భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/పార్థసారథిశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

మానసబోధశతకము చిత్తబోధశతకములమూలమున ఆంధ్రలోకమునకుఁ జిరకాలపరిచితుఁడైయున్న తాడేపల్లి పానకాలుకవి యీపార్థసారథిశతకమును రచించెను. ఇతఁ డింతియగాక రుక్మిణీపతిశతకము మంగళాద్రినృసింహశతకము లక్ష్మీశతకము లోనగుగ్రంథములు గావించియున్నాఁడు. పానకాలుకవి నియోగి బ్రాహ్మణుఁడు; శ్రీవత్ససగోత్రుఁడు. కవినివాసము కొండవీటిసీమలోనిదియుఁ గృష్ణాతీరస్థము నగు తాడేపల్లి. ఇట కవివంశీయులు నేఁటికిని గలరు. కవిజీవితమును గూర్చినయంశము లట విశేషించి తెలియరావుగాని కవి యిప్పటికి నూఱుసంవత్సరములక్రింద జీవించియుండెననియు నితఁడు వైద్యమున మిగులఁ బేరుగాంచినవాఁ డనియుమాత్రము తెలిసినది. ఇతఁడు వైద్యనిపుణుఁ డనుటకు నేత్రదర్పణమే తార్కాణము కాగలదు.

క. పదిరెండుపర్వతంబులు
     విదితంబుగ నదులు రెండు విభుఁడు నృసింహుం
     డదనైనదుర్గ మొక్కటి
     పదపడి ముదమలరు తాడెపల్లి ధరిత్రిన్.

నేత్రదర్పణమునఁ బానకాలుకవి సహజముగఁ దనజన్మభూమిని గొనియాడియున్నాఁడు. తాడేపల్లి కొండలసంఖ్య పదిరెండు, రెండునదులు పురి నొరసి పాఱుచున్నవి. నృసింహుఁడు గ్రామదైవతము. కొండపై నొకపూర్వదుర్గముగలదు. ఉన్నంతలో సరిపుచ్చుకొని మాతృభూమి గౌరవమును వేనోళ్లఁ గొనియాడుపానకాలుకవి ధన్యుఁడు.ఇతనికవిత మృదుమధురముగా నుండును. ముఖ్యముగా నితనిశతకములలో మానసబోధశతకమున కున్నంతప్రశస్తి మఱియొకదానికి లేదు.

ఈ పార్థసారథిశతకము తిరువలిక్కేణి పార్థసారథిస్వామినిగూర్చి రచింపఁబడినది. ఇందలిపద్యములు విష్ణులీలలను గొండాడుచు శ్రావ్యముగఁ బఠనీయముగ, మనోహరముగనున్నవి. కవి మంగళగిరిపానకాలరాయనిభక్తుఁడు కావున పానకాలరాయఁ డని పేరుదాల్చియుండును. ఇతనికవిత పానకమువలె మధురముగానుండుననుటలో సంశయ మించుకేనియు లేదు. కవి తనప్రశస్తిని నేత్రదర్పణమున నిటులు జెప్పికొనియున్నాఁడు:

గీ. అఖిలరాజాధిరాజసభాంతరాగ్ర
     పూజితుఁడ సర్వవిద్యావిరాజితుఁడను

ఈపద్యభాగమువలనఁ గవి రాజసత్కృతుల నొందినటులఁ దెలియుచున్నది. ఆరాజులపేరులఁ దెలిపియుండునేని కవికాలము సులభముగా గురుతింప వీలుచిక్కెడిది. ఈకవిజీవితచరిత్రమునకు నితనిగ్రంథములకుఁ దాడెపల్లివాస్తవ్యులగు కవివంశీయులు కృషి చేసి భాషాభిమానమును బ్రచురింపవలసినయావశ్యకత విశేషించి కలదు.

అఱువదిరెండుసంవత్సరములక్రింద మదరాసులో ముద్రితమైన దోషవంతమగు నొకజీర్ణప్రతి నాధారపఱచికొని కవియభిప్రాయములను గుర్తించి సవరించి యెటులో ప్రయాసమీఁద నీశతకమునకు శుద్ధప్రతి వ్రాయఁగలిగితిమి. ఇతనికవితలో నందందు స్వల్పలోపములు గలవు. ఇట్టివి పానకములో నెలసులవంటివి. ఇతనిశతకములన్నియు ముద్రితములు కాకుంట పరితాపకరము.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

శేషాద్రిరమణకవులు

1.2.25

శతావధానులు

శ్రీరస్తు

తాడేపల్లి పానకాలురాయకవికృత

పార్థసారథిశతకము

ఉ.

శ్రీరమణీమణీశ సువసీకృతమౌనిమనోబ్జకోశ శృం
గారవపుఃప్రకాశ మదకౌరవసైన్యవనాశ్రయాశచా
ణూరగళోగ్రపాశ వృజినోరగసంఘపతంగమేశ ఘో
రారిచమూవినాశ సదయామృతనీరధి పార్థసారథీ.

1


చ.

సమరముఖారిభీమ నుతసాధుజనావనకామమౌని హృ
త్కమలసహస్రధామ వ్రజకంజముఖీకుముదాళిసోమ స
ద్విములగుణాభిరామ పరవీరభయంకరనామ దేవతా
విమతవిరామ పద్మభవవేద్య దయాంబుధి పా...

2


చ.

గరుడతురంగ దివ్యమణికాంచనభూషణభూషితాంగ సం
గరరిపురాడ్విభంగ సనకస్తుతదివ్యకథాప్రసంగ సా
గరతనయాభిషంగ మురగర్వసమీరభుజంగ దుర్భవో
త్కరతమసఃపతంగ మృదుతల్పపయోనిధి పా...

3

చ.

పరమకృపాలవాల భవబంధవిమోచనశీల లోకసం
భరణయశోవిశాల నిజభక్తజనావనఖేల శాత్రవో
త్కరవిపినాగ్నికీల కనకస్ఫుటదివ్యదుకూల ధర్మరా
డ్వరసురసాలసద్గుణకదంబపయోనిధి పా...

