బైబులు భాష్య సంపుటావళి - దేవమాత, అంత్యగతులు/భక్త విజయం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

3. భక్త విజయం

మనవిమాట

"భక్త విజయం" అనే ఈ గ్రంథంలో అబ్రాహాము, సమూవేలు మొదలైన భక్తుల కథలను వివరించాం. బైబుల్లోని భక్తిమంతమైన అధ్యాయాలను కొన్నిటిని ఎన్నుకొని వాటిమీద వ్యాఖ్య చెప్పాం. ఈ కథలను పూర్వమే బైబులు భాష్యం 102-105 సంచికల్లో ప్రచురించాం. ప్రతి కథలోను సందర్భం, వివరణం, ప్రార్థనాభావాలు అనే మూడంశాలు వుంటాయి.

ఇక్కడ చేర్చిన 17 కథల పవిత్ర గ్రంథాన్ని చదువుకొని భక్తితో మననం జేసికోవడానికి ఉద్దేశింపబడినవే. ఈ గ్రంథంద్వారా మన పాఠకులు బైబులుతో పరిచయం కలిగించుకొని దైవానుభూతిని పొందుతారని ఆశిస్తున్నాం, ఇది మూడవ ముద్రణం.

విషయ సూచిక

1. ఈసాకు బలి 140 2. సంసోను మరణం 144 3. సమూవేలు పిలుపు 147 4. ప్రభువు సౌలుని నిరాకరించడం 151 5. దావీదుకు అభిషేకం 155 6. దావీదు - గొల్యాతు 157 7. నాతాను ప్రవచనం 161 8. దావీదు పాపం 164 9. సొలోమోను స్వప్నం 169 10. రాజ్యవిభజనం 173 11. సారెఫతు వితంతువు 177 12. కర్మెలు కొండమీద యేలీయా 180 13. హోరేబి కొండమీద యేలీయా 184 14 నాబోతు ద్రాక్షతోట 188 15. ఏలీయాకు వారసుడుగా ఎలీషా 192 16. నామాను కుష్ట నయంగావడం 196 17. సౌలు పరివర్తనం 200

- ప్రశ్నలు 206

1. ఈసాకు బలి - ఆది 22,1-19

1. సందర్భం

అబ్రాహాము సారా ముసలివాళ్ళయ్యాక ఈసాకు పట్టాడు. అప్పుడు అబ్రాహాముకి నూరేండ్ల వయస్సు తల్లిదండ్రులు ఈసాకుని అల్లారుముద్దుగా పెంచారు. ఆ బాలుడు పాలు త్రాగడం మానినరోజున అబ్రాహాము గొప్ప విందు చేయించాడు. ఈసాకుకి ముందే అబ్రాహాముకి హాగారు వలన యిష్మాయేలు కలిగాడు. కాని సారా ప్రేరణంవలన, దేవుని అనుమతిపై, అబ్రాహాము ఈ తల్లీబిడ్డలను ఇంటినుండి వెళ్ళగొట్టాడు. ఇక ఇంటిలో మిగిలివున్న బిడ్డడు ఈసాకు వొక్కడే కనుక అబ్రాహాము ఆదరణ ఆప్యాయత ప్రేమ ఆ బిడ్డడిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఈ దశలో దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు. అనగా దేవుడు అబ్రాహాముకి తనమీద యొక్కువ ప్రేమో లేక ఈసాకుమీద యొక్కువ ప్రేమో తెలిసికోగోరాడు. అబ్రహాము తన కొరకే తన్ను సేవిస్తున్నాడో లేక తన వరాల కొరకు తన్ను సేవిస్తున్నాడో తెలిసికోగోరాడు. ప్రభువు ఆ భక్తుని విశ్వాసాన్ని పరీక్షించాడు.

2. వివరణం

అతడు రాత్రి కలలో అబ్రాహాముతో మాట్లాడాడు. నీవు గాఢంగా ప్రేమించే యేకైక కుమారుని మోరీయా కొండమీద నాకు దహనబలిగా అర్పించాలని చెప్పాడు. ఈ ప్రదేశం తర్వాత యెరూషలేం నగరమౌతుంది. ఈసాకుని బలిగా అర్పింపబోయే తావననే షుమారు 900 ఏండ్ల తర్వాత సొలోమోను రాజు దేవాలయం కడతాడు. ప్రస్తుతం ఇదంతా దట్టమైన అరణ్యం. ఆ రోజుల్లో ఆ దేశంలో వసించే ఆదిమజాతి ప్రజలైన కనానీయులు తమ పిల్లలను మోలెకు దేవతకు దహనబలిగా అర్పించేవాళ్ళ అబ్రాహాముకి ఈ సంగతి తెలుసు. కాని దేవుడు తన కుమారునే యిలాగ బలియిూయమని అడుగుతాడని కలలోగూడ ఊహించలేదు. కనుక దేవుని ఆజ్ఞను వినగానే అబ్రాహాముకి పిడుగు పడినట్లయింది. ప్రభువు యిష్మాయేలుని బలిగా ఈయమంటే అబ్రాహాముకి అంత బాధ కలిగేది కాదు. కాని దేవుడు ఈసాకునే బలిగా కోరుకుతున్నాడు. ఈ ఈసాకు ద్వారానే తన సంతానం తామరతంపరగా పెరుగుతుందని దేవుడు అతడికి పూర్వమే ప్రమాణం చేసాడు. మరి యిప్పడు ఆ బిడ్డడు పోతే ఆ వాగ్గానం ఏలా నెరవేరుతుంది?

అబ్రాహాము ప్రాచీన తరానికి చెందినవాడు. అప్పడు జనసంఖ్య లేదు. కనుక ఆ కాలంలో భగవంతుడు అన్ని దేశాల్లోను అన్ని జాతుల్లోను తల్లిదండ్రులకు సంతానంమీద కోరిక పట్టించాడు. ఇప్పుడు మనం జనసంఖ్య విస్తారంగా పెరిగిపోయిన రోజుల్లో వున్నాం. కనుక ఈ కాలంలో దేవుడు తల్లిదండ్రులకు సంతానం వద్దనే కోరికను పుట్టిస్తున్నాడు.

ఆ ప్రాచీన కాలానికి చెందిన అబ్రాహాము తన ఏకైక కుమారుణీ ఏలా త్యాగం చేయగలడు? ముసలివాడు ఊతకర్రమీద ఆధారపడి నడచినట్లుగా అబ్రాహాము ఈసాకు మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ముసలివాని చేతిలోనుండి ఊతకర్రను లాగివేస్తే అతడు ఏమౌతాడు?

ఈ విధంగా ఈసాకుని బలియిూయడం అబ్రాహాముకి అన్ని విధాల కష్టమైంది. కనుక అతని దుఃఖమూ మానసిక వేదనా అంతాయింతా కాదు. ప్రభువు ఆజ్ఞ అతని విశ్వాసానికి నిజంగా పరీక్ష.

మనమైతే అమ్మో యెంత దొంగదేవుడు! బిడ్డట్టి యిచ్చినట్లేయిచ్చి మళ్ళా తీసికొనిపోతాడా అని భగవంతుణ్ణి తిట్టేవాళ్ళమే. కాని అబ్రాహాము మహా భక్తుడు. ప్రభువుని పూర్ణహృదయంతో ప్రేమించిన మహానుభావుడు. ప్రభువు ఆజ్ఞ రాత్రి కలలో విన్పించింది కదా! ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. సత్వరమే దేవుని ఉత్తరువుని పాటించాలి. కనుక అతడు తెల్లవారకముందే లేచాడు. గాడిదను ప్రయాణానికి సిద్ధంజేసాడు. దహనబలికి కట్టెలు చీల్చి మోపు కట్టాడు. కుమారుడ్డీ ఇద్దరు సేవకులనూ తీసికొని మోరీయా కొండకు బయలుదేరాడు. మూడురోజులు ప్రయాణంచేసి ఆ కొండను చేరాడు. సేవకులను కొండ క్రిందనే ఉండమని చెప్పి కుమారునితో తాను కొండ ఎక్కడం ప్రారంభించాడు.
ఈసాకు కట్టెలమోపు మోసికొని కొండ యొక్కుతూన్నాడు. అతడు భావికాలంలో ఇంకో కట్టెలమోపు మోసికొనిపోయే క్రీస్తుకి చిహ్నంగా వుంటాడు. అబ్రాహాము నిప్పూ కత్తీ తీసికొని పోతూన్నాడు.
ఈలా తండ్రీ కొడుకులు కొండ యొక్కుతూండగా ఈసాకు నాన్నా! నిప్పూ కత్తీ వున్నాయి. అసలు దహనబలికి గొర్రెపిల్ల యేదీ అని అడిగాడు. ఆ ప్రశ్న బయటికి అమాయకంగా కన్పిస్తుంది. కాని ఆ పసివాడి ప్రశ్నవల్ల అబ్రాహాము గుండె తరుగుకొనిపోయింది, అతడు నాయనా నీవే బలిపశువాతావరా అని ఈసాకుతో చెప్పాలి. కాని యేతండ్రి తన కుమారునితో అలా చెప్పగలడు? ఏ తండ్రి తన సొంత చేతులతోనే కుమారుని బలియిూయగలడు? కనుక అబ్రాహాము తన దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకొని నాయనా దహనబలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూరుస్తాడు అని బదులు చెప్పాడు.
అంతలో తండ్రీ కొడుకులు కొండశిఖరాన్ని చేరుకొన్నారు. అక్కడ అబ్రాహాము రాళ్ళతో బలి వేదికను నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. కుమారుని బంధించి కట్టెలపైనుంచి చంపడానికి కత్తిదూసాడు. ఇప్పడు ఈ కథ చదువుతూన్న మనకు ఈసాకు ఎటూ చనిపోడని తెలుసు. కాని అబ్రాహాముకి ఈ సంగతి తెలియదు. అతడు కుమారుడు బలిఔతాడన్న భావంతోనే అతన్ని చంపడానికి కత్తి యెత్తాడు. అతడు తన ప్రాణంకంటెగూడ ఈసాకుని అధికంగా ప్రేమించాడు. కాని,ఈసాకుకంటెగూడ దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు. కనుక దేవుని ఆజ్ఞను పాటించి ఈసాకుని బలియిూయడానికి వెనుకాడలేదు.
                             141 

కాని అబ్రాహాము కత్తిని చేపట్టగానే ప్రభువు ప్రత్యక్షమై ఓయీ! చిన్నవాణ్ణి చంపకు. నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన యీసాకుని నాకు బలియిూయడానికి నీవు వెనుకాడలేదు. కనుక నీవు దైవభీతి కలవాడవని రుజువైంది. నీవు నా యాజ్ఞను పాటించి నాకు విధేయుడవయ్యావు. నేను నీ విశ్వాసాన్ని పరీక్షించాను. ఆ పరీక్షలో నీవు నెగ్గావు. అదే చాలు. నేను నీ కుమారుని చావును కోరను అని చెప్పాడు.

 తర్వాత అబ్రాహాముకి ప్రక్క పొదలో కొమ్మలు చిక్కుకొని వున్న పొట్టేలు కన్పించింది. అతడు ఈసాకుని విడిపించి అతనికి బదులుగా ఆ పొట్టేలిని తీసికొనివచ్చి దేవునికి బలిగా అర్పించాడు. యూదులు దేవళంలో తమ తొలిచూలు మగబిడ్డను దేవునికి కానుకగా సమర్పించేవాళ్లు, ఓ గొర్రెపిల్లనో లేక ఓ జత పావురాళ్ళనో దేవునికి కానుకగా అర్పించి ఆ బిడ్డట్టి మళ్ళా విడిపించుకొని పోయేవాళ్ళు. తర్వాతికాలంలో భక్తిలేని యూదరాజులు కొందరు తమ బిడ్డలనే బాలుదేవతకు బలిగా అర్పించారు. యూదులకు ఈ కార్యం ఎంతమాత్రం తగదనీ, పితరుడైన అబ్రాహాము బిడ్డట్టి కాక గొర్రెపిల్లను దేవునికి బలిగా అర్పించాడు చూడండనీ రచయిత ఆనాటి యూదులను హెచ్చరిస్తున్నాడు.
ఈసాకు నాయనా దహనబలికి గొర్రెపిల్ల యేదీ అని అడిగినప్పడు అబ్రాహాము దాన్నిదేవుడే సమకూరుస్తాడని చెప్పాడు కదా! కనుక అబ్రాహాము ఆ మోరీయా ప్రాంతానికి “దేవుడే సమకూరుస్తాడు" అనే అర్థమొచ్చే పేరుపెట్టాడు. కనుక ఈ సంఘటనాన్ని పరస్కరించుకొని "కొండమీద దేవుడే సమకూరుస్తాడు" అని యూదుల భాషలో ఓ సామెత ఏర్పడింది.
నీ సంతతిని లెక్కకందని రీతిగా విస్తరిల్లజేస్తానని ప్రభువు పూర్వమే అబ్రాహాముకి ప్రమాణం చేసాడు. ఆ వాగ్దానాన్ని ఇక్కడ మళ్ళా పునరుద్దాటించాడు. ఆకాశంలోని నక్షత్రాల్లాగ, సముద్రం వొడ్డునవుండే యిసుక ముక్కల్లాగ, నీ సంతానాన్ని అసంఖ్యాకంగా పెంచుతానని దేవుడు అతనికి మళ్ళీ వాగ్దానం చేసాడు, భూమిమీది ప్రజలు నా నుండి దీవెనలు కోరుకొనేపుడు, నీకు కలిగినట్టే తమకూ శుభాలు కలగాలని కోరుకొంటారు అని చెప్పాడు. అనగా అబ్రాహాము భక్తకోటికి ఆదర్శమౌతాడు
ఆ పిమ్మట అబ్రాహాము సంతోషంతో కొండదిగి వచ్చాడు. సేవకులతో కలసి పూర్వం తాను విడిదిచేస్తూన్న బేర్షబాకు తిరిగి వెళ్ళాడు. 
                          3. ప్రార్ధనా భావాలు
1. అబ్రాహాము విశ్వాసానికి పెట్టింది పేరు. ఈ గుణం అతనిలో మూడుసార్లు వెల్లడియైంది. మొదటి పర్యాయం, దేవుడు అతన్ని పిల్చినపుడు. కాల్షియా దేశంలో దేవుడు తన్ను పిలువగానే అబ్రాహాము తన సొంత దేశాన్నీ చుట్టపక్కాలనూ వదలిపెట్టి ఈ క్రొత్త దేవుని వెంటబడివచ్చాడు - ఆది 12,1. రెండవ పర్యాయం, 
                             142 

ముసలిప్రాయంలో దేవుడు అతనికి సంతానాన్ని కలిగిస్తానని చెప్పినప్పడు. ఆ భక్తుడు తానూ సారా వృద్దులైయున్నాకూడ దేవుని ప్రమాణం ప్రకారం తమకు బిడ్డడు పుడతాడని నమ్మాడు. ఆ నమ్మకాన్ని జూచి దేవుడు అబ్రాహాముని పుణ్యపురుషునిగా గణించాడు - 15,4–6. మూడవ పర్యాయం, దేవుడు ఈసాకుని బలియిూయమని అడిగినప్పడు - 22,2. ఈ భక్తని నుండి ప్రేరణం పొంది నేడు మనమూ విశ్వాస పుణ్యాన్ని అధికంజేసికోవాలి. అబ్రాహాములాగే నేడు మనంకూడ మన విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా నిరూపించుకోవాలని చెప్తుంది యాకోబు జాబు - 221-22. నీతిమంతులు భక్తి విశ్వాసాలవలన జీవిస్తారని చెప్తుంది హబక్మూకు ప్రవచనం 2,4. కనుక మన జీవితంలో విశ్వాసపుణ్యానికి ఎంతో ప్రాముఖ్యముంది. ఆ పుణ్యానికి ప్రేరణంగా వుండేవాడు అబ్రాహాము.


2. అబ్రాహాము గాఢంగా ప్రేమించిన ఏకైక కుమారుడు ఈసాకు - ఆది - 22,2. 12, 16. అలాంటి కుమారుణ్ణి దేవుని కొరకు త్యాగం చేయడానికి అతడు వెనుకాడలేదు. ఈ రీతిగానే పరలోకంలోని తండ్రికి క్రీస్తుకూడ ఏకైక కుమారుడు. ఆ క్రీస్తుని మనకొరకు త్యాగం చేయడానికి తండ్రికూడ వెనుకాడలేదు - యోహా 3,16. ఇంకా, కట్టెల మోపు మోసికొనిపోయే ఈసాకు మరో కట్టెలమోపు మోసుకొనిపోయే క్రీస్తుకి చిహ్నంగా వుంటాడు అని చెప్పాం-ఆది 22,6. క్రీస్తు మోసికొనిపోయిన సిలువ రెండుకొమ్మలు ఒకదానిమీద వొకటి అంటగట్టగా ఏర్పడినది. కనుక అదికూడ కట్టెలమోపే. ఈలా ఈసాకు సూచించే క్రీస్తు నూత్న వేద ప్రజలమైన మనకు పరిపూర్ణ రక్షణాన్ని ప్రసాదించాలని అడుగుకొందాం.

3. దేవుడు అబ్రాహాముని పరీక్షించాడు. అతడు తన భక్తులందరినీ పరీక్షిస్తూనే వుంటాడు. మోక్షంలోని దేవదూతలూ, ఏదెను తోటలోని ఆదిదంపతులూ, యోబు, యూదా మొదలైనవాళ్ళంతా పరీక్షకు గురైనవాళ్లె.మనకుగూడ ఈ జీవితంలో పరీక్షలూ శోధనలూ తప్పవు. వాటిల్లో విజయాన్ని సాధిస్తేనేగాని మనం మోక్షానికి అరలంకాము, లేకపోతే దేవుడు మనకు వట్టినే మోక్షాన్ని ఇచ్చినట్లవుతుంది. అర్హత లేకపోయినా మనం స్వర్గాన్ని సంపాదించినట్లవుతుంది. కనుక శోధనల్లో మనం మన విశ్వాసాన్ని రుజువు చేసికోవాలి. ఈ శోధనల్లో దేవుని వరప్రసాదం మనతో వుంటుంది. ఈ బలంతోనే మనం ఈలోకంలో ఎదురయ్యే ప్రలోభాలను జయించాలి - 1కొ 10,13.

4. అబ్రాహాముకి తన ప్రాణంకంటెగూడ మిన్నయైన వాడు ఈసాకు. ముసలివాడు ఊతకర్రమీద ఆధారపడి నడిచినట్లుగా అతడు ఈసాకుమీదనే ఆశలన్నీపెట్టుకొని జీవిస్తున్నాడు. అలాంటి ఈసాకుని దేవుడు బలియిూయమని అడిగాడు. ఆ ప్రభువు

                           143 

మననుండిగూడ త్యాగాలు కోరతాడు. అతడు మనకు ప్రీతిపాత్రులైనవారిని తీసికొని పోవచ్చు. మన ఆరోగ్యాన్నీ ధనాన్నీ ఉద్యోగాన్నీ ఇంకా మనకిష్టమైన వాటినీ తీసికొనిపోవచ్చు. ఈలాంటప్పడు మనం అతనిమీద సుమ్మర్లు పడకూడదు. అబ్రాహాములా మన ఈసాకుని మనం - అనగా మనకిష్టమైనవాటిని - దేవునికి సమర్పించడానికి సిద్ధంగా వుండాలి. మన చిత్తప్రకారంగాక దేవుని చిత్తప్రకారం జీవిస్తుండాలి. చివరకు మనకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణాన్నిగూడ దేవుని చేతుల్లోకి అర్పించుకోవాలి.

                  2. సంసోను మరణం న్యాయాధి 16,4-31
                        1. సందర్భం

సంసోను న్యాయాధిపతుల్లో వొకడు. యిప్రాయేలీయులను ఫిలిస్టయుల బారి నుండి కాపాడినవాడు. అతడు చాలకాలం గొడ్రాలుగావున్న తల్లికి దైవానుగ్రహంవల్ల జన్మించినవాడు. చిన్నప్పటినుండి నాజరేయ ప్రతాన్నిపాటించి అసాధారణమైన దైవబలాన్ని పొందినవాడు. కాని అతడు స్త్రీలోలత్వం వలన తన వ్రతాన్ని భంగం చేసికొన్నాడు, తనలోని దైవబలాన్ని కోల్పోయి శత్రువులకు లొంగిపోయాడు. కట్టకడన తన తప్పలకు పశ్చాత్తాపపడి మరల దైవబలాన్ని పొంది శత్రువులను నాశంజేసాడు. వీరమరణం చెందాడు. సంసోను కథలు యిప్రాయేలు జానపద గాథలకు చెందినవి. చాలయేండ్ల పల్లెల్లో ప్రచారంలో వున్న యిూ కథలు తర్వాత బైబుల్లో కెక్కాయి.

                        2. వివరణం

ఇక్కడ మన మెన్నుకొనిన వేదపఠనంలో రెండు భాగాలున్నాయి, 4-22 వచనాలు సంసోను డెలీలాను మోహించడాన్ని గూర్చి 23-31 వచనాలు అతని మరణాన్ని గూర్చి.

తిమ్నాతు యువతితోను గాసా వేశ్యతోను కొంతకాలం గడిపినపిదప సంసోను సొరేకు లోయకు చెందిన డెలీలాను మోహించాడు. అంతకుముందే అతడు సింహాన్ని గొర్రెపిల్లనులాగ చంపాడు. గాడిద దౌడ యెముకతో వేయిమంది ఫిలిస్టీయులను వధించాడు. ఆ రోజుల్లో ఫిలిస్టయులు యిస్రాయేలీయులకు ప్రబల శత్రువులు. వారి బారినుండి యిస్రాయేలీయులను కాపాడ్డమే సంసోను ముఖ్య బాధ్యత.

ఫిలిస్టయ సర్దారులు ఐదుగురు. సంసోను విచిత్ర బలానికి కారణమేమిటో వీళ్ళకు అంతుబట్టలేదు. అతనిలో యేదో మాంత్రికశక్తి పనిచేస్తుందనుకొన్నారు. వాళ్ళు తమ జాతి ఆడపడుచైన డెలీలాకు లంచం పెట్టి ఆమె ద్వారా సంసోనును లొంగదీసు

                              144 

కోవాలనుకొన్నారు. ఐదుగురు కలసి 56వేల వెండికాసులు లంచంగా యిచ్చారు, ఆరోజుల్లో అది చాల పెద్ద సొమ్ము.

డెలీలా సంసోనుని మభ్యపెట్టి అతని విచిత్ర బలానికి కారణమేమిటని అడిగింది. అతడు పచ్చిపచ్చిగావున్న అల్లెత్రాళ్ళతో నన్ను కట్టివేస్తే నా బలంపోతుందని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాని సంసోను ఆ యల్లెత్రాళ్లను నిప్పంటుకొనిన నారత్రాళ్ళనులాగ త్రెంచివేసాడు. డెలీలా నవ్వలపాలయింది.
ఆమె మళ్ళా నీబల రహస్యమేమిటో చెప్పమని సంసోనుని నిర్బంధం చేసింది. అతడు క్రొత్తతాళ్ళతో కడితే నా బలం పోతుందని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాని సంసోను ఆ త్రాళ్లు దారాల్లాగ బ్రెంచివేసాడు. డెలీలాకు రెండవసారి ఆశాభంగం కలిగింది.
ఆమె మళ్ళా నీ యద్భుత శక్తికి కారణమేమిటో చెప్పమని అతన్ని పీడించింది. అతడు నాయేడు జడలను పడుగులాగ నేసి మేకుకి అంటగడితే నాబలం పోతుందని చెప్పాడు. డెలీలా అలాగే చేసింది, కాని అతడు తలతో ఒక్క వూపు వూపగా మేకు వూడివచ్చింది. జడలుకూడ విడిపోయాయి. ఈలా సంసోను మూడుసార్లు డెలీలాను ఆటలు పట్టించాడు.
కాని డెలీలా సంసోనుని వదలిపెట్టలేదు. నీ బలరహస్యాన్ని తెలియజేస్తేనేకాని నీకు నాపట్ల ప్రేమవుందని రుజువుకాదు అని అతనిని తొందరపెట్టింది. సంసోను డెలీలా పోరు పడలేక విసిగిపోయి చివరికి తన బలరహస్యాన్ని చెప్పివేసాడు. నేను చిన్నప్పటినుండి నాజరేయ వ్రతాన్ని చేపట్టి నా తలజట్టు కత్తిరించుకోకుండా జీవించాను. ఈ జట్టుని కత్తిరిస్తే నా బలం పోతుంది అని తన మర్మాన్ని తెలియజేసాడు

యథార్థంగా సంసోను బలం అతని జట్టులో లేదు. అతడు చేపట్టిన నాజరేయ వ్రతంలో వుంది. ఈ ప్రతాన్ని పూనినవాళ్ళు మద్యం సేవించరు. తలజట్టు కత్తిరించుకోరు. దైవసేవలో కాలం గడుపుతారు. నూత్నవేదంలో స్నాపక యోహాను ఈలాంటివాడే. ఇక్కడ సంసోను తన రహస్యాన్ని తెలియజేయడంవల్ల తన వ్రతభంగానికి తానే కారకుడయ్యాడు. తన అజాగ్రత్తవల్ల తానే నాశమయ్యాడు.

డెలీలా సంసోనుని మభ్యపెట్టి తన వాడిలో నిద్రబుచ్చి అతని జడలు ఏడింటిని కత్తెర వేయించింది, దానితో అతని బలం పోయింది. ఆ యింటిలోనే ఓ మూలన దాగుకొని వున్న ఫిలిస్టీయ దొరలు వచ్చి అతనిమీద పడ్డారు. అతడు పూర్వంలాగ తన బలాన్ని ప్రదర్శించి శత్రువులనుండి తప్పించుకొందామనుకొన్నాడు. కాని ఆ బలం అతనిలో వుంటేగా! 53 సందర్భంలో బైబులు "ప్రభువు తన్ను విడనాడాడని సంసోనకి తెలియదు" అని చెప్తుంది — 16,21. ఇది బైబుల్లోని అతి దయనీయమైన వాక్యాల్లో వొకటి. తానెంతటి దీనావస్థలో వున్నదికూడ సంసోనుకి అర్థంకాలేదు.
                                145 

జట్టు పోవడంతోనే సంసోనికి వ్రతభంగమైంది. దానితో స్వీయశక్తికూడ నశింపగా అతడు దుర్బలుడయ్యాడు. ఫిలిస్ట్రీయులు అతనిని బందీనిచేసి కండ్లు పెరికివేసి గాసాకు కొనిపోయి చెరలో వేసారు. గానుగ మానుకి కట్టివేసి అతనిచే ఆమాను తిప్పించారు. ఈ పని గాడిదో యెదో చేస్తుంది. అనగా సంసోను పశువులాంటివాడైపోయాడని భావం. ఈ విధంగా అతడు స్త్రీలోలత్వం వలన తన జటూ, బలమూ, కండల్లా, స్వేచ్చా వ్రతమూ అన్నీ కోల్పోయాడు. ఎంతటి వీరునికి ఎంత దుర్గతి! నరులు ఎంతటి వున్నత స్థాయిలో వుంటారో వారి పతనం గూడ అంత తీవ్రంగా వుంటుంది.

ఫిలిస్టీయుల దేవుడు డాగోను, వాళ్ళు ఆ దాగోనే సంసోనుని తమచేతికి పట్టియిచ్చాడనుకొని పొంగిపోయారు. కృతజ్ఞతాపూర్వకంగా డాగోను దేవళంలో ఉత్సవం జరపబూనారు. ఆ పండుగలో వాళ్ళు సంసోనుని వీరకార్యాలు చేసిచూపించమన్నారు. అతడు బందీగావుండే, బంధింపబడిన యెలుగుబంటిలాగ వాళ్ళముందు వీరకార్యాలు చేసాడు. ఆ తమాషా చూచి ఫిలుస్టీయులు ఆనందించారు.

డాగోను దేవళం రెండు పెద్ద స్తంభాలమీద నిల్చివుంది. మీది అంతస్తులో మూడువేలమంది ఫిలిస్టీయులు కూర్చుండి సంబరం జూస్తున్నారు. సంసోను క్రింద రెండు స్తంభాలమధ్య నిలచివున్నాడు. అతడు తనకు జరుగుతూన్న అవమానాన్ని భరించలేకపోయాడు. తన దుర్గతికి తానే కారకుడనని గ్రహించాడు. తన తప్పకి పశ్చాత్తాపపడ్డాడు. తన పాపాన్ని మన్నించమని ప్రభువుని వేడుకొన్నాడు. ఫిలిస్టీయులను నాశం జేయడం అతని బాధ్యత. డాగోను దేవళాన్ని కూలద్రోస్తే వాళ్లు పెద్ద పెట్టున చస్తారు. అప్పడు అతని బాధ్యత తీరుతుంది. కనుక అతడు ప్రభువుకి మనవి చేసాడు. నా తప్పిదాన్ని మన్నించి నాకు మళ్ళాపూర్వబలాన్ని ఒక్కసారి దయచేయమని వేడుకొన్నాడు. దేవుడు అతని వేడికోలు ఆలించాడు.

చెరలో వున్నప్పటినుండి సంసోను జట్టు మళ్ళా పెరుగుతూ వచ్చింది. అనగా అతని పూర్వబలం తిరిగి రాజొచ్చింది. ఈలా దైవాశీర్వాదంతో బలాఢ్యుడైన సంసోను రెండు స్తంభాలమీద రెండు చేతులుమోపి వాటిని బలంగా ముందుకి త్రోసాడు. ఆ త్రోపుకి దేవళం పెళ్ళన కూలి నేలపైబడింది. పైనున్నవాళూ క్రిందివాళూ అందరూ చచ్చారు. ఈ విధంగా శత్రువులమీద పగతీర్చుకొని సంసోనుకూడ మరణించాడు.

ఈ సందర్భంలో బైబులు "సంసోను బ్రతికివుండగా చంపినవారికంటె చనిపోతూ చంపినవారే అధికులు" అని చెప్పంది – 16,30. ఫిలిస్టీయులనుండి యిస్రాయేలీయులను కాపాడ్డానికే ప్రభువు సంసోనును ఎన్నుకొన్నాడు. కనుక వాళ్ళను నాశం చేయడం అతని పూచీ, ఈ కార్యాన్ని అతడు చనిపోతూ అధికంగా సాధించాడు. అతనిది వీరమరణం. శత్రువులను నాశంచేయడానికి అతడు స్వీయప్రాణాలనే అర్పించాడు. ఆ రీతిగా అతడు

                              146 

దైవభకుడుగా మరణించాడు. అతని వీరమరణంద్వారా యిస్రాయేలీయులకు శత్రువులనుండి విముక్తి కలిగింది.

                        3. ప్రార్థనా భావాలు

1. సంసోను దేవుని అనుగ్రహంవల్ల జన్మించినవాడు. దేవుడతనికి విచిత్రమైన బలాన్ని దయచేసాడు. యిస్రాయేలీయులకు న్యాయాధిపతినిగా నియమించాడు, ఇన్ని ప్రత్యేక వరప్రసాదాలు వున్నా అతడు స్త్రీలోలుడై చెడిపోయాడు. శత్రువులకు చిక్కి అవమానాలకు లోనై దయనీయమైన చావు చచ్చాడు. కామం చాల చెడ్డ పాపం. దానివల్ల ఉచితానుచితాలు మరిచి పశువుల్లా ప్రవర్తిస్తాం. దైవశిక్షకు గురౌతాం. ఈ దుర్గుణానికి లొంగకుండా వుండే భాగ్యం కొరకు వేడుకొందాం.

2. సంసోను చివరి క్షణంలోనైనా కన్నుతెరచి తన తప్పలను మన్నించమని దేవుని ప్రార్థించాడు. ప్రభువు అతని తప్పిదాలను మన్నించి పూర్వపు బలాన్ని దయచేసాడు. ఆ బలంతో అతడు శత్రువులను హతమార్చాడు, కాని డాగోను దేవాలయాన్ని కూల్చి శత్రువులను చంపేపడు తానుకూడ చనిపోతానని అతనికి బాగా తెలుసు. ఐనా తనజాతి శ్రేయస్సు కొరకు అతడు స్వీయప్రాణాలను సమర్పించడానికి వెనుకాడలేదు. అతనిది వీరమరణం. జీవితంలో పెద్ద పొరపాట్లు చేసినా కడన భక్తితో మరణించడం గొప్ప భాగ్యం. ఈ భాగ్యం కొరకు వేడుకొందాం.

