భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/మహిజామనోహరశతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక

ఈశతకము రచించినకవి రేమెల రామదాసుఁడు. ఇతఁ డార్వేలనియోగిబ్రాహ్మణుఁడు. అప్పయసూరి వేంకమాంబల కుమారుఁడు. ప్రతివాదిభయంకరము సింగరాచార్యులవారి శిష్యుఁడు. రావు గంగాధరరామారావుగారి పరిపాలనమునందున్న దుగ్గుదుర్తి గ్రామనివాసి. ఈయంశములు శతకాదియందలి పద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. గంగాధరరామారాయప్రభువర్యులు క్రీ. శ. 1870 ప్రాంతములం దుండియుంటచే నీకవియు నప్పటివాఁడనియుఁ బిఠాపురసమీపనివాసియనియు శతకకవులచరిత్రకారులు వ్రాసియున్నారు. పీఠికాపురసంస్థానప్రభువు లగు నే గంగాధరరామారావుగారికాలమున నీకవి యుండెనో శతకమున విస్పష్టముగఁ దెలుపఁబడకపోవుటచేఁ గవిజీవితకాల మెంతవఱకు నిశ్చితమొ నిర్ధారణము చేయ నయితి కాదు.

ఈశతకమునందు భక్తమందారమనఁదగు శ్రీరామమూర్తి యభివర్ణితుఁడయ్యెను. ఇందలిపద్యములు ధారాళశైలితో సులభగ్రాహ్యములై పఠనీయములై యున్నవి. స్వతంత్రభావములు మనోహరముగా నుంటచే నీశతకమును భక్తిరసశతకసంపుటమునందుఁ జేర్పఁబూనితిమి.

ఇందలినీతిపద్యములందుఁ గృతివిక్రయము, కన్యావిక్రయము, అన్యాయవర్తనము, ఈషణత్రయము, యాచ్నాదైన్యము, దరిద్రావస్థ లోనగునంశములను గూర్చిన పద్యములవలన గ్రంథకర్త సంసారకష్టములకు లోనై నానావస్థలకుఁ బాలై భవతారకుఁడగు శ్రీరాముని తారకనామస్మరణమున కీశతకము రచించెనని తోఁచును. భక్తిరసపద్యములలో శ్రీరామునిదయాశాలిత్వము దివ్యమంగళసుస్వరూపము భక్తత్రాణపరాయణత్వము కొనియాడఁబడెను. దశావతారవర్ణనమునుగూర్చియుఁ గొన్నిపద్యములు రచింపఁబడెను.

దాశరథిశతకమునందును రామతారకశతకమునందు శ్రీరామకర్ణామృతమునందువలె నీశతకమునందును శ్రీరామలీలలు మనోహరముగ వర్ణితములై యుంటచే నీశతకము రామభక్తుల కవశ్యపఠనీయము.


నందిగామ

ఇట్లు భాషాసేవకులు

20-10-25

శేషాద్రిరమణకవులు,

శతావధానులు.

శ్రీరస్తు

రేమెల రామదాసకవికృత

మహిజామనోహరశతకము

ఉ.

శ్రీరమణీమనోహర యశేషఋషీశ్వరదేవతాశ్రితా
పూరితపాదపద్మములకు న్బ్రణమిల్లి రచింతు నేఁడు సం
సారగభీరఘోరతరసాగర మేను తరించఁగోరి నీ
తారకనామకావ్యము యథావిధిగా మహిజామనోహరా.

1


ఉ.

రేమెలవంశసంభవుఁడ రేణిగ నార్వెలగోత్రజుండ నో
రామ సురారిభంజన సురార్చితవిగ్రహరామదాసుఁడన్
కామ మెలర్ప నొక్కశతకంబును గానుకగా నొనర్చి మీ
వామపదాబ్జముల్ గొలుతు వ్యాసనుతా మహిజామనోహరా.

2


ఉ.

అప్పయసూరి సౌమ్యగుణి నంచితశీలిని వెంకమాంబనున్
ఒప్పుగఁ బెండ్లియాడి ధర నుత్తమచర్యలఁ గీర్తిఁ బొందె యా
కప్పురగంధికిన్ చతురగర్భజ రామయనామధేయుఁడన్
దప్పకఁ జేతు మీభజన దాసుఁడనై మహిజామనోహరా.

3

ఉ.

ధైర్యమును న్మహత్వమును ధార్మికము న్ధనధాన్యసంప దౌ
దార్యమహాతపస్వి భయదాకృతి పండితకోటికి న్సదా
వార్యము సూరినట్టిప్రతివాదిభయంకర యార్య సింగరా
చార్యులశిష్యుఁడ న్విమలచక్రధరా మ...

4


ఉ.

బాధలు మాన్పి ధీరప్రతిపక్షిభయంకరులైన రావు గం
గాధరరామరావు కరుణారసభావముఁ బూని బ్రోవగా
మాధవ దుగ్గుదుర్తిపురమందు నివాసముఁ జేయుచుందు మో
రాధమనోహరా కలుషరాగహరా మ...

5


ఉ.

శ్రీరమణీయ మీచరణసేవయు మా కనయం బొసంగు మీ
తారకనామమంత్రమును దాండవమాడఁగ నాదుజిహ్వపై
ధారణఁ జేసి నాయఘము తర్లఁగఁజేయుము శేషశాయి మీ
బారికిఁ జేరినాఁడసుమి పాపహరా మ...

