బాల వ్యాకరణము/కారక పరిచ్ఛేదము
కారక పరిచ్ఛేదము.
1. ప్రాతిపదిక సంబోధనోక్తార్థంబులం బ్రథమ యగు.
ప్రాతిపదికార్థమునందు : రాముఁడు - రావణుఁడు. నియతోపస్థితికము - ప్రాతిపదికార్థము. సంబోధనమునందు: ఓరాముఁడ - ఓరావణుఁడ. ఉక్తార్థమందు: రాముఁడు రావణుని సంహరించెను. ఉక్తమనఁగా చెప్పబఁడినది. ఈ వాక్యమందు నాఖ్యాతము కర్తను జెప్పినది గావునఁ దద్వాచకమగు రామ శబ్దమునకుఁ బ్రథమమయ్యె. రామునిచే రావణుఁడు సంహరింపఁ బడియె. ఈ వాక్యమం దాఖ్యాతము కర్మమును జెప్పినది గావునఁ దద్వాచకంబగు రావణ శబ్దమునకుం బ్రథమమయ్యెనని యెఱుంగునది.
2. కర్మంబున ద్వితీయ యగు.
ధాత్వర్థఫలాశ్రయంబు కర్మము నాఁబడు. దేవదత్తుఁడు వంటకమును వండెను. ఇట వండె ననుమాటకు వంట చేసెనని యర్థము. వంట ఫలము - చేయుట వ్యాపారము. వంట యనంగ బాకము. పాకమున కాశ్రయము కావుటంజేసి వంటకము కర్మం బయ్యెనని యెఱుంగునది.
3. చేతవర్ణకంబు కర్త కగు.
ధాత్వర్థ వ్యాపారాశ్రయంబు కర్తనాఁబడు. దేవదత్తుని చేత వంటకము వండఁబడియె. వండఁబడియె ననఁగా వంట చేయఁబడియెనని యర్థము. చేయుటం కాశ్రయుఁడగుటం జేసి దేవదత్తుండు కర్తయయ్యె.
4. చేతవర్ణకంబు హేతుకరణంబులకు, గ్రహ్యాదియోగజంబగు పంచమికిని బహుళంబుగా నగు.
ఫలసాధనయోగ్యం బగు పదార్థంబు హేతువు. క్రియాసిద్ధిం బ్రకృష్టోపకారంబు కరణంబు. హేతువునకు: ధనముచేత సౌఖ్యంబు గలుగు. విద్యచేత యశంబు గలుగు. పక్షంబున వలన వర్ణకంబగు. కరణంబునకు: ఖడ్గంబుచేత ఖండించె, కోలచేతఁ గూలనేసె. పక్షంబున దోడవర్ణకంబగు. గ్రహ్యాది యోగంబునందు: జరాసంధుఁడు రాజులచేతఁ గప్పంబు గొనియె. మైత్రుండు చైత్రునిచేత ఋణంబు గొనియె. ఈ యర్థంబులు నీచేత నెఱింగితి. ఈ వృత్తాంతంబు వానిచేత వింటి. పక్షంబున వలన వర్ణకంబగు. ఇత్యాదికంబు లెఱుంగునది.
5. కరణ సహార్థ తుల్యార్థయోగంబులం దృతీయకుం దోడవర్ణకం బగు.
కరణంబునందు: కోలతోడఁగూలనేసె. సహార్థంబునందు: రాజు సేనలతోడ వచ్చె - సేనాసహితుండయి వచ్చెనని యర్థము. తుల్యార్థ యోగంబునందు: చైత్రుని తోడ మైత్రుండు తుల్యుండు. తృతీయకనుటంజేసి చైత్రునకు మైత్రుండు తుల్యుండని తుల్యార్థయోగంబున షష్ఠియునగు. 6. వచ్యర్థాముఖ్యకర్మంబునకుఁ దోడఁ కువర్ణకంబులు ప్రాయికంబుగా నగు.