3. నూత్నవేదంలో హెబ్రేయుల జాబు సంసోనుని భక్తిమంతుల్లో వాకనిగా పేర్కొంటుంది—11,32. పాపపు జీవితం గడిపినా ప్రభువుకి మొరపెట్టి ప్రభువుని నమ్మి చనిపోవడం వల్లనే అతడు భక్తిమంతుడయ్యాడు. ఈ భక్తి మనకుకూడ అలవడాలని వేడుకొందాం.

                     3. సమూవేలుకి పిలుపు - 1 సమూ 3
                         1. సందర్భం
ఎల్మానా భార్య అన్నా ఆమెకు చాలయేండ్లపాటు సంతనాం కలగలేదు. కనుక ఏటేట షిలో దేవళానికి వెళ్ళి ప్రభువుని ప్రార్ధించేది. ఓసారి ఆమె దేవాలయానికి వెళ్ళి ప్రభూ! నాకు ఒక మగబిడ్డను ప్రసాదించావంటే వాణ్ణి ఆమరణాంతం నీ సేవకే సమర్పించుకొంటానని మొక్కుకొంది. అన్నా కోరినట్లే దేవుడు ఆమెకు ఓ బిడ్డను దయచేసాడు. అన్నా అతనికి సమూవేలు అని పేరు పెట్టింది. మూడేండ్ల యిూడున ఆ
                           147 

బాలుని షిలో దేవళంలో కానుకగా అర్పించింది. అప్పడు షిలొలొ పెద్ద గురువు ఏలీ. అతని కుమారులు ఫీనెహాసు హోప్నికూడ అక్కడే యాజకులు. సమూవేలు ఈ దేవళంలోనే పెరుగుతూ కోవెలలో ఏలీకి సహాయం చేస్తూండేవాడు.

                               2. వివరణం

సమూవేలుకి ఇంచుమించు 12 ఏండ్ల యిూడు వచ్చినప్పడు దేవాలయంలో దేవుడు దర్శనమిచ్చాడు. ఆ రొజుల్లో యిస్రాయేలు ప్రజలు దేవుని సందేశం వినాలని ఉవ్విళ్ళూరిపోతున్నారుగాని ఆ సందేశాన్నితెలియజెప్పే ప్రవక్తలెవరూ లేరు. ఏలీ యాజక కుటుంబం పాపకార్యాల్లో మునిగి తేలుతూంది. ఆ కుటుంబాన్ని జూచి ప్రభువు ప్రజల మీద కోపించి వారికి తన దివ్యవాణిని విన్పించలేదు.

అప్పటికే యేలీ ముదివగు. అతనికి కంటిచూపుగూడ మందగించింది. ఓనాటిరాత్రి అతడు దేవళంలోని మధ్య భాగంలో పండుకొని నిద్రిస్తూన్నాడు. సమూవేలు గర్భాగారంలో మందసంవద్ద పండుకొని నిద్రపోతూన్నాడు. మందసం కొయ్యపెట్టె దానిలో ప్రభువ మోషేకు వ్రాసియిచ్చిన రెండు రాతిపలకలు వుండేవి. ఈ పెట్టె పూర్వవేదకాలంలో దైవసాన్నిధ్యం. ఈ పెట్టెదగ్గర రాత్రంతా దీపం వెలుగుతుండేది. ఆ దీపంలో చమురు ఐపోయినప్పడల్లా మళ్ళా చమురు పోవడం సమూవేలు పని. అందుకే అతడు గర్భాగారంలో పండుకొని వున్నాడు. ఆ రాత్రి వేకువజామున ప్రభువు సమూవేలుని పేరుపెట్టి పిల్చాడు. బాలుడు గబాలున లేచి యేలీయొద్దకు పరుగెత్తుకొని వెళ్ళి అయ్యా పిల్చావా ఇదిగో వచ్చాను అన్నాడు. ఏలీ నాయనా నేను నిన్ను పిలువలేదు వెళ్ళి పండుకో అన్నాడు. ఈ విధంగా మూడుసార్లు జరిగింది. సమూవేలుకి ఇంకా ప్రభువునిగూర్చి తెలియదు. అనగా ప్రభువు అతన్నింకా తన ప్రవక్తనుగా చేసికోలేదు. అతనికింకా దేవునితో సన్నిహితమైన సంబంధం కలగలేదు. కనుక సమూవేలు మూడుసార్లు ఏలీయే తన్నుపిలుస్తున్నాడనుకొని పొరపాటుపడ్డాడు.
మూడవసారి యేలీకి అర్థమైంది. అపరాత్రిలో దేవళంలో పిల్లవాణ్ణి ఎవరు పిలుస్తారు? దేవుడే పిల్చివుండాలి. కనుక అతడు సమూవేలుతో నాయనా ఆ స్వరం నీకు మల్లా విన్పిస్తే "అయ్యా! నీ దాసుడ్డి సెలవీయి. నేను నీవు చెప్పినట్లే చేస్తాను అని పల్కు ఆ స్వరం నీతో చెప్పిన సందేశాన్నితెల్లవారిన తర్వాత నాకు తెలియజేయి" అని బోధించాడు.
ప్రభువు రాత్రి దేవళంలో నాల్గవసారి సమూవేలూ అని పిల్చాడు. బాలుడు వెంటనే లేచి అయ్యా నీ దాసుణ్ణీ సెలవీయి. నేను నీవు చెప్పినట్లే చేస్తాను అని పల్కాడు. దేవుడు అతనికి తన సందేశం విన్పించాడు. ఆ సందేశం ఇది. ఏలీ కుమారులిద్దరు పరమ దుర్మార్డులు. వాళ్ళు దేవళంలో చేసే ఆగడాల వల్ల దేవునికి అపకీర్తి కలుగుతూంది. ఏలీ వాళ్ళను అదుపులో పెట్టలేదు. కనుక ప్రభువు ఆ కుటుంబాన్ని సమూలంగా
                              148 

నాశంచేయబోతున్నాడు. ఇక ఏలాంటి బిలులర్పించినా అవి ఏలీ కుటంబపు పాపాలకు ప్రాయాశ్చిత్తం చేయలేవు.

ఉదయాన్నే సమూవేలు కోవెల తలుపులు తీసి దేవాలయం మధ్యభాగంలోకి వచ్చాడు. అక్కడ యేలీ అతన్నికలసికొని బాబూ! దేవుడు నీకు ఏమి సందేశం చెప్పాడో తెలియజేయమన్నాడు. సమూవేలు మొదట దడిసాడు. కాని యేలీ ఒట్టపెట్టుకొని అడిగినందున దేవుడు తనకు వివరించిన ఉదంతమంతా తెలియజేసాడు. ఏలీ వినయంతో దేవుని చిత్తానికి లొంగాడు, నాయనా! నీతో మాట్లాడింది ప్రభువే. అంతా ఆయన సంకల్పించుకొన్నట్లే జరుగుతుంది. ప్రభువుకి అడ్డురావడానికి నేనెవడ్డి అన్నాడు.

పై దర్శనంలో ప్రభువు సమూవేలుని గూర్చి యేమీ చెప్పలేదు. ఐనా ఆ దర్శనంలోనే అతడు దేవుని ప్రవక్త అయ్యాడు. ఇక దేవుడు అతనిద్వారా మాటలాడ్డం మొదలెట్టాడు. కనుక సమూవేలు పలికిన పలుకులన్నీ నెరవేరాయి. కావున ఉత్తరాదినుండి దక్షిణాది వరకు గల యిస్రాయేలు ప్రజలంతా సమూవేలు దేవుని ప్రవక్త అయ్యాడని గ్రహించారు. అటుతరువాత ప్రభువు షిలో దేవళంలో సమూవేలుకి చాలసార్లు దర్శనమిచ్చాడు. చాలసారులు అతనికి తన సందేశాన్ని విన్పించాడు. ఆ సందేశాన్ని సమూవేలు ప్రజలకు తెలియజేస్తుంటేవాడు. ఈ విధంగా ఏలీ కాలంలో ప్రజలతో మాటలాడ్డం మానివేసిన ప్రభువు, ఇప్పడు సమూవేలు ద్వారా మళ్ళా మాటలాడ్డం మొదలెట్టాడు. అతని ద్వారా యావే దివ్యవాణి దేశంలో పుష్కలంగా విన్పించింది.

ఆ రోజుల్లోయిస్రాయేలీయులకు ప్రబల శత్రువులు ఫిలిస్ట్రీయులు. వారికీ వీరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏలీ కుటుంబమంతా నాశమైంది. ఏలీకి బదులు సమూవేలేషిలో దేవళంలో యాజకుడయ్యాడు. అతడు యాజకుడు, ప్రవక్త. న్యాయాధిపతి, యుద్ధవీరుడు. యిప్రాయేలీయులను చాల యేండ్లపాటు దైవమార్గంలో నడిపించిన మహాభక్తుడు. 

యిస్రాయేలు దేశంలో మొదట రాజపదవిని నెలకొల్పినవాడు సమూవేలే. అతడు మొదట సౌలుని రాజుగా అభిషేకించాడు. ఆ రాజు దేవుని మాట వినక భ్రష్టుడైపోతే సమూవేలు దావీదుని రెండవరాజుగా అభిషేకించాడు. తన తల్లి అన్నా కోరుకొన్నట్లే అతడు ఆమరణాంతం దేవుని సేవకుడుగానే జీవించాడు - 1సమూ 1,11. పూర్వవేదంలోని మహాభక్తుల్లో సమూవేలు ఒకడు,

                        3. ప్రార్థనా భావాలు
1. సమూవేలు ఆలించిన మొదటి దైవోక్తి ఏలీ కుటుంబం వినాశాన్ని గూర్చి ఏలీ పాప కుటుంబం యుద్ధంలో నాశమైంది. తర్వాత ఏలీకి బదులుగా సమూవేలే దేవళంలో యాజకుడయ్యాడు. అపవిత్రుడైన గురువుకి బదులుగా పవిత్రుడైన శిష్యుడు వచ్చాడు. 
                            149 

ఎప్పుడు కూడ పాపపు మూకకు దేవుడు మొదట శిక్షాప్రవచనాలు విన్పిస్తాడు. ఆ మీదట రక్షణ ప్రవచనాలు విన్పిస్తాడు. ఏలీ జీవితంలో ఈలాగే జరిగింది. నేడు మన జీవితంలోను ఈలాగే జరుగుతుంది. కనుక మొట్టమొదట మనం దేవుని యెదుట మన పాపాలకు పశ్చాత్తాపపడాలి. పశ్చాత్తాపానంతరంగాని అతని రక్షణను పొందలేం.

2. దేవుడు సమూవేలుని పిల్చిన తీరుగూడ మననం జేసికోదగ్గది. అతడు పూర్వం తన భక్తులను నేరుగా పిల్చాడు. సమూవేలు యెషయా యిర్మియా పౌలు మరియు మొదలైనవాళ్ళను దర్శనాల ద్వారా ప్రత్యేకంగా పిల్చాడు. కాని నేడు మన పిలుపు ప్రత్యక్షంగా గాక పరోక్షంగా వుంటుంది. అనగా మన హృదయంలో ఓ విధమైన కోరిక పుట్టించి ఆ కోరికద్వారా దేవుడు మనలను తన సేవకు పిలుస్తాడు. ఈ పిలుపుకొందరి విషయంలో ఐతే, గురు కన్యాజీవితాలు గడపడానికి. మరికొందరి విషయంలో ఐతే, భక్తిగల సంసారజీవితం గడపడానికి. ఐనా ఈ రెండూ దైవపిలుపులే. ఈ రెండురకాల పిలుపుల్లోను మనకు దైవదర్శనాలు కలగవు. హృదయంలో పుట్టే కోరికలు చాలు. ఆ సమూవేలులాగే మనంకూడ నేడు మన జీవితంలో దేవుని పిలుపుని ఆలించాలని వేడుకొందాం.

3. సమూవేలు రాత్రి గర్భాగారంలో దైవమందసం వద్ద పండుకొని వుండగా అతనికి దేవుని స్వరం విన్పించింది. దైవమందసం దైవసాన్నిధ్యం. దైవోక్తులు విన్పించే తావు. సమూవేలు పవిత్రమైన వాతావరణంలో వున్నప్పడు అతనికి దేవుని పల్కులు విన్పించాయి. నేడు మనకుగూడ దేవుడు తన సందేశాన్ని విన్పిస్తాడు. అతడు మన అంతరాత్మలో మాటలాడతాడు. కాని అతని స్వరాన్ని వినాలి అంటే మన తరపున మనం పవిత్రమైన వాతావరణంలో వుండాలి. బైబులు పఠించాలి. ప్రార్ధన చేసికోవాలి. దేవళానికి వెళ్ళి దేవుణ్ణి పూజించుకోవాలి. దేవద్రవ్యానుమానాలను స్వీకరించాలి. సోదరప్రేమతో సేవాభావంతో జీవించాలి. ఈలా దేవునితో పరిచయం కలిగించుకొని పవిత్ర వాతావారణంతో జీవిస్తుంటే మనకు దైవస్వరం విన్పిస్తుంది. కేవలం లౌకిక జీవితము గడిపేవాళ్ళకు దేవుని స్వరం విన్పించదు. దేవునివల్ల ప్రభావితులం కావాలి అంటే మొదట మనకు అతనిమీద భక్తి కుదరాలి.

4. సమూవేలు దైవసందేశాన్ని విన్పింపగా యేలీ ఆయన చేయదలుచుకొన్న కార్యం చేయునుగాక అన్నాడు. అతడు తన కుటుంబం నాశంగావడానికి సమ్మతించాడు. దేవునిమీద సుమ్మర్లు పడలేదు. దేవుని చిత్తాన్ని గుర్తించి ఆ చిత్తప్రకారం జీవించడం యూదుల ముఖ్యభక్తి. మనంకూడ ఈ భక్తిని అలవర్చుకోవాలి, మన చిత్తప్రకారం మనం జీవించక దేవుని చిత్తప్రకారం జీవించడం అలవాటు చేసికోవాలి. జీవితంలో ఆయా ముఖ్య నిర్ణయాలు చేసికొనేపుడు దేవుణ్ణి సంప్రతించి చూడాలి. 5. ఇది చాల మంచిక. కథ జరిగిన స్థలం దేవాలయం. సమయం ప్రశాంతమైన వేకువవేళ. నిశ్శబ్ద వాతావరణం. దైవసందేశాన్ని విన్నది నిర్మల మనస్ముడైన పసిబాలుడు. మాట్లాడినది ప్రభువు. ఈలా కథంతా పవిత్రమైన వాతావరణంలో జరిగిపోయింది. కనుక మనం ఈ సంఘటనను బైబులునుండి పదేపదే చదువుకొని పవిత్రమైన దేవుని సందేశాన్ని వినడానికి సిద్ధంకావాలి. ప్రభువు దివ్యవాణి ఆనాడు సమూవేలుని వలె నేడు మనలనుగూడ ప్రభావితులను జేస్తుంది.

                  4. ప్రభువు సౌలుని నిరాకరించడం 
                       - 1సమూ 15
                       1. సందర్భం
ప్రభువు సౌలుని మొదటి రాజుని చేసాడు. కొంతకాలమయ్యాక సౌలుకి పొగరెక్కి దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుడు అతని రాజపదవినుండి త్రోసివేసాడు. అవిధేయత పెద్ద పాపమని సౌలుకథ తెలియజేస్తుంది.
                        2. వివరణం

సమూవేలు సాలు దగ్గరికి వచ్చి "పూర్వం నేనే నిన్ను రాజునిగా అభిషేకించానుకదా! కనుక నీవు నా పలుకులు ఆలించు. అమాలెకీయులను సర్వనాశం చేయమని ప్రభువు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు వాళ్ళను శాపంపాలుచేయాలి" అని చెప్పాడు. శాపం పాలుచేయడమంటే యుద్ధంలో గెల్చినవాళ్ళు ఓడిపోయినవాళ్ళను స్త్రీలు పిల్లలతోసహా వధించడం. వారి పశువులను ఆస్తులను నాశంచేయడం. ఇది క్రూరకార్యం కాదా? ప్రాచీనకాలంలో కనాను దేశానికి చుట్టుపట్ల వసించే జాతులన్నీ యుద్ధంలో ఓడిపోయిన తమ శత్రువులను శాపంపాలుచేసి నాశం చేసేవి. కనుక ఇక్కడ యావే ప్రభువుకూడ ఈ పద్ధతినే అనుసరించాడు.

అమాలెకీయులు యిస్రాయేలీయులకు పూర్వం శత్రువులు. యూదులు ఐగుప్తనుండి తరలివచ్చేపుడు ఈ ప్రజలు వారికి కీడు చేసారు. కనుక ప్రభువు వాళ్ళను నాశం చేయగోరాడు - ద్వితీ 25, 17-19. సౌలు ఈ కార్యాన్ని నెరవేర్చడానికి అంగీకరించాడు.

ఆ రోజుల్లో కేనీయులనే మరోజాతివాళ్ళుకూడ అమాలెకీయులతో కలసి జీవిస్తుండేవాళ్ళు ఈ కేనీయులు యిప్రాయేలీయులకు మిత్రులు. కనుక సౌలు మొదట వాళ్ళను అమాలెకీయులనుండి విడదీసి ప్రక్కకు పంపాడు. ఆ రీతిగా వాళ్ళు చావుని తప్పించుకొన్నారు. సౌలు యద్ధంలో అమాలెకీయులను ఓడించి చంపివేసాడు. కాని వారి రాజైన అగాగును మాత్రం చంపలేదు. తన విజయచిహ్నంగా అతన్ని బ్రతికి వుండనిచ్చాడు. ఇంకా సౌలు అనుచరులు అమాలెకీయుల బక్కగొడ్లనుచంపి పేసి బలిసినవాటిని మిగుల్చుకొన్నారు. కనుక సౌలు అతని సైనికులు అమాలెకీయులను శాపంపాలు చేయాలి అన్నయావే ఆజ్ఞను ఖండితంగా పాటించలేదు. తమకు లాభంగా వున్నంతవరకు శత్రువుల పశువులను దక్కించుకొన్నారు.

కావున ప్రభువు సమూవేలుకి ఫిర్యాదు చేసాడు. సాలు నా యాజ్ఞలను ధిక్కరించాడు. నేనతన్ని రాజుని చేసినందులకు విచారిస్తున్నాను అన్నాడు. సౌలుని క్షమించమని సమూవేలు రాత్రంతా ప్రభువుకి మొరపెట్టాడు. కాని ప్రభువు అతని వేడికోలు ఆలించలేదు.

సమూవేలు సౌలుని చూడబోయి గిల్లాలు పుణ్యక్షేత్రంలో అతన్నికలసికొన్నాడు. సౌలు నేను యావే ఆజ్ఞ పాటించి అమాలెకీయులను నాశంచేసానని డంబాలు పల్మాడు. కాని ప్రవక్త అతన్ని నిలదీసి మీరు శత్రువుల పశువులనుండి బలసిన యెడ్లను గొర్రెలను దక్కించుకొన్నారు. మరి ప్రభువు ఆజ్ఞను పాటించిందెక్కడ అని ప్రశ్నించాడు. కాని రాజు మేము వీటిని ప్రభువుకి బలి యిూయడానికే అట్టిపెట్టుకొన్నామని బూకరించాడు.

ఆ మాటలకు సమూవేలు కోపం తెచ్చుకొని రాజుతో “వట్టి బలులవలన యావేకు ప్రీతి కలుగుతుందా? విధేయత వలన కాదా? బలులకంటె విధేయత గొప్పదికాదా? గర్వంతో దేవునిమీద తిరుగుబాటుచేస్తే సోదె చెప్పించుకొన్నంత పాపం. విగ్రహాలను పూజించినంత నేరం. నీవు యావే ఆజ్ఞను త్రోసిపుచ్చావు కనుక ప్రభువు నీ రాజపదవిని త్రోసివేసాడు" అని పల్మాడు.

ప్రవక్త చెప్పినట్లు, బలికంటె విధేయత గొప్పది. ఎందుకంటె బలి వట్టి బాహ్యక్రియ. హృదయంలో భక్తి లేకున్నా దాన్ని సమర్పించవచ్చు. కాని హృదయంలో భక్తిలేందే విధేయత చూపలేం. కనుక సౌలు బలి అర్పించడానికి పూనుకోవడంకంటె దేవునిపట్ల విధేయత చూపడం లెస్స.

అసలు దేవుడు సౌలుని బలి సమర్పించమని కోరనే లేదు. అమాలెకీయులను శాపంపాలు చేయమన్నాడు అంతే. సౌలు ఈ యాజ్ఞను మీరాడు, అతడు దేవుణ్ణి తనకిష్టమెచ్చిన పద్ధతిలో పూజించవచ్చుననుకొన్నాడు. అనుచరుల మన్ననను సంపాదింపగోరి వారిని తమ యిష్టం వచ్చినట్లు చేయనిచ్చాడు. అది అతని తప్ప.

సౌలు దేవుని ఆజ్ఞమీరి అతని మీద తిరుగుబాటు చేసాడు. తన్ను పైకి తీసికొనివచ్చిన దేవునిపట్ల గర్వాన్ని ప్రదర్శించాడు. ఈ యహంకారం విగ్రహాలను పూజించినంత పాపం. సోదె చెప్పించుకొన్నంత నేరం. సౌలు ప్రభువుని నిర్లక్ష్యంచేసి అతని ఆజ్ఞను త్రోసి వేసాడు. యావేకూడ సౌలుని రాజపదవినుండి త్రోసి వేసాడు. ఇక అతనికి బదులుగా దావీదు రాజవుతాడు.

ఈ 15వ అధ్యాయాన్ని కూర్చిన రచయిత రెండు సంప్రదాయాలను ఒకదాని ప్రక్కన ఒకటి చేర్చాడు. 24-29 వచనాల ప్రకారం సమూవేలు సౌలుతో బలికి వెళ్ళలేదు. 30-31 వచనాల ప్రకారం వెళ్లాడు.

మొదట తొలి సంప్రదాయాన్ని చూద్దాం, ప్రవక్త చీవాట్లు పెట్టగా కట్టకడన సౌలు తన తప్పని ఒప్పకొన్నాడు. సైనికులకు మోమోటపడి వారు పశువులను దక్కించుకోడానికి అనుమతినిచ్చానని అంగీకరించాడు. తనతోపాటు బలినర్పించడానికి ప్రవక్తను గిల్లాలునకు రమ్మని వేడుకొన్నాడు. ప్రవక్త అతని వేడుకోలును తిరస్కరించి ప్రక్కకు తొలగిపోతూండగా సౌలు అతని అంగీ చెంగును పట్టుకొన్నాడు. ఈలా చేయడం సౌలు అణకువకు చిహ్నం. ప్రవక్తను బతిమాలడానికి గురుతు. కాని ప్రవక్త గబాలున వెళ్ళిపోబోగా అతని అంగీ చెంగు చినిగింది. ఈలా చినగడం సౌలు రాజ్యం చినిగిపోయిందనడానికి గుర్తు. కనుకనే ప్రవక్త యిక్కడ "ప్రభువు యిస్రాయేలు రాజ్యాన్ని నీ చేతినుండి లాగివేసి నీకంటె యోగ్యుడైన వాడికి ఇచ్చివేసాడు" అని చెప్పాడు. ఈ యోగ్యుడైనవాడు దావీదే. 

ఇస్రాయేలీయులకు దీపమైన ప్రభువు రాజ్యపదవిని నెలకొల్పినందులకు విచారించలేదు. అది యికమీదట దావీదుద్వారా కొనసాగుతుంది.

ఇక రెండవ సంప్రదాయం ప్రకారం (30-31) తన వెంట గిల్లాలు బలికిరమ్మని రాజు సమూవేలుని బతిమాలాడు. యిప్రాయేలు పెద్దలమందు తన పరువు నిలబెట్టమని వేడుకొన్నాడు. సమూవేలు అలాగే గిల్లాలుబలిలో పాల్గొన్నాడు. 

ఈ యధ్యాయం చివరలో అమాలెకీయుల రాజయిన అగాగు మరణవృత్తాంతం వస్తుంది. అతడు సౌలు తన్ను చంపలేదు కనుక మరణాన్ని తప్పించుకోవచ్చుననుకొన్నాడు. మరణభయం తీవ్రత తగ్గిందనుకొన్నాడు. కాని సమూవేలు అతన్ని గిల్లాలు బలిపీఠం దగ్గరికి రప్పించాడు.

అతనితో ఓరి! పూర్వం నీ కత్తివలన చాలమంది తల్లలు తమ బిడ్డలను కోల్పోయారు. ఇప్పడు నా కత్తివలన నీతల్లికూడ తన బిడ్డణ్ణి కోల్పోతుంది" అన్నాడు. బలిపీఠం ముందట, యావే యెదుట, అతన్ని బలిపశువును లాగ ముక్కలు ముక్కలుగా నరికివేసాడు. ఈలా సౌలు చేయవలసిన పనిని ప్రవక్షే చేసి ముగించాడు. 

తర్వాత సౌలు గిల్బోవా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిమ్మట దావీదు రాజయ్యాడు. ఈ రీతిగా సమూవేలు ప్రవచనం నెరవేరింది.

                        3. ప్రార్ధనా భావాలు

1. సౌలు దేవుని ఆజ్ఞను మీరాడు. అతడు ఆగాగుని చంపలేదు. బలిసిన పశువులను వధింపలేదు. దేవుడు అడగక పోయినా బలిని అర్పించడానికి పూనుకొన్నాడు. తన అనుచరుల వత్తిడికి లొంగిపోయాడు. ప్రభువుకి అవిధేయుడయ్యాడు. అతన్ని పూర్ణహృదయంతో సేవించలేదు. ఈలాంటి అరకొర భక్తి దేవునికి నచ్చదు. కనుకనే ప్రభువు అతన్ని రాజపదవినుండి త్రోసివేసాడు. నేడు మన భక్తి, మన విధేయత ఏలా వున్నాయి? అతడు ఎన్నో సారులు మనలను మన స్థానంనుండి త్రోసివేయవలసింది కదా!

2. ప్రవక్త దేవుని స్థానంలో వుండేవాడు. దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజెప్పేవాడు. కనుక అతని ఆజ్ఞ మీరితే దేవుని ఆజ్ఞ మీరినట్లే కావుననే మన కథలో రాజు ప్రవక్త ఆజ్ఞ మిరితే దేవుని తన ఆజ్ఞ మీరినట్లే భావించాడు. అతన్ని రాజపదవినుండి త్రోసివేసాడు. రాజుల గ్రంధాల్లో తరచుగా రాజులకీ ప్రవక్తలకీ ఘర్షణలు వస్తుంటాయి. రాజులు ప్రవక్తల ఆజ్ఞలు మీరి పాపం కట్టుకొంటారు. కాని నేడు మనం మన పెద్దల ఆజ్ఞలను ఎంతవరకు పాటిస్తున్నాం? వారి ద్వారా విన్పించే దేవుని మాటలను ఎంతవరకు లెక్కచేస్తున్నాం?

3. దేవుడు సౌలుని రాజపదవినుండి త్రోసివేసాడు. ఇది ఘోరమైన కార్యం. ఇక ప్రభువు సౌలుని మన్ననతో జూడడు. అతనికి బదులుగా దావీదుని ఆదరిస్తాడు. సౌలు మొదటి రాజయి పాముకుందేమిటి? దేవుని ఆదరాన్ని కోల్పోవడం, అతనిచే తిరస్కరించబడ్డం, ఎంత దౌర్భాగ్యం! కాని మనం పాపకార్యాలు చేసినపుడు దేవుడు మనలను మాత్రం త్రోసివేయడం లేదా? పాపం వలన దేవుని ఆదరాభిమానాలను కోల్పోయి మనంమాత్రం దౌర్భాగ్యులం కావడంలేదా?

4. సౌలు అనుచరులు వత్తిడికి లొంగిపోయాడు. వాళ్ళు బలసిన పశువులను దక్కించుకొంటూంటే చూస్తూ వూరకున్నాడు. అతడు అనుచరుల అభిమానాన్ని సంపాదింపగోరి దేవుని అభిమానాన్ని కోల్పోయాడు. మనంకూడ మనకిష్ణులైన వారి అభిమానాన్ని పొందగోరి చేయరాని పనులు చేస్తాం. చేయవలసిన పనులు చేయం. దీనివలన దేవునికి కోపం రప్పిస్తాం, అతని అభిమానాన్ని కోల్పోతాం. ఇది పరమ దౌర్భాగ్యం.

                     5. దావీదుకు అభిషేకం 
                       1సమూ 16,1=18
                        1. సందర్భం
సౌలు అవిధేయుడై దేవుని ఆజ్ఞ మీరాడు. కనుక దేవుడు అతన్ని రాజపదవినుండి త్రోసివేసాడు. అతనికి బదులుగా దావీదుని రెండవరాజుగా ఎన్నుకొన్నాడు. నేను ఈషాయి

కొడుకుల్లో ఒకడ్డి రాజుగా ఎన్నుకున్నాను, నీవు వెళ్ళి అతనికి అభిషేకంచేయి అని సమూవేలు ప్రవక్తను బేల్లెహేముకి పంపాడు.

                       2. వివరణం

సౌలు అంటే సమూవేలుకి ఇష్టం. అతడు రాజపదవిని కోల్పోవడంజూచి సమూవేలు బాధపడ్డాడు. పైగా సమూవేలు రెండవరాజుకి అభిషేకం చేయబోతున్నాడని తెలిస్తే సౌలు ఊరకుంటాడా? కనుక సమూవేలు భయపడ్డాడు.

ప్రభువు సౌలుకి ఉపాయం చెప్పాడు. నీవు ఓ ఆవు పెయ్యను తోలుకొనిపో, బలిని అర్పించేవాడిలగ బెత్లెహేo వెళ్ళు. విందు సందర్భంలో నేనెన్నుకొన్నవాణ్ణి రాజుగా అభిషేకించు. సౌలుగాని మరెవ్వరుగాని ఈ రహస్యాన్ని తెలిసికోలేరు అని చెప్పాడు.

యీషాయికి ఎన్మిదిమంది కొడుకులు. దేవుడు వాళ్ళల్లో ఎవడ్డి రాజుగా ఎన్నుకొన్నాడో ప్రవక్తకు తెలియదు. అతడు దేవుని ఆజ్ఞప్రకారం తైలప కొమ్మను తీసికొని ఆవుపెయ్యను తోలుకొని బేల్లెహేముకి వచ్చాడు.

సమూవేలుని చూడగానే ఆ వూరి పెద్దలకు భయం వేసింది, అతని వాక్కు దీవెననూ శాపాన్ని గూడ తెచ్చిపెడుతుంది. ఇప్పడు అతడు బెత్లెహేము వాసులను దీవించడానికి వచ్చాడా లేక శపించడానికి వచ్చాడా? పైగా అతడు రాజులను చేసేవాడు, రాజులను కూలద్రోసేవాడు. అతని వల్ల ఈ గ్రామానికి ఏమి కీడు రానున్నదో!

సమూవేలు పురజనులకు భయపడవద్దని చెప్పాడు. మీరందరూ స్నానంచేసి శుద్ధిని పొంది బలికిరండని వారిని ఆహ్వానించాడు. యీషాయినీ అతని కుమారులనూ స్నానంతో శుద్ధిచేయించి ఆవుపెయ్యను బలియిూయడానికి పూనుకొన్నాడు.

రెండవరాజును అభిషేకించే సమయం వచ్చింది. యిూషాయికి ఎన్మిదిమంది కొడుకులు, వారిలో ఎవరిని రాజుగా అభిషేకించాలా అని సమూవేలు ఆలోచిస్తున్నాడు.

పెద్దకొడుకు ఎలీయాబు. అతడు రూపసి. పొడుగరి. సౌలుకీ అతనికీ ఆకారంలో పోలికలున్నాయి. పైగా యూదుల సంప్రదాయం ప్రకారం, ఇంటిలో పెద్ద కొడుక్కికొన్ని ప్రత్యేక హక్కులుంటాయి. తండ్రి ఆస్తిలో అతనికి రెండువంతులు వస్తుంది. తండ్రి ఇంటివద్ద లేనప్పడు అతడు తండ్రి స్థానాన్ని పొంది తమ్ముళ్ళను ఆజ్ఞాపిస్తాడు. కనుక దేవుడు పెద్దకొడుకైన యెలీయాబునే రాజుగా ఎన్నుకొనివుండాలనుకొని సమూవేలు అతనికి అభిషేకం చేయబోయాడు. కాని దేవుడు సమూవేలుని వారించి నరులైతే వెలుపలి రూపాన్ని జూచి మురిసిపోతారు. నేనైతే హృదయాన్ని పరిశీలిస్తాము. ఈ యెలీయాబు నాకు నచ్చలేదని చెప్పాడు. తర్వాత ఇతర కుమారులైన అబీనాదాబు, షమ్మా మొదలైనవాళ్ళంతా పుట్టుక క్రమంలో సమూవేలు దగ్గరికి వచ్చారు. కాని ప్రభువు వాళ్ళనెవరినీ ఎన్నుకోకపోవడంచే సమూవేలు వారికి అభిషేకం చేయలేదు.

