బిల్వమంగళ/రెండో అంకము
రెండో అంకము
________
ఒకటో రంగము
(చింతామణియింటిలో సాధు బిచ్చగాడు)
సాధు - నీ కీయింటి వద్దనేనా పని?
బిచ్చ - ఔను - మాట యిచ్చినాను, దానిని మరతునా?
సాధు - పనేదో చెప్పు వింటాను.
బిచ్చ - చిన్న పనే. ఈయింటియజమాని తానిక్కడ లేనప్పు డిక్కడికి ఎవరెవరు వత్తురో చూడుమని నన్నంపినారు. ద్వారము దగ్గర ఉంటిని, వర్షము కురుస్తూంటే లోనికి వచ్చినాను. స్త్రీ లితరుల వంచింపబోయి వారే వంచింపబడుదురు. నేను పరదేశినని కేక వేసినాను - అటుకులు, బెల్లము, పెరుగు, పెట్టినారు. నన్ను పోల్చినారేమో - "ఆమాడుమొగమే పంపించియుండు"నన్నారు. ఇల్లు ఎవరో తుడుస్తూఉంటే జల్లు కొట్టుతున్నదని కేక వేసితిని, ఈమూల నుండు మన్నారు. నీవు రాత్రి అంతా మేలుకొని యుంటి వెందుచేత? సాధు - నీవిటనున్నావని తెలుస్తే రెండుమాటలు నేర్పియుందును.
బిచ్చ - ఇప్పుడు నేర్పిన ప్రయోజనము లేదు - మేఘము లింకా విరియలేదు, ముసుగుదన్ని మూడంకెవేసి నిద్రపోయెదను. శిష్యుడు చేయవలసినపని నే నెరుగుదును.
సాధు - దాసి యిటువస్తే నేనొక గొప్పసిద్ధుడ నని చెప్పు.
బిచ్చ - ఆలాగే - ఈదాసీతో వ్యవహారము సామాన్యముకాదు. నీమాట లిక్కడ సాగవు - అది కత్తికోతకత్తె. గురు శిష్యసంప్రదాయము చెల్లేటట్లులేదు. నీవు దానికి బోధించినది నేనెరుగుదును. రాధాకృష్ణనాటక మాడవలెనని నీ యూహ-అది తెనిసినవాడను గనుక నీతో ఈ ప్రసంగ మెత్తినాను.
సాధు - నాశిష్యుడవని అను-అందు ప్రమాద మేమి?
బిచ్చ - నీ వేషము గంభీరముగా నుందిగాని దానికి తగిన యోగ్యత నీకు లేదు. తెలివితక్కువ కాకుంటే తెల్లవారిన తరువాత గురుశిష్యధర్మ మెందుకు? నిశీథమున నిష్ఠయందున్న ప్పుడు గురవేనమ: యందును.
సాధు - నీవుపోయి పరుండు - నే నీదాసితో కొంత ముచ్చటించవలెను.
బిచ్చ - తెల్లవారిన పిమ్మట కూడదా? తత్పూర్వ మామె దర్శనమె దుర్లభము. పట్టెమంచముపై పరుండిన పడుపుకత్తె పైకముచూపితే పరుగెత్తివచ్చును గాని రుద్రాక్ష పేరుల చప్పుడు విని ఈవంక వచ్చునా? పాటపాడితే గాని నీకు పైకమబ్బదు. అందుచేతనే కాబోలు పిచ్చిదానిని చేజిక్కించుకొనయత్నించినావు-అది శ్మశానమునకు పారిపోయినది.
సాధు - వెర్రివాడా, నాకుకాదు, నీకని నేనుచెప్పలేదా?
బిచ్చ - హరిహరీ! ఇది నేనెరుగను - నీవు వగకాడవు గనుక పిచ్చిదానిపై నాసవిడిచి దాసికొరకు తల్లడిల్లుతూన్నావు. నాదగ్గిర దాచకు-ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేవాడను సుమా! ఈదాసి ఆడదైనా నూరుగురు మగవాళ్ళను చంపి పుట్టింది బాబూ! అదిగో బ్రహ్మరాక్షసిలాగు వస్తూన్నది-(పరుండును.) మూస:Cnter దాసి - ఇద్దరు పెద్దమ్మ లిక్కడ చేరినారూ? తాళము పగులగొట్టి లోన దూరలేదు కదా!.... వీళ్ళు దొంగలుకారు. ఓహో! అయ్యగారు దయచేసినా రా?
