బసవపురాణము/ప్రస్తావన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రస్తావన

ఆంధ్రవాఙ్మయమునందు బసవపురాణము సుప్రసిద్ధమైన ప్రాచీన కావ్యము. బసవపురాణము జానుఁదెనుఁగు కావ్యములందు రసవత్కావ్యమై, లింగధారులకు పవిత్రమైన పురాణముగ నున్నది. బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వ్రాసిన విపులమైన పీఠిక బసవపురాణప్రతిభ నాంధ్రలోకమునకు విశదము చేయుచున్నది. పీఠికయందు సోమనాధునికాలము, కృతులు, శైవమత భేదములు, బసవేశ్వరునిచరిత్రము, భక్తులచరిత్రములు మొదలగు విషయములను ప్రభాకరశాస్త్రిగారు సువ్యక్తముచేసిరి. విషయవిమర్శనము నందువలె రచనావిమర్శనమునందను ప్రభాకరశాస్త్రిగారి వైదుష్యము సువ్యక్తమగుచున్నది. సోమనాథుని కవితాసామర్థ్యమును దేశిరచన, ద్విపద, శివకవులు, జానుఁదెనుఁగు, శబ్దప్రయోగములు, శబ్దవిశేషములు, రచనా సౌందర్యము మొదలగు శీర్షికలందుఁ బరిష్కర్తలైన శాస్త్రిగారు బాగుగ విమర్శించి పాఠకులకు గ్రంథమునం దభిరుచిని విస్తరింపఁజేసిరి. బసవభక్తి రసము, తెనుఁగుతియ్యఁదనము, ద్విపదగతి బసవపురాణమునందు రసస్థాయిని బొంది భక్తి పారవశ్యమును, బ్రహ్మానందమును గలుగఁజేయుచున్నవి. సోమనాథుఁడు తనరచనకుఁ బురాణనామకరణము చేసిననను బసవపురాణము కావ్యరూపమును దాల్చినది. ఆంధ్రవాఙ్మయ పరిశోధనలకు బసవపురాణము పెన్నిధిగా నున్నవిధమును ప్రభాకరశాస్త్రిగారి పీఠికయును, మూలమును సువ్యక్తము చేయుచున్నది. గ్రంథమునకుఁ గీలకమైన వీరశైవమతవిషయమై పరిశోధనలు చేయవలసిన యవసరమును వర్తమానకాలమునందు వీరశైవమునకుఁ బట్టిన దుస్థితి తెలియఁజేయుచున్నది. వీరశైవమునకును, వైదికమతములకును గల సంబంధబాంధవ్యములను బరిశోధకులు విమర్శించి వివిధ మతములకును గల సమానధర్మములను నిరూపించుట శ్రేయస్కరము.

వైదికమతము

వేదయుగమునందుఁ గర్మపరమైన వైదికమతము కాలక్రమమున జ్ఞానపరమై పరివర్తనమును బొందినది. మతలక్ష్యమనిత్యములైన యజ్ఞయాగాదుల ఫలములనుండి నిత్యమైన మోక్షమునకు మరలినది. కర్మకాండకును, జ్ఞానకాండకును సంఘర్షణము గలిగినది. వేదములందలి మంత్రములకును, బ్రాహ్మణములకును సమన్వయములేక కర్మలు పరిహాసపాత్రములైనవి. జ్ఞానప్రధానములైన జైనబౌద్ధాది మతములు ప్రబలినవి. కర్మదీక్షాపరాయణులైన బ్రాహ్మణులకును, బ్రాహ్మణేతరవర్ణస్థులకును వైదికమతలక్ష్యమునందు భేదదృష్టి గలిగినది. జైనబౌద్ధమతములు ప్రబలి బ్రాహ్మణప్రాబల్యమును తగ్గించినవి. జైనబౌద్ధ మతములు బ్రాహ్మణ్యమును బ్రతిఘటించినను బ్రాహ్మణులపట్ల శత్రుత్వమును బూనలేదు. బౌద్ధధర్మములు ఖండించినను బ్రాహ్మణధర్మమును గారవించినవి. ధమ్మపదమునందు బ్రాహ్మణవర్గమనునధ్యాయము గలదు. ఆ వర్గమునందు బ్రాహ్మణధర్మములు నిర్దేశింపఁబడినవి. వైదికమత పరిణామము నందుఁ గర్మయోగమును, జ్ఞానయోగమును భక్తిమార్గము జీవయాత్రయందు సమన్వయము చేయుచున్నది. కర్మమార్గము జ్ఞానమార్గమునకు సాధనంబైనను బ్రాహ్మణాధీనంబైన నిత్యకర్మానుష్ఠానము ప్రాణకళను గోల్పోయి ప్రజల నిత్యజీవయాత్రకు నిరర్థకమైనది. కర్మాధికారులు గాని ప్రజలు జీవయాత్రయందు దారితెన్ను తెలియక పరితపించుచుండిరి. తత్త్వజ్ఞుల సిద్ధాంతములును అందరానిఫలములై, ప్రజ లజ్ఞానాంధకారము నందు మునిఁగి యుండిరి. ఇట్టి విషమదశయందు వర్ధమానుఁడు, సిద్ధార్థుఁడు మొదలగు క్షత్రియవీరులు బ్రాహ్మణాధికారమును బ్రతిఘటించి జైనబౌద్ధాది మతములను స్థాపించి, ప్రజలయందు నూతనమైన ప్రాణకళను బ్రతిష్ఠించిరి.

జైన బౌద్ధమతములు

సిద్దార్థ, వర్ధమానులు నిర్జీవమై క్రూరమైన కర్మకాండను, దుర్గ్రాహ్యమైన జ్ఞానమార్గమును నిరసించి ప్రజాజీవనమునందు ధర్మమార్గమును బ్రతిష్ఠించిరి. బుద్ధదేవుఁడు సంకుచితమైన బ్రాహ్మణకర్మానుష్ఠానమును నిరాకరించినను విశాలమైన కర్మసిద్ధాంతమును బ్రతిష్ఠించెను. యజ్ఞయాగాదిపరమైన కర్మ విశ్వవ్యాపకమైన కర్మభావమును బొందినది. వైదికమతమునందు మంత్రోదిష్టమై యిష్టదేవతాపరమైన కర్మ బౌద్ధమతమునందు సర్వవ్యాపకత్వమును బొందినది. వైదికమతమునం దప్రధానముగ నున్న కర్మ బౌద్ధమతమునందుఁ బ్రధానస్థానము నాక్రమించినది. జాతి, మత, కులభేదములు లేక, శుభాశుభకర్మఫలము "లవశ్యమను భోక్తవ్యం” అను సిద్ధాంతము హిందూమతమునందు సుప్రతిష్ఠితమైనది. కర్మసిద్ధాంతము, పునర్జన్మసిద్ధాంతము హిందూబౌద్ధమతములందు సమానప్రతిష్ఠను బడసినవి. జైనబౌద్ధమతములు 1000 ఏండ్లు భరతఖండమునందుఁ బ్రబలినవి. దేశమునందంతటను మఠములు, విహారములు, స్తూపములు వెలసినవి. సన్న్యాసులు, శ్రమణకులు వేనవేలు దేశమునందంతటను వ్యాపించిరి. దైవారాధనలేని బౌద్ధమతము సంకరమై, ప్రాణప్రతిష్ఠలేక, ప్రజాజీవనమునకు నిరర్థకమైనది. శంకరాచార్యులు జైనబౌద్ధమతములను ఖండించి వైదికమతమును బునరుద్దారణ చేసెను. శంకరాచార్యులు జైనబౌద్ధమతములను ఖండనము చేయుచు శైవవైష్ణవాది షణ్మతముల నామోదించెను. శంకరాచార్యులు కర్మసిద్ధాంతమును, పునర్జన్మసిద్ధాంతమును సర్వాత్మత్వసిద్ధాంతముతోను, సర్వబ్రహ్మసిద్ధాంతముతోను మేళవించి, వైదికమతపరిణామమును వేదాంతమునందు సార్థకము చేసెను. వైదికమతసంప్రదాయములైన ద్వైతాద్వైతవిశిష్టాద్వైతమతములు స్థాపితములై, వైదికకర్మలు, జాతికులభేదములు పుష్టిని పొందినవి. ప్రాకృతజనులు జీవయాత్రయందుఁ గడతేరుటకు వైదికకర్మల కనధికారులు. జ్ఞానమార్గము దుర్గమము. ఈ విషమదశయందు రామానుజుఁడు, చైతన్యుఁడు, బసవేశ్వరుఁడు మొదలగు మహాభక్తులు బయలుదేరి ప్రజాజీవనమును సుఖప్రదము చేయుటకుఁ బూనుకొనిరి.

భక్తిమార్గము

వ్యక్తావ్యక్తములకును, కర్మజ్ఞానమార్గములకును, సగుణనిర్గుణోపాసనములకును మానవహృదయమునందు భక్తిమార్గము సంధిబంధనముగ నున్నది. రుద్రేంద్రవరుణాగ్ని దేవతార్చనలతో నారంభమైన వైదికమతము "సర్వం ఖల్విదం బ్రహ్మ' యనుతత్త్వపరిజ్ఞానపరిణామమును బొందినది. ఈ పరిణామాంకురములు ద్వైతాద్వైతములందును, శైవవైష్ణవములందును, నిర్గుణసగుణోపాసనలందును, కర్మభక్తిజ్ఞానయోగములందును, నిగమాగమ పురాణములందును జిజ్ఞాసువులకు గోచరంబగుచున్నవి. మానవుని నిత్యజీవితమునందు దుఃఖనివృత్తికిని, సుఖప్రాప్తికిని దైవసందర్శనము పరమసాధనముగనున్నది. జైనబౌద్ధమతములు సంసారము దుఃఖసాగరమనియును, సన్న్యాసము సుఖసాధనమనియును నుపదేశించినవి. అద్వైతము సంసారము మాయాకల్పితమని యుపదేశించినది. పండితులు, బ్రాహ్మణులు కర్మలతోను, సిద్ధాంతములతోను, సన్న్యాసాశ్రమముతోను గాలయాపనము చేయుచున్నను బ్రజ లజ్ఞానాంధకారమగ్నులై దుఃఖవేదన ననుభవించుచుండిరి. వైరాగ్యము, నిర్లిప్తత్వము, నిర్లక్ష్యము, నిఃస్పృహ, నిస్సహాయత్వము పరిపాటియై, భారతీయచైతన్యము నిర్వీర్యమైనది. ఈ విషమావస్థయందు బసవేశ్వరోపస్థితమైన వీరశైవము మతధర్మములందును, లక్ష్యమునందును, సాంఘికార్థికపరిస్థితులందును మహాపరివర్తనమును గలుగఁ జేసినది.