ప్రవక్తకు అనుమానం కలిగింది. ప్రభువు ఈ యేడురు కొడుకుల్లో ఎవరినీ ఎన్నుకోలేదు. కనుక యీషాయికి ఇంకా కొడుకులు వుండివుండాలి. అందుచే ప్రవక్త నీ కుమారులంతా వీళ్లేనా అని అడిగాడు. తండ్రి అయ్యా! కడగొట్టవాడు ఇంకొకడున్నాడు. వాడు ఇంటిపట్టునలేడు. పొలంలో గొర్రెలు మేపుకొంటున్నాడు అని చెప్పాడు. ప్రవక్త అతన్ని శీఘ్రమే పిలిపింపమని తండ్రిని ఆదేశించాడు. తండ్రి పిలుపుపై దావీదు పొలంనుండి ఇంటికి వచ్చాడు.

దావీదు చూడ్డానికి ఆకర్షణీయంగా వున్నాడు. అతడు రాగానే ప్రభువు సమూవేలుతో నేను కోరుకొన్నవాడు ఇతడే అని చెప్పాడు. కనుకనే సమూవేలు విందు సమయంలో అన్నల యెదుట దావీదుకు ఏకాంతంగా అభిషేకం చేసాడు. అనగా పొట్టేలు కొమ్మకివున్న బిరడాను తొలగించి దానిలోని ఓలివచమురుని దావీదు తలపై కుమ్మరించాడు. యిస్రాయేలు ప్రజల రాజులకీ యాజకులకీ తైలాభిషేకం చేసేవాళ్ళ దీనివల్ల అభిషిక్తునికి దైవశక్తి లభించేది. ఇక్కడ ఈ యభిషేకం ద్వారానే దావీదు రెండవ రాజయ్యాడు. వెంటనే దేవుని ఆత్మ దావీదు మీదికి దిగివచ్చింది. ఈ యాత్మ యుద్దాత్మ ఆ రోజుల్లో యిస్రాయేలుకు ప్రబల శత్రువులు ఫిలిస్టీయులు.యిస్రాయేలు రాజు వారితో యుద్ధాలు చేయాలి. కనుక ఈ యాత్మ దావీదుకి యుద్దాల్లో నేర్పు ధైర్యసాహసాలూ దయచేసింది.

ఈ యభిషేకం సమూవేలు దావీదుకి బెల్లెహేమున రహస్యంగా చేసింది. దీన్ని గూర్చి ఇతరుల కెవరికీ తెలియదు. తార్వత యూదీయులూ యిస్రాయేలీయులూకూడ దావీదుకి హెబ్రోనున బహిరంగంగా అభిషేకం చేస్తారు - 2సమూ 2,4, 5,3, ఈ యభిషేకాలన్నీ ముగిసాక, సౌలు గిల్బోవా యుద్ధంలో చనిపోయాక, ఇంకా చాలయేండ్ల తర్వాతగాని దావీదు రాజ్యపాలనానికి పూనుకోలేదు.


{{center

3. ప్రార్ధనా భావాలు

}}
1. ప్రభువు ఎన్నిక ఆశ్చర్యకరంగా వుంటుంది. అతడు ఏడుగురు అన్నలను కాదని దావీదునే ఎన్నుకొన్నాడు. ప్రవక్త వచ్చినప్పడు దావీదు ఇంటిపట్టునగూడ లేడు. కనుక అతనికి రాజయ్యే అవకాశం చాల తక్కువ. ఎలీయూబుకి ఈ యవకాశమెక్కువ. కాని దైవనిర్ణయం తప్పతుందా? ప్రభువు కయీనుని కాదని హేబెలనీ, ఏసావుని కాదని యాకోబునీ ఎన్నుకొన్నాడు. అతడు తన కిష్టమొచ్చిన 

వారిని పిలుస్తాడు. నేడు మన పిలుపగూడ ఈలాగే ఆశ్చర్యకరంగా వుంటుంది. యోగ్యులు ఎందరో వుండగా అతడు మనలనే తన సేవకు పిల్చాడు. కనుక మనం భక్తిభావంతో ఆ ప్రభువుకి వందనాలు చెప్పకోవాలి.

2. ఎలీయాబు పెద్దకొడుకు, రూపసి, పొడుగరి. అన్నివిధాల రాజు కాదగినవాడు. కాని దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. ప్రభువు హృదయాలు చూచేవాడు. ఎలీయాబు హృదయం అతనికి నచ్చలేదు. నరులమైన మనం వెలుపలి రూపాన్ని చూచి బ్రమసిపోతాం. ఆకారాలు, అందచందాలు, కులం, అధికారం, డిగ్రీలు, మాటతీరు మొదలైనవాటిని చూచి మనం నరులకు విలువనిస్తాం. కాని దేవుని దృష్టిలో ఇవెందుకూ కొరగావు. హృదయాలకు విలువనిచ్చే దేవునికి మన హృదయం నచ్చుతుందా? మనం తోడి నరులను మెప్పిస్తుంటామా లేక దేవుణ్ణి మెప్పిస్తుంటామా? దేవుళ్ళాగే మనంకూడ అంతరంగానికి విలువనీయవద్దా?

3. దావీదు అభిషేకం పొందగానే దేవుని ఆత్మ అతని మీదికి దిగివచ్చింది. ఆయాత్మ యుద్ధబలాన్ని ఇచ్చే ఆత్మ అని చెప్పాం. నాడు యిస్రాయేలీయులకు ముఖ్యంగా కావలసింది ఫిలిస్త్రీయులతో పోరాడే రాజు. కనుక ఆత్మ దావీదుకి ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది. నేడు ఆత్మ మనకుకూడ మన అంతస్తుకి తగిన వర ప్రసాదబలాన్ని దయచేస్తుంది. ఆయాత్మడు గురువుకీ, ఉపదేశికీ, మరకన్యకీ సంఘ పెద్దకీ ఉపాధ్యాయునికీ ఎవరికి కావలసిన బలాన్ని వాళ్ళకు దయచేస్తాడు. మన తరపున మనం వినయంతో మనకు కావలసిన వరప్రసాదాన్ని ఆయాత్మ నుండి అడుగుకోవాలి.

6. దావీదు గొల్యాతు

-1 సమూ 17, 1=11, 32-54

1. సందర్భం

దావీదు వీరకృత్యాలు ఎన్నో ప్రసిద్ధిలోకివచ్చాయి. కాని వాటిల్లో గొల్యాతు కథకు వచ్చిన ప్రసిద్ధి దేనికీ రాలేదు. ఈ జీవితంలో మన గొల్యాతులు మనకుంటారు. ఆ దావీదులాగే మనంకూడ దైవబలంతో మన గొల్యాతులను గెల్వాలి.

2. వివరణం

యిస్రాయేలీయులకు ప్రబల శత్రువుల ఫిలిస్టీయులు. వారినిబట్టే కనాను దేశానికి "పాలస్టీనా" అని పేరు వచ్చింది. ఓసారి ఎఫేసు దమ్మీము వద్ద యూదులకు ఫిలిస్ట్రీయులకూ యుద్ధం జరిగింది. ఉభయ సైన్యాలు ఆవైపు కొండపైనీ ఈవైపు కొండపైనీ బారులు తీర్చాయి. మధ్యలో లోయ వుంది.

యిస్రాయేలీయుల రాజు సౌలు. ఫిలిస్టీయుల నాయకుడు గొల్యాతు. ఈ గొల్యాతు తొమ్మిడగుల ఎత్తునవండి రాక్షసుళ్ళాగ కన్పించేవాడు. అతని తలకు కంచుటోపీవుంది. రొమ్ముకు కవచంవుంది. కాళ్ళకు పదతాణాలు వున్నాయి. భుజంమీద యూటె, చేతిలో బాకూ వున్నాయి, ఓ బంటు డాలు మోస్తూ అతనికి ముందుగా నడుస్తూంటాడు.

గొల్యాతుకి వొళ్ళంతా ఆచ్చాదనముంది. నొసటిమీద మాత్రం ఏమీలేదు. కనుక నొసటిమీద కొడితేనేగాని వాడు చావడు.

గొల్యాతు ముందుకివచ్చి యిస్రాయేలు సైన్యం నుండి ఎవరైనా ఒక వీరుడు వచ్చి తనతో పోరాడవచ్చునని సవాలు చేసాడు. యిస్రాయేలీయుల వీరుడు గెలిస్తే ఫిలిస్త్రీయులంతా యిస్రాయేలీయులకు బానిసలౌతారనీ, తాను గెలిస్తే యిప్రాయేలీయులంతా ఫిలీస్టయులకు బానిసలౌతారనీ పందెం వేసాడు. ఉభయ పక్షాల సైనికులు యుద్ధం చేస్తే చాలమంది చస్తారు. ఈ పద్ధతిలో ఐతే ఎవడో ఒక్క వీరుడు మాత్రమే చనిపోతాడు. అధిక ప్రాణనష్టం జరుగదు. కనుక ఉభయ పక్షాలు ఇద్దరు వీరులు మాత్రమే పోరాడే పద్ధతిని అంగీకరించాయి. కాని ఫిలిస్టియునితో పోరాడగల మెనగాడెవడు యిస్రాయేలీయుల పక్షాన కన్పించలేదు. వాళ్ళంతా గొల్యాతుని చూచి భయపడ్డారు.

అప్పడు దావీదనే బాలుడు సౌలు దగ్గరికివచ్చి రాజా! మనవారి పక్షాన నేను గొల్యాతుతో పోరాడగలను మీరేమీ భయపడనక్కరలేదు అన్నాడు. సౌలు దావీదుతో నాయనా! నీవు ఏనాడు యుద్ధంలో పాల్గొనని బాలుడివి. అతడు చాల యుద్దాల్లో పోరాడి ప్రావీణ్యం గడించిన మహావీరుడు. నీవు అతనితో ఏలా పోరాడతావు అన్నాడు.

దావీదు రాజా! నేను సైనికులతో పోరాడని మాట నిజమే. కాని వన్యమృగాలతో పోరాడి అనుభవం గడించాను. మాతండ్రి గొర్రెలుకాసూ చాలసార్లు సింహాలతో ఎలుగుబంట్లతో పోరాడి వాటిని మట్టపెట్టాను. వన్యమృగాల వాడి గోళ్ళనుండి నన్ను రక్షించిన దేవుడు సున్నతి సంస్కారంలేని ఈ ఫిలిస్టీయుని బారినుండి తప్పక కాపాడతాడు. సజీవుడూ శక్తిమంతుడూ ఐన ప్రభువు సైన్యాలను సవాలు చేయడానికి వీడు ఏపాటివాడు అన్నాడు.

ఆ మాటలాలించి సౌలు యిస్రాయేలీయుల తరపున గొల్యాతుతో పోరాద్దానికి దావీదుకి అనుమతి నిచ్చాడు. ఆ రాజు దావీదుచేత తన ఆయుధాలను ధరింపజేసాడు. కాని దావీదు గొర్రెలు కాచుకొనే బాలుడు. ఆయుధాలకు అలవాటు పడినవాడు కాడు. కనుక అతడు వాటితో నడవలేకపోయాడు. పైగా గొల్యాతు ఈ ఆయుధాలవల్ల చావడు. అందుచే దావీదు వాటిని తొలగించివేసాడు. దావీదు ఆయుధం ఒడిసెల. అతడు ఏటినుండి నున్నని రాళ్లు ఐదేరుకొని సంచిలో వేసికొని కర్ర చేతబట్టుకొని గొల్యాతు మీదికి పోయాడు. ఫిలిస్టీయుడు తన బంటు డాలు మోసూ ముందు నడువగా దర్పంతో దావీదు మీదికి వచ్చాడు.

గొల్యాతు యిస్రాయేలీయుల పక్షంనుండి సౌలు రాజో లేక మరో మహావీరుడో తనతో పోరాద్దానికి వస్తాడనుకొన్నాడు. తీరాచూస్తే ఓ పసివాడు తనమీదికి వస్తున్నాడు. ఇది ఫిలిస్టీయునికి అవమానమనిపించింది. అతడు దావీదుతో ఓరీ! నీవు కర్రనెత్తుకొని కుక్కమీదికి వచ్చినట్లుగా నా మీదికి వస్తున్నావా? నాతో పోరాద్దానికి నీకెన్ని గుండెలు? నేను నిన్ను చంపి వన్యమృగాలకు ఆహారంగా వేస్తాను అన్నాడు.
దావీదు ఓయి! నీవు కత్తి యిూటె బాకు మొదలైన ఆయుధాలతో నామీదికి వస్తున్నావు. కాని నేను మా దేవుని పేరుమీదిగా నీపైకి వస్తున్నాను. నీది మానుషబలం, నాది దైవబలం. నేను నిన్ను చంపి నీ శవాన్ని ఆకాశపక్షులకు మేతగా వేస్తాను. యిస్రాయేలీయులు కొలిచే దేవుడొకడు ఉన్నాడు. అతడు ఆయుధాలద్వార విజయాన్ని ప్రసాదించడు. ఈ యుద్ధం మా దేవునిది. అతడు తన్ను నమ్మినవాళ్ళకు ఉచితంగానే గెలుపును దయచేస్తాడు అని పల్మాడు.
ఈలా ఫిలిస్ట్రీయుడు దావీదు తమతమ సేనలను దాటివచ్చి రెండు కొండల నడుమనున్న లోయలో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. దావీదు కొంచెం దూరం నుండే ఒడిసెలతో రాయి విసిరి ఫిలిస్టియుని నొసటిపై కొట్టాడు. అక్కడ ఆచ్చాదనమేమీలేదు. కనుక ఆ రాయి ఫిలిస్టీయుని నొసటిని చీల్చుకొని లోపలికి పోయింది. దానితో గొల్యాతు మొదలు నరికిన తాటిచెట్టులాగ గభీలున నేలపైన కూలాడు. అతడు స్పృహతప్పి పడిపోయాడుకాని ఇంకా చావలేదు.
దావీదు సాహసంతో ఫిలిస్టీయుని కత్తిని లాగుకొని దానితోనే అతనిని పొడిచి చంపాడు, అతని తలను తెగనరికాడు. ఫిలిస్టీయ సైనికులు తమ వీరుడు కూలడం చూచి గుండెలు చెదరి పారిపోయారు. యిప్రాయేలీయులు వారిని వెన్నాడి దొరికినవారిని దొరికినట్లుగా వధించారు. ఫిలిస్టీయుల శిబిరం నుండి కొల్లసొమ్ము దోచుకొన్నారు. ఈ రీతిగా వాళ్ళు శత్రువమీద మహావిజయం సాధించారు.
                         3. ప్రార్థనా భావాలు
1. ఈ కథలో పసివాడైన దావీదు మహావీరుడైన గొల్యాతుని గెల్చాడు. ఇక్కడ దావీదు చిన్న రాజ్యమైన యూదాను సూచిస్తాడు. గొల్యాతు యూదామీదికి దండెత్తి వచ్చిన పెద్ద రాజ్యాలను సూచిస్తాడు. శతాబ్దాల పొడుగునా ఈజిప్టు, అస్సిరియా, బాబిలోనియా, పర్షియా, గ్రీసు, రోము మొదలైన పెద్దరాజ్యాలు యూదులను 

నాశంజేయు జూచాయి. యూదా చిన్న రాజ్యమైనా దైవబలం కలది. దైవరక్షణం కలది. కనుక అది నాశమైపోలేదు. దేవుని నమ్మినవాళ్లు చిన్నవాళ్ళయినా సరే ఓడిపోరు. దావీదు చిన్నవాడే కావచ్చు. గొల్యాతు పెద్దవాడే కావచ్చు. కాని గొల్యాతుకంటె పెద్దవాడైన దేవుడు దావీదుని కాపాడాడు. ఈలాగే మనకుకూడ ప్రభువు అండాదండా లభించాలని వేడుకొందాం.

2. ఈ జీవితంలో మన గొల్యాతులు మనకుంటారు. ఈ గొల్యాతులు మన అపజయాలు, భయాలు, పిరికితనం, వ్యాధిబాధలు, నిరుత్సాహం, దారిద్ర్యం మొదలైన నానారూపాల్లో వుంటాయి. కాని వాటిది కేవలం లౌకిక బలం. మనలను కాపాడేదా దైవబలం. దైవబలం ముందు లౌకికబలమెంత? దేవుడ్డి నమ్మిన భక్తుడు కలకాలం గెలుస్తాడు. ఈ దృష్టితో జూస్తే, బైబులు బోధ అంతాగూడ ఈ దావీదు కథలో ఇమిడివుంది.

3. గౌల్యాతుకి కత్తి, బాకు, ఈటె, మొదలైన భయంకరాయుధాలు వున్నాయి. దావీదు ఆయుధం చిన్న ఒడిసెల మాత్రమే. ఈ చిన్న ఒడిసెలతోనే అతడు మహాయుధాలు కల వీరుణ్ణి గెల్చాడు. అసలు దావీదు ఆయుధం ప్రభువు దివ్యనామమే. అతడు గొల్యాతుతో "నేను సైన్యాలకు అధిపతియైన యావే పేర నీ మీదికి దండెత్తి వచ్చాను" అన్నాడు - 45. నేడు మనకుకూడ ఆ ప్రభువు నామమే, అతనిమీద నమ్మకమే ఆయుధం.

4 దావీదు దేవుణ్ణి నమ్మినతీరును మనం జాగ్రత్తగా మననం చేసికోవాలి, అతని వాక్యాలు ఈనాడు మనకూ ప్రేరణం పుట్టిస్తాయి. ఎలుగుబంటులూ సింహాల వాడిగోళ్ళ నుండి నన్ను రక్షించిన ప్రభువు ఈ ఫిలిస్టీయునినుండి కాపాడకపోడు - 37. నేను యావే పేర యుద్ధానికి వచ్చాను-45. యావే కత్తి బల్లాలవలన విజయాన్ని ప్రసాదించడు, ఈ యుద్ధం యావేది-47. ఈ వాక్యాల్లో ఎంత నమ్మకం

కన్పిస్తుందో చూడండి! పూర్వం ఓ కీర్తనకారుడు 

కొందరైతే రథాలనూ గుర్రాలనూ నమ్మారు మేమైతే ప్రభువుని నమ్మాం

అని పాడాడు-20, 7. ఈ వాక్యం దావీదుకు అక్షరాల వర్తిస్తుంది. అది నేడు మనకూ వర్తించాలి, 

7. నాతాను ప్రవచనం

1రాజుల దినచర్య 17

1. సందర్భం

   గిల్బోవా యుద్ధంలో ఫిలిస్టీయులు సౌలుని వధించారు. సౌలు కుమారుడు ఈపోృషెతు యిస్రాయేలు పదకొండు తెగలకు రాజయ్యాడు. యూదా తెగమాత్రం దావీదును రాజుగా ఎన్నుకొని అతనికి అభిషేకం చేసింది. పదిన్నరయేండ్లపాటు దావీదు ఈపోృషెతు వైరిరాజులుగా పరిపాలించారు. అటుతర్వాత శత్రువులు ఈష్బోషెకం వధించారు. ఆ పిమ్మట యిస్రాయేలు తెగలన్నవచ్చి దావీదుని దేశానికంతటికి రాజునుగా హెబ్రోనున అభిషేకించాయ.తదనంతరం దావీదు రాజధానిని యెరూషలేముకి మార్చాడు. మందసాన్ని ఆ నగరానికి తోడ్కొని వచ్చాడు. శత్రువులు చాలవరకు లొంగిపోయారు. ఇక అతనికి ඊසාකරයටීක.

2. వివరణం

   ఈలాంటి పరిస్థితుల్లో దావీదు నేనైతే దేవదారు కొయ్యతో నిర్మించిన సుందరమైన ప్రాసాదంలో వసిస్తున్నాను. ప్రభువు మందసం మాత్రం దిక్కుమొక్కూ లేకుండా ఓ డేరాలో పడివుంది. ప్రభువు సాన్నిధ్యానికి నా మేడను మించిన మందిరాన్ని కడతాను అనుకొన్నాడు, ఆ యాలోచనను నాతాను ప్రవక్తకు తెలుపగా అతడు నీవు కట్టగోరిన దేవాలయాన్ని కట్టు అని చెప్పాడు. 
   కాని ఆ రాత్రే ప్రభువు వాణి నాతానుతో దావీదు దేవాలయం కట్టగూడదని చెప్పింది. నాతాను ఆ సంగతిని ప్రవచన రూపంలో దావీదుకి తెలియజేసాడు. దాని వివరణమిది. ప్రభువు ఎడారి కాలంలో యిస్రాయేలీయులతో ప్రయాణం చేసినంతకాలం తనకు దేవాలయం కట్టమని ప్రజానాయకులను అడగలేదు. ఆ కాలమంతా ప్రభువు మందసం గుడారంలోనే వుండిపోయింది, యిస్రాయేలీయులు కనాను దేశంలో స్థిరపడిన పిదపగూడ దేవుడు తనకు దేవళం కట్టమని న్యాయాధిపతులను కోరలేదు. 
   ప్రభువు అల్పుడైన దావీదుని ఆదరించాడు. అతడు పొలంలో గొర్రెలు మేపుతూండగా దేవుడు అతన్ని పిలిపించి రాజుని చేసాడు. అతడు చేసిన యుద్థాల్లో అండగా వుండి అతనికి విజయాన్ని ప్రసాదించాడు. ప్రపంచంలోని మహారాజులకు అబ్బే కీర్తి దావీదుకి గూడ లభించేలా చేసాడు. ఇవి ప్రభువు దావీదుకి చేసిన వ్యక్తిగతమైన వపకారాలు. 
   ప్రభువ యిస్రాయేలు సమాజానికి గూడ ఎన్నో వుపకారాలు చేసాడు.వారికి కనాను దేశాన్ని నివాసస్థానం చేసాడు. ఆ దేశపు ఆదిమవాసులు వారికి లొంగిపోయేలా చేసాడు. 

దావీదు ప్రభువుకి మందిరాన్ని కట్టాలని కోరుకొన్నాడు కదా! ఈ కోరికకు దేవుడు ఎంతో సంతోషించాడు. దావీదు తనకు దేవాలయం కట్టకపోయినా కట్టినట్లే భావించాడు. కనుక అతడు దావీదుని బహూకరింపగోరాడు. ఆ బహుమానమేమిటంటే, దేవుడు దావీదుకి ఓ మందిరాన్ని కట్టిపెడతాడు. ఆ మందిరం దావీదు రాజవంశమే. దావీదు వంశంలో పుట్టినవాళ్ళ ఎడతెగకుండా యెరూషలేములో పరిపాలనం చేస్తారు. అతని రాజవంశం కలకాలం కొనసాగుతుంది. కడన ఆ రాజవంశంనుండే మెస్సీయా పుడతాడు. ఆ ప్రభువు రాజ్యానికి అంతమే వుండదు. ఆ క్రీస్తుద్వారా దావీదు రాజవంశం శాశ్వతంగా నిలిపోతుంది.

దావీదుకి బదులుగా అతని కుమారుడు సొలోమోను దేవాలయం కడతాడు. దావీదే ఎందుకు మందిరాన్ని కట్టగూడదంటే, అతడు చాల జాతులతో యుద్ధాలుచేసి రక్తాన్ని అపారంగా ఒలికించాడు. అతని చేతులు మలినమయ్యాయి. అలాంటి మలిన హస్తాలతో అతడు దేవునికి మందిరాన్ని కట్టగూడదు. ఆ పని సొలోమోను చేస్తాడు. - 1రాజుల దినచర్య 22,6-10.

ప్రభువు ఈ సొలోమోనుని కుమారునిలాగ ఆదరిస్తాడు. సౌలులాగాక సొలోమోను దేవుని మన్ననను పొందుతాడు. ఇది నాతాను దావీదుకి చెప్పిన ప్రవచనం. ఈ ప్రవచనం ప్రకారం మెస్సీయా దావీదు వంశంలో జన్మిస్తాడు. అతడు రాజుగా అవతరిస్తాడు.

పూర్వం సీనాయి కొండదగ్గర ప్రభువు యిస్రాయేలీయులందరితోను నిబంధనం చేసికొన్నాడు. తాను వారిని కాచి కాపాడతానని బాసచేసాడు. ఐతే దావీదు కాలంనుండి ఈ సీనాయి నిబంధనం దావీదు కుటుంబానికి పరిమితమై పోయింది. అనగా యికమీదట దావీదు కుటుంబంద్వారా, ఆ కుటుంబంలో జన్మించే మెస్సీయా ద్వారా, ప్రభువు యిప్రాయేలీయులను ఉద్ధరిస్తాడు. ఈ ప్రవచనంతో మొదలుపెట్టి ప్రవక్తలు 500ఏండ్లపాటు మెస్సీయా దావీదు కుటుంబంలోనే జన్మిస్తాడని ప్రవచనాలు చెపూవచ్చారు. వాళ్ళ చెప్పినట్లే తర్వాత వెయ్యేండ్లకు క్రీస్తు దావీదు కుమారుడుగా బెత్లెహేములో జన్మించాడు.

నాతాను ప్రవచనం దావీదుకి పరమానందం కలిగించింది. తన రాజవంశం శాశ్వతంగా కొనసాగడం, తన కుమారుడు సొలోమోను యెరూషలేములో దేవాలయం కట్టడం సామాన్య భాగ్యాలా! అతడు దైవమందసాన్ని పెట్టివుంచిన గుడారంలోనికి వెళ్ళి ప్రభువుకి కృతజ్ఞతావందనాలు చెల్లించాడు. ప్రభూ! నీవు నన్నింతగా పట్టించుకోడానికి నేనేపాటివాణ్ణి? మా కుటుంబమేపాటిది? నీవు నన్నింతగా ఆదరించి పెద్దజేయాలా? అని వ్యక్తిగతంగా వందనాలు అర్పించాడు.
ప్రభువు యిస్రాయేలు సమాజానికంతటికీ గూడ వుపకారాలు చేసాడు. అతడు ఐగుపులో ఆ ప్రజల కొరకు ఎన్నో అద్భుతాలు చేసాడు. వారిని ఫరో బానిసంనుండి 

విడిపించి కనాను దేశానికి తీసికొని వచ్చాడు. వారితో ఒప్పందం చేసికొన్నాడు. తాను వారికి దేవుడూ, వారు అతనికి భక్తులూ అయ్యారు. ఈ ఉపకారాలకు దావీదు ప్రభువుకి సమాజపరంగా వందనాలు అర్పించాడు. అతని ప్రార్ధన మనకుగూడ కృతజ్ఞతాభావాన్ని నేర్పిస్తుంది.

3. ప్రార్థనా భావాలు

1.మెస్సీయా రాజుగా వస్తాడు, దావీదు కుటుంబంలో పుడతాడు అని యూదులు శతాబ్దాల పొడుగునా ఉత్సాహంతో ఎదురుచూస్తూ వచ్చారు. వాళ్ళ ప్రవక్తలు ఈ యంశాన్ని పురస్కరించుకొని ఎన్నో ప్రవచనాలు చెప్పారు. మెస్సీయా రాజు అనే ప్రవచనాలకు నాతాను సందేశమే ఆధారం. ఐతే క్రీస్తుపూర్వం 587లో బాబిలోనియా ప్రవాసంతో దావీదు వంశం అంతరించింది. ఆ పిమ్మట దావీదు వంశపు రాజులు లేరుకాని దావీదు కుటుంబం మాత్రం కొనసాగింది. యోసేపు ఈ దావీదు కుటుంబానికి చెందినవాడే. అతని పెంపుడు కొడుకే క్రీస్తు. యోసేపు ద్వారా క్రీసు దావీదు కుటుంబానికి చెందినవాడయ్యాడు. దావీదు కుమారుడయ్యాడు. ఈ క్రీస్తురాజు రాజ్యానికి అంతం ఉండదు. అతడు శాశ్వతంగా రాజు - లూకా 1,32-33. దావీదు రాజవంశం ఏనాడో అంతరించినా అది క్రీస్తుద్వారా శాశ్వతంగా కొనసాగిపోతుంది. ఆ ప్రభువు నాడు యిస్రాయేలీయులకూ నేడు మనకూగూడ రక్షణాన్నిచ్చేవాడు. క్రీస్తు మనలను సంపూర్ణంగా రక్షించాలని ప్రార్థిద్దాం.

2.దావీదు మందిరం కట్టకపోయినా దేవుడు అతని మంచి కోరికను మెచ్చుకొన్నాడు. తానే అతనికి ఓ మందిరాన్ని కట్టిపెడతానని వాగ్దానం చేసాడు. దేవుడు దావీదుకి కట్టిపెట్టే మందిరం అతని రాజవంశమే. ఆ వంశంనుండే మెస్సీయా ఉద్భవిస్తాడు. అతనిద్వారా దావీదు రాజవంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. ఈ దావీదులాగే మనకు గూడ మంచి కోరికలుండాలి. మంచి కోరికలు ప్రార్థనల్లాంటివి. మంచికోరికలంటే యేమిటివి? మతం వ్యాప్తిచెందాలి. గురువులు మఠకన్యలు పవిత్రంగా జీవించాలి. ప్రజల్లో భక్తివిశ్వాసాలు పెరగాలి. పాపం అంతరించాలి. దేవుని చిత్తమైతే మనచుటూవున్న అన్యమతస్థులుకూడ ప్రభువు శిష్యులు కావాలి. అతని బోధలను ఆలించాలి. చాలమంది యువతీయువకులు దైవసేవలో చేరాలి. ఈలాంటి భక్తిగల కోరికలను మనం నిరంతరం కోరుకొంటూండాలి. వీటిని దేవుడు ప్రార్థనలుగానే భావిస్తాడు. పూర్వం మన ప్రాంతంలో వేదబోధ చేసిన విదేశ గురువులకూ మఠకన్యలకూ ఎన్ని భక్తిగల కోరికలుండేవో! ఆనాటి వాళ్ళకోరికల ఫలితంగానే ఇప్పడు మనం క్రైస్తవులమయ్యాం. ప్రభువు నేడు మనకుగూడ భక్తిగల కోరికలు పుట్టించాలని అడుగుకొందాం.

3. ఈ యధ్యాయంలో దావీదు వ్యక్తిగతంగాను యిప్రాయేలు సమాజం తరపునాను సమర్పించిన కృతజ్ఞతా ప్రార్ధనం చాల భక్తిమంతమైంది. అతన్నిచూచి మనంకూడ భక్తితో కృతజ్ఞతా ప్రార్ధనం చేయడం నేర్చుకోవాలి. ఆ ప్రభువు కరుణవల్ల మనకు విద్య వుద్యోగం పరపతి కుటుంబం పిల్లాజల్లా ఇలబ్లావాకిలీ ఆరోగ్యం శాంతి మొదలైన నానా భాగ్యాలు సిద్ధించాయి. క్రైస్తవ విశ్వాసం, తిరుసభ దేవద్రవ్యానుమానాలు బైబులు గ్రంథం మరియమాత మొదలైన ఆధ్యాత్మిక వరాలు ఎన్నో లభించాయి. వీటన్నిటికి గాను మనం ప్రభువుకి వందనాలు చెప్పకోవద్దా?

4. దావీదు ప్రభువుకి దేవాలయం కట్టాలనుకొన్నాడు. తాను వసించే మేడకంటె పెద్దభవనం నిర్మించాలనుకొన్నాడు. అతని దేవాలయభక్తి అపారమైంది. తర్వాత సాలోమోను దేవాలయం కట్టించాడు. అది ఆనాటి గొప్ప భవనాల్లో రూపొందింది. యూదులు సంవత్సరం పొడవునా ఈ దేవళానికి యాత్రచేస్తుండేవాళ్ల దానిపట్ల అపారమైన భక్తి చూపేవాళ్ళు. నేడు మన గ్రామంలో, విచారణలో వుండే దేవాలయంపట్ల మనకు నిజమైన భక్తి వుండాలి. ప్రార్ధనకూ పూజకూ మనం ఆ మందిరానికి వెళ్తూండాలి. దాన్నిచూచి గర్వించాలి. కాని మన దేవాలయ భక్తి ఏపాటిది?

