Jump to content

బసవరాజు అప్పారావు గీతములు/దొంగకృష్ణుడు

వికీసోర్స్ నుండి

రాధ రాణిగ నేలునే
         చెలియరో!
     రాధపున్నెము పండునే!

దొంగకృష్ణుడు

(రాధికాగీతము)

ల్లవాడే
    గొల్ల
పిల్లవాడే
    చెలియ
కల్లగాదే వాని
వల్లో జిక్కితినే! నల్ల ||

వచ్చినాడే
    తోట
జొచ్చినాడే
    సకియ
చొచ్చి నాదౌ మనసు
ముచ్చిలించాడే! నల్ల ||

ఆగినాడే
    పొదల
దాగినాడే
    మనసు
రాగబంధమువేసి
లాగుకొన్నాడే నల్ల ||

చూచినాడే
    మోము
దాచినాడే
    నాదు
దాచుకొన్నా వలపు
దోచుకున్నాడే నల్ల ||

చేరినాడే
    చెంత
చీరినాడే
    చేర
కోరి చేరా బోవ
పారిపోయాడే నల్ల ||

పాడినాడే
    చనుచు

ఆడినాడే
    మదిని
చేడె! అతనిపాట
వీడకున్నాడే! నల్ల ||

ఊదినాడే
    మురళి
చేదినాడే
    వలపు
నాదుమది తనరూపు
పాదుకొలిపాడే నల్ల ||

చూడలేనే
    మమత
వీడలేనే
    వాని
జోడుకూడని ఉసురు
వీడిపోనీవే నల్ల ||