భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/శ్రీవసుదేవనందనశతకము

వికీసోర్స్ నుండి

పీఠిక

ఈశతకము రచించిన కవి వెల్లాల రంగయ్య. సుబ్బమ, ఆదినారులకుమారుఁడు. కవివిద్యాగురువు మన్నవ లక్ష్మణార్యుఁడు. కవి యేకులమువాఁడొ నివాస మెటనో యేకాలమున నుండెనో యెఱుంగనగు నాధారములు శతకమున లేదు. దాశరథిశతకములోనిపద్యముల కనుకరణపద్యము లుంటచేఁ గవి యాధునికుడని యూహింప నవకాశము కలుగుచున్నది.

ఈవసుదేవనందనశతకము 108 పద్యములతో నలరారుచున్నది. ప్రతిపద్యమునందున శ్రీకృష్ణుని యమానుషచర్యలు మనోహరముగా వర్ణింపఁబడినవి. కృష్ణునిశృంగారచేష్టల కీకవి తనశతకమున నెడమీయక కేవల మహిమానువర్ణనమె గావించుటచే నీళతకము కృష్ణభక్తులకు సర్వదా పఠనయోగ్యముగా నుండుననుట సత్యము. ఈకవినామము శతకకవుల చరిత్రమునందుఁ గూడఁ గానరాదు.

కవియందు వ్యాకరణదోషములు లేవనియె చెప్పవచ్చును. ధార నిరర్గళముగ మనోహరముగ నున్నది. అంత్యప్రాసపద్యములు సమాసజటిలపద్యములు చదువఁజదువఁ జవులూరుచుఁ జెవి కింపుగ నున్నవి. కృష్ణునిశృంగారలీలలు వర్ణించుచునో గోపికాలోలత్వమునకుఁ బ్రాముఖ్యమిచ్చి యే చెలి యనో యభిసారికగాఁ జేసి పిలువమనుటతోడనో ముగింపఁబడినశతకములు గలవు గాని తెలుఁగులోఁ గృష్ణుని దివ్యమహిమానువర్ణనప్రాధాన్యశతకములు లేవనులోపము నీశతకము తీర్చుచున్నది కావుననే యీశతకము భక్తజనములకుఁ బఠనీయముగ నున్నదని నుడివితిమి.

భాగవతాదిగ్రంథములలోని కథాంశములు శ్రీకృష్ణుని యమానుషకృత్యములు పద్యములం దభివర్ణించెనే గాని కవి తనకవితావిభమును భావసమృద్ధినిఁ జూపుటకు ప్రయత్నింపలేదు. మొదటిపద్యములలో జక్కనిసమాసభూయిష్టములగు నంత్యనియమములు గలవు. కవిత మృదుమధురముగా నున్నది. చాలవఱకుఁ బద్యములలోనియంశములు పురాణకథలె గావుర శతకమున ననుకరణము లంతగా లేవని చెప్పవచ్చును. శ్రీరామప్రాముఖ్యము గల దాశరథిశతకమువలె నిది కృష్ణప్రాముఖ్యమగు భక్తిరసశతకము. కవి యెంతమెలకువగఁ బూర్తిచేసినను భక్తిరసోద్దీపమున నీశతకము దాశరథిశతకమునకుఁ దీసిపోయినను దక్కుగల శ్రీకృష్ణభక్తిశతకములకుఁ దీసిపోదని మాతలంపు.

నందిగామ.

శేషాద్రిరమణకవులు,

1-6-26.

శతావధానులు.

శ్రీరస్తు

శ్రీవసుదేవనందనశతకము

ఉ.

శ్రీకలితోరువక్ష సరసీజదళాక్ష సమస్తలోకర
క్షాకరణైకదీక్ష యళికక్షఋభుక్షవిపక్షశిక్ష గో
పీకమనీయమందిరనవీనపయోదధిచౌర్యదక్ష ల
క్ష్మీకరసత్కటాక్షనతశీలవసూ వసుదేవవందనా.

1


ఉ.

రంగదరిప్రభంగ ఖగరాజవిరాజతురంగ భక్తహృ
త్సంగ భవాంధకారసముదగ్రపతంగ సురారిపద్మమా
తంగ విదర్భజాహృదయతామరసభ్రమమాణభృంగ స
ర్వంగ కరీంద్రతాపపరిభంగ హరీ వ...

2


ఉ.

శ్రీకరుణానిధాన విధిసృష్టినిదాన ఫణోపధాన స
ల్లోకసుఖప్రదాన మునిలోకతపఃప్రణిధాన భక్తర
క్షాకరణైకతాన గతకామవితాన ఘనోజ్జ్వలత్తటి
త్ప్రాకటదివ్యపీతపరిధాన హరీ వ...

3


ఉ.

యాదవవంశభూషణ నిజాశ్రితభక్తజనానురాగ ప్ర
హ్లాదవిభీషణాదికమహాజనరంజన వైరిభంజనా
శ్రీద సమస్తసద్గుణసుశీల యశఃప్రతిపాదసజ్జనా
హ్లాదకరాంతరంగ దనుజారినుతా వ...

4

ఉ.

నారద శారదాధిపసనందనవందితదాసభూతబృం
దాక తారకామవదనా మృదువాదన తత్వబోధనా
నారదశారదాబ్జరుగనాదరణాంగ విలోకయాగకృ
ద్ధారకతారకా ఖగరథాసుకథా వ...

5


ఉ.

రాజ ధరాదిసర్వసురరాజనుతాక్షరమంత్రరాజ గో
రాజవిజేత రూపకపరాజితభవ్యమనోజతేజ భూ
రాజశిరఃప్రకీర్ణమణిరాజితపాదసరోజ శౌర్యరా
రాజ దరాత్యజేయ యుడురాజముఖా వ...

6


ఉ.

రాజనిభాననా విహగరాజతురంగ దయాంతరంగ గో
రాజ నిశేశమౌళిసురరాజసరోరుహమిత్రభీష్మరా
డ్రాజనుతా హరీ యసురరాజభయంకర భక్తశంకరా
రాజసహోదరీహృదయరంజన శ్రీవ...

