భారతీయ నాగరికతా విస్తరణము/నాగరికతా విస్తృతి

వికీసోర్స్ నుండి

భారతీయ నాగరికతా విస్తరణము.

2. నాగరికతా విస్తృతి.

పూర్వప్రకరణమున ప్రాచీనభారతీయుల యాదర్శములను పేర్కొనియుంటిమి. ఈప్రకరణమునందు భారతీయనాగరికత యేయేదేశములయం దేయేశతాబ్దములలో వ్యాపించెనో దిజ్మాత్రముగ సూచింపబడును.

ఇటీవల పికాడర్స్‌పెట్రీ యను నొక పండితుడు యీరప్, ఆసియా, ఆప్రీకా ఖండముల నడుమగల మద్యధరాసముద్ర తీరమునందున్న మెంఫియనునగరమున భారతీయ స్త్రీపురుషుల చిత్రములను గనుగొనెను. ప్రాచీనభారతీయు లాసియాఖండపు ప్రాగుత్తరముననున్న జపాను ద్వీపమునందును, ప్రాగ్దక్షణముననున్న మొలక్కాసుద్వీపమునను, నైరుతిభాగమునందున్న ఆఫ్రికాఖండమునకు సమీపమునందున్న మెడగాస్కర్‌ద్వీపముననుగూడ తమ నాగరికతను వ్యాపింపజేసినటుల తెలియనగుచున్నది. ఈ యెల్లలనడుమనుండు సువిశాలభూభాగమంతయు నొకప్పుడు భారతీయాధ్యాత్మిక సామ్రాజ్యముగ నుండెను.

ఈయార్యనాగరికత భారతదేశమునందలి యన్నిభాగములనుండియు విస్తరించెను. పశ్చిమమున ఆప్‌గనిస్థానముమొదలు తూర్పున జపానువరకునుగల దేశములలో వ్యాపించిన నాగరికత యుత్తరాపన నాగరికత. బర్మా, ఇండోచైనా, జావా, సుమత్రాలలో విస్తరించినది. యాంధ్రదేశ నాగరికత. ఆశియాఖండపు ప్రాగ్దక్షిణద్వీపములలో గొంతవరకును ద్రవిడదేశ సంపర్కమును గన్పించుచున్నది. ఈ భారతీయ నాగరికత భూమార్గమునను సముద్రమార్గముననుగూడ విస్తరించెను. సామాన్యవాణిజ్యమార్గములే నాగరికతా విస్తరణమునకుగూడ మార్గములైనవి. ఇటుపైనీ విస్తరణము సవిస్తరముగ వివరింపబడును.

(1) టిబెట్:- క్రీ. శ. 1 వ శతాబ్దమున 'యూఎచీ' అను నొకజాతివారు మధ్య ఆసియానుండి భారతభూమిపై దండెత్తివచ్చి యిట స్థిరపడిరి. వారిలో నొక తెగవారగు కుపాను లిచ్చట రాజ్యమేలిరి. అందు సుప్రసిద్దుడును, భారతీయచక్రవర్తులలో నగ్రగణ్యుడునగు కనిష్కుడు కాష్‌ఘర్, యార్‌ఖండ్ మున్నగు మద్య ఆసియాలోని ప్రదేశములను జయించెను. ఈతని యాదరణముచే నీదేశములలో మహాయానబౌద్దమతము విస్తరించినది. ఇటనుండి యీమతము చైనాకు ప్రాకినది. క్రీ. శ. 7 వ శతాబ్దమున స్ట్రాంగ్ ట్సన్ గంపో (Strang-tsan-Gampo)యను నాతడు టిబెట్టును పాలించుచుండెను. అతని భార్యయగు నేపాలరాజపుత్రిక తాంత్రికబౌద్దమతము నాదేశమున బ్రవేశింపజేసెను. అ రాజు మఱియొకభార్యయగు చైనారాజపుత్రిక యాదరమున టిబెట్టుదేశమున కనేకులగు చైనాదేశభిక్షవు లేతెంచిరి. గంపోరాజు తనమంత్రిని హిందూదేశమునకు విశేషజ్ఞానము నుపార్జించుటకై బంప, నాతడు దేవనాగరీలిపినుండి యొకక్రొత్తలిపిని నిర్మించి టిబెట్టుదేశమున బ్రచారము చేయించెను. క్రీ. శ. 8 వ శతాబ్దమున మఱియొకరాజు పద్మసంభవుడు నాతనిశిష్యుడగు వైరోచనుడు మున్నగు భారతీయపండితుల ననేకులరావించి వారిసాహాయ్యమున టిబెటనుభాషలో వాఙ్మయమును నిర్మింపజేసెను. క్రీ. శ. 1083 లోనాలందావిశ్వవిద్యాలయాధ్యక్షుడును బండితశిఖామణియునగు ద్వీపాంకర అతీశుడు టిబెట్టునకేగి యచ్చటిమతమునకు నూతనోత్తేజమును గల్గించెను. ఆదేశమునం దమరకోశము, మేఘదూతము, చంద్రగోమివ్యాకరణము, చిత్ర లక్షణము మున్నగుభారతీయ గ్రంథములెన్నియో భాషాంతరీకరింపబడినవి. మొత్తముమీద టిబెటనులు తాంత్రికబౌద్దమున బద్ధాదరులైరి. మంత్రములు, ఇంద్రజాలము, శక్త్యారాధనము వీరికి ప్రీతికరములు.

