బొబ్బిలియుద్ధనాటకము/పంచమాంకము

వికీసోర్స్ నుండి

పంచమాంకము.

స్థలకము. - బుస్సీ డేరా.

(హైదరు, విజయరామరాజు, బుస్సీయు యథోచితము ప్రవేశింతురు.)

బుస్సీ. - ఏమి మహారాజా ? ఈరాత్రివేళ కట్టు పంచెతోను కాలినడకతోను వచ్చినారు ? హైదరుం గూడ తెచ్చినారు ?

హైదరు. - ఈఛనము బొబ్బిలికోటమీదికి నడిస్తిమా, కోట పడతా మంట ; ఈ రాత్రి తప్పితే బొబ్బిలి మనవల్ల గా దంట.

బుస్సీ. - అది యెట్లు మహారాజా ?

రాజు. - డొంకలోనిపులి పొదలో చేరినది; తాండ్రపాపయ్య కోటలో లేఁడు, రాజాములో నున్నాఁడు. హర్కారాలచే రంగారాయఁడు అతనికి బంపిన జాబు ఇదిగో. ఎ టయినను మనరాక ఈగడియకో పైగడియకో అతనికి తెలియక మానదు; తెలిసినంతనే అతఁడు రాక మానఁడు. వచ్చినంతనే మనల నందఱను రూపుమాపక మానఁడు.

బుస్సీ. - [అప్రియముగాఁ జూచుచు] ఇసీ ! ఆహర్కారా లిట నున్నారా ? వారివలన నింక నే మయినం దెలిసికొందము.

రాజు. - ఆహర్కారాలు ఇరువురు బికారివేసముల బిచ్చమెత్తుకొనుచు 11 పహరాలు దాఁటినారు. 12 డవ పహరాలో మీరాసాహెబు వారిని అడ్డగించి, సోదా చూచి, వారి గోధుమరొట్టెలను విఱువ నుండఁగా, వారు ఆరొట్టెలను పెఱుకుకొన యత్నించి, వానిచేతినుండితీసికోలేక, ఆజులుముచేత లేచిన మన సిపాయీలమీద, తమ కాసెకోకలలో దాఁచుకొనియున్న బాకుమాత్రముతో కలియఁబడి, సాయుధులను నూర్గరను పొడిచి, తాము పొడుచుకొని చచ్చినారు. మీరాసాహేబు నాకు ఆ రొట్టెలలోని యీజాబులను తెచ్చి యిచ్చినాడు.

బుస్సీ. - [ముక్కుపై వ్రే లిడుకొని] ఆహా ! ఈబొబ్బిలిలో హర్కారాలే ఇంత పని చేసినారు ! బంట్లు దొరలు ఏమి చేయుదురో! అయ్యా, ఇపుడు అంధకారము ; తెల్లవాఱ నిండు. హర్కారాలు దొరకిరిగదా ? ఇంక తాండ్ర పాపయ్యకు కబురు అందు ననుభయము లేదు గదా ? రాజు. - అయ్యయో ! దొరగారూ ! ఏమి యిట్లు సెల విచ్చెదరు ! ఇట్టి హర్కారాల నెందఱ నెన్ని దిక్కులకు వారు పంపినారో ? ఎందఱు తప్పించుకొని పోయియుందురో ? అంధకారమునకు 12000 మన్నె పౌఁజు చేతను ఇలాయీలు వేయించి పట్టపగలు గావించెద. ఎట్లును మీవలన నిపుడు కా దందు రేని, నాకు సెల విండు ; నేను నాయూరి కేఁగి మీపేరు చెప్పుకొని బ్రతికియుండెద.

హైదర్. - సర్దార్, రాయభారి అంతాపనిచేసినాడు! ఈహర్కారాలు ఇంతా పని చేసినారు. ఇంకా జోదులు దొరలు ఏమి చేస్తారో ! కన్క మన షిణేహితులు చెప్పేలాగ వారిని ఏమఱు పాటుగా కొట్టడం షరీ పని నాకీ తోస్తుంది.

బుస్సీ. - ఎవరురా అక్కడ?

దౌవారికుఁడు. - [ప్రవేశించి] ఏమి సర్కార్ ఆజ్ఞ ?

బుస్సీ. - పోయి క్షణములో సర్దార్ల నందఱను తోడ్కొనిరా ?

దౌవా. - చిత్తము సర్దార్.

[అని నిష్క్రమించును.

(నేపథ్యమున కాహళము ఊఁదుదురు.)

బుస్సీ. - ఏమి తంట తెచ్చెదరు రాజా మీరు ?

రాజు. - తంట తీర్చుపని నేను తెచ్చినది.

[సర్దారులు ప్రవేశింతురు.]

బుస్సీ. - కూర్చుండుఁడు.

[అందఱు కూర్చుందురు.

బుస్సీ. - ఇప్పుడు మీరు బొబ్బిలిమీఁదికి నడుపవలయును.

సర్దా. - ఏమి సర్కార్ ! ఇలాగ హుకుం చేసారు ! ఈ చీకటిలో ఈ నిద్ర మబ్బులో యలాగ నడుస్తాం ?

హైదరు. - మామూల్ లేనిమాట వచ్చిం దేమి మీనోట ? మన్కీ చదుర్న ధిక్కరించిన పోగరుబోతులకి మన్మూ ఏమఱుపాటమే కొట్టవాలా లేదూ!

రాజు, - నా 12,000 మన్నె సేనచేత, ఇలాయీలు, కాగడాలు, మతాబులు వేయించి మీకు పట్టపగలు చేసెదను.

హైదర్. - శబాశ్ ! అదీ షరి ! బలే మెహర్బాన్.

