Jump to content

బసవపురాణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

బసవపురాణము

పాలుకురికి సోమనాథప్రణీతము

ప్రథమాశ్వాసము

శ్రీ గురుదేవు నంచితగుణోత్తంసు - యోగీంద్రహృదయపయోజాతహంసుఁ
బరమకృపామూర్తి భక్తజనార్తి - హరుఁ ద్రిజగత్స్ఫూర్తి నానందవర్తి
భవరోగవిచ్ఛేది భక్తవినోది - శివతత్త్వసంపాదిఁ జిరతరామోది
నిత్యస్వరూపు నున్మీలత్ప్రతాపుఁ - బ్రత్యయగతపాపు భక్తప్రదీపు
భావనాతీతు సద్భావనోపేతు - సావయవఖ్యాతు నమితు నజాతు
నాద్యంతరహితు వేదాంతార్థసుహితు - విద్యాత్మసహితు సంవిత్సౌఖ్యమహితు
భక్తపరాధీను భక్తనిధాను - భక్తసమాధాను భక్తావధాను
భక్తపరంజ్యోతి భక్తవిభూతి - భక్తదుఃఖారాతి భక్తానుభూతి
భక్త[1]వజ్రత్రాణు భక్తధురీణు - భక్తజనప్రాణుఁ బరమకళ్యాణు
మన్మనోరమ్యు నిర్మలభావగమ్యుఁ - జిన్మయు సౌమ్యు భజించి కీర్తించి;
యుల్లమున మదీయవల్లభుఁ జెన్న - మల్లికార్జు[2]నుఁ దేటతెల్లగా నిలిపి;
సముదితసారూప్యశాశ్వతతనులఁ - బ్రమథులఁ ద్రిభువనప్రమథులఁ దలఁచి
ప్రకటలింగైక్య పురాతనభక్త - నికరంబు శివునంద నిష్ఠించి కాంచి;
వ్యక్తలింగముల సద్భక్తిరసా - షిక్తుల నూతనభక్తులఁ గొలిచి;

[3]బసవచరిత్ర మివ్వసుమతి[4]మీఁదఁ - బసరింతుఁ దత్కథాప్రౌఢి యెట్లనిన:
[5]శ్రీమన్మహాదేవుసింహాసనంబు - హైమవతీశువిహారస్థలంబు
హరునిభక్తులకు నేకాంతవాసంబు - పరమయోగులకు హృత్ప్రమదావహంబు
నరులకుఁగర్మసంహరణైక హేతు - వరయంగ సురలకు [6]నాశ్రయభూమి
సకలతీర్థములకు జనయిత్రి యగుచుఁ - బ్రకటింప నొప్పు శ్రీపర్వతేంద్రంబు;
ఉర్విఁ దత్పర్వతసార్వభౌమునకుఁ - బూర్వవక్త్రాంకవిస్ఫురణ [7]దుల్కాడ
నొలసి కుమారశైలోత్తంసలీలఁ - దిలకించి పెంపారుఁ ద్రిపురాంతకంబు;
తత్రిపురాంతకస్థానవాస్తవ్యుఁ - డై త్రిపురాంతకుం డభినుతిఁ బేర్చు;
నాపురసంహారు నపరావతార - రూపితఖ్యాతినిరూఢిఁ దలిర్చు
నాసదాశివమూర్తి య[8]వికలైశ్వర్య - భాసురచరలింగపటుదీప్తిఁబరగు
నాకాలకంధరు ననవద్యహృద్య - సాకారవిభ్రమవ్యాప్తిఁ బెంపారు
నా దేవువీర వ్రతాచారసార - మేదురస్ఫురణమై మించి వెలుంగు
జంగమరత్నంబు శరణసమ్మతుఁడు - లింగైక్యవర్తి గతాంగవికారి
పండితారాధ్య కృపాసముద్గతుఁడు - మండితసద్భక్తిమార్గప్రచారి
విలసితపరమ సంవిత్సుఖాంభోధి - నలిఁ గరస్థలి సోమనాథయ్యగారు;
బసవని కారుణ్యరససుధావార్ధి - నసదృశలీల నోలాడుచు నిత్య
నియమవ్రతాచారనిరుపమనిష్ఠ - క్రియగొనఁదత్త్వనిర్ణయము సంధిల్ల
నతులగోష్ఠీసుఖస్థితిఁ బేర్చుభక్తి - మతినియమంబుల మల్లినాథుఁడును;

నాదివేదాంతసిద్ధాంతపురాణ - వేదశాస్త్రాగమవిహితమార్గములఁ
దను మనోధన నివేదన సమగ్రత[9]ను - బనుగొని జంగమార్చనలు సేయుచును
[10]శీలంబు దనర సీమాలంఘనవ్ర- తాలంకృతిని బేర్చి యాచారలీల
యసలారఁగాఁ గుమారాద్రికిఁ దూర్పు- దెసను సోపానముల్ దీర్చి పొల్పార
మహితసద్భక్తి సమంచితవృత్తి - మహిఁజను రెంటాల మల్లినాథుఁడును;
నిరతిశయప్రీతి నిత్యంబు నైదు - కరవీరపుష్పముల్ హరునకర్పింప
నొక్కనాఁడొకఁడందుఁదక్కువయైనఁ- గ్రక్కునఁదననేత్రకమలమర్పించి
భవునిచే [11]నసదృశాంబక మప్డ పడసి- ధ్రువకీర్తిఁ బేర్కొన్న దోచమాంబయును;
ధీరుండు మున్నయదేవయోగీశు - కూరిమి శిష్యుఁడు నారయాంకునకుఁ
బుత్త్రుండుఁ బరమపవిత్రుండు విమల - గాత్రాంచితుఁడు నీలకంఠాగ్రజుండు
జగదభినుతుఁడు ప్రసాదావధాని - [12]నిగమార్ధవేత్త [13]గోడగి త్రిపురారి;
లోనుగా సకలభక్తానీక మెలమి- మానితభక్తిసామ్రాజ్యసంపదలు
[14]సిలివిలివోవంగఁ జిరతరమహిమ - నలరారుచుండంగ [15]నందొక్కనాఁడు
మండితాసంఖ్యాతమాహేశ్వరులకు - దండప్రమాణంబు దగనాచరించి
భక్తదయారసపరమామృతాభి - షిక్తుండ నగుచు గోష్ఠీప్రసంగతిని
“నసదృశంబై యొప్పు బసవపురాణ - మెసకంబుతోఁ జెప్ప నిష్టమయ్యె[16]డిని
వరకథాసూత్రంబు [17]వెరవెఱిఁగించి - చరితార్థుఁ జేయరే కరుణతో” ననుచు
సన్నుతి సేయుచు సస్పృహత్వమున- విన్నవించు[18]డు భక్తవితతి హర్షించి
సముదితప్రీతిఁబ్రసాదావలోక - నము నివ్వటిల్లంగ నన్ను వీక్షించి
“బసవపురాణంబుఁ [19]బసరించుశక్తి- నసలార నొసఁగితి మట్లు గావునను
రచియింపు బసవపురాణంబు నీవు - నచలితభక్తహితార్థంబు గాఁగ”
నావుడు భక్తజనావలియాజ్ఞ - వావిరిఁదలమోచి వర్ణింతుఁగవిత.
పాటింపఁదగిన కర్ణాటభూమికిని - గోటీరమై యొప్పుగొబ్బూరనంగ
నా యగ్రహారమహాజనోత్తమ ని- కాయపూజిత పాదకమలద్వయుండు

శాంభవ [20]వేధదీక్షాసద్విశేష - సంభావితాశ్రితజనసముత్కరుఁడు
సురుచిరప్రణవవిస్ఫురితోపదేశ - చరితార్థ నిఖిలశిష్యప్రతానుండు
కింకర నిచయహృత్పంకేరుహాంత - రాంకిత వరసచ్చిదానందమూర్తి
పాత్రుండు భవలతాదాత్రుండు విషయ - జైత్రుండు విమలచరిత్రుండు సకల
భువనపావనమూర్తి బుధచక్రవర్తి - ప్రవిమలకీర్తి సద్భక్తిప్రపూర్తి
యని వినుతింపగ నాశ్చర్యమహిమ - మనుచుండు మండెంగమాదిరాజనఁగ;
నా మాహాత్ముని సముద్యత్కృపాపూరి - తామృతహస్తకృతావతారుండు
నా గురుదేవు పాదాబ్ద సౌరభ్య - భోగలీలా వరపుష్పంధయుండు
నా శివయోగి యుదాత్తమూర్తి ప్ర - కాశితహృత్పద్మకర్ణికాంతరుఁడు
నా దివ్యదేహు దయాకలిత ప్ర - సాదపాదోదకాస్వాదతత్పరుఁడు
గురు పరతంత్రుండు గొబ్బూరి విభుఁడుఁ - బరమ శివాచారపథవర్తనుండు
లింగైక్యనిష్ఠావిలీనమానసుఁడు - సంగనామాత్యుండు జగదుపకారి
యని యిట్లు భక్తసభాభ్యంతరాళ - మున నిన్నుఁజెప్పంగ విని లసత్ప్రీతి
వసరింప జంగమభక్తుండ వనియు - బసవపురాణైకపాత్రుండ వనియు
నచలితప్రీతి మా [21]కనుగులంబనియు - రచియింతు సవపురాణసత్కవిత
యవధానవంతుండవై నెమ్మి వినుము - సవిశేషభక్తిమై సంగనామాత్య!
ధర “నుమా మాతా పితా రుద్ర” [22]యనెడు- వరపురాణోక్త నీశ్వరకులజుండ
శరణ[23]గణాశ్రయ సకలస్వరూప - గురులింగ [24]వరకరోదరజనితుండ
భక్తకారుణ్యాభిషిక్తుండఁ [25]బాశ - ముక్తుండఁగేవల భక్తిగోత్రుండ
భ్రాజిష్ణుఁడగు విష్ణురామిదేవుండుఁ - దేజిష్ణు వగు శ్రియాదేవి యమ్మయును
గారవింపఁగ నొప్పు గాదిలిసుతుఁడ - వీరమాహేశ్వరాచారవ్రతుండ
ఖ్యాత సద్భక్తిమైఁగల కట్టకూరి - పోతి [26]దేవరపదాంబుజషట్పదుండ
సకృపాత్ముఁడగు కర[27]స్థలి విశ్వనాథు - ప్రకటవరప్రసాదకవిత్వయుతుఁడ
[28]వడగాము రామేశువరశిష్యుఁ డనఁగఁ - బడు చెన్నరాముని ప్రాణసఖుండ
సంభావితుఁడ భవిజనసమాదరణ - సంభాషణాది సంసర్గ [29]దూరగుఁడ
నలిఁబాల్కురికి సోమనాథుఁడనంగ - వెలసినవాఁడ నిర్మలచరిత్రుండ

నురుతర గద్యపద్యోక్తులకంటె - సరసమై పరగిన జానుఁదెనుంగు
చర్చింపఁగా సర్వసామాన్య మగుటఁ - గూర్చెద ద్విపదలు గోర్కి దైవాఱఁ
దెలుఁగుమాటల[30]నంగవలదు; వేదముల - కొలఁదియ కాఁజూడుఁ డిలనెట్టు లనినఁ
[31]బాటి తూమున[32]కును బాటి యౌనేనిఁ- బాటింప సోలయుఁ బాటియ కాదె
అల్పాక్షరముల ననల్పార్థరచన - కల్పించుటయ కాదె కవివివేకంబు
అలరుచు బసవనిఁ దలఁచుతలంపు - బలుపునఁగాఁ జేసి భావ[33]మ్ము మెఱసి
యకలంక లింగ రహస్యసిద్ధాంత - సకల వేద పురాణ సమ్మతంబైన
యాతత [34]బసవపురాతనభక్త - గీతార్థసమితియే మాతృక గాఁగఁ
బూరితంబై యొప్పు పూసల[35]లోన - దారంబు క్రియఁబురాతనభక్తవితతి
చరితలలోపల సంధిల్ల బసవ - చరిత మే వర్ణింతు సత్కృతి [36]యనఁగ
నసదశలింగదేహస్థుడైయున్న - బసవని వేఱొక్క భావంబు గాఁగఁ
దగిలి వర్ణించుట [37]దప్పనవలదు - తగు భక్తివర్ధనార్థంబు దానగుట
బసవని శరణన్నఁ బాపక్షయంబు - బసవని శరణన్నఁ బరమపావనము
బసవని శరణన్నఁ బ్రత్యక్షసుఖము - బసవని శరణన్నఁ భవరోగహరము
బసవని శరణన్నఁ భక్తి సేకూరు - బసవని శరణన్నఁబంధముల్వాయు
బసవని శరణన్నఁ [38]భాగ్యముల్వొందు - బసవని శరణన్నఁబర శీలంబు
బసవని శరణన్నఁ బాయు నాపదలు - బసవని శరణన్నఁ బ్రబలు సంపదలు
బసవని శరణన్నఁ [39]నసలారుఁ గీర్తి - బసవని శరణన్నఁ ఫలియించుఁగోర్కి
బసవని శరణన్నఁ నెసఁగు వాక్సిద్ధి - బసవని శరణన్నఁ భ్రాజిల్లుబుద్ధి
[40]వేయేల తగ "బసవా” యనఁబరగు-నీ యక్షరత్రయం [41]బిటులొక్కమాటు
చదువునెవ్వండేని ముదముతోనతని - వదనంబు శివునకుఁగుదురు దా ననఁగఁ
బాయక బసవనిఁ బ్రస్తుతించినను - బాయుట సోద్యమే భవబంధనములు
బసవండు కేవల భక్తుఁడే తలఁప - నసమాక్షుఁడారూపమై నిల్చెఁగాక
బసవఁడు వసుధపైఁ బ్రభవించునంత - బసవని నరుఁడని పలుకంగఁదగునె?
హరుఁడు [42]నిరాకారుఁ డైనచో బసవఁ - డరయంగ సాకా[43]రుఁడై చరియించు
హరుఁడు సాకా[44]రుఁడై యలరుట సూచి - శరణుఁడై బసవండు సందు లేకుండు

