బసవరాజు అప్పారావు గీతములు/కాంచితి! కాంచితి!
స్వరూపం
కాంచితి! కాంచితి!
కాంచితి కాంచితి భగవంతుని నా
కన్నులార నేడు
కళ్యాణభాగ్య భాసమానయౌ
కాంతరూపమున కన్నుల బడియెన్
పడతీ! పిల్లలు కలరా నీకని
అడిగితి నేదయతోన్,
పాపులయ్యు పశ్చాత్తాపము బడు
ప్రణయినీజనులె నాబిడ్డ లనెన్ !
మెలతా ! జగతిని నీకెవ్వరైన
మిత్రులు గలరా యంటిన్,
మిత్రు లౌదు రనె ప్రపంచమందు ప
విత్రవర్తనము గలవా రెల్లన్
అతివా ! నీ ప్రాణనాథు డెవ డని
యంటి నిలువలేక,
ఆడుదానివలె హృదయము కానుక
యర్పించినతడె నా నాథు డనెన్
కాంచితి కాంచితి భగవంతుని నా
కన్నులార నేడు.