ముసేపనాల్. - [గాయము చూపు] ఆరాయబారిది వఖ్పోటు ఇద్గో సర్కార్ ; నేను నడుజ్దాను బొబ్బిలిమీదికి. తెల్లవారేలోపల, వాడ్కీ వాడిదొర్లకీ నేను కర్కర్కర్కర్ కొయ్యవాలా వుంది. బొబ్బిలిజెండా తెగ్గొట్టి, మనజెండా ఎత్తకుంటే నాపేరు ముసేపనాల్ గాదు. నాకీ ఫిరంగివాత వెయ్యండి నేను బొబ్బిలి కొడితే నాకీ యేమీ యిస్తార్. బుస్సీ. - 6000 వరహాలు ఇప్పించెదను.

మునే. - 6000 వరహాలు నాకీ వద్దు. నేను బోనగిరి కొట్టినాన్, కళ్లికోట కొట్టినాన్. ఇట్వంటి బీసాదీజీతానికి నేను కోటలు తియ్యలేదు. బొబ్బిలి ఏడుగడియలు దోపు ఇయ్యవాలా, ఇస్తే బొబ్బిలి కూలుజ్ధాన్.

రాజు. - బళీ ! బళీ ! సర్కారునకు వరహాలు లాభము. ఇది మఱియు మంచిదే.

బుస్సీ. హైదరు. - అలాగే కానీ ;

ముసే. - మఱి నాపని చూజ్దాన్. సలాం, సలాం.

[అని నిష్క్రమించును.

సర్దార్లందఱు. - సలాం ; సలాం ;

[నిష్క్రమింతురు.

బుస్సీ. - లాల్ఖాన్, మఱి, ఏక్షణాని కాక్షణము సమస్తవృత్తాంతము మాకు చూచి వచ్చి స్పష్టముగా చెప్పుటకు సమర్థు లగువారిని అయిదార్గురును నియమింప వలయును.

లాల్.- చిత్తం. సలాం.

[నిష్క్రమించును.

రాజు. - నేను వేషము మార్చుకొనెదను. నాసేన కేర్పాటు చేసెదను.

బుస్సీ. - ఈ రాత్రి మమ్ము చంపుటకు వచ్చితివి రాజా నీవు.

రాజు. - సలాము.

[అని నిష్క్రమించును.

(నేపథ్యమున వెలుతురు.)

బూసీ. - ఆహా ; ఎంత వెల్తురు !

హైదరు. - ఛనంలో వేయించినాడు మషాల్ రాజా.

[నేపథ్యమున బాకా భేరి, డంక నగరా, నౌ బత్తు.]

ప్రథమ నివేదకుడు. - [ప్రవేశించి] సలాం, సలాం. ముసేపనాల్ కౌలు చెప్పినారు. ఆయాసర్దార్లకింద 12,000 సిపాయిలు, 6000 పరంగులు, 6000 ఇంగిలీసులు, 13000 చట్కార్లు, 6000 నలందులు, 3000 బుడతకీసులు, 4000 గోసంగులు, నడుము గట్టినారు. వీరుగాక హిందూ తురక సిపాయీలకు లెక్క లేదు. కోట మీదికి నడుస్తున్నారు.

బుస్సీ. - మంచిది.

[నివేదకుడు నిష్క్రమించును.

ద్వితీయ నివేదకుఁడు. - [ప్రవేశించి] సలాం. సలాం. మందుకొట్లకి శెల్వు అయింది. తోటాలు గీటాలు, పంచి పెడ్తావున్యారు.

బుస్సీ. - మంచిది.

[ద్వి. నిష్క్రమించును.

(నేపథ్యమున)

[ఓరోరి, అహోబిళాన్ని, భూతనాధుణ్ణి, పెద్దగుండ్లతో మట్టి కోట మీదికి మోర్జా చెయ్యండి. రామసింగును, లక్ష్మనసింగును, భేతాళున్ని, అనుమంతుణ్ణి, చిల్లపెంకులు, చిట్టెపురాళ్లు, మంగలకత్తులు, డబ్బుల తిత్తులు, ఏగానులు, గులకరాళ్లు గట్టించి వెలమలమీదికి మోర్జాచెయ్యండి. జంట ఫిరంగులు, జబరజంగులు, బోకుమారులు, ఔటుఫిరంగులు, మగరదిండ్లు, అన్నీ తయ్యారు చెయ్యండి. కంచుఫిరంగులు గట్టించండి. చెకుముకి బారులు, 13000 తయ్యారు చెయ్యండి. 6000 జజ్జాయిబారులు, అనుపు దిద్దండి.]

ప్ర. - [ప్రవే.] విజయరామరాజుగారు యుద్ధం చూడడానికి ఏనుగ మీదికి దివాన్ హైదర్జంగుగారిని పిలుస్తున్నారు.

బుస్సీ. - పోవోయి; పోయి, తమాషా జూచిరా.

[హైదరు నిష్క్రమించును.

ప్ర. - సర్కార్, తమ పటాలం వారందఱు తిరగబాటు చేస్తున్నారు.

బుస్సీ. - ఆశ్చర్యము ! ముందు నడవ వలసినవారే !

ప్ర. - కైపు లేనిదీ వారు ఏమీ చెయ్య లే రంట.

బుస్సీ. - అవును మామాటగా బొడ్మిన్ తో వారికి సారాయి మామూలుకొలత ప్రకారము ఇమ్మని చెప్పుము.

[ప్ర. నిష్క్రమించును.