సాధు - వచ్చినాను.
దాసి - నేడు మాయజమానిగారు రానందున యజమానురాలివద్ద నుండవలసి వచ్చింది. ఇక్కడికి రావడము మాట మనస్సులో పెట్టుకొనే ఉంటిని - చిన్న కునుకు పట్టింది. పాపము మిమ్ము కష్టపెట్టినాను, పొగాకైనా తేలేదు-పొద్దు పోయినప్పటినుంచీ యిక్కడే ఉన్నాను. ఇంటికి పోలేదు-ఏమి చేయడానికీ తోచలేదు. దీపమువెలిగించి పొగాకుతెచ్చి అరుగు మీద కూర్చుండి మీయుపదేశము వింటాను...(పోబోవును) బిచ్చ - చూచినావా దీని విశ్వాసము! తిరిగి వస్తానంది - నీవు నన్నెరిగినట్లు దానికి తెలియనీయకు-ఇద్దరినీ గెంటి వేయగలదు.
సాధు - పొగాకు కేమిలే-నీవుండు. నేను రామేశ్వరము, హరిద్వారము, నాసిక, పూరి చుట్టివచ్చినాను గాని నాకు నచ్చినవా ళ్ళెక్కడా కనబడలేదు.
దాసి - ఆమాట నిజమే. అట్టివాళ్ళు దొరకడము అలభ్యయోగమే. నాకిప్పటికి ఇరువైయొక్కసంవత్సరములు గడచినవి. ఆఁ చైత్రామాసానికి పందొమ్మిది నిండినవి, నాకూ అట్టివాళ్ళు లభించలేదు.
సాధు - నీవుమాత్రము నాకు చక్కగా నచ్చినావు.
దాసి - గట్టిగా మాటలాడకు. ఇక్కడో బికారి యున్నాడు, వాడిచెవిని మనమాటలు పడితే మనకిద్దరికీ పొసగడము కష్టము.
సాధు - నీకు రాధాప్రేమతత్వ ముపదేశించ వలె నని నా కోరిక.
దాసి - మంచిమాటే.
సాధు - సావధానముగా విను. ఈ సంసారసాగరము దాటవలెను.
దాసి - ఔను.
సాధు - దానికిముం దీవేశ్యావృత్తి మానవలెను, వెలయాలియై యుంట వెర్రికాదె? దాసి - నాసంగతి నీవెరుగవు-పురుషుని చూడగానే గుణము పోల్చగలను. దేవతార్చనము చేయక నీరైనా తాగను. నాయం దనుగ్రహించి నాయింటికి వచ్చినవానిని నాధునిగా భావించి పరపురుషుని కన్నెత్తిచూడను. ఈరీతిగా ఇరవైరెండేళ్ళూ ఒక్కరిపోషణమందే కాలక్షేపము చేసినాను.
సాధు - నాభావము నీకవగతము కాలేదు-నే నుంచు కోవడముమాట ఎత్తలేదు-ప్రేమవిషయము పల్కుతున్నాను.
దాసి - కావచ్చును. ఆడదానను గనుక విశదముగా చెప్పినకాని బోధపడదు.
సాధు - అట్లైతే - రెండుమాటలలో తెల్పుతాను. నేను నిన్ను రాధగా చూచుకొంటాను, నీవు నన్ను కృష్ణుని గా నెంచుకో. పిదప నీకిష్టమువచ్చినట్లు చేసినా పాపముండదు... రాధ వవుతావా?
దాసి - మీమాట నాకు తెలియలేదు.
సాధు - రాసరసమయివై నా రాధవు కా, నీకుప్రణయకోపము వచ్చుని, నీపాదములు పట్టి నే నలక తీర్చుతాను...నేను వేణుగానము చేసెదను, నీవు "ఏడీకృష్ణుడు? కృష్ణుడేడీ?" అని సొక్కిసొలసిసోలుతావు...తెలిసిందా?