శరణుఁడై బసవండు సందు సేకొన్నఁ - బరమభక్తి స్థితి బసవన్న గొలుచు
భక్తుఁడై లింగంబు ప్రకృతి సేకొన్న - వ్యక్తిగా బసవన్న వరవుడు సేయుఁ
బరమాత్మరూప మా బసవఁడే యెఱుఁగుఁ - బరమేశుఁ డెఱుఁగు నా బసవనిరూపు
సాలోక్యసామీప్యసారూప్యపదవు - లోలిని బొంద సాయుజ్యంబుఁజెంద
వచ్చుఁగాకిల బసవస్వామి గాఁగ - వచ్చునే [45]పెఱపెఱవారలకెల్లఁ
బ్రమథాగ్రగణ్యుండు బసవఁడీశునకు - సమశీలభక్తుండు జంగమంబులకు
లింగదేవునకు ననుంగు బసవఁడు - జంగమకోటికి సడిసన్నదాసి;[46]
యెక్కంగ వాహనం బీ[47]శుకు బసవఁ;- డెక్క సింహాసనం బీశుభక్తులకుఁ
గాలకంధరు కరవాలు బసవఁడు; - శీలం[48]బు భక్తుల చేతియద్దంబు;
బసవని నేరి కౌఁబ్రస్తుతి సేయ - [49]వసమె [50]యెవ్వరికైన బసవని నెఱుఁగ
సంపన్నుఁడై లింగజంగమంబందుఁ - బొంపిరిగొని పువ్వుఁగంపునై యుండుఁ
గావున బసవని గణుతింపరామి - దేవాసురులకైనఁ దెల్లమై యుండు;
నెన్నంగ వేడ్కకాఁడెఱుఁగునే దోస- మన్నట్లు గాక యాహవణి గీర్తింప
నిదియుఁ గోటికిఁబడగెత్తినవానిఁ - బదివేల కాఁపవై [51]బ్రదుకు మన్నట్టు
లాపరంజ్యోతిస్స్వరూపంబునకును - దీపకంభంబు లెత్తించినయట్లు
భవనిర్మితములైన పత్రపుష్పములు - భవునకుఁ దగ సమర్పణ సేయునట్లు
గాక కీర్తిం[52]పఁగా నాకుఁ దరంబె - ప్రాకటంబుగ భక్తబండారి[53] చరిత?
మైనను [54]లోకహితార్ధంబు గాఁగ - నా నేర్చుకొలఁది వర్ణన సేయువాఁడ
నవరసరసికత [55]భువినిఁ బేరుగొన్న - శివకవిప్రవరులచిత్తంబు లలర
నిప్పాట నితరులఁ జెప్పెడి దేమి - తప్పనఁదారులు దడఁబడఁబలికి
వెలసినచదువులు [56]వీటిఁబోరిత్త - పొలిసిపోయిరి తమపురులు [57]దూలఁగను
మృడుమహత్త్వముఁగానమిని బొంకులనఁగఁ - బడుఁ “గవయఃకింనపశ్యంతి” యనుట
యనుచుఁ గుకవుల గీటునఁ బుచ్చి పేర్చి - వినుతింతుఁ [58]దత్కథావిధ మెట్టులనిన:

ప్రథమాశ్వాసము

కథారంభము

[59]శ్రీకీర్తిసంచితాంచితవరభక్తి - సాకార! వినమితామాత్య సంగాఖ్య!
శ్రీరజితాచలశృంగంబునందు - మారారి యుమయును [60]మానిత క్రీడఁ
దగిలినసుఖ[61]సత్కథావినోదమున - సొగయుచు నున్నెడ శుద్ధశివైక
మానసు [62]లగు నుపమన్యుఁడు భృంగి - యానందికేశ్వరుఁ డాదిగాఁ గల్గు
ప్రమథులు గొలువంగఁ బరిమితంబైన - సమయోచిత మెఱింగి చనుదెంచి ప్రీతి

నారదుఁడు కైలాసమున కేఁగుట


నారదుండను మునినాయకోత్తముఁడు- భూరిసర్వాంగముల్ భువిఁబొందమ్రొక్కి
ముకుళితహస్తుఁడై మ్రొక్కుచు మఱియు- సకలలోకాలోకచరితంబు లెల్ల
విన్నవింపఁగ నున్న [63]కన్నెర్గి శివుఁడు- వెన్నెలగలకంట [64]వీక్షింపుచున్న
యవసరోచితమున నంబికాదేవి - శివుననుమతమునఁజేసన్నఁబిలిచి
“పోయివచ్చినకార్యములు విన్నపంబు- సేయు [65]మీ వున్నట్లు శివునకు” ననిన
నమ్మునీశ్వరుఁడు మహాలింగదేవు- సమ్ముఖుఁడై కరాబ్జమ్ములు [66]మొగిచి

నారదుఁడు శివునకు భూలోకవృత్తాంత మెఱిఁగించుట


“సకలలోకాలోకచరితంబు లెల్లఁ - బ్రకటితభక్తి నెప్పటియట్ల పరగు
నరలోకమున నుమానాథ! మీ భక్తి - చరితమేమియును విస్పష్టంబు గాదు.
తవిలి శివాచార[67]తత్పరులగుట - భవులతోఁ గొందఱు పలుకకున్నారు
లోకప్రపంచంబులోఁ గొందఱుండి - లోక[68]బోధకు లోను గాకున్నవారు
మఱికొందఱానందమగ్నులై తమ్ము- మఱచి లోకములకు [69]మఱపడ్డవారు
ఉన్నతసద్భక్తియుక్తులై కొంద - ఱున్నారు తమతమయొడళులు డాఁచి
యిది కారణముగాఁగ నీశ! మీ భక్తి - తుద మొదలిది యనఁ దోఁప దెవ్వరికి
నందు దృష్టప్రత్యయంబులవలన - సందియంబులు దక్కి సద్భక్తియుక్తి
సుస్థిరలీల లింగస్థలజంగ - మస్థల తత్ప్రసాదస్థలంబులను
సంపన్నులై జగజ్జనులెల్ల భక్తి - సొంపునఁ జుబ్బనఁజూఱలఁ దేల
నీవ ప్రసన్నుండవై వచ్చిలోక - పావనంబుగ భక్తిఁబాలింపవలయు”

శివుఁడు పార్వతితో నందికేశ్వరుని వృత్తాంతము చెప్పుట


[70]నని విన్నవించిన నద్దేవదేవుఁ - డనురాగచిత్తుఁడై యతనికిట్లనియె
“నందికేశ్వరునకు నాకునొక్కింత- సందు లేకునికి నిస్సందేహ మగుట
నీతనిఁ బుత్తెంతు నితనిచేఁబరమ- పూతమై లోకంబు [71]బోధంబు వడయు”
ననవుడు గిరిరాజతనయ ప్రాణేశుఁ - గనుఁగొని ముకుళితకరకంజ యగుచు
“నందికేశ్వరునకు నాకు నొక్కింత - సందు లేకునికి నిస్సందేహ మనుట
[72]భక్తైకతనుఁడవై పలికిన విధమొ? - వ్యక్తిగా నతఁడు నీవై యున్నవిధమొ
యానతి [73]యి"మ్మని యంబిక యడుగ- నా నారదుడు విన నభవుఁడిట్లనియె
"అగునగు నట్టిద యంబుజనేత్రి[74] - తగుఁదగు భక్తైకతనుఁడ నట్లగుదుఁ
జెప్పెద వినుము విశేష [75]మింకొకటి - దప్పదే నతఁడన తర్కించి చూడ
నేమికారణ మనియెదవేని వినుము - తామరసానన! తత్కథాయుక్తి

శిలాదుని తపస్సు


యాది ననేకయుగాదులనాఁడు - నాదరికమున శిలాదుఁ [76]డనంగఁ
దాపసముఖ్యుండు దపమొనరించె- శ్రీ పర్వతంబు నైరృత్యభాగమునఁ
గందమూలాదులు గాలియు నీరు- నిందురశ్ములును [77]దినేశరశ్ములును
నాహారముగఁ ద్రికోట్యబ్దముల్ సలిపి - సాహసంబున మరి శతకోటియేఁడు
లావంతశిల తనకాహారముగను - భావించి ఘోరతపంబర్థిఁ జేయ
నతనికిఁ బ్రత్యక్షమై యేము నిలిచి - మతి నిష్ట మెయ్యది మమువేఁడుమనిన
నత్తఱి నతఁడు సాష్టాంగుఁడై మ్రొక్కి - చిత్తంబులోఁ బ్రీతి సిగు[78]రొత్తి నిగుడ
“సర్వజ్ఞ! పశుపతి! శంకర! శర్వ!- సర్వలోకేశ్వర! శాశ్వత![79] సాంబ!
అవధారు వేదవేదాంతావగమ్య! - అవధారు విన్నపంబాశ్రితసులభ!
శ్రీ మన్మహా[80]దేవ! శివలింగమూర్తి! - యేమిటఁగొఱత యేస్వామి! [81]మీ కృపను
నైనను నాకొక్కయభిమతంబైన - దాని వేఁడెద మహాదాని! యీక్షణమ
నీయట్టివానిని నిజభక్తజనప- రాయత్త! [82]సుతుఁగా దయామతి నొసఁగు”
మనవుడు నతనికి నభిమతార్థంబు - నొనరింప [83]నున్నంత వనజాక్షి! వినవె!