4


చ.

తరణిశశాంకనేత్ర మదదానవమండలజైత్ర దుగ్ధసా
గరదుహితాకళత్ర శుభకారణవిశ్వమహావిచిత్ర సుం
దరఘననీలగాత్ర సురతారకదివ్యచరిత్ర నీలకం
ధరనుతిపాత్ర పత్రికులనాథరథీ హరి పా...

5


చ.

సరసవచోవిలాస విలసత్ స్ఫుటకాంచనవాస భావసం
భరితఘృణావికాస పరిపాలితపాదసరోజదాస సుం
దరదరపాండుహాస నిరతస్ఫురితామితకీ ర్తిభాస సం
గరరిపురాణ్ణిరాస మురకంఠవిలుంఠన పా...

6


ఉ.

ఘోరతరారిదూర ఘనకోమలచారుశరీర యామునా
తీరవిహార వల్లవసతీజనజార మునీంద్రమానసా
గార తుషారహీరకరకంఠపటీరసమానకీర్త్యలం
కార సుమేరుధీర మురగర్వహరా హరి పా...

7


చ.

శరనిధిరాడ్గభీర హిమశైలసమానసుధీర హాటకా

మరమణిహార మారసుకుమారశరీర రిపుప్రహార భా
సురఖగరాడ్విహార రణశూర శ్రుతివ్రజసార కాననాం
తరకరిదైన్యదూర నిజదాసజనావన పా...

8


ఉ.

నందయశోదనందన సనందనవందన సుందరాంగ సం
క్రందనవంద్యకుందరదరాజిత నందకహస్త సర్వదా
నందముకుంద నందితసనంద జగత్రయతుంద యిందిరా
మందిర మందరోద్ధరణమంజులభూషణ పా...

9


చ.

భవహరణంబులై సకలపాపవిమోచనకారణంబులై
శివసనకాదియోగిజనసేవ్యములై శుభదాయకంబులై
భువిఁ బొగడొందు మీచరితము ల్గొనియాడెద నన్ను బ్రోవు మా
ధవ హరి వాసుదేవ ఖలదానవసూదన పా...

10


ఉ.

వ్రేతలకోర్కి దీఱ కడువేడుకతోడ యశోదగర్భసం
జాతుఁడవై విదర్భనృపజాతను రుక్మిణి బెండ్లియాడి వి
ఖ్యాతిగ ద్వారకాపురము కాపురమై విలసిల్లి యాదవ
వ్రాతము నేలి తీవెగద వాసవసన్నుత పా...

11


చ.

హలహలపూరితోరుకుచయై పెనురక్కసివ్రేతలెల్ల భీ
తిలఁ జనుదెంచి కృష్ణ యివె తియ్యని నాచనుబాలు ద్రావ నాఁ

కలి నెడలించు నీకు ననఁగా నొకగ్రుక్కకు దానిప్రాణముల్
దొలఁ గిలఁ గూలఁజేసితివి దుష్టనిశాటిని పా...

12


ఉ.

గోపవిలాసినీమణులు గొల్వక కొల్వయి వారితోడ స
ల్లాపము లాడువేళల విలాసము కన్నులఁ జూడనైతి నా
పాపవశంబుచేత నిఁకఁ బల్మఱు ని న్భజియించుచుందు నో
గోపకరూప కావు నను కూరిమితోడుత పా...

13


ఉ.

చిన్నికుమార మన్ను దినజెల్లున నీ కని పల్క తల్లి లే
దన్నను నీవు నమ్మ వటులైనను చూడుము నాదువక్త్రమం
చు న్నిఖిలప్రపంచమును జూపితివౌ తలవాకిటన్ గృపా
సన్నమతిన్ యశోదకుఁ బ్రసన్నుఁడవై మును పా...

14


ఉ.

వెన్నలు బాలు నేతులును వేడుక మీఱఁగ గొల్లయిండ్లలోఁ
గ్రన్నన మ్రుచ్చిలింప వ్రజకాంతలు కుయ్యిడ నయ్య శోద ని
న్మన్నన ఱోల గట్ట నటు మద్దులు గూలఁగ నీడ్చి శాపసం
ఛన్నుల యక్షరాట్సుతుల సయ్యనఁ బ్రోచితె పా...

15


ఉ.

వేడుక చేలము ల్విడిచి వ్రేతలు నయ్యము నాపగాంబులన్
గ్రీడలు సల్పుచుండఁ గని కేరుచు వస్త్రములన్ హరించి యా

చేడెలమానమెల్లఁ గొని సిగ్గులు వీడఁగఁజేసి వారు ని
న్వేఁడఁగ చీర లిచ్చితివి నేర్పున క్రమ్మఱ పా...

16


చ.

ఇతరము లేక వ్రేతలు యథేష్టముగా నిను గూడి నిత్యమున్
బతిహితబంధుభావములఁ బల్మఱు క్రీడలు సల్పి వేడ్కతో
నతులితవైభవాప్త లయి యంత్యమున న్భవదంఘ్రిపద్మసం
గతలయి ముక్తి గాంచిరి సుఖమ్ముగ మున్ హరి పా...

17


ఉ.

నందునిమందలోన యదునందనులంద ఱమందభక్తి మీ
యందునఁ గల్గి వారు ముద మందఁగ సంపద లందఁజెంది రా
నందము నందనందన సనందన వంద్య ముకుంద కృష్ణ గో
వింద యటంచు ని న్దలంచి వేడుక మీఱఁగ పా...

18


చ.

కుతుక మెలర్ప నింద్రునకు గోపకులందఱు విందు సేయఁగా
మతిఁ దలపోయఁగూడదని మాన్పఁగ నప్పుడు దేవరాజు కో
పితుఁడయి ఱాళ్లవాన గురిపింపఁగఁ గేలను గొండ యెత్తి గో
పతతులభీతి పోగడచి పాలనఁ జేసితె పా...

19


చ.