దాసి - నీవు నన్ను పోషింపగల్గితే అన్ని ఆట లాడుతాను. కూటికీ గుడ్డకీ యిచ్చిన చాలును. పరుండడానికి పరుపక్కరలేదు, చాపైనాసరే-నగలుపెట్టినా మానినా ఏమీఅనను.
సాధు - నేను బ్రహ్మచారిని, సామంతుడను కాను. ఒకటిరెండు విద్యలు మాత్రమే ఎరుగుదును, భస్మాలు చేస్తాను, బంగారము చేయగలను.
దాసి - బంగారము చేయగలవూ?
సాధు - శ్రీగురుకటాక్షమున ఆవిద్య నేను నేర్చగలిగితిని, నీ కుపదేశిస్తాను.
దాసి - అబ్బో! అలాగైతే నాబోటివాళ్ళను పదిమందిని పోషించగలవు. (స్వ) నన్ను బుట్టలో వేయవలెనని చూస్తున్నాడు!
సాధు - ఆవిద్య నేర్చుకొన్నాను, ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదు; గురువుగారు "బైరాగికి బంగారు మెందుక"ని నిషేధించినారు. ఆవిద్య ఇతరుల కుపదేశించుమనే గుర్వాజ్ఞ. నీవు నారాధవై తే నీకు నేర్పుతాను. సంవత్సరము నా చెప్పు చేతలలో ఉంటే సకలవిద్యలూ ఉపదేశిస్తాను.
దాసి - (స్వ) సన్యాసికి సొత్తక్కరలేదు. కాని సాని కావలెనట! వీడు టక్కరి లాగున్నాడు, ఇంటినుండి గెంటవలయును, లేకుంటే హాయిగా నిద్రపోనీయడు. (ప్ర) సరే, మీరు పొద్దుగుం కేసరికి రండి, నేను నిద్రపోవలెను. (బిచ్చగానితో) ఓరీ మొద్దా! నీవూ నడువు, నేను లోనికిపోవలెను, ఇద్దరూ దయచేయండి.
(గోడమీదనుండి బిల్వమంగళుడు దుముకును)
అయ్యొబాబో! దొంగర్రో! దొంగ! ఇల్లు దోపిడవును!
(లోపల, ఏమే, దాసీ, ఏమిటాగోల?) రావమ్మా! దీపము తేవమ్మా! ఏదో మూల్గుతూన్నట్లుంది.
(దీపము పట్టుకొని చింతామణి వచ్చును)
చింతా - ఏమిటే? ఏ మాగోల?
దాసి - (బిల్వ|| చూపి) చూడమ్మా-అయ్యగారు!
చింతా - మాడుముఖము మళ్ళీ వచ్చిందా? ఇక నన్ను కొరుక్కొని తింటాడు-అదేమి మూలుగుతున్నాడు?
దాసి - గోడమీదనుండి గెంతినారు, దెబ్బ తగిలింది, ఇరుకు పట్టిందేమో?
చింతా - నామెడ కురిపోసినాడు-నాకేమి దిక్కు దేవుడా?
బిల్వ - చింతామణీ-నీరు కొంచెము తే.
దాసి - బ్రతికియున్నా రమ్మా, భయము లేదు. జీవముంది.
చింతా - లేకుంటే నాప్రాణాలు తీయడ మేలాగా?
దాసి - ఇటురా, చేతులుపట్టుకొని తీసుకొని పోదాము.
చింతా - ముందు లేవనెత్తి కూర్చోపెట్టు.
బిల్వ - దాసీ, నీవు నన్ను ముట్టకు, చింతామణీ! కౌగిలిచ్చి నన్నెత్తు.
చింతా - ఆఁ. దాసీ, ఎత్తవే-లే లెమ్ము, నేను రావాలా?
దాసి - అయ్యా! నీకు బుద్ధి ఉందా? చింతా - ఓసి, నీచిన్నతనము కూల! సంగతిగ్రహించ లేకపోయినావు-సాయంత్ర మా మొద్దును బంపినాడు, నే నెవడినైనా సరసుని పెట్టుకొన్నానేమో స్వయముగా చూడవలెనని అర్ధరాత్రికి తానే దయచేసినాడు.