8. దావీదు పాపం

2సమూ 11,2-12,14

1. సందర్భం

దావీదు యిప్రాయేలు రాజులందరిలోను గొప్పవాడు. ప్రభువుకి అమితంగా ప్రీతి కలిగించినవాడు. అలాంటివాడే ఫ్రీ వ్యామోహానికి లొంగి పాపంలో పడిపోయాడు. దీన్నిబట్టి మన బలహీనతలను మనం ఏనాడూ విస్మరించకూడదని అర్ధం జేసికోవాలి. హీబ్రూ రచయితలు దావీదుని ఉత్తమ రాజునిగా చిత్రించారు. ఐనా వాళ్ళు అతని బలహీనతను కప్పిపెట్టలేదు. వారిలాగే మనంకూడ సత్యప్రీతిని అలవర్చుకోవాలి. 2. వివరణం

అది యుద్ధకాలం. దావీదు సైన్యాధిపతియైన యోవాబు రెండవ అమ్మోనీయుల యుద్దాన్ని నడిపిస్తూ రబ్బా పట్టణంలో వున్నాడు. దావీదు యెరూషలేమున వున్నాడు. ఒకనాటి సాయంకాలం అతడు రబ్బాయుద్ధాన్ని గూర్చి ఆలోచిస్తూ తన మేడమీద పచార్లు చేస్తున్నాడు. ప్రక్కింటి ఆడగూతురు బెత్షెబా స్నానం చేసికొంటూ అతని కంటబడింది. ఆమెను చూడగానే రాజుకి మతిపోయింది. అతను బెత్షెబాను గూర్చిన వివరాలు అడగ్గా ఆమె ఊరియా భార్య అని తెలిసింది. ఈ వూరియా హిత్తీయుడు. దావీదుకి అంగరక్షకుడు. ముప్పదిమంది వీరుల్లో ఒకడు.

దావీదు కామవికారానికి లొంగి బెత్షెబాను ప్రాసాదానికి రప్పించుకొని ఆమెతో పాపంచేసాడు. ఆ పాపఫలితంగా ఆమెకు గర్బం కలిగింది. ఆమె గర్భవతి ఐనప్పటినుండి రాజు పన్నాగాలకు పూనుకొన్నాడు. బత్షెబా తనవలనగాక తన భర్తయైన ఊరియావల్లనే గర్భవతి ఐనట్లుగా నిరూపించాలని అతని తపన.

కనుక అతడు రబ్బాలో అమ్మోనీయులతో పోరాడుతూన్న ఊరియాను యెరూషలేముకి పిలిపించాడు. అతని నుండి యుద్ధవార్తలు విన్నాడు. సాయంకాలం అతన్ని యింటికి పొమ్మన్నాడు. అతడు ఆ రేయి ఆలిని కూడతాడని భర్తవల్లనే బెత్షెబాకు గర్భం కలిగినట్లుగా ప్రచారం చేయవచ్చునని దావీదు తలంపు.

కాని వూరియూ ఆ రాత్రి యింటికి పోనేలేదు. రాజు మేడ ముందటనే అంగరక్షకుల ప్రక్కన పండుకొని నిద్రించాడు. దావీదు నీవు మీ యింటికేల పోలేదని ప్రశ్నింపగా వూరియా ప్రభూ! దైవమందసంతోపాటు యిప్రాయేలు సైనికులుకూడ గుడరాంలోనే పడివున్నారు. యుద్ధకాలంలో యోవాబు అతని అంగరక్షకులు బయటనే నిద్రిస్తున్నారు. ఈలాంటి పరిస్థితుల్లో నేను హాయిగా తిని త్రాగి ఆలిని కూడతానా? నేను అలాంటిపని చేసేవాణ్ణికాదు అన్నాడు.

యిస్రాయేలు సంప్రదాయం ప్రకారం యుద్ధం పవిత్రమైంది. కనుక యుద్ధకాలంలో సైనికులకు భార్యా సంగమం నిషిద్ధం - 1సమూ 21,4-5. ఇక్కడ అన్యజాతివాడైన హిత్తీయుడు ధర్మశాస్త్ర నియమాలను జాగ్రత్తగా పాటించాడు, అతని శీలం గొప్పది. భక్తుడైన దావీదు మాత్రం ధర్మశాస్త్ర నియమాలను మీరాడు. ఇది విడూరం.

మళ్ళా రెండవసారి దావీదు వూరియాను అతని ఇంటికి పంపగోరాడు. కనుక ఆ మరునాడు అతన్ని తనతోపాటు భోజనానికి ఆహ్వానించి తప్పత్రాగించాడు. మధుపానం లైంగికవాంఛలను రెచ్చగొడుతుంది. ఐనా వూరియా లొంగలేదు. ఆ రేయికూడ అతడు యింటి వెళ్ళక రాజు అంగరక్షకుల ప్రక్కనే పండుకొని నిద్రపోయాడు.

ఇక దావీదు వూరియాను ఏలాగైన వదలించుకొని బత్నెబాను పెండ్లిచేసికోవాలనుకొన్నాడు. కనుక అతడు యోవాబుకి ఓ జాబు వ్రాసి దాన్ని వూరియా చేతనే పంపాడు. దానిలో "నీవు పోరు భీకరంగా జరిగే తావున వూరియాను మొదటి వరుసలో పెట్టించు. శత్రువులువచ్చి అతనిమీద పడినప్పడు మీరతన్ని ఆదుకోవద్దు" అని వ్రాసాడు. ఊరియా ఈ జాబుని సేనాధిపతి దగ్గరికి తీసికొనిపోవడం వలన తన చావుకబురుని తానే మోసికొనిపోయి నట్లయింది. యుద్ధంలో మొదటి వరుసలో వున్నవాళ్ళకు అపాయమెక్కువ. ప్రాణాలకు తెగించి పోరాడే శూరులనే మొదటి వరుసలో వంచుతారు.

జాబును చూడగానే యోవాబుకి దావీదు కుట్ర అర్థమైంది. అతడు రాజు చెప్పినట్లే చేయగా వూరియా యుద్ధంలో చనిపోయాడు. యోవాబు రాజునొద్దకు దూతనంపి యుద్ధవార్తలు చెప్పించాడు. తాము శత్రువుల నగరమైన రబ్బాను ముట్టడిస్తుండగా యిస్రాయేలు వీరులు కొందరు మరణించారనీ వారిలో ఊరియాకూడ వున్నాడనీ చెప్పించాడు. దావీదు దూతతో యుద్ధంలో ఎవరు చస్తారో ఎవరు బ్రతుకుతారో చెప్పలేం. జరిగినదానికి చింతించవద్దు. మీరు యుద్దాన్ని ఇంకా తీవ్రంచేసి రబ్బా పట్టణాన్ని జయించండి అని చెప్పాడు. రాజుకి కావలసింది వూరియా చావు. అతనితోపాటు ఇంకా కొందరు వీరులు కూలినా దావీదుకి చింతేమీ లేదు.

వూరియా పోయాడు కను బెత్షెబా దావీదుకి సాంతమైపోయింది. రాజు తలచుకొంటే దెబ్బలకు కొదవా? అతడు ఆమెను తన మేడకు రప్పించుకొని పెండ్లి చేసికొన్నాడు. అటుపిమ్మట ఆమె బిడ్డను కంది. ఇక్కడ దావీదు కేవలం కామతృప్తికొరకే బత్షెతెబాను పెండ్లి చేసికొన్నాడు అనుకోగూడదు. పెనిమిటి పోయాడు కనుక దిక్కులేని బత్షెబాను ఆమె బిడ్డణ్ణి కాపాడ్డానికి అతడు ఆమెను పరిణయమాడాడు అని చెప్పాలి.

కాని దావీదు చేసిన ఈ దుష్కార్యం యావేకు కోపం కలిగించింది. అతడు ఓ పేదవాణ్ణి అన్యాయంగా చంపించి అతని భార్యను అపహరించాడు. కాని మోషే ధర్మశాస్త్రం ప్రకారం యిస్రాయేలీయులను నడిపించే ప్రభువు రాజు అధర్మాన్ని ఏలా సహిస్తాడు? కనుక అతడు దావీదుని చీవాట్లు పెట్టడానికి తన భక్తుడైన నాతాను ప్రవక్తను పంపాడు. ప్రవక్తలు ప్రభువు సందేశాన్ని ప్రజలకు ఎరిగించేవాళ్లు. తాము ప్రభువుకి నోరై మాటలాడేవాళ్ళు.

దావీదు సామాన్యుడు కాదు, రాజు. కనుక ప్రవక్త అతన్ని నేరుగా మందలించకూడదనుకొన్నాడు. ఓ కథ ద్వారా అతని అంతరాత్మకు ప్రబోధం కలిగించాలనుకొన్నాడు. కావున నాతాను దావీదుకి ఈ కథ చెప్పాడు. అయ్యా! ఎంత అన్యాయం జరిగిందో చూచావా! ఓ నగరంలో ఓ పేదవాడూ ఓ ధనికుడూ వసిస్తున్నారు. ధనికునికి చాల పసులమందలున్నాయి. పేదవానికి ఒక్కటే గొర్రెపిల్ల. అతడు ఆ గొర్రెపిల్లను అల్లారుమదుగా పెంచుకొనేవాడు. సరే, ఓ దినం ధనికుని యింటికి చుట్టమొచ్చాడు. అతడు తన పశువులన్నిటినీ భద్రంగా అట్టిపెట్టుకొని పేదవాని గొర్రెపిల్లను లాగుకొనివచ్చి చుట్టానికి విందు చేయించాడు-అని కథ ముగించాడు.

ఈ కథవిన్న దావీదుకి వొళ్ళు మండింది. అతడు కోపంతో ఆ థనికుడు పేదవాడికి నాల్గరెట్ల నష్టపరిహారం చెల్లించాలని అన్నాడు. మోషే ధర్మశాస్త్రమే పూర్వం ఈ నియమం చేసింది - నిర్ణ 22,1.

ఈ కథలో నాతాను ఉద్దేశించిన పేదవాడు అతని గొర్రెపిల్ల, వూరియా అతని భార్య బత్షెబాను. కనుక ప్రవక్త దావీదు జవాబునందుకొని అతనితో నేను చెప్పిన దుషుడైన ధనికుడవు నీవే సుమా! ప్రభువు ఈలా అంటున్నాడు. నీకు ఇందరు భార్యలు ఉన్నారు కదా! సౌలు చనిపోయినపుడు అతని భార్యలను కూడ నీ వశం జేసానుగదా! నీవు ఈ స్త్రీలందరితోను సుఖించవచ్చుకదా! అన్నెంపన్నెం ఎరుగని వూరియాను చంపించి అతని యాలిని నీ యాలిని చేసికొంటావా? ఈ దుర్మార్గానికిగాను నీకు రెండు శిక్షలు పడతాయి. నీవు వూరియా-మీదికి కత్తి యెత్తావు కనుక, కత్తి నీ కుటుంబాన్ని విడువదు. నీ కొడుకులు చాలమంది అంతఃకలహాలతో చస్తారు. నీవు వూరియా భార్యను చెరిచావు కనుక నీ భార్యలను నీ కుమారుడే చెరుస్తాడు అని చెప్పాడు.

దావీదు రాజు, న్యాయాధిపతి కూడ. దేశంలో న్యాయాన్ని కాపాడవలసిన రాజే ధర్నాన్ని చెరిస్తే ఇక దిక్కెక్కడిది? కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు? కనుక ప్రభువు దావీదుకి ఈ శిక్షలు విధించాడు.

పై శాపం ప్రకారం తర్వాత దావీదు కుటుంబంలో అంతఃకలహాలు చెలరేగాయి. ప్రవక్త నుడివినట్లుగా అతడు నాల్గవంతులు నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది. బత్షెబాకు దావీదు వలన కలిగిన మొదటిబిడ్డడు పరిటిలోనే పోయాడు. దావీదు కుమారులు అమ్మోను, అబ్షాలోము, అదోనియా శత్రువుల వాతబడి దారుణమైన చావు చచ్చారు. ఇంకా, అబ్షాలోము తండ్రిమీద పగబట్టి పట్టపగలే, అందరూ చూస్తుండగానే తండ్రి భార్యలను చెరిచాడు - 16,22. నాతాను ప్రవచనం ఈలా నెరవేరింది.

ఇక్కడ నాతాను చెప్పిన పేదవాని గొర్రెపిల్ల అనే కథ బైబుల్లోని ప్రశస్తకథల్లో వొకటి. అన్యాపదేశంగా వుండే ఈ కథ నేటికీ మనకు ప్రేరణం పట్టిస్తుంది. ప్రవక్తలు మాటనేర్పరులు.

దావీదు నాతాను పలుకులన్నీ సావధానంగా విన్నాడు. పూర్వం చాలమంది 'దుష్టరాజులు ప్రవక్తలకు ఎదురుతిరిగారు. వాళ్ళ నోళ్ళ మూయింపజూచారు. కాని దావీదు అలా చేయలేదు. అతడు మంచి రాజు, బలహీనత వల్ల పాపంలో పడిపోయినా, తన తప్పని తెలిసికొని పశ్చాత్తాపపడ్డాడు. అతడు వినయంతో నేను యావేకు ద్రోహంగా పాపం చేసాను. ప్రభువు నా తప్పిదాన్ని మన్నించాలని వేడుకొంటున్నాను అన్నాడు. నాతాను రాజుతో నీవు సద్బుద్ధితో పశ్చాత్తాపపడ్డావు కనుక ప్రభువు నీ దోషాలన్నీ మన్నించానడు. ఈ పాప ఫలితంగా నీవు చావవుగాని నీ వలన బత్షెబాకు కలిగిన బిడ్డడు చనిపోతాడు అని చెప్పాడు. తర్వాత అలాగే జరిగింది.

పూర్వం సౌలు పాపంజేయగా ప్రభువు అతన్ని నాశంజేసాడు. రెండవ రాజాయిన దావీదు పాపంజేస్తే దేవుడు అతన్నెందుకు వదలివేసాడు? దావీదునీ అతని అనుయాయులనూ కరుణిస్తానని ప్రభువు పూర్వం మాటయిచ్చాడు. ఈ అనుయాయులనుండే తర్వాత మెస్సీయా ఉద్భవిస్తాడు. కనుక దేవుడు తన ప్రమాణాన్ని నిలబెట్టుకోగోరి ఇక్కడ దావీదుని నాశం చేయలేదు - 7,14-15.

3. ప్రార్ధనా భావాలు

1. ప్రజల దృష్టిలో దావీదు గొప్పవాడు, శూరుడు. అతని కీర్తికీ విజయాలకూ అంతులేదు. కాని దేవుని దృష్టిలో అతడు దుర్మార్గుడు. పేదవానిని చంపి వాని గొర్రెపిల్లను అపహరించిన దుష్టుడు. కనుక అతనికి శిక్షలు పడ్డాయి. ఒకసారి లోకం మనలను మెచ్చుకొంటుంది. ఇరుగుపొరుగువాళ్ళు మనలను మంచివాళ్ళమని పొగుడుతారు. వాళ్ళ మాటలు విని మనంకూడ మురిసిపోతాం. కాని నరులు మనలను మెచ్చుకొంటేచాలదు. వాళ్ళకు మన రహస్యకార్యాలు తెలియవు కదా! దేవుడు మనలను మెచ్చుకోవాలి. అప్పుడే మనకు విలువ. అందరి హృదయాలు న్యాయాన్యాయాలు తెలిసిన దేవుడు మనలను అంగీకరిస్తే అప్పడు మనకు నిజమైన గుర్తింపు. కనుక మనమెప్పడుకూడ నరుల దృష్టిలో కాక దేవుని దృష్టిలో ఏలా చలామణి ఔతున్నామా అని పరిశీలించి చూచుకోవాలి.

2. నేను చెప్పిన దుష్టుడవు నీవే అని ప్రవక్త పలికిన వాక్యం దేవుని వాక్యం. కనుకనే అది దావీదుకి పశ్చాత్తాపం పుట్టించింది. ప్రభువు వాక్యం నేడు మనకుకూడ పశ్చాత్తాపం కలిగిస్తుంది. మనం వేదవాక్యం చదువుకొనేప్పడు అది మన తప్పిదాలకు మనలను ఖండిస్తుంది. మన దోషాన్ని ఎత్తిచూపుతుంది. న్యాయాధిపతిలాగ మనకు తీర్చు చెప్తుంది - హెబ్రే 4,12. కనుక భక్తుడు తరచుగా బైబులు చదువుకొని ఆ వేదవాక్యం కలిగించే ప్రేరణం ద్వారా తన హృదయాన్ని శుద్ధిచేసుకోవాలి - యోహా 15,3. 3, 11,6-17 వచనాల్లో దావీదు వూరియామీద కుట్రలు పన్నాడు. ఎన్నో వంచనలకు పాల్పడ్డాడు. అబద్దాలు ఆడాడు. మోసాలు చేసాడు. వ్యభిచార పాపంలో చిక్కుకొన్నవాళ్ళు నేడూ ఈలాగే కపటంగా ప్రవర్తిస్తారు. వాళ్ళను నమ్మకూడదు.

4. నాతాను కథ వినగానే దావీదుకి కోపంవచ్చింది. అతడు పేదవాని గొర్రెపిల్లను అపహరించిన దుర్మార్గుడు నాలువంతులు నష్టపరిహారం చేయాలి అని అరచాడు, అతనికి ఇతరుని తప్ప బాగా తెలియవచ్చింది. తన తప్ప మాత్రం తెలియలేదు, మనమూ ఇతరుల తప్పలను తీవ్రంగా ఖండిస్తాం. మన పాపాలను మాత్రం గుర్తించం. కాని యెదుటివాని కంటిలోని నలుసును గమనించి మన కంటిలోని దూలాన్ని చూడకుండావుంటే యేమి లాభం? - మత్త 7,3-5.

5. నాతాను మందలించగానే దావీదు తన తప్పని వొప్పకొన్నాడు. నేను ప్రభువుకి ద్రోహంగా పాపంచేసాను అని అంగీకరించాడు. ఇది మంచివాళ్ళ లక్షణం. దుర్మార్గులు తమ తప్పని తాము ఒప్పకోరు. హేబెలుని చంపిన కయీను తన అపరాధాన్ని అంగీకరించలేదు. దేవుడు నీ తమ్ముడు ఎక్కడున్నాడని ప్రశ్నింపగా అతడు వాడికి నేనేమైనా కాపలా వున్నానా అని అడిగాడు - ఆది 4,9. పాపం చేసినపుడు మనం దావీదులా ప్రవర్తించాలిగాని కయీనులా ప్రవర్తించకూడదు.

పాపం కట్టుకోకూడదు. కాని బలహీనతవల్ల పాపంలో పడిపోయినపుడు ఈ దావీదు కథ మనకు పాఠం నేర్పుతుంది. ప్రేరణం పుట్టిస్తుంది. విశేషంగా పాపుల కొరకే దీన్ని బైబుల్లో చేర్చారు.

9. సాలోమోను స్వప్నం

1రాజు 3,4-27

1. సందర్భం

దావీదు చివరిరోజుల్లో అతని కుటుంబంలో అంతఃకలహాలు పెచ్చుపెరిగాయి. అతని కుమారుల్లో ఎవరు రాజు కావాలనే సమస్య ఎదురైంది. పెద్దవాడైన అదోనియా తాను రాజు కావాలని పట్టుపట్టాడు. సైన్యాధిపతియైన యోవాబు అతన్ని సమర్ధించాడు. కాని ప్రవక్తనాతాను యాజకుడైన సాదోకు చిన్నవాడైన సాలోమోనుని రాజుని చేయగోరారు. కడన దైవచిత్త ప్రకారం దావీదు గీహోను చెలమచెంత సాలోమోనుకే రాజ్యాభిషేకం చేయించాడు. తండ్రి అనంతరం అతడు రాజ్యం చేయడం మొదలుపెట్టాడు.

2. వివరణం

సొలోమోను గిబ్యోను పుణ్యక్షేత్రానికి వెళ్ళి దహనబలులు అర్పిస్తుండేవాడు. ఓసారి అతడు అక్కడ బలిని అర్పించడానికి వెళ్ళగా దేవుడు రాత్రి కలలో కన్పించి నీకేమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. సాలోమోను ప్రభూ! నీవు మా తండ్రి దావీదుని కరుణతో ఆదరించావు. అతడు తన తరపున తాను నిన్ను పూర్ణహృదయంతో సేవించాడు. అతని కుమారుడనైన నేను ఒడుదుడుకులన్నీ తప్పించుకొని ఇప్పడు రాజునయ్యాను. నీవు ఈనాడు నన్ను సింహాసనంమీద కూర్చోబెట్టావనగా మా తండ్రి దావీదుని కరుణించినట్లే, కాని నేను ప్రాయంలో చిన్నవాడ్డి మా తండ్రి దావీదు అనుభవం నాకు లేదు. ఈ ప్రజలు అసంఖ్యాకంగా వ్యాపించి వున్నవాళ్ళు. వీళ్ళను పరిపాలించే సామర్థ్యం నాకులేదు. కనుక వీరిని చక్కగా పాలించడానికి నాకు వివేకవిజ్ఞానాలను ప్రసాదించు అని వేడుకొన్నాడు.

ఆ రోజుల్లో రాజు న్యాయాధిపతిగూడ. ప్రజలు తగాదాలతో రాజు దగ్గరికి వస్తారు. అతడు న్యాయబుద్ధితో తీర్పు చెప్పాలి. ధర్మశాస్త్రంలోని ఆదేశాల ప్రకారం దోషిని శిక్షించి నిర్దోషిని వదలిపెట్టాలి. కనుక సొలోమోను న్యాయాధిపతిగా సక్రమమైన పద్ధతిలో ప్రజలకు తీర్పుచెప్పే వివేకాన్ని ప్రసాదించమని దేవుణ్ణి అడుగుకొన్నాడు, న్యాయాధిపతిగా తన బాధ్యతను తాను నిర్వహించే తెలివిని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకొన్నాడు.

మామూలుగా పూర్వవేద ప్రజలు దేవుణ్ణి నాల్లవరాలు కోరుకొన్నారు. అవి దీర్గాయువు, సంతానం, సిరిసంపదలు, శత్రువుల మీద విజయం. కాని సొలోమోను ఈ వర్గాల్లో దేనినీ అడుగుకోలేదు. తన కొరకు ఏమీ అడగలేదు. ప్రజలందరి శ్రేయస్సుకోరి చక్కగా తీర్పుచెప్పే వివేకాన్ని మాత్రం అడుగుకొన్నాడు. మంచి తీర్పులు చెప్పడం అతని బాధ్యత. కనుక అతడు తన బాధ్యతను తాను నిర్వర్తిస్తే చాలు అనుకొన్నాడు.

సాలోమోను మనవి ప్రభువుకి ఎంతో ప్రీతి కలిగించింది. అతడు నీవు నీ స్వార్థాణానికి ఏమీ కోరుకోక ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించే వివేకవరం మాత్రం అడిగావు. తప్పక ప్రసాదిస్తాను. వివేకరంగంలో నీలాంటివాడు నభూతో నభవిష్యతి. నీవడగకున్నా సిరిసంపదలూ కీర్తి ప్రతిష్టలుకూడ నీకిస్తున్నాను. నీ తండ్రి దావీదులాగ నీవు నా యాజ్ఞలు పాటిస్తూ నాకు నమ్మినబంటువై వుంటే నేను నీకు దీర్గాయువుగూడ ప్రసాదిస్తాను అని చెప్పాడు.

అంతట సాలోమోను నిద్ర మేల్కొని దేవుణ్ణి సేవించి యెరూషలేముకి తిరిగివచ్చాడు. అంతకుముందే దావీదు మందసాన్ని యెరూషలేమన గుడారంలో పెట్టించాడు. సొలోమోను దానిముందు దహనబలులు అర్పించాడు. కొలువుకాళ్ళకు విందుజేయించి ప్రభువు తనకు కలలో కన్పించిన వైనాన్ని తెలియజేసాడు. ప్రభువు సొలోమోనుకి విజ్ఞాన వరాన్ని ప్రసాదించాడు కదా! అది వెంటనే అతనిలో పనిజేయడం మొదలుపెట్టింది. ఆ రాజు తన విజ్ఞానాన్ని రుజువు చేసికొనే అవకాశంగూడ వెంటనే దొరికింది.

ఓరోజు ఇద్దరు వేశ్యలు జగడమాడుకొని రాజు దగ్గరికి తీర్చుకు వచ్చారు. మొదటియామె రాజుతో ఈలా చెప్పింది. దొరా! మేమిద్దరం ఒకే యింటిలో వసిస్తున్నాం. ఈమెకూ నాకూ మూడురోజుల తేడాతో మగబిడ్డలు పుట్టారు. ఒకరేయి ఈమె నిద్రమంపులో తన బిడ్డడిమీదికి పొరలి వాణ్ణి చంపివేసింది. కాని తెలివితో ఆరాత్రే తన బిడ్డట్టితెచ్చినా ప్రక్కలో పరుండబెట్టి నా కుమారుడ్డి తీసుకవెళ్ళి తన ప్రక్కలో పండబెట్టుకొంది. నేను ఉదయాన్నే శిశువుకి పాలీయబోగా వాడు చనిపోయి వున్నాడు. జాగ్రత్తగా పరిశీలించి చూచి వాడు నా బిడ్డడు కాదని తెలిసికొన్నాను అని చెప్పింది. వెంటనే రెండవవేశ్య అందుకొని ఏలికా! బ్రతికివున్నవాడు నా బిడ్డడు. చచ్చినవాడు ఆమె బిడ్డడే అని పలికింది. మొదటి వేశ్య రెండవ వేశ్యకు అడ్డువచ్చి బ్రతికి వున్నవాడు నావాడు, చచ్చినవాడే నీవాడు అని వాదించింది.

రాజు ఇరువురి వాదాన్ని విన్నాడు. దేవుడిచ్చినవరం అతన్ని ప్రేరేపించింది. అతడు నిజమైన తల్లిని గుర్తుపట్టే విధానాన్ని మనసులోనే ఊహించుకొన్నాడు. బయటికి ఏమీ చెప్పకుండా, బ్రతికివున్న బిడ్డణ్ణి రెండు ముక్కలుగా నరికి ఇద్దరికి చెరియొక ముక్కనివ్వమని సేవకుణ్ణి ఆజ్ఞాపించాడు. బంటు కత్తి తీసికొని అలాగే నరకబోగా కన్నతల్లికి కడుపు తరుగుకొనిపోయింది. ఆమె ప్రభూ! బిడ్డను చంపవద్దు. వాణ్ణి ఈమెకు ఈయండి. నా బిడ్డడు ఎక్కడవున్నా ఫర్వాలేదు. వాడు బ్రతికివుంటే చాలు అంది. కాని రెండవ తల్లి ఈబిడ్డడు ఎవరికీ దక్కకూడదు. వీణ్ణి రెండు ముక్కలుగ నరికివేయవలసిందే అని అసూయతో పలికింది. వారి మాటలనుబట్టే సాలోమోను ఎవరు నిజమైన తల్లో, ఎవరు దొంగ తల్లో నిర్ణయించాడు. నిజమైనతల్లి తన బిడ్డడు చనిపోవడానికి ఒప్పకోదు కదా! కడుపుతీపి ఆమెకు అడ్డువస్తుంది కదా! ఈవిధంగా సొలోమోను తెలివితో నిజమైన తల్లిని గుర్తుపట్టి బిడ్డణ్ణి ఆమెకే యిప్పించాడు.

అంతవరకు యిస్రాయేలు పెద్దలకు సాలోమోను సామర్థ్యం తెలియదు. వాళ్ళ మన రాజు కుర్రవాడు. ఇతనికి దావీదుకున్న అనుభవం లేదు. ఇతడు ప్రజలను చక్కగా పరిపాలించగలడా అని శంకిస్తున్నారు. ఈ తీర్పు విన్న తర్వాత వాళ్ళకు సొలోమోనుమీద నమ్మకం కుదిరింది. వాళ్లు ఇతడు తండ్రిని మించిన తనయుడు అనుకొన్నారు. అతన్ని చూచి భయపడ్డారు. భగవంతుడు అతనికి ప్రసాదించిన విజ్ఞాన వరాన్ని గుర్తించి విస్తుపోయారు.

3. ప్రార్థనా భావాలు

1.యూదుల దృష్టిలో మోషే ధర్మశాస్తానికి ప్రసిద్ధి. సొలోమోను విజ్ఞానానికి ప్రసిద్ధి. విజ్ఞానమంటే యేమిటి? దేవునిపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటిమెట్టు అంటుంది సామెతలగ్రంథం 9, 10. కనుక విజ్ఞానమంటే దైవభీతీ, దైవభక్తి. దీన్నే మనం నూత్నవేదంలో వరప్రసాదం అంటాం. ఈ వరంతో మంచిచెడ్డలను గుర్తిస్తాం. చెడ్డను విసర్జించి మంచిని సాధిస్తాం. యోగ్యరీతిని ప్రవర్తించి విజయాన్నిచేపుతాం. ఇహలోక వస్తువులకంటె పరలోక వస్తువులమీద అధికప్రీతిని చూపుతాం. సంగ్రహంగా చెప్పాలంటే, వివేకంతో మంచి జీవితం గడపడమే విజ్ఞానం. ఈ వరం సాలోమోనుకిలాగే మనకుకూడ అత్యవసరం. కనుక అతనిలాగే మనంకూడ దేవునినుండి ఈ భాగ్యాన్ని అడుగుకోవాలి.

2.ప్రజలకు మేలు కలిగేలా పరిపాలించడం, వారికి న్యాయబుద్ధితో తీర్పుచెప్పడం సాలోమోను బాధ్యత. ఈ స్వీయ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి అతడు విజ్ఞాన వరాన్ని అడుగుకొన్నాడు. ఎవరి బాధ్యతలను వాళ్లు తృప్తికరంగా నిర్వహించాలి. వృత్తి ధర్మాన్నిసక్రమంగా పాటిస్తే దేవుణ్ణి ఆరాధించినంత. ఈనాడు మనం మన బాధ్యతలను ఏలా నిర్వహిస్తున్నాం? తల్లిదండ్రులంగా, పెద్దలంగా, ఉపదేశులంగా, ఉపాధ్యాయులంగా, మఠకన్యలంగా, గురువులంగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా? ఈ విషయంలో సొలోమోను మనకు ప్రేరణంగా వుంటాడు.

3.ప్రభువు సొలోమోనుతో నీవు నా యాజ్ఞలను పాటించి నాకు విధేయుడవైతే నేను నీకు దీర్గాయువును గూడ ప్రసాదిస్తాను అని చెప్పాడు. కాని విజ్ఞానవరాన్ని బడసిన సొలోమోనే దేవుని ఆజ్ఞలను పాటించలేదు. అతడు మోషే ధర్మశాస్తాన్నిమీరి వివిధ జాతుల ఆడపడుచులను పెండ్లి చేసికొన్నాడు.వాళ్ళకు పుట్టింటి దేవుళ్లుండేవాళ్లు. సాలోమోను ఈ రాణులకు వశుడైపోయి వాళ్ళ కొలిచే దేవతలను కొలిచాడు. వాళ్ళకు దేవళాలు కట్టించాడు. విగ్రహారాధనలో పడిపోయాడు. తన తండ్రియైన దావీదులాగ పూర్ణహృదయంతో దేవుణ్ణి సేవించలేదు. కనుక దేవుడు సాలోమోను మీద కోపించి అతని రాజ్యాన్ని రెండు ముక్కలుగా చీల్చివేసాడు. ఒక ముక్కకు అతని కుమారుడు రాజుకాగా మరో ముక్కకు అతని బానిస యరోబాము రాజయ్యాడు- 1రాజు 11,1-12. అతడు ప్రభువుని త్యజించాడు కనుక ప్రభువు అతన్ని త్యజించాడు. సొలోమోనువంటి జ్ఞాని పడిపోతే ఇక మనబోటివాళ్ళం నిలువగలమా? ఆ రాజులాగే మనంకూడ మన అంతస్తుని మరచి దేవునికి ద్రోహం చేస్తాం. కనుక సౌలు చెప్పినట్లుగా మనం భయంతో వణకుతూ మన రక్షణకార్యాన్ని సాధించాలి - ఫిలి 2,12. నిల్చివున్నవాడు పడిపోకుండా వుండేలా జాగ్రత్తపడాలి - 1కొరి 10,12, కావున భయభక్తులతో దేవుణ్ణి కొలిచే భాగ్యాన్ని అడుగుకొందాం.

