బసవపురాణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము


శ్రీ లింగమథనవిలోలకేలీవి - శాలసౌఖ్యానంద! సంగయామాత్య!
అక్కడ నంతఁ గళ్యాణంబునందు - నెక్కుడు శివభక్తికెల్లయై పరగు
బండారి బలదేవదండనాయకుఁడు - దండి బసవనికిఁ దనయ నిచ్చుటయుఁ
బ్రమథు లెంతయుమెచ్చి రాఁబంపఁబోవు - క్రమమునఁ బ్రమథలోకమున కేఁగుడును
బలదేవమంత్రి యాప్తుల బంధుజనులఁ - బిలువంగఁబంచి యా బిజ్జలుం డనియె

బసవేశ్వరునకు బిజ్జలుఁడు దండనాయకపద మిచ్చుట


[1]ఇతనితోఁబుట్టువు సుతుఁ డెవ్వఁడేని - నితని నియోగంబు ప్రతిదాల్పఁగలఁడె?
అనవుడు "కలఁడు మహారాజ! యతని - తనయ ప్రాణేశుండు వినయోక్తిపరుఁడు
నీ రాజ్యమంతయు నిలువంగఁ [2]జాలు - దూరీకృతాఘుండు దోర్బలాధికుఁడు
విను మఖిలకళాప్రవీణుఁ డెట్లనిన - జనులెల్ల నెఱుఁగఁగ సంగమేశ్వరుని
చేఁ బ్రసన్నత వడసెను గాన నీకుఁ - దాఁ బ్రధానిగఁ దగు ధరణీశ” యనిన
నిజ్జగం బింతయు నేలినకంటె - బిజ్జలు డెంతయుఁ బ్రీతాత్ముఁ డగుచుఁ
దన వీటఁదగిన ప్రధానుల హితులఁ - దనయెక్కుభద్రేభమును నమాత్యులను
బసవనిఁ దోడ్తేరఁబంచుడు వారు - నెసకంబుతో సంగమేశ్వరం బేఁగి
యక్కడ బసవని నసమానుఁ గాంచి - చక్కఁ[3]జాఁగిలి మ్రొక్కి సరణి నిట్లనిరి
“నాకోపభోగాపునర్భవాదులను - నీ కొకలెక్కయే నిజమట్లకాక
శివభక్తిసారానుభవభవ్యసుఖికి - నవశంబ కాక రుచ్యములె యిన్నియును?
నైనను లోకహితార్థుండ వీవు - కాన మా ప్రార్థనఁ గైకొనవలయు
బిజ్జలక్షోణీశు ప్రియము సల్పినను - నిజ్జగతీతలం బేలఁడే(వే?) చెపుమ
మంత్రిపట్టమునకు, మండలంబునకుఁ, - దంత్రంబునకు, నిజాప్తమునకు, మూల
భండారమునకు భూపతిరాజ్యమునకు - నొండేమి నీవకా [4]కొడయ లున్నారె?
యతఁడు పట్టెఁడుకూటి కర్హుండ కాని - క్షితికెల్ల నీవచూ పతివి నిక్కంబు
విచ్చేయు” మని యిట్లు విన్నవించుడును - నచ్చోట భక్తహితార్థంబు దలఁచి

యందఱుఁగొల్వంగ "నట్లకా”కనుచుఁ - గందర్పహరుభక్తగణములనెల్లఁ
గొలిచి తత్కారుణ్యజలరాశిఁ దేలి - యలరుచుఁ జనుదేర నంత నిక్కడను

బసవేశ్వరుఁడు కళ్యాణకటకము చేరుట


“నదెవచ్చె నిదెవచ్చె” నని విని ముదిత - హృదయుఁడై బిజ్జలుఁ డెదురుకొ న్వేడ్క
నలవడఁ బదియురెండామడనేల - గలయఁగఁ గల్యాణకటక [5]మంతయును
శ్రీరమ్యముగ నలంకారింపఁ [6]బంచి - భూరమణుండు శృంగారంబు సేసి
మండలాధీశ సామంత ప్రధాన - దండాధినాథమాతంగతురంగ
పరివారసహి[7]తుఁడై పరమహర్షమున - నరుదెంచి పదహతి ధరణి గ్రక్కదల
వివిధవాద్యధ్వనుల్ దివి [8]దీటుకొనఁగ - నవనీతలేశుఁ డల్లంతటఁ గాంచె
బసవకుమారు సద్భక్తిశృంగారు - నసదృశాకారుఁ దత్త్వార్థవిచారు
నేకాం[9]గవీరు దేహేంద్రియదూరు - లోకనిస్తారు నలోకానుసారు
జంగమవ్యాపారు సజ్జనాధారు - లింగగంభీరు గతాంగవికారు
విమలశివాచారుఁ ద్రిమలధిక్కారు - నమితమహాచారు నచలితధీరు
విరహితసంసారు వీరావతారుఁ - బరిహృతాహంకారు భక్తివిహారు
శివభక్తిసారు విశిష్టప్రకారు - నవినాశసంస్కారు నతులితశూరు
విపులక్షమాగారు వినయప్రచారు - సుపథైకవిస్తారు శుద్ధశరీరుఁ
గుజనవిదారు సద్గుణమణిహారు - వృజినతరుకుఠారు విహితోపకారు
నతిదయాలంకారు నఘసముత్సారు - హితహృద్గతోంకారు నతసముద్దారు
శ్రుతిపరిచారు నిర్మోహాంధకారుఁ - గృతరిపుసంహారు ధృతనయాచారుఁ
[10]జారునిర్మలకీర్తి సత్యప్రపూర్తి - సారసద్గుణవర్తి శాశ్వతమూర్తిఁ
గని పాదచారియై చనుదెంచి చేరి - ఘనతరప్రియపూర్వకంబుగ నపుడు
సముచితసత్కారసంతుష్టుఁ జేసి - సమదాంధగంధగజంబు [11]లేళ్నూఱు
పండ్రెండువేలు శుంభత్తురంగములు - పండ్రెండులక్షలు బలవత్పదాతి
పాటి బండారులు పన్నిద్ద ఱందు - మేటితనంబు నర్మిలినిచ్చి తనదు
నఖిలరాజ్యమునకు నర్హుఁగాఁ జేసి - సుఖలీల బిజ్జలక్షోణీశ్వరుండు

దానును బసవనదండనాయకుఁడు - నా నియోగము గొల్వ నరుదెంచుచుండఁ
బుణ్యపణ్యాంగనల్ పురవీథులందుఁ - బుణ్యాత్ము బసవప్రభునిఁ జూచువేడ్కఁ
“జూడఁగ వచ్చెద సుదతిఁ నే” ననుచు - “వేడుక [12]చెఱుపక వేగ ర”మ్మనుచు
“గాలిదొసఁగుఁ గాక! క్రమ్మఱు” మనుచు - “నేలమ్మ! వచ్చిన నేమి నీ”కనుచు
“నేకతంబొకతెవ యేఁగుమీ” వనుచు - “నీ కాళ్ల నడచెదనే కాంత!" యనుచుఁ
“బతిగన్న సైఁచునే పడఁతి! ని”న్ననుచుఁ - “బతిగని యెట్లైనఁ [13]బదరని"మ్మనుచు
“బసవన్నఁ జూడకపడఁతి! పో”ననుచు - “ముసుఁగిడి వేగ రా మురియక” యనుచు
“దోఁకొని పోయిన దోసమే” యనుచు - “మూఁకలోనికిఁబోకు ముగ్ధవీ” వనుచు
“దిక్కులు చూడక చక్కర"మ్మనుచు - “నెక్కడి తరువమ్మ! యింతి! నీ”కనుచు
“మానిని! బసవన్న మహిమ యి”దనుచు - “మానుగా భక్తుల మఱిచూత”మనుచు
“నిట్టి సందడి [14]గలదే యెందు” ననుచుఁ - “దట్టాడకిటు వేగ తరుణి! ర”మ్మనుచుఁ
“గంటివే బసవయ్యఁ గమలాయతాక్షి!” - “గంటినే మోక్షంబుఁగంటిఁగా” కనుచుఁ
“జూచితే!పోదమాసుకుమారి!” యనుచుఁ-“జూచుచుండఁగఁబోవ సొగయునే” యనుచు
వచ్చువారును జూచువారును గట్ట - నిచ్చువారును జూచి యేఁగెడెవారుఁ
బొరిఁబొరిఁ దెచ్చి విభూతివీడ్యంబు - లరుదొంద బసవయ్య కర్పించువారు
నంగన ల్వివిధపుష్పాంజలు లిచ్చి - మంగళారతులెత్తి మహి మ్రొక్కువారు
“స్వస్తి దీర్ఘాయువు శంకర!” యనుచుఁ - బ్రస్తుతిదీవనల్ పచరించువారు
హృద్యంబుగా గీతగద్యపద్యములఁ - జోద్యతరంబుగా స్తుతియించువారు
వారివారిక కయివారముల్ సేయు వారును నలిరేఁగి తారాడువారుఁ
గలకలంబులకు డగ్గఱక హర్మ్యాగ్ర - తలములపై నుండి దర్శించువారు
నం దొకయెడ విముగ్దాంగన యచటి - సుందరులకు సన్న [15]సూపి యిట్లనియె
“పంబిన వివిధవాద్యంబులుఁ దమ్మ - టంబులు నిస్సహణంబులు సెలఁగ
నందంద “చాఁగు బళా”! యంచు నేఁగు - నందికోలలవారు ముందటిగములు
నెల్ల [16]వెల్లెల్లుల కెల్లయై పరగు - నల్లహయా[17]రూఢ మవ్వీరగణము
చక్కగా నీ వ్రేలిచక్కటినడుమఁ - బెక్కువిధంబులం దక్కజం బగుచు
వేడుకఁ గోలాట మాడెడువారుఁ - గూడలి త్రిపురాంతకుని [18]కొల్వువారు
గెడఁగూడి పసిఁడిగిర్గిటకేళికలను - గడు నొప్పు సొన్నలికపురంబువారుఁ

జేరువ నాడెడు పేరణివిధము - సౌరాష్ట్రనాయకుసంప్రదాయంబు
వేడుకఁ బ్రతిజోకలాడెడువారుఁ - గూడలి సంగయ్య [19]కొలువునర్తకులుఁ
బాడుచు నట విండ్లపై [20]గజ్జెపరువు - లాడెడువారు [21]రాయనికొల్వువారు
సంగతి నేఁగు తురంగ[22]సంఘముల - పింగల బిజ్జలు ముంగలనొప్పు
వర[23]గజారూఢులై యరుదెంచుచున్న - పరమమాహేశ్వరప్రకరంబునడుమ
శివభక్తజనులమీఁదివ దృష్టులుఁగాఁగ - సవినయసంభ్రమాసక్తి మ్రొక్కుచును
నలఘుసన్మణికలాపాంశులు ప్రజ్వ - రిలు మౌక్తికచ్ఛత్రములగమి [24]నీడ
నతమంత్రిజనశిరోనాయకరత్న - వితతిఁ గూడిన పదాన్వితనఖములను
నెలమిఁ దలిర్చు భద్రేభంబు నెక్కి - యలరారుచున్నట్టి యలమహామహునిఁ
[25]గారుణ్యమూర్తి విక్రమచక్రవర్తిఁ - జారునిర్మలకీర్తి సత్యప్రపూర్తి
గలియుగరుద్రు సత్కరుణాసముద్రు - విలసనభద్రు సద్వినయనిర్ణిద్రు
ధీరు సద్భక్తిశృంగారు నేకాంగ - వీరు నా బసవకుమారుఁ జూచితిరె”
అనవుడు నందఱుఁ గని యట్లుమ్రొక్క - వనితకు మఱియొక్క వనిత యిట్లనియె
“నలినాక్షి! యీతఁడే నందీశమూర్తి - పొలఁతి! యీతండె త్రిభువనపావనుఁడు
వనిత! యీతఁడె భాగ[26]వాడ మాదవ్వ - మను [27]నోమిపడసిన యనుఁగుఁబుత్త్రుండు
పడఁతి! యీతఁడె మనబలదేవమంత్రి - కడుఁ [28]గూర్చి యిచ్చిన కన్యకమగఁడు
సన్నుతాంగి! యితండె సంగయ్యదేవు - మొన్నఁబల్కించిన ముల్లోకనుతుఁడు
[29]మడఁది! యాతండె యిమ్మనుజేశుచేతఁ - గడునొప్పుమన్నన వడసినయతఁడు
కన్నులపండు వీ యన్నఁ జూచినను - బన్నుగా జిహ్వలపండువు వొగడ
నిట్టి ధన్యల మౌదుమే నేఁడు మనల - పుట్టువు సఫలతఁబొందె నెంతయును”
నని యిట్లు చెప్పుచునడుగుచు జనులు - వినుతింపఁగాఁ బురి [30]వెసఁ జొచ్చునెడను
జగతీతలేశుండు నగరోపకంఠ - మగడు నా బసవయ్య నర్థి దోడ్కొనుచుఁ
బరిమితభటమంత్రి పరివృతుం డగుచు - నరుదెంచి భవనాశ్ర[31]యాభ్యంతరమున
మున్నున్నమంత్రులు పన్నిద్ధ[32]ఱకును - [33]గన్నాకుగాఁ బెద్దగద్దియ నునిచి
వరవస్త్రభూషణోత్కరము లర్పించి - యరుదొంద బసవయ్య కాతఁ డిట్లనియె