6


ఉ.

పావనరామమంత్రమును పాటిగఁబొందుట యెన్నఁ డబ్బునో
భావమునందు మీచరణపద్మము లెప్పుడు నిల్పు టెన్నఁడో
భూవర మాదయారసము పూర్ణముగా మరి వచ్చు టెప్పుడో
పోవనుఁ జేయ శక్తుఁడవు పాపహరా మ...

7


చ.

పదములు నమ్మినాఁడ నతిపామరుఁడంచు దలంపకయ్య నా

సదమలపాదపద్మములు సారెకుఁ గొల్చినవారిదోషముల్
పదపదమంచుఁ ద్రోతువట పాయక నామొఱ యాలకించి నీ
వదనముఁ జూప వేమిటికి వాలిహరా మ...

8


ఉ.

రమ్మిఁక జాల మేల నను రాపులుఁ బెట్టకు దాసకామ ని
న్నమ్మితి రామ నీదుదయ నాపయి నించుక రా దదేమి మీ
కమ్మితి దేహ మింక నిజ మారడిఁ బెట్టకు సూరికామ ని
న్నమ్మికచేతఁ గొల్చెదను నామదిలో మ...

9


ఉ.

ఓరఘురామయంచు బలుకోరికఁ బిల్వఁగ నేల రావు రా
నేరము చాలఁ గల్గినను నీరజనాభ సహింపఁగాఁదగున్
గూరిమిచేత నీవు నను ఘోరభవాంబుధిలోన వేసటల్
దూరముఁ జేసి యేలుమిఁక దోషహరా మ...

10


ఉ.

కాముకుఁడంచు నీవు ననుఁ గాలభటాళికిఁ జేర్పకయ్య యో
తామరసాక్ష దీను నిటుఁ దాపము నొందఁగ నేఁచ నాయమా
కోమలదేహ నామనవిఁ గూరిమితో వినరాద నాపయిన్
దామస మేల నీకు నిటు దాసునిఁగా మ...

11


చ.

ఘనుఁడ వటంచు నమ్మితి నఘాళులఁ దోలుము రామదాసుని
న్ఘనతగఁ బ్రోవ రావ ననుఁ గంజదళాక్ష నిరాకరించుట

న్మనమున యెన్నఁ డెంచకు రమాపతి యెట్లుఁ దలంచినావొ యీ
తనువును నమ్మలేదుర సదామదిలో మ...

12


ఉ.

వాసిఁ దొలంగి నీభటులు వ్యాధిని బొందినఁ గీర్తి యేరిదో
రోసము లేక దాసునెడ రూఢిగఁ బ్రోచెడివాఁడ వంచు నే
దోసిలి యొగ్గి సంస్తుతులు దోషహరా నినుఁ జేయుచుందు నీ
దాసులలోన నే నొకఁడ దాసుఁడనై మ...

13


చ.

కరివరు నేలినావు మునుఁ గాంక్ష యొకింతయు లేక కాకమున్
శరణని వేఁడఁగానె దయశాలివియై కరుణించినావు నా
మొర విని కావ వేమి నిను మోదముతో స్తుతిసేయుచుందు నో
తరణికులేశ యీభవము ధన్యతకై మ...

14


ఉ.

చూడఁగ నీపదద్వయముసొంపు నుతింపఁగ నెంతవాఁడ నే
వీఁడను నీదుభక్తియును నేమఱుపాటుననైన నామదిన్
వేఁడెద రామ రామ యని వేడుకతోడ భజింపుచుందు నీ
వాఁడను నన్ను బ్రోవు మిఁక వాలిహరా మ...

15


ఉ.

వాదము జేసి దాసపరివారజనంబులలోన నుండెద
న్మాదని నీవు యేవిధము మాయలు జేసిన నీదుభక్తిచే
నాదరి జేరకుండఁగను నౌరని దాసులు మెచ్చరో లెద

న్వాదమె మీకు నాకు మరి వాలిహరా మ...

16


చ.

మరణము నొందువేళ నిను మాటికి పన్నగశాయి యంచు నే
దిరముగఁ బల్కఁజాల నను దీనదయాపర యేమి జేతువో
యిరవుగ నిప్పుడే మదిని యీశ్వరపూజిత నీదు నామము
ల్తరచి తరింపఁగోరెద సచా మదిలో మ...

17


ఉ.

జాలము సేయఁగాఁ దగదు చాలుర నాపయి పంత మేలరా
జాలి యొకప్పుడైన ననుఁ జాలఁగ నమ్మినవాఁ డటంచు నా
పాలిఁటఁ బుట్టదాయె భవబంధము లేగతిఁ బాపువాఁడవో
దూలితబాధ బెట్ట కిక దోషహరా మ...

18


ఉ.

దాసులు వెంట వత్తురని దానవమారణ వైనతేయునిన్
వాసిగఁ జూచి నీ వతని వాహన మౌటకుఁ గారణంబగున్
భాసురహస్తి గుఱ్ఱములు పల్లకి యుండఁగ వైనతేయునిన్
వాసిగ నెక్కు టేమిటికి వాలిహరా మ...

19


ఉ.

నారదగానలోలతను నామొఱ వీనుల నాటదాయెనో
తారకరామనామములు దాసులు బాడుచు చుట్టుకుండిరో
పారము లేనిపాతకుని భారముగా విని యూరకుంటివో
నేరము లేదు యుండినను నేలగదే మ...

20

ఉ.