మైత్రుండు చైత్రుని తోడ నిట్లనియె - మైత్రుండు చైత్రున కిట్లనియె. ప్రాయికం బనుటచే వొకానొకచో ద్వితీయయునగు.
7. ఉపయోగంబునం దాఖ్యాతకుం దోడవర్ణకం బగు.
నియమపూర్వక విద్యాస్వీకారం బుపయోగం బనంబడు. రామకృష్ణులు సాందీపునితోడ వేదంబుల జదివిరి - సాందీపునివలన నని యర్థము.
8. సంప్రదానంబునకుం జతుర్థి యగు.
త్యాగోద్దేశంబు సంప్రదానంబు నాఁబడు. జనకుండు రాముని కొఱకుఁ గన్యనిచ్చెను. కొన్నియెడల నుద్దేశ్యమాత్రంబున కగు. పురుషార్థంబు కొఱకు ప్రయత్నింపవలయు. చతుర్థికి మాఱుగా షష్ఠియె తఱచుగా బ్రయోగంబులం గానంబడియెడి. జనకుండు రామునకుం గన్యనిచ్చెను. పురుషార్థంబునకు యత్నింపవలయు.
9. అపాయ భయ జుగుప్సా పరాజయ ప్రమాద గ్రహణ భవన త్రాణ విరామాంతర్థి వారణంబు లెద్దాననగు, దానికి వలన వర్ణంకం బగు.
అపాయము - విశ్లేషము, భయము - వెఱపు, జుగుప్స - ఏవ, పరాజయము - దయ్యుట, ప్రమాదము - పరాకు, గ్రహణము కొనుట, ఎఱుంగుట - వినుట ఇత్యాది, భవనము - పుట్టుట, త్రాణము - కాచుట, విరామము - విరమించుట, అంతర్థి - మఁఱుగుట, వారణము - వారించుట. అపాయంబునకు - మైత్రుండు రాజ్యంబువలన భ్రష్టుండయ్యె. భయంబునకు - చోరునివలన భయపడియె. జుగుప్సకు - పాపంబు వలన నేవగించె. పరాజయమునకు - అధ్యయనము వలన డస్సె. ప్రమాదంబునకు - పాడివలనం బరాకు వడియె. గ్రహణంబునకు - మైత్రుని వలన ధనంబు గొనియె. భవనంబునకు - మనువు వలనం బ్రజలు పుట్టిరి. త్రాణంబునకు - చోరునివలనం గాచె. విరామంబునకు - భోగంబుల వలన విరమించె. అంతర్థికి - కృష్ణుండు తల్లి వలన దాఁగె. వారణంబునకు - శోకంబువలన వారించె. ఈ పంచమికి షష్ఠియుం గొండొకయెడల నగు. చోఱునకు వెఱచె. పాపంబున కేవగించె. అధ్యయనంబునకు డస్సె. పాడికిం బరాకువడియె. మనువునకు నిక్ష్వాకుండు పుట్టె - ఇత్యాదు లూహించునది.
10. ఉండిపదం బొకానొకచో వలన వర్ణకంబున కనుప్రయుక్తంబగు.
హిమగిరివలన నుండి గంగవొడమె - నాకంబువలన నుండి నారదుండు వచ్చె.
11. ఉండిశబ్దము పరంబగునపుడు వలనకు ద్వితీయాసప్తములు ప్రాయికంబుగ నగు.
వనమునుండి వచ్చె - వనమందుండి వచ్చె. ఊరినుండి వచ్చె ఊరనుండి వచ్చె. వనమునుంచి, ధనమునుంచి యని యుంచి శబ్దాను ప్రయోగంబుతోఁ గొందఱు వ్యవహరించెదరు. గాని యది సాధుకవి ప్రయోగారూఢంబుగాదని యెఱుంగునది.
