బసవపురాణము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

చతుర్థాశ్వాసము

శ్రీగురులింగ! సుస్థిరదయాపాంగ- యోగాత్మ! భక్తిమహోత్తుంగ! సంగ!

మడివాలు మాచయ్య కథ

మఱియును మడివాలు మాచయ్యనాఁగ - నఱలేని వీరవ్రతాచారయుతుఁడు
శ్రేష్ఠుఁడు జంగమ[1]ప్రష్ఠుఁడు న్యాయ - నిష్ఠురాలాప మహిష్ఠమండనుఁడు
నిష్ఠితేంద్రియగుణాన్వితుఁడు లింగైక్య - నిష్ఠాపరుఁడు సుప్రతిష్ఠితకీర్తి
భవిజన సంసర్గపథపరిత్యాగి - ప్రవిమలత్తత్వానుభవసుఖాంబోధి
పరగు భాషా[2]వ్రతపాలనశాలి - [3]దరితషడ్వర్గుఁ డాస్థానంబుజ్యోతి
రజకజాత్యావృతప్రత్యక్షరుద్రుఁ - డజరామరుండయోనిజుఁడవ్యయుండు
శరణపదాంభోజషట్పదుండనఁగ - బరగి హిప్పరిగె యన్పురవరంబునను
నుండంగ బసవనియురుభక్తివార్థి - నిండారి [4]దెసలను నిట్టవొడుచుడుఁ
బొంగి లింగానందపూరితుండగుచు - జంగమదర్శనాసక్తి నేతెంచి
బసవనిచేఁ బ్రణిపత్తి గైకొనుచు - నసమజంగమకోటి కర్చలిచ్చుచును
బంటింపక [5]వరువుఁ బనులు సేయుచును - గంటి నా చేతులకసివోవ ననుచు
బాస వట్రిల్ల సద్భక్తసంఘంబు - మాసిన వస్త్రముల్ మఱి మోసికొనుచు
వేవుజామున నేఁగి వేఱొక్క రేవు - గావించి యుదుకుచు [6]ఘట్టనల్ సేసి
శస్త్రసమేతుఁడై సద్భక్తవితతి - వస్త్రముల్ రజతపర్వతభాతిఁదాల్చి
పరిగొనివచ్చుచోఁ బురవీథి “భవులు - శరణులవస్త్రముల్ సంధిల్లిరేని
నోడఁజాఁబొడుతుఁజుండొ” యనిఘంట - నాడాడ వ్రేయుచుఁగూడఁ జాటుచును
మఠమున కేతెంచి [7]మణుఁగులన్నియును - గఠినము ల్గాకుండ [8]ఘట్టించి మడువ
నట్టిచో జంగమంబరుదెంచి యడుగ - - నెట్టికట్ణంబైన [9]నిచ్చి మ్రొక్కుచును
నా వస్త్రముల వారలడుగవచ్చినను - లేవనకందిచ్చు లింగసంపదను
అంత నద్భుతచిత్తుఁడై బసవండు - సంతతంబును విని సంస్తుతుల్ సేయ

“నలిభక్తతతివలువలుదుకుచాకి - విలసితభక్తియు నిలఁజెప్పఁబడియె
నదిగాక యేకాకియన్మడివాలు - సదమలభక్తి భాషయు నొప్పెఁ గాని
యిట్టి సద్భక్తియు నిట్టి మహత్త్వ - మిట్టి [10]సామర్ధ్యంబు నెఱుఁగ మే”మనుచు
సల్లీల ననిశంబు సంస్తుతు ల్సేయఁ - దెల్లగానటు గొన్ని దినములు సనఁగ
బఱతెంచుచో [11]ముట్టుపాటైన నొకని - నఱిముఱిఁ జంపి మాచయ్య యున్నెడను

