బసవరాజు అప్పారావు గీతములు/పాడుసిగ్గు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సుందరాంగు లెంద రున్న
    చూడ డించుకేని వారి
        నతడే నీ నాథు డంచు
        నతివ నే నెఱింగితినే!"

"అంతమాత్ర నెట్టులందు
వతడే నా నాథుడంచు?"

    "చెలియ! నిన్న నీవు ముద్దు
    చేతులతో గూర్చినట్టి
    కలువపూలదండ యతని
    కంఠసీమ నలర గంటి

        నతడే నీ నాథు డంచు
        నతివ! తెలియ జాలనటే?"

పాడుసిగ్గు

దేవ! నా కనులముందు
తేజరిల్లు మెప్పటట్లు దేవ! నా ||
ప్రణయపూర్ణ హృదయుడవై
భాసమాన దేహుడవై

భావవీధి నన్ను గోరి
వచ్చిన నిను గాంచనైతి దేవ! నా ||

వెల్లివిరియు తేజముతో
వెల్లమబ్బు నంచు వీడి
మెల్లన దిగివచ్చు నిన్ను
మేల్కొనియుం జూడనైతి దేవ! నా ||

వలపున నాయిల్లు జేరి
తలుపు మెల్ల తట్టు నీదు
పిలుపు వినియు, ని న్నెఱిగియు
వలపు నిలుప జాలనైతి దేవ! నా ||

పాడుసిగ్గు వీడదాయె
ప్రాణేశా! దేవా! నీ
చూడచక్కనైన మోము
చూడలేక వెఱగుపడితి దేవ! నా ||

జీవితంపుమేలి ఫలము
చేత జిక్కి జారిపోయె
మండిపో వెడారిలోన
నెండమావి యట్లదోచె దేవ! నా ||

అస్తమిత దినేశంబై
అంధకార బంధురమౌ

మిన్నుపై హఠాత్తుగాను
మెఱపు మెఱసినట్టులయ్యె దేవ! నా ||

వలపునిండి వచ్చిన నీ
వాంఛ దీర్పనైతి నంచు
మెలవేసుకపోవు హృదయ
మెట్లు బ్రతుకుదాన నింక

ప్రణయపూర్ణ హృదయుడవై
భాసమాన దేహుడవై
దేవ! నా కనుల యెదుట
తేజరిల్లు మెప్పటట్లు.

రాగిణి

చూడ జూడ నీ రూపము
సుందరమై యొప్పు దేవ!

సొక్కి సొక్కి నీ వలపున
సోలి పరవశత గందును!

    వినగ వినగ నీ నామము
    వీనుల విందౌను నాథ!