ద్వి. - [ప్రవేశించి] సర్కార్ ! తమ షోల్జర్లు షారాయి తాగీ కఫరు తప్పి ఒకరిమీదికి ఒకరు సనీలు దూసుకొంటున్నారు. ఇఖ క్షణమయినా ఆళష్యం శెయ్యడం షరి గాదు. గుండు పారించడానికి ముసేఫనాల్ మూడో సెలవు అడ్గుతారు. ఆకాశ మంత కాగడాల పట్టపగల్ అయివుంది

బుస్సీ. - వారిగుండు ముందు మిగిలిన బాగుగ నుండును. [గడియారము చూచుకొని] 12 గంట లయినవి.

(నేపథ్యమున ఫిరంగి మ్రోఁత.)

బుస్సీ. - [దద్దిరిల్లి శ్రవణ మభినయించి, కోపముతో] ఎవరురా మా కడపటి సెలవు లేకయే ఫిరంగియగాదు చేయించినాఁడు?

ద్వి. - కోటలో జాముఫిరంగీ వేశివుంటారు సర్కార్.

(అంతట హైదరు రాజును తత్తఱమునం బ్రవేశింతురు.)

రాజు. - [స్వగతము] ఈ ఫిరంగిచేత నాపని సాధించెదను [ప్రకాశము] ఏమి దొరగారూ ! ఇక నేమున్నది ? వచ్చి పడ్డారు మనమీఁదికి బొబ్బిలివారు. ఫిరంగులు. మోర్జా చేసి కొట్టుచున్నారే ! బుస్సీ. - అది వారిఫిరంగి యని నిశ్చయమా ?

రాజు. - ఇంకను సందేహమా? ఎదుట నున్న, మమ్ము గుఱి పెట్టుదు రని మేము పరారి చేసి వచ్చినారము.

బుస్సీ. - ఓయి సిపాయి, ఇదే నాకడపటి యాజ్ఞ,

[ద్వి. నిష్క్రమించును.

[నేపథ్యమున - కౌలోకౌలు.]

ఫిరంగి ప్రముఖా గ్నేయాస్త్ర ధ్వనులు. -

మార్ ! మార్ ! పైర్ ! పైర్ !

ప్ర. - [ప్రవేశించి] మనఫిరంగీలు పేలినవి. కోటబురుజు లంతట మనుష్యులని పేలింది, సిబ్బందీలని పేలింది. మనవాళ్లు అన్ని పక్కలా ఒక్కమాటే కోట కూల్చడానికి ఫిరంగీలు కాలుస్తున్నారు.

[అని నిష్క్రమించును.

ద్వి. - [ప్రవేశించి] సలాం సర్కార్, ధర్మారావుకీముందు మిగిలి ఆడంగులు లడాయి చేస్తున్నారు. బకాల్ బీబీలు సర్కార్ ! ఆళ్లు కొప్పులు విప్పి వెనకసిగలు దట్టంగా వేసి, పైటచెంగు నడుంకట్టు కట్టి, రాళ్లు రప్పలు వళ్లో కట్టుకొని, రోకళ్లు తీసుకొని, బేరివారిస్త్రీలు కలపటమైనారు. రాళ్లు మనరాణువమీదికి గిరవాట్లు యేస్తారు. ఒడిశాలలతో కొడుతున్నారు. దగ్గిరికి యెల్లిన షోల్జర్లని మండీ యేసుకొని రోకళ్లతో పండబెడుతున్నాఅరు. ఆళ్లమీదికి యెల్లినాడే సిద్బిదీలాల్ ఆడూమర్గయా. సగము మంది సర్దార్లు బకాలుపేటమీదికి ఉడాయించినారు. కడ్మ అందఱు బురుజులకాడ, కింద లడాయిమాని, ఈళ్లలడాయి తమాషా చూస్తావున్నారు. కోటమీద ఆళ్లకి దీపాలు లేవు. మనరాజాదీపాలు ఆళ్లకి వెన్నెల వుంది. దానిచేత ఆళ్లు మనసర్దార్లకీ గురీపెడతారు. వఖ్ గురికి టకీసుల్తాన్ మర్గయా. మనగురికి ఆళ్లు కొంచెంకొంచెం అందుతారు ; ఎక్వా అందడం లేదు. సలాం.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - స్త్రీలు యుద్ధము చేయుటా ! సిద్దిబిలాల్ వారిచేత చచ్చుటా ? కోమటిస్త్రీలా ! టకీసుల్తాను దోరినాడూ ! మేము ఎక్కడను ఇట్టిది యెఱుగము ! ఏమి యీగడ్డ బీరము ?

రాజు. - ఏమి ! నేను ముందే చెప్పలేదా ? నన్ను బట్రా జంటిరే మఱి ?

బుస్సీ. - ఏమయ్యా రాజా ? మాకు స్త్రీలతో లడాయి చేయించెదవు నీవు ?

రాజు. - [సమందహాసము] ఓడిపోదు మని భయమా ?

బుస్సీ. - బలే జిత్తులమారివిగా నున్నావయ్యా ? ఆడువారితో జగడము అవమానము కాదా ?

రాజు. - [సమందహాసము] గెలిచిన మానమే. బుస్సీ. - నీవు మానిసివి గావోయి ?

రాజు. - ఏ మన్నను సరియే.

హైదరు. - సాహెబు, నాకీ శెల్వు ఇయ్యండి, నేను ఆ తమాషా చూచి వొస్తాన్.

బుస్సీ. - చూచి వచ్చి మాకు చెప్పుము.

[హైదరు నిష్క్రమించును.

బుస్సీ. - [రాజు నుద్దేశించి] ఏమి రాజా యీస్త్రీలు ఇజార్లు అంగీలు తొడిగి డాలు తర్వారు పూని పోరుదురా ?