అంతటఁ బోవక యాశిలాదుండు - నెంతయు భక్తితో నిలఁజాఁగి మ్రొక్కి
“యభిమతంబగు పుత్రునర్థినిత్రేని - యభవ! [84]నీ [85]భక్తియం దణుమాత్రమైనఁ
దక్కున [86]గలిగినఁదల [87]ద్రుంచివైతు - నక్కుమారునకు నీ వడ్డమైయున్న
నట్టేనిఁగొడుకు నిమ్మటు గానినాఁడు - [88]నెట్టణ నేనొల్ల నీ యిచ్చువరము”

శివుఁడు శిలాదునకు వరమొసఁగుట


నంచు విన్నప మాచరించుడు నతని- సంచితభక్తికి సంప్రీతిఁ బొంది
యాదిసృష్టికి మున్ననాదియై పరగు - నాదిమదీయాంశమగు వృషభంబు
ధర్మరూపమనఁ గృతయుగంబునందు - ధర్మంబు నాల్గుపాదంబుల నడచు
రమణతోఁద్రేతాయుగమునను ధర్మ - మమరఁగ మూఁడు పాదములను నడచు
జగములో ద్వాపరయుగ[89]మందుఁ బాద- యుగమున ధర్మనియుక్తిమై నడచుఁ
బొనరుచుఁ గలియుగంబున నొక్కపాద- మునను జరించు [90]ధర్మనిరూఢి వెలయఁ
దగిలి యిమ్మాడ్కిని ధర్మస్వరూప - [91]మగుట లోకహితార్థుఁ డగు నట్లుఁగాక
పూని ద్వితీయశంభుం డనుపేరఁ- దా నిత్యుఁడై పరమానందలీల
మాకు వాహనమై ప్రమథ ముఖ్యుఁడయ్యు - గోకులపతియయ్యు శ్రీకరమహిమ
వెలసిన యయ్యాదివృషభేంద్రుఁజూచి - "నలి శిలాదునకును నందీశుఁ డనఁగఁ
బుట్టుము; నీవొండెఁ బుట్టంగవలయు - నట్టుగా కేనొండెఁ బుట్టంగవలయు
రూపించి ధర్మస్వరూపులై మహిమ- నేపారుప్రమథగణేంద్రులందెల్ల
మక్కువ పెక్కువ [92]మద్భక్తియుక్తి - యెక్కు[93]వగాఁగ నీ కిచ్చినవాఁడఁ
గాన మిక్కిలిభక్తి గలయట్టిపుత్రుఁ- గాని శిలాదుండు దా నొల్ల ననియె
నిచ్చినవరమింక నేఁదప్పనేర -నచ్చెరువంద మా [94]యనుమతిఁజేసి
పుట్టు ద్వితీయ[95]శంభుండనఁబుడమి - "నట్టిద [96]కా” కని యానందలీలఁ

నందికేశ్వరుని యవతారము


బుట్టె నయోనిసంభూతుఁడై యతని- కిట్టలంబుగ నందికేశ్వరుఁ డనఁగఁ
బుట్టఁగఁ దోడనె పుట్టె మద్భక్తి - పుట్టక యటమున్న పుట్టె మచ్చింత
పరమతత్త్వామృతం [97]బయ చన్నుఁబాలు- గురుపదధ్యానవిస్ఫురణయ వెన్న

వేదాంతసూక్తుల వెడ [98]దొక్కుఁబల్కు - లాదిశివాచారమదియ వర్తనము
గాను మదీయాంఘ్రికమలంబు లాత్మ - లో ని[99]డుకొని భక్తిలోలత్వ మెసఁగ
బలువిడిఁబాఱునేఱుల నట్టనడుమఁ - జలికాలమెల్లఁ బుక్కిలిబంటి నిలిచి
యేకపాదాంగుష్ఠమిలమీఁద మోపి - యాకసంబునకు ముఖాంబుజ మొగ్గి
వర్షంబు [100]భోరన [101]వఱుగొని కురియ - హర్షంబుతోడ నల్లాడక నిలిచి
మేదినిఁదలమోపి మీఁదికి రెండు - పాదంబు[102]లను నెత్తి పంచాగ్నినడుమఁ
దలఁచిన డెందంబు దాపంబుఁ బొందఁ - బలికిన నొరెల్లఁబటపటఁబగులఁ
జూచినఱెప్పలు సుఱచుఱఁగమర - నేచినయెండల నెడపక నిలిచి
భువియు వడంక నంభోనిధులింక - రవిశశుల్ గ్రుంకఁగూర్మంబు దలంక
దిక్కరీంద్రులు ద్రుంగ దిక్కులు గ్రుంగ - నక్కులాద్రులుస్రగ్గ నహిపతి మ్రొగ్గ
దిక్పతుల్ బెదర నద్దివియెల్లనుదర - వాక్పతి యదర నధ్వరములు సెదర
హరితల్లడిల్ల బ్రహ్మాండముల్ డొల్ల - ధరనుల్కములు (లును?) డుల్ల సురలుభీతిల్ల
నపరిమితంబైన యతివీర ఘోర - తపమాచరించెఁజిత్రము చిత్రమనఁగ;
నంత భయభ్రాంతులై యజాచ్యుతులు - సంతాపచిత్తులై సకలదేవతలు
గ్రక్కున మాయున్నకడకు నేతెంచి - మ్రొక్కి సాష్టాంగులై మోడ్పుఁగేలమర
“దేవ! దేవేశ్వర! దేవతారాధ్య! - దేవచూడామణి! దేవాధిదేవ!
పరమభట్టారక! పరమస్వత్రంత్ర! - పరమేశ! పరమాత్మ! పరమ! పరుండ!
శంకర! పంకజసంభవాద్యమర - శంకర! దురితభయంకర! యభవ!
యక్షయ! సర్వజ్ఞ! యఖిలలోకైక - రక్షక! దక్షమఖక్షయ!దక్ష!
యని మమ్ముఁ గీర్తింప నచ్యుతాదులను - గనుఁగొని యేమును గన్నుల నవ్వి
“యింత సంతాపింప [103]నేటికి మీకు - భ్రాంతిఁ బొందిన [104]వెఱ్ఱిపశుజీవులార!
[105]నందీశ్వరుఁడు సేయునవ్యతపంబు - చందంబు సూచియో శంకించి రాక
చీరికిఁ గైకొన్నె శ్రీప! నీ పదవి - కోరునే బ్రహ్మ! నీ [106]కొండుకపదవి
ఓరి దేవేంద్ర! నీ [107]యొడఁబడుపదవి - [108]పే రతఁ డెఱుఁగునే పెక్కు లేమిటికిఁ
ననుఁగాని యాతండు నాపదంబైన - మనమునఁ దలఁపడు [109]మా భక్తులాన”
యనుచుఁ బ్రసన్నుండనై యేను వారి - మనముల దిగులెల్ల మాన్పంగఁ దలఁచి
యందఱుఁ గొలిచిరా నచటికిఁబోయి - నందికేశ్వరుడాయ ముందట నున్న

నతఁడంతరంగంబునందు నన్ గాంచు - గత దేటతెల్లయై కానవచ్చుటయు
నప్పుడచ్చెరువుఁబ్రహర్షంబు భక్తి - ముప్పిరి గొని మనంబున నుల్లసిల్ల
సాష్టాంగమెఱఁగి మదంఘ్రికంజములు- హృష్ణుఁడైనెన్నుదురిఱయంగ మ్రొక్కి
యానంద బాష్పపూర్ణాస్యుఁడై కలయ- మేనురోమాంచ సమ్మిళితమై తనర
గద్గదకంఠుఁడై కరములు మొగిచి- తద్గతచిత్తుడై తాఁబ్రస్తుతింప
“మెచ్చితి వరము నీ కిచ్చితి వేఁడు - మిచ్చ యెయ్యది నందికేశ్వర!” యనిన
దరహాస[110]కాంతి వక్త్రమునఁ [111]దుల్కాడ - నరుదొంద మాకు నిట్లని విన్నవించెఁ
“బెన్నిధి యుండగమన్నడుగుదురె? - ని న్నొండు వేఁడెడు [112]నిర్గుణి గలఁడె?
పదవులు గిదవులు పనిలేదు నీదు- సదమలభక్తిఁ బ్రసాదింపు [113]దేవ?”
యనిన గాఢాలింగనావలి నతని- తనువు నా తనువునఁ బెనఁగొల్పి యంత
“భవదీయగాత్ర సంస్పర్శన సుఖము - నవక మెక్కఁగ వాహనం బగు మిట్లు
ఆది మదీయవాహనమవు నీవు- వేదాంతనుత! మహావృషభేంద్ర!” యనుచుఁ
బ్రమథేంద్రపదవికిఁబట్టంబు గట్టి- యమితసర్వజ్ఞత్వమప్పుడిచ్చుడును
నంతట శ్రీధరుఁడంతట నజుఁడు- నంతట దేవేంద్రుఁడంతట సురలు
[114]ధరఁజాఁగఁబడి మ్రొక్కి కరములు మొగిచి- శరణంచు నందికేశ్వరునిఁ గీర్తింప
నతఁడు దయామతి నల్లన నగచు- నతగులౌ సురలను నరవిరికంటఁ
జూచె భయంపడు సురలుఁ దొల్లింటి- యేచిన భీతివోఁజూచినయట్లు
శ్రీగిరినైరృత్యభాగంబు పుణ్య - భాగ మా క్షేత్రంబు పరమపావనము
నందికేశ్వరుని పుణ్యతపంబుచేఁత - 'నందిమండల' మను నామంబుఁదాల్చె
నచ్చట వర్తించునఖిల జీవులకు - నిచ్చితి నపవర్గమిందీవరాక్షి!
దొరకొను నందికేశ్వరుచరితంబు- విరచించువారికి విన్నవారికిని
నచలితబుద్ధి దృష్టాదృష్టసిద్ధి - ప్రచురవచశ్శుద్ధి భక్తిసమృద్ధి
యిట్టిద కావున నీ నందికేశుఁ -డెట్టున్న నేన కా [115]కేల యొండొకఁడె?”
యని యానతిచ్చుడు నఖిలాండపతికి- ననురాగమున జగదంబ కేల్మొగిచి
యన్నందికేశు నందంద చూచుచును - మన్నన దైవాఱ మఱియు నిట్లనియె
“ఈ నిరహంకార మీ సదాచార - మీ నిరంతరభక్తి యీ ప్రభుశక్తి
యీ సిద్ధపాండిత్య మీ నిత్య [116]సత్య - మీ సుకుమారత్వ మీ యాత్మతత్త్వ

మీ శుద్ధచారిత్ర మీ పుణ్యగోత్ర - మీ శుభాంచితమూర్తి యీ లసత్కీర్తి
యేరికిఁగల్గునే యెన్నిభంగులను - గారవింపఁగ నీవు గానివారలకు
నిన్ను [117]ధరింపంగ నీకె కాకొరుల - కెన్నంగ శక్యమే యీశ! [118]సర్వేశ!
అట్టిద కాక నీ యంశంబు గాని - యట్టివాఁడింత నీ [119]కనుగులం బగునె!”
యనుచున్న గిరిరాజతనయ వాక్యములు - విని ముదితాత్ముఁడై విశ్వేశ్వరుండు
నారదుదెసఁజూచి "నందికేశ్వరుని - గౌరవమహిమ విఖ్యాతిని వింటె”
యనుచు నానందీశు నధికదయార్ద్ర - వనధిఁ [120]దేల్చుచుఁ గనుఁగొనుచున్న యెడను
నెంతయు భయము నొక్కింతయుఁజూపు - నెంతయు సిగ్గు నొక్కింతయు ముదముఁ
దనకు భూషణములై తనరారుచుండ - గనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
సులభరోమాంచకంచుకితాంగుఁ డగుచు - దలఁపున డెందంబు దటతట [121]నదర
మస్తకవిన్యస్తహస్తుఁడై తన్నుఁ - బ్రస్తుతింపుచు నున్నప్రభు నందికేశుఁ
గనుసన్నఁ జేసన్నఁ గదియంగఁ బిలిచి - తన నిర్మలప్రసాదముఁగృపచేసి
నెయ్యంబుఁగరుణయు నిండి వెల్విరియ - నయ్యంబికాధవుఁడతనికిట్లనియె.

శివుఁడు నందికేశ్వరుని మర్త్యమున బసవేశ్వరుఁడుగా జనింపఁ బంపుట


“ఇది శ్రుతిస్మృతిమూలమిది ధర్మశీల - మిది విమలాచార మిది [122]తత్త్వసార
మిది సుమహత్త(హాత)త్వమిది కృతార్థత్వ - మిది యాదిపథమని విదితంబుగాఁగ
నీ కతంబునన నిర్ణీతమై భక్తి - లోకంబునందవలోకింపఁబడియెఁ
బ్రమథాధిపతులకుఁ బార్వతీసతికి - విమలమదీయతత్త్వముఁ బ్రబోధించు
తెఱఁగునకంటెను దెల్లంబుగాఁగ - నెఱిఁగించితిమి [123]నీకు నెక్కుడుఁ గూర్మి
నట్టిద; సర్వజ్ఞుఁ డనుపేరు నీకు - [124]నిట్టట్టునా వలదెల్లచోఁజెల్లుఁ
గాన యామర్త్యలోకమ్మున కరిగి - పూని ద్వితీయశంభుండన మహిమ
వ్యక్తిగా లోకహితార్థంబు సకల - భక్తహితార్థంబు పరమార్థముగను
మా వినోదార్థంబు మర్త్యంబుఁ బరమ - పావనంబుగఁ జేయు బసవఁడన్పేర”
నావుడుఁ [125]గేల్మోడ్చి నందికేశ్వరుఁడు - దా విన్నపము చేసె దేవదేవునకు
“మీ యాజ్ఞఁదలమోచి [126]మెయికొని పనులు - సేయుదు నన్నింత సెప్పంగనేల?
[127]మర్త్యలోకమునకు మఱి వేఱె యొకఁడు - గర్త యున్నాఁడె లోకత్రయవరద!

