బసవరాజు అప్పారావు గీతములు/వీరుడు

వికీసోర్స్ నుండి

వీరుడు

    వీరు డెవడురా
    శూరు డెవడురా!

ఘోరమైన యుద్ధభూమి
మాఱుమ్రోగు ఫిరంగీల
బారులకును వెఱవకుండ
    బోరు సైనికుండేనా?

ఉసురుల విసికించి జగతి
మసలకుండజేయు క్రూర
వ్యసనమ్ములతోడ బోరి
    వశము గొనినవాడు కాడొ? వీరు...

    శక్తియెద్దిరా?
    వ్యక్తి యెద్దిరా?

కొండలన్ని పిండికొట్టి
మండు మహాగ్నుల జొరబడి
దండిశక్తి జూపి వెలుగు
    గండరగం డగుటేనా?

అన్నమాట నెర్గింపగ
నెన్ని కట్టడిడుమలైన
వెన్ను జూపకుండ కోరి
    కొన్న ధీరు డగుట కాదొ? శక్తి...
    రక్తి యెద్దిరా?
    ముక్తి యెద్దిరా?
పాడుమబ్బు సంచులతో
కూడబెట్టి యనుభవింప
జూడలేక ప్రాణమైన
    వీడెడు దురవస్థ యేన?
మనసు గొన్నకన్నియకై
ధనము ప్రాణ మైన నిచ్చి
ప్రణవపు నిర్వాణమ్మున
    తనివి గొనుట గాకనెద్ది? రక్తి...
    వీరు డెవడురా!
    శూరుడెవడురా!