7


ఉ.

శ్రీకమలాసనాదిసురసేవితపాదసరోజ దివ్యవా
సా కమలాధిరాజకలుషామయభేషజ యండజధ్వజా
శ్రీకమలాభహస్త నుతిసేయుదు నెప్డు నధోక్షజా హరీ
నాకమలామృతం బొసఁగ నారతమున్ వ...

8


ఉ.

శ్రీధరభూమి వేంకటగిరి న్మదిరంజిలఁ బ్రాఁతకోటనా
రాధితుఁ డౌచు శ్రీవరదరాజని పేరువహించియున్న నా

నాథుఁడ వంచు నెంచితి ననాథునిఁ బ్రోవు శమాదిపుష్పసా
రాధనఁ జేసెదన్ వరదరాజ హరీ వ...

9


ఉ.

నాకుజబోదరాయణుల నన్నయ భీమన కాళిదాసులన్
బ్రాకటభక్తి మ్రొక్కి శివభక్తునిఁ దిక్కనఁ బోతనార్యులన్
శ్రీకరవందనంబులను జిత్తమునం దలపోసి భక్తి న
స్తోకత నిన్ను గొల్చెదను సూరినుతా వ...

10


ఉ.

సారసనేత్ర నీవిమలచారుచరిత్రము సేయఁబూని బ
ల్సారము గల్గు పద్యశతసంఖ్యను మీకు సమర్పణంబుగా
సారెకు నీదురూపగుణసన్నుతి జేసెదఁ జిత్తమందు సం
సారముఁ బాపవే దయను సారమతీ వ...

11


ఉ.

ఆదిని సోమకుండు చతురాననవేదచయంబుఁ దెచ్చి యు
న్మాదత నంబుధిం జొరఁగ మాధవ వాని ఝషంబవై సురా
హ్లాద వధించి వేదనిచయంబును బ్రహ్మకు నిచ్చినట్టి యో
వేదగవేషణా మనుపవే శఠు నన్ వ...

12


ఉ.

సౌధభవార్థమై సురనిశాటులు కంధిని మందరాద్రిచే
సాధనఁ జేయ నబ్ధి నది జారిన యోశరణార్థి కావవే
నాథ యనంగఁ గూర్మమయి నాడెముగా గిరి మోచి కాచి శ్రీ
నాథుఁడ వైతి గాదె బుధవంద్య హరీ వ...

13

ఉ.

భూమినిఁ జంకఁ బెట్టుకొనిపోయిన దైత్యుని హేమనేత్రునిన్
భీమముతోడఁ జంపి పృథివీస్థలిఁ గొమ్మున నెత్తినట్టి యో
తామరసాక్ష యాదికిటి తాపసవందిత యోమురాంతకా
కామునిఁ గన్నతండ్రి ననుఁ గావు దయన్ వ...

14


ఉ.

మాధవ భీకరోగ్రపటుమాఢితయుక్త నృసింహరూప స్వ
ర్ణోదరుఁ జంపి నైజచరితోక్తులఁ బానము సేయునట్టి ప్ర
హ్లాదునిఁ గాచినట్లు శరణార్థినిఁ గావఁగదే మహాత్మ నీ
పాదము లెప్పుడున్ దలఁతు బ్రహ్మనుతా వ...

15


ఉ.

ఇంద్రుని రాజ్యలక్ష్మిఁ గొని యేఁగినదానవుఁ జేరి గుజ్జువై
మంద్రశుభోక్తులం ద్రిపదమండలిదానముఁ బొంది యంతవై
సాంద్రత నిండి యాబలి రసాతలికిం బడఁద్రొక్కి రాజ్య మా
యింద్రుని కిచ్చినట్టి జగదీశ హరీ వ...

16


ఉ.

ధారుణిలోన రాజుల నుదారత యిర్వదియొక్కసారి యెు
ప్పార వధించి రక్తమున మాన్యతఁ దండ్రికిఁ దర్పణంబుఁ బ
ల్మారు నొనర్చి విప్రులకు మానుగ నిచ్చితి ధారుణిన్ మహో
దారక రేణుకాతనయ దండమయా వ...

17


ఉ.

తాటకఁ గూల్చి శంకరునిధర్మముఁ ద్రుంచి ధరాసుతాకళా
పాటవ మొంది యింద్రజుని భండనమందు వధించి వానరు

ల్కోటులుగూడ రావణు సకూటముఁ జంపినరామ బ్రోవు నీ
చాటునఁ గింకరుండ నను శౌరి హరీ వ...

18


ఉ.

రాముఁ డనంగఁ బుట్టి ధర రాక్షసులం బడఁగొట్టి యాత్రతో
నైమిశముం జొరంగ మునినాథులు సూతుఁడు దక్క లేవఁగా
నేమము నాక మున్నతని నిం కెఱఁజానడువన్ బ్రబోధచేఁ
బ్రేమను జీవిఁ జేయవె హరీ ముసలీ వ...

19


ఉ.

దానవకోటులం దునిమి దానవవైరుల నాదరించి యీ
శానునకున్ సుతీవ్రతరసాయకమై మరి మూఁడులోకముల్
పూనికతోడ మోదమును బూర్ణముఁజేసిన బుద్ధమూర్తి యో
మానధనాఢ్య యేలు నను మన్ననతో వ...

20


ఉ.

అశ్వముఖుండవై జనులయజ్ఞతఁ బాపి మహావిభూతిమై
శశ్వదమోఘమై విబుధసౌఖ్యదమై శ్రితసేవ్యమై మహా
శాశ్వతమైనజ్ఞానమును స్థాపనఁ జేసిన కల్కిమూర్తి యో
విశ్వధరా ననున్ మనుపవే కృపణున్ వ...

21


ఉ.