ఇందున్న నేమి? నా కందున్న నేమి? - యెందున్న నేమి? నీయందు నా యునికి.”
అని విన్నవించిన యా నందికేశు - వినయోక్తులకు జగద్విభుఁడిట్టులనియె,
“గురులింగమూర్తిజేకొని వచ్చియేన - పరమతత్త్వార్థతత్పరుఁజేయువాఁడఁ
బ్రాణలింగంబనై భ్రాజిల్లి నీదు - ప్రాణాంగముల నొడఁబడి యుండువాఁడ
రూఢిగా జంగమరూపంబుఁ దాల్చి- వేడుక [128]నినుఁగూడి విహరించువాఁడఁ
దను మనోధనములు [129]దారవోకుండఁ - [130]దనుఁ జేర్చికొనువాఁడ ననఁగి పెనంగి
నా ప్రాణములకుఁ బ్రాణంబగుచున్న - నా ప్రమథులకుఁ బ్రాణంబగు నీకు
నాకును సందొక్కనాఁడు లేకునికి - నీకుఁ దెల్లముగాదె లోకపావనుఁడ!”
అని యూఱడిలఁ బల్కునాశంకరునకుఁ - దనువెల్లఁ జేతులై తా మ్రొక్కి నిలిచి
“విన్నపంబేఁ బనివినియెద” ననుచు - నన్నందికేశుండు సాష్టాంగమెఱఁగి
ప్రమథసన్నిహితుఁడై భ్రాజిల్లు శివుని - నమిత తేజోమూర్తి నాత్మలో నిలిపి
నరలోకమల్లదె నా నింతనంత - నరుదెంచె రయమున; నంత నిక్కడను
గురుతరంబైన శ్రీగిరిపశ్చిమమున - నరనుతం బగుచుఁ గర్ణాటదేశ మనఁ
గడు నొప్పునందుఁ బ్రఖ్యాతసద్భక్తి - సడి [131]సన్నహింగుళేశ్వర[132]భాగవాటి
యను నగ్రహారంబునందు విఖ్యాతి - మనుచుండు మండెఁగ మాదిరా జనఁగ;
నతని పరమసాధ్వి యతివ మాదాంబ - సతతశివాచార సంపన్నధన్య
కొత్తడి [133]నెల్లను గొండొక్క వెద్ద - యుత్తమురాలు ధర్మోపేతగాత్రి
యెల్లవారలకంటె మొల్లంబునందు - నల్లవో యనుజీవనంబునఁ బొదలి
కొడుకులు లేమికిఁ గడు [134]దుఃఖి యగుచు - వెడనోము [135]లన్నియు వేసర నోమి
యాద్యులు వొత్తంబులందెల్ల వెదకి - "హృద్యంబుగా నందికేశ్వరునోము
కామ్యార్థసిద్ధికిఁగారణం"బనుచు - సమ్యగ్వ్రతస్థితి సతికిఁజెప్పుటయు
నమ్మహాత్ములు సెప్పినట్లుగా గుడికి - నిమ్ములఁజని నందికేశ్వరుఁజూచి
సర్వాంగములు ధర సంధిల్ల మ్రొక్కి - 'సర్వజ్ఞ! నందికేశ్వర! దయాంభోధి!'
యంచుఁబ్రస్తుతి చేసి యతిభక్తి మ్రొక్కి - యంచితవ్రతచర్యలాచరింపుచును
నిమ్ముల సోమవార మ్మాదిగాఁగఁ - దొమ్మిదిదినములుత్సుకవృత్తి నోఁచి
మఱునాఁడు నందిని మజ్జనంబార్చి - గుఱుతైన చందనకుసుమంబు లిచ్చి

మెత్తనివస్త్రముల్ మెయినండఁ [136]గప్పి - యుత్తమాభరణంబు లురుగజ్జియలును
నందెలు [137]గంటలు నలవడఁగూర్చి - పొందుగాఁ బసిఁడికొమ్ములు [138]గొరిజియలు
వెట్టి ఫాలంబునఁబట్టంబు వెలయఁ - గట్టి నందికి నలంకారంబు సేసి
యక్షతధూపదీపాదులొనర్చి - యక్షణంబున బంచభక్ష్యముల్ [139]కుడిపి
పులగంబు ముందటఁ [140]జబ్రోవగాఁ బోసి - పులకండమును నెయ్యిఁ గలపి యర్పించి
పరమమాహేశ్వర[141]ప్రతతికి నెల్ల - బరిణామ మంద సపర్యలు సేసి
“నందీశ! [142]నందీశ! నవనందినాథ! - ఇందుకళాధరు నెక్కుడుఁగుఱ్ఱ!
నా యన్న! నా తండ్రి! నా యాలఱేఁడ! - నీ యట్టి సద్భక్తు నీ యట్టిపుత్త్రు
ఖ్యాతిగా నొక్కనిఁ గరుణించితేనిఁ - బ్రీతి యెలర్ప నీ పేరిడుదాన”
ననుడు నప్పుడు మాదమాంబకు నంది - జనులెల్ల నెఱుఁగఁ [143]బ్రసాదంబు వెట్ట
నక్కున మోమున నా ప్రసాదంబు - మక్కువ నెక్కొల్పి మఱి మౌళిఁదాల్చి
మ్రొక్కి నిజావాసమునకు నేతెంచె - నెక్కుడు శుభచేష్ట లెదురుకొనంగ
నంత నెప్పటికంటె ననురాగరసము - వింత వేడుక వుట్టి వెలఁదియుఁ బతియు
లీల వర్తిల్ల; మున్భూలోకమునకు - బాలేందు శేఖరుపనుపునఁ జేసి
వచ్చిన నందికేశ్వరుఁడాత్మలోన - నచ్చెరువంది తా నరుదెంచుపనికి
ననుగుణంబుగఁ దన్నుఁ దనయునిఁగాఁగ - వనజాక్షి [144]నోమె నేమని చెప్పవచ్చు.
దలఁచిన కార్యంబు దలకూడె ననుచు - వెలఁదిగర్భమునఁ బ్రవేశింపఁ దడవ
మగువకంతట నెల మసలెఁ దోడ్తోన - తగగర్భచిహ్నముల్ [145]దా నంకురించె
నమృతాం[146]శుఁడగుపుత్రుఁడతివగర్భమున - నమరియుండుట [147]నొక్కొ యాఁకలిగాదు
జలజాక్షి కడుపున సద్భక్తిరుచికుఁ - డలరుటనో రుచులరుచులై తోఁచె;
బాండురాంగునిమూర్తి పడఁతిగర్భమున - నుండుటనో [148]వెలరొందె మైదీఁగె
పడఁతిశీలపుఁజూలు భవిపాకములకు - నొడఁబడకునికినో యోకిళ్లు పుట్టెఁ
గ్రాలుచు సుతునిరాకకు నోరు దెఱచు - లీలనో సతికావులింతలు పుట్టె
శివమూర్తి దనకు లోనవుటనో తవిలె - శివయోగనిద్ర నాఁ జెలువకు నిద్ర
కాలకంధరుమూర్తి గడుపున నునికి - నో లలితాంగి చన్మొనలు [149]నల్పెక్కెఁ
బెనుపుగ శివమూర్తి వనితగర్భమునఁ - దనరనో నడుము పేదఱిమి వోనాడె

యోగీంద్రహంసుఁ డయ్యువిదగర్భమున - రాగిల్లుటనొ నడ వేగంబు వదలె
ననఁగ మానినిగర్భ మంతకంతకును - నినుపారి తనుపారి [150]పెనుపారి పొదలి
నవమాసములు నిండ నందీశమూర్తి - నవకమై కడుపులోనన [151]మవ్వమొందె
జనని గర్భావాసమను గుహాంతరమ - తన సమాధికి సుఖస్థానమై పరగ
సిద్ధపద్మాసనాసీనత నతివి - శుద్ధాత్ముఁడై భూతశుద్ధికిఁ జొచ్చెఁ
గడవ నూకుచు నుదకముఁ బాఱఁజల్లి - యడర నెబ్బంగినో యగ్ని దా నేర్చె
బూది దా రాఁజదు పొగయదు తాను - నూదండు ముట్టించె నొక్కదీపంబు
నొప్పుదీపమునఁ దా నున్నయిల్లెల్లఁ - గప్పుగాలకయుండఁగాల్చె లోపలన
“యిలఁగాలు మోపండు నిట్టిబిడ్డండుఁ - గలఁడమ్మ!” యనుచు శత్రులును మిత్రులును
దమతమ పట్లను దా రుండు నోడి - భ్రమితులైకనుకనిఁ బాఱుచునుండ
నచ్చుగాఁ దాఁ జౌదళాబ్జంబుఁ గడచి - వచ్చి త్రికూటంబు వసుధపై నిలిచి
సచ్చరిత్రత సుప్తసర్పంబుఁ జోఁపి - క్రచ్చఱ షడ్దళకమలంబు నొంది
కర మర్ధి దశదళకమలంబుఁ బొంది - పరగ ద్వాదశదళపద్మంబుఁజెంది
షోడశదళపద్మసురుచిరసౌఖ్య - [152]కేలీవిలోలుఁడై [153]యోలలాడుచును
దాఁటి యాద్విదళపద్మంబునఁ దన్ను - [154]నాఁటించి సచ్చిదానందంబు నూని
చనునధోముఖమగు షట్కమలములు - మునుకొని యిట్లూర్ధ్వముఖములై తనర
నిశ్చలకోదండ నిజగతి నున్న - పశ్చిమనాళ[155]సంభవమైనయట్టి
నాదంబునకుఁ జొక్కి నగముపై మ్రొక్కి - మోదంబునకుఁజిక్కి ముందఱ నిక్కి
సరినూర్ధ్వముఖసహస్రదళాంబుజాత - మరయ నధోముఖమై మించి వెలుఁగ
దివ్యుఁడై షోడ[156]శాంత వ్యోమచంద్ర - భవ్యసుధాపానపారవశ్యమున
నాతతంబుగఁ బరంజ్యోతిస్స్వరూప - మై తన వెలుఁగ వెల్గై వెల్గుచుండ
బలువు ఱా ప్రతిమగర్భంబులోపలను - వెలిఁగెడు దీపంబు విధమును బోలెఁ
బాండురాంగంబైన పడఁతిగర్భమునఁ - [157]బోఁడిగా వెలుగుచుఁ బుత్త్రుఁడీ క్రియను

దగిలి శివధ్యానతత్పరత్వమున - మొగిఁదల్లికడుపులో [158]మూఁడేఁడులున్న
సుతభరాక్రాంతయై మతి శ్రమంబంది - సతి దొంటి నందికేశ్వరుగుడికేఁగి
“నోములు గీములు వేములఁగలిపి - నీ మర్వుసొచ్చితి [159]నిఖిలలోకేశ
మఱుఁగుసొచ్చినయట్ల మన్నించి నన్ను - మెఱయింపు సుతునీగి మేలయ్యె నేఁడు
పున్నెంబు సేసిన పొలఁతు[160]లు నెలల - నెన్నఁ దొమ్మిది మోచి కున్నలం గండ్రు
అల్లన మూఁడేఁడులయ్యె [161]నన్నింత - [162]యల్లటపెట్టెదో[163]యన్న! నే నెఱుఁగ
దుర్భరంబైన యీయర్భకు [164]వలని - గర్భంబు కర్కటిగర్భంబు వోలె
నరయంగ నీయిచ్చు [165]వరములు సాలు [166]నెర(రి?)వు మాన్పింపవే యేమియు నొల్ల
నన్నెంత కెత్తుకోనున్నదో కాక - యెన్నఁడు విందుమే యిట్టిగర్భముల!"
ననుచుఁ దా నచ్చోట నచ్చోట నిలిచి - తనువు శ్రమంపడఁదనయింటి కరిగి
పాన్పుపై [167]నుస్సని పరితాపమంది - తన్పుగా నార్ద్రచందనవారిఁదోఁగి
నెవమునఁ గనుమూసి నిద్రఁ [168]బొందుడును - సువిదకుఁగలవోలె నుక్షవల్లభుఁడు
జంగమలింగవేషంబొప్పఁదాల్చి - యంగన [169]కిట్లని యానతి యిచ్చె
“నీ మనస్తాపంబు నీవగ మాన్పఁ - గా [170]మించి వచ్చితిఁగమలాయతాక్షి!
“నీ కడ్పులో నున్న యాకుమారుండు - లోకపావనమూర్తిగాక కేవలుండె?
యాదివృషభము శిలాదునికొడుక; - యాదేవదేవుని యానతిఁజేసి
భక్తహితార్ధమై ప్రభవించు నీకు - వ్యక్తిగాఁ జెప్పితి వగవకుమింకఁ
బుట్టెడుఁ బుత్రుండు; పుట్టఁగఁదడవ - పెట్టుమా బసవఁడ న్పేరు పెంపార”
నని యానతిచ్చిన నంత మేల్కాంచి - కనువిచ్చి [171]చూచుచుఁగాన కెవ్వరిని
“ఈతఁడు మన నందికేశుండు దాన - [172]యేతెంచెఁ గానోపు నింతయు నిజము
బ్రదికితి; నా జన్మఫలమెల్ల నేఁడు - తుదముట్టె" ననుచు సంతోషాబ్ధిఁదేలి
చెలులుఁ జుట్టములు నచ్చెరువంది వినఁగఁ - గల తెఱఁగంతయుఁ [173]గడువేడ్కఁ దెలిపి
యున్నెడఁ గోమలియుదరంబులోన - నున్న మహాత్మునిహృన్నలినంబు
దానయై వెలిఁగెడు తత్పరంజ్యోతి - వానిఁ బ్రబోధించి “వచ్చినపనులు
మఱచితే” యనవుడునెఱిఁగి సద్భక్తి [174]యఱ(ఱు?)కువ గాకుండ సాష్టాంగమెఱఁగి