“సకలసామ్రాజ్యపూజ్యస్థితికెల్లఁ - [34]బ్రకటింపఁగా నీవ పతివట్లుఁగాక
నా యర్థమునకుఁ బ్రాణమునకుఁ బతివి - వేయును నేల? నీవే [35]నేను బసవ!
నిన్ను నమ్మితి” నంచు నెయ్యమెలర్ప- మన్నన బిజ్జలక్ష్మాధీశుఁ డనిన
“సకలలోకైకరక్షకుఁడగు శివున - కొక నిన్ను [36]రక్షించుటకు నెంతవెద్ద
కావున మాలింగ దేవుభక్తులకు - [37]నేవేళ వెఱచుండు మింతెయె చాలు
నీ రాజ్య మేలించుటిది యెంతవెద్ద - నీరధి మేరగా నిన్ను నేలింతు”
నని యూఱడిల బసవనదండనాథుఁ - డనుకూలుఁడై పల్క నంత బిజ్జలుఁడు
మఱియుఁ గట్టఁగనిచ్చి మహనీయలీలఁ - గొఱలునెయ్యమున వీడ్కొలిపె; వీడ్కొలుప;
గా బసవఁడు భక్తగణములు దాను - నా బలదేవనాయకుని నగళ్లు
తనకు నిజాలయస్థానమై యుండఁ - దననియోగము గొల్వఁ దాఁ జనుదెంచి
లాలితలింగకేళీ[38]లసన్మతిని - లీలానుకూల [39]సచ్ఛీలసంపదల
ననుదినవర్ధమానైశ్వర్యుఁ డగుచు - జనపతిరాజ్యంబుఁ జక్కవెట్టుచును
దెసలెల్ల సత్కీర్తిఁ బసరించుచున్న - బసవనిపూనిక బాసయెట్లన్న

బసవేశ్వరుని బాస


శివరాత్రి నిత్యంబు చెల్లించు బాస - శివభక్తులెల్లను శివుఁడను బాస
భక్తుల యెగ్గులు పట్టని బాస - భక్తులకుల మెత్తిపలుకని బాస
మృడునైన నొకమఱి యడుగని బాస - యడిగిన యర్థంబు [40]గడపని బాస
చీమంతయైన వంచింపని బాస - యేమి వేఁడిన నడుగిడకిచ్చు బాస
తలఁపెట్టులట్టుల పలికెడు బాస - పలుకట్ల నడవడిఁ బాలించు బాస
పలికి బొంకనిబాస వొలివోని బాస - చలమెడపని బాస సలిపెడి బాస
తప్పఁ దొక్కనిబాస [41]దరలని బాస - యెప్పుడు భృత్యత్వ మెడపని బాస
కలనైన శివునకు గెలుపీని బాస - గెలుపు భక్తుల కిచ్చి కీడ్పడు బాస
పరసతిపై దృష్టి వఱపని బాస పరధనంబుల కాసపడకుండు బాస
పరనింద నెయ్యెడఁ బొరయని బాస - పరమర్మకర్మముల్ వలుకని బాస
పరసమయంబులఁ [42]బరిమార్చు బాస - పరవాదులను బట్టి భంజించు బాస
హరదూషణకుఁ జెవులానని బాస - హరగణానర్పితం బంటని బాస

హరగణపరతంత్రుఁడై యుండు బాస - హరభక్తు లెట్లన్న నట్లను బాస
జంగమంబును బ్రాణలింగ మన్బాస - వెంగలిమనుజుల వేఁడని బాస
భవికి మ్రొక్కనిబాస భవి కీనిబాస - భవబాధలకు నగపడకుండు బాస
విషయేంద్రియములకు వెన్నీని బాస - విషమషడ్వర్గంబు విరియించు బాస
వేదోక్తభక్తి సంపాదించు బాస - యాది శివాచార మలరించు బాస
శిరమట్టఁ [43]బాసిన శరణను బాస - శిరమున కట్టు [44]వాసిన మ్రొక్కు బాస
ముట్టినచో [45]వెన్క మెట్టనిబాస - యిట్టివన్నియుఁ దుదముట్టించు బాస
బసవనిచరితంబు బసవఁడే యెఱుఁగు - వసమె యెవ్వరికైన వాక్రువ్వఁదలఁప
[46]ధీరంబుకట్ట గంభీ[47]రంబుతిట్ట - సారార్థములప్రోక జ్ఞానాగ్ని కాఁక
ప్రతినలగుడ్డ విశ్రుతభక్తిగడ్డ - వ్రతములపంట వైరాగ్యంబువెంట
సత్యంబుకలను ప్రసాదంబుకొలను - కృత్యంబుతాఁప యకృత్యాబ్ధితేఁప
వేదాంతములపాటి విద్యలమేటి - నాదంబుక్రోలు సమ్మోదంబుకీలు
శాంతతనెలవు యీశ్వరుకట్టినలవు - దాంతతకలిమి నిత్యత్వంబు [48]బలిమి
వినయంబుతేట వివేకంబుకోట - యనురక్తి యిల్లు నుదాత్తత పెల్లు
తత్త్వంబుతీగ మహత్త్వంబుచేగ - సత్త్వంబు వెన్ను నాస్థానంబు చెన్ను

బసవేశ్వరుని దర్శింప శివభక్తు లరుదెంచుట


బసవఁడు కేవలభక్తుండె యనుచు - [49]వసిగొని లోకముల్ [50]వర్ణన సేయ
నొక్కొక్క నియమంబు నిక్కంబుగాఁగఁ - జక్కన దర్శింపఁ జనుదెంచువారు
చేకొన్నవ్రతములు చెల్లించు[51]వారు - ప్రాకటవ్రతబుద్ధిఁ బఱతెంచువారు
“ఖ్యాతుఁడో భక్తిసమేతుఁడో యరసి - చూతముగాక!” యంచును వచ్చువారు
“బసవనిచేఁ బూజ [52]వడయుద"మనుచు - నెసకంబు దళుకొత్త నేతెంచువారు
“నతనిఁజూచినఁ జాలు నభవునిభక్తి - యతిశయంబగు” నని యరుదెంచువారు
బసవతీర్థం బేఁగు [53]పరస యనంగఁ [54]బసిగొని యిలఁ గ్రిక్కిఱిసి వచ్చువారు
కరితురగాందో[55]ళవిరచితానేక - వరరథారూఢులై యరుదెంచువారు
[56]ప్రకటరుద్రాక్షసన్మకుటవర్ధనులు - సకలాంగభసితాది శాసనధరులు
విరచితవస్త్రోపవేష్టితమకుటు - లురుజటాజూటవిస్ఫురితశాసనులు

కక్షకరస్థలకంఠోత్తమాంగ - వక్షస్థ్సలా[57]దికవరలింగధరులు
నుతసంయమీశ్వరు లతులవ్రతస్థు - లతి[58]శీలు రితరపాకాదివర్జితులు
సంభావితులు భవిజనసమాదరణ - సంభాషణాదిసంసర్గవర్జితులు
పరశివధ్యానైకపరతంత్రమతులు - నిరవధిలింగైక్యనిష్ఠితేంద్రియులు
స్వచ్ఛలింగానుభవేచ్ఛాత్మసుఖులు - ప్రచ్ఛన్నలాంఛను ల్ప్రకటలాంఛనులు
నటకులు గాయకుల్ నవరసాత్మకులు - పటుకళావేదులు బహుశాస్త్రమతులు
వాదులు దార్కికుల్ వరకవుల్ దత్త్వ - వేదులు వేదార్థవాదులాదిగను
నెడనెడ నిబ్బంగిఁ గెడఁగూడి నడవఁ - బుడమి యొక్కట నొడ్డగెడవయ్యె ననఁగ
ఖండేందుధరుభక్తగణము లిబ్బంగిఁ - దండతండంబులు దారేఁగుదేర
విలసితమృగమదకలితమార్గముల - వెలుఁగుముక్తాఫలంబులమ్రుగ్గు లమర
ముకురపల్లవమణిముక్తాఫలాది - మకరతోరణముల నికరంబు లలర
ఖ్యాతిగా వృషభసమేతమై యొప్పు - కేతనానీకముల్ గ్రిక్కిఱియంగ
నాతతవ్యాసహస్తాకృతి నున్న - వాత[59]పూరణములు వడిఁ గ్రాలియాడ
నుడువీథిఁ గప్పి సమున్నతలీల - నడపందిరులు వెలి [60]గొడుగులుఁ దనరఁ
దతవితతాదివాద్యంబులు మ్రోయ - నతిశయంబుగ విన్కు లంతంత నమరఁ
బాయక “చాఁగుబళా!" యనుశబ్ద - మాయతి [61]నాకసమంది ఘూర్ణిల్లఁ
బ్రతిదినంబును భక్త బండారిబసవఁ - డతిభక్తిరతి మతి నంకురింపఁగను
శాశ్వతఘనలింగసంపద మెఱిసి - యీశ్వరభక్తుల [62]ని ట్లెదుర్కొనుచు

బసవేశ్వరుని శివాచారనిరతి


మంగళహర్షోదితాంగవిక్రియల - సంగతి నాత్మ నుప్పొంగి యుప్పొంగి
భయభక్తియుక్తిఁ [63]దద్భక్తాంఘ్రిచయము - పయిఁ జక్కఁజాఁగిలఁబడిమ్రొక్కి మ్రొక్కి
పటుతరసద్భక్తపాదాబ్జరేణు - పటలపర్యంకంబు పైఁ బొర్లి పొర్లి
హరభక్తనికరదయామృతవృష్టి - పరిగొని కురియఁ [64]దొప్పఁగఁ దోఁగి తోఁగి
యొడయలదివ్యపాదోదకవార్ధి - నడునీటఁ గడువేడ్కఁ బడి తేలి తేలి
వరభక్తసందోహపరితోషితార్థ - పరమసపర్యసంపద వ్రాలి వ్రాలి
మతిలింగజంగమోచితపరతత్త్వ - సతతశివార్చనారతి సోలి సోలి
శరణనిర్మలనిత్యసత్యప్రసాద - వరసేవనక్రీడ వడిఁ గ్రాలి క్రాలి

చారువచోవిలాసంబులఁ దనర - నో[65]రార వారి సన్నుతి సేసి చేసి
వారి మనోలత వడిఁజుట్టిచుట్టి - సారగాంధర్వరసముఁ గ్రోలి క్రోలి
దరహసితాస్య విస్ఫురణయుఁ దనర - హరగణాస్థానంబునం దాడి యాడి
[66]నిక్కంపు [67]భక్తికి నిక్కయై తన్నుఁ - దక్కి [68]యెంతయు భక్తిఁదాఁ జొక్కి చొక్కి
యనవరతము నీప్సితార్థుల కర్థిఁ - దనుమనోధనము [69]లప్పన సేసి చేసి
యందంద పరమతత్త్వానుభవార్థు - లందత్త్వసౌఖ్యజలధి ముంచి ముంచి
ప్రవిమలభక్తి సంపత్సుఖార్థులను - బ్రవిమలభక్తిసంపదఁ దేల్చి తేల్చి
యారంగఁ గామసుఖాపేక్షితులను - శ్రీ(స్త్రీ?)రత్నరాజిఁ బూజించి పూజించి
వరరత్నభూషణోత్కరధనార్థులను - వరవస్త్రభూషణావళిఁ దన్పి తన్పి
రాజవదుపచారపూజనార్థులను - రాజవదుపచారరతిఁ గొల్చి కొల్చి
యష్టాంగభక్తి క్రియాసుఖార్థులను - నష్టాంగభక్తిక్రియలఁ బూన్చి పూన్చి
శీలసంబంధుల శీలంబు లెఱిఁగి - శీలసంబంధ సుస్థితి నుంచి యుంచి
నియమవ్రతాధికనిష్ఠితాత్మకులఁ - బ్రియవస్తుసమితి నర్చించి యర్చించి
బసవఁ డీక్రమమున భక్తిసామ్రాజ్య - మెసకంబుతోఁ జేయునెడ లసత్ప్రీతి
“ముప్పూఁట నోగిరంబులుఁ బదార్థములుఁ - దప్పక కావళ్ల నెప్పుడుఁ బంప
వెండి వేశ్యలయిండ్ల నుండి భోగించు - మిండజంగములు పండ్రెండువే లనిన
నున్న జంగమసంఖ్య [70]మున్ను రూపించి - యెన్నంగ శక్యమే యీశునకైన”
ననుచు భక్తానీక మచ్చెరువంద - ననయంబు భూతిశాసనులాదిగాఁగ
నెల్లభక్తావళి కీప్సితార్థములు - సెల్లించుచును భక్తి సేయుచున్నెడను;