యాదవవర్య మీన ఢులి యజ్ఞ వరాహ నృసింహ వైదుషీ
వేదనిరూఢవర్ణి భృగువీర నరాధిప రామ బుద్ధ సౌ

మోదవిశిష్ట కల్కిభవము ల్ధరియించిన బాలకృష్ణ నీ
పాదుకవాహుఁడన్ మనుపు భర్గనుతా వ...

22


ఉ.

సంగరమందుఁ బుణ్యజనసంఘము కోడి సుర ల్మహాత్ము ఖ
ట్వాంగునిఁ గూడి మోములను వానివిరోధులు బాఱఁబోరి యా
సంగడికాని కాయువును పార్థతఁ దెల్ప ముహూర్తమందు ని
స్సంగతముక్తికిం జనఁడె జ్ఞానమునన్ వ...

23


ఉ.

గోపకులంబునందు మదిఁ గోరిక దీరఁగ నుద్భవించి యా
గోపవరాంగనామణులకోరికఁ దీర్చినముద్దుకృష్ణ యో
గోపకులాబ్ధిచంద్ర నను గూర్మినిఁ జేరఁగదీసి యేలుమా
కాపరివంచు నమ్మితిని గావఁగదే వ...

24


ఉ.

ఆసురభామఁ బూతన జనాంతకగంసుఁడు వంప నం దస
ద్భాసురగేహమందుఁ దనపాలచనుం గుడిపింప దానినం
పాసువులన్నియుం గుడిచి యాసురి వేగమె జంపినట్టి యో
శ్రీసనకాదివందిత విరించినుతా వ...

25


ఉ.

మూఁడునెలల్ చనంగ మఱి మోదముచేతఁ దృణాచరాఖ్యునిం
గాడుపురూపునిన్ గగనగామినివై వధియించి యుయ్యెలం
గూడిన ప్రోడ నీమహిమగుంఫన మెన్న దరంబె యేరికిన్
నేఁడిదె దండమయ్య కరుణింపఁగదే వ...

26

ఉ.

పిన్నతనంబునందు మఱి వీథుల నాడుచునుండ నమ్మతో
మన్ను దినెన్ జనార్దనుఁడు మాధవుఁ డంచు వచింప నర్భకుల్
మన్ను నదేల తింటి విటు మాధవ యన్న చరాచరాండసం
పన్నజగంబుఁ జూపవె స్వవక్త్రమునన్ వ...

27


ఉ.

గోపులఁ గూడి కానలను గోవుల మేపుచునుండ బ్రహ్మ యా
గోపులగోవులన్ మఱుఁగఁ గూర్చిన తక్షణమందు నీవ యా
రూపము లెల్లఁ దాల్చి మును రూఢి నటింపఁగ నీపదాప్తికిన్
దాపుర మిచ్చి మ్రొక్కి చనె ధాత హరీ వ...

28


ఉ.

కొండికనాఁడు గోపకులఁ గూడి వనంబుల నాల మేపుచున్
గండనిఁ గాళియోరగుని గండఱఁగాండమునందు దూక నీ
దుండగ మవ్వకుం దెలిపి తోడ్కొనిరా ఫణిఁ ద్రోలి యంతఁ గ
న్బండువుగాఁ గనంబడవె భవ్యగుణా వ...

29


ఉ.

కాననమందు గోపకులు గంజదళేక్షణ కారుచిచ్చుచేఁ
బ్రాణములన్ మదిన్ విడచి రావముతోడఁ గృపాబ్ధి కావవే
దీనులమంచు వేడఁ బటుతీవ్రగతిన్ శిఖి మ్రింగినట్టి యో
దీనపరాయణా మనుపు దీనుఁడ నో వ...

30


ఉ.

వల్లవకాంతలెల్ల మును వస్త్రచయంబును విప్పిపెట్టి సం
ఫుల్లసరోజవాహిని సుమోదముతో జలకేళులాడ నా

గొల్లలపుట్టముల్ నగుచుఁ గొంచుకపో మఱి వారు వేఁడ నీ
వుల్లసమాడి యీవె పురుషోత్తమ యో వ...

31


ఉ.

మానవజన్మ మెత్తి యతిమాయల బాలురఁ గూడి ప్రీతితోఁ
గానలయందు గోవులను గాచుచు వారికి లీలఁజూపుచున్
మానుగ విప్రభార్యలకు మాన్యత మోక్ష మొసంగినట్టి యో
దీనశరణ్య యేలుము సుధీవినుతా వ...

32


ఉ.

వాసవుఁ డల్గి గోపకులపై మఱి రాళులవాన గుర్వ నా
యాసము గల్గి గోసహితయాదవులందఱు నిన్ను వేఁడ నా
యాసములేక కొండను రయంబునఁ గేల నమర్చి గొల్ల లు
ల్లాసము వొందఁ బ్రోచితి విలాసముఖా వ...

33


ఉ.

నందుఁడు సార్ధరాత్రి యమునానదికింజని స్నానమాడ నా
నందునిదైత్యులు న్వరుణనాథునిసన్నిధిఁ జేర నీవు సా
నందముతోడఁ బోవ మఱి యాతఁడు బూజ లొనర్పఁ దృప్తుఁడై
నందుని దోడి తెచ్చితివి నాథ హరీ వ...

34


ఉ.

నీలపయోధరం బనఁగ నీతను వొప్పగు నందు నిందు నిన్
బోలెడునీదుమోము నఱమూసినకల్వలఁ గండ్లఁ జూడ గో

బాలురు వారలన్ దమిని బాల్పడకం గళలూని నిల్పి వే
యేలిననాదుతండ్రి హరి యీశ్వర యో వ...

35


ఉ.

దుర్మతియైనకంసుఁడు వధూగురుబాలవినాశకృత్యముల్
పేర్మిని జేయువాని హరి భీకరనాగముబోలెఁ జంపి త
చ్ఛర్మదభూమిఁ దాతకిడి సౌఖ్యముసేసిన చిన్నికృష్ణ యో
నర్మదమందహాస నిను నమ్మితి శ్రీ వ...

36


ఉ.