సుతుఁడ వటంచు నందుఁడును జుట్టమ వంచును గోపకామినుల్
హితకరి వంచు గోపజను లిష్టసఖుండ వటంచుఁ బాండవుల్
మతి దలపోయుచుందురు రమాయుతమూర్తిని నిన్ను వార లే
వ్రతము లొనర్చిరో తెలియరాదుగదా మును పా...

20

చ.

నిను గని కన్మొఱంగి విధి నేర్పున గ్రేపుల గోపబాలురన్
గొని చన ఛద్మవత్సముల గోపకుమారకులన్ సృజింప న
త్తనయులఁ గ్రేపులన్ గని ముదమ్మునఁ దల్లు లభేదబుద్ధిచేఁ
గనుఁగొనఁజేసి తీవు మును కంసనిషూదన పా...

21


చ.

వలువలు గంధమున్ పువులు వంటకమున్ ఫలముల్ జలంబు లిం
పలరఁగఁ బాయకాదిజను లర్పణసేయ కటాక్షదృష్టిచే
వెలయఁగఁ బ్రోచినాఁడవని వీడక వేడుకతోడ నీకథా
వలిఁ బరికింపఁ జిత్రమగు వారిజలోచన సా...

22


చ.

పరగఁగ దుస్ససేనుఁడు సభాసదులందఱు జూడ ద్రౌపదిన్
పరిభవ మొందఁజేయ నిను భక్తియుతంబుగఁ గృష్ణ వేఁడ న
ప్పరమపతివ్రతామణి కపారములై తనరారు చేలముల్
కరుణ నొసంగి కాచితివి కంసనిషూదన పా...

23


చ.

కడువడిబాణజాలముల గాసిలజేసెడివాని చూచెదే
బెడిదపుచక్రధారలను భీష్ముని జంపుదు నిన్నుఁ గాతు న
న్విడు విడు మర్జునా యనుచు వింతగ గంతు లొనర్చునట్టినీ
యడుగులు జూపవే దయ దయామృతనీరధి పా...

24


ఉ.

భీమసుయోధనుల్ గన విభీషణరోషవిషాగ్నితప్తులై

భీమతరాహవంబునను బెబ్బులులట్టులఁ బోరునప్పు డా
భీముని గేలిసేయుగతి పెందొడలాయము దెల్పి శత్రునిన్
హామికఁ గూలఁజేసిన దయాగుణనీరధి పా...

25


చ.

చలమున భీమమాగధులు చయ్యన కయ్యము జేయ నయ్యెడన్
న్బలము దొలంగి భీమునకు భంగము రాఁగఁ దృణంబుఁ జీల్చి యా
చెలువున శత్రుని న్దునుమఁ జేసిన నీమహనీయలీల లిం
పలరఁగ నెన్న శక్యమె దయామృతనీరధి పా...

26


చ.

సమరథులన్ మహారథుల సైన్యములన్ దగఁ గూర్చి కౌరవుల్
సమరమునన్ బెనంగొనఁగ శక్రతనూజునకు న్నియంతవై
క్రమమున శత్రులన్ దునిమి రాజ్యము ధర్మజుఁ జేర్చినట్టి నె
య్యము గణియింప శక్యమె దయామృతనీరధి పా...

27


ఉ.

పాండవు లంప కౌరవసభాస్థలికిం జని దుష్టబుద్ధి మా
ర్తాండసుతానువర్తులయి దర్పమునన్ ధృతరాష్ట్రసూను లు
ద్దండత నిన్నుఁ బట్టుకొనఁ దార్కొన వారలు భీతిఁ జెంద బ్ర
హ్మాండము నిండఁ దాల్చితి భయంకరరూపము పా...

28


చ.

వనచరపీడితుం డగుచు వారణనాథుఁడు మిమ్ము వేఁడ నా
తనిమొఱ నాలకించి సురతండము లచ్చెరువొంది చూడఁగాఁ

జని మకరిన్ మహోగ్రనిజచక్రముచేఁ బరిమార్చి యగ్గజేం
ద్రునిదురవస్థ బాపితివి తోయజలోచన పా...

29


చ.

కమలభవాండభాండములు కల్పన సేయఁగఁ బెంపఁ ద్రుంప లో
కమునను నీవుదక్క మఱి కర్తలు లేరని చాటి చెప్పు వే
దములు పురాణశాస్త్రములు దద్దయు మీమదిగాన నన్యులన్
మిము విడనాడి వేఁడఁగలమే? కలనైనను పా...

30


చ.

కడిమి భవత్కథల్ విననికర్ణములున్ భవదీయకీర్తనల్
నుడువనినోరు నిత్యము నినుం బొడఁగానని యట్టికన్నులుం
బుడమిని బాడుబొంద లనఁబోలునటం చని మాటిమాటికిన్
తడబడ కేను చాటెద ముదంబున నచ్యుత పా...

31


చ.

సదమలబుద్ధి నిన్ను తృటి సన్నుతిఁ జేసినవాఁడు సర్వసం
పదలను జెంది పాపములఁ బాయుచు సంచితపుణ్యుఁ డౌచు నా
పదలను జెంద కెప్పుడు శుభంబులచే మని తా ముదంబునన్
తుదిని భవత్పదంబుఁ గను తోయజలోచన పా...

32


చ.

నలినసఖుండు తాను గగనస్థితి నొక్కరుఁ డయ్యుఁ జూడఁగా
జలభరితంబులైన కలశంబులయందు ననేకరూపుఁడై

యలరెడుభంగి ప్రాణినివహంబులయందు ననేకమూర్తివై
వెలయుచునుండు నీవు మునివేద్య జనార్దన పా...

33


చ.

స్థిరమతి మీపదాబ్జములె దిక్కని యెన్నుచు నిత్యముక్తులై
పరగెడు శ్రీమహాపరమభాగవతోత్తముల న్నుతించి త
చ్చరణసరోజతీర్థ మనిశంబును గ్రోలెద వేడ్కమీఱ మ
ద్దురితవిముక్తికై రిపువిదూర రమాధిప పా...

