బసవరాజు అప్పారావు గీతములు/భూదేవి
స్వరూపం
భూదేవి
అమ్మా వో భూ దేవీ!
నమ్మితిమమ్మా నిన్నే! అమ్మా వో భూదేవీ!
నీరుపేరు చెపితె గుండె
నీరయిపోయే నమ్మా,
నిప్పుపేరు చెపితె ప్రాణి
గుప్పు నెగిరి పోనమ్మా! ||అమ్మా||
గాలిపేరు చెపితె మాకు
కాలుసేతు లాడవమ్మ,
ఆకాశమ్మంటే మా
కసలే భయ మౌనమ్మా! ||అమ్మా||
కొండకోనలయినగాని
ఘోరారణ్యాలుగాని
మేడలైనగాని చెట్ల
నీడలే నెడారిగాని, ||అమ్మా||
తల్లిపక్కలోన చిన్ని
పిల్లలు బజ్జున్నలాగు
నిన్ను నమ్మి నిబ్బరముగ
నిద్దరబోయేమమ్మా!
అమ్మావో భూదేవీ!
నమ్మితిమమ్మా నిన్నే!