శైవము

శైవమతపరిణామము వైదికమతపరిణామమునకుఁ బ్రత్యక్షప్రమాణముగ నున్నది. వైదికమంత్రోపస్థితుఁడైన రుద్రుఁడు వేదాంతమునందు శివరూపపరిణామమును బొందుచు, “శివో౽హం ” అను తత్త్వమును సువ్యక్తము చేయుచున్నాఁడు. శివుఁడు యజ్ఞపురుషుఁడు. శివుఁడు సగుణనిర్గుణపరబ్రహ్మ. శివుఁడు హిమాచలమునందు గౌరీశంకరుఁడు; రామేశ్వరమునందు రామలింగేశ్వరుఁడు; కాశ్మీరమునందు మహాదేవుఁడు; మధురయందు సుందరేశ్వరుఁడు; కాశీయందు విశ్వేశ్వరుఁడు; సౌరాష్ట్రమునందు సోమనాథుఁడు; శ్రీశైలమునందు మల్లికార్జునుఁడు. శివాలయములు దేశావృతములై శైవమతవ్యాప్తిని దెలియఁజేయుచున్నవి. పాశుపతులు, కాలాముఖులు శివపూజాపరాయణులు. శైవులు లింగరూపమునను శివునిఁ బూజించుచు శివోత్కర్షను జేయుచున్నారు. అధర్వశిఖయందలి “ఈశ్వరః శివ ఏవ చ... శివ ఏకో ధ్యేయః శివఙ్కరః", స్కందోపనిషత్తునందలి “జీవ శ్శివ శ్శివో జీవః స జీవః కేవల శ్శివః” మొదలగు వాక్యములు శివోత్కర్షను దెలుపుచున్నవి. శైవులు శివాలయములయందును, పీఠములయందును, స్వాంగముల యందును లింగమును బ్రతిష్ఠించి పూజించుచున్నారు. శివలింగార్చనమును అద్వైతమతస్థాపకులు శ్రీ శంకరాచార్యులు వారి పీఠమునందుఁ బ్రతిష్ఠించిరి.

శివలింగము

అవ్యక్తము-నిర్గుణము, నిరాకారము, నిరహంకారము, నిరవద్యము. అవ్యక్తమును వ్యక్తమైన విశ్వమంతయును అనంతములైన నామరూపములను సేవించుచుఁ బ్రసవించుచున్నది. అవ్యక్తము లింగాకృతిని విశ్వవ్యాప్తమై యొప్పుచున్నది. ఆకాశలింగము, వాయులింగము, తేజోలింగము, ఆపోలింగము, పృథ్వీలింగము అవ్యక్తమునకు వ్యక్తస్వరూపములు. అవ్యక్తలింగస్వరూపములందుఁ బార్థివలింగము సగుణనిర్గుణస్వరూపములను గలిగి పూజాపాత్రమైనది. పార్దివలింగమును స్త్రీపుంసయోగచిహ్నముగను బండితులు కొందఱు నిర్ణయించినను, మహత్తునకు బీజచిహ్నముగ నున్న లింగమున కీ లక్షణ మప్రధానము. లింగము షడక్షరీమంత్రరూపమని శైవాగమములు విశదముచేయుచున్నవి. ఈ లింగమాకాశాది పంచభూతము లందును గోచరం బగుచున్నది.

శివలింగమును వర్ణవివక్షత లేక సకలవర్ణములవారును బూజించు చున్నారు. బ్రాహ్మణులు దేవతార్చనలందును, సకలవర్ణములవారును, దేవళము లందును, శివలింగమును బూజించుచున్నారు. లింగధారులు లింగమును స్వీయాంగములందు ధరించుచు శైవులును, వీరశైవులును నగుచున్నారు. లింగధారణము గూఢార్థమును, బాహ్యార్థమును గలిగి, వీరశైవమున కపూర్వమైన వ్యక్తిత్వమును గలుగఁజేయుచున్నది.

వీరశైవము

వీరశైవము వైదికమతమును, జైనబౌద్ధమతములను బ్రతిఘటించుట కేర్పడిన శైవమతము. శైవమతము భరతఖండమునందు - ముఖ్యముగ దక్షిణప్రాంతములందు - వ్యాపకమునుబొందిన ప్రాచీనమతమని శైవాచార్యుల చరిత్రలు తెలుపుచున్నవి. ద్రవిడాంధ్రకర్ణాటక దేశములందు శైవము వ్యాపించినవిధమును భక్తుల చరిత్రములు విశదముచేయుచున్నవి. శంకరాచార్యులు జైనబౌద్ధమతములను నిర్వీర్యములఁజేసినను ప్రజాసామాన్యమునం దామతములు వ్యాప్తిని గాంచియున్నవి. అద్వైతసిద్ధాంతములు ప్రజలకు దుర్బోధ్యములు. జైనబౌద్ధమతములు నాస్తికమతములు. అద్వైతసిద్ధాంతములు, జైనబౌద్ధమతములు వైదికకర్మల ప్రతిభను తగ్గించినవి. ప్రజాహృదయమునందుఁ గలిగిన నూతనోత్సాహమును వీరశైవము పల్లవింపఁ జేసిన విధమును బసవేశ్వరచరిత్రము తెల్లము చేయుచున్నది. బసవేశ్వరుఁడు బ్రాహ్మణకులమునందు జన్మించినను ఉపనయనమును నిరాకరించి వీరశైవదీక్షను బూనిన పరమశివభక్తుఁడు. వీరశైవము కర్మమార్గమును నిరసించుచున్నవిధమును వీరశైవసిద్దాంతములు వెల్లడిచేయుచున్నవి. బసవేశ్వరుఁడు వడుగును నిరాకరించుచుఁ దండ్రికిఁ జెప్పిన సమాధానము కర్మనిరసనమును జేయుచున్నవి.

కూలి భక్తుల కెత్తుకెలది త్రాటి - మాలలకెత్తుట మఱి తప్పుగాదె?
కర్మపాశంబు లొక్కటఁదెగ నీల్గి - కర్మంబు త్రాళ్లు దాఁగట్టుకోఁదగునె?
రుద్రాక్షభసితాదిముద్రలు దాల్చి - క్షుద్రముద్రలు దాల్పఁగూడునే చెపుమ
యీ రీతిఁద్రాటికిఁదూరమై యున్న - వీరమాహేశ్వరాచార దీక్షితుని
నిర్మితోభయకర్మనిర్మూలు నన్నుఁ - గర్మాబ్ది ముంచుట ధర్మమే నీకుఁ?
గ్రచ్చఱఁగన్నులఁగానవు గాక - వచ్చునే బసవని వడుగుసేయంగ
బ్రహ్మశిరోహరుఁబ్రమథైకవంశ్యు - బ్రహ్మవంశ్యుండని భావించె దెట్లు?
జాతిగోత్రాతీతు సద్గురుజాతు - జాతిగోత్రక్రియాశ్రయుఁ జేసెదెట్టు?
అకులస్థుఁడై యున్న యభవుని భక్తు - నికనేకులంబని నిర్ణయించెదవు?

              * * * * * * * * * * * *

“ధరనన్య దేవతాస్మరణమాత్రమున - నిరువదెన్మిదికోట్లు నరకంబులొందు”
నన శ్రుతులందును వినరె బాపనికి - దినకరపావకదిక్పాలకులను
హరివిరించ్యాదులనఖిలదేవతల - ధర మూఁడుసంధ్యలఁదాఁగొల్వవలయుఁ
గొలువక తక్కినఁబొలిసె బ్రాహ్మ్యంబు - కొలిచెనేనియు భక్తి వొలిసెఁగావునను
బ్రాహ్మణుఁడేనియు భక్తుఁడెట్లగును? - బ్రాహ్మణుఁడెట్లగు భక్తుఁడేనియును?

మావిడిబీజంబు మహిమీఁద విత్తఁ - గా వే మగునె పెక్కుగథలేమి చెప్పు?
సహజలింగైక్యనిష్ఠాయుక్తి భక్తి ! - బహుదేవతాసేవ బ్రాహ్మణ పథము;

     
  • * * * * *


కర్మమార్గంబగుఁగాక బ్రాహ్మ్యంబు - నిర్మలశివభక్తి నిష్ఠితంబగునె?

బ. పు.19, 21-పుటలు.