తృతీయ నివేదకుడు. - [ప్రవే.] సలాం సర్కార్, బకా ల్బీబీలు, వజ్రాల్ కెంపుల్ బంగారు జవాహరీ యేస్కొని, కాశ్మీర్ బనారస్ చీరల్ ముస్తీబుతో జిగ్జిగ్జిగా మెరుస్తా కోటబురుజుమీద కంటికి చూపడగానే, వారికీ హౌరీలు తల్చుకొని మన తుర్కి సిపాయీలు వఖరికి వఖరు యెన్కకి మోచేతి పోట్లతో నెట్టుకొని తోసుకొని లగ్గలెక్తా వున్నారు. ఎక్డం తొందరలో సగం మంది కింద ఖందకం వుందీ లేదూ, అందులో పడ్తారు. తతిమ్మాసగం... [అను నర్ధోక్తిలో]

బుస్సీ. - స్త్రీలు త్రోయఁగా క్రింద పడి చచ్చినారు, ఇంతే గదా ;

తృ. - బస్ సర్కార్.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - మనమును చూతము వచ్చెదరా మహారాజా ?

రాజు. - నాకు క్రొత్త గాదు. మీరే చూడుఁడు.

ద్వి. - [ప్రవే.] సర్కార్ సలాం, బకాల్బీబీలు లగ్గలు యెక్నారే ఆసిపాయీల మీద తెర్లుతావున్న నూనె ఉడుకుడుకు నీళ్లు, కాగుతావున్న అంబళ్లు పోసి 1000టికి, కళ్లల్లో మిరపగుండ గంపల్ గంపల్ గా కుమ్రించి 15000 టికి, కూల్చిన్యార్. తప్పించు కొని ఎక్కి కలియబడినవాళ్లని నోటీలో రోకళ్లతో గుమ్మి పడదోసిన్యారు. సన్నెకళ్లు, రోళ్లు, వేసి ఎందరినో, తల్కాయలు పగల్గొట్టిన్యారు.

[ నిష్క్రమించును

[బుస్సీ ముక్కుపై వ్రేలుంచుకొనును.

చతుర్థనివేదకుడు. - [ప్రవే.] సర్కార్, మనివాడు చండ్రోలు మహమ్మదు ఆ బీబీలతో కలియబడి మిరపగుండ మారెమ్మ కన్ను నిండి కబోదియై రోకటిదెబ్బకీ ఖందకంలోపడి సచ్చీపోయినాడు.

[నిష్క్రమించును.

బుస్సీ. - జిహో వా ! జిహో వా ! మేము పోరిన మే మేమగుదుమో !

[హైదరు రక్తవస్త్రములతో అంబటి తలతో ప్రవేశించును.]

బుసీ. - అరే ! ఎవరు నీవు ?

హైదరు. - క్యా సాబ్, నేను హైదర్జంగు కాదూ ? నాకీ తెల్వదూ మీకీ ? రాజు. - ఏమి సాహేబ్ ? మీరు పోరితిరా ఏమి ? మీ యొడ లంతయు ఈ నెత్తు రేమి ?

హైదరు. - మేము పోరలేదు రాజాభాయి. బకాల్బీబీలపోరు సూడడానికి వెల్లి సిపాయీల నడ్మ మే వున్యాం. బీబీలరోకళ్లకి వాళ్ల తల్కాయల్ పగిలి నామీద కురిశిన నెత్తుర్వానాకీ నావొల్లంతా యఱ్ఱా అయింది. మఱివఖ్టీ, ఈపగిడీ ఈగర్మీచా ఈదాడీ లేక్పోతే, నామొఖం వుడ్కీ పోయి వుంటుంది. ఆపిసాసీలు అంబల్కి పోసినారయ్యా! నామొఖంమీద! ఆఖీమీద! సూడడానికీ పోతే సావడానికి అయింది ! ఈళ్ల మొగవాళ్లు బేరాలకీ పోయినారంట ' ఈళ్లు మనవాళ్లకి దంచుతావున్నారంటా అక్డాఅక్డా ఒకడు రెండు బీబీలు సస్తా వున్యారు సాబ్. నాకీ నోటీతెరిస్తే అంబలి నాల్కాకి లక్కాలాగా వస్తుంది ; నాల్కా కాల్తుంది ; అంటుకుంటుంది ! వదల్దు. తమాషా చెప్పడానికి వచ్చినాన్ ; కడుక్కొందాంకి లోపల్కి పోతాన్.

[నిష్క్ర.

ద్వి. - [ప్రవేశించి] సిద్దీమక్కాలు, బకాలుబురుజు పట్టినాఁడు. బకాలుపేట అంతా దోపుడు అయింది. బీబీలు మాయ మైనారు.

[నిష్క్రమించును.

బూసీ. - మఱి మన మేల పోవుట ?

ప్ర. - [ప్రవే.] సలాం సర్కార్. బొందిలిగూడెం, మన్నేగూడెం మాడిపోయినవి. సాపుగా దోచినారు. కాపుగూడెం మీదికి దౌడు తర్లినారు.

[నిష్క్రమించును.

చ. - [ప్రవేశించి] సర్కార్ సలాం. కాపుపేటలో షుకురుల్లా పోరుతాడు. కాపులు నాగేళ్లు, కాళ్లు, కఱ్ఱులు, గండగొడ్డళ్లు, గునపాలు, పాఱలు వీటితో కొడ్తారు 'అరే యిది బలరాముడి దెబ్బ సూడరా' అని కాపువాడు నాగేటితో కొట్తాడు. మనవాళ్లు 300 మందులు డింకకొడ్తారు.

[అని నిష్క్ర.

[హైదరు అంబలి కడిగికొని ప్రవేశించును.]

తృ. - [ప్రవే.] సర్కార్, వకనాగేలు కఱ్ఱు మొన షుకురుల్లా సాహెబుకీ పుఱ్ఱెలొ దూరి ఆఖిమే బైటికివచ్చింది. ఇం కొకడు గడ్డపాఱతో తల్కాయ యెన్కాకీకొడితే కాపువాడు నాగేలు లాక్కొన్నాడు. షుకురుల్లా తన్నుకొని గింజుకొని పీరులలో కలసిపోయి నిద్రపోతా వున్యాడు.

