బసవరాజు అప్పారావు గీతములు/తగనా?

వికీసోర్స్ నుండి

ఒక్కపరి కోకిలమ్మటు లొక్కసారి
    గరుడ గంధర్వ కిన్నరీ గానఫణితి
    బాలపవనుడు పూల నుయ్యాల లూపు
    నట్ల నీపాట మమునూపె, నౌర, కృష్ణ!

పవను కౌగిలి జొచ్చిన పల్లవమ్ము
లట్టులను నాలిచింతల నన్ని మరచి
భవ దమృత వేణుగానాతి పారవశ్య
మున నచేతను లటులైతిమోయి కృష్ణ!

తగనా?

దాసిగా నుంటకైన
తగనా ప్రాణేశ, దేవ? దాసిగా ||

పాదమ్ములు నొచ్చినంత
పట్టుటకైనను దగనా? దాసిగా ||

తలపై నీ పాదధూళి
దాల్చుటకైనను దగనా? దాసిగా ||

వదనమ్మును గాంచి భక్తి
ప్రణమిల్లుటకుం దగనా? దాసిగా ||

నిన్ను జూచి మదిని ప్రేమ
నిలుపుటకైనను దగనా? దాసిగా ||

నా నాథుడ వీవె యనుచు
నమ్ముటకైనను దగనా? దాసిగా ||

ఒరు లెవ్వరు జూడకుండ
నొక్క ముద్దుగొన దగనా? దాసిగా ||

పరవశమున నీ ప్రేమము
పాడుటకైనను దగనా?
     దాసిగా నుంటకైన
     తగనా ప్రాణేశ, దేవ? దాసిగా ||

గుర్తులు

"అతడే నా నాథు డంచు
అతివ! యె ట్లెఱింగితివే?"

    "ఎందరిలో నున్నను తా
    నీ మోమే గాంచుచుండు