బసవరాజు అప్పారావు గీతములు/ప్రణయగీతము

వికీసోర్స్ నుండి

ప్రణయగీతము


జల జల మని పాఱు సెలయేటిచెంత
నిభృత నికుంజంపు నిశ్శబ్దమందు
పాలఱా పానుపుపై బవ్వళించి
పూవులదావికి పొంగుచు మదిని
పిట్టల పాటల వీనులవించు
పండువెన్నెల మేను పరవశమొంది
పతి కౌగిలింపగ భయపడి తగ్గి
సొక్కి సోలెడు నిండుచూలాలివోలె
చక్కని చందురు సరసకు బోక
నొంటరిగా బోవు నొక మొగిలుకన్నె
మో మద్దమందు నాముద్దుల చెలియ
వన్నెల చిన్నెల వదనమ్ము గాంచి
వలపు ముచ్చట లేవొ తలపున రాగ
హృదయమ్మునందెల్ల వింతరాగమ్ము
పరమాత్మశక్తి నా ప్రబలి లోగొనగ
చెంత నిలచుచు మిన్ను జీల్చుకుపోవు
నడవి మల్లియచెట్టుకడ కేగి, మేలి

పూ వొండు గొని దాని బూరగా జేసి,
ప్రణయవాయువులతో బాగ పూరించి
రాగబలమున వ్రేళ్ళు వేగ నాడంగ
నా ప్రాణసఖి నెమ్మనమ్మున నిల్పి
వలపుసంపదలె శాశ్వతమని నమ్మి
వాయించినా నొక్క ప్రణయగీతమ్ము
విరహిణీజన మర్మ మెరిగిన మలయ
పవనుండు నే బాడు ప్రణయగీతంబు
నుద్యానవనసీమ నొంటరిగాను
చల్లని వెన్నెల యెల్లెడగాయ
నెత్తమ్మిపూవుల మెత్తనిపాన్పు
పయి మేను జేరిచి, పరవశమొంది
కలలోన కాంతుని కౌగిలి జొక్కి
కరగు నా ముద్దులకన్నె వీనులను
చల్లని నా పాట మెల్లగా నూదు
ప్రణయకవయిత్రి నా బాలయే యెఱుగు
నా భావగీతికి నన్వయం బెల్ల
ప్రేమకోకిల నాదు లేమయే మెచ్చు
నవ్యమాధుర్యమౌ నా గానరసము.