బిల్వ - చింతామణీ, నిజముగా నిన్నుచూడ వచ్చినాను సుమా.
చింతా - (ముక్కు మూసుకొని) అబ్బా! ఈ దుర్గంధ మేమిటి? (ముగ్గురూ పోవుదురు)
బిచ్చ - చూచినావా? ఎంత మూర్ఖుడవో. సంతకి సన్నజాజులు తెస్తారు, కాని చవిటిమన్ను తెస్తారా? ఇంకా ఆలోచనెందుకు? బయటికి పద, లేకుంటే చీపురుదెబ్బలు తప్పవు. నేనూ వత్తునుకాని నాకింకా ఆశ పోలేదు. (దాసి వచ్చును)
దాసి - అబ్బే! అయ్యగారు ఒంటికేదో పూసుకొని రాలేదుకదా? ముక్కులో నరాలు కుళ్ళిపోతూన్నవి. శవము కంపు!
(చింతామణి వచ్చును)
చింతా - దాసీ, కుళ్ళిన మాంసమే! పురుగులు గులగులలాడుతూన్నవి. పక్కంతా పాడైంది. ఇల్లంతా పాడు కంపు - ఏలాగు పోతుందో?
సాధు - దాసీమణీ, నేను పోనా?
చింతా _ ఈశవ మెవడు ? వీడినికూడా పంపినాడా? దాసి - ఇంకా ఉన్నావా? ఒకసారి చెప్పితే వినబడ లేదా?
సాధు - రే పొకసారి కంటపడుతావా?
దాసి - ఇప్పుడు దయచేయండి, రేపటిమాట ఆలోచింతాము. (సాధు పోవును)
బిచ్చ - ఏమమ్మో, యజమానురాలా, నేనుకూడా పోనా? నాకేమి యివ్వవా?
చింతా - ఆఁ కొంచెముండు - ఏమి తల ఆడిస్తూన్నావు? అతనివెంటా రాలేదు, నన్నుచూడ వచ్చినానంటున్నావా; ఈజీవచ్ఛవ మెందుకు వచ్చినాడు? - ఇంత గాలి వానలో ఏ రీదడ మేమి? శ్రాద్ధమూ లేదూ గీర్థమూ, లేదు. సర్వాబద్ధమే ! ఏటియొడ్డునే ఎక్కడీ దాగియుండెను - గోడ దాటడమేమి? గచ్చుగోడ నున్నగా ఉంది, దన్నూ లేదు దావూలేదు.
(బిల్వమంగళుడు వచ్చును)
బిల్వ - చింతామణీ, నీవు తాడు జారవిడువ లేదా?
చింతా - విన్నావా? దాసీ, ఎవరికోసమో గోడమీది నుండి తాడు జారవిడిచినా నట? చూచినావా గేలి?
బిల్వ - హాస్యము కాదు, నీతోడు - నిజముగానే తాడు పట్టుకొని ఎక్కినాను.
చింతా - దాసీ, నీవు నాకన్న పెద్దదానవు - నీయెదుటనే చెప్పుతూన్నాను, ఇట్టిమాట లింక పడలేను. ఒక రూపాయి యిమ్మంటే ఊరల్లా గోల! లేకుంటే మరిపింతలు. ఇల్లూ వాకిలీ తాకట్టు. నిచ్చెనవేసి గోడదాటి ఇంట్లో దూరడము! పైపెచ్చు మనస్సులో నాటే మాటలు!
బిల్వ - చింతామణీ-నిచ్చెనపై నే నెక్కలేదు, తాడు పట్టుకొనే ఎక్కినాను. నూరు రూపాయీలు జాగ్రత్తపెట్టు మని గుమస్తాతో చెప్పినాను, ఎల్లుండి యిస్తాను.
చింతా - ఏదీ, తాడు? చూపకుంటే చీపురు విరుగు తుంది.
బిల్వ - రా, చూపెదను.