34

ఉ.

కారణకార్యరూపములఁ గన్పడుసర్వము నీ వటంచు నా
సారససంభవాదులును సత్యముగాఁ దెలియంగ లేక నిన్
సారె భజింతు రట్టినిను సంస్తుతి సేయఁగ నెంతవాఁడ నో
నీరజనాభ కృష్ణ ఘననీరజలోచన పా...

35


చ.

పొలుపుగ మీపదాబ్జమునఁ బుట్టినబిడ్డను వేడ్క మీఱఁ దాఁ
దలను ధరించి శంకరుఁడు దాల్చె శివాఖ్యను జిత్ర మెన్నఁగా
బలజదళాక్ష నీమహిమ సన్నుతి సేయ నశక్యమైన నా
కొలఁదికిఁ దోఁచినట్లు నిను గోరి భజించెద పా...

36


చ.

కడుమధురంబులై యమృతకల్పములై కలుషాపహంబులై
యడరెడు మీచరిత్రము లహర్నిశల న్వినుచుండువాఁడు తా

నిడుమలఁ బొంద కెప్పుడు నభీష్టసుఖంబులు గాంచి ధన్యుఁడై
పుడమిని భాగ్యవంతుఁడనఁ బొల్పెసఁగున్ గద పా...

37


ఉ.

ఎవ్వనినాభియందు జనియించి విరించి ప్రపంచమెల్లఁ దా
నెవ్వనిసత్కటాక్షమున సృష్టి యొనర్చు నమర్త్యకోటికిన్
ఎవ్వఁడు మూలమై వెలయు నెవ్వఁడు లచ్చికి భర్త యయ్యె నే
నవ్విభు నిన్నుఁ గొల్చెద నహర్నిశలున్ హరి పా...

38


ఉ.

వింటిని మీచరిత్రములు వేడుక మీఱఁగ మిమ్ముఁ జూడఁగాఁ
గంటి భవత్కటాక్షమున గణ్యము లేనిభవాబ్ధిఁ దాఁటఁగాఁ
గంటిని దమ్మికంటి రిపుకంటకదేశ ముకుంద కృష్ణ ము
క్కంటికినైన నీమహిమ గానఁగ శక్యమె పా...

39


ఉ.

కేశవ పద్మనాభ హరి కృష్ణ జనార్దన వాసుదేవ ల
క్ష్మీశ జగన్నివాస నరసింహ మురాంతక చక్రపాణి క్ర
వ్యాశనవైరి శార్ఙ్గ నరకాంతక వామన తార్క్ష్యవాహ వా
రాశిశయాన నగ్గరుణ రంజిలఁ గావుము పా...

40


చ.

అమలినభక్తిచేత కమలాధిప ని న్నెవఁడైనగాని హృ
త్కమలమునందునిల్పి విహితంబుగ పూజ లొనర్చువాఁడు న

య్యమభటబాధలం బొరయ కంత్యమునందు భవత్పదంబు సి
ద్ధముగను జెందు నంచు మరి దల్చెద మాధవ పా...

41


చ.

ఉరగశయాన దేవ పురుషోత్తమ కేశవ రుక్మిణీమనో
హర నరమిత్ర మిత్రకమలాహితలోచన నిర్వికల్పభా
సుర నవహేమనేత్ర మధుసూదన కైటభహారి దేవ నిన్
శరణమటంటిఁ గావు నను సర్వజగన్నుత పా...

42


చ.

గురువులయాజ్ఞ మీరి బుధకోటులమాటలు గేరి నిత్యమున్
బరులధనంబు గోరి పరభామలపొంతలఁ జేరి దుష్టులై
తిరిగెడు మానవాధములు దిక్కరి యంత్యమునందుఁ బాపమన్
శరనిధిలో మునుంగుదురు సత్యము సత్యము పా...

43


ఉ.

పాయక నిన్ను సంతతము బ్రస్తుతి జేసిన మానవుండు సు
శ్రీయుతుఁడై సమస్తజనసేవితుఁడై పొగడొందుచుండు నా
రాయణ వాసుదేవ కమలాధిప శౌరి జగన్నివాస ప
ద్మాయతచారునేత్ర నరకాసురమర్దన పా...

44


ఉ.

కంటి భవత్పదాబ్జములు కంటిని దేవరశంఖచక్రముల్
కంటిని యుష్మదంకగతలక్ష్మిని గన్నుల కర్వుదీరఁగాఁ
గంటిని తావకీనవరకౌస్తుభమున్ లలితోర్ధ్వపుండ్రమున్

గంటిని నీదువాహనము గంటిని మిమ్ముల పా...

45


చ.

పతితజనావనుండవని పల్మఱు ని న్గొనియాడుచుండు నే
నతిముదమంద సంతతము నాశ్రితకల్పమహీజ దేవకీ
సుత చతురాననార్చిత విశుద్దయశోజ్జ్వలరుక్మిణీసతీ
హితకరసూరిసేవిత యహీనపరాక్రమ పా...

46


చ.

చపలుఁడ బుద్ధిహీనుఁడను జారుఁడ చోరుఁడఁ బాపకర్ముఁడన్
గపటిని నన్నుఁ బ్రోచుటకుఁ గర్తవు నీ వని నమ్మియుంటి నో
తపనశశాంకనేత్ర నిరతంబును వేడుకమీఱ శ్రీరమా
ధిప ఖలదూర దేవనుత దీనదయాపర పా...

47


చ.

యదుకులసార్వభౌమ కమలాధిప దీనశరణ్య గోపికా
హృదయసరోజమిత్ర నవహృద్యఘనామలగాత్ర కంధిరా
ట్సదన ముకుంద కృష్ణ భవసన్నుత పన్నగతల్ప నిన్ను స
మ్మదమునఁ గొల్తుఁ గావు నను మౌనిజనావన పా...

48


చ.