12. కంటెవర్ణకం బన్యార్థాది యోగజం బగు పంచమికగు.
రామునికంటె నన్యుండు ధానుష్కుండు లేఁడు. లోభంబుకంటె నితరంబు దోషంబు లేదు. ఇచట షష్ఠియునగు. రామున కన్యుండు ధానుష్కుండు లేఁడు. అన్యము - ఇతరము - పూర్వము - పరము - ఉత్తరము ఇత్యాదు లన్యాదులు.
13. కంటెవర్ణకంబు నిర్ధారణపంచమి కగు.
ఎచ్చట నిర్ధార్యమాణంబు జాత్యాదులచే భేదంబు కలిగియుండు, నచటం బంచమియగు. ఆ పంచమికిం గంటె వర్ణకంబగునని యర్థము. జానపదులకంటె నాగరులు వివేకులు. మానహానికంటె మరణము మేలు.
14. పట్టివర్ణకంబు హేతువులగు గుణక్రియల కగు.
జ్ఞానముఁబట్టి ముక్తుఁడగు - నీవు వచ్చుటంబట్టి ధన్యుడనయితి. ఇచట వలన వర్ణకంబు నగు. జ్ఞానము వలన ముక్తుండగు.
15. శేషషష్ఠికి యొక్కయు నగు.
ఇచట శేషంబనఁగా సంబంధంబు. రాముని యొక్క గుణములు - నా యొక్క మిత్రుఁడు - వానియొక్క తమ్ముఁడు. కువర్ణకంబును గొన్ని యెడల సంబంధంబునం దగు. నాకుం దమ్ముఁడు - మీకు నెచ్చెలి.
16. నిర్ధారణషష్ఠికి లోపల వర్ణకంబగు.
జాతి గుణ క్రియా సంజ్ఞలచేత సముదాయంబునుండి యేకదేశంబునకుం బృథక్కరణంబు నిర్థారణం బనంబడు. ఎద్దానివలన నిర్థారణంబగు నచ్చటి షష్ఠికి లోపల వర్ణకం బగునని యర్థము. మనుష్యులలోపల క్షత్రియుండు శూరుండు - గోవుల లోపలఁ గపిల బహుక్షీర - అధ్వగుల లోపలం బాఱువాఁడు శీఘ్రగామి - ఛాత్రులలోపలఁ మైత్రుండు సమర్థుండు. ఇచట సప్తమియు గలదు. మనుష్యులయందు క్షత్రియుండు శూరుండు. ఇత్యాదులెఱుంగునది.
17. అధికరణంబునకు సప్తమి యగు.
అధికరణంబు నానాధారంబు. ఔపశ్లేషికంబు వైషయికం బభివ్యాపకంబని యాధారంబు త్రివిధంబు. ఘటమందు జలమున్నది - మోక్షమం దిచ్ఛ గలదు - అన్నిటియం దీశ్వరుండు గలడు.
18. ఉకారాంత జడంబునకు నవర్ణకం బగు.
ఘటంబున జలంబున్నది - దేవదత్తునకు మోక్షమున నిచ్ఛ గలదు.
19. విశేష్యంబునకుంబోలె విశేషంబునకు లింగవిభక్తి వచనంబు లగు.
నందతనయుండు కృష్ణుండు నాకు దిక్కు - దేవకీపుత్రు హరిని నుతింతు నెపుడు - శుభవిధాయుల రామకృష్ణుల భజింతు - భువనవంద్యను రుక్మిణిఁ బ్రస్తుతింతు.
20. స్త్రీసమంబులగు విశేషణంబులయు మువర్ణకాంత విశేషణంబులయు బహువచనంబున కేకవచనంబు బహుళంబుగానగు.
మాటలు పెక్కేల - మాటలు పెక్కు నేల. కులిశధార ల్కుంఠింతం బయ్యె - కులిశధారల్కుఠితంబు లయ్యె. ఇష్టమగు పదార్థములు - ఇష్టములగు పదార్థములు.
