బసవరాజు అప్పారావు గీతములు/నవజీవనము
స్వరూపం
నవజీవనము
వాడిన పూవున కేటికి మరలను
పరిమళ మొసగెదు దేవా?
ఎండిపోయినట్టి బావి నూటల
నేటికి నూరించెదు దేవా?
బ్రద్దలైన సంద్రపుటల నేటికి
పైకి తిరిగి పంపెదు దేవా?
నేలను పడుచున్న గాలిపడగను
నేటి కెగురగొట్టెదు దేవా?
పారబోసుకొన్న ప్రణయ పాత్రము
పానీయముతో నింపెదు దేవా?
ఆశలు వీడిన వానికి మరలను
ఆశలేల గూర్చెదు దేవా?
ప్రాణమ్ములు చేదైన వానికిని
ప్రాణము తీయగ జేసెదు దేవా?
అంధకార గర్భ నరక వాసికి
నానంద తేజ మేటికి దేవా?
వాడిన పూవున కేటికి మరలను
పరిమళ మొసగెదు దేవా?