[నిష్క్రమించును.

చ. - [ప్రవే. హైదరల్లీ నుద్దేశించి] సర్దార్, సాహెబ్, ఖిల్లాకి కుడి యెడమ అన్నివైపుల అగాడి పిచాడి లడాయి అయితుంది. వఖ్ సర్దార్ వఖసర్దార్కు ఖుమ్మక్కు శెయ్యడాన్కి లేదు. తమరు వస్తే కాపుపేట అయినా పడిపోతుంది, అని అనమరల్లి సాహెబు చెప్తారు.

హైదరు. - నేను యేలడాయికి అయినా వజ్దానుగాని కఱ్ఱుషుకురుల్లా నాగేటి లడాయికి మాత్రం రాను.

[చ. నిష్క్రమించును.

బుస్సీ. - ఏమి రాజా ? మమ్ముల నందఱను ఇక్కడ గుండాన వైచుటకు తెచ్చినారా !

రాజు. - నేను ముందే చెప్పలేదా ? నన్ను బొబ్బిలివారి బట్రా జంటిరే !

చ. - [ప్రవే.] సర్కార్, మర్గయా అనమరల్లీఖాన్ ; మర్గయా సర్కార్ ; అనరమల్లీఖాన్ ; మర్గయా :

[అని నిష్క్రమించును.

ద్వి. - [ప్రవే.] సర్కార్, పేపేఖాన్ లెగిశినాడు. మనవాళ్లు ఇప్పుడు కాపు పేటమీద వున్యారు. కాపుపేట వాళ్లకీ కిందా వుంది.

(అని నిష్క్రమించును.

తృ. - [ప్రవేశించి] మన హర్కారా వుండ్లే కూకూభాయి, ఆడు దారిలో బాణం తగిలి మర్గయా, మేం ఇంకా మర్గయాలేదు.

(అని పో నుంకించును.

దౌవాకుఁడు. - అరే హర్కారా జవాన్, నీవు ఇంకా మర్గయా లేదూ అన్యావే, నీవు కూడా మర్గయా అయినావు వోయి, లేక్పోతే యెందుకీ తెచ్చినావు వోయి ఆకూకూగాడిది షమాషారమ్?

తృ. - అరే మేము ఇంకా మర్గయా లేదూ అంటే !

దౌవా. - ఉందీ అంటే !

తృ. - అరే లేదురా అంటే !

దౌవా. - అరే ఉందీరా అంటే.

తృ. - నీకి ఇప్పుడు మర్గయా చేస్తాన్.

[అని కత్తి దూయును.

దౌవా. - ఎగ్తాళికి చెప్పినాన్ భాయి.

తృ. - నీకీ యెగ్తాళీ వుంది, మాకీ సావు వుంది.

దౌవా. - అదే నేను చెప్పినమాట. పోభాయి పో.

[తృ. నిష్క్ర.

చ. - [ప్రవేశించి] సర్కార్ సలాం, పెద్దబురుజు వుందీ లేదు, దాన్కి బేతాళం నామ్ చెప్తారు. ఆబేతాళబురుజుమీద్కి మన్వాళ్లు నిచ్చెనలు వేసియెక్తారు; ఎక్కినంత మంది ఖందకం వుందీ లేదు కిందా ; అందులో పడ్తారు. ధూరాన్కి చీమల్బారు కన్పడ్తుంది. బారు ఎక్కుతుంది, నిచ్చెన జాడించినారు లాగ బారు పడిపోతుంది. ఎల్గుబంటిబారు ఎక్తుంది, కోతుల్బారు పడ్తుంది

[అని నిష్క్రమించును.

[తృ. మిక్కిలి రోఁజుచు మహాసంభ్రమముతో ప్రవేశించును.

బూసీ. - ఏమిరా యీయడావిడి?

తృ. - సాబ్ ! ఏమిచెప్పడం ; పెద్ద ఫిరంగిగుండు నాకీభాఅని తర్ముకొనివచ్చింది, బురుజుమీదానుంచీ. నేను దాన్కీకంటే ముందు రావాలకోసం బలేపగ్గు మేవచ్చినాన్, దాన్కి చేత గాభరా అయింది. బుస్సీ. - [హైదరుతోను రాజుతోను జనాంతికము] వీఁడు తెచ్చు వృత్తాంత మంతయు ఇట్టిదిగానే యుండునా ? [ప్రకాశము] ఏమిరా ఒడలు తెలిసి మాటలాడు చున్నావా ?

తృ. - పోయి సూడండి సాబ్, ఇంకా అది యెన్క దిగబడే వస్తా వుంటుంది. ఇప్పట్కీ మీకీ తగుల్తుంది.

బుస్సీ. - పోరా మూర్ఖా.

