బసవపురాణము/పీఠిక

వికీసోర్స్ నుండి

బసవపురాణము - పీఠిక

తొలుదొలుతఁ దెలుఁగున ద్విపదరూపమున బసవపురాణమును వెలయించిన కవీశ్వరుఁడు పాల్కురికి సోమనాథుఁడు. బసవపురాణమును బద్యకావ్యముగా రచియించినవాఁడును, సోమనాథుని శిష్యుఁడగు శివరాత్రి కొప్పయ్య కాఱవతరమువాఁడును, సోమనాథుని గ్రంథములను బఠనపాఠనాదిరూపమునఁ బ్రచారమునకుఁ దెచ్చుచున్నవంగడము వారిలోనివాఁడును నగు పిడుపర్తి బసవనకవి తన బసవపురాణపీఠికలో సోమనాథుని చరిత్ర మీ క్రిందివిధముగాఁ జెప్పినాఁడు :

పాల్కురికి సోమనాథుని చరిత్రము

“శివాజ్ఞ చొప్పున భృంగి బసవపురాణమును లోకమున వెలయించుటకై పాల్కురికి సోమనాథకవిగా నవతరించెను. అతనిశక్తి యిట్టిది:

సీ. లిపి లిఖింపకమున్న యపరిమితార్థోక్తి, శక్తి యాతని జిహ్వ జరగుచుండు
    ఛందోధికరణాది సరణిఁ జూడకమున్న, మదినుండుఁ గావ్యనిర్మాణశక్తి
    భాష్యసంగతులు చెప్పకచూడకయమున్న, రుద్రభాష్య క్రియారూఢి వెలయు
    తర్కశాస్త్రాది విద్యలు పఠింపకమున్న, పరపక్షనిగ్రహప్రౌఢి వెలయు

గీ. నతని నుతియింప నాబోఁటికలవియగునె, జైనమస్తకవిన్యస్తశాతశూల
    కలితబిజ్జలతలగుండుగండబిరుద, శోభితుఁడు పాల్కురికి సోమనాభిధుండు.

ఒకనాఁడు శివభక్తు లోరుఁగంటిలో స్వయంభూదేవుని యాలయము మంటపమునఁ గూరుచుండి బసవపురాణమును వినుచుండఁగాఁ బ్రతాపరుద్ర చక్రవర్తి యీశ్వరదర్శనార్థమై యక్కడి కరిగి యదిచూచి " ఈ సంభ్రమ మేమి” యని యడిగెను. వారు “బసవపురాణమును వినుచుంటి” మనిరి. “బసవపురాణమనఁగా నెట్టిది” యని మరల రాజడిగెను. “ఈ నడుమఁ బాల్కురికి సోమనాథుఁడను పతితుఁడు (ప్రాసవళ్లు) వెట్టి ద్విపదరూపమునఁ గల్పించెను. అది యప్రామాణికము, అనాద్యము.” అని యొకధూర్తవిప్రుఁడు రాజుతో దాన్నిఁ గూర్చి తెగడి పలికెను. రాజంతట నటనుండి యరిగెను. పురాణమును వినుచున్న శివభక్తు లా ధూర్తవిప్రునిఁ జంప ననుజ్ఞఁ బడయుటకయి పాల్కురికిపురమున నున్న సోమనాథునికడ కేఁగిరి. వారి యభియోగమును విని సోమనాథుఁడు దా నూరకున్నచో భక్తులకుఁ దలవంపు కాఁగలదని యాగ్రహించి భవులతో సందర్శన సంభాషణ సంబంధము లేనివాఁడయినను విధిలేక వివాదమునకు సిద్ధపడెను. అల్పమానవునిచే నా ధూర్తవిప్రుని గెలిపించెదనని ప్రతిన పూనెను. లింగముద్రలు గల యెడ్లను గట్టిన గుడారుబండిలో నెక్కి శిష్యులతో సోమనాథుఁ డోరుఁగంటికి బయలుదేరెను.

వీరిరాక నోరుఁగంటిలోని ప్రతివాదు లెఱిఁగి యల్లరిగాండ్ర గొందఱ గుమిగూర్చి లింగముద్రలు దగిలించి సోమనాథు నెదుర్కొనఁ బంపిరి. వాండ్రట్లు వచ్చి సోమనాథునకు మ్రొక్కఁగాఁ గృత్రిమముగాఁ దాల్చిన లింగచిహ్నములు వాండ్రకు సహజములయ్యెను. అంతవారును సోమనాథుని శిష్యులై వెంబడించిరి.

సోమనాథాదు లోరుగంటి కోటగవనికిఁ జేరవచ్చిరి. బండియెడ్లు గజలక్ష్మి విగ్రహమును జూచి లోనికిఁ జొరవయ్యెను. సోమనాథుఁడు తొలఁగిపొమ్మని పలుకఁగా నా విగ్రహము తునిసి నేలఁబడెను. అది విని ప్రతాపరుద్రుఁడును, ప్రత్యర్థులును భయపడి వచ్చి విధేయులై సోమనాథునకు నమస్కరించిరి. అతఁడు వారి నాశ్వాసించెను. కొన్నిదినము లక్కడ భక్తుల ప్రార్థనమున నివసించెను.

త్రికాలవేదిగాన సోమనాథుఁడు పిడుపర్తి శివరాత్రి కొప్పయ్య మొదలగు శిష్యులఁ బిలిచి “యీ దేశ మిఁకఁ గొలఁదికాలమునకుఁ దురుష్కాక్రాంతము గాఁగలదు. మాబోఁటి నియమస్థుల కిక్కడ నుండరాదు. మీకొఱకై యీ రాజ్యమున నొకగ్రామము సంపాదించియిత్తును” అని తెలిపి తన శిష్యుఁడును బ్రతాపరుద్రుని మంత్రియునగు నిందుటూరియయ్యన్నను బిలిచి, యాయన మూలమున దోకిపర్తి నగ్రహారముగాఁ బడసి, యందు శిష్యులతోఁ గొంతకాలము వసియించెను. పదపడి యాతఁడు "నాకు వార్ధకము గదిసెను. ఇఁక బాహ్యకర్మములు మాని సమాధిస్థితిని బడయుదు” నని శిష్యులకుఁ దెలిపి యాంధ్రదేశము వీడి కర్ణాటదేశమున శివగంగాక్షేత్రము చేరువను గల 'కలికె' మను నగ్రహారమునకుఁ జేరెను. అక్కడ నొక సమాధి గల్పింపఁజేసికొని యందు దిట్టముగా విభూతిఁబోయించి దానిపైఁ గూర్చుండి తన శరీరమును గావ శిష్యులను నియమించి యాయతప్రాణుఁడయ్యెను. కొంతకాలమునకు శివుఁడు ప్రత్యక్షమై కైలాసమునకుఁ గొంపోయెద రమ్మనియెను. "సమాధిని దెఱచి యితరు లెఱుఁగకుండఁ గొంపోయెదవేని సమాధిని వీడి సోమనాథుఁ డెక్కడికేని పాఱిపోయె నందురు. సమాధిని దెఱవక కొనిపోయెదవేని సమాధిలో నాతఁడు క్రుళ్లిపోయెనందురు. ఈ రెండపవాదములును బుట్టకుండ నన్నుఁ గొంపొమ్ము. భవిని జూడనను నానియమము దప్పిపోకుండునట్లును, భూమిజనులు నీరూపులో నారూపును జూచునట్లును, నాకుఁ బ్రియమయిన నందిరూపును స్ఫటికమయముగాఁ దాల్చి తద్గర్భమున నన్నుఁజేర్చుకొని లోకులకు సందేహము దీఱునట్లు నాసమాధిపైఁ గొంతదడవు కానవచ్చి భక్తజనులు ప్రస్తుతింపఁగా నన్ను నీలోకమునకుఁ గొనిపొమ్ము" అని ప్రార్థించెను. అంగీకరించి శివుఁడట్లే యాచరించెను.”

పయివిషయములు సోమనాథుని శిష్యున కాఱవతరమువాఁడు చెప్పినవి. ఈ చెప్పినవాఁడు క్రీ.1480 కిఁ దర్వాతివాఁడు. ఇవిగాక సోమనాథుని కృతులను బట్టియుఁ దత్కాలమువారగు మఱికొందఱు కవుల కృతులను బట్టియుఁ గూడ సోమనాథుని చరిత్రము గొంత గుర్తింపనగు చున్నది. వాని నిఁకఁ బరిశీలింతము.

సోమనాథుని కాలము

పిడుపర్తి బసవన కాకతీయప్రతాపరుద్రుని కాలమున సోమనాథుఁడు వర్తిల్లెనని చెప్పినాఁడు. ప్రతాపరుద్రుఁడని పేరు క్రీ. 1292 నుండి 1326 దాఁక నంధ్రదేశమును బరిపాలించిన ప్రతాపరుద్రదేవునకే చెల్లుచున్నది. క్రీ. 1132 నుండి 1198 దాఁక రాజ్యమేలినవాఁడు కాకతీయ రుద్రదేవుఁడు వేఱొకడున్నాఁడు. ఈతఁడు ప్రతాపరుద్రదేవుని యమ్మమ్మతండ్రి యగు గణపతిదేవునికిఁ బెద్దతండ్రి. ఈతనిఁ బ్రథమప్రతాపరుద్రుఁడని సామాన్యముగా నేఁటివారు గొందఱు పేర్కొనుచున్నారు గాని రుద్రదేవుఁడనియే యీతనిపేరు. పిడుపర్తి బసవన్న యని పేర్కొన్నవాఁడు క్రీ. 1292 నుండి 1326 దాఁక రాజ్యమేలిన ప్రతాపరుద్రదేవుఁడు కావలెను. “ఇఁక నల్పకాలములో రాజ్యము తురుష్కాక్రాంతము గానున్నది” అని సోమనాథుఁ డన్నాఁడన్న బసవన్న రచన కాతఁడయినచో నిర్వాహమేర్పడును.

మఱియుఁ బ్రతాపరుద్రుఁ డొసఁగిన దోకిపఱ్ఱగ్రహారము కొంతకాల మయిన పిదప సోమనాథుని శిష్యసంతతియగు తమ పూర్వులకుఁ జెల్లకపోఁగా సోమనాథుని శిష్యుఁడయిన శివరాత్రి కొప్పయ్య మనుమఁడగు సోమయ్య ప్రౌఢరాయలచేత నాయగ్రహారమును బునఃప్రతిగ్రహము గాంచెననికూడ స్వవంశవృత్తాంతమునఁ బిడుపర్తి బసవన చెప్పుకొన్నాఁడు. ప్రౌఢరాయఁడు క్రీ. 1430 వఱకుఁ బరిపాలించెఁ గాన యాతనిచే నగ్రహారముఁ బడసిన వాని తాత క్రీ. 1326 దాఁక రాజ్యమేలిన ప్రతాపరుద్రదేవుని కాలమున నున్నవాఁడే కావలెను.

మఱియుఁ క్రీ. 1168 వఱకు జీవించియున్న బసవేశ్వరునియు, నటుతర్వాతఁ గొలఁది దినములకు లింగైక్యమందిన మల్లికార్జునపండితారాధ్యులయు జరిత్రములను గథాకోవిదులయిన వృద్ధులవలన విని బసవపురాణమును, బండితారాధ్యచరిత్రమును నద్బుతోత్తరములయిన మాహాత్మ్యప్రశంసలతో రచియించిన సోమనాథకవి బసవేశ్వరునకును, బండితారాధ్యునకును నూఱు నూటయేఁబది యేండ్లకుఁ దర్వాతివాఁడగుననుటయే సంగతముగా నుండును. పయిసాధనములను బట్టి చూడఁగా సోమనాథుఁడు ప్రతాపరుద్రదేవుని కాలము (1292 - 1326) వాఁడే యగుననిపించును. కాని, యింతకంటెఁబ్రబలము లయిన ప్రమాణములు గొన్ని సోమనాథుఁడు (ప్రథమ) రుద్రదేవుని నాఁటి (1132 - 1198) వాఁడే యని నిరూపించుచున్నవి.

కర్ణాటభాషలో సోమరాజనుకవి యుద్భటకావ్యమని యొక ప్రబంధమును రచించెను. అందాతఁడు :

మ. ప్రమథానీక కథార్ణవేందు హరిదేవాచార్యనం ధైర్యనం
     సముదంచద్వృషభస్తవామరమహీజారామనం సోమనం
     విమలజ్ఞాన సుదీపికాస్ఫురితచేతస్సద్మనం పద్మనం
     క్రమదిందం బలగొండు పేళ్వెనొసెదా నీ కావ్యమం సేవ్యమం.

అని హరిదేవాచార్యుని, వృషభస్తుతి నెఱపిన సోముని, పద్మరసును స్తుతించినాఁడు. ఈ సోమరాజు తన గ్రంథరచనాకాలము నిట్లు చెప్పుకొన్నాఁడు:

మ. జననాథోత్తమ సోమరాజను సిర్దీ కావ్యం వలం శాలివా
     హన శాకాబ్దమదెయ్దె సాసిరదనూఱిం సంద నాల్వత్తు నా
     ల్కనె యారంజిత చిత్రభానువ వరాశ్వీజోత్సితైకాదశీ
     వనజాతారి తనూజవాసరదొ ళాదత్తల్ల మంగర్పితం.

శక.1144 (క్రీ.1222) లో నది రచితమయ్యెను. పాల్కురికి సోమనాథుఁడీ కాలమునకుఁ బూర్వుఁడు గావలసియున్నాఁడు. కర్ణాటకవిచే స్తుతింపఁబడిన సోముఁడు వేఱొకఁడు గావచ్చుననఁగాదు. వృషభస్తుతి నెఱపిన సోముఁడితఁడే కాని వేఱొకఁడు లేఁడు. బసవపురాణాది గ్రంథరచనముచే క్రీ. 1200 నాఁటికి సోమనాథుఁడు ప్రఖ్యాతి కెక్కియుండెనని యిది చెప్పుచున్నది.

సోమరాజకవి సోమనాథుని స్తుతించుటచేతనేకాక మఱికొన్ని సాధనముల చేతఁగూడ సోమనాథుఁడు రుద్రదేవునికాలము (క్రీ 1198 వఱకు) వాఁడనియే యేర్పడుచున్నది.

“జంగమరత్నంబు శరణసమ్మతుఁడు, లింగైక్యవర్తి గతాంగవికారి
పండితారాధ్య కృపాసముద్గతుఁడు, మండితసద్భక్తి మార్గప్రచారి
విలసితపరమ సంవిత్సుఖాంభోధి, నలిఁ గరస్థలి సోమనాథయ్యగారు.”

మొదలగు భక్తులను వేఁడి బసవపురాణ కథావృత్తాంతమును దాను దెలిసికొన్నట్లు సోమనాథుఁడు బసవపురాణమునఁ జెప్పుకొన్నాఁడు. మీఁది ద్విపదలలోఁ గరస్థలిసోమనాథయ్య 'పండితారాధ్యకృపాసముద్గతుఁ'డని కలదు. పండితారాధ్యులవారి శిష్యుఁ డనియేని, లేక తదనుగ్రహమున జనించినవాఁ డనియేని దాని కర్దమగును. తచ్ఛిష్యుఁ డనుటే యుక్తతరము. పండితారాధ్యుఁ డనఁగా మల్లికార్జున పండితారాధ్యుఁడే. ఆయన శిష్యుఁడయిన కరస్థలి సోమనాథయ్యకుఁ బాల్కురికి సోమన సమకాలమువాఁడని దీనివలన నేర్పడుచున్నది.

పండితారాధ్యులవారు బసవేశ్వరుని దర్శింపను గళ్యాణకటకమునకుఁ బ్రయాణమై వచ్చుచుఁ ద్రోవలో వనిపురమనుగ్రామమున నుండఁగా నాఁటి కెనిమిది దినములకుముందు కప్పడిసంగమేశ్వరమున బసవేశ్వరుఁడు లింగైక్యమందెనన్న వార్త వినవచ్చినట్లును, బసవేశ్వరనిర్యాణమునకుఁ బండితారాధ్యుఁడు మిక్కిలి విలపించినట్లును, వనిపురము శంకరయ్య యను భక్తునితో నక్కడనుండియే శ్రీశైలమున కరిగినట్లును బండితారాధ్యచరిత్రమునఁ గలదు. శ్రీశైలమున కరుగునాఁటికిఁ బండితారాధ్యుఁడు కడువృద్ధుడు. శ్రీశైలము చేరిన తరువాతఁ గొలఁదిదినములకే శివరాత్రి పుణ్యదినోత్సవము జరపి పండితారాధ్యుఁడు లింగైక్యమందెను. బసవేశ్వరుఁడు లింగైక్యమందినట్లు పండితారాధ్యచరిత్రమును బట్టి గట్టిగా నిర్ణయింప నగుచున్నది. 1168లో బసవేశ్వరుఁడు లింగైక్యమందెను. 1170 కే పండితారాధ్యుఁడును లింగైక్యమంది యుండును.

ఇట్టి పండితారాధ్యులవారి శిష్యునితో సంభాషించి బసవపురాణ కథార్థముల నెఱిఁగిన పాల్కురికి సోమనాథుఁడు 1190 ప్రాంతములకంటెఁ దర్వాతివాఁడయి యుండఁడు. అది రుద్రదేవుని పరిపాలన కాలమేకదా!

మఱియుఁ బండితారాధ్యులవారు లింగైక్యక మందినపిదప వారి శిష్యుఁడైన దోనమయ్య, వారి ప్రథమపుత్రుఁడైన కేదారయ్యకు లోకారాధ్యపట్టమును గట్టి తా ననర్గళముగా భక్తి రాజ్యమేలుచున్నట్టును, గేదారయ్యయు నలుగురు పుత్రులఁ గాంచి వంశాభివృద్ధితో నున్నట్లును బండితారాధ్యచరిత్రమునఁ గలదు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్యచరిత్ర రచనాకాలమునకుఁ బండితారాధ్యులవారి శిష్యుఁడును బుత్రుఁడును, సజీవులై యున్నారని, మనుమలు పేర్వెలయుచున్నారని దీనివలన నేర్పడుచున్నది. సోమనాథుని గ్రంథములలోఁ బండితారాధ్యచరిత్రము కడపటిది. ఈ సాధనమునుబట్టి చూచినను బండితారాధ్యుల లింగైక్యమునకుఁదర్వాత నిర్వది ముప్పదియేండ్లకే రుద్రదేవుని పాలనకాలముననే (ఇంచుమించుగా 1190) సోమనాథుఁడు ప్రసిద్ధ గ్రంథకర్త యయి యున్నట్టు స్పష్టమగుచున్నది.

సోమనాథుని కాలనిర్ణయమున కింకను గొన్ని సాధనములు గలవు. అవి డొంకతిరుగుడుగా నీ కాలమునకే చేరునవిగా నుండుటచే విడనాడినాడను. ఆఱు పురుషాంతరములకుఁ దర్వాతివాఁడగు పిడుపర్తి బసవన్న గ్రంథము సోమనాథుని గ్రంథములకంటెను దత్సమకాలమువారి గ్రంథముల కంటెను బ్రబలప్రమాణము కాఁజాలదు. బహుకాలమునకుఁబిదప బసవన్న వినికిళ్లను బట్టి వ్రాసిన వ్రాతలలోఁ గొన్నితప్పులు దొరలవచ్చును. సోమనాథుఁడు క్రీ. 1190 ప్రాంతములవాఁడనుటయే సిద్ధాంతముగా నిశ్చయింపవలెను.

బసవపురాణ రచనాకాలము

బసవపురాణమున బిజ్జలుఁడు మృతుఁడైన తర్వాత నాతని కుమారులు రాజ్యముకొఱకు యుద్ధముచేసి వారును జనిపోయిరని కలదు.

“అంత రాజ్యార్ధమై యనిసేసి యతని, సంతానమెల్ల నిస్సంతానమయ్యె
వీఁకఁ గొట్టములలో వెలిఁగె గుఱ్ఱములు, తోఁకల నిప్పులు దొరుగనక్షణమ
కరులును గరులును గన్నంతనెదిరి, పొరిఁబొరిఁదాఁకి జర్జరితమై పడియె
బ్రమసి యమాత్యాదిభటవర్గమెల్లఁ, దమలోనఁజచ్చిరి సమరంబు సేసి
బసవని సత్య శాపమునఁగాఁజేసి, పసచెడి కటకంబు పాడయ్యెనంత.”

- బసవపురాణము

బిజ్జలునికి సోవిదేవుఁడు, సంకమ, వీరనారాయణుఁడు, సింగణుఁడుఁ, వజ్రదేవుఁడు అనువారు కుమాళ్లుండిరి. బిజ్జలుని (క్రీ. 1167) తర్వాత పదునాఱేండ్లకే (క్రీ. 1183) వీరెల్లరు రాజ్యభ్రష్టులై చనిపోయిరి. వీరిలో సోవిదేవుఁడు పదియేండ్లును, సంకమ నాల్గేండ్లును, వీరనారాయణుఁడు, సింగణుఁడు, మూఁడేండ్లును, రాజ్యము చిన్నభిన్నములగుచుఁ జిన్నదగుచునుండఁగాఁ బరిపాలనము చేసిరి. క్రీ. 1183 నాఁటికి రాజ్యము పూర్తిగా నన్యాక్రాంతమయినది. సోమనాథుఁడీ విషయమును బేర్కొన్నాఁడు గాన, బసవపురాణ రచనము క్రీ.1183 కుఁదర్వాతిదగుట స్పష్టము.

పిడుపర్తి బసవన ఓరుఁగంటిలో భక్తులు బసవపురాణముఁ జదువు చుండఁగాఁ బ్రతాపరుద్రుఁడు వచ్చి వినెనని వ్రాసినవ్రాఁత ప్రతాపరుద్రునిఁగూర్చి కాక రుద్రదేవునిఁగూర్చి కావచ్చును. రుద్రదేవుఁడు క్రీ. 1198 దాఁక రాజ్యమేలినాఁడు గావున నా కథ యప్పుడు జరిగియుండవచ్చును. సోమనాథుఁడు రుద్రదేవునే ప్రతాపరుద్రుఁడని భేదము తెలియక చెప్పియుండవచ్చును. ఆ కథ జరగినదే యగునేని బసవపురాణము క్రీ. 1183 కుఁ దర్వాత 1198కిఁబూర్వము రచితమగును. ఇంచుమించుగా క్రీ. 1190 బసవపురాణ రచనాకాలమని నిర్ణయింపవచ్చును.

సోమనాథుని నెలవు

సోమనాథుని యింటిపేరు పాలుకురికి, పాల్కురికి, పాలకురికి అని మూఁడు రూపములును గానవచ్చుచున్నవి. ఈతఁడు నివసించిన గ్రామము పాల్కురికి యగును. అన్యవాదకోలాహలమని సోమనాథునిపేరనే "సోమనాథలింగ” యను సంబోధనముతో సీసశతకమును రచియించిన శివుఁడొకఁ డితఁడు పాల్కురికి గ్రామవాస్తవ్యుఁడని చెప్పెను. పాల్కురికి గ్రామము నేఁటి నైజాము రాష్ట్రమున నోరుఁగల్లు మండలమునఁగలదట! సోమనాథుఁడు సిద్ధిపొందిన పిదప నాతని సమాధిపై 'సోమనాథలింగ' మని శివలింగము ప్రతిష్ఠితమయ్యెనని కొందఱందురు. పాల్కురికిలో సోమనాథలింగము గలదేమోకాని యది యీ సోమనాథుని యనంతరమాతని సమాధిపైఁ బ్రతిష్ఠితమయ్యెనని కొందఱందురు. పాల్కురికిలో సోమనాథలింగము గలదేమోకాని యది యీ సోమనాథుని యనంతర మాతని సమాధిపైఁ బ్రతిష్ఠిత మయ్యెననుట విశ్వాస్యము గాదు. సోమనాథుఁడు సమాధిలో బయలయినది పాల్కురికి గ్రామమునఁగాదు. కర్ణాటదేశమున శివగంగాక్షేత్రము చేరువనుగల కలికెమను గ్రామమున నాతఁడు సమాధిస్థితుఁ డయ్యెను. పిడుపర్తి బసవన బసవపురాణము, పాల్కురికి సోమనాథపురాణము, కర్ణాటకవిచరిత్రము, మొదలగు గ్రంథము లీ విషయమును రాద్ధాంతపఱుచుచున్నవి.[1]

పాల్కురికి గ్రామమున జనించుటచే సోమనాథున కాయూరి లింగమూర్తి పేరే తల్లిదండ్రులు పెట్టియుండవచ్చును. అక్కడ సోమనాథదేవాలయము, సోమనాథుని పుట్టుకకుఁ బూర్వముననే వెలసియుండవచ్చును.

సోమనాథుని కులగోత్రములు

సోమనాథుఁ డారాధ్యబ్రాహ్మణుఁడని పలువురు తలంచిరి. కాని శ్రీ బండారు తమ్మయ్యగా రితఁడు జంగముఁ (జంగమకులమువాఁ) డని వ్రాసిరి.[2]

వారి యభిప్రాయముతో నేనేకీభవింపజాలకున్నాఁడను. సోమనాథుఁడు బ్రాహ్మణుఁడే యని నేను దలంచుచున్నాఁడను. పండితారాధ్యచరిత్రము, చతుర్వేదసారము, బసవరాజీయము మొదలగు సోమనాథుని గ్రంథములను బరిశీలించినచో సోమనాథుని బ్రాహ్మణత్వము సందేహింపరానిదిగా గోచరించును. మంచి శిష్టాచారసంపత్తిగల బ్రాహ్మణునకే యెఱుకపడఁదగిన విషయములెన్నో పయిగ్రంథములందుఁగలవు. వానిలో వేదమంత్రము లుదాహృతములయినవి. వేదభాష్యము లుద్దృతములయినవి. వైశ్వదేవాదిశ్రౌతకర్మల రహస్యము లెన్నో విమర్శింపఁబడినవి. ఆనాఁ డిట్టివిషయములు బ్రాహ్మణుల కందరానివిగా నుండెడివి. పండితారాధ్యచరిత్రమున “నలిఁ బాల్కురికి సోమనాథుండనంగ, వెలయువాఁడను జతుర్వేదపారగుఁడ” అనుట యాతని బ్రాహ్మణత్వము నుద్ఘోషించుచున్నది. బ్రాహ్మణేతరుఁడు వేదమును జదువరాదనుటకుఁ బ్రమాణములను సోమనాథభాష్యమున సోమనాథుఁడే యుదాహరించియున్నాఁడు.[3]

పండితారాధ్యచరిత్ర కృతి శ్రోతయగు పాల్కురికి సూరనామాత్యుని సోమనాథుఁ డిట్లు సంబోధించుచున్నాఁడు :

“పరమపవిత్ర ! యాపస్తంబసూత్ర !
హరితసగోత్ర! విద్యాపుణ్యగాత్ర !....
మచ్చికనాముద్దుమఱఁది వీవనియు
నెచ్చెలికాఁడవు నీవె కాకనియు”

“అఱలేని సఖుఁడ! సూరార్య! నా ముద్దు
 మఱఁది! విన్మిది మహిమప్రకరణము”

సోమనాథునివలె వీరశైవదీక్షితుఁడు గాకుండుటచేఁగాఁబోలును దన మఱఁదియగు సూరార్యుని యాపస్తంబసూత్ర భారద్వాజ గోత్రము లిట్లు పేర్కొనఁబడియెను. భారద్వాజగోత్రుఁడగు సూరార్యునకు బావమఱఁదియగు సోమనాథుఁడును సూరార్యునివలె బ్రాహ్మణుఁడే యగును. గట్టిగాఁ జుట్టఱికము కానవచ్చుచున్నను నది వట్టివరుస కన్నమాటయే యని కొట్టివేయుట సరికాదు. అట్లు కొట్టివేయుటకుఁ జుట్టఱికమునఁ బ్రబలబాధకములు గానరావలెను గదా! ఏవీ? ఇంటిపే రొక్కటి యగుటచే నిచ్చిపుచ్చుకొనుసంబంధ మసంబద్దమగు ననుట యసంబద్ధము. ఏకగ్రామవాస్తవ్యులగుటచే భిన్నగోత్రులకుఁ గూడ నొకయింటిపే రేర్పడవచ్చును. భిన్నగోత్రు లొకేయింటిపేరు, ఒకేకులముగలవా రసంఖ్యాకులుగా నగపడుచున్నారు. సోమనాథునియు, సూరనార్యునియు నింటిపే రొక్కటగుటచే వారిర్వురు నొక్కవంశమువారే యని నిరూపింపరాదు. ఒక్కవంశమువా రగుదురేని బావమఱఁది వరుసయు దూషితమే యగును.

పలువురు కర్ణాటాంధ్రకవులు సోమనాథుని నారాధ్యనామముతోఁ బేర్కొనిరి. పాల్కురికి సోమనాథపురాణ మాతఁడు బ్రాహ్మణుఁడని, వేమనారాధ్యుని వంశమువాఁడని వాకొన్నది. శైవులయిన బ్రాహ్మణులకే యారాధ్యనామ మానాఁడు చెల్లినది. బసవపురాణ, పండితారాధ్యచరిత్రాదులు పరిశోధింపఁదగును. బెలిదేవి వేమనారాధ్యుఁడు జంగముఁడని (జంగమ కులమువాఁడను నర్థమున) వ్రాయుట యవిచారమూలకము. పండితారాధ్యచరిత్రమున బెలిదేవి వేమనారాధ్యచరిత్రము గలదు. వేమనారాధ్యున కొకభూవరుఁడు నమస్కరించెను. ఆతఁ డాశీర్వదింపఁ డయ్యెను. ఆ భూవరుఁడన్న వాక్యము లిట్లున్నవి :

దండియై నృపకుమారుండంతఁబోక...
కొంతభక్తియుఁదోఁప సంతతాభ్యుదయ
కరులు మహాభక్తవరులు భూసురులు,

హరవేషధరు లఘహరులు చిత్పరులు
మీరని మ్రొక్కుడు మేలొందుమనక,
యూరకయుండుట యుచితమే పెంపె.”

మీఁది ద్విపదలు బెలిదేవి వేమనారాధ్యుఁడు బ్రాహ్మణుఁడని చెప్పుచున్నవి గావా? 'సోమనాథుని గురువునకుఁ దాతయైన బెలిదేవి వేమనారాధ్యుఁడు జంగముఁడు' అనియు, 'కావున జంగములకు శిష్యుఁడు...' జంగముఁడు గాక మఱొక్కఁ డెట్లగును?” అనియుఁ గావించు నాక్షేపము నిలువఁగలదా? వేమనారాధ్యుఁడు జంగముఁ డగుట నిజము కాదుగదా. ఆ కారణముచేఁ దత్పౌత్త్ర శిష్యుఁడు సోమనాథుఁడును జంగముఁ డగుననుటయు దబ్బఱయేకాదా! ఇది 'గజము మిథ్య; పలాయనమును మిథ్య' యన్నట్టున్నదిగాదా!

జంగముఁడయిన పిడుపర్తి సోమన పాల్కురికి సోమనకుఁ గృతిగా బసవపురాణమును జెప్పుటయు, ఆతఁడు సోమనాథునిఁ దనకుఁ గులగురుఁ డనుటయుఁ బాల్కురికి సోమనాథుఁడు జంగముఁ డగుననుట కెట్లు సాధకములో నే నెఱుఁగఁజాలకున్నాఁడను!

సోమనాథుఁడు బ్రాహ్మణుఁ డయినను శివదీక్షితుఁ డగుటచేఁ దనకులగోత్రాదికమును జెప్పుకొనఁడయ్యెను. తన్ను గన్న తల్లిదండ్రులపేళ్లు ప్రథమకృతియగు బసవపురాణమున మాత్రము :

“భ్రాజిష్ణుఁడగు విష్ణురామిదేవుండు
 తేజిష్ణువగు శ్రియాదేవి యమ్మయును
 గారవింపఁగ నొప్పు గాదిలిసుతుఁడ”

నని చెప్పుకొన్నాడు. అప్పటికి వారు బ్రదికియుండవచ్చును. వారి ప్రాపును సోమనాథుఁడు పడయుచుండవచ్చును. తర్వాతి కృతులలో వారి పేళ్ళెత్తనే లేదు.

“ధర నుమా మాతా పితా రుద్ర” యనెడు
వరపురాణోక్తి నీశ్వరకులజుండఁ

బేరెన్నఁబడిన శ్రీబెలిదేవి వేమ
నారాధ్యులను బరమారాధ్య దేవు
మనుమని శిష్యుండ మధురులింగ
ఘనకరుణాహస్తగర్భసంభవుఁడ
మును బసవపురాణమున నెన్నఁబడిన,
పెనుపారు జనులకుఁ బెంపుడుకొడుక
...........................................................
బసవని పుత్రుండ బసవగోత్రుండ.”

- పండితారాధ్య చరిత్ర

బసవపురాణమునఁబేర్కొన్న తల్లిదండ్రుల నిందుఁ బేర్కొనలేదు. వారి యెడనంతగా గౌరవము గూడఁ జూపలేదు. "పెనుపారు జను” లన్నాఁడు. వారికిఁ “బెంపుడుకొడుక” నన్నాఁడు. ఇట్లు తల్లిదండ్రులను, గులగోత్రములను బేర్కొనకుండుటకుఁ గారణ మాతనికిఁ దల్లిదండ్రులు, కులగోత్రములు లేకపోవుట కాదుగదా!

ఆ కారణము ననుభవసారమున నిట్లు చెప్పినాఁడు :-

క. "భువిలో శివదీక్షితులగు
    శివభక్తుల పూర్వజాతిఁ జింతించుట రౌ
    రవనరకభాజనం బా
    శివుఁ బాషాణంబుఁ గాఁగఁ జింతించుక్రియన్.

సీ. ధర "నుమా మాతా పితా రుద్ర యీశ్వరః
              కులమేవ చ” యనియుఁ గలదు గాన
     సద్గురుకారుణ్యసంజాతులెల్ల స
              గోత్రు లనక యన్యగోత్రు లనఁగఁ

ఆ.వె. దగునె యొక్కతల్లిదండ్రుల కుద్భవం
        బైన ప్రజలలోన హీనవంశ్యు

లెందుఁ గలుగబోదురే శివగోత్ర స
త్పాత్ర భక్తిసూత్రపథచరిత్ర.”

ఈ పద్యములు శివదీక్షితుఁ డగుటచే సోమనాథుఁడు దన జన్మజాత్యాదులఁ బేర్కొననొల్లఁడయ్యెనని తెలుపుచుండుట లేదా? 'ఈశ్వరుకులజుండ, నీశ్వరపుత్రుండ' నని చెప్పికొన్నను నాతని తలిదండ్రులు వేఱుగాఁ గలరని మనము గ్రహించుచుంటిమి గదా!

ఈ సంప్రదాయ మొక్కశైవులందేకాక శాక్తులందును గలదు. శాక్తదీక్ష గొన్నవారు పుట్టినప్పుడు తమకుఁబెట్టినపేరుగాక దీక్షానామమని వేఱొకపేరు ధరింతురు. శైవులకుఁగల గురుకరోదరజనితత్వము వారికిని గలదు. దీక్షాగ్రహణమునాఁటనుండియు జన్మము వేఱయినట్లే వారి నిశ్చయమును. వారికిని జాతాశౌచమృతాశౌచాదులు నిషిద్ధములే. ఈ విషయమున శాక్తతంత్రములకు శైవతంత్రములకు సాదృశ్యమే. కాలాముఖపాశుపతాదిశైవు లిట్టినియమములు గలవారే. కాని, బసవేశ్వరోపజ్ఞముగా నుద్భుద్దమయిన వీరశైవము మాత్రము వీరవ్రతముగలదై కొంతవిలక్షణవిధానము గాంచినది. తద్విషయము బసవేశ్వరమత మనుచోటఁ బ్రపంచించి వ్రాయుదును.

సోమనాథుఁడు బ్రాహ్మణుఁ డయినను దీక్షితుల సంప్రదాయము చొప్పున జన్మగోత్రసూత్రాదికములను జెప్పుకొనకపోయెను. ఇతరవిధముల నాతని బ్రాహ్మణత్వము ప్రవ్యక్తమగుచున్నను నీయసమర్థసాధనమును గొని యాతఁడు బ్రాహ్మణుఁడు కాఁడనుట యుక్తమా?

ఇఁక బసవపురాణమున బ్రాహ్మణులను 'ద్రాటిమాల'లని, 'పచ్చిమాల' లని గర్హించుటచే సోమనాథుఁడు బ్రాహ్మణుఁడు గానేరఁడనుటయు నసంగతమే యగును. పయితిట్లు సోమనాథునివి గావు. వీరశైవవివాదములందు బసవేశ్వరాదుల వాక్కులను సోమనాథుఁడనుకరించి చెప్పెను. కాని, యవి సోమనాథుఁడు స్వయము నోరారఁ దిట్టినవిగావు. గ్రంథమునఁ బ్రసక్తులగు కథాపురుషుల పనులను, బలుకులను ననువదించినంత మాత్రమున వానిని గ్రంథకర్తకతకరింపరాదు గదా! బసవపురాణమున బ్రాహ్మణగర్హ యుండఁగాఁ బండితారాధ్యచరిత్రమున బ్రాహ్మణప్రశంస గలదు. మల్లికార్జున పండితారాధ్యుఁడు బ్రాహ్మణధర్మముల నాదరించినవాఁడు గావున, నందు సోమనాథున కట్లు వ్రాయవలసెను. బసవేశ్వరుఁడు బ్రాహ్మణధర్మములు గర్హించినవాఁడు గావున బసవపురాణమున నిట్లు వ్రాయవలసెను.

సోమనాథుఁడు బ్రాహ్మణుఁ డగుట నిస్సంశయమే. అయినను మనకాలమువా రయిన వీరేశలింగముపంతులుగారు, రామమోహనరా యోపజ్ఞముగాఁ బేర్వెలసిన బ్రహ్మసమాజసిద్దాంతములమీఁది యభిమానాతిశయముచేతను, తన్మతతత్త్వజ్ఞానాతిరేకముచేతను వయస్సు చాలఁగాఁ గడచిన పిదప యజ్ఞోపవీతాదికమును ద్యజించినట్టుగా సోమనాథుఁడును బసవేశ్వరోపజ్ఞముగా వెలసిన వీరశైవసిద్దాంతముమీఁది యభిమానముచే శివభక్తిపారవశ్యముచే గాయత్రీయజ్ఞోపవీతాదికములను, గులమును జాలవయస్సు కడచినపిదప విడనాడినాఁడేమో యని యాతఁ డాంధ్రదేశమును విడిచి కర్ణాటదేశమునకుఁ జేరుటనుబట్టి నే నించుక సంశయించితిని. కాని, సోమనాథభాష్యమును జూడఁగా నాసంశయమునకు స్థానములేదని యేర్పడెను. గాయత్రీమంత్రము శివపరమనియు ననుష్ఠేయమనియు సోమనాథుఁ డందు వ్రాసెను. బసవేశ్వరునికాలమున వీరశైవమత మాంధ్రదేశమున వేరూనలేదు. బసవేశ్వరునికిఁ దర్వాతఁ జాలఁగాలము గడిచిన తర్వాతనే యల్పాల్పముగా నది యాంధ్రదేశము నంటుకొన్నది.

నేఁటి జంగమజాతివారు పాల్కురికి సోమనాథునికాలమునఁగూడ నాంధ్రదేశమునఁ గలరన్న నమ్మకము కల్మిని గాఁబోలును, దమ్మయ్యగారు పయివాదముఁ దెచ్చి పెట్టిరి. ఆ కాలమున జంగమపదము చరలింగమను నర్థమునఁ గలదే కాని నేఁటి జంగమజాతికి వాచకముగాలేదు. ఈ జాతి యప్పటికింక నేర్పడలేదు.

నన్నిచోడని కుమారసంభవకృతి నందుకొన్న మల్లికార్జునుఁడు పెక్కుచోట్ల జంగమ మల్లికార్జునుఁడని పేర్కొనఁబడెను. కాని, యందే యాతఁడు 'భూసురవంశాద్యుఁడు' ఇత్యాది విధముల బ్రాహ్మణుఁ డనియే ప్రస్తుతుఁడయ్యెను. మీఁది చర్చవలన సోమనాథుని బ్రాహ్మణత్వము నిర్వికల్పముగా నిలువఁగలదని నేను నమ్ముచున్నాఁడను.

సోమనాథుని గురువులు

శ్రియాదేవియు, విష్ణురామిదేవుఁడును నీతనికిఁ దల్లిదండ్రులని యిదివఱకే వ్రాసితిని. ఈతనికి గవితావిద్య నేర్పిన విద్యాగురుఁడు కరస్థలి విశ్వనాథుఁడు.

    “సకృపాత్ముఁడగు కరస్థలి విశ్వనాథు
     ప్రకటవరప్రసాదకవిత్వయుతుఁడ.

-బసవపురాణము



గీ. “విమలచిత్ప్రపూర్తి విశ్వేశవరమూర్తి
    వినయవర్తి భువనవినుతకీర్తి
    విభుకరస్థలంబు విశ్వేశుకారుణ్య
    జనితవిమలకావ్యశక్తియుతుఁడ.”

-అనుభవసారము

ఈతనికి శివదీక్ష నొసఁగిన గురుఁడు గురులింగార్యుఁడు -

'గురులింగవరకరోదర జనితుండ', 'గురులింగ తనూజుండ', 'పేరెన్నఁ బడిన శ్రీ బెలిదేవివేమ-నారాధ్యుఁడను పరమారాధ్యదేవ, మనుమని శిష్యుండ మద్గురులింగ - ఘనకరుణాహస్త గర్భసంభవుఁడ.'

పయివాక్యములవలన బెలిదేవి వేమనారాధ్యుల మనుమఁడయిన గురులింగార్యుఁ డీతని దీక్షాగురుఁడని తెలియనగును. సంస్కృతపండితారాధ్యచరిత్రమునఁగూడ నిట్లే కలదు.

“బెల్దేవి వేమనారాధ్య ప్రశిష్యస్య కృపానిధేః
 గురులింగార్యస్య దయాహస్త గర్భ సముద్భవః.

'మనుమ'డనఁగా నాచార్యవంశమున మనుమఁడని సంస్కృతగ్రంథకర్త గ్రహించెను. కావుననే 'ప్రశిష్యస్య' అనెను.

ఇంకొక గురుఁడు పోతిదేవర -
'కట్టకూరి-పోతిదేవర పదాంబుజ షట్పదుండ'

ఈ కట్టకూరి పోతిదేవర యెట్టివాఁడో యెక్కడివాఁడో యెఱుఁగరాదు.

సోమనాథుఁడు పేర్కొన్న సమకాలభక్తులు

చెన్నరాముఁడు- ఈతఁడు వడగాము రామేశుని శిష్యుఁడు; సోమనాథునికిఁ బ్రాణసఖుఁడు. కరస్థలి సోమనాథయ్య - ఈతఁడు పండితారాధ్యుల శిష్యుఁడు; శ్రీశైల త్రిపురాంతకవాస్తవ్యుఁడు; మల్లినాథుఁడు- రెంటాల మల్లినాథుఁడు - ఈతఁడు సీమాలంఘన (పొలమేరదాఁటరాదను నియమము)వ్రతము గలిగి శ్రీశైలము, కుమారాచలమునకుఁ దూర్పుదెసను మెట్లు కట్టించి యక్కడనే యున్నవాఁడు. దోచమాంబ-ఈమె శివున కనుదినము నైదుకరవీరపుష్పము లర్పించునట్లు వ్రతము పూని యం దొక్కనాఁ డొక్కపుష్పము తక్కువకాఁగాఁ దనక న్నిచ్చి శివునిచే మరలఁబడసి కీర్తి గన్నదట! గోడగి త్రిపురారి - ఈయన మున్నయదేవయోగికి శిష్యుఁడు; నారయకుఁ గుమారుఁడు; నీలకంఠునికి నన్నగారు; సోమనాథుని యనుభవసారకృతికిఁ బతి. గొబ్బూరి సంగనామాత్యుఁడు - ఈతఁడు మండెఁగ మాదిరాజు (బసవన తండ్రిగాఁడు) శిష్యుఁడు; గొబ్బూరి కధిపతి; బసవపురాణకృతిశ్రోత. పాల్కురికి సూరనామాత్యుఁడు- ఈతఁడు వీరపోలేశ్వరునికి శిష్యుఁడు; పాల్కురికి సోమనాథునకు ముద్దుమఱఁది; పండితారాధ్యచరిత్ర కృతిశ్రోత.

సోమనాథుని కృతులు

పిడుపర్తి బసవన తన బసవపురాణమున సోమనాథుని కృతులనిట్లు పేర్కొన్నాఁడు:

సీ. బసవపురాణంబు, పండితారాధ్యుల
              చరితంబు, ననుభవసారమును, జ
     తుర్వేదసార సూక్తులు, సోమనాథభా
              ష్యమ్ము, శ్రీరుద్రభాష్యమ్ము, బసవ

     రగడ, గంగోత్పత్తిరగడ, శ్రీబసవాఢ్య
               రగడయు, సద్గురురగడ, చెన్న
     మల్లు సీసములు, నమస్కారగద్య, వృ
               షాధిపశతకంబు, నక్షరాంక

గీ. గద్యపద్యముల్, పంచప్రకారగద్య
    యష్టకము, పంచకము, నుదాహరణయుగము
    నాది యగు కృతుల్ భక్తహితార్థబుద్ధి
    జెప్పె నవి భక్తసభలలోఁజెల్లుచుండు.”

ఇందు బసవపురాణము, పండితారాధ్యచరితము, అనుభవసారము, చతుర్వేదసారము, చెన్నుమల్లు సీసములు, వృషాధిపశతకము, (ఒక) బసవోదాహరణము అనునవి తెల్గుకృతులు. సోమనాథభాష్యము (దీనికే బసవరాజీయ మని మాఱుపేరు), రుద్రభాష్యము, అష్టకము, పంచకము, నమస్కారగద్య, అక్షరాంకగద్య, పంచప్రకారగద్య, (ఒక) బసవోదాహరణము, సంస్కృతభాషలో నున్నవి. కడమవి కన్నడమున నున్నవి. వీనిలో రుద్రభాష్య మిప్పుడు గానరాకున్నది. 'సోమనాథస్తవమని మఱియొక ద్విపదస్తవము తెలుగుభాషలోనే యీ కవివరుని దొకటి గలదు” అని శ్రీ బండారు తమ్మయ్యగారు వ్రాసిరి. అది యోరుఁగంటిలో ముదిగొండ శంకరారాధ్యులవారిచేఁ బరిష్కృతమై ముద్రితమైన 'మోక్షపాయ' మను పుస్తకమునఁగల సోమనాథస్తవమే యగునేని దానికిఁ గర్త పాల్కురికి సోమనాథుఁడనుట నిరాధారము. దాని ముగిం పిట్లున్నది :

“భక్తుల సంగంబు భక్తసద్గోష్ఠి
  భక్తుల పదసేవ పదపడి చేయ
  కరుణ నొసంగవే కైలాసవాస
  గురునాథ శ్రీపాలకురికి సోమేశ !”

తద్రచనము సోమనాథుని రచనమువలె లేదు. తమ్మయ్యగారు పేర్కొన్న సోమనాథస్తవ మింకొకటి కలదేమో! సోమనాథుని గ్రంథములనెల్లఁ బఠనపాఠ నాది ప్రచారమునకుఁ దెచ్చినవాఁడు, తచ్చిష్యపరంపరలోనివాఁడు నగు పిడుపర్తి బసవన్న యాగ్రంథమును బేర్కొనలేదు.

కర్ణాటకమున సోమేశ్వరశతక మొకటి యీతనికృతిగాఁ జెప్పఁబడునది గలదు. దోషభూయిష్ఠమగు నా శతకము పాల్కురికి సోమనాథుని కృతిగా విశ్వసింపఁజాలమని కర్ణాటవిద్వాంసు లనుచున్నారు. కర్ణాటకవిచరిత్రకారులును నా శతకము సోమనాథుని రచన మగుటనుగూర్చి సంశయించిరి. అష్టకములను పంచకములనుగూడఁ బరిగణించిన పిడుపర్తి బసవన యీ శతకము సోమనాథుని రచనమే యగునేని పేర్కొనక విడువఁడు. “సోమేశ్వరా” యని సంబోధనము మకుటముగాఁగల యా శతకము సోమనాథుని శిష్యపరంపరలోనివాఁ డితరుఁడు రచియించినదయి యుండవచ్చును. సోమనాథునిఁ బ్రస్తుతించునది అన్యవాదకోలాహలమని నామాంతరముగల సోమనాథలింగ శతకము గలదు. అదికూడఁ గర్తృనామరహితమే. కొందఱు దానిని గూడ సోమనాథునికృతినిగాఁ దలంచిరి.[4] అది పొరఁబాటు. మఱియుఁ గర్ణాటకవి చరిత్రమున నీతఁడు 'సహస్రగణనామములు'. 'శీలసంపాదనము' అను కర్ణాటగ్రంథములనుగూడ రచియించినట్లు వ్రాయఁబడెను. పండితారాధ్యచరిత్రలో సోమనాథుఁడు గణసహస్రనామస్తవముఁ జేర్చెను. కర్ణాటకవులు దానిని బేర్కొనుటనుబట్టి కర్ణాటకవిచరిత్రకారు లా గ్రంథము వేఱుగాఁ గర్ణాటమున రచితమైన ట్లూహించిరి. మఱియుఁ గన్నడకవిచరిత్ర మిట్లు చెప్పుచున్నది: "భైరవేశ్వరకావ్యపుఁ గథాసూత్రరత్నాకరమున నిట్లు గలదు. సోమనాథుఁడు జ్యోతిర్మయ శాంభవీజ్ఞాన దీక్షాబోధలోని పరమరహస్యార్ధమును సంగయ్య యను శరణునికి నూటయఱువది వచనములలో సంగ్రహించి యుపదేశించెను” దీని యాథాథ్యము మన కెఱుఁగరాదు.

కృతుల వివరణము

బసవపురాణము - ఇఁకముందు దీనిఁ గూర్చి విపులముగా వివరణ ముండును. పండితారాధ్యచరిత్రము - ఇందు మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రము వర్ణితమయినది. ఇది బసవపురాణమువంటి ద్విపదకృతి. గ్రంథస్వరూపమునందును, కవితాగౌరవమునందును బసవపురాణముకంటె గొప్పది. బసవపురాణమునఁ జెప్పఁబడని శివభక్తుల కథలిందు గలవు. అందుఁ జెప్పఁబడనిది బసవేశ్వరచరిత్ర మిందుఁ గొంత గలదు. గురురాజకవి దీనిని సంస్కృత భాషలోనికిఁ బరివర్తించినాఁడు. అది కొంత ముద్రిత మయినది. శ్రీనాథకవిసార్వభౌముఁడు దీనిని బద్యప్రబంధముగా రచియించినాఁడు. అది నేఁడు గానరాకున్నది.

చతుర్వేదసారము - ఇందు శివపారమ్యము ప్రతిపాదితమయినది. పండితారాధ్యచరిత్రమునను, సోమనాథభాష్యమునను జెప్పఁబడిన యుక్తులే, ఉదాహృతములయిన శ్రుతిస్మృతిపురాణాదులే యిందును సీసపద్యములలోఁ జక్కఁగాఁ బొందికగాఁ జెప్పఁబడినవి. నాలుగువందల సీసపద్యములిందు గలవు. ప్రతిపద్యమును బసవసంబోధనముతో ముగియుచున్నది. పండితారాధ్యచరిత్రమున నీ కృతి పేర్కొనఁబడినది.

అనుభవసారము - ఇది చిన్న పద్యకృతి: గురుభక్తిమహిమ, శివపూజావిధానము, భక్తలక్షణము, జంగమసేవ, ఇష్టలింగార్పణము, షట్‌స్థలవివరణము మొదలగు శైవధర్మము లిందుఁ దెలుపఁబడినవి.

చెన్నమల్లు సీసములు- ముప్పదిరెండు సీసపద్యములు. షట్‌స్థలవైభవ మిందుఁ బ్రశంసింపఁబడినది. 'చెన్నమల్లు' అను మకుటముతో నీ సీసపద్యములు ముగియుచున్నవి.

వృషాధిపశతకము- "బసవా బసవా బసవా వృషాధిపా” అనుమకుటముతో నిందుఁ బ్రతిపద్యమును ముగియుచున్నది. ఈ వృత్తశతకమున బసవపురాణకథాసారమెల్లఁ గలదు. బసవేశ్వరప్రస్తుతి గలదు. పెక్కుపద్యములు శబ్దచిత్రము గలవి. సంస్కృత ద్రవిడ మణిప్రవాళ కర్ణాట మహారాష్ట్ర భాషల పద్యములు గూడ నిందుఁ గలవు.

ఇవి ముద్రితములైన యాంధ్రగ్రంథములు. బసవోదాహరణము - ఇది యముద్రితము. [5]

ఆది:

ఉ. శ్రీగురులింగతత్పరుఁ డశేషజగన్నిధి శుద్దతత్త్వసం
     యోగసుఖప్రపూర్తి వృషభోత్తమమూర్తి యుదాత్తకీర్తి ది
     వ్యాగమమార్గవర్తి బసవయ్య కృపాంబుధి మాకు భక్తిసం
     భోగములం బ్రసాదసుఖభోగములం గరుణించుఁగావుతన్.