చింతా - రా, దాసీ, చూచి వత్తాము. (పోవుదురు)
బిచ్చ - ఈనాడు నాగ్రస్థితి బాగులేదు, రాత్రి కూలి పోయింది, నిద్రే లాభము-నన్ను వీళ్లు సాక్ష్యము వేయలేదు, బతికినాను, న్యాయాధిపతే విచారణకర్త! ఆమెమాట నిజమే, ఈరాత్రివేళ నది దాటడ మేమిటి! అంతా గోల లాగుంది - ప్రేమ యిలాటిదే కాబోలు ! దూరాన ఉండి అంతా చూస్తాను.
_______
రెండో రంగము
_______
(గోడమీద పాము-బిల్వమంగళ, చింతామణి, దాసి, బిచ్చగాడు.)
బిల్వ - అదిగో చూడు, తాడు వేలాడుతూన్నది.
చింతా - ఏదీ? (గోడదగ్గరకు పోయి) అమ్మో! ఎంత పామో! కొండనా గేమో?
బిచ్చ - ఔనండో, సర్పము తల గోతిలోకి దూర్చిందంటే తోకపట్టి ఎంతలాగినా ఊడిరాదు. భయము వేయ లేదు కాబోలు! మంచి తాడే దొరికింది! (స్వ) ఇతడే దొంగైతే సప్తప్రాకారాలు దాటి సొత్తు కొనిపోవును కదా!
దాసి - వలపన్న నిట్టిది! ఇతడు నామనసుకి నచ్చినాడు, ఇతరులయం దిట్టిప్రేమ యుండునా? కొట్టు, చీపురుతో కొట్టుతానన్నవే!
చింతా - ఈ కాలసర్పమును పట్టుకొని గోడ దాటినావా? భయము లేకపోయిందా బాపనయ్యా? అదేమి ఎర్రబారి చూస్తున్నావు?
బిల్వ - చింతామణీ, నిన్నే చూస్తున్నాను.
చింతా - ఏమి టాచూచేది? నేనేమి కొత్తసానినా?
బిల్వ - నీయందమూ చందమూ.
చింతా - నది నెట్లు దాటగల్గినావు?
బిల్వ - ఈదగల్గుదునని నదిలో దుమికితిని. మధ్యకు వచ్చేసరికి తుపానురేగి ఊపిరి సలిపిందికాదు. ఒకదుంగ నా దరికి కొట్టుకొని వచ్చింది!
చింతా - ఈ కంపేలాగు వచ్చింది?
బిల్వ - అదేమో నాకు తెలియదు.
చింతా - తోక పట్టుకుంటే పాము కాటువేయలేదా?
బిల్వ - చింతామణీ-ఆత్మత్యాగము నీవెరుగవు-తెలిసి యుంటే ప్రాణ మతితుచ్ఛమనిపించును, పామునకూ, తాడుకీభేద ముండదు.
చింతా - నీకు మైమరుపు కలిగిందా? పిచ్చి పట్టిందా?
బిల్వ - నీకు ప్రేమమహత్వ మావంతైనా తెలియదు, కాని అతిసుందరివి! లోకమోహినివి!
చింతా - రెప్ప వాల్పక చూస్తున్నా వేమి?
బిల్వ - నామాట నిజమౌనో కాదో చూస్తూన్నాను. నాకు మతిలేదని నీ విదివరకే గ్రహించియుండవలసినది. నీవు హాయిగా నిద్రపోతూ ఉంటే నేను నీముఖమే చూస్తూ ఉంటాను. నీ వూపిరి విడిచేటప్పుడు దశదిశలూ నాకు శూన్యములై తోచును. నీవు కంట నీరు పెట్టితే నాగుండెలో శూలముగుచ్చిన ట్లుండును. ఇది నీవెరుగవా? నాకు పిచ్చి పట్ట కేమి? నాసర్వస్వమూ ఋణగ్రస్త మయింది, అది నేను లెక్క చేయలేదు. నిందమాత్రమే నా కాభరణ మయింది. నామాటలన్నీ నిజమని ఇప్పుడైనా తెలిసిందా? (పామును చూచి) నాకు మతి లేదనడానికి కిదే దృష్టాంతము. నేను వెర్రివాడనే కాని, చింతామణీ, నీవు అసమానసౌందర్యఖనివి! నిరుపమాన రూప సుందరివి!