తృ. - సాహెబ్, ఎన్ని ఫిరంగులు కొట్టినా గోడ దెబ్బకీ దెబ్బకీ వఖతులం పెళ్ల రాల్తుంది. గోడ పగల్దు, బొక్కపడదు. గుండు గుండు అక్కడ అక్డ గ్రుచ్చుకొని గాండామురుగం తోలు మచ్చాల్ లేదూ, అదీలాగా వుంటుంది. దగ్ర వెల్లడానికి పాచినీళ్లు, ఖంపు, అడ్సు, బురద, వూబి, ఖందకం. దాన్కిమీద వంతెన కట్టి, ఖిల్లాకి బొక్కా చెయ్యడానికి పోతే, ఉప్పర్నుంచి, చాటుచాటుమే వుండి ఖాఫర్లు బడాబడా రాయిబండల్ దొర్లుతారు. మనివాళ్లు తుపాకులు లక్షపేల్చినా, చాటుమేవుండే ఖాపర్కు తగల్దు. వఖ్వఖ్ ఖాపుర్ హగ్పడ్తాడు; వాడ్కి దూఅరం గుండు తగుల్తాడూ లేదు; వాడు పడ్తాడూ లేదు. ఆఖాపుర్ గాడ్గి బాణం కిందికి భుర్రుభుర్రుభుర్రుభుర్రు వస్తుంది. వఖ్దాన్కి వఖ్దాన్కి వఖ్డు వఖ్డు మన దాడివాలా మర్గయా. చీకటి చేసి, వంతెన వేశి బొక్కా కర్తాహే. బళే దళసరివుంది. బొక్కాఅవతల్కిపోదు 'కోట పట్టలేము, బుమ్మక్కు కావాలా.' చెప్తారు ముసేటికితాన్ సాహేబు.

బుస్సీ. - లగ్గలెక్కువారికి ఖుమ్మక్కు చేయు మను.

తృ. - బస్.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - హైదర్సాబ్. రాతికోటకంటె, ఇటికకోటకంటె మట్టికోట పడఁ గొట్టుట కష్టముగా నున్నది !

హైదరు. - ఇప్పుడు తెలుస్తా వుంది.

చ. - [ప్రవేశించి] సర్కార్ సలామ్, బేతాళ్ బురుజుమే ఎదిరిరాణ్వ కిటకిట వుంది, వాళ్లసామికి రధం వుచ్చం లేదూ? అద్మీ అద్మీ నిండి అరధం వుంది బురుజు. అక్కడ ముత్యాల పాపయ్యంట వాళ్లకి సర్దార్. వాడు సింహం వున్యాడు సర్దార్. వాళ్లదిఈ పట్టాకత్తులు మనదీపా ల్మతాబులో తళ్తళా తళ్తళా తళత్తళా మెగ్గుతుంది, అది తళ్తళా మన కన్నుకీ గుచ్చుకొంటుంది, మనకీ కబోదీ చేస్తుంది. నచ్ఛత్రం అంతా వఖ్ జాగామే చేరితే ఏమి వుంది అదీ వుంది బురుజుమీద.

[నిష్క్ర.

ప్ర. - [ప్రవేశించి] మన్వాళ్లు బేతాళ్ బురుజు ఎక్కినార్. వాళ్లకి వాళ్లకి లగాలగి మరామరి.

[నిష్క్రమించును.

బుస్సీ. - ఇక పర్వా లేదు. బొక్కపడక పోయినను, మనవీరులు లోపల ప్రవేశించి సర్వ సంహారము చేయుదురు. తృ. - [ప్రవే.] ముత్యాల్ పాపయ్యా పట్టాకత్తి మన చండ్రోలు మహమ్మదుకీ కూడా లేదు. ఆ పాపయ్యచేతులో మన దూడూఖా న్మర్గయా ;దేదేఖాన్‌గయా ; దాడీఖాన్ గయా;ణాణాబాయి, గుగ్గుమియా, లడ్డుసాబు, బర్ఫీసుల్తాన్, పేపేపైల్మాన్, అందఱు సఫాయి.

[నిష్క్రమించును.

బుస్సీ. - ఎంత సాదనాలు చేసినవారయ్యా యీబొబ్బిలి బంట్లు !

చ. - [ప్రవే.] ముసేఫనాల్ హాతికి దిగి, లగ్గాకీ యెక్కి, పాపయ్యతో కలపట మైనాడు. ఆళ్లకి యిద్దఱికి తడాఖా, అందఱు లడాయి మాని చూస్తారు. ఇద్దఱున్నూ అంతర్పల్టీ, దొంతర్పల్టీ, నాల్గేసి హాకాశపల్టీ లేశి, పార్వాపిట్టల్లాగ, ఆణ్ని దాటి ఈడు, ఈణ్ని దాటి ఆడు, పోతాడు.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - ఎంత సేపు ? ముసేఫనాల్ ఆలస్యం చేయఁడే;

ప్ర. - [ప్రవే. హర్షముతో] సర్కార్ సలామ్, ముసేఫనాల్ తన పేరు చెప్ఫి ముత్యాలపాపయ్యని పేగులు వెళ్లబొడిచినాడు. వాడు నారాయణ నారాయణ అంటా నేలకొరిగినాడు.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - బళీ ! బళీ ! ముసేఫనాల్ !

తృ. - [ప్రవే. హర్షముతో] సర్కార్, ముసేపనాల్ వాళ్ల జెండా తీసి, మన జెండావేశినాడు. వాళ్ల నౌబత్తు తోసి మననౌబత్తు మోగిస్తా వున్నాడు.

[అని నిష్క్ర.