10. రాజ్య విభజనం 1రాజు 11,26-12, 24

1. సందర్భం

సొలోమోను గొప్ప రాజు, వైభవంగా యిస్రాయేలీయులను ఏలాడు. కాని అతడు

విగ్రహారాధకుడు. కనుక ప్రభువు అతనిపై కోపించి అతని రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాడు. చరిత్రను మన జీవితంలోని సంఘటనలను నడిపించేది ప్రభువే.

2. వివరణం

సొలోమోను రాజు వెట్టిచాకిరివారిని నియమించి ఏప్పడూ భవనాలు కట్టిస్తూండేవాడు. అతడు ఆ చాకిరివారికి యరోబాము అనే సేవకుణ్ణి నాయకుణ్ణిచేసాడు. దైవప్రేరణం వల్ల ఈ సేవకుడే సాలోమోనుకి ప్రబల శత్రువు అయ్యాడు.

ఓసారి అహీయా ప్రవక్త యెరూషలేము ప్రక్కన వున్నపొలంలో ఈ యరోబాముని కలసికొన్నాడు. అప్పడు ప్రవక్త కొత్త అంగీని ధరించి వున్నాడు. అతడు ఆ యంగీని పండ్రెండు ముక్కలుగా చించి పదింటిని యరోబాముకిచ్చి నీవు వీటిని తీసికో అన్నాడు. దీని భావమిది. సొలోమోను రాజ్యంలో పండ్రెండు తెగల యిస్రారాయేలీయులున్నారు. వారిలో యూదా బెన్యామీను అనే రెండు తెగలవారికి మాత్రమే ఇకమీదట సొలోమోను వారసులు రాజులౌతారు. తతిమ్మా పది తెగలు చీలిపోయి కొత్త రాజ్యమౌతాయి. వీటికి యరోబాము అతని అనుయాయులు రాజులౌతారు.

ప్రవక్తలు తమ బోధలను నటించి చూపించేవాళ్ళు. ఈ సంఘటనం అలాంటి నటనాత్మకమైన బోధ. అహీయా ప్రవక్త సొలోమోనుకి విరోధి. ఆ రాజు ప్రభువు ధర్మశాస్తాన్ని మీరడం జూచి ,అహీయా మరికొందరు ప్రవక్తలు అతన్ని ఎదిరించారు. సాలోమోను అన్యజాతుల దైవాలను పూజించి ప్రభువుకి ద్రోహం చేసాడు. కనుక దేవుడు అతని రాజ్యాన్ని రెండు ముక్కలు చేసాడు. ఈ సంగతిని అతడు తన భక్తుడైన ప్రవక్తద్వారా ముందుగానే ఎరిగించాడు. సొలోమోను విగ్రహారాధకుడైనా అతని తండ్రి గొప్ప దైవభక్తుడు. ఏకైక హృదయంతో, అనన్యచిత్తంతో యావేను కొల్చినవాడు. కనుక ప్రభువు తనకు దావీదుపై గల ఆదరభావంచే రాజ్యవిభజనాన్నిసొలోమోను కాలంలో జరిగించనన్నాడు. ఆ కార్యం సొలోమోను కుమారుడైన రెహబాము కాలంలో జరుగుతుందని చెప్పాడు. యరోబాము సాలోమోనుమీద చిన్న తిరుగుబాటు చేసాడు. ఆ రాజు అతన్ని చంపజూచాడు. కాని అతడు ఈజిప్టుకి పారిపోయి షీషకు ఫరో మరుగుజొచ్చాడు. సొలోమోను చనిపోయేవరకు అక్కడే వున్నాడు. ఈ షీషకు రెహబాము కాలంలో యూదామీదికి దండెత్తివచ్చి అతన్ని కొల్లగొట్టాడు. కాని సేవకుడైన యరోబాము ఏలా రాజయ్యాడు? సాలోమోను చనిపోగా అతని కుమారుడు రెహబాము రాజ్యానికి వచ్చాడు. అతని పట్టాభిషేకం షెకెము పుణ్యక్షేత్రంలో జరిగింది. సొలోమోను చనిపోయాడని తెలిసి యరోబాము యూదాకు తిరిగివచ్చాడు. అక్కడ రెహబాము పట్టాభిషేకానికి వచ్చిన యిప్రాయేలు పెద్దలందరు అతనితో అయ్యా! మీ నాయన పెద్ద భవనాలు కడుతూ మాచేత వెట్టిచాకిరి చేయించుకొన్నాడు. మామీద పెద్ద పన్నులు విధించాడు. ఈ భారాన్నిమేమిక మోయలేం. నీవైనా ఈ బరువుని తగ్గించవా అని అడిగారు. రెహబాము తన తండ్రికి సేవలు చేసిన వృద్దులను పిలిపించి ప్రజలు నన్నీలా అడుగుతున్నారు. నేను వారికేమి సమాధానం చెప్పాలి అని ప్రశ్నించాడు. ఆ వృద్దులు నీవు ఈ పెద్దలకు ప్రీతి కలగేలా మాటలాడు. వాళ్ళ జీవితాంతం నీకు లొంగివుంటారు అని చెప్పారు.

కాని రెహబాము ఆ వృదుల సలహాను పాటించలేదు. తనతో పెరిగిన యువకులను ఆలోచనం అడిగాడు. వాళ్ళు దుష్టాలోచనం చెప్పారు. ఆ దుష్టసలహా ప్రకారం అతడు యిస్రాయేలు పెద్దలతో పరుషంగా మాటలాడాడు. నేను మా తండ్రి మీపై మోపిన భారాన్ని ఇంకా రెండంతలు చేస్తాను. అతడు మిమ్మ శిక్షించినదానికంటె నేను రెండంతలు అదనంగా శిక్షిస్తాను అన్నాడు.
ప్రభువు తన భక్తుడైన అహీయా ప్రవక్తద్వారా సెలవిచ్చినట్లే యరోబామును రాజును చేయగోరి రెహబాముకి ఈ దుర్బుద్ధి పుట్టించాడు-12, 14
రాజు ఈలా మూర్ధంగా మాట్లాడితే ప్రజానాయకులు సహిస్తారా? వాళ్ళ రోషం తెచ్చుకొని రెహబాముమీద తిరుగుబాటు చేసారు. తమలో తాము మనమిక దావీదు వంశజులతో కలసి వుండవద్దు. మనదారి మనం చూచుకొందాం అనుకొన్నారు. కనుక ఉత్తరానవున్నపది తెగల యిస్రాయేలీయులు యూదా బెన్యామీను గోత్రాలనుండి విడిపోయి 

స్వతంత్రరాజ్యాన్ని ఏర్పరచుకొన్నారు. రెహబాము తన సైన్యాధిపతి అదోరాముని ఉత్తరపు తెగల మీదికి పంపాడు. కాని వాళ్ళతన్ని వధించారు. రాజుకూడ యెరూషలేముకి పారిపోయి ప్రాణాలు దక్కించుకోవలసి వచ్చింది. ఉత్తర తెగవాళ్ళు యరోబాముని రాజుగా ఎన్నుకొన్నారు. అతడు సమరియా పట్టణాన్ని రాజధానిగా జేసికొని ఉత్తర రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాడు. దక్షిణాన యెరూషలేమునుండి రెహబాము రెండు తెగల వాళ్ళను పాలించాడు. అటుపిమ్మట రెహబాబు ఉత్తరరాజ్యం వాళ్ళను లొంగదీసుకోవడానికై పెద్ద సైన్యంతో యుద్దానికిపోయాడు. కాని షెమయా అనే ప్రవక్త ప్రభువు పంపగా వచ్చి రెహబాముతో ఈ రాజ్య విభజనం ప్రభువు సంకల్పం వలన జరిగింది. కనుక మీరు మీ సోదరులైన ఉత్తరాది తెగల వారిమీదికి పోకండి అని చెప్పాడు. రెహబాము యుద్ధం చాలించి వెనుకకు వచ్చాడు. ఈ విధంగా సొలోమోను విగ్రహారాధనం వలన, రెహబాము మూర్ఖత్వం వలన యిస్రాయేలు రాజ్యం రెండు భాగాలుగా చీలిపోయింది. ఇది ప్రభువు నిర్ణయించిన కార్యం ప్రవక్తలు దీన్ని ముందుగానే తెలియజేసారు. అంతా వాళ్లు చెప్పినట్లే జరిగింది. రాజ్యవిభజనం క్రీస్తుపూర్వం 931లో జరిగింది. 722లో ఉత్తర రాష్ట్రం అస్సిరియా రాజుకు చిక్కి నాశమైపోయింది. అంతవరకు, అనగా 209 యేండ్లకాలం ఆ రెండు రాజ్యాలు పరస్పరం పోట్లాడుకొంటూ వచ్చాయి.

3. ప్రార్ధనా భావాలు

1. చరిత్రగతిని నడిపించేవాడు ప్రభువు. అతడు సాలోమోను పాపాలకు శిక్షగా యిస్రాయేలు రాజ్యాన్ని విభజించాలనుకొన్నాడు. ఆ సంగతిని అహీయా ప్రవక్తద్వారా ముందుగానే ఎరిగించాడు. సొలోమోను సేవకుడైన యరోబాముని రాజుని చేసాడు. రెహబాము ఉత్తర రాజ్యం మీదికి దండెత్తబోతూంటే షమయా ప్రవక్తద్వారా ఆ ప్రయత్నాన్ని వారింపజేసాడు. ఈ యంశాలనుండి మనం చరిత్రగతిని నడిపించేవాడు ప్రభువేనని అర్థంజేసికోవాలి. అతడు నేడు మన జీవితంలోని సంఘటనలనుగూడ నడిపిస్తూంటాడు. అతని అనుమతి లేనిదే మనకు మంచీ జరగదు, చెడ్డా జరగదు. దేవుణ్ణి ప్రేమించేవాళ్ళకు అన్నీ అనుకూలంగానే జరిగిపోతాయి-రోమా 8,28. కనుక భక్తిమంతులు తమ జీవితంలో జరిగే ప్రతిసంఘటనంలోను దేవుని హస్తాన్ని దర్శిస్తారు. రెహబాము సన్నిహితులు అతనికి దుష్టసలహా చెప్పారు. దానివలన అతడు యిస్రాయేలు పెద్దలపట్ల మూర్ధంగా ప్రవర్తించి రాజ్యవిభజనకు కారకుడయ్యాడు. మనం ఎవరికీ దుష్టాలోచనలు కలిగించకూడదు. ఇతరులు మనకు దుష్టాలోచనలు పట్టిస్తే వాటి ప్రకారం నడవకూడదు. మనం ఇచ్చే సలహాకాని, పొందే సలహాకాని దేవుడు ఆమోదిస్తాడా అని పరిశీలించి చూచుకోవాలి. భక్తులు ఇతరులకు మంచి సలహాలనిచ్చి లోకానికి ఎంతో మేలు చేసారు, దుషులు దుష్ట సలహాలనిచ్చి ఎంతో కీడుకూడ చేసారు.

సొలోమోను మహాజ్ఞాని. ఐనా అతడు విగ్రహారాధనకు పాల్పడి యిస్రాయేలు రాజ్యానికి వినాశం తెచ్చిపెట్టాడు. అతడు మోషే ధర్మశాస్రాన్ని మీరి అన్యజాతుల ఆడపడుచులను వివాహం చేసికొన్నాడు. వారి దైవాలను తానూ ఆరాధించి పాపం కట్టుకొన్నాడు – 11.2-4 అతనిపై కోపించి ప్రభువు రాజ్యాన్ని విభజించాడు. నేడు మనం విగ్రహాలను కొలవకపోయినా లోకవస్తు వ్యామోహాల్లో పడిపోతుంటాం. ధనం, పదవులు, పేరుప్రతిష్టలు మొదలైన వాటిని ఆర్ధించటానికి నానా గడ్డీ తింటాం. ఈ వ్యామోహాలు మనలను నాశంజేస్తాయి. సృష్టి వ్యామోహాల్లో జిక్కి సృష్టికర్తను విస్మరించకుండా వుండేవాడు ధన్యుడు.

ప్రవక్తలు తమ బోధలను నటించి చూపించారన్నాం. ఆహీయా తన అంగీని ముక్కలుగాచించి యిప్రాయేలు రాజ్యం రెండు భాగాలుగా చీలిపోతుందని చెప్పాడు. ఈ పద్ధతి నూతవేదంలోకూడ కన్పిస్తుంది. క్రీస్తు అంజూరాన్ని శపించడం నటనాత్మకమైన బోధ -మత్త21, 19. ఈ యంజూరం యిస్రాయేలు నాయకులకు గుర్తు. క్రీస్తు బోధలను నిరాకరిస్తే వాళ్ళు ఆ చెట్టులా ఎండిపోతారని భావం, అగబు ప్రవక్త పౌలు నడికట్టతో తన కాలు సేతులు బంధించుకోవడం నటనాత్మకమైన బోద - అ, చ.21, 10-11. ఇక్కడ యూదులు పౌలుని బంధించి రోమీయులకు అప్పగిస్తారని భావం, పూర్వవేద ప్రవక్తలు మన నూతవేదపు అర్యశిపుల్లాంటివాళ్ళ భగవంతుణ్ణి బాగా అనుభవానికి తెచ్చుకొన్న భక్తులు, రాజుల గ్రంథాలు మాటిమాటికీ ప్రవక్తలను పేర్కొంటాయి.ప్రభువు వారిద్వారా మాటలాడతాడని చెప్తాయి. బైబుల్లోని వారి బోధలను చదువుకొని నేడు మనంకూడ ప్రేరణం పొందాలి.

11. సారెఫతు వితంతువు 1రాజు 17

1. సందర్భం

అహాబురాజు క్రీస్తుపూర్వం 871-52 వరకు ఉత్తర రాజ్యమైన సమరియాను ఏలాడు. ఆ దేశాన్ని పాలించిన సమర్ధులైన రాజుల్లో అతడూ వొకడు. ఆ రాజు సీదోను రాజు కొమార్తెయైన యెసెబెలును పెండ్లాడాడు. సీదోను రాజ్యంలో ప్రజలు బాలుని కొల్చేవాళ్లు కనుక ఆ రాణి తన పట్టింటి మతాన్ని యిస్రాయేలు దేశానికిగూడ తీసికొని వచ్చింది. ఆ రోజుల్లో యిస్రాయేలు చుట్టపట్లవున్న కనానీయ జాతులన్నీ ఈ దేవుణ్ణి కొల్చేవి. కనుక యావేపట్ల భక్తిలేని యూదులు చాలమంది ఈ బాలు ఆరాధనలో పడిపోయారు. ఆ రోజుల్లో ఇది పెద్ద సమస్య ఐంది. అహాబు రాజు ఆర్థిక రాజకీయ విషయాలేగాని మతవిషయాలు పట్టించుకొనేవాడు కాదు. ఈలాంటి పరిస్థితుల్లో ప్రభవు ఏలీయా ప్రవక్తను తన సేవకు పిల్చాడు. ఈ ప్రవక్త బాలు ఆరాధనను నిరసించి యావే మతాన్ని నిలబెట్టడానికి కంకణం కట్టుకొన్నాడు. అతడు యావే ప్రభువుపట్ల మహాభక్తి ఆసక్తి కలవాడు. పూర్వవేదంలోని భక్తాగ్రేసరుల్లో వొకడు. ఈ కథలోను రాబోయే కథల్లోనుగూడ మనం ఏలీయా చరిత్రను చూస్తాం. యేలీయా అతని శిష్యుడైన యెలీషా కథలు యిస్రాయేలీయుల జానపద గాథలకు సంబంధించినవి. హీబ్రూ రచయితలు నిష్కపటులైన పల్లె ప్రజలను ఉద్దేశించి మొదట ఈ కథలను చెప్పారు.

2. వివరణం

ఈ యధ్యాయంలో రెండు భాగాలున్నాయి. మొదటిది, అనావృష్టి వస్తుందని యెలీయా ముందుగానే రాజుకి తెలియజేయడం-1-7, రెండవది, వితంతువు కథ 8-24. మొదట అనావృష్టి కథను చూద్దాం. ఏలీయా రాజు దగ్గరికి వెళ్ళి నేను బాలుని నిరాకరించి యావే ప్రభువుని కొల్చే ప్రవక్తనని చాటిచెప్పకొన్నాడు. దేశంమీదికి కరువు వస్తుందనీ, తాను కురవమంటేనేగాని వాన కురవదనీ ఖండితంగా చెప్పాడు. యావేమతానికీ బాలు మతానికీ బద్దవైరం. బాలు వరానికీ పైరుపంటలకీ జంతుగణాభివృద్ధికీ నరసంతానానికీ అధిపతియని అతని భక్తుల నమ్మకం. ఏలీయా నేను దేశంమీదికి కరువు తెప్పిస్తాను, మీరు కొల్చే బాలు నిజంగా దేవుడైతే వాన కురిపించమనండి చూద్దాం అని రాజుని సవాలు జేసాడు. అసలు అహాబు విగ్రహారాధన పాపంవల్లనే కరువు వచ్చిందని ఎత్తిపొడిచాడు. ప్రవక్త నేను ఆజ్ఞాపిస్తే తప్ప ఈ దేశంలో వాన కురవదని అన్నాడు. ప్రవక్త వాక్కులోని శక్తి అమోఘమైంది.ఈ యధ్యాయంలో యావే ఆరాధనం, ప్రవక్త వాక్కులోనిశక్తి అనే రెండంశాలూ ముఖ్యమైనవే. తన శాపవాక్యాలతో దేశంమీదికి కరువును రప్పించినందుకు రాజు ఏలీయాను చంపజూచాడు. కనుక ప్రవక్త పారిపోయి కెరీతువాగు పారే అరణ్యప్రాంతంలో తలదాచుకొన్నాడు. ప్రభువు తన ప్రవక్తను కాపాడతాడు కదా! కనుక దేవుని ఆజ్ఞపై రోజూ రేపూమాపూ కాకులు అతనికి రొట్టెలు కొనివచ్చేవి. ఆ కరవకాలంలో ప్రవక్త ఆ రొట్టెను తిని, ఆ వాగులోని నీళ్లు త్రాగి తన ప్రాణాలు నిల్పుకొన్నాడు. పూర్వం ప్రభువయిస్రాయేలు ప్రజలనుగూడ ఈ రీతినే ఎడారిలో అద్భుతంగా దయచేసిన ఆహారంద్వారా కాపాడాడని చదువుతున్నాం - నిర్గ 16,8. సరే, కొంతకాలానికి కరవు మదరగా కేరీతు వాగుకూడ వట్టిపోయింది. ఇక, రెండవభాగం సారెఫతు వితంతువు కథ, ప్రభువు ఏలీయాను కెరీతువాగు నుండి సీదోను దేశంలోని సారెఫతు నగరంలో వసించే ఓ వితంతువు దగ్గరికి పంపాడు. ఈ దేశంలో బాలుని కొల్చేవాళ్ళని చెప్పాం. యావేయిస్రాయేలు దేశంలోలాగే ఇక్కడకూడా అనావృష్టిని కలిగించాడు. ఐనా అతడు తన భక్తురాలైన వితంతువనీ ఆమె కుమారునీ మాత్రం చావునుండి కాపాడగోరాడు.

ప్రవక్త నగర ద్వారంవద్ద ఆ పేదరాలిని కలిసికొని అమ్మా! నాకు కొంచెం మంచినీళ్ళూ ఓ రొట్టా తీసికొనిరా అని చెప్పాడు. ఆమె నాయనా! ఈ కరవు కాలంలో రొట్టె లెక్కడివి? మా యింటిలో యింకా పిడికెడు గోదుమ పిండీ, కొంచెం ఓలివు నూనే మిగిలివున్నాయి. వాటితో చివరిరొట్టె కాల్చుకొని నేనూ నా కుమారుడూ తింటాం. ఆ మీదట కరువు వాతబడి చస్తాం అంది. ఆ మాటలకు ప్రవక్త తల్లీ! నీవూ నీ కుమారుడూ భుజించకముందు నాకొక రొట్టె చేసిపెట్టు. ప్రభువు నిన్నుకరుణిస్తాడు. నీకు యావే దీవెన యిది. ప్రభువు ఈదేశంలో వాన కురిపించేవరకు మీ కుండలోని పిండిగాని, పిడతలోని నూనెగాని తరగిపోవు అని చెప్పాడు. 

ఆ వితంతువు ప్రవక్తమాట నమ్మింది. ముందుగా అతనికి రొట్టెజేసిపెట్టింది. తర్వాత తనూ తన కుమారుడూ రొట్టె కాల్చుకొని భుజించారు. ఈలా ఆ కరవు కాలమంతా గడచిపోయింది. మొదట తన వాక్కుతో వానను ఆపివేసిన ప్రవక్త ఇప్పడు మళ్ళా అదే వాక్కుతో ఆహారాన్ని కూడ సృజించాడు. ప్రభువే తన ప్రవక్త వాక్కుద్వారా పనిచేస్తుంటాడు. ఇక్కడ అహాబు విగ్రహారాధనం కరువుని తెచ్చిపెడితే, ప్రవక్త భక్తి వితంతువు విశ్వాసం ఆహారాన్ని చేకూర్చిపెట్టాయి. ఈ కథ ఈలా వుండగా ఇంకో సంఘటనం జరిగింది. వితంతువు ఏకైక కుమారుడు జబ్బుపడి చనిపోయాడు. ఆమె ప్రవక్తను నిషురాలాడింది. అయ్యా! నీవు దైవభక్తుడివి కదా! నీవు నా రహస్యపాపాలను నీ దేవునికి తెలియజేసావు. అతడు నాపై కోపించి నా కుమారుడ్డి చంపివేసాడు చూడు అంది. ప్రవక్త బాలుని మృతదేహాన్ని తన గదిలోనికి తీసికొనిపోయాడు. ఆ శవంపై బోరగిలపడి తన శ్వాసను దానిలోనికి వూదాడు. ఆ బాలుని బ్రతికించమని దేవునికి మనవిచేసాడు. ప్రవక్తవాక్కు శక్తిమంతమైనది కదా! దేవుడు అతని మొరవిని చనిపోయిన బిడ్డట్టిబ్రతికించాడు. అతడు ప్రాణాలు తీసేవాడూ తిరిగి యిచ్చేవాడూకూడ. నూతవేదంలో పౌలుకూడ ఇదే పద్ధతిలో త్రోయపట్టణంలో ఐతుకు అనే యువకుణ్ణి బ్రతికించాడని చదువుతున్నాం - అ,చ,20,9-10.

వితంతువు చనిపోయిన బిడ్డడు మళ్ళా బ్రతకడం జూచి పరమానందం చెందింది. ఆమె ప్రవక్త వాక్కులోని శక్తిని గుర్తించింది. అతడు కొలిచే యావే ప్రభువుని విశ్వసించింది.

3. ప్రార్ధనా భావాలు

1. ప్రభువు తన భక్తులందరినీ ఆహారంతో పోషిస్తాడు. అతడు ప్రాణిపోషకుడు. ఆకాశపక్షులను పోషించే ప్రభువు తనకు పోలికగావుండే నరులకు తిండి పెట్టడా? కనుక మనం ఆందోళనం చెందకూడదు - మత్త 6,25-26.

2. రాజులు మొదలైన చారిత్రక గ్రంథాలను వ్రాసిన హీబ్రూరచయితలకు ప్రవక్తల వాక్కులంటే పరమగౌరవం. ఈ యధ్యాయం ఏలీయా వాక్కులోని శక్తిని మూడు పర్యాయాలు పేర్కొంటుంది. అతని మాటపై దేశంలో వాన కురవడం ఆగిపోయింది-1. అతని వాక్కవితంతువు కుటుంబానికి ఆహారం చేకూర్చి పెట్టింది -14, అతని పలుకు పోయిన పిల్లవాడి ప్రాణాన్ని మళ్ళా తీసుకువచ్చింది-22. ఈ ప్రవక్తల వాక్కులనే యిప్పడు బైబుల్లో మన కొరకు పదిలపరచి వుంచారు. కనుక మనం వాటిని భక్తిభావంతో చదువుకోవాలి.

3. సీదోను వితంతువు విశ్వాసం మెచ్చుకోదగింది. ఆమె ప్రవక్త వాక్యాన్ని నమ్మి మొదట అతనికి రొట్టెజేసి పెట్టింది. తత్ఫలితంగా ఆమెకు రోజురోజు రొట్టె లభించింది. దైవభక్తునిపట్లగల నమ్మకంద్వారా ఆమె ఆహారం సంపాదించుకొంది. క్రీస్తుకూడ ఆమె విశ్వాసాన్ని పొగడాడు-లూకా 4,25. ఈమెలాగే మనంకూడ విశ్వాసాన్ని పెంచుకోవాలి.

4. ఆ వితంతువు మొదట ప్రవక్తకు భోజనం పెట్టింది. తర్వాత తాను తింది. దైవభక్తునిపట్ల ఆమె చూపిన శ్రద్దా గౌరవమూ ఆలాంటివి. మనంకూడ మన ప్రేషిత సేవలో మొదట దేవుని ప్రజల అక్కరలు తీర్చాలి. ఆ పిమ్మట మన అక్కరలు తీర్చుకోవాలి. మొదట దైవసేవ, అటుపిమ్మట మన అక్కరలూ సుఖాలూ మొదలైనవి. భక్తిలేని గురువు మఠకన్య ఉపదేశి మొదలైన దైవసేవకులు మొదట తమ అవసరాలను తీర్చుకొంటారు. దేవుని ప్రజలను పట్టించుకోరు. కాని భక్తిగల దైవసేవకులు ఆ సారెఫతు విధవలాగే మొదట విశ్వాసుల అవసరాలను తీరుస్తారు.

12. కర్మెలు కొండమీద ఏలీయా 1 రాజు 18

1. సందర్భం

కర్మెలు కొండమీద యావేకి బాలుకీ పోటీ జరిగింది. ఆ పోటీలో యావే గెల్చి బాలు ఓడిపోయాడు. ఏలీయా సమరియా దేశంలో యావేమతాన్ని పునరుద్ధరించాడు. యిస్రాయేలీయులను మళ్ళా ప్రభువు దగ్గరకి రాబట్టాడు. భగవంతునిపట్ల భక్తి ఆసక్తి వున్న నాయకులందరికీ అతడు ప్రేరణంగా వుంటాడు.

2. వివరణం

మూడేండ్లపాటు ఉత్తర రాష్ట్రమైన సమరియాలో కరువు వికటాట్టహాసం చేసింది. ఆమీదట ప్రభువు క్షమాన్ని తొలగించాలనుకొన్నాడు. తన ప్రవక్తను అహాబు రాజు దగ్గరికి పంపాడు. దారిలో ప్రవక్త అహాబు ముఖ్యమంత్రియైన ఓబద్యాను కలసికొన్నాడు. ఇతడు యావేభక్తుడు, యెసెబెలు బారినుండి యావే ప్రవక్తలను కాపాడినవాడు. అప్పడు ఓబద్యా దేశంలోని వాగుల్లోను చెలమల్లోను ఏపాటి నీరు మిగిలివుందా అని పరిశీలించి చూస్తున్నాడు. నీరు చాలినంత లేకపోతే కొన్ని పశువులను చంపవలసి వుంటుంది.

ప్రవక్త ఓబద్యాను రాజుకి తన సమాచారం తెలియజేయమన్నాడు. మంత్రి దడిసాడు. ఎందుకంటే ఏలీయా ఒక్కతావలో వుండడు. ప్రభువు ఆత్మ అతన్ని చోటునుండి చోటుకి త్రిప్పతూంటుంది. ఏలీయా పలానాచోట వున్నాడని ఓబద్యా రాజుకి చెస్తే, కడన అతడు ఆ తావులో కన్పించకపోతే రాజు కోపంతో ఓబద్యానే చంపివేయవచ్చు. ఆ రాజు ఏలీయాకోసం అంతటా వెతికిస్తున్నాడు, దేశం మీదికి అనావృష్టిని తీసుకొచ్చింది ప్రవక్షే కనుక అతన్ని పట్టుకొని చంపించాలని ప్రయత్నం చేస్తూన్నాడు.

కడన రాజు ఏలీయాను కలసికొన్నాడు. ఈ దేశానికి నీపీడ పట్టింది అని అతడు ప్రవక్తను నిందించాడు.అనగా ఏలీయా బాలు దేవతను అవమానించాడు కనుక ఆ దేవుడు వానను ఆపివేసాడని రాజు భావం. దేశానికి నా పీడ కాదు నీ పీడే పట్టిందని ప్రవక్త రాజుని నిందించాడు. అనగా రాజు బాలుని కొల్చినందున యావే వానను ఆపివేసాడని ప్రవక్త భావం.

ప్రవక్త రాజుని సవాలు చేసాడు. నీ రాణి పోషించే 450 మంది బాలు ప్రవక్తలనీ యిస్రాయేలు ప్రజలనీ కర్మెలు కొండమీదికి తీసికొనిరా. అక్కడ ఏ దేవుడు నిజమైనవాడో నేనే నిరూపిస్తాను అన్నాడు, రాణి ఈ ప్రవక్తలను రాజు కోశాగారంలోని ధనంతో పోషిస్తూంది. రాజు ప్రవక్త సవాలుని అంగీకరించాడు. కర్మెలు కొండమీద ఇద్దరు దేవుళ్ళకూ పోటి జరగబోతూంది.

రాజూ బాలు ప్రవక్తలూ యిస్రారాయేలీయులూ ఏలీయా అంతా కర్మెలు కొండమీద పోగయ్యారు. ఈ కొండమీదనే ఏలీయా చాలాకాలం ఏకాంతంగా వసించాడు. అది దైవసాన్నిధ్యానికి నిలయం. అతడు ప్రజలను ఈలా షరతు పెట్టాడు. "మీరు ఇప్పటివరకు బాలనీ యావేను కూడ పూజిస్తున్నారు. ఇకమీదట ఎవరో వొక దేవుణ్ణి మాత్రమే ఎన్నుకోండి. ఏలా ఎన్నుకోవాలి? బాలు ప్రవక్తలను ఒక యెదుని కోసి దాని మాంసాన్ని బలిపీఠంమీద పెట్టమనండి. నేనూ ఒక యెదుని కోసి దాని మాంసాన్ని బలిపీఠంమీద పెడతాను. ఇద్దరమూ మా దేవుళ్ళకు ప్రార్థన చేస్తాం. ఏ దేవుడు నిప్పనిపంపి బలిపీఠంమీది మాంసాన్ని దహిస్తాడో అతడే నిక్కమైన దేవుడు, మీరు ఇకమీదట అతన్ని మాత్రమే కొల్వాలి సుమా" అన్నాడు. ప్రజలంతా ఆ షరతుని అంగీకరించారు.

మొదట బాలు ప్రవక్తల వంతు, వాళ్ళు ఎద్దునికోసి మాంసం పీఠంపై పేర్చి వాళ్ళ దేవుణ్ణి ఆవాహనం చేసారు. ఉదయం నుండి సాయంకాలందాకా పెద్ద శబ్దంతో జూలుకి ప్రార్ధన చేసారు. కాని ఆ దేవుడు పలకలేదు వులకలేదు. ఏలీయా వాళ్ళను వేళాకోళం చేసాడు. మీ బాలు ఏదో ఆలోచనలోనో పనిలోనో పడివుండవచ్చు లేదా ప్రయాణంలోనో నిద్రలోనో మునిగివుండవచ్చు. ఇంకా పెద్దగా అరవండి. అతనికి విన్పిస్తుంది అని యెగతాళి చేసాడు. బాలు ప్రవక్తలు ఆవేశం తెచ్చుకొని ఇంకా పెద్దగా అరుస్తూ ప్రార్థనలు చేసారు. తమ శరీరాలను కత్తులతో కోసుకొని నెత్తురు కార్చుకొన్నారు. ఐనా వారి దేవత నుండి ఏ జవాబూ రాలేదు.

తరువాత ఏలీయా వంతు వచ్చింది. అతడుకూడ కొండపైన బలిపీఠం కట్టించాడు. ఎద్దుని కోయించి మాంసాన్ని పీఠంపై పేర్పించాడు. పన్నెండు కడవల నీళ్లు తెప్పించి పీఠంపై కుమ్మరించాడు. అది తడిసి మద్దయి పోయింది. ఆ నీళ్ళ పీఠంనుండి క్రిందికి కారి దానిచుటూ వున్న కందకాన్ని నింపాయి. అలా జలమయమైవున్న బలివేదికమీది మాంసాన్ని దేవుడు అగ్నితో కాల్చివేయాలి. పూర్వం మోషేకూడ యిస్రాయేలు ప్రజలను సీనాయి కొండదగ్గర ప్రోగుజేసి అక్కడ ఓ బలిపీఠాన్ని కట్టించాడు. కోడె నెత్తుటిని ఆ బలిపీఠం మీద చల్లి దేవునితో నిబంధనం చేయించాడు - నిర్ల 24,4-8. కనుక ఇక్కడ కర్మెలు కొండమీది యేలీయా ఆ సీనాయి కొండమీది మోషేను జ్ఞప్తికి తెస్తాడు.