చింతా - సరిపోయింది-ఏమంటివి?
బిల్వ - నీ వప్రతిమ మనోహరిణివి. లేకున్న ఇన్ని దినాలు నిన్ను పూజింతునా! నీవు దేవివా, రాక్షసివా అని సంశయిస్తూన్నాను. దేవివైతే నామనోవ్యధ నెరుగగల్గుదువు. నీవు రాక్షసివే, కాని కమనీయగాత్రపు, కాంచనమూర్తివి.
చింతా - దుంగపై ఈదినా నంటివే, ఏదీ దానిని చూపు.
బిల్వ - ఇంకా అపనమ్మకమే! రా, పోదాము.
________
మూడో రంగము
________
(నదీకూలము-శవము పడియుండును, బిల్వ, చింతా, దాసియూ వత్తురు.)
(బాటసారులు పాడుతూ పోవుదురు)
మాయరా-జన్మము-మాయరా-పరికించిచూడగ ||మా||
మాయరా కాంచనము దాపిన-కాయ మిది క్షణభంగురంబని
హేయమని-సర్వభోగంబుల-రోయుటే భద్రమని తెలియర||మా
కాలచక్రము నిల్వబోదుర - కాంచబోవు గతించు నిముసము
కాంతలను కనకంబువీడుము-కావు ముక్తికిసాధనములవి||మా||
సారము లేనట్టి సం-సారమనుచీకటిని నీకెట
దారితోచదు తెన్నుదోచదు-వారిజాక్షునిగొల్వకుండిన||మా||
వార కాంతల మోహవిభ్రమ-వాగురులలో చిక్కబోకుము
వారిహృదయముప్రేమశూన్యము-వారిమాటలుబూటకము లే||
బిల్వ - నిజము-సర్వమూ మాయ! ఈవిపులబ్రహ్మాండ మందు "నాది" అనదగిన దేదీ కానరాదు. ఎవర్తెకోసము నదిలో నర్ధరాత్రి ఉరికితినో అదే నాదికాదు! ఎక్కడైనా ఏదేనా "నాది" అనదగింది ఉన్న దేమో చూస్తాను.
చింతా - ఓహో! ఏమి యీ నదీకోలాహలము! సముద్రములాగు ఓరు పెట్టుతూన్నది, దేశమంతా ముంచే లాగుంది!...ఇందులో ఉరికినావా?...ఏమి తెగువ!...ఏదీ దుంగ? ఎక్కడ పెట్టినావు?
బిల్వ - అదిగో! (శవము చూపును)
చింతా - ఇదా? అబ్బే! కుళ్ళిన శవము!...నీమాటలన్నీ నిజము, నాకు నమ్మకము పుట్టింది...నీకు తప్పకుండా మతిపోయింది! రోత లేకపోయింది! సిగ్గూలేదు, లగ్గూలేదు; బిడియములేదు, భీతిలేదు-తా డనుకొని తాచుపాము పట్టుకొన్నావు, కర్రయని శవము కౌగలించినావు!... నే నిదివరలో ఒకమాట విన్నాను, నేటి కది నిజమయింది... నీచిత్తము వేశ్యనగు నామీద లగ్నముచేయక హరిపాదపద్మములందు ఏకలక్ష్యముగా లగ్నము చేసితివా, అది సార్థకమైయుండును. ని న్నేమందును? అర్ధనిశీథమున ఘోరమైనతుపానులో నిండునదిలో దుమికి, శవముపై ఈదుకొని వచ్చినావు! ఇది వినగానే ఒళ్ళు గగురుపొడుస్తూన్నది. ఇంతేకాక పాము పట్టుకొని గోడ దాటినావు! ఇదంతా భ్రమ అనుకొన్నాను. ఇదే భ్రమ ఐతే ఇక ప్రమ ఎటువంటిది? ఏమి ధైర్యము! ఏమి తెగువ! ...నీచిత్తవృత్తి చూస్తే నాకేమీ పాలుపోలేదు.
బిల్వ - ఇంతే! పురుషశరీరంబు - బుద్బుదము చూడ
నీటను పెరుగును-నీటనే కుళ్లు
కుక్కలు నక్కలూ-కొరికి పీకెడును,
అనలానభస్మమై-యనిలాన నెగయు,
ఇదె నాతి, దానికి-నీగతియె యబ్బు;
సర్వసృష్టియు జూడ క్షణభంగురంబు.
