బొబ్బిలియుద్ధనాటకము/ప్రవేశకము1

వికీసోర్స్ నుండి

(చతుర్థ పంచమాంకముల నడుమ)

ప్రవేశకము.

(అంతట పలువురు పౌరులు ప్రవేశింతురు.)

ప్రథముఁడు. - ఒయ్యోయి సన్నాసీ, కోటలో నేమోయి చెవులు గింగు రనే లాగ యీరోజల్లా ఖణీల్ ఖణీలు ఖణీల్మని మోగుతూ వుంది ?

ద్వితీయుఁడు. - ఓహో అప్పడా ! మఱేమీ గాదు ; కత్తులు, కఠారీలు, ఈటెలు, బల్ల్యాలు, బాకులు, ఈలాంటి వన్నీ చికిలీ చేయిస్తూ వున్నారోయి.

అప్ప. - ఏమి చికిలీ అయినా చేయించేరుగాని, ఈకత్తులూ కఠార్లు, ఆ నల్లమందు మారెమ్మ ముందర అక్కరకు రావురా. నేను పెద్దలు చెప్పగా విన్నాను. కొన్ని విశేషాలు.

సన్నాసి. - నాకు చెప్పరా ఆవిశేషాలు.

అప్ప. - వినుమఱి. ఈ నల్లమందు మారెమ్మ అనే ఆమె కాళికాదేవి, అదే కాళరాత్రట. కాగానే మనకళ్లకి నల్లగా బొగ్గువర్ణంగా కనబడుతుంది. ఆమెకి కిట్టని వాళ్లు దగ్దిరికెళితే భగాలు మని మంట మండి అంతర్ధానమవుతుంది. వాళ్లు కాలి చచ్చిపోతారు.

సన్నాసి. - అవునురా, అవునురా.

అప్ప. - మఱి మన యీ దేశాల్లో నుంచి మంత్ర తంత్రాలకి పలాయమాన మై పోయిన భూత ప్రేత పిశాచ బ్రంహ్వరాక్షస శాకినీ ఢాకినీ కాకినీ ఠాకినీ పినాకినీ బడబాకినీ గోడదూకినీ పాడెపీకినీ నింగినాకినీ నేలదేకినీ నీడగోకినీ దయ్యాలు ఆమెకి పరివారము. అవి ఆమెతో కూడా యెప్పుడూ అంతర్ధానంలోనే వుంటవి. యుద్ధంలో ఆమెకి కిట్టనిపక్షం వాళ్లని తెలియనీకుండ మీదబడి చంపి రక్తం తాగేస్తవి.

సన్నాసి. - తినేస్తవట కూడా.

అప్ప. - అవును మఱి. మఱీ-ఆమెయెప్పుడున్ను పరంగు లింగిలీసులు వొళందులు బుడుత కీసులు సిద్దీలు వున్నారే, వాళ్ల పక్షము. ఆమె వీళ్లకి గొట్టాలూ వుండలూ యిస్తుందే అవే తుపాకులు ఫిరంగులూ యినపగుళ్లున్ను. ఉండలవెనక తానేవుండి వూత్తుంది.

పౌరులు. - ఈళ్లల్లో బుడతకీసు లన్నా వే అదేం పేరండీ ?

అప్ప. - వాళ్లు గుఱిగా చూస్తే బుడతలు, అనగా కుఱ్ఱవాళ్లు, కెవ్వున కేకేసి కీసుకీసుమంటా లగువు వేసి చచ్చి పడిపోతారు. పౌరులు. - నిజమేనా నిజమేనా ? ఏ మాశ్చర్యము !

అప్ప. - అవుతే అబద్ధం చెప్పుతానా ?

పౌరులు. - అబ్బా ! యీళ్లచేత మనపని యేమౌద్దో గందా ?

పౌరులు. - వొళందు లన్నారే వొళందు లేంటయ్యా ?