(2) చైనా :- క్రీ. పూ. 3 వ శతాబ్దమున చైనాదేశీయులు హిందూదేశమును జేరుటకై యనేకప్రయత్నము లొనర్చిరి. క్రీ. పూ. 217లో పదునెన్మండ్రు బౌద్దబిక్షవు లాదేశమునకేగిరట. మఱుసటి శతాబ్దమున 'చాంగ్‌కియన్‌' అను నతడటనుండి మొదటిసారి మనదేశమునకు రాగల్గెను. క్రీస్తుశకారంభమున యూఎచి, బాక్ట్రియను, సాగ్ఱయసుమున్నగు మద్య ఆసియాజాతులవారు చైనాలోబౌద్దమతము నుపదేశించిరి. క్రీ. శ. 67లో కశ్యపమతంగుడు, ధర్మరక్షకుడునను నిర్వురు భారతీయభిక్షవులు చైనాకేగి 'మింగ్‌టి' యను నాదేశపు చక్రవర్తియాదరణ నంది బౌద్దగ్రంథములను భాషాంతరీకరించియు, నారాధనలను నెలకొల్పియు, మతప్రచారము సాగించిరి. క్రీ. శ. 4 వ శతాబ్దమున 'పాహియన్‌' అను నత డనేకకష్టముల కోర్చి యీదేశమున కేతెంచెను. ఈతడు తక్షశిలా, పురుషపురము, పాటలీపుత్రము, తామ్రలిప్తి మున్నగు బౌద్ద విద్యాస్థానములలో బౌద్దమతరహస్యములను నేర్చుకొనెను. ఇందుచే చైనాదేశీయులకు బౌద్దగ్రంథములను, మతమునుగూడ, సూత్రతల నుండి నేర్పుటకవకాశము గలిగెను.