కళిక : వెండియుఁ ద్రిభువనవినుతిసమేతుఁడు
        మండితసద్గుణమహిమోపేతుఁడు
        సురుచిరశివసమసుఖసంధానుఁడు
        పరమపరాపరభరితజ్ఞానుఁడు
        విదితానందాన్వీతమనస్కుడు
        సదమలవిపులవిశాలయశస్కుఁడు.

అంతము:

ఉ. నీవు దయాపయోనిధివి నిన్ను నుతించినఁ గల్గు భక్తి నీ
     చే వరవీరశైవరతి చేకుఱు నీకయి యిత్తుఁ గబ్బముల్
     నీవలనం గృతార్ధత జనించును నీకు నమస్కరింతు నా
     భావమునందు నుండి ననుఁ బాయకుమీ బసవయ్య, వేఁడెదన్.

ఇఁక సంస్కృత గ్రంథములు : -

సోమనాథభాష్యము -దీనికే 'బసవరాజీయ' మని నామాంతరము. ఇది యిర్వదియైదు ప్రకరణములు గలది. శైవసంప్రదాయము లిందు వివరింపఁబడినవి. ఇందు గాయత్రీమంత్రము శివపరమని నిరూపింపబడినది. లింగార్చనా ప్రాధాన్యము చెప్పఁబడినది. వైదికాచారగర్హణము గానరాదు సరిగదా దాని ప్రాధాన్యముగూడ నిందుఁ బ్రతిపాదితమయినది. శ్రుతిస్మృతి పురాణాగమాదుల నుండి పెక్కుశ్లోకము లిం దుధృతములయినవి. హరదత్తాచార్యుల చతుర్వేదతాత్పర్యసంగ్రహముననుండి యిందుఁ బెక్కుశ్లోకము లుదాహృతములయినవి.

ఇది ముద్రితము.

రుద్రభాష్యము :- యజుర్వేదమందలి రుద్రాధ్యాయమున కిది భాష్యమయి యుండును. నేఁ డిది గానరాకున్నది. ఇవి ముద్రితములు.

ఈ క్రింది గ్రంథము లముద్రితములు.

బసవోదాహరణము[6] - ఇది బసవేశ్వరస్తుతి రూపమయినది. సరళమయిన రచనతో హృద్యముగ నున్నది.

ఆది:

అపిచ పురాతననూతనశివగణపాదోదకపరిలసదభిషేకః;
క్షపితవిపల్లవపల్లవజంగమ లింగసమర్చననిచితవివేకః.

అంతము:

య స్సంగీతనిధి, ర్యమాహు రభవం, యే నార్చితం సూనృతం,
యస్మై స్వస్తి, యత స్తదీయ ముదభూ, ద్యద్వీరశైవవ్రతమ్;
యస్యాపాంగసహోదరీ చ కరుణా, యస్మిన్ మహత్త్వాదికం
స త్వం త్రీణి జగంతి పాహి బసవామాత్యేశ చూడామణే !

నమస్కారగద్యము - ఆది :

శ్లో. శ్రీకంఠోద్భవవేదచోదితలసద్వీరవ్రత ప్రక్రియా
    చారాదేశకదేశికాయ భువనస్తుత్యాయ సత్యాయ చ;
    ....................................................................................
    సాక్షాచ్చ్రీవృషభాధిపాంశ బసవాధీశాయ తస్మై నమః
    అపిచ శ్రీ ప్రమథేంద్రాయ నమో
    వ్యపగత...... ...................................................

అంతము:

    మఘవత్ప్రణుతపదాబ్జాతాయ దాతాయ
    విఘసత్రితయసుఖోద్ధరణాయ శరణాయ;
    కుసుమశరరిపుభక్తవృషభాయ వృషభాయ
    బసవాయ తే నమస్తే నమస్తే నమః.

శ్లో. సరస నమస్కృతి గద్యం వరపదమణిఖచితవాక్సువర్ణాభమ్;
    అష్టోత్తరశతకుసుమం రచితం పాల్కురికి సోమనాథేన.

పంచప్రకార గద్యము - ఆది:

శ్లో. స్వస్తిశ్రీ ప్రమథాన్వయోత్తమ శిలాదశ్రీమునీంద్రాత్మజ
    శ్రీకంఠప్రతిబింబమూర్త యనఘ శ్రీనందినాథప్రభో;
    తస్యాంశోద్భవ దండనాథ బసవ శ్రీనామధేయప్రభో
    త్వత్కారుణ్యతరంగితం మయి సదా సంక్షిప్యతా మీక్షణమ్.

జయజయ బసవ శ్రీమన్మహావృషభేంద్రాపరావతార నిసహచిత వీరమాహేశ్వరాచారసార ప్రమథగణాలంకార జగత్త్రయాధార దేవా! బసవా!

అంతము:

జయశివరంజన, జయభవభంజన, జయకరుణాకర, జయసురభీకర, జయగతదూషణ, జయఋతభాషణ, జయగుణరాజిత, జయగణపూజిత, జయజయశ్రీ బసవదండనాథ నమస్తే.

అక్షరాంకగద్యము -ఆది :

అపి చ శివశృంగార, ఆదిపథవిస్తార, ఇహపరసుఖాధార, ఈషణత్రయదూర, ఉద్ధతగుణోపేత, ఊర్ధ్వరేతోజాత........... అంతము:

శమితవిషయోద్రిక్త, షడ్వర్గనిర్ముక్త, సహజజంగమభక్త, హరగణ హితచ్చత్ర, లలితకీర్తికళత్ర, క్షరవిముఖనిజగాత్ర, అక్షరస్తుతిపాత్ర, శివకరజ బసవ దండనాథ నమస్తే.

అకారాదిక్షకారాంత మకరో దక్షమాలికామ్;
ప్రసాదీ సోమనాథార్యో బసవస్య కృపానిధేః.

అక్షరాంకశ్లోకములును గలవు

అష్టోత్తరశతనామగద్యము - ఆది :

శ్రీమద్గురు బసవేశ నమస్తే, సామయభవ నిర్నామ నమస్తే,

అంతము :

ఆద్య నమస్తే, వేద్య నమస్తే, తత్త్వ నమస్తే, చిత్త్వ నమస్తే,
భావ నమస్తే, భావి నమస్తే, సద్గురుబసవస్వామిన్ నమస్తే.

వృషభాష్టకము - ఆది :

పక్షీంద్రవాహనతపోబలసాధనీయ
సర్వేశ్వరోల్లసిత వాహనలాల్యమాన !
కాపాలిరూప సముపేత పునీతదృష్టే
శ్రీ వజ్రశృంగ వృషభాధిపతే నమస్తే !

అంతము :

పాల్కుర్కి సోమరచితం వృషభాష్టకం యః
స్తోత్రం శ్రుణోతి పఠతీహ వినిశ్చితార్థమ్;
సో౽థాశు యాతి వృషభాధిపతేః ప్రసాదా
ల్లబ్దాద్ విశుద్ధపదభక్తిఫలాదభీష్టమ్.

పంచరత్నములు -ఆది :

ప్రియతమశివభక్తా బిందునాదానురక్తా
మయి భవ శివయుక్తా హారహీరప్రభాక్తా
నియమిత సకలాంగా నీలకంఠ ప్రసంగా
నయతు బసవలింగాధీనభక్తిక్రియాంగా.

అంతము :

శ్రీమతే వృషభేంద్రాయ సోమనాథేన ధీమతా.
పంచరత్నం కృతం స్తోత్రం జ్ఞానవైరాగ్యభక్తిదమ్.

బసవాష్టకము - ఆది :

జయజయ బసవాంశ సత్యసద్భక్తివాసా
జయజయ శివగోత్రా సత్ప్రసాదైకపాత్రా;
జయజయ భవదూరా శాశ్వతైకాంగవీరా
జయజయ బసవాఖ్యా సంవిదాశ్చర్యసౌఖ్యాం.

అంతము:

బస్వాష్టక మిదం పుణ్యం సర్వపాపప్రణాశనమ్;
యః పఠేచ్ఛృణుయా ద్వాపి శివలోకే మహీయతే.

కడమ కన్నడ రగడల కాద్యంతములు చూపకుండెదను.

సోమనాథుని పేరఁగల కృతులు

పిడుపర్తి బసవన పద్యబసవపురాణమును సోమనాథుని పేర నంకితముచేసినాఁడు. దానిఁగూర్చి యింతకుముందుఁ గొంతప్రస్తావము జరగెను. అన్యవాదకోలాహలమని పేరుగల సోమనాథలింగశతక మీతని పేరనే కలదు. అందు సోమనాథస్తుతియును, శివపారమ్యప్రతిపాదనమును, మతాంతరగర్హణమును గలవు. అది కర్ణాటకమునను గలదట. వీరశైవకవు లెల్లరు సోమనాథుని స్తుతించిరి. కర్ణాటకభాషలో వీరశైవకృతులు పెక్కులు గలవు. కావునఁ నందుఁ బలువురుకవు లీతనిఁ బ్రస్తుతించిరి. వీరశైవు లీతని మతప్రవర్తకులలోఁ బ్రస్తుతింతురు. ఈతఁడు భృంగీశుని యవతారమని వారినమ్మకము. ఈతఁడు బసవేశ్వరునియుఁ బండితారాధ్యునియుఁ జరిత్రముల రచించినట్లే యీతని చరిత్రమును బాల్కురికి సోమనాథపురాణ మనుపేరఁ గర్ణాటభాషలో విరక్త తొంటెదార్యుఁ డనుకవి రచియించినాఁడు. ఆతఁడు క్రీ.1560 ప్రాంతములవాఁడు.

పాల్కురికి సోమేశ్వరపురాణము - ఇందు సోమనాథుని చరిత్రమును ప్రధానముగాఁ జేసికొని సోమనాథుని సమకాలమువారగు రెంటాల మల్లినాథుఁడు, పాల్కురికి సూరామాత్యుఁడు మొదలగువారియు, నింకను బ్రాచీనులగు మఱి పెక్కురయుఁ జరిత్రములను, శివలీలలను గ్రంథకర్త వర్ణించినాఁడు. సోమనాథచరిత్ర మిందల్పముగానే కానవచ్చును. ఉన్నదాని సారమిది.

"సోమనాథుఁడు వేమనారాధ్యవంశమువాఁడు; పాల్కురికి గ్రామవాస్తవ్యుఁడు; గురులింగార్యునకు మంగళాంబకుఁబుత్రుఁడు. (ఈతఁడు దీక్షావంశమునఁ దలిదండ్రుల పేళ్లు చెప్పినాఁడు.) ఓరుఁగంటి ప్రతాపరుద్రునిచే నారాధితుం డయినాఁడు. (పిడుపర్తి బసవన చెప్పిన కథనెల్ల నీతఁడును జెప్పినాఁడు). అప్పుడు చక్రపాణి రంగనాథుఁడను వైష్ణవునితో సోమనాథునకు మతవిషయమునఁ దగవు వాటిల్లెను. అశైవుని దర్శింపఁడు గాన సోమనాథుఁడు తెరచాటుననుండి వాదముచేయ నంగీకరించెను. కాని, యా వైష్ణవుని జయించుటకు సోమనాథుని పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరుఁడే తలపడెను. వారిర్వురకును గొప్పవాదము జరిగెను. రంగనాథుఁ డోడిపోయెను. పరాజయదుఃఖముతో నా రంగనాథుఁడు శ్రీశైలమార్గముననే తిరిగిపోయెను. శ్రీశైలమల్లికార్జునునిఁ జూడక ద్వేషబుద్ధితోడనే యరిగెను. ఆ శివద్వేషముచే నాతనికిఁ గన్నులు గ్రుడ్డివయ్యెను. అహోబలమున కరిగి యాతఁడు నరసింహస్వామిని బ్రార్థించెను. ఆ స్వామివలన స్వప్నమున శివాధిక్యబోధమును బడసి లజ్జితుఁడై తిరిగి శ్రీశైలమునకు వచ్చి శ్రీశైలమల్లికార్జునుని బహువిధములఁ బ్రస్తుతించెను. పదపడి పాలకురికికి వచ్చి సోమనాథుని దర్శించి యపచారము క్షమింపఁ బ్రార్థించెను. సోమనాథుఁ డనుగ్రహించెను. రెండవకన్నును వచ్చెను. రంగనాథుఁడు శైవదీక్ష నొసంగుమని సోమనాథునిఁబ్రార్థించెను. పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరునిచేత సోమనాథుఁ డాతని శివదీక్షితుని జేయించెను. రంగనాథుఁ డప్పుడు వీరభద్ర విజయ శరభచరిత్రాదులను రచియించి గురుపాదముల కర్పించెను. తరువాత సోమనాథుఁడు కర్ణాటదేశమునఁ గలికె మనునగ్రహారమునకుఁ బోయి సమాధిస్థుఁడై లింగైక్యమందెను.

ఇందుఁ బ్రధానముగా, నపూర్వముగాఁ గానవచ్చుచున్నది చక్రపాణి రంగనాథుని విషయము.

ఈ పాల్కురికి సోమనాథపురాణమే కాక కర్ణాటకృతి యగు గురురాజచరిత్రముగూడ నీ చక్రపాణి రంగనాథునిచరిత్రమును జెప్పుచున్నది. ఈ తొంటిదార్యకవి చెప్పినట్టే యాగురురాజచరిత్రకర్త సిద్ధనంజేశకవియు రంగనాథుని యోటమిని జెప్పినాఁడు. 'వీరభద్రవిజయము' 'శరభలీల' యను గ్రంథములనే కాక యాతఁడు శ్రీగిరినాథవిక్రమమని యేనూఱు సీసపద్యముల తెలుఁగు గ్రంథమును గూడ రచించెనట! దానినే సంస్కృతమునఁగూడ రచించెనట ! ఆ కవి యిట్లు చెప్పుచున్నాఁడు :

శ్రీశైలభర్తకును సీసంబులేనూఱు
లేసప్పపద్యంగ ళెంటుసావిరగళుం
భాసురద దండకం సాహస్ర తారావళియు నాల్కు లయగ్రాహియు
ఆ శతకవృత్తగళు దోధకం సావిరవు
భాసురదతోటకం నూఱు రగళెగ ళేడు
భాషిసిద మత్తకోకిల మూఱు సాసిరం గీతియం తాఱునూఱు.
సరసమంజెర వెంటు కందంగ ళైనూఱు
విరచిసిదకృతియు మూవత్తాఱు గద్యగళు
నిరువ మూవత్తాఱు వుభయశతకం వొప్పు మిగిలు సర్వేశ నిమిగె.

ఈతని తెలుఁగు కృతియగు శ్రీగిరినాథ విక్రమముగాని, తక్కిన కర్ణాటకృతులు గాని నేఁడు గానరాకున్నవి. కాని యీతని కృతియే యనఁదగినదిగా 'నయన రగడ' యని నామాంతరముగలది 'శివభక్తిదీపిక' యనుకృతి కలదు. పరిశీలింపఁగా నా కృతి సోమనాథపురాణ గురురాజచరిత్రములు చెప్పినకథనే నిరూపించునదిగాఁ గానవచ్చినది. ఆ కృతిలోని పట్టులను గొన్నింటిని జూపుచున్నాఁడను. అది కొన్నివందల చరణములు గల రగడ.

క. శ్రీపార్వతీశుఁ జూడక
   పాపాత్ముఁడ నగుచుఁ బోవఁ బథమునఁ జక్షుల్
   దీపించు దృష్టి దొలఁగిన
   శ్రీపతి నడుగంగఁ జెప్పె శివుఁ గర్తనుగాన్.

రగడ : శ్రీశైలవల్లభుని శిఖరంబుఁ బొడగంటి
          కాశీపురాధీశు గౌరీశుఁ బొడగంటి,
          మహినొప్పు శ్రీశైలమహిమ నేఁ బొడగంటి,
          బహువేదశాస్త్రముల్ ప్రణుతి సేయుటఁగంటి
          భూలోకకైలాస పురమనఁగఁగనుఁగొంటి
          ఫాలాక్షుఁ డిచ్చోటఁ బాయకుండుటఁ గంటి
          ధృతిఁదూర్పుమొగసాలఁద్రిపురాంతకముఁగంటి
          ................................................................................
          పర్వతలింగంబుఁ బ్రాణేశుఁడని కంటి
          పర్వతేశ్వరుహృదయ పద్మనిలయునిఁగంటి
          ........................................................................
         భక్తుల ప్రతిహత ప్రతిభమతులని కంటి
         భక్తులకుఁబ్రత్యర్థిపరులు లేరనికంటి
         భక్తులాపదలచేఁబట్టుపడరని కంటి
         ...........................................................
         శివభక్తిదూషకులు చిరపాపులని కంటి,

శివభక్తిదూషకులు చెడిపోదురని కంటి
..................................................................
త్రిభువనము భక్తులకుఁ దృణకణంబని కంటి
సభలందు భక్తులకుఁ జయవాదమని కంటి
......................................................................
.....................................................................
గౌరీశుఁడే సర్వకర్తగాఁ బొడగంటి
కారుణ్యమున శివుఁడు గనిపించెనని కంటి
.....................................................................
బహుపాపములు నన్నుఁ బట్టువిడుచుట గంటి
నయముగా నయనములు నాకీయఁ బొడగంటి
...........................................................................
భయభక్తులను భర్గుపాదములు పొడగంటి
నిది పుణ్యమని కంటి నిది గణ్యమని కంటి
నిది యోగమని కంటి నిది భోగమని కంటి
నిది ధర్మమని కంటి నిది మర్మమని కంటి
నిది నిత్యమని కంటి నిది సత్యమని కంటి
నింక శ్రీగిరిఁ జేర నేఁగందునని కంటి
శంకరుని కృపవడయు సమయ మిదియని కంటి
నింక నాయెత్తు కృతు లిత్తునని పొడగంటి
నింకఁ గృతి సెప్ప నాకేమి భరమని కంటి
వడిఁగృతుల్ నాయెత్తు వచ్చునని పొడగంటి
తనర శ్రీరంగకవి దాతయని పొడగంటి
భువిలోపలఁబ్రసిద్ధ పుణ్యుఁడని పొడగంటి.”
           * * *

సోమనాథపురాణ, గురురాజచరిత్రములందు రంగనాథుఁడని పేరుండఁగా నీ రగడలో 'శ్రీరంగకవి' యని పేరున్నది. రెండు నొక్కనిపేళ్లే కావచ్చును; ఇది వైష్ణవము వీడినతర్వాతిపేరు గావచ్చును. మల్లికార్జునస్వామిని దర్శింపకపోవుటచేఁ గనులుపోవుట, అట్లు పోవుటకుఁ గారణమడుగఁగా శ్రీపతి (అహోబలనృసింహుఁడు) శివుఁడే కర్తయని తెలుపుట కృత్యాది పద్యమునఁ గలదు. సభలందు భక్తులు జయించుట, శివానుగ్రహమునఁ బోయినకన్నులు మరల వచ్చుట రగడలోఁ గలదు.

మఱికొన్ని గాథలు

మఱియు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోని స్థానిక చరిత్రములందును గర్ణాటకవిచరిత్రమునను గూడ నీ క్రింది విషయములు గలవు :

సోమనాథుఁ డోరుఁగంటిలో నుండఁగాఁ బెరుగుకురికి శాస్త్రి, నేతికురికి శాస్త్రియని యిర్వు రాతనితో వివదించిరట; పాలకురికిలో నుండి వచ్చినవారే గదా పెరుగురికి నేతికురికి శాస్త్రులని యవహేళనముచేసి సోమనాథుఁడు వారిని జయించెనట!

గణపుర ప్రభువయిన జగదేకమల్లునిచే సోమనాథుఁడు లింగముద్రతో గొంత భూమిని బడసెనట.

సోమనాథుని నిష్ఠలు, నియమములు

ఈతఁడు చతుష్షష్టిశీలసంపన్నుఁడని పలువురు చెప్పిరి. చతుష్షష్టిశీలముల వివరణమున కిది చోటుగాదు. 'భవిజన దర్శన స్పర్శ నాలాప వివిధ దానాదాన విషయదూరగుఁడ'నని యీతఁడు చెప్పుకొన్నాఁడు. శైవేతరుల (భవుల) మొగములఁ జూడమని శైవులును, వైష్ణవేతరుల మొగములఁ జూడమని వైష్ణవులును వ్రతములు పూనుట గలదు! అట్టివారు నేఁడునున్నారు!

సోమనాథుని వైదుష్యము

సోమనాథుని పాండిత్యవిశేషము చతుర్వేదసారమునను, పండితారాధ్యచరిత్రమునను, బసవరాజీయము (సోమనాథభాష్యము) నను గాననగును. వేదములనుండి, పురాణములనుండి శివపారమ్యప్రతిపాదకములయిన వాక్యముల నీతఁడు హెచ్చుగాఁజూపినాఁడు. వేదములు, వేదభాష్యములు (కొన్నిచోట్ల వేదభాష్యముల ప్రతీకముల నిచ్చినాఁడు. ఆ భాష్యము లెవ్వరివో? విద్యారణ్యభాష్య మప్పటికి పుట్టలేదు గదా!), పూర్వోత్తరమీమాంసలు పురాణములు మొదలుగా మతాచారవిధులకు సంబంధించిన సంస్కృతగ్రంథములనెల్ల నీతఁడు శోధించినాఁడు. శైవమతవ్యాపకులలో నాంధ్రులలో మల్లికార్జున పండితారాధ్యుఁడు, నీతఁడు గొప్ప విద్వాంసుడు. ఇతర మతఖండనాదుల పట్టులందు మల్లికార్జున పండితారాధ్యులు శివతత్వసారమునఁ జెప్పినయుక్తులనే యీతఁడు వివరించి తన పండితారాధ్యచరిత్రమునఁ జేర్చినాఁడు. బసవేశ్వరుఁడు పరమశైవుఁడై శివభక్తిరసామృతసింధువున నోలలాడిన భక్తాగ్రణియు, గేయకవితావిశారదుఁడును నగును గాని యీ యిర్వురంత గొప్పవిద్వాంసుఁడు గాఁడేమో!

పాండిత్య మిట్లుండఁగా నీతఁడు సంస్కృతాంధ్ర కర్ణాట ద్రవిడ మహారాష్ట్ర భాషలలోఁ గవితఁజెప్పనేర్చినవాఁడు. సంస్కృతాంధ్ర కర్ణాట భాషలలో నీతఁడు రచించిన గ్రంథములే కలవు. కాని, యీతని సంస్కృతకవిత యంత రసవంతమయినది గాదు. సంస్కృతవచనరచనయు నంత మేలయినదిగాదు. ఆంధ్రదేశమునను, ఆంధ్రవాఙ్మయమునను గడించిన గౌరవమున కంటె సోమనాథుఁడు కర్ణాటదేశమునను, గర్ణాటవాఙ్మయమునను హెచ్చుగౌరవము గడించెను. కాని, యాతని కర్ణాటరచనములు నంతగొప్పవి గావు. బసవపురాణ, పండితారాధ్యచరిత్రలలోఁ బ్రస్తుతులయిన పలువురు భక్తుల చరిత్రములు ద్రవిడ మహారాష్ట్ర దేశములందుఁ బ్రఖ్యాతములయినవి. ఆ భాషలలో నాతనికిఁ బరిచితి లేకున్నచో నాయాచరిత్రముల నాతఁడు సంధానింపఁజాలక పోవును. బసవపురాణమున నొకచోట ప్రౌఢమయిన ద్రావిడకృతినే ప్రపంచించినాఁడు. ఈతని యాంధ్రకవితానైపుణ్యము, ఆంధ్రభాషావైశారద్యము, గ్రంథవిమర్శన ప్రకరణమునఁబ్రస్తుతింతును. ఈతనికిఁ 'దత్త్వవిద్యాకలాపకవితాసార' 'అన్యవాదకోలాహల' 'ప్రత్యక్షభృంగీశావతార' బిరుదములు గలవని కర్ణాటకకవిచరిత్రకారులు వ్రాసిరి. ఆంధ్రగ్రంథములందు బిరుదములు గానరావు. కాని, పద్యబసవపురాణమం దీతఁడు 'జైనమస్తకవిన్యస్త శాతశూలకలిత బిజ్జలతలగుండు గండబిరుదశోభితుఁ'డని ప్రశంసింపఁబడినాఁడు.

బసవపురాణము

ఈ గ్రంథము ప్రధానముగా బసవేశ్వరుని జీవితచరిత్రమును జెప్పుచున్నది. బసవేశ్వరుఁడు లింగైక్యమందినపిదప నల్పకాలమునకే (ముప్పది యేండ్లకే) రచితమగుటచే నిది తచ్చరిత్రమును దెలుపు సాధనములలో ముఖ్యమయిన దనవచ్చును. బసవేశ్వరుని చరిత్రమును దెలుపునవి, తజ్జీవితకాలముననే వెలసినవి, శాసనములు మొదలగు సాధనము లింతకంటె బలవంతము లింతవఱకుఁ గానరాలేదు.

ప్రధానముగా నిందు బసవేశ్వరచరిత్రమే వర్ణితమయినను, అనుప్రసక్తములుగా నుపాఖ్యానములుగా నింకను బలువురు భక్తుల చరిత్రములు వర్ణితములయినవి. సోమనాథుఁడే తద్గ్రంథరచనమునకుఁ గథావస్తుసామగ్రిని గథాకోవిదులగు వృద్ధులవలన నుండియుఁ, బ్రాచీనులగు భక్తులును, బసవేశ్వరుఁడును, జెప్పిన పాటలు పదములు మొదలగు గేయరచనములవలన నుండియు గ్రహించినట్లు చెప్పుకొన్నాఁడు.

ఆతతబసవపురాతనభక్త
గీతార్థసమితియే మాతృక గాఁగఁ
బూరితంబై యొప్పు పూసలలోన
దారంబుక్రియఁ బురాతనభక్తవితతి
చరితలలోపల సంధిల్ల బసవ
చరిత మే వర్ణింతు సత్కృతి యనఁగ.....
ప్రస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణఁ
బ్రస్తుతికెక్కినబసవని చరితఁ
జెప్పితి భక్తులచే విన్నమాడ్కిఁ
దప్పకుండఁగను యథాశక్తిఁ జేసి.”

బసవపురాణము సోమనాథోపజ్ఞమేయగుటను బయిద్విపదలు స్పష్టపఱుచుచున్నవి. కాని, యీ సోమనాథుఁడే పండితారాధ్యచరిత్రమున రెండుచోట్ల నిట్లు చెప్పినాఁడు:

బసవన్నగీతముల్ వచరించువారు
బసవపురాణమొప్పఁ జదువువారు.....
అరుదగు దాసయ్య యఱువత్తుమువుర
చరితంబులను శ్రీబసవపురాణంబు
నేలలువెట్టంగ నింపుసొంపారు
శైలిమైఁ గ్రాలుచుఁ జదివెడువారు
చాతుర్య మెసఁగ బసవదండనాథు
గీతంబులాదిగా గీతాఢ్యులయిన
సకలపురాతనచారుగీతములు
ప్రకటించి ప్రకటించి పాడెడువారు.

- పండితారాధ్యచరిత్రము.

ఈ ద్విపదలు పండితారాధ్యులవారు శివరాత్రిమహోత్సవమును శ్రీశైలమున జరపనేఁగినప్పుడు శ్రీశైలమధిరోహించు భక్తులచేష్టల వర్ణించు పట్టుననున్నవి. వీనినిబట్టి చూడఁగా బసవపురాణ మాకాలమునకే యున్నట్టుగా నేర్పడును. సోమనాథుఁడు, శైవగ్రంథసంచయమునఁ దనబసవపురాణము పేరుగూడఁ జేర్చుకొనుట నభిలషించియుఁ దన బసవపురాణ రచనానంతర మది శ్రీశైల మధిరోహించు భక్తులచేఁ బఠింపఁబడుచుండుట నభిమానించియుఁ గాలదోషము గలుగుటను బాటింపక యట్లు చెప్పియుండవచ్చును. అంతేకాని, వాస్తవముగా నాకాలమునకు బసవపురాణము పుట్టలేదు.

బసవపురాణమున బసవేశ్వరచరిత్రముగాక మఱి మహారాష్ట్రులు, ఆంధ్రులు, కర్ణాటకులు, ద్రవిడులు నగు భక్తుల చరిత్రములుగూడఁ బెక్కులు వర్ణితములయినవి. అందాంధ్రకర్ణాట మహారాష్ట్ర దేశభక్తులలోఁ బ్రాయికముగాఁ బలువురు బసవేశ్వరుని సమకాలము వారగుదురు. కావున వారి కథలు బసవేశ్వరుని కథవలెనే వృద్ధశైవులు చెప్పుటచేతను, కొన్నిగొన్ని గేయములలో (బసవేశ్వర ప్రభృతులు రచించినవి) ప్రస్తుతములగుటచేతను దెలిసికొని పెంపొందించి వర్ణించియుండును. కాని, ద్రమిళభక్తుల కథలు కొన్ని మిక్కిలి ప్రాచీనములగుటచేతను, ద్రవిడభాషలో నా కథలు గ్రంథరూపమున రచితములయి యుండుటచేతను, హెచ్చుగా నాకథలే బసవపురాణమున వర్ణితములయి యుండుటచేతను, అందును నట్టిద్రవిడభక్తుల చరిత్రములను దెలుపునదియు, మిక్కిలి ప్రాచీనమైనదియునగు 'తిరుతొండర్‌తొఘై' అను గ్రంథము బసవపురాణమునఁ గొంత ప్రపంచితమై యుండుటచేతను సోమనాథుఁ డా కథల నేదేని ద్రవిడగ్రంథమున నుండి గ్రహించి తెలిఁగించెనేమోయని సందేహింపఁ దగును. బసవపురాణమున వర్ణితములగు ద్రవిడభక్తుల చరిత్రములనే వర్ణించు ద్రవిడగ్రంథములలో 'పెరియపురాణ' మను గ్రంథము మిక్కిలి ప్రఖ్యాతమయినది. శివభక్తుల కథల కది నిధానము. ఆ గ్రంథమునకు ద్రవిడభాషలో గొప్పగౌరవము గలదు. అది 'శేక్కిజ్షార్' అను శివకవిచే రచితమయినది. ఆతఁడు సోమనాథుని కంటె నించుకపూర్వుఁడు. అనపాయుఁడను కులోత్తుంగచోడుని యానతిచే నది రచితమయ్యెనని యందుఁగలదట! రెండవ కులోత్తుంగచోడునకే యనపాయుఁడని పేరుగలదు గావునను, ఆతఁడు క్రీ. 1145 నాఁటివాఁడు గావునను దత్కృతమయిన పెరియపురాణమున నుండి సోమనాథుఁడు కథల గ్రహించియుండఁగూడును. కాని, చదివిచూడఁగాఁ నాపురాణమునఁ జెప్పఁబడిన కథారీతులకును, బసవపురాణమునఁజెప్పఁబడిన కథారీతులకును సంబంధమంతగా గానరాకున్నది. స్థూలదృష్టినే సోమనాథుఁడు వానిని గ్రహించియుండవచ్చును.

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారమున సూత్రప్రాయముగాఁ గొందఱు శివభక్తుల కథలు చెప్పఁబడినవి. సోమనాథుఁ డాకథలనెల్ల నిందు వివరించినాఁడు. ఇందుఁ దిన్నగా వివరింపకున్న వానిఁ గొన్నింటిని బండితారాధ్యచరిత్రమునఁ జెప్పినాఁడు. బసవ పండితారాధ్యచరిత్రములను రచించు ఛలమునఁ బ్రాక్తనభక్తుల చరిత్రముల వర్ణించి తన వాక్కును బవిత్రపఱుచుకొందునని యాతఁడే చెప్పుకొన్నాఁడు. బసవపురాణ రచనమున కించుక ముందుగాఁ (క్రీ. 1165) హరీశ్వరుఁడను కవిచేఁ గర్ణాటకమున 'శివగణదరగళె' యను గ్రంథము రచితమయినది. అందును శివభక్తుల చరిత్రములే వర్ణితము లయినవి. అదికూడ నీతని గ్రంథరచనముకుఁ దోడ్పడి యుండవచ్చును. మఱియు సంస్కృతమున శివభక్తుల (అఱువదిమూవుర) చరిత్రములఁ జెప్పుగ్రంథములు గలవు. అవి సోమనాథునికిఁ దర్వాతివి కానిచో వానినిగూడ నీతఁడు చూచి యుండవచ్చును.

బసవపురాణగౌరవము - దాని పరివర్తనములు

సోమనాథోపజ్ఞముగా వెలసినదైనను బసవపురాణము శైవులలో మతగ్రంథముగా బహుప్రఖ్యాతిని బడసెను. ఆంధ్రదేశముకంటెఁ గర్ణాటదేశమున దీనికి గౌరవము మిక్కిలి యెక్కువ. బసవేశ్వరుఁడు పెంపొందించిన వీరశైవము (దీనిస్వరూపము ముందు తెలియును.) హెచ్చుగాఁ గర్ణాటదేశమునఁ బెంపొందెను గాన, తచ్చరిత్రమునకుఁగూడ నక్కడ గౌరవమెక్కువ. తన ఘనకృతులు తెనుఁగుననే వెలయించినవాఁ డయినను, సోమనాథుఁడు గూడఁ గర్ణాటదేశముననే హెచ్చుగా గౌరవముఁ బడసెను. ఆంధ్రదేశమునఁగూడఁ నారాధ్యబ్రాహ్మణులకంటె వీరశైవులగు జంగములు లింగబలిజెలు మొదలగువారు దీనిని మిక్కిలి గౌరవముతో నారాధింతురు. శుభాశుభసమయములం దీగ్రంథమును వారు పారాయణము చేయుచుందురు. ఇందలి యుపాఖ్యానము లనేకప్రబంధములుగా నితరకవులచే రచితము లగుటేకాక యీ గ్రంథమే యనేకకవులచే ననేకవిధరచనలతో ననేకభాషలలోనికిఁ బరివర్తితమయినది. కర్ణాటకమున భీమకవి దీనిని షట్పదివృత్తములలో ముక్కకుముక్కగాఁ బరివర్తించెను. రాఘవాంకకవి 'వృషభేంద్రవిజయ' మనుపేర వృత్తములలో రచియించెను. ఇంకను గన్నడమునఁ బెక్కుగ్రంథములు గలవు. సోమనాథుని తెలుఁగుకృతిని, భీమన కర్ణాటకృతిని ననుసరించి యరవమున నొకకవి బసవపురాణమును బద్యకృతిగా రచియించెను.

తెలుఁగునఁ బిడుపర్తి బసవన పద్యకృతిగాక యింకను బెక్కులు బసవపురాణములు గలవు. బెజవాడ వాస్తవ్యుఁడు, శ్రీపతి పండితారాధ్య సింహాసనారూఢుఁడు నగు మహాదేవారాధ్యుఁ డొకబసవపురాణమును, బద్యకృతిని రచియించెను. మఱియు నాపస్తంబసూత్రుఁడు, హరితసగోత్రుఁడునగు తుమ్మలపల్లి నాగభూషణకవి వేఱొక బసవపురాణమును బద్యకృతినే రచియించెను. ద్విపదలుగా, యక్షగానములుగా బసవపురాణమును రచియించినవా రింకను బెక్కురు గలరు. బసవపురాణము సంస్కృతమునకుఁగూడఁ బరివర్తితమైనది. కాని, యాసంస్కృతగ్రంథమును జూచి పలువు రది మిక్కిలి ప్రాచీనమైనదనియు, దానిఁబట్టియే భాషాగ్రంథములు పుట్టెననియు, నది వ్యాసప్రణీతమనియు భ్రమింతురు. ఆ గ్రంథమం దట్లే కలదు. గద్య మిట్లున్నది:

“ఇతి శ్రీ బాదరాయణమహర్షి ప్రణీతే శ్రీ బసవేశ్వర పురాణే స్వరూప గ్రంథే పరమరహస్యే స్కందాగస్త్యసంవాదే త్రిచత్వారింశో౽ధ్యాయః.”

ఇది ప్రాచీనమయినదిగాని వ్యాసప్రణీతముగాని కాదనియుఁ గృష్ణామండలమందలి యేలూరిలోఁ గాపురమున్నవారు కందుకూరివారు దీనిని దెనుఁగు బసవపురాణమునుబట్టి సంస్కృతమునకుఁబరివర్తింపఁజేసిరనియు దానిలోని ద్విచత్వారింశాధ్యాయమందలి కథనుబట్టి మనము గ్రహింపవచ్చును. అందిట్లున్నది :-

"కృష్ణాగోదావరీనదుల నడిమిదేశమున హేలాపుర (ఇది యేలూరి కిటీవలి వారు పెట్టిన పేరు) మని నగరముగలదు. ఆ నగరమున 'పేరలింగ' మని నీతిశాస్త్రవిశారదుఁడొకఁడు పుట్టఁగలఁడు. అతఁడు లింగధారి; శివార్చనపరుఁడు. ఆయన భార్య వీరమ్మ. వారికి అమృతలింగమని కుమారుఁడు పుట్టును. ఆతఁడు శ్రీశైలమందు మల్లికార్జునదేవునిఁగూర్చి తపమాచరించును. మల్లికార్జునస్వామి ప్రత్యక్షమై నీకుఁ బుత్రుఁడనుగాఁ బుట్టుదునని వరమిచ్చును. అట్లే పుట్టును. అతని పేరు మల్లికార్జునుఁడే. ఆతఁడు మహాప్రాజ్ఞుఁడు; లింగార్చనవ్రతుఁడు. ఆయన జ్యేష్ఠపత్ని గురవమ్మ. వారికి వీరలింగమని కొడుకు పుట్టును. తర్వాత అమృతలింగము, వీరేశ్వరుఁడు, సాళ్వేశుఁడు, మూర్తిరాజు, కూడలిసంగయ్య అను వారు జనింతురు. పిదప నొకనాఁడు స్వప్నమున పాలంకి సదాశివుఁడను తమ గురువురూపముతో శివుఁడు ప్రత్యక్షమై మల్లికార్జునున కిట్లు చెప్పును. “నీగర్భమున నిఁక బసవేశ్వరుఁడు జన్మించును. ఆతనికి బసవేశ్వరుఁడని పేరిడుము. మీకు గురువయిన పాలంకి సదాశివాఖ్యుఁడగు నాచే నీ పుత్త్రులందఱకు లింగధారణముఁ జేయింపుము” అని. ఆ స్వప్నముచొప్పుననే కొన్నాళ్ల కాతనికిఁ గుమారుఁడు కలుగును. ఆతనికి బసవేశ్వరుఁడని పేరిడుదురు. వారియింటిపేరు కందుకూరివారు. ఆతఁడు మహావిద్వాంసుఁడు, మహాదాత, అనేక రాజసమ్మానితుఁడు నగును. ఆతనికి గంగమ్మయని వీరమ్మయని యిర్వురు భార్యలగుదురు. అందు వీరాంబాబసవేశ్వరులయోగము గౌరీశంకరుల యోగమువలె శాశ్వతమై వెలయును” అని యాయధ్యాయము కథాసారము.

ఏలూరిలో కందుకూరివారని ప్రఖ్యాతులగు నారాధ్యబ్రాహ్మణులు నేఁడు నున్నారు. అత్తలూరిపాపకవి చెన్నబసవపురాణమును గృతినందినవా రాయింటివారే. సోమనాథుని ద్విపద బసవపురాణము నింతకుముందుఁ జక్కగా నచ్చునఁ గూర్పించినవా రావంశమువారే. ఆ గ్రంథముచివర వారు తమవంశావళినిగూడఁ జేర్చిరి. ఈ సంస్కృతబసవపురాణమున వర్ణితుఁడగు బసవేశ్వరుని నావంశావళిని బట్టి గుర్తింపనగును.

శంకరకవికృతిగా సంస్కృతబసవపురాణమును గర్ణాటకకవిచరిత్ర పేర్కొనుచున్నది. అది యిదిగాక వేఱొకటి కావచ్చును. ఏలనగా నిది వ్యాసప్రణీతమని కలదు.

బసవేశ్వర చరిత్రము

(బసవపురాణమునుబట్టి)

శ్రీశైలమునకుఁ బశ్చిమభాగమునఁ గర్ణాటదేశమున హింగుళేశ్వరభాగవాటియను నగ్రహారముగలదు. (ఇది యిప్పటి బిజపూరు జిల్లాలో నున్నది. ) అందు మండెఁగ మాదిరా జనుబ్రాహ్మణుఁడు గలఁడు. ఆయన భార్య మాదాంబ. నందీశ్వరుఁ డామె గర్భమునఁ బుత్త్రుఁడై జనించెను. ఆ బాలుని జననవేళకుఁ గూడలి సంగమేశ్వరదేవుఁడు తాపసవేషమున వచ్చి లింగార్పిత మాతనికిఁ గుడుపవలదని మాదాంబకు బోధించిచనెను. తల్లిదండ్రులు బసవఁడని యా శిశువునకుఁ బేరిడిరి. గర్భాష్టమవర్షమున నాతనికిఁ దండ్రి యుపనయనము చేయ  యత్నించెను. భక్తివేఱు, బ్రాహ్మ్యమువేఱు గావున భక్తుఁడగు తనకు బ్రాహ్మ్య మక్కఱలేదని చెప్పి తండ్రితో వాదించి బసవన యుపనయనము చేసికొనఁ డయ్యెను. తల్లిదండ్రులతో వేర్పడి తనసహోదరి నాగమాంబతో నాతఁ డిల్లువీడి వెలికిఁజేరెను. మాదాంబసోదరుఁడును, కళ్యాణకటకము నేలుచున్న బిజ్జలుని దండనాయకుఁడును నగు బలదేవుఁడు వారి నాదరించెను. భవికిఁ బుత్త్రిక నీయనని పూనిక గల్గియున్నవాఁడు గావున నాబలదేవదండనాయకుఁడు తనకూఁతురగు గంగాంబను బసవని కిచ్చి పెండ్లిచేసెను. ఆ వింతపెండ్లికి లోకు లాశ్చర్యమందిరి. పిదప బసవన్న, గంగాంబ, నాగాంబ మువ్వురును గూడలిసంగమేశ్వరుని దర్శింప నేఁగిరి. సంగయ దేవుఁడు మునుపటి విధమునఁ దాపసవేషముతో గుడిముందు ప్రత్యక్షమయ్యెను. బసవన యారాధించెను. శివభక్తులదుశ్చరిత్రములు మేలుగానే గ్రహింపుమనియు, శత్రులయినను లింగవంతులను మిత్రులనుగానే చూడుమనియు ప్రాణాపాయము వచ్చినను బూనినవ్రతము విడువకుమనియు, భక్తులజాతుల విచారింపకుమనియు, శివద్వేషులను జంపుమనియు, వేదశాస్త్రార్థసంపాదితమైన భక్తిని లోకమున నెలకొల్పుమనియు, - ఇత్యాది విధముల సంగయదేవుఁడు బసవనికి హితోపదేశము చేసి గుడిసొచ్చి యంతర్ధానమయ్యెను. భక్తులెల్లరు నబ్రమంది బసవనను బ్రస్తుతించిరి.

బలదేవదండనాయకుఁడు శివలోకమున కేఁగెను. ఆతని దండనాయక పదమును బిజ్జలుఁడు బసవని కొసఁగెను. బసవన కళ్యాణ కటకమునకుఁ జేరెను. ఆతని యాదరువున నసంఖ్యాకులుగా శివభక్తులు కళ్యాణమునకుఁ జేరుచుండిరి. అప్పుడు కళ్యాణముననున్న శివభక్తుల సంఖ్య లక్షయు నెనుబదివేలని పండితారాధ్యచరితమందు గలదు. మిండజంగములే పండ్రెండువే లుండెడువారట! ఇందఱకును బసవన యీప్సితార్థములు సంఘటించుచుండెడివాఁడు. బసవనసోదరియగు నాగాంబకుఁ జెన్నబసవన్న యని కొడుకు గల్గెను. ఆతఁడు బసవన తర్వాత బసవన యంతవాఁడు. మేనమామ నాతఁడెంతయుఁ నారాధించుచు శిష్యుఁడై యాతని యాజ్ఞలో మెలఁగుచుండెను. అల్లమప్రభువను శైవాచార్యుఁ డొకనాఁడు బసవనియింటికి వచ్చెను. బసవన యామహనీయునకు విందువెట్టెను. ఆతఁడు బసవనికి బెక్కువరము లొసఁగెను. అప్పటనుండి బసవన యనేకాద్భుతకృత్యములఁ జేయఁజొచ్చెను.

ఒకనాఁడు దొంగఱికము చేయుటకయి కొందఱు దొంగలు భక్తులువోలె వంగకాయలు లింగములుగాఁ గట్టుకొని బసవనయింటి కరుదెంచిరి. బసవనచూచి వారిని గుర్తించి దయచేయుఁడని యాహ్వానించి "లింగభక్తులు గానివారు నా యిల్లు సొరరాదుగాన మీరు మాహేశ్వరులే. లింగార్చనలు సేయుఁ”డని వేఁడెను. దొంగలు జడిసి కూర్చుండిరి. బసవన వారికి వాంఛితార్థ మొసఁగెను. వారి మెడలోని వంగకాయలు నిజముగా లింగములయ్యెను.

ఒక భక్తుఁడు బసవనికడకువచ్చి నిత్యలింగార్చనమున మ్రుగ్గువెట్టుటకు గాను పదిపుట్లముత్తెములు కావలెననఁగా బసవన చూచిన మాత్రనే జొన్నలరాశి ముత్యములుగా మాఱెను. దాని నాభక్తున కొసఁగెను. ఈ విధముగా నెడలేక శివభక్తుల కాతఁడు దానము సేయుచుండుట నెఱిఁగి సంగయదేవుఁ డొకనాఁడు జంగమరూపమునవచ్చి 'నాకు మూఁడవక న్నొసఁగు' మనికోరెను. లింగపసాయితమను ఖడ్గమును బూని 'నీమాయ నేనెఱుఁగనా? యిదె చూచుకొమ్మ'ని యుద్ధమున నాయనకు ముక్కన్నుఁ జూపెను. లజ్జించి సంగయదేవుఁడు మాయమయ్యెను. 'ఇసీ! పాఱిపోయితివా? వారు వీరు వలె నిన్ను, నేను వర మడుగువాఁడ ననుకొంటివా? నీ భక్తు లారగింపఁగా మిగిలిన ప్రసాదమే కలకాలము నాకుఁ గలదు. నీకేమైన వలయునేని కోరుము; నేనొసఁగెదను. మాట తప్పువాఁడనుగాను; నీయాన! నీ ప్రమథులయాన!” యని గద్దించి యాదేవు నోడించి బసవన గెలిచెను.

ఒకనాఁడు బిజ్జలునికొల్వునఁ గూర్చుండి వ్యవహారము నడపుచు బసవన నడుమ నసందర్భముగా "వెఱవకు వెఱవకు ” మనుచుఁ గడువఁబైకెత్తువిధమునఁ జేతులు పైకెత్తెను. బిజ్జలుఁడు నవ్వి! 'ఏమయా నీకు భక్తిరసము తలకెక్కెనా? శైవపుఁబిచ్చి యెత్తెనా? అదియేమి అట్లసందర్భముగా మాటాడితివి? చేతు లెత్తితివి?' అని యడిగెను. 'త్రిపురాంతకుని గుడికిఁ దూర్పున (ఇది కళ్యాణ కటకమునఁ గలదే.) గపిలేశ్వరమున నొకతపస్వి యనుదినము నాఱుపుట్లపాలతో శివు నభిషేకించుచున్నాఁడు. ఆ పాలు వీథివీథులను గాలువలుగట్టి పాఱుచున్నవి. చల్లమ్ము గొల్లది యొకర్తె నెత్తిపైఁ గడువఁబెట్టుకొని యటపోవుచుఁ గాలుజారి పడఁబోవుచు "బసవయ్యా” అని పిలిచెను. ఆమెకుఁ దోడ్పడితిని. ఆ గొల్లదాని రూపిట్టిది; దాని యిల్లిట్టిది; విచారించి కనుఁగొనుము' అనెను. రాజు విచారింపగా నదియట్లే జరగినట్టు తెలిసెను. అబ్బురమంది రాజు బసవన నారాధించెను.

సొన్నలికపురమున శ్రీశైల మల్లికార్జునిని వెలయించి లక్షతొంబదివేల శివలింగములఁ బ్రతిష్ఠించి మర్త్యములోని యన్నపానముల ముట్టక, సహజమకుటము, నొసలికన్ను గలిగి, మేనినీడ, అడుగుజాడ, గానరాకుండఁ గైలాసముదాఁకఁ జరించువానిని సిద్దరామయ్య యను మహనీయుని నడిగి యొకప్పుడు శివభక్తులు కొందఱు బసవన యిహముననేకాక శివలోకమునను గూడఁ గానవచ్చుట నెఱిఁగిరి.

మిండజంగముల మిండఱికపు ముచ్చట్లకుఁగాను బొక్కసమునఁగల ధనమెల్ల బసవన వెచ్చపెట్టుచుండఁగా నుద్యోగులు బిజ్జలున కెఱిఁగించిరి. బిజ్జలుఁడు బసవనిఁ బిలిచి 'యట్లుచేయుట పాడియా' యని యడిగెను. 'ఒడయల సొమ్మే యొడయల కిచ్చితిఁ గాని మీధనముగా'దని బసవన యనెను. లెక్కలు చూపెను. బొక్కసపుఁదాళములు దెఱచి చూచుకొమ్మనెను. చూడఁగా లెక్కకు మిక్కిలియై బొక్కసమున ధనముండెను. బిజ్జలుఁడు నివ్వెఱ చెందెను.

బసవనభార్య గంగాంబ కట్టుకొనిన చీరఁ దెచ్చియిచ్చినఁ గాని చేరనియ్య నని వేశ్య యొకమిండజంగమున కానవెట్టఁగా నాతఁడు వచ్చి యడిగినంతనే బసవన తన భార్యచేత నా చీర నిప్పించెను. ఇట్లు పలువురు మిండజంగములకు వాంఛితార్థము లొడఁగూర్చెను.

జాతిభేదముఁ బాటింపక బసవన భక్తులయినచో మాలమాదిఁగలనుగూడ నారాధించుచుండెను. వారు కుడిచి డించిన యుచ్ఛిష్టమును భుజించుచుండెను. వారితోఁ జెయిచెయిఁగలపి తిరుగుచుండెను. ఇది సయిపఁజాలక రాజపురోహితులు రాజుతో విన్నవించిరి. 'కళ్యాణకటకమెల్ల బసవని మూలమునఁ జెడుచున్నది. వర్ణాశ్రమధర్మము లిఁక నిలుచునట్లులేవు. ఆతఁడు మాలమాదిఁగలతో భుజించుచున్నాఁడు; మరల నీ నగరిలోనికి మర్యాదగా వచ్చుచున్నాఁడు. శివనాగుమయ్య యనుమాలనితో నిప్పుడు దిరుగుచున్నాఁడు చూడు'మని యాతనికిఁజూపిరి. రాజు కోపించెను. బసవన వాదించెను. వీరమాహేశ్వరులకు జాతిభేదము పరికింపరాదనెను. బ్రాహ్మణులకంటె, భక్తులే యధికులనెను. శివనాగుమయ్య హస్తమునుబట్టి యొత్తి దాననుండి పాలు చిమ్మిరేఁగుటను బిజ్జలాదులకుఁ జూపెను. బ్రాహ్మణు లోడిపోయిరి. బసవనివాదమునకు లోఁగి బిజ్జలుఁడు శివనాగుమయ్యకు మ్రొక్కెను. ఏనుఁగు నెక్కించి యూరేఁగించి బసవయ్య శివనాగుమయ్యను దనయింటికిఁ గొంపోయెను.

కళ్యాణపురమున నప్పు డీపేళ్ళవారు భక్తులుండిరి

(బసవ. పు. 226 చూడు.)