అప్పన్న. - వాళ్లువొళంగులు - వొడ్రంగులు - అనగా కంసాల్లు సముద్రం కింద వూళ్లు, యిళ్లు, మైదానాలు, ఆకాశం, అన్నీ కట్టుకొని, తిమి తిమింగిలాల మందలని గేదెమందలలాగ పాడి చేసుకొంటూ, ఆపాలు బడబానలంలో కాచుకొని తాగుతూ, హాయిగా వుంటారు అందుకోసం వాళ్లకి వొళందు అని పేరు.

ఒక కుఱ్ఱవాడు. - [బ్యా అని యేడ్చుచు] నాకు బయ మేస్తావుంది. నన్నుమా యింటికాడికి తీసకెల్లండి.

[అని ఒక పౌరుని పట్టుకొనును.

ఆపౌరుడు. - తీసకెల్తాలే, మాకా డుండు, భయ ముండదు.

కుఱ్ఱ. - అబ్బా ! నానుండను.

[బ్యా అని యేడ్చుచు పరువున నిష్క్ర.

సన్నా. - బాగా నరుకుతావురా. మఱికొందరి పేరు పరంగు లన్నావే అదెందు కొచ్చింది ?

పొరులు. - కుఱ్ఱోడు యెల్లినాడు లెండి. మఱి శెప్పండి.

అప్ప. పిరంగీలు కాల్చడంలో అంతటి వాళ్లు మఱి లేరు. కడమవా ళ్లంతా తుపాకీలు యేలాగ యెత్తి రొమ్మున పెట్టుకొని కాలుస్తారో, వీళ్లు యెంత పిరంగీ అయినా అలాగే యెడమచేత్తో యెత్తి రొమ్మున బెట్టుకొని కాలుస్తారు. అదీ కారణం ఆపేరు రావడానికి.

పొరులు. - ఇంగిలీసు లేటండీ?

అప్ప. - వాళ్లమతంలో 'యెంజెల్సు' అంటే దేవతలు. వీళ్లు దేవతల అవతారమని ఆపేరు వచ్చింది. ఆలాగే వీళున్న చోట అధర్మం జరగ దంటారు.

పౌరులు. - మరి యీళ్లందఱు తెల్లగా వుంటారే,అదే మండీ?

అప్ప. - పూర్వము హనుమంతుడు మొదలయిన వానరవీరులు సీతాదేవిని చూచి వచ్చి మధువనంలో చొచ్చి తేనె లన్నీ తాగేసి, దధిముఖుణ్ణి అవమానపఱిచినప్పుడు అతడి మొఱ్ఱని సుగ్రీవుడు వినకపోతే, దధిముఖు డంటే అతని మొఘం పెరుగులాగ తెల్లగా వుంటుం దన్నమాట, అతను అలిగి దేశాలమీద పాఱిపోఁగా, అప్పట్నుంచి ఆదేశాలన్ని గడ్డగడ్డగానే, చెట్లు, చేమలు, కొండలు, అడవులు, ఆకాశం, నదులు, జీవరాసులు, అన్నీ కాలమానంతో కూడ, పెరుగుగడ్డలలాగ తెల్లబడి పోయినవి. వీళ్లు ఆదేశాల వాళ్లు. పౌరులు. - ఏమి శ్రిత మండీ ? మరి సిద్దీలో ?

అప్ప. - వాళ్లు ఏపనిమీద వెళ్లినా అది సిద్దే; అందుకోసం సిద్దీలు. పూర్వం వాళ్లు బొమ్మరాకాసు లట. వాళ్లకి మేకలు పొట్టేళ్లు ఆటవు. ఒక్కడొక్కడూ పూటకి ఒక యెద్దుని తినేస్తాడు.

సన్నా. - కొంద రంటారు పూటకు ఒక పెద్ద శిద్ది నెయ్యి వీళ్లకి అన్నంలోకి కావాలట. అందుకోసం ఆపే రొచ్చిందట.

పౌరులు. - ఓయిబాబో ఓయిబాబో ! ఏమి యింతండీ !