మాచయ్య తెరువరిని జంపెనని పౌరులు బల్లహునకుఁ జెప్పుట


వీరువారన కెల్లవారునుగూడి - ధారుణీశ్వరు సభాస్థలికేఁగి మ్రొక్కి
“బల్లహ! వినుము నీ పట్టణంబునను - బ్రల్లదుండొక చాకి బత్తుండననుచు
మొలఁగఠారముగట్టి తొలఁగండు ద్రోవ - తొలఁగించు నే బల్లిదులఁబిఱుసనఁడు
చాటుఁ "జీరలమూట సంధిల్లిరేని - పోటు ముందఱ” [12]ననిపోటులమాట
నంగళ్లు నిలిపె బేహారముల్మాన్చె - సంగడి నిటయట సరియింపరాదు
పురవీథి నెవ్వరేఁ బోయినఁ జూచి - పరిగొన [13]కనుకనిఁబాఱంగం దోలు
[14]నెదురను బసి గుఱ్ఱ మేనుంగు బండి - యదియేమి సోద్దెమో కదియంగ వెఱుచు
నల్లంతఁబొడగని [15]చల్లన నవసి - కల్ల వెల్లైపాఱుఁగథలేల? నేఁడు
వింత వాఁడొకఁడు మున్వినమిఁగాఁజేసి - సంతకుఁ బోవుచో సంధిల్లినంతఁ
బొడిచి మీఁదికిఁజిమ్మెఁబొందియు నచటఁ - బొడలేదు మ్రింగెనో పోయెనో దివికి
నటగార్యమెఱుఁగమే[16]మవనీశ! వినుము - ఇట వచ్చితిమి నీకు నెఱిఁగింప”ననిన
బసవనిదెసఁ జూచి పార్థివేశ్వరుఁడు - కసిమసంగుచు మహోగ్ర[17]త నిట్టులనియె
“ఇది యేమివిపరీతమింక నెవ్వరికి - బ్రదుకంగవచ్చు నీ భక్తులచేతఁ
గోకలుదుకు చాకి గ్రొవ్వి యిప్పురము - [18]లోకంబునెల్ల గల్లోలమార్చెడిని
జాకికి [19]నింతేల స్రడ్డలు జనులఁ - జేకొన కడిచెడుఁ జేరంగనీక
యిట్టిచోద్యంబు లేమెఱుఁగ [20]మేనాఁట - ముట్టినఁ జీరలు ముఱుగునే చెపుమ
పురజనులకు మున్నె చరియింపరాదు - పరదేశికింక రాఁబాసె మా పురికి
నెంతబల్లిదుఁడొ నేఁడ్వింతవాఁడొకఁడు - సంత కేఁగఁగఁజంపె శవమును లేదు

ఆకసంబునకేఁగు నట్టలుఁగలవె? - చాకి రక్కసిక్రియ జనుల మ్రింగెడిని
తిట్టఁడు వలుకఁడు ముట్టినమాత్ర - నిట్టు సంపఁగఁ గూడునే పెఱవాండ్రఁ
బాడిఁదలంపక బత్తుండననుచుఁ - బాడుగాఁ జంపు నీ పౌరులనెల్ల”
ననుచుఁబురోహితు లనుమతంబునను - దన యామికులఁజూచి ధారుణీశ్వరుఁడు
“చాకి నచ్చోటన చంపుండు వొండు - కాక మ్రింగిన వానిఁ [21]గ్రక్కిన రండు”
అనవుడు బసవఁడిట్లనియె నాతనికి - "విను మీఁదెఱుంగక వెడలనాడెదవు

బసవఁడు బల్లహునకు మడివాలు మాచయ్యమహిమఁ జెప్పుట


లేకులు [22]లోకుల కాకఱపులకుఁ - “జాకిచా”కని యేల సందడించెదవు
చాకియే యతఁడు సాక్షాల్లింగమూర్తి - కాక యేటికిఁ గనుకనిఁబలికెదవు
కులజుండు నతఁడె యకులజుండు నతఁడె - కులములేకయు నన్నికులములు నతఁడె
ఆ నీలగళు నపరావతారంబు - గాన యాతఁడు సర్వగతుఁడెట్టులనిన
సరసిజభవుజడల్ జన్నిదంబులుగఁ - బరగ భిక్షించిన బ్రాహ్మణుఁడతఁడ
మహితాపవర్గ సామ్రాజ్యపట్టంబు - వడి భవాంబుధిఁద్రిప్పు వైశ్యుండు నతఁడ
యిల సత్క్రియారంభఫలములు గోసి - సొలవక నూర్చెడు శూద్రుండు నతఁడ
యాదిశక్తియ మున్నుపాదానముగను - [23]నాదబిందులు గారణంబుగఁ దగిలి
వేడుక బ్రహ్మాండ వివిధ భాండములఁ - గూడ వానెడు [24]నాది కుమ్మరి యతఁడ
హరియెమ్ము దండంబునహిపతి ద్రాడు - నరసింహుపెనుపగు నఖరంబు గ్రొంకి
[25]యవని మోచినవరాహం బెఱగాఁగ - నవనిఁ గూర్మంబును నల్లమత్స్యంబు
గాలమి ట్లేకోదకంబునఁదిగిచి - లీలనటించు నా జాలరి యతఁడ
చటుల సంస్కృతి జీవఘటచక్రకర్మ - పటుపరివర్తన భ్రమణంబుఁ గూర్చి
కీలు వొందించి యా క్రియ [26]రాటనముల - వాలి యాడించు నా వడ్రంగి యతఁడ
మును జీవమను లోహమునకు జ్ఞానాగ్ని - నొనరఁగఁ బదనిచ్చు కనుమరి యతఁడ
ఇచ్చుచో నెఱిఁగి కల్లచ్చుల నూకి - యచ్చుల నొరగొను నగసాలి యతఁడ
హరిణమై రమియించు నజునిశిరంబు - శరమునఁద్రెంచిన శబరుండు నతఁడ
హరిముఖ్యకృమికీటకాదిపశువుల - వెరవునఁ బాలించు వ్రేఱేఁడు నతఁడ