(రుద్రునిమాఱట రూపంబు లనఁగ - భద్రేభసంహరు ప్రతినిధులనఁగ
కళ్యాణమున నిత్యకల్యాణభక్తి - లౌల్యనిరర్గళ లాలిత్యముగను
మడివాలుమాచయ్య మాదిరాజయ్య - బడవరబ్రహ్మయ్య బాచిరాజయ్య
కిన్నర బ్రహ్మయ్య గేశిరాజయ్య - కన్నడ బ్రహ్మయ్య గల్లిదేవయ్య
మోళిగమారయ్య ముసిఁడిచౌడయ్య - శూలదబ్రహ్మయ్య సుఱియచౌడయ్య
కలికేతబ్రహ్మయ్య గక్కయ్యగారు - తెలుఁగేసు మసనయ్య దెలుఁగు జొమ్మయ్య
శాంతదేవుండును జమ్మయ్య బాస - వంతు కేసయ్య యేకాంతరామయ్య
యుత్తమాంగద కేశిహొన్నయ్య గండ - గత్తెరనాచయ్య గాలాగ్ని రుద్రి
శృంగిబొప్పయగారు [7]సిగురుచందయ్య- డింగరిమల్లయ్య సంగమేశ్వరుఁడు
కదిరెరెమ్మయ మహాకాళయ్యగారు - పదుమరసును బురాణదమాయిభట్టు
నుదరదరామయ్య యోగిదేవయ్య - యుదయమరసుగారు హొన్నయ్యగారు
ధవళయ్యగారు బొంతాదేవిగారు - సవరద[8] చిక్కయ్య సారెనాయండు



శివముద్దుదేవుండు సిక్కదేవుండు - శివరాత్రి సంగయ్య యవిముగతయ్య
చండేశుచామయ్య ముండబ్రహ్మయ్య - బండె [9]యరేవణ్ణ [10]యిండెసోమన్న
హాటకేశ్వరుని బ్రహ్మయ మహాబలుఁడు - కోటేశుచామయ్య గొగ్గయ్యగారు
దుమ్మదబ్రహ్మయ్య ధూర్జటికేశి - యెమ్మెసంగయ గపిలేశు విస్సయ్య
నొణిమేశుచిక్కయ నులుకచందయ్య - గణదాసిమాదన్న [11]గంటిమల్లయ్య
మురహాటకేతయ్య హరవిహొల్లయ్య - గిరిగీఁటు సింగయ్య గురజకాళవ్వ
బానసభీమయ్య భాస్కరయ్యయును - గోనియమల్లయ్య గొగ్గయ్యగారు
అల్లయ్యమధుపయ్య యనిమిషకేశి - హొల్లయ్య గోడలమల్లయ్యగారు
ఓలెబ్రహ్మయ కరహాళమల్లయ్య - బాలబ్రహ్మయగారు పణిహారిబాచి
కవిలెబ్రహ్మయ బందికారమల్లయ్య - యవకరకేతయ్య శివనాగుమయ్య
నిజలింగచిక్కయ్య నిర్లజ్జశాంతి - నిజభావుఁడును నిత్యనేమదమైలి
యంకబ్రహ్మయ గరహాళ బ్రహ్మయ్య - సుంకేశుబంకయ్య లెంకమంచయ్య
యేలేశుబ్రహ్మయ్య యీడెబ్రహ్మయ్య - మైలనబ్రహ్మయ్య మాయిదేవయ్య
చక్కెరబ్రహ్మయ్య శరణయ్యగారు - చిక్కబ్రహ్మయ్యయు సిరిగిరయ్యయును
వీరమారయ్యయు వీరలింగయ్య - వీరబ్రహ్మయ్యయు వీరభావయ్య
వీరనాగయ్యయు వీరకల్లయ్య - వీరభోగయ్యయు విమలదేవయ్య
[12]కక్కయ్యగల్లయ్య గాటకోటయ్య - చిక్కయ్య వీరయ్య శ్రీసూరసాని
కొండగుడ్కేతయ్య గుండయ్యగారు - చండేశుబ్రహ్మయ్య శంకరయ్యయును
అమృతదేవయ్యయు ననిమిషయ్యయును - విమలదేవుండును వీరాదిగాఁగ
శివభక్తిసంపదల్ సిలివిలివోవ - సవిశేషభక్తి దృష్టప్రత్యయములఁ
జూపుచుసద్భక్తి సురుచిరమహిమ - నేపారు వీరమాహేశ్వరావలికి.

కల్యాణపురమున బసవని బలఁగమును జూచి శివార్చకులు, పాశుపతులు మొదలగువా రనేకు లంతకుముందు లింగము లేనివారయినను నప్పుడు లింగవంతులయి వీరమాహేశ్వరులు కాఁజొచ్చిరి. అంతకుముందు శివాలయములందు దేవలకులు బోయలకు శివప్రసాద మొసఁగు చుండెడివారు. బసవన్న మతము వచ్చిన తర్వాత వారు శివప్రసాదమును దామే భుజింపఁ జొచ్చిరి. బోయల కియ్యరయిరి. పెద్దతగ వేర్పడెను. బోయలు బిజ్జలుని దర్శించి మొఱపెట్టుకొనిరి. బిజ్జలుఁ డిది యేమి యన్యాయ్యమని బసవనిఁ బిలిచి యడిగెను. బసవన వాదించెను. “శైవులవలనఁ బ్రసాదము బోయలకుఁ బోవచ్చునుగాని వీరమాహేశ్వరులవలన బోయలకుఁ జెల్లఁగూడ” దనెను. “కాదందురేని, నేను సంగమేశ్వరదేవునకు నేఁడు విష మర్పింతును. బోయ లారగింతురుగా” కనెను. “వివిధపక్వాన్నము లారగింప మీరును, విష మారగింప మేమునా” యని బోయలు మొఱపెట్టిరి. “శివున కర్పించి విసము బసవన యారగించునది. ఆతఁడు చావకున్న నిఁక మీదఁ బ్రసాదము మాకక్కఱలేదు. చచ్చిన మాకీయవలయు” నని బోయలనిరి. బిజ్జలుఁడంగీకరించెను. బసవన్న యట్లే సంగయదేవునకు విషనైవేద్యము పెట్టి తానును దక్కిన భక్తులు నారగించిరి. బోయలు తగవు విడిచి శరణాగతులయిరి. బసవఁడనుగ్రహించెను.

జగదేవుఁడను దండనాయకుఁడు (ఈతఁడును బసవనగోష్ఠిలోనివాఁడే కాని యప్పటి కింకను, వర్ణాశ్రమధర్మముల విడనాడలేదు) తన యింట శుభకార్యముఁ జేసికొనుచు, బసవన్నను భోజనమునకు రమ్మని ప్రార్ధించెను. ఆతఁడు శరణులరాక కోర్వఁగలవేని వత్తుననెను. జగదేవుఁడు వంటకము కాఁగానే బసవన రాకకుఁబూర్వమే బ్రాహ్మణసమారాధనము గావింపఁజొచ్చెను. పరిచారకుఁడొకఁ డీవార్త బసవనకుఁజెప్పెను. ఆతఁడు గోపించి తాను భోజనమునకుఁ బోవకుండెను. తర్వాత నా జగదేవుఁడు బసవనను బిలుచుకొనిపో వచ్చెను. బసవన తెర యడ్డము గట్టించెను. భక్తజనాళినుండి తొలఁగిపొమ్మని జగదేవునిఁ దెగడెను. “ఈశ్వరభక్తుఁడవై యుండి కర్మచండాలురతోఁ గలసి కుడిచితివి; పాపివి; పోపొ"మ్మనెను. పెక్కుదెఱఁగుల గర్హించెను. జగదేవుడు “కర్మబద్ధుఁడనైతిని; పాపిని. నాకిఁకఁ బ్రాయశ్చిత్తము లేదు. ప్రాణము విడుతును” అని మొఱవెట్టెను. భక్తుల యనుమతిని బసవన్న యిట్లు చెప్పెను. "ఇఁకఁగొలఁ ది దినములలో నీ కళ్యాణకటకమున శివద్రోహము పెంపొందఁగలదు. అప్పుడు శివద్రోహిని జంపుదునని నీ విప్పుడు మాటయిత్తువేని నీ యీతప్పిదమును శివుఁడు మన్నించును.” జగదేవుఁ డందుల కంగీకరించి వీరతాంబూలము గొనెను. బసవన భక్తులతో జగదేవునింటికిఁ బోయి భోజనము చేసెను.

బసవని మాహాత్మ్య మెఱిఁగియుఁ గాలము సమీపించుటచేఁ గొన్నాళ్లు సన్న పిదప, బిజ్జలుఁడు బసవమతమునఁ జేరిన యల్లయ్య, మధుపయ్య లనువారి నిద్దఱును బిలిపించి కారణమేదో తెలుపకుండనే కన్నులు పెఱికించెను. బసవన మొదలగువా రిఁక నీయూర నిలువరాదని నిశ్చయించుకొని జగదేవునిఁ బిలిచి 'యిదిగో, నీబాస చెల్లించుకోవలసిన సమయము వచ్చిన'దని చెప్పి కళ్యాణకటకము పాడగునట్లు శపించిరి. అప్పుడు మడివాలుమాచయ్య, చౌడరాయఁడు, ఏకాంతరామయ్య, కిన్నరబ్రహ్మయ్య, కేశిరాజయ్య, కన్నడ బ్రహ్మయ్య, కక్కయ్య మొదలగువారితో బసవన కప్పడి సంగమేశ్వరమున కేఁగెను. కటకము పాడుపడెను. అపశకునము లనేకములు దోఁచెను. జగదేవుఁడు మల్లయ బ్రహ్మయలను వారిర్వురు దోడురాఁగా నొకనాఁటిరాత్రి బిజ్జలునిఁ బొడిచి చంపెను. తర్వాత నాతఁడు దన్నుఁదాఁ బొడుచుకొని మరణించెను. పిదప బిజ్జలుని బిడ్డలు రాజ్యార్ధమై యుద్ధముచేసి మృతిఁజెందిరి. బసవన కూడలి సంగమేశ్వరమున సంగయదేవునిలోఁజేరెను.

బసవన చరిత్రము

(చెన్నబసవపురాణమునుబట్టి)

చెన్నబసవపురాణము ప్రధానముగా బసవన మేనల్లుఁడు చెన్నబసవనిచరిత్రమును దెలుపుచున్నది. కాని, బసవనిచరిత్రముగూడ నిందుఁగలదు. బసవనిచరిత్రము విషయమున నిది బసవపురాణముతోఁ గొంత వేర్పడుచున్నది. అందుఁ జెప్పఁబడని క్రొత్త విషయములను ముఖ్యభేదములను మాత్రమిక్కడఁజూపుచున్నాఁడను.

బసవని తోఁబుట్టువగు నాగమ్మకుఁ బెండ్లికాలేదు. భర్తలేకయే యామెకుఁ జెన్నబసవన్న పుట్టినాఁడు. బహుకాలప్రయత్నమున బసవన కక్కయ్యయను భక్తవరుని ప్రసాదమును బడసి దానిని దన యుత్తరీయము కొంగునఁ గట్టికొని యింటికి వచ్చెను. ఆతని పరోక్షమున నాగమ్మ దానిఁ జూచి కక్కయ్యగారి ప్రసాదమును దనకొఱకై సహోదరుఁడు దాఁచితెచ్చెనని తలఁచి యారగించెను. తర్వాత బసవన దా నారగించుటకై వెదకి నాగమ్మ యారగించుటను దెలిసికొని తన కాభాగ్యము లేకపోయినందుకుఁ జింతిలి తన సహోదరి భాగ్యవిశేషమున కబ్బురపడెను. తత్ప్రసాదాస్వాదమాహాత్మ్యముచే నాగమ్మ గర్భమునఁ గుమారస్వామి యంశమునఁ జెన్నబసవన్న పుట్టెను. బసవన్నకంటె మిక్కిలి యందగాఁ డగుటచే నీతనికిఁ జెన్నబసవన్న యన్న పేరేర్పడెను. [13]బిజ్జలుఁడు నీలలోచనయని పేరుగలదానిఁ దన చెల్లెలిని బసవనకిచ్చి పెండ్లిచేసినట్లు చెన్నబసవపురాణమునఁ గలదని కొందఱు వ్రాసిరి. తెలుఁగు చెన్నబసవపురాణమున నాకది గానరాలేదు.

బిజ్జలుని జగదేవాదులు చంపిన పిదప బిజ్జలుని పుత్రులు మొదలగువారు కొన్నాళ్లకు బసవనను, చెన్నబసవనను, దదాప్తులను జంపుటకై దండువెడలిరి. అప్పటికి బసవన కూడలి సంగమేశ్వరమున సంగయదేవునిలోఁ జొచ్చెను. చెన్నబసవాదులను వారరణ్యమధ్యమున నడ్డగించిరి. చెన్నబసవేశ్వరుని మాహాత్మ్యమున నందు నంధతమసము క్రమ్ముకొనఁగా యాదవులు పరస్పరము పొడుచుకొని చచ్చినట్టుగా నాసేనయెల్ల గొట్టికొనిచచ్చెను. పిదప భక్తులతోఁ జెన్నబసవన్న హుళికపట్టణముఁ జేరి యక్కడిరాజుచే సమ్మానితుఁడై కొన్నాళ్ల కక్కడనే లింగైక్యమందెను.

బసవనచరిత్రము

(బిజ్జలరాయనిచరిత్రమును బట్టి)

బిజ్జలుఁడు జైనుఁడు. బసవనకుఁ బద్మావతియని పేరు గల తోఁబుట్టువు గలదు. ఆమెను బిజ్జలుఁడు పరిగ్రహించెను. పద్మావతిమీఁది వ్యామోహమున బిజ్జలుఁడు జాగ్రత్తగొనక రాజ్యభారమును మంత్రియగు బసవన కప్పగించెను. మాలలు మాదిఁగలు మొదలగు తక్కువజాతులవాండ్రకు లింగములుగట్టి మాహేశ్వరులని పేరుపెట్టి కులమర్యాదలను సదాచారములను వీటిఁబుచ్చి బసవన గొప్పసాంఘికవిప్లవము గలిగించెను. రాజుప్రాభవమును గుంచించెను; అకృత్యము లనేకములు గావించెను; జైనులను జంపించెను. బిజ్జలున కీతని దుష్పరిపాలనము దుస్సహముగా నుండెను. పరస్పరము వారిలో వైమనస్య మేర్పడెను. కొల్లాపురపు శిలాహారరాజయిన మహామండలేశ్వరుని జయించి కల్యాణమునకుఁ దిరిగివచ్చుచుండగాఁ బసవన పంపిన జంగమొకఁడు జైనవేషముతో వచ్చి దర్శించి బిజ్జలునకు విషఫల మొసఁగెను. దానిని వాసనచూచి యాతఁడు మృతిఁజెందెను. చనిపోవుచుఁ దన కుమారుఁడయిన యిమ్మడి బిజ్జలునితో "బసవన చేయించిన పని యిది! కావున వానిని జంపుము” అని చెప్పెను.

బిజ్జలుని తర్వాతఁ దత్పుత్రుఁడయిన యిమ్మడిబిజ్జలుఁడు రాజయి బసవన్నను బట్టుకొనుటకయి తన దండనాయకులను నియోగించెను. జంగముల ననేకులను బాధించెను. కేరళదేశమునకుఁ బారిపోయి బసవన్న యక్కడ నిమ్మడిబిజ్జలుని సైనికులరాకకు జడిసి బావిలోఁ బడి మృతిఁజెందెను. ఆతని భార్య నీలమ్మ విషము తిని చచ్చెను. “మరణాంతాని వైరాణి” గనుక నిమ్మడిబిజ్జలుఁ డంతతో శాంతుఁడయ్యెను. చెన్నబసవన్న తన మేనమామయగు బసవన్నకున్న ధనకనకవస్తువాహనాదులను రాజున కిచ్చివేసెను. రా జనుగ్రహింపఁగాఁ జెన్నబసవన్న రాజమంత్రి యయ్యెను.

ఏది విశ్వాస్యము?

ఇట్లు బసవని చరిత్రము మూఁడు గ్రంథములందును భిన్నవిధములతో నున్నది. వీనిలో విశ్వాస్య మేది యని యించుక విచారింపఁదగును. బసవపురాణము బసవని లింగైక్యమునకుఁదర్వాత ముప్పదినలువదియేండ్లకు రచితమయినది. చెన్నబసవపురాణము మఱి నన్నూఱేండ్లకుదర్వాత (క్రీ. 1560)ను, బిజ్జలరాయచరిత్ర మంతకింకను దర్వాత (క్రీ. 1600) ను రచితమయినవి. కావున వీనిలో బసవపురాణమే మన కెక్కువ ప్రమాణముగా గ్రహింపఁదగినది. ప్లీటు మొదలగువారు, తెలుఁగు బసవపురాణమును దాని ప్రాచీనతను గుర్తింపమిచే మూఁడుగ్రంథములను సమానదృష్టితోఁ జూచిరి. దేనికిని వారంతగాఁ బ్రామాణ్యము నంగీకరింపరయిరి.

బసవపురాణమునఁ జెప్పఁబడిన విషయములకును, బిజ్జలుని శాసనములఁ బట్టి యెఱుఁగనగుచున్న విషయములకును విరోధ మేమియుఁ గానరాదు గాని, బిజ్జలుని శాసనము లెన్నేని వెలసియుండఁగా నందొక్కదానియందేని బసవనిఁ గూర్చి కాని, వీరశైవమును గూర్చి కాని యే విధమయిన ప్రశంసయుఁ గానరాకుండుట కొంతవింతగాఁ దోఁచును. బసవపురాణమునుబట్టి చూడఁగా బిజ్జలునియొద్ద బసవనిమంత్రిత్వ మానాఁడు పశ్చిమచాళుక్యరాజ్యమున గొప్పయలజడిని మతసంక్షోభమును గలిగించినట్టు కన్పట్టును. ఇంత యలజడి కలిగినప్పుడది బిజ్జలుని శాసనములలోని కేవిధముగానేని యెక్కియుండఁ దగును.

బసవపురాణమున వర్ణితములయిన కథలెల్లనవి యట్లే జరిగినవని చెప్పనలవిగాదు. మడివాలుమాచయ్య, తాను పూర్వదినమునఁ జంపిన మనుష్యుని మర్నా డాకాశముననుండి యవతరింపఁజేయుట, బసవన జొన్నలప్రోవును ముత్యాలప్రోవునుగాఁ జేయుట మొదలగువాని నీ కాలము వారెవ్వరు నమ్ముదురు? అవి యసంభావ్యములు కావనుటకుఁ దగ్గ కాలమింకను రాలేదు. చరిత్రపరిశోధనమున మనమిట్టివాని నర్ధవాదములనుగాఁ గొట్టివేయుచుందుము. ఇట్టి యద్భుతకథలు; మతముతో భక్తితో సంబంధించిన సర్వస్థలములందును గలవు. కాని, బసవనను గూర్చి పాల్కురికి సోమనాథుఁడు చెప్పిన యద్భుతకథలలో నొక్కదానిని మాత్రము బసవన సమకాలమువాఁడే యగు మల్లికార్జున పండితారాధ్యుఁడు గూడ శివతత్త్వసారమున మూఁడుపద్యములలోఁ గొండాడినాఁడు.

క. అసమేక్షణ! శివభక్తుం
    డసమశ్రేష్ఠుఁడని పలికి యన్యులతోడన్
    బొసపోరై బండారువు
    బసవన విసమెత్తి త్రావి బ్రదుకఁడె రుద్రా!

క. వసుధ నుమేశుఁడె దైవము
    ప్రసాదమె పవిత్ర మీశుభక్తులె కులజుల్
    పొసపోరని బండారువు
    బసవన విసమెత్తి త్రావి బ్రదుకఁడె రుద్రా!

క. కుసుమశరారీ! శివలిం
   గసమేతులు దక్కఁ బొందఁగా నిది నిర్మా
   ల్యసుఖంబని బండారువు
   బసవన విషమెత్తి త్రావి బ్రదుకఁడె రుద్రా!

ఇది జరిగినను జరగియుండవచ్చును. పరతత్త్వము శివుఁడే యని త్రికరణశుద్ధిగా నమ్మిన మహాభక్తుఁడు, బసవేశ్వరుఁడు నిర్భయముగా నిస్సంశయముగా నిబ్బరించి లింగమూర్తిపై భారముచి నిజముగా విషము ద్రావి యుండవచ్చును. సంకల్పబలమున నీశ్వరానుగ్రహమునఁ జెక్కుచెదరక నిలిచి యుండవచ్చును. అది యసంభావ్యమని నేఁడు మన మనుకొనఁ బనిలేదు. ఉత్తమయోగ్యత లేవియు నుండకయే సీతారామనామకుఁ డొకయొడ్డీఁడు నేఁడు విషమును, గరఁగించిన సీసమును, నింక నెన్నింటినోకూడఁ దినుచు సర్వభక్షకుఁడని పేరంది నిరపాయముగా నుండుటను మనము వినుచుంటిమి; కనుచుంటిమి.

బసవన తోఁబుట్టువును బిజ్జలుఁడు పరిగ్రహించుటను గాని, బిజ్జలుని తోఁబుట్టువును బసవన పరిగ్రహించుటను గాని సోమనాథుఁడు వాకొనలేదు. అవి నమ్మఁదగినవిగా నాకు దోఁపవు. బసవన తోఁబుట్టువగు నాగాంబ భర్త లేకయే కొడుకును గనెనని చెన్నబసవపురాణము చెప్పుచున్నది గాని, యదియు నేఁటికింకను మనకసంభావ్యముగానే తోఁచుచున్నది. బసవపురాణమున నామెకుఁ జెన్న బసవన్న యని కొడుకు గల్గినట్టు కలదే కాని, యామెకుఁ బెండ్లి జరగినదో లేదో, యామె యాకొడుకు నెట్లు గనెనో తెలియవచ్చుట లేదు. బసవన్న తండ్రితోఁ దగవులాడి యిలు వీడి వచ్చునప్పుడే యామెయు సోదరునితో నిలు వీడినది. బసవన యుపనయనము చేసికొననట్లే యీమె వివాహమును జేసికొనలేదా? ఈ సంశయమే కక్కయ్యగారి ప్రసాదపుఁగథకుఁ గారణమై యుండును. జైనులు శైవులు పరస్పరము ద్వేషము గలవారగుటచేఁ జెన్నబసవపురాణమున వీరొకకథను గల్పింపఁగా బిజ్జలరాయచరిత్రమున దీనికిఁ బ్రతికూలముగా వారొకకథను గల్పించిరి. చెన్నబసవపురాణమున నీలలోచన యను బిజ్జలుని సోదరిని బసవన పరిగ్రహించినట్లుండఁగా, బిజ్జలరాయచరిత్రమున బసవనసోదరి యగుపద్మావతిని బిజ్జలుఁడు పరిగ్రహించినట్టున్నది. మఱియుఁ జెన్నబసవపురాణమునఁ జిత్రకన్యకథ యని యసభ్యపుఁగథ యొకటి గలదు. అది యిది:- బిజ్జలునికి సౌందర్యవతియగు సోదరిగలదు. ఆమె గుఱ్ఱాలకాపరిని గూడెను. బిజ్జలున కది తెలిసెను. “బసవని సోదరియగు నాగమ్మ పెండ్లి లేకుండనే చెన్నబసవన్నను గన్నందుకు నేను బరిహరించితిని. దానికిఁ బ్రతిగా నాకే యిట్టి యవమానము దాపరించెను.” అని దుఃఖించి యాతఁడా గుఱ్ఱపుఁగాపరిని జంపించెను. చిత్రకన్యను జిత్రవధ చేయఁ దలారుల కాజ్ఞాపించెను. వారట్లు చేయుటలో నామె హస్తములు దెగి చెన్నబసవన్న యింటి వాకిటఁబడెను. అతిసౌందర్యవంతములుగానున్న యా హస్తములను జూచి మిండజంగము లచ్చెరువందిరి. ద్వారపాలకులు జరిగిన వృత్తాంతమును జెప్పిరి. మిండజంగములంత సౌందర్యవంతురాలగు నాచిత్రకన్యను జూడమైతిమి గదాయని వగచిరి. ఆమెను బ్రదికించి మాకుఁజూపు మని బసవనను బ్రార్ధించిరి. ఆమె శరీరశకలములెల్ల నేఱి తెప్పించి బసవన యామెను బ్రదికించెను. మిండజంగముల బులుపులు మెండయ్యెను. బసవన యామెను మిండజంగము లెల్లరకును భోగార్థమై నియోగించెను. అందఱు మిండజంగముల యాసలను దీర్పఁగాఁదగ్గసత్త్వము నామె కొసఁగెను. ఆ మిండగీం డ్రామెను దోడ్కొనిపోయిరి.”

ఈ రోఁతకథను జెప్పుటకుఁ జెన్నబసవపురాణకర్త వెనుకాడఁడయ్యెను. బసవనసోదరి యగు నాగమ్మచరిత్రమును గూర్చి జైను లాక్షేపింపఁగా వారికిఁ దలవంపుగా నుండుటకై శైవు లీకథను గల్పించియుందురనియే నేను దలంచుచున్నాఁడను. తెలుఁగు చెన్నబసవపురాణమున నంతగాఁ జరిత్ర విషయమే లేదు.

చరిత్ర విషయమునఁ జెన్నబసవపురాణము, బిజ్జలరాయచరిత్రము నంతగా విశ్వసింపఁదగినవి కావని నా తలంపు. బిజ్జలరాయచరిత్రము బిజ్జలుఁడు జైనుఁడని చెప్పుచున్నది. కాని, బసవపురాణమున నెక్కడను బిజ్జలుఁడు జైనుఁ డనుట కాధారము కానరాదు. ఆతఁడు జైనుఁ డనుటగూడ యవిశ్వాస్యమే యని నా తలంపు. బిజ్జలునియుఁ దత్పుత్రులయు శిలాతామ్రశాసనములు పెక్కులు నేఁడు దొరకియున్నవి. అందుఁగూడ వారు జైను లనుట కాధారములు గానరాకపోవుటేకాక శివభక్తు లనుటకే యాధారములు గానవచ్చుచున్నవి. వారు శాసనములందు సువర్ణవృషభధ్వజులుగాఁ దెలియవచ్చుచున్నారు. ఇది వారి శివభక్తతను సూచించుచున్నది. బసవన నెలకొల్పిన వీరశైవమున బిజ్జలుఁ డభినివిష్టుఁడు గాకపోవచ్చును. కాని, యాతఁడు శివద్వేషము గలవాఁడు మాత్రము గాఁడు. బసవపురాణమున నట్లెక్కడను లేదు. మఱియు,

క్రీ.1195 నాఁటి యబ్లూరుశాసనము(ఏకాంతరామయ్య విషయము దీనఁ గలదు. అది ముందు దెలియఁగలదు. ఇదేకథ బసవపురాణమునను గలదు.)ను బట్టి చూచిననుగూడ బిజ్జలుఁడు జైనుఁడు గాడనియే యేర్పడును.

“ఏకాంతరామయ్యయును, జైనులును శివుఁడు పరదైవమని జినుఁడు పరదైవమని తగవులాడిరి; ప్రతిజ్ఞాపత్రములు వ్రాసికొనిరి. ఏకాంతరామయ్య ప్రతిన నెగ్గించుకొని జినదేవుని శిరసు విఱుగఁగొట్టించెను. జైనులు బిజ్జలుని కడకుఁబోయి మొఱపెట్టిరి. ఆతఁ డేకాంతరామయ్యను బిలిపించి యడిగెను. రామయ్య తన ప్రతిజ్ఞానిర్వహణమును నిరూపించెను. పునఃప్రతిజ్ఞ సలిపి నెగ్గుదుననెను. జైను లందుకుఁ దూఁగరయిరి. బిజ్జలుఁడు వారిని గర్హించి పంపెను. ఏకాంతరామయ్య నారాధించెను. ఆతఁ డారాధించు వీరసోమనాథ దేవునకగ్రహార మొసఁగెను” అని యాశాసనమునఁ గలదు. బిజ్జలుఁడు జైనులను గర్హించెననియు శివుని కగ్రహార మొసఁగెననియు నుండుటచే శాసనకారుని యెఱుకలో నాతఁడు జైనుఁడు గాఁడనియే యున్నట్లేర్పడుచున్నది. ఈ శాసనము సరిగా బసవపురాణ రచనము నాఁటిది.

బసవనికాలమున గళ్యాణమునఁగల మిండజంగముల మిండఱికపుఁగథలు గొన్ని బసవపురాణమునఁ గలవు. సత్యముగా నట్టివి కొన్ని జరగినను జరగియుండవచ్చును. భక్తులు పరమేశ్వరులే యని, భక్తులచేయు తప్పులు తప్పులే కావని, భావించు పరమభక్తు లున్నప్పు డట్టిచర్యలు జరగుట కభ్యంతరమేమి. శైవభక్తుల కథలను బోలినవి వైష్ణవభక్తుల కథలు నిట్టివి యున్నవిగదా!

ఇట్లు చూడఁగా, మాహాత్మ్మములను బొగడు కథలు కొన్నిపోను, బసవపురాణమునఁ గానవచ్చు బసవనిచరిత్రమునఁ దక్కినదెల్ల దథ్యమనియే తలఁపఁగూడును. శాసనములందు బసవేశ్వరుని విషయము లేకున్నను దత్సమకాలమువాఁడగు నేకాంతరామయ్య విషయము గలదు గదా! ఆ శాసన మానాఁటి జైనశైవమతముల స్పర్థలను స్పష్టపఱచుచున్నది గదా! శాసనాదు లెందుకు? పండ్రెండవశతాబ్ది యుత్తరార్ధముననుండి నూఱేండ్లలోఁ గల్యాణప్రాంతములందుఁ గర్ణాటదేశమున బసవమతానుయాయు లసంఖ్యాకులుగా నతిశయించుట యొక్కటే బసవేశ్వరమతప్రాబల్యప్రాభవములకు బలిష్ఠమగు సాక్షి గాఁజాలును!

బిజ్జలుఁడు కలచురి వంశమువాఁ డగుట శాసనాదుల మూలమున స్పష్టముగా మనకుఁ దెలియవచ్చుచున్నది. కాని, సోమనాథుఁ డాతఁడు చాళుక్యవంశమువాఁడని చెప్పినాఁడు.

అల్లయ్య మధుపయ్య యను భక్తవరులఁ
బ్రల్లదుఁడై రాజు వఱపుడు నతని
యాయతైశ్వర్యంబు నతులప్రతాప
మాయుష్యమును భవిష్యద్రాజ్యరమయు

నవనిలోఁ జాళుక్యులను పేరు హరుని
కవిలెను దుడిపించి కల్యాణకటక
మీడితభక్తి మహిష్ఠతపేర్మిఁ
బాడుగా శపియించె బసవనమంత్రి

- పండితారాధ్యచరిత్ర

ఈ వ్రాఁత ప్రామాదికము. బిజ్జలుఁడు చాళుక్యుఁడు గాఁడు. కలచుర్యులు వేఱు. చాళుక్యులు వేఱు. చాళుక్యులను గొట్టి వచ్చినవాఁ డీబిజ్జలుఁడు కలచుర్యుఁడు.

బసవేశ్వరుఁడు కప్పడి సంగమేశ్వరునకు భక్తుఁడనియుఁ, దుది కాతఁ డాకప్పడి (కూడలి) సంగమేశ్వరమునకే యేఁగి యాదేవునితో నైక్యమందె ననియు, బసవపురాణమునఁ గలదుగదా! కర్ణాటకదేశమున సంగమేశ్వరక్షేత్రములు రెండు గలవట! సర్ వాల్టరు ఇలియట్ దొరగారు, బిజాపూరు జిల్లా హన్గొండ తాలూకాలో కృష్ణామలాపహానదులు సంగమించు స్థలమునఁ గల సంగమేశ్వరమే బసవేశ్వరుఁడు లింగైక్యమందిన స్థలమనియుఁ దత్రత్యులక్కడి సంగమేశ్వర లింగమునకు నడుమ నొకగుంటను జూపుచు నది బసవేశ్వరుఁడు లింగములోనికి దూరినచోటి చిహ్నమని చెప్పుదురనియు, వ్రాసిరి. ప్లీటుదొరగా రీవిషయమును గూర్చి సందేహించిరి. బసవపురాణమునఁ గూడలి (కప్పడి) సంగమేశ్వరమే పేర్కొనఁబడినది గావున, కృష్ణా తుంగభద్రానదుల సంగమస్థలమునఁగల సంగమేశ్వరమునకే పయిపేరు గలదు గావున, బసవేశ్వరుఁడు లింగైక్యమందిన స్థలముగాఁ దలఁపఁబడినది యిదియే యగునేమో యని వారు వ్రాసిరి. కూడలి సంగమేశ్వరమనికాని, కప్పడి సంగమేశ్వరమనికాని కృష్ణామలప్రభానదుల సంగమస్థలమునకుఁ బేరులేకుండుట నిశ్చితమే యగునేని, కృష్ణా తుంగభద్రానదుల సంగమస్థలమే బసవేశ్వరుఁడు లింగైక్యమందినస్థలమని నిశ్చయింపవలయును.

బిజ్జలుని చరిత్రము

బసవపురాణాదులను విడిచి శాసనాదులను గొని యీతని చరిత్రమును దెలిసికొందము. చేదిదేశము (జబల్పూర్) నేలిన కలచుర్య (కలంజర) రాజులశాఖలలో నొకశాఖవారు కళ్యాణము నేలుచున్న చాళుక్యులయొద్దనుద్యోగులుగా నుండిరి. అందు బిజ్జలుఁడు మూఁడవ తైలపదేవునియొద్ద నుద్యోగిగా నుండి క్రమముగా స్వతంత్రుఁడై పశ్చిమ చాళుక్యరాజ్యమున కేకచ్ఛత్రాధిపతి యయ్యెను. ఆతని కిర్వురు భార్యలు, పెద్దభార్యకు నలుగురు పుత్రులు, పిన్నభార్యకొక పుత్రుఁడు నొక పుత్రికయు జనించిరి. బిజ్జలుడార్జించిన పశ్చిమచాళుక్యరాజ్యము తత్పుత్త్రులకాలమున యథాయథలయినది. సరియయిన వంశానుక్రమణి తెలియరాదు గాని, పల్నాటిలో రాజ్యమేలిన వారును, పల్నాటివీర చరిత్ర కథానాయకులునగు ననుగురాజ ప్రభృతులును, విద్యానగరరాజబంధువులై 15 శతాబ్ది నుండి యాంధ్రదేశమునఁ బ్రఖ్యాతిగడించిన వారగు నార్వీటి బుక్కరాయాదులును నీ బిజ్జలుని వంగడమువారగుదురు. బిజ్జలుని వంశవృక్ష మిట్టిది : పశ్చిమ చాళుక్యరాజులకు మన బిజ్జన తొలుత సామంతుఁడుగా నుండెను. క్రీ. 1146 ప్రాంతముల నుండి యీతని శాసనములు గలవు. తొలుతటి శాసనములనుబట్టి యీతఁడు మూఁడవతైలపదేవుని సామంతుఁడని యెఱుఁగ నగుచున్నాఁడు. బిజాపురమునఁగల క్రీ. 1151 నాఁటి శాసనమున నీతఁడు మూఁడవ తైలపుని సామంతుఁడనియు, మహాప్రధానదండనాయక సేనాధిపతి బిరుదాంకుఁడైన మైలారయ్య తర్దవాడి 1000ని నీతనికి సామంతుఁడై పాలించుచున్నాఁ డనియుఁగలదు. బలగామి (బెల్గాం) లోఁగల (క్రీ. 1155 నాఁటిది. అది తైలపుని యాఱవపాలన వత్సరము) శాసనమున బిజ్జలుఁడు సర్వదేశములను బాలించుచున్నట్టు గలదు. బిజ్జలుని మూఁడవతైలపదేవునకు సామంతునిఁగాఁ జెప్పు శాసనములలో క్రీ.1155 నాఁటి దగు నీ బెల్గాంశాసనమే కడపటిది. అప్పటనుండి బిజ్జలుఁడు శాసనములలోఁ దన స్వతంత్రపరిపాలనము వ్యక్తమగునట్లు తనయేల్బడి వత్సరములను జెప్పుకొన నారంభించినాఁడు. కాని 1162 వఱకు బిజ్జలుడు పశ్చిమచాళుక్యరాజ్యముపై సంపూర్ణాధిపత్యమును బడయలేదు. అయినను 1056 నుండి సామంతస్థితిని మీఱి స్వతంత్రస్థితికి వచ్చినాఁడు.

క్రీ. 1162 బిజ్జలుని యేడవ పరిపాలనవత్సరము. అప్పటి శాసనములలో నాతఁడు “కలచుర్య చక్రవర్తి” “సమస్తభువనాశ్రయ శ్రీపృథివీ వల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర పరమభట్టారక” బిరుదములఁ జేర్చుకొన్నాఁడు. ఆతని కప్పుడు శ్రీ ధరదండ నాయకుఁడు, పద్మరసు, అమ్మణ, సోమదేవయ్య, విజయాదిత్యుఁడు (మహామండలేశ్వరుఁడు) కార్తవీర్యుఁడు, ఈశ్వరయ్య, సిద్ధలయ్య, కలియమ్మరుసు, పెర్మాడి యనువారు సామంతరాజులుగాఁ బేర్కొనఁబడిరి. క్రీ. 1168 శాసనములో బిజ్జలుఁ డేకచ్చత్రాధిపత్యముగా రాజ్య మేలుచు రాజ్యభారమును దనకొడుకయిన సోవిదేవునిమీఁదఁ బెట్టినట్టున్నది. ఆ శాసనము సోవిదేవునిదే. నాఁటిదే బిజ్జలుని కడపట శాసనము. అది యాతని పండ్రెండవ పాలనవత్సరము. సోవిదేవుని తర్వాత నాతని తమ్ములు సంకమ, ఆహవమల్లుఁడు, సింఘణుఁడు కూడఁ గొలఁదిదినములు రాజ్య మేలిరి. ఏచలదేవి యను భార్యవలన బిజ్జలునికి వజ్రదేవుఁడు, శ్రియాదేవి యను కుమారుఁడును గుమార్తెయుఁ గలిగిరి. క్రీ. 1182 లో బిజ్జలుని కొడుకులను వీడి పశ్చిమ చాళుక్యరాజ్యలక్ష్మి మరలఁ జాళుక్యరాజేయగు నాల్గవ సోమేశ్వరునిఁ జెందినది. కలచుర్య వంశ్యుల పరిపాలన మంతతో నంతరించినది - శాసనములవలన బిజ్జలవృత్తాంత మింతమాత్రమే తెలియవచ్చుచున్నది.

బసవనకృతులు

కర్ణాటకభాషలో బసవన్న "లాలితంబుగ నాల్గులక్షల మీఁద, నోలినర్వది నాల్గువేలగీతము” ల రచియించినట్లు బసవపురాణము చెప్పుచున్నది. పయిసంఖ్య యా గీతముల గ్రంథసంఖ్య కావచ్చును. పండితారాధ్యచరిత్రమున బసవనిగీత మొకటి మొదలెత్తి యుదాహృతమయినది.

అక్కజంబక్కజంబని బాసగీత
మొక్కటానతియిచ్చె .........”

బసవన్న గీతములు కొన్ని నేఁడును గర్ణాటభాషలోఁ గానవచ్చు చున్నవి. షట్ స్థలవచనములు, కాలజ్ఞానవచనములు, మంత్రగోప్యము, శిఖారత్నవచనములు అను పేరుగలవి యిప్పుడు దొరకుచున్నవి. [14]వీనిలో కూడలి సంగమదేవుని సంబోధనముండును. బసవనకాయన యిష్టదైవము గదా! బసవేశ్వరుని కర్ణాట గేయములను మచ్చునకుఁజూపుచున్నాఁడను.

“నరెకెన్నెగె తెరెగల్లకె శరీరగూడవగదమున్న
 హల్లుహోగి బెన్నుబాగి అన్యరిగె హంగాగదమున్న
 కాలమేలె కయ్యనూరి కోల హిడియదమున్న
 ముప్పిందొప్పవళియదమున్న మృత్యుముట్టదమున్న
 పూజిసు నమ్మ కుడలసంగమదేవరా!

అరగిన పుత్తళియ నురియ నాలగె హొయ్దుమాతాడువ సరసబేడ.

బెణ్ణెయ బెనకంగె కెండదుండలిగెయ మాడి
           చిల్లవాడిదరె హల్లు హోహుదు
కుడలసంగయ్యన శరణరొడసె
           సరసవాడిదరె అదు విరస కాణిరయ్య
ఉళ్లవరు శివాలయ మాడిసీయరు
           నానే మాడువె బడవనయ్య

ఎన్న కాలేకంభ దేహవే దేగుల శిర హొన్నకళస నోడయ్య
కుడల సంగమదేవయ్య కేళయ్య స్థావరక్కటివుంటు జంగమక్కటివుంటె.

ఆడి కాలు దణియదు నోడి కణ్ణు దణియదు మాడి కై దణియదు హాడి నాలగె దణియదు సుడి తలె దణియదు బేడి మనం దణియదు ఇన్నువే నా నిమ్మకైయార పూజిసి భజిసదె మన దణియలొల్లదు కుడల సంగమదేవా నిమ్ముదరవ బగిదాను హోగువ బరవెనగె.

మడకెయె దైవవు మరదల్లియె దైవవు బీదియకల్లె దైవవు బిల్లనారియె దైవవు కాణిరైయ కొళగవె దైవవు గిళియె దైవవు కాణిరైయ దైవ దైవవెందు కాలిడలింబిల్లవు దేవనొబ్బనె కుడల సంగమదేవ.

జాతివిడిదు సూతకవ నరసువరె, జ్యోతివిడిదు కత్తలెయ నరసువరె, ఇదే తకొ మరుళు మానవా జాతియల్లి అధికవెంబె విప్రశతకోటియొ ళిర్దల్లి ఫలవేను భక్తశిఖామణియెందుదు వచన నమ్మ కుడలసంగన శరణర పరుషవ నంబుకెడ బేడ మనుజా.”

సంగీతకళలో బసవన గొప్పనేర్పుగలవాఁడని పెక్కుచోట్ల సోమనాథుఁడు ప్రశంసించినాఁడు.

చ. విరచితశుద్ద సాళవ నవీన మృదుస్వరమంద్ర మధ్య తా
     ర రుచిర దేశిమార్గ మధురస్వరగీత సుధాతరంగిణీ
     తరలతరంగజాల సముదంచితకేళి విలోల సంగమే
     శ్వర శరణయ్య నీకు బసవా బసవా బసవా వృషాధిపా!

సంగీతమున నింత నేర్పు గలవాడు గావుననే యన్ని గేయకృతుల నాతఁడు రచియింపఁగల్గెను. భక్తిరసప్లుతముగా నాతఁడు గేయముల రచించి మధురతరముగా స్వయము గానము చేయుటచే నాకాలమున ననేకులను స్వమతమునకుఁ ద్రిప్పుకొనఁగల్గినాఁడు.

బసవనకు బాలసంగయ్యయని కొడుకొకఁడు జనియించెననియు బసవన కంటెముందే యాతఁడు లింగైక్య మందె ననియు, నప్పుడు బసవన:

పుష్ప విద్దంతె మొగ్గెయ నర్పిసికొండ శివను
పక్వవాద ఫల విద్దంతె కసుగాయ కోయ్ద శివను”

అని ప్రలాపించెననియు, భైరవేశ్వరకావ్యము కథాసూత్రరత్నాకరమునఁ గలదని కర్ణాటకవిచరిత చెప్పుచున్నది.

బసవనకృతులలో షట్‌స్థలవచనములను నేను జదివి చూచితిని. తెలుఁగున శంకరవచనములు, వేంకటేశ్వరవచనములు నున్నవిధమున నవి భక్తిరసభరితములై తేటగాఁ జదువఁదగినవిగా నున్నవి.

కర్ణాటాంధ్రభాషలలో బసవనమీఁద రచితములయిన స్తుతిగ్రంథములకు మితిలేదు. ఆతఁడు నందీశ్వరునియవతారమని వీరశైవుల విశ్వాసము. పాల్కురికి సోమన తన బసవపురాణకథాసారము నెల్లఁ దెలుఁగున వృషాధిపశతకమునను సంస్కృతమున బసవోదాహరణాదులందును వెలయించినాఁడు. అతఁడు రచియించిన గ్రంథములెల్ల బసవస్తుతిరూపములే. బసవేశ్వరు నుపాస్యదైవతముగాఁ గొల్చినవారిలోఁ దొల్తటివాఁ డాతఁడే. బసవేశ్వరునియెడ నాతనికిఁ గలభక్తి యింతంతనరానిది. వృషాధిపశతక, బసవోదాహరణాదులఁ జదివిన నది తెలియనగును.

బసవన సమకాలమువారు

బసవపురాణమున బసవనకు సమకాలమువారుగాఁ బేర్కొనఁబడినవారిని గూర్చి తెలియఁదగినవిశేషములు గొన్ని గలవు. కావున, సంక్షిప్తముగా వారి చరిత్రముల నిక్కడ వివరించుచున్నాఁడను.

మడివాలు మాచయ్య (పు. 100)

ఈతడు చాఁకలి. మహిమగల భక్తుఁడు. ఈతఁడు శివభక్తుల మడుఁగుల నుదికి తెచ్చునప్పుడు భవు లడ్డు రాఁగూడదు. వచ్చెనేని చంపును. ఒకనాఁడొక బాటసారి యడ్డురాఁగా వానిని జంపెను. బిజ్జలుఁ డందుకుఁ గోపించి యీతనిఁ జంపుటకై యేనుఁగును బంపెను. దానినిగూడ నీతఁడు చంపెను. బసవన తెలుపఁగ బిజ్జలుఁ డీతని మాహాత్మ్యమును విని యచ్చెరువంది యీతనికి శరణాగతుఁడయ్యెను. ఈతఁడు చచ్చిన మనుజుని, నేనుఁగును మరల బ్రదికించెను.

ఈతఁడు కాలజ్ఞానవచనములను, ఇతరవచనములను రచియించి నట్లు కన్నడకవిచరిత చెప్పుచున్నది. సాధారణముగా నాకాలపు వీరశైవులందఱపేర “కాలజ్ఞాన” మని యేదేదో భవిష్యద్విషయముఁ జెప్పునవిగా గొన్నిగ్రంథములు కన్నడమునఁగలవు. అవియెల్లను వారువారు రచియించినవే యనుటను గూర్చి నేను సంశయించుచున్నాఁడను.

అల్లమప్రభువు (పు. 36)

బసవపురాణ మీతని నతిలోకచరిత్రునిఁగాఁ జెప్పుచున్నది. కర్ణాటకవిచరిత్రమున నీ మహనీయుని చరిత్ర మిట్లు వ్రాయఁబడినది.

“ఈతఁడు శూన్యసంపాదనము, మంత్రమాహాత్మ్యము, షట్‌స్థలవచనములు, మంత్రగోప్యపదములు, సృష్టివచనములు, బెడగినవచనములు, (ప్రభు దేవర) కందములు, కాలజ్ఞానవచనములు నను గ్రంథముల రచియించెను.

ఈతఁడు వీరశైవగురువులందు బహుప్రఖ్యాతుఁడు. “శ్రీమద్దేశికషట్ స్థలచక్రవర్తి, బ్రహ్మానంద, పరమశివమూర్తి, విరక్తశిఖామణి, మాయాకోలాహల ప్రభుదేవుఁ”డని శైవగ్రంథకర్త లీతనిఁ బేర్కొనిరి. ఈయన విషయమునఁ బ్రభులింగలీలలు, అల్లమప్రభు సంగీతపదములు మొదలగు గ్రంథములు పుట్టినవి.

ఈతఁడు శ్రీశైలమున నరఁటిచెట్టులో శివైక్యమందె నన్నవార్త వినియే బసవేశ్వరుఁడు కూడలి సంగమేశ్వరునిలోఁ జేరెనని (కన్నడ) చెన్నబసవపురాణమునఁ గలదట.

సిద్ధరామయ్య (పు. 48)

బసవపురాణ మీతఁడు సొన్నలిక పురవాస్తవ్యుఁ డనియు, నభినవ శ్రీగిరియని యాగ్రామమును బెంపొందించి శ్రీశైలమల్లికార్జును నక్కడికిఁ గొని వచ్చి ప్రతిష్ఠించి యింకను బెక్కుశివలింగముల నెలకొల్పి మేనినీడయు, నడుగుజాడయుఁ గానరాకుండఁ జరించువాఁడనియు, సమాధియోగమున శివలోకమునకుఁ బోయివచ్చుచుండువాఁ డనియుఁ జెప్పుచున్నది. ఆ గ్రామమున నాతఁ డొకతటాకము ద్రవ్వించి విద్యాసముద్రుఁడని బిరుదుగల కర్పరుఁడనుయోగి నోడించి తాను గట్టుకొన్న యా తటాకము నడుమను సమాధిని గల్పించుకొని యందే బయలయ్యె నట. నిజజననమును సుగ్గళవ్వకు రేవణసిద్ధుఁడు సూచించినట్టును, చెన్నబసవన్నకడ లింగదీక్షను, దత్త్వోపదేశమును బొందినట్లును గొన్ని వీరశైవగ్రంథములు చెప్పుచున్నవి.

యోగినాథవచనములు, మిశ్రస్తోత్రత్రివిధి, సిద్దరామేశ్వరత్రివిధి, అష్టావరణస్తోత్రత్రివిధి, మంత్రగోప్యము, కాలజ్ఞానము, అను గ్రంథముల నీతఁడు కన్నడమున రచియించెను. రాఘవాంకకవి (క్రీ. 1165) ఈతని చరిత్రమును సిద్ధరామపురాణ మనుపేర రచించెను.

సకలేశ్వరు మాదిరాజయ్య (పు. 89)

ఈయన శ్రీపర్వతమున వసించు శివయోగీంద్రుఁడు. ఏడువందలయేం డ్లీతఁడు శివానుగ్రహమున జీవించెనట. బసవనను జూచునాఁటి కీతఁ డార్నూఁట యేఁబది యేండ్లవాఁడట! మల్లికార్జున పండితారాధ్యుఁ డీతని నిట్లు ప్రస్తుతించినాడు.

క. భూతలమున నిది యెంతయు
    నూతనమని పొగడ నేడునూఱేండ్లు మనం
    డే తనరుభక్తిఁద్రిపురా
    రాతీ, సకలేశు మాదిరాజయ్య శివా!

ఈ మాదిరాజయ్య కళ్యాణకటకమును శపించి బసవేశ్వరుఁడు వీడివచ్చునప్పు డాతనితోడ నుండినట్లు బసవపురాణమునఁ గలదు. మల్లికార్జున పండితారాధ్యుఁడు (శివతత్త్వసారమును) బసవేశ్వరాదులు లింగైక్య మందిన పిదప శ్రీశైలమునకుఁజేరి తానును లింగైక్య మందఁబోవుచుఁ గడకాలమున రచియించెను. తద్రచనాకాలమునకు మాదిరాజయ్యయు లింగైక్య మందెనని యెఱుఁగనగును. మాదిరాజయ్య కృతిగాఁ గన్నడమునఁ గొన్నిరచనములు గలవట! కెరెయ పద్మరసున కీతఁడు పితామహుఁడట.

మఱియుఁ గిన్నరబ్రహ్మయ్య (పు. 142) కన్నడ బ్రహ్మయ్య, ముసిఁడి చౌడయ్య, సురియచౌఁడయ్య, తెలుఁగు జొమ్మయ్య, శివనాగుమయ్య యనువారు బసవనసమకాలమువారు. వీరినిగూడ మల్లికార్జున పండితారాధ్యుఁడు శివతత్త్వసారమున స్మరించినాఁడు. కలకేతబ్రహ్మయ్య, మోళిగమారయ్య, ఏకాంతరామయ్య, కక్కయ్య, భోగయ్య, గుడ్డవ్వ, జగదేవదండనాయకుఁడు, పదుమరసు, పురాణదమాయిభట్టు, అల్లయ్య, మధుపయ్య, మొదలగువారింకను బసవన్న సమకాలమువారు గలరు. వారిని గూర్చి పుట. 229లో చూడఁదగును. మల్లికార్జున పండితారాధ్యుఁడు శివతత్త్వసారమున వీరినిఁబేర్కొనలేదు. ఇందీక్రిందివానిని గూర్చి యించుక చరిత్ర మెఱుక కందుచున్నది.

మోళిగ మారయ్య

నేఁటి బందరుదేశమందలి మాండవ్యపురమును [15]పాలించుచు శివభక్తుల నారాధించుచు నుండెను. బసవన్న యతనియొద్ద నున్న శివభక్తులను దనతోఁ బిలుచుకొనిపోఁగా అతనిని జంపుట కిద్దఱు సేవకులను బంపెను. వారు జంగమవేషమును వేసికొని బసవనియింటియందు శివభక్తులనడుమఁ గూర్చుండిరి. బసవని మహిమచే వారిమెడలందున్న వంగకాయలు లింగకాయ లయినవి. ఇది విని మారయ్య వైరాగ్యమున నిట్లు పాడెను.

హిరియరదర్శన నయనక్కె చెలువు ;
సత్పాత్ర క్కిడువుదు హస్తక్కె చెంద;
సత్యవ నుడివుదు వాక్యక్కె భూషణ;
శివస్తుతి కేళువుదు కర్ణక్కె అలంకార ;
శరణరకూడె సంభాషణె ప్రాణకై శృంగార
ఇంతిల్ల దనరన బాళుహోలెయజోగికైయ పాత్రదిందకడె

156 పుట. కన్నడ కవిచరిత్ర

అని పాడి రాజ్యమును బరిత్యజించి కళ్యాణమున కేగి కట్టెలు కొట్టి అమ్ముకొనుచు జంగమార్చన చేయుచుండెను.

మోళిగమారయ్య వచనము లని కర్ణాటగ్రంథము గలదు.

ఏకాంతరామయ్య (పు. 170)

బసవపురాణమునఁ జెప్పఁబడిన విషయమే యీషద్బేదముతో నొకశాసనమునఁగలదు. దాని సారార్థమును జెప్పుచున్నాఁడను.

హనగల్లు కదంబులలోనివాఁడగు కామదేవ మహామండలేశ్వరుని దా శాసనము. అందు శాసనసంవత్సరము పేర్కొనఁబడలేదు. కాని, యీ కామదేవుఁడు క్రీ. 1181నుండి 1203 దాఁక రాజ్యమేలినాఁడు గాన శాసనమును దన్మధ్యకాలపుదయియుండును. బసవపురాణ రచనాకాలము శాసన రచనాకాలము నించుమించుగా నొక్కటే యగును.

