బసవరాజు అప్పారావు గీతములు/గగన కుసుమములు

వికీసోర్స్ నుండి

ఆశాకిరణము

శుభ్రజ్యోత్స్నకు వన్నె గూర్చు నీ
సోయగంబు గనువారే లేరే?
విభ్రాంతి గొల్పునీ దివ్యప్రభ
వీక్షించువారు లేరే కాంతా?
రాల్గరిగించెడు నీప్రేమరాగ
మాలించువారె లేరే యింతీ?
కాలము నిరవధి పృథ్వి విపులమౌ
జాలింబడియెద వేలే బేలా?

గగన కుసుమములు

ఆకాశసుమముల నంద మౌనంచు
పొలతి యాశాలతన్‌ బోషింతు వేలె?
శ్రీకృష్ణుపదదివ్యసీమ శోభిల్లు
బూజాసుమంబుల బూయింపరాదె?
    పలురంగులను కన్ను లలరించునంచు
    నాశాదళమ్ముల గోసెదే లింతి?

శీత విఫలవాత శాతాసిహతిని
    పలురంగులాకులు నిలువ వోబేల?
బంగారుచెం డ్లటు రంగారునంచు
కాంక్షాఫలమ్ముల కాసింతె యింతి?
క్రూరమృత్యు విషోరగోగ్రకీలలను
అమృతఫలమును విషమ్మయి పోవునేమొ!

ఆదర్శము

ఆకసమున చిఱుమబ్బుల చాటున
        నడగి దాగుమూత లాడె దేలే?
నీ కళ్యాణాకృతి శోభ తెలియ
        నిలచి తాండవము సేయవె మూర్తీ
చినుకుచినుకులుగ తేనెతుంపురుల
        జిలుకుచు చవు లూరించెద వేలే?
ఘనధారాపాతముగ నమృత మా
        కాశవాహినీ వర్షింపగదే!