వీరశైవమునకుఁ బ్రధానదీక్ష లింగధారణము. లింగధారణమునకుఁ గక్ష, కరము, ఫాలము, కంఠము, శిరస్సు, వక్షఃస్థలము ముఖ్యస్థానములు. లింగధారులందఱును జాతిమతకులభేదములు లేని శివభక్తులు. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, మాలలు మొదలగు అష్టాదశవర్ణముల వారును వీరశైవులై కులభేదములను నిరసించినవిధమును బసవచరిత్రము విశదముచేయుచున్నది. బిజ్జలునకు బ్రాహ్మణులు బసవేశ్వరుఁడు వర్ణసంకరము చేయుచున్నవిధమును దెలిపినపుడు బసవేశ్వరుఁ డొసఁగిన ప్రత్యుత్తరము భక్తితత్త్వమును విశదము చేయుచున్నది. -

వేదంబులాదియో విధికల్పితంబు - లాదియో జాతులకది యెట్టులనినఁ
జను వేదచోదితజాతులు రెండు - వినుము ప్రవర్తకంబును నివర్తకము
భవకర్మసంస్కారి భువిఁబ్రవర్తకుఁడు - శివకర్మసంస్కారి భువి నివర్తకుఁడు
సన్నుతవేదార్థచరితంబులుండ - మొన్నఁబుట్టినకులమ్ములమాట లేల
స్రష్టుక్తమగునట్టి జాతులు గానె - యష్టాదశంబులు నవి యేల చెప్పు
మిక్కిలిపదునెనిమిదివర్ణములకు - నిక్కమారయ భక్తనిచయంబు కులము
భాగ్యహీనుండు దాఁబసిఁడిఁబట్టిన న - యోగ్యంపులోష్టమై యున్నట్లు శివుని
ప్రతిబింబమూర్తియౌ భక్తుఁడు భవికి - మతిఁజూడఁ మానవాకృతి నుండు ధరణిఁ
గావున శివభక్తగణముల మహిమ - భావింపఁదలఁప నీ ప్రాప్తియే చెపుమ.

-బ.పు, 209 పుట.

వర్తమానకాలమునందువలెనె జాతిమతకులవైషమ్యములతో నిండి నిర్వీర్యమైన సంఘమును వీరశైవము భక్తిపాశబద్ధముచేసి వీర్యవంతముచేసినవిధ మాశ్చర్యమును గలుగఁ జేయఁగలదు. వీరశైవులు లింగపసాయిత శస్త్ర ములను బూని శివద్రోహులను, జైనులను జంపుట ఘోరకార్యమైనను వీరశైవప్రభావమును విశదముచేయుచున్నది. జగదేవుఁడు వీరతాంబూలంబును గొని బిజ్జలుని సంహరించి, ఆత్మహత్యను జేసికొనెను. నాచిదేవయ్యయును, పండ్రెండువేల శివభక్తులును జైనులను సంహరించిన విధము భయంకరమై వీరశైవదీక్షాప్రభావమును విశదము చేయుచున్నది. వీరశైవ మచిరకాలముననే కర్ణాటాంధ్రద్రావిడదేశములందు వ్యాపించి ప్రజాహృదయము నాకర్షించుటకు వీరమాహేశ్వరభక్తియును, సాంఘికవ్యవస్థలును గారణంబులు.

వీరశైవసంఘము

వీరశైవమునకు శివభక్తి, లింగధారణము, విభూతి రుద్రాక్షధారణము, పంచాక్షరీమంత్రము, లింగపసాయిత శస్త్రధారణము ప్రధానలక్షణములు. వీరశైవమునందు శివభక్తి వీరస్వరూపమును దాల్చుచున్నది. శివభక్తిపరవశులైన భక్తులు తమ కన్నులను, దారాపుత్రాదులను, ప్రాణములను శివార్పణముచేసి కైవల్యమును బొందినవిధమును భక్తులకథలు దెలుపుచున్నవి. కన్నప్ప, సిరియాలుఁడు, నిమ్మవ్వ, కుమ్మరగుండయ్య, చౌడయ్య, బొమ్మయ్య, వైజవ్వ, దూడయ్య, శ్వపచయ్య, కక్కయ్య, గుడ్డవ్వ మొదలగు భక్తులకథ లత్యద్భుతమైన వీరభక్తిని దెలుపుచున్నది. భక్తుల ప్రాకృతనామములె చిత్తపరివర్తనమును దెలుపుచున్నది. వీరశైవధర్మము సాంఘికపరివర్తనమును, మతపరివర్తనమును ప్రతిపాదించినది. వీరశైవసంఘమునకు బసవేశ్వరుఁడు దండనాయకుఁడు; మాహేశ్వరులు సేనాపతులు, భక్తులు సైనికులు. భక్తసైన్యము శత్రుమిత్రాభిమానమును, ప్రాణమానధనాభిమానమును లేక శైవధర్మనిర్వహణమును జేయఁబూనినది. జంగములైన శివభక్తు లందరును శివస్వరూపులు. వీరశైవులు బ్రాహ్మణులు - మాలలు, పండితులు - పామరులు, ప్రభువులు- ప్రజలు, స్త్రీలు - పురుషులు, దొంగలు - దొరలు మొదలగు భేదావరణము లేని శివభక్తులు. శివభక్తులు వారి సర్వస్వమును జంగముల కర్పించి శివానందమును బడయుదురు. వీరశైవము జంగమభక్తిని, భవినిరసనమును బోధించినది. లింగధారణము లేని వారందఱును భవులు. భవులు నిరసింపఁబడినవిధమును బసవపురాణము, వీరశైవాగమములు విశదము చేయుచున్నది. వీరశైవము బ్రాహ్మణ్యమును, యజ్ఞయాగాదులను, కర్మలను నిరసించి నిందించుచున్నది. పాల్కుర్కి సోమనాథాది బ్రాహ్మణులు కొందఱు కులగోత్రములను విసర్జించి వీరశైవదీక్షను స్వీకరించి కృతార్ధులైరి.

మల్లికార్జునపండితారాధ్యులు మొదలగువారు వీరశైవదీక్షను బూనియును గులముతోఁ బొత్తును విడువఁజాలక, వీరశైవసంఘమునందుఁ జేరఁజాలక పోయిరి. “భక్తిమీఁదివలపు బ్రాహ్మ్యంబుతోఁ బొత్తుఁ - బాయలేను నేను బసవలింగ” యనుచు మల్లికార్జునపండితుఁ డాక్రోశమును జేయుట లింగధారణస్వీకారమును, బసవమతస్వీకారాభిలాషను సూచించుచున్నది. లింగధారణస్వీకారము కాక కేవలము శైవమతస్వీకారమునే తెలిపిన యెడలను బసవలింగనామసంస్మరణమునకును, భక్తివలపునకును నర్థము గనుపడదు. పితృమేధాదికర్మల విసర్జనమె లింగధారణమునకు నిదర్శనముగ నున్నది. ప్రస్తుతము లింగధారి బ్రాహ్మణులందు వాదప్రతివాదములకు మూలమైన ఖననసంస్కారమును లింగధారణమును సూచించుచున్నది. బసవేశ్వరుని కాలమునందును, సన్నిహితకాలమునందును శివభక్తిపరవశులై అష్టాదశకులములవారును లింగధారణను గొందఱు, వీరశైవదీక్షను గొందఱును గైకొనిరి. లింగధారణదీక్షను గైకొనిన వారియందుఁ గొందఱు సంబంధ బాంధవ్యములను విసర్జింపఁజాలక కులాచారముల నవలంబించు చుండిరి. లింగధారులయ్యును, వీరశైవాచారపరాయణులు గాని బ్రాహ్మణ వైశ్యాదులుండుట కిదియే కారణమై యుండవలయును. వీరశైవప్రతిభ తగ్గినతరువాతను బ్రాహ్మణులు, వైశ్యులు లింగధారణదీక్షను బొందుట యసంభవము. ఆంధ్రదేశమునందు లింగధారిబ్రాహ్మణులకుఁ బీఠము లేకుండుటకుఁ గారణము మతత్రయబ్రాహ్మణుల ప్రాబల్యమును, వీరశైవప్రాబల్యమును, బ్రాహ్మణలింగధారుల యప్రాబల్యమును నని యూహింపఁదగియున్నది. పండితత్రయవంశజులు (శివలెంకమంచెన పండిత, శ్రీపతి పండిత, మల్లికార్జునపండిత, వంశజులు) పీఠస్థులనియే వ్యవహరింపఁ బడుచున్నారు. లింగధారిబ్రాహ్మణులు వీరశైవనామము నెపుడు స్వీకరించినను భిన్నమతములవారును, భిన్నవర్ణములవారును వీరశైవులై, వర్ణాశ్రమధర్మములను బారఁద్రోలుటకుఁ జేసిన మహాప్రయత్నములను వీరశైవమత చరిత్రము విశదముచేయుచున్నది. వీరశైవమతమునకు నేఁటికినిగల ప్రాబల్యమును గర్ణాటకదేశమునందుఁగల వీరశైవమఠములు విశదము చేయుచున్నది. వీరశైవమఠాధిపతు లితరమఠాధిపతులవలె సకలగౌరవములను బొందుచున్నారు. వీరశైవము తలపెట్టిన కులావరణనిర్మూలనము దుస్తరమైనది. లింగాయతులు, జంగములు, సాలెలు, జాండ్రలు ప్రత్యేకకులమువారై, మరికొన్ని కులము లేర్పడినవి. వైదికధర్మ ప్రాబల్యము తిరిగి తలయెత్తినది. భక్తిప్రధానమైన వీరశైవము నిర్జీవమైన యాచారసాంప్రదాయబద్దమై సాంఘికప్రయోజనములకును, మానవకల్యాణమునకును నిరుపయోగమైనది.

వీరశైవతత్త్వము

వీరశైవతత్త్వార్థము నిగూఢముగ నున్నది. వీరశైవమునకు బాహ్యమునందువలె అంతరంగమునందును లింగధారణము బీజముగ నున్నది. వైదికమతమునందలి దేవతార్చనము, వేదాంతమునందలి తత్త్వార్థము, జైనబౌద్ధమతములందలి సంఘారాధనము, వివిధమతములందలి కర్మారాధనము వీరశైవభక్తియందు సంయోగమును బొందినవి. లింగార్చనము, లింగైక్యము, జంగమభక్తి, వీరదీక్ష వీరశైవమునందు సంయోగమును బొందినవి. వీరశైవులు జైనబౌద్ధమతములను ఖండించి ఆ మతస్థులను హింసించినను, ఆ మతధర్మములు వీరశైవమునందుఁ బ్రతిష్ఠను బడసినవి. బౌద్ధమతమునకు మూలస్కంధములైన, "1.బుద్ధం శరణం గచ్ఛ, 2. ధర్మం శరణం గచ్ఛ, 3. సంఘం శరణం గచ్ఛ” యను మూఁడు ధర్మములును గురులింగ, జంగమ, శరణు రూపములను దాల్చినవి. ఏతద్ధర్మానుష్ఠానము వ్యక్తి కైవల్యమునకును, మానవకల్యాణమునకును సాధనంబుగ నున్నవిధమును నిగమాగమాచారములు తెల్లముచేయుచున్నవి. వీరశైవులు జాతికులభేదములు లేక జంగమ, లింగములకు శరణాగతు లగుచుందురు.