చ. - [ప్రవే.] అరే ! రే! రే! దొంగదారిని వచ్చినాడు రంగారాయడు ఆ బురుజుమీఁదికి ! పట్టాకత్తితో ఊడుస్తాడు బురుజంతా. ఆయన్కీ కోసం బలేకాగడాలు వేశినారు. 'బొబ్బిలియేటు సూడు, యెలమపోటు సూడు, రంగారాయడి రణరంగము సూడు.' అంటాయేస్తాడు. అంతా తిరువణ్ణామలె దీపోచ్చం అయింది. ఆయన షైమూం వున్యాడు సర్కార్ ! తుపాన్ వున్యాడు ! ఇక్డవున్యాడు ! అక్డవున్యాడు! ఇక్డ లేడు ! అక్డ లేడు ! అక్డా యిక్డా కూడా వున్యాడు! మల్లీ ఇందర్జాలం వున్యాడు, మల్లీ కంటికి హగ్పడ్తాడు, గుఱికి హగ్పడుడు. ఆయ్న ఎక్డ కన్పడ్తే అక్డ ఈరాజాగారి దం డంతా శరణు చెప్పేవాడు, దండం పెట్టేవాడు, దద్దిరిల్లి కందకంలో పడేవాడు. ఆయన సొంతచేతితో కత్తితో నరుకుతాడు ; గాలి నఱుకు తాడులాగ నరుకుతాడు. మంచి మంచి సిపాయి ఆయన్కి కొట్టడానికి పోతాడు, సలాం శేస్తాడు. ఆ షూర్మాన్ అద్మీ అద్మీకి గొంతు కోసి తల్లకిందు చేసి, నెత్తురువానలు కురిపిస్తాడు. నిలువు మొండ్యాలు ఆయన్కి చుట్టు ఔతుఖానాలు. అవే నెత్తురు చిచ్చుబుడ్లు ఆయన్కి చుట్టు.

[అని నిష్క్రమించును.

హైదర్. - సర్దార్, నేను మల్లీ యెల్లి సూశి వొస్తాన్.

[అని నిష్క్ర.

బుస్సీ. - ఎంతసేపు ఆడఁగలఁడు ఈదొమ్మరియాట ?

తృ. - [ప్రవే.] సర్దార్, రంగారావు ముసేఫనాల్కి ఐదుకీ ఆఱుకీ వఖ్ గుదీగా ఈటెపోటు చేసి కందకంలో కూల్చినాడు. అతని ఎడమ్కాలి తన్నుతో మనఢంకా ఆకాసానికి పోయింది. మనఫౌజుమే ఎవడితల్కాయమే పడింది. అతని జెండా ఎగురుతుంది. ఇప్డు అద్గో ఆమోగేది ఆయన్ది నగారా.

[నిష్క్రమించును.

బుస్సీ. - బళీ; బళీ మహావీరుఁడు! మహావీరుడు! ఆయనతో మనకు యుద్ధము కంటె సఖ్యమయిన బాగుగా నుండును.

ప్ర. - [ప్రవే.] మనిసర్దార్లు పదితూర్లు తెల్లజెండా యెత్తితే 'మీ రేమిరా ఆడపిల్లలా?' అంటా, అతనిబంట్లు యెఱ్ఱజెండా లెత్తినారు.

[నిష్క్రమించును.

బుస్సీ. - హా ! హా ! బలారే ! బలారే !

ద్వి. - [ప్రవే.] మల్లీ బేతాళం బురుజు మీదికి నడ్పితే, ఎవరు పోవడం లేదని తిర్గుబాటు చేస్తారు.

బుస్సీ. - హైదరుజంగును నడుపు మను.

[ద్వి. నిష్క్రమించును.

[హైదరు జంగు చినిగిన నగారా కుండ నెత్తికి తగుల్కొని

యుండ రక్తవస్త్రములతో ప్రవేశించును.]

బుస్సీ. - ఎవర వోయి నీవు, ఇట్లు పెద్ద జిన్ వచ్చినట్లు వచ్చుచున్నావు?

హైదర్. - ఏం సర్దార్, నాకీ తెల్వదూ మీకి? మన నగారాకుండ రంగారావు ఎడ్మకాలితో తన్నీ తే, ఎగిరి వచ్చి నాతల్కాయమీద పడి, చిన్గి గుచ్చుకొని వుంది. తల్కాయ లాక్కోవడానికి రాకుండ వుంది.

[నౌకరులు హైదరుతలనుండి కత్తితో తోలుం గోసి కుండం దివియుదురు.

బుస్సీ. - ఆశ్చర్యము ! అది నీతలకాయమీఁదనే పడవలయునా !

ప్ర. - [ప్రవే.] సర్దార్. రాజా తమ్ముడు వెంగళ్రావు కోటబైటిక, 500 బంటు 150 గుఱ్ఱంతో తరలినాడు. కొండబోటుమీదుగా మనడేరాలమీదికే వస్తూవున్నాడు.

బుస్సీ. - దారిలో మన గుఱ్ఱపు దండు వున్నది. పర్వా లేదు.

[ప్ర. నిష్క్ర.

చ. - [ప్రవే.] సర్దార్, వెంగళ్రావుకి మనగుఱ్ఱం ఎదుర్కొన్నది. 2000 గుఱ్ఱం సఫాయి. ఆయన్కి, 100 గుఱ్ఱం, 150 మంది సిబ్బంది మర్గయా. ఆయన ఫిరంగిగుండు వస్తుంది లాగా కొండబోటు మీదుగా వస్తున్నాడు.

బుస్సీ. - పర్వా లేదు, అక్కడ నున్నది ఫిరంగీల యనుపు.

[చ. నిష్క్ర.

బుస్సీ. - [స్వగతము] ఏమి యాశ్చర్యము ! ఇంత గుఱ్ఱపుదండు నాశమైనందులకు నైజాముగారికి ఏమి చెప్పగలము ?

ద్వి. - [ప్రవే.] సర్కార్, వెంగళ్రావు 50 గుఱ్ఱాలు 350 కాల్బలంతో కొండబోటు మీద్కిరాగానే, వారిమీద్కి ఫెళ్ ఫెళ్, ఫెళ్ ఫెళ్, మోగినయి మన జజాయీల బార్లు. ఢాము ఢామని అగాదయినయి మన ఫిరంగీల బార్లు. 50 గుఱ్ఱాలుసఫాయి! 150 గురితో మొదట మీకాడికి రాయిబారం వచ్చినాడే ధర్మారావు ఆయన కూలి పోయిన్యాడు.

బుస్సీ. - అది చాలు మంచిది మనకు.

