బసవరాజు అప్పారావు గీతములు/అకాలకుసుమములు
స్వరూపం
అకాలకుసుమములు
ఇప్పుడే తలజూపెద వేటికి ని
న్నెవరు గాంతురో వెఱ్ఱిచంద్రుడా,
ఎల్లెడ సూర్యుండు వెల్గుచుండ నీ
చల్లదన మ్మేరికి కావలయున్?
కమ్మతావులను నేటికి నెల్లెడ
జిమ్ముచుంటివే సంపగిపూవా,
ఉమ్మరించు నీ వేళ నెవరు నీ
కమ్మతావు లానందించేరే?
కుంకుమ పసువులు మోముపై పూసు
కొందువేల పార్వతివలె సాధ్వీ
సంకరయువతులు నీ దేదీప్యపు
కుంకుమ తేజము మెచ్చెదరే?
కూ కూ యని తేనె లొల్క బాడుచు
గుండెలు కరిగించెదేల పికమా,
కాకు లెల్లెడల కావు కావు మన
నీ కలకంఠము వినబడునే?