బసవరాజు అప్పారావు గీతములు/పితృస్మృతి
ఆ తీగె యీ తీగె
అడివి పొదరింటిలో
అల్లుకున్నట్లు మన
మైక్య మౌదామె?
ఆ వాగు యీ వాగు
అడ్డాలకోనలో
యేకమైనట్లు మన
మైక్య మౌదామె?
ఆ మాట యీ మాట
అర్థాంతరములోన
వాక్యమైనట్లు మన
మైక్య మౌదామె?
- _________________
పితృస్మృతి
<>తల్లియును దండ్రియును గూడ తానె యౌచు
ప్రాణములకన్న నెక్కుడు ప్రాణముగను
నన్ను గాచి పెంచిన నాదు కన్న తండ్రి
యాత్మకు నొసంగు శాంతి నాత్మైకనాథ!
స్వాగతము
(మా మంగళప్రద జన్మకథ)
అమ్మా! ఓ లోకమాత
కొమ్మా నా స్వాగతమ్ము|| అమ్మా||
ఎల్ల జగమ్ముల నేలెడు
తల్లి మా యింట చిట్టి
పిల్లవుగా జన్మింపగ
నుల్లమునన్ గోరి వచ్చి
తమ్మా ఓ లోకమాత!
కొమ్మా నా స్వాగతమ్ము.
సకల చరాచర ప్రపం
చము లెల్ల జరించి వచ్చి
తల్లి! దయను నేటికి నా
యిల్లి పావనమ్ము జేసి
తమ్మా! ఓ లోకమాత!
కొమ్మా నా స్వాగతమ్ము.
నా తపమ్ము ఫలియించెను
నా జన్మము ధన్య మయ్యె