బసవరాజు అప్పారావు గీతములు/వరుస వావి (కల)
కడకు కంటి నా తపఃఫలమ్ముగ
కరుణాహాసోదంచితమూర్తిని
కడచి బడసి చింతనామృతమ్మును
కన్నీళ్ళ తీపి నాత్మను దనిపితి
నెన్ని సంద్రముల నెన్ని నదంబుల
నీ జీవనావ గడపితి నౌరా!
కన్నులకు నెత్తు రెగదట్టెడు నది
జ్ఞాపకమ్మునకు వచ్చెడి నేనిన్!
వరుస వావి (కల)
సకియ నేను గూడి సరస
సల్లాపము లాడుకొంచు
వాకిట నిలుచునియుండగ
వచ్చె నొక్క బేరగాడు.
సంతసరుకు లమ్మువాని
చెంతజేరి సంతసమున
వింతలెల్ల గాంచుచుండు
నంతలోన నప్పుడటకు ||సకియ||
చిన్ననాటి చెలిమితోడి
చెలులు వచ్చి మమ్ముగాంచి
వింతసంతసమ్ము జెలగ
"నింతి, యెవ్వ రీత?" డనిరి.
ముద్దుమోము నెల్లడ ముసి
ముసి నగవులు మొలకలెత్త
"నరరూపము దాల్చి దిగిన
నారాయణమూర్తి" యనియె ||సకియ||
"నరరూపము దాల్చి దిగిన
నారాయణమూర్తెగాని
అక్కరొ, మీ యిద్దరికిని
యెక్కడిదే చుట్టరికము?"
వదనము వికసించి వెలుగ
బదులుమాట జెప్పకుండ
హృదయమునకు గట్టిగ న
న్నదుముకొనుచు నవ్వె చెలియ ||సకియ||