శ్రీపతి నీవు రాముఁడును శిష్యకుచేలసమేతుఁడైన సాం
దీపునియొద్ద శాస్త్రసమితిన్ సుమతిక్ గణుతించి నేర్చి వి
జ్ఞాపితు లైనభంగి నను జ్ఞానకళాపరిపూర్ణుఁ జేయవే
శ్రీపృథివీపతీ వరద శిష్యుఁడ నో వ...

37


ఉ.

తాపవిదూరమున్ గురువు తన్మృతపుత్రు సజీవిఁ జేసి సం
తాపము దీఱఁ దెచ్చి గురుదక్షిణ నిమ్మన వల్లెయంచు నా
పాపనిఁ గంధి దైత్య యమపట్టణముల్ చని రోసి తెచ్చి సాం
దీపున కిచ్చి మ్రొక్కినసుధీర భళీ వ...

38


ఉ.

నారదచోదితోగ్రయవనప్రభుదాడి బురి న్ముసుంగ నీ
పౌరులద్వారకం బనిచి వాఱుచుఁ దోకొని వాని భూమిభృ
ద్ఘోరగుహన్ సనిద్రు ముచికుందునిచేఁ జెడఁజూచి యాబుధో
ద్ధారున కీవె ముక్తి విబుధస్తుత యో వ...

39

ఉ.

బాలవయస్సునందు నిను బాయక నందునిచెల్లె లిచ్చతోఁ
బాలనఁ జేసి పెంచి పరిపక్వవయస్సున నిన్నుఁ జూచి గో
పాలక నన్నుఁ బొందుమనఁ బాలనఁ జేసితి రాధికాసతిన్
లోలతతో జనార్దన త్రిలోకనుతా వ...

40


ఉ.

పన్నగవైరి యింద్రునిసభాసదులందఱ గెల్చి యాసుధన్
గొన్నవిధాన భూపతులకోటుల గెల్చి రమాలలామఁ గై
కొన్నమహానుభావ ననుఁ గూరిమితోఁ గృపఁజూడుమయ్య యా
పన్నుఁడనయ్య దీనజనపాల హరీ వ...

41


ఉ.

ఏమని విన్నవింతు నిఁక నేమి దలంచెద నీమహత్త్వమున్
బామరు లాడునింద విని పాపుకొనన్ గుహఁ జొచ్చి బల్మి భా
మామణియున్ శమంతకము మానుగఁ దెచ్చినయట్టికృష్ణ యో
క్ష్మామరసేవ్య కైకొనవె జాంబవతిన్ వ..

42


ఉ.

దేవ జగన్నివాస జగతీధవ దూరితినంచు భీతితోఁ
గావుమటంచు నిన్నజుఁడు గానుకనిచ్చెను సత్యభామ నీ
వావనిత గ్రహించి మఱి యాతనిఁ గాచినభంగి కావు మో
పావనమూర్తి యోపతితపావన నన్ వ...

43


ఉ.

ఇందునిభాననా సురల నింపుగఁ బ్రోచినప్రోడ దేవకీ
నందన గోపికాహృదయనందన లక్ష్మణ భానుపుత్రిఁ గా

ళిందినిఁ బెండ్లియాడి మురళీప్రియగానముఁ జేసితౌర గో
వింద నమో యటంచు నిను వేడెద శ్రీ వ...

44


ఉ.

రాధకు నల్లుఁడై యిలను రమ్యముతోడ వివాహమొంది యా
యాదవవంశ మెల్ల భువి ఖ్యాతిగఁజేసిన చిన్నికృష్ణ యో
మాధవ కేశవా యసురమల్లురఁ గూల్చిన నిన్ను గొల్తు నీ
పాదములన్ మదిన్ దలఁతుఁ బార్థనుతా వ...

45


ఉ.

నారదమౌని దివ్యసుమనంబు సమర్పణఁ జేయ రుక్మిణీ
నారికి నీయఁగా నతఁడు నవ్వుచు భామకుఁ దెల్ప సత్యహృ
ద్దూరుఁడ వైతివా యనుచు దూరిన నాకుల నొడ్డి పారిజం
బూరఁట దెచ్చి యీవె శ్రుతిసూక్త హరీ వ...

46


ఉ.

దానవరాజపుత్రి వనితామణి దెల్పఁగఁ జిత్రరేఖయున్
మానినిఁ గూడియున్న సుకుమారుని నెత్తుకపోయి యాయుషా
మానిని కిచ్చె నాతియును మారునికేళిని గూడియుండఁగా
బాణుఁడు కోపగించుకొని బాలుని ద్రాడునఁ గట్టివైవ నా
దానవుబాహులం దునిమి దైత్యుల శంకరు గెల్చి తెచ్చితౌ
మానినినిం గుమారకుని మాధవ శ్రీ వ...

47


ఉ.

ఈవసుధన్ మదంబునను నీశుఁడ నేనని క్రూరభాషలన్
నీవలె చిహ్న మూనిన యనీతునిఁ బౌండ్రకవాసుదేవునిన్

గావరమెల్లఁ బోనణఁచి కయ్యమున న్వధియించినట్టి యో
దేవర నన్నుఁ బ్రోవవుగదే తగదే వ...

48


ఉ.

నారదుఁ డొక్కనాఁడు నళినాక్ష త్వదీయసుదర్శనార్థమై
ద్వారకకుం జనంగ సురతన్ జరియించి పదారువేలగో
నారులతో సమాఖ్యతను నైజసుచాతురిఁ జేసినట్టి నీ
చారునిలాసముల్ నుడుప శక్తుఁడనే వ...

49


ఉ.

శ్రీపతి మున్ను ధర్మజుఁడు చిత్తమునం దలపోయ వేగ నా
భూపతిరాజసూయమును బూర్ణముఁ గాఁగ నొనర్చి ధర్మపృ
థ్వీపతి సేయుపూజఁ గొని ధీరత సంతసమందినట్టి భ
ద్రాపతి బ్రోవుమా ద్యుమణిధామ హరీ వ...

50


ఉ.