ఏలీయా బాలు ప్రవక్తలకంటె భిన్నంగా జపించాడు. ప్రభూ! నీవు యిస్రాయేలుకి దేవుడివి. నీకొరకే నేను ఈ శ్రమంతా పడుతున్నాను. నా మొర ఆలించి అగ్నిని పంపు. అవిశ్వాసంతో నీ చెంతనుండి వెళ్ళిపోయిన ఈ ప్రజలను మళ్ళా నీ దగ్గరికి రాబట్టుకో అని మనవిచేసాడు. అతడు సంగ్రహంగాను నిమ్మళంగాను ప్రార్థించాడు. బాహ్యాడంబరం ఏమీ లేదు.

అది యిప్రాయేలీయులు సాయంకాలం ప్రభువుకి బలులు అర్పించే సమయం. ఏలీయా ప్రార్థన చేసాడో లేదో దేవుడు పంపిన అగ్నిదిగివచ్చి ఎద్దు మాంసాన్నీ కట్టెలనూ కందకంలోని నీటినీగూడ దహించి వేసింది. ఆ యగ్నినిజూచి ప్రజలు ఆశ్చర్యపోయారు. సాష్ట్రాంగపడి దండం పెట్టారు. యావే ఒక్కడే నిక్కమైన దేవుడని అరచారు. దానితో దొంగ దేవుడెవరో యధార్థమైన దేవుడెవరో తేలిపోయింది. పోటీలో యావే గెల్చాడు.

బాలు ప్రవక్తలను పారిపోనీయకుండా పట్టుకొండని యేలీయా ప్రజలను ఆజ్ఞాపించాడు. వాళ్ళ 450 మందినీ బంధించారు. ఏలీయా వాళ్ళందరినీ వధించాడు. బాలు తన భక్తులను కాపాడలేకపోయాడు. నేడు మనం ఏలీయా అంతమందిని చంపటం హింసకాదా అని ప్రశ్నిస్తాం. కాని ఆ రోజుల్లో పరిస్థితి వేరు. యావే బాలు దేవరల మధ్య పోటీ యుద్ధంలాంటిది. ఆకాలంలో పోరులో గెల్చినవాళ్ళు ఓడిపోయినవాళ్ళను చంపేవాళ్ళ కనుక ఇక్కడ యావే భక్తులు బాలు భక్తులను చంపారు. ఇంకా, ప్రజలను అపమార్గం పట్టించే కపట ప్రవక్తలను పట్టి చంపివేయాలని మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది -

ద్వితీ 13,5. ఏలీయా ఇక్కడ ఈ యాజ్ఞనుకూడ పాటించాడు.

బాలుతో పోటీ ముగిసింది. ప్రజలు దేవుడు పంపిన నిప్పనీ, కపట ప్రవక్తల నెత్తటినీ చూచి యావే వొక్కడే దేవుడని నమ్మారు. అతనివద్దకు తిరిగివచ్చారు. కాని అహాబు ఇంకా యావేచెంతకు తిరిగిరాలేదు. అతడు బాలు ఓటమిని చూసూ వూరకుండిపోయాడు. మరి.అతన్నిగూడ ప్రభువు దగ్గరికి రాబట్టడం ఏలా? వర్షంద్వారా.

కొండమీద బలి సమర్పిస్తున్నారు కనుక ఇంతవరకు అందరూ ఉపవాసం చేసారు. ఇప్పడు ఆ బలి ముగిసింది. కనుక ప్రవక్త రాజుతో నీవువెళ్ళి భోజనం చేయవచ్చు అని చెప్పాడు. తానేమో తలను కాళ్ళమధ్య పెట్టుకొని గాఢమైన ప్రార్థనలో మునిగిపోయాడు. ఆ ప్రార్ధనం వానకొరకే.

అతడు సేవకునితో నీవు సముద్రంవైపు పారజూడు. మజేమైనా లేచిందేమో చూడు అన్నాడు, సేవకుడు ఆరుసార్లు సాగరంవైపు చూచినా మేఘమేమీ కన్పించలేదు. కాని ఏడవసారి చూచేప్పటికల్లా మూరెడంత మబ్బు తునక కన్పించింది. కాని ఆ చిన్న మబ్బులో దేవుని హస్తం వుంది. కనుక అది అంతై యింతై మహా మేఘమై ఆకాశాన్నంతటినీ ఆవరించి కుంభవర్షం కురిపించింది. మూడేండ్ల తర్వాత దేశంలో కరువు తొలగిపోయింది. ఈ వానను కురిపించింది బాలుకాదు, యావే. బాలు వానదేవుడుగా ప్రసిద్ధిపొందినా శక్తి లేనివాడు. భూమ్యాకాశాలనూ ప్రకృతి శక్తులనూ నడిపించేదీ శాసించేదీ యావే ప్రభువు వొక్కడే.

అహాబుకి విషయం అర్థమైంది. యావే శక్తి బాలు అశక్తి తెలిసింది. అతడు రథమెక్కి ఆవానలోనే తన రాజధానియైన యె(సెయేలుకు తిరిగిపోయాడు. అంతలోనే ప్రభువు ఆత్మ ఏలీయాను ఆవేశించింది. అతడు మహావేగంగా పరుగెత్తి రాజు రథం కంటె ముందుగానే యొస్రెయోలుకు చేరుకున్నాడు. కర్మెలు కొండకీ ఈ నగరానికీ 17 మైళ్ళ దూరం. అంతదూరమూ అతడు ఆత్మశక్తితో పరుగెత్తాడు. అతడు వార్తావహుడుగా వెళ్లి బాలు వోడిపోయాడనీ యావే గెల్చాడనీ రాజధాని నగరంలోని పౌరులకు చాటిచెప్పాడు అనుకోవాలి.


3. ప్రార్ధనా భావాలు

1. ఏలీయా జీవితాంతం బాలు ఆరాధనను ఎదిరించి నిల్చిన భక్తుడు. ఏకైక హృదయంతో యావేను కొల్చినవాడు. ఈనాడు మనం బాలు దేవతనీ విగ్రహాలనూ కొలవం. కాని మన శోధన మరోరూపంలో వుంటుంది. మనం కొల్చేది లోకవస్తువుల్ని. ప్రభువు ఇద్దరు యజమానులను సేవించవద్దని ఆదేశించాడు. ఈ యిద్దరు యజమానులు దేవుడూ లోకవస్తువులూను - మత్త 6,24. మామూలుగా మనం కొల్చే లోకవస్తువులు సుఖభోగాలు డబ్బు పదవి అధికారం పేరుప్రతిష్టలు మొదలైనవి. నరులంతా వీటికోసమే ప్రాకులాడుతూంటారు. మనం వీటిల్లోపడి దేవుణ్ణి పూర్తిగా విస్మరిస్తాం. ఇంత అవివేకం మరొకటిలేదు.

2. ఏలీయాకు నిజదేవునిపట్ల వున్న ఆసక్తిని మనం ఎంతైనా మెచ్చుకోవాలి. యిస్రాయేలీయులు సీనాయి దగ్గర యావేతో నిబంధనం చేసికొన్నవాళ్లు, అతని ప్రజలు, అతన్ని పూజించే భక్తులు. ఐనా వాళ్లు మూరులై యావేను విడనాడి బాలు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళను మళ్ళా ప్రభువు దగ్గరికి రాబట్టిందాకా ఏలీయాకు విశ్రాంతి లేదు. యిస్రెయొలు దేశంలో యూవే మతాన్ని పునరుద్ధరించిందాకా అతనికి నిద్రలేదు. ప్రేషిత సేవలో మనకుకూడ ఈ ప్రవక్తకున్న ఆసక్తి వుండాలి. ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసికొని వచ్చిందాకా మనంకూడ నిద్రపోకూడదు. 3. ఏలీయాలాంటి ఆధ్యాత్మిక నాయకులు మన ప్రజలకు ఎప్పుడూ అవసరమే. జనులు తెలియక దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. ఈ లోకమే, ఇక్కడి ఆకర్షణలే చాలు అనుకొంటారు. అలాంటివాళ్ళను నిరంతరమూ మళ్లా దేవుని దగ్గరికి తీసికొని వస్తూండాలి. మామూలుగా మన క్రైస్తవ సమాజంలో ఆధ్యాత్మిక నాయకులు గురువులు మరకన్యలు ఉపదేశులు ఉపాధ్యాయులు మొదలైనవాళ్లు. ఈ నాయకులు ఏలీయాలాంటి మహాభక్తులనుచూచి ప్రేరణం తెచ్చుకోవాలి. ఈ పాపపు లోకంలో ఆధ్యాత్మిక విలువలకు సాక్ష్యంగా నిలువాలి.


13. హోరేబు కొండమీద యేలీయా


1రాజు 19


1.సందర్భం

ఏలీయా బాలు ప్రవక్తలను చంపినందున యెసెబెలు రాణి అతనిమీద పగతీర్చుకోగోరింది. ప్రవక్త ఆ రాణికి దడిసి పారిపోయాడు. నిరుత్సాహంతో యావే మతాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని ఆపివేద్దామనుకొన్నాడు. చనిపోదామనికూడ తలంచాడు. హోరేబు కొండమీద ప్రభువు అతనికి దర్శనమిచ్చి ఓదార్చి తిరిగి పూర్వపు పనిమీద పంపాడు. జీవితంలో కష్టాలనూ ఆటంకాలనూ ఎదుర్కొని నిరుత్సాహం చెందేవాళ్ళకు ఏలీయా విషాదగాథ ప్రేరణం పట్టిస్తుంది.


2. వివరణం

బాలు ప్రవక్తలు ఓడిపోవడం, అద్భుతంగా వాన కురవడం అహాబు చూచాడు. ఐనా అతడు బాలు మతాన్ని విడనాడలేదు. యెసెబెలు రాణి ఏలీయాను 24 గంటల్లోనే చంపిస్తానని శపథం చేసింది. యావేపట్ల యిస్రాయొలీయుల విశ్వాసం చూద్దామా అంటే అదీ అంతంతమాత్రమే. అసలు వాళ్ళ నమ్మతగినవాళ్ళు కాదు. కనుక అతడు ప్రాణాలు కాపాడుకోగోరి యెసెయేలు నుండి పారిపోయాడు.

ప్రవక్త నిరుత్సాహం చెందాడు. విషాదానికి గురయ్యాడు. బేర్షణ పట్టణం వరకు వెళ్ళి సేవకుణ్ణి అక్కడే వదలివేసి. శోకంతో నరుల సాహచర్యాన్ని వదలివేసి, ఆహారంకూడ మానివేసి, యాత్రికుడై ఏకాంతంగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ రేగుచెట్టుక్రింద చతికిలబడి ఆ తావలోనే ప్రాణాలు విడిస్తే బాగుంటుందికదా అనుకొన్నాడు. తన పూర్వులైన మోష సమూవేలు మొదలైన భక్తులంతా యావే మతాన్ని నిలబెట్టలేకపోయారు. కన్ను 184 మూసారు. తాను వాళ్ళకంటె గొప్పవాడు కాదు. కనుక తానూ ఓటమిని అంగీకరించి కన్నుమూస్తే బాగుంటుంది- ఇవి యేలీయా విషాద భావాలు.

పూర్వం కష్టాల్లోయిస్రాయేలు భక్తులు చాలమంది ఈలాగే భావించారు. ప్రజలు మాటవినక తనమీద ఎదురుతిరిగితే మోషే ప్రాణాలు విడువగోరాడు - నిర్గ 32,32 చూపకోల్పోయిన తోబీతు యూతనలకు తట్టుకోలేక చనిపోగోరాడు-3,6. నీనివే పట్టణం నాశం కాలేదని బాధపడి యోనా ప్రాణాలు వదలివేయగోరాడు-4,3. దుర్మార్ణులైన ప్రజలు పెట్టే బాధలు భరించలేక యిర్మీయా అసువులుబాయగోరాడు - 20,14. బాధలు ఎదురైనపుడు నేడు మనమూ ఈలాగే చేస్తాం.
కాని ప్రభువు ఆపదలు వచ్చినపుడు తన భక్తులను వదలివేయడు కదా! అతడు ప్రవక్తకు దారిజూపడానికి ఓ దేవదూతను పంపాడు. ఆ దూత ప్రవక్తకు ఆహారమూ నీళ్లూ అందించాడు. అతనిచే రెండుసార్లు భోజనం చేయించాడు. హోరేబుకు వెళ్ళమని సలహా యిచ్చాడు. ప్రవక్త ఆ ఆహారబలంతో నలభైరోజులు నడచి హోరేబు కొండను చేరుకొన్నాడు.
అది దేవుని కొండ, పుణ్యక్షేత్రం. పూర్వం మోషే ఇక్కడే యావేను దర్శించాడు. యావే మతం ఇక్కడే ప్రారంభమైంది. ఆ మోషే పిలుపునీ ఉద్యమాన్నీ ఇప్పడు ఏలీయా కొనసాగించాలి. ఆనాడు మోషేకు దయచేసిన బలాన్నీ ప్రేరణనీ ప్రభువు ఇప్పుడు ఏలీయాకుకూడ ప్రసాదిస్తాడు. హోరేబు కొండమీది యేలీయా అదే కొండమీది మోషేను జ్ఞప్తికి తెస్తాడు.
ఏలీయా రాత్రి ఆ కొండలోని ఓ గుహలో నిద్రించాడు. ప్రభువు పూర్వం మోషేనుగూడ కొండనెర్రెలో పెట్టి వుంచినట్లుగా చదువుతున్నాం - నిర్గ23,22. ప్రభువు వాణి యేలీయాను నీవిక్కడ ఏం చేస్తున్నావు? యిస్రాయేలు దేశంలో వుండవలసిన వాడివి ఇక్కడున్నావేమి అని ప్రశ్నించింది. ప్రవక్త దేవునికి మూడంశాలను గూర్చి ఫిర్యాదు చేసాడు. 

1.తాను యావేను మాత్రమే కొలిస్తే యిప్రాయేలీయులు బాలుని కొల్చారు. 2. వాళ్లు యావే బలిపీఠాలను కూలద్రోసి అతని ప్రవక్తలను పట్టి చంపారు. 3. కడన ఆ ప్రజలు తన్ను కూడ చంపివేయజూస్తున్నారు. తానుకూడ పోతే యిక యావే మతాన్ని నిలబెట్టే దిక్కు వుండదు. ఇది ప్రవక్త ఆవేదన.

ప్రభువు వాణి యేలీయాను గుహనుండి కొండమీదికి ఎక్కిరమ్మంది. అతడు కొండశిఖరం ఎక్కాడు. అక్కడ పెనుగాలి, భూకంపం, అగ్నిజ్వాలలు మొదలైన భయంకర దృశ్యాలను చూచాడు. పూర్వం ఈలాంటి భీకర దృశ్యాల్లోనే హోరేబు కొండమీద దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు-నిర్ణ 19,16-19. కాని యిప్పడు ఈ యద్భుత సంఘనటల్లో దేవుడు లేడు. అవి కేవలం అతని ఆగమనాన్ని సూచించేవి మాత్రమే. 

ఈ సంఘటనలు ముగిసాక ఓ మెల్లని స్వరం విన్పించింది. ప్రభువు మృదువైన స్వరంతో యావే అనే తన పేరుని విన్పించాడు. ప్రవక్తనుగూడ పేరెత్తి పిల్చాడు - 13. ఇదే దైవసాక్షాత్కారం. ఈ యధ్యాయమంతటిలోను ముఖ్యమైన వాక్యం ఇదే. అది దేవుని స్వరమని యేలీయా వెంటనే గుర్తించాడు. కనుకనే అతడు భయభక్తులతో తన అంగీ చెంగుతో ముఖాన్నికప్పుకొన్నాడు. అపవిత్రుడైన నరుడు మహాపవిత్రుడైన దేవుణ్ణి కంటితో చూడకూడదు.

ఇక్కడ ప్రవక్తకు ప్రభువు స్వరం మెల్లగా విన్పించింది. దీని భావమేమిటి? ప్రభువు తన భక్తుడైన యేలీయాకు ఆత్మీయుడూ సన్నిహితుడూ అయ్యాడని అర్థం. మనం ఎదుటవున్నవాళ్ళతో పెద్దగాగాక మెల్లగా మాట్లాడతాం. గుసగుసలాడతాం. కనుక ఇక్కడ ప్రవక్త యావే యెదుట నిల్చివున్నాడని భావం. అతనికి ప్రభువు సాక్షాత్కారం కలిగిందని ఫలితార్థం.

ఈ దైవదర్శనంతో ఏలీయా నిరుత్సాహమూ విషాద భావాలు తొలగిపోయాయి. అతనికి మళ్ళీ ధైర్యంవచ్చింది. ప్రవక్త సమరియా దేశంలో తాను చేస్తున్న ప్రభువు పనిని ఆపివేసి నిరాశతో ఈ కొండకు వచ్చాడు. ప్రభువు అతన్ని ఉత్తేజపరచి మళ్లా పూర్వపు పనిమీద పంపాడు.

యావే ఏలీయాకు మూడు విషయాలు చెప్పాడు. 1) ప్రవక్త యావే మతోద్ధరణ కార్యక్రమాన్ని మానివేయకూడదు. కనుక అతడు తనకు వారసునిగా యెలీషాను అభిషేకించాలి-16. 2) యిప్రాయేలీయులలో భక్తివిశ్వాసాలు లేనివారిని హసాయేలు, యెహూ మొదలైనవాళ్లు శిక్షిస్తారు. 3) ఏలీయా తాను వంటరిగాడినని భయపడనక్కరలేదు. ప్రభువు అతనికి భక్తిమంతులైన యిస్రాయేలీయులను ఏడువేలమందిని తోడుగా ఇస్తాడు. వాళ్ళు బాలుని ఎంతమాత్రం కొలవరు.

ఈ దర్శనం ద్వారాను ఈ సందేశం ద్వారాను ప్రవక్త ఉత్తేజాన్ని తెచ్చుకొని కొండ దిగి వచ్చాడు. ఏలీయా తన దేశానికి తిరిగిరాగా ఓ తావులో ఎలీషా పొలం దున్నుతూ కన్పించాడు. ఇతడే ఏలీయాకు వారసుడు. కనుక ఏలీయా తన అంగీని తీసి దానితో యెలీషాను కప్పాడు. ఈ యంగీ దాన్ని తాల్చిన వ్యక్తినీ, ఆ వ్యక్తి హక్కులనూ తెలియజేస్తుంది. కనుక ఇక్కడ రెండంశాలను గుర్తించాలి. 1. ఏలీయా తన అంగీతో యెలీషాను కప్పడం ద్వారా అద్భుతాలుచేసే గురువశక్తి శిష్యుల్లోకి ప్రవేశించింది. యేలీయా దాటిపోయాక అతని అద్భుతాలను ఈ శిష్యుడు కొనసాగిస్తాడు. 2. గురువుకి శిష్యునిమీద హక్కులుంటాయి. కనుక యొలీషా ఇంటికివెళ్ళి తల్లిదండ్రులవద్ద సెలవు తీసికొని మళ్ళా గురువు దగ్గరికి రావాలి. అతని వుద్యమాన్ని కొనసాగించాలి.

ఎలీషా తాను పొలందున్నుతూన్న రెండెద్దులను వధించి మాంసం వండి 'తనతోపాటు వ్యవసాయంచేసే తోడి పనివారికి వడ్డించాడు. వాళ్ళంతా భుజించారు. హీబ్రూ సంప్రదాయం ప్రకారం గురువు దగ్గరికి వచ్చిన శిష్యుడు తన పూర్వజీవితాన్ని మార్చుకొంటాడు. కనుక యెలీషా తన వ్యవసాయ వృత్తిని మానివేసి గురువుగారిని అనుసరించాడు. అతడు యావే మతోద్ధరణ కార్యక్రమానికి పూనుకొన్నాడు.


3. ప్రార్ధనా భావాలు

1. ఏలీయా నిరాశతో యావే మతోద్దరణ కార్యక్రమాన్ని వదలివేయాలనుకొన్నాడు. దేవుడు అతనికి కొండమీద ప్రేరణంపుట్టించి మళ్ళీ పూర్వపు పనిమీద పంపాడు. జీవితంలో మనకుగూడ అపజయాలూ నిరాశలూ కొల్లలుగా ఎదురౌతాయి. దేవుడు మనకు ఒప్పజెప్పిన పనిని వదలివేయాలనిపిస్తుంది. కాని అలా వదలివేయకూడదు. ఏలీయాలాగే మన బాధలను దేవునితో చెప్పకోవచ్చు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు. మనకు ఉత్సాహాన్ని పట్టించే వ్యక్తిదగ్గరికో తావుదగ్గరికో పనిదగ్గరికో వెళ్ళవచ్చు. దేవుడు వీళ్ళ ద్వారాగాని స్వయంగాగాని మనలను ఉత్తేజపరుస్తాడు. నూత్నబలాన్ని దయచేస్తాడు. ఆ పిమ్మట మళ్ళామన పనిమీద మనలను పంపుతాడు. ఎప్పుడుకూడ దేవుడు మనకు ఉద్దేశించిన పనిని మాత్రం వదలివేయకూడదు. అపజయాలు ఎదురైనప్పడెల్లా ప్రభువునుండి మళ్లామళ్ళా ప్రేరణం పొందుతూండాలి.

2. మోషే, యోనా, యిర్మీయా మొదలైన మహాభక్తుల్లాగే యేలీయాగూడ నిరుత్సాహానికి గురయ్యాడు. చనిపోగోరాడు. మనలనుగూడ చాలసార్లు నిరాశాభావాలు ఆవరిస్తాయి. ఐనా భక్తులందరికీ ఓదార్పును దయచేసే ప్రభువు ఒకడున్నాడు. మనం అతన్ని ఆశ్రయించడం మర్చిపోగూడదు, శ్రమలు ఎదురైనపుడు దివ్యసత్రసాద సన్నిధిలో ప్రార్థన చేసికొంటే కొంత వూరట కలుగుతుంది.

3. ఏలీయా దేవదూత ఒసగిన ఆహారాన్ని భుజించి సత్తువ తెచ్చుకొని 40 రోజులు ప్రయాణం చేసి కొండను చేరుకొన్నాడు. ఈ యాహారం మన దివ్యసత్రసాదాన్ని సూచిస్తుంది. ఈ లోకయాత్రలో దివ్యభోజనం మనకు అపారమైన బలాన్నిస్తుంది.

4. కొండమీద దేవుడు యేలీయాకు ప్రత్యక్షమయ్యాడు. అతనితో మెల్లని స్వరంతో మాటలాడాడు. అనగా అతనికి సన్నిహితుడయ్యాడు. ఏలీయా ప్రభువు సాన్నిధ్యాన్ని గుర్తించి భయంతో ముఖం కప్పుకొన్నాడు. అతని దైవానుభూతి గొప్పది. బైబుల్లో భక్తుల దైవానుభూతిని తెలియజేసే అరుదైన ఘట్టాల్లో ఇదీ వొకటి. మన జీవితంలోగూడ ఈ దైవానుభూతిని తప్పక సాధించాలి. ఈ వరాన్ని మనం ఆశతో అడుగుకోవాలి.

5. ఏలీయా పిలవగానే ఎలీషా అతనివెంటబోయాడు. పూర్వపు వ్యవసాయ జీవితాన్ని వదలివేసి యావే మత పునరుద్ధరణ కార్యక్రమానికి పూనుకొన్నాడు. పిలుపునందుకొన్న గురువులూ మఠకన్యలూ మొదలైనవాళ్ళంతా పూర్వపు పాపజీవితాన్ని వదలివేసి వినూత్నమూ పవిత్రమూ ఐన ప్రేషిత జీవితానికి పూనుకోవాలి.

6. మోషే యేలీయాలకు పోలికలున్నాయి. ఇద్దరూ కొండమీద దేవుణ్ణి చూచారు. ఇద్దరూ మళ్ళా తబోరుకొండ మీద మారురూపం దాల్చిన క్రీస్తుని చూచారు - మత్త 17,2. ఏలీయా నూత్నావేదంలో క్రీస్తుకి పురోగామిగా వస్తాడు అనుకొన్నారు. ఆ మహాభక్తులు మనకొరకు ప్రార్ధనం చేయాలని వేడుకొందాం.


14. నాబోతు ద్రాక్షతోట


1రాజు 21


1. సందర్భం

ఈ యధ్యాయం పేర్కొనే నాబోతు సంఘటనం సాంఘిక అన్యాయాన్ని తెల్పే కథ. ఇది మొదటి రాజుల గ్రంథంలోని రెండు సిరియా యుద్ధాలమధ్య చేర్చబడింది. నాబోతుపై కుట్రపన్ని అతన్ని చంపించిన సూత్రధారిణి అహాబు భార్య యెసెబెలు. ఆమె అంతకుముందే యావే ప్రవక్తలనుగూడ చంపించింది. యావే ప్రవక్తయైన ఏలీయా నిర్భయంగా రాజుని ఎదిరించి అతని అన్యాయానికి తిగిన శిక్షను ఎరిగించాడు. ఈ కథ ప్రవక్తల ఆధిక్యాన్ని తెలియజేసేది, ప్రవక్తల సంప్రదాయానికి చెందింది. ఇది పూర్వవేదంలోని సుప్రసిద్ధమైన కథల్లో వొకటి.


2. వివరణం

అహాబు ఉత్తర రాజ్యమైన సమరియాకు చెందినవాడు. ఆ రాజ్యానికి రాజధానికూడ సమరియా నగరమే. కాని యిక్కడ చలి విపరీతంగా వుంటుంది. అందుచే ఆ రాజు చలి తక్కువగా వుండే యెసెయేలు పట్టణాన్ని రెండవ రాజధానిగా చేసికొన్నాడు. మన కథ ఈ నగరంలో జరిగింది.

నాబోతు యెసెయేలు పట్టణంలో పదిమందికీ తెలిసిన పేదరైతు. నీతి నిజాయితీలు కలవాడు. అతని చేను రాజు ప్రాసాదానికి ఆనుకొనివుంది. కనుక రాజు దానిని తీసికోగోరాడు. దానికి బదులుగా రైతుకు మరో చేనుగాని లేక సరిపడిన వెలకాని యిస్తానన్నాడు. కాని నాబోతు తన చేనుని వదలుకోవడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. అది అతనికి తండ్రి తాతలనుండి వచ్చిన పొలం. అతడు దాన్ని మళ్ళా తన పత్ర పౌత్రులకు వదలివెళ్లాలి. యిస్రాయేలు దేశంలోని భూమి అంతా ప్రభువుదే. ఆ నేలను దేవుడు యూదులకిచ్చాడు. కనుక నేల పవిత్రమైంది. ఏ కుటుంబానికి చెందిన భూమి ఆ కుటుంబం ఆధీనంలోనే వుండాలి. అన్యాక్రాంతం కాకూడదు. ఏ కుటుంబమైన పేదదై తన పొలాన్ని ఇతరులకు అమ్మకొంటే, జూబిలి సంవత్సరమైన యేబయ్యవ యేట అది తిరిగి సొంత కుటుంబానికి చెందిపోతుంది - లేవీ 25,23. కాని రాజు తీసికొన్న భూమి తిరిగి సొంతదారునికి రాదు. కనుకనే నాబోతు తన పొలాన్ని వదలుకోడానికి ఇష్టపడలేదు.

అహాబుకి ధర్మశాస్త్ర నియమాలు తెలుసు. అతడు బలాత్కారంగా పేదవాడైన నాబోతు నేలను తీసికోలేడు. కనుక కోపంతో ఇల్లజేరి విచారంగా పడకపై పండుకొన్నాడు. అతని భార్య యెసెబెలు భర్త మనస్తాపానికి కారణం తెలిసికొంది. ఆమె యూదుల ఆడపడుచు కాదు. తూరు దేశానికి చెందిన అన్యజాతి స్త్రీ. వాళ్లు బాలు అనే అన్యదేవతను కొల్చేవాళ్ళు. యెసెబెలు సమరియా దేశంలో కూడ ఈ బాలు మతాన్ని ప్రచారం చేయించింది. తనకు అడ్డమొచ్చిన యావే ప్రవక్తలను పట్టి చంపించింది-19,10.

యొసెబెలు అహాబులాగ మోషే ధర్మశాస్త్ర నియమాలను లెక్కచేసేదికాదు. ఆ రాణి దౌర్జన్యంగా నాబోతు పొలాన్ని లాగుకోవాలనుకొంది. నీ సామర్థ్యమింతేనా అని భర్తను గేలిచేసింది. అతని అధికారాన్ని తాను చేజిక్కించుకొంది. అతని రాజముద్రను తీసికొంది. అతని పేరు మీదిగా యెసెయేలు నగర అధికారాలకు జాబు వ్రాసింది. దానిమీద రాజముద్రవేసి పంపించింది.

ఆ జాబులో ఆమె నగరాధికారులను ఈలా ఆజ్ఞాపించింది. “నాబోతు పాపాలకు దేవుని కోపం దేశంమీదికి దిగివస్తుంది. ఆ కోపాన్ని తొలగించడానికిగాను మీరు ఉపవాసం చేయండి. నాబోతు దేవుణ్ణి రాజనీ శపించాడని ఇద్దరు దుర్మార్గులచేత కూటసాక్ష్యం చెప్పించండి. ఈ సాక్ష్యం ఆధారంగా అతన్ని చంపించండి".

నగరాధికారులు రాణి లేఖను చూచి అది రాజు లేఖే అనుకొన్నారు. ఆమె ఆజ్ఞాపించినట్లే చేసారు. దుర్మారులిద్దరు నాబోతు దేవుణ్ణి రాజునీ శపించాడనీ కూటసాక్ష్యం చెప్పారు. ఇద్దరెందుకంటే, ఒకడి సాక్ష్యం చెల్లదు-ద్వితీ 17,6. దేవుణ్ణి రాజనీ తిట్టడం ధర్మశాస్త్రం ప్రకారం నేరం - నిర్గ 22,28. ఈ తిట్టడమే నాబోతు చేసిన పాపం. ఈ పాపాన్ని తొలగించడానికే యెస్రేయేలు ప్రజలు ఉపవాసం పాటించింది. ఈ నేరాన్ని సాకుగా బెట్టుకొనే వాళ్లు నాబోతుని చంపించింది. కాని ఇదంతా వట్టి కుట్ర. యెసెబెలు పాపఫలం. నగరాధికారులకు యెసెబెలు కుట్రకూడ తెలియదు. వాళ్లు రాజే నాబోతును చంపమని ఆజ్ఞాపించాడు అనుకొన్నారు.

ఆరోజుల్లో యిస్రాయేలు రాజు న్యాయాధిపతికూడ. కనుక అహాబురాజు న్యాయాధిపతిగా పేదసాదలకు న్యాయం చేకూర్చవలసినవాడు. అతడే మోసంతో నాబోతును చంపిస్తే ఇక పేదలకు దిక్కెక్కడిది? కంచే చేనుమేస్తే కాపుని ఆదుకొనేదెవరు? నాబోతు యెసెబెలు కుట్రలో జిక్కి ప్రాణాలు కోల్పోయాక అహాబు అతని పొలాన్ని స్వాధీనం చేసికోవడానికి సమరియానుండి యెస్రెయేలుకు వచ్చాడు, చట్టరీత్యా చంపబడిన ద్రోహి ఆస్తి రాజుకు చెందుతుంది. కనుక అతడు నాబోతు పొలంమీద తనకు హక్కువున్నట్లుగా ప్రవర్తించాడు. పూర్వం దావీదురాజు ఈలాగే ఊరియాను చంపించి అతని భార్య బత్షేబాను అపహరించాడు. రాజులు తలంచుకొంటే దెబ్బలకు కొదవా?

ప్రభువు అహాబు యెసెబెలుల కుట్రను గమనిస్తూనే వున్నాడు. భక్తిమంతుల మరణం ప్రభువుకి ఎంతో బాధ కలిగిస్తుంది - కీర్తన 116,15. కనుక అతడు అహాబుకి బుద్ధి చెప్పడానికి తన సేవకుడైన యేలీయాను పంపాడు, ఆ ప్రవక్త ప్రభువు వాణిగా బయలుదేరి వచ్చాడు.

