బసవరాజు అప్పారావు గీతములు/పలవరింతలు
Appearance
- [1]
దాంపత్యము
పరుషము నాథా యన, నా
దరము ప్రియా యనగ, నింక దాసా యనగా
వరము కాదేని పశువా
పురుషుండానాతి పలుపు (రజ్జు) బోల్పంగదగున్.
పండితులు మెచ్చి ముదమందు పరమ నాప్ర
యోగవిజ్ఞాన మెంచను యోగ్య మంచు
బాగుగా శిక్షనొందినవారికేని
ఆత్మవిషయాల నప్రత్యయమ్మె కాదె.
పలవరింతలు
చల్లన్ని చిట్టియొడిలోన తల వుంచీ
ఆకసమ్మున బాఱుమబ్బులను గాంచీ
గలగలని కదలేటి ఆకులను జూచీ
అన్నమూ నీళ్ళెందు కనుచు అడిగేను!
చిట్టి నాచెక్కిళ్ళు చేతితో నిమిరీ
తియ్యగా ప్రేమమ్ము దెల్పేటివేళా
చిరునవ్వు నవ్వేటి చంద్రుణ్ణి గాంచీ
స్వర్గ మింకేటికని పలువరించేను!
సముద్రము
ఎంత లోతుంటుందొ
యీ సముద్రము చిట్టి!
అంతులేనేలేద
నంటారు కాదా!
ఈ సముద్రము దరిని
నీ అగాధపు హృదయ
మది యేమొ, చిట్టి, నా
కట్టె తలపొచ్చింది
బ్రహ్మాండమైన నీ
ప్రణయాబ్ధిలో బడే
పిల్లకాలవను నా
ప్రేమ లెఖ్ఖా జమా! ఎంత ||
- ↑ * కాళిదాసు నుండి