“కుంతలదేశమున సోమనాథశివాలయము గల యలందిపట్టణమున వేదవేదాంగవేత్త శ్రీవత్సగోత్రుఁడు పురుషోత్తమభట్టను బ్రాహ్మణుఁడు గలఁడు, ఆతని భార్యపేరు పద్మాంబిక. వారికిఁ జిరకాలము సంతానము లేదయ్యెను. పుత్రార్థమై వారు శివునారాధించిరి. సపరివారుఁడై కైలాసమున శంకరుఁడు సభదీర్చి యుండగా నారదుఁ డరుదెంచి, సిరియాలాదులు బొందితోఁ గైలాసమునకు వచ్చుటచేతను, కేశిరాజాదులు శివసాన్నిధ్యము నపేక్షించి భూలోకమును వీడుటచేతను భూలోకమున జైనబౌద్ధమతములు పేట్రేగుచున్నవి' అని నివేదించెను. 'తన్మతనాశనార్థమై భూమిలో నవతరింపుము అని శివుఁడు వీరభద్రు నాజ్ఞాపించెను. శివాజ్ఞ చొప్పుననే వీరభద్రుఁడు పురుషోత్తమభట్టు గర్భమునఁ బ్రవేశించెను. పురుషోత్తమభట్టు కలలోఁ గనుపడి “మీకుఁ గొడుకు గల్గును. రాముఁడని పేరిడుఁడు. ఆతఁడు దక్షిణాపథమున జైనమతస్థుల నోడించి తన్మతనాశనము చేయును” అని తెల్పెను. అట్లే కొడుకు గల్గెను. రాముఁడని పేరిడిరి. శివభక్తిని బోధించిరి. ఏకాంత భక్తినిబట్టి యాతని కేకాంతరామయ్యని పేరయ్యెను. త్రికరణశుద్ధిగా నాతఁడు శివతన్మయుఁడై దక్షిణదేశమునఁగల సోమనాథదేవాలయములకెల్ల నేఁగి యా యా సోమనాథదేవులనెల్ల నారాధించెను. ధార్వార్ మండలమున లక్ష్మేశ్వర్ అనే హలల్గేరియొద్ద సోమనాథదేవాలయమున స్వామిలింగమూర్తిని గొలుచుచుండఁగా నా స్వామి ప్రత్యక్షమై "ఆబ్లూరి కేఁగి నీ వక్కడనేయుండి తలయయిన నొసఁగి జైనుల నోడఁగొట్టుము” అని యాజ్ఞాపించెను. అట్లే అబ్లూరి కేఁగి సన్న్యాసివలె బ్రహ్మేశ్వరదేవాలయము కడ నాతఁడు శివు నారాధించుచు నుండెను. సంకగౌండుఁడని పేరుగల గ్రామాధికారితోఁగలసి యా యూరిజైనులు జినదేవుఁడే భగవంతుఁడని యా శివాలయముఁ జేరి జినుని మ్రొక్కసాగిరి. 'శివుఁడే పరదైవ' మని యేకాంతరామయ్య వాదించెను. సృష్టిస్థితిలయకారణము శివుఁడే యని రాద్ధాంతపఱిచి వారి యారాధనమును నిరాకరించి గర్హించెను. “వట్టిమాట లెందుకు? శివుఁడే పరదైవమగునేని నీ తల నాయన కప్పగించి మరలఁ బడయుము. అట్లు చేసెదవేని నీవాదము నెగ్గెనని మే మొప్పుకొందుము. జినవిగ్రహమును బాఱవైచి శివలింగమునే యారాధింతుము” అని వారనిరి. ఏకాంతరామయ్య యంగీకరించెను. తాటాకులమీఁదఁ బంతములు వ్రాసికొనిరి. శివగీతములు పాడుచు నేకాంతరామయ్య తన తలఁదఱుఁగుకొనెను. ఏడవనాఁటి కాతనితల మరల వచ్చెను. జైనులు చలచల్లఁగా జాఱిరి. తమమాట చెల్లించుకొనరయిరి. జైనులెంతో జాగ్రత్తతో రక్షించుచున్నను గూడ నేకాంతరామయ్య వారారాధించు జినదేవుని తల విఱుఁగఁగొట్టి దానిని దానారాధించు శివదేవునకుఁ గానికగాఁ గొని తెచ్చెను. (ఆ శాసనమున సంకగౌండఁడు సేనతో ఒంటరియగు నేకాంతరామయ్య పయికి యుద్ధమున కేఁగినట్లు ఓడినట్లు శివానుగ్రహమున నేకాంతరామయ్య గెల్చినట్లు చిత్రముగూడఁ జెక్కఁబడియున్నది) జైనులు తమ మతనాశనమునకుఁ గోపించి కళ్యాణమునకు వచ్చి దేశాధీశ్వరుఁడగు బిజ్జలుని యొద్ద మొరపెట్టుకొనిరి. బిజ్జలుఁడు వారి మాట విని యేకాంతరామయ్యపైఁ గోపించి యాతనిఁ బిలిపించి యడిగెను. ఆతఁడు జైనులు వ్రాసి యిచ్చిన ప్రతిజ్ఞాపత్రమును జూపెను. జైను లింకను బందెముకు వత్తురేని వారి జినాలయము లేడ్నూఱును దనతలఁ దగులఁబెట్టి యయిన వ్రచ్చివైపింతు ననియెను. బిజ్జలుఁ డప్పుడు నానాదివ్యస్థలములనుండి ప్రఖ్యాతులయిన జైనాచార్యులను బిలిపించెను. ఏకాంతరామయ్యతోఁ బందెమునకు నిలుఁడనెను. వారు నిలువరయిరి. బిజ్జలుఁడు వారి నపహసించి యిఁకమీఁద శైవులతో వివాదములు పెట్టుకొనకుఁడని మందలించెను. ఏకాంతరామయ్యకు సభలో జయపత్రము వ్రాసియిచ్చెను. ఆయన కాళ్లు గడిగి యారాధించెను. అప్పటినుండి యాసోమనాథునికి వీరసోమనాథుఁడని పేరయ్యెను. ఆ స్వామికి బనవాసి పండ్రెండువేలలో సత్లేజి డెబ్బది గ్రామములలోని దగు గోగేలి గ్రామమును బిజ్జలుఁ డప్పుడు దానము చేసెను. పిదప నాల్గవ చాళుక్య సోమేశ్వరుఁడు తన సేనాపతియగు బ్రహ్మనితో శెలయావచియ కొప్పయందు సభ చేసినప్పుడు శివభక్తుల కథలలో రామయ్య కథకూడ వినెను. ఉత్తరము వ్రాసి యేకాంతరామయ్యను బిలిపించి యాతఁడు తన యంతఃపురమున నాతని కాళ్లు గడిగి యారాధించెను. ఆ వీరసోమనాథదేవునకే బనవాసి పండ్రెండు వేలలోనే నాగరఖండము డెబ్బది గ్రామములలో నొకగ్రామము సమర్పించెను.

పిదప మహామండలేశ్వర కామదేవుఁ డక్కడి కరిగి యా కథలెల్ల విని యేకాంతరామయ్యను హానుగల్లు అను గ్రామమునకుఁ బిలిపించి కాళ్లు గడిగి యారాధించి (యావీరసోమనాథ దేవాలయమునకే హానుగల్లు 500 లలో హోసనాథ్ డెబ్బదింటిలో) ముండాగోడు దగ్గఱ మల్లిహళ్లి యను గ్రామము సమర్పించెను. ఈ శాసనమప్పటిది. బిజ్జలుఁడు దేవాలయమునకు దానము చేసినప్పుడు మహామండలేశ్వరుఁడని పయిశాసనమునఁగలదు. కావున నప్పటి కాతఁడు మూఁడవ తైలపదేవుని నోడించి స్వతంత్రుడు గాలేదు. అనఁగా నాకాలము క్రీ.1162కుఁ బూర్వమగును.

పద్మరసు

ఈతని తాత శివయోగి మల్లికార్జునుఁడు. మల్లరసని యాతని నామాంతరము. కర్ణాటకదేశమందలి కల్లకురికియం దాతఁడు ప్రభువై యుండి విరక్తుఁడై శ్రీశైలమున కరిగెను. తత్పుత్రుఁడు సకలేశమాదరసు కొంతకాలము కల్లకురికిని బాలించి విరక్తుఁడై శ్రీశైలమున కరుగుచుఁ ద్రోవలో శిష్యప్రార్ధనమున 'అంబ' యనుగ్రామమునఁ గొంతకాలము వసించి పిదప శ్రీశైలమున కరిగి తండ్రియయిన మల్లరసును జూడఁగా నాతఁడు, “నీ వింకను నేనూఱేండ్లు భూలోకమున వసించి కల్యాణకటకమున ధర్మస్థాపనార్థమై పుట్టిన బసవనితోఁ గలసి వర్తింపుము” అని నిబోధించెను. ఈతని పుత్త్రుఁడు మాయిదేవుడు అంబగ్రామమం దుండెను. ఆతనికి నరసింహబల్లాళుని దండనాయకుఁడును కమ్మకులవల్లభుఁడును నగు గౌరప్ప యక్కయగు మంగళ నిచ్చి పెండ్లిచేసిరి. వీరి పుత్త్రుఁడే కెరెయపద్మరసు. ఈతని భార్య దండనాథగౌరప్ప పుత్త్రియగు మాదేవి. నరసింహ బళ్లాళుఁడు గౌరప్ప కనంతర మా దండనాయకపదమును పద్మరసు కొసఁగెను.

పద్మరసు గురుపరంపరకుఁ జేరినవాఁడు; చతుశ్శాస్త్రపండితుఁడు. ఈతఁడు బేలూరిలో నొకచెరువును ద్రవ్వించుటకై రాజధనాగారముననుండి పండ్రెండువేల పొన్నులను దీసికొని యొకమిండజంగమున కొసఁగెను. అది రాజు విని పద్మరసును బిలిపించి యడిగెను. చెరువు సర్వంసిద్ధ మయ్యెను వచ్చి చూడవచ్చునని పద్మర సనెను. రాజును బిలుచుకొనిపోయి చూపెను. ఆ చెర్వునకుఁ బిట్టసముద్రమని పేరు. ఈ చెరువును గల్పించుట చేతనే యీతనికిఁ గెరెయ పద్మరసని పేరయ్యెను. కెరె యనఁగాఁ గన్నడమునఁ జెఱువు. ఈ పద్మరసు మంత్రిపదమును విడిచి బేలూరులోనే వసించుచుండెను. త్రిభువన తాతాచార్యుఁడని యొక యాంధ్రదేశ బ్రాహ్మణుఁడు విష్ణువే పరదైవమని స్థాపించుటకై యనేకస్థలముల కేఁగి వాదార్థములు నెఱపి జయమందుచుండెను. దోరసముద్రము (బల్లాళరాజు రాజధాని) నకు వచ్చి బల్లాళరాజును దర్శించి శాస్త్రార్థము చేయింపఁగోరెను. రాజు పద్మరసును బిలిపించెను. త్రిభువన తాతాచార్యునకును, బద్మరసునకును శాస్త్రార్థము జరిగెను. వాదమునఁ బద్మరసు గెలిచెను. వాదనిర్ణయప్రకారము త్రిభువన తాతాచార్యుఁడు వైష్ణవమతము వీడి పద్మరసునకు శిష్యుఁడై వీరశైవదీక్షఁ గొనెను.

పిదపఁ పద్మరసు తన కుమారుఁడయిన కుమారపద్మరసుకు జ్ఞానోపదేశమును జేసి కాశీయాత్ర వెడలి మార్గమునఁ బంప (హంపి)కు వచ్చి హరిదేవకవిని జూచి "ఉమాపతి నిన్ను నేఁటి కెనిమిదవనాఁడు తనలోఁ జేర్చుకొనును, అంతలో నీవు రచించు కావ్యమును ముగింపుము” అని చెప్పి కాశి కేఁగి యక్కడ విశ్వేశ్వరునితో నైక్యమందెను.

కెరెయ పద్మరసు త్రిభువన తాతాచార్యులతో శాస్త్రార్థము నెఱపునప్పుడు నరసింహబళ్లాళుని యాస్థానమున నీ క్రింది కవీశ్వరులుండిరి. దోరసముద్రపు రామన్న, ఉభయకవిశరభభేరుండుఁ డనఁబడు కవీంద్రరాఘవుఁడు, హుళిగరమాయిదేవ పురాణభట్టు, గురుభక్త కామన్న, విశ్వన్న, ఉద్ధతశాస్త్రి, నికరభంజన నాగనాథార్యుఁడు, అతిరసికకర్ణాభరణబుధవరుఁడు పదవాక్యప్రమాణజ్ఞ దేవరస పండితుఁడు, అనేకకలావేత్త హంపి రావితందె, జగదారాధ్య నాగిదేవుఁడు, అష్టభాషాకవీశ్వర శివదాఁడు, శైవవిరుద్ధమతదావదాదర సుశరణకవి - ఇత్యాదులు.

పద్మరసు నరసింహబల్లాళుని సభలో శ్రీశివాద్వైతసాకారసిద్ధాంతసానందచరిత్రమను సంస్కృతగ్రంథమును రచియించి, త్రిభువన తాతాచార్యులను జయింపఁగా సభలోని విద్వాంసులెల్లరును నీ క్రిందివిధముగా నాతనిఁ బ్రశంసించిరి.

దోరసముద్ర వెంబ హెసరిం కరమొప్పున రాజధానియోళ్
ధీరనృసింహభూవర నహోమహియం పరిపాలిసుత్తిర
ల్కారసియాణ్మ నోలగకె బందనగుర్విసు తాంధ్రదేశ దిం
శౌరియ భృత్యనోపు భువనత్రయతాతన నిప్పునోర్వవం.
శివనిల్లా శివభక్తి యిల్ల శివసిద్దాంతందలిల్లా మతం
సువిచారస్థితిగిల్ల నాడెవనజాక్షం దైవవా వైష్ణవం
సువిశాలం నిజభక్తిగెం దెనుతె పత్రాలంబనం గెయ్యెత
ద్భవియం పద్మరసార్యరోడిసిదరీసానందచారిత్రదిం.
పిందె సమస్తనీలపటసాంఖ్యర బౌద్దర జైనభేదదోళ్
సందరభాట్టతార్కికర కూడతివాదిసి, సోర్కిసూక్తియ
ల్లొందదబద్ధవాదియెనిపుద్ధత వైష్ణవనంవిభాడిసు
త్తిందుధరప్రతిష్ఠయగపద్మరసర్ నెగళ్దర్ ధరిత్రియొళ్.

ఇవిగాక యొక్కొకకవీశ్వరుడును వేర్వేఱుగా సంస్కృతకర్ణాటభాషలలోఁ బద్మరసుమీఁద రచించిన పద్యములును గలవు. పద్మరసుకు సకలశాబ్ధికసార్వభౌమ, ఉద్దతవాది నికరవేశ్యాభుజంగ, తార్కికచక్రవర్తి, శ్రీ శివాద్వైతసాకారసిద్ధాంతప్రతిష్టాపనాచార్య, శరణకవి, భవిదూరాది బిరుదులు గలవు.

ఈతఁడు సానందచరిత్రమునుగాక దీక్షాబోధమని వేఱొకగ్రంథమును గూడ రచియించెను.

పద్యబసవపురాణ కర్తయగు పిడుపర్తి బసవన తండ్రి సోమనాథుఁడీ దీక్షాబోధను దెనిఁగించెను. వీరశైవమతవ్యాపనమున కీగ్రంథ మెంతేని యాకాలమున నుపకరించి యుండును. గురుశిష్యసంవాదరూపమున సులువుగా వీరశైవసంప్రదాయమునెల్ల నీగ్రంథము నిరూపించుచున్నది. తత్కాలపు వీరశైవమతస్వరూపము దెలుపు గ్రంథములలో నిది ప్రధానమయినది. మతవిమర్శము పట్టున నే నెక్కువగా నీ గ్రంథమును గ్రహింతును.

మాయిదేవుఁడు :- ఈతఁడు పద్మరసుపయిఁ బ్రశంసారూపముగాఁ జెప్పిన పద్య మొకటి గలదు. జగదేవ దండనాయకుఁడు :- ఈతఁడే బసవేశ్వరుని నిదేశము చొప్పున బిజ్జలుని సంహరించినవాఁడు. మల్లయ్య, బ్రహ్మయ్య యను వారిర్వురీతనికిఁ దోడయిరి.

అనుమకొండ రాజధానిని జయింప సైన్యసమేతుఁడై వచ్చి యరికట్టి కాకతి ప్రోలరాజు ప్రతాపప్రదీప్తి ముందు నిలువనేరక క్షణములో జగద్దేవుఁ డొకఁ డోడి పాఱెనని యనుమకొండ శాసనము చెప్పుచున్నది. ఆ జగద్దేవుఁడు పట్టిపొంబుచ్చపురాధీశుఁడని, సంతానరాజులలో నొక్కడని, మహామండలేశ్వరుఁ డని, క్రీ. 1149 లో నాతఁడు కుందూరుగ్రామము దానము చేసినట్లు శాసనము గలదని, యాంధ్రుల చరిత్రము చెప్పుచున్నది. బిజ్జలునిఁ జంపిన జగదేవుఁ డీతఁడు కావచ్చును.

ప్రాచీన భక్తులు

బసవపురాణమునఁ బ్రస్తుతులయిన ప్రాచీనభక్తులలోఁ బెక్కు 'రఱువత్తుమూర్' అను పేర నఱవమునఁ బ్రఖ్యాతులయిన యఱువది మూగురు భక్తుల లోనివారు. ద్రవిడమున వారికి 'నయనార్ల'ని పేరు. నైనార్లు, నాయనార్లు అని కూడఁ దెలుఁగునఁ గలదు. అఱువదిమూవురలో బసవపురాణమునఁ గొందఱును, పండితారాధ్యచరితమున మఱికొందఱును బ్రస్తుతులయిరి. కాని, యానుపూర్వితో వారినెల్లరును సోమనాథుఁడు స్తుతింపలేదు.

అఱువదిమూవుర పేళ్లను మన సోమనాథుఁడు పండితారాధ్యచరిత్రము చతుర్థప్రకరణమున సహస్రగణనామసంఖ్యానమున నిట్లు పేర్కొన్నాఁడు :

తిరునీలకంఠుండు తిరునీలనక్క
తిరుమూలదేవుండు తిరునాళ్లపోవ
మానకంజారుండు మంగయక్కరసు
ఆనయనార్ మొన్నయధరుండు పిట్ట
నంగ రోహిణి పిళ్లనయనారు నంగ
సంగచండుండు పూసలనయనారు

పరమనాచియరు దీపదకళియారు
కరిగణనాథుండు గరికామదేవుఁ
డమరనీతి యిరువదాండారి మురుఘు
నమినంది యేణాధినాథుండు సాంఖ్య
తొండభూపతి చిరుతొణు తిరుకురిపి
తొండండు నంబి సిర్తొండండనంగ
సీరాలదేవుండు సేదిరాజయ్య
గారికాళవ్వ యేకాశి సోమాసి
మారుండు వీరపెర్మాణిదేవుండు
వీరచోడఁడు జడయా రిరిత్తాండి
యెల్వచలంది వాగీశనైనారు
కొళ్వుళి యెళయదంగుళియ నైనారు
చిఱుపులియారు లచ్చిరియారు నారు
మిఱుమిండయారు నమిత్తండయారు
కరియంబ యరిపాలు కడమలనంబి
కళియంబ గుగ్గుళ కళియనైనారు
కన్నప్పతాపసి కరయూరచోడు
చెన్నయ్య చోడండు చేరమరాయఁ
డిడుగుడిమారయ్య నిడుమారదేవుఁ
డడిభర్తయణుమూర్తి యఱువత్తుమూరు.

సంఖ్య కఱువదిమూగురే యయినను సంస్కృత కర్ణాటద్రవిడ గ్రంథములలో వారిపేళ్లు గొన్ని భేదించుచు నెక్కువగుచున్నవి[16] ఒకగ్రంథమున బేర్కొనఁబడినవారిని గొందఱను వేఱొకగ్రంథము పేర్కొనకున్నది. ఒకనికే యొకగ్రంథమున నొకపేరు, వేఱొకగ్రంథమున వేఱొకపేరును గలదు. వానిని సరిచూచి బసవపురాణమునఁ బ్రస్తుతులయినవారిని గూర్చి యించుక వివరణము చేయుచున్నాడను. [17]

సుందరనాయనారు :-పు. 128 [18]నంబినాయనారని ఒడయనంబి యని యీతని నామాంతరములు. సుజ్ఞానిని, జటీశ్వరుఁడు ఈతని తల్లిదండ్రులు. నదిపురపు నరసింహవర్మ (నరసింహమునయర్) ఈతనిఁ బెంచుకొన్నాఁడు. ద్రవిడభాషలో నీతఁడు గొప్పకవి. తిరుతొండర్‌తొఘై యని యీతఁడు రచియించిన శివస్తోత్రమును బ్రపంచించి సోమనాథుఁడు (పు. 134) కొంత తెలిఁగించినాఁడు. ఒడయనంబివిలాసమని యీతని చరిత్రమే తెలుగునఁ బ్రబంధముగా రచితమయినది.

మిఱుమిండఁడు :- పు. 128 మెఱెమిండర్, విఱన్‌మిండర్, వీరమిండ, శంగునాయనార్ అని యీతనిపే ళ్ళితరగ్రంథములఁ గలవు.

చేరమచక్రవర్తి - మహాగోదుఁడని యీతని నామాంతరము. పయి మువ్వురును సమకాలమువారు.

కుమ్మర గుండయ్య - పు. 139 తిరునీలకంఠర్ అని నామాంతరము

దంగుళి మారయ్య - పు. 138 ఇళయాంగుడిమారన్ అని యఱవమున, 'భక్తో దంగుళిమారాఖ్యః ' అని సంస్కృత బసవపురాణమున, 'ఎళయ దంగుళిమారన్' అని కన్నడమునఁ గలదు. చేదివల్లభుడు - పు. 137 సిద్దిరాజని నామాంతరము.

ఇఱువదాండారి - పు. 104 ఇరుపత్తుఁడు ఇఱిపత్తనాయనార్. ఎఱిపత్తనాయనార్ అని ద్రవిడకర్ణాటములందుఁ బేరు. సంస్కృత బసవపురాణమున ఇరువత్తుఁడని కలదు.

కరయూరిచోడఁడు - పు. 137 కరపూరిచోడఁడని కన్నడము. పొగ్హళ్ చోళఁ డని యఱవము.

ఏణాధినాథుఁడు - పు. 136 ఏణాదినాథుఁడని యఱవము సంస్కృత బసవపురాణమున ఏణాధినాథుఁడనియే కలదు.

ఉడుమూరి కన్నప్ప - పు. 78 కణ్ణప్పన్. శ్రీకాళహస్తివాఁడు.

గుగ్గులుకళియారు - పు. 135 కంకుళినాయనార్ అని యఱవము.

మానకంజారుఁడు - పు. 57 చోళరాజు.

అరివాళునాయనారు - పు. 135 సంకులాదాయుఁ డని నామాంతరము. శూద్రుఁడు.

రుద్రపశుపతి - పు. 63 తెలుఁగు బసవపురాణమున నున్న కథ వేఱు; అఱవమునను, గన్నడమునను నున్నకథ వేఱు. తెలుఁగుకథలో 'ఆదిపురాణ' మని ద్రవిడ శివపురాణము పేరున్నది. అఱవమున నట్టిగ్రంథము తెలియరాదు.

చండేశుఁడు - పు. 228

తిరునావుకరశు - పు. 172 అప్పర్ అని నామాంతరము. ఈతఁడు తిరుజ్ఞానసంబంధి కుజ్జపాండ్యుల సమకాలమువాఁడు. ద్రవిడమున గొప్పకవి.

కరికాళవ్వ - పు. 69 పూతవతి నామాంతరము.

నక్కనైనారు - పు. 66 తిరునీలనక్కనైనార్, నీలనగ్న, మురుగర్ నామాంతరములు. నమినంది - నేమినంది నామాంతరము

పిళ్లనైనారు - పు. 174 తిరుజ్ఞానసంబంధి నామాంతరము. సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు 'ద్రవిడశిశు'వని యీతనినే ప్రశంసించిరి. వాగీశ, నక్కనైనార, హరదత్తాచార్యాదుల కీతఁడు సమకాలమువాఁడు. వైష్ణవుల పన్నిద్దఱాళ్వారులలో నొకఁడగు తిరుమంగైయాళ్వారుతో నీతఁడు భాషించెనట.

కలికామదేవుఁడు - పు. 132

తిరుమూలదేవుఁడు - పు. 140

నాట్యనమిత్తండి - పు. 79 దండియడిఘళ్. బసవపురాణమున నున్న కథవేఱు. పెరియపురాణకథ వేఱు.

సాంఖ్యతొండఁడు - పు. 179 తెలుగున సర్వత్ర 'సాంఖ్య' అనియే యున్నదిగాని యాతఁడు శాక్యుఁ డగుటచే శాక్యతొండఁడని యుండఁదగును. అఱవమున నట్లే కలదు.

చిఱపులి - పు. 140 శిఱపులి, నిరోధిశార్దూలుఁడు అని నామాంతరములు.

చిఱుతొండఁడు - పు. 140 సిరియాలుఁడు, దభ్రభక్తుఁడు నామాంతరములు. ఈతఁడు రెండవపులకేశిని జయించి, వాతాపికోటను బట్టుకొని తన రాజున (మొదటి నరసింహవర్మ?) కొసఁగెను. ఈతఁడు సేనాధిపతి. కాంచీపురవాస్తవ్యుఁడు. క్రీ.శ. 630 నాఁటివాఁ డగును. ఈతని కొడుకు సీరాలుఁడు; భార్య తిరువెంగాణి; దాసి చంద(న)నంగ.

అడిభర్త - పు. 136 అదిపత్తర్ అతిభక్తర్ నామాంతరములు.

కళియంబనైనారు - పు. 137 కలికంపఁడు, కలికంబఁడు నామాంతరములు.

సుందరపాండ్యుఁడు - పు. 176 కుబ్జపాండ్యుఁడు కూనపాండ్యుఁడు, గూనిపాండ్యుఁడు నామాంతరములు. జినసేన భట్టాకలంకాదు లీతని జైనునిఁ జేసిరి. పిదపఁ దిరుజ్ఞానసంబంధి శైవునిఁ జేసెను. నరసింగ మునయర్‌ -పు. 121 శిరత్తుణెనాయనార్, రణమిత్రుఁడు అని కర్ణాటసంస్కృతగ్రంథములందు నామాంతరములున్నవి. అందు నరసింగ మునయర్ కథ వేఱుగా నున్నది.

కొట్టరువుచోడఁడు - పు. 121 కుట్టులినాయనార్.

పూసలనాయనారు - పు. 140 పోసల నాయనార్.

మంగయక్కరశి -పు. 176, 177 సుందర పాండ్యుని భార్య. (పొగ్హళ్ కరయూరి) చోడనికూతుఁరు.

అఱువదిమూగురలో ద్రవిడకర్ణాటగ్రంథములందు వర్ణితులలో బసవపురాణమునఁ గానవచ్చినవారిని బయిఁబేర్కొంటిని. ద్రవిడకర్ణాటగ్రంథములందుఁగానవచ్చువారు కొందఱు మన బసవపురాణమునఁ గానరాకున్నారు. బసవపురాణమునఁ గానవచ్చువారు గొందఱు ద్రవిడకర్ణాటగ్రంథములందుఁ గానరాకున్నారు. కథలలోఁగూడఁ గొన్ని భేదములుగలవు. ఆయా విషయములు సమగ్రముగాఁ జర్చించుట కిది చోటుగాదు.

మఱికొందఱు

శంకరదాసయ్య, తేడరదాసయ్య, దుగ్గళవ్వ - వీరు మువ్వురును సమకాలమువారు. పు. 111,114, 181,199 పశ్చిమచాళుక్యరాజయిన జగదేకమల్లుఁడు (ఈతఁడే రెండవ జయసింహవల్లభుఁడు. దేసింగుఁడు, సింగబల్లహుఁడు అని పేర్కొనఁబడినవాఁడు నీతఁడే), కళ్యాణకటకమునఁ బంచలోహములతోఁ బోతఁపోయించి నెలకొల్పిన విష్ణుప్రతిమను దృష్టించి జడయశంకరస్థానవాస్తవ్యుఁడైన శంకరదాసయ్య తుత్తునియలు చేసెను. ఈ సింగబల్లహుని భార్యయే సుగ్గళదేవి. ఈమె శైవమతస్థురాలు. తేడరదాసయ్య యీమె గురుఁడు. తన మాహాత్మ్యమును ప్రకటించి తేడరదాసయ్య సింగబల్లహుని శైవునిఁగాఁ జేసెను. పొట్లచెరువు, కొలిపాక యనుపురము లాతని రాజ్యస్థానములుగా శాసనములందుఁగలదు. పొట్లచెరువులోనే తేడరదాసయ్య మాహాత్మ్యమును ప్రకటించి యక్కడి జైనమఠముల నేణ్ణూఱింటిని జెడఁగొట్టించెను. అప్పుడు రాజుతో నక్కడి జైనులెల్లరుగూడ శైవమత మవలంబించిరి. పొట్లచెఱువు బళ్లారి మండలమందుఁ గలదు. కొలిపాక యెక్కడిదో యెఱుఁగరాదని ప్లీటుదొరగారు వ్రాసిరి. కాని యది నిజాం రాష్ట్రాంధ్రదేశమున నున్నది.

హలాయుధుఁడు - ఈతఁడు చిఱుతొండనికి సమకాలమువాఁడని కలదు. చిఱుతొండఁడు క్రీ.శ.630 వాఁడని గుర్తించితిమి గాన, యీతఁడు నాకాలమువాఁ డగును. హలాయుధస్తవమని యీతఁడు రచియించిన శివస్తవము (పంచస్తవిలో నొకటి) కలదు. హలాయుధ నిఘంటు వీతని దగునో కాదో?

ఉద్భటుఁడు- పు. 219 శైవులెల్లరు నీతని స్తుతింతురు.

క. హరలీలాస్తవరచనా
   స్థిరనిరుపమభక్తిఁ దనదుదేహముతోడన్
   సురుచిరవిమానమున నీ
   పురమున కుద్భటుఁడు ప్రీతిఁ బోవఁడె రుద్రా!

శివతత్త్వసారము.



క. క్రమమున నుద్భటుఁడు గవి
    త్వము మెఱయఁ గుమారసంభవము సా(నా?)లంకా
    రము గూఢవస్తుమయకా
    వ్యముగా హరలీలఁ జెప్పి హరు మెప్పించెన్.

నన్నిచోడ కుమారసంభవము.

ఉద్భటారాధ్యచరిత్ర[19] మని తెనాలి రామలింగకవి యీతని చరిత్రమునే తెలుఁగునఁ బద్యకావ్యముగా రచియించెను. తెలుఁగుదేశమున నుద్భటారాధ్య పరంపరవా రారాధ్యులు పలువురున్నారు. ముదిగొండవా రుద్భటారాధ్య పరంపరవారని యుద్భటారాధ్యచరిత్రమునఁ గలదు. ఆతఁడు ఘూర్జరదేశమునఁ గల బల్లకిపురవాస్తవ్యుఁడని బసవపురాణాదులందుఁ గలదు. కాశ్మీరరాజగు జయాపీడునిసభలో విద్యాపతిగా నుండెనని (క్రీ. శ. 779 నుండి 813 వఱకు)

వంశవృక్షము

[20]శ్రీపతిపండితుఁడు

|

గోకర్ణుఁడు

(పంచముని ద్విజునిఁగాఁ జేసెను)

|

మల్లికార్జునుఁడు

(శిష్యార్థమై కృష్ణాజలము నింకించెను. )

|

చినమల్లికార్జునుఁడు

(ఎనుఁబదేండ్ల సువాసినికిఁబుత్త్రునిఁ బుట్టించెను)

|

పండితుఁడు

|

గోకర్ణుఁడు

|

మల్లికార్జునుఁడు

(తత్పరంపరలో)

|

లింగన

పండితత్రయము

శ్రీపతిపండితుఁడు, శివలెంక మంచెన పండితుఁడు, మల్లికార్జున పండితుఁడు పండితత్రయమని పాల్కురికి సోమనాథుఁడు చెప్పినాఁడు.

హరభక్తియుత్పత్తి కధిపతి నాఁగఁ
బరగెను దొల్లి శ్రీపతి పండితయ్య
చెనసి భక్తి క్రియాస్థితికర్త యనఁగఁ
జనియెను లెంకమంచెనపండితయ్య
దూరాన్యసమయసంహారుఁడై చనియె
శూరుండు మల్లికార్జున పండితయ్య
ఖ్యాపితభక్తికిఁ గారణపురుషు
లై పండితత్రయంబన భువిఁ జనిరి.

- పండితారాధ్య చరిత్ర.

శ్రీపతిపండితుఁడు - (పుట. 210) ఈయన యాంధ్రుఁడు; బెజవాడ వాస్తవ్యుఁడు.

పశ్చిమచాళుక్యరాజగు నాఱవ విక్రమాదిత్యుని యొద్ద దండనాయకుఁడై పెక్కురాజ్యములను జయించిన యనంతపాలుఁడు కొండపల్లినాడు పాలించుచు బెజవాడలో నుండఁగా నీ శ్రీపతిపండితుఁ డాతనికి గురుఁడై యుండెను. అనంతపాలుని శాసనము బెజవాడకుఁ జేరువగానున్న చేఁబ్రోలఁగూడఁ గలదు. ఆతఁడు క్రీ.శ. 1095-1118 లో నుండెను. శ్రీపతిపండితుని మల్లికార్జున పండితారాధ్యుఁ డిట్లు ప్రశంసించినాఁడు.

క. ఒక్కఁడె దైవము శివుఁడని
   నిక్కము సేయుటకు ముడిచె నిప్పులు సీరన్
   స్రుక్కక శ్రీపతి పండితుఁ
   డక్కజముగ విజయవాడ నలజమ్మి శివా!

మన సోమనాథుఁడుగూడ నీ కథనే పేర్కొన్నాఁడు. [21]శ్రీపతి పండితుని వంశమువాడగు కాశీనాథుని వీరారాధ్యుడు తన ధర్మగుప్తాభ్యుదయమున నీ కథ నిట్లు వివరించి చెప్పినాఁడు.

గీ. అరయఁ దత్పండితేంద్ర నిజాంశభూతి
    భవులు శ్రీపతి మంచెనపండితులును
    మల్లికార్జునపండితుఁ డెల్లజనులు
    వినుతు లొనరింప వెలసి రుర్వీతలమున.

గీ. వారు భువి వీరశైవప్రవర్తనంబు
   బ్రాహ్మణాచార మగునంచుఁ బఠ్యమాన
   వేదవేదాంతసిద్ధాంతవిశ్రుతముగఁ
   దెలియఁజేయుచు విలసిల్ల రలఘుమహిమ.

క. ధీరుడు శ్రీపతిపండితుఁ
    డారయఁ బ్రాచీనదేశికాహ్వయుఁడు మహో
    దారదివాద్వయమార్గ
    స్పారధురంధరుఁడు లోకపావనుఁ డెన్నన్.

క. ఆ గురుడు విజయవాటిని
    భోగోజ్జ్వలమందిరమున బుధయుతుఁడై శై
    వాగమనైగమబోధా
    యోగమునఁ జరింపుచుండి యొకనాఁ డనియెన్.

క. శివుఁడే దైవము ధరలో
   శివభక్తులె సత్కులీనసిద్ధాంతపరుల్
   శివమంత్రమె మనురాజము
   శివుని ప్రసాదంబె భోగశేఖర మరయన్

వ. అని శపథంబుగా బలుకుచు ననంతపాలదండనాయక మహీధవాది శిష్యతతి సేవాయత్తచిత్తంబులం బ్రవర్తింపుచుండఁ బరవాదికోలాహలుండై జయవాటీపురంబున విజయధ్వజం బెత్తి మహోత్తరశైవాచార్యుం డనఁ జెలంగుచుండి యొక్కనాఁడు.

సీ. సరవిఁగృష్ణానదీస్నానంబు గావించి
               నిత్యకృత్యంబులు నెఱయఁదీర్చి
    వచ్చుచోఁ బురవీథి వసుధేశు మదగజం
               బరుదేరఁ దొలఁగుచు నచట నొక్క
    గొడగరి వాకిలిఁగడఁ జొచ్చి నిలిచిన
               నంతఁ దద్గృహమేధి యరుగుదెంచి
    శరణార్థి, గురురాయ, సతతంబు నావ్రతం
               బార్వు రయ్యలకు శివార్చనంబు

   దగసలుపుచుంట నొకయయ్య తక్కువయ్యె
   నేఁడు లింగైక్య మిఁక నాకు నిక్క మనిన
   మంచిదని వాని వ్రత మొనరించి వేడ్క
   వచ్చు దేశికుఁ గని పరవాదు లుదరి

క. ఓహో, బ్రాహ్మణుఁడట యితఁ
    డాహా యగ్గొడగరింట నారోగిణ మి
    ట్లీహీ యొనరిచివచ్చెను
    ద్రోహంబని చుట్టుకొనిరి దుర్మతు లగుచున్

గీ. పరగ నీ రీతిఁ బరవాదు లురవడించు
    గతికిఁదా మున్ను జేసిన కడుఁబ్రతిజ్ఞ

నిగమసమ్మతి రూఢిగా నెఱపఁదలఁచి
వారు గొనిపోవ నృపసభఁ జేరె గురుఁడు

వ. ఇట్లు పరవాదు లప్పండితేంద్రు ననంతపాల దండనాయక భూవరాస్థానంబునకు గొనిపోయి యిట్లనిరి.

క. గొడగరి మల్లయ యింటను
   గడుపారఁగఁ గుడిచిరాఁగఁ గాంచితి మితఁడే
   ర్పడ మీ గురు వెట్లగునని
   కడుఁదోఁచక యుంటి మిపుడు కలఁగుచు నధిపా!

సీ. అని యిట్లు విప్రు లాడిన నలంకుచు సభ్యు
                    లా పండితునిఁ జూచి యనఘచరిత!
    యిది యెట్టిదగునని ముదలింపఁ జిఱునవ్వు
                    సెలవులదైవాఱి చెలువుదనర
    నింతయు నిజము మే మెనయ మున్నొనరించు
                   ప్రతిన యిట్టిది యసత్ప్రాజ్ఞులార,
    మొనసి యాత్మాద్వైతమున శివాద్వైతంబు
                   ననుఁ జెందువారలఁ గినిసి జాతి

గీ. భేద మెంచఁగరాదని పృథులశాస్త్ర
    రీతులును మౌనివర్గంబు నీతి దెలియుఁ
    డరసి జాబాలశతరుద్రియాదులందుఁ
    బలుకు పలుకులు వినుఁడు విభ్రమముమాని.

(పౌరు లంగీకరింపక పండితుని బహిష్కరించిరి- పచనాదుల కగ్ని నొసఁగరయిరి - అంత)

సీ. వేదవేదాంతార్థవిధులచే సాధింపఁ
                  గాలేక మూర్ఖులై కదిసి మీర
    లగ్ని మీ కిడమని యార్చుట లది మీకుఁ
                 గలిగియుండినఁగదా కడమమాట

    లని కోపశిఖివీక్షణాగ్రప్రచారియై
                 గరిగొని విస్ఫులింగములఁ దనుప
    బొమలు గంటిడ ధరాభ్రమణంబుచే దిశల్
                 కుమ్మరిసారె చందమ్ము నెఱప

గీ. గగనభాగంబునం దిరుల్ గ్రమ్ముకొనఁగ
    సర్వజీవౌఘమును సభాసదులు మూర్చ
    నొంద నప్పండితేంద్రుఁ డత్యుగ్రవేగ
    సరణి లంఘించెఁ దన్మహాస్థానవీథి.

వ. అప్పండితేంద్రుండు జయవాటికాపురమల్లికార్జునాగ్నేయభాగంబున నున్న శమీశాఖి సమీపంబునకు నరిగి యద్దేవున కభివందనంబును ప్రమథగణస్తోత్రంబును గావించి వీతిహోత్రు నాకర్షింపుచుఁ దనమీఁది పట్టుపచ్చడంబునం గట్టి యిట్లనియె.

మ. వినుమీ పావక, శైవగేహములలో విశ్రాంతి దక్కన్ బురం
     బున నెందున్ వసియింప కీ కుజనవిస్ఫూర్జన్మదంబున్ హరిం
     పు నగేంద్రాలయునాజ్ఞ దప్పి యనయంబున్ మీఱినన్ వీరభ
     ద్రునిచే నీకగు బన్నమున్ దెలియఁగా దొడ్డాడ నింకేటికిన్.

(అట్లు శ్రీపతిపండితుని యానచొప్పున గ్రామమున నగ్నికరవయ్యెను. అనంతపాలదండనాథాదులతో నెల్లరును వచ్చి శరణార్థులయిరి. వారము దినములయిన పిదప శ్రీపతిపండితుఁడు శమీవృక్షపుఁ గొమ్మను వ్రేలఁగట్టిన పచ్చడపుమూటను విచ్చి యగ్నిదేవుని విడిచిపుచ్చెను. పండితుని మాహాత్మ్యమున కచ్చెరువంది యనేకులు తచ్ఛిష్యులయిరి. తదాది శ్రీపతిపండిత సంప్రదాయమువారికి బెజవాడ యాస్థానమయ్యెను.)

శివలెంక మంచెనపండితుఁడు (పుట. 197)

శివలెంక యింటిపేరివా రారాధ్యబ్రాహ్మణులు నేఁడును బ్రఖ్యాతులుగా నాంధ్రదేశమందుఁ గలరు. శ్రీపతిపండితారాధ్యుని వంశవృక్ష మున్నట్టే మంచెన పండితుని వంశవృక్షమును నేఁటి శివలెంకవారియొద్ద నెందేని కలదేమో! మంచెనపండితుఁడు శ్రీపతిపండితున కించుక తర్వాతికాలమున నుండెను.

మల్లికార్జునపండితుఁడు

ఈయన చరిత్రము ప్రసిద్ధమే. ఈ పీఠికలో నింతకుముం దక్కడక్కడఁ గొంతప్రస్తుతము నయ్యెను. గోదావరీతీరమందలి దాక్షారామ మీయన జన్మదేశము. ఈయన పెక్కుగ్రంథముల రచియించెను. అందు శివతత్త్వసార మను తెల్గుకృతి నొకదాని నేను ప్రాచ్యలిఖితపుస్తకశాలకై సేకరించితిని. ఇప్పుడు మఱియొక 'శ్రీముఖదర్శనగద్య' మనుదానిఁ గనుఁగొనఁగల్గితిని. దాని యాద్యంతము లిట్టివి:

ఆది :-

శ్లో. త్రైలోక్యస్య భవానేవ నిగ్రహానుగ్రహక్షమః;
    శ్రీవిశ్వేశ్వర మాం పాహి మహేశ్వర! నిరీశ్వర!

జయజయ రుద్ర, వీరభద్ర, విరించిపంచమశిరఃఖండన, యజ్ఞపురుషశిరఃఖండన! -

అంతము :

మల్హణప్రియ, బల్లాణప్రియ, కుమ్మరగుండయ్యప్రియ, అఖిలభువనభక్తజనప్రియ, దేవా! సురపతిప్రముఖ నిఖిల ప్రార్థితప్రథన పరమేశ్వర, దేవా నమస్తే నమస్తే నమః.

శ్రీమాన్ మాహేశ్వరశ్శిష్టో మల్లికార్జునపండితః;
శ్రీముఖదర్శనగద్యం హృద్యం గ్రథితవాన్ (?)

శైవమతము

క్రీస్తు పుట్టుకకుఁ బూర్వమున నుండియు, అనగా రెండువేల యేండ్లకుఁ బూర్వమున నుండియు దక్షిణాపథమున శైవవైష్ణవమతములు పేర్వెలయుచున్నవి. ప్రధానముగా వైష్ణవమతమునకు ద్రవిడదేశమందును, శైవమతమునకుఁ గర్ణాటాంధ్రదేశములందును బ్రచారము గలదు. శ్రీరంగక్షేత్రము వైష్ణవులకును, శ్రీశైలము శైవులకును, దీర్థములుగా నుండెడివి. ద్రవిడదేశమునఁ గూడ మధురాదిక్షేత్రములు, శైవులకుఁ దీర్థములుగా నున్నవి గలవు. శ్రీశైలము కర్ణాటాంధ్రదేశముల కూడలిలోఁ గలదు గావునను, బ్రాయికముగాఁ గర్ణాటాంధ్రదేశములకుఁ బాలకు లొక్కరే యయిరి గావునను, లిపిలో మాత్రమే కాక భాషలోఁగూడ నంతగా భేదములేదు గావునను గర్ణాటాంధ్రు లాకాలమునఁ బరస్పరము మిక్కిలి సన్నిహితులుగా నుండెడివారు. శ్రీశైలము చతుర్ద్వారములు[22] (త్రిపురాంతకము, సిద్ధవటము, అలంపురము, మాహేశ్వరము) గలదై యాకాలమునఁ గర్ణాటాంధ్రశైవాచార్యులకు నిత్యనివాసముగా నుండెడిది. ఎడతెగక శైవులు శ్రీశైలమునకు రాకపోకలు జరపుచుండెడివారు. నిత్యముగా నక్కడ ననేకులు నివసించుచుండెడివారు. సామాన్యముగా నిక్కడ శైవులని నేను పేర్కొన్నను నాకాలపు శైవులలోఁ గొన్ని భేదములు గలవు. ఆ భేదములు పాశుపతము, కాలాముఖము, కాపాలికము మొదలగు పేళ్లుగలవి. శివుఁడే పరతత్త్వమని విశ్వసించువారయినను వీరిలోఁ బరస్పరము మతస్పర్దలు, విరోధములు గూడ నుండెడివి. [23]వీరికెల్లరకు నైకకంఠ్యము లేకుండెడిది. వీరెవ్వరుగాని వర్ణాశ్రమభేదములను విడనాడినవారుగారు. పయిశైవమతముల సూక్ష్మభేదములను స్పష్టముగాఁ గనుఁగొనుటకు బలవత్తరములయిన యాధారములు నేఁడు దొరకకున్నవి. శైవగ్రంథములం దుద్దృతములయిన యాగమతంత్ర శ్లోకములనుబట్టి యాయామతముల స్థూలస్వరూపములను మాత్రము గనుఁగొన సాధ్యమగును. ఆ కాలపుఁ దంత్రగ్రంథములును, నాగమగ్రంథములును, నాయామతములవారి యనుష్ఠాననిబంధములును నేఁడు పర్యాప్తముగా మనకు దొరకుటలేదు. విద్యారణ్యులవారి సర్వదర్శనసంగ్రహమునఁ బాశుపత శైవమతములు నిర్వచింపఁబడినవి. బ్రహ్మసూత్రములకు శ్రీకంఠశివాచార్యులు రచియించిన భాష్యము విశిష్టాద్వైతసిద్ధాంతమును వాసుదేవుఁడని, శివుఁడని యనుటలోఁదక్కఁ దక్కినవిషయములం దంతగా భేదములేదు. అప్పయదీక్షితులవారి కాలమున నుండియే యీ గ్రంథ మెక్కువ వ్యాప్తిఁ జెందినట్టు గానవచ్చుచున్నది. కావున నిది యంతగాఁ బ్రాచీనమయినది గాకపోవచ్చుననియు నప్పయదీక్షితులవారి కాలముననో యంతకించుక పూర్వకాలముననో, రచితమై యుండవచ్చు ననియుఁ గొందఱునుచున్నారు. రామానుజులవా రీ శ్రీకంఠభాష్యమునే వరవడిగా నుంచుకొని తమ శ్రీభాష్యమును రచించిరనియు, నీ శ్రీకంఠ శివాచార్యులు శంకరులనాఁటి వారనియుఁ గొంద ఱనుచున్నారు. ఈ విషయ మిట్లుండఁగా నీ నడుమ బ్రహ్మసూత్రముల పయి శ్రీపతి పండితారాధ్య రచితముగా శ్రీకరభాష్యమని యొక గ్రంథము బయల్పడినది. ఇది శ్రీపతిపండిత రచితము గాదనియే నా నమ్మకము. శంకరాద్వైతము ప్రబలిన పిదప నాగమతంత్రమతములవారు గూడ, దమ మతములు బ్రహ్మసూత్రాభిప్రేతములే యని నిరూపించుటకు యత్నించిరి. స్వసిద్ధాంతానుసారముగా బ్రహ్మసూత్రములకు భాష్యముల రచించిరి. ఈ పూన్కి శంకరులకుఁ బూర్వకాలమున నున్నట్టు గానరాదు.

శ్రీకంఠభాష్యమునఁగాని, శ్రీకరభాష్యమునఁగాని పాశుపత కాలాముఖాది శైవమతభేదముల స్వరూపములు గానరావు. వీరాగమ వాతూలాగమాదులు కొన్ని శైవమతములను నిరూపించునవి గలవు.

శ్రీశైలము శైవమతస్థుల కునికిపట్టుగా నుండి తత్తన్మతముల కభ్యుచ్చ్రయము గల్గించుచుండుట యాకాలమున దక్షిణాపథమునఁ జైనబౌద్ధమతముల వ్యాప్తికిఁ గొంత యడ్డంకిగా నుండెను. ఈ యడ్డంకిని దొలఁగఁద్రోసికొనుటకై బౌద్ధు లయిన సిద్ధనాగార్జునాదులు శ్రీశైలముమీఁదనే నెలవుకొని యక్కడనే స్తూపములఁ గట్టుకొని స్వమతములను వ్యాపింపఁజేయ మొదలిడిరి. జైనబౌద్ధమతములు అహింసాతత్త్వమును బోధించుచు జాతిభేదమును బాటింపక యనుష్ఠానసౌకర్యము గలిగి సర్వసమ్మతములుగా నుండుటచే ననేకు లామతములందుఁ జేరఁజొచ్చిరి. బహుభేదములతోఁ బరస్పరస్పర్దలతో నున్న శైవమతము లానాఁడు సన్నగిలఁ జొచ్చెను. శంకరులవారి యద్వైతసిద్ధాంతము మహోదయము గలదై జైనబౌద్ధమతములనే కాక శైవమతములను గూడఁ జిదుకఁగొట్టసాగెను. ఇట్లు కాలము గడవను గడవను, శైవమతములు చాల సన్నగిల్లుటయు, జైనబౌద్ధమతములు సమధికవ్యాప్తి గలవగుటయు, తర్వాత నద్వైతమతము సర్వాధికవ్యాప్తి గలదగుటయు, దటస్థించెను. 10, 11, 12, శతాబ్దుల నాఁటి కాంధ్రకర్ణాటదేశములందు మతములస్థితి యిట్లున్నది. అప్పుడు జైనబౌద్ధాద్వైతమతముల తళ్లుననుండి స్వమతమును రక్షించుకొనుట శైవమతముల వారి కావశ్యకమయ్యెను. అందుకై యాంధ్రకర్ణాటదేశములందుఁ గొందఱు మహనీయులు వెలసిరి. ఆంధ్రదేశమున వెలసిన మహనీయులు పండితత్రయము, వీరి విషయమింతకుముందే వ్రాసియున్నాఁడను. శివలెంకమంచెన పండితుఁడును, శ్రీపతి పండితారాధ్యుఁడును రచించిన గ్రంథములేవో మనకు దొరకకున్నవిగాని మల్లికార్జున పండితారాధ్యుఁడు రచించిన గ్రంథము, శివతత్త్వసారము, నేఁడు దొరకియున్నది.[24] అందు ముందుగా నద్వైతమతమునే యాయన ఖండించెను. చందవోలు మొదలగు స్థలములం దీ పండితారాధ్యులవారు జైనబౌద్ధమతముల నెట్లు విధ్వంస పఱిచిరో పండితారాధ్యచరితముఁ జదివినఁ దెలియఁగలదు. ఈయన పాశుపతశైవమత ప్రవర్తకుఁడు. ప్రాచీన సంప్రదాయానుసారముగా శైవమతమును వైదికముగా నీయన నిలువరింపఁ బూనెను. ఇట్టు ప్రాచీనసంప్రదాయములను బరిపోషించుట వలన లాభమంతగాఁ గానరాదని యెఱిగి యింతకంటెఁ దీవ్రముగాఁ గర్ణాటదేశమున బసవేశ్వరుఁడు, ఏకాంత రామయ్య, పద్మరసు మొదలగువారు వర్ణాశ్రమాచారకలితములై యున్న ప్రాచీన శైవమతభేదముల నెల్ల నడచిపుచ్చి వానిలోనుండి వీరశైవమని క్రొత్త శైవమును సర్వశైవమతసారముగా నుద్దరించి నెలకొల్పిరి. దీనినే ప్రాచీన శైవమతములలోఁ దగవులు చల్లారి యైక్యమేర్పడెను. నూతనోత్తేజముఁ గాంచి శైవమతము బలముగలదై నెలకొనెను. వర్ణభేదమును విడుచుటచే నీ శైవము జైనబౌద్ధమతములవలె సర్వసాధారణమై సులువుగా నందఱచే నాదృతమయ్యెను. ఒకప్రక్క నిట్లు వీరు స్వమతమందు సౌలభ్యసౌకర్యములను గల్పించి పలువుర నందుఁ జేర్చుకొనుటతోపాటు, తమకు మతమునఁ బ్రబలప్రాతికూల్యము గలిగియున్న జైనబౌద్ధమతములను దండనీతి నుపయోగించి చెండాడి కూడ స్వమతమును బ్రబలపఱుచుకొనిరి. ఇంతగొప్పకార్యమును సాగించుట సాధారణులకు శక్యముగాదు గదా! పశ్చిమచాళుక్యరాజ్యమును గైవసపఱుచుకొని యేకచ్ఛత్రాధిపతిగాఁ గళ్యాణమున రాజ్య మేలుచున్న బిజ్జలుని మంత్రియు, దండనాథుఁడును మహనీయుఁడునగు బసవేశ్వరుఁడీ సంఘమందు ముందు నిల్చెను. ఈతఁడు స్వయము మహాభక్తుఁడు. శివుని వాహనమగు నందీశ్వరుని యవతారమే యీతఁడని శైవులెల్లరు విశ్వసించిరి. ఆజానజమయి శివభక్తి యీ మహనీయునందుఁ గుదురుకొనెను. శివుఁడే పరతత్త్వమనియుఁ దదన్యదేవతారాధనము దగదనియు నీతఁడు పసిప్రాయమందే నిశ్చయించుకొనెను. వర్ణాశ్రమాచారధర్మములను దదభిమానులయిన తలిదండ్రులను వర్జించెను. తానును దనదోడి శివభక్తులును సుదృఢముగా నేర్పఱుచుకొన్న మతధర్మముల నిర్వహించుటలో నిర్భయతతో మెలగెను. ఆ కాలమునఁ బశ్చిమచాళుక్యదేశమున నీతఁడు మతరాజ్య మేలె ననవచ్చును. తన మతము ననువర్తింపని వారిని జంపించెను. అట్లు చంపవలసినదిగా సంగమేశ్వరదేవుఁ డీతని బాల్యముననే శాసించెనట. ఈ శాసనము ననుసరించి యీతఁడు తన యేలికయగు బిజ్జలునిఁ గూడఁ జంపించెను! బసవేశ్వరుని మత మొక్కనూఱేండ్లలోఁ గర్ణాటదేశమెల్ల వెల్లివిరిసినది. ఈ వీరశైవమతమున వేలకొలఁది జనులు ప్రవేశించిరి. బ్రాహ్మణుల దగ్గఱ నుండి చండాలురదాఁక నాకాలమున నీకుల మాకుల మని భేదములేక యెల్లరు కూడిన సంఘమువారే నేఁడు లింగాయతు లనుపేరఁ గర్ణాటదేశమున నున్నారు. బసవేశ్వరుని యనంతరము గొంతకాలమున కాంధ్రదేశమునఁ గూడఁ దన్మతము వారు, జంగములు, వ్యాప్తి చెందిరి.