విన్నప మాలకించు పరవీరభయంకర నీదునామముల్
సన్నుతిఁ జేయుదాసులకు సాదరమోక్ష మొసంగినావు నీ
కన్న మహాత్ముడున్ గలఁడె కానకపోయితి నిన్నినాళ్లు నా
కన్న దురాత్ముఁడున్ గలఁడె కంసహరా మ...

21


ఉ.

చిత్తమునందు నీపయిని చింత యొకప్పుడు మానలేదు నీ
చిత్తమునందు న న్మరచి చిక్కులు బెట్టఁగనేల రామ మీ
చిత్తము నింత బింకముగఁ జేసితె దాసుఁడు యెట్లు నోర్చు మీ
చిత్తము కెట్లు దోఁచినదొ చిక్కదురా మ...

22


ఉ.

ఎంతని వేడుకొందు నిను యేమని దూరుదు యేమి జేతురా
పంతము కెంతవాఁడ బలుపంతము జేయకు మోర్వజాల నీ
వింత శిలాత్మకుండవని యెన్న డెఱుంగకపోయినాను నే
నింతటిలోనే తేలితని యెంచకుమీ మ...

23


చ.

కరివరునిన్ విభీషణుని గాకమునున్ గుహునిన్ గుచేలునిన్
మరియును గుబ్జనున్ రవికుమారుని నాదిగఁ గాచినావు గా
నరమర లేక నీవు నటు నన్నొకనిన్ దయఁ జూడకుందువా
పరమమునీంద్రయోగిజనపాపహరా మ...

24


ఉ.

ఏమిర రామ న న్నిటుల నేచుట ధర్మము గాదు యేలరా

పామరు గాచుటే బిరుదు పావనరామ తలంచి చూచినన్
బామరుగానివాని భువిఁ బాలనఁ జేయుట గాదు కేశవా
నీమది నెంచి చూడు మిఁక నిక్కమురా మ...

25


ఉ.

ఒక్కొకవేళ ని న్మదిని నోరఘువీర దలంపకుందు వే
రొక్కొకవేళ మీసొగసురూపము జూపుమటంచు వేఁడుదున్
మక్కువచేత వీనిని సమత్వము జేయుము నీమనంబులో
తక్కినకోరి కేల పటుదైత్యహరా మ...

26


ఉ.

నీదయ గాదు నాపయిని నేఁ డెవరిన్ కరుణించమందునో
యాదవవంశపావనుఁడ యాదర మించుక పుట్టదాయె నీ
పాదసరోరుహంబులును భావములోపల వేఁడువారికిన్
నీదగు సన్ని ధిచ్చితివి నే నెరుసా మ...

27


చ.

సనకసనందనాదిమునిసంఘమె చాలు నటంచు నామొఱ
ల్గినమును వీనుల న్వినియు దీక్షవహించియుఁ బ్రోవకుంటివో
నను నటుగాక చాలగను నాపద బెట్టదలంచినాడవో
మనమున కుందుబుట్టె నిక మాన్పగదే మ...

28


చ.

పరులను వేఁడనంటి నినుఁ బ్రార్థనఁ జేయుచునుంటి నిత్యమున్
దరగని పాదసేవయును దాసున కిమ్మనుమంటి శ్రీహరీ

పరమపదం బొసంగుటకుఁ బాత్రుఁడ నైతినొ లేదొ దెల్పవే
పరమదయాంతరంగ బహుపాపహరా మ...

29


చ.

పటుతరమైన మాయలకు పన్నగభూషనుతప్రతాప నే
నెటువలె నోర్చువాఁడ జగదీశ్వర నన్నును గావకున్న యా
చటులతరమ్ము నన్నుడుకు చిమ్ముచునుండెడి పాపవారిధిన్
యెటు దరిజేరువాఁడ నిఁక నేలగదే మ...

30


ఉ.

ప్రోచిన నీవు నన్ను విడఁజూచిన నీకృపఁ గోరియుండితిన్
భూచరఖేచరాళికిని బోషకకర్తవు నీవె రామ చైఁ
జూచి కృపాకరుండవని సంతస మంద భయంబు గోరితే
యోచనబుట్ట దిచ్చుటకు యోగినుతా మ...

31


చ.

శరణని మిమ్ము వేఁడఁగను శత్రునితమ్ముఁడటంచు నీమదిన్
నిరసన బుట్టకుండఁగను నెమ్మదిగా దయ నేలినావు నే
నిరతము నిన్నుఁ గోరి కరుణించుమటంచు భజించి వేఁడఁగా
కరఁగదు నీమనం బెటులు కంసహరా మ...

32


ఉ.

భావజశత్రుమిత్ర భవబంధవిమోచనశస్త్రదీపికా
పావననీలగాత్ర నవపద్మదళాయతనేత్ర శ్రీకరా
బావనమాలసూత్ర ఘనపంకజధామ రమాకళత్ర నా

భావమునందు కల్మషము బాపఁగదే మ...

33


ఉ.

రంగదరాతి భీషమణిరాజవిరాజితభూష గోపికా
సంగసమగ్రవేష ననయంబున దాసజనాళిపోష ని
ర్భంగతరంగసంఘములపాపపయోనిశోషకామ దు
స్సంగతిఁ బొందకుండఁగను జేయగదే మ...

34


ఉ.