ఇదేసమయమునం దొక చైనాదేశసైన్యాధిపతి "కుమారవిజయుడను నొకభారతీయుని దనదేశమునకుబందిగగొనిపోయెను. ఈతడు పదిసంవత్సరము లాదేశముననుండి, యసమాన పాండితీప్రతిభచే ననేకమేధావంతుల నాకర్షించి, బౌద్దగ్రంథ భాషాంతరీకరణమునకు మార్గదశ్సియయ్యెను. ఈకాలమున బుద్దభద్రుడను మఱియొక భిక్షవు సముద్రమార్గమున చైనాదేశముజేరి దక్షిణభాగమున మత ప్రచారమారంభించెను. ఇచ్చటి ప్రజ లూహాశక్తియు, గావ్యధోరణియు గలవారుగ నుండిరి. ఈ గుణములకు భారతీయమగు ఋజువర్తనమును, మనస్సంయమనమును, ధ్యానమును తోడుజేసి, యీభిక్షవు చైనాదేశమున ధ్యానవాదమునకు (School of Meditation) బునాదులేర్పరచెను. క్రీ. శ. 5 వ శతాబ్దిలో కాశ్మీరరాజపుత్రుడగు గుణవర్మయను నాతడు మతదీక్షచే రాజ్యమునువిడచి, యన్యదేశములకేగెను. 424లో నీతడు చైనాదేశోత్తరభాగమున దన యత్యద్భుతభాషాంతరీకరణ శక్తివలనను, చిత్రకళా నైపుణ్యముచేతను మతప్రచారము నత్యుత్తమముగ నొనర్చెను. ఒకవిశేషమేమన నీతడు భిక్షుణీజనములకైగూడ గొన్నివిహారములను గట్టించెను. ఇంతటినుండియు సంఘసేనుడు, గుణవృద్ది మున్నగు ననేకులు సింహళ జావాద్వీపముల మీదుగా భారతభూమినుండి చైనాదేశమున కేగియుండిరి. క్రీ. శ. 6 వ శతాబ్దమున మఱి యిర్వురు భిక్షువులు మతప్రచార మొనర్చిరి. వీరిలో బోదిధర్ముడు ప్రథముడు, అతనికి పిమ్మట బౌద్దతత్వజ్ఞులలో ముఖ్యుడగు వసుబంధకవి జీవితచరిత్రమును వ్రాశిన పరమార్థుడుగూడ సముద్రమార్గముననే చైనాకువచ్చెను. అనంగ, వసుబంధు మున్నగు సర్వాస్థివాదుల గ్రంథములను భాషాంతరీకరించి యీపండితుడు చైనాలో యోగాచారవాదమును బయల్వెడలించెను. క్రీ. శ. 7, 8వ శతాబ్దములలో చైనాదేశము నం దీ భారతీయ నాగరీకతా విజృంభణము పరమావధిని గాంచినది. అప్పుడు హిందూదేశమున కేతెంచి యిట విజ్ఞానామృతమును గ్రహించి స్వదేశమగు చైనాను పునీతంజేసిన హ్యూన్ ష్వాంగు, ఈత్‌సింగు మున్నగువార లీవిషయమై వ్రాసియుండిరి. అ కాలమున భారతీయమగు బ్రతివిషయమును గౌరవనీయముగ నుండెడిది. బౌద్దయుగమున హిందూదేశమున వర్థిల్లిన శిల్పము, విగ్రహనిర్మాణము, తంత్రము, చిత్రలేఖనము మున్నగునవి యాకాలపు చైనాదేశీయుల కాదర్శములై నిరుపమమగు నాగరీకతా సమ్మేళనమును జూపుచున్నవి. (3) కొరియా :- చైనానుండి బౌద్దమతము కొరియాకు - ప్రాకినది. క్రీ. శ. 374లో 'అతో, 'షన్‌తో' అను నిర్వురు భిక్షువులాదేశమునకు రాజధానియగు పినాంగ్‌పట్టణము కేగిరి. మఱి పదిసంవత్సరములకు బిమ్మట మతానందుడను నతడు కొంద ఱనుచరులతోగూడ కొరియారాజ్యమున కాహ్వానింపబడెను. 5వ శతాబ్దమున మఱియొక భిక్షువు కొరియాలోని సిల్లరాజపుత్రికకు దనయోగశక్తిచే చికిత్సజేసి రాజాదరమును బడసి, యారాజ్యమున తాంత్రికబౌద్దమతమును వ్యాపింపజేసెను. మఱి యేబదిసంవత్సరములకు కొరియారాజదంపతులు బౌద్దదీక్షను గైకొనిరి. అంతట నాదేశమునం దొక మతనియోగ మేర్పడి 10వ శతాబ్దమువరకును బౌద్దమత మభివృద్ధినందెను.