గురులింగజంగమాకుంఠితభక్తి - యరిదిసుజ్ఞానంబు నా ప్రసాదములు
నలిఁగరణములుఁ బ్రాణంబులు నగుదుఁ - దలఁపంగ దేహచైతన్యము లగుచుఁ
గ్రమమున నెలకొన్నఁ గడుసంతసిల్లి - భ్రమలేకపొడమిన ప్రజ్ఞచేనంత

గురుఁడు లింగంబని గుఱుతుగా నెఱిఁగి - యరయ లింగమ గురుండనియు నెఱింగి
గరిమ జంగమము లింగంబుగా నెఱిఁగి - మరలి లింగము జంగమంబుగా నెఱిఁగి
చనుజంగమము గురుస్వామిగా నెఱిఁగి- ఘనగురువరుని జంగమముగా నెఱిఁగి
యొకరొకరొక రందు నుండుట నెఱిఁగి- యొకరీతి మువ్వురు నొకటిగా నెఱిఁగి
యిట్టివిజ్ఞానమహిష్ఠుఁడై మనసు - ముట్టి మూర్తిత్రయంబును భజింపుచును
బరమసదానంద భరితాత్ముఁడగుచు-నరుదైన గురుకరుణాబ్ధిఁ దేలుచును

-దీక్షాబోధ 74-పుట.

జీవయాత్ర

జీవయాత్రకుఁ బరమప్రయోజనము బ్రహ్మానందమయమైన విశ్వకల్యాణము. జీవుఁడు జీవయాత్రను జేయుటకు విశ్వమంతయును విశ్వేశ్వరజీవవిశ్వభావములను, జ్ఞేయజ్ఞాతృజ్ఞానభావములను, కార్యకర్తృకారణభావములను, గురులింగజంగమరూపములను, సాధ్యసాధకసాధనభావములను సంభవమగుచున్నది. అవ్యక్తమైన పరమాత్మకును, వ్యక్తమైన విశ్వమునకును వ్యక్తావ్యక్తమైన జీవునియందు ధర్మప్రతిష్ఠ కలుగుచున్నది. జీవుఁడు సహజముగ వ్యక్తమైన విశ్వమునందు దేహభ్రాంతిని బొంది సుఖప్రాప్తికి దూరస్థుఁ డగుచున్నాఁడు. అవ్యక్తమును గనుగొనుటకు సాధనంబై నవ్యక్తము స్వయముగను ప్రతిబంధక మగుచున్నది. జీవయాత్రయందు వ్యక్తావ్యక్తముల పరిజ్ఞానము మతములకు, ధర్మములకు, కర్మలకు, సాహిత్యములకు, కళలకు, శాస్త్రములకుఁ బరమఫలము. అవతారమూర్తులు, మహర్షులు, తత్త్వజ్ఞులు, జ్ఞానులు, యోగులు, త్యాగులు, శాస్త్రజ్ఞులు, ధర్మజ్ఞులు, కర్మజ్ఞులు, భక్తులు జీవయాత్రాఫలమును సాధించుటకుఁ జేసిన తపఃఫలమును బ్రబంచవిజ్ఞాన మనంతముగ బోధించుచున్నది. నిగమాగమములు, దర్శనములు, గీతలు, ధర్మశాస్త్రములు, పురాణములు, కావ్యములు, నాటకములు, కళలు సువ్యక్తము చేయుచున్న ఈ యనంతవిజ్ఞానము జీవయాత్రకు సాధనంబైనను, జనసామాన్యంబునకు దుర్గ్రాహ్యముగ నున్నది. జీవక్షేత్రమునందు వ్యక్తావ్యక్తములకు ధర్మప్రతిష్ఠను సమకూర్చుటకు భగవద్భక్తి పరమసాధనముగనున్నది. జీవయాత్రను, దేవయాత్రను జేయగలవిధమును వైదికమతధర్మము లనంతవిధములను నిర్దేశించుచున్నవి.  దేహధారులకవ్యక్తమును గ్రహించుట దుస్తరము. అవ్యక్తము వ్యక్తముద్వారా గ్రాహ్యమగుచున్నది:

శ్లో. క్లేశో౽ ధికరతర స్తేషా మవ్యక్తాసక్తచేతసామ్,
    అవ్యక్తా హి గతి ర్దుఃఖం దేహవద్భి రవాప్యతే.

జీవయాత్రను, విషయయాత్రను జేయక శివయాత్రను జేయుటకు సర్వకాల సర్వావస్థలయందును శివసందర్శన, సంస్మరణ, సంకీర్తనములు సాధనములుగ నున్నవి. జీవయాత్రను శివయాత్రను జేయుటకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు గురులింగజంగమార్చనలందు భక్తిపరవశములు కావలయును. జీవయాత్రను దేహయాత్రార్థము గాక ఆత్మయాత్రార్థము చేయవలసినవిధమును సాధకునకు వీరశైవము వివరము చేయుచున్నది.

సాధకుఁడు

మానవశరీరమద్భుతమైన నిర్మాణము. ఆ నిర్మాణమునందలి కీలులను గనుఁగొనుటకు మహానుభావులు సమర్థులు. దేహేంద్రియాదుల కీలులను ప్రకృతిశాస్త్రజ్ఞులు నిర్ణయించినను అతీంద్రియరహస్యములను నిర్ణయించుటకు మహాయోగులు సమర్థులు. తత్త్వజ్ఞులు దేహమునందుఁగల తత్త్వములను భిన్నవిధములను నిర్ణయించుచున్నారు. సాంఖ్యులు, యోగులు 5 తత్త్వములను, వీరశైవులు 36 తత్త్వములను నిర్ణయించుచున్నారు. సృష్టిక్రమమునం దనులోమవిధాన మాకాశజన్యమైన శబ్దముతో నారంభమగుచున్నది. పంచభూతములు, స్థూలసూక్ష్మములు పది, దశేంద్రియములు, మనోబుద్దిచిత్తాహంకారములు, జీవుఁడు ఇరువదియైదు తత్త్వములు. స్థూలమైన శబ్దమునకు నాదము లింగరూపము. అవ్యక్తమున కాదిమవ్యక్తస్వరూపము నాదము. ఆ నాద మంతర్లింగరూపమున విశ్వమునం దంతటను విలసిల్లుచున్నది. మానవదేహమున సహస్రారమునందు దేదీప్యమానముగ విరాజిల్లుచున్నది. బుద్ధ, క్రీస్తు, కృష్ణావతారములం దీ దివ్యతేజమును భక్తులు సందర్శించి చిత్రించిరి. సకలమానవులయందును దేదీప్యమానమగు తేజము ప్రక్షిప్తముగ నున్నది. నాదసంజాతమైన లింగశరీరము సకలదేహాంతర్యామియై జీవయాత్రను మోక్షయాత్రను చేయుటకు సాధనంబుగ నున్నది. జీవయాత్రను కైవల్యయాత్రను జేయుటకు బాహ్య్యలింగధారణమును, నంతర్లింగధారణమును నుపయోగపడఁ గలవిధమును వీరశైవాగమములు వివరించుచున్నది. ఈ రహస్యమునే అపరోక్షానుభూతి యందు శంకరాచార్యులు విశదము చేయుచున్నారు :

శ్లో. యత్ర యత్ర మనో యాతి బ్రహ్మణ స్తత్ర దర్శనాత్,
    మనసో ధారణం చైవ ధారణా సా పరా మతా. - అపరోక్షానుభూతి.

శ్రీ గురుకటాక్షము అధికారియైన భక్తునకు వీరశైవదీక్ష నొసంగి కృతార్థునిఁ జేయుచున్నది. వీరశైవదీక్ష కధికారలక్షణములను బసవపురాణము, వీరశైవదీక్షాబోధ ఇటులు వివరించుచున్నవి :

తగనివారికి దీక్షఁ దగఁజేయుగురున - కగుఁబ్రమాదంబు మహాదేవుచేత
గురువులు శిష్యుని గుణవిశేషముల - నరయక దీక్షఁజేయఁగ నెట్లువచ్చు
బాలురకును మద్యపాయికి ద్యూత - శీలికి మాంసభక్షికి నజ్ఞునకును
ఆతురునకు వేశ్య కంగహీనునకు - నీతి గాదట వ్యసనికి దీక్షఁజేయ
నివి దెలియకఁ దీక్షలిచ్చినగురున - కవు నరకంబని హరువాక్యమనుడు.