దానవసంహరాయ రణదర్పితశూరహరాయ సేవకా
ధీనదయారసాయ జగదేకవిరాట్పురుషాయ శ్రీరమా
మానసపద్మభృంగ యతిభాసితమంగళవిగ్రహాయ నా
మో నమయంచు మ్రొక్కిడుదుఁ బ్రోవగదే మ...

35


ఉ.

దీనజనాళిఁ బ్రోచుటకు ది క్కెవ రింకను సామి యీవిధిన్
దీనతఁ బెట్ట నేల భవదీయకటాక్షము రాద నాపయిన్
కానిర నిన్ను నమ్మగను కష్టము బెట్టఁదలంచినావుగా
కానక చేసితి న్నఘము గావగదే మ...

36


ఉ.

ఎన్నగరాని యాయమునిహింసకు లోఁబడకుండ మున్నె వో
పన్నగశాయి కాయమున బల్మియు దప్పక మున్నెవో మహా
పన్నశరణ్య కాలభటబాధలు జెందకమున్నె రామ మీ

.

సన్నుతపాదపద్మములచాటున నుంచుము ప్రేమతోడ నా
విన్నప మాలకించు యతివేగముగా మ...

37


ఉ.

రామ యనేకరాక్షసవిరామ సదాసుగుణాలలామ నీ
నామసుధారసంబు మరి నాకును దృప్తిని బొందనియ్యవే
సామజరాజరక్షకుఁడ సంతతము న్భజియించి నమ్మితిన్
కామవికారము ల్లణచి కావగదే మ...

38


ఉ.

చేసితి దుష్టకృత్యములు జీర్ణవయస్కుల జూచి నవ్వితిన్
రోసితి సజ్జనుల్పయిని రోసము జేసితి రామ రామ నేఁ
జేసిన నేరము ద్దలఁచి చిక్కులు బెట్టకు దాసకామ నీ
దాసులలోన నే నొకఁడ దాసునిగా మ...

39


ఉ.

పాపములన్ని నీవు యెడఁబాపెడిసామి వటంచు నమ్మితిన్
యాపదఁ బాపవే పరమయార్తశరణ్య కృపాకరుండవై
జూపుము నీదురూప మిటు సూరిజనస్తుత నీవె దిక్కు ను
ద్దీపితశత్రుమూర్ధ్నిచరదివ్యశరా మ...

40


చ.

మనవి పరాకుగా వినకు భాసురతేజ మదీయదోషము
ల్దునిమి నిరంతరంబు కృపతోఁ బరిపాలనఁ జేయుమయ్య మీ
తనయునిమీఁద యింత దయదప్పిన వేరె ని కేమ నందు నీ
మనమున కిట్లు దోఁచినద మంచిదటే మ...

41

ఉ.

నీసరి దైవము ల్గలరె నిశ్చయమౌ ధర మానవాళిలో
నాసరి పాతకు ల్గలరె నమ్మినదైవము నీవె పాపము
ల్వీసము జెందకుండ నను వేంకటనాయక జేయుమయ్య యా
బాసును జేయకయ్య భవబంధహరా మ...

42


చ.

అతికఠినుండ వీవు బహునాపద బొందినవాఁడ నేను నీ
మతముకు జాలిబుట్ట దెటు మంచిది బంగరురంగశాయి నా
పతితము మాన్ప వేరొకరు భారకు లెవ్వరు నీవుదప్ప న
న్నితరులు లేరు గాచుటకు నేలగదే మ...

43


చ.

దినము దినంబునందు యతిదీనుఁడనై బ్రతిమాలుచుండఁగాఁ
గనికర మెంత లేదొ కడకంటినినైననుఁ జూడవైతి వే
మనఁగల దీర్ఘకోప మిఁక మాని ననున్ గృపఁ జూడుమయ్య మీ
తనయుఁడగాన నేను ఘనదైత్యహరా మ...

44


చ.

సలలిత నీదునామజపసంగ తెఱుంగ గిరీశ గాను స
ద్విలసితపాదపద్మభవదించుకరేణుమహత్ప్రభావమున్
దెలియ నహల్య గాను జగతీవర నీమృదుసత్యభాషలన్
దలఁపఁగ రావణానుజుని తమ్ముని గాను భవద్విలాసముల్
దెలిపి స్తుతింప నాతరమె దేవనుతా మ...

45

ఉ.

నీదగురాక గోరి ధరణీతలమందున స్వాతివానకున్
మోదముతోడ శుక్తివలె భూమిజనాయక నున్నవాఁడ నా
మీఁదను నీకు నింతచల మెందుకు నిన్నును నమ్మియుంటి రా
రా దరిఁ జేర్చి యేలగదరా కృపచే మ...

46


ఉ.

ఫుల్లసరోజనేత్ర ఘనపుణ్యచరిత్ర విభూతిరాజితా
వల్లవరాజపుత్ర శశివంశజునర్జునమిత్ర గోపికా
యుల్లసరోజమిత్ర ఘనయోగిజనస్తుతిపాత్ర రామ నా
యుల్లములోపల న్నిలుము యోగినుతా మ...

47


చ.

దురితభరంబు దోలి మరితుచ్ఛమతంబు వధింపజాలి ని
బ్బరపుసుబుద్ధి నేలి పటుభానుజదూతలఁ బారదోలి శ్రీ
ధర తవపాదపద్మసుధధారలు గ్రోలి భజించువాఁడె రా
తరగనిపుణ్యశాలి ఘనదైత్యహరా మ...

48


ఉ.