[ద్వి. నిష్క్రమించును.

[బుస్సీ డేరాపై గుండ్లు పడును.

బుస్సీ. - అరే ! ఇ దేమి మాడేరా మీదికి ఫిరంగిగుండ్లు ? ఎవరు కాల్చినవి ? అపాయముగా నున్నదే !

ఒకకింకరుడు. - [ప్రవేశించి విజయరామరాజు నుద్దేశించి] దండం మహాప్రభో ! ఏలినవారిడేరామీద ఫిరంగిగుండ్లు పడుతున్నయి. డేరా కాలిపోతా వుంది. పదిమందికి గాయాలైనయి.

రాజు. - [స్వగతము] ఇవి ఎట్లు వచ్చినవి మా డేరామీదికి ? వారికి ఫిరంగులు లేవే ? [ప్రకాశము] పోయిఆర్పుఁడు.

[కింకరుఁడు నిష్క్ర.

ప్ర. - సర్కార్, వెంగళ్రావు అగాదు మీదుగానే ఫిరంగీలపై పడినాడు. మనఫిరంగిబార్లకి వెనక తిరిగి వచ్చి పటాలరాముడు వాటిమీద దుమికినాడు. ఇద్దఱు వెయ్యిమంది జనాన్కి ఫిరంగి బారులవాళ్లకి అందఱికీ పొడిచి, నఱికి, చంపి, ఆఫిరంగులే అడవికి పారిపోయి మల్లీ వస్తావున్న మనపౌజుమీదికి తిప్పి కాల్చి పౌజునంతా నాశంచేశారు. మీడేరాల మీదికి కూడా తిప్పినారు.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - ఇప్పుడు ఫిరంగిగుండ్ల కారణము తెలిసినది. అయినను భయము లేదు. దారిలో ఆరా బున్నది.

తృ. - [ప్రవే.] సర్దార్ 200 మందితో వెంగళ్రావు, పటాలరామయ్య, తుపాకి మందు పరిశినమైధానం మయానికి దుమకగానే ముసేటక్కితాన్ ఆరాబుకి నిప్పు పెట్టిన్యాడు. దొర, రామ్య. వారిగుఱ్ఱాలు, వఖ మన్సీ తప్ప అంతా భగ్‌భగ్.

[నిష్క్ర.

బుస్సీ. - ఇఁక పర్వాలేదు. ఒంటిగాండ్రు వీ రేమి చేయఁగలరు ?

ప్ర. - [ప్రవే.] సర్దార్, పటాలరాముడు లాడూఖాన్ కలపట మైనారు; గుఱ్ఱాల మీదనే పరవళ్లు దొక్కుతారు. లాడూఖాన్ చేతి యీటెపోటికి రాముడు చచ్చి పడిపోయినాడు. వెంగ్రళ్రాయడి యీటెపోటుకి లాడు పడిపోయినాడు., బ్రదికేవున్నాడు.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - మంచిది.

రాజు. - [స్వగతము]

           క. తురకలవీరులు పలువురు
               మరణంబుం బొందినారు ! మాటికి నన్నున్
               గరకర కనెదరు ఖానులు ?
               గిరిని బిడుగు లట్లు నన్నుఁ గెడపుదు రేమో ? ౬౭

వెంగళ్రావు. - [ప్రవేశించి రక్తవస్త్రములతో గాయములతో అతి క్రోధమున] ఎక్కడరా ఆవిజయరాముఁడు ? ఏఁడిరా విజయరాముఁడు ? {{

[ఎల్లవారును సంభ్రాంతులై లేతురు.

రాజు. - వెంగళ్రావు !

[అని కేక వేసి గునగున పలాయితుఁ డగును.

వెంగ,ళ్రావు. - నన్ను తప్పించుకొని పోఁగలవఁటరా? [అని తఱుమును; బుస్సీ లోనగువారు వెంగ,ళ్రావును పట్టుకొని ఆఁపుదురు ; హైదరుజంగు దూరముగా నుండి చూచు చుండును. వెంగళ్రావు మూర్ఛితుఁడై పడిపోవును.]

బుస్సీ. - హాహా ! హాహా ! లేవ వయ్యా మహావీరుఁడా. లే వీర లో కాలం కారమా లే.

[వెంగళ్రావు మూర్ఛ తేరును.

బుస్సీ. - సేవకులారా, ఈయనను వైద్యశాలకుం గొనిపోయి రాజువలన ఈయనకు అపాయము గాకుండ చూచుకొనుచు, మందు లిచ్చి, మాకుఁ దెలుపుఁడు.

[సేవకులు వెంగళ్రావునుం గొని పోవుదురు.

బుస్సీ. - ఇట్టిమహావీరులతో ఏల పోరు పెట్టుకొంటిమి !

సేవకులు. - [ప్రవే.] సర్కార్, ఆయన తేరినాడు ? 'వకరిచేత చావవలశిన ఖర్మం మాకేమి ?' అని పలికి బాకుతో ఱొమ్ములో పొడుచుకొని కాలంచేశినాడు,

బుస్సీ. - జిహోవా ! జిహోవా ! ఈబొబ్బిలి సూర్యచంద్రులలో చంద్ఁరుడు ఈయస్తగిరిం. గ్రుంకి నాఁడు ! రండి, మనమందఱము పోయి ఆ మహావీరుని చూతము. ఎన్ని గాయములు తగిలినవో, ఎంత బలాఢ్యుఁడో, ఎట్టియాకారమువాఁడో, చక్కఁగా చూతము. ఆయనను చూచి నేను మాదేశమున మాప్రభువుల యెదుట ఆతని రూపపరాక్రమములను వర్ణించెదను.

[అందఱు నిష్క్రమింతురు.

____________