పరులగుణంబు లెన్ని తమపాటిజనంబులు నెంచి చూడఁగా
ధరణిని లేరటంచు నిరతంబును బెద్దల నింద సేయఁగా

దొరకొనుదుష్టమానవు లధోగతిపా లయి దుఃఖపూరితో
దరులయి రౌరవాబ్ధిఁ బడి తాము నశింతురు పా...

49


ఉ.

పావనమైన మీచరణపద్మమరందము గ్రోలుచున్న నా
భావము హీనదైవములపజ్జ వసింపఁగఁ బోవనేర్చునే
తావకదాసదాసులకు దాసుఁడ నయ్యెద నన్ను బ్రోవవే
శ్రీవనితామనోహర విరించిభవార్చిత పా...

50


చ.

హలకులిశాదిలక్షణసమన్వితపాదసరోజ కృష్ణ యీ
కలుములు శాశ్వతంబులని కాయము నిత్యముగా దలంచుఁ దాఁ
బెలసి ధనేషణాది కవిధేయమతి న్గడుచంచలాత్ముఁడై
తెలియక చేతనుండు కడతేరఁగనేరఁడు పా...

51


చ.

అనుపమభాగ్యశీల శరణాగతవత్సల దేవదేవ నీ
వెనసిన సత్కటాక్షమున నెవ్వనిఁ జూడవు నెవ్వఁడైన ని
న్గనుఁగొనఁ డట్టివాఁడు నరకంబున నిందితుఁడై వసించునం
చనయము దల్తు నామదిని నచ్యుత కావుము పా...

52


చ.

మురహర వాసుదేవ భవమోచన శౌరి జగన్నివాస శ్రీ
ధర ముచుకుందపాల ఖలదానవమర్దన శ్రీరమామనో

హర హరసేవ్య కృష్ణ భవదంఘ్రియుగంబను తెప్పచేత నే
దురితమహాబ్ధి దాఁటెదను దుర్జనసంహర పా...

53


చ.

శమదమయుక్తియోగు లనిశంబు యమాదులచేత నాత్మకా
యములఁ గృశింపఁజేసి హృదయాంబుజపీఠములందు నీపదా
బ్జము లిడి నిత్యముక్తులయి సర్వము నీవని తల్తు రట్టిని
న్నమలినభ క్తి నేఁ గొలుతు నచ్యుత కావుము పా...

54

పంచాయుధస్తవము

చ.

ఘనతరనిర్దళద్రిపునికాయవధూజనగర్భగోళమై
కనదురుకాంతిసంవిజితకాండజదుర్హృదపూర్ణబింబమై
దనరెడు నీదుచిందమును దద్దయు భక్తి నమస్కరింతు నా
మన మలరంగ సంతతము మౌనిచయాన్విత పా...

55


చ.

పటుతరవిస్ఫులింగము లభంగమహత్ప్రళయానలప్రభా
పటలమువోలె దిక్తటులఁ బర్వఁగ దారుణవృత్తిజన్యలం
పటుఁడగు మేదినీసుతుని బట్టి ధరాస్థలిఁ గూల్చినట్టినా
చటులసుదర్శనంబునకు జాగిలి మ్రొక్కెద పా...

56


చ.

అమలసువర్ణరత్నకటకాంచితమై సురరాజసేవ్యమై
సమదనిశాటవీరభటసంచయకాననవీతిహోత్రమై
యమరెడు యుష్మదుజ్జ్వలకరాబ్జగతోరుగదాసుదండమున్

బ్రమద మెలగ్ప సంతతము ప్రార్థనఁ జేసెద పా...

57


చ.

భవదురువిక్రమక్రమము ప్రౌఢికి నెక్కఁగ దోర్యుగంబుచే
దివియ నమస్కరించుగతిఁ దేజము మీఱుచు బాణవృష్టి న
ద్దివిజవిరోధిసంఘముల ద్రుంచి విరించిముఖాదిదేవసం
స్తవములు గాంచు నీదుఘనశార్ఙ్గము గొల్చెద పా...

58


చ.

అతినిశితోజ్జ్వలన్నిజభయంకరరూపవినీలధారచే
నతులబలాతిరేకమనుజాశనకంఠవిలుంఠనక్రియా
చతురత నెన్నిక న్వడసి సంతతమున్ సురపూజనీయమై
క్షితి పొగడొందు యుష్మదసికిన్ బ్రణవిల్లెద పా...

59

దశావతారసూచకము

చ.

జలముల జొచ్చినన్ శిఖరిచాటున డాఁగిన ముస్త లెత్తినన్
బిలమున గూడినన్ పరుల భిక్షము వేఁడి నరాతిఘాతివై
యలరినఁ గాన కేగిన దురాశల జెందిన మౌనివైన ని
న్నలరుచుఁ గొల్తు నింక కలికాకృతివైనను పా....

60


చ.

పని గొని పద్మసంభవుఁడు భారతితో నిదురింపఁ జోరుఁడై
కనుగొని వేదముల్ గొనుచుఁ గంధిని జొచ్చినసోమకాసురు

న్వెనుకొని మీనరూపమున వేగమె వానివధించి యాశ్రుతుల్
మునుకొని బ్రహ్మ కిచ్చి జగముల్ దగ బ్రోవవె పా...

61


ఉ.

మందులు జేర్చి పాల్కడలి మంచిఘటమ్ముగ మందరాచలం
బందపుఁగవ్వమై యహికులాధిపు త్రాడుగ దేవదానవుల్
పొందుగఁ దర్వ నంబుధిని భోరున నగ్గిరి గ్రుంగఁ గూర్మమై
సుందరలీలఁ దాల్చిన యశోనిధివౌ భళి పా...

62


చ.

ఇలఁ గొని యారసాతలము కేగెడి మేలిమికంటిరక్కసు
న్బలిమి వరాహరూపమునఁ బట్టి వధించి ధరాతలంబు బెం
పలరఁగఁ బంటిమీఁద సకలామరు లెన్నఁగఁ దాల్చి లోకముల్
వెలయఁగ నేలు నీమహిమ వింతగదా హరి పా...

63


చ.