21. ఒకానొకచో నొక విభక్తికి మఱియొక విభక్తియు నగు.
మైత్రుండు గృహమున వెడలెను - గృహమునుండి యని యర్థము. వాఁడు వాహనమును దిగెను - వాహనమునుండి యని యర్థము. వారు సుఖమున్నారు - సుఖముతో నని యర్థము. ఇత్యాదులెఱుంగునది.
22. జడంబు తృతీయా సప్తములకు ద్వితీయ బహుళంబుగా నగు.
రాముఁడు వాలినొక్క కోలంగూలనేసె - కోలతో నని యర్థము. లంకం గలకలంబు పుట్టె - లంకయందని యర్థము. బాహుళకంబుచే నిక్కార్యం బుదంతంబునకు బహుత్వమందెయగు. అర్జునుండు శత్రుసేనలను బాణంబులను రూపుమాపె - బాణములచే నని యర్థము. మీనంబు జలంబులనుండు - జలంబులందని యర్థము. 23. ఉదంత జడంబు తృతీయకు నవర్ణకం బగు.
రాముఁ డొక్క బాణంబున వాలింగూలనేసె - బాణముచే నని యర్థము.
24. జడంబు ద్వితీయకుం బ్రథమ బహుళంబుగా నగు.
వాఁడు పూవులు దెచ్చె - వాఁడు పూవులను దెచ్చె. ఆకె సొమ్ములు దాల్చె - ఆకె సొమ్ములను దాల్చె. వాఁడిల్లు వెడలె - వాడింటిని వెడలె. బహుళకముచేఁ దృతీయా సప్తములకు విధించిన ద్వితీయకుం బ్రథమ రాదు.
25. కాలాధ్వములకుం బ్రాయికంబుగాఁ బ్రథమ యగు.
వాఁడు నిన్నవచ్చె - వీఁడు నేఁడు వోయె - మాపు నిలువుము - ఱేపు పొమ్ము - వారు క్రోశము నడచిరి - వీ రామడవోయిరి.
26. సర్వనామ సంఖ్యాభిధాన తద్విశేష్యంబుల యందెయ్యది ముందు ప్రయోగింపబడు, దాని ద్వితీయాదులకుం బ్రథమ బహుళంబుగా నగు.
అన్ని గుఱ్ఱములకు - అన్నింటికి గుఱ్ఱములకు - గుఱ్ఱము లన్నింటికి - గుఱ్ఱముల కన్నింటికి సాహిణులు మువ్వురు. రెండు గుఱ్ఱములకు - రెంటికి గుఱ్ఱములకు - గుఱ్ఱములు రెండింటికి - గుఱ్ఱములకు రెండింటికి సాహిణులు నలుగురు. లక్ష గుఱ్ఱములకు - లక్షకు గుఱ్ఱములకు - గుఱ్ఱములు లక్షకు - గుఱ్ఱములకు లక్షకు - గుఱ్ఱములకు లక్షకు రవుతులు లక్ష - ఇత్యాదు లెఱుంగునది. 27. ఒకానొకచో విశేషణంబుల షష్ఠికిం బ్రథమ విభాష నగు.
సుగుణాభిరాముఁడు రామునకు జోహారు వొనర్చెద - సుగుణాభిరామునకు రామునకు జోహారు వొనర్చెద.
28. భవత్యర్థ వ్యవహితంబులగు విశేషణంబులకుం బ్రథమ యగు.
అగు మొదలగునవి భవత్యర్థములు. విద్యాశాలియగు పురుషుని సకల జనులు సన్మానింతురు. భూతదయాళురగు మహాత్ములకు శ్రేయంబు గలుగును. అతిమానుష మత్యద్భుత మతిదుష్కర మయిన కేశవార్జున కృతి.