భావజకోటిరూప భవబంధవిదారణరూప పాండురా
జీవయశఃకలాప పరచిత్తభయంకరచాప యో మహా
దేవనుతప్రతాప జగదేకవిరాజితభూప రాగదే
కావగదే ననుం గృపను కంసహరా మ...

49


చ.

వలదు చలంబు నాయెడను వారిజనేత్ర దయాసముద్ర న

న్నలసటఁ బెట్ట నీకు మరి నాయము గాదని యెంత వేఁడినన్
పలుకవు యింక నే నెవరిపోలికిఁ జేరుదునయ్య యయ్య నీ
తలఁపునఁ జాలి బుట్ట దెటు దైత్యహరా మ...

50


ఉ.

నీపదభక్తి సల్పుచు ననేకములైన దురంతకార్యముల్
పాపమనంబుచేత పరభామలకౌఁగిటఁ జిక్కి చేసితిన్
పాపు డటంచు నన్ను యెడఁబాయకు సామి తరింపఁజేయవే
తాపము నొందఁజాల పటుదైత్యహరా మ...

51


ఉ.

నీదరిఁ జేరినాఁడ బహునేరము లెన్నక నాదరంబుచే
నాదుభయంబు దీర్చి శరణాగతచిహ్నను బొందవయ్య రా
మా దయ యేల రాదు పరమాప్తుఁడవంచును కోరియుండితే
ఖేదము బెట్టుచుండితివి క్రూరహరా మ...

52


ఉ.

కోరినకోర్కె లిచ్చెదని కుంభినిలోపల యార్యులందఱున్
భూరిగఁ జెప్పుచుండఁగను బొందుగ వింటి నిజంబునైతె సం
సారభయంబు వాపి ధరఁ జారుతరంబగు మోక్షమార్గమున్
నేరము లెన్నొ యున్న నిఁక నియ్యగదే మ...

53


ఉ.

ఎన్నటికైన నిన్ను మదియందున సంతసపాటుతోడ నా
కన్నులనిండఁ జూచుటకుఁ గల్గునొ గల్గదొ దెల్పవయ్య యా

పన్నతఁ జెందునయ్య భవబంధముచేతను బ్రోవవయ్య రా
వన్న పరా కదేల వినుమా మొఱలన్ మ...

54


చ.

దురితపయోధిలో మునిఁగి దోరకమున్నె జరాదిరోగముల్
బిరబిర వచ్చి యీతనువు బింకము నొంచకమున్నె కుత్తుకన్
గురగురలాడుచున్ కఫముఁ గూడకమున్నె భజించ దోషముల్
శరమునఁ గూల్పవయ్య పటుచక్రధరా మ...

55


ఉ.

ధీరత నిన్ను వేఁడుటకు దివ్యచరిత్ర ధ్రువుండఁ గాను దై
త్యారిజనార్దనా! పరమదైవమయంచు నుతింపసాగ న
క్రూరునిఁ గాను పామరుఁడ కృష్ణ భవద్విను తేనుఁ జేయఁగా
నేరనుఁ జాలమేల కరుణించఁగదే మ...

56


ఉ.

చేసినదుష్కృతిన్ దునిమి చింతను బా పిటుఁ గారవంబుచే
దాసజనాళిలోఁ గలపి ధన్యత నొందఁగఁ జేయుమయ్య యో
భాసురచక్రధారి పరభాసురశౌర్యహతస్వరూప నా
దోసము కొట్టివేయుటకుఁ దోఁచదుగా మ...

57


చ.

పరమకృపానిధే విమలపంకజనేత్ర హరే యటంచు ని
బ్బరమతులై నిను న్భజన పాయకఁ జేసినవారిపుణ్యముల్

తరమె వచింప శేషునకు ధాతకునైనను నీదునామముల్
మఱవనివాఁడె పుణ్యుఁ డగు మాన్యుఁడునౌ మ...

58


ఉ.

కానుక లివ్వఁజాల కతికంధిగిరీశ ... లట్లనీ
మానితపాదపద్మములు భావమునందు భజింపఁజాల నా
దీనతఁ బాపవేల జగతీధవ చాలఁగ నమ్మియుండితిన్
దానవసంహరా దురితదైత్యహరా మ...

59


ఉ.

దండధరుండుఁ బెట్టు పటుదండన కేను భయంబుఁ జెంది నీ
యండను జేరియుంటి నభయంబు ఘనంబుగ నివ్వ వేమి కో
దండకళాప్రవీణ భవదండను జేరిన దాసకోటికిన్
దండిగ మోక్ష మిచ్చితివి దైత్యహరా మ...

60


చ.

మును నిను వేఁడువారిని నమోఘముగా దయఁజూచినావు న
న్నును నటుఁ జూడ వేమి శర ణో రఘురామ యటంచు వేఁడుచున్
దినములు దుర్భరంబుగను దీనదయాపర త్రోయుచుందు నీ
వినవు యదేమి నామనవి వేదనుతా మ...

61


ఉ.

తల్లివి దండ్రివంచు మరి దాత గురుండవటంచు యేను శ్రీ
సల్లలితంబులైన పదసారసముల్ మది నమ్మియుండితే
నల్లనిమేనువాఁడ కరుణారస మెందుకు బుట్టునయ్య నీ
యుల్లమునిండ కల్మషమె యోగినుతా మ...

62

చ.