         * * * * *

గురునాథుఁ డతనిఁ గన్గొని వత్స, వినుము - హరదీక్ష నిమ్మన్న నా పట్టుమనుచు
శిష్యునిశక్తియు శిష్యునిభక్తి - శిష్యుభావముఁ బరీక్షింప కీఁదగునె
యా ముముక్షుఁడు దీక్ష యగుటయే చాలు - నా మీఁద నాచరణంబు దుర్ఘటము
మొదలు సర్వద్వంద్వములఁ బాయవలయు - మదము గర్వముఁ బొడమకయుండవలయు కుత్సితనిష్ఠురకోపమాలిన్య - మాత్సర్యశాఠ్యడంబము లుండఁదగదు
కష్టలోభజ్ఞానకామమోహాది - దుష్టగుణంబులు దొలఁగంగవలయు గుదపాదపాణివాగ్గుహ్యసౌఖ్యములు - గదిసిన వశవర్తి గాకుండవలయు
శాంతంబు ముఖవికాసంబు సద్వృత్తి - దాంతి నీతియు దెల్వి దయయును వలయు సంతోషమును గతస్పర్ధయు ధర్మ - చింతయు సద్గుణశీలంబు వలయు
మొగమోటయును దానమును వినయంబు - తగవు ధర్మార్థసాధకబుద్ధి వలయు
నుచితజ్ఞతయు సత్క్రియోద్యోగధర్మ - రచన పరోపకారంబును వలయు

శివుఁడె దైవంబని చేపట్టవలయు - శివమహోత్సవములు సేయంగవలయు
నిత్యశివార్చనాన్వితుఁడు గావలయు - సత్యంబు గురుపరిచర్యయు వలయు
భయభక్తియును శివపరతంత్రమతియు - నియమవ్రతంబులు నిష్ఠయు వలయు
నీ గుణంబులుగల్గ కెట్లియ్యవచ్చు - నాగమోక్తంబగు హరభక్తిదీక్ష

- వీ.దీ. బో. 13 - పుట.


శత్రులైనను లింగహితులై యున్న - మిత్రులకాఁ జూడుమీ బసవన్న!
పట్టినవ్రతములు ప్రాణంబుమీఁద - మెట్టిన విడువకుమీ బసవన్న!
వేఱుభక్తులజాతి వెదకకుండుటయె - మీఱినపథము సుమీ బసవన్న!
చిత్తజాంతకుభక్తిఁ జెడనాడు ఖలుల - మృత్యువుగతిఁ ద్రుంపుమీ బసవన్న!
వేదశాస్త్రార్థసంపాదితభక్తి - మేదిని వెలయింపుమీ బసవన్న!
తిట్టిన, భక్తులు కొట్టినఁ, గాల - మెట్టిన, శరణసుమీ బసవన్న!
యేఁదప్పుపట్టుదు నిలఁ బరస్త్రీల - మీఁదఁ గన్నార్పకుమీ బసవన్న!
సాధ్యమౌ భక్తప్రసాదేతరంబ - మేధ్యంబకాఁజూడుమీ బసవన్న!
నిక్కంపుభక్తికి నిర్వంచకంబు - మిక్కిలి గుణము సుమీ బసవన్న!
ఏ ప్రొద్దు జంగమంబేనకాఁజూడు - మీ ప్రసాదముఁ గొను మీ బసవన్న!
నాలుకకింపుగా శూలిభక్తులను - మేలకా నుతియింపుమీ బసవన్న!
యేమైన వలసిన యెడరైనఁదలఁపు - మీ మమ్ము మఱవకుమీ బసవన్న!

-బసవపురాణము, ప్రథమాశ్వాసము - 25

గురువు శిష్యునకుఁ జిన్మయదీక్ష నొసంగి హస్తమస్తకసంయోగమును, పంచాక్షరీమంత్రోపదేశమును జేసి, లింగమునకుఁ బ్రాణకళాన్యాసము చేసి లింగాంగసంయోగమును జేయుచున్నాఁడు. జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల వలనఁ గలుగుచున్న జ్ఞాన మారూఢము గాక చంచల మగుచున్నది. దశేంద్రియములు సామాన్యముగ దేహయాత్రయందు లగ్నమగుచు దుఃఖదాయకం బగుచున్నవి. జీవయాత్రయందు జీవున కారూఢజ్ఞానము గలుగుట కాత్మావలోకనము సాధనముగ నున్నది. ఆత్మావలోకనము బాహ్యాభ్యంతరములందు లింగనిరీక్షణమూలమున సాధ్యమగుచున్నది.

కాన నీ యిష్టలింగము భావగమ్యుఁ - డై నిన్నుఁ బ్రేరేప నలరింతు క్రియలు

తవిలి లింగముఁ జూడఁ దాఁజూచుఁరూపు -వివరించి లింగంబు విన విను ధ్వనులు
సొరిది లింగము సోఁక సోఁకు స్పర్శనము- బరమలింగము భుజింప భుజించు నవియు
నెగడి లింగంబు ఘ్రాణింప ఘ్రాణించుఁ - దగ లింగదృష్టిచేఁ దా ద్రష్ట యగును
సరి నిట్లు ప్రాణైకసహచరుం డగుచుఁ - జరియించుభక్తుండు సర్వాంగలింగి
ప్రాణాంగములు చన ప్రాణలింగంబు - ప్రాణాంగములు గాఁగ నమరించి చేష్ట
లును లింగమందుఁ గీల్కొలిపి తానంత - యును లింగమయిమయి యుండు నా శరణు
నేమని మది నిర్ణయింతుఁ గీర్తింతు - నా మహాత్ముని యుపమాతీతమూర్తిఁ
జడబుద్బుదము నీట సమసినయట్లు - వడగండ్లు నీటిలో వర్షించునట్లు
కాఁకల నింగిలీకము రసమైన - జోకఁగాష్ఠము లగ్గి సోఁకి తామగ్ని
యైనట్లు లింగంబునందైనతనువుఁ - దాను లింగక్రియఁ దగ లింగమయ్యె
మది నెవ్వఁ డెయ్యది మరిగి ధ్యానించు - నదియె వాక్కున వెళ్లనాడుచునుండు
నదియ కర్మంబుచే నలరింపుచుండు - విదితంబుగా నీది వేదవాక్యంబు.

- వీరశైవదీక్షాబోధ 88, 90-పుటలు.

లింగనిరీక్షణ మతీంద్రియజ్ఞానమును బ్రసాదింపఁగలవిధమునకు సిద్ధపురుషుల యనుభవము ప్రసిద్ధముగ నున్నది. దివ్యదృష్టి, దూరశ్రవణము, దివ్యజ్ఞానము, అష్టసిద్ధులు, శివత్వము గలుగుచున్నవి. స్థూలశరీరము సూక్ష్మశరీరమునందును, సూక్ష్మశరీరము లింగశరీరమునందును, లింగశరీర మాత్మయందును, ఆత్మ పరశివునందును లీనమై, శివసాయుజ్యము గలుగుచున్నది. సాధకుఁడు పరశివుఁడైనను దేహభ్రాంతిని దన దృష్టిని దేహయాత్రయందు లగ్నముచేయున్నాఁడు. సాధకునిదృష్టిని దేహయాత్రయందు లగ్నమగుటకు మలత్రయమును విడువవలయును.

ఆణవమలమును బాయుటకు మాతాసతీసుతాదుల భ్రాంతిని వదలి తాను శివాంశమైన చైతన్యస్వరూపమని కనుఁగొనవలయును.

సకలంబుఁ దానయై సర్వేశ్వరుండు - సకలంబు నాడించుచైతన్యమూర్తి
శివుఁ డట్టి చైతన్యచేతనాత్మకుఁడు - తవిలి ప్రేరేపంగఁదానాడు జగము
తల్లి పార్వతియును దండ్రి శివుండు - నెల్లభక్తులు తన హితబంధుజనులు
ననుచు నానాపురాణాగమార్థములు - మును జెప్పెఁ గావున ముందుండి నీవు
నాది నీశ్వరబీజమందైతిగాన - భేదంబు లెల్లఁ గల్పితముగా నాత్మఁజింతించి తెలియును స్థిరమౌట నీవు - అంతన పాయు నీ కాణవమలము.

- వీరశైవదీక్షాబోధ 32-పుట.

మాయామలంబు తొలంగుటకుఁ గులభ్రాంతిని, స్త్రీపురుషభ్రాంతిని విడిచి, సర్వత్ర ఆత్మసందర్శనంబును జేయవలయును.

శిలలోపలఁ జనించిన నేమి పసిడి - శిలయుఁ దా నగునయ్య! చింతింప నట్ల
మానవులందు సంభవులైన నేమి - మానవు లగుదురె మా భక్తవరులు
పూరుషులైన నపుంసకులైన - నారులైనను బ్రాహ్మణకులీనులయినఁ
జండాలులైనను శంభుఁ బూజింప - నొండేమి రుద్రసామ్యులు విచారింప
నదిగాక నీవు నీ యాత్మను గాంచి - వదలకుండినఁ గులవ్యామోహ ముడుగుఁ
మఱి దానె తొలఁగు నీమాయామలంబు - తొరలు నహంకృతి దోడ్తన యడఁగు.

- వీరశైవదీక్షాబోద 39-పుట.

కార్మికమలమును బోనాడుటకు యథాలాభసంతుష్ఠుఁ డగుచు, తన సంపదలను గురులింగజంగమములకు సమర్పించి వారి తీర్థప్రసాదములను స్వీకరింపవలయును.

ప్రాణేశ్వరునకుఁ బ్రాణార్థంబు లొసఁగు - జాణవై ధన మిమ్ము సద్భక్తులకును
వినుము వెండియు నొక్కవిత్తమేకాదు - తనుమనోధనములు దగఁగురులింగ
జంగమావలి వినిశ్చయ మెట్టులనిన - సంగతలింగదీక్షాకాలములను
త్రివిధమూర్తులకును శ్రీగురుస్వామి - త్రివిధ మిమ్మనియె నా త్రివిధ మెట్లనిన
తను వెప్పుడును గురూత్తమునకు మనముఁ - దనరలింగమునకు ధనము భక్తులకు ఘనమనోవాక్కాయకర్మసత్క్రియలఁ - దన గురునియనుజ్ఞఁ దప్ప కిచ్చినను
ఘనములకెల్లను ఘనమైనలింగ - మును శ్రీగురుండును ముదమార నిచ్చు
నటుగాక దీక్ష నీ వాసించినపుడు - తటుకునఁ దను మనోధనముఁ ద్రిమూర్తు
లకు సమర్పింప వాలాయంబుగాన - నొకటియు నీది గాకుండుటఁ దెలసి
త్రివిధమూర్తులకును ద్రివిధవస్తువుల - నవిరళప్రీతి నీ వర్పించి తేనిఁ
బట్టించు సద్భక్తిభావ మంతటను - గట్టిగాఁ దొలఁగు నీ కార్మిక మలము.