ప్రీతిఁ బుత్త్రుఁడు మోడ్పుఁజేతులతోడ - నా తల్లిగర్భంబునందుదయించె;
నర్ధోదయమునంద యతనిలో నున్న - యర్ధేందుమౌళి [175]గుప్తాకృతిఁ దాల్చి
యంగంబుపైఁ గడు సాంగంబుగాఁగ - లింగసాహిత్యంబు లీల నొనర్చె.
“వచ్చిన త్రోవ యెవ్వరుఁ గానకుండ - నెచ్చోట నుండియో యేతెంచెఁ దపసి
యిది యే [176]మొకో!” యని యింటివారెల్లఁ - బదరుచు నంత విభ్రాంతులైచూడ
ముడిచిన మడుపుఁగెంజడముడినడుమ - మృడుని చందంబులు వెడవెడ దోఁపఁ
గట్టిన వెలిపొత్తి కచ్చడంబెందుఁ - బుట్టనిరుద్రాక్షభూషణంబులును
రాగికుండలములు రత్నకంబ[177]ళియు - యోగదండంబునునొకచేత [178]గొడుగు
బూదిబొక్కసమును బొలుపారుమేని - బూదిపై నొప్పు త్రిపుండ్ర రేఖలును
దళతళమను మెర్గుపలువరుసయును - గలయ నొత్తిన [179]వాలుగడ్డంబుఁదనరఁ
దపసులరా జొక్కతపసిచందమున - నపుడు మాదాంబకు ననురాగమెసఁగ
“నిల్లకప్పడిసంగమేశ్వరంబందు - నెల్లప్పుడును నున్కి యెట్టులంటేని
యేను గూడలి సంగమేశ్వరు పేర - కాన యాగుడిలోనఁ గదలకుండుదును
నా కొడుకొక్క జన్మమున నితండు - లోకహితార్ధమై నీకుదయించెఁ
గాన వచ్చితిఁ జూడఁగా నీ భవమున - కేన చూ గురుఁడ నింకిటమీఁదటికిని
నీనందనునకు లింగానర్పితంబు - [180]లాన సుమీ యించుకంతైనఁ గుడుప”
ననుచు నదృశ్యుఁడై యరిగె నతండు - మనసిజహరుఁడు [181]దాఁజనఁగ నంతటను
బాలార్కకోటుల ప్రభలు గీడ్పఱచు - బాలుని తేజంబు [182]వర్వుటఁ జేసి
సూచీముఖంబైనఁ జొనుపంగరాని - యేచినతిమిరంబు నెల్లమానవుల
యజ్ఞానతిమిరంబు నావంతలేక - విజ్ఞానమయుఁగని వేగంబ పాయ
వేగక వేగినవిధమైనఁజూచి - రాగిల్లె నిఖిలంబు రవి [183]పాఁగె ముడిగె
జననియు జనకుండు సత్పుత్త్రుఁజూచి - యనురాగరసవార్ధి మునిఁగి యాడుచును
భక్తులఁ బిలువంగఁబనిచి యిర్వురును - భక్తిఁ బ్రణామ [184]మేర్పడ నాచరించి
యిమ్ముల సింహాసనమ్మిడి తత్‌క్ష - ణమ్మ విభూతి వీడ్యమ్ములర్పించి
పాదోదకంబులు వట్టిమైఁగడిగి - బూది ఫాలంబునఁబూసి పైఁజల్లి
పంచమహావాద్యపటలంబులులియ - నంచితాగణ్యపుణ్యాత్ముఁదత్సుతుని

బసవ నామంబిడి పతియును సతియు - నెసక మెక్కఁగ నున్న యెడఁ గుమారుండు
వెనుకఁజీకటి యుండఁదన కేటితేజ - మనుగతి దీపంబుఁగనుఁగొని నవ్వు
సన్నుతలింగప్రసాదమగ్నతన - యున్నట్లు చనుగుడ్చు [185]నూరక యుండు
శివసుఖామృతమును జేఁగ్రుమ్మరించి - చని [186]సూచుమాడ్కి హస్తములారగించు
శివపదధ్యాననిశ్చేష్టితావస్థఁ - దవులుచందంబునఁ దా వెఱఁగందు
బిలిబిలి సంసారమిలఁ [187]బాఱఁదోలి - [188]చెలఁగి యాడెడుగతిఁజేతులాడించు
మాయాప్రపంచంబు దాయంగనీక - పాయఁదన్నెడు రీతిఁబాదంబులార్చు
వడి మెయిఁదన పూనివచ్చినపనులు - దడవయ్యె ననుచు నుల్కెడుభంగి నులుకు
భవుఁ [189]బాడ నానందబాష్పంబు లొలుకు - పవిది నేడుచుఁగనుఁగవ నశ్రులొలుక
భవబాధలకు నగపడి మొఱవెట్టు - భవులకుయ్యాలించుభాతి నాలించు
నొడయలయడుగులఁ [190]బడి మొఱల్వెట్టు - వడువునఁ బుడమిపైఁ బడి బోరగిల్లు
నిల [191]మఱపడ్డ నిర్మలశివభక్తి - తలయెత్తువడువునఁ దాఁ దలయెత్తు
నరుదొందఁ బద్మాసనాసీనవృత్తిఁ - బొరి నభ్యసించుపొల్పునఁ గూరుచుండుఁ
బూని ద్వితీయశంభుండను నంది - నే నను భావన నిలఁ [192]దోఁగియాడు
నా వీరమాహేశ్వరాచార మెల్లఁ - బ్రోవయి నిల్చినపోల్కి నిల్చుండుఁ
గడఁకతో నాది మార్గము దప్పకుండ - నడుగిడులీలఁ [193]దప్పడుగులు వెట్టు
మలహరుఁ బేర్కొనుమాత్ర గద్గదము - లలరుకైవడి [194]దొక్కుఁబలుకులు పలుకు
బల్లిదు ల్మాశివభక్తులే యనుచుఁ - గ్రేళ్లువాఱుచు నాడుక్రియఁబాఱి యాడు
నంత [195]వినోదంపుటాటప్రాయమున - సంతతంబును శివార్చన మాచరించు
బుద్ధు లెఱుంగు లేఁబురులుప్రాయమున - సిద్ధంబు భక్తుల శివునిగాఁ దలఁచు
సర్వజ్ఞుఁడైన వృషభమూర్తిగాన - సర్వవిద్యలు సహజంబపాటిల్ల
గతభక్తియుక్తుఁడై గర్భాష్టమమున - సుతునుపనయనంబు శుభముహూర్తమునఁ
జేయుదునని తద్దఁ జిడిముడిపడఁగ, - నా యెడ బసవఁడిట్లని దండ్రికిని:-

బసవేశ్వరుఁడు వడుగు వలదని తండ్రితో వాదించుట


"వడుగని యిది యేమి గడియించె దీవు - జడుఁడ వెట్లయితివీశ్వరునిఁ గొల్చియును
బరమాత్ముగురునిగాఁ బడసి దుర్నరుల - గురులని తలఁచుట నరకంబు గాదె?

గతపూర్వజన్మసంస్కారుఁడై పిదప - వితతద్విజత్వంబు పతితంబు గాదె?
నిర్మలగురుకృపాన్వీతజన్మునకుఁ - గర్మజన్మంబు దుష్కర్మంబు గాదె?
యగ్గురుపాదంబులర్చించు నతని - కగ్గిలో హవి వేల్చుటది దప్పుగాదె?
మలహరాత్మకమగుమంత్రంబుఁ [196]గఱచి – పలుమంత్రములు [197]గొనఁబాపంబుగాదె?
శూలి భక్తులకెత్తుకేలది త్రాటి - మాలల కెత్తుట [198]మఱి తప్పుగాదె?
కర్మపాశంబులొక్కటఁదెగు నీల్గి - [199]కర్మంబుత్రాళ్లు దాఁగట్టుకోఁదగునె?
రుద్రాక్షభసితాదిముద్రలు దాల్చి - క్షుద్రముద్రలు దాల్పఁగూడునే చెపుమ?
యీ రీతిఁద్రాటికి దూరమైయున్న - వీరమాహేశ్వరాచారదీక్షితుని
నిర్మితోభయకర్మనిర్మూలు నన్నుఁ - గర్మాబ్ది ముంచుట ధర్మమే నీకుఁ?
గచ్చఱఁగన్నులఁగానవు గాక - వచ్చునే బసవని వడుగుసేయంగ
బ్రహ్మశిరోహరుఁ బ్రమథైకవంశ్యు - బ్రహ్మ[200]వంశ్యుండని భావించె[201]దెట్లు?
జాతిగోత్రాతీతు సద్గురుజాతు - జాతిగోత్రక్రియాశ్రయుఁ [202]జేసె దెట్టు?
లకులస్థుఁడై యున్న యభవుని భక్తు - నికి నేకులం బని నిర్ణయించెదవు?
కావున నెన్నిమార్గములను వడుగు - గావింపఁగా రాదు కథ [203]లేమిచెప్ప”
ననవుడుఁదండ్రియిట్లనియెఁ బుత్త్రునికి - విన[204]వయ్య! బసవయ్య! విప్ర[205]మార్గంబు
నాగమవిధిఁ బదియా(దునా?) ఱుకర్మంబు - లాగర్భసంస్కార మాదిగాఁ గలవు
వానిలో నొకఁడైన నూన మౌనేని - కానేరఁడాతఁడగ్రకులోత్తముండు
అందు విరుద్ధ మెయ్యది రుద్రగణము - [206]నాందిముఖ్యం బుపనయనపూజకును
బనుగొనఁ బ్రణవంబు భర్గుఁడే దైవ - మనుటయు మంత్రంబు నట్లును గాక
పెట్టిన సూత్రముల్ భీమసర్పములు - పట్టినపాత్రంబు బ్రహ్మశిరంబు
పాలాశదండంబు పంకజోదరుని - కోలెమ్ము దలచుట్టు [207]కూఁకటుల్ జడలు
నఱితికృష్ణాజిన మది గజాజినము - వఱలు మేధావియే నెఱిభూతి గాఁగ
హరుఁడు భిక్షాటనమాచరింపఁగ - నరిగిన వేషమింపారఁదాల్చినను
నట్టైనఁగాని బ్రాహ్మణుఁడు గాఁడనిన - నిట్టు విరుద్ధమే యీశు భక్తునకు?
వడుగుచేసిన భక్తి వట్టి పాటగునె? - నొడువరితనమునఁ గడవ నాడెదవు
[208]పసిబిడ్డమాటలు పనియు లేదింక - మసలక చేయుమీ మా చెప్పినంత