బసవేశ్వరునకుఁ బూర్వమున్న శైవమతములను గూర్చియు, బసవేశ్వరప్రవర్తితమైన వీరశైవమును గూర్చియుఁ గొంత వివరింతును.

పాశుపతము

ఈ వ్రత మధర్వశిర ఉపనిషత్తునందుఁ జెప్పఁబడినది. శ్రీకంఠభాష్యము గూడ దానినే పేర్కొనుచున్నది. బ్రహ్మప్రణవపంచాక్షరీప్రాసాదాది మంత్రములు, పశు, పతి, పాశాది వస్తువ్యవహారము, భస్మోద్ధూళన త్రిపుండ్రధారణ లింగార్చన రుద్రాక్షధారణాది ధర్మములు పాశుపతులకుఁ గలవని శ్రీకంఠభాష్యమువలనఁ దెలియనగును. ఈ విషయములనే మల్లికార్జున పండితారాధ్యులవారి శివతత్త్వసారము గూడఁ బ్రపంచించి చెప్పుచున్నది. పాశుపతు లద్వైతమతమును మిక్కిలి గర్హించిరి. వారు జీవేశ్వరులకు భేదము చెప్పుదురు. పశువులగు జీవులు పతియగు రుద్రుని యనుగ్రహముచే పాశమయిన సంసారముననుండి ముక్తులై మోక్షసుఖము ననుభవింతురు. జీవులకుఁ బాశబంధము తొలఁగును గాని పశుత్వము తొలఁగదని మల్లికార్జున పండితుఁడు చెప్పెను.

క. గోపతి కృతమున భవపా
   శాపేతములయిన పశువులట్టులు భవపా
   శాపేతులైన పశువులు
   ప్రాపింతురు మోక్షసుఖము పశుపతి నీచేన్.

మఱియు, వారు సన్న్యాసమును గర్హింతురు.

క. ప్రాజ్ఞులు వేదజ్ఞులు లో
   కజ్ఞులు చేకొండ్రె గతశిఖాగాయత్రీ
   యజ్ఞోపవీతనాస్తికు
   లజ్ఞులు చేకొండ్రుగాక యద్వైతమజా!

శ్రీకంఠభాష్యము గూడ సన్న్యాస మావశ్యకమనుటలేదు. పాశుపతులు విశిష్టాద్వైతసిద్ధాంతమువారు. మల్లికార్జున పండితారాధ్యులవారి శివతత్త్వసార మీవిషయమును స్పష్టముగాఁ దెలుపుచున్నది :

క. వేదోక్తసదాచారా
    పాదనమున నెగడునట్టి పశువులకుఁ బురా
    పాదితదురితక్షయమై
    యాదరమున ధర్మ మధిక మగు నీశానా!

క. ధర్మాధిక్యంబున నతి
   నిర్మలబోధయు విరక్తినిష్ఠయుఁగల య
   క్కర్ములకు నీ ప్రసాదము
   పేర్మిని శివభక్తి పుట్టుఁ బృథుభావమునన్.

క. మానితశివభక్తి శివ
   జ్ఞానధ్యానముల నీ ప్రసాదాతిశయా
   నూనతఁ గర్మక్షయమై
   యానందప్రాప్తి ముక్తుఁడగు నీశానా!

విశిష్టాద్వైతసిద్ధాంతమునకు జీవగఱ్ఱ యనఁదగిన శ్రుతి (నాయ మాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన, యమై వైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్) ప్రతిపాదితమయిన యర్థమునే పయిపద్యములును జెప్పుచున్నవి. విశిష్టాద్వైతులవలె వీరును శ్రౌతస్మార్తకర్మలతో సమానముగా నా(శైవా)గమోక్తము లయిన కర్మములను గూడ నాచరింతురు. [25]

కాలాముఖులు

వీరి సిద్ధాంతమేదో స్పష్టముగాఁ దెలియరాదు. కాని, వీరు శక్తిపూజనుగూడఁ జేయువారుగాఁ దెలియవచ్చుచున్నారు. మండలార్చనాదులు శాక్తసంప్రదాయములు గొన్ని వీరికిఁ గలవు. లింగార్చనము శక్తిశివసంయోగరూప మయినదే. శక్తిచిహ్నము పానవట్టము, శివచిహ్నము లింగము నగును. శక్తిరహితుఁడగు శివుఁడు చేష్టింపఁజాలడనియు, శక్తిసహితుఁడగు శివుఁడే సర్వశక్తుఁడనియుఁ బ్రాచీనశైవసిద్దాంతము. ఈ విషయమునే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో 'శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం - నచే దేవం దేవో న ఖలు కుశలస్స్పందితు మపి' అని చెప్పిరి. మఱియు జీవాత్మ శక్తిపీఠమనియుఁ, బరమాత్మ లింగమనియు, లింగపీఠములు జీవాత్మైక్యబోధకములనియు నాగమములందుఁ గలదు : జీవాత్మ శక్తిపీఠం స్యాత్ పరమాత్మాతు లింగకమ్'. కాలాముఖులు శక్త్యర్చనముగూడఁ గావింతురు. వారు నిత్యబ్రహ్మచారులు. గార్హస్థ్యము వారికిఁ దగదు. నన్నిచోడని కుమారసంభవమునఁ గాలాముఖ శైవసంప్రదాయములు కొన్ని గాననగును.

పాశుపతాదులు లింగధారులు గారు

దేవలకులు మంత్రదీక్షాన్వితులును
శైవపాశుపతాది శాసనధరులు

వారివారిక లింగవంతులై చూచి
వారివారిక లింగవంతులై కూడి

-బసవపురాణము.

ఈ ద్విపదలు బసవేశ్వరుని యుద్బోధమువలన లింగధారణములేని పాశుపతాదులుకూడ లింగధారులయి వీరశైవమునఁ జేరఁజొచ్చిరని చెప్పుచున్నది.

వ్రతం పాశుపతం చైవ కాలాముఖకపాలికే,
లింగాంగ సంగహీనత్వాత్తచ్ఛిష్యో నరకం వ్రజేత్.

- వీరశైవాచారసంగ్రహము.



శ్లో. శైవాన్ పాశుపతాన్ వామాన్ కాలాముఖమహావ్రతాన్,
    అతిరిచ్యతి దేవేశి! ప్రాణలింగార్చనో బుధః.

- వీరాగమము.

పై శ్లోకములు పాశుపతులు, కాలాముఖులు, కాపాలికులు లింగధారులు గారనియు, అట్టివారికి శిష్యుఁడగువాఁడు నరకము నందుననియుఁ జెప్పుచున్నవి. ఇట్టి శ్లోకములు పెక్కులు గలవు.

తెలుఁగునాటి యారాధ్యులు వీరశైవులు గారు;

పూర్వకాలమున వీరు లింగధారులు గారు

ఈ విషయము తగవులకుఁ దానకమగునని నే నెఱుఁగుదును. అయినను నాకు వాస్తవముగాఁ దోఁచినదానిఁ దెలుపుచున్నాఁడను. ప్రాజ్ఞులు పరిశోధింపఁ దగుదురు. తెలుఁగుదేశపువారగు పండితత్రయము (శివలెంకమంచెన పండిత, శ్రీపతిపండిత, మల్లికార్జున పండితులు) లింగధారు లనుటకు బలవదాధారములు నాకుఁ గానరాలేదు. మల్లికార్జున పండితారాధ్యుల గ్రంథమున నెక్కడను లింగధారణప్రశంసయే లేదుగదా! ఆంధ్రదేశమున నాకాలమునఁ గాలాముఖులు గూడఁ బలువురుండిరి. నన్నిచోడని గురువయిన మల్లికార్జునుఁడు కాలాముఖమతమువాఁడు. ఆతఁడుగూడ లింగధారిగాఁడు. కుమారసంభవ మందెక్కడను లింగధారణప్రశంస గానరాదు. వీరశైవులు గర్హించు వర్ణాశ్రమాచారవిధులు, వైదికకర్మలు వీరికి సమ్మతములు. మల్లికార్జున పండితారాధ్యులకు బ్రాహ్మణ్యముమీఁద నాస్థ గలదు. వర్ణాశ్రమధర్మనిబంధనముమీఁదఁ దాత్పర్యము గలదు. శివభక్తియందుఁ దన్మయత్వమును గలదు. బసవేశ్వరుఁడు మహాశివభక్తుఁడని యాయనయెడల నద్భుతగౌరవమును, వైదికకర్మలను గర్హించి వర్ణాశ్రమాచారములను రూపుమాపుచున్నాఁడని యతృప్తియుఁ గాంచినవాఁడై బసవేశ్వరుని దర్శించి వాదించుటకై పోవుచుండఁ ద్రోవలోఁ దన్మృతివార్త వినవలసెననియు, “భక్తిమీఁది వలపు బ్రాహ్మ్యంబుతోఁ బొత్తుఁ బాయలేను నేను బసవలింగ” యని యాతఁడు చెప్పెననియుఁ బ్రతీతి గలదు. దీనిఁబట్టికూడ నాతఁడు బసవేశ్వరుని మతమువాఁడు కాఁడని స్పష్టముగా నెఱుఁగనగును. లింగమును ధరించిన వీరమాహేశ్వరుఁడు (వీరశైవుడు) వర్ణాశ్రమధర్మములను, వైదికకర్మములను నాచరింపరాదని కలదు. ఇట్లు విడుచుటే వీరవ్రతము. వీరశైవులు జంగములయిన (చరించునట్టి) శివలింగములేయని వీరశైవగ్రంథములు పలుకుచున్నవి. శివత్వమును బొందినవారు మరల వైదికకర్మాచరణమునకుఁ బాల్పడరాదు. కర్ణాటదేశమునఁ గల లింగాయతులు సరిగా నట్టి వీరశైవసంప్రదాయమువారు. వారికి లింగధారణము గలదే కాని, యజ్ఞోపవీతాదులు లేవు. వారు బ్రాహ్మణులవలె విశుద్దమయిన సదాచారము గలవారే కాని, బ్రాహ్మణులతోఁ గాని, తదితరులతోఁ గాని సహభోజనమునొల్లరు. వారు బ్రాహ్మణాదివర్ణధర్మముల నభిమానింపరు. ఆంధ్రదేశపుటారాధ్యులు సంపూర్ణముగా బ్రాహ్మణధర్మములు గలవారు. తక్కిన బ్రాహ్మణులతో వీరు సహభోజనము గావింతురు. బ్రాహ్మణ్యము నభిమానింతురు.

దశమశతాబ్ది కింకను బూర్వకాలముననుండి గౌడదేశమున గోళకీమఠ మను పేర గొప్ప శైవాచార్యమఠము ప్రఖ్యాతిగాంచెను. భావశంభు, సోమశంభు ప్రభృతులు తన్మఠాధిష్ఠాతలు. సోమశంభువు తనపేర నొకపద్దతిని రచియించెను. శివలెంకమంచెన పండితుఁ డీ సోమశంభువు మనుమఁడట! ఈ పరంపర వారు 'కలచురిక్ష్మాపాలదీక్షాగురువు' లని పలుచోట్లఁ బ్రస్తుతింపఁబడిరి. కలచురిక్ష్మాపాలుఁడగు బిజ్జలునకుఁ గూడ వీరు గురువులయి యుందురని నేను దలంచుచున్నాఁడను. బిజ్జలుని కాలమునఁ బశ్చిమచాళుక్యరాజ్యమున నీ పరంపరవారు పలువురు శివాచార్యు లుండిరి. బసవపురాణములో వారి పేళ్లు చూడఁదగును. ఏతన్మఠపరంపరవారు వేలకొలఁది మహనీయులు దక్షిణాపథమెల్ల వ్యాపించిరి; కేరళమునకుఁగూడ నరిగిరి; మఠముల నెలకొల్పిరి. కృష్ణలీలాశుకుని గురువగు నీశానశివాచార్యుఁడు కేరళమందుండినవాఁడు. ఆయన చోళరాజగు రాజరాజచోళునకును గురువై యుండెను. ఈశానశివగురుదేవపద్ధతి శివ, ధర్మశివ, విశ్వేశ్వరశివాదులు తెలుఁగుదేశమునకుఁ జేరిరి. విశ్వేశ్వర శివాచార్యుఁడు కాకతీయగణపతి చక్రవర్తికి శివదీక్షాగురుఁడై, తండ్రియై (దీక్ష నొసఁగుట చేతనా?) యాంధ్రదేశమునఁ గృష్ణాతీరమునఁ మందర గ్రామమున గొప్పమఠము నెలకొల్పను. తా నందు నెలకొనెను.

శ్లో. శ్రీ చోళేశ్వర మాలవక్షితిపతీ రాజన్యచూడామణీ
    యచ్చిష్యౌ కిమతః పరం గణపతి క్షోణీపతి ర్యత్సుతః,
    న స్యాత్కస్య ముదే స దేశికవరశ్ళైవాగమాంభోనిధి
    శ్రీవిశ్వేశ్వర దేశికః కలచురిక్ష్మాపాల దీక్షాగురుః.
    త్వంగత్పింగ జటాకిరీట ముదయస్మేరారవిందాననం
    ముక్తాకుండలమండితాం సశిఖరం హారై ర్మనోహారిణమ్,
    విద్యామంటపవర్తినం గణపతిక్ష్మాపాల దీక్షాగురుం
    శ్రీవిశ్వేశ్వరశంభు మీక్షితవతాం తే చక్షుషీ చక్షుషీ.

- మల్కాపుర శాసనము.

కాళేశ్వరము, పొన్నగ్రామము, మంద్రకూటము, మానేపల్లి, ఊటుపల్లి, చంద్రవల్లి, కంభంపల్లి, ఆనందపురము, కొమ్మూరు, శ్రీశైలము, వెల్లాల, ఉత్తర సోమశిల మొదలగు గ్రామములందు శివాలయములను, మఠములను నీతఁడు నెలకొల్పను. వీరి పరంపరవారు తెల్గుదేశమున కృష్ణదేవరాయల తర్వాతి కాలముదాఁక గూడఁ బలువురు ప్రఖ్యాతులై యుండిరి. శ్రీనాథునిచే నోడింపఁబడిన డిండిముఁ డీ పరంపరవారికి సంబంధించినవాఁడే. నేఁ డద్వైతమతాచార్యపీఠములుగా నున్న విరూపాక్ష, పుష్పగిరిపీఠము లానాఁడు వీరు నెలకొల్పిన శైవమఠములే. పెదకళ్లేపల్లిలో శివాలయము నీ సంప్రదాయమువాఁ డును, బుష్పగిరి మఠాధిపతియు నగు సోమశివాచార్యుఁడే కాకతీయ ప్రతాపరుద్రుని పాలనమున క్రీ.శ. 1282 నాఁడు కట్టించెను. ఆయన విగ్రహము గూడ నక్కడఁగలదు. పెక్కుగ్రామములందు వారి ధర్మప్రతిష్ఠలు గలవు. కృష్ణరాయల కాలమున నున్నవారును, ముక్కుతిమ్మనాదులకు గురువులు నగు నఘోరశివాచార్య దక్షిణామూర్తి శివాచార్యులు, వీరి సంప్రదాయమువారే. సూత్రభాష్యకారుఁడు, శ్రీకంఠ శివాచార్యుఁడు గూడ నీ పరంపరలోనివాఁడే యగుననుకొందును. వీరి యుద్బోధముచేతనే కాఁబోలును బ్రతాపరుద్రుని కాలమున నాంధ్రదేశ శివాలయములలోఁ బెక్కింటఁ దమ్మళ్లు తొలఁగింపఁబడి, వెలనాటివారు పూజారులుగా నిలుపఁబడిరి. ఈశానశివాఘోరశివాదులు రచించిన దీక్షాప్రతిష్ఠాది నిబంధనముల ననుసరించియే నేఁ డాంధ్రదేశ శివాలయములలో నుత్సవాదులు నడిపింపబడుచున్నవని నేఁ దలఁచున్నాఁడను. శైవాగమసమ్మత మయిన వైదికప్రక్రియచేతనే యారాధ్యు లాయుత్సవాదుల నేఁడును నడుపుచున్నారు. ఆంధ్రారాధ్యసంప్రదాయము పూర్వకాలమున నీ శివాచార్యపరంపరవారి సంప్రదాయముగానే యుండెనని నేను దలఁచుచున్నాఁడను. పెక్కువిధములఁ జూడఁగా నాంధ్రారాధ్యసంప్రదాయ మిట్టిదిగాఁ గానవచ్చుచున్నను, లింగధారణము, కరపీఠార్చనము. షట్‌స్థల వివేకము మొదలగునవి వీరశైవసంప్రదాయోద్భూతములు గొన్నిగూడఁ గలసియుండుటచే వీరును వీరశైవులేమో యనియు సంశయము గల్గును. వీరశైవులకు ముఖ్యమయిన వైదికకర్మత్యాగము, కులాశ్రమాచారత్యాగము, అన్యదేవతారాధనత్యాగము మొదలగు వీరవ్రతములు వీరికి లేకుండుట యట్టి సంశయమునకుఁ బ్రబలబాధకముగాను నున్నది. ప్రాచ్యలిఖితపుస్తకశాలలో 11-5-16 అని సంఖ్యగల ప్రాచీనతాళపత్రగ్రంథమున గోదావరీతీరమున నొకస్వాములవారు ప్రాచీనగ్రంథములను శైవసంప్రదాయములను జక్కఁగాఁ బరిశోధించి, యక్కడి బ్రాహ్మణులకు వ్రాసిన పత్రిక యొకటి గలదు. అది యిప్పటి కిన్నూఱేండ్ల క్రిందట వ్రాయఁబడినదై యుండును. ఆనాఁటికి రెండువందల యేండ్లకుఁ బూర్వము ఆంధ్రదేశమువారు 66 కుటుంబములవారు బ్రాహ్మణులు శ్రీశైలమున కేఁగి యక్కడ లింగధారణదీక్ష గొనిరనియు, కొంద ఱక్కడనే వీరశైవులై యుండిరనియుఁ, గొందఱు వైదికధర్మముతో లింగధారణమును గూడఁ నాంధ్రదేశమందుఁ బాటించుచుండి రనియు నందుఁగలదు. ఇది వాస్తవమేమో పరిశోధింపవలసియున్నది. ప్రాచీనాంధ్రారాధ్యసంప్రదాయగ్రంథములలో లింగధారణాదివిషయములు గానరాకుండుట చేతను, నాంధ్రారాధ్యులలో నిప్పటికిఁ గొన్ని కుటుంబములవారు లింగధారణము లేకయే యుండుటచేతను మీఁదివిషయము విశ్వాస్యమే యగునని నేఁ దలంచుచున్నాఁడను.

క్రీ.శ.1350 నుండి 1450 దాఁక సుప్రఖ్యాతులుగానున్న కొండవీటిరెడ్లు, తన్మంత్రులు శైవమతాభినివిష్టులుగా నుండిరి. వారికిని వారి మంత్రి యగు మామిడి ప్రెగ్గడయ్యకును శంకరారాధ్యులను వారు గురువులుగా నుండిరి. ఆ శంకరారాధ్యులకే పెదకోమటి వేమారెడ్డి పినపాడను గ్రామము నగ్రహారముగా నొసఁగెను. దానికి శాసనము గలదు. తెనాలిదగ్గఱఁ బినపాటిలో నేఁడా శంకరారాధ్యులవారి వంశమువారు మృత్యుంజయారాధ్యులు గలరు. వీరిది యుద్భటారాధ్య వంశమట! కాని, వీరికి లింగధారణము లేదు. బహుకాలమున నుండి సుప్రఖ్యాతమయియున్న యీ వంశమువారు లింగధారులు గాకుండుట వింతగాదా! మఱియు నాంధ్రదేశపుటారాధ్యుల కుటుంబములలో మిక్కిలి గౌరవము గడించినవారు లింగధారణము లేని వారింకను గొందఱు గలరు. గోదావరీ మండలమున నయ్యగారివారని యారాధ్యులు గలరు. [26]వారికిని లింగధారణములేదు. ఉద్బటుఁడు భోజునకు దీక్షాగురువని పండితారాధ్యచరిత్రమునను, నుద్భటచరిత్రమునను గలదు. భోజుఁడు రచించిన శైవతంత్రము తత్త్వప్రకాశము నేఁడు సుముద్రితమై యున్నది. అందు నేఁటి యారాధ్యసంప్రదాయవిషయము లేవియుఁ గానరావు. గోళకీమఠసంప్రదాయమువారు తమ గ్రంథములందు భోజుని గ్రంథములను బ్రమాణముగాఁ గొనియున్నారు. ఉద్బటుఁ డీభోజునకు గురువే యగునేని యాతఁడు నేఁటి యారాధ్యసంప్రదాయమువాఁడు గానేరఁడు. ఆ యుద్భటుని వంశమువారగు నాంధ్రారాధ్యులుగూడ భోజగ్రంథ, గోళకీమఠాచార్యకృత గ్రంథోపదిష్టమగు వైదిక శైవసంప్రదాయమువారే యగుదురు. బసవేశ్వరుని కాలమునుండి యాంధ్రదేశారాధ్యులు వీరశైవులై లింగధారులై యుందురేని కర్ణాటదేశమునఁ బోలె వీరికిని మఠములు, గురుపరంపరలును నుండెడివి. ఆంధ్రదేశమున గోళకీమఠ సంప్రదాయము వారి మఠములే యుండెడివిగాని, నేఁటి యాంధ్రారాధ్య సంప్రదాయము వారి మఠము లెన్నఁడు నున్నట్టు దెలియరావు. పండితత్రయోద్భటారాధ్య వేమనారాధ్యాది వంశపరంపరలవా రాభిజాత్యముగలవా రారాధ్యవంశములవారు పలువురు వెలయుచున్నను, లింగధారణాది దీక్షలు గొనుటలో గురువంశములు, శిష్యవంశములు నను భేదము లేక వీరిలో నెల్లరును సమానసమ్మానమునే పడయుచున్నారు. బహుకాలమున నుండియు నిట్టి సంప్రదాయమే సాగుచున్నచో నిప్పుడు లేకున్నను బూర్వకాలమున నేని యట్టి మఠము లుండకపోవునా యని సంశయము.

దహనసంస్కారము నేఁ డాంధ్రారాధ్యసంప్రదాయమున లేదు. కాని తావన్మాత్రమున వీరు వీరశైవులనఁగాదు. ఇటీవల వీరు లింగధారణముతో పాటు ఖననసంస్కారమునుగూడ పరిగ్రహించియుండవచ్చును. గోళకీమఠ సంప్రదాయమువారు కూడ నుత్తములైన శివదీక్షితులకు నాశౌచముగాని, శ్రాద్ధాదికము గాని యక్కఱలేదనిరి. 'నిర్వాణ దీక్షితానాంతు సూతకం నైవవిద్యతే' - 'దీక్షితానాం చ శైవానాం శ్రాద్ధం స్యాచ్చైవమేవ హి, న వైదికం కృతం శైవం శివలోకం స గచ్ఛతి' - ఆశౌచదీపిక, అఘోరశివాచార్యుఁడు.

ఆంధ్రారాధ్య సంప్రదాయము వారి దీక్ష పేరు చిన్మయదీక్ష. వీరశైవులదీక్ష పే రుత్తరదీక్ష. రెండు సంప్రదాయములు వేఱనుట కిదియు నొక తార్కాణ. కృష్ణదేవరాయలకుఁ బూర్వకాలమున నాంధ్రదేశమున నారాధ్య బ్రాహ్మణులు లింగధారులయి యుండిరనుటకుఁ బ్రబలాధారములు గలవేమో యింకను బరిశోధింపవలసి యున్నది.

వీరశైవము బసవేశ్వరాద్యుపజ్ఞమే

లింగధారణమును జెప్పుశ్లోకములు గొన్ని యాగమములలోనివిగాను, బురాణములలోనివిగాను నిటీవలి వీరశైవగ్రంథములందుఁ గలవు. ఆ శ్లోకములే కాక, కొన్ని యాయాగమములుగూడ వీరశైవమతము వెలసిన కాలమునను, నటు తర్వాతికాలమునను నేర్పడినవని నేను దలఁచుచున్నాఁడను. వీరశైవసిద్దాంతమును దెలుపు నాగమము వీరాగమమని యొకటి గలదు. అది యిట్టిదే. ఏలనఁగా నందుఁ బెక్కుచోట్ల నాల్గుశైవమఠములు పేర్కొనఁబడినవి. నల్గురు శైవాచార్యులు పేర్కొనఁబడిరి.

శ్లో. రేవణో మరుసిద్ధేశో రామదేవో మునీశ్వరః,
    పండితారాధ్య ఇత్యేతే చతుర్మఠమునీశ్వరాః.

ఇందు నాల్గవవాఁడగు పండితారాధ్యుఁడు శివలెంక మంచెన పండితుఁ డయినను, శ్రీపతిపండితుఁడయినను, మల్లికార్జున పండితుఁడయినను బసవేశ్వరుని కించుమించుగా సమకాలమువాఁడే యగును. తక్కినవారు గూడ బసవేశ్వరుని నాఁటివారే. ఈ యాగమమున వీరశైవసంప్రదాయము లెల్ల వివరింపఁబడినవి. ఇది పురాతనగ్రంథ మనుట నే నంగీకరింపఁజాల నయ్యెదను. మఱియు రేణుక(రేవణ)సిద్ధరచితము సిద్ధాంతశిఖామణియు, మాయిదేవరచితము శివానుభవసూత్ర(విశేషార్థప్రకాశన)మును, పద్మరసు దీక్షాబోధయుఁ , నీలకంఠాచార్యుని క్రియాసారమును గలవు. వీరశైవసిద్ధాంతమును నిరూపించు గ్రంథములలో మూలభూతము లివి. ఈ గ్రంథముల రచించినవారు బసవేశ్వరుని కాలమువారును దర్వాతికాలము వారును నగుట విస్పష్టవిషయము. బసవపురాణమును బట్టి, అబ్లూరు శాసనమునుబట్టి యీ మతము క్రీ.శ.1150 ప్రాంతమున నేర్పడినది గానే తెలియనగుచున్నది. ప్రాచీనాగమగ్రంథములం దక్కడక్కడ వీరశైవసిద్ధాం తానుకూలములగు శ్లోకములు గొన్నియున్నను, వానినెల్ల నుద్దరించి కులాచారనియమములను ద్రెంచి వీరశైవమని క్రొత్తసిద్ధాంతము నెలకొల్పినవారు మాత్రము బసవేశ్వరాదులే యనుటకు సంశయింపఁబనిలేదు. ఈ యర్థమునకు సాధకములయిన విషయములు పెక్కులు బసవపురాణమునఁగూడఁ గలవు.

వీరశైవము

వీరశైవులు "శివలింగం కరాద్యంగే వీరశైవస్తు ధారయేత్” అను విధి చొప్పున లింగధారణము చేయుదురు. ధరించిన యాలింగమునకుఁ బ్రాణలింగమనియు, నిష్టలింగమనియుఁ బేరు. అది లోపించెనేని గండగత్తెఱ వేసికొని చనిపోవలసినదే కాని వారు జీవించియుండరాదు.

ప్రాణలింగవ్రతే లుప్తే ప్రాయశ్చిత్తం న విద్యతే,
ప్రాణత్యాగాత్పరం తస్మా త్సావధానేన ధారయేత్.
ప్రాణలింగే చ విచ్ఛిన్నే లింగే ప్రాణాన్ పరిత్యజేత్,
ప్రతిదీక్షాం ప్రాప్య తిష్ఠేద్రౌరవం నరకం వ్రజేత్.

సిద్ధాంతశిఖామణిలోఁ బ్రాణలింగ మనఁగా నంతర్లింగ మనియు, నిష్టలింగ మనఁగా బాహ్యలింగ మనియు, కరపీఠార్చన ముత్తమమనియుఁ గలదు. 'ఇష్టలింగ మిదం స్థూలం యద్భాహ్యేధార్యతేసదా, ప్రాణలింగంతు తత్ సూక్ష్మం యదంతర్భావనామయమ్. బాహ్యపీఠార్చనా దేత త్కర పీఠార్చనం వరమ్'.

వీరశైవ మద్వైతసిద్ధాంతము ననుసరించును.
శివేన సహ సంబంధా చ్ఛైవమిత్యాదృతం బుధైః,
ఉభయోస్సంపుటీభావా ద్వీరశైవ మితి స్మృతమ్.
వీ శబ్దే నోచ్యతే విద్యా శివజీవైక్య బోధికా,
తస్యాం రమంతే యే శైవా వీరశైవాస్తు తే స్మృతాః
స్వయం లింగాంగసంబంధీ శివ ఏవ న చాపరః.

ఇట్లు చెప్పియు సిద్ధాంతశిఖామణికారుఁ డద్వైతమతమును గర్హించెను. అద్వైతమునఁ జేరినచో బాహ్యలింగార్చనము మానివేయుటగును గాన యా మతము పనికిరాదనెను. సర్వాద్వైతమని, యీశ్వరాద్వైతమని భేదముఁ జెప్పి యీశ్వరాద్వైతమే తగును కాని, సర్వాద్వైతము తగదనెను. మల్లికార్జున పండితారాధ్యుఁడుగూడ నీ యద్వైతభేదముఁ జెప్పెను.

వీరశైవులు జాతిభేదము పాటింపరాదు.

శ్లో. ఏకపీఠం జగత్సర్వ మేక మాకాశమాలయమ్,
    ఏకతోయం సదా పీత్వా జాతిభేదం న కారయేత్.
    అమరంగ నటుగాక యఖిలమర్త్యులకు
    సమము ధాతువులును సమము పిండములు
    సమము సూతకములు సమము జన్మములు
    సమము నిద్రాహారసంగకృత్యములు
    సమము మోహభయాభిషంగలోభములు
    సమ మింద్రియవిషయసముదాయములును
    సమము లీభూతపంచకములు నవయ
    వములును సుఖదుఃఖవాసనల్ సమము
    లదిగాక ధర యేక మఖిలజీవులకు
    తుద నాకసంబు పొత్తు సమస్తమునకు
    తోయ మొక్కటి జగత్తునకుఁ బ్రాపింప
    నైయుండుఁ గులభేదమైన లాగెట్లు.
          * * * * *
    సద్రతి బ్రాహ్మణక్షత్రియవైశ్య
    శూద్రకులీను లంచును బల్కె దీవు
    ఎక్కడ వారికి నేతెంచెఁ గులము
    టక్కరు లాడుమాటలుగాక యనిన.

- దీక్షాబోధము.

ఇట్లు వీరు జాతిభేదమును గర్హించి యా కాలమున ననేకుల లింగధారులఁగాఁ జేసి వారినెల్లర నొక్కపొత్తునకుఁ దెచ్చి తమమతమున కభ్యుచ్ఛ్రేయమును గూర్చుకొనఁగల్గిరి. కాలక్రమమునఁగూడ నాపూన్కి యట్లే సాగుచుండఁ గల్గెనేని యాంధ్రకర్ణాటదేశములందు జాతిభేదము సమసిపోయికూడ నుండవచ్చును. కాని, దానిఁ బ్రబలముగాఁ బ్రతిఘటించిన యద్వైతాదిమతముల యధికవ్యాప్తిచే, నానాజాతులనుండి క్రొత్తక్రొత్తవారు నాఁటనాఁట వీరశైవు లగుచుండుటగాని, తన్మూలమున జాతిభేదములు సమయుటగాని సందర్భింప దయ్యెను. తర్వాతి కాలమున నక్కడక్కడఁ గొందఱు కొందఱు కొలఁది కొలఁదిగా మాత్రమే వీరశైవదీక్ష గొని యాసంఘమునఁ జేరిరి. దానిచే బసవేశ్వరాదుల కాలమున వేర్పడి యేర్పడిన శైవదీక్షితుల వంశపరంపరలును దర్వాతివారు కొలఁదిమందియు మాత్రమే కూడి నేఁడు లింగాయతులను పేరఁ బ్రత్యేకసంఘమై వెలయుచున్నారు.

ఇటీవలికాలమున నా మతమునఁ గ్రొత్తగాఁ జేరినవా రంతగా లేకపోవుటచే జాతిభేదమును బాటింపరాదను సిద్ధాంతమును స్థాపింపఁబూనిన యా సంఘమే సంకుచితమై తాను నొకజాతియై తనకు ముందున్న జాతులకంటె నింక నొక్కజాతిని హెచ్చింపఁగల్గెనే కాని, జాతిభేదమును సమయింపఁజాలదయ్యెను.

వీరశైవమతస్వరూపము, వీరాగమము, వీరశైవాచారసంగ్రహము మొదలగు గ్రంథములందుఁ గానవచ్చును. బసవేశ్వరుని సమకాలము వాఁడగు కెరెయ పద్మరసు రచియించిన వీరశైవదీక్షాబోధలోఁ బ్రధానవిషయము లెల్ల జక్కఁగా స్పష్టపఱుపఁబడి యున్నవి. పిడుపర్తి సోమనాథుని తెలుఁగు దీక్షాబోధను జదివి వీరశైవమతస్వరూపమును జక్కఁగాఁ దెలిసికొనవచ్చును.

శివకవులు

వీరశైవులలోఁ గవీశ్వరులగువారు శివునిమీఁదను దద్భక్తులమీఁదను దక్క నితరులగు భవులమీఁద నెప్పుడును గృతులఁ జెప్పెడివారుగాదు. కావున, వారికి శివకవులని పేరు గల్గెను. కర్ణాటాంధ్రగ్రంథములలో శివకవుల ప్రశంస పెక్కుచోట్లఁ గలదు. శివకవులు భవికవుల గర్హించిరి. కవితలోఁగూడ వారు వేఱుమతము వారయిరి.

ఐనను లోకహితార్ధంబు గాఁగ
నానేర్చు కొలఁది వర్ణనసేయువాఁడ

నవరసరసికత భువిని బేర్కొన్న
శివకవి ప్రవరుల చిత్తంబు లలర
నిప్పాట నితరులఁ జెప్పెడి దేమి
తప్పులు దారులుఁ దడఁబడఁబలికి
వెలసిన చదువులు వీటిఁబో రిత్త
పొలిసిపోయిరి దమపురులు దూలఁగను
మృడుమహత్త్వము గానమిని బొంకులనఁగఁ
బడుఁ 'గవయః కిం న పశ్యన్తి' యనుట
యనుచుఁ గుకవులఁగీటునఁబుచ్చి పేర్చి,

-బసవపురాణము.

సోమనాథుఁడు బసవపండితారాధ్యచరిత్రములందును, అనుభవసారమందును, శివకవులను స్తుతించెనే కాని, యాంధ్రకవితాగురుఁ డనఁబడిన నన్నయ మొదలగు నితరకవులను వేరిని స్తుతింపలేదు.

శివకవుల గ్రంథములు

మల్లికార్జున పండితారాధ్యుని శివతత్త్వసారమును, నన్నిచోడని కుమారసంభవమును, మన సోమనాథుని కృతులును, నిప్పుడు మన కుపలబ్దము లయిన శివకవుల గ్రంథములలోఁ బ్రాచీనములు. మల్లికార్జున పండితుని కృతులు మఱికొన్ని దొరకవలసియున్నవి. మల్లికార్జునపండితుని కంటెఁ బూర్వుఁడు శ్రీపతిపండితుఁడు గూడఁ గవియట! ఆయన బెజవాడలో నుండినవాఁడు. ఆయన తెలుఁగుకృతు లేమేని రచియించెనేమో యెఱుఁగరాదు. పండితారాధ్యచరిత్రలో నీ క్రిందిగ్రంథములు పేర్కొనఁబడినవి.

అంచితబాణగద్యాక్షరగద్య
పంచగద్యాదులు వటుగణాడంబ
రంబు వర్ణాడంబరంబు వ్యాసాష్ట
కంబును శ్రీనీలకంఠస్తవంబు

శ్రీరుద్రకవచంబు శారభంబును మ
యూరస్తవము హలాయుధమనామయము
మలహణమును మహిమంబనుస్తవము
మలయరాజీయంబు మౌనిదండకము
స్తుతిమూలమగు మహాస్తోత్రసూత్రములు
శతకంబు శివతత్త్వసారంబు దీప
కళిక మహానాటకము నుదాహరణ
ములు రుద్రమహిమయు ముక్తకావళులు
గీతసూక్తములు భృంగిస్తవంబులు పు
రాతనమునిముఖ్యరచితాష్టకములు
హరలీల-
   * * * * *
ఆనందగీతంబు లర్థిఁ బాడుచు శి
వానందలీలల నలరి యాడుచును
శంకరగీతముల్ సరవిఁ బాడుచును
శంకరలీలల జతుల కాడుచును
బరమశివానందభరితమై మఱియు
హరగణాగ్రణులున్న యవసరంబునను
   * * * * *
మదినుబ్బి సంసారమాయాస్తవంబు
పదములు దుమ్మెదపదముల్ ప్రభాత
పదములు పర్వతపదము లానంద
పదములు శంకరపదముల్ నివాళి
పదములు వాలేశుపదములు గొబ్బి
పదములు వెన్నెలపదములు సెజ్జ

వర్ణన మఱి గణవర్ణనపదము
లర్ణవఘోషణ ఘూర్ణిల్లుచుండఁ
బాడుచు నాడుచుఁ బరమహర్షమున
...............................................................

-పండితారాధ్య చరిత్రము.

పయివానిలోఁ బెక్కులు సంస్కృతగ్రంథములు. శివతత్త్వసారము తెల్గుకృతి. శతకము, దీపకళిక మొదలగునవికూడఁ దెల్గుకృతులు గావచ్చును. ఆనందగీతములు, శంకరగీతములు, తుమ్మెదపదములు, ప్రభాతపదములు మొదలగు గేయరచనలుగూడ తెల్గువే. కాని యవి మన కిప్పుడు దుర్లభములుగా నున్నవి. దీనినిబట్టి చూడఁగా నీ శివకవుల తెలుఁగు కృతులు, పద్యరచనము గలవి, మల్లికార్జున పండితారాధ్యుని కాలమునకంటెఁ బూర్వము లేవేమో యని సంశయము కలుగుచున్నది. ఉన్నచో సోమనాథుఁడు పేర్కొనియుండును గదా! శివకవుల రచనారీతులను బరిశోధింపఁగా వీరి గ్రంథములకును, నన్నియాదు లగు (భవి)కవుల గ్రంథములకును బెక్కుభేదములు గానవచ్చుచున్నవి. అవి ముందు వివరింతును:

జానుఁదెనుఁగు

శివకవులు పలువురు జానుఁదెనుఁగును బ్రశంసించిరి :

చ. సరళముగాఁగ భావములు జానుఁదెనుంగున నింపుపెంపుతోఁ
    బిరిగొన వర్ణనల్ ఫణితి వేర్కొన నర్థము లొత్తగిల్ల బం
    ధురముగఁ బ్రాణముల్ మధుమృదుత్వరసంబునఁ గందళింప న
    క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయనలీలఁ గ్రాలఁగాన్.

- నన్నిచోడుఁడు.



ఉరుతరగద్యపద్యోక్తులకంటె
సరసమై పరగిన జానుఁదెనుంగు

చర్చింపఁగా సర్వసామాన్యమగుటఁ
గూర్చెద ద్విపదలు గోర్కిదైవాఱఁ

- బసవపురాణము.


..................................................
ఒప్పదు ద్విపద కావ్యోక్తి నావలదు
ఆరూఢ గద్యపద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్టరచన
మానుగా సర్వసామాన్యంబు గామి
జానుఁదెనుఁగు విశేషము ప్రసన్నతకు

- పండితారాధ్యచరిత్రము.

సోమనాథుఁడే జానుఁదెనుఁగనఁగా నిట్టిదని వృషాధిపశతకమున జెప్పినాఁడు:

చ. బలుపొడతోలుసీరయును బాఁపసరుల్ గిలుపారుకన్ను వె
     న్నెల తల సేఁదుఁగుత్తుకయు నిండిన వేలుపుటేఱు వల్గు పూ
     సలు గలఱేని లెంక వని జానుఁదెనుంగున, విన్నవించెదన్
     వలపు మదిన్ దలిర్ప బసవా బసవా బసవా వృషాధిపా!

ఆ కాలమున నీ జానుఁదెనుఁగు మిక్కిలి ప్రసన్నమై సర్వసామాన్యమై యుండెను. తర్వాతి మన కవీశ్వరులు సంస్కృతప్రాయమైన రచనను దెలుగునఁ జొప్పించి జానుఁదెనుగును సన్నగిలఁ జేసిరి. ఇటీవలి తెలుఁగురచనలలో నెక్కువ రుచ్యములయిన నానుళ్లును బలుకుబళ్లును మిక్కిలి తక్కువ కాఁజొచ్చెను. సోమనాథుని గ్రంథములోను, నన్నిచోడని గ్రంథము లోను మన కిపు డర్ధము గాని జానుఁదెనుగుఁబలుకు లనేకము లున్నవి. సంస్కృతప్రాయముగ రచనలకు మన మలవడుటయు, దేశితెలుఁగురచనలఁ ద్రోసిపుచ్చుటయు నిట్టగుటకుఁ గారణములు. ఈ విషయము నించుక వివరింతును.

దేశిరచన

తెలుఁగునకుఁ దోడిభాషయగు ద్రవిడభాషలో దేశిరచన లెక్కువగా నెక్కొన్నవి. ద్రవిడదేశీయులగు జైనులయు, శైవులయు, వైష్ణవులయు దేశిచరిత్రములు ద్రవిడభాషాసహజములగు దేశవృత్తములలో సంస్కృతసంపర్క మంతగా లేని ద్రవిడదేశిభాషలో రచితములై వెలసియున్నవి. కర్ణాటకమున నంతగా నట్టిరచనములు లేవుగాని తెలుఁగున కంటెఁ గొంత హెచ్చుగా నున్న వనవచ్చును. ఆదికాలమునఁ దెలుఁగుగ్రంథములు ప్రాయికముగా సంస్కృతభాషలో నున్న పురాణాద్యార్యగ్రంథముల కనువాదములుగానే వెలయుటచే నాంధ్రసహజములయిన దేశిరచనముల కాదరువు సన్నగిల్లెను. మన పూర్వులు పౌరాణికములయిన యార్యకథలమీఁదను, సంసృతచ్ఛందస్సుమీఁదను సంస్కృతప్రాయమయిన తత్సమభాషమీఁదను నభిమానము గలవారయి దేశీయేతివృత్తములను, దేశీయచ్చందస్సులను, దేశభాషను జిదుకఁద్రొక్కిరి. నేఁడు మనము స్త్రీపామరాదుల గేయరచనములని యనాదరమునఁ జూచు పదరచనము వరుసలే ద్రవిడభాషలోని ప్రౌఢకావ్యములందలి వృత్తములుగా నెలకొన్నవి. తరువోజ, ద్విపద, రగడ, అక్కర, గీతి, సీసము మొదలగు పరిమితజాతులే దేశిచ్ఛందోజనితములు మన గ్రంథములం దాదృతములయ్యెను. ఈ దోషముచే మన తెలుఁగుప్రబంధములం దాంధ్రతాముద్ర యంతగాఁ గానరాకున్నది. కొంతవఱ కాంధ్రతాముద్ర నచ్చొత్తి ప్రబంధముల రచించినవారిలో నగ్రగణ్యుఁ డీ సోమనాథ కవియే. ఈతఁడు దేశీయకథలను దేశిచ్ఛందోజనితమగు ద్విపదమున దేసితెనుఁగుబాసలో రచించినవాఁ డగుటచే నీతని కవితలో నాంధ్రతాముద్ర సక్కఁగా నత్తికొనెను. ఈతఁడు తన కవితారచనము నిట్లు ప్రశంసించుకొన్నాఁడు.

...............................................
సత్కృతియన నూత్నసంగతి దనరఁ
దొమ్మిదిరసములు దొలఁకాడ వాని
యిమ్మడి వర్ణన లెసఁగఁ దద్‌ద్విగుణ

మగు నలంకారంబు లసలార వాని
ద్విగుణార్థభావనల్ దీటుకొనంగఁ
దేటతెనుంగున ద్విపద రచింతుఁ
బాటిగాఁ దత్కథాప్రౌఢి యెట్లనిన
జాతులు మాత్రానుసంధానగణవి
నీతులు గాన 'యనియతగణై 'ర
నియును 'బ్రాసో వా' యనియు 'యతీర్వా' య
నియుఁ జెప్పు ఛందోవినిహితోక్తిగాన
ప్రాసమైనను యతిపై వడియైన
దేసిగా నిలిపి యాదిప్రాసనియతి
దప్పకుండఁగ ద్విపదలు రచియింతు
నొప్పదు ద్విపదకావ్యోక్తి నావలదు.
ఆరూఢ గద్యపద్యాది ప్రబంధ
పూరిత సంస్కృతభూయిష్ఠరచన
మానుగా సర్వసామాన్యంబు గామిఁ
జానుఁదెనుఁగు విశేషము ప్రసన్నతకు
అట్టునుగాక కావ్యము ప్రౌఢిపేర్మి
నెట్టన రచియింప నేర్చినఁజాలు
నుపమింప గద్యపద్యోదాత్తకృతులు
ద్విపదలు సమమ భావింప నెట్లనిన.
సరళతసరణి ప్రసన్నత చెన్ను
పరిణతగణపదపద్ధతి శబ్ద
శుద్ధి ప్రయోగప్రసిద్ధి గళాస
మృద్ధి నానుడి వడిమితి యతి యర్థ
పుష్టి నైజము రసపుష్టి వినూత్న

సృష్టి విశేష్య విశేషణశ్లేష
సొంపు గుమారత పెంపు మాధుర్య
మింపు మృదుత్వంబు గుంపోజు సదువు
యమకంబు గమకంబు యతిగతి గార
కము పూరకము గ్రియ గాంతి విశ్రాంతి
రంగుబెడంగు మెఱుంగు సమాన
సంగతి యక్షరశయ్య సంఘటన
నిపుణత రసికత నెఱి సమాసార్థ
ముపమానమవధానముత్ప్రేక్ష లక్ష్య
లక్షణవ్యక్తి యలంకార యుక్తి
దక్షత సుమతి విచక్షత యనిన
జాతుల రచనాప్రణీతులఁ గావ్య
నీతుల రీతుల నేతు లుట్టంగ
వరకవుల్ గొనియాడ వర్ణన కెక్క
ధరఁజెప్పు కృతియ యుద్యత్కృతిగాక
జల్లి పూరక మపశబ్ద మక్రమము
వొల్లు వ్యుత్క్రియ జడ్డు వొందసంఘటన
కాకు వ్యర్థంబసంగతి విరసంబు
వైకల్యమత్యుక్తి వైరిపదంబు
తలవిరుపసమగ్రత శిథిలబంధ
ములుదబధంబు గ్రామ్యోక్తి గంటకము
ద్రాభ ఛందోవిరుద్దంబాదియగు న
లాభప్రలాపోక్తి లాఘవంబనక
వసిగూర్చు కృతులు నా వడ్లును బెరుగు
బిసుకుచందము బిలిబిలికృతుల్ గృతులె
అటుగాన యభివినుతానందితోక్తి

పటుగద్యపద్య ప్రబంధసామ్యముగ
కావ్యకళాప్రౌఢిఁ గల్పింతు ద్విపద
కావ్యంబు భావ్యంబు గాఁగ నట్లయ్యు
నవికలవేదవేదాంతేతిహాస
వివిధాగమపురాణవిహితసూక్తముల
నిదమిత్థమనుచోట నివియె ప్రామాణ్య
పదములు గాఁగ ద్విపదలు సంధింతు
సొట్టైనరత్నంబు చుట్టును బసిఁడి
గట్టిన భావన నెట్టణఁదెనుఁగు
సంధిపూర్వాపరసంఘటనముల
బంధురచ్ఛందోనిబద్ధముల్ గాఁగ
వేదసూక్తములకు వెరవైనమాట
లాదటఁగన్పింతునది జల్లి యనక
వలనెఱింగియు వేదవాక్యంబు ద్విపద
కొలఁదినే పలుకుటకును మది మెచ్చి
కేలిముద్రిక రత్నకీలనసేయు
చో లేశమైనవచ్చునె రత్నమొత్త
సొట్టైనరత్నంబు చుట్టునుబసిఁడి
గట్టుట యతివివేకంబిట్లయయ్యు
దేసిగా వచియింతు ద్విపదకు వళ్లుఁ
బ్రాసంబులునుఁ బొందుపడఁగఁదావలయు
ననుచుఁదదీయసూక్తాక్షరపంక్తి
జెనకక యింతొప్పఁ జెప్పునేయనుచు
సన్నుతిఁ జేయుచు సత్కవులలరఁ
దిన్ననిసూక్తుల ద్విపద రచింతు
నదియునుగా కైహికాముష్మికద్వి

పద హేతువవుట ద్విపదనాఁబరగు
ద్విపదాంబురుహముల ధృతి బసవేశు
ద్విపదాంబురుహము లతిప్రీతిఁ బూను

- పండితారాధ్య చరిత్రము.

తన గ్రంథములు సుగ్రహములుగా నుండవలెనని యీతఁడు తలంచెను. సంస్కృతభాషలో ననుష్టుప్పు సులువుగా రచింపఁదగినదై, యక్షరబాహుళ్యము లేమిచే సులువుగాఁ జదువఁదగినదై, యన్వయక్లేశము లేమిచే సులువుగా నర్ధము చేసికోఁదగినదై పురాణాదులందు లక్షలకొలఁది గ్రంథసంఖ్యతో వెలసియుండుట యెఱిఁగి దానివలెఁ దెలుఁగున వెలయఁదగినది ద్విపదయని గుర్తించి సోమనాథుఁడు తన ప్రధానగ్రంథములగు బసవపురాణ, పండితారాధ్యచరిత్రములను ద్విపదరచనములందే నెలకొల్పెను. ఆరూఢ గద్యపద్యాది ప్రబంధపూరిత సంస్కృతభూయిష్టరచన సర్వసామాన్యము గాదనియు, జానుఁదెనుఁగు మిక్కిలి ప్రసన్నముగా నుండుననియు, నది ద్విపదరచనమున మిక్కిలి పొసఁగి యుండు ననియుఁ బయి ద్విపదలందు సోమనాథుఁడు సూచించినాఁడు. మఱియు సులువయిన రచనము గలదని ద్విపదను దక్కువగాఁ జూడవలదనియు, సర్వసామాన్యమగుట ద్విపద కొకగుణవిశేష మనియు, గద్యపద్యోదాత్తకృతుల కది తీసిపోదనియు, గావ్యగౌరవమును బోషించునది, దోషరాహిత్యమును గుణసాహిత్యమునుగాని, ఛందఃప్రయాసాతిశయము గాదనియుఁజెప్పినాఁడు.

