బసవరాజు అప్పారావు గీతములు/వటపత్రశాయి
స్వరూపం
వటపత్రశాయి
ఒంటిగా నుయ్యాల లూగితివా
నా ముద్దుకృష్ణా
జంటగా నను బిల్వదగదోయీ?
కంటికంతా జలమయంబై
మింటివరకును నేకరాశై
జంటదొరుకని మహాప్రళయపు
టింటిలో వటపత్రడోలిక
నొంటిగా నుయ్యాల లూగితివా
నా ముద్దుకృష్ణా
జంటగా నను బిల్వదగదోయీ?
జగము లన్నియు కాలయోనిని
మొగము లెఱుగక నిద్రబోవగ
నగుమొగము గల ముద్దుబాలుడ
వగుచు జోలల బాడుకొంచూ
నొంటిగా నుయ్యాల లూగితివా
నా ముద్దుకృష్ణా
జంటగా నను బిల్వదగదోయీ?