యిట్టిచోద్యంబు లే మెఱుఁగ మేనాఁటఁ - బట్టి! మా కడుపునఁ బుట్టితికాక
‘ప్రాలు గల్గుసుపుత్రుఁ బడసితిమింక - మేలయ్యె’నని యేము లీల [209]నున్నెడను
బుట్టివాఁడ కులముపురులు వోనాడ - [210]నెట్టయ్య! తలఁచెదు పట్టి [211]మాయయ్య!
కులదీపకుఁడు పుట్టఁగులము వర్ధిల్లు - గులనాపకుఁడు పుట్టఁ గులమెల్ల [212]గ్రుంగుఁ
గులమునకెల్లను గుద్దలిఁగొంటి - [213]వెలిసేయరే నన్ను విప్రులు విన్న?
నిన్నుఁ జేపట్టి [214]యనీతిమై కులము - చెన్నఁటి! పోనాడి చెడనెట్లు వచ్చు?
యుక్తి సెప్పితిమిప్పు డొల్ల[215]వైతేని - భక్తియు నీవును బడ్డట్లు పడుము.”
అని నిష్ఠురోక్తుల నందంద పలుక - విని పొంగి బసవఁ డిట్లనియెఁ గోపమున
“బ్రాహ్మ్యంబు భక్తియుఁ [216]బలికెదుకూడ - బ్రాహ్మ్యంబు [217]వేఱెదర్శనమయియుండు
వేఱెదైవంబును వేఱె మంత్రంబు - వేఱె యాచార్యుండు వేఱె వేషంబు
ధ్యానంబు వేఱె బ్రాహ్మ్యక్రియల్వేఱె - మానుగా నాచార్యమార్గంబు వేఱె
కాదేని నగ్నిముఖము, బ్రహ్మశిరము, - నాదిరుద్రుడు శిఖ, హరి యుదరంబు
ప్రాణాదివాయువు ల్ప్రాణంబు, యోని - క్షోణి, దాశ్వేతంబు సూవె వర్ణంబు
నసమాక్షువిధమె గాయత్రి సాంఖ్యాయ - నసగోత్ర మిరువదినాల్గక్షరములు
దానికి మఱి త్రిపాదంబు షట్కుక్షి - పాన లొండును గావు పంచశీర్షంబు
నని చెప్పుఁగాదె మీయాజ్ఞికంబులును - వినుము దైవంబది వేఱౌనొ కాదొ?
కావున నిదియు సాంఖ్యాయనమతము - [218]దైవంబనంగలేదు తా బహురూపు
దాని కాచార్యుండు ధరఁగర్మజడుఁడు - దానికి మంత్రంబు దాను గాయత్రి
ప్రతిదినక్రియ కర్మబంధంబు వేష - మితరేతరము మోక్షహేతువే తలఁప?
నదికాక షడ్దర్శనాతీతమైన - మదనారిసద్భక్తిమార్గంబు వినుము
శ్రుతి "విశ్వతశ్చక్షుఋత” యంచుఁ బొగడు - స్తుతుల మీఱినయట్టి సూక్ష్మరూపంబు
[219]ఆదికి నాది నిత్యానందమూర్తి - శ్రీ దివ్యలింగమూర్తియ సుదైవంబు
నట్టి యీశ్వరునాత్మఁబట్టించి చేతఁ - బెట్టంగఁజాలిన పృథుదయామూర్తి
ప్రకటింప "నగురో రధిక” మనఁ బరగు - సకలస్వరూప మాసమయసద్గురుడు
మంత్రంబులకు రాజమంత్రమై వెలయు - మంత్రంబు దానికి మఱి షడక్షరియు
భవదూరమగు జటాభసితరుద్రాక్ష - సవిశేషమోక్షానుసారి వేషంబు

భువి జన్మపాపౌఘభూజకుఠార - మవిరళసత్క్రియాష్టాంగసద్భక్త
సందర్శనంబుల సకలపాపములు - డిందు మోక్షాంగన వొందుఁగావునను
నిది ఫలప్రాప్తి యింకిటమీఁద లింగ - పదసేవనోత్కృష్టభవ్యసౌఖ్యంబు
ఫలమిట్టిదని చెప్ప భావింప శ్రుతుల - తలమె జీవన్ముక్తి తత్త్వాత్మకంబు
కావున వేఱె మార్గంబుగాఁ జూడు - భావింప బ్రాహ్మ్యంబు భవునిభక్తియును
గలవండ్రు దర్శనంబులు నాఁగఁ గొన్ని - కలిసియుండునె మున్నొకండొకఁడందు
దర్శనంబులు గల్గఁ దలఁచి రేనియును - దర్శనంబది వేఱెతత్త్వరూపంబు
తలఁప నీశ్వరపదతల్లీయసౌఖ్య -ఫలకారణమె కర్మపాశబంధంబు
నిటుగాకయుభయము నేకమండ్రేని - యటుగాదువో నిటలాక్షుభక్తునకు
“ధర నన్యదేవతాస్మరణమాత్రమున - నిరువదెన్మిదిఁగోట్లు నరకంబు [220]లొందు”
నన శ్రుతు[221]లందును వినరె [222]బాపనికి - దినకరపావకదిక్పాలకులను
హరివిరించ్యాదుల నఖిలదేవతల - ధర మూఁడు సంధ్యలఁదాఁగొల్వవలయుఁ
గొలువక తక్కినఁ బొలిసె బ్రాహ్మ్యంబు - కొలిచెనేనియు భక్తి వొలిసెఁ గావునను
[223]బ్రాహ్మణుఁడేనియు భక్తుఁడెట్లగును? - [224]బ్రాహ్మణుఁడెట్లగు భక్తుఁడేనియును?
[225]మావిడిబీజంబు మహిమీఁద విత్తఁ [226]గా వే మగునె పెక్కుగథలేమి చెప్ప?
[227]సహజలింగైక్యనిష్ఠాయుక్తి భక్తి; - బహుదేవతాసేవ బ్రాహ్మణపథము;
కులసతియట్లు నిశ్చల యుక్తిభక్తి; - వెలయాలియట్టు లవ్విప్రమార్గంబు,
కాదేని నందిముఖ్యస్థితిఁ గొలిచి - యాదిదేవుఁడ [228]దైవమనుమంత్ర మెఱిఁగి
తా రుద్రవేషంబుఁ దాల్చెనేనియును - వారక యట్ల తా వర్తింపవలదె?
యిలువేలుపైన సర్వేశ్వరుఁ డుండఁ - బలువేలుపులఁగొల్వఁ [229]బాడియే చెపుమ?
కాన యిన్నియుఁ జెప్పఁగా బనిలేదు - దాన సందియమె గౌతముని దధీచి
వ్యాసుని [230]శాపంబు వహ్నిపాలైన - భూసురులకు భక్తి వొలుపొంద నగునె?
యురవడిచేసి భక్త్యుద్రేకములను - బరమార్ధ [231]మెడలంగఁ బలికె నా వలదు
ఇది శ్రుతిస్మృతి మూలమేకాని యొండు - పదక [232]వాదంబని భావింపఁజనదు
కర్మమార్గంబగుఁగాక బ్రాహ్మ్యంబు - నిర్మలశివభక్తి నిష్ఠితంబగునె?

ఇట్టి బ్రాహ్మణమార్గమిది దథ్యముగను - బట్టి యాడెదవేని వనియు లేదింకఁ
గాకులు వెంచిన కోకిలపిల్ల - [233]కాకులఁ బోలునే కావుకావనుచు
నెక్కడితల్లి మీ రెక్కడితండ్రి - ఎక్కడితోడు ధర్మేతరులార!
చెన్నయ్య మా తాత చేరమ తండ్రి - పిన్నయ కక్కయ్య బిడ్డ నే ననుచు
వేడుక సద్భక్తి విధి నుండువాఁడ - నేడుగడయు మాకు నిది నిక్కువంబు
మీయంత నుండుఁడు మీరును, నేను - నాయంత నుండెద వేయును నేల"?

బసవేశ్వరుని పెండ్లి


యనుచు సహోదరి యగు నాగమాంబ - యను దాను నచ్చోట నుండఁగాదనుచు
నరుదెంచె మఱి [234]పణిహారియింటికిని - నరులిది సోద్యమనంగ నంతటను
వడుగునకని మున్ను వచ్చినయతఁడు - పడఁతి మాదాంబకు భ్రాత సజ్జనుఁడు
పాండురాంగుని భక్తిపరుఁడు బిజ్జలుని - బండారి బలదేవదండనాయకుఁడు
“శివభక్తునకుఁ బెండ్లి సేయుదుఁగాని భవికి నీ” [235]ననుతొంటిబాసఁదలంచి
“ఇట్టిభక్తునకిప్పుడీక నా కూఁతు - నెట్టివానికి నిత్తు నింక నే” ననుచు
బసవకుమారునిపాలికిఁ బోయి - యెసక మెసఁగఁ గూఁతు నిచ్చి తా మ్రొక్కి
"నా బిడ్డఁ జేకొని నన్ను రక్షింప - వే బసవన్న! మాహేశ్వరతిలక!”
యనుచుఁ బ్రార్థన చేసి యా బసవయ్య - యనుమతంబునఁ బుర మభిరమ్యముగను
మకరతోరణములు మణితోరణములు - ముకురతోరణములు మును గట్టఁబనిచి
“గలయంగ వీథులఁ గస్తూరి యలుకుఁ - డెలమి ముక్తాఫలంబుల మ్రుగ్గులిడుడు
రండు భక్తులఁ బిలువుండు మీ రెదురు - [236]వొండు వేగమతోడి తెండు [237]తెండనుచు
నిట వచ్చునయ్యల కెదురు వచ్చుచును - నట వచ్చునయ్యలకర్థి మ్రొక్కుచును
సింహాసనస్థులఁ జేసి యాకర్మ - సంహారమూర్తుల చరణముల్గడిగి
యవిరళనవ్యపుష్పాంజలు లిచ్చి - ప్రవిమలధూపదీపంబులొనర్చి
యమ్మహాత్ములకు సాష్టాంగుఁడై యక్ష - ణమ్మ విభూతి వీడ్యమ్ములర్పించి
కోలాటమును బాత్రగొండ్లి పేరణియుఁ - గేళిక జోకయు లీల నటింపఁ
బాయక “చాఁగు! బళా!” యను శబ్ద - మాయతి నాకసం బంది ఘూర్ణిల్ల
నలిరేఁగి వేణువీణావాద్యవితతు - [238]లులియుచు లీలతో నొక్కట మ్రోయ
నానందగీతంబు లగ్గించువారు; - పూని శంకరగీతములు వాడువారు;

[239]జతిగీతములమీఁదఁ [240]జప్పట లిడుచు - [241]నతిశయశివభక్తి నాడెడువారు;
నాదిపురాతనాపాదితస్తుతులు - వేదార్థములుగాఁగ [242]వివరించువారు;
నెఱి శివమరులు [243]న గుఱిలేని వేడ్క - నఱిముఱి మిన్నంది యాడెడువారు;
మ్రొక్కి శివానందమునఁ దమ్ము మఱచి - నిక్కపుసుఖమున నిద్రించువారు;
నిఖిలమాహేశ్వరనికరంబు నిట్లు - సుఖలీలఁ గొలువున్నచో బసవయ్య
[244]యప్పాదజలముల నభిషిక్తుఁడగుచు - నొప్పుదివ్యాంబరయుగ్మంబు [245]సాతి
భసితంపునెఱపూఁత పలుచఁగాఁబూసి - నొసలఁ ద్రిపుండ్ర మొప్పెసఁగ ధరించి
మౌళిఁ బ్రసాదసుమంబులు దుఱిమి - పోలఁగ రుద్రాక్షభూషలు దాల్చి
సారమై లింగపసాయితం బనెడు - పేరను గల్గు కఠారంబు గట్టి
యానందబాష్పంబులలుఁగులు వాఱ - మేను రోమాంచ సమ్మిళితమై తనర
“బగుతులపాదుకాప్రతతులు నాకు - నగపడె” నంచు నందంద మ్రొక్కుచును
నొడయల కడుగులు వొడసూపనోడి - [246]మడఁచి వెన్కకుడాఁచి మహినప్పళించి
[247]యూరుల మోఁచేతులూఁది కేల్మొగిచి - వారక యొక్కింత వంగి యుప్పొంగి
తనతొంటి భావంబుఁ దాల్చినయట్టు - లనిమిషుఁడై కన్నులారఁ జూచుచును
భక్తిశృంగార మేర్పడఁ జూఱగొన్న - భక్తికళార్ణవు బసవయ్యఁ జూచి
“యిట్టి ధన్యుఁడ నౌదునే యిప్పు”డనుచు - దట్టుఁడు బలదేవదండనాయకుఁడు
తన కూఁతుఁ గామినీజనతిలకంబు - ననుపమశృంగారవనధి గంగాంబఁ
దోడ్తెచ్చి యట్ల భక్తులకు మ్రొక్కించి - యేడ్తెఱ శుభచేష్టలెదురుకొనంగ
శివభక్తవనితలు సేసలు [248]సల్ల - శివబలం [249]బగ్గలించిన ముహూర్తమున
వేదోక్తశివధర్మవిధి బసవనికి - గాదిలిసుతఁ బెండ్లి గావించె నంత
“నట్టిద కాదె మున్నాదిఁ [250]దలంపు - నిట్టట్ట నావల దిదియె పథంబు
హరునిభక్తులబలంబది లేమిఁగలిమి - హరివిరించులు ద్రుంగుదురు మందు రనినఁ
దక్కిన గ్రహచంద్రతారాబలముల - యెక్కువదక్కువలెన్న నేమిటికిఁ?
గరుణఁ జూచుటయ లగ్నంబు సేయుటయు - వరముహూర్తంబు దీవనయ బలంబు
గాన భక్తులకృప గలదు బసవని - కేనాఁట విందుమే యిట్టి పెండిండ్లు”