నీవును భీమపార్థులును నెమ్మది భూసురవేష మూని యా
భూవిభునాజ్ఞచే మగధభూవిభునిన్ రణభిక్ష వేఁడి యా
కావరపోతుమాగధుని గయ్యమునన్ వధియింపఁ జేసితౌ
దేవదయానిధీ గుణనిధీ మృదుధీ వ...

51


ఉ.

మానధనుండు ధర్మజుఁడు మాన్యతఁ జేసిన రాజసూయమున్
బూనికఁ దీర్చి భీష్మకురుపుంగవులందఱు చూచుచుండఁగా

మానవనాథుఁడైన శిశుపాలునిఁజంపిన యట్టి జెట్టి యో
దానరణప్రవీణ గుణధామ హరీ వ...

52


ఉ.

పాండవమధ్యముండు నినుఁ బ్రార్ధనఁ జేసిన సూతుఁడై మఱిన్
ఖాండవముం దహింప ఘనగాండివచాపము వహ్ని యీయ నా
ఖండలు గర్వముం జెఱచి కయ్యమునన్ విజయంబు నిచ్చితౌ
చండతరప్రకాశ గుణశాలి హరీ వ...

53


ఉ.

బాలసుహృత్కుచేలునికి భాగ్యము లిచ్చితి వంచుఁ గుబ్జకున్
లాలనఁ జేసి రూపము విలాసముఁ జేసితి వంచు ధర్మజుం
బాలనఁ జేసి రాజ్యవిభవంబుల నిచ్చితి వంచు రుక్మీణీ
లోల నుతింతు నిన్ను మదిలో నెపుడున్ వ...

54


ఉ.

పన్నగశాయి నీవు మును పార్థుఁడు యాత్రకు వెళ్లివచ్చినం
దిన్నఁగ ద్వారక న్నిలిపి తెంపునఁ జెల్లెలి నిచ్చి పంప నీ
యన్న హలాయుధుండు విని హా యని యోర్వక కోపగించినన్
మన్ననఁ జేసితౌర మతిమంత భళీ వ...

55


ఉ.

శంభువరంబుఁ బొందియు నృశంసతఁ దచ్ఛిరమున్ స్పృశ్రేష్టసం
రంభు వృకాసురు న్నిజకరంబుల స్నాతను జేయఁ గూల నా
శంభుని ప్రాణముల్ నిలిపి సన్నుతి కెక్కిన కృష్ణ దేవకీ
డింభక కావు కాంచనపటీ సుకటీ వ...

56

ఉ.

భూరమణుండు ధర్మజుఁడు వొమ్మన హస్తిపురంబుఁ జయ్యనం
జేరి ముదంబునంది కలసేమము లారసి బుద్ధిజెప్పినన్
గౌరవనాథుఁడున్ వినక క్రౌర్యముఁ జూపఁగ విశ్వరూపమున్
వారికిఁ జూపినట్టి భగవంత హరీ వ...

57


ఉ.

కౌరవ రాజధానికిని గార్యము సంఘటనంబు సేయ ధీ
సారుఁడు భక్తుఁడౌ విదురుసద్మముఁ జేరి భుజించి ప్రేమతోఁ
గోరినగోర్కె లిచ్చితి వకుంఠితచిత్తము నీకు నిచ్చితిన్
సైరణ నేమి యిత్తువొ వశంకర యో వ...

58


ఉ.

నీరజనాభ నిన్ను మును నెయ్యముతోడ ధనంజయుండు వే
సారి రణంబులోఁ దనకు సారథి గావలెనంచు వేఁడఁగా
సారథివై కిరీటికిని జాతురిఁ జూపినసార్థసారథీ
నీరుచిరాంఘ్రిపాళి నను నిల్పఁగదే వ...

59


ఉ.

పార్థుఁడు దొల్లి యుద్ధమున స్వాంతవిషాదముఁ జెంద మోహతా
నర్థముఁ బాప యోగగతి నంతయుఁ దెల్పి సువిశ్వరూపముం
బ్రార్థనఁ జేయఁ జూపిన మహాత్మ గురుండని గొల్తు సర్వదా
యర్థినిఁ బ్రోవు శిష్యసుజనార్తిహరా వ...

60


ఉ.

వారిజబాంధవుం డపరవారిధిఁ గ్రుంకకమున్న సైంధవుం
జేరి శిరంబుఁ ద్రుంతునని చేసె ప్రతిజ్ఞ ధనంజయుండు నీ

వారవిబింబమున్ మఱి యవారితచక్రము గప్పి సైంధవుం
జేరి వధింపఁజేసితివి శీఘ్రమునన్ వ...

61


ఉ.

కౌరవకోటినెల్ల నతికౌశల మొప్ప వధింపఁజేసి యా
కౌరవరాజ్య మిచ్చితివిగా కరుణించి యజాతవైరికిన్
గౌరవమైనకీర్తి జయగణ్యత గాండివి కిచ్చినట్టి యో
శౌరి దయాపయోధి గుణశాలి హరీ వ...

62


ఉ.

ద్రౌణి యపాండవంబుగను బ్రహ్మశిరంబను నస్త్ర మేయఁగాఁ
బ్రాణభయంబుగాఁ గవియ బాండవరక్షణఁ జేసియున్ గదా
పాణివియై తదస్త్రపరిబాధితు నార్తుని నుత్తరోదరుం
ద్రాణనఁ జేసినట్టి సువిధాన హరీ వ...

63


ఉ.

భాసురసూనుకై పతితపావను నీశు సమాధి నుండ ఘం
టాసురుఁ డీశుఁ గొల్చి యమృతార్థము వేఁడఁగఁ గృష్ణుఁ డీగలం
డాసనుఁ గోరుమన్న నిను నార్తి స్మరింపుచుఁ గాంచి యర్చతో
భూసురప్రేత మీయ నగి భూతపతి న్స్పృశుఁ జేసి సాత్వికా
భ్యాసము ముక్తి నిచ్చిన దయాంబునిధీ వ...

64


ఉ.