[27]ప్రకటితకపట నాటక సూత్రములను - వికృతి ప్రకృతులార్చు వెండీఁడు నతఁడ
కులనగంబులు నూకి జలధులు సల్లి - పొలము [28]వోడేర్చు నా బోయయు నతఁడ
ఏకార్ణవంబైనయెడ నజాచ్యుతులఁ - జేకొన కుదికెడు చాకియు నతఁడ
మహితభక్తాళికి మడుఁగులు సేఁత - మహినిప్డు మడివాలు మాచయ్య యనఁగ
నిన్నియుఁ దానయై యిట్లున్నయతని - కెన్నెద వొకగులంబిది నీకుఁదగునె?
కారణపురుషావతారుఁ డాయయ్య - చారుచరిత్ర విస్మయమెట్టులనిన
నరసింహశార్దూలకరిదైత్యచర్మ - పరిధానుభక్తులపరిధాన వితతి
గాని యొండుదుకఁడు, వానిని నంటఁ - గానీఁడు నితరుల ఘట్టించునెడను
భక్తుల చీరల భక్తులకిచ్చు - యుక్త సద్భక్తినియుక్తి వట్రిల్ల
జంగమంబడిగిన సమకట్టనిచ్చు - భంగిగా లింగసంపద దులుకాడఁ
జీరలువైచినవా[29]రడిగినను - వారికిఁ దమతమ వస్త్రంబులిచ్చు
నటమీఁద నతని మహత్త్వంబు వినఁగఁ - గుటిలాత్ములకు సమకూడదు మఱియు
జీర లంటినమాత్రఁ గారించుభక్తుఁ - డూరకుండునె చంప కీరు వోయినను
వల దభిమానంబు వొలివుచ్చుకొనకు - మిల నొరులేల నీ వెత్తిపోయినను
జుట్టవ్రేలను జక్కఁ జూపఁగఁగలవె? - అట్టేల? వల” దన్నఁ గట్టుగ్రుఁ డగుచుఁ
"గారణంబులుఁ గథల్ గల్పింప కిచట - నూరక చూచుచు నుండు మీ” వనుచు
బసవని వారించి పాపాత్ముఁ డంత - వెస యామికులఁ జూచి "వేఱుపాయమునఁ

బిజ్జలుఁడు మాచయ్యను జంప నేనుఁగుఁబంపుట


దొలఁగకాతఁడు వచ్చుత్రోవను మీరు - [30]తలఁగ కాతనిఁ దలతలమని నిలిచి
సమదాంధగంధగజంబుఁ బైకొలపి - సమయింపుఁ" డనవుడు జనులుత్సహింప
మావంతు లేఁగి సామజముఁ బైకొలిపి - యా వీరవరురాక కరికట్టి [31]నిలువ
నల్లంతఁ బొడగని యార్చి బొబ్బిడుచుఁ - "గల్లినాథుని భద్రగజ మొక్కనరుని

మడివాలు మాచయ్య యేనుఁగును జంపుట


యేనికదున్నకు నేల పంకించు - మానవుల్చానక మగుడఁడో” యనుచు
గంటయుఁ గొడుపును గదియింపఁ దడవ - పంటించె నేనుఁగుఁ బలమెల్ల నవిసె