ననుచు లోకంబెల్ల నాశ్చర్యమంది - వినుతింపఁజొచ్చిరి వీరు వా రనక
అంత [251]భక్తాళికి నభిమతార్థములు - సంతుష్టిగాఁబరిచర్య లొనర్చి
సాష్టాంగుఁడై భువిఁజాఁగిలి మ్రొక్కి - శిష్టభక్తాళికిఁజేతులు మొగిచి
“యిల్లకప్పడి సంగమేశ్వరంబందుఁ – దెల్లంబు మా గురుదేవుఁడున్నాడు
చనియెద వారి శ్రీ చరణముల్ [252]గొలువఁ - గనియెద మిక్కిలి కరుణ మీ చేత”
ననుచు సోదరియును నాలును దానుఁ - జనియె నా బలదేవుఁడనుప వేగంబ
అప్పురి బసవఁడల్లంతటఁగాంచి - తప్పక గురుపదధ్యానాత్ముఁడగుచు
గురువున్నపురి దృష్టిగోచరంబైన - ధరఁజాఁగి మ్రొక్కుచు నరిగె నంతంతఁ
గన్నంత నుండి తాఁజన్నంతదవ్వు - నెన్న యోజనమాత్ర మెసఁగి మ్రొక్కుచును
'గుదురుగదా మున్ను గురుభక్తి శివున - కిది యెంతవద్ద దానితని వీక్షింప'
నని యెల్లవారలు నర్థిఁ గీర్తింపఁ - [253]జనఁ జొచ్చెఁ బురిగురుస్తవనంబుతోడ;
నప్పురిమహిమ దా నది యెట్టి దనినఁ - జెప్పఁగ నలవియే శేషునకైనఁ
బురియేఱులన్నియుఁ బుణ్యతీర్థములు - పరగంగ [254]గుహలెల్ల హరునివాసములు
గిరులన్నియును హేమగిరులు దలంపఁ - దరులెల్ల రుద్రాక్షతరువులు గలయ
వనములన్నియుఁ బుష్పవాటిక లచటి - గనులన్నియును భూతిగనులు [255]దెల్పార
[256]గొలఁకులన్నియు నొప్పు జలజాకరములు - కల గోవులన్నియుఁ గామధేనువులు
గోడెలన్నియు నందికుఱ్ఱ లాపురము - వాడలన్నియు రంగవల్లి వేదికలు
నరులెల్ల భక్తులు చిరజీవులెల్లఁ - బరికింపఁ గారణపురుషరూపములు
స్త్రీలెల్లఁ బరమపతివ్రతామణులు - నే లెల్ల [257]నవిముక్తనిధిసమానంబు
పలుకులెల్లను దత్త్వభాషలు జనుల - యులు వెల్ల గీతవాద్యోత్సవరవము
కల్లరి పతితుండు ఖలుఁడు దుర్జనుఁడు - ప్రల్లదుఁ డఱజాతి భక్తిహీనుండు
వికలుండుఁ గొండీఁడు వెదకిననైన - నొకఁడు కప్పడిసంగమేశ్వరంబందు
సడిసన్న కూడలిసంగమేశ్వరుని - గుడికేఁగి [258]తన్ను భక్తు లెదుర్కొనంగ
గుడిముందటను నిల్చిగురులింగమూర్తి - యడుగులకపుడు సాష్టాంగుఁడై మ్రొక్కి
వేదపురాణార్ధవిమలసూక్తులను - నాదంబు పూరించి నలిఁబ్రస్తుతింపఁ

సంగయదేవుఁడు బసవేశ్వరునకుఁ బ్రత్యక్షమగుట


దొల్లింటివేషంబుతో వచ్చి తేట - తెల్లగా సంగయదేవదేవుండు
గుడివెలిఁ బొడసూప గురులింగమూర్తిఁ - బొడఁగని బిట్టుల్కిపడి బసవండు
పెద్దయుఁ బ్రమదంబు [259]భీతియు భక్తి - దుద్దెక్కి తనలోనఁ [260]దొట్రుకొనంగ
నంతంత మఱియు సాష్టాంగుఁడై మ్రొక్కి - వింతవేడుక వెల్లివిరియ నగ్గురువు
చరణము లానందజలములఁ గడిగి - గురుపూజ తన్న కాఁగూడ నర్పించి
పడియున్న, నతిదయాభావామృతంబు - కడకంటఁ [261]గెడఁగూడఁగొడుకు లేనెత్తి
యందంద కౌఁగిట నప్పళింపంగ - ముందట మ్రొక్కుచు మోడ్పుఁగేలమర
నెలకొన్న తత్స్వర నేత్రాంగవిక్రి - యలు భూషణంబులై యాదట నున్న
బసవకుమారు సద్భక్తికి మెచ్చి - వెసఁబ్రసాదంబప్పుడొసఁగి యిట్లనియె;
“వచ్చినపోయినవారిచే నీదు - సచ్చరిత్రము విని సంతసిల్లుదుము
గతకాలవర్తనకంటె సద్భక్తి - మితిదప్పి నడవకు మీ బసవన్న!
శూలి [262]భక్తాలి దుశ్శీలముల్ గన్న - మేలకాఁ గైకొను మీ బసవన్న!
శత్రులైనను లింగహితులై యున్న - మిత్రులకాఁ జూడు మీ బసవన్న!
పట్టినవ్రతములు ప్రాణంబుమీఁద - మెట్టిన విడువకు మీ బసవన్న!
వేఱుభక్తులజాతి వెదకకుండుటయె - మీఱినపథము సుమీ బసవన్న!
చిత్తజాంతకుభక్తిఁ జెడనాడుఖలుల - [263]మృత్యువుగతిఁ ద్రుంపు మీ బసవన్న!
వేదశాస్త్రార్థసంపాదితభక్తి - మేదిని [264]వెలయింపు మీ బసవన్న!
తిట్టిన, భక్తులు కొట్టినఁ, గాల - మెట్టిన, శరణను మీ బసవన్న!
యేఁ దప్పువట్టుదు నిలఁ బర స్త్రీల - మీఁదఁ గన్నార్పకు మీ బసవన్న!
సాధ్యమౌ భక్తప్రసాదేతరం బ - మేధ్యంబకాఁ జూడు మీ బసవన్న!
నిక్కంపుభక్తికి [265]నిర్వంచకంబు - మిక్కిలి గుణము సుమీ బసవన్న!
ఏ ప్రొద్దు జంగమం బేనకాఁజూడు - మీ ప్రసాదముఁ [266]గొను మీ బసవన్న!
నాలుక కింపుగా శూలిభక్తులను - మేలకా నుతియింపు మీ బసవన్న!
యేమైన వలసిన [267]యెడరైనఁదలఁపు - మీ మమ్ము మఱవకు మీ బసవన్న!
మోసపుచ్చు శివుండు బాసలేమఱకు - మీ సత్య మెడపకు మీ బసవన్న!
అని మృదుమధురాంచితాలాపములను - దనయుఁబ్రబోధించి తాఁగౌఁగిలించి

కొడుకుచే మ్రొక్కించుకొని గురుమూర్తి - గుడిఁజొచ్చి తొంటికైవడిన యున్నెడను
నందఱు నతివిస్మయాక్రాంతులగుచు - నిందుమౌళియ కాక యితఁడు మర్త్యుండె?
యెన్నఁడే గుడికడ [268]నీతపస్వీంద్రుఁ - గన్నవారెవ్వరుఁగలరయ్య! తొల్లి
బసవండు తనకెంత భక్తుఁడో కాక - యెసకంబుతో సంగమేశుండు దాన
వచ్చి తాపసిక్రియ మెచ్చి బోధించి - [269]చొచ్చె నగ్గుడియ తా నెచ్చనో(?) యణఁగె
అతికృతకృత్యులమౌదుమే యిట్లు - స్తుతియింపఁ గనుఁగొనఁజొప్పడె నేఁడు
[270]బాపురా! మాయన్న! బసవకుమార! - [271]బాపురా! మాతండ్రి! భక్తివర్ధనుడ!
నల్లవో! బసవన్న! నందీశమూర్తి! నల్లవో! బసవయ్య! ముల్లోక[272]వంద్య!
ఇట్టుండవలవదా పుట్టినఫలము - యెట్టును నున్నార మే మేమికొఱయుc?
దనయు నొప్పించి వస్త్రము సమర్పించి - వనిత నియోగించి జనకునిఁ ద్రుంచి
పడసిరాద్యులు దొల్లి బసవఁడిట్లిపుడు - పడయునే శివుకృప బట్టకబయల”
అని యెల్లవారును [273]నంకింపుచుండ - ననురాగచిత్తుఁడై యా బసవయ్య
కూడలి సంగయ్య గుడిమంటపమునఁ - గూడి భక్తావలి గొలు విచ్చియుండఁ
సారాంచితోక్తుల సంస్తుతింపుచును - బూరితంబుగ నాదపూజ సేయుచును
మూఁడుసంధ్యల గురుమూర్తిఁగొల్చుచును - [274]బోఁడిగాఁ బ్రొద్దులు వుచ్చుచునుండె
బసవ పురాణార్థపరిచయస్ఫీత! - బసవపురాణార్థపరిమళాఘ్రాత!
[275]బసవనామావళి పరమానురక్త! - బసవనామావళి పాటకాసక్త!
బసవపాదాంభోజ పరిమళభృంగ! - బసవపాదాంభోజభరితోత్తమాంగ!
బసవకారుణ్యసౌభాగ్యైకపాత్ర! - బసవకారుణ్యసంపత్కళా[276]మాత్ర!
బసవసన్నిహిత సద్భక్తాత్మసఖ్య! - బసవసన్నిహిత సద్భావనంగాఖ్య!
ఇది యసంఖ్యాతమాహేశ్వర దివ్య - పదపద్మసౌరభ భ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోపభోగ - సంగత సుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగ ఘన కరస్థలి విశ్వనాథ - వర కృపాంచితకవిత్వస్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మనుకథయందు - ననుపమంబుగఁ బ్రథమాశ్వాసమయ్యె.