బసవని మేనల్లుఁడు చెన్నబసవని మహిమ


బరమేశుభక్తియ ప్రాణమై పరగు - తరుణి యా నాగాంబవరతనూభవుఁడు
ప్రస్తుతింపఁగ [71]నొప్పుబసవకారుణ్య - హస్తసంభూతప్రశస్తదేహుండు
నసదృశభక్తియోగాత్ముండు చెన్న - బసవండు గురుభక్తిపాత్రోత్తముండు
సర్వాంగలింగి సంసారనిస్సంగి - గర్వాపహారి వ్రాక్తనశివాచారి
సారగుణాన్వేషి సరససంభూషి - కారుణ్యరాశి లింగమనఃప్రవేశి
యగణితసుఖశీలి యతిదయాశాలి - నిగమార్ధసంవేది నిచితప్రమోది
విరహితోభయకర్మి వరలింగధర్మి - యరివర్గసంహారి యాత్మోపకారి

లింగాభిమాని యభంగురజ్ఞాని - సాంగత్యసువిధాని సతతావధాని
పరమానురాగి సద్భక్తిసంభోగి - విరసభవత్యాగి విమలాత్మయోగి
సత్యసల్లాపి ప్రసన్నస్వరూపి - నిత్యప్రతాపి వినిర్గతపాపి
యీశ్వరమూర్తి యతీంద్రియవర్తి - శాశ్వతకీర్తి ప్రసాదప్రపూర్తి
యనఁగ నిట్లొప్పారి యతులితమహిమ - ననుదినవర్ధమానాంగుఁడై [72]యుండ
“బసవని శ్రీపాదబిసరుహంబులకు - నసలార నిత్యంబు నర్చ లిచ్చుచును
మించినభక్తిమై మేనరోమాంచ - కంచుకం బధికసమంచితంబుగను
గద్గదకంఠుఁడై కనుఁగవ సుఖస - ముద్గతాశ్రువు లొల్క నుత్సుకలీల
సప్రాణలింగలింగప్రాణమథన - సుప్రసన్నానుభవప్రాప్తిఁ బొంది
నలిగొనమర్కటన్యాయంబునందు - ఫలమునఁ బొంది సోపానంబులు డిగి
వెసఁ బొందఁగలుగువాయసఫలన్యాయ - మసలారఁగాఁ జరితార్థతఁ [73]బొంది
గురుభక్తి[74]ఫలసారగుహ్యప్రసాద - వరసేవనాసుఖపరవశలీలఁ
గమనీయ మొంద లింగంబు ప్రాణంబు - రమణఁ బ్రసాదపూరంబు దేహంబు
దిరమగు శుద్ధభక్తియు మానసంబు - హరగణానుభవసౌఖ్యంబు ధనంబు
నిటు గూడ నన్నియు నేకమై కాదె - పటుతరంబుగఁ జెన్నబసవఁడై [75]పేర్చె
భవ్యలింగమున కేర్పడఁ బ్రాణమగుచు - నవ్యప్రసాదంబునకు రుచి యగుచు
జంగమభక్తి కాశ్రయపదం బగుచు - మంగళప్రాప్తికి మందిరం బగుచు
గుఱిగాక వాజ్మనోగోచరం బగుచు - వఱలెడు శివతత్త్వ[76]వల్లభు మహిమ
బిలిబిలి తలఁపులవలన వర్తిల్లి - మొలచిన తమతమ కొలఁది మాటలను
వినుతించుటెల్లను వెలితియ కాదె - పనుగొన నా చెన్నబసవన్న నెలవు
కావున బసవండె గణుతింప నెఱుఁగు - భావింప నా చెన్న బసవన్న మహిమ
బసవనిమహిమయు భాతిగాఁ జెన్న - బసవండె యెఱుఁగు బెంపెసఁగఁ గీర్తింప”
నంచు భక్తానీక మచ్చెరువంద - నంచితభక్తిసమగ్రత మెఱసి

చెన్నబసవన బసవేశ్వరుని స్తుతించుట


“శాశ్వత! సర్వజ్ఞ! శశ్వద్గుణాంక! - విశ్వేశ శ్రీ గురవే నమో” యనుచు
“సద్యఃప్రసన్నానవద్యవేదాంత - వేద్యాత్త! శ్రీ గురవే నమో” యనుచు
“దత్తకైవల్య! యుదాత్తసద్భక్తి - విత్తేశ! శ్రీ గురవే నమో” యనుచు

“నమిత పరంజ్యోతి రాకారదివ్య - విమలాంగ! శ్రీ గురవే నమో” యనుచు
“స్థిరతరసృష్టిస్థితిలయప్రపంచ - విరహిత! శ్రీగురవే నమో” యనుచు
“సకళ నిష్కళ చరాచరరూపవిగత - [77]వికృతాంగ! శ్రీ గురవేనమో” యనుచు
“నాద్యంతరహితనిత్యామలతేజ! - విద్యాత్మ! శ్రీగురవే నమో” యనుచు
“నధ్వషట్కాతీత! యతిపాతకౌఘ - విధ్వంస! శ్రీగురవే నమో” యనుచు
“మోక్షా[78]ర్థిరక్షణదక్షకటాక్ష - వీక్షణ! శ్రీగురవే నమో” యనుచు
“నజ్ఞానతిమిరసంహారార్థ[79]దత్త - విజ్ఞాన!శ్రీ గురవే నమో” యనుచు
“ధన్యాత్మశిష్యమస్తకకృపాహస్త - విన్యాస! శ్రీ గురవే నమో” యనుచు
“నఘహరణార్థశిష్యజనోపభుక్త - విఘనస! శ్రీగురవే నమో” యనుచు
“నశ్రాంతభక్త జనాత్మాంబుజాత - విశ్రాంత! శ్రీగురవే నమో” యనుచు
“ననఘ గురుప్రసాదామృతహృదయ - వినివాస ! శ్రీగురవే నమో” యనుచు
భ్రాజిల్ల నా చెన్నబసవఁ డబ్బసవ - రాజును దనగురుఁ బ్రస్తుతి సేయ

అల్లమప్రభుని రాక


నంత నల్లమప్రభువను సంయమీశుఁ - డంతకాంతకమూర్తి యతులితకీర్తి
నిర్మూలితోద్రిక్తదుర్మలుఁ డుభయ - కర్మనికృంతనకర్మకర్మఠుఁడు
వైరాగ్యసంసారవర్జితాత్మకుఁడు - దూరదృష్టాదృష్టచారుచర్యుండు
దానప్రతిగ్రహహీనవర్తనుఁడు - మానావమానసమానకీర్తనుఁడు
సమలోష్టకాంచన సమసుఖదుఃఖ - సమమిత్ర శాత్రవ సద్భావనుండు
సప్తధాతుమదాదిసర్వాంగగుణవి - లుప్తచిత్తుండు సంసుప్తిదూరుండు
కాలసంకల్పవికల్ప మహేంద్ర - జాలప్రపంచనిర్మూలనశాలి
పరమశివానందపరవశీభూతుఁ - డురుముక్తకేశయుతోత్తమాంగుండు
దివ్యానిమిషసుధాదృష్టి[80]గోచరుఁడు - భవ్యుండు గాంధర్వపండితోత్తముడు
ఆంతరయాగనిరంతరయోగ - వంతుఁ డనంతవేదాంతవేద్యుండు
నిశ్శరీరి శరీరి నిర్నామి నామి - నిశ్శబ్ది శబ్ది వినిర్భావి భావి
ద్వైతయోగక్రియాద్వైతయోగక్రి - యాతీతయోగక్రియాన్వీతుఁ డనఁగ
ముల్లోకములఁ దేటతెల్లయై భక్తి - కెల్లయై స్వేచ్ఛావిహీనకృత్యమున

లీలఁ గరస్థలలింగవిన్యస్త - లోలేక్షణానందకేళిఁ దన్మఱచి
యిది యేఱు వల్లంబు నిది సెట్టు గట్టు - నిది దెరు వడవి యన్నది దలంపుడిగి
యరుదేర నన్నియు నంతంతఁ దొలఁగి - తెరువిచ్చుటకు నరు లరుదని పొగడ
బసవని యసమవిభ్రాజితభక్తి - రసవార్ధి వెల్లివిరిసి నిట్టవొడువ
వచ్చెఁ దద్వీచిప్రవర్తితం బగుచు - వచ్చువహిత్రంబువడువు[81]ను బోలె;
నిచ్చ రత్నపరీక్ష యెఱిఁగి చేపట్టు - బచ్చునుబోలె నబ్బసవయ్య ప్రభువు
భావంబు సంగయదేవునియంద - భావనఁ బొరయుడు భక్తిమై మ్రొక్క
రుచిరరత్నప్రభానిచితమై యున్న - యచలితస్వర్ణసింహాసనం బెక్కి
ప్రభువున్న; నంగప్రభాపటలంబు - లభినుతిఁ బొందె దిశాంతరాళముల
నొడల జీవము గల్గియును లేనివాని - నడగల్గియును వర్తనము లేనివానిఁ
గన్నులు [82]వ్రేఁగులుగాఁ గలవాని - మున్ను లింగమ ప్రాణముగ నున్నవానిఁ
జేతనుండయ్యు నిశ్చేష్టలవాని - ఖ్యాతి లేకయు నుతిఁ గడచన్నవాని
బలుకుల మీఱినబాసలవానిఁ - దలఁపులదాఁటిన తత్త్వంబువాని
గుణహీనుఁ డయ్యును గుణమిచ్చువాని - బ్రణవాత్ముఁ డయ్యు నేర్పడియుండువానిఁ
గని శరణనుచు గద్గదకంఠుఁడగుచుఁ - గనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
బసవఁ డల్లంతటఁ బ్రణమితుం డగుచుఁ - నసలార సముచితాభ్యర్చితుఁ జేసి
లింగతూర్యములు సెలంగ నుప్పొంగి - మంగళారతులెత్తె మహిఁ దత్‌క్షణంబ

అల్లమప్రభునికి విందువెట్టుట


పల్లెరం బిడి పంచభక్ష్యాన్నములును - నెల్లపదార్థముల్ దెల్లంబు గాఁగ
వడ్డించి యబ్బసవండర్థి దొడ్డ - దొడ్డకళ్లుగఁ జేసి తొడిఁ [83]దొడిఁబట్టి
హరునకుఁ దొల్లి యా సురియచౌడరసు - కరమర్థి [84]నందిచ్చు కరణియుఁబోలె
[85]నందిచ్చుచుండంగ నర్థిఁ జేసేత - నందికొంచును బ్రభు వారగింపంగ
బంబి లక్షయు నెను(c?) బదివేలు జంగ - మంబులకనుచు సమగ్రత దనర
నటమున్న చేసినయప్పదార్థంబు - లిటుగూడ సమయుడు [86]నెట్లొకో యనక
యేనకాకోగిరం బింక నీ కనుచుఁ - బూని యూఁకింపఁ బ్రభువు మెచ్చి యంతఁ
“గో”యని భక్తనికాయంబు వొగడ - "హో”యని సత్కృపాయుక్తి వొల్పార
“బాపురే! బసవ! సద్భక్తసంత్రాణ! - బాపురే! బసవ! సద్భక్తిధురీణ!