అక్కటా! ఎవరికై ప్రాణంబు లిడుచుంటి నేనె
వ్వరికినై యీశవ-పరిరంభణంబు?
కౌగిలించితి బిగ్గ-గాలి నే నయ్యయొ
ఇది యుషయా? లేక ఇది ఛాయయేమొ?
మిథ్య సమస్తంబు! మిథ్యయే! మిథ్య!
నిబిడాంధకారంబు నీక్షించుచుంటి.
ఎవరివాడను నేను? ఎయ్యది నాది?
ఇట్టి తాపము సైప-నేల నేనిట్లు?
ఛాయామహావాయు-సౌధ సౌధముల
తోచక నేనిట్లు-తోవ దొక్కితిని.
ఎవడొకో నావాడు? ఎయ్యది నాది?
కానరా వదియేల? కడగి యెవరైన
ఆర్చిన నాజ్వాల-నసువు లర్పింతు.
హేయంబు సంసార-మిది చివుకుకర్ర!
అనుకొనుటకు ప్రేమ-కాధారమేది?
ఏడ ప్రేమమహాబ్ధి-ఏడ దోచదుగ;
ప్రాణప్రవాహిని-పడుచోటు గాన.
బుట్టినదాదియూ-పొడగాంచనైతి
నాత్మీయమనదగు-నర్థ మొక్కటియు.
ఏడబోవుదు నేను? నెయ్యెడ గాంతు?
గాఢాంధకారంబు-గనరాదు దారి
ఛవిజూపు నెవ్వాడు-ఛాయ విరియగను>
ఆత్మీయుడగువాని-నరయ బోవుదును
లోకమంతా తిరిగి-కేక వేయుచును.
(పిచ్చిది పాడుతూ వచ్చును)
(తోడిరాగము..."పట్టువిడువబోడు" వరుస)
పట్టువిడిచిపోడు-నా చెయి ||ప||
ఎట్టులనేగిన నావెన్క నె పడు
కొట్టితిట్టినను, కొందలమొందడు ||ప||
సంతసమొంద నే-చింతనుతొలగును,
చింతించిన నే - చింతనుగూలును;
ఎంతయాదరము కలదొకొయనిపరీ-
క్షింతును నాదగురత్న మల్లదిగో ||ప||
సత్యాసత్యములను బోధించు,
నిత్యానిత్యములను చూపించు;
అత్యాదరముననెదప్రేమించు,
భృత్యకోటికిని ముక్తినొసంగును ||ప||
చింతా - ఆహా! ఏమి మధురగానము ! బిల్వ - నావా రెవ్వరూ లేరా? ఉన్నారు, లేకేమి? అంధకారమున నరయలేకున్నాను. ఉన్నారు, నాదగ్గరే ఉన్నారు. లేకుంటే, దుర్వారతరంగిణీమధ్యమున శవమును జారవిడిచిన దెవరు? క్ష్వేళవహ్నియైన కుండలి కరవకుండా నన్ను కాచినవా రెవరు? - నావారు లేరని అన్నవా రెవరు? ఇపుడు నాతో ఆత్మీయుడను అని చెప్పినవా రెవరు? ... నీ వెవడవు? నీరూపమెట్టిది? నీ వతిసుందరమూర్తివి ! ఒక్కసారి కంటపడవా? పోనీ ఎక్కడ నుందువో చెప్పు... నా ప్రాణాలు పోతూన్నవి... నాదగ్గరనే ఉన్నావు; నే నంధుడను కావున కాంచలేకున్నాను. నాకళ్ళు విప్పేవా రేరీ? ...నే నెక్కడికి పోవుదును?.. (పోవును)
చింతా - ఎక్కడికో పోతూన్నాడు-విరాగి అయ్యెనా ఏమి? అతనివారు లేనప్పుడు నావారు మాత్ర మున్నారా? చూస్తాను. (పోవును)
దాసి - చిత్రముగా ఉంది వీళ్ళచర్య.. (పోవును)