దేవతలన్ రిపుల్ గెలువ దీనతతో నిను వేఁడ వారికిన్
దావకవర్మమంత్రమును దథ్యముగా నెఱిఁగించి యంతఁ బ్రా

గ్దేవగణంబుఁ బోరున వధింపఁగఁజేసిన దివ్యమూర్తి నీ
సేవకసేవకుండఁ బ్రియశిష్యుఁడ నో వ...

65


ఉ.

కాండములన్నియున్ స్వజఠరాంతరమందు ధరించు జెట్టి యీ
పిండమునందు జీవతను బేర్మి వహించి పిపీలికాది కా
ఖండలదేహము ల్ఫలితకాంక్షలఁ జేసి రమించుప్రోడ యో
ఖండితదానవా జడుఁడఁ గావఁగదే వ...

66


ఉ.

దేహవరత్రయంబునను దృశ్యపదార్థసమూహము ల్మహా
మోహతనూర్ణనాభిక్రియ మోదముచే సృజియించి బద్ధుఁడౌ
దేహివిగాఁ గనంబడుచుఁ దీక్ష్ణతమంబును జేయు నీశ నన్
దేహవిహీనుఁ జేయవె సుధీరనుతా వ...

67


ఉ.

సారసనాభ దుర్మల మసారకుదుఃఖమయస్వరూపసం
సారపయోధి నుత్కటరసక్రిమిజాలగతాగతాదిసం
చారమువోలె భ్రాంతిలయజన్మము లందుదురయ్య నిర్ద్వయా
కార పరాత్మ నీదువిముఖత్వమునన్ వ...

68


ఉ.

ఉద్ధవుఁ డేఁగుదెంచి మఱియొక్కతఱిన్ సఖియంచువేఁడ శ్రీ
బుద్ధసుమార్గముం దెలిపి భూరికృపం గరుణింపలేదె నా
బద్ధతఁ బోవఁద్రోచి ననుఁ బాలనఁ జేయఁగదే పరాత్మ యా
యుద్ధవుమాడ్కి బ్రోవు మొడయుండవుగా వ...

69

ఉ.

శ్రీవిధివందనా వరద సేవిత యోగ్యుఁడవంచు నెంచి నా
యావరణాదులన్నియును నావలఁ ద్రోచి త్వదీయరూపునన్
భావము నిల్పినాడఁ భవబంధముఁ బోవఁగ జేసి వేగమే
యేవిధిఁ బ్రోతువో యభవ యిత్తఱి నన్ వ...

70


ఉ.

కాలునికింకరు ల్మదసకల్మషచిత్తవిధేయుఁడైన నా
పాలికి వచ్చి దుఃఖమయబాధలు వెట్టెదరంచు నిప్పుడే
యేలిక వైననీభజన మింపుగఁ జేసెదనయ్య యయ్య నీ
బాలుఁడనయ్య వేఁడెదను బార్థసఖా వ...

71


ఉ.

బాలురతప్పులన్ గురుఁడు బాలనఁ జేసినభంగి నాదుపా
పాళిని బాఱఁదోలి కృపఁ బాలనఁ జేయఁగదే మహాకృపా
శాలివటంచు నెంచి నిజసౌధరసోపమదివ్యనామముల్
గ్రోలితి దైత్యఖండన త్రిలోకనుతా వ...

72


ఉ.

పావన మైన మీకథలు భాగవతు ల్పఠియించుచుండ బల్
పావనమూర్తి వంచు నినుఁ బల్మఱుఁ జిత్తమునందుఁ గొల్చెదన్
శ్రీవర నాదుజన్మమున సిద్ధి వహింపఁగఁ జేయ మ్రొక్కెదన్
గావఁగదయ్య యీశ విభు కంసహరా వ...

73


ఉ.

సుందరమైన నీభజనశోభను గాంచ సుశక్తిలేనివా
రందఱు జన్మదుఃఖనిచయాంబుధియందు నిమగ్ను లౌచు నెం

దెందు సుమూఢులేగద సురేశ్వర దాసుఁడఁ బ్రోవు నన్ గృపా
కంధి నితాంతశాంత నరకాంతక యో వ...

74


ఉ.

నాగధరాదిదేవతలు నారదపర్వతదివ్యమౌనులున్
యాగము సేయు కర్మకులు వ్యాసముఖార్యమహానుభావులున్
యోగిశిఖామణు ల్సుకవు లూహఁ గలంగి భవత్పదాబ్జసం
యోగముఁ జెంద యోగినుతా వ...

75


ఉ.

అజ్ఞుఁడ మూఢుఁడన్ జడుఁడ నర్థవిహీనుఁడ దుష్టచిత్తుఁడన్
బ్రాజ్ఞత లేనివాఁడ బహురాగవశీకరుఁడన్ శఠుండఁ గ్రౌ
ర్యజ్ఞుఁడ నన్ భవద్భజనరక్తుని జేసి యిఁకైనఁ బ్రోవు స
ర్వజ్ఞ కృపాసముద్ర భవభంజన యో వ...

76


ఉ.

శ్రీరమణీమనోరమణ శ్రీహరి కృష్ణ మదీయపాపముల్
బారఁగఁదోలి నాదుమది బాయకయుండెదవంచు నిన్ను వే
సారితిఁ గావవే దయను సంస్తుతిఁ జేసెదనయ్య వేగమే
భూరిదయానిధీ సుగుణపూజిత యో వ...

77


ఉ.

సారసనాభ యార్యజనసన్నుత నీపదసేవఁ జేసెదన్
గోరినకోర్కు లిచ్చి నను గొబ్బున నేలు ముపేక్షఁ జేసినన్
గౌరవమైన నీమహిమకౌశలమెల్ల హరించుఁ గాన నే
మారకుమా యశస్సు వినుమా కనుమా వ...

78

ఉ.

లోకములెల్ల నీకడుపులోన జనించె నటండ్రు ధీయుతుల్
శ్రీకమలాసనాదిమునిసేవ్యులు సన్నుతి కెక్కలేదె ము
న్నీకమనీయరూపమును నిల్పి మనంబునఁ గాదె దేవ యే
కాకిని నన్ను నేలి దయఁ గావఁగదే వ...