నల్లవో! బసవ! యనశ్వరకీర్తి! - నల్లవో! బసవన్న! నందీశమూర్తి!
అమృతంబునందు దివ్యంబగుచేగ - విమలమాణిక్యగర్భమున దీపంబు
చెఱకునఁ బండు పసిఁడిఁగమ్మఁదనము - గొఱయైన మలయజ కుజమునబూవు
చిత్తరువునకును జీవంబుఁ బసిఁడి - పుత్తళికిని బ్రాణమును నిక్కువముగఁ
బుట్టినయట్టు[87]గాఁ బుట్టితి కొడుక! - నెట్టణ భక్తికి నిలుకడ యగుచు
నాదుబసవ! దండనాయకబసవ! - యాదిబసవ! యసంఖ్యాతులబసవ!
భక్తులబసవ! యా ప్రమథులబసవ! - ముక్తీశుబసవ! నా ముద్దులబసవ!
సంగన బసవ! ప్రసాదంబు బసవ! - జంగమంబు బసవ! సత్యంబు బసవ!
పండితబసవ! సత్పాత్రంబు బసవ! - బండారిబసవ! సౌభాగ్యంబు బసవ!
తత్త్వంబు బసవ! మహత్త్వంబు బసవ! - సత్యంబు బసవ! నిత్యత్వంబు బసవ!
[88]వృషభంబు బసవ! సంవిజ్జ్యోతి బసవ! - విషకంఠు బసవ! వివేకంబు బసవ!
తజ్‌జ్ఞులబసవ! తత్త్వజ్ఞులబసవ! - ప్రాజ్ఞులబసవ! సర్వజ్ఞులబసవ!
సిద్ధులబసవ! ప్రసిద్ధులబసవ! - శుద్ధులబసవ! ప్రబుద్ధులబసవ!
బసవయ్య! బసవన్న! బసవకుమార - బసవ! బసవరాజ! బసవలింగంబ
వడిఁ బాఱుజలమున కొడలెల్లఁగాళ్లు - వడిఁ గాలుచిచ్చున కొడలెల్ల నోళ్లు
వడి వీచుగాడ్పున కొడలెల్లఁదలలు - వడిఁ జేయు [89]బసవన కొడలెల్ల భక్తి
'బసవా' యనఁగ విన్నఁ [90]బానలొండేల? - పసులకునైనను ప్రబలదే భక్తి?
“బసవా” యనఁగ విన్నఁ [91]బానలొండేల? - [92]పసిబా[93]లురకునైన నెసఁగదే భక్తి?
“బసవా” యనఁగ విన్నఁ బానలొండేల? - యసమాక్షునకునైన నలరదే భక్తి?
“బసవా” యనెడి భక్తిపరులఁ జూచినను - [94]నెసఁగుపక్షులకైన నింపదే భక్తి?
“బసవా” యనెడు భక్తిపరులచేరువను - మసలు జంతువులకు నెసఁగదే భక్తి?
“బసవా” యనినఁ జాలుఁ [95]బానలొండేల? - ననలార విషమైన నమృతంబు గాదె?
“బసవా” యనినఁ జాలుఁ [96]బానలొండేల - పసిగ మైఁగులిశంబు గుసుమంబు గాదె?
“బసవా” యనినఁ జాలుఁ [97]బానలొండేల? - వసుధ శత్రులు మిత్రవర్గంబు గాదె?
“బసవా” యనినఁ జాలుఁ [98]బానలొండేల? - వెసఁగాలు కార్చిచ్చు వెన్నెల గాదె?
లింగైక్యసౌఖ్యకేళీలోల [99]భక్తి - జంగమప్రాణాను[100]సంధానశక్తి

యుభయప్రసాదసంయోగోపభుక్తి - త్రిభువనంబుల నున్నదే యితరులకు”
నని పెక్కుభంగుల నగ్గింపుచుండ - [101]ననుషక్తి నా బసవనకుమారుండు
మిక్కిలిసద్భక్తి మిక్కుటంబుగను - మ్రొక్కుచు నందంద మోడ్పుఁగేలమర
“భక్తవత్సల! [102]పరాపర! పరమాత్మ! - ముక్తివల్లభ! [103]దివ్యమూర్తి! సర్వజ్ఞ!
ప్రభువ! జంగమలింగ! ప్రమథాగ్రగణ్య! - ప్రభువ! సంగయదేవ! పరమానురాగ!
కారుణ్య నిధి! సమగ్రత సూపి నీకు - నారగింపఁగ [104]బెట్టునంత భక్తుఁడనె?

పార్వతి ప్రమథులకు విందువెట్టు కథ


కైలాసమునఁ దొల్లి గఱకంఠుఁ గొలువ - శైలేంద్రకన్యక సనుదెంచునెడను
మారారి యట్ల ప్రమథవర్గమెల్ల - నారంగ సారూప్యధారులై యున్నఁ
బరమేశుఁడెవ్వఁడో ప్రమథు లందెవరొ? - యరుదెంచి యెఱుఁగలేకంబిక నిలువఁ
బార్వతీసందేహభావన యెఱిఁగి - పార్వతీశుఁడు దక్కఁబ్రమథు లక్షణమ
తమతమ తొంటిరూపములు వోవిడిచి - రమణ నొండొండురూపములు వొల్పార
గోమేషవానరకుక్కుటముఖులు - సామజశరభోష్ట్ర శార్దూలముఖులు
మహిషాశ్వసారంగమార్జాలముఖులు - నహికేసరివరాహవిహగాదిముఖులు
ద్విముఖచతుర్ముఖత్రిముఖికముఖులు - నముఖపంచముఖసహస్రాదిముఖులు
లంబోష్ఠలంబాక్షలంబనాసికులు - లంబోదరులు నతిలంబకర్ణులును
గజకర్ణు లజకర్ణు లజితకర్ణులును - విజయఘంటాకర్ణ వీరకర్ణులును
బాహూరుముఖులును బాహూరుతనులు - బాహూరుపాదులు బాహువక్త్రులును
బహుబాహుబహుపాదబహుతాలుజిహ్వ- బహువర్ణబహుకర్ణబహురూపధరులు
నై యున్న ప్రమథగణానేకకోట్ల - నాయంబ గని యద్భుతాక్రాంత యగుచు
నతులితనిజసహజాకృతి నున్న - పతికి మ్రొక్కుచును సంస్తుతిపూర్వకముగ
“విను ప్రమథాధీశ! వీరలందఱును- దన మనోధర్మంబు దారిట్లెఱింగి
కామరూపంబు [105]సక్కఁగఁ దాల్చి రొప్ప - నీమహా[106]గణములకెల్ల నీక్షణమ
పెట్టుదు విందు సంప్రీతిమై భక్తి - పుట్టెడు నంచు విభూతు లిప్పించి
యరిగి మహాకాశ మనియెడిబయలఁ - బరగఁ దత్త్వములను పందిరుల్ వెట్టి
యవికలాజాండంబు లనుభాండములను - వివిధపక్వాన్నాదివితతులు గూర్చి

భవ్యకల్పద్రుమఫలపల్లవములు - దివ్యామృతంబునఁ దివుటఁ దాలించి
క్షీరేక్షురసదధిఘృతవార్ధికోట్ల - క్షీరేక్షురసదధిఘృతములు నినిచి
యకలంకరసరసాయనములు గూర్చి - సకలదీర్ఘికల వాసన చేసి [107]కలపి
మఱియుఁ జింతామణిమందిరభిత్తిఁ - దఱిఁదఱిఁ బదపదార్థములు సిత్రించి
సురభిసహస్రసుస్థిరజన్మదేశ - వరదివ్యలోచన వలయువస్తువులు
వెండియు సమకూర్చుచుండంగఁ బ్రమథ - మండలి ప్రమథ[108]కుమారు నొక్కరుని
“యరయుమా యవసరం బయ్యెనొ కాదొ? - గిరిజాలయంబున కరిగి నీ” వనుడు
“నవుఁగాక” యని వచ్చి యంబికఁగాంచి - “యవసరంబే”[109]యని యడుగఁగఁ దడవ;
“ప్రమథుల నిట్టున్నభంగిఁ దోడ్తెమ్ము - ప్రమథకుమార! వేపరువు[110]న” ననుడు
“నొక్కింత [111]వెట్టిన నొగి నారగించి - గ్రక్కునఁ దోడ్తెత్తు గణములనెల్ల
నరుగంగఁ జాల నిట్లాఁకొని” యనుడు - సరసర లింగావసరముఁ జెల్లించి
సొంపార గిరిజ వడ్డింప వడ్డింపఁ - బొంపిరి నోగిరంబులు పదార్థములు
కులపర్వతంబులంతలు గళ్లు సేసి - నలినారగింపంగఁ గలపదార్థములు
నోగిరంబులు సమయుడు వెఱఁగంది - యాగౌరి యత్యద్భుతాక్రాంత యగుచు
“నెన్నంగఁ బ్రమధులకెల్లఁ గావించి - యున్న పదార్థంబు లోగిరంబులును
మానుగాఁ బ్రమథకుమారుఁడొక్కరుఁడ - తా నారగించెఁ జిత్రము సిత్ర! మింక
నేమి సేయుదు” [112]నంచు నీశ్వరుకడకు - హైమవతీదేవి యరుదెంచి మ్రొక్కి
తలవాంచియున్నెడ దరహాసదీప్తి - [113]వెలయంగఁ బ్రమథుల వినుతిసేయుచును
“గౌరి! యిం దొకసిట్టిగణ మిట్టివాఁడు - తోరం[114]బు గణములగౌరవం బెట్టు
లవు "నసంఖ్యాతాస్సహస్రాణి” యనుచు - భువి"సేవ మేతన్నిబోధ[115]త” యనుచుఁ
దొడఁగి వేదములు సంస్తుతిసేయఁబోయి - [116]నడుఁకుచు [117]వడవడ వడఁకెడినేఁడుఁ
గావున ప్రమథు లక్షయు లనపాయు - లావిర్భవన్మహిమాఢ్యు లద్విజులు
నవ్యయు లనుపము లమరు లక్షరులు - దివ్యులు భవ్యులు ద్రిభువనస్తుతులు
సుభగులు సుగుణులు సుమతులు శూరు - లభవు లప్రతిము లత్యానందయుతులు
వేదాంతవేద్యులు విశ్వైకనుతులు - నాదికారణు లణిమాదిసద్గుణులు
లింగాంశు లయ్యాదిలింగసంభవులు - లింగమూర్తులు మహాలింగైకతనులు
లింగాశ్రయులు వ్రాణలింగసంగతులు - లింగసదర్థులు లింగానుభవులు

లింగగంభీరులు లింగకారణులు - లింగవ్రతస్థులు లింగచేతనులు
లింగవినోదులు లింగసంచయులు - లింగావధానులు లింగాత్మసుఖులు
లింగాభిమానులు లింగశాసనులు - లింగసత్ ప్రాణులు లింగతత్పరులు
సర్వశుభోదయుల్ సర్వాధిపతులు - సర్వసంపూర్ణులు సర్వకారణులు
[118]వేయేమి? ప్రమథుల కాయంబు మాకుఁ - గాయంబు గాకొండుగాయంబు గలదె?
ఇందొక్క ప్రమథునియిచ్చ నజాండ - సందోహములు సెడు జనియించు నిలుచు
నదిగాక హరివిరించాది దేవతలఁ - గుదియింతురనుటెల్ల నిది యెంతవెద్ద
తప్పకిందొక్కఁడు ఱెప్పవెట్టుడును - నప్పుడ సర్వసంహార మౌ[119]ననినఁ
గావున వర్ణింపఁగా నగోచరము - భావించి చూడ మా ప్రమథులమహిమ”
యంచుఁ బ్రశంసింప నంబికాదేవి - సంచితమానసాశ్చర్యయై యుండె;
నట్టిపార్వతియు మున్నారగింపంగఁ - బెట్టఁజాలదు విందు విన్నపాపనికి
దేవ! దేవస్తుత్య! దివ్యలింగాంగ - భావనాతీత! సద్భావసన్నిహిత!
శంకర! [120]దురితభయంకర! శౌరి - పంకజ ప్రభవాదికింకరోల్లసిత!
శుభకర! చిన్మయ! జ్యోతిస్స్వరూప! - ప్రభువ! [121]పరాపర! భక్తవత్సలుఁడ
సర్వకల్యాణ! సంసారవిదూర! - సర్వజ్ఞ! జియ్య! సాక్షాత్సంగమేశ!
నెట్టణ నిష్ఠించి నీకారగింపఁ - బెట్ట నాశక్యమే? పృథుదయా[122]భావ!

