బసవరాజు అప్పారావు గీతములు/ప్రోషిత

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రోషిత

ఎవరు సంతోషింప నీ యలంకారంబు?
ఎవరు గని మెచ్చుకొన నీ సొమ్ములెల్ల?
ప్రవిమలాత్మక! దేవ! ప్రాణేశ! నీవుగా ||కెవరు||

నిదుర బట్టక రేల నీ మనోహరరూప
మెద నిల్పి నా జీవితేశ్వరుడ వీవె యని
పదిలముగ నిన్ను నే బట్టుకొని కౌగిలిడి
మదిపొంగి కనువిప్ప మాయమైపోతి విం ||కెవరు||

బాల సూర్యుని కాంతి గేలి సేయగజాలు
ఫాలమున తేజస్సు ప్రభవిల్లుచుండగా
లీల లొప్పెడుమూర్తి దాల్చి నాదగు మనో
లోలత్వమున్‌ బాప జాలిగొని రావైతి

వెవరు సంతోషింప నీ యలంకారంబు?
ఎవరు గని మెచ్చుకొన నీ సొమ్ములెల్ల?
ప్రవిమలాత్మక! దేవ! ప్రాణేశ! నీవుగా
కెవరు సంతోషింప నీ యలంకారంబు?