అహాబు పేదవాడ్డి హత్యచేయించడమేగాక అతని పొలాన్నిగూడ దొంగిలించాడు. రెండు నేరాలు చేసాడు. కనుక అతనికి ఫెూరశిక్ష తప్పదు. ఆ రాజు పేదవాని నెత్తుటిని చిందించిన నగరంలోనే అతని నెత్తుటినిగూడ కుక్కలు నాకుతాయి. ఎంత నేరానికి అంత శిక్ష కదా!

ఏలీయా ప్రవక్తకీ రాజకీ పడదు. బాలుని కొల్చినందుకు ప్రవక్త రాజుని చీవాట్ల పెడుతూ వచ్చాడు. కనుక అతడు రాజుకి శత్రువయ్యాడు. పైగా యిప్పడు రాజు పేదవాడ్డి అన్యాయంగా చంపించాడు కదా! యిప్రాయేలీయులకు ఓ ఆచారముండేది. ఏ నరుజ్జయినా శత్రువులు చంపివేస్తే అతని చుట్టాలు ఆ శత్రువులమీద పగతీర్చుకొనేవాళ్ళు. ఇక్కడ యేలీయా నాబోతుకు చుట్టమై అహాబుమీద పగతీర్చుకోడానికి వచ్చాడు. ఈ దృష్టిలో కూడ అతడు రాజుకి శత్రువు.

ఏలీయా అహాబు బలాన్నీ రాచరికాన్నీ చూచి దడవలేదు. నిర్భయంగా ప్రభువు సందేశాన్ని అతనికి విన్పించాడు. అహాబు చేసిన దుష్కార్యానికి అతని కుటుంబమంతా నాశమైపోతుందని గర్జించాడు. అతడు, అతని భార్య యెసెబెలు, కుమారుడు అహస్యా మనుమడు యెహోరాము అంతా యుద్ధంలో చస్తారు. ఆహాబు ఓమి రాజవంశానికి చెందినవాడు. ఆ వంశమే పూర్తిగా అంతరించిపోతుంది. ఈలా అతడు వొడిగట్టిన అన్యాయానికి శాస్తి జరుగుతుంది. భార్య ప్రోద్బలంపై ప్రభువును విడనాడి విగ్రహారాధనకు పాల్పడినందులకు అహాబు సర్వనాశమైపోతాడు.

ఈ యధ్యాయమంతా గూడ కుట్రతో హత్యతో శాపాలతో నిండివుంది. కట్టకడన మాత్రం ఓమంచి సంగతి వస్తుంది. ఏలీయా తన్నుతిట్టి శపించగా అహాబు పశ్చాత్తాపపడ్డాడు. సంతాపసూచకంగా గోనెతాల్చి ఉపవాసమున్నాడు. కటిక నేలపై పండుకొన్నాడు. ప్రభువు అతన్ని పశ్చాత్తాపాన్ని చూచి మనసు మార్చుకొన్నాడు. యావే అహాబు కాలంలోనే అతని వంశాన్ని నాశం చేయలేదు. ఆ శిక్షను అహాబు కుమారుని కాలానికి వాయిదా వేసాడు.


3. ప్రార్ధనా భావాలు

1. ఈ య్యధ్యాయంలో ముఖ్యమైన అంశం సాంఘిక అన్యాయం. రాజా న్యాయాధిపతీ ఐన అహాబు న్యాయాన్ని చెరిచాడు. అధికారగర్వంతో పేదవాడైన నాబోతును చంపించి అతని పొలాన్ని దోచుకొన్నాడు. దానికి తగిన శిక్షను అనుభవించాడు. ఈనాడుకూడ ధనవంతులు పేదలకు అన్యాయం చేస్తూనే వున్నారు. ఆ పేదల నెత్తురు పూర్వం హేబెలు నెత్తురులాగ దేవునికి మొరపెట్టితీరుతుంది - ఆది 4,10. కనుక మన క్రిందివాళ్ళకు మనమెప్పడూ అన్యాయం చేయకూడదు. ఒకరికి ముట్టవలసింది మనం కొట్టివేయకూడదు. ఎవరికి దక్కవలసింది వాళ్ళకు దక్కనీయాలి.

2. అహాబులాగ దుండగాలు చేసేవాళ్ళు నేడూ వున్నారు. కాని ఆ దుండగాలను ఖండించే ప్రవక్తలు మాత్రం నేడు లేరు. ఐనా ప్రవక్తల స్థానంలో మన అంతరాత్మ వుంది. మనం పాపకార్యం చేసిన వెంటనే మన అంతరాత్మ మనలను హెచ్చరిస్తుంది. చీవాట్లు పెడుతుంది. అంతరాత్మ ప్రబోధం విని మన తప్పులకు మనం పశ్చాత్తాపపడాలి.

3. ఏలీయా అహాబు రాజుకి భయపడలేదు. ధైర్యంగా అతన్ని ఎదిరించాడు. అతని తప్పిదాన్ని వేలెత్తి చూపించాడు. నేటి సమాజంలో ధనవంతులూ బలవంతులూ చేసే అన్యాయాలు మనకు తెలుసు. కాని వాళ్ళను ఎదిరించే సాహసం మనకుండదు. పలుకుబడి కలవాళ్ళను ఎదిరించి మనం విజయాన్ని సాధించలేం. పైగా ప్రమాదాన్ని కొనితెచ్చుకొంటాంగూడ. అందుచేత దడుస్తాం, వెనుకాడతాం. కాని ప్రవక్తలు ఈలా దడవలేదు. నిర్భయంగా దుష్టలను ఎదుర్కొన్నారు. వాళ్ళ ధైర్యం మనకుకూడ లభించాలని ప్రభువుని వేడుకొందాం.

4. అహాబు ' ఏలీయా నోటినుం: వచ్చిన ప్రభువు వాక్యాలకి దడిసాడు. పశ్చాత్తాపపడ్డాడు. అలాగే మనం కూడ పాపకార్యాలు చేసినపుడు ప్రభువు ఆజ్ఞలకు భయపడాలి. చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడాలి.


15. ఏలీయాకు వారసుడుగా ఎలీషా


2రాజు 2


1. సందర్భం

ఏలీయా స్వర్గానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఎలీషా అతనికి వారసుడయ్యాడు. అద్భుతాలు చేసే గురువుగారి శక్తి అతనికి సంక్రమించింది.


2. వివరణం

ఏలీయా ఎలీషా గిల్లాలునుండి బేతేలుకి అక్కడి నుండి యెరికోకీ, అక్కడినుండి యోర్గానుకీ వెళ్ళారు. ప్రతి తావులోను ఏలీయా శిష్యునితో ఇక నీవిక్కడ ఆగు అని చెప్తుండేవాడు. శిష్యుని విశ్వాసాన్ని పరీక్షించాలని ఏలీయా తలంపు. అతడు ఈలా చెప్పినపుడల్లా యెలీషా దేవుని తోడు. నేను నిన్ను వదలిపెట్టను అనేవాడు. చివరి గడియల్లో గురువుగారిని వదలిపెట్టకుండా భక్తితో సేవించాలని ఎలీషా తలంపు.

ప్రవక్తలు యేలీయా మోక్షానికి వెళ్ళిపోబోతున్నాడని గుసగుసలాడుకో జొచ్చారు. వాళ్ళ పై తావులన్నిటిలోను ఆ సంగతిని గూర్చి ఎలీషాను అడిగారు. ఆ విషయాన్ని గూర్చి మనం అసలు మాట్లాడకూడదు. మీరు నోరు కదపవద్దని యెలీషా వారిని మందలించాడు.
యోర్దాను నది దగ్గరికి రాగానే యేలీయా తన అంగీని తీసి నదీ జలాలను మోదాడు. వెంటనే నది రెండు పాయలుగా చీలి దారి యేర్పడింది. గురుశిష్యులు నది ఆవలి వొడ్డుకు వెళ్ళిపోయారు. అక్కడినుండే యేలీయా స్వర్గానికి వెళ్లాడు. పూర్వం మోషే సముద్రజలంగుండా దారిచేసాడు–నిర్గ 14. యోషువా ఈ నదీ జలాలగుండానే త్రోవచేసాడు–3. అలాగే యిప్పడు ఏలీయా కూడ ఆ నీటిగుండా మార్గం చేసాడు.
ఏలీయా శిష్యుని భక్తికి సంతసించి, నేను వెళ్ళిపోబోతున్నాను. ఈ చివరి క్షణాల్లో నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శిష్యుడు అయ్యా! నాకు నీ శక్తిలో రెండువంతులు దయచేయి అని అడిగాడు. యూదుల సంప్రదాయం ప్రకారం పెద్దకొడుక్కి తండ్రి ఆస్తిలో రెండువంతులు వస్తుంది—ద్వితీ 21,17. కనుక గురువు తన్ను పెద్దకొడుకుని చూచినట్లుగా చూడాలని ఎలీషా ఉద్దేశం. అనగా గురువునుండి ప్రవక్త శక్తిని సమృద్ధిగాపొంది అతినికి తగిన వారసుడు కావాలని ఎలీషా కోరిక.
కాని ప్రవక్త పదవీ వారసంగా వచ్చేదికాదు. అది దేవుడిచ్చే వరం. కనుక ఏలీయా శిష్యునితో నాయనా! నీ కోర్మెను తీర్చడం కష్టం. నేను ఈ భూమి మీదినుండి వెళ్ళిపోయేపుడు నేను నీకు కన్పిస్తే నీకోరిక నెరవేరుతుంది. కన్పించకపోతే నెరవేరదు 

అని చెప్పాడు. ఏలీయా స్వర్గానికి వెళ్ళేపుడు ఇతర ప్రవక్తలెవరూ చూడలేదు గాని ఎలీషా మాత్రం చూచాడు.

గురుశిష్యులు ఈలా మాటలాడుకొంటూండగానే అగ్ని రథం వారిరువురిమధ్య ప్రవేశించింది. ఏలీయాకీ నిప్పుకీ దగ్గరి సంబంధం వుంది. అతడు నిప్పుని రప్పించే ప్రవక్త. ఇక్కడ నిప్పురథం దైవసాన్నిధ్యానికి గుర్తు. ఈ రథంతోపాటు వచ్చిన సుడిగాలి యేలీయాను మోక్షానికి కొనిపోయింది. పూర్వం హనోకుని కూడ దేవుడు ఈలాగే అద్భుతంగా స్వర్గానికి తీసికొని పోయాడని చదువుతున్నాం - ఆది 5,24.

సుడిగాలి ఏలీయాను స్వర్గానికి కొనిపోయిందనే వాక్యం అతడు చనిపోలేదని చెప్పదు. ఏలీయా మరణం మీద దేవునికి సర్వాధికారం వుందని మాత్రమే ఈ వాక్యభావం. అనగా దేవుడు తన కిష్టమొచ్చిన రీతిలో ఏలీయాకు మరణాన్ని పంపాడు. ఏలీయా ఏలా మరణించాడో మనకు తెలియదు. మరణానంతరమే దేవుడు అతని ఆత్మను తీసికొనిపోయాడు. బాబిలోనియా ప్రజలు తమ గాథల్లో వారివీరులూ రాజులూ సజీవులుగానే స్వర్గానికి వెళ్ళిపోయారని చెప్పకొనేవాళ్ళు. ఇక్కడ బైబులు రచయిత ఏలీయాను గూర్చికూడ ఇదే పద్ధతిలో చెప్పాడు. ఆ ప్రవక్తకు అసాధారణమైన గొప్పతనం ఆపాదించాలని అతని కోరిక.

ఏలీయా యూవే మతానికి నాయకుడు. అతడు లేకపోతే దేశంలో యామే మతం ఏలా నిలుస్తుంది? పైగా బాలు మతం పెచ్చుపెరిగిపోదా? కనుక ఎలీషా సంతాపంతో తండ్రీ! యిప్రాయేలును అన్నివిధాల కాచి కాపాడుతూ వచ్చిన నీవుపోతే ఇక మాకు దిక్కేముంది అని అరచాడు. అతడు గురువుగారివైపు అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు. కొంతసేపయ్యాక గురువు అతనికి కన్పించలేదు.

ఎలీషా జారిపడిపోయిన గురువుగారి అంగీని తీసికొని యోర్ధానునది వొడ్డను నిల్చున్నాడు. ఇక్కడ ఈ యంగీ దాన్ని ధరించిన ఏలీయా శక్తి తెలియజేస్తుంది. ఆ శక్తి ఎలీషాలోకి ప్రవేశించింది. కనుక అతడు ఆ యంగీతో నదీజలాలను బాదగానే అవి రెండు పాయలుగా చీలిపోయి దారి ఏర్పడింది. ఎలీషా ఆ దారిగుండా ఈవలి గట్టుకి వచ్చాడు. కావున అద్భుతాలుచేసే గురువుగారి శక్తి ఎలీషాకు సమృద్ధిగా లభించిందని అర్థంజేసికోవాలి.

గురుశిష్యులతోపాటు యెరికోనుండి 50మంది ప్రవక్తలుకూడ యోర్ధాను సమీపానికి వచ్చి దూరంగా నిలబడ్డారు. ఏలీయా మోక్షారోపణాన్నియెలీషాలాగ వాళ్ళు చూడలేదు. అద్భుతాలుచేసే అతనిశక్తికూడ వాళ్ళకు సంక్రమించలేదు. ఇప్పడు ఎలీషాకు నది దారి ఈయడం జూచి వాళ్ళంతా ఏలీయా శక్తి ఎలీషాకు సంక్రమించిందని తెలిసికొన్నారు. వినయంతో అతనికి నమస్కరించి అతన్నితమ నాయకునిగా ఎన్నుకొన్నారు.

ఆ ప్రవక్తలు దేవుని ఆత్మ ఏలీయాను కొనిపోయి ఏ కొండల్లోనో లేక లోయల్లోనో జారవిడచి వుంటుందనుకొన్నారు. కనుక యాభైమంది మూడునాళ్ళపాటు అతనికోసం అంతటా వెతికారు. అటుపిమ్మట యెలీషా దగ్గరికి వచ్చి గురువుగారు ఎక్కడా కన్పించలేదని చెప్పారు. ఎలీషా అతడు మీకు దొరకడు. అసలు అతడు ఈ లోకంలో లేడు అని చెప్పాడు.

కాని యేలీయా ఏమైందీ ఎలీషా చెప్పలేదు. అతడు ఏలీయా మరణం తీరును వివరించలేదు. ఐనా అందరిలాగే ఏలీయా కూడ చనిపోయి వండాలి. ఆ చావు వైనం మనకు తెలియదు. ప్రభువు మాత్రం అతని ఆత్మను ఆదరంతో స్వర్గానికి కొనిపోయాడు.

అసలు ఇక్కడ రచయిత చెప్పదలచుకొన్న ముఖ్యాంశం ఏలీయా మరణమూ మోక్షారోపణమూకాదు. ఎలీషా గురువుగారికి వారసుడు అయ్యాడనేది అతడు తెలియజేయదలచుకొన్న ప్రధానాంశం. కనుకనే అతడు వెంటనే గురువుగారి శక్తితో శిష్యుడు చేసిన రెండద్భుతాలను పేర్కొన్నాడు.

గురువుగారి శక్తిని పొందిన ఏలీయా రెండు అద్భుతకార్యాలు చేసాడు. మొధటిది, రోగలక్షణాలున్న యెరికో నీటిని శుద్ధిచేయడం. అతడు కొత్తపిడతలో ఉప్పను తీసుకురమ్మన్నాడు. ఈ పిడత లౌకిక కార్యాలకు వాడిందికాదు. అది దైవసేవకే అంకితమై దైవశక్తితో నిండి వుంటుంది. అలాంటి పిడతలోని ఉప్పకూడ రోగలక్షణాలను తొలగించే సామర్థ్యం కలిగి వుంటుంది.

ఇక్కడ యెరికో ప్రజలు ప్రవక్తను గౌరవించారు. అతడు వారి అక్కరను తీర్చాడు.దైవాభాక్తుని గౌరవి0చె ప్రజలు దీవెన లభిస్తుందని ఈ కథ చెప్పిన రచయిత భావం.

ఎలీషా నీటిని శుద్ధిచేయడం అనే అద్భుతాన్ని నేడు మనం ఆదివారం పూజకు ముందుగా తీర్ధాన్ని చల్లేపుడు జ్ఞప్తికి తెచ్చుకొంటున్నాం. ఆనాడు ఎలీషాలాగే నేడు మనంకూడ నీటిలో ఉప్పను కలుపుతున్నాం. ఆ నీటిని ప్రజలమీద చిలకరిస్తున్నాం. ఆ నీటిని చీలకరించిన తావుల్లో పిశాచ తంత్రోపాయాలు తొలగిపోయి పవిత్రాత్మసాన్నిధ్యం నెలకొంటుందని విశ్వసిస్తున్నాం.

ఇక, రెండవ అద్భుతం బేతేలుచెంత ఎలుగుబంట్ల చిన్నపిల్లలను చీల్చివేయడం. ఈ పిల్లలు ప్రవక్తను ఎగతాళి చేసారు. అతడు ఆ పిల్లలను శపించి వారు ఎలుగుబంట్ల వాతబడేలా చేసాడు. ఇక్కడ నిర్ధయథొ ప్రవర్తించాడు కదా అని నేడు మనం ప్రశ్నిస్తాం. కాని ప్రవక్తను నిందిస్తే శిక్ష తప్పదని తెలియజేయడానికి మాత్రమే రచయిత ఈ సంఘటనను ఇక్కడ పేర్కొన్నాడు.

పైగా బేతేలు విగ్రహారాధనకు నిలయం. పూర్వం యెరోబామురాజు ఇక్కడ క్రొత్తగా దేవాలయాన్ని కట్టించి బాలు ఆరాధనను ప్రచారం చేయించాడు-1రాజు 13,29-30. కనుక ఈ పట్టణం పిల్లలు విగ్రహారాధకుల పిల్లలు. కనుకనే ఇక్కడ వీరికి శిక్ష పడింది.

పై రెండు అద్భుతాలను ఉదాహరించడంలో రచయిత ఉద్దేశం సంగ్రహంగా ఇది. ప్రవక్తను గౌరవిస్తే దేవుని దీవెన లభిస్తుంది. అతన్ని అవమానపరిస్తే శిక్ష వస్తుంది.

3. ప్రార్ధనా భావాలు

1. ఈ యధ్యాయంలో ముఖ్యాంశం ఏలీయా మోక్షారోపణం కాదు. ఎలీషా గురువుకి వారసుడు కావడం ఇక్కడ ముఖ్యాంశం, నిజమైన ప్రవక్త మరో ప్రవక్తకు వారసుడైనా అయియుండాలి. లేదా దేవుడే అతన్ని స్వయంగా ఎన్నుకొనైనా వుండాలి, ఇక్కడ ఎలీషా గురువుకి వారసుడు అన్న విషయాన్ని తెలియజేసాడు రచయిత. కనుక అతడు నిజమైన ప్రవక్త ప్రవక్తలపట్లా వారి బోధలపట్లా మనకు అపార గౌరవం వండాలి. వాళ్ళు పవిత్రాత్మచే ప్రేరితులై దేవుని సందేశాన్ని విన్పించారు - 2షేత్రు 121. ఆ సందేశాన్నే ఇప్పడు బైబుల్లో మనకొరకు పదిలపరచి వుంచారు. కనుక బైబుల్లోని ప్రవక్తల వాక్యాలు మనకు శిరోధార్యాలు. మనం వాటిని భక్తితో మననం చేసికోవాలి.

2. ఏలీయా కూడ అందరిలాగే మరణించాడు. ఏలా మరణించాడో మనకు తెలియదు. ప్రభువుకి అతని మరణం మీద సంపూర్ణాధికారం వుంది. జనన మరణాలకు అతడు కర్త కదా! కనుక అతడు ప్రవక్తను తన కిష్టమొచ్చిన రీతిలో మరణింపనిచ్చాడు. ఆ మరణంద్వారా అతన్ని తన దగ్గరకు పిల్చుకొన్నాడు. చావుద్వారా అతనికి నిత్యజీవమిచ్చాడు. యేలీయా బ్రతికివుండగా ప్రభువు ఆరాధనం పట్ల అపారమైన ఆసక్తిని చూపించాడు. దానికిగాను ప్రభువు అతన్ని బహూకరించి తన సన్నిధిలోనికి చేర్చుకొన్నాడు. ఆ ప్రవక్తకులాగే మనకుకూడ మంచి మరణం లభించాలని అడుగుకొందాం-2తిమో 4,6-8.

3. ఎలీషా గురువుని సేవించి ధన్యుడయ్యాడు. గురువు శక్తిని పొంది ప్రజలకు మేలు కలిగించే అద్భుతాలు ఎన్నో చేసాడు, శిష్యుడు గురువును గౌరవించి అతని బోధలను జాగ్రత్తగా వినాలి. గురువునుండి దైవానుభూతినీ భక్తి శ్రద్ధలనూ వారసంగా పొందాలి. మనమట్టుకు మనం మన పెద్దలమాట వింటున్నామా? ఆ ఎలీషాలాగ మన పెద్దలకు యోగ్యులమైన వారసులంగా ప్రవర్తిస్తూంటామా?

4. ప్రవక్తను గౌరవిస్తే దేవుని దీవెన లభిస్తుంది. యెలీషా యెరికో పౌరుల కొరకు నీటిని నిర్మలం చేసాడు. ప్రవక్తను అవమానిస్తే దేవుని శాపం వస్తుంది. యెలీషాను ఎగతాళి చేసిన పిల్లలను తోడేళ్ళ చీల్చివేసాయి. మనకు కూడ ప్రభువు సేవకులపట్ల గౌరవముండాలి. వాళ్ళను పూజ్యభావంతో చూడాలి. పైగా దేవుని సేవకులైన గురువులు మఠకన్యలు మొదలైనవాళ్ళ తమ పిలుపుని విలువతో చూచుకోవాలి. తమ అంతస్తుకి తగ్గట్టుగా మసలుకోవాలి. వళ్ళు దగ్గరబెట్టుకొని పవిత్రంగా జీవించాలి. దైవసేవకులకు పవిత్రత ఒక్కటి తగుతుంది.

16. నామాను కుష్ఠ నయంగావడం

2రాజు5


1. సందర్భం

దేవుడు ఏలీయాను స్వర్గానికి కొనిపోయాక అతని శిష్యుడు ఎలీషా ప్రవక్త అయ్యాడు. గురువుగారిలాగే ఇతడుకూడ చాల అద్భుతకార్యాలు చేసాడు. ఇక్కడ అతడు నామాను కుష్ఠను నయంజేయడం చూస్తాం. ఈ కథలో అన్యజాతివాడైన నామానుకీ ప్రవక్త శిష్యుడైన గేహసీకిగల వ్యత్యాసాలను పాఠకులు జాగ్రత్తగా గమనించాలి. భక్తులు పలుసార్లు చదివి మననం చేసికోదగిన మంచి కథ యిది.

2. వివరణం

ఈ కథలో రెండుభాగాలున్నాయి. 1-19 వచనాలు నామాను కుష్ఠ నయంగావడాన్ని గూర్చి 20-27 వచనాలు గేహసీకి శిక్షపడడాన్ని గూర్చి బైబులు రచయిత ఈ యిద్దరు పాత్రల వ్యత్యాసాన్ని చక్కగా చిత్రించాడు. నామాను విశ్వాసం మెచ్చుకోదగ్గది. గేహసీ దురాశ నిందింపదగ్గది.

ఆ రోజుల్లో సిరియా రాజు బెనదాదు. యిప్రాయేలు రాజు యెహోరాము. ఈ రాజు బెన్షదాదుకి లొంగి కప్పం గడుతుండేవాడు. సిరియా రాజు సైన్యాధిపతి నామాను, సిరియా రాజు కొల్చే దేవత రిమ్మోనుహదాదు. కాని రాజకి యుద్ధంలో విజయాలు ప్రసాదించింది ఈ దేవత కాదు, యావే ప్రభువే నామాను ద్వారా సిరియా దేశానికి విజయాలు దయచేసాడు. కనుక బెన్షదాదుకి నామానంటే అభిమానం. ఈ నామాను కుష్టరోగి ఐనా నామానునిగాని గేహసీనిగాని ప్రజలు సమాజంనుండి వెలివేయలేదు. కనుక వారిది యథార్థంగా కుష్టకాదు, ఓ రకం చర్మవ్యాధి అనుకోవాలి.

యిస్రాయేలు దేశపుపిల్ల వొకతె నామాను భార్యకు దాసి ఐంది. ఆ అమ్మాయి ఓ దినం సందర్భవశాత్తు నామాను యిస్రాయేలు దేశంలోని ప్రవక్త ఎలీషా వద్దకు వెళ్లే అతని వ్యాధి నయమౌతుందని చెప్పింది. ఆ బాలిక అన్యదేశంలోకూడ తన విశ్వాసాన్ని దాచుకోలేదు. అన్యజాతి ప్రజలవద్దగూడ యావే ప్రభువు మహిమనీ అతని ప్రవక్తశక్తినీ కొనియాడింది, ఈవిధంగా ఊరూ పేరూ లేని ఈ పిల్ల నామాను రోగవిముక్తికి కారకురాలైంధి. ఒకోసారి మనం అన్యమతస్తుల యెదుట మన విశ్వాసాన్ని ప్రదర్శించడానికి సిగ్గుపడతాం. ఇది పొరపాటు. ఈ పిల్ల తన విశ్వాసాన్ని దాచుకోలేదు.

నామాను తన రాజు అనుమతితో విలువైన కానుకలు తీసికొని రథమెక్కి ఆడంబరంగా యిప్రాయేలు దేశానికి వచ్చాడు, సిరియా రాజు యిప్రాయేలు రాజుకి జాబుగూడ వ్రాసి పంపాడు. దానిలో అతడు నీవు నామాను కుష్ఠటను నయంచేయి అని యిప్రాయేలు రాజును ఆజ్ఞాపించాడు. ఆ రోజుల్లో యిప్రాయేలు రాజ్యం సిరియాకు లొంగి వుందని చెప్పాంగదా! కావుననే శత్రురాజు అతన్ని అలా ఆజ్ఞాపించగలిగాడు.

యి(సాయేలు రాజు బెన్షదాదు లేఖను చదువుకొని నామాను కుష్ఠను నయంజేయడానికి నేనేమి దేవుణ్ణా యేమిటి అని గొణుగుకొన్నాడు. సిరియా రాజు ఈ కుంటిసాకుతో తనమీద యుద్ధానికి వస్తాడేమో అని భయపడ్డాడు. సంతాప సూచకంగా తనవంటిమీది బట్టలు నిలువన చించుకొన్నాడు.

ఎలీషా ప్రవక్తకు ఈ సంగతంతా తెలిసింది. యిప్రాయేలు రాజు తన ప్రవక్తద్వారా నామాను కుష్టను నయంజేయించాలని మాత్రమే బెన్లదాదు ఉద్దేశం. రాజే స్వయంగా వ్యాధి నయం చేయాలని అతని భావం కాదు. కనుక ప్రవక్త రాజునొద్దకు కబురంపి రోగిని తన చెంతకు పంపించమన్నాడు. లేఖలోని అపార్థం తొలగించాడు. దైవశక్తితో తానతనికి రోగవిముక్తి కలిగించగలనని చెప్పాడు. కనుక సైన్యాధిపతి రథమెక్కి అట్టహాసంగా ఎలీషా యింటికి వచ్చాడు.

నామాను తనంతట తానే యెలీషా యింటిదాకా వచ్చినా ఆ యింటిలో అడుగుపెట్టలేదు. ప్రవక్త బయటికి వచ్చి తన్ను ఆహ్వానించాలని అతని కోరిక, యెలీషాగూడ తన యింటిలోనుండి వెలుపలికి రాలేదు. సైన్యాధిపతే వినయంతో తన యింటిలోనికి రావాలని అతని వద్దేశం. ఇద్దరికీ బెట్టుసరి యొక్కువ.

కడన ప్రవక్త తన సేవకుణ్ణీ పంపి నీవు యోర్గానులో ఏడుసార్లు స్నానంచేయి అని సైన్యాధిపతికి చెప్పించాడు. నామాను పొగరు అణచాలనీ అతని విశ్వాసాన్ని పరీక్షించాలనీ గూడ ఎలీషా తలంపు. కాని ప్రవక్త తీరు సైన్యాధిపతికి నచ్చలేదు, అతడు ఈ ప్రవక్త వెలుపలికివచ్చి సాదరంగా నన్ను యింటిలోనికి ఆహ్వానిస్తాడనుకొన్నాను. కుష్ట సోకిన నా అవయవాలపై తన చేతిని త్రిప్పి తన దేవుని ప్రార్ధించి నాకు ఆరోగ్యదానం చేస్తాడనుకొన్నాను. అతడు ఈ పనులేవీ చేయలేదు. ఇప్పడు నన్ను వీళ్ళ యోర్గానునదిలో స్నానం చేయమంటున్నాడు. ఈ యేటి విలువెంత? మాదేశంలో ఇంతకంటె శ్రేష్టమైన నదులు లేవా? నేను వాటిల్లో మునిగి ఆరోగ్యం పొందలేనా? అని మండిపడుతూ అక్కడినుండి వెళ్ళిపోబోయాడు. ప్రవక్త వాక్కులోని శక్తి అతనికింకా అర్థంకాలేదు. అధికార గర్వంవలన అతనికి తల తిరిగింది.

అలా కోపంతో చిందులు తొక్కుతూ వెళ్ళిపోబోయే సైన్యాధిపతిని అతని సేవకులు వారించారు. అయ్యా! ప్రవక్త నినేదైనా కష్టమైన కార్యం చేయమంటే నీవు తప్పక చేసేవాడివి. ఇప్పడు అతడు సులభమైన కార్యం చేయమంటే చేయనంటావా అని మందలించారు. ఇక్కడ బైబులు రచయిత నామాను అహంకారానికి సేవకుల వినయ విశ్వాసాలకూ గల వ్యత్యాసాన్ని సృష్టంగా తెలియజేసాడు. ఏమైతేనేమి, సేవకుల మందలింపద్వారా నామానుకి విశ్వాసం కలిగింది. అతడు యోర్గానులో ఏడుసార్లు మునిగి శుద్ధిని పొందాడు. తన వ్యాధి కుదరడాన్ని చూచి తానే విస్తుపోయాడు. రోగవిముక్తివల్ల అతనిలో విశ్వాసం బలపడింది.

ఆరోగ్యాన్ని పొందిన నామాను ప్రవక్తకు వందనాలు చెప్పకుండా వుడాయించలేడు. అతని కృతజ్ఞతాభావం మెచ్చుకోదగింది. అతడు తాను కొలిచే హదాదు రిమ్మోను కాక, యావే ప్రభువు నిక్కమైన దైవమని నమ్మాడు. ఆ దేవుని శక్తితో తనకు మేలు చేసిన ప్రవక్తకు భక్తితో కానుకలు అర్పింపబోయాడు. కాని యెలీషా డబ్బుకి ఆశపడని దైవసేవకుడు. కనుక నాకు నీ కానుకలేమీ వదు. దైవశక్తి వల్ల నీకు ఆరోగ్యం కలిగింది. అదే చాలు. ఇక వెళ్ళిపో అన్నాడు.

నామాను, నేను మీ దేశంనుండి రెండు గాడిదలు మోసేంత మట్టిని మా దేశానికి తీసికొనిపోతానన్నాడు. ఈ మట్టి యిప్రాయేలు దేశానికి చిహ్నంగా వుంటుంది. దాని మీద అతడు బలిపీఠాన్ని నిర్మించి సిరియా దేశంలో యావేను పూజిస్తాడు. ఆ రోజుల్లో ప్రజలు ఒక్కోదేశం ఒక్కో దేవునికి చెందిందని భావించేవాళ్ళు కనుక ఏ దేశానికి అధిపతియైన దేవుణ్ణి ఆ దేశంలోనే కొలవాలి. సిరియాలో రిమ్మోనునీ యిస్రాయేలులో యావేనీ కొల్చేవాళ్ళ నామాను ఇప్పడు సిరియాలో యావేను కొల్వబోతున్నాడు. యావేపట్ల అతని నమ్మకం అంత గొప్పది.