అల్లమప్రభువు బసవనికి వరములిచ్చుట


యనుచుఁ బ్రశంసింప [123]నల్లమ మెచ్చి - వినుతదయామృతవనధి నోలార్చి
“సురభి చింతామణి సురభూరుహములు - వర(రు?)వులై యుండంగ వర మీగి యెంత
వెద్ద నా” కనుచు సంప్రీతి సిత్తమునఁ - దద్ద సంధిలఁ బ్రసాదము గృప సేసి
తలఁచిన [124]పదపదార్థములు సేకూడ - వలె నన్న వస్తువు లిలఁ [125]దాన పొందఁ
బలికినబాసయుఁ బాటియై తనర - నిలిచినమార్గంబు నిలుకడ గాఁగఁ
బట్టినపదడైనఁ బసిఁడియై వెలుఁగ - ముట్టినబయలైన మూర్తి సేకొనఁగఁ
దెఱలినశివునైన వెఱవక గెలువఁ - దఱిమినజంగమధట్టున కోర్వఁ
జాలు నక్షయలింగసంపద లిచ్చి - లీలఁ దత్త్యార్థసమ్మేళనం బొలయ
మోహమాయాదితమోరాశిఁ ద్రుంచి - దేహేంద్రియాదివిద్వేషం బడంచి
మున్ను దత్త్వస్థితిఁ దన్నుఁ దా నెఱిఁగి - తన్నును సత్క్రియోదాత్తతఁ గూర్చి

లీనమై ప్రాణంబు లింగమం దొలయఁ - గా నాథుఁ డాప్రాణలీనమై యుండఁ
గా నిరంతరపరమానందసుఖము - నూనిన శివభక్తియుక్తిమార్గమున
వడి “దివారాత్రౌచ వర్జయే” త్తనఁగఁ - బడుసదాంతర్యోగభాతి గైకొలిపి
ఘనబహిరంగశృంగారాంతరంగ - వినుతప్ర[126]మథనసంవిత్సుఖలీల
దివ్యానుభవవార్ధిఁ దేల్ప నబ్బసవఁ - డవ్యయశివతత్త్వ మనువు నెఱిఁగి
యుప్పు [127]ముల్లియ నీర నుంచినయట్లు - గప్పురంబున నగ్గిఁ గప్పినయట్లు
వడగళ్లవర్షంబు వారాశిఁ గురియు - వడుపునఁ దా లేక వర్తింపుచుండెఁ
బ్రభువుచరిత్రంబు భక్తిమై భక్త - సభలందుఁ జదివిన సంప్రీతి విన్న
సరససమంచితసచ్చిదానంద - సురుచిరలింగైక్యసుఖము [128]వట్రిల్లు

వంగకాయలు లింగములైన కథ


వెండియు నొకనాఁడు దండనాయకుఁ డ - ఖండితభక్తివికస్వరలీల
జంగమార్చన సేయుసమయంబునందు - దొంగలు బందివెట్టంగ నూహించి
లింగవంతులు గాని [129]లెంగుల కతని - యంగణాంతరమున కరుగరాదనుచు
వంగకాయలు గట్టుకొంగులఁ బొదివి - లింగసన్నిహితుల భంగి వట్రిల్లఁ
జనుదెంచి యా బసవనదండనాథుఁ - గని భయంపడి మ్రొక్కఁ గన్నుల నవ్వి
“లింగవంతులుగాని లెంగుల కీశ్వ - రాంగణంబున కెట్టు లరుదేరవచ్చు
నింక భక్తుల కాక యీశ్వరార్చనలు - కొంకక చేయుఁడు గూర్చుండుఁ” డనిన
నుల్లముల్ గలఁగ నొండొరులఁ జూచుచును - జల్లన గుండె [130]దిగుల్లన [131]నవయ
భావించి “మన [132]మెట్టు బందిఁ జిక్కితిమి - దేవర గలిగెనా చావు దప్పెడిని
మన కింక నెమ్మెయి [133]మగిడిపోఁ బోల” - దని కృతనిశ్చయులై కూరుచుండి
సరసర మును లింగసహితులపోలెఁ - గరములు [134]సాఁచుడుఁ గట్టుకొంగులను
భంగి నా బసవయ్య భావసంగతిని వంగకాయలు వ్రాణలింగంబు లయ్యె

బల్లేశుమల్లయ్య కథ


అట్టిద కాదె మున్వ్యవహార మేఁగి - నట్టిచో లింగాలయంబు లేకున్న
“సంతతలింగ[135]సంస్పర్శననియమ - మంతరించినఁ జచ్చునటె సెట్టి” యనుచు
గుంచితమతిఁ బూరిగుడి [136]వన్ని యచటఁ - గుంచంబుఁ గొండగోఁగులఁ బూజసేసి

“కఱకంఠుగుడి యిదెకంటి మే” మనుచుఁ - [137]బెఱికసెట్లాతనిఁ బిలిచి చూపుడును
నాయతభక్తి “శివాయ నమోన - మో” యని యందంద మ్రొక్కి ముమ్మారు
వలగొని యింటికి వచ్చి కుడ్చుడును - “నిల లింగ మనుచు నిహీ! మల్లభావ
గుంచంబునకు మ్రొక్కి కుడిచెఁ [138]బొట్టారఁ - గుంచంబుఁ గొనిరండు [139]గొలువఁగవలయు
నాఁకటి కక్కఱకైనదె వేల్పు - వేఁకువఁ గుంచంబు వెండియు వలయు”
ననుచు నా శివదేవు నపహసింపంగ - “వినఁ [140]గూడ”దని చేయి వీనులఁ జేర్చి
“చా! కుక్కలార! సాక్షాల్లింగమూర్తి - గాక కుంచమె? [141]యెఱుంగక మొఱం(ఱిం?)గెదురు
నమ్మరే రండు పినాకిఁ జూపెదను - గ్రమ్మన” నని యేఁగఁగాఁ దొంటియెడను
బ్రాకారమును ముఖభద్రమంటపము - శ్రీకరంబుగ స్వర్ణశిఖరంబు గుడియు
విరచితంబై యొప్పు వృషభేంద్రుఁడెదుర - నరయఁ గుంచము లింగ మయ్యె నతండు
నెల్లలోకముల[142]ను బల్లేశుదేవు - మల్లయ్యనా నొప్పె మఱి యట్లుఁగాక

కాటకోటని కథ


కాట[143]కోటఁడు నాఁగఁ గలఁ డొక్కగొల్లఁ- - డేట[144]పెంట్రుక దన కీశ్వరుం డనుచుఁ
బాలెల్లఁ బెంట్రుకపైఁ [145]బోయఁ దండ్రి - గేలి సేయుచువచ్చి కాలఁదన్నుడును
ఖ్యాతసద్భక్తిమైఁ గాటకోటండు - నాతని కలుగుచుఁ జేతిగొడ్డటను
[146]భూతలంబునఁ బడి పొరిఁబొరిడొల్ల - నేతరి వెనుకముందించుక లేక
తల దెగిపడ వ్రేసెఁ దా భవంబనెడు - పులితలఁ దెగవ్రేయుపొలుపు వట్రిల్ల
నిక్కడ నితఁడు దా నిట్లు వ్రేయుటయు - నక్కడఁ గైలాసహర్మ్యకవాట
జాలముల్ గూడ జర్జరితమై [147]పడియెఁ [148]గీలొకో! గొడ్డలి “గైలాసమునకుఁ
గడుఁజోద్య"మని నరుల్ [149]బుడిబుళ్లువోవ - నడరఁబెంట్రుక లింగ మయ్యె [150]నంతటను
బంబిన బావూరి బ్రహ్మయ్యభావ - నంబునఁ గాదె జొన్నలు లింగ మయ్యెఁ
గావున భక్తులభావంబు లింగ - దేవునకును జన్మదేశంబు [151]గాదె
బసవని భక్తిసౌభాగ్యప్రభాతి - యెసకంబు దలపోయ నిది యెంతవెద్ద?
చపలలు శివునిలాంఛనపరు లగుచు - నపవర్గకారణులై రదెట్లనిన:-
నేణాంకధరుభక్తి కెక్కు “ననాద - రేణ శాఠ్యేన” యన్ క్రియఁ దలపోయ

ననుచు భక్తానీక మచ్చెరువంద- నను[152]షక్తి మ్రుచ్చుల నబ్బసవయ్య
యచ్చులఁగాఁ జూచి యభిమతార్థంబు - లిచ్చి భక్తులఁ జేసె [153]నిజ్జగం బెఱుఁగ

జొన్నలు ముత్తెములైన కథ


మఱియును నొకజంగమం బేఁగుదెంచి - యఱిముఱి నభ్యంజనావసరమున
[154]నిత్యనేమం బిది నేఁటి మ్రుగ్గునకు - ముత్యాలపొడి మాకు ముక్కుస వలయుఁ
గదలక మెదల కీక్షణమాత్రలోనఁ - బదివుట్ల ముత్యముల్ బసవ! యి”మ్మనిన
సరసర [155]లింగపసాయితశస్త్ర - కరతలుఁడై చూడఁ గనుదృష్టి నున్న
జొన్నల [156]ప్రో(C?)క విశుద్ధముక్తాఫ - లోన్నతరాశియై యున్న నవ్వుచును
“సన్నుత! పదివుట్ల సంఖ్య మీకేల? -యెన్ని మీ వలసిన వన్ని గైకొనుఁడు”
అనవుడు “నట్లకా”కనుచు ముత్యములు- గొనిపోయెఁ బెఱికలఁ [157]దనర నన్నియును.

మొఱటద వంకయ్య కథ


మొఱటద వంకయ్య మున్కొక్కనాఁడు - కఱ[158]కంఠభక్తుఁడొక్కరుఁ డర్ధరాత్రి
నరుదేరఁ బొడగని యడుగుల కెరఁగి- సరసోచితక్రియా[159]సంతుష్టుఁ జేయ;
“మాలింగమునకుఁ నేమమ్మొక్క మొదవు-పాలును మారేడుఁబత్తిరి వలయు,
నటుగాని యవసరం బలవడనేర; - [160]దిటసెల్లునో యని యేఁగుదెంచితిమి
ఎడసేయఁ [161]గా దింక నీక్షణంబునను- గడియింపకుండినఁ [162]గాదు గార్యంబు
హరభక్తు లూర లే రొరుల నే నడుగఁ- బొరుగూరి కీ[163]వేళఁ బోవంగరాదు
ఇంకనె” ట్లన నాత్మ నించుకేనియును- గొంకక వంకయ్య గొడ్డు నక్షణమ
కొనివచ్చి యొకవట్టికొఱట సంధించి- మనసిజహరభక్తమండలిఁ దలఁచి
“యీకొఱటన [164]పత్తిరీ గొడ్డునంద- ప్రాకటంబుగఁ బాలు వడయుదు” ననుచుఁ
గుండ వేగమ కడ్గికొనివచ్చి పిదుకఁ - గుండ నిండఁగఁ బాలు గురిసె నాగొడ్డు
కొఱటనె పత్రి యంకురితమై [165]పరిగె- వఱల నామొఱటద వంకయ్య గోసి
తెచ్చి యా భక్తున కిచ్చి నేమంబు - సెచ్చెరఁ జెల్లించెఁ జెప్పఁ జిత్రంబు
అనఁగ విందుము దొల్లి యాద్యోక్తులందుఁ- గనుఁగొంటి మిప్పు డీ కటకంబునందు

బసవని దృష్టిసంస్పర్శనంబునన - [166]యెసఁగు జొన్నలప్రో(c?)క యిందఱుఁ జూడఁ
బొనరుచు ముత్యాలప్రో(c?)కయై తనరె” - నని భక్తమండలి వినుతింపుచుండఁ