అప్ప. - ఆమాట కేం గాని, నా కొక స్వాములవారు చెప్పినారు ; రొండు పాదాలు రొండు శిద్దెలు, రొండు పిక్కలు అంతకన్న రొండు పెద్ద నిలువు శిద్దెలు, తొడలు అంతకన్న రొండు పెద్ద నిలువు శిద్దెలు, పిఱ్ఱలు మఱీ ప్యాద్ధ రొండు శిద్దెలు, కడుపు వొక ప్యాద్ధ అడ్డ శిద్దె, ఱొమ్ము ఆలాంటివే రొండు నిలువు శిద్దెలు, బుగ్గలు రొండు శిద్దెలు, తలకాయ ఒక శిద్దె, ఈలాగ పుట్టినా డట వీళ్ల మూలపురుషుడు ఆమూలంగా వీళ్లకి శిద్ధీలని పేరట.

పౌరులు. - అ టయితే యీళ్లకి మనోరు సాల్లే రంటారా ?

అప్ప. - మనవారికే ఈపరాసులు చాల్లే రంటాను.

సన్నా. - అది యలాగ ? వివరంగా చెప్పు.

అప్ప. - యలాగంటే, మనదొరలు భేతాళుడి వంశస్తులు.

సన్నా. - అయ్యో నీ తెలివీ ! భేతాళనాయు డని వీరి మూలపురుషుడురా ; భేతాళుడు గాడు. ఆయన వోరుగంటి ప్రతాపరుద్రమహారాజుకాడ ప్రధాన సేనా నాయకుడుగా వుండి, తురకలని పారదోలి, వోరుగంటి యాంధ్రరాజ్యాన్ని స్థాపించినవాడు.

అప్ప. - అ దెంతమాత్రం గాదు. భేతాళుడు భేతాళుడు భేతాళుడే. ఆభేతాళుడు ఈకోటలోనే నివాస ముండి, పిశాచాలని యేలుతూ వుండేవాడు. అప్పుడు హనుమంతుడు ద్రోణపర్వతం తేవడానికి వెళ్లుతూ, మంచి తిండి వుంటే మోయడానికి బలము వుంటుం దని, భేతాళుడియింటికి చుట్టంగా వొచ్చినాడు. తన బురుజు తమకి యిద్దఱికిచాల దని, భేతాళుడు ఆక్షణాన పిశాచాలచేత హనుమంతుడికి వేఱే బురుజు కట్టించి, అది ఆయనకి బస యేర్పరిచి, అందులో తిండి పెట్ట్యాడు. అందు చేతనే యీ బురుజుకి భేతాళబురు జని, ఆబురుజుకి హనుమంత బురుజని, పేళ్లు వచ్చాయి.

సన్నా. - వహవ్వా ! వహవ్వా ! మంచి సొరకాయలురా ! పోనీ మని విన్న కొద్దీ నరుకుతున్నావు. కానీ, ఇంకా నరుకు. నీకు తగిన వినేవాళ్లే దొరికినారు ! పౌరులు. - ఇంకా శెప్పండయ్యా, శెప్పండి ; మనదొరలు పరాసులని యలాగ గెలుస్తారో ?

అప్ప. - వినండి మఱి. వెలమదొరలలోనే మఱి కొందఱు నరిసింహమూర్తి వంశస్తులు. అందుచేత వెలమదొరల ముందర, యీభూలోకంలో, మ రేవీరులున్ను తల యెత్తలేరు.

సన్నా. - ఓయి నీ తెలివీ ! సర్వజ్ఞ శింగమ నాయనింగారని మఱి నొక మూలపురుషుడు రా. ఆయనికి తెలియని శాస్త్రంగాని విద్యగాని లేనందున, ఆయనికి సర్వజ్ఞ బిరుదు వొచ్చింది. ఆయన వేంకటగిరి రాజధానిగా తూర్పుసీ మంతా యేలిన దొర.

అప్ప. - అన్నా ! సన్నాసిగాడు ! మాటమాటకీ పుల్లేస్తాడు !

[అని సన్నాసిని చిటమట లాడుచుం జూచును.

సన్నా. - ఏమిటీ ! అప్పిగాడు మనిషిలాగ రేగుతున్నాడు !

[అని కోపించును.

[అంతట వెట్టివాడు ప్రవేశించి యిట్లు దండో రా వేయును.]