- వీరశైవదీక్షాబోధ 42-పుట

ఆణవమలమును, మాయామలమును, కార్మికమలమును బాసిన సాధకుఁడు ధర్మప్రవర్తకుఁడై, శ్రీగురుకటాక్షమునకుఁ బాత్రుఁడై, లింగధారణరూపమైన చిన్మయదీక్షను బొంది శివస్వరూపుఁ డగుచున్నాఁడు. శివలింగస్వరూపుఁడైన సాధకుఁడు శివలింగస్వరూపులైన జంగమభక్తుల తీర్థప్రసాదములను గైకొని ప్రకృతికల్పితములైన భేదావరణములను విడిచి గురులింగైక్యమును బొందుచున్నాఁడు.

సకలమతములకును లక్ష్యము జంగమసేవ. ప్రాణహింస చేయక ప్రాణులకు సంతోషమును గలుగఁజేయుటయే ఈశ్వరపూజాఫలమని మతములన్నియును జాటుచున్నవి. బసవేశ్వరుఁడు లింగధారులైన భక్తులను జాతిమతభేదములను విసర్జించి పూజించి, మానవసోదరత్వమును జంగమరూపమునను స్థాపించినవిధమును బసవచరిత్ర రమ్యముగను బోధించుచున్నది.

సాధన

సాధనకును దుఃఖనివృత్తిని, సుఖప్రాప్తిని గలుగఁజేయుటకు శివాత్మకమైన విశ్వమంతయును సంసిద్ధముగ నున్నది. దేశకాలపాత్రల సంస్కారముల కనురూపముగ బహువిధములైన సాధనములను మహానుభావులు కల్పించి సాధకులకుఁ దరణోపాయము విశదము చేయుచున్నారు. వైదిక, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, శాక్తేయాది భారతీయ మతములను, యూధ, క్రైస్తవ, మహమ్మదీయాది మతములును షడ్దర్శనములను, కర్మజ్ఞాన భక్తి హఠ సన్న్యాసాదియోగములును కైవల్యప్రాప్తికి సాధనంబులుగ నున్నవి. సాధకునకు సకలసాధనములును ధర్మక్షేత్రమైన శరీరమునందుఁ బ్రత్యక్షముగ నున్నవి. దేహేంద్రియవశీకరణము సాధనలకు మూలము. సాధకుఁడు జీవయాత్రయందు దేహేంద్రియాదిసాధనలను దేహయాత్రకు వినియోగించిన దుఃఖమును, ఆత్మయాత్రకు వినియోగించిన సుఖమును గలుగుచున్నవి. శ్రీకృష్ణుఁడు భగవద్గీతయందు జీవయాత్రను ఆత్మయాత్రను జేయఁగలవిధమును జక్కఁగా బోధించెను.

శ్లో. యజ్ఞార్థాత్కర్మణో౽ న్యత్ర లోకో౽యం కర్మబన్దనః।
    తదర్థం కర్మ కౌంతేయ, ముక్తసఙ్గ స్సమాచర॥
    యజ్ఞశిష్టాశిన స్సంతో ముచ్యన్తే సర్వకిల్బిషైః।
    తే త్వఘం భుఞ్జతే పాపాః యే పచన్త్యాత్మకారణాత్॥

-భగవద్గీత, అ. 3-9, 13.

మానవులు యజ్ఞములను ఆత్మార్థము చేయునపుడు, పుణ్యమును దేహార్థము చేయునపుడు పాపమును బొందుచున్నారు. మానవులు కర్మలను పరహితార్థము చేయునపుడు మోక్షమును, స్వకామ్యార్థము చేయునపుడు బంధమును బడయుచున్నారు. గీతాశాస్త్రము బోధించుచున్న ఈ పవిత్రభావమునే వీరశైవము గురులింగజంగమసాధనరూపమున సార్థకము చేయుచున్నది. సాధకుఁడు సకలప్రపంచమును లింగరూపమునను నారాధించునపుడు దేహభ్రాంతి పోయి పరశివధ్యాస గలుగుచున్నది. దేహమునందుఁ గర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు పంచభూతములను నాశ్రయించి విషయములను భోగించుచు జీవస్వరూపమును విస్మరింపఁజేయుచున్నవి. జీవస్వరూపమును గనుఁగొనుటకు, నిరంతరమును విషయవాసనలను ఆత్మార్పణముచేయుటకు మనోనిగ్రహము పరమసాధనమని మహానుభావులు బోధించుచున్నారు. వేదాంతులు వేదములందును, యోగులు యోగములందును, కర్మోపాసకులు యజ్ఞములందును, ఆగమజ్ఞులు ఆగమములందును నీ పరమరహస్యమును బోధించుచున్నారు. సాధకులు ఇంద్రియములను మనస్సునందును, మనస్సును జిత్తమునందును, చిత్తమును బుద్ధియందును, బుద్ది నహంకారమునందును లయముచేసి, బ్రహ్మానందమును అనుభవించుటకు లింగనిరీక్షణము పరమసాధనమని వీరశైవము బోధించుచున్నది.

సహస్రారమునందుఁ బరంజ్యోతియై ప్రకాశించుచున్న పరబ్రహ్మమును సందర్శించుటకు దేహేంద్రియాదులు జ్యోతిస్స్వరూపమును బొందవలయును. ఇంద్రియాదులను వేధించి ఆత్మప్రసాదమును బడయుటకు దేహము మంత్రపూతమై చిన్మయము కావలయును. భూతశుద్ధియోగము ప్రతిపాదించిన షట్చక్రనిరూపణమును వీరశైవము షట్స్థలపూజ, షడ్లింగసందర్శనము రూపమున భక్తుల నిత్యజీవనమునందు సమన్వయము చేయుచున్నది. వైదికమతమునందుఁ గామ్యార్ధములకును, మోక్షమునకును మంత్రోపాసన ప్రాముఖ్యమును బడసిన విధమును వేదములు, వేదాంగములు విశదము చేయుచున్నవి. భూతశుద్ధికిని, కైవల్యమునకును బంచాక్షరీమంత్రము షట్చక్రములను, షట్స్థలములను వేధించి నాదరూపమున సహస్రారమునందు సదాశివరూపమునను వెలుంగుచున్నవిధమును శ్రీమత్ శంకరాచార్యులు సౌందర్యలహరియందు మనోహరముగను వర్ణించియున్నారు. 

శ్లో. క్షితౌ షట్పఞ్చాశ ద్ద్విసమధికపఞ్చాశ దుదకే
    హుతా శే ద్వాషష్టి శ్చతురధికపఞ్చాశ దనిలే,
    దివి ద్విష్షట్త్రింశ న్మనసి చ చతుష్షష్టిరితి యే
    మయూఖాస్తేషా మప్యుపరి తవ పాదామ్బుజయుగమ్.

                                                                  

-సౌందర్యలహరి -14శ్లో. మన స్త్వం వ్యోమ త్వం మరుదసి మరుత్సారథి రసి
    త్వ మాపస్త్వం భూమి స్త్వయి పరిణతాయాం నహి పరమ్,
    త్వ మేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా
    చిదానన్దాకారం శివయువతి భావేవ బిభృషే.

                                                                 

-సౌందర్యలహరి - 35శ్లో. సహయజ్ఞాః ప్రజా స్సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః
    అనేన ప్రసవిష్యధ్వ మేష వో౽ స్త్విష్టకామధుక్
    దేవాన్ భావయతానేన తే దేవా భావయన్తు వః
    పరస్పరం భావయన్తశ్శ్రేయః పర మవాప్స్యథ.

                                                                    

-భ. 3 అ. 10-11

మానవుల పురోవృద్ధికి కర్మలను సాధనంబులుగ భగవంతుఁడు నిర్మించెను. ఆ కర్మలు దేవతారాధనమునకు వినియోగపడునపుడు శ్రేయఃప్రాప్తికి సాధనంబు లగుచున్నవి.

సహస్రారము
       ^
ఓమ్ సత్యమ్

షల్లింగములు షట్‌స్థలములు షడక్షరి షట్‌చక్రములు షడ్వ్యాహృతులు
మహాలింగము ఐక్య ఓమ్ ఆజ్ఞా ఓమ్‌తపః
సత్యప్రసాదలింగము శరణ విశుద్ద ఓమ్‌జనః
చరలింగము ప్రాణ వా అనాహత ఓమ్‌మహః
శివలింగము ప్రసాది శి మణిపూరక ఓమ్‌సువః
గురులింగము మహేశ్వర మః స్వాధిష్ఠాన ఓమ్‌భువః
ఆచారలింగము భక్త మూలాధార ఓమ్‌భూః

సాధకుఁడు ఆజ్ఞాచక్రవర్తియై తపోలోకమునందు దివ్యదృష్టిని గలిగి మహాశివలింగమును గాంచునపుడు ఓఙ్కారాతీతమై సదాశివైక్యమయమైన సాయుజ్యము గలుగుచున్నది. సహస్రారము లింగైక్యమునకు ముఖముగ నున్నది.

వీరశైవాగమములందు వేదాంతమంత్రశాస్త్రముల రహస్యములు భిన్నరూపములను సమన్వయమును బొంది, భక్తియోగప్రభావమును నిత్యజీవనమునందు విస్తరింపఁజేసినవి. ఆత్మవికాసమునకును, సంఘబలమునకును, భక్తప్రసాదమునకును, శివసాయుజ్యమునకును వీరశైవము పరమసాధనముగ నేర్పడినది.