హరిమయ మీప్రపంచమని యాడెద విచ్చటఁ జూపుమంచుఁ జే
జఱచినఁ గంబము న్వగులఁ జండతరోగ్రనృసింహమూర్తివై
స్ఫురితనఖాళి హేమకశిపు న్వడిఁ జీలిచి బాలు నేలు నీ
చరితము లెన్న శక్యమె విశాలయశోనిధి పా...

64


ఉ.

వేలుపుమూఁకలం దరిమి వేడుకతో బలి యీజగత్రయం
బేలఁగ నెంచి మూఁడడుగు లింపుగఁ గుబ్జత వేఁడి వానిఁ బా
తాళముఁ జేర్చి తత్పదవి తత్క్షణ మింద్రున కిచ్చినట్టి నీ
లీలల లెక్కఁబెట్టఁగను లే రజముఖ్యులు పా...

65

ఉ.

కంటకు లైనపార్థివులకంఠము లిర్వదియొక్కపోరులన్
బంటుతనంబున న్దునిమి పాయక తద్రుధిరాపగమ్ములన్
వెంటనె బైతృకమ్ము లతివేడుక దీఱిచి భార్గవాఖ్యచేఁ
బంటవలంతిభారమును బాపితివౌ భళి పా...

66


చ.

దినకరవంశజుండవయి ధీరతఁ దాటక ద్రుంచి గౌతమాం
గనను బవిత్రఁ జేసి కరకంఠునివి ల్దునుమాడి సీత నొ
య్యన వరియించి కాననమునందుఁ జరించి పయోధి దాఁటి రా
వణుని వధించి తీవె రఘువర్యుఁడవై హరి పా...

67


చ.

అజహరు లెన్నఁ గైరవహితాన్వయమందు జనించి యచ్యుతా
గ్రజుఁ డన మించి రేవతి కరగ్రహణం బొనరించి సాధన
వ్రజములు దాల్చి ఘోరసమరంబున ముష్టికముఖ్యదుష్టులన్
భుజబలిమి న్వధించి జగము ల్మనసేయవె పా...

68


చ.

త్రిపురవరుల్ దురంబుల సతీపతి నొంపఁగ బౌద్ధమూర్తివై
కపటమునం దదీయకులకాంతలనిష్ఠలు మాన్పి శైలజా
ధిపునకు సాధనక్రమము దెల్పి పురంబులు గూల్చినట్టి నీ
విపులచరిత్రముల్ వినఁగ వింతగదా హరి పా...

69


చ.

కరముల శంఖచక్రశరకార్ముకఖడ్గము లుల్లసిల్లఁగాఁ

దురగముపై వడి న్బొలిచి దుష్టుల బర్బరపారసీకఘూ
ర్జరులను ద్రుంచి ధర్మము ధరాస్థలి నిల్పగఁ గల్కిమూర్తివౌ
గురుతరశీలదేవ నిను గోరి భజించెద పా...

70


చ.

కడలిఁ జరించి మందరము కవ్వముగా భరియించి పంటిపైఁ
బుడమి ధరించి దైత్యసుతుఁ బ్రోచి బలీంద్రుని వంచి రాజులన్
బొడిచి దశాస్యుఁ ద్రుంచి హలము న్గొని బుద్ధత మించి కల్కివై
యలరెడు నిన్ను వేఁడెద దయామృతనీరధి పా...

71


ఉ.

 శ్రీరమణీశ యోగిజనసేవితపాదసరోజమందరో
ద్ధార సుమేరుధీర నిజదాసజనావనఖేల దీనమం
దార భుజంగరాణ్మృదులతల్ప జగత్త్రితయైకమోహనా
కార కృపాసముద్ర హరి కాళియమర్దన పా...

72


చ.

పదములఁ గిల్కుటందియలు బంగరుదట్టి కటీతటంబునన్
ఎద సిరికౌస్తుభం బఱుత నింపుగ ఫాలతలంబున న్మృగీ
మదతిలకంబు నౌదలను మంజులరత్నకిరీట మూని న
న్నదనుగఁ బ్రోవవే దయ దయామృతనీరధి పా...

73


చ.

నిరుపమనీలదేహ రజనీచరమర్దన గోపికామనో
హర నవనీతచోర వికచాంబుజనేత్ర జగన్నివాస భా

సురగుణజాల హేమమణిశోభితహారకిరీటకుండలా
భరణ విరోధిసంహరణ పాండవపాలన పా...

74


ఉ.

రంగుమెఱుంగుదువ్వలువ రాజతరత్నవిభూషణంబు లు
ప్పొంగుచుఁ దాల్చి నీలమణిపోలిక మే న్విలసిల్ల శ్రీరమా
లింగనవైభవం బలరులీల ఘటిల్లఁగ నేగుదెంచి నీ
బంగరుపాదపద్మములు బాగుగఁ జూపవె పా...

75


చ.

వరద ముకుంద చక్రధర వాసవవందిత వాసుదేన మం
దరధరణీధరోద్దర సనందనసంస్తుత వేదవేద్య శ్రీ
ధర మురదైత్యభంజన పతంగకులాధిపవాహ రాధికా
వర వరరత్నసంగతసువర్ణవిభూషణ పా...

76


ఉ.

దొంతరబాముల న్వెడలు త్రోవఁ గనుంగొనలేక బేలనై
వంతలఁ బొందుచున్న నను వంచన సేయక బ్రోవుమంచు నే
చెంతకుఁ జేరినాఁడ నెడసేయక సత్కృపతోడఁ గావవే
దంతురశాంతిదాంతిగుణధామ దయానిధి పా...

77


ఉ.

పంకజనాభ ఘోరభవపాశవిమోచన గోపవేష శే
షాంకశయాన శౌరి సుజనావన దారుణవాసవేంద్రనా
శంకర శంఖచక్రధర శంకరసంస్తుత దేవదేవ నీ

కంకితమైన దీకృతి రయంబునఁ గైకొను పా...

78


చ.