ద్విపదరచన సర్వసామాన్యమే

వర్తమాన నాగరకలోకము గొంత వర్ణించుచున్నను నాఁడు నేఁడు నాంధ్రలోకము నాలుకలపై నాట్యమాడుచున్న పాటలు, పదాలు మొదలగు దేశిరచనలలో నూటికిఁ దొంబదివంతు రచనములు ద్విపదలును, దద్వికారములునై యున్నవి. ఒక్క ద్విపదమే విషయభేదమునుబట్టి, స్థలభేదమునుబట్టి, పాఠకభేదమునుబట్టి పఠించు తీరులలో బహుభేదములను బొందుచున్నది. తోలుబొమ్మలవాండ్ర యాటలలోను, స్త్రీల పాటలలోను, పంబవాండ్రయు , బవనీండ్రయు, సుద్దులలోను, మఱియుఁ బెక్కువిధములగు పామర రచనములలోను బహుళముగా ద్విపదయు, మంజరియుఁ గానవచ్చును. కాని, వారివారి పాటతీరులు వేరు గానే యుండును. ప్రాచీనలేఖకు లిట్టిరచనములను దాటియాకులపై వ్రాయునప్పుడు వారు చదువు ఫణితిలో నేర్పడు దీర్ఘస్వరాదులతోనే వానిని వ్రాయుచుండెడివారు. మన బసవపురాణముగూడఁ గొన్ని ప్రతులలో నట్టితీరున వ్రాయబడియున్నది.

కైలాసమునఁ దొల్లి గఱకంఠుగొలూవ
శైలేంద్రకన్యక సనుదెంచు నెడాను.

ద్విపద రచనమున వెలయించుటచేఁ దన గ్రంథములు పండితులకే కాక పామరులకుఁగూడ నుపాదేయములు కాఁగలవని, యట్లు కావలయునని సోమనాథుఁ డభిమానించెను. అవి యట్లే వెలయఁగల్గెను.

ఛందస్స్వాతంత్ర్యము

ఈ యభిమానముచే సోమనాథుఁ డితరాంధ్రకవులు పాటించిన ద్విపద చ్చందోనిబంధమునఁ గొంత స్వాతంత్ర్యము వహించి మాఱుపాటు గావించెను. తాళ్లపాక చిన్నన్న ప్రాచీనసంప్రదాయానురోధమున ద్విపదలక్షణము నిట్లు నిర్వచించినాఁడు.

వాసవుల్ మువ్వురు వనజాప్తుఁ డొకఁడు
భాసిల్ల నది యొక్క పదము శ్రీకాంత
క్రమమున నవి నాల్గు గణముల నడచుఁ
గ్రమదూరముగఁ బ్రయోగము సేయరాదు
ఆ పాదమునకు మూఁడవగణం బాది
దీపించు యతి యంబుధిప్రియతనయ
యుపమింపనవి ప్రాసయుతములై రెండు
ద్విపదనా విలసిల్లె వికచాబ్జపాణి

ద్విపదకు ద్విపదకుఁదెగఁజెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితరభాషలను
యతుల లోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులుఁ జెల్లును ప్రయోగానుసారమున
ద్విపదతో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు ప్రయోగింప నది యయుక్తంబు
మఱియు సంస్కృతపు సమాసరూపమున
నెఱయ నెన్నిటినైన నిర్మింపఁదగును
..........................................................
అనులక్షణమ్ముల ననువొంది సుకవి
జన సుప్రయోగైక శరణమై......

- అష్టమహిషీకళ్యాణము.

రంగనాథరామాయణాదు లీలక్షణము ననువర్తించుచున్నవి. కాని, సోమనాథుని రచన మిట్లు లేదు. ద్విపదమున నితరకవులెవ్వరును బాటింపని ప్రాసయతి నీతఁడు చేర్చెను. రంగనాథరామాయణమునఁగాని, గౌరన హరిశ్చంద్రచరిత్రమునఁగాని, ప్రాసయతి యెక్కడను గానరాదు. ఈతఁడును నీతని కనుయాయులగు శివకవులు మఱికొందఱును మాత్రమే యీ ద్విపద ప్రాసయతిని జేర్చిరి. 'అనియతగణైః' 'ప్రాసోవా 'యతిర్వా' యని మూఁడు సంస్కృతసూత్రముల నుదాహరించి సోమనాథుఁడు మాత్రాగణఘటితములగు జాతులందుఁ బ్రాసయతి చెల్లునని నిర్ణయము చేసినాఁడు. ఈ నిర్ణయము సంగతమే యనఁ దగియున్నది. అయినను రంగనాథాదులు దీని నంగీకరింపమికి హేతువేమో: మఱియు ద్విపదయు ద్విపదయుఁ గలయునప్పు డొక్కపదమే యిటు గొంతయు నటు గొంతయునై యుండునట్లు రంగనాథాదులెక్కడను గూర్పరయిరి. 'ద్విపదతో ద్విపద సంధిల నేకశబ్ద-మపుడు ప్రయోగింప నది యయుక్తంబు' అని చిన్నన్న స్పష్టముగా నీ విషయమును నిరూపించినాఁడు. అయినను మన సోమనాథుఁ డీ నిర్ణయమును బాటింపలేదు.

జాతులు మాత్రానుసంధానగణవి
నీతులుగాన యనియతగణైర
నియును బ్రాసో వా యనియు యతిర్వా
...............................................................
అతిశయప్రీతి బ్రహ్మాండపురాణ
మతమహోమోహస్యమాహాత్మ్య మన మొ
దలఁద్రిపుండ్రం మోక్షదం త్యక్త మనవి
రళ మేతదన్యత్ర రమతే యనఁగ ను
చితసూక్తి యట్ల వాసిష్ఠలైంగంబు.

(పండితారాధ్యచరిత్రము)

ఇట్లు గూర్చుట పండితారాధ్యచరితమందే హెచ్చుగాఁ గానవచ్చును. బసవపురాణమున నేద్విపద కాద్విపద విడఁబడియే యున్నది.

ఇది యిట్లున్నను నీతఁడు, దర్వాతికవు లంతగాఁ బాటింపనిదియు, నన్నయరచనమందుఁ దిన్నఁగా నెన్నఁదగియున్నదియు నగు సీసరచనావైలక్షణ్యమును అనుభవసారమునను, జతుర్వేదసారమునను జక్కఁగాఁ బాటించినాఁడు. మఱియు క్రౌంచపదవృత్తమున, నన్నిచోడనికంటె నెక్కువ నియమమును బాటించినాఁడు.

చంచుల నాస్వాదించుచు లేఁదూం డ్లకరువుప్రియలకు నలఁదుచు మైరో..

- నన్నిచోడఁడు.

భక్తివినీతుల్ యుక్తిసమేతుల్ భవభయనిపతిత పశుగణపూతుల్...

- సోమనాథుఁడు

ఇందు నన్నిచోడని రచనమున చరణము రెండుదళములై మొదటిదళమునఁ బ్రాసయతియు, రెండవదళమున వేఱుగా యతియుఁ గల్గియున్నది. సోమనాథుని రచనమున నింత కెక్కువగా ద్వితీయదళమున యతి ప్రథమదళ ప్రథమాక్షరమునకనుగుణమైనదిగా నున్నది. అర్వాచీనకవులెల్లరు నీ విధానమునే యనుకరించిరి.

ప్రాసవిశేషములు

సోమనాథుని గ్రంథములలో నితర(భవి)కవికృతులం దంతగాఁ గానరానివి ప్రాసవిశేషములు గొన్ని గానవచ్చుచున్నవి. నన్నయాదుల కృతులలోఁ బ్రాసములందు హల్‌సామ్యము తప్పక కాననగును. అనఁగాఁ బ్రథమచరణ ద్వితీయాక్షరమున నెన్ని హల్లులు సంయుక్తములుగా నున్నవో యన్ని సంయుక్త హల్లులును దక్కిన మూఁడుచరణములందును గూడ ద్వితీయాక్షరమునఁ గూడి యుండును. మల్లికార్జునపండితుఁడు మొదలగు శివకవు లీ నియమము నంతగాఁ బాటింపరయిరి. కతిపయ హల్ సామ్య మున్నఁ జాలునని వీరు దలంచిరి.

క. నమ్మిన భక్తుఁడు గన్నడ
   బమ్మయ సద్భక్తి మహిమ పరికింపఁగ లో
   కమ్ములఁ జోద్యముగాదె య
   ధర్మంబును ధర్మమయ్యెఁ దత్త్వాతీతా!

ప్రాఁతవ్రాఁతలలో “ధమ్మన్” యని యుండును.

క. ఇవ్వసుమతిఁ గడుఁగమ్మని
   పువ్వులలోఁ బుట్టి నట్టి పువ్వులు గొఱయే
   సర్వజ్ఞభక్తి విరహితుఁ
   డెవ్వఁడు నుత్కృష్టజాతుఁ డేటికిఁగొఱయే.

-శివతత్వసారము.



   “మర్త్యలోకమునకు మఱి వేఱె యొకఁడ
    కర్తయున్నాఁడె లోకత్రయవరద!”

    “మధ్యాహ్నమగుటయు మారయ్య లింగ
    తద్ద్యానసుఖ నిరంతర వర్తియగుచు.”

“అక్షణంబునఁ బంచభక్ష్యముల్ గుడిపి.”

“కర్ణంబునావుడు బిజ్జలుఁ డంత
 లజ్జయు సిగ్గును బుజ్జగింపగ.”

“బుజ్జగించుచు వెడ్లుబుడ్లునుబెట్టు
 నిర్జీవిక్రియఁ బడు నివ్వెఱఁగందు.”

“తత్త్రిపురాంతకస్థానవాస్తవ్యుఁ
 డై త్రిపురాంతకుం డభినుతిఁ బేర్చు.”

-బసవపురాణము.

ప్రయోగరత్నాకరమున వేములవాడ భీమకవి నృసింహపురాణ మందలిదని యీ క్రిందిపద్య ముదాహృతము.

క. ఈ క్షితికి వచ్చి వేగము
    దాక్షారామమున వారతరుణుల నృత్తం
    బీక్షించి యంతకంటెను
    దత్ క్షణమున నేర్చి రంభ తగవేర్పడఁగన్.

రేఫాధిక్యమునుమాత్ర మితరాంధ్రకవులు గొందఱుగూడ నంగీకరించిరి. ఈ సంప్రదాయము మల్లికార్జునపండిత సోమనాథాదులచేఁ క్రొత్తగా నెలకొల్పఁబడినదిగాదు. కర్ణాటభాషలో నిట్టిప్రాసము గలదు. ఆ భాషలో దీనికి శాంతప్రాసమని పేరు.

క. బెరసిరె ముంసంయోగా
   క్షరంగళేక స్వరంగళిం సుప్రాసం
   నెరెదు విపర్యాసక్రమ
   దిరె సతతం శాంతపూర్వమక్కుం ప్రాసం

క. పత్తి ప్రమాదఫలకమ
   నత్యుగ్రగ్రాహనివహ సంక్షోభితదోళ్

   మత్తీరత్నాకరదోళ్
   పుత్త్రికెయెనెబిళ్దళింతు బాళ్దుదెచోద్యం

క. శాంతప్రాసదభేదము
   దిం తక్కుం ..........

- కవిరాజమార్గము.

వర్గాక్షరములు పరస్పరము ప్రాసములుగా నుండవచ్చుననియు వర్గప్రాసమని దానిపేరనియు, శషసలు, పరస్పరము ప్రాసముగా నుండవచ్చుననియు దానిపేరు సమీపప్రాసమనియుఁ గవిరాజమార్గమునఁ గలదు. శివకవులీ ప్రాసములఁ గూడఁ బ్రయోగించిరి. అర్వాచీనాంధ్రలాక్షణికులు ప్రాచీనకవుల ప్రయోగములఁ బెక్కింటిని సాధనాంతరములచే సమర్థించి పయిప్రాసముల క్రిందఁ బరిగణింపఁ బనిలేకుండఁ జేసికొనిరిగాని, కొన్నిపట్టుల నెట్టును సమర్థింపఁజాలక పోయిరి. శసప్రాసము, థ ధ ప్రాసము, డఢ ప్రాసము పెక్కు తెనుఁగుకృతులలోఁ గానవచ్చును. మన సోమనాథుఁడును బ్రయోగించెను. తెలుఁగునఁగూడ శాంతప్రాసములు, వర్గప్రాసములు సమీపప్రాసములు గలవు. ప్రాచీనలాక్షణికులు వానిని బరిగణించిరి. శివకవులు ప్రాచీనసంప్రదాయమును జక్కఁగాఁ బాటించిరి గాని, యితరకవులు నిర్బంధముల హెచ్చించుకొనిరి.

మఱియు, నన్నిచోడఁడు, సోమనాథుఁడును, బూర్ణబిందువునకు నర్ధబిందువునకుఁ బ్రాసముఁ గూర్చిరి.

క. పోఁడిగ నగజత పశ్శిఖి
   మూఁడుజగమ్ములను దీవ్రముగఁ బర్విన బ్ర
   హ్మాండముఁగాఁచిన కాంచన
   భాండముక్రియఁదాల్చెఁ దత్ప్రభాభాసితమై.

- కుమారసంభవము.

పాండురాంగంబైన పడఁతిగర్భమునఁ
బోఁడిగా వెలుఁగుచుఁ బుత్త్రుఁడీ క్రియను.

- బసవపురాణము.

వర్గప్రాసమును, సమీపప్రాసమును నంగీకరించునప్పుడు పూర్ణార్ద బిందుప్రాసమునుగూడ నంగీకరించుట సంగతమే యగును. అయినను నన్నయాదులగు కవులీ ప్రాసము నంగీకరింపరయిరి. వారి గ్రంథములలో గానరాదు. ఇప్పు డర్ధబిందువులుగా నెఱుఁగఁబడుచున్న పదములు పోఁడి, మూఁడు మొదలగునవి యానాఁడు పూర్ణబిందువులుగనే యెన్నఁబడుచుండ వచ్చుననియు, నిది పూర్ణబిందుప్రాసమే కావచ్చుననియుఁ గొందఱందురు. అది యట్లుగాదు. పోఁడి, మూఁడు పదములను మరల నీ కవులే యర్దబిందు ప్రాసమునఁగూడఁ గూర్చిరి గావునను, నాకాలపుఁ గవులెల్లరు నా పదముల నర్దబిందువిశిష్టములఁగనే ప్రయోగించిరిగావునను, నది పూర్ణార్ధబిందుప్రాస మనియే తలంపవలెను.

నాఁడు నావిందిగెనాఁ బురవీథిఁ
బోఁడిగా గుడ్డవ్వ వోవభూసురులు

- పుట. 223

ఇత్యాదులు పెక్కులు ప్రయోగములర్దబిందు విశిష్టతానిర్ణాయకములు గలవు. మఱియు నన్నయ భారతకృతిపతియగు రాజరాజనరేంద్రుని కూఁతురు సోమలదేవి (ఇంచుమించుగా నన్నయకాలమున) చెక్కించిన దాక్షారామ శిలాశాసనమునఁగూడ నొక పద్యమం దీ ప్రాసము గానవచ్చు చున్నది.

సకలవసుమతీశ మకుటలసద్రత్న
కిరణరుచివిరాజి చరణుఁడయిన
నిజభుజప్రధాని బెజయితదేవని
కూఁతుసరియె పోల్పఁ గాంతలెందు.

ఈ పద్యము నాల్గవ చరణమున 'కూఁతు' పదము 'కాంత' పదము ప్రాస యతిలోఁ జేర్పఁబడినవి. ఇందుఁ 'గూఁతు' పద మర్ధబిందు విశిష్టముగా నెన్నఁబడవలసినదే. అది పూర్ణబిందూచ్చారణముతో నుండవలసినదే యగునేని శాసనమున "కూంత్తు” అని చెక్కింపఁబడియుండును.

వేములవాడ భీమకవి నృసింహపురాణములోనిదిగా నీక్రింది పద్యము లక్షణ గ్రంథములందుఁ గలదు.

ఉ. వాఁడిమి నల్లసిద్ది జనవల్లభుఁడోర్చిన రాజుభీతితో
     నాండ్రను గావకుండ వృషభాంకము వెట్టికొనంగఁజూచితో
     నేఁడిది యేమి నీవనుచు నెచ్చెలులెల్ల హసింప నంతలో
     మూఁడవకంటితోడి దొరమూర్తి వహించిన మ్రొక్కిరంగనల్

ఇందు రెండవ చరణమున 'ఆఁడుర' అని కాని, 'ఆండుర' అని కాని, యుండునేమోయని నా సంశయము. ఆండ్రురు, నీళ్లులు ఇత్యాది విధముల బహువచనప్రత్యయములపై మరలఁ బహువచనప్రత్యయములు గల రూపములు భారతాదులలో నేఁడు గానవచ్చుచున్నవి. అవి యట్టివి కాకపోవచ్చునని 'ఆఁడురు, నీళులు' ఇత్యాది విధములనే యుండియుండవచ్చు నని నా తలఁపు. 'వెలయాండ్రురకలుపు' అనుచో 'వెలయాఁడురకలుపు' అని కాని, లేక 'వెలయాండురకలుపు' అనికాని, యుండవచ్చును.

కవిజనాశ్రయమునఁగూడ 'ప్రగీతి' లక్షణములో 'మూఁడుసేసి నగణములు, రెండు నలములు, మూఁడిన గణములును మొగినహంబు, పోఁడిగాఁ గనర్థమునకగు మీఁద ని,ట్లుండఁ జెప్పవలయు నొగిఁబ్రగీతి' అని కలదు. అదియు పూర్ణార్ధబిందుప్రాసమే.

మఱియు నీతఁడు పూర్ణార్ధబిందుప్రాసమును రేఫద్వయప్రాసమును గూడఁ గూర్చినాఁడు.

జగతిఁ బద్మపురాణసంహితలందె
సఁగె శంభురాఘవసంవాదమునను

- పండితా

బ్రాఁతిగా నాదివరాహదంష్ట్రంబు
ఖ్యాతమీశ్వరుచేతఁగాదె యున్నదియు -బసవ పు. 203

బూది దా రాఁజదు వొగయదు దాను
నూఁదండు ముట్టించె నొక్కదీపంబు -బసవ పు.15

షోడశపండువు సూడఁబోదండు
పోఁడిగా నీపాలు పురహర! కొనుము ! -బసవ పు. 71

ఊఁదు సార్ధానుస్వారముగా శబ్దరత్నాకరమునఁగలదు. అది సార్దానుస్వారమే యని నిర్ణయించుటకుఁ బ్రబలప్రమాణము కావలెను.

చీరసించుచు విప్రులాఱడి వైచి
కారించుతఱి నుదకము లేదు గంట. -బసవ పు. 83

అతిముఱిఁ జన్నఁబాలర్థించివేఁడఁ
జిఱుతచే నొకపిండికరు డిచ్చితల్లి. పుట.120

తారొండె శివుఁబంపఁదగదన్న వారు
గారొండె నంబికి వేఱొక్కభృత్యు. -బసవ పు. 133

'ఆరడి' యని సాధురేఫముగాఁగూడఁ గొందఱు ప్రయోగించిరి.

యతివిశేషములు

మూఁకకు నెగయుచు ముస్సుముస్సనుచు - బసవ పు. 160

అనుచోట నేఁటి వ్యవహారము చొప్పున “బుస్సుబుస్సనుచు” యని యుండఁ దగుననియు నది యప్పకవ్యాదులు పేర్కొన్న 'ముకారయతి' యగుటచే సాధువే యగుననియుఁ దలఁపఁదగియున్నది. కాని, వ్రాఁతప్రతులలో “ముస్సు ముస్సనుచు” అని యుండుటచే నట్లే యుంచితిని. అప్పకవి చెప్పిన చొప్పున ముకారయతి ప్రాచీనకృతులందు నా కెక్కడను గానరాలేదు. అప్పకవి ముకార యతికి లక్ష్యముగా నాచన సోముని వసంతవిలాసములోనిదిగా నీ క్రింది పద్యము నుదాహరించినాఁడు.

క. అత్తఱి విటనాగరకులు
    చిత్తమున వసంతకేళి సిగురొత్తంగా
    మొత్తములు గట్టితెచ్చిరి
    ముత్తెపుఝల్లరులతోడి బుఱ్ఱటకొమ్ముల్.

ఈ పద్యమందలి 'బుఱ్ఱటకొమ్ముల్' అను పదమును ప్రాచీనకవులు 'ముఱ్ఱటకొమ్ముల్' అనియే వాకొనిరి. కుమారసంభవమునఁ బెక్కుచోట్ల నన్నిచోడకవి యట్లే ప్రయోగించెను. రామాయణమం దయ్యలార్యుఁ డట్లే ప్రయోగించెను. 'ముఱ్ఱటకొమ్ములు' బుఱ్ఱటకొమ్ములుగా మాఱిన పిదప లాక్షణికు లీ ముకారయతిని గల్పించిరి. దానిఁబట్టి యర్వాచీనకవు లా యతిని ప్రయోగించుచు వచ్చిరి. 'ముస్సు' ధ్వన్యనుకరణమైనట్టే ముఱ్ఱటకొమ్ములో 'ముఱ్ఱు' కూడ ధ్వన్యనుకరణమగునని నా తలఁపు. ప్రాచీనకాలమున 'ముస్సు' 'ముఱ్ఱు' అని యున్న ధ్వన్యనుకరణము లర్వాచీనకాలమున 'బుస్సు' 'బుఱ్ఱు' లుగా మాఱియుండవచ్చును.

నన్నయాదులు విభక్తిముకారముతో 'పుఫుబుభు' లకును యతిని గూర్చిరి. కాని, యితర ముకారముతోఁ గూర్పరయిరి. లాక్షణికులు దానికి ము విభక్తికయతి యని పేరిడిరి. “పుణ్యుఁడు రాఘవుండు వనముం గనియెన్” అను విధమునఁ బ్రయోగించిరిగాని 'పుణ్యుఁడు రాఘవుండు మునిముఖ్యులతో' నను విధమునఁ బ్రయోగింపరయిరి. సమానోచ్చారణముగల 'ము' కారముల కిట్లు యతిలో భేదము గల్పించుట నేఁడు వింతగా గాన్పించును గాని యాంధ్రమున నట్టి యతివ్యవస్థ యేర్పడిన కాలమున నీ విభక్తి ముకారము వేఱువిధముగా నుండెడిది. నేఁడును విభక్తిముకారమునకు 'మ్ము, Oబు' అని రూపాంతరము లున్నవి. వనము, వనమ్ము, వనంబు అనియు రూపములు గలవు. నన్నయకుఁ బూర్వకాలమున 'ఁబు' అను రూపముకూడ నుండెడిది. ఆ కాలమున వనమ్బు, వనఁబు, రూపములే ప్రధానముగా నుండెడివి. వనమ్ము, వనము రూపములు పయి రూపములకంటె నర్వాచీనములు. ప్రాచీనశాసనము లీ విషయమును నిరూపించుచున్నవి. ద్రవిడభాషాశబ్దస్వరూప మిందుకుఁ దోడువలుకుచున్నది. 'క. ఎట్టి విశిష్టకులంబునఁ బుట్టిన ! సదసద్వివేకములు గల్గిన ' ఇత్యాది విధముల నన్నయాదు లీ యతిని బ్రయోగించిరి. వనఁబు రూపమున్న కాలమున నేర్పడినదగుటచే నీ మువిభక్తికయతి ముకారయతి వంటిది గాదయ్యెను. ప్రాచీనులు ముకారయతిని బ్రయోగించిరనుట కప్పకవి యుదాహరించిన వసంతవిలాస పద్య మప్రయోజకము. తక్కిన పద్యము లర్వాచీనకృతుల లోనివి.

శివకవు లఖండయతిని ప్రయోగించిరి. పండితారాధ్యుఁడు 'వేదోక్తముగ నెఱుంగవలయుఁ దుదిని మహేశా' అనెను.

సోమనాథుఁడు నామాఖండయతిని గూడఁ బ్రయోగించెను.

మఱియు నేకాంతరామయ్యనా నొక్క -బసవ. పు.170

మఱియును శివనాగుమయ్యనా నొక్క

- ఖండమై తనరు నాగయ్యహస్తమున - పండితా. ప్రథమప్రకరణము. అనియు గలదు.

చేయుడు లెంకమంచెన పండితులకు
శ్రీరమణుండు మంచెన పండితయ్య. -బసవ. పు. 198

ఇందు 'మంచెన' పదము నేఁడు 'మంచన' యని ప్రయుక్తమగును. ఆనాఁ డిట్టి నామపదములలోఁ కొన్నింట అన, అయ, అను విధమునఁ బదచ్చేదము కానరాదు. నన్నియ, మల్లియ, మంచెన, కూచెన, ఉదాహరణములు. నేఁడివి నన్నయ, మల్లయ, మంచన, కూచెనలుగా మాఱినవి. నన్నయకూడ నొకవిధమున నామాఖండయతిని బ్రయోగించెను.

ఉ. పాయక పాకశాసనికి భారతఘోరరణంబునందు నా
     రాయణునట్లు [27]వాణసధరామరవంశవిభూషణుండు నా
     రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడున్ తన కిష్టుఁడున్ సహా
     ధ్యాయుఁడు నైనవాఁడభిమతంబుగఁదోడయి నిర్వహింపఁగాన్.

ఇందు మూఁడవ చరణములోనిది నామాఖండయతి యనఁదగినదియే కాని, యది సంస్కృతసమాసమధ్యగతము. సోమనాథుని ప్రయోగములకును దీనికిని మిక్కిలి భేదము గలదు. అఖండయతిని నిర్వచించినవాఁడు పాల్కురికి సోమనాథుఁడని 'మానుగ విశ్రమాక్షర' పద్య మాతని దని కొందఱు లాక్షణికులు పేర్కొనిరి. మఱియు,

ప్రేమంబెలర్పంగ “భృత్యా(త్యే?)పరాధ
స్స్వామి నోదండ” యన్చదువు నిష్ఠించి. బసవ. పు. 106

పాయకశ్రుతి “రసాన్భక్తస్య జిహ్వా
గ్రే” యని యేప్రొద్దు మ్రోయుఁగావునను. బసవ. పు. 164

పయి ద్విపదలలో 'రాధ' 'జిహ్వా' యనునవి 'గగ'ములుగా నున్నవి. ద్విపదలక్షణము చొప్పున నక్కడ "గల" ములుండవలసి యున్నవి. “వాసవుల్ మువ్వురు వనజాప్తుఁ డొకఁడు భాసిల్ల నది యొకపదము” అని తల్లక్షణము. సంస్కృతమునఁ జరణాంతమందలి లఘువు గురువు గావచ్చునని 'పాదాంతస్థం వికల్పేన' అని విధియుఁ బ్రయోగములును గలవు. కాని, పాదాంతమందలి గురువు లఘు వగుట కానరాదు. ఈ రెండు గణభంగములును సంస్కృతభాషానుకరణమునఁ బడినవి. వీనిని సమర్థించుట యెట్లో! 'శ్లో॥ లఘు ర్భవే ద్గురుః కుత్రచిద్గురుశ్చ లఘుస్తథా, ఉచ్చారణస్య కల్ప్యత్వాన్నిదానం తత్ర సద్వచః' అను నథర్వణకారిక గతి కావలెనేమో! మఱియు,

శునకగార్దభమ్లేచ్ఛ శుకదర్దు రాది
అంధకకరి దైత్యవ్యాఘ్రలాలాజ. -బసవ. పు. 204-205

పయి రెండు చరణములందును 'సల' ముగా నుండవలసిన ద్వితీయగణములలో 'త్య' 'భ' లు గురువులుగా నగుటచే గణభంగ మేర్పడుచున్నది. అన్ని ప్రతులందును నీ పాఠములే కలవు. వీనిని సమర్ధించుట యెట్లో!

ద్విపదమునఁ బ్రాసయతిని జేర్చుట, రేఫద్వయసాంకర్యము నంగీకరించుట మొదలుగా సోమనాథుఁడు చూపిన ఛందస్స్వాతంత్ర్యమును శివకవు లంగీకరించిరిగాని, యితరులు గర్హించిరి. కాకతి ప్రతాపరుద్రుని కాలముననే యిట్టి గర్హ మేర్పడినట్లు పద్యబసవపురాణము తెలుపుచున్నది. అర్వాచీనుఁడగు నొక శివకవి యిట్లు చెప్పినాఁడు :

...................................................
ఇలఁబాలకురికి సోమేశుండు మున్ను
తొలఁగక ప్రాసయతుల్ ద్విపదలను
లలి రచించుట యది లక్ష్యంబుగాను
నెలమి రేఫఱకారములు శివకావ్య
ముల యందుఁ జెల్లుఁ దప్పులు గావు గాన
ఆ పాల్కురికి సోముననుమతి నేను
దీపిత ప్రాసయతిచ్ఛందసరణి
నా మహాగురు దేవు ననుమతియట్ల
శ్రీ మెఱయంగ రచించితినిట్లు.

-మఱి బసవపురాణము.

ఛందోవిషయముననేకాక వ్యాకరణవిషయమునఁగూడ నన్నిచోడ సోమనాథాదులగు శివకవులకును నితరులకును బహుభేదములు గలవు. నన్నిచోడనియు, సోమనాథునియు శబ్దప్రయోగములు గొన్ని యసాధారణములై యితర కవికృతులందుఁ గానరానివై యున్నవి. అట్టివానిని గొన్నింటిని బేర్కొనుచున్నాఁడను.

అసాధారణ ప్రయోగములు

కర్ణాటాంధ్రలాక్షణికులు కావ్యదోషములలో గణించిన 'వైరిపద' మనుశబ్దదోషము వీరి కృతులలోఁ బెక్కుచోట్లఁ గానవచ్చుచున్నది. వైరిపదము దోషమని గర్హించిన ప్రాచీనకవులే కొందఱు వానిని దఱచుగాఁ బ్రయోగించుట వింతగా నున్నది. సోమనాథుఁడు పండితారాధ్యచరిత్రమున 'వైరిపదము' ను గర్హించెను. కవిజనాశ్రయము, ఆంధ్రభాషాభూషణము, కావ్యాలంకారచూడామణి, ఛందోదర్పణము మొదలగు గ్రంథము లీ దోషమును బేర్కొన్నవి. అయినను, నన్నయాదుల కృతులలోఁగూడ నిట్టి వైరిపదములు కొన్ని గానవచ్చుచున్నవి. అర్వాచీనలాక్షణికు లనింద్యగ్రామ్యములని యట్టివానిని గొన్నింటిని గణించిరి. ప్రాచీనులట్టి వానిని వైరిపదములనియే పేర్కొనియు ప్రయోగించిరి. వైరిపదమనఁగా సంస్కృతాంధ్రపదముల విరుద్దసమాసము. సోమనాథుఁడు బసవపురాణమున మాత్రము ప్రయోగించిన వైరిపదములఁ జూపుచున్నాఁడను.

పు. 6- 'దీపగంభంబులు', పు. 15- 'చౌదళాబ్జంబు', పు. 26 'ముల్లోకవంద్య', పు. 30-'ముల్లోకనుతుఁడు', పు. 240- 'ముల్లోకనాథుని', పు. 44- 'నిత్యనేమంబు', పు. 55 - 'నిత్యపడి', పు. 134-'నిత్య', (ఇట్టివి పెక్కుమార్లు), పు. 55- 'పుడమీశ', పు. 60,62 - 'సర్వాంగకచ్చడము', పు. 124- 'భక్తకూటువలు', పు. 178 - 'మజ్జనబావి', పు. 201- 'ఇతరవేల్పులు', పు. 44,205-'తవనిధి', పు. 249 - 'తవరాజు', పు. 185-'తవరాజవల్లభుఁడు', పు. 201 - 'సిరిమహాదేవాదిసురలు', 140 ధర్మకవిలె, ఇత్యాదులు. పరిశోధింపఁగా నీ పదములు, సోమనాథుని కాలమున బాహాటముగా నాంధ్రశైవకావ్యములందుఁ బ్రయోగింపఁబడుచుండినట్లు గానవచ్చుచున్నది. ద్రవిడకర్ణాటభాషలలోను, దత్కాలపుఁగృతులలో నిట్టివి కొన్ని గానవచ్చుచున్నవి. కొన్నింటిని బేర్కొనుచున్నాఁడను

దీపగంభములు : కంభమని సంస్కృతశబ్దము లేదు గావునను, ఉన్నదనుకొన్నను, దెనుఁగుసంధి చొప్పున క, గ యగుట యసంగతము గావునను, నిది వైరిసమాసమే. తెనుఁగుపలుకులలోఁ గొన్నింట, వర్గద్వితీయ చతుర్థాక్షరములు గలవు. ఆంధ్రవ్యాకరణకర్త లవి లేవనుట యసంగతమని నా తలంపు. ప్రాచీనలేఖనములందు వర్గద్వితీయ చతుర్థాక్షరములుగా నున్నవానిని నేఁటి పరిశోధకులాంధ్రమున నవి లేవనునమ్మకముచే వర్గప్రథమ తృతీయాక్షరములుగా సంస్కరించుచున్నారు. ద్రాభ, జఱభి, వజ్జలు మొదలగు వానిఁజూడఁదగును. సోమనాథుఁడే :

కంభకట్లను మేలుకట్లను బొలుచు- గంభీరపుష్పకాగారంబునందు - అని 'కంభ' పదమును ప్రయోగించెను. మఱియుఁ బెక్కు శాసనములలోను గలదు.[28]

ద్రాభఛందోవిరుద్ధంబాదియగున- లాభప్రలాపోక్తి లాఘవంబనక. - పండితా.

చౌదళాబ్జము :- ఇది చౌసీతిబంధములు, చౌషష్టికళలు, చౌపదము, చౌపుటము అను పదములవంటిది. ముల్లోకవంద్యుఁడు ఇత్యాదులు-అనంతుఁడు:

గీ. “మొదలి తెలుఁగుపై సంస్కృతపద మొకండుఁ
     జరగ లోకరూఢిని సమాసంబు చొరదు
     పూని ముజ్జగంబులు ననఁబోలుఁగాని
     యతఁడు ముజ్జగద్వందితుఁ డనఁగఁ జనదు”

అనెను. కాని, సోమనాథుఁడిట్టిపదములను బలుచోట్లఁ బ్రయోగించెను. తత్కాలపు శాసనకావ్యములందును నిట్టివి గానవచ్చుచున్నవి. "ముల్లోకవిభుండు సక్రి” ఓపిలి సిద్దిశాసనము. [29]నిత్యనేమము, నిత్యపడి మొ. ఈ పదములను మఱికొందఱు కవులును బ్రయోగించిరి. నిత్య వేఱుగాఁ గూడఁ గలదు. నాఁటి శాసనములందును 'నిత్యపడి, దివసపడి' ఇత్యాదులు గలవు.[30] పుడమీశ- దీనిఁగూడఁ బలువురు కవులు ప్రయోగించిరి. 'పుడమిపుఁడున్ ధనాఢ్యుఁడును' - నన్నిచోడుఁడు; 'పుడమీశ్వరగొంకనృపతి భోగసురేంద్రా' -మను మంచిభట్టు నశ్వశాస్త్రము; 'పొడగాంచి యిదియుఁ గఱచెన్ ! బుడమీశ్వర దేహమనుచు' - నారాయణకవి పంచతంత్రము; ఇత్యాదులు పెక్కులున్నవి. కర్ణాటభాషలోఁగూడ నిది కలదు. 'తవనిధి, తవరాజు' ('తపోనిధి, తపోరాజు అనుటకు) మొ. తెలుఁగు కృతులలోఁ గాని శాసనములలోఁగాని నాకిది గానరాలేదు. ద్రవిడకర్ణాట ప్రబంధములలో నిట్టివి తఱచుఁగా గలవు. తక్కిన ప్రయోగములు నాకన్యత్ర కానరాలేదు. జీవగఱ్ఱ - ఈ పదమును చతుర్వేదసారమున సోమనాథుఁడు ప్రయోగించెను. ఇది 'యనింద్యగ్రామ్య (వైరిసమాస) మని పలువురందురు గాని నాకట్లు దోఁపదు. శ-ర-లో దీనికి జీవనౌషధము జీవాతువు' అని యర్థము వ్రాయఁబడినది. ఈయర్థమును సరిగాఁ దోపదు. జీవ =వీణ మొదలగువాని తంతి చక్కఁగా మ్రోఁగుటకుఁ గాను దానిక్రింద నుంచెడు కంబళిపీఁచు లోనగునది. దాని నుంచుటకుఁ గాను బెట్టినకఱ్ఱకు 'జీవగఱ్ఱ' యని పేరు. 'విపులతరంబగు వీణ దానది యెంత కారణంబగు జీవగఱ్ఱ యెంత' చతుర్వేదసారము. "శ్రుతికి నుత్కరంబు సూపఁ గవలయుచోఁ జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ” క్రీడాభిరామము.

పు. 144- అభిమానకత్తె ఈ పదము క్రొత్తగాఁ గానవచ్చినది. శ్రీనాథుఁడు గూడ నిట్టిపదములఁ బ్రయోగించినాఁడు. 'అన్న మీయన్న కోపగాఁ డౌనొ కాఁడొ', - కాశీఖండము; 'కొడుకుఁ గాంచినట్టియ కోపకత్తె' - క్రీడాభిరామము

పు.119- 'సద్భక్తసమూహి' ఇత్యాదులు. నన్నిచోడఁడు నిట్లు ప్రయోగించెను. 'శారదనీరదసమూహిచాడ్పునఁబోలెన్', సితచ్ఛదసమూహి' :- కుమార సంభవము; దశమాశ్వాసము.

కర్మధారయమున మహచ్ఛబ్దము - పు. 12- 'ఇది సుమహత్తత్వము', పు. 225 - 'ప్రోద్గత సూత్రమహద్గురుపుత్ర, మండలి లోభవన్మహదాజ్ఞ' - 'పండితా. - ఇట్టి వింకను గలవు. కర్మధారయసమాసమున 'మహత్' 'మహా' అని మాఱవలసి యుండఁగా నీతఁడు 'మహత్' అనియే షష్ఠీసమాస మందుంబోలె నుంచినాఁడు. ఈ దోషము నన్నిచోడని కుమారసంభవమునఁ గూడఁ బెక్కుచోట్లఁ గలదు. 'దళితాంభోరుహ సప్తపత్ర సుమహత్కాశాసనౌఘంబు' (-షష్ఠాశ్వాసము) ఇత్యాదులు.

పు. 37 - 'వచ్చు వహిత్రంబు వడువునుబోలె' 'వఱలఁగఁదాల్చిన తెఱఁగును బోలె'. నన్నిచోడఁ డిట్టివానిని దఱచుగాఁ బ్రయోగించినాఁడు. 'బలసికొలువున్న సురగిరిభంగివోలె', 'వనముగాపు వచ్చు వడువువోలె.'

పు. 84 - ఊరకో నాయన్న యూరకో తండ్రి' 'ఊరకుండు' అని ప్రయుక్తమగు శబ్దపల్లవధాతువునకు “ఊరకొను' అని యేకధాతురూపము క్రొత్తగా నున్నది. ఇట్టి ధాతువు నేఁడు వ్యవహారమునఁ గూడ వినవచ్చుచున్నది.

ఇల్ల :- పు. 23- 'ఇల్లకప్పడిసంగమేశ్వరంబందు.” పిడుపర్తి బసవన పద్యకృతిలో దీనిని 'ఇల్లీ కప్పడి సంగమేశ్వరమునం' దని మార్చినాఁడు. ఆ స్థలమునకుఁ గప్పడిసంగమేశ్వరమని పేరు. తెలుఁగులో 'ఇల్ల' పద మిక్కడనే కాని, యితరత్ర ఇల్ల, ఇల్లది, ఇల్లెక్కడ మొదలగు ప్రయోగములు గలవు గాని, వానిని వ్యాకర్తలామ్రేడితమున వచ్చిన యాదేశరూపములఁగా ననుగ్రహించిరి. అల్లి, ఇల్లి, ఉల్లి, ఎల్లి పదములు స్థల విశేషవాచక సర్వనామపదములని కర్ణాటవ్యాకర్తలు పేర్కొనిరి. తెలుఁగునఁగూడ నీ పదములు గలవు. అల్లది, అల్లవాఁడు మొదలగు విధముల నామ్రేడితమున వచ్చిన యాదేశరూపము లని సరిపుచ్చుకొనఁదగిన స్థలములోఁ గాక 'అల్ల'కు స్వతంత్ర ప్రయోగములు గూడఁ వెలుగునఁగలవు. పు. 175- 'దివి నల్లవోయెడు దేవదేవేశు' ఇత్యాదులు. 'అల్ల' తత్రార్థకము ; ఇల్ల', అత్రార్థకము; 'ఉల్ల' సమీపప్రదేశార్థకము; ఎల్ల' కుత్రార్థకము. ఇక్కడ ప్రయుక్తమయిన 'ఇల్ల' 'ఇక్కడున్న 'చేరువగానున్న', యను నర్థము గలది. ఇది యామ్రేడితమున వచ్చిన యాదేశరూపముగాదు. 'ఉల్ల'కుఁ గూడఁ బ్రాచీన ప్రయోగములు గలవు. ఉల్ల తెల్లని తురగోత్తము వాలంబు' - నన్నయ, ఆదిపర్వము. 'ఉల్ల కాంచన రథముపై నున్న వాఁడు', 'దానికుల్ల తెరువు' - అరణ్యపర్వము. 'ఎల్ల' సర్వార్థకము కలదుగాని, కుత్రార్థకము తెలుఁగున మృగ్యము. పెండ్లిండ్లు : పు. 23 - నేఁడు 'పెండ్లిండ్లు' అని యెల్లరు వ్యవహరించుచున్నారు. పెండిలికి బహువచనము 'పెండిండ్లు' అగుటయే సరి. ఈ రూపము నీ కవి 'పెండిండ్ల నోములఁ బేరంటములనుఁ - బండువుదినముల' అని ప్రాసలోఁ బ్రయోగించినాఁడు.

పు. 80 - 'ఒల్వువడు' - 'ఒలుచు' ధాతువునకుఁ గృద్రూపము నేఁడు 'ఒల్పు' గాఁ గానఁబడును. చువర్ణాంతములయిన ధాతువులకుఁ బెక్కింటికి నేఁడు కృద్రూపమున 'పు' వర్ణము గానవచ్చుచున్నది. ఊడుచు-ఊడుపు, గెలుచు-గెలుపు, తాలుచు- తాలుపు, ఇత్యాదులు. సోమనాథుని కాలమున నివి 'వు' వర్ణాంతములుగా నుండెడివి. 'తారకుం బోరగెల్వున్, చిరముగ నొల్వువడ్డ', - కుమారసంభవము 1,5 ఆశ్వాసములు. మన సోమనాథుఁడే 'బిల్వపత్రిని నెలదాల్వుఁ బూజించి' అని పండితారాధ్యచరిత్రమునఁ బ్రయోగించినాఁడు. ఇది లేఖకప్రమాదమని దిద్దరానిది. 'అరియవట్టనమున ఊడ్చిన ఊడ్వునేల, - క్రీ.శ.1121 నాఁటి శాసనము[31] ఇట్టివి పెక్కులు.

క్వార్థక సంధులు : పు. 31- ఏ వేళ వెఱచుండుము.” (నిర్వచనోత్తరరామాయణమున 'వెఱచిట్లంబుధినాథనందనులు' అని తిక్కన ప్రయోగించెను. పు. 76 - ' ఊచవోయున్న భావమున' పు. 105- 'ఎలుఁగు వి నేతెంచి, పు. 153 - 'ఏ తెంచారగించె, గలిగున్న దనుచు' పు. 160- 'కట్టెగసల్లంత, 'పులుగఱచు మియుచు' 'ఏటువడీల్గఁడే'; పు. 202-'కలిగుండువాఁడు, పు. 185 - 'అంజలి ముంచెత్తు నమ్మాత్రలోన', పు. 215- ఇట్టివి క్వార్థకేకారసంధులు పెక్కు లీ కవి గ్రంథమునఁ గలవు.

ఇకారసంధులు : పు. 44 - పత్తిరీగొడ్డునందు, పు. 81- పడఁతర్ఘ్య పణ్యముల్, పు. 116 - 'కంచేడువాడలు' ఇత్యాదులు గలవు.

షష్ఠీసమాసము: పు. 45-సత్యమాహేశ్వరులిండ్ల, పు. 116 - 'గతిహీనులిండ్ల, పు. 155- ఇతరులిండ్లైన', పు. 171 - 'వేల్పులొడయండు, జిన భక్తులిండ్ల, పు. 240 'మా భక్తులొద్ద' బడుగులాదరువ', పు. 102- పురోహితులను మతము;' ఇత్యాదులు. షష్ఠీసమాసమున విభక్తిలోపమును, అకారముపై సంధియు సర్వప్రాచీనకవి సమ్మతము. ఇట్టి ప్రయోగములననేకులు ప్రయోగించిరి.

కుషష్ఠి : పు. 203 - 'ఈశుకు బసవఁడు,' 'కంతుసంహరుకెన', పు. 209, 226 - 'కరికాల చోడుకు', 'పుడమీశుకొల్వుకు,' ఇత్యాదులు. ఇట్టివి క్వాచిత్కముగాఁ బ్రాచీన కృతులలో నున్నవి.

సంబోధనమున సంధి :- పు. 184, 216- 'ఎఱుఁగరెజైనులా రెన్నఁడు మీరు, 'ఓడులారేటికి'. పండితారాధ్యచరిత్రమునను నిట్టి సంధులు గలవు. ఇవి యితర కవుల కృతులలో నాకుఁ గానరాలేదు.

'మహత్తులపై 'రో :- పు. 64 'వీరభద్రయ్యరో, 'పు. 68 - 'వీరెవ్వరయ్యరో యనుచు, దేవరో, బసవరో, ఇత్యాదులు. “రో" మహతీ వాచకముల మీఁదనే యుండు ననుట సరికాదు. ఇతర కవులు గూడ మహద్‌వాచకములపై 'రో ' చేర్చిరి.

నెట్టణ :- 'ఇట్టి నెట్టణభక్తి యిట్టి ముగ్ధత్వము,' - 'నెట్టణ భక్తికి నిలుకడయగుచు,' 'నెట్టణశరణుండ నిర్మలాంగుండ,' - ఇట్టివి పెక్కులు. 'నెట్టన' పెక్కు గ్రంథములందుఁ గలదు. అది క్రియావిశేషణముగాఁగానవచ్చు చున్నది. ఇక్కడ విశేష్యముగా నున్నది. ప్రాచీనకృతులలో నిది విశేష్యముగాఁ గూడఁ బ్రయుక్తమయినట్టున్నది. శబ్దరత్నాకరమున 'నెట్టన' చూచునది. 'నెట్టనము' అని రూపాంతరమును గలదు.

మహ మా :- పు. 180- 'మహలింగమూర్తి, పు. 213- 'ఈమా(మహా) జనము' ఇత్యాదులు పెక్కులున్నవి. మహచ్ఛబ్దము 'మా' అగునని కర్ణాట వ్యాకర్తలు చెప్పిరి “మహచ్చబ్దక్కుద్బవిక్కుం మా దేశం దోషవిల్ల సంస్కృతపదం పరక్కొదవలోడం” శబ్దమణిదర్పణము. దీని కుదాహరణములు మాదేవ, మాకాళి, మాదాని, మాశౌర్య పదములు. ఇదియు నట్టిదే. యుష్మదస్మత్సమాహార సంప్రార్థనాద్యర్థక క్రియ : పు. 149 - 'చెప్పుదండు', పు. 174 - 'చెఱుపుదండు', పు. 179 - 'పోదండుగాక', పు. 215 - 'చూతండు' పండితారాధ్యచరిత్ర 2వ ప్రకరణమున పడుదండు', 'ఉండుదఁడు', 'తీర్తండు' ఇత్యాదులు పెక్కులు. ఇవి యితరకవుల కృతులలో చెప్పుదుము, చెఱుపుదము, పోదము, పొదము, పదము, పదండు, చూతము, పడుదము, ఉండుదము తీర్తము అను రూపములతో వ్యవహృతము లగుచున్నవి. ఒక్క 'పోవు' ధాతువునకు మాత్రమీ కవి ప్రయోగించిన 'పోదండు, పొదండు,' 'పొదరు' రూపము లితర కవులును ప్రయోగించిరి. తక్కిన ధాతువులపై నాకిట్టి రూపములు శివకవుల కృతులలోనే తక్కనిఁక నెక్కడను గానరాలేదు ఈ రూపములు క్రొత్తగా నున్నవి.

పదాంతాజ్లోపము : పు. 12- 'వెల్విరియ', పు. 28- 'ఎదురుకొన్వేడ్క' పు. 101- 'నేఁడ్వింతవాఁడొకఁడు, పు. 269- 'భాషా ప్రణీతమన్బడు బల్లగోల, 'త్రాడ్పేన,' - 'నేలఁబడి పొరల్ కూయిడు, గుడిసొచ్చు గుడివెడల్' - పండితా. - ఇత్యాదులు. కొన్ని శబ్దముల తుదియచ్చు లోపించుట ప్రాచీన గ్రంథములలోఁ బెక్కింటఁగానవచ్చును. 'వసివాళ్వాడు', 'కడివోయినవాళ్ ముడువంగ, 'గ్రుక్కిళ్మింగు' ఇత్యాదులు. ను, లు, రు, వర్ణాంతశబ్దములకు నువర్ణాంతధాతువులు క్రియాజన్యవిశేషణములుగా నున్నప్పుడు వాని యుకారమునకును గూడ లోపముగలదు. కాని 'వెలివిరియు' 'వెల్ విరియు' గాను, 'అనఁబడు' 'అన్బడు' గాను, 'పొరలును కూయిడును' పొరల్‌కూయిడు' గాను, 'వెడలును' 'వెడల్' గాను మాఱుట క్రొత్త. ఇట్టిదే 'విప్రసతికి నూఱు వేఁడఁ జన్ వరములు' - నన్నయ, సభాపర్వము. నేఁడు, త్రాడు శబ్దములు తొలుత 'నేళ్' 'త్రాళ్' గా నుండినవి గావున నవి 'వాళ్వాడు' వలె మాఱుట సంగతమే. మఱియు 'తివ్యు' 'కుర్వు' 'నుస్లు' ఇత్యాదులఁగూడ నీతఁడు ప్రయోగించెను.

'అంబుజనేత్రి' పు. 8- ప్రాచీనకృతులలో నిట్టిరూపములు శాసనము లలోఁ దఱచుగా నున్నవి. 'అబ్జనేత్రి', 'కోమలీ', 'కుసుమకోమలి', 'వల్లభ' 'నయనవల్లభి' 'పల్లవాధరి', 'బాలకి' ఇత్యాదులు యతిస్థలములందు దిద్దరానివై కూడఁ గలవు. అవధారణార్థకము : పు. 9- 'పరమతత్త్వామృతంబయ చన్నుఁబాలు, ఇక్కడ 'అమృతంబు' పై నవధారణమున 'అమృతంబ' యగును గాని దానిపై మరల 'అ' వచ్చుట క్రొత్తగా నున్నది. యతికూడ హల్లుతోనే కలదు. తిక్కనగూడ నిట్లు ప్రయోగించినాఁడు. 'దరికొని తెగఁగాల్చునట్టిదయ యగుఁజుమ్మీ'; (ఉద్యోగ 2 ఆశ్వా). పు 205 - 'నలిగొన బొందితో ననకొనిపోఁడె', ఇటకూడ మీఁదిదానివంటిదే. ఈ 'తోనన' పలువురు ప్రాచీనకవులు ప్రయోగించిరి.

పసిబిడ్డ :- పు. 19- ప్రాత వ్రాతప్రతులలోఁ గొన్నింట 'పసుబిడ్డ, కలదు. అఱవమున 'పసుఁబిళ్లై' కలదు. పసరు, కసరు, శబ్దములకు పసు, కసు, పసి, కసి, రూపము లేర్పడినవి. పసరుఁబిందె, కసరుఁగాయ, పసిపిందె, పసుఁ బిందె, కసిగాయ, కసుఁగాయ, అని రూపములు గలవు. అట్టే యిదియును.