పరమాత్మునిఁ గనుఁగొనుటకు భక్తి పరమసాధనమని అన్ని మతములును దెలుపుచున్నవి. విశ్వరూపసందర్శనమునకు భక్తి పరమసాధనమని శ్రీకృష్ణుఁడు పరమభక్తుఁడైన విజయున కుపదేశించినవిధము భక్తిప్రభావమునకు నిదర్శనము.

శ్లో. భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవంవిధో౽ర్జున,
    జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరస్తప!
    మత్కర్మకృన్మత్పరమో మద్భక్త స్సంగవర్జితః,
    నిర్వైర స్సర్వభూతేషు య స్స మామేతి పాండవ!

-భగ. 11-అధ్యా. 54-55

విహితసదాచారవృత్తి సద్భక్తి - సహజజంగమలింగసద్భక్తి గలిగి
విను శివలాంఛనవిశ్వాసియైన - ఘనుఁడు భక్తుం డనఁగా నుతి కెక్క
పరధనంబును బరభామలఁ గోర - కరవిలింగైకనిష్ఠాత్ముఁడై పేర్చి
భావశుద్ధియు దృఢభక్తియుఁ గలుగ - మావారు భక్తుని మాహేశుఁ డండ్రు
ప్రేమ లింగమునక ర్పింపని ద్రవ్య - మేమియు నంటక నిష్టలింగప్ర
సాదంబు భోగింప సావధానమున - నాదట వర్తించు నతఁడు ప్రసాది
యనురక్తి లింగంబుఁ బ్రాణంబుఁ గూర్చి - ఘనతరప్రాణలింగశరీరి యగుచు
నే సుఖదుఃఖము లెఱుఁగక శివుని - దాసుఁడై కొలుచునాతఁడు ప్రాణలింగి
తనకు లింగము పతి దాను దత్పత్ని - నని నమ్మి పంచేంద్రియములసౌఖ్యంబుదా నెఱుంగక లింగతత్పరుం డగుచు - జానొంద శివుఁ గొల్వ శరణుఁడౌ నతఁడు
ఒలసి షడ్వర్గషడూర్మిషడ్భ్రమల - నలర కష్టవిధార్చనంబును లేక
శర్వునకుఁ దనకు సందింత లేక - నిర్వాణపద మంది నిర్భావుఁ డగుచు
ఒగి శిఖికర్పూరయోగంబుభంగిఁ - దగిలి వర్తించునాతఁడు శివైక్యుండు

-దీక్షాబోధ 81-82

శ్రీకృష్ణపరమాత్ముఁడు ఉపదేశించిన భక్తిమార్గమునే లింగధారణరూపమున వీరశైవము వ్యక్తముచేయుచున్నది. సాధకుఁడు చిత్తమును శివునియందు లయముచేయుటకు నిరంతరమైన శివధ్యాస సాధనముగ నున్నది. అభ్యాసమువలన ధ్యాస కల్గుచున్నది. జంగమార్చనలవలనను అభ్యాసమును, కర్మఫలత్యాగమును, శివసందర్శనమును గలుగుచున్నవి. బాహ్యాభ్యంతరముల గురులింగజంగమలింగార్చనలందు సాధకునకు భక్తిస్వరూపము గోచరం బగుచున్నది. బసవచరిత్రయందు సామాన్యజనులు మహాభక్తులై శివసాయుజ్యమును బొందినవిధము మనోహరముగ వివరింపఁబడినది. బసవమతము వైదికమతమును బ్రతిఘటించినను నిగమాగమపురాణాదులందుఁ బ్రతిపాదితములైన సాధనలను స్వీకరించి లింగధారణకు బ్రముఖతను గల్పించినది. వీరశైవము కొంతకాలము మహావ్యాపకత నొందినది. కాలక్రమమునఁ జిన్మయదీక్ష, లింగధారణము కులాచారములై, భేదావరణమును గల్పించి, వ్యక్తివికాసమునకును, సంఘజీవనమునకును, మానవకల్యాణమునకును నిరర్ధకములై, వీరశైవప్రతిభను తగ్గించినవి.

సాధ్యము

జీవుఁడు జీవయాత్రయందు శివస్వరూపమును బొందుట జీవయాత్రకుఁ బరమప్రయోజనము. "అహం బ్రహ్మాస్మి,” “తత్త్వమసి,” “శివో౽హం ” ఇత్యాది మహావాక్యార్థములను జీవయాత్రయందు సార్థకము చేయుటకు వీరశైవము తలపెట్టినది. లింగధారణము శివభక్తులందు ద్వైతభావమును బోఁగొట్టి అద్వైతభావమును వ్యక్తముచేయుచున్నది. పరమశివుఁడు, జీవుఁడు, ప్రకృతి, ఆత్మ, జీవుడు, దేహము; గురువు, లింగము, జంగము; భావలింగము, ప్రాణలింగము, ఇష్టలింగము; లింగశరీరము, సూక్ష్మశరీరము, స్థూలశరీరము; నాదము, బిందు, కళ: ఇత్యాది త్రివిధభావరూపములను విశ్వమంతయును గోచరంబగుచున్నది. సృష్టికి వ్యక్తరూపమైన నాదము, విశ్వమును లింగరూపమున నావరించి, కళారూపమునను సువ్యక్తమగుచున్నది. నాదము, చైతన్యకళారూపమున సహస్రారమునందు విలసిల్లుచుఁ బ్రాణకళల నాకర్షించుచున్నది. ప్రపంచమంతయును జైతన్యాధిష్ఠితమైన జంగమస్థావరరూపములను బ్రభవించుచు శ్రేయఃప్రాప్తికి సాధనంబుగ నున్నది. బాహ్యాంతరములందు లింగధారణము పంచభూతములను, దశేంద్రియములను, అంతఃకరణచతుష్టయమును వేధించి సాధ్యమును జేరుటకుఁ బరమసాధనమని వీరశైవము బోధించుచున్నది. లింగాంగి జంగమలింగప్రసాదమునందు ఇష్టార్థసిద్ధిని, గురులింగప్రసాదమునందు భావార్థసిద్ధిని గలిగి, నైష్కర్మ్యఫలసిద్ధిని బొందుచు, శివకైవల్యమును బొందుచున్నాఁడు. వీరశైవమతసాంప్రదాయములు తీర్థప్రసాదములమహిమను విశేషముగ బోధించుచున్నవి. శ్రీ గురుప్రసాదము స్థూలరూపమునను, భావరూపమునను సాధకునిఁ జిన్మయునిఁ జేసి, శివభక్తగణమునందుఁ జేర్చుచున్నది. జంగమార్పితములైన యిష్టపదార్థములు శివార్పితములై మహాప్రసాదభావమున సాధకునకు శివప్రసాదమును గలుగఁజేయుచున్నవి. మానవుల సుఖదుఃఖములకు కోపప్రసాదములు గారణంబులుగ నున్నవి. కోపము పశులక్షణమై దుఃఖమును, ప్రసాద మీశ్వరలక్షణమై సుఖమును గలుగఁజేయుచున్నవి. భక్తియుక్తమైన శ్రీ గురులింగజంగమప్రసాదము శివసాయుజ్యమునకు సాధనమై యున్నది. భావప్రాణేష్టలింగపరమైన శ్రీ గురులింగజంగ మైక్యాత్మకమైన వీరశైవతత్త్వము, వీరశైవమునకు శివాద్వైతమును బ్రతిపాదించుచున్నది. శైవసిద్దాంతములు ద్వైతప్రతిపాదకములనియును, ద్వైతాద్వైతప్రతిపాదకము లనియును, అద్వైతప్రతిపాదకములనియును భిన్నాభిప్రాయములు ప్రబలియున్నను వీరశైవము శివాద్వైతమును బ్రతిపాదించుచున్నదని పండితాభిప్రాయము.

ఆ లింగమునకుఁ బంచామృతస్నపన - మోలిఁ గావించి సర్వోపచారముల
నర్చించి ధూపదీపాదు లర్పించి - చర్చింప సూక్ష్మమై సకలదిక్కులను
బరమసత్కళ మున్నె భరితమైయున్కి - నరయ శిష్యుని శిరంబందున్నకళను
గని గురుమూర్తి యాకర్షించి లింగ- మునయందు మంత్రోక్తముగఁ బ్రతిష్ఠించి

యాలింగమును శిష్యుహస్తాంబుజమునఁ - గీలించి నీవిందుఁ గృపతోడ నుండు
మని దేవుఁ బ్రార్థించి యతని కర్పించి - వినయస్థుఁడగు శిష్యు వీక్షించి నీకుఁ
బ్రాణలింగ మితండు భావించి యెపుడుఁ - బ్రాణపదంబుగాఁ భజియింపుచుండు
ధరియింపు మేప్రమాదము లేకయుండ - ధరియింపఁగాఁ బ్రమాదము వచ్చెనేని
ప్రాణపరిత్యాగ మర్హంబు సుమ్ము - ప్రాణలింగులకని పదిలంబుపరచి
సుహితాంగలింగైక్య శోభనక్రియల - సహజైక్యసత్యప్రసాదాంగుఁ జేసి
సహజవాయుప్రాణసంబంధ మణఁచి - విహితలింగప్రాణవిశ్వాసుఁ జేసి
యమలాత్మఁ జిజ్జ్యోతియందు సంధించి - విమలతత్త్వార్థవివేకంబు నొసఁగి
యిద్దజీవన్ముక్తిహేతువై తనరు - శుద్ధశైవరహస్యసూక్తులఁ దెలిపి
స్వాదుస్వకీయప్రసాదంబు నొసఁగి - వేదోక్తసద్భక్తివేత్తఁ గావింప
నూహించి గురువాక్యమోలి శిష్యుండు - దేహభావములఁ దద్దేవు ధరించి
ఘనుని నిత్యుని సర్వగతునిఁ గేవలుని - యనుపమ శివుని జ్ఞానానందమయుని
నాదాత్ము నీశ్వరు నైర్గుణ్యమూర్తి - నాదిమధ్యరహితు ననుపమ సూక్ష్మ
తనుని షట్త్రింశదుత్తరతత్త్వవర్తిఁ - యగుఁ బరాత్త్పరతరుఁబ్రహ్మస్వరూపు
నిట్టిలింగముఁ దన కిచ్చి రక్షించి - నట్టి శ్రీ గురునాథునంఘ్రిపద్మములు
తన శిరంబున నిరంతరమును బాదు - కొనియుండ భావించికొనుచు శిష్యుండు
నా గురునాథుని నా లింగమూర్తి - నా గురుప్రతిబింబమగు జంగమంబు
వరుసతో నేకభావంబుగాఁ దెలిసి - స్థిరభక్తియుక్తిఁ బూజింపుచునుండె

-వీ.దీ.బో. 46 - 47.