  1. వజ్ర
  2. నదేవుఁ దెల్లఁ
  3. కొన్ని శాసనములందును, వ్రాఁతలందును 'బసువ'పదము కలదు. బసవపురాణము పండితారాధ్యచరిత్రము మొదలగు గ్రంథముల వ్రాఁతప్రతులలో రెండురూపములును గానవచ్చుచున్నవి. కాని, సోమనాథుడీ బసవపురాణమునను బండితారాధ్యచరిత్రమునను యతిస్థలమున బసవపదమునే ప్రయోగించెను. “శరణోపకార బసవపురాణార్థ-వరభుక్తిముక్తిసంవర్ధన చరిత” (7వ యాశ్వాసము తుద. బసవపురాణము). “చరితంబులును శ్రీబసవపురాణంబు - చాతుర్య మొసఁగ బసవదండనాథు గీతంబు” (పండితా. అయిదవ ప్రకరణము. 61-62 పుటలు) ఈతఁడే సోమనాథభాష్యమున బసవ, బసువ, పదములు రెండును సాధువులే యనియుఁ జెప్పినాఁడు. “-వృషభస్య బసవనామకత్వం కస్మా త్కారణా దాసీదితి. వృకారస్య బకారాదేశో భవతి. వబయో రభేద ఇతి. 'శషోస్స' ఇతి సూత్రాత్ ష కారస్య సకారాదేశో భవతి. వః పవర్గతేతివారరుచ్య సూత్రాత్ బ (భ-అనియుండవలెను) కారస్య వకారాదేశో; భవతి, ఏతద్వృషభాక్షరతద్భవాత్ “బసవ” ఇతి నామ వక్ష్యతే. సాక్షాద్వృషభేశావతార ఇత్యర్థః. పశూన్ పాతీతి పశుపః, వృషభః, తత్పశుప (పే) త్యక్షరత్రయతద్భవాత్ బస(సు అని యుండవలెను) వ ఇత్యక్షరత్రయం సంభవతి”— సోమనాథభాష్యము రెండవపుట.
  4. లోన
  5. శ్రీమహాదేవుని
  6. నాశ్రమ
  7. దొల్కాడ
  8. వితధైశ్వర్య
  9. యుఁ బనుగొన
  10. ఓలిమై గ్రామ
  11. నసదృశంబవు కనున్నవడసి
  12. నిగమాంత
  13. ఈతఁడే యనుభవసారకృతిపతి.
  14. జిలిబిలి. వినుకలి సుఖము సిల్విలివోవునంత - పండి-4ప్రక.
  15. నట్లొక్క
  16. డును
  17. వెరవెఱుఁగించి, ఇట్లు కొన్ని చోట్లఁగలదు.
  18. ఇట్టిచోట్లఁగూడఁ గొన్నిప్రతులలో నర్ధానుస్వారము కానవచ్చును. కాని పెక్కుప్రతులలో లేకపోవుటచేతను, బూర్ణానుస్వారరూప మెక్కడను గానరాకుండటచేతను, దాని నిక్కడఁ జేర్పలేదు.
  19. బచరించు శక్తి
  20. వేద
  21. కనుగలం
  22. యనఁగఁ బరగువేదోక్తి
  23. జనా
  24. 'జంగమవర కుమారుండ' అని యొక ప్రతి
  25. బాప
  26. దేవుని
  27. స్థలము విశ్వేశు
  28. వడుగాము, వడుగామి
  29. వర్జితుఁడ
  30. నాఁగ
  31. ఈ ద్విపద కర్థమస్పష్టముగా నున్నది. 'సోలకు' అని యుండవలెనేమో!
  32. కంటెఁ
  33. ముల్ మెఱసి
  34. సకల
  35. లోని
  36. ననఁగ
  37. తప్పునా
  38. భాగ్యంబు లొందు
  39. బసలారు
  40. వేయేమి
  41. బిలనొక్క
  42. నిరాకారమైయున్న
  43. రమై
  44. రమై
  45. పేర్వేఱు, పెదపెద్ద
  46. దాసుఁడు-అనవలసినచోట నీతఁడు 'దాసి' యని ప్రయోగించుచు. “విష్ణుఁబాసి వ్యాసుఁడు శివుదాసి గాఁడె,” “నుతికి మెచ్చిచ్చెఁ గన్నులు గాళిదాసికి,” “నీదాసి నీలెంక నీడింగరీఁడ” చతుర్వేదసారసూక్తులు. “చెన్నారఁ గాళిదాసియు శివుచేతఁ గొన్న-(కాళిదాస కవినిగూర్చి) పండితారాధ్య4.ప్రకరణము 31పుట
  47. జెప్పు డీశ్వరునకెక్క
  48. పు
  49. బసవని నెవరికి నెఱుంగ
  50. రుమహిమ
  51. ప్రబలు
  52. తునా గానాఁ
  53. భక్త
  54. ని బేర్కొన్న
  55. దారలు (తప్పనదారులు?)
  56. వీటఁబో
  57. మాలఁగను
  58. నిక్కథవిధ
  59. పెక్కుప్రతులలో నీ ద్విపదము కానరాదు.
  60. మానవ
  61. 'సంకథా' అని యుండఁదగును.
  62. ఁడగు
  63. కన్నెర్గి యతని; కన్నెఱింగతని
  64. తత్సమధాతువులకుఁగూడ శత్రర్థమున 'నింపు' గలదు.
  65. నీవు
  66. మోడ్చి
  67. తత్పరత్వమున
  68. బాధకు
  69. మఱుపడ్డ
  70. యని
  71. బోధింపఁబడును
  72. భక్తవత్సలుఁడైన
  73. యిండని
  74. అంబుజనేత్రి యనుట పాణినీయముచొప్పున సరికాకున్నను, దెలుఁగున ననేకకవీశ్వరు లట్లే ప్రయోగించిరి.
  75. మిందొకటి
  76. డు నాఁగఁ; డనాఁగఁ
  77. దివసేంద్రురశ్ములును
  78. రారి
  79. రూప
  80. లింగశివదేవమాకు-నే
  81. నీ
  82. త్తుణ
  83. నున్నెడ
  84. మీ
  85. భక్తికి నణు
  86. యైనను
  87. దున్మి
  88. నెట్టన
  89. మున
  90. ధర్మువునన వెలసిత
  91. మగుచు
  92. మాభక్తి
  93. యెక్కుడు
  94. యానతిఁబోయి
  95. శంభుఁడవనఁ
  96. కాకంచునానంద
  97. ఇట్టి రూపము భారతమందున్నది “దరకొని తెగఁగాల్చునట్టిదయ యగుఁజుమ్మీ!” - ఉద్యోగ. ద్వీ-ఆ. ప 197.
  98. ద్రొ
  99. డి
  100. జోరన
  101. వలగొని
  102. లెత్తుక
  103. నేఁటికి
  104. యట్టి
  105. నందికేశ్వరుచేయు
  106. కొండొక
  107. యొడిఁబడు
  108. పే రాతఁ డడుగునే
  109. మా కన్నులాన మా భక్తులార
  110. లక్ష్మి
  111. దొ
  112. నిగ్గిండి
  113. నాకుఁన
  114. ధరణిఁ జాఁగిలి
  115. కెలమీనొఁడొకఁడె
  116. సత్త్వ
  117. భరింపంగ
  118. మహేశ
  119. కనుగలం
  120. ముంచుచు
  121. నుదర
  122. ధర్మ, పుణ్య
  123. నీక యెక్కుడుఁ
  124. నిట్టట్టనా
  125. గేల్మొగ్చి
  126. మేదినిఁబ
  127. ఇట్టిప్రాసముల నీ కవి పెక్కుచోట్లఁ బెట్టియున్నాఁడు.
  128. నీ తోడ
  129. దారువోకుండ
  130. నను
  131. సను
  132. భాగవాడ, భోగవాడ
  133. లోనెల్ల, లోపల
  134. ఈ కవి యిట్లు స్త్రీలింగ రూపముండవలసినపట్లఁ బుంరూపముకూడఁ బ్రయోగించును.
  135. లొగిఁ గొన్ని
  136. గట్టి
  137. మువ్వలు
  138. గొరిజెలును
  139. వెట్టి
  140. ప్రోక
  141. ప్రకరంబు కెల్ల
  142. నందన్న
  143. బ్రసాదించినంత
  144. నోఁచె
  145. మంకురించె
  146. గు
  147. నకో
  148. వెల్లనొందె
  149. గప్పారె
  150. నను
  151. చెల్వమొందె
  152. క్రీడా
  153. తేలనాడుచును
  154. 'నాటు' నిరనుస్వారముగా శబ్దరత్నాకరమందున్నది. వ. మీటుగలరథికులను నొక| నాటికి వేవురవధింతు నరుశరములు నో| నాటి పడవైచునంతకు| వేటాడెదఁ బ్రతిబలంబు వీరులనెల్లన్. భార. ఉద్యో. 4ఆశ్వా. ఈ పద్యమునుబట్టి శబ్దరత్నాకరకారులు నిరనుస్వారతను నిర్ణయించిరి. కాని దీనిఁబట్టియే సానుస్వారత సాధితమగుచున్నది. పయికందము నాల్గుచరణములందు ననుస్వారముండఁదగును. 'నాటు'లో ననుస్వారము కలదని పయిద్విపదప్రయోగము కూడఁ జెప్పుచున్నది. భీమఖండమం దీ క్రింది ప్రయోగముగూడ నున్నది. “నాఁటె మందారతరువులతోఁటలందు-” 4 ఆశ్వా.
  155. సంబంధమైనట్టి
  156. శాంతర్వ్యోమ
  157. ఈ కవి యిట్టిప్రాసము మఱికొన్నిచోట్లఁగూడఁ గూర్చినాఁడు.
  158. మూఁడేండ్లు మున్న
  159. నిఖిలంబు నెఱుఁగ
  160. తుకలెల్ల
  161. నన్నెంత
  162. యల్లడ
  163. యయ్య!
  164. వలన
  165. వరము పాలొడలి
  166. యెర(రి)పు
  167. నుహ్హని
  168. జెందంగ
  169. కప్పు డిట్లానతియిచ్చె
  170. ముందె; మదె
  171. చూచుడుఁ
  172. యేతెంచెఁ గాఁబోలు
  173. దెలియఁ జెప్పుచును
  174. యఱయు లేకుండంగ
  175. గుర్వా
  176. మకో!
  177. ళము
  178. గొడుగు
  179. డాల(?)
  180. లానచూ! యంచుకయైనఁ గుడ్సినను
  181. తా ననఁగ
  182. పరగుటఁ జేసి
  183. పాంగ్య, పాంక
  184. మొప్పఁగ
  185. చూరక
  186. యాను
  187. గూల, దూల
  188. చెలఁగి యాడుగతిఁ జేతులు విచ్చి యాడు
  189. జూడ
  190. బడమొదల్వెట్టు
  191. మర్వు(ఱు)
  192. దొంగి
  193. దట్టడుగులు(?)
  194. ద్రొక్కు
  195. వినోదంబులాట
  196. దలఁచి
  197. గానఁ
  198. మాలమి(ర్మి) గాదె
  199. కర్మంపుఁద్రాళ్లు
  200. వంశజుఁ
  201. చుటె; చితె
  202. జేయుటె, జూసితె
  203. లేల
  204. వన్న! బసవన్న!
  205. మార్గమున
  206. నందిముఖం
  207. కూఁకటల్
  208. 'పసుబిడ్డ' అని యితరగ్రంథములందున్నది.
  209. నుండంగఁ
  210. నెట్టన్న
  211. నాయన్న!
  212. గ్రుంగు
  213. వెలితి సేయరె ని(న)న్ను
  214. యీ నీతియుఁ గులము
  215. వేనియును
  216. బదరెదు
  217. వేద
  218. దైవమన్నది
  219. “అదిగాక మహిమదా నది యేమి చెప్ప” ఈ చరణ మొక ప్రతీలో నున్నది.
  220. లయ్యె
  221. లెందును
  222. బ్రాహ్మనికి
  223. బ్రాహ్మఁడేనియు వెండి
  224. బ్రాహ్మఁడెట్లగు మున్ను భక్తు
  225. మామిడివిత్తు దా మహిమీఁదవిత్త
  226. వేమగునే పెక్కువిధు లేల చెప్ప
  227. సహజైకలింగ
  228. దేవుఁడను
  229. బాపంబు గాదె, పాటియే చెపుమ
  230. శాపంపుటగ్గి
  231. మెఱుఁగక
  232. వాక్యం
  233. కాకులువోలెఁ దాగావుకావనునె! ఎ.
  234. హారునింటికిని
  235. నని
  236. కొండు
  237. లెం
  238. లొల
  239. జగతీతలము
  240. జప్పటు
  241. నగణిత
  242. వినుతించు; విరచించు
  243. లన
  244. యప్పాట
  245. సాఁతి
  246. మడిఁచి
  247. యూరువుమోఁచేత నూని
  248. వెట్ట
  249. బంగవించిన
  250. దిఁదలంప
  251. భక్తావళి కభి
  252. గొలిచి
  253. జనిచొచ్చెఁ
  254. గుళ్ళెల్ల
  255. వొల్పార
  256. కొలను
  257. నదిముక్తినిధి
  258. తనుభక్తు లెదురుకొనంగ
  259. బ్రీతియు
  260. దొట్రి, దొప్పి
  261. నొడఁ
  262. శాసను”, లాంఛనుల
  263. మిత్తిగవైత్రుం
  264. మెఱయింపుమీ
  265. నిర్వంచకతయె
  266. గుడ్వుమీ
  267. యెడలను
  268. తనరాజు
  269. చొచ్చియు ... నెచ్చటో?
  270. బాపురే
  271. బాపురే
  272. కీర్తి ఈ సమాసము నీతఁడు పెక్కుచోట్లఁ బ్రయోగించినాఁడు. "ముల్లోకనాథుని ముట్టంగఁగొలిచి” పండితా. ఇతరకవులుకూడ దీనిఁ బ్రయోగించిరి. “ముల్లోకవిభుండు సక్రి” ఓపిలిసిద్ధి శాసనము.
  273. వినుతింపుచుండ
  274. బోఁడిమిగాఁ బ్రొద్దువుచ్చును
  275. బసవాక్షరత్రయ
  276. మిత్ర