మిము నిటు వేఁడుచుండఁగను మెల్లఁగఁ బ్రాణము లెఫ్డు వోవునో
కమలదళాక్ష వాని నిఁక కాలభటుల్ గొనిపోవకుండఁగా
శమనుని కాజ్ఞ సేయుము విశాలబలు దరి కావలుంచవే
మమ యిసువంటకుండ భవబంధహరా మ...

63


ఉ.

రమ్ము విహంగవాహన నిరంతరవైరము నీకు నాకు వీ
సమ్మును లేదు నుండినను జక్కనిరామ క్షమించి నన్ను మీ
సమ్ముఖమందునున్న మునిసంఘములోపల నుంచివేయ దో
సమ్ములు ద్రుంపవే దురితసారహరా మ...

64


ఉ.

బాములు నెత్తఁజాల ననుభావము లోపల నుంచవేల నా
సామివి నీవు చక్కగను శాంతముచేతను రా వదేల ని
ష్కామునిఁ జేయవేల భవసాగరవీచుల నీఁదఁజాల నీ
ధామమునందు దాఁచఁగదె దైత్యహరా మ...

65


ఉ.

గోపమ నాపయిన్ మదిని గూరిమిఁ బుట్టదు గావరావు నా
పాపము యేమొగాని యొకమా రిటుఁ జూడకనుంటివేమి యో
తాపసబృందయీరిత సదా కఠినంబు వహించియుండితే
నాపద లెట్లు బాతు విను నందసుతా మ...

66


ఉ.

ఎంతటివాఁడవయ్య విను మెన్నటికిన్ నిను నమ్మరాదు నీ

 చెంతనుఁ జేరియుండినను చిక్కులు బెట్టఁదలంచితౌర నే
నింతకు నేమి జేసితిని నీవు యెఱుంగని ఘోరకృత్యముల్
పంతము మాను నాపయిని పాపహరా మ...

67


చ.

నిను మరి నమ్మరాదనుచు నేరము లెన్నుచు బల్కినాఁడ నీ
మనమున ముద్దువాక్యముగ భావనఁ జేయుము రోషగించకే
నను గృపఁజూడు దాసుఁడ ననాదరణీయుఁడనైతి బ్రోవరా
తనువునిఁకేల నిత్య మిది దైత్యహరా మ...

68


ఉ.

పొండని కాంక్షల న్విడిచి పూజలొనర్చినవారిదోషముల్
కొండలవంటివైన ధరఁ గూలి హరించక యున్నె నిత్య మా
ఖండలసంపదల్ భువిని గల్గకయుండునె ముక్తికాంత కై
దండను నివ్వకున్నె తుది దైత్యహరా మ...

69


చ.

దశరథరాజగర్భమున ధారుణియందునఁ బుట్టి యేపునన్
మశకములట్ల దానవుల మారణఁ జేసి సురాలికిన్ సదా
గుశలము నొందఁజేసి జనకోటికి సంతస మబ్బునట్లుగా
దశదిశ లెల్ల నేలితివి దైత్యహరా మ...

70


ఉ.

ఏటికి రామ యీవరుస హింసను బెట్టెదు వోర్వజాల నీ
పాటికినైన నన్ను దమపాలికిఁ బిల్వుము రంగశాయి నా

కాటలఁ బ్రోచినట్లు ననుఁ గావఁగరాద చలం బదేలరా
తాటకసంహరా దురితదైత్యహరా మ...

71


ఉ.

శ్రీయుతమోములో పరమసేవకసాధుజనాళితో లస
చ్ఛాయల నీను హారసముదాయముతో నతిశాంతమూర్తివై
రా యభయంబు నియ్యగదవే యపరాధినిఁ గావవే జగ
ద్గేయ గుణాలవాల ఘనకీర్తిధరా మ...

72


చ.

పరభయచక్రధారి భవబంధవిమోచనకారి యేలరా
కరగదు నీమనంబు కనకాంబరధారి యిఁ కేమి జేతు యే
తెఱఁగున నాపదల్ గడతు దీనత బెట్టుట మంచియేకదా
వరమునియోగివంద్య బహువ్యాధిహరా మ...

73


ఉ.

స్నేహితుఁడైన యావరకుచేలునకున్ ధనసంపదల్ బహూ
త్సాహముతో నొసంగి మరి దాసునిఁగాఁ గృపఁజూచినావు వై
దేహివిభుండ యాకరణి దివ్యముగాఁ గరుణించకున్న యో
శ్రీహరి యెందుఁబోదు నిఁక చింతిలుచున్ మ...

74


చ.

కరుణ యొకింత రాదొ నను గాచుటకున్ మరి వేళగాదొ నా
మొఱ విన నీకు నాదరముఁ బుట్టకయున్నదొ యట్లుగాక నన్

గరుణను జూడకుండుటకుఁ గారణ మేమి దయాసముద్ర నీ
దరిసెన మెవ్విధి న్నగును దైత్యహరా మ...

75


ఉ.

ఘోరము లైనబాపములఁ గూల్పఁగఁజాలిన మేటివయ్యు సం
సారుల కెల్ల నీవు సిరిసంపద లిచ్చెడివాఁడవయ్యు నిన్
భూరిగ గొల్చుభక్తులకు మోక్షము నిచ్చెడివాఁడవయ్యు న
న్వేఱుగఁ జేసి తేమనుదు వేధనుతా మ...

76


చ.