సంగమేశ్వరుఁడు బసవని మూఁడవకన్నడుగు కథ


జెచ్చెర మఱియు నీప్సితవస్తు[167]వితతి - నెచ్చుగా బసవఁ డిట్టిచ్చుటఁ జూచి
“వేడుకయ్యెడు నాకు వేఁడంగ” ననుచు - రూఢిగా జంగమరూపంబుఁ దాల్చి
చక్కన సంగమేశ్వరుఁడ యేతెంచి - గ్రక్కున మూఁడవక [168]న్నడ్గఁ దడవ
ఆయత లింగపసాయితహస్తుఁ - డై "యెఱుఁగనె నీదుమాయ నే” ననుచు
ముకురంబుఁ జూపుచు ముక్కన్ను నీకు - నకలంక! సహజంబ యదె చూడు” మనిన
నద్దంబులోన ఫాలాక్షంబుఁ గాంచి - యద్దేవదేవుండు దద్ద లజ్జించి
యప్పు డక్కడన నిరాకార మగుడుఁ - జప్పరింపుచుఁ జూచి “చా! పంద! పంద!
ఓడకు మోడకు మోరోరి! సంగ! - ఓడకు మోడకు మొకటి[169]యు నొల్ల
నెఱుఁగవే సత్యమాహేశ్వరులిండ్ల - నెఱయంక కానిని నిజగతి నన్ను
దాసయ్యవలె నిన్నుఁ దవనిధి వేఁడ - నా సిరియాలున ట్లాత్మజుఁ గోరఁ
గనకవృష్టి యడుగఁ గరికాలునట్ల - వనితకు నెడవుచ్చు మన నంబిభాతి
వెండియుఁ గుమ్మరగుండయ్య కిచ్చు - మిండప్రాయంబుఁ గామింపఁ గాదేవి
స్వర్గాపవర్గాదిసౌఖ్యంబులొల్ల [170]భర్గ! - [171]నీ ప్రమథుల భక్తులయిండ్ల
నలరుచు డించిన యా ప్రసాదంబె - కలదు భోగింపఁగాఁ గలకాలమెల్ల
సర్వభక్తాత్మ! మీ జలకంబువాఁడు - గుర్వుగా మా కాటకోటయ్యగారు
హర! మీ నగరిమాలకరి పుష్పదంతుఁ - డరిది పూజారి కన్నప్ప [172]దేవయ్య
యిండెగట్టెడిది మా [173]యిండెరేకవ్వ - ఖండదీపమువాఁడు [174]గా నమినంది
నెట్టణ దీవించి నీకు విభూతిఁ - బెట్టెడువాఁడు మా పిళ్లనైనారు
అను[175]షక్తిమై గంధ మర్పించువాఁడు - మనసిజసంహర! మాయణుమూర్తి
వరద! మీ ధూపంబువాఁడు మాచయ్య - వరకీర్తి! మీ గంటవాఁ డోహిళయ్య
ధర మంగళారతుల్ [176]దరిసించువాఁడు - వరద! సోమయగారు శరణవత్సలుఁడు
వంటకట్టెలు దెచ్చువాఁడు మారయ్య - పంటింపఁ గరికాలు పడిపెట్టువాఁడు
కఱకంఠ! యడబాల సిఱుతొండనంబి - [177]మఱి బానసమునది మా సంగళవ్వ

కరికాళచోడు(?)వళ్ళెర మిడువాఁడు - గరగ[178]కావటివాఁడు ఘనుఁడు హౌన్నయ్య
రమణీయమగు నోగిరంబుల [179]పరిసె - నమువాఁడు సెన్నయ్య విమలదేహుండు
ఆరగింపఁగఁ బెట్టునవసరంబులది - వీర[180]చోడవగారు విశ్వైకవినుత!
అడపంబువాఁడు రేచయమును(?) [181]బాలు - పడుప్రసాదులు బిబ్బబాచయ్యగారు
మృడుఁడ! మా నాట్యనమిత్తండి వైద్యుఁ - డడరంగఁ గల్లిదేవయ్య! వెండీఁడు
మలహర! సామవేదులు పురోహితులు - వెలయఁ బౌరాణికుం డిల మాయిభట్టు
కోరి మీ పరిహాసకులు గళియంబ - [182]గారు వాగీశనైనారు వాఠకుఁడు
శ్రీపతిపండితుల్ శివుఁడ! మీ [183]కవులు - నా పండితయ్యగా రనుఁగుఁబండితులు
నాదివీణెలవాఁడు మాదిరాజయ్య - నాదరసజ్ఞుఁడు నలి శంకరయ్య
కరణంబు గర్మసంహర! కేశిరాజు - ధర జగదేవుండు దండనాయకుఁడు
గణనాథుఁ డిందుశేఖర! మీ ప్రధాని - ప్రణుతించి [184]చూడ మా ప్రభువు మీ ప్రభువు
ఇఱువత్తుఁడు గజసాహిణి యశ్వసాహి - యొఱపుగాఁ జేరమ యోగియొడయఁడు
అనఘ! రామయ్య యేకాంతంబువాఁడు - నొనర బల్లహుఁడు గుంటన, సఖినంబి
శంకర! నీ బంటు శంకరదాసి - యంకంబువాడు [185]నేణాదినాథుండు
లెంక దా మంచయ్య లీల మీ నగరి - సుంకీఁడు [186]సుంకేశు బంకయ్యగారు
సురియఁబట్టెడువాఁడు సురియచౌడయ్య - పొరిఁగులచ్చిరియారు భువి హేళగీఁడు
హర! నీకు బెజ్జమహాదేవి దాది - ధర రుద్రపశుపతి దామంత్రవాది
సువిధాని! కక్కయ్య భువి జాలగాఁడు - శివరాత్రి [187]సంగయ్య [188]సెలిబోగ[189]తందె
దేవరదాసయ్య దేవ! [190]దాసీఁడు - భావింపఁ గిన్నరబ్రహ్మయ్య బచ్చు
మడివాలు మడివాలుమాచిదేవయ్య - కడమలనంబి సొప్పడ [191]దివ్వెలాఁడు
తెల్లంబు గోడలు దీర్చెడువాఁడు - [192]సల్లీల గోడలమల్లయ్యగారు
కుమ్మరి గుమ్మరగుండయ్యగారు - జొమ్మయ్య వేఁటకాఁ డిమ్మహిలోన
కమ్మ [193]రమ్ములవాఁడు ఘనుఁ డిల్లహాళ - బొమ్మయ్య గీలారి నెమ్మిఁ జండండు
[194]మాయావి బల్లేశుమల్లయ్య [195]గట్టె - బోయీఁడు బాచయ్య భూరికొటారి
పాలువిదుకువాఁడు లీల వంకయ్య - పాలుగావంగ నేర్పరి గొడగూచి
కావున నీదు సకలనియోగంబు - మావారలై యండ మన్మనోరమణ!

ఏమిటఁ గొఱఁత? నా కేమిటఁగడమ? - ఏమైన నడుగు నీ కిచ్చెద నింక
మానంబు వదలిన [196]మదిఁ దల్లడిలిన - మానుగాఁ బ్రమధులయాన నీ యాన
కాలకూటము గుత్తుకకు రాకమున్న - క్రాలుపురంబులు గాలకమున్న
గౌరివివాహంబు గాకటమున్న - యార నజాండంబు లలరకమున్న
తివిరి మూర్తులు నెన్మిదియు లేకమున్న - భువి హరిబ్రహ్మలు పుట్టకమున్న
యటమున్న యటమున్న [197]యటమున్నమున్న - యిట నీవు నా స్వామి [198]వేను నీ బంట
కఱకంఠ! [199]యిదియేమి [200]గళవళించెదవు - వఱల నా చేతఁ బోవచ్చునే” యనుచు
నసమాక్షుతోడ [201]మాఱంకమై గెలిచె - బసవఁ డుద్యద్భక్తి [202]భాతిమై నిట్లు

బసవఁడు గొల్లెతచల్లకడవఁ బడకుండఁ బట్టిన కథ


వెండియు నిర్మలాఖండిత[203]కీర్తి - దండనాథాగ్రగణ్యుండు [204]పుణ్యుండు
సజ్జనసుతుఁడు బసవఁ డొక్కనాఁడు - బిజ్జలుకొలువునఁ బ్రీతిఁ గూర్చుండి
“యోడకోడకు [205]మని యొక [206]కడవెత్తు - మాడికి బాహుయుగ్మముఁ జాఁపఁదడవ
“ఇసుమంత” [207]బూడిద నొసలఁ బూసినను - మసలక కొండంతమరు [208]లొందుననుట
తెల్లం” బనుచు రాజు మెల్లన నగుచుఁ - “జెల్లఁబో బసవయ్య! శివమరుల్ గొంటె
[209]బ్రమసితే తలకెక్కి భక్తిరసంబు - గుమతివై నిండినకొలువులోపలను
“నోహో” యనుచు “నోడకోడకు”మనుచు - “బాహుయుగ్మము సాఁచిపట్టుటే”మనినఁ
“స్వగుణసంకీర్తన దగదు సేయంగఁ - దగదని యున్నను నగుసభ” యనుచుఁ
“ద్రిపురారిగుడితూర్పుదెస నేఱునేలఁ - గపిలేశ్వరంబందుఁ దపసి యొక్కరుఁడు
ఆ లింగమునకు నిత్యము నాఱువుట్ల - [210]పాల మజ్జనమార్పఁ గాలువల్ గట్టి
వీథివీథుల వెల్లివిరియ నేనుఁగుల - పాద[211]ఘట్టనములఁ బంకంబు రేఁగ
నా వీథిఁ జల్ల దా నమ్ముచుఁ [212]గణఁకఁ - బోవుచోఁ గాలూనఁ బోయినఁ దొసఁగఁ
గడురొంపిఁ [213]గాలుజారుడుఁ జల్లకడవ - పడఁ[214]బోవ [215]గొల్లెత “బసవరో” యనిన
బట్టితి నచ్చటఁ బడకుండఁ గడవఁ - జట్టన చేతులు సాఁచి యే ననుచు
గొల్లెతరూపంబు గొల్లెతయిల్లు - గొల్లెత యున్న [216]యిక్కువయుఁ జెప్పుటయు

రప్పించి గొల్లెత రాజు దా నడుగఁ - దప్పక బసవయ్య సెప్పినయట్ల
చెప్పుచు [217]నొఱగినచేతి ఱొంపియును - నప్పుడు జాఱంగ నంటినకాలి
ఱొంపియుఁ జూపి యెఱుంగ[218]రె యితని - పెంపున కిది [219]సెప్పఁ బెద్దయే తొల్లి

తిరుచిట్టంబలుని కథ


ప్రవిమలభక్తి విభ్రాజిత[220]లీల - భువి [221]నఱువాద్దడి మువ్వురిలోన
శ్రీనిలయుఁడు దిరుచిట్టంబలుండు - నా నొక్కభక్తుఁ డనశ్వరకీర్తి
కరమర్థితో వర్షకాలంబునందు - హరపూజనార్థమై [222]యట్లొక్కనాఁడు
చని పుష్పములు గోసికొని వచ్చునెడను - వననిధితీరంబునను గాలు జాఱి
పడి వడిఁ బుష్పముల్ వడకుండ భక్తుఁ - డడరుచుఁ “జిట్టంబలాధీశ” యనుడుఁ
బరముఁడు భక్తునిఁ బడకుండఁ బట్టు - పరుసున ననుఁ బట్టె బసవలింగంబు
వడినట్టులును [223]గాక వసుధేశ వినుము - [224]పుడమిని సొన్నలి [225]పురవరంబునకును
బోయినచోటఁ దత్పురి సుఖగోష్ఠి - నాయతభక్త సభాభ్యంతరమున
సిద్ధరామునిఁ జూచి శివభక్తవితతి - “సిద్ధుండ! లోకప్రసిద్ధంబు గాఁగ
నభినవ శ్రీగిరి యనఁగ నిప్పురము - నభినవలీల సొంపార రచించి
యా పర్వతము మల్లికార్జునదేవు - నేపారఁ గొనివచ్చి యిచ్చట [226]నిలిపి
ధ్రువముగా లక్షయుఁ దొంబదివేలు - శివలింగములను జెచ్చెరఁ బ్రతిష్ఠించి
దానికిఁ దనఁగ మర్త్యములోనియన్న - పానముల్ ముట్టక భక్తిపెంపునను
సహజమకుటము నొసలికన్నుఁ దనర - మహితయోగానందమహనీయలీల
మేనినీడయు భువి మెట్టిన [227]-యజ్జ - గానఁగఁబడ దనఁగాఁ జరింపుచును
నమితసమాధియోగాంతంబునందుఁ - బ్రమథలోకమునకుఁ బన్నుగా నేఁగి
యక్కడఁ దత్త్వరహస్యసద్గోష్ఠి - మక్కువ నెక్కొన మసలి [228]యేతెంతుఁ
[229]బ్రఖ్యాతమిది [230]మాకుఁ బ్రమథలోకమున - నాఖ్యాతసత్కీర్తి [231]యగు బసవాఖ్యుఁ
బొడగంటిరే [232]భక్తభూరిసద్గోష్ఠి - గడు నొప్ప నిక్కడఁ గలుగు నక్కడను
నతఁ డుండు నా విందు మఖిలలోకముల - సతతసాన్నిధ్యానుషక్తిమై” ననిన
శివభక్తతతిఁ జూచి సిద్ధరామయ్య - “ప్రవిమలగతి నేఁడు ప్రమథలోకమున
నరసి వచ్చెద”నంచు నాక్షణంబునను - నరిగి కైలాసనగాగ్రహర్మ్యమున

