బసవరాజు అప్పారావు గీతములు/ప్రేమప్రయాణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రేమప్రయాణము

     దీపముచుట్టును మిడుతవోలె నే
     తిరుగుచుంటి నోదేవా.

     ఏ పగిదిని నా పాపము బాపెదొ
          నీయదె భారము దేవా!

     త్రాచుబాముతో సయ్యాటల నే
          సల్పుచుంటి నోదేవా!

     కాచుటకును నీవుదక్క నెవ్వరు
          కల రిక దిక్కో దేవా!

     నీటిబుగ్గపై మహాసముద్రము
          నీదుచుంటి నోదేవా

     నీట ముంచినను తేలవేసినను
          నీదే భారము దేవా!

     చెలియతోడ నిశి ప్రేమప్రయాణము
          జేయనుంటి నోదేవా

     వలపుదీపికలతో మా బాటల
          వెలుగజేయు మోదేవా!