బసవరాజు అప్పారావు గీతములు/మురళీకృష్ణుడు
క్రొత్తవింతలు
"ఈ తమ్మలపు ముద్రలేడవే చెలియ?"
నిద్రలో ప్రియుడు నన్ ముద్దాడెనేమొ.
"ఈ మేని గందంబు యేడదే చెలియ?"
భువన మోహనమూర్తి పూసినాడేమొ.
"మగువ! నేడీ కంఠమాధుర్య మేమె?"
నా మోహనుడు నింపెనేమొ ప్రేమముతో.
"కాంత నీ కీ దివ్యకాంతి యెక్కడిదే?"
నా దేవదేవుండు నన్ మెచ్చెనేమొ.
మురళీకృష్ణుడు
హృదయములు రెండు ప్రేమచే నేకమైన
లీల శ్రుతిలోన వేణువు లీనమయ్యె
విశ్వమెల్లను నిండిన ప్రేమరాగ
మట్లు నీరాగ మెల్లర నావహించె.
ఒక్కపరి కోకిలమ్మటు లొక్కసారి
గరుడ గంధర్వ కిన్నరీ గానఫణితి
బాలపవనుడు పూల నుయ్యాల లూపు
నట్ల నీపాట మమునూపె, నౌర, కృష్ణ!
పవను కౌగిలి జొచ్చిన పల్లవమ్ము
లట్టులను నాలిచింతల నన్ని మరచి
భవ దమృత వేణుగానాతి పారవశ్య
మున నచేతను లటులైతిమోయి కృష్ణ!
తగనా?
దాసిగా నుంటకైన
తగనా ప్రాణేశ, దేవ? దాసిగా ||
పాదమ్ములు నొచ్చినంత
పట్టుటకైనను దగనా? దాసిగా ||
తలపై నీ పాదధూళి
దాల్చుటకైనను దగనా? దాసిగా ||