పలుకవదేల యో పతితపావన రామ యటంచుఁ బిల్వఁగా
నలిగినయట్లు నుంటి విఁక నాదర మెప్పుడుఁ బుట్టునయ్య నీ
తలఁపున శంకమాని భవదంఘ్రులుఁ జూపుము నమ్మియుంటి స
త్ఫలమునుఁ బొందఁజేయఁగదె పాపహరా మ...

77


ఉ.

ఇప్పుడు బ్రోవకున్న మరియెప్పుడు బ్రోతువు రంగశాయి మా
యప్పవు నీవు చాలఁగను యాదర ముంచి ఘనంబు లైన నా
తప్పులు గావు మీయెడను దైన్యముఁ బెట్టఁగరాదు దీనుఁడన్
దప్పకఁ జేతు మీభజన దాసుఁడనై మ...

78


ఉ.

బంటను దాసపోషబిరుదాంకిత రామ పురారిమిత్ర నా
జంటను బాయకుండఁగను చక్కఁగ రమ్మని వేడుకొంటి నీ
వింటివొ లేదొ నాదు మొఱ వీనులసోక పరాకదేల నా
దంటకు రావదేల ఘనదైత్యహరా మ...

79

ఉ.

ఎంతని వేఁడుకొందు జగదీశ్వర నాపయిఁ బ్రేమ నీకుఁ గా
సింతయునైన లేక మరి చిక్కులు బెట్టఁగరాదు నామొ ఱా
లింతువటంచు నమ్మితి నిలింపులగుంపుల నేలు మేటి క
త్యంతము భారమా నను దయామతిఁ బ్రోచుట గానరాదు మున్
దంతినిఁ గావవే కృపను దైత్యహరా మ...

80


ఉ.

పాపపుబుద్ధిచేత బహుపాపము లార్జనజేయుచున్ దురా
లాపము లాడుచుండెనని రాఘవరామ తలంపకయ్య నీ
దాపునఁ జేరియుంటి నను దాసునిగాఁ గృపఁజూచి నేరముల్
కోపము లేక బాపగదె కూరిమితో మ...

81


చ.

కరివరదా రమారమణ కారుణికోత్తమ భక్తపాల నీ
మఱుఁగునఁ జొచ్చియుంటి నను బంటుగ నేలుము శాశ్వతంబుగా
పరమపదంబునందు యతిభాతిగ నన్నును పంగఁగోరితిన్
సరగున నీవె యావరము శాంతముచే మ...

82


ఉ.

ఏమిర రామచంద్ర నను నేలినవాఁడవటంచు వేడితే
కామితదాసుకోరికెను గైకొనకుంటివి యించుకైన నే
నేమియుఁ జేయువాఁడ నిను నిష్ఠురవాక్యము లాడఁజాల రా
మా మనసందు వాద మిఁక మాన్పవుగా మ...

83

ఉ.

శ్రీవర మీపదాబ్జములు సేవయొనర్చుచు నమ్మియుంటి నా
భావములోన యోపరమపావననామ పురారిమిత్ర న
న్గావఁగ రాకయుండి చిరకాలముఁ జిక్కులఁ బెట్టుచుండితే
నావశమౌనె యోర్చుటకు నాయమటే మ...

84


చ.

చిలుకను నొక్కవారసతి చేరికఁ బెంచియు దాని మాటికిన్
బిలచిన రామ రామ యని భేదము సేయక నీవు నంత నా
లలనకు మోక్షమిచ్చిన పురాణకథల్ నిజమైతె రామ నేఁ
దలఁచఁగ రావదేమి ఘనదైత్యహరా మ...

85


ఉ.

నాయము గాదు యింతకఠినము వహించుట రంగశా్యి నేఁ
బాయని మోహజాలములు బంధముచేతను జిక్కి బిల్చితే
నోయని బల్కరాద శరణొందిన దాసులఁ గావ మేరగా
దా యదువంశపావన రథాంగధరా మ...

86


ఉ.

పాతకిఁ గాచుటే పతితపావనరామ ధరిత్రిలోన ప్ర
ఖ్యాతినిఁ బొందు సామికని గానకఁ జేసిన దోషసంఘముల్
యాతన బెట్టకుండఁగ దయారసమున్ మదినుంచి బాపవే
పూతకిసంహరా దురితపుంజహరా మ...

87


ఉ.

మానవకోటిలో దురితమానవుఁడంచుఁ దలంచి నీమదిన్

హీనతఁ జేయుచుండితివి యింతియెగాని దయాపరుండవై
బూనిన దోషముల్ దునిమి మోదమునియ్యవు యింతపంతమా
దీనుఁడ నీదయాంబుధిని దేల్చఁగదే మ...

88


ఉ.

నాసరియైన పాతకుల నార్తుల నందఱిఁ గాచితో జగ
ద్భాసిని గాను మిమ్ములను దానవసూతి తలంచినంతనే
భాసురరూపుతో వెడలి భక్తునిఁ గాచియు నేఁడు నన్ను నా
యాసముఁ బెట్టుటేల దురితాళిహరా మ...

89


ఉ.

నేనొనరించుపాపము లనేకము గుంపులుగూడియుండె రా
మానుజ వాని నెవ్వరును బాపెడివా రెటు లేరుగాన రా
వే నఘసంఘముల్ దునుమ వేల్పవు నీవె పరాక దేల లే
వే ననుఁ గావరమ్ము యతివేగముగా మ...

90


ఉ.