79


ఉ.

చేసితినయ్య పాపములు నేసితిఁ బెద్దలనెల్ల హాస్యము
ల్జేసితి నన్యభామలను జేరి సుఖించినవారిపొందు నేఁ
జేసితి నన్నియు న్మఱచి చిక్కులు పెట్టకుమయ్య యయ్య నీ
దాసుఁడనయ్య యార్తజనతాపహరా వ...

80


ఉ.

పాపము లెన్నిఁ జేసితినొ పంకరుహాక్ష మదీయచిత్తము
న్నీపదయుగ్మమం దునికి నిల్వదు కర్మవశంబునన్ మహా
పాపములందుఁ జొచ్చు నిఁకఁ బాలనఁ జేయఁగదే మహాత్మ నా
పాపము లెంచకో వరద భక్తనుతా వ...

81


ఉ.

ఆదరమొప్ప మ్రొక్కెద గదాగ్రజ సంసృతిఘోరసాగరం
బీఁదఁగలేక విశ్రమవిహీనతఁ జెందెదనయ్య యీవృథా
వాదులఁ జేరనయ్య యతిపామరుఁడయ్య శరణ్యుఁడయ్య యం
భోదనిభా భయం బుడిపి బ్రోవఁగదే వ...

82


ఉ.

శంకల నన్నియు న్విడచి శంకరసాక్షిగ నన్యదేవతల్
పొంకముతోడఁ బోవిడచి పొందుగ నీభజనంబు సేతు నా

వంకకు వచ్చి యూఱటలు వంచన లేక వచించి బ్రోవు నీ
కింకరుఁడయ్య దండ మిదె కృష్ణ హరీ వ...

83


ఉ.

ధాతవటంచు నీవిమలతారకమంత్రము సర్వలోకవి
ఖ్యాతమటంచు నెంచి వినయంబున జోతలు సేసి యెప్పుడున్
ధాతను గన్నతండ్రి నిను ధ్యానము సేసెదఁ గృష్ణ వేగమే
యీతఱి నేలుమా దయను నీశ్వర యో వ...

84


ఉ.

ఓపరమాత్మ యోవరద యోకమలాసనవంద్యపాద గౌ
రీపతి బాదరాయణ కరిప్రముఖస్తుతదివ్యనామ ల
క్ష్మీపతియంచు భక్తులకు క్షేమము నిచ్చెదవంచు వేఁడెదన్
బావుఁడ నీదుభక్తుఁడను బాపహరా వసుదేవనందనా.

85


ఉ.

ఏగతిఁ జేరవచ్చు మది నెప్పుడు జూతును నీవిలాసమున్
రాగము ద్వేష మెప్పుడు హరంబగు నెప్పుడు మోహలోభముల్
రోగము వాసిపోవునను రోయక బోయక బ్రోవుమయ్య నీ
వే గతివంచు నమ్మితిని వేగమె రా వ...

86


ఉ.

ఎన్నిభవంబు లొందితినొ యెన్నిప్రతాపము లొందినాఁడనో
సన్నుతి కెక్కు నీభజనసౌఖ్యము నిప్పుడు కాంచినాఁడ నా

యన్న క్షమింపుమన్న శరణాగతుఁడన్న ననుం గృపన్ సదా
మన్ననఁ జేయుమన్న హరి మాధవ యో వ...

87


ఉ.

శ్యామలవర్ణ నాదుమది సత్వముతో నినుఁ బూజఁ జేసెదన్
గోమలమైన మీపదముఁ గోరి సదా భజియించుచుండెదన్
దామరసాక్ష నీవిమలతారకమంత్రము నిచ్చి వేగ ని
ష్కామునిఁ జేయుమా త్వరితకాలమునన్ వ...

88


ఉ.

నెట్టితి వైరివర్గముల నేర్పున మీగుణవర్ణనంబు చే
పట్టితి యుష్మదంఘ్రి గురువర్యుఁడవంచుఁ ద్వదర్చనాన్యమున్
మెట్టితి వేదశాస్త్రవిధి నేర్పరినై భవదన్యమార్గముల్
గొట్టితిఁ గావుమా వరద గొబ్బున నన్ వ...

89


ఉ.

కర్మము లెన్నిఁ జేసినను కంజదళాక్ష వికారదూరమై
శర్మదమైన మీస్మరణఁ జారుముదంబునఁ జేయునట్టి దు
ష్కర్మఠుఁడైన పధ్ధతినిఁ గాంచునటండ్రు త్వదంఘ్రియుక్తుఁడేఁ
గర్మవిభేదసద్గతిని గాంచఁడొకో వ...

90


ఉ.

వారిజలోచనా వినుము వారణమున్ గృపఁ గావలేదె పా
కారిసురాదులం గృపను గావఁగలేదె భయంబుఁ బాపి వే

మారు భజించుభక్తుఁడను మన్ననఁ బోషణఁ జేయరాదె నన్
శౌరి కృపానిధీ ప్రబలశౌర్యహరీ వ...

91


ఉ.

శ్రీధవ మున్ను నీకృపఁ గరిప్రభు ద్రౌపది వాయసాధమున్
యోధవిభీషణున్ శబరి యోగికుచేలుని భీష్మపార్థులన్
మాధవ నారదాదిమునిమాన్యులఁ బ్రోచినపుణ్యమూర్తి న
న్నీధరఁ బ్రోవుమా కరుణ నీశ హరీ వ...

92


ఉ.

భూమి ననేకజన్మములఁ బూనితి నోర్వను జన్మ మెత్త నీ
నామకథాసుధారసము నాలుకఁ గ్రోలితి సేవఁ జేసితిన్
వేమఱు వేఁడికొంటి నను వేదనఁ బెట్టుకుమంటి నీయవే
ప్రేమను నిత్యమైనపదవిన్ గృపతో వ...

93


ఉ.

