బసవరాజు అప్పారావు గీతములు/ఏమొ
దివ్యసుందరనాగ ! దేహి యన్నాము
కనిపెట్టి మ మ్మెపుడు కాపాడవోయి !
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
పగ లనక రే యనక పనిపాటలందు
మునిగితేలేటి నా మోహాలబరిణె
కంచెలు కంపలూ గడచేటివేళ
కంపచాటున వుండి కొంప దీకోయి!
నాగులచవితికీ నాగేంద్ర! నీకు
పొట్టనిండా పాలు పోసేము తండ్రి!
- _________________
ఏమొ
ఈ యగాధ నిశీధాన నెట్టయెదట
వెలుగు కన్పించెనని అదే కులకబోకు
కొఱివిదయ్యాలొ? యెవరైన నరులయొక్క
కరములం దుండు దీపాలకాంతు లేమొ?
ఈ యఖండసముద్రాన నేరి కోరి
సంచులకు నిండ దెస్తిని సంప దంచు
మురవగా బోకు కిందుమీ దెరగకుండ
నత్తగుల్లలొ? మంచి రత్నాలొ యేమొ?
ఈకికారణ్యమధ్యాన నిచట నచట
దిరిగి యేవేవొ వేళ్లేవొ తీగ లిన్ని
మోపులకు దెచ్చినా నని మోజుపడకు
చచ్చుతీగెలొ? జీవనౌషధులొ యేమొ?
ఈ మహాతిరణాలలో నీడనాడ
నెఱుక లేని మనుష్యులపరిచయమ్ము
లబ్బెగా యంచు నుబ్బి తబ్బిబ్బు లవకు
శత్రులో? ప్రాణ మిచ్చేటి మిత్రు లేమొ?
- _________________
ఐక్య మౌదామె?
ఆమబ్బు యీ మబ్బు
ఆకాశ మధ్యాన
అద్దుకున్నట్లు మన
మైక్య మౌదామె?