సిద్ధరామయ్య కైలాసమున కరుగుట


నజ [233]కాలబుద్ధ క్షయాంత[234]రజ్యోతి - నిజ[235] బలప్రియ యామ్యనీల రుద్రేశ(శ్వ?)
యీ(రే? )శాన శర్వ సర్వేశ భర్గ ప్ర - కాశ సురాధీశ గౌరీశ ధన్య
వామదేవ భవోద్భవ ప్రచండ ధర - వామదేవో(హో?)గ్ర సంవాహ పినాకి
ధాతృ విధాతృ హుతాశన శివ మ - హాతేజ సూక్ష్మలయ క్రూరదంష్ట్ర
క్షేమేశ [236]వికరణార్చిష్మంత దమన - భీమాభిధానోగ్ర పింగాక్ష [237]కర్తృ
విషధరానంత నివృత్తి నిధీశ - వృషభగణాధ్యక్ష విభు వాయువేగ
హరరత్నకర బభ్రు హంతాగ్నిదుఃఖ - కర సుఖకర [238]సుదుంబర కాలరుద్ర
హరిహరబ్రహ్మసౌమ్య స్వామి మృత్యు - హర భయానకహలాహల పరం[239]ధామ
వజ్రదేహావ్యయ వట రుద్ర దీర్ఘ - వజ్రదంత వియోగ వట విరూపాక్ష
సహనేశ శంభు పంచశిఖ నియోక్తృ - గుహ రుద్ర [240]బాధక గోపతీశాన
పింగ ళాసాధ్య మాతంగ రోహిత[241]సు - రంగ కపాలధర స్థూలరుద్ర
శాశ్వతే శోర్ధ్వకేశ త్రిదశేశ - విశ్వేశ చండేశ విత్తేశ వృషధ
రాక్షయరుద్ర కాలాగ్నిరుద్ర త్రి - యక్షఫణీంద్ర విచక్షులాదిగను
రుద్రచిహ్నలు గ్రాల రుద్రాత్ములైన - రుద్రగణాధీశ్వరుల్ సేరికొలువ
శ్రీనంది నందినాథానంద వృషభ - సానంద గోముఖ హయ[242]ముఖాభంగ
దండపా ణీశాన చండీశ [243]రుద్ర - రుండాభరణ రుద్ర పుండరీకేశ
పర్వతాభరణ దర్ప సుభద్రశర్వ - సర్వజ్ఞ సర్వాత్మ సర్వసంహరణ
దారుక రేణుక ధవళాక్ష వీర - వీరక వీరభద్రారూఢ భద్ర
త్రిజటి ధూర్జటి లోకవిజయాట్టహాస - నిజబల విషబల నీల నిశ్శంక
నీలలోహిత నిత్య నిష్కళ శాంత - కాల మహాకాల కాల కాలోగ్ర
రూప నిరూప విరూపాక్ష విశ్వ - రూప పుష్కళ శాంతరూప వృషాంశ
యుగ్రాక్షభర్గాసితగ్రీవపింగ - ళోగ్రకాయాతీత(?) యుత్తుంగవిముఖ
కరిముఖ నరముఖ కపిముఖ ద్విముఖ - శరభముఖాముఖోష్ట్రముఖ శార్దూల
ముఖ చతుర్ముఖ పంచముఖ సుముఖాష్ట - ముఖ నవముఖ దశముఖ షణ్ముఖైక
ముఖ సహస్రముఖ దుర్ముఖ వికటాక్ష - మఖహర విషహర [244]మలహర మృత్యు

హర యమహర గజాసురహర సకల - సురహరాసురహర పురహర భృంగి
గజకర్ణశార్దూల కర్ణాశ్వకర్ణ - విజయఘంటాకర్ణ [245]వీరగోకర్ణు
లాదిగా బలసి సదైశ్వర్యలీల నాది - ప్రమథగణేంద్రావళి గొలువ
సనకసనందన సన్మునీశ్వరులు - ననుఁగులై [246]తమహృద[247]యాబ్జముల్ పూన్ప
నుపమన్యు వామదేవ పవిత్రపాణి - కపిల కణ్వాగస్త్య కౌశిక సుబల
శ్వేత దధీచి వసిష్ఠ [248]కణ్వాత్రి - గౌతమ కశ్యప సూతానిలాత్మ
మాండవ్య హరిత మార్కండేయ పులహ - శాండిల్య వత్స కుత్స పులస్తిశక్తి
బాదరాయణ భృగు బక దాల్భ్య రురు శి - లాద మౌద్గల్య వర్ణాద శాకల్య
[249]గర్గ శౌనక [250]చతుష్కర్ణమృకండు - భార్గవాంగిరస విభాండక శునక
మైత్రేయ బల్లకి మంకణ చ్యవన - మిత్రావరుణ నారదాత్రిసౌవర్ణ
పైలసుమంతుసుబ్రహ్మణ్య మంద - పాల సుమిత్ర రైభ్యక సత్య సుమహ
పర్వత జైమిని పౌలస్య గార్గ్య - దుర్వాసు లాదిగా సర్వ సన్మునులు
[251]వెలుఁగ నాశీర్వాద వేదనాదముల - నలరుచు నందంద యనుకీర్తిసేయ
సుర నర దనుజ ఖేచర సిద్ధ సాధ్య - గరుడ గంధర్వోరగ ప్రకరంబు
ద్వాదశాదిత్యు లేకాదశరుద్రు - లాది నవబ్రహ్మ లష్టవసువులు
సురపాగ్ని యమదైత్య వరుణగంధవహ - నరవాహ [252]హరదిశానాథయూధంబు
శ్రీవాగ్వధూనాథ జిష్ణులు నవిక - లావరణస్థులై యభయముల్ వేఁడఁ
దుంబురునారదాదులు సుగీతామృ - తంబున నెయ్యంబు దనర నోలార్ప
నంబికా[253]సహితుఁడై యాస్థానమంట - పంబునఁ బేరోలగంబున నున్న
శివదేవుఁ గనుఁగొని సిద్ధరామయ్య - యవిరళభక్తి సాష్టాంగుఁడై మ్రొక్కి
“విన్నపం బవధారు విశ్వలోకైక - సన్నుత!” మర్త్యంబు సద్భక్తజనులు
“ప్రమథలోకంబున బసవండు [254]గలఁడో- ప్రమథేశుకొలువునఁ బరికింపు” మనిరి
“బసవసంస్తుత్య! సద్భక్తైకదేహ! - యసలార నున్నరూపానతి” [255]మ్మనిన

శివుఁడు తన హృదయమున బసవనిఁ జూపుట


“నాలోక మీలోక మననేల బసవఁ - డేలోక[256]మునను లేఁ? డెల్లచో నుండుఁ
బ్రమథులయందు సద్భక్తులయందు - నమరంగ నా హృదయాబ్జకర్ణికను

సతతంబు గురులింగ[257]చరణములయందు - నతిముదమున నుండు నాదిబసవఁడు
అట్టొట కి[258]టుసూడుమా” యని శంభుఁ - డిట్టలంబుగఁ దన హృదయంబుఁ దెఱవ
సంగతంబగు కరస్థలము లింగంబు - జంగమావళికిని శరణనుకరము
ననిమిషుఁడై చూచు హరుమీఁది దృష్టి - గనుఁగ హర్షాశ్రుకణవితానంబు
దరహసితాస్యవిస్ఫురణయుఁ దనరఁ - బరమశివధ్యానపారవశ్యమునఁ
బద్మాసనస్థుఁడై పరమేశు హృదయ - పద్మంబునం దున్నబసవనిఁ జూచి
ప్రమథులు హర్షింప నమరులు మ్రొక్క - నుమబోటి యత్యద్భుతోపేత గాఁగ
నా మూర్తిఁ గని సిద్ధరామయ్య యుద్గ - తామితానందపూర్ణాత్ముఁడై [259]తనర
హరుఁడు పర్వతపుత్త్ర నరవిరికంటఁ - బొరిఁ బొరిఁ జూచుచుఁ బూర్ణేందువదన!

శివుఁడు పార్వతికి బసవని మహిమ తెలుపుట


చూచితే బసవనిసురుచిరమహిమ - యీ చెల్వునిల్కడ యేరికిఁ గలదె?
వెలయఁగ నయ్యాదివృషభేంద్రుఁ డనఁగ - నలి నేన రెండుమూర్తులు ధరించితిని
విను "తవపుత్త్రోభవిష్యామి” యనుచు - నెనయ శిలాదున కేన పుట్టితిని
అసలార భక్తహితార్ధమై యేన వసుధ జనించితి [260]బసవం డనంగ
నెసఁగ నిట్టిద[261]కాన యీశుండ నేన - బసవఁడన్ పేరి సద్భక్తుండ నేన
మున్నును మన బసవన్న సద్గుణ మ - హోన్నతి యెఱుఁగవే యొగి నట్లుఁగాక
లోకాధిపతి నేను లోలాయతాక్షి! - ప్రాకటంబుగ లోకపావనుఁ డితఁడు
కారణలోకసంహారుండ నేను - కారణలోకోపకారి యితండు
భక్తవత్సలుఁడ నేఁ బర్వతపుత్త్రి! - భక్తరత్నములకు బండారి యితఁడు
భక్తైకదేహుండ భావింప నేను - భక్తజనప్రాణి బసవఁ డీక్షింప
ముక్తికి రాజఁజూ ముద్దియ నేను - భక్తికి రాజుసూ [262]బసవఁ డీక్షింపఁ
[263]బసరింప నే లింగపట్టబద్ధుండ - బసవండు సద్భక్తిపట్టబద్ధుండ
అచరలింగంబ నే నచలేంద్రతనయ! - సచరాచరక్షోణిఁ జరలింగ మితఁడు
సనునాది నా పేరు [264]శంభుం డనంగఁ - బొనర ద్వితీయశంభుఁడు వీనిపేరు
స్థిరభక్తి మమ్ముఁ గొల్చినఁగాని లేదు - ధర వీనిఁ దలఁచినంతనె [265]ముక్తి గలదు.
అలరుచుఁ బ్రాణదేహార్థముల్ నాకు - నిల నిత్తు రఖిలభక్తులు నొక్క యెడను

నచ్చుగాఁ బ్రాణదేహార్ధముల్ బసవఁ - డిచ్చుచునుండుఁ [266]దా నెల్లభక్తులకు
నా యతమతి బసవా యనఁబరగు - నీ యక్షరత్రయం [267]బిట్లొక్కమాటు
సదువు నాతని ముఖసదనంబు నందె - కదలకుండుదుము మా గణములు నేము
పొదలు నెవ్వని యాత్మ [268]నుదితసద్భక్తి - యదియు బసవని మహత్త్వంబ కాదె
పరికింప నెవ్వఁడు వడయుఁ బ్రసాద - వర[269]ముక్తి యది బసవని కృప గాదె
మదిలోన నెవ్వఁడు మముఁ దలపోయు - నదియెల్ల బసవనియంశంబ కాదె
[270]పసరించు జంగమభక్తి యెవ్వండు - వసుధలో నది బసవనివృత్తి గాదె
భక్తిపట్టము దాల్ప బసవఁడు దక్క - శక్తిసమేతులు [271]జగతిపైఁ గలరె
యదిగాక యొక్క నాయందేల భక్త - హృదయస్థుఁడై [272]చూడ నిట్లున్నవాఁడు
అంచు వెండియుఁ బ్రస్తుతించుచు శంభుఁ - డంచితమతి బసవయ్య కిట్లనియె
“బసవ! మర్యమునందు భక్తులు గలరె? - [273]యెసకమై సంసార మిష్టమే నీకు?”
నని యానతిచ్చుడు నద్దేవు హృదయ - వనజస్థుఁడగు బసవం డిట్టులనియె
“మందునకైనను మర్త్యలోకమున - నిందుశేఖరుభక్తుఁ డెందును లేఁడు
భక్తుండ నేన చూ భక్తులిందఱును - భక్తాత్మ! మీ స్వరూపంబ కావునను
వెండియుఁ గలదొక్క విన్నపంబింకఁ - జండేశవరద! ప్రసన్నత వినుము
జంగమలింగప్రసాదోపభోగ - సంగతసుఖసుధాశరధి నోలాడు
[274]నిటువంటిభవము లెన్నేనియు లెస్స - యిట యపవర్గ మహిష్ఠతకంటెఁ
గావున శునకసూకరక్రిమికీట - కావహజన్మంబులైనఁ గానిమ్ము
సు[275]ప్రసిద్ధము జంగమప్రసాదంబ - యేప్రొద్దు భోగింప [276]నెట్లు గల్గినను
జాలుఁబో భవకోటిశతసంఖ్యలందు - [277]నోలినన్ బుట్టింపు మొకటియు నొల్ల”
ననవుడు గౌరీశుఁ డతిదయాదృష్టిఁ - గనుగొని సిద్ధరామునకుఁ జూపుడును
శివునకు మ్రొక్కుచు సిద్ధరామయ్య - భువికి నేతెంచి యద్భుతము నెక్కొనఁగ
భక్తసమూహికి బసవయ్యమహిమ - వ్యక్తిగాఁ జెప్పంగ నట్ల నేవింటి”
ననవుడు బిజ్జలుఁ “డట్టు లౌటకును - జనులకునెల్ల [278]దృష్టం బిప్పు డిదియ”
యనుచు నమూల్యవస్రాభరణములఁ - బొనరంగఁ [279]గాళవ్వబోయత కొసఁగి