అభవుఁడ వంతరాత్ముఁడ వనాద్యుఁ డవార్యహితైకసత్కళా
విభవుఁడ వప్రమేయుఁడ వవిశ్వుఁడ వక్షయతత్వబోధసా
నుభవుఁడ వార్తబంధుఁడ వనుశ్రుతవీర్యుఁడ వైననీవు నా
కభయ మొసంగి బ్రోవవె దయామృతనీరధి పా...

79


ఉ.

నందసునందనందన సనందనవందన కంజనేత్ర గో
వింద ముకుంద కేశవ త్రివిక్రమ కృష్ణ మురారి సచ్చిదా
నంద పురందరామరగణస్తుత సద్గుణబృంద యిందిరా
మందిర మామకవ్యధలు మాన్పఁగదే హరి పా...

80


చ.

తఱుచుగ గోగణవ్రతనితాంతమతి స్థితుఁడౌ నృగుండు భూ
సురవరకోపదీపితవచోహతి దుర్భరనిర్జలప్రహిన్
సరటగతి స్వసింపఁ గని శాపవిమోచను జేసి బ్రోచితే
గుఱుతుగ నీమహామహిమ కోవిదు లెన్నఁగ పా...

81


చ.

గురుతుగ కంసదాసియగు కుబ్జపటీరసుగంధబంధురా
గరుఘనసారలేపనము గైకొని పైకొని రాచి సుందర
స్మరశరలీలఁ చేర్చి సరసంబగుకోరిక దీర్చి మోక్షసం
భరితను జేసినట్టి నిను భక్తిని గొల్చెద పా...

82

చ.

గురుమతితోఁ గుచేలుఁ డటుకుల్ పిడికెం డొసఁగన్ భజించి భా
సురతరమోక్షసంపదలు శోభిలఁగా దయచేసితౌ భళీ
కర మనురక్తి భూమిసురకామిను లన్న మొసంగ వారి నా
దరమున బ్రోచు నీనెనరు దెల్పఁగ శక్యమె పా...

83


చ.

అరుదుగ రాజసూయమఘమప్పుడు చైద్యునిమస్తకంబు ప
ళ్లెరమనుచక్రధార నవలీలఁగ ద్రుంపఁగ నెల్లవార ల
చ్చెరుపడ తేజము న్వెడలి జేరెఁగదా నిను నీదుమాయ లె
వ్వరలకునైన శక్యమె ధ్రువంబుగ నెంచఁగ పా...

84


చ.

విరివిగ గోపకామినుల వేణువుఁ బూని వినోదపంచమ
స్వరమృదుమాధురీరవవశస్ఫురితాంగులఁ జేసి మోహన
స్మరసుఖకేళి దేల్చి సుకుమారముల న్విలసిల్లు నీదుసుం
దర మరయంగఁ గోరితి ముదంబునఁ జూపవె పా...

85


చ.

విరటుపురంబున న్మదనవేదన కోర్వక కీచకుండు బి
త్తరి ద్రుపదావనీశదుహిత న్గవయన్ జనువేళ నుగ్రుఁడై
కరువలిపట్టి నీదయనుగాదె వధించి యశంబు గాంచి దు
ర్భరుఁడగు మాగధున్ దృణముభంగిని జీలిచె పా...

86


చ.

మురియుచు దుర్మదాంధమున మోసము గానక దుష్టచిత్తుఁడై
కురుపతి పాండునందనులఁ గొంచక వంచన సేయ వాని సం

గరమునఁ గూల్చి రాజ్యము సుఖస్థితి ధర్మజుఁ డేలు టెల్ల నీ
కరుణనుగాదె నీమహిమ గాంచఁగ శక్యమె పా...

87


ఉ.

మన్నులు దిన్నబిడ్డఁడని మాటికి నిన్ను యశోద బల్క బ
ల్వెన్నలు మెక్కుచోరుఁడని వ్రేతలు వేమరు ఱవ్వ సేయఁ దా
ర్కొన్న దవాగ్ని మ్రింగెనని కొంచక గోపకుమారు లెన్న నీ
చిన్నెలవిన్నచోద్యము వచింపఁగ శక్యమ పా...

88


చ.

పరులను వేఁడనంటి పలుబాముల కోరువనంటి నీవ నా
దొరవని నమ్మియుంటి నెటుదోఁచక వేదనఁ కొంటి మేటిదే
వరవని వెంటనంటి నిను వర్ణనసేయుచు వేఁడుకొంటి నా
మొఱ వినుమంటి ప్రోవుమని మ్రొక్కఁగఁ గంటిని పా...

89


చ.

నిరతము నిన్నుఁ గొల్చుమహనీయులఁ జెందదు పాతకవ్రజం
బరయఁగ నంచు దేవ భవదంఘ్రికయోజము లాత్మలోన సు
స్థిరముగ నమ్మినాఁడ నను చిక్కులు బెట్టఁగ నేల ప్రోవవే
పరమదయాంబుధీ విహగపాలరథి హరి పా...

90


చ.

ఉడుతను లేడినిన్ కరిని నూసరవెల్లిని గొండచిల్వనున్
బడవరిపక్షినిన్ బడుగుబాపని బూవులవాని చాకినిన్

బుడుతని బానిసెన్ గడకు బోయతయింతి నరణ్యచోరునిన్
గడువడి నేలు నీ నెనరు గాంచఁగ వింతగు పా...

91


ఉ.

దండము దండ మద్రిధర దండము దండము పాండవావనా
దండము దండ మద్రినుత దండము దండము చండవిక్రమా
దండము దండ మబ్జఢృత దండము దండము భండనోత్సుకా
దండము దండ మార్యహిత దండము దండము పా...

92


ఉ.

నీపదపద్మసేవనము నీపదభక్తులతోడి సఖ్యమున్
నీపదిపద్యముల్ వినుట నీపయిబుద్ధులు నా కొసంగవే
తాపసకల్పభూజనిజదాసజనావన యింతకంటె నిం
కేపగిది న్గణింపఁగలదే యపవర్గము పా...

93


చ.