వీరశైవమునకు లింగధారణము బీజము; లింగభక్తి శక్తి; గురులింగజంగమప్రసాదము కీలకము. శైవము ప్రాచీనవైదికమార్గమునఁ గర్మలను, వర్ణాచారములను నాశ్రయించుచు వృద్ధిని బొందినది. వీరశైవము కర్మసంస్కారములను, జాతిభేదములను నిరసించుచు, లింగధారణదీక్షను శాసించుచు, శైవమునకు నూతనచైతన్యమును గలుగఁజేసినది. ఇష్టలింగారాధనము కైవల్యమునకు సాధనము గాఁగలవిధమును వీరశైవ ముపదేశించుచున్నది.

పరికింప నీ కళఁ బరమేశుఁ డండ్రు - గరిమతో నాదాత్మకం బండ్రు దీని
నదియె పో పరశివుం డన్న యతండు - నదియె మహాలింగ మన నున్న యాతఁ

డతనికె నెల్లద్రవ్యముల నర్పింప - నతులప్రసాదసౌఖ్యము గల్గు ననుచుఁ
గౌరికి శంభుఁ డీ క్రమ మానతిచ్చె - నీ రీతి నర్పింప నెఱుఁగ రెవ్వారు.
                 * * *
నీ కాయమందును నీ ప్రాణమందు - నీ కరణములందు నిండెడు నెద్ది
యది యనాద్యంతంబు నప్రమేయంబు - సదసదుత్తరము నక్షయము నసాధ్య
పదమనియును జెప్పఁబడు పరశివుని - సదమలకళశిరఃస్థాన మందుండి
యిది యిట్టిదని వచియింప వర్ణింపఁ - గదిసి పేర్కొననశక్యం బెవ్వరికిని
గడుమనోజ్ఞానచింతల కందరాని - దగునిర్మలంబు నిత్యము నిరంజనము
నరసిచూడఁగఁ దాన యత్యంతసూక్ష్మ - తరమగు పరకళ దాన కాదెట్లు
ఈ కళ దాన కాదే గురునాథుఁ - డాకర్షణముఁ జేసి యట లింగమందుఁ
బెట్టి శిష్యుని కరపీఠిక నిలుపఁ - గట్టిగా ప్రాణలింగం బయ్యెఁ దెలియఁ
                *. *. *
అంగంబునను లింగ మధివసించుటను - లింగాంగికంగంబు లేదని తెలిపి
యంగంబు లింగమం దణఁగుటఁ జేసి - లింగాంగములు రెండు లేకుంటఁ దెలిపె
మునుపు లింగము ప్రాణములయందు నెలవు - గోనఁ బ్రాణగుణ మణంగుట నెఱిఁగించె
కళయందుఁ బ్రాణంబుఁ గళ ప్రాణమందు - నీల రెండుఁ గలసియుండెడి కీలుఁ దెలిసె
నది గానఁగళతోడఁ బ్రాణంబుతోడఁ - పొదలిన లింగంబు పూజ్యలింగంబు

-వీ. దీక్షాబోధ 4-5

బసవేశ్వరుని కాలమునందు జైనబౌద్ధమతముల ప్రతిభ తగ్గినది. శ్రీశంకరాచార్యులు వైదికమతప్రతిభను బునరుద్ధరించినను, ప్రజాసామాన్యమునకు నిరుపయోగమయినది. శైవాచార్యులు శివలింగార్చనరూపమున శైవమును గాపాడుచున్నను, శైవమునకు నిస్తేజస్త్వము గలిగినది. ఆళ్వారులు, శ్రీమద్రామానుజాచార్యులు వైష్ణవమతవ్యాపనమునకుఁ బూనుకొనిరి. ప్రాచీనాచారధర్మములు వికలత్వమును బొందినవి. నవీనాచారధర్మములు వ్యాపకమును బడయలేదు. కులభేదములు, జాతిభేదములు, మతాచారభేదములు ప్రజాహృదయమును నిర్వీర్యము చేసి, నిర్జీవత్వముఁ బ్రబలఁజేసినవి. ఇట్టి విషాదస్థితియందు సంఘమునందు వీరశైవము చిత్కళాన్యాసమును జేసి మహాపరివర్తనమును గలుగఁజేసినది. శివభక్తిచిహ్నమైన లింగధారణము వీరశైవమును వీర్యవంతము చేసినది. వీరశైవమునందు గురుప్రసాదితములైన భక్తిభావనలు జంగమార్చనలందు సార్థకములై, భక్తిరసావేశమును గలుగఁజేసినవి. వీరశైవులైన లింగాంగులందఱు నగ్రజాంత్యజకులభేదములు లేక తీర్థప్రసాదములను గ్రహించుచు, శివస్వరూపులై శివసాయుజ్యమును బొందుచున్నారు. వీరశైవమునందు సిద్ధాంతమైన శివభక్తిప్రసాదము జంగమార్చనలందుఁ గ్రియారూపమున సార్థక మగుచున్నది. బసవపురాణమునందు మనోహరముగ వర్ణింపఁబడిన ప్రాకృతభక్తుల దివ్యచరితములు వీరశైవమతప్రతిభను విశదము చేయుచున్నవి.

బసవేశ్వరుఁడు

బసవేశ్వరుఁ డొకమహావ్యక్తి. బ్రాహ్మణకులజుఁడైన బసవేశ్వరుఁడు బ్రాహ్మణకులమును విడుచుట బసవేశ్వరుని దృఢసంకల్పమును వెల్లడిచేయుచున్నది. బసవేశ్వరుఁడు పరమశివభక్తుఁ డయ్యును, బిజ్జలునకు మంత్రిత్వమును, దండనాయకత్వమును వహించి రాజ్యభారమును నిర్వహించెను. బసవేశ్వరుఁడు తన సర్వస్వమును, రాజ్యాదాయమును, రామదాసు శ్రీరామమూర్తికి కైంకర్యము చేసినరీతిని, జంగమార్చనలకు సమర్పించుచుండెను. శివానుగ్రహమువలన బిజ్జలుని కోశమునందు ద్రవ్యమునకు లోటు లేకుండెడిది. అతఁడు భక్తులకుఁ దన భార్యనగలను, వలువలను సమర్పించి జంగమార్చనలం దిష్టలింగార్చనలను జేయుచుండెను. బసవేశ్వరుఁడు తాను మంత్రియను నహంకారములేక జంగమకోటులకు సముచితార్చనలను సలుపుచుండెను. అనన్యమైన జంగమభక్తి బసవేశ్వరుని త్యాగశీలమును విశదముచేయుచు బసవేశ్వరభక్తిని విస్తరింపఁజేసినది. వైరాగ్యసన్న్యాసోపహతమై జడమయమైన సంఘమునందు బసవేశ్వరుఁడు చైతన్యకళాన్యాసమును జేసి కర్మయోగప్రవృత్తి నుద్దరించెను.

జైనబౌద్ధులు కర్మసన్న్యాసులై సంఘమునందు వైరాగ్యమును వ్యాపింపఁజేసిరి. భక్తికి, ప్రజాగౌరవమునకు కాషాయాంబరములు చిహ్నములైనవి. భిక్షాటనము పూజ్యమైనవృత్తియైనది. గృహస్థాశ్రమమునందు విరక్తి ప్రబలినది. ప్రజలు నిరాశ్రయులై, సంఘశక్తి క్షీణించినది. బలములేని సంఘము స్వధర్మనిర్వహణమునకు నిరుపయోగమైనది. భగవద్భక్తిని సార్థకముచేయుటకు మానవసేవయే పరమసాధనముగ నున్నది. బసవేశ్వరుఁడు నిత్యజంగమార్చనలందు ఆత్మపూజను, శివపూజను, సంఘపూజను సాధ్యముచేసి, సంకుచితమైన భక్తిమార్గమును, సంఘజీవనమును విస్తరింపఁజేసి వీరశైవమును వీర్యవంతముఁ జేసెను. బసవేశ్వరుని రాజ్యాధికారము, ధృఢసంకల్పము, పరమశివభక్తి, త్యాగశీలము, కులనిరసనము, జంగమభక్తి, మాహాత్మ్యము వీరశైవవ్యాపనమునకు సాధకంబులై, బసవావతారము ప్రసిద్ధిని బడసినది. వీరశైవచరిత్ర బసవేశ్వరుని మహిమను వెల్లడిచేయుచున్నది.

కర్ణాటకాంధ్రభాషలందుఁగల వీరశైవవాఙ్మయమును బండితులు పరిశోధించి వీరశైవతత్త్వమును వ్యక్తముచేయుదురుగాక! వీరశైవాత్మకమైన బసవపురాణ మాంధ్రగ్రంథమాలయందు నాల్గవకుసుమముగ వెలయుచున్నది. ఈ సుప్రసిద్ధసోమనాథకృతికి స్వాగతం బొసంగి యాదరింప నాంధ్రలోకమును వేఁడుచున్నాను.

ప్రభవ సం. ఆశ్వయుజ శు. 3.

బుధవారము.

కా. నాగేశ్వరరావు.