బసవరాజు అప్పారావు గీతములు/ఐక్య మౌదామె?
మురవగా బోకు కిందుమీ దెరగకుండ
నత్తగుల్లలొ? మంచి రత్నాలొ యేమొ?
ఈకికారణ్యమధ్యాన నిచట నచట
దిరిగి యేవేవొ వేళ్లేవొ తీగ లిన్ని
మోపులకు దెచ్చినా నని మోజుపడకు
చచ్చుతీగెలొ? జీవనౌషధులొ యేమొ?
ఈ మహాతిరణాలలో నీడనాడ
నెఱుక లేని మనుష్యులపరిచయమ్ము
లబ్బెగా యంచు నుబ్బి తబ్బిబ్బు లవకు
శత్రులో? ప్రాణ మిచ్చేటి మిత్రు లేమొ?
- _________________
ఐక్య మౌదామె?
ఆమబ్బు యీ మబ్బు
ఆకాశ మధ్యాన
అద్దుకున్నట్లు మన
మైక్య మౌదామె?
ఆ తీగె యీ తీగె
అడివి పొదరింటిలో
అల్లుకున్నట్లు మన
మైక్య మౌదామె?
ఆ వాగు యీ వాగు
అడ్డాలకోనలో
యేకమైనట్లు మన
మైక్య మౌదామె?
ఆ మాట యీ మాట
అర్థాంతరములోన
వాక్యమైనట్లు మన
మైక్య మౌదామె?
- _________________
పితృస్మృతి
<>తల్లియును దండ్రియును గూడ తానె యౌచు
ప్రాణములకన్న నెక్కుడు ప్రాణముగను
నన్ను గాచి పెంచిన నాదు కన్న తండ్రి
యాత్మకు నొసంగు శాంతి నాత్మైకనాథ!