బసవరాజు అప్పారావు గీతములు/ఆశాబంధములు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆశాబంధములు

తిరిగితి నెన్నో దేశముల బడి
దొరకునొ చక్కని నెల వంచున్‌

రాగము లెన్నో హాయిగ బాడితి
రక్తి దేన గల్గునొ యంచున్‌

యెక్కితి నెన్నో పర్వతమ్ములన్‌
చుక్కల బట్టుదునొ యంచున్‌

వేవిధమ్ములౌ ప్రేమల సోలితి
ప్రేమగుట్టు గాంతునొ యంచున్‌

ఇచ్చితి నెందరికో హృదయపుధన
మీవిపండు పండునొ యంచున్‌

ఎన్నోపూవుల పూజల సల్పితి
నీశ్వరుకృప గల్గునొ యంచున్‌