29. భవత్యర్థకంబు సన్నిహిత విశేషణంబునకును, దాని ముందు విశేషణంబుల కయి పదంబును బహుళంబుగా ననుప్రయుక్తం బగు.
అతులుఁడయి యప్రమేయుఁడౌ హరిని గొలుతు.
30. అయి పదానుప్రయోగంబు లేనిచోఁ దుదివిశేషణంబున కేని, విశేషణంబు లన్నింటికేని మీఁద సముచ్చయార్థంబు విభాషం బ్రయోగింపఁబడు.
ఆద్యుఁ డప్రమేయుఁడు నగు హరిని గొలుతు. ఆద్యుఁడు నమేయ గుణుఁడు నౌ హరిని గొలుతు. ఆద్యుఁ డప్రమేయుండగు హరిని గొలుతు. 31. ధాతుజ విశేషణ వ్యవధానంబున విశేషణంబు లన్నింటి కయి పదంబనుప్రయుక్తం బగు.
ఆద్యుఁడయి యప్రమేయుఁడై యఖిల సేవ్యుఁడై యెసంగెడు దేవుని నభినుతింతు. ఇచట మఱియుం ప్రయోగ వైచిత్ర్యంబు గలదది ప్రయోగంబుల నెఱుంగునది.
32. భావార్థకాది యోగంబునం గర్తకుం బ్రథమ యగు.
రాముఁడు వచ్చుట - రాముఁడు రాఁగా లక్ష్మణుఁడు గాంచె - రాముఁడు విల్లందినం ద్రిలోకంబు లాకులంబులగు - రాముఁడు పట్టిన ప్రతిన వారింపం దరంబుగాదు.
33. ప్రథమాంతంబు లగు యుష్మ దస్మ ద్విశేషణంబుల కేకత్వంబున
వు ను లు ను బహుత్వంబున రు ము లు నంతాగమంబులు ప్రాయికంబుగ నగు.
34. ఈ యాగమంబులు పరంబులగునపు డుత్వంబున కత్వం బగు.
నీవు ధన్యుఁడవు - నేను ధన్యుఁడను - మీరు ధన్యులరు - మేము ధన్యులము. ఇకారంబు మీఁది కు-ను-వు క్రియా విభక్తుల యుత్వంబున కిత్వంబగు నను సూత్రముచేత వు ను ల కిత్వంబగు. నీవు సుకృతివి - నేను సుకృతిని - ఆర్తి హరుఁడ వౌ నినుఁ గొల్తు నంబుజాక్ష గర్వ గర్విష్ఠుండను నన్ను - మీరలు పెద్దలు - ఇత్యాదులు ప్రాయిక గ్రహణముచే రక్షితంబులయ్యె.
35. అది శబ్దంబునకు వు ను లు పరంబు లగునపుడును సంబోధనంబు నందును దాన యను నాదేశం బగు.
నీవు చిన్నదానవు - నేను జిన్నదాన - ఓ చిన్నదాన.
36. అన్య యుష్మ దస్మ త్కార్యంబులం దుత్తరోత్తరంబు బలీయంబు.
వారును మీరును ధన్యులరు - మీరును మేమును ధన్యులము.
37. ఏక వాక్యంబునం దొకానొక్కండు తక్క సర్వపదంబులు క్రమ నిరపేక్షంబుగం బ్రయోగింపం జను.
పూర్వమిది పరమిది యను నియమ మపేక్షింపక వాక్యమందెల్ల పదంబులు వలచినట్లు ప్రయోగింపదగును. ఏని ప్రభృతి శబ్దములు కొన్ని నియమ సాపేక్షంబు లయియుండు. గాలి చల్లగా వీచెను - వీచెను జల్లగా గాలి - చల్లగా గాలి వీచెను - వీచెను గాలి చల్లగా - గాలి వీచెను చల్లగా - చల్లగా వీచెను గాలి.
ఇది కారక పరిచ్ఛేదము.