“యవికలాజాండతత్త్వాత్మకుఁడైన - శివుఁడు గరస్థలాసీనుఁడై యుండ
సర్వగతుండైన శంభుభక్తునకు - సర్వగతత్వంబు సహజంబ కాదె
సర్వమయుండైన శర్వుభక్తునకు - సర్వమయత్వంబు సహజంబ కాదె
దూరేక్షణంబును దూరశ్రవణము - దూరవిజ్ఞానసిద్ధులు మొద ల్గాఁగ
నణిమాదిసిద్ధులు నభవుభక్తునకు - గణుతింప నెంత శ్లాఘ్యంబు దా” ననుచు
సకలమానవులు మస్తకతటన్యస్త - ముకుళితహస్తులై మ్రొక్కుచునుండ
“నల్లవో”యనుచు భూవల్లభుఁ డతులి - తోల్లాసచిత్తుఁడై యెల్లవస్తువులు
దట్టుఁడు బసవనదండనాయకున - కిట్టలంబుగఁ గట్టనిచ్చె సంప్రీతి
గురుభక్తిశృంగార! గుణగణాధార! వరదయాలంకార! సురుచిరాకార!
ఖ్యాతగంభీర! దుష్కర్మవిదూర ! - గీతమహోదార! ధూతసంసార!
అకుటిలచిత్త ! శివాచారవేత్త ! - ప్రకటతత్త్వాయత్త ! ప్రవిమలవృత్త !
అజ్ఞానజైత్ర! యుదాత్తచరిత్ర! - విజ్ఞానపాత్ర! సంవిత్సుఖామాత్ర!
రూఢవ్రతోత్తుంగ! రుచిరాంతరంగ! - గూఢప్రసాదాంగ! గొబ్బూరిసంగ!
ఇది యసంఖ్యాతమాహేశ్వరదివ్య - పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగప్రసాదోపభోగ - సంగతసుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలుకురికి సోమనాథ - సుకవిప్రణీతమై శోభిల్లి తనరి
చరలింగఘనకర[280]స్థలివిశ్వనాథ - వరకృపాంచితకవిత్వ స్ఫూర్తిఁ బేర్చి
చను బసవపురాణ మను కథయందు - ననుపమంబుగ ద్వితీయాశ్వాసమయ్యె.
                                                           * * *

  1. హితుఁడు
  2. గలఁడు
  3. జాఁగిలఁబడి మ్రొక్కి యిట్లనిరి
  4. కున్న వారెవ్వరు
  5. మెంతయును
  6. బంపి
  7. తమై
  8. దీటిమ్రోయు
  9. ఈ ద్విపదము కొన్ని ప్రతులలోనే కలదు
  10. లేణ్ణూరు
  11. జరుపక
  12. బఱప
  13. గల్గునే యెన్నఁడ
  14. చూపుచుననియె
  15. పెల్లెలుగల
  16. రూఢుండప్పరగణము
  17. గొల్చువారుఁ; జూచువారు
  18. గొలుచు
  19. సజ్జపఱపు, గుజ్జుగురపు, గట్టివరపు
  20. రాయనిఁగొల్చువారు
  21. భట్ట
  22. రథా
  23. నడుమ
  24. ఈ క్రింది నాల్గు చరణములు పెక్కు ప్రతులలో లేవు
  25. మాదాంబ
  26. నోఁచి
  27. గూర్మిని
  28. మడఁతి
  29. జనఁ
  30. మా
  31. ఱందు
  32. గన్నారఁ
  33. బ్రకటంబుగా
  34. మన్పు
  35. రక్షింపనొండెంత వ్రేఁగు
  36. ఏవలనెఱచుచుం డింతియ చాలు
  37. కేళీలోలమతిని
  38. సుశీల
  39. లెడపని
  40. తరగని
  41. బొరిమాల్చు
  42. బాసియు
  43. వాసియు
  44. వెన్ను
  45. ధీరంపుఁగట్ట
  46. రంపుఁదిట్ట
  47. చెలిమి
  48. పసి
  49. ప్రస్తుతి
  50. మనుచుఁ-బ్రా
  51. వడయుదు
  52. పరుస
  53. వసి
  54. ళి
  55. ప్రకటితరుద్రాక్షమకుట
  56. నేక, ధిక
  57. శయులి
  58. తోరణములు
  59. గొడగులు
  60. నాకాశమద్రువ
  61. లందెదురుకొనంగ
  62. (క) దొప్పనఁ
  63. నోరూరి
  64. నిక్కంబు
  65. బ్రీతికి
  66. యెక్కుడు
  67. లొప్పన
  68. మున్నిరూపించి
  69. దగు
  70. యంత
  71. బొదలి
  72. సాకార
  73. పేర్చి
  74. వాల్లభ్య
  75. వికలాంగ
  76. ర్థ
  77. తత్త్వ
  78. భాసనుఁడు
  79. వడువునుబోలె, ఇట్టి ప్రయోగములు నన్నిచోడని కుమారసంభవమునఁ గూడఁగలవు.
  80. వ్రేగులు, వేవేలుగాఁగను
  81. బడిపట్టి
  82. నందించు
  83. నందించు
  84. నెట్లకో
  85. మున్పుట్టితి
  86. “సౌందర్య(ము)బసవ? సాధ్యులబసవ! నందీశు బసవ! యానందంబు బసవ!” కొన్ని ప్రతులయందుఁగలదు
  87. బసవ! నీ
  88. బాస
  89. బాస
  90. పసు
  91. బాలులకు
  92. నెసఁగఁ బక్షుల
  93. బాస
  94. బాస
  95. బాస
  96. బాస
  97. యుక్తి
  98. సంధానుషక్తి
  99. ననురక్తితోడుత నా బసవండు
  100. పరాత్పర
  101. దయా
  102. బెట్ట నంతశక్తుఁడనె
  103. చక్కనఁ
  104. ప్రమథుల
  105. పట్టి
  106. కుమారుని నొకని
  107. బేమనీ
  108. నావుడును
  109. వెట్టెదే; నెట్టఁదా
  110. నని యీ
  111. వెలుఁగంగ
  112. పు
  113. ధితమ
  114. యడఁకుచు, నడఁకుచు
  115. గడగడ
  116. వేయేలఁ
  117. ననఁగఁ
  118. యఖిల సంస్తవ! వామదేవ!
  119. పరాత్పర
  120. మూర్తి
  121. నల్లన
  122. యర్థముల్ దద్దఁ జే
  123. దామె
  124. ప్రమోద
  125. ముడియ
  126. వర్థిల్లు
  127. వెంగలు లతని
  128. ధిగిల్లన
  129. నవియ, విరియ
  130. మీడ
  131. మగుడి
  132. సాఁపు; దోఁచు
  133. దర్శనసమయంబు, అం
  134. గట్టియెక్క, కు
  135. బెఱెక
  136. గడ్పార
  137. కొల్వంగలేదు
  138. గాదనుచుఁ జెయి
  139. కనుకని మొఱింగెదరు
  140. బల్లేశ్వరుదేవ
  141. కోటండనాఁగలఁ
  142. పెంట్రిక
  143. గీటఁ, జిందఁ
  144. ఈ ద్విపద కొన్నిప్రతులలో లేదు
  145. కూలె
  146. కీలకో
  147. బుడిబుళ్లిఁబోవ
  148. వెండియును
  149. గాన
  150. రక్తిమై మ్రుచ్చులను బసవయ్య
  151. నిలవట్లుగాక
  152. ఇక్కడ 'నిత్తెనేమ'మనియు 'ముత్తేలపొడి' యనియు దిద్దఁదగియున్నను, వ్రాతప్రతు లన్నింటను నిట్లేయుండుటచేతను, 'నిత్యనేమ' మని యీ కవి మఱికొన్నిచోట్లఁగూడఁ బ్రయోగించుటచేతను, నట్లు చేయలేదు.
  153. వశాయత
  154. ప్రోఁగు
  155. దనకైనయన్ని
  156. కంఠు
  157. సంపన్నుఁ సంపూర్ణుఁ
  158. ఇటు సె
  159. రా
  160. గాదు లేదనిన
  161. ప్రొద్దువో
  162. పత్రియీ
  163. తనరె, పర్వె(ర్వ)
  164. యెసఁగ
  165. సమితి
  166. కన్నడుగుటయు
  167. నేనొల్ల
  168. భర్గుని
  169. ని న్గొల్చిన
  170. దేవుండు
  171. యిండి
  172. కడమలనంబి
  173. రక్తిమై
  174. దనరించు
  175. మఱియు బానసముది
  176. కావడి
  177. పరికరము
  178. చోడప
  179. మనవాలు
  180. నారు
  181. కావ్యుఁడా
  182. చూడంగఁ బ్రభువు
  183. నేణాది
  184. బంకీశుసుంకయ్య
  185. బంకయ్య
  186. చవి
  187. తద్దె
  188. మాసీఁ(స్టీ?)డు
  189. దివ్వటీఁడు
  190. బల్లిదుల్
  191. తమ్ములవాఁడు
  192. మాయారి
  193. కొట్టు
  194. మహిఁ, మఱిఁ
  195. యంతకమున్న
  196. యేను
  197. యిట్లేల
  198. కలవరించెదవు
  199. మాఱాఁకమై
  200. బ్రాఁతి
  201. మూర్తి
  202. ధన్యుండు
  203. మంచునొ
  204. కడువెత్తు
  205. బూడిది, బూడిదె
  206. లెత్తె
  207. భ్రమసితే
  208. పాలు
  209. ఘట్టనచేత
  210. గడవఁబోవుచుఁగాటక బోయినిదొసఁగ (యనఁగ)?
  211. గాల్దెమల్పడఁ
  212. బడ
  213. వ్రాఁతప్రతులన్నింటను 'గొల్లెత' యను రూపమే కలదు
  214. యింకువయు
  215. నూఁగిన
  216. వే
  217. యొక్క
  218. మహిమ
  219. నఱువత్తాది? నఱువత్తాండి
  220. యందొక్క
  221. గాకవిన్ పుడమీశ!
  222. కడయను
  223. కపురంబుకును
  224. నునిచి
  225. యడుగు
  226. యేతెంచు
  227. ప్రఖ్యాతి యిది
  228. మీకు
  229. యట
  230. మీరు
  231. కలా
  232. గుణ
  233. విత
  234. కృత్య
  235. సదంబర
  236. ధాత
  237. ఘాతుక
  238. కు
  239. ముఖనంద
  240. రౌద్ర
  241. శిఖి, స్మర
  242. విమల
  243. నిజ
  244. యంబులఁ బూ
  245. కణాద
  246. గార్గ్య
  247. జతుకర్ణి
  248. వెలయ
  249. భవనిశా
  250. సహితమై
  251. కలఁడు
  252. మ్మనుడు
  253. మందు లేఁడెట్లు తలంపఁ
  254. చరణంబులందు, జంగమంబందు
  255. కిదె
  256. యుండ
  257. బసవేశుఁ డనఁగ
  258. కాక
  259. బసవండు తలఁపఁ
  260. బ్రసరింప
  261. శంభుండనాఁగఁ శంభుండునాఁగఁ
  262. కల్గు భక్తి
  263. నెల్లెడ భక్తతతికి
  264. బెవ్వఁడేనియును
  265. నొదవు
  266. భక్తి
  267. ప్రసరించు
  268. జగములఁ
  269. కూడ
  270. ఎసఁగు నీ సంసార
  271. నటు... లెన్నైనను మేలు
  272. ప్రసిద్ధగ
  273. నిట్లు
  274. నోలిని.... మొకటినే
  275. దృష్టము గాదె యిదియు, ననుచు
  276. గాటకబోయిని
  277. స్థల