సురతతిఁ జూడ నచ్చరలు సొం పలరింపఁగ నాడఁ గిన్నరుల్
వరలయతాళసంగతుల వారకగానము బాడ భూసురుల్
వరుసను స్వస్తివాచకముల న్గణుతింపుచు వేడ్క రమ్ము నా
దురితములెల్ల వీడఁ గృపతోడను బ్రోవఁగ పా...

94


ఉ.

రవ్వలు జేసి గోపికలు రాయిడిఁ బెట్టఁగఁ గావవైతివా
చివ్వ లొనర్చు దైత్యులకుఁ జెచ్చెర నైక్య మొసంగవైతివా
క్రొవ్వున ఱాళ్ల ఱువ్వి జడిఁగొట్టిన శక్రుని నేలవైతివా
పువ్వులఁ బూజ సేయునను బ్రోవనిదేమిర పా...

95

ఉ.

ఒప్పులకుప్ప నీవు ముద మొప్పఁగ నప్పులకుప్పలోన బ
ల్గొప్పగఁ జిల్వపాన్పునను గోమలితోఁ బవళించి లోకముల్
తప్పక బ్రోతువంచు విదితమ్ముగ నొజ్జలు చెప్ప నమ్మి యా
చొప్పున గొల్చు నన్ను దయఁజూడఁగదే హరి పా...

96


చ.

పరుఁడను గాను రార భవబాధల కోరువలేర నిన్ను సు
స్థిరముగ నమ్మినార మది దీనత మానుపవౌర సామి నా
మొఱ వినవేర నేను నిను ముఖ్యముగా వినుతింపనేర న
న్బొరలను బెట్టమేర పరిపూర్ణదయాంబుధి పా...

97


చ.

గురుతుగ సత్యలోకమునకున్ హనుమంతుని సర్వలోకసం
భరితునిగా బలిన్ జెలిమి బాయక ద్రౌణికి మౌనిరాట్పదం
బరయఁగ నర్కజాధిపున కామనురాజ్యపదాధికారమున్
విరివిగఁ గల్గఁజేయ దొర వీవని వింటిని పా...

98


ఉ.

కంటిని రుక్మిణీసతిని గంటిని సాత్రజితీవధూమణిన్
గంటిని శంబరాంతకుని గంటిని శ్రీబలభద్రదేవునిన్
గంటి నుషాంగనాపతిని గంటిని మీపరివార మంతయున్
గంటిని మిమ్ము మీ నెనరుఁ గాంచఁగఁ గంటిని పా...

99


చ.

శరణు సమస్తదేవగణసంస్తుత దివ్యపదాంబుజద్వయా
శరణు కళిందజాతటవిశాలవనాంతరగోగణావనా

శరణు వ్రజాంగనావదనసారసవిస్ఫుటలోకబాంధవా
శరణు తుషారహీరఘనసారయశోనిధి పా...

100


చ.

సరసిజనేత్ర రార గుణసాగర రార మురారి రార సుం
దరఘనగాత్ర రార శుకనారదసన్నుత రార గోపికా
సురతవిచిత్ర రార దయఁజూడవదేర కలంచెదేర నా
దురితము బాపవేర భవనదూరదయానిధి పా...

101


ఉ.

ఆతప మర్కుఁ డబ్జుఁడు హిమాంశువు లంచితవృష్టివారిద
వ్రాత మయత్నపూర్వముగఁ బ్రాణుల కిం పొనరించినట్ల ని
ర్హేతుకజాయమానకరుణేక్షణపంక్తుల బ్రోవ నీవెగా
దాతవటంచు నమ్మితి యథావిధిగా నిను పా...

102


చ.

జడుఁడ శఠుండ ధూర్తుఁడ నృశంసుఁడ దుష్టుఁడ కష్టుడ న్దురా
త్ముఁడ నతిఘోరకల్మషుఁడ మూఢుఁడ దుర్భవసాగరంబునన్
బడలినవాఁడ నోపతితపావన యోహరి యోయదూద్వహా
తడయక బ్రోవవే యనుచు దండము బెట్టితి పా...

103


ఉ.

మ్రొక్కెద దేవకీతనయ మ్రొక్కెద సంతతసేవకావనా
మ్రొక్కెద దేవదేవ హరి మ్రొక్కెద భావభవారిసేవితా
మ్రొక్కెద రుక్మిణీరమణ మ్రొక్కెద సాత్రజితీమనోహరా
మ్రొక్కెద కంససంహరణ మ్రొక్కెద గావవె పా...

104

చ.

జయజయ దేవదేవ జలజాతభవార్చిత పాదపంకజా
జయజయ వామదేవ శరజన్మముఖామరజాలసంస్తుతా
జయజయ వాసుదేవ నవసారసపత్రవిశాలలోచనా
జయజయ శారదాభ్ర సురసాలయశోనిధి పా...

105


చ.

పుడమిని తాడెపల్లికులముఖ్యుఁడ విప్రుఁడ పానకాలురా
యుఁడ భవదంకితమ్ముగ శతోత్పలచంపకవృత్తముల్ ముదం
బడర రచించినాఁడను దయామతి గైకొని ధన్యుఁ జేయవే
తడయకనంచు మ్రొక్కెదను దప్పక బ్రోవవె పా...

106


చ.

నిరుపమకౌస్తుభాభరణ నీరదనీలశరీర హాటకాం
బర జగదేకవీర భవబంధవిమోచనశూర వాసవా
వరజ ముకుంద కృష్ణ యదువల్లభ భూరియశోలసద్ధృతీ
తిరువలికేణిపట్టణపతీ గుణనీరధి పా...

107


ఉ.

మంగళ మిందిరాసహితమంజులనీరదనీలవిగ్రహా
మంగళ మభ్రకేశనుత మానితకౌస్తుభహారకంధరా
మంగళ మార్యలోకహిత మౌనిజనస్తుతపాదపంకజా
మంగళ మంచు ని న్నెపుడు మానకఁ గొల్చెద పా...

108


పార్థసారథిశతకము
సంపూర్ణము