శిథిలద్విత్వము :- పు. 144 - 'అట్టయు నీడ్పించి యగడ్తవైపించె' కర్ణాట వ్యాకరణమున 'శిథిలద్విత్వము'ను గూర్చి యొక ప్రకరణమే కలదు. తెలుఁగున శిథిలద్విత్వప్రశంస గానరాదు. శిథిలద్విత్వమనఁగా సంయుక్తాక్షరము తేలఁ బలుకఁబడుట. దానిచేఁ తత్పూర్వాక్షరము లఘువగును. తెలుఁగున 'అద్రుచు, విద్రుచు, చిద్రుపలు,' అనుపదములు మాత్రమే యిప్పుడు శిథిలద్విత్వములనఁ దగినవి గానవచ్చుచున్నవి. కర్ణాట శిథిలద్విత్వములలోఁ గొన్నియైనను, దెలుఁగునఁ గూడఁ బ్రాచీనకాలమున శిథిలద్విత్వములుగా నుండియుండవచ్చును. 'యగడ్తవైపించె' నను నీ ప్రయోగ మందుకు స్పోరకము. తెలుఁగున నిప్పుడు 'డ' గా మాఱిపోయిన ఱ (జ్ష) అక్షరముగల పదమది. 'ఈ అగఱ్త' కర్నాటకమున శిథిలద్విత్వముగలదే "అగడితవైచె” అనుపాఠము పరిగ్రాహ్యముగా నాకుఁదోఁపకున్నది. 'ఈడ్పించి' యండుటచే 'వైపించె' అనియే తర్వాత నుండఁదగును. నన్నిచోడఁడు కూడ నిట్టి ప్రయోగములఁ జేసినట్టున్నాఁడు. 'శ్రీరామేశకవీశ్వరాదు లెడ్దనీ శ్రీపాదముల్', 'ఎడ' ఎద' అను రూపములను గొన్నచో నిక్కడ సరిపోవును గాని వ్రాఁతప్రతిలో ఎడ్డ' అని యున్నది గావున, నట్లే గ్రహింపఁదగును. కన్నడమున నదియు ఎఱ్ద' అని శిథిలద్విత్వము గలపదము. 'మొగుచు' ధాతువు; 'మొగుడు' ప్రేరణరూపమని శబ్దరత్నాకర కారులనిరి. అట్లే యగునేని యదియు 'మొగుడుచు,మొగుడ్చు' అని యేర్పడి దానిపై శిథిలద్విత్వమై 'మొగుడ్చు' కొన్నాళ్లుండి యిప్పుడు మొగుచు రూపముగా మాఱినదనవలెను. 'మొగుపు' అని కృద్రూపముగూడఁగలదు. బూది, బూడిదనుండి యేర్పడిన దనుటకంటె భూతినుండి యేర్పడినదనుట యుక్తము.

షష్ఠీసమాసమున 'పు,ంపు' లు :- పు. 32- 'ధీరంబుకట్ట', 'గంభీరంబు తిట్ట, ఇత్యాదులు. ప్రాచీనకృతులలో షష్ఠీసమాసమున ముకారమునకు 'పు', 'ంపు'లు గానరావని కొందఱందురు గాని యది సరికాదు. బసవపురాణపు వ్రాఁతప్రతులలో రెండురూపములును గానవచ్చుచున్నవి. 'ధీరంపుఁగట్ట గంభీరంపుఁ దిట్ట.” ఇత్యాదిగాఁ గూడఁ గలదు. తిక్కనాదులు దఱుచుగా నిట్టు ప్రయోగించిరి. ప్రాఁత వ్రాఁతప్రతులు చూడఁదగును. ప్రాసస్థలముల లోని ప్రయోగము లనివార్యములు, వానిఁ జూపుచున్నాఁడను. 'చ. తపమును- గల్గు క్రీడిక, య్యపు వెరవెక్కుడై గెలుచునట్లుగ' - కర్ణ.3 ఆశ్వా. 'లావుదేవక' య్యపువెరవేపుదాల్మి - శల్యపర్యము. 'కృపఁ దిలకింపఁ బెంపఁ బరికింపఁ గలాఁడుదయించు నంచు వే, దపుగని వేల్పు సెప్పిన' - సోమన హరివంశము, 2 ఆశ్వా. 'కపటమువన్ని జానకి నకల్మషఁదెచ్చినయట్టి పాపక | ర్మపుఁబొడువన్.” - భాస్కర రామాయణము, యుద్ధకాండము. ఇత్యాదులు. కవిలోకచింతామణిలో వెల్లంకితాతంభట్టు గూడ షష్ఠీసమాసమున నీ యాదేశము గలదని వచించెను.

తదియ్యము : పు. 129 - 'అయ్యా యనఁగ నేమి యయ్యా యనెడు తదియ్యవాక్యంబునజ్జియ్య యడంచి' ఇందు 'తదియ్య' పదము సంస్కృతవ్యాకరణవిరుద్దము. 'తదీయ' ఉండవలెను. అట్లు దిద్దినచోఁ బ్రాసభంగమగును. 'జియ్య'కు 'జీయ' రూపాంతరము గలదు. దీర్ఘములమీఁది య, వ, లు కొన్ని ద్విత్వమును జెందుట, పూర్వదీర్ఘము హ్రస్వమగుట ప్రాకృతమునను, దెనుఁగునను గలదు. 'హైయంగవీనము'ను 'హయ్యంగవీన' మని వ్రాయుట, యుచ్చరించుట గలదు. ఐయున్న అయ్యున్న యని యౌవనము జవ్వనమని యయినట్టు తదీయము తదియ్యము కావచ్చును. ప్రకృతులకే కాక ప్రత్యయములకుఁగూడ వికృతిరూపములు గలవు. కాని, యిది సంస్కృతసమాసమున నున్నది. నన్నిచోడఁ డును, ననంతామాత్యుఁడును నిట్టి ప్రయోగములఁ జేసిరి. 'మహేశుఁడయ్యుమా, యవ్వనవారి పూర్ణసురతాభి వివర్ధితుఁడై' - కుమారసంభవము 9 ఆశ్వాసము. 'వ్వ' ప్రాసలోనున్నది. 'నవ్వుచు - నీ యవ్వనలక్ష్మికిన్ భటుడు.' భోజరాజీయము 7 ఆశ్వాసము.

ప్రథమాదులమీఁద గసడదవాదేశము :- ప్రాచీనకృతులలోఁ బ్రథమావిభక్తిమీఁదను, ద్రుతాంతముగాని క్రియారూపములమీఁదను, కొన్ని యవ్యయముల మీఁదను, సంఖ్యాపరిమాణవాచకములమీఁదను, కొన్ని సమాసములలోను నుండు కచటతపలకు గసడదవలాదేశములగుట కానవచ్చును. ప్రథమాంతముల మీఁద నీ యాదేశము నిత్యమని యాంధ్ర భాషాభూషణాదులు పేర్కొన్నవి. క్రియావ్యయముల విషయమనిశ్చితముగా నున్నది. ప్రాంతవాఁతలలోఁదఱచుగా నీ యాదేశము కానవచ్చును గాని యదిలేని వ్రాఁతలును గొన్నిగలవు. ప్రాసస్థలముఁ జూచి వీనిని నిర్ణయింప నగును. అట్లచూడఁగాఁ కొన్ని యవ్యయములపై నిత్యముగా రాకపోవుట కానవచ్చును. కొన్ని క్రియలపై నవ్యయముల పైఁ గొందఱు కవులాదేశము చేసియుఁ, జేయకయును బ్రయోగించిరి. సంఖ్యాపరిమాణవాచకములపై మాత్రమీ యాదేశము నిత్యముగాఁగానవచ్చును. ప్రథమాంతముల మీద గూడఁగొందఱు వికల్పముగాఁ నీ యాదేశమును బాటించిరి. ఆంధ్రశబ్ద చింతామణ్యాదుల విశ్వసించి వ్యాకరణకర్తలు గొందఱాచ్చికములమీఁది తత్సమములకుఁ గలదని, తత్సమములమీఁది యాచ్చికములకుఁ గలదని, ఇంకేమోయని వ్రాసిరి గాని యది యెల్లఁ ద్రోసిపుచ్చఁదగినది. పరిశీలింపఁగా కళలపై నుండు పదాది కచటతపలకు, గసడదవలు బహుళముగా వచ్చుననుటయే చిక్కులేని నిర్వచనముగాఁ గానవచ్చుచున్నది. ప్రాచీనకాలమునఁ బ్రథమమీఁదను, గ్రియలమీఁదను గసడదవాదేశము బహుళముగానే కలదనుటకుఁ గొన్ని ప్రయోగములఁ జూపుచున్నాఁడను. 'ప్రా| త్రత గలిగెనేని నా కొస| గు తదీయాలోకనంబగు తెఱంగుగృపన్ | - 'లే | డుదలంప నశ్వమేధము' శాంతిపర్వము; కన్యాత్వమే నాకులే | దుగదా! నిర్వ-రామా-పొ | మ్ముకపివరేణ్య! నీ వనిన మోదితులై, 'మదీయంబైన మర్మంబు వీ | డు కృతఘ్నుండయిచెప్పెఁ గూలునని యాటోపంబు దీపింప', 'వికృతములైన... నీవు బీ | తు కుడిచివచ్చి నోరికొలఁదుల్' - భాస్కర. యుద్ధకాండము.

క. ఆపద్వినీతులగుదురు
    కాపురుషులు పరమ పురుషకారుణిక గుణుల్
    శ్రీ పాటింప వినీతులు
    నాపద్దశకంటె దశదిశాంకాభరణా!

- బద్దెన నీతిసారముక్తావళి.

ఇవియెల్లఁ బ్రాచీన ప్రయోగములు. క్రియల పయిని బ్రథమాంతముల పయిని నాదేశము లేకున్నందుకర్వాచీన కవిప్రయోగములనెక్కువగాఁ జూపవచ్చును. 'వయ | శ్శ్రీ చన రెంటికిం జెడిన రేవఁడనౌదునె నీరజేక్షణా' మనుచరిత్రము. - ఇఁక నవ్యయములపై నీయాదేశము నానావిధములఁగలదు. అవధారణార్థకము, క్త్వార్థకము మొదలగువానిపైఁ గానరాదు. అట్లు, ఏమి, మొదలగువానిపై నిత్యముగాఁగానవచ్చును. అన్ని యవ్యయముల మీఁదను బ్రాసస్థానప్రయోగములు దొరకకున్నవి. ఇతరస్థలముల విషయము వ్రాఁతలలో నిరుదెఱఁగులను నుండును. ప్రాచీన కాలముననే యీ యాదేశము సునిశ్చితముగా నుండలేదు. శాసనములు గూడఁ గొంతవఱకు వీనియనిశ్చితతను నిరూపించుచున్నవి. ప్రాచీనతర శాసనములరీతి ననుసరించి తొలుత నీ యాదేశము నీ గ్రంథమునఁ బూన్కితోఁబాటింపఁదలఁచితినిగాని, భారతాది ప్రయోగముల ద్వైవిధ్యమును, దాళపత్ర గ్రంథములంతగా నీ నియమమును బహుకాలమున నుండియే పాటింపకుండుటను, వర్తమాన పాఠకలోకమున కీ విధమపరిచితమగుటను, గొన్ని యెడల నర్థక్లేశమును గలిగించుటను, అచ్చులోనపూర్వమయిన మార్పగుటచే నెంత జాగ్రత్తగాఁ జూచినను గన్నువంచించి కొన్ని పట్టులు గానరాకుండుటను, బర్యాలోచించి, యాపూన్కిని వీడి నేనును బహుళముగానే యీ యాదేశము నిందుఁ బాటించితిని.

పు. 131 - ఏనువోయెద - తాను నేను శబ్దములు ద్రుతాంతములుగా వ్యాకరణములందుఁ బరిగణితములగును. 'ముందరదముడిగుమే | ను విదప డిగియెద.' శల్య 2 ఆశ్వా - అని తిక్కన 'ఏను' కళగాఁ బ్రయోగించెను. 'ఏనవిదప' అను సంస్కారము తప్పు. 'ఏనువెనుక' అని పాఠము కలదందురు గాని యది నాకే ప్రతిలోను గానరాలేదు. ఆ శబ్దములను బ్రాచీనులు కళలనుగానే ప్రయోగించిరని నా నమ్మకము. కళలు గనుకనే 'ఏను' పై 'పిదప' 'విదప' అయినది. మఱియు, నే| ను గరంబుత్సుక వృత్తితో- నిర్వచనో, 4 ఆశ్వా. ఈ ప్రయోగము ద్రుతాంతత్వమునకును సాధకమే. కాని, ప్రాచీన ప్రతులలోఁ బెక్కింటఁ దాను, నేను శబ్దములమీఁది కచటతపలు గసడదవలుగాఁ గాన వచ్చినవి. బసవపురాణపు వ్రాఁత ప్రతులలోనున్న పాఠమును నేను మార్పఁ జాలనయితిని.

కాన కళయే :- బసవపురాణపు వ్రాఁతప్రతులలోను భారతాదుల వ్రాఁతప్రతులలోను, ఎక్కడఁజూచినను కాన కళగానే కానవచ్చును. ధృతరాష్ట్రుండును, - కా | న తగంబొందుట' యని తిక్కన ప్రయోగము గలదు. వందల కొలఁది స్థలములలో నది కళగానే వ్రాయఁబడి యున్నది. ప్రాచీనగ్రంథములలో నెక్కడను నది ద్రుతాంతముగాఁ గానరాదు. 17వ శతాబ్దినుండి రచితములయిన గ్రంథములలోనే యది ద్రుతప్రకృతికముగా మాఱినది. ప్రాచీనగ్రంథములలో 'కాన' అనియే 'న' లఘువగునట్లు వందలకొలఁది పట్టుల నున్నదిగాని 'కానన్' అని గురు వగునట్టుగా నెక్కడను ద్రుతముతోఁ గానరాదు. అది కళ యనుట కిదియొకటియే ప్రబలసాధనము కాఁదగును.

స్త్రీ, పుం వాచకములు :- పు. 108, 'సడిసన్నదాసి' (పుం.) కొడుకులు లేమికిఁగడుదుఃఖి యగుచు' (స్త్రీ), వనిత యపూర్వలాంఛనధారిగాఁగ' (స్త్రీ) ఇత్యాదిస్థలములఁబుంలింగరూప ముండవలసినచోట స్త్రీలింగరూపమును స్త్రీలింగరూపముండవలసినచోటఁ బుంలింగరూపమును నీ కవి ప్రయోగించి నాఁడు. (పుట6, పుట్‌నోట్ చూచునది.)[32] శత్రర్థకములు :- పు.7 'వీక్షింపుచున్న, ఇత్యాదులు. ప్రాఁతవ్రాఁత ప్రతులందన్నింట శత్రర్థమగు 'చున్' పరమగునపుడు ఇంచు, ఇంపుగా మాఱుట సర్వత్ర గానవచ్చుచున్నది. ఈ బసవపురాణము ప్రతులన్నింటను నిట్టిరూపములే కానవచ్చుచున్నవి. కొందఱు వ్యాకరణకర్త లీ రూపములఁగూడఁ బరిగణించిరి; కొందఱు సరి కాదనిరి. వ్రాతఁప్రతులందు వందలకొలఁది పట్టులందున్న 'యింపు' రూపములను, మార్ప సాహసింప నయితిని. కాని, యతి ప్రాసములలో నీ రూపములు ప్రాచీన గ్రంథములందు నాకుఁ గానరాలేదు. ఈ బసవపురాణమున పు 236 'శుభకార్య మాచరించుచు నొక్కనాఁడు, పు. 52 అంచు వెండియుఁ బ్రస్తుతించుచు- ఇత్యాదులు 'ఇంపు' రాని ప్రయోగములున్నవి. ప్రాఁతవ్రాఁత లన్నింట నుండుటచే నుంచితినిగాని యీ 'యింపు' సోమనాథునికి సమ్మతమే యనఁజాలను.

అర్ధానుస్వారములు :- తిక్కనాదుల కాలమునఁగూడ నర్దానుస్వార పరిజ్ఞానమస్పష్టముగా నున్నట్టే కానవచ్చును. ఒకరు సానుస్వారముగాఁ దలఁచిన దానిని వేరొకరు నిరనుస్వారముగాఁ దలఁచుటే దీనికిఁ దార్కాణము. 'ప్రోక'ను నన్నిచోడఁడు నిరనుస్వారముగాఁ బ్రయోగించెను.

క. కోకనదంబులు మొగుడం
   గోకంబులు విరిసి దెసలకుం జన మెఱుఁగై
   ప్రోకలుగొని మౌక్తికనిక
   రాకరమనఁ దారలెసఁగె నంబరవీథిన్

- అష్టమాశ్వాసము

శబ్దరత్నాకరమున నిది నిరనుస్వారముగానే గ్రహింపఁబడినది గాని లక్ష్యము సానుస్వార మనఁదగినదిగా నున్నది. (చూ:శ.ర.) మఱియు భాస్కర రామాయణ యుద్ధకాండమున 'ప్రాఁకుదుమా' 'ఊఁకున- మ్రాకుఁలు,-ప్రోఁకలు' అని సానుస్వారముగా గ్రహింపఁబడినది. మన సోమనాథుఁడును,

పు. 144 - 'మ్రోఁకు వెంటన యెడతాఁకుచుఁజుట్టి | ప్రోఁకగాఁ బోయుచుఁ బొద్దులు వుచ్చ' పు. 32, - సారార్థములప్రోఁక జ్ఞానాగ్నికాఁక' అని, సానుస్వారముగానే గ్రహించెను. కుమారసంభవమును, శబ్దరత్నాకరమును, నమ్మి దీనిని నేను నిరనుస్వారముగానే తలఁచి, యీ ముద్రణమునఁదొలుతఁ గొన్నిపట్టుల ననుస్వారమును (c ?) అని కుండలీకరించి యుంచితిని. ఇట్లే మఱిపెక్కు శబ్దములఁ గూర్చి సంశయము గలదు. కొన్ని ప్రాచీనశాసనములలో 'పెరుగు' నిరనుస్వారముగా నున్నది. 'తనకు నసమువెరుగ' సోమలదేవి దాక్షారామ శాసనము.[33] మార్కండేయ పురాణముననుండి సానుస్వారమనుటకు లక్ష్యముగా శ. ర. లో నీ క్రింది పద్యముదాహృతము.

క. అనఘ మదాలసకడుపున
    జనియించియు యోగిమాత చనుగుడిచి పెరిం
    గిన తనయు లితరవనితల
    తనయులు చనుత్రోవఁ జనఁగ దగియెడువారే
    ఇది యిట్టుండవలెను.
    జనియించియు యోగిమాత చనుగుడిచియుఁ బె
    ర్గినతనయు..................................................
    మార్కండేయపురాణమున నుండియే

    'ఉత్తముఁ డనఁగంబరంగు నుర్వినని మునుల్‌'

అని పద్యము నుదాహరించి, శబ్దరత్నాకరకారులు 'పరగ' సానుస్వార మనిరి.

'ఉత్తముఁడను పేరఁబరగె నుర్వినని మునుల్'

అని వ్రాఁతప్రతుల పాఠము. పరగ నిరనుస్వారమే, 'చాగు' లో నరసున్న లేదేమో! కొన్ని వ్రాఁతలలోఁ గలదు. ప్రాచీన కవులెల్లరును, సానుస్వారముగాఁ బ్రయోగించిన 'ఏఁగు' నిటీవలివారు నిరనుస్వారముగాఁ గ్రహించిరి. ప్రాచీనులు, వీపు, చీకటి, తీగ. తూగాడు నిరనుస్వారముగాఁ బ్రయోగించిరి. ఇటీవలివారు సానుస్వారముగాఁ బ్రయోగించుచున్నారు. 'నాడు' దేశార్థమునఁగూడ శాసనములందు సానుస్వారముగాఁ గానవచ్చును. నూఱు మీఁది యౌపవిభక్తిక మగు నూటిలో శ్రీనాథుని శాసనమునను, మఱిపెక్కింటను ననుస్వారము గానవచ్చును. 'ఏటికి' నిరనుస్వారముగాఁ గొందఱును సానుస్వారముగాఁ గొందఱును బ్రయోగించిరి. పు. 15 నాఁటు (పుట్ నోట్ చూ.) దీర్ఘముల మీఁది యౌపవిభక్తిక టకారములకుఁ బూర్వమర్ధానుస్వారము పెక్కు వ్రాఁతలందుఁ గానవచ్చును. 'గోచి' కి నిరుదెరఁగుల వ్రాఁతలుండును. తొరుగు సానుస్వారమని శ. ర. లోఁగలదు. అట్లనుటకుఁ బ్రమాణము నాకుఁగానరాలేదు. అది నిరనుస్వారమే యని నా తలఁపు. 'మావిడి' సానుస్వారముగా బహుశాసనము లందుఁ గానవచ్చును. “మా విణ్డి' అని కూడ నున్నది. ఎనుబది, ఐదు, శబ్దములలో ననుస్వారముండు ననుకొనెదను. 'మాదిఁగ' లో ననుస్వారము గలదు. అది మాతంగశబ్దభవము. 'లింగులుగాక మాదింగలున్నారే' - పండితా. 'తూపు'లో ననుస్వారము గలదని కొందఱందురు. భారతమున నది నిరనుస్వారముగాఁ బ్రయుక్తము. 'కోపించి మూఁడుబల్ దూపుల' కర్ణపర్వము. అఁట, అంట, రూపములు గలవని చిన్నయసూరి ప్రభృతులందురుగాని ప్రాచీన కృతులలో 'అంట' రూపమే కానరాదు. 'అట' లో సున్నయుఁగానరాదు. అట, అటె, అట్టె, అనియే ప్రాచీన ప్రయోగములు. 'పోతు' హరివంశమున నెఱ్ఱప్రెగడ నిరనుస్వారముగాఁ బ్రయోగించెను. కొన్ని వ్రాఁతలలో సానుస్వారముగాఁ గానవచ్చును. కొన్ని యువర్ణాంతధాతువులకు భావార్థమున సానుస్వారమయిన 'త' వచ్చుటచే (చేఁత, రోఁత ఇత్యాదులు) తత్సదృశమయిన (చేతులు, గోతులు, పోతులు మొదలగు) శబ్దములకుఁ గూడఁ బరిజ్ఞానములేని లేఖకులనుస్వారముల నుంచుచు వచ్చిరి. అట్లే యనుడు, నావుడు, ఆరగించుడు మొదలగు శబ్దములందుఁ గొన్ని తాటాకు ప్రతులలో ననుస్వారములు గానవచ్చును. రాముఁడు, బాలుఁడు మొదలగు శబ్దములకుంచినట్లే యపరిజ్ఞానముచే లేఖకులట్లు వానికిని సున్నఁజేర్చి యుందురు. వానిని జూచి కొందఱవి సానుస్వారములే యనుచున్నారు. అది సమ్మతముగాదు. అట్లగుచో నవి నిండుసున్నలుగాఁగూడ మాఱవలెను గదా! ఎక్కడను నట్టి రూపములు గానరావు. అవి నిరనుస్వారములనుటకనేక ప్రయోగములం జూపనగును.

పు. 47- కడుఱొంపిఁ గాలుజాఱుడు -

పు. 72 - 'మృడుఁడు వాలారగించుడు రిత్తకుడుక -

ఇట్టి ప్రయోగములు భారతాదులలోను బెక్కులున్నవి. విస్తరభీతిచే విడుచుచున్నాఁడను. 'కలఁగుఁడు' అను పదమే 'కలగుండు' గా రూపాంతరమును జెందినదనియు నావుడు మొదలగువానిలో ననుస్వారముగలదనుటకిది జ్ఞాపకమనియు నొక వాదము గలదు. ఇది సరికాదు. కలఁగుడు మొదలగు శబ్దముల తుది 'డు' ధాత్వర్థకము. ఇది ప్రాచీనకృతులలోనే హెచ్చుగాఁ గానవచ్చును. నావుడు, అనవుడు మొదలగు శబ్దముల తుది 'డు' ఆనంతర్యార్థకము. ఒకటి కళ, వేఱొకటి ద్రుతాంతము. ఈ రెండింటనుగూడ నరసున్న లేదు. 'కలఁగుడు'నుండి కలగుండు వచ్చెనేని యదీ ధాత్వర్ధకమగు 'డు' సానుస్వారమనుటకు జ్ఞాపకము గావలెనుగాని యానంతర్యార్థకమగు 'డున్'కుఁ గారాదు. అప్పుడు రెండు నొక్కటే యనవలెను. ఒకచోట ద్రుతమును ద్రోసిపుచ్చుటో రెండవచోటఁ జేర్చుటో చేయవలెను. అప్పుడు సంధులలోని చిక్కులను సమర్ధింపవలెను! ఈ కల్పనము తగదు. ఇంత యంగీకరించినను సర్వధాతు సాధారణమైన 'డు' ఎక్కడను బూర్ణానుస్వారమును బొందఁ జాలక యొక్క 'కలగుండు'లో మాత్రము చెందఁగల్గెననుట యుక్తముగాదు. అది యట్లే యగునేని కలఁగుఁడు 'కలఁగుండు' 'కలంగుండు' రూపములుండఁదగునే కాని 'కలగుండు' అని యుండఁదగదు. 'కలగుండు' శబ్దమునకు నే నిట్లు నిష్పత్తి చెప్పుదును. కల్హారము, కహ్లారము నున్నట్లు, 'హిసి' నుండి 'సింహ' మయినట్లు పారువము, పావురము నయినట్లు వర్ణవ్యత్యయముచే 'కలంగుడు' అని 'గు' కు బూర్వముండవలసిన యనుస్వారము 'గు' కుఁ దర్వాతఁబడి 'కలగుండు' అయినది. (కలఁగుడు శబ్దార్థ మాశబ్దమునకే పట్టి కలగుండు అయినది.) అనుస్వారవ్యత్యయ మేర్పడుటచేతనే 'కలగుండు' లో 'ల' తర్వాత నర్ధానుస్వారము లేదయ్యెను. మంచెళ్ళ వాసుదేవపండితుని వైకృతచంద్రికను, పట్టాభిరామ పండితుని పట్టాభిరామ పండితీయమును బ్రమాణముగాఁ గొందుమేని ప్రాచీనభాషా స్వరూపము పఱిపఱి యగును. ప్రాచీనతాళపత్రపుఁ బ్రతులలోఁ గొన్నింట మాత్రమే అనవుడు, నావుడు మొదలగు శబ్దములం దనుస్వారము కానవచ్చును. కాని, పెక్కు ప్రతులనుస్వారము లేకుండఁగూడ నున్నవిగదా! ఆ శబ్దములలో సున్నయుంచి వ్రాసిన ప్రతులకంటె, ఉంచకుండ వ్రాసినప్రతులే యెక్కువని నేను రూపింపఁగలను. ఇఁక నీ విషయము విడిచెదను.

శకటరేఫములు :- తిక్కనాదుల కాలమునకే ఱ-ర-భేదజ్ఞానము తార్మాఱు కాఁజొచ్చినట్టున్నది. అప్పటి శాసనములలోను గ్రంథములలోను గూడఁగొన్ని శబ్దములటు నిటు గానవచ్చుచున్నవి. ఱ, ర భేదమును బాటించి వ్రాసిన తాళపత్రఁపుబ్రతులరుదుగా నుండును. కాఁబట్టి తత్పరిజ్ఞానము మనకు యతి ప్రాసములను బట్టియు, శాసనములను బట్టియు, సాధ్యము. కూఁతుఱు అని శాసనములలో సర్వత్ర ఱ కాననగును. నేఁడందఱు 'కూఁతురు' అనియే తలంతురు. చేకుఱు, సమకుఱు, చేకూఱులు, బండిఱాతోను, సమకూరు, సాదురాతోను శ.ర. లోఁ గలవు. ఇది సరియా? శాసనములలో 'ఱేపు' బండిఱాగా నుండును. భారతమున నది రేయితో యతిలోనున్నది. ఱేపు బండిఱా యగుచో నేఁడు సాదు రా లుగాఁ దలఁపఁబడునవి పెక్కులు బండిరాలు గావలసి యుండును. తీగగదల్చినఁ బొదయెల్లఁ గదలును. 'సగము' అను నర్థమున గొందఱు ప్రాచీనులు 'అర' గాను మఱికొందరు 'అఱ' గాను ప్రయోగించిరి. 'అఱచందురుని క్రొత్తమెఱుఁగులు' హరివంశము 7 ఆశ్వా. (చూ.శ.ర.) అరచందురుడెందము లోఁ | జొరఁబారి - నరకుండు - హరినిటల, ఉత్తర హరివంశము 1 ఆశ్వాసము. మన సోమనాథుఁడును -

పు. 146-'దరహసితాస్యుఁడై తలుపులదిక్కు | నరగంట నొక్కింత యఱలేక చూచి' అని సాధురేఫముగాఁ బ్రయోగించెను. నెఱియ, యని శ. ర. కారులు పు.135 - నెరియల పాలైనఁ బురహర నీకు- సోమనాథుఁడు. శ.ర.కారులు, ఏర్పడు, ఏర్పఱుచు, ఏర్పరించు, వెల్వడు, వెల్వఱుచు, వెల్వరించు-ఇత్యాది విధముల 'పఱుచు' రూపాంతరమగు 'వరించు' ను సాధురేఫముగా గ్రహించిరి. యుద్ధమల్లుని శాసనము మూఁడవ యక్కరలో 'వెల్వఱించిన నశ్వమేధంబు' అని బండిఱా కలదు. 'తివురు' శ. ర. 'తివుఱు' అని యుద్ధమల్లశాసనము. ముందర, ముందఱ-లు భారతముననే కలవు వేఱువేఱుకాదు. పేరు + పేరు, పేరువేరు; పేర్వేరు, వేర్వేరు, అని ప్రాచీనుల ప్రయోగములు. ఎరఁగు ఎఱఁగు కలదు. పడమర పడుమఱు, రెండు దెఱఁగులను గలదు. రేఫద్వయ పరిజ్ఞాన మీ తెఱఁగున నఱవఱలై (అరవరలనియుఁ గొందఱనిరి) యున్నది. పర్యాప్తమయిన పరిశీలనమునకిది పట్టుగాదు. ఈ గ్రంథము ముద్రణమున నిట్టి చీకాకుగలశబ్దములు కొన్నింటిని గొన్నిపట్టుల నటునిటుగాఁగూడ నుంచితిని. మఱియు బండిఱా సంయుక్తమైనపుడు నన్నయనాఁట బండిఱాగానే వ్రాఁత యుండెడిది. మన సోమనాథుఁడు మొదలగువారు సంయుక్తమయిన సాదురాతో దానిని బ్రాసములందుంచిరి. నేఁటిలిపిలో సంయుక్తమయిన బండిఱా సాదురా గానే యున్నదిగాన నేనట్లే యుంచితిని.

అవగాగమము - నన్నయభారతమున పూరణార్థమున 'అవ' కానరాదు. 'అగు' కలదు. 'మూఁడగు పర్వము, ఇత్యాదులు. ఆ కాలపు శాసనములలో హెచ్చుగా 'అవు' కాననగును. 'మూఁడవునడపున, రెండవుకొడుకు' ఇత్యాదులు. అగు, అవులకు భేదములేదుగదా! తర్వాత, 'అవ' 'ఔ' అను రూపములు గూడ నేర్పడినవి[34]. సోమనాథుని కాలమునకే 'అవ' రూప మేర్పడినది.

పు. 123 - ఇచ్చమైఁ బదుమూఁడవేటి యంత్యమున' అని కలదు. 'అగు అవు' లున్నచో 'అగునేటి, అవునేటి' అని యుండును. 'అవ' రూపముమీఁదనే 'మూఁడవది' అయినట్టు 'మూఁడవేఁడు' అయ్యెను. పెక్కుచోట్లఁ బూరణార్థమున సోమనాథుఁ 'డవ' ప్రయోగించెను. ఏ వ్రాతప్రతిలోను 'అగు"అవు' రూపములు గానరాలేదు. లిపికారులు కవిప్రయుక్త రూపములను మార్చి తమకాలపు రూపములను లిఖించిరనఁగూడదు. కొన్నిచోట్ల నట్లు జరిగియుండవచ్చును గాని సర్వత్ర యట్లగుట యసంభవము. నన్నయ భారతమునఁ బెక్కు ప్రతులందు 'అగు' పాఠమే కానవచ్చుచున్నదిగదా!

మఱికొన్ని

పు. 145 'ఇగ మెడ దునియెదవు' - ఇందలి 'ఇగ' అరసున్న లేనిది. చిన్నయసూరి ప్రభృతు లిది సానుస్వార మనిరి

పు.159 'ప్రెబ్బొంత పెయ్యల పెద్ద' - పెరు- బొంత- పెద్దబొంత గలవాఁడు - పెర్బొంత- ప్రెబ్బొంతయయినది. పెర్గడ ప్రెగ్గడ అయినట్టు

పు. 147 - 'కల్లోలంబునొందె' - ఇత్యాదులు పెక్కులు -

పు. 179- 'అర్ఘ్యపణ్యములు' - ఇది పెక్కుచోట్లు: 'అర్ఘ్యపాద్యము' లనుటకు,

పు. 242 - అర్ధరాత్రి, అర్ధరాత్రమనుటకు పు.

147- పసిఁడిమయము, తమమయము,

పు. 156- పర్సవేదులు,

29, 31 కట్టనిచ్చు, కట్టఁగనిచ్చి

ఇట్టి వ్యవహారమునేఁడు లేదు. నేఁడు 'కట్నమిచ్చుట' యనియే కలదు. సోమనాథుఁడు 'కట్నమిచ్చుట' గూడఁ బ్రయోగించెను. సత్కరించి యొసఁగెడు వస్త్రమునకుఁగట్నమని తొలుతఁ బేరై నేఁడది వస్త్రములేకపోయినను, సత్కరించి యొసఁగు భూమ్యాభరణాదులకుఁగూడ వాచకమయినది. సోమనాథుఁడు కట్నమును వస్త్రసామాన్యవాచకముగాఁగూడ వాడినాఁడు

పు. 101. 'ఎట్టి కట్నంబైన నిచ్చి మ్రొక్కుచును' - ఇక్కడ కట్నమనఁగా 'ఉదికిన గుడ్డ' యే; కట్టునది (వస్త్రము), కట్టము, కట్టనము, కట్నము, అనురూపములఁజెందినది. కొట్టము, కొట్టనము, కొట్నము= ధాన్యము; రాటము, రాట్టము, రాటనము, రాట్నము= నూలియంత్రము- ఈ శబ్దము లిట్టివే పు. 145 'ఈఁజుమ్ముర' (తుమున్నంతముగాదు. )

పు. 65 'లేనెత్తి'

పు. 114 'ఏనుంగుగోల్పడె' కోల్పడె=పోయె,

పు. 194 అతఁడదృశ్యముగ = అదృశ్యముకాఁగా

పు. 195 చోళవాళి వేళవాళి, -

ఈ పదముల కర్థమెఱుఁగరాదు. 'చోళవాళిక కాక క్షోణీతలేశ- వేళవాళికిఁ గర్తవే' అని పండితారాధ్యచరిత్రమునను గలదు. దీనిఁగూర్చి శివతత్త్వసారపీఠికలో శ్రీ కె.వి. లక్ష్మణరావుగా రిట్లు వ్రాసిరి. "చోళవాళి = చోళపాళి, చోళరాజ్యము. వేళవాళి = వేళపాళి =కాలపాళి = కాలునిరాజ్యము. అని నే నర్థము చేసికొంటిని. కాని, అర్థము స్పష్టమనుటకు వీలులేదు.” కన్నడ కవిచరిత 1 వాల్యుం 24 పుటలో 'చోళవాళి' ని గూర్చి చర్చకలదు. అది యిట్టిది :- ఈ (చోళవాళి) శబ్దమును రైస్ చోళ రాజ్యమని భ్రమించినట్లు తోఁచుచున్నది. ఈ శబ్దమునకు ఋణము లేక బాధ్యత అని యర్థమని యీ క్రింది ప్రయోగములఁబట్టి స్పష్టమగుచున్నది. “జోళదపాళియంపగెదు దిల్లా ద్రోణనుంద్రౌణియుం - రన్నకవి. జోళదపాళిగెన్న సువనిత్తాఖ్యాతియం తాళ్దువెం - కర్ణపార్యుఁడు. సలహిదొడయన చోళవాళిగె తలెయ మారువుదొండుపుణ్య - కుమారవ్యాసుఁడు”- ఈ ప్రయోగముల నన్నింటిని జూడఁగా నా కిట్లర్ధము తోఁచుచున్నది. చోళవాళి = జొన్నల కయిన నిర్ణయము. వేళవాళి - జీవితకాలమున కయిన నిర్ణయము. అనఁగా, 'జీతము (తిండికి జొన్నలు) ఇచ్చినందులకుఁ జేయవలసిన సేవకే నీవధికారివి గాని, జీవితకాలపు విధానమున కెల్ల నధికారివి కా' వనియర్ధము. చోళ మనఁగా జొన్నలు. వాళి =వతను, ఏర్పాటు, నిర్ణయము. కన్నడమున 'చోళదవాళి' యని యుండుటచేత నది షష్ఠీసమాసము. ఆ కాలమున రాజసేవకులకు జీతము జొన్నలిచ్చుచుండి రనుటకు నన్నిచోడని ప్రయోగము - మునుమిడి వైరివాహినులముట్టి........... జొన్నలు గొన్న ఋణంబు నీఁగుదున్. కుమారసం. 11 ఆశ్వా. పు. 240 వదరు - 'ఒదవంగ వఱ్ఱేట నోడయుండంగ- వదరూఁదినట్లు' వదరు= సొఱకాయబుఱ్ఱ, నన్నయ ప్రయోగ మిది చూడఁదగును. 'అందు వైదర్భికి నొక్క యలాబూఫలంబును శైబ్యకు నసమంజసుండను కొడుకునుం బుట్టిన ఆ|| 'వరదుఁడైన యీశువరమున నిది యొక్క, | వదరు వుట్టె నెట్టి వరమొ యనుచు | దానిఁ బాఱవైవఁగానున్న' - అరణ్య. 3 ఆశ్వా..

పు. 219 బ్రహ్మపురులు = దేవాలయములలోని స్వస్తివాచక బ్రాహ్మణులు. “సోమేశ్వరదేవర బ్రహ్మపురుల సానుల వృత్తులు ఒక్కొకళ్ళకు ఖ 3” ఇది శక. 1075 నాఁటి నన్నిచోడ శాసనము[35] -మఱియు చేఁబ్రోలి శాసనమున 'దేవర బ్రహ్మపురి బ్రాహ్మలు 14 కు' ఇత్యాది.

పు. 40 కైకొనిపి (కైకొనఁజేసి) 'మేలుకొనిపి' - శ్రీనాథుఁడు.

207 పు. కూఁతురివరియింప' కూఁతురు శబ్దము ప్రథమేతర విభక్తులలో 'రు' లోపించునని కేతన యనెను. 'పరగఁగూఁతురు శబ్దంబుపై రుకార! మొక్క పలుకున పైనైన నుండుఁబాయు' నని విన్నకోట పెద్దన చెప్పెను.

పు. 121 మఱియట్లనేమెచ్చి - అట్లన్ అనికూడఁ బ్రాచీన ప్రయోగములు గలవు గాఁబోలును! 221 మల్లజియ్య, బొల్లజియ్య - దేవళములందర్చకులుగా నుండు తమ్మళ్లకు 'జియ్య' లని వ్యవహారము. పెక్కు శాసనములందుఁ దమ్మళ్లు 'జియ్య'లని పేర్కొనఁబడిరి.

30 పు దృష్‌ట్లు- ఈ రూపమును నన్నయకూడఁ బ్రయోగించెను. దృష్‌ట్లు భ్రష్‌ట్లు, రూపములు ప్రాచీనతరకవి సమ్మతములు.

95 పు. కొల్చురగ సంఘములు (కొల్చునురగ') అని యుండవలసినది.

69 పు. అనియొండె వేసరనాసరఁగన్న జననిఁగదాయని - వేసరను, ఆసరను అని ఛేదము. 'కుక్షింభరిత్వంబున క్షుత్‌క్షాములై వేసరియోసరి దాసరి గుంపు (శర-చూ) అని యాముక్తమాల్యదలోఁ గలదు. బసవపురాణమున 'ఆసరు' అవి యతిలో 'ఆ' కలదు. ఆముక్తమాల్యదలోఁగూడ 'వేసరి యాసరి దాసరిగుంపు' అని యుండవలయునేమో! 121 - నాసికము. దీని ముకారాంతముగాఁబలువురు ప్రాచీనకవులు ప్రయోగించిరి.

పు. 109 అదిగొమ్మనుచు = అదిగో+ అనుచు; అదిగో, ఇదిగో, వీఁడుగో, వాఁడుగో అను రూపములు గలవు. 'కొనుము' కు, కొమ్ము, కో, అను రూపములు గలవు. అదిగొనుము= దానిని గ్రహింపుము, చూడుము' అని యర్థము. 'కొనుము' రూపాంతరమగు 'కో' అగుటచే నాపదము కళగాని ద్రుతాంతముగాదు. 'అది| గో కానంబడియెఁ దెల్లగొల్లెనభంగిన్' అని వరాహపురాణమునఁ గలదు. పింగళిసూరన దాని ద్రుతాంతముగాఁ బ్రయోగించుట చింత్యము. 'మనసు మ్రుచ్చిలి చొచ్చిన మత్తికాఁడు | వీఁడు గొమ్మని- ఉత్తరహరివంశము. అదిగో ఇత్యాదులున్నట్టే అదివో, ఇదివో, వాఁడువో, వీఁడువో రూపములును గలవు. ఇక్కడ, 'పో పొమ్ము రూపాంతరము. వాఁడుగో, వీఁడుగో రూపముల యునికిని గొందఱు సందేహించుచున్నారు. పిల్లలమఱ్ఱి వీరన శాకుంతలమునను, జైమిని భారతమునను దానిని ప్రయోగించెను. వాఁడుగో మాయన్న వంశవర్ధనుడు | నేఁ డేల మది దప్పెనెలఁతరోనీకు, పల్నాటి వీరచరిత్ర - 'పేరు నేతిబీఱకాయ విలుచుకొందురు గాని చేరిచూడఁబోతె నెయ్యి చిక్క దందులో | ఈ రీతి బ్రాహ్మణుల పద్దు నెన్నఁగా నేమియుగద్దు! వాఁడుగో మాదరచెన్నవరుఁడె బ్రాహ్మణుఁడు' - చిలుకపాటివారి వచనములు

పు. 124, 178 'పశువరించు' ఈ పదము నన్నయ రచనలోఁగూడఁ గలదు. 'నీ యట్లు క్రూరులై నృపతులఁ జెఱఁబెట్టి పశువరించుచుఁ బశుపతినుమేశు! వరదుఁ బూజించినవారును గలరె' సభాపర్వ. 1 ఆశ్వా. 'తనయుఁబశువఱిచి తద్వప | గొనివేల్చినఁ జూచి' అరణ్య. 3 ఆశ్వా. మొదటి ప్రయోగమున హింసించు బాధించు అనియు, రెండవదాన యజ్ఞపశువునుగాఁ జేసి చంపు అనియు నర్థము పొందుచున్నది. పశువఱుచు, 'పశువరించు' రూపాంతరములు గావచ్చును. [36]'పశువడు' కలదో లేదో! సోమనాథుని ప్రయోగములకు మొదటి యర్థమే పొందుచున్నది. 'పశువరింపఁగఁ జంప' - 'పశువరించుచుఁ గొర్లపాలు సేయుచును' అనుచో హింసించు బాధించు అనియే యర్థమగును.

పు. 85 విగుర్వణము. నన్నయ 'విగుర్వించు' అనియు నన్నిచోడఁడు 'గర్వవిగుర్వణంబులన్' అనియు నీ పదమును బ్రయోగించిరి. 'గుర్వీ ఉద్యమనే' అని ధాతుపాఠమునఁ బరిగణితమయిన ధాతువున నుండి పయిపదములు పుట్టినవి. గుర్వీధాతువుననుండి 'గూర్వణ' మని రూపమేర్పడునుగాని 'గుర్వణ' మని యేర్పడదు గావున నిది కర్ణాటదేశి పదమని కొందఱందురు. గుర్వు, గుర్వించు, అగుర్వు, అగుర్వించు అనునవి తద్భవరూపములగునని నేఁదలంతును. 'విగుర్వించు' 'విగుర్వణము' తత్సమములనియే నా తలఁపు. కావుననే నన్నిచోడఁడు 'గర్వవిగుర్వణంబులన్' అని సంస్కృత సమాసమునఁ జేర్చెను. గుర్వు, గుర్వించు మొదలగు తద్భవశబ్దముల సంబంధముచే 'విగూర్వించు, విగూర్వణము' అని యుండవలసిన తత్సమ శబ్దములను లేఖకులు 'విగుర్వించు, విగుర్వణము' అని లిఖించియుందురు. 'గు' ఎట్లును గురువేకాన 'గుర్వణ' మన్నను 'గూర్వణ' మన్నను బద్యములందుఁ జిక్కులేదయ్యెను. ఈ తలఁపు తోడనే నేను 'గు (గూ?) ర్వణ' మని యుంచితిని.

పు. 67 తొంగిళ్ళు - శ. ర. లో నీ పదమునకు నీటిబొట్లు, నూనెబొట్లు అని యర్థము కలదు. భల్లాణ చరిత్రలోనివిగా బసవపురాణములోని యీ ద్విపదలే యపపాఠములతో నందుద్దృతములయ్యెను. (శబ్దరత్నాకరమునఁ బెక్కు పట్టుల బసవపురాణ పండితారాధ్యచరిత్రములలోని ద్విపదలోని ద్విపదలే భల్లాణచరిత్ర ద్విపద భాగవత పతివ్రతాచరిత్రములలోనివిగా నుద్దరింపఁబడినవి. ఆయా ద్విపదలాయా గ్రంథములందు నాకుఁ గానరాలేదు. శ. ర. లో గ్రంథ సంకేత వివరణ పట్టికలో భల్లాణచరిత్రము వాలేశ్వరునిదిగాఁ జెప్పఁబడినది. వాలేశ్వరునిది పద్యకృతి) ఇక్కడ ముద్రితమయిన పాఠమును శ. ర. పాఠమును జూచినఁ దెలియఁగలదు. తలంటునప్పుడు పసిబిడ్డలఁబండుకొనఁబెట్టుటకయి చాఁచిన యూరుద్వయమునకు దొంగిళ్ళని పేరు. 'తొంగిళ్ళపై నిడి లింగమూర్తికిని నంగన గావించు నభ్యంజనంబు' అను ద్విపదను గన్నడకృతిలో భీమకవి యిట్లు పరివర్తించినాఁడు. 'ఎరడుతొడగళమేలె పరమన | నిరిసిసలె యభ్యంగనవ నా| చరిసు' మఱియు 'అంగిటి ముత్లొత్తునందందవ్రేలఁ - దొంగిళ్ళఁ గార్నీరు దో నెత్తిమిడుచు' అనుదానికి 'అంగుళియ ముళ్ళం సుదతితం నంగుళది నొత్తువళుతుంగో త్సంగదిం సురిదంబువనితం నెత్తి యొళెరెవళు.”

శబ్దరత్నాకరకారులు మన సోమనాథుని గ్రంథములను స్వయముగాఁ దలస్పర్శముగాఁ బరిశోధించినట్టు గానరాదు. అట్లు శోధించియుందురేని బసవపురాణ, పండితారాధ్యచరిత్రములలోని ద్విపదలనే యన్యగ్రంథములలోని వానిఁగా నుద్దరించుటగాని యనేకశబ్దములను విడుచుటగాని సంభవింపదు. సోమనాథుని గ్రంథములు మొదటి తరగతిలోఁ జేరవలసినవయినను వారైదవతరగతిలోఁజేర్చిరి. ఇంతవఱకు నేఁజూపిన శబ్దములు కొన్ని శబ్దరత్నాకరమునఁ జేరనివే. నిఘంటువులలోఁ జేరనివి నూర్లకొలఁదిగా శబ్దములీ సోమనాథుని గ్రంథములలో నింకనుగలవు. ఈ బసవపురాణమున స్థూలదృష్టిని నాకు గోచరించిన వానిని గొన్నింటి నకారాద్యక్షరక్రమమునకుఁ దార్చి యిక్కడఁ జూపుచున్నాఁడను. శబ్దరత్నాకరమునకందనిశబ్దములు, అందినను దప్పు రూపముతో నున్నశబ్దములు తప్పుటీకతోనున్న శబ్దములు, సందిగ్ధరూప సందిగ్దార్థములతో నున్నశబ్దములు నిందుఁగలవు.

శబ్ద విశేషములు

పు. 46 అంకంబువాఁడు = ముద్రధారి

పు. 234 అక్కిలించు = అక్కలించు,

పు. 71 అచ్చన = అర్చన,

పు. 120 అడఁకు= ఒదుఁగు,

పు. 134 అ(?)డచాళ్లు = రాజ్యాంగోద్యోగులు, పు. 153 అడుకు = దాఁచు

పు. 75 అడువరి = ఆడువరి, వప్రము,

అడ్డాయుధము = ఆయుధభేదము..

పు. 162, అరసు= రాజు, 'రాజన్' శబ్దము, అఱవమున 'అరశన్' కన్నడమునను తెనుఁగునను అరసు 'దేవ-రసు నిర్ధనయ్య నిరాళదేవయ్య' పండితా. పు.3

పు. 73 అరివియగు= బయలగు, (అఱివి = శిథిలము చూ. కాశీఖండము)[37]

పు. 113 అరుచు= చెల్లించు,

పు. 146 అఱగొడైతనము = (చూ.శ.ర.) అలగొండెతనము,

పు. 68 అఱిమి = అజీర్ణవ్యాధి, అఱుకువ రూపాంతరము అఱు+ ఇమి శ.ర. అరిమి చూచునది.

పు. 220 అఱప =చేని మంచె

పు. 105, 134 అఱిముఱితనము = తొందర,

పు. 138, 139 అలుకు = చల్లు,

గీ. నెగడు పేర్బిందులనువిడినీరఁ బ్రియుఁడు |
    గరజ హలముల మైపూఁతగలయఁ గలఁచి
    కామబీజములలుక వేగమున మొలచు
    మొలకలన మేని నిండ ముత్పులక లెసఁగె.

-కుమారసం. 8 ఆశ్వా.

పొంగారెడు నేతికిఁబయిపై నీరలికినయట్లపోలె నిష్ఫలమయ్యెన్. దశకుమార చరిత్ర, 3 ఆశ్వా. 'పరువంపుఁ బుప్పొడి బాగుగాఁదీర్చిన యలకలపైఁ బొలుపార నలికి, ఎఱ్ఱన హరివంశము.

పు. 69 ఆదట = తృప్తి.

పు. 8 ఆదరికము = ఆదరము, (కిట్టెల్ కన్నడనిఘంటువు చూచునది) పు. 99, 191 ఇబ్బంది = అజ్ఞాని

పు. 109 ఇఱివిరి (ఈ పాఠమే యుక్తము) = ఇఱియుట విరియుట - సంకోచ వ్యాకోచములఁ జెందుట, మినుకుమినుకు మనుట,

పు. 132, 229 ఇలుపుట్టు = ఇలువరుసను వచ్చినది.

పు. 80 ఉడుపనేయి = ఉడుమునేయి, పు.

72 ఉద్దెసించు = ఉద్దేశించు, పు.

155 ఉనుపరి = స్వతంత్రుఁడు,

పు. 130, 198, 190, 200, 202. ఎగుదు= ఎగిసి వచ్చు, దూఁకివచ్చు,

పు. 133 ఎడయునుబుచ్చు,

పు. 45 ఎడవుచ్చు,

పు. 68,129 ఎడవోవు = కుంటెనతనమునకుఁ బంపు, కుంటెన తనమునకుఁ బోవు,

పు. 16 ఎరివు= బాధ,

పు. 43 ఏట = గొఱ్ఱె,

పు. 114 ఏటము = సమృద్ధము,

పు. 189 ఐదవెట్టు = ముట్టు.

పు. 80 ఒడిపిలిపాసెము = (శ.ర. లో నిది యప్రయుక్తమని కలదు.) పండఁబాఱినను బచ్చిగానున్న ధాన్యమును దంచిచేసిన బియ్యముతో వండిన పాయసము,

పు. 74 ఒడ్డణము = ఒడ్డాణము,

పు. 139 ఒమ్ము = ప్రియమగు,

పు. 165 ఒఱగోయు = ఒఱనుండిలాఁగు,

పు. 146 ఓజు = అధిపతి, గురువు, ఒజ్జ,

పు. 32 కంభకట్టు = స్తంభములకుఁగట్టి చేయు నలంకారము. మీఁదఁ గట్టి చేయు నలంకారము మేలుకట్టు;

పు. 125 కట్టిల్లు = అంటుకొను, పు. 72 కట్టుగ్రము = కడు+ ఉగ్రము,

పు. 103 కట్టుగ్రుఁడు,

పు. 100 కట్నము = వస్త్రము,

పు. 116 కడయింటి పొడున = అతిసంసారుఁడయిన పోటుమానిసి,

పు. 102 కనుమరి = కమ్మరి,

పు. 7 కన్నెఱుఁగు = జాడయెఱుఁగు,

పు. 150 కలకేత విద్య,

పు. 149 కలకేత వేషము = ఇంద్రజాల విద్య,

పు. 112 కల్లచ్చులు = తప్పుటచ్చులు,

పు. 101 కల్లవెల్ల = గజిబిజి,

పు. 188 కవణము = పొర, అడ్డు,

పు. 183 కసిమసి = గజిబిజి (గసియుమసియు)

పు. 102 కాకఱపులు = వదరులు,

పు. 120 కింగాణము = నైచ్యము,

పు. 72, 163, 232 కుడుక = కోర, గిన్నె,

పు. 178 కుతగలు[38] = కుతజ్‌జ్ఞులు, దుర్విజ్ఞానులు,

పు. 107 కాయకము = వర్తకము, పనిపాటు, ఇది సంస్కృత సమాసమున 'కాయకలబ్ది' ఇత్యాది విధములఁ గలదు. 'ప్రాయపుఁ గాయకుల్ వలె' విజయవిలాసము

పు. 112 కొట్నము = ధాన్యము.