మేలుగ దాసకోటికి నమేయఫలంబులు నివ్వఁజాలి నా
పాలికి రాక నీవు పరిపాలన చేయక రామనామ మే
మూలను దాచుకోగలవె ముక్తిప్రదాయక నాకుఁ దెల్పవే
చాలగఁ జిక్కుల న్నిడకఁ జక్రధరా మ...

91


ఉ.

ఏ నిఁక యెంత వేడినను యేమనవైతివి రామచంద్ర యీ
దీనతఁ బాపి చక్కఁగను దిక్కయి ప్రేమను గావకుండినన్

దీనులఁ గావ నీవె మరి ది క్కనుమాట లబద్ధమౌనుగా
గాన చలంబు మాని ననుఁ గావఁగదే మ...

92


ఉ.

రామ యనేకనామ బహురాక్షసగర్వవిరామ యోపరం
ధామ గుణాభిరామ నృపతారకసోమ వినీలనీరద
శ్యామ శమాభిరామ భవసాగరమగ్నత నొందకుండఁగా
క్షేమముగాను నన్ను దరిఁ జేర్చగదే మ...

93


చ.

జలచరరూపమై వడిగ సాగరమున్ జొరబారి నుగ్రతన్
దలములుచేత యానిగమతస్కరవీరునిఁ జీరివైచి రం
జిలుచును నాల్గువేదములుఁ జేకొని చిక్కులు వాపి ధాతకున్
దెలిపి యొసంగి తీవేకద దేవనుతా మ...

94


చ.

ఘనమగు మంథరాచలము కవ్వముగా ఫణిరాజు రజ్జుగా
నొనరిఁచి దేవదైత్యులు పయోనిధిఁ బూని మధింపుచున్నచో
చని యడుగంట కూర్మమయి శైలము దాల్చినవాఁడ వీవెకా
కనకవిశాలచేలధర కంసహరా మ...

95


చ.

ధరఁ గని చాపఁజుట్టినవిధంబునఁ జుట్టియుఁ గొంచుఁబోయి సా
గరమున డాగియున్న కనకాక్షుని ద్రుంచి వరాహమూర్తివై

ధరణిని తొల్లిచందముగ దక్షిణకొమ్మున యెత్తి గ్రక్కునన్
విరివిగఁ జేసి తీవెగద వేధనుతా మ...

96


చ.

 కనుగొన దేవబృందముల కద్భుతమైన నృసింహమూర్తిచే
దనుజులప్రాణము ల్జెదర స్తంభమునం దుదయించి వక్ష మే
పున విదళించి హేమకశిపు న్విదళించి వడిన్ సురారినం
దను గృపఁ జూచి తీవెగద దైత్యహరా మ...

97


చ.

పదయుగళంబు భూగగనభాగమునం దిడి శౌర్యధైర్యసం
పదుఁడగు నబ్బలీంద్రు నొకపాదముచే తలఁ గ్రుంగఁద్రొక్కి పెం
పొదవఁ ద్రిలోకముల్ నముచిసూదను కియ్య వటుండవైన యో
సదమలమూర్తి వీవెగద చక్రధరా మ...

98


చ.

ధరఁగల క్షత్రజాలములఁ దారుణవీరపరాక్రమంబుచే
యిరువదియొక్కమారు పృథివీస్థలిఁ గూల్చియు వారిరక్తముల్
త్వరితముగాను పైతృలకు తర్పణమీడియు భూసురాళికిన్
ధరను నొసంగి తీవెగద దైత్యహరా మ...

99


ఉ.

ఆలమునందు తాటకిని యంతము నొందఁగనేసి యాగమున్
పాలనఁ జేసి గౌతమునిపత్నికి శాపము మాన్పి రామ సీ

తాలలన న్వరించి యతిదర్పితు రావణకుంభకర్ణము
ఖ్యాళి వధించి తీవెగద ఖ్యాతిగ నో మ...

100


ఉ.

నందునియింట కృష్ణహలినామముతోడుత వృద్ధిబొంది గో
మందలఁ గాచుచుండి వృషభాసురుఁ డాదిగ క్రూరదైత్యులన్
మందునిభ్రాతృవీటికి నమందముగా వసియింపఁజేసి గో
విందుఁడ వైతి వీవెగద వేధనుతా మ...

101


చ.

ఇలఁగలమానవాళికి నచింత్యవిరాట్పురుషస్వరూపమున్
సులభముగాను నెల్లపుడుఁ జూపదలంచి దయాలవాల శ్రీ
లలితపుబుద్ధమూర్తి వయి లక్షణధామసుభద్రఁ గూడి భూ
నిలయుఁడవైన సామి కరుణించఁగదే మ...

102


చ.

కలియుగమందు సంకరనికాయజనంబును జూచి పాపసం
కుల మెడలించ రౌద్రముగ ఘోటక మెక్కి కరాసిఁ బూని దు
ష్టులఁ బరిమార్చి వేగమున తొల్లియుగంబు లధర్మపద్ధతిన్
నిలిపిన కల్కి వీవెగద నేరుపుగా మ...

103

ఉ.

ఏలినవాఁడ నీపయిని యేను బొనర్చిన వృత్తజాలముల్
మాలికగాను గైకొని యబద్ధములున్న క్షమింపవయ్య గో
పాలకృపాలవాల భవబంధవిమోచన నిన్ను నెప్పుడున్
జాల భజింపుచుందు పటుచక్రధరా మహిజామనోహరా.

104


మహిజామనోహరశతకము
సంపూర్ణము.