అళివిగాని పెళయం వొచ్చింది. (డుండుం.) పరాసులు గడెకో గడెకో కోటమీది కొస్తారు. (డుండుం.) వూరిజన మంతా యెవరిసొత్తులు, పానాలు, వారిశాతనైనలాగ కాపాడుకోవలశింది. (డుండుం.) యీలా గని యేలినవోరు సాటించ మన్నారు. - (డుండుం.)

[అని నిష్క్రమించును.

పౌరులు. - [దిగులుతో] ఈసాటింపుకి గుండె నొటుక్కు మంటున్నది బాబో !

అప్ప. - నా కేమో భయంలేదు. నా కింకా 2000 బ్రాహ్మణార్థా లున్నాయని జోస్యుడు చెప్యాడు.

పౌరులు. - వవ్వా వవ్వా! మంచి జోశ్శమయ్యా. మాకంతా సావూ, పరాసు కూడూ, తప్పదు. ఏం శేతాం బాబూ ?

(అంతట కోమటి చెలువలు నీళ్ల బిందెలతో తిరిగి తిరిగి

వెనుకకు చూచుచు వడివడిగా నడచుచు ప్రవేశింతురు.)

సన్నా. - ఏ మమ్మా, కోమటక్క లంతా వడివడిగా గుంపుగా వొస్తున్నారు?

ఒకతె. - ఎందుకా అన్నా ? సిద్దీలు అక్క డక్కడ పొంచుండి ఆడవాళ్ల కేసి తప్పుడు చేష్టాలన్నీ చేస్తున్నా రన్నా.

[అని వడిగా పరిక్రమించును.

అప్ప. - నేను వెళ్తా; నా కీరోజు బ్రాహ్మణార్థం వుంది.

[అని నిష్క్ర.

సన్నా. - బలే తండిపోతు ! నేను రేపు వుంటానో వుండనో? అందుకోసం అరు వేడవడం యెందుకు? గోపాలస్వామిగుడి నంబ్యాచార్లు నాకు చక్కెర పొంగలీ దధ్యోధనమూ పెడతా నన్నాడు. వా ట్నెందుకు పోగొట్టు కోవడం ? ఒకపౌరుఁడు. - ఆయన్ని తిండిపో తన్నావే, మరి ను వ్వేంటయ్యా ?

[సన్నాసి పలుకక నిష్క్రమించును.

ఒకతె. - (ఇతరులతో) అక్కోవ్ వో అక్కా , యీపరాసులు సిద్దీలు వీళ్లంతా మనరాయనింగారి యింటికి పెళ్లిళ్లకి వొచ్చిన చుట్టాలే గదా. వారికి చుట్టాలైతే మనకీ చుట్టాలే గదా. కడమ చుట్టాలకి వారు విందు చేస్తే, వీళ్లకి విందు మనం చేతాం. వీళ్లు మనపేటకొస్తే ;

రెండవది. - వేడి వేడి నూనంటి, అక్కో వో అక్కోవ్.

మూడవది. - వేడి వేడి నీళ్లోసి, అక్కో వో అక్కోవ్.

మాలుగవది. - పలసని యంబలి పెట్టి, అక్కో వో అక్కోవ్.

ఐదవది. - అందులోకి నంచుకోను మిరపగుం డేసి,

ఆఱవది. - తాగడానికి తెగబారెడు చు ట్టిచ్చి,

ఏడవది. - తలకీ సన్నెకళ్లూ పొత్రాలూ ఇచ్చి,

ప్రథమ. - పెద్దనిద్ర పొమ్మాని పండుకోబెడదాం.

వారందఱు. - " "

[అని నిష్క్ర.

పౌరులు. - యీళ్లగో డేంటో మనకి తెలలేదు. రండి. రాయనింగారు మనమల్ని కాసేకాలం తప్పితే, మన మెల్లి రాయనింగారిని కాయాల, మనం కత్తులతోను కటారులతోను పొడవలేక పోతే, పొడిచేవోళ్లకి కావలిశినయి అందిత్తాం, నౌకరీ చేతాం; అందుకు రాయనింగారిని అడుక్కొందాం.

[అని నిష్క్రమింతురు.

ప్రవేశకము సమాప్తము.

____________