(4) జపాన్ :- క్రీ. శ. 5వ శతాబ్దమున చైనా నాగరికత జపానుకు సోకినను బౌద్దమతముమాత్ర మాదేశమునకు కొరియా మూలముననేవచ్చెను. 538 లో కొరియాదేశము స్వర్ణనిర్మితమగు నొక బుద్దవిగ్రహమును కొన్నిబౌద్దగ్రంథములను సామంతతా చిహ్నములుగ చైనాదేశమున కంపెను. మఱి నలుబదిసంవత్సరములకు 'ఉమయోచో' యను జపాన్‌రాజు భౌద్దమతమును రాజమతము నొనర్చెను. కొరియాభిక్షువులచే దన ప్రజలకు వైద్యజ్యోతిషములను చెప్పించి యీతడు దేశీయులను గొందరిని బౌద్దధర్మమును దెలిసి కొనుటకై చైనాదేశమున కంపెను. బౌద్దమతముతోపాటు కళలు, స్వచ్చందసేవ మున్నగునవికూడ జపానును బ్రవేశించినవి. 'కన్‌జిన్‌' అనునాత డీదేశమున వైద్యసంఘములను స్థాపించెను. 736 లో భారతీయుడును, బ్రాహ్మణుడును భారద్వాజగోత్రియుడునగు బోధిసేనుడను భిక్షువు చిత్రకారులను, గాయకులను దోడ్కోని జపానుదేశమునకేగి ముప్పదిసంవత్సరములకాలము బౌద్దమతప్రచారము నొనర్చెను. ఈభిక్షువులు భారతీయాదర్శములను భారతీయ గానమును చిత్రకళను దేశీయులకు నేర్పియు, దేశీయనాగరికత నభివృద్ధిపరచియు జపానుదేశ జీవితమునకు నూతనోత్తేజమును గల్పించిరి. 8 వ శతాబ్దమున నాదేశమున వైదుష్యమును, శాంతిసౌఖ్యములును బ్రబలినవి. సుభాకరసింహ, అమోఘవజ్రాదులచే బ్రవర్తింపబడిన మాంత్రికవాదమును, అనంగభిక్షుని ధర్మలక్షణవాదమునుగూడ నీదేశమున కేతెంచినవి. ఈ ప్రచారమునకు ఫలితముగ 9 వ శతాబ్దమున జపానుదేశీయులే బ్రత్యేక పరిశ్రమమొనర్చిబౌద్దమతమున నూతనసిద్ధాంతములను బయల్వెడలించిరి. 'టెండెయ్‌' ('Ten-dei') 'షిన్ గన్‌' (Shin-Gon) అను శాఖ లిట్టివే. 12 వ శతాబ్దినాటికి తాత్విక బహుళముగాక సుగమమును మనోరంజకమునగు మత మవసరమైనది! దానికి ఫలితముగ 'సుఖవటి' యను నొకసిద్దాంతము బయల్వెడలినది. దీని ననుసరించి తత్వమును, యోగమును, నిష్ప్రయోజకములు. అమితాభయసు దైవమునందు నిశ్చలమగు నమ్మకముండినచో ముక్తి సులభ సాద్యమగును. అంతియేగాక బౌద్దమతమునకు బూర్వ మీదేశమునందు----------' మతమునగూడ గొప్పపరివర్తనములు జరిగినవి. అమతావలంబకులు తమదేవతలను బుద్దుని యవతారములుగ బరిగణింప మొదలిడిరి.

(5) బర్మా :- క్రీస్తుశక ప్రారంభముననే భారతీయులకు బర్మాదేశముతో బరిచయముండినటుల దెలియుచున్నది. క్రీ. శ. 78 లో ప్రపంచమంతను చుట్టివచ్చిన యొకగ్రీకుదేశీయుడు ఆఫ్రికాఖండమునుండి హిందూదేశముమీదుగాచైనా దేశమువరకును వర్తకముజరుగుట కనుకూలమగు మార్గముండెడిదని వ్రాసియున్నాడు. బర్మా యీమార్గముననే గలదు. 3 వ శతాబ్దమున హిందూదేశమునుండి అస్సాం బర్మాలమీదుగా చైనాకు మార్గముండెడిదని చంపాయను హిందూరాజ్యములోని శాసనములనుండి తెలియుచున్నది. 5 వ శతాబ్దమున భారతదేశమునందు గుప్తరాజుల పరిపాలనమున హిందూమతమపూర్వమగు నభివృద్ధి నందినది. ఈ సమయముననే ఆశియాఖండమునందలి ప్రాగ్దక్షిణదిశను అస్సాం చైనాలకు మధ్యనుండు ప్రకృత ఇండోచైనాలో చంపా, కాంభోజయను, హిందూరాజ్యములు నెలకొల్పబడినవి.