దోషము పేరి రుగ్మతకుఁ దోయజనేత్ర త్వదంఘ్రిభక్తిసి
ద్ధౌషధమున్ భుజింపఁగ నిరామయదివ్యపదంబు నొంది సం
తోషము జెందితిన్ మనుపు తొందరఁ బెట్టకుమయ్య పాపని
శ్శేషతఁ జేయుమయ్య నిజసేవకుఁడన్ వ...

94


ఉ.

భుక్తియు భక్తియున్ మఱియు భూరికటాక్షముచేత ముక్తియున్
శక్తుఁడవంచు నిచ్చుటకు శైశవకాలమునుండి కొల్తు నా

రిక్తతఁ బాఱఁదోలి బహురిక్థునిఁ జేసి యిఁకైన బ్రోవవే
భక్తమనోభిలాషద శివస్తుత శ్రీవ...

95


ఉ.

ఏలక జాగుఁజేసెద వదేలర నీవు కృపారసంబుతో
నేలవె మూడులోకముల నేలవె యార్యుల గోపబాలురన్
బాలుఁడ నీకు మ్రొక్కెదను బాగుగ బ్రోవవె గోపకామినీ
లోల హరీ యటంచు మదిలోఁ దలఁతున్ వ...

96


ఉ.

రార రమావినోద వినరా సుగుణాకర కోటిమన్మథా
కార సురేంద్రవంద్య యరిఘాతుక పాండుసుతోపకార రా
రా రవికోటిధామ రణరంగభయంకర గోపికాన్వయో
ద్ధారక నన్ను నేలుమి యుదారమతిన్ వ...

97


ఉ.

కుంజరు నేలి కుంజరునిఁ గూలిచి వానరు నేలి వానరున్
భంజనఁ జేసి యండుని బండియు నండజుఁ జెండియున్ ధరన్
రంజనఁ జేసియున్ ధరను రాళులవానకుఁ గేల నెత్తియున్
సంజయు నేలినట్టి గుణసాంద్ర హరీ వ...

98


ఉ.

ఎన్నిక లెన్ననంటి మఱి యెగ్గు లసత్యము లాడనంటి సం
పన్నత లేదటంటి పరభామలపొందులఁ గూడనంటి యా

పన్నుఁడ నంటి నీవిమలపాదుకసేవను జేసెదంటీ నే
నెన్ని వచించినన్ గరుణ నేల వహో వ...

99


ఉ.

అండజకాండుఁ డార్తసుజనార్తివిఖండుఁ డరిప్రఖండకో
దండకళాప్రచండగసుదర్శనవర్తికిఁ గృష్ణమూర్తికిన్
రెండవసాటిదేవుఁ డిఁక లేఁడని సాటెద భద్ర నెక్కి బ్ర
ద్దండడఢాండఢాండనినదంబుల శ్రీవ...

100


ఉ.

పూనికతోడఁ జేసితిని పూర్తిగ నుత్పలవృత్తమాలికన్
దీని ధరించి నాదుమది దీనతఁ బాపి విముక్తి నీయవే
దీనదయాళు కృష్ణ జగతీధవ మాధవయంచు వేఁడెద
న్శౌనకనారదాదిమునిసన్నుత శ్రీవ...

101


ఉ.

శ్రీలలితంబునైన కృపచేఁ గరుణింపుము శీలమైన వె
ల్లాలసగోత్రజాతుల విలాసముతోడ మదీయవంశముం
బాలనఁజేసి తద్భవుల బంధువులన్ దిలకించి బ్రోవుమా
శ్రీలలనామనోంబుజవశీకరణా వ...

102


ఉ.

శ్రీరమణీయమైనకృపచేతను బ్రోవుడు నాదుమిత్రులన్
వారిని వారివారి మఱి వారిని జేరినవారి నెప్పుడున్
భూరివివేకసంపదసపుణ్యసముక్తులఁ జేసి యేలుమా
భూరిగుణాఢ్య వేడెదను పూజ్యపదా వ...

103

ఉ.

ఆగమవేద్య దీనసుజనాశ్రిత మన్నవలక్ష్మణార్య వి
ద్యాగురువర్యశిష్యుఁడ గదాగ్రజ సుబ్బమయాదినార్లకున్
శ్రీగుణశీలపుత్రుఁడను శ్రీధవ రంగయనామధేయుఁడన్
బాగుగఁ గొల్చెదన్ మనుపు భర్గనుతా వ...

104


ఉ.

శ్రీపతి నీకు వందనము శ్రీలలనామణియైనలక్ష్మికిన్
గోపసతీలలామలకు గొబ్బున మ్రొక్కులు దాసదాసుఁడన్
నాపతివంచు నమ్మితిని నామదివాంఛలు దీర్చి కావుమా
పాపి నటంచు నెంచకు మపారకృపా వ...

105


ఉ.

మాధవ నీకు నిత్యశుభమంగళ మెప్పుడు నీదుభార్యకు
న్రాధకు సత్యభామకును నందకశార్ఙ్గసుచక్రశంఖకౌ
మోదకికిన్ శుభంబు లగు మోదము గల్గు ఫణీంద్రవైరికిన్
యాదవవంశభూషణ మహాత్మ హరీ వ...

106

కందగీతకవినామగర్భిత ఉత్పలమాలా-శైలబంధము

ఉ.

శ్రీశమరంజనా ఖగహరీ రమణీయసుఖప్రదాయి రా
ధాశుభదాయకా సుజనతత్యభయంకర సూరిరక్షణా
శ్రీశమికల్యపో హరవిరించమనఃకుముదాబ్జవిష్ణు స్వా
మీ శరణాగతద్విపకులేశనుతా వ...

107

ఉ.

ఏవసుదేవనందనునియింగిత మౌదలఁ దాల్తు రెల్ల వా
రావసుదేవనందనునియాజ్ఞ రచించిన యుత్పలంబులన్
భావనఁ జేసిన న్వినిన వ్రాసిన వారి కభీష్టసంపద
ల్పావనముక్తి నిచ్చు దయ భవ్యుఁడు గృష్ణుఁడు సుస్థిరంబుగన్.

103

సంపూర్ణము.