ఐతే పండుగరోజున సిరియారాజు రిమ్మోను దేవళానికి వెళ్ళి ఆ దేవతకు మొక్కేవాడు. అతని వెంటనున్ననామానుకూడ ఆ దేవతకు మొక్కాలి. లేకపోతే మర్యాదగా వుండదు. కానీ ఇది సభ్యతవల్ల చేసే ఆరాధనకాని నిజమైన భక్తివల్ల చేసేదికాదు. ఈ వొక్క సందర్భంలోనే తాను చేసే విగ్రహారాధనకు ప్రవక్త తన్ను మన్నించాలని నామాను మనవి చేసాడు. ఎలీషా నామాను పరిస్థితిని అర్థం చేసికొని అతని విగ్రహారాధనను మన్నించాడు. అతడు వెళ్ళిపోయాడు. ఇంతవరకు నామాను కథ. అన్యజాతివాడూ విశ్వాసం లేనివాడూ ఐన నామాను రోగవిముక్తి కారణంగా పూర్ణహృదయంతో యావే ప్రభువును విశ్వసించాడు. ఇది యిక్కడ ముఖ్యాంశం.

ఇక గేహసీ కథ. ఇతడు ప్రవక్త శిష్యుడు. భవిష్యత్తులో ప్రవక్త కాబోయేవాడు. యూదభక్తుడు. కాని అన్యమతస్థుడైన నామానుకున్న భక్తివిశ్వాసాలు ఇతనికి లేవు. అతని ప్రధాన దురుణం దురాశ, గేహసీ అనే పేరుకి ఆసబోతు అని అర్ధం, ధనలోభంవల్ల నరుడు ఎంతగా పతనమైపోతాడో ఇతని కథ తెలియజేస్తుంది.

ఓ వైపున నామాను తెచ్చిన సొమ్మును చూడగానే గేహసీ కండ్లు జిగేలున మెరిసాయి. మరోవైపున ప్రవక్త ఆ సొమ్మను ముట్టకపోవడం అతనికి నిరాశ కలిగించింది. అతడు ప్రవక్త పేరుమీదిగా ఆ సొమ్ములో కొంత దక్కించుకోవాలనుకొన్నాడు. కనుక సైన్యాధిపతి రథం వెంట పరుగెత్తుకొనిపోయి అయ్యా! మా గురువుగారు పూర్వం నీ సొమ్ము ముట్టుకోలేదు. కాని యిప్పడు మనసు మార్చుకొన్నారు. తలవని తలంపుగా ఇద్దరు ప్రవక్తలు ఆయన యింటికి అతిథులుగా వచ్చారు. కనుక ఆయన నీ నుండి మూడువేల నాణాలు రెండు జతల పట్టుబట్టలు కోరుతున్నాడు అని చెప్పాడు. ఇక్కడ గేహసీ నేరాల రెండు. మొదటిది, అతని అత్యాశ. రెండవది, అతడు గురువుగారిని గూర్చి అబద్ధం చెప్పడం. అనగా యెలీషా నామానునుండి ఈ సొమ్ము అడగకపోయినా అడిగాడని చెప్పడం.

నామాను ఉదారబుద్ధి కలవాడు. గేహసీ మూడువేలడిగితే అతడు ఆరువేలిచ్చాడు. ఆ సొమ్మును సేవకులనెత్తికెక్కించి గేహసీతో పంపించాడు, గేహసీయిల్ల ఓఫెలుకొండమీద వుంది. ఆ తావుకి రాగానే అతడు సేవకులవద్ద నుండి నాణాల సంచులు తీసికొని వారిని పంపివేసాడు. ఆ సంచులు భద్రంగా తన యింటిలో దాచుకొన్నాడు.

తర్వాత గేహసీ నంగనాచిలాగ తిరిగివచ్చి గురువు గారికి సేవచేయబోయాడు. కాని గురువుగారు అతన్ని నిలదీసి ఓయి! నీ వెక్కడికి వెళ్లావో చెప్ప అన్నాడు, అతడు నేనెక్కడికీ వెళ్ళలేదు. ఇంతసేపు ఇక్కడనే వున్నానుగదా అన్నాడు. కాని ఎలీషాకు దైవశక్తి దైవజ్ఞానమూ రెండూ వున్నాయి. అతడు గేహసీ చేసిన తప్పడుపని అంతా దర్శనంలో చూస్తూనే వున్నాడు. కనుక అతడు ఓయి! నేను ఇక్కడే వున్నానా మనసు నీతో వచ్చి నీవు చేసిన మోసమంతా చూచింది. నీవు దురాశతో నామాను దగ్గర డబ్బు తీసికొని దానితో పొలాలూ తోటలూ పశులమందలూ సంపాదించాలనుకొన్నావు. కావున నీకు శిక్ష యిది. నామానుని వదలివెళ్ళిన కుష్ట నిన్నూ నీ వంశీయులనూ పట్టిపీడిస్తుందిపో అన్నాడు. గురువు చెప్పిట్లే వెంటనే గేహసీకి కుష్ట సోకింది. అనగా గేహసీ ఇక తన వారసులకు ఆస్తినికాక కుష్టరోగాన్ని వదలిపోతాడు, ఇది దురాశకు ప్రతిఫలం.

పాఠకులు ఈ కథలో నామాను గేహసీలకుగల వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించాలి. నామాను ఉదారగుణం గలవాడు. గేహసీ ఆసబోతు. ఎలీషా నామాను విశ్వాసాన్ని పరీక్షింపగా అతడు విశ్వాసంకలవాడని రుజువైంది. కాని గేహసీ విశ్వాసం పరీక్షింపగా అతడు విశ్వాసం లేనివాడని తేలింది. నామానుకి విశ్వాసంవలన కుష్ట నయమైంది. గేహసీకి విశ్వాసం లేనందువలన కుష్ఠ సోకింది. ఒకడు మొదటలో కుష్టరోగి, మరొకడు కడపట కుష్ఠరోగి.

3. ప్రార్ధనా భావాలు

1. ఊరూపేరూలేని ఒక బానిసపిల్ల తన విశ్వాసం ద్వారా నామాను రోగవిముక్తికి కారకురాలైంది. ఆ బాలిక పరాయిదేశంలో గూడ తన విశ్వాసాన్ని దాచుకోలేదు. ఒకోసారి సామాన్య నరులే తోడిజనానికి దేవుణ్ణి గూర్చి శ్రద్ధగా బోధిస్తారు. కనుక వీళ్ళ సేవను మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఇంకా, నామాను కోపంతో యోర్గానులో మునగకుండా వెళ్ళిపోబోతూంటే సేవకులు అతనికి విశ్వాసం పుట్టించారు. కనుక వేదప్రచారంలో మనం ఈ సామాన్య జనాన్నిగూడ వాడుకోవాలి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వేదబోధ చేస్తారు. 2. మొదట నామానుకి యావే ప్రభువుపట్ల విశ్వాసమూ వినయమూ లేవు. సేవకులు యోర్గానులో మునగమని బతిమాలడంద్వారా అతనికి ఆ గుణాలు అలవడ్డాయి. నేడు మనకుగూడ విశ్వాసమూ వినయమూ వుంటేనేగాని దేవుడు మన యిబ్బందుల్లో మనలను ఆదుకోడు. లూకా 4,27లో క్రీస్తు నామాను విశ్వాసాన్ని ల్లాఘించాడు. మనకు కూడ ఆ గుణం అలవడాలని వేడుకొందాం.

3. దురాశ ఘోరమైన పాపం. ఈ దుర్గుణం గేహసీని నాశంచేసింది. ఈ దుర్గుణం వల్లనే ఆకాను (యెహోషువా7) యూదా, అననీయా సఫీరా మొదలైనవాళ్ళంతా చెడారు. వీళ్ళ తమ ఆత్మను ధనానికి అమ్ముకొన్నారు. డబ్బు, పదవి, తిండి మొదలైనవాటిని పురస్కరించుకొని మనం కూడ అత్యాశకు లొంగిపోతూంటాం. ఈ దుర్గుణానికి వశులం గాకుండా వుండాలని ప్రభవుని అడుగుకొందాం.

4. నామాను యోర్గాను నదిలో మునిగి శుద్దుడయ్యాడు. నేడు మనం వేదగ్రంథ పఠనం దేవద్రవ్యానుమానాలు, ప్రార్ధనం, సోదరప్రేమ సేవ మొదలైన పుణ్యకార్యాల్లో మునిగి శుద్దులం కావాలి. ఈ భాగ్యం కొరకు ప్రభువుని వేడుకొందాం.

17. సౌలు పరివర్తనం

అ.చ.9,1-19

1. సందర్భం

సైఫనుని రాళ్ళతో కొట్టి చంపించినవారిలో సౌలు కూడ ఒకడు. అతన్ని చంపేవాళ్ళు తమ బట్టలకు సౌలుని కాపలా వుంచారు. సైఫను చనిపోతూ తన శత్రువులకొరకు ప్రార్థించాడు. &9 ప్రార్థనా ఫలితంగా సౌలుకి పరివర్తనం కలిగింది. ఆ పరివర్తనం కథను లూకా ఈ యధ్యాయంలో వివరించాడు. అపోస్తలుల చర్యల (ѓбофо మొదట పేత్రు కథను వర్ణిస్తుంది. ఆ పిమ్మట 9వ అధ్యాయం నుండి గ్రంధాంతం వరకు సౌలు కథను వర్ణిస్తుంది. ఆ తొలి రోజుల్లో తిరుసభ అన్యజాతి ప్రజల్లో వ్యాపించడానికి ముఖ్యకారకుడు సౌలే, కనుక అతని కథ అందరూ పఠింపదగింది.

2. వివరణం

క్రీస్తు ఉత్థానానంతరం క్రైస్తవమతం యెరూషలేములో శ్రీప్రగతిని వ్యాపిస్తూంది. యూదుల ప్రధాన యాజకుడు క్రైస్తవ భక్తులను పట్టి చెరలో వేయండని ఆజ్ఞాపించాడు. అతనికి తోడ్పడిన వాళ్ళల్లో సౌలు ఒకడు. అతడు మొదట యెరూషలేములోని క్రైస్తవులను 'బంధించి చెరలో త్రోయించాడు. ఆ పిమ్మట డమస్కులోని క్రైస్తవులను గూడ బంధించాలని సంకల్పించుకొన్నాడు. డమస్కు ప్రార్ధనా మందిరాల అధిపతులకు చూపడానికి ప్రధానార్చకుని నుండి పరిచయ పత్రాలను పొందాడు.

యెరూషలేమునుండి డమస్కు నగరానికి 140 మైళ్ళ దూరం. ఈ పట్టణం ప్రపంచంలోని అతి ప్రాచీన నగరాల్లో వొకటి. గొప్ప కూడలి తావు. సౌలు ఇద్దరు ముగ్గురు అనుచరులను తీసికొని గుర్రాలమీద ఈ నగరానికి వెళ్తున్నాడు. అది క్రీస్తుశకం 36వ సంవత్సరం, దారిలో తలవని తలంపుగా అతనికి ప్రభు దర్శనం కలిగింది.

కాని సౌలు క్రైస్తవులను ఎందుకు హింసించాడు? అతడు దుషుడు కాదు. భక్తిపరుడైన రబ్బయి. క్రైస్తవ మార్గాన్ని అపార్థం చేసుకోవడంవల్ల అతడు క్రైస్తవులకు శత్రువయ్యాడు.

క్రైస్తవులు క్రీస్తే మెస్సీయా అంటున్నారు. కాని ధర్మశాస్త్రం ప్రకారం సిలువ వేయబడినవాడు శాపగ్రస్తుడు - ద్వితీ 21,22-23. ఈలాంటి శాపగ్రస్తుడు మెస్సీయా ఏలాగౌతాడని సౌలు వాదం. ఇంకా, మెస్సీయా రాజుగా వస్తాడనుకొన్నారు యూదులు. అలాంటప్పుడు, సిలువమీద దిక్కులేని చావు చచ్చిన క్రీస్తు మెస్సీయా ఏలాగౌతాడు? పైపెచ్చు క్రైస్తవులు క్రీస్తుని "ప్రభువు" అంటున్నారు. ఇది పూర్వవేదంలో యావేకు వర్తించే బిరుదం. దీన్ని క్రీస్తుకు వాడితే అతడు యావే ప్రభువుతో సరిసమానమౌతాడు. అపుడు ఇద్దరు దేవుళ్ళవుతారు. కాని యూదులు ఏకేశ్వరోపాసకులు. కనుక క్రీస్తుని "ప్రభువు" అనడం సౌలు దృష్టిలో దేవదూషణం, ఇంకో అపరాధమేమిటంటే, క్రైస్తవులు యెరూషలేం దేవాలయాన్నీ ధర్మశాస్తాన్నీ తూలనాడుతున్నారు - అ, చ.6, 14 ప్రాచీన కాలంనుండీ యూదులకు ఈ రెండూ పరమ పవిత్రమైనవి. పరిసయుల శాఖకు చెందిన పరమ నిష్ణాపరుడైన సౌలుకి ఈ నింద సహింపరానిదైంది. ఇన్ని కారణాలవల్ల అతడు క్రైస్తవులను హింసించడానికి పూనుకొన్నాడు.

సౌలు డమస్కనగరాన్ని సమీపిస్తుండగా ఉత్తాన క్రీస్తు అతనికి వెలుగురూపంలో దర్శనమిచ్చాడు. ఆ వెలుగును భరించలేక సౌలు గుర్రం మీదినుండి క్రిందపడ్డాడు. పూర్వవేదంలో యావే ప్రభువు వెలుగు. అతడే వెలుగుని చేసాడు. ఆ వెలురు ఇప్పడు ఉత్తాన క్రీస్తు రూపంలో సౌలుమీద ప్రసరించింది - 2కొ 4,6. ఆ వెల్లురు సౌలూ నీవు నన్నెందుకు హింసిస్తున్నావని ప్రశ్నించింది. ప్రభూ! నీవెవరివి అని సౌలు అడిగాడు. నీవు హింసించే క్రీస్తుని నేనేనని ఆ జ్యోతి సమాధానం చెప్పింది. సౌలు క్రీస్తుని బాధించలేదు. క్రైస్తవులను బాధించాడు. కాని క్రీస్తు క్రైస్తవుల్లో నెలకొని వుంటాడు. క్రైస్తవులు, తిరుసభ, అతనికి శరీరం. అనగా వాళ్ళు క్రీస్తుతోకూడి ఏకవ్యక్తి ఔతారు. అలాంటి క్రైస్తవుల్ని హింసిస్తే క్రీస్తుని హింసించినట్లే, క్రీస్తు క్రైస్తవుల్లో ప్రత్యక్షమై వుంటాడు.

క్రీస్తు దర్శనం సౌలుకేగాని అతని అనుచరులకు గాదు. వాళ్లు సౌలుకి ఆధ్యాత్మికంగా ఏదో జరిగిందని గ్రహించారు. వాళ్ళకు క్రీస్తు స్వరం విన్పించిందికాని అతని వెలుగు మాత్రం కన్పించలేదు. ఈ గ్రంథం 22.9. ఈ యనుచరులు వెలుగును చూచారుకాని క్రీస్తు స్వరాన్ని వినలేదని చెప్తుంది. ఈలాంటి చిన్నచిన్న తేడాలను లూకా పెద్దగా పట్టించుకోలేదు.

క్రైస్తవులను హింసించాలనుకొని వచ్చిన సౌలు ఈ దర్శనంవల్ల నిస్సహాయుడై పోయాడు. దైవశక్తి ముందు మానవుల గొప్ప ఏపాటిది? అతడు పూర్తిగా గ్రుడ్డివాడై పోయాడు. నేలమీద వెల్లకిలబడివున్నాడు. అనుచరులే అతన్ని పైకిలేపి చేయిపట్టుకొని డమస్కు నగరానికి నడిపించుకొని పోవలసి వచ్చింది. ఆ దర్శనం ప్రభావం ఎంత తీవ్రమైందంటే సౌలు మూడురోజులవరకు అన్నపానీయాలు ముట్టుకోలేదు. భగవంతుడు నరులను తన సేవకు వినియోగించుకోక ముందు వారిని నిర్వీర్యులను చేస్తాడు.

డమస్కులోని క్రైస్తవ నాయకుల్లో ఒకడు అవనీయా, ప్రభువు అననీయాతో సాలను క్రైస్తవ సమాజంలోకి చేర్చుకొమ్మని చెప్పాడు. ఆ భక్తుడు విస్తుపోయాడు. సౌలు భయంకర వేదహింసకుడు కదా! పలిదగ్గరికి గొర్రెపిల్లనీ, డేగదగ్గరికి పావురాన్నీ పంపుతావా అని అతడు క్రీస్తుని అడిగాడు.

ప్రభువు అననీయాకు భయపడవద్దని చెప్పాడు. సౌలు పూర్తిగా మారిపోయాడని తెలియజేసాడు. అతడు పూర్వం క్రైస్తవులకు ఎంత అపకారం చేసాడో ఇపుడు వారికి అంత వుపకారం చేస్తాడని చెప్పాడు. సౌలు మొదట యూదులకు వేదబోధ చేస్తాడు. అటుపిమ్మట అన్యజాతి జనులైన గ్రీకు రోమను ప్రజలకు గూడ వేదబోధ చేస్తాడు. ఇప్పుడు మనం యూరప్ అని పిల్చే ప్రదేశంలో మొట్టమొదటిసారి క్రీస్తుని బోధించినవాడు పౌలే. అతని కృషివల్ల తిరుసభ కేవలం యూదులకే పరిమితంకాక అన్యజాతుల్లో కూడ వ్యాపించింది. సౌలు సామాన్య ప్రజలకు మాత్రమే కాక హెరోదు అగ్రిప్ప మొదలైన రాజులకీ, ఫిలిక్సు, ఫెస్టస్ మొదలైన గవర్నర్లకీ, స్థానిక అధికారులకీ క్రీస్తుని తెలియజేస్తాడు. ఇంకా, సౌలు ప్రభువు సేవలో ఎన్నో బాధలు అనుభవిస్తాడు. యెషయా ప్రవక్త పేర్కొన్న బాధామయ సేవకుళ్ళాగ క్రీస్తుకోసం శ్రమలు అనుభవిస్తాడు. ఈలాంటి సౌలుని క్రైస్తవ సమాజంలో చేర్చుకోవడానికి అననీయా ఏమాత్రం వెనుకాడకూడదని క్రీస్తు తెలియజేసాడు.

సౌలుకి అద్భుతంగా దర్శనమిచ్చిన ప్రభువు అతన్ని నేరుగా క్రైస్తవ సమాజంలో చేర్చుకోవచ్చుకదా! కాని క్రీస్తు అలా చేయలేదు. ఆనాటి క్రైస్తవ పెద్దలద్వారానే అతడు క్రైస్తవ సమాజంలో చేరాలని ప్రభువు నిర్ణయించాడు. నేడుకూడ మనం క్రీస్తు స్థానంలో వున్న పెద్దలను కాదని క్రీస్తుని చేరలేం.

అననీయా యూదా యింటిలోవున్న సౌలుని దర్శించడానికి వచ్చాడు. అతని రాకతో సౌలు బలహీనత తొలగిపోయింది. అతనికి చూపకూడ వచ్చింది. అతని కండ్ల నుండి పొరలు చేప పొలుసుల్లాగ రాలి క్రిందబడ్డాయి, పూర్వం గ్రుడ్డివాడైన తోబియా కండ్లనుండి ఈలాగే పొరలు రాలిపడ్డాయని వింటున్నాం - తోబీతు 11,12-13.

అననీయా భక్తుడు సౌలుకి జ్ఞానస్నానమిచ్చాడు, సౌలు క్రైస్తవ సమాజంలో చేరిపోయాడు. ఈ జ్ఞానస్నానం తోనే అతడు ఆత్మను పరిపూర్ణంగా పొందాడు. ఇకమీదట ఆత్మే అతన్ని నడిపిస్తుంది. అతనిచేత నానా పట్టణాల్లో నానా ప్రజలకు వేదబోధ చేయిస్తుంది. కడన ఆత్మే అతనిని రోము పట్టణానికి తోడ్కొనిపోయి అక్కడ వేదసాక్షిగా మరణించేలాగూడ చేస్తుంది.

డమస్కు దర్శనం పౌలులో గొప్ప మార్పు తెచ్చింది. ఆ సంఘటనం తర్వాత అతని భావనాసరణి పూర్తిగా మారింది. అది అతనికి గొప్ప ప్రేరణం పుట్టించింది. కనుక ఈ దర్శనం పౌలుని ప్రభావితం చేసిన తీరును మనం కొంచెం విపులంగా తెలిసికోవాలి.

పౌలు మొదట పాపిగా వుండి తర్వాత ఈ దర్శనం వల్ల పరివర్తనం చెందలేదు. అతడు యూదమతం ప్రకారం మచ్చలేని జీవితమే గడిపాడు. ఈ దర్శనం వల్ల అతడు యూదమతాన్ని వదలి క్రైస్తవ మతంలోకి వచ్చాడు. రక్షణం ధర్మశాస్రాన్ని పాటించడంవల్లకాక క్రీస్తుని విశ్వసించడం వల్ల లభిస్తుందని గ్రహించాడు. ఈ దృష్టిలో మాత్రమే డమస్కదర్శనం అతనికి పరివర్తనం కలిగించింది.

తరతరాలబట్టి యూదులు మెస్సీయాకోసం గంపేడాశతో ఎదురుచూస్తున్నారు. కాని అతడు ఎప్పడు వస్తాడో వారికి తెలియదు. డమస్కు దర్శనంవల్ల పౌలు క్రీస్తు రాకడతోనే మెస్సియా కాలం ప్రారంభమైందని గుర్తించాడు - 1కొ 10,11. యూదులు కోరిన కోరికలన్నీ మెస్సియాద్వారా సిద్ధించాయని తెలిసికొన్నాడు.

మోషే కాలంనుండి క్రీస్తు వరకు రక్షణం ధర్మశాస్తాన్ని పాటించడం వల్ల సిద్ధించింది. యెరూషలేము దేవాలయంలో ఆరాధనలు జరపడంవల్ల సిద్ధించింది. కాని యికమీదట క్రీస్తుని విశ్వసించడం వల్లగాని రక్షణం లభించదు. పూర్వవేద కాలంలోలాగ యిప్పడు మన పుణ్యక్రియలు మనలను రక్షించవు. ఈ పుణ్యక్రియలు ప్రధానంగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించడమే. ఇప్పడు మనలను రక్షించేది క్రీస్తు వరప్రసాదం. ప్రభువు మరణోత్థానాలు మనకు పాపవిమోచనం కలిగిస్తాయి. ఈ సత్యం పౌలుకి బాగా అర్థమైంది. 203 పూర్వవేదంలోని యూదులు యావే ప్రభువు రక్షణం తమకు మాత్రమేననీ, అన్యజాతుల ప్రజలందరూ నాశమైపోతారనీ భావించారు. ఈ దర్శనంలో పౌలు రక్షణం యూదులకు మాత్రమేకాక, అన్యజాతి ప్రజలకు గూడ సిద్ధిస్తుందని గుర్తించాడు. తాను అన్యజాతులకు క్రీస్తుని అత్యవసరంగా బోధించాలనిగూడ గ్రహించాడు. అతన్ని బోధించకపోతే తాను ముదనష్టమైపోతానని తెలిసికొన్నాడు. కనుకనే "క్రీస్తుని బోధించకపోతే నా పరిస్థితి దారుణమౌతుంది" అని చెప్పకొన్నాడు - 1కొ9,16. యిర్మీయా మొదలైన పూర్వ ప్రవక్తల్లాగ తానూ తల్లి గర్భంనుండే ప్రభువు సేవకు పిలువబడినవాజ్ఞని యెంచాడు - గల 1,15-16.

ద్వితీయోపదేశ గ్రంథం పేర్కొన్నట్లుగా సిలువపై చనిపోయిన క్రీస్తు శాపగ్రస్తుడే – 21,22-23. కాని అతడు శాపగ్రస్తుడు అయింది ఎందుకు? తన పాపాల కొరకు కాదు. మన పాపాల కొరకు, సిలువ మరణం ద్వారా అతడు శాపానికి గురై మన శాపాన్ని తొలగించాడు - గల 3,13. ఈలా అర్థం చేసికోవడంద్వారా పౌలుకి క్రీస్తుపట్ల గల ఈసడింపు తొలగిపోయింది. అతనిపట్ల గాఢమైన కృతజ్ఞతాభావం కలిగింది. ఆ క్రీస్తుని అందరికీ బోధించాలన్న తీవ్రమైన కోరికకూడ కలిగింది.

పౌలుకి రక్షణ చరిత్రలో మూడు దశలున్నాయని అర్థమైంది, మొదటిదశ అబ్రాహామునుండి మోషేవరకు. ఈ దశలో ధర్మశాస్త్రంలేదు, సొంత అంతరాత్మ ప్రకారం జీవించిన నరుడెల్లా రక్షణం పొందాడు. రెండవదశ మోషేనుండి మెస్సియా వచ్చిందాకా. ఈ దశలో ధర్మశాస్త్రం నరులకు రక్షణాన్నొసగింది. కావుననే పూర్వవేద యూదులు భక్తి శ్రద్ధలతో మోషే ఆజ్ఞలను పాటించారు. ఇక మూడవదశ క్రీస్తు ఊత్దానకాలంనుండి లోకాంతంవరకు. ఇది మెస్సియా కాలం. ఈ దశలో క్రీస్తుని విశ్వసించి రక్షణం పొందాలి. అతని మరణోత్దానాలను నమ్మి అతని ప్రేమాజ్ఞలను పాటించి పాపపరిహారం పొందాలి. ఇప్పడు మనమంతా ఈ మూడవదశలో వున్నాం. కనుక ఈ మూడవదశలో అవశ్యంగా క్రీస్తుని ప్రజలందరికి బోధించాలని పౌలుకి తట్టింది. కనుకనే వేదబోధమీద అతనికి తపన.

ఈ విధంగా డమస్కు దర్శనంలో ఎన్నో దైవరహస్యాలు ఇమిడి వున్నాయి. అది పౌలుకి జీవితాంతం వరకు ప్రేరణం పుట్టించి అతన్ని ముందుకి నడిపిస్తూ వచ్చింది. మనకుగూడ ఈ డమస్కదర్శనం అనేది ఒకటి సొంతంగా వుంటేనే తప్ప మన జీవితాన్ని భక్తితో గడపలేం.

3. ప్రార్థనాభావాలు

1.డమస్కు దర్శనంవల్ల పౌలు పూర్తిగా మారిపోయాడని చెప్పాం. ఈ కాలంనుండి క్రీస్తు అతనికి ఏకైక ధ్యేయమయ్యాడు. ఆ ప్రభువుని బోధించడానికి అతడు సుదీర్ఘమైన ప్రేషిత ప్రయాణాలు మూడు చేసాడు. ఆనాటి గ్రీకు పట్టణాల్లో ఎన్నో క్రైస్తవ సమాజాలను స్థాపించాడు. ఆ సమాజాలకు 14 జాబులు వ్రాసాడు, వాటిని నూత్నవేదంలో నేటికీ చదువుతున్నాం. తీతు తిమోతిలాంటి శిష్యబృందాన్ని తయారుచేసాడు. ప్రభువుపట్ల తనకున్న గాఢమైన భక్తివల్ల ఇప్పడు నేనుకాదు నాయందు క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పకొన్నాడు-గల 2.20. అతన్ని బోధించకపోతే నా పరిస్థితి దారుణమౌతుందని వాకొన్నాడు - 1కొ 9,16-17. క్రీస్తే మనకు నిజమైన విలువ, అతనితో పోలిస్తే ఈ లోకంలోని వస్తువులన్నీ చెత్తాచెదారంలాగ విలువలేనివి అని వాకొన్నాడు-ఫిలి 3,8-11. ఇలాంటి డమస్కదర్శనాన్ని మనం పవిత్ర గ్రంథంనుండి మళ్ళామళ్ళా చదువుకొని ప్రేరణం పొందాలి.

2.పౌలుకి కలిగిన క్రీస్తు అనుభూతిలో ఓ నూరవవంతయినా మనకుకూడ కలిగితే మన జీవితం ధన్యమౌతుంది. మనం పుట్టు ප්‍රිෆික්‍ෂළුය. క్రీస్తు విశ్వాసం కొరకు మనం ఎలాంటి కృషి చేయలేదు. ఏ శ్రమా పడలేదు. కనుక మామూలుగా మనకు అతనిపట్ల గాఢమైన విశ్వాసం పట్టదు. ఇప్పడు వేదగ్రంథ పఠనంద్వారా, దేవద్రవ్యానుమానాలను భక్తితో స్వీకరించడంద్వారా, ప్రార్థన చేసికోవడం ద్వారా మనం ఈ యనుభూతిని పొందాలి. సౌలుకి లాగ ఇప్పడు మనకు అద్భుతమైన దర్శనాలేమీ కలగవు. మనం విశ్వాసంద్వారా హృదయంలోనే ప్రేరణం పొందాలి. ఆ ప్రేరణాన్ని ప్రభువునుండి మనకు సంపాదించి పెట్టమని ప్రేషితుడైన పౌలునే అడుగకొందాం.

3.క్రీస్తుని బోధించకపోతే నా పరిస్థితి దారుణమౌతుంది అనుకొని పౌలు వేదబోధకు పూనుకొన్నాడు. మనకు వేదబోధపట్ల శ్రద్ధ వుండదు. ఇరుగుపొరుగువాళ్ళకు క్రీస్తుని తెలియజేసే పూచీ క్రైస్తవులందరికీ వుంది. ఈ దేశంలో కేవలం 2.5 శాతం క్రైస్తవులు. కనుక మనకు బోధన తపనను దయచేయమని పౌలుని అడుగుకొందాం.

205

ప్రశ్నలు

1.ఈసాకుని బలిగా సమర్పించడంలో అబ్రాహాము ప్రదర్శించిన విశ్వాసాన్ని తెలియజేయండి.
2.స్త్రీలోలుడైన సంసోను పతనమైన తీరూ, అతడు తన మరణానికిముందు శత్రువులను నాశంజేసిన తీరూ వివరించండి.
3.ప్రభువు సమూవేలుని పిల్చినతీరూ, దానినుండి మనం నేర్చుకోదగ్గ పాఠలనూ వివరించండి.
4.ప్రభువు అవిధేయుడైన సౌలుని రాజపదవినుండి త్రోసివేసిన తీరును వివరించండి.
5.సమూవేలు దావీదుకి అభిషేకం చేసిన తీరును వివరించండి. నేడు మనం మన పిలుపనీ సేవనూ లోతుగా అర్థంజేసికోవడానికి ఈ సంఘటనం ఏలా తోడ్పడుతుంది?
6.దావీదు గొల్యాతుల కథలో మానుషబలం దైవబలానికి లొంగిపోయిన తీరును వివరించండి. ఈ కథ నేడు మనకు కలిగించే ప్రేరణలను కొన్నిటిని తెలుపండి.
7.దావీదు దేవునికి మందిరం కట్టగోరిన తీరూ, దేవుడే దావీదుకి మందిరం కట్టిపెట్టినతీరూ వివరించండి.
8.దావీదు పాపంచేయగా నాతాను అతన్ని మందలించిన తీరును వివరించండి. ఈ కథ నేడు మనకేలా ప్రేరణం పట్టిస్తుందో తెలియజేయండి.
9.సాలోమోనుకు విజ్ఞానవరం ఏలా లభించింది? ఆ వరం అతనిలో ఏలా పనిచేసింది?
10.అహీయా ప్రవచనాన్ని వివరించండి. రెహబాము కాలంలో రాజ్యవిభజనం ఏలా జరిగిందో తెలియజేయండి.
11.ఏలీయా ప్రవక్త సారెఫతు వితంతువునీ ఆమె కుమారుడ్డీ ఆదుకొన్న తీరు వివరించండి.
12.కర్మెలు కొండమీద బాలుమతానికీ యావే మతానికీ జరిగిన పోటీని వివరించండి.
13.ఏలీయాకు హోరేబు కొండమీద కలిగిన దైవానుభూతిని వివరించండి. ఈ కథ నేడు మనకు ఏలా ప్రేరణం పట్టిస్తుందో తెలియజేయండి.
14.అహాబు నాబోతు ద్రాక్షతోటను అపహరించిన తీరూ, ఏలీయా ఆ అన్యాయాన్ని ఖండించినతీరూ వివరించండి. 15.ఏలీయా స్వర్గానికి పోయినతీరూ ఏలీషా అతనికి వారసుడైన తీరూ వివరించండి.
16.ఎలీషా నామాను కుష్టను నయంజేసి అతనికి రోగవిముక్తిని కలిగించిన తీరును వివరించండి. లేదా "నామాను విశ్వాసం మెచ్చుకోదగ్గది" - వివరించండి.
17.సౌలుకు డమస్కదర్శనం ఏలా కలిగింది? దానివల్ల అతడు క్రొత్తగా గ్రహించిన వేద సత్యాలేమిటివి?