బౌద్దగాథలలో అశోకచక్రవర్తి బర్మాకుగూడ మతప్రచారకులను బంపెనని వ్రాయబడియున్నది. ఈ దేశమున దొరకిన 5 వ శతాబ్దినాటి 'పూ--' శాసనములనుండి యంతకు రెండు మూడు వందల సంవత్సరములకు బూర్వమే యిచ్చట హిందూమతము వ్యాపించె ననియు' నిచ్చటి వారలు సంస్కృత ప్రాకృతములనుండి కొన్ని మాటలను తమభాషలోనికి దెచ్చుకొనిరనియు, దెలియుచున్నది. అటుపై మహాయానబౌద్దమతము గూడ బర్మాను బ్రవేశించెను. క్రీ. శ. 450 లో హీనయానబౌద్దమత ప్రచారకుడగు బుద్దఘోశు డీదేశమున మతబోధ నొనర్చెను.

(6) నయాం :- కాంభోజ దేశమునుండి హిందూ బౌద్దమతము లీదేశమును బ్రవేశించినవి. అంతియగాక భారతదేశమునుండి విజ్ఞానకృశి చేయుడకై యేతెంచిన బ్రాహ్మణులును, వర్తకమునకై వచ్చిన వణిజులునుగూడ నీ మతప్రచారము నొనర్చిరి. నయాందేశమునందలి మతము, భాష, సంస్థలు, లిపి, కళలు, వాఙ్మయము మున్నగు - నవన్నియు హిందూదేశమునుండి పరిగ్రహింపబడినవే.

(7) కాంబోడియా :- ఈదేశము బర్మాకును, చైనాకును మధ్యనుండి ప్రకృతమునం ఇండోచైనా, యని పిలువబడు భాగమున నయాంకు దక్షిణమునం దున్నది. క్రీ. శ. 1 వ శతాబ్దమునం దొకపర్యాయమును, 4 వ శతాబ్దిలో నింకొక సారియు హిందువులు మాతృ భూమినుండి యీదేశమునకు వలసవచ్చిరి. ఇచ్చటి శాసనములనుండి 7-13 వ శతాబ్దములలో నిచ్చట సంస్కృత భాషయు, దేవనాగరీ లిపియు వ్యవహారమునం దుండెడి వనియును, హిందూ దేవాలయము లనేకములు నిర్మింప బడిన వనియును దెలియుచున్నది. 5 వ శతాబ్దమునం దిచ్చటి జయవర్మయను రాజు నాగ సేనుడను బౌద్దభిక్షువును హిందూ దేశమునుండి రావించి బౌద్దమతమును వ్యాపింపజేసెను.

(8) చంపా :- ఇయ్యది నయాం కాంబోడియాలకు తూర్పున బ్రకృత అస్సాంలో నుండినది. క్రీ. శ. 192 లో హిందువులు దీనిని నిర్మించిరి. పాణనీయ వ్యాకరణము, పురాణములు, జ్యోతిషము, పడ్డర్శనములు, ధర్మ శాస్త్రములు శైవా గమములు, హిందువుల చతు:షష్టి కళలు నీ దేశమునం దుండినవి. ఇచ్చట శైవ మతము ప్రబలుటచే శివాలయము లనేకము లుండెడివి. వాని శిదిలములు నేటికిని బరిశోధకులకు లభించుచున్నవి.

(9) మలే ద్వీపకల్పము :- ప్రాచీన హిందువులు పశ్చిమమున ఆఫ్రికా ఖండములోని మెడగాస్కర్ ద్వీపముతోడను, తూర్పున మలేద్వీప కల్పము మీదుగా జావా, సుమత్రా దీవులతోడను వ్యాపారము జేయుచుండిరి. మలే భాసలో నెన్నియో సంస్కృత పదములు గలవు. మతనైతి కార్దిక జ్యోతిష గణితాది విషయములను గూర్చి యిచ్చటివారి యభి ప్రాయములు గీర్వాణ పదములలోనే బేర్కొనబడుచున్నవి. వారి దేవతలలో నుత్తమ వర్గీయులు హిందూదేవతలు. సర్వవిదములను మలేవాసులు చిరకాలము హిందూనాగరికత ననుభవించిరి.