పు. 13 కొత్తడి = స్త్రీ సమూహము, "పుణ్య చరిత్ర గులాగ్రగణ్య గొత్తడి సకలంబు” ఉద్యో. ప. పు. 210 కొత్తి = స్త్రీ, (కొత్తి, గోఁతికూడా ఉన్నది. హరివం)[39]

పు. 145 కొయ్యనగాండ్రు = మూర్ఖులు,

పు. 112 కొసనక = కొసనక్క (దేవత పేరు)

పు. 84 కోడిఱెప్ప = ఱెప్పలో దుర్మాంసము పెరుగు నేత్రవ్యాధి,

పు. 124, 230 కోలాస = రిత్తకోరిక, దురాశ,

పు. 105 క్రిగ్గాలి = క్రిక్కుగాలి, తప్పుగాలి.

పు. 245 క్రియగొను = పనిగొను.

పు. 191 క్రుమ్ముడి = కుఱుముడి (క్రొమ్ముడి శబ్దములేదు)

పు. 85 క్రేకన్ను = క్రేవకన్ను, కడచూపు, కటాక్షము ('క్రే' తర్వాత అరసున్న లేదు. క,గ, కాలేదు).

పు. 237 క్షణియించు = అర్పించు.

పు. 30 గజ్జెపరుపు = ?

పు. 216 గట్టిగ బావులు = ఏతపు నూతులు.

పు. 32,146 గనియ = గని? కండపట్టు? 'అన విని మేటి ధర్మమగు నట్టిది యెయ్యది, యెట్టిదెప్పుడున్ | గనియగఁ బండియుండు' అరణ్యపర్వము ఆశ్వా. శ. ర. లో ' కనియ= మాఁగబండు ” అని యీ ప్రయోగమే యాధారముగాఁ గలదు. ఇక్కడను 'గనియ' కాఁ దగునని నాతలఁపు. 'ఆ చేను గనివలెఁబండినది' అనుట కలదు.

పు. 183 గఱిగొను = ముతైపుఁ జిప్ప జలబిందువును దాల్చు

పు. 97 గామిడి= గడుసరి

పు. 71 గుడగుడలు = సంశయము.

పు. 32, 224 గుడ్డ = గుట్ట. పు. 102 గెలిగొను = గేలిగొను.

పు. 65 గొంతి = కాంత

పు. 240 గొఱుపడము = కంబళి

పు. 74 గోరంతప్రొద్దు = ఓరంతప్రొద్దు

పు. 234 చక్కిలించు = చక్కిలిగింత చెందు

పు. 160 చిఱలువొడుచు = (పశువులు) నేలగోరాడుచు రేఁగిపరువెత్తు.

పు. 209 చెరలు = ఉప్పొంగు.

పు. 69 చేకళ్లు= చేతిముద్దలు.

పు. 222 జంగెత = జంగమురాలు

పు. 61 జక్కొల్పు = సమకూర్చు.

పు. 224 జరగడుగు= జలగడుగు, (నేఁడు జలగడుగుజాతి వారనఁబడు వారికిఁ బూర్వము 'జరగడుగువా' రనియే పేరయి యుండును)

పు. 107 జాడము = తుండము?

పు. 134 జాణత = చాతురి

పు. 71 జాత్ర = జాతర, ఉత్సవము.

పు. 107 ఝాళి సేయు = జాడించు.

పు. 74 టెంకణము = గోపురము?

పు. 215,226 తండు = నిస్సారము.

పు. 195 తందె = అయ్య.

పు. 76 తథ్య = సత్యము.

పు. 68,119 తఱుచంటి = దుడుకువాఁడు. శ - రలో తఱుసలియని యీ పదము గ్రహింపఁబడినది. తఱుసలి పై నౌపవిభక్తిక ప్రత్యయముచే తఱుసంటి మాటలు' అని నన్నయ ప్రయోగించెనని సీతారామాచార్యులవారు దలంచిరి. కుమారసంభవమున 'తఱుచంటి దన్ను నెదిరిని నెఱుఁగఁడు' అని 'తఱుచంటి' యే ప్రకృతిగాఁగానవచ్చుచున్నది. సోమనాథుని ప్రయోగములు నన్నిచోడ ప్రయోగరీతినే సమర్థించుచున్నవి. పు. 23 బగుతులు= భక్తులు, బగితియుఁ గలదు.

పు. 26 బట్టకబయలు = బట్టబయలు

పు. 109 బడగు = వెడఁగు, పొగరుఁబోతు.

పు. 70 బడరుఁడు = ఈశ్వరుఁడు

పు. 160 బడిసివైచు = చేతులార్పు.

పు. 112 బడుగుపనులు = దాస్యము.

పు. 209 బరులు = చిఱుడొక్కలు

బనత = నొసలు ? దౌడ?

పు. 20 బహురూపులు = వేషములు, వేషగాండ్రు.

పు. 115 బుగ్గరించు = విచ్చు.

పు. 111 బులుసరితనము = దంభము

పు. 70 బెడంగు = మూతి వెడల్పయినది?

పు. 70 బొత్తిస = ముసుఁగుపైఁట.

పు. 68, 143 బొప్పఁడు, బొప్ప = బాబు

పు. 178 మజ్జనబావి = జలకమాడుబావి

పు. 229,74 మట్టగించు = క్రుళ్లగించు.

మడిగూడు = ప్రసాదము.

పు. 130 మదుకు= వణఁకు.

పు. 184 మర్గడము = మలవిసర్జనము?

పు. 133 మర్మమేలము = రహస్యపుఁజనవు.

పు. 172 మఱపడు= చాటుపడు, మఱుపడు -రూపాంతరము

పు. 112 మసనక = దేవత పేరు

పు. 216 మాదర = మాదిఁగ (మేదరకాదు) మాదర చెన్నయను గూర్చి

క. చెన్నయ మాలఁడుగాఁడే
   మున్ను మహాదేవుఁగొలిచి ముక్తుండయ్యెన్

జన్నమున శివుని దక్షుఁడు
మన్నింపమిఁజేసి పచ్చిమాలండయ్యెన్

- శివతత్త్వసారము

పు. 101 ముట్టుపాటు= స్పర్శము.

పు. 209 మున్నుడుక = ?

పు. 198 ముట్టము, తిరుముట్టము = ప్రతిష్ఠాపీఠము.

పు. 172 మేడెమువొడుచు = మేడము వొడుచు శ. ర. చూ.

పు. 113,215 మొగవాడ = దేవాలయాదులలో దేవుఁడు మొదలగువారికి ముందుగట్టెడు నడ్డుతెర, ముఖపటము.

పు. 158 మోహణము = ఖడ్గపుఁబిడి.

పు. 134 మ్రింగనఁగొండి = మ్రింగివేయువాఁడు.

పు. 74 తాటనవుచ్చు = ?

పు. 117, 118 తాపసి = తపస్వి.

తుల్కాడు = దైవాఱు, తుల్కాడు, తొల్కాడు, రెండు రూపములును వ్రాఁతలలో గలవు.

పు. 97 తొంగిళ్లు = బిడ్డఁబండుకొనఁ బెట్టుకొనుటకై చాఁచిన యిరుదొడలు.

తొరుగు = స్రవించు.

పు. 189 త్రట్లు = కళలు.

పు. 158 త్రస్తరులు= పరిహాసములు

పు. 151 దయపడు= కరుణించు.

పు. 112 దారలువట్టు = బాకాలూఁదు.

ధర్మకవిలె= అనుగ్రహపాత్రుఁడు.

నంగ= స్త్రీ.

పు. 144 నంజు= సందేహించు.

పు. 234 నడబాళ్లు = రాజ్యాంగోద్యోగులు. పు. 200 నిట్టపాటు= నిలువునఁబడుట.

పు. 160 నిట్రించు= నీల్గు

పు. 107, 147 నెట్టోడు= భయపడు, గజిబిజిపడు.

పు. 124 నెఱవణి = ప్రశస్తి,

పు. 84 పక్కిళ్లు = ప్రక్కలు.

పు. 135 పటవలి=వస్త్రము.

పు. 164 పడికివల్చు = దుర్గంధముగొట్టు.

పు. 61, 152 పడిగము= పళ్లెరము, పాత్రము ( తమ్మ యుమియునదే కాదు)

పడిహారి = పణిహారి, పడితెచ్చువాఁడు, వేత్రహస్తుఁడు.

పు. 21 పదకవాదము = కల్పితవాదము, కవితాకల్పనము.

పు. 212 పదరు = దబ్బనము?

పు. 238 పదువ = తృణభేదము.

పు. 64 పనువు = పనవు

పు. 140, 108 పన్న= అధముఁడు, సేవకుఁడు.

పు. 228 పన్ను = పల్లము, చౌడోలు, (ఏనుంగు పన్నగునే గాడిదలకు)

పు. 66 పరిచ్ఛేది = శిరచ్చేదసన్నద్దు (ఁడు) రాలు.

పు. 86 పరిసెనమువాఁడు = స్పర్శచేయువాఁడు.

పు. 124, 178 పశువరించు = హింసించు.

పు. 38, 232 పసిగ= పసి ( పసిక అనియు)

ప్రామిఁడి = గయ్యాళి, ధూర్తుఁడు.

పు. 55 పాదిగ = పాతిక.

పు. 86 పాయగొమ్ములు = చెట్టు పంగటికొమ్మలు 'పాయగొమ్ముల నల్లఁ బట్టు దగిల్చి యక్కొన యాకుపై వెండికోరవెట్టి' - ఉత్తరహరివంశము.

పు. 179 పిట్టపిడ్గఱ = పిట్టపిడుగు,

పు. 242 పుప్పించె= పుచ్చఁజేసెను. పు. 18, 20 పురులు = సౌందర్యము, కీర్తి, ధనము.

పు. 82 పూన్చు= పూజించు

పు. 43 పెంట్రుక = పెట్రిక.

పు. 31 పెంట= పేఁట.

పు. 43 పెఱికసెట్టి= శాసనములందు 'పెఱుక సెట్టి' కలదు.

పు. 22 పేయ= పెయ్య.

పు. 240 పొట్టపోర్వు= కడుఁజేరువ.

పు. 128 పోలగు= ఒప్పు

పు. 103 పోడేర్చు= భూమిని గృష్యనుకూలముగాఁ జేయుటకై పుట్ట పొదరు మొదలగువానిఁగొట్టి తగులఁబెట్టు.

పు. 71 పోలెలు= పోళీలు.

పు. 60 మనికులు= స్థిరులు.

పు. 189 ప్రేలగింపులు= ప్రేలుటలు.

పు. 82 పాదొ(దు)ట్రు = సాలెపట్టు.

పు. 202 భ్రమరించు = చుట్టివచ్చు.

పు. 22, 226 లింగపసాయితము= లింగప్రసాదితము. వీరశైవులు చేత ధరించు ఖడ్గము.

పు. 74 వంపుడుగట్ట= కరకట్ట

పు. 19 వట్టిపాటు= వ్యర్ధము

పు. 123 వదిగొను = వరుసపెట్టు

పు. 204 వయ్యు = వైచు.

పు. 136వ ఫుట్‌నోటు చూచునది. (వలయెత్తి నీటిలో వయ్యంగఁ దడవ, వలఁగొని మఱునాఁడు వయ్యంగఁ దొలుత.)

వరువుడు, వరుపుడము, వరువు, వర్వు = దాస్యము.

పు. 149 వలివేగము (వలవేగము, అనియుఁగలదు) = కడువేగము. పు. 245 వర్షాఫలము= వడగల్లు (వర్షోపలమనుటకు వర్షాఫలమనెను)

పు. 171,190 వసది= జైనమఠము (నేఁడు 'బస్తి' యనఁబడును).

పు. 33 వాతపూరణములు= గాలి గుమ్మటములు.

పు. 62 వాళగ్రోలు = పిల్లనగ్రోవి?

పు. 153 విడియలు= రొక్కపు జాలెలు.

పు. 191 విసమాల్చు = మాయించు.

పు. 138 లెంగిలిబంటు= అధమభృత్యుఁడు.

పు. 46, 103 వెండీఁడు= బొమ్మలాడించువాఁడు.

పు. 81 వెడ్లుబుడ్లువెట్టు = నిశ్చేష్టమగు

పు. 224 వెరవిండి= వెరవెఱుంగనివాఁడు.

పు. 42 లెంగులు= అధములు.

పు. 180 వేఁడివెల్ల= వేఁడిబూడిద

పు. 69 వేసరు+ ఆసరు= ఆయాసముచెందు, ఉజ్జగించు.

పు. 22 శివమరులు= సివమెత్తుట.

పు. 112 శివశరణులు= శివుఁడు శరణముగాఁ గలవారు.

పు. 74 సువిధానులు= సువిధానమనుచు హెచ్చరిక చేయువారు.

పు. 214 సడగరంబు = సంభ్రమము, ఉత్సాహోద్రేకము.

పు. 122 సుళువు= తిరుగాటము.

పు. 125 సూనెగాఁడు = కటికవాఁడు.

పు. 130 సొకనాసి= దేవళములో గర్భాలయపు ముందటిపట్టు, 'సుకనాసి' యని శాసనములు.

పు. 240 సోడంబు = ఖడ్గము?

పు. 46 హేళగీఁడు= కథలు చెప్పువాఁడు?

మఱియు

పు. 62 పుటలో ధూకళి, ఝంకళి మొదలగు నృత్యపరిభాషా పదములును, పు. 90 పుటలో మొగచాళము, నవఠాణము, సాళి, పెళ్లాపెళ్లి మొదలగు సంగీత పరిభాషాపదములు పెక్కులును దుర్‌జ్ఞేయములుగా నున్నవి. వాని నెల్ల నేనిక్కడఁబేర్కొన నయితిని.

మఱియు,

అనుగులము - అనుగలము, కొమ్ము - కొమ్మకసువు - కసపు, కడువ-కడవ, వరువుడు -వరవుడు, కుఱుఁగలి-కుఱఁగలి, చనువు- చనవు, పనువు - పనవు, గొడగు- గొడుగు, పెంట్రుక -పెంట్రిక, రూపములు గలవు. ఇందుఁ దొలిరూపములు ప్రాచీనములు. మోఁకాలు, మోఁచేయి, శబ్దములకు, శ.ర.లో మోఁద+కాలు, మోఁద+చెయి, యని నిష్పత్తులు గలవు. మ్రోఁకాలు, మ్రోఁచెయి, యని ప్రాచీనరూపములు. మ్రొగ్గు+కాలు, మ్రొగ్గు+చెయి, అని వాని నిష్పత్తులు. మ్రాను-మాను, మ్రోడు - మోడు, మ్రబ్బు - మబ్బు, స్రడ్డ-సడ్డ, మొదలగు రూపములు నున్నవి. ఇందును దొలివి ప్రాచీనములు. అట, ఇట, ఎట, ఆడ, ఈడ, ఏడ, అచట, ఇచట, ఎచట, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, శబ్దములు, కళలుగాను ద్రుతప్రకృతికములు గాను గలవు. పయి శబ్దములు వ్రాఁతలలో నిరుదెఱఁగులను గలవగుటచే నేను నిరుదెఱఁగులను నుంచితిని.

ఇప్పుడు పేర్కొన్నవిగాక యింకను బెక్కుశబ్దములు శబ్దరత్నాకర సంస్కారమున కుపకరించునవి యిందుఁగలవు. విస్తరభీతిచే నింక విడుచు చున్నాఁడను.

ప్రాఁత పలుకుబళ్లు

అర్వాచీనకవుల కృతులలోనంతగాఁగానరాని వానిని బ్రాఁతపలుకు బళ్లను గొన్నింటి నిక్కడఁ జూపుచున్నాఁడను.

ప్రవేశింపఁదడవ (ప్రవేశింపఁగానే) 147 బాహుయుగ్మముఁ జాపఁదడవ (చాఁపఁగానే) ఇత్యాదులు పెక్కులు. ఎర్రాప్రెగ్గడ హరివంశమునఁగూడ నిట్టి పలుకుబడి గలదు.

పు. 66 కాన నా తప్పునఁగాఁజేసి ( నా తప్పువలన) తలఁచు తలంపుఁ - బలుపునఁగాఁజేసి - (బలుపు వలన). పు. 85 వెండియు నక్షిరోగంబొ (వేఱొక యక్షిరోగమో)

పు. 236 అరుగుము భక్తజనాళిలో వెడలి (లోననుండి వెడలి).

పు. 179 ఆమటఁ బదిట, (పదియామడల దూరమున)

పు. 171 అట వార్త గలిగి (అని వినికిడి యేర్పడి)

పు. 75 కొఱడుగొట్ర, మ్రానుమట్ర, బడియబట్ర, కట్టెగిట్టె, సదసట్ర, నలినట్ర, కస్వుగట్ర, ఈ జంటపలుకులలో ద్వితీయముల కర్ణము లేదను కొందును. శ.ర.లో 'మట్ర' టీక చూచునది.

పు. 70 తల్లివి గలుగంగఁ దనకు రోగంబు (తనకు=నాకు)

పు.11 నందీశ్వరుఁడు సేయు నవ్యతపంబు - ఇచ్చోఁబ్రాత పలుకుబడి చొప్పున 'నందీశ్వరుఁడుచేయు' అని యుండుననియు నా పాఠమే గ్రాహ్యమనియుఁ దలఁచితినిగాని పెక్కుప్రతులలోఁ దొలిపాఠమే యుండుటను 'మీరు సెప్పినయట్లు మృడునకుఁబాలు, - నీవు దూపొడిచిన ఠావుదక్కఁగ, ఇత్యాదులగు బహుప్రయోగములుండుటను జూచి యిదియు గ్రాహ్యమే యనుకొంటిని. ఇట క్రిందిమాటలకేఁ దప్పువట్ట | నిటమీఁద సిరియాలు నీశ్వరు వార్త! మఱచి యాడితిరేని మా భక్తులెడకు | మఱి మీరు హరునికోమటి తోడివారు (సిరియాలుని యొక్కయు నీశ్వరుని యొక్కయు, వార్త, హరుని తోడివారు కోమటి తోడి వారును

పు.20 భక్తియు నీవును బడ్డట్లు పడుము, - ఇత్యాదు లనేకములు గలవు. సోమనాథుఁడు తన గ్రంథములందుపయోగించిన భాష, ప్రాచీనత చేతను, గర్ణాటాంధ్రదేశముల కూడలిపట్టున వాడిక కలదగుటచేతను, మఱియు సోమనాథుని బహుదేశభాషా పరిజ్ఞానముచేతను, వైలక్షణ్యముగాంచి నేఁడు మధ్యాంధ్ర దేశవాస్తవ్యులయి, కర్ణాటద్రవిడ భాషాపరిచయ మించుకయుఁ బొందని వారికిఁగొంత వింత గొల్పుచుఁగొన్ని పట్టులఁ గొఱుకఁబడనిదై యుండును.

అనుకరణములు

సోమనాథుఁడొండు రెండు పట్టులందు నన్నిచోడని ననుకరించెను. నన్నిచోడకవి సోమనాథకవికంటెఁ బ్రాచీనుఁ డగును.

సీ. నేలయు నింగియుఁ దాళముల్ వాయింప
                నెండమావులఁబట్ట బండతలయు
    మ్రోఁకాలు ముడివెట్ట రోఁకటఁ జిగుళులు
                గోయఁ జట్రాతిపైఁ గ్రుంగ నిడుపు
    లేక చిత్రము వ్రాయ నాకాశమునఁ దాఁప
                రమునిడ మంచుఁ గుంచమునఁ గొలువ
    నేనుంగు పురు డోమ ఱా నారగొన గాలి
                గంటిడ నిసుమున గట్టుదాల్ప

గీ. నీరినడుమఁద్రెంప నేలఁదెన్నుండి చే
    వెల్పఁ గలియుఁద్రచ్చి వెన్నగొనఁగఁ
    గడవనేర్పు గలిగి కందువుమానెఁడై
    కత్తిగంటులయిన యత్తగంతు ? - కుమార.

ద్వి. నెట్టణ నేలకు నింగికి సూత్ర
      పట్టమ్రోఁకాళ్లకు బట్టతలలకు
      ముడివెట్టఁ దన నీడ గడవంగఁబాఱఁ
      వడి నెండమావుల కడ గళ్లుగట్ట
      పాయక రెండుగాఁ బాటెడునీరు
      వ్రేయఁ బుల్జున్ను గోరో యని యమ్మ
      ఱా నారయొలువఁ జట్రాతిపైఁ గ్రుంగ
      నేనుంగు పురుడోమ నిసుము త్రాడ్పేన
      లలిగొనదెసలు తాళములు వాయింపఁ
      జెలఁగుచు రోఁకటఁ జిగుళులు గోయఁ

గలివెన్న వుచ్చఁ గొండలు దొంతిఁబేర్ప
నిల మంచు గుంచానఁ గొలువ రేఁబవలు
సేయ నాకసమునఁ జిత్రరూపములు
వ్రాయ వాయువుఁ బట్ట వడగళ్ల గుళ్లు
గట్ట వెన్నెల గుంపుగాఁజేయ వచ్చి
పుట్టినప్పుడె నేర్చు బుద్ధులప్రోఁక

-పండితారాధ్యచరిత్రము.

ఇట్టి వింక నొండు రెండు పట్టులందుఁ గలవు. మల్లికార్జున పండితారాధ్యుల శివతత్త్వసారపుఁబద్యములు పెక్కులు పండితారాధ్యచరిత్రమున ద్విపద రూపమున దాల్చినవి. అది యసంగతముగాదు. మఱియు నాగమగ్రంథములలోని శ్లోకములు పెక్కులు బసవపురాణ పండితారాధ్యచరిత్రములందుఁ దెలిఁగింపఁ బడినవి. ద్రవిడభాషలో 'తిరుతొండర్‌తొఘై' యను పేరఁగల లఘుస్తుతి కిందనువాదము గలదు.

“పరగు మహాభక్తచరితలు నాద
 భరితమై చనఁ దిరుపాటలు సేసి
 పాడుచు నొక్కొక్క భక్తుని చరిత
 వేడుకఁ బొగడునవ్విధమెట్టులనిన. పు. 133

ఇది దాని యుపక్రమము. కర్ణాటభాషలో బసవేశ్వరుఁడు మొదలగు వారు రచించిన గేయ వచన రూపగ్రంథములనుండి కూడ నీతఁడు గొన్ని పట్టులను దెలిఁగించి యుండవచ్చును. ఆ గ్రంథములప్రఖ్యాతములగుటచే వానిని గుర్తింపఁ గాదు.

ఇఁక మన సోమనాథుని రచనములను బలువురనుకరించిరి. శివకవులెల్లరుననుకరించినవారే. బమ్మెరపోతరాజు, శ్రీనాథుఁడు మొదలగువారి గ్రంథములలోఁగూడ నప్రయత్నముగా సోమనాథుని రచనములు దొరలినవి.

క్షీరాబ్దిలోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరుద్రావంగఁ
జూతఫలంబులు సుంబించు చిలుక
భాతిఁ బూరుగుమ్రానిపండ్లు గన్గొనునె
రాకామల జ్యోత్స్నఁద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిద్రావ
విరిదమ్మివాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలివిరుల
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపందిచనుసీక నెఱుఁగవు గాక ! పు. 55

సీ. మందార మకరందమాధుర్యమునఁదేలు
                 మధుపంబు వోవునే మదనములకు
    నిర్మలమందాకినీ వీచికలఁదూగు
                 రాయంచ సనునె తరంగిణులకు
    లలితరసాలపల్లవ ఖాదియై చొక్కు
                 కోయిల సేరునే కుటజములకు
    పూర్ణేందుచంద్రికా స్ఫురితచకోరకం
                 బరుగునే సాంద్రనీహారములకు

-భాగవతము.

పండితారాధ్యచరిత్రమును బద్యకావ్యముగా రచించినవాఁడగుటచే శ్రీనాథుని యితర రచనలలోఁగూడఁగొన్ని పద్యభాగములు పలుకుబళ్లు నీతనివి చేరినవి. 'పాక మింతయు వృథాపాకంబుచేసె - ఆవగింజంతబూది మైనలఁది కొనిన | వెలఁది గుమ్మడికాయంత వెఱ్ఱిపుట్టు' ఇత్యాదులు

పరివర్తనముల తీరు

ఈ బసవపురాణమును బద్యకృతిగా రచించిన పిడుపర్తి బసవన కడునేర్పరి. ఆతఁడు ద్విపదలను నిపుణముగాఁ బద్యములందట్లే పొందించి నాఁడు. ఈ గ్రంథమున కది కొన్నిపట్టులఁడిప్పణిగాఁగూడ నుపయుక్త మగును. కాని, యా రచనము చాల సంగ్రహముగా నున్నది. కొన్నిపట్టు లాతఁ డర్థముకాక విడిచినాఁడు. భీమకవి కన్నడింపు మిగుల నెన్నఁదగినదిగా నున్నది. ఆతఁడు దీనిని తు-చ- తప్పకుండ ముక్కకు ముక్కగాఁ గన్నడించినాఁడు. కొన్ని పట్టులనించుక పెంచినట్లును గానవచ్చును. మిక్కిలి చిక్కుగా దుర్‌జ్ఞేయములు గానున్న పట్టులు గొన్ని యా కన్నడకృతిద్వారమునఁ దెలిసికొన నా కనువు పడెను. శబ్దరత్నాకరాదులలోఁ గానిరాని యనేకాపూర్వశబ్దములకుఁ గన్నడ కృతి తోడ్పాటున నేనర్థము గ్రహింపఁగల్గితిని. ఈ తెల్గుకృతికది ప్రశస్తమయిన టీక యనఁదగును.

రచనా సౌందర్యము

మన సోమనాథుని రచన మసాధారణ సౌందర్యము గల్గియున్నదనుట యతిశయోక్తి గాదు. ఛందస్సు, భాష, విషయము మూఁడును దేశీయములే యగుటయు, కవి శివతత్త్వానుభవమున నోలలాడుచుఁ దన్మయుఁడై కవితావేశము వొందియుండుటయు నట్టి యసాధారణ సౌందర్యమునకుఁ గారణములు.

వడిఁబాఱు జలమున కొడలెల్లఁ గాళ్లు
పడిఁగాలు చిచ్చున కొడలెల్ల నోళ్లు
వడి వీచు గాడ్పున కొడలెల్లఁ దలలు
వడిఁజేయు బసవన కొడలెల్ల భక్తి.

అని బసవనిఁగూర్చి సోమనాథుఁడు భావప్లుతములుగాఁ బలికిన పలుకులు స్వవిషయమునఁగూడ సమన్వితములయ్యెను. ప్రతిపదమునను శివభక్తి పరవశుఁడై యుండి సోమనాథుఁడు గ్రంథముల రచియించెను. ముగ్ధభక్తుల కథలు మొదలగు వానిలోఁగొన్ని పట్టులు చదువునప్పుడు మనసు ద్రవించితీఱును. బెజ్జమహాదేవి కథయు గొడగూచి కథయుఁ గన్నప్పని కథయు జదువునప్పుడు నేను బెక్కు తడవలు కరఁగితిని. మాయమర్మలు లేని విశుద్ధముగ్ధభక్తిని బ్రకటించుటలో సోమనాథుఁడక్కడ మధుర మధురములయిన జానుఁదెనుఁగుఁబలుకుల జాలువార్చి ముద్దులు గురిపించెను. శబ్దాలంకారములకయి, యర్థాలంకారములకయి, సోమనాథుఁడెక్కడను బాధపడలేదు. తనకుఁదెలియక యప్రయత్నముగాఁ బొందుపడినవే కాని యాలంకారికులు పేర్కొన్న కావ్యగుణముల ననుధ్యానించి పనిపూని చొప్పించినట్టు కన్పట్టుపట్టు లీ గ్రంథమున నెక్కడను గానరావు. సులువుగా రచింపఁదగిన ద్విపద మగుటచే సోమనాథుని చూపు కథాకల్పనమందును, విషయవిన్యాసమందును, భావప్రపంచమందును బరుగులువాఱినదే కాని, యతిప్రాసచ్ఛందోభాషాబంధములందుఁ జిక్కుకొని యెక్కడను ద్రొక్కటపడలేదు. అట్లు పరుగువాఱుటలోఁ బెక్కుపట్టులందీతఁడు పాఠకుఁడు సరిగాఁ దన్నువెన్నాడఁగలఁడా యనికూడఁ జూడఁబోఁడయ్యెను. పదులకొలఁది ద్విపదలు గడచినను బయికిఁబయికి వాక్యము పొడుగువాఱుచు సాగుచుండుటే కాని ముగియకుండుట నీ గ్రంథమునఁ బెక్కుపట్టులఁ జూడఁగలము. అట్టు ముగియకుండుటలోఁ గర్తృపదము రెండుమూఁడు తడవలు గూడ మరల మరలఁ గానవచ్చుచుండును. ఇట్టి యిక్కట్టు పండితారాధ్యచరిత్రమున మఱింత గలదు.

శివభక్తిస్మరణము వచ్చినప్పు డీతఁడొడలు మఱచును.

“పొరి మజ్జనోదకంబులకట మున్న
 పరముపై నానందబాష్పముల్ దొరుగఁ
 బూజించు నవపుష్పరాజికి మున్న
 రాజాంకుపై హృత్సరోజంబు విరియ
 ధూపవాసనకు మున్ ధూర్జటి మ్రోల
 వ్యాపితాంతర్గతవాసన దనర
 వెలుగు నీరాజనంబుల కటమున్న
 మలహరునంద యాత్మజ్యోతి ప్రబల

వినివేదితపదార్థవితతికి మున్న
తన ప్రాణపద మీశ్వరున కర్పితముగ
లింగార్చనము దాను బొంగి చేయుచును
నంగచేష్టలకు నంతంతఁ బాయుచును
సుభగలింగముఁ జూచి చూచి క్రాలుచును
నభవామృతం బాని యాని వ్రాలుచును
సురుచిరోక్తుల సోలిసోలి పాడుచును
స్థిరసుఖాంబుధిఁ దేలి తేలి యాడుచును
మంగళోన్నత బహిరంగంబు నంత
రంగంబుఁ దన ప్రాణలింగస్థ మగుచు.”

మఱియు,

“పరగు చతుర్వర్గఫలము లాదిగను
 వరసుతునడుగుము వాంఛితార్థమ్ము
 లనవుడు మందస్మితాననుండగుచు
 ననుషక్తి ముకుళితహస్తుఁడై మ్రొక్కి
 యెఱుఁగ మోక్షముల పేరెఱుఁగ వాంఛితము
 లెఱుఁగవేఁడెడు మార్గమెఱుఁగ నేమియును
 నెఱుఁగుదు నెఱుఁగుదు నెఱుఁగుదు మఱియు
 మఱియును మఱియు ముమ్మాటికి నిన్నె
 కావునఁగోరిక కడమయుఁగలదె
 దేవమూల స్తంభ దివ్య లింగాంగ
 నీ యతులిత దయాన్విత దృష్టి యిట్లు
 నాయందు నాఁటి కొనలు పసరింప
 నాదగు సంస్పృహాపాదితదృష్టి
 నీ దృష్టిలోనన నెక్కొని పొదలఁ

గరుణింపు దక్కినవరము లే నొల్లఁ
బరమాత్మ యని విన్నపంబాచరింప. పు. 80

మఱియును,

“బాపురే నిర్వాణి ! బాపురే తపసి!
 బాపురే బాపురే కోప పుంజంబ!
 పాపంబుఁ బొందెడు కోపించువాఁడు
 పాపిగా కే నేల పాపినయ్యెదను
 స్ఖలియించు కోపాగ్ని కణములఁజేసి
 కలఁగదే మానసఘన సరోవరము
 ఎసఁగెడు కోపాగ్ని నింకదే చెపుమ
 మసలక హృదయాబ్జమకరందధార
 వెలువడు కోపాగ్ని వేఁడిమిఁజేసి
 నలఁగదే సచ్చిదానందపద్మంబు
 జ్ఞానంబు సొంపొ? విచారంబు పెంపొ?
 ధ్యానంబు ఫలమొ ? యీ తామస గుణము!
 నాకేమి సెప్పెద వీ కాననమున
 లేకున్నవే చెట్లు నీకుఁ గూర్చుండ
 నిట్టి శాంతాత్మకు లెచ్చోటఁగలరు!
 పుట్టుదురే నినుఁబోల సంయములు!
 వఱదవోవు నెలుఁగు గొఱుపడం బనుచు
 నెఱుఁగక యీఁత కాఁ డేఁగిపట్టుడును
 వడిఁ బాఱునెలుఁ గంత వానినిపట్టఁ
 గడనున్నవాఁ 'డోరి ! విడువిడు' మనుడు
 'విడిచితి నది దన్ను విడువ' దన్నట్టి
 వడువున విడిచిన విడుచునే మాయ

 
పొంగి చిచ్చుఱకంగఁ బోవుచుఁ జీర
కొంగోసరించు పెన్వెంగలియట్ల
చెల్లుఁ బొమ్మని సన్న్యసింపఁ బోవుచును
నిల్లప్పగించు నయ్యిబ్బందియట్ల
పదపడి నూతిలోఁ బడఁబోయి తాప
వెదకుచు మెట్టెడి వీఱిఁడి యట్ల
జ్ఞానాత్ముఁడై సర్వసంగముల్ విడిచి
తానాశ్రయముఁగోరు తపసిచందమున
నిల మరు ల్వోయె రోఁకలిగొనిరండు
తలఁ జుట్టుకొనియెదఁ దా నన్నయట్లు
పానలేల చెఱకుపందెమం దొక్క
యీనె సిక్కిన నోడుటేకాదె తలఁప
రోసి సంసారంబుఁబాసి యొక్కింత
యాసించెనేనియు నది వెల్తి గాదె?”

ఇక్కడ 'కోపగర్హ' ను బలుదెఱఁగులఁ బ్రపంచించి కోపిని సిగ్గునఁ గూరునట్లు చేసినాఁడు. భావోద్రేకముగలపట్టులిట్టివీగ్రంథమునఁ బెక్కులు గలవు. కవిత్వ రచనాశౌండీర్య మిట్టిది పండితారాధ్యచరిత్రమందింక నెక్కుడుగా నిండారి పండఁబాఱి యున్నది. అది యపూర్వము లగు ప్రయోగములకు, శబ్దములకు, విషయములకు, గనియ. ఆకాలపు టాంధ్రదేశ ప్రజాచరిత్రమున నది యనేక విషయములఁదెలుపుచున్నది. ద్విపదలు జడవాఱి పొడుగులై సాగియుండుటచే నది యన్వయక్లేశమునఁగూడ దీనిని మీఱియున్నది. ఆ గ్రంథముననుండి యెత్తిచూపవలసిన యపూర్వవిషయము లనేకములు గలవు. విస్తరభీతిచే నిక్కడ విడిచితిని.

ముద్రణ విధానము

ఏలూరిలోఁ గందుకూరివారు బసవపురాణమును జాగ్రత్తతోఁ బ్రకటించిరి. దాని నాధారముగాఁ గొని ప్రాచ్యలిఖితపుస్తకశాలలో సి.పి. బ్రౌనుదొర గారు సేకరించిన ప్రతులలోని పాఠములను దోడుచేసికొని యీ ముద్రణము సాగించితిమి. శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులుగా రొకతాళపత్ర ప్రతి నొసఁగిరి. ముద్రణ సమయమునఁ గ్వాచిత్కముగా దానిని గూడఁదోడు చేసికొంటిని. భీమకవి కన్నడకృతియుఁ, బిడుపర్తి [40]బసవన పద్య బసవపురాణమును నాకు మిక్కిలిగా నుపకరించినవి. కన్నడ బసవపురాణము తీరు తిన్నన లేని ప్రాఁతకాలపు రోఁతయచ్చులో నుండుటచేఁ బ్రతిపదము దానిని బరికించుట యసాధ్యమయ్యెను. ఆవశ్యకము గల్గినపట్టులమాత్రమే దానిఁ జూడఁగల్గితిని. అది సుముద్రణమున నుండెనేని నాకింక నెన్నో యపూర్వ విషయములు తెలియఁ దగియఁదగియుండెడి వని నమ్ముచున్నాఁడను. ముద్రితమైన సంస్కృత బసవపురాణము నిష్ప్రయోజనమే. అది మిక్కిలి సంక్షిప్త మైనది. కొందఱు భక్తుల పేళ్ళు మొదలగువానినొకవిధముగా దానిని బట్టి నిర్ణయించుకొంటిని. అఱువత్తుమూవుర పేళ్ళు, ద్రవిడ కర్ణాటాంధ్రసంస్కృత గ్రంథములలో భిన్నభిన్న రీతులతో నున్నవి. తాళపత్రప్రతులలోని పాఠములను సాహసించి సంస్కరింపరాదనుతలంపుతో నుండుటచేతను, నవి యిదమిత్థమని నిర్ణయింపఁ గుదురనివై యుండుట చేతను నక్కడక్కడ మిక్కిలి త్రొక్కటపడితిని. తొలుత నీ గ్రంథమును భాషాతత్త్వపారంగతులగు శ్రీ గిడుగు వెంకటరామమూర్తిపంతులుగారును నేనును గలసి పరిశోధింపఁ దలఁచుకొంటిమి. కాని, వారు సుదూరదేశమున నుండుటచే నట్లు ఘటింపదయ్యెను. ఈ ముద్రణమున దొరలిన దోషములతో నాకే కాని వారికి సంబంధము లేదు. వారి తోడ్పాటుండినచో నింకను నిది గుణోత్తరముగా సాగియుండెడి దనుకొనెదను.

కృతజ్ఞత

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు తాళపత్ర ప్రతులపాఠములను సేకరించుటలో మిక్కిలి వ్యయమునకుఁ బాల్పడిరి. మఱియు నేను దఱచుగా మద్రాసులో నుండకపోవుట మొదలగు కారణములచే గ్రంథముద్రణమునకుఁ జాలఁగాలము పట్టినను సైఁచిరి. ఆంధ్రదేశోపకార కార్యములెన్నేని వారి హస్తముననుండి యవతరించుచున్నవి. 'ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్' అన్నసూక్తికిఁ దార్కాణమైనవారు శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు చెన్నపురి చిత్రవస్తు ప్రదర్శనశాలలో సేకరమైయున్న శైవాచార్య శిలాచిత్రమునకుఁ జక్కఁగాఁ బ్రతిబింబము నెత్తియిచ్చిరి. మైసూరు వాస్తవ్యులగు శ్రీ బి. బసవారాధ్య బి. యె;బి.యెల్. గారు బసవపురాణము మొదలగు కర్ణాట గ్రంథముల నేతద్ గ్రంథముద్రణము ముగియుదాఁక మాకెరవుగా నొసఁగి యెంతయు నుపకరించిరి. భారతీ కార్యనిర్వాహకులును, నందును, శ్రీ గన్నవరపు సుబ్బరామయ్యగారును, ఆంధ్ర పత్రికా ముద్రణాలయమున ముద్రణాధికృత ముఖ్యుఁడగు నావుల పార్థసారథినాయఁడు గారును, ముద్రణమున సౌకర్యముగూర్చిరి. వీరికెల్ల గడుఁగృతజ్ఞుఁడను. పీఠికా రచనాదులలోఁగర్ణాటకవి చరిత్రము రెండు సంపుటములును, ప్లీటు దొరగారి బొంబై గెజిటియరును, నాకుఁ బెక్కు విషయముల నెఱిఁగించినవి. అందులకుఁ దత్కర్తలయెడఁగృతజ్ఞుఁడను.

అనేక పాఠభేదములవలని యలజడియుఁ దెకతెంపులేక యేకధారగా నున్న ద్విపదల దీర్ఘగతియు నా యపరిజ్ఞానమును గారణములుకాఁగా నక్కడక్కడ తప్పులు దొరలినవి. వానిని పరిశోధన పత్రమునఁ జేర్చితిని. పునర్ముద్రణమున దిద్దుకొందును. ఇంకను నాకంటి కందనివి యుండవచ్చును. ఎఱిఁగినవారు దెలిపినచో దిద్దుకొందును. ప్రాజ్ఞులకు మ్రొక్కుచున్నాను.

ప్రభవ

వ్యాసపూర్ణిమ.

మదరాసు.

విద్వద్విధేయుఁడు,

వేటూరి ప్రభాకరశాస్త్రి

  1. పిడుపర్తి బసవన బసవపురాణమున నీ విషయము గానరాదని కొందఱనవచ్చును. అందు “కలిమలభంగచంగ శివగంగకుఁ జెంగటఁ గల్కె మన్పురిన్” అని యుండవలసినచోట నచ్చుతప్పు- "శివగంగకుఁ జెంగటఁ గల్గు మత్పురిన్” అని పడినది.
  2. ఆంధ్రపత్రిక యుగాది సంచిక, దుందుభి సంవత్సరము; పుట 144 చూచునది.
  3. ప్రసాదస్థలమాహాత్మ్యప్రకరణమునః - “అశుద్ధాత్మా శుచిర్లోభా న్మద్భుక్తం పావనం పరమ్, భక్షయ న్నాశ మాప్నోతి శూద్రో హ్యధ్యయనాదివ; శూద్రస్య వేదాధ్యయన మగ్రజాగ్రహణం తథా.” ఇత్యాదులు.
  4. కర్ణాటకవి చరిత్ర, దానిని బట్టి కం. వీరేశలింగము పంతులుగారును
  5. సూచన: ఇది తరువాతికాలంలో వే. ప్ర. శా.గారిచే పరిష్కరింపబడి ముద్రించబడినది. ప్రథమముద్రణ చూ|| భారతి, ప్రభవ సంవత్సర మాఘమాసం. మరియు చూ| ప్రస్తుత బసవపురాణము అనుబంధం-2 (2013)
  6. 19వ పుటలోని 1వ పాద సూచికను చూడగలరు
  7. శివకుమారుండు
  8. చక్కయ్యగారు
  9. యుదే
  10. మిండ
  11. కరియ
  12. చిక్కబ్రహ్మయ్యయు శ్రీగిరయ్యయును - కక్కయ్య నల్లయ్య కాటకోటయ్య
  13. బిజ్జలుని సోదరి నీలలోచనయనుదానిని బసవన పెండ్లాడెనని, శివావతారమయిన యల్లమప్రభువు కల్యాణము విడిచి శ్రీశైలమున నరఁటిచెట్టులో లింగైక్యమందె నన్నవార్త విని కూడలి సంగమేశ్వరమున బసవన లింగైక్యమందెనని, అది శక 707లో నని, చెన్నబసవపురాణము చెప్పుచున్నట్లు, ప్లీటు మొదలగువారు వ్రాసిరి. తెలుఁగున బసవపురాణమునఁగాని, చెన్నబసవపురాణమునఁగాని యీ విషయములు గానరావు. కన్నడ చెన్నబసవపురాణమున నుండియుండును. తెలుఁగు చెన్నబసవపురాణకారుఁడు (అత్తలూరి పాపకవి) పాల్కురికి సోమనాథుని బసవపురాణమునకు విరుద్ధములుగానుండు విషయములను గొన్నింటిని గుర్తించి తన కృతిలో వానిని విడిచినట్టున్నాఁడు.
  14. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోఁజూడనగును. అవి యింకను ముద్రితములు కాలేదు. ఇందు దాహృతములయిన గేయములు కర్ణాటకకవిచరిత్రలో వుదాహృతములైనవి.
  15. గోదావరి మండలమందు గల యీ మాండవ్యపుర మేదో?

    శా॥ శ్రీమద్రాజమహేంద్రనామనగరీ శ్రీదుర్గవర్యస్థితా
          సామాన్యస్ఫురమాణ దక్షపురపశ్చాద్భాగతుల్యానదీ
          గ్రామణ్యంతిక పూర్వదిక్పథితతీరప్రాంత దివ్యోదిత
          శ్రీమాండవ్య పురీవరం బలరె ధాత్రీనూతనస్వర్గమై.

                               

    -శ్రీ గుణరత్నకోశము.

  16. కన్నడమున - 'అఱువత్తుమూవుర పురాతనచరితె' 'త్రిషష్టి పురాతనచరితె' “అఱువత్తుమూరు పురాతనశరణరచరిత్రె, సంస్కృతమున - స్కాందోపపురాణ, శివరహస్య, శివభక్త మాహాత్మ్యములు; తమిళమున - పెరియపురాణము.
  17. మైసూరు ప్రాచీనవస్తుపరిశోధకసంఘమువారు ఈ సంవత్సరపు కార్యనివేదన ప్రకటనమున 'అఱువత్తుమూవుర' చరిత్రమునుగూర్చి కొంతపరిశోధనము నెఱపినారు. ఇక్కడ నాకది కొంత యుపకరించినది. వీరినిగూర్చి ద్రవిడవిద్వాంసులే యింకను సరియైన పరిశోధనము జరపఁజాలకున్నారు. నేనిక్కడ మైసూరు రిపోర్టులో నున్నక్రమము ననుసరించు చున్నాఁడను.
  18. (ఇందలి ఈ పుటసంఖ్యలు బసవపురాణము ఆంధ్ర గ్రంథమాల - 2 1926 ముద్రణము ననుసరించినవి.) -ప్రకాశకులు.
  19. ఇది సరస్వతీ పత్రికలో (ముక్త్యాల) ముద్రితమయినది. విశేష విషయములు విపులముగా దానికి నేను వ్రాసిన పీఠికలోఁ జూడదగును.

    (చూ. పుటలు 79- 97. ప్రకాశకులు)

  20. శ్రీపతిపండితుని యనంతరము బహుపురుషాంతరములదాఁక నీ వంశమువారు బెజవాడవాస్తవ్యులు గానే యుండిరి. ధర్మగుప్తాభ్యుదయాదిప్రబంధకర్తకాలమునఁ గాఁబోలును ఎలకుఱ్తి నగ్రహారముగాఁ బడిసి వారు బెజవాడ వీడి తమ యగ్రహారమున వసింపఁజొచ్చిరి. శ్రీ నాగేశ్వరరావు గారు నేఁడు బెజవాడలో దివ్యసౌధమును గట్టించి తత్థ్సానవాస్తవ్యులై యెనుబదివందల యేండ్లకంటె నెక్కువకాలము నుండి తమవంశము వారికిఁ జెల్లుచున్న ప్రాచీనపుఁగాణాచిని మరల నిలుపుకొన్నారు.
  21. శ్రీపతి పండితవంశమవారే తర్వాత 'కాశీనాథుని' వారయిరి. కాశీనాథుని వీరారాధ్యులు రచియించిన ధర్మగుప్తాభ్యుదయ భద్రాయుశ్చరిత్ర కృతులనుబట్టియు, తచ్ఛిష్యుఁడగు సిద్ధరామయ్య రచించిన సంస్కృతోదాహరణ స్తవాదులనుబట్టియు నీ విషయము గుర్తింపనగును. కాశీనాథుని నాగేశ్వరరావుగారి కీ వీరారాధ్యుఁడు 5వ తరమువాఁడు. శ్రీపతి పండితోపక్రమముగా వీరారాధ్యులవఱకు వంశక్రమము, పయిగ్రంథములందుఁ గలదు. అది యిట్టిది. -
  22. శ్రీశైల సంకల్పము: "పూర్వద్వార త్రిపురాంతక దక్షిణద్వార జ్యోతిస్సిద్ధవట, ప్రతీచీద్వారా ఆలంపురీ బాలబ్రహ్మేశ్వర ఉత్తరద్వార మాహేశ్వరాఖ్య చతుర్ద్వారోపశోభితే”
  23. శ్లో॥ వామాః పాశుపతా శ్చైవ కాలాముఖ మహావ్రతాః
         కాపాలా భైరవా శ్శాక్తా స్స్రావకా యోగధారణాః
        శైవా బహువిధా శ్చైవ వైష్ణవాః పాంచరాత్రికాః;
        వైఘానసాః కులా: కౌలా సత్సంభేదాస్తథా ఉమే;
        సాంఖ్యాశ్చలాకులా శ్చైవ తథా హంసపరాయణాః;
        ఏతే సమయిన స్సర్వే అన్యోన్యకలహప్రియాః;
        ఏతాన్ సర్వాన్ పరిత్యజ్య వీరశైవం వదస్వ మే - వీరాగమము.

  24. ఈ గ్రంథమును దొలుదొలుత నరసాపురమున నొక జంగముదేవరయింట నుండి నేనే దొరతనము వారి ప్రాచ్యలిఖితపుస్తకశాలకై సేకరించితిని. పుస్తకమునఁ గానరాకున్నను నది శివతత్త్వసారమని మల్లికార్జున పండితారాధ్య రచితమని తొలుత గుర్తించి, కీర్తిశేషులయిన కె.వి. లక్ష్మణరావుగారికి దాని యుత్కృష్టతను దెలిపి ముద్రింపఁగోరఁగా వా రాంధ్రసాహిత్యపరిషన్మూలమునఁ బ్రశస్తమయిన పీఠికతోఁ బ్రకటించిరి.
  25. వేదో౽పి శివాగమ ఇతి వ్యవహారో యుక్తః, తస్య తత్కర్తృత్వాత్; అతశ్శివాగమో ద్వివిధః, త్రైవర్ణకవిషయస్సర్వవిషయ శ్చేతి; వేద స్త్రైవర్ణిక విషయః, సర్వవిషయ శ్చాన్యః, ఉభయో రేక ఏ ఈశాన స్సర్వవిద్యానామ్... అతః. కర్తృ సామాన్యా దుభావప్యేకార్థపరం ప్రభామాణమేవ. - శ్రీకంఠభాష్యమ్.
  26. వీరార్వేలనియోగులు గాని యారాధ్యులు గారని కొందఱనుచున్నారు. “కూచిమంచి తిమ్మకవ్యాదుల గురువైన దెందులూరి లింగనారాధ్యుని శిష్యులందఱు 'అయ్యగారు అనుటచే నాయన తర్వాతి వారయ్యగారివారైనారు” అని బ్రహ్మశ్రీ నడకుదుటి వీరరాజుపంతులుగారు వ్రాసిరి. రక్తాక్షిచైత్ర భారతి చూడుఁడు.
  27. తానును - పాఠాంతరము.
  28. దక్షిణ హిందూదేశ శాసన సంచయము. IV నెం. 1378 చూ.
  29. చూ. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక.
  30. దక్షిణ హిందూదేశ శాసన సంచయము. IV నెం. 1020 చూ.
  31. చూ. దక్షిణ హిందూదేశ శాసన సంచయము, IV వాల్యుం . 479 పుట.
  32. దాసుఁడు అనవలసినచోట నీతఁడు 'దాసి' యని ప్రయోగించుచు 'విష్ణుఁబాసి వ్యాసుఁడు శివదాసిగాఁడె,' 'నుతికి మెచ్చిచ్చెఁగన్నులు' 'గాళిదాసికి' (నీ దాసి నీ వెంక నీ సింగరీఁడ' చతుర్వేదసార సూక్తులు. చెన్నారఁ గాళిదాసియు శివుచేతఁ గొన్న (కాళిదాస కవిని గూర్చి) పండితారాధ్య 4 ప్రకరణము 31 పుట.
  33. రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక, దక్షిణ హిందూదేశ శాసన సంచయము IV చూ.
  34. దక్షిణ హిందూదేశ శాసనములు 4 సంపుటము. చూ.
  35. 1915 సం. గవర్నమెంటువారి శాసన సంచయము. నెం 363
  36. 'పశుపఱుచు' రూపాంతరమే యగునేని యుద్ధమల్ల శాసన లిపిరీతిని 'పశువఱించు' అని శకటరేఫముతో నుండవలెను.
  37. నిడి నీరు = వాననీరు. తిరుపతి ప్రాంతముల వాడుక ఉన్నది. శాసనములు చూ. పీఠికలో ఈ పట్టున శాస్త్రిగారీ విషయమును గుర్తించిరి ( ప్రకాశకులు)
  38. కించిజ్‌జ్ఞులు, అతజ్‌జ్ఞులు, కుతజ్‌జ్ఞులు అని నేనన్నాను, సూర్యరాయవారు సితగులు, అతగులు, కుతగులు- ఇన్నీ ఉన్నవి గాన అతగులు = హతకులు అన్నారు, చేయి దిగండిట్టి సితగుండుగలడె పుట, 69 కన్నడమున సితగుడు = వ్యభిచారి. తెలుగున - ధూర్తుఁడు.
  39. ఈ పట్టున శాస్త్రిగారిట్లు గుర్తించుకొనిరి ( ప్రకాశకులు)
  40. పద్య బసవపురాణకర్త పిడుపర్తి సోమనాథుఁడని కవుల చరిత్రము మొదలగు గ్రంథములు పేర్కొన్నవి. ఆ గ్రంథమున గద్యములందుఁగూడ నట్లే కాననగును. కాని, కృత్యవతరణికలోఁ జూడఁగాఁ దత్కర్త పిడుపర్తి బసవనయని యేర్పడును. పరిశోధించియే నే నీ మార్పును జేసితిని. గద్యములందు సోమనాథుఁడని యుండుటకుంగారణము మృగ్యము.