నంతటఁబోక మావంతులు నూక - నంతంత డగ్గఱు నంతకుమున్న
వెన్నున నెలకొనియున్న వస్త్రములు - నన్నభోమార్గంబు[32]నందఱియించి
చేతిగంటయు నంద చేర్చి మైవెంచి - చేతులు [33]సమరుచు నేతెంచి [34]చూచి
దండియై మావం[35]తుతండంబుఁ జంపి - తుండంబుఁ జేపట్టి త్రోచి రాఁదిగిచి
యంజలిగుంజలి [36]యల్లార్చి పేర్చి - భంజింపుచును వీరభద్రుండు దివిరి
వడి నృసింహునివైచు వడుపున వైచుఁ - బడనీక లోచేతఁ బెడచేత వేయు
నచ్చుగా నార్చుచు హరుఁడిభదైత్యు - వ్రచ్చినగతి వచ్చివందఱలాడుఁ
గోపించి విష్ణునికోలెమ్ము రుద్రుఁ - డేపునఁ [37]దునిమినట్టిల నెమ్ములేఱు
మాలకు మాంసంబు మఱి గొడారికిని - దోలు[38]ను గాకుండఁదొలఁగంగ వైచి
త్రోవ నేతెంచుచోఁ దొలఁగనిబాస - గావున నతులవీరావతారుండు
నిమ్మార్గమున భక్తులెల్ల నుప్పొంగ - నమ్మదకరి పొడవడఁచి[39] యక్షణమ
“ఎవ్వండు నా మీఁద నేనుంగుఁ గొలిపె - నవ్వసుధేశుక్రొవ్వడఁతుఁ బొ""మ్మనిన
నింతవృత్తాంతంబు నెఱిఁగి బిజ్జలుఁడు - నంతక [40]మున్ను మోమల్లన వంచి
బసవని దెసఁ జూడఁ బరమహర్షమున - వసుధేశునకు బసవనమంత్రి యనియె

బసవఁడు బిజ్జలునకు శివభక్తులమహిమఁ జెప్పుట


“వలదని వారింప వారింప వినక - చలమునఁ బంచితి జనులమాటలను
నేనుంగుఁ గోల్పడె మానంబు వొలిసెఁ - దూనిక చెడె శివద్రోహంబుఁ దగిలె

ఇరువదాండారి కథ


ధరణీశ! విను తొల్లి ద్రావిళభూమిఁ - గరయూరిచోడభూవరుని రాజ్యమున
మున్నరవాద్దడిమువ్వురిలోన - నెన్నంగ నొక భక్తుఁడిరువత్తుఁ డనఁగ
నపగతసర్వసంగపరీత చరితుఁ - డపరిమిత ప్రతాపానూనకీర్తి
సాహసాంకుఁడు శివద్రోహరగండఁ - డాహవవీరభద్రావతారుండు
సకలలోకప్రపంచకళావిరక్తుఁ - డకుటిలచిత్తుఁ డత్యద్భుతకీర్తి
సకల శాస్త్రాభ్యాసశౌర్యాన్వితుండుఁ - బ్రకటశివాచారపరుఁ డనఁబరగి
యౌవనప్రారంభమందు సద్భక్తి - భావనుఁడై భయభ్రాంతుల మీఱి
విస్మయలీల శ్రౌతస్మార్తవిహిత - భస్మరుద్రాక్షవిస్ఫారాంగుఁడగుచు
వరభక్తసందోహచరణారవింద - పరిచరణ క్రియాపరవశుఁడగుచు

శివభక్తులకు నెగ్గుసేయు పాతకుల - నవిచారమునఁ జంపునట్టినేమంబు
ప్రాణస్థలంబుగాఁ బ్రమథోక్త శివపు- రాణార్థపదవిశారదుఁడన నొప్పి
యుండంగఁ జోడమహోర్వీతలేశు - శుండాల మతిరౌద్రపిండితంబగుచుఁ
గలితమదో[41]ద్రేకజలధారలొలుక - వలవేగమున ననివారితవృత్తి
విడివడి యప్పురవీథి నేతెంచు - నెడ నొక్కభక్తుండు గడజాము లేచి
వేవునో ప్రొద్దని వేవేగ మంచి - పూవుఁదోఁటలు సొచ్చి భావించి చూచి
పరగిన [42]పెనుగాలి బలువునఁ జేసి - చిరిఁగిన ఱేకుల ఛిద్రపుష్పములు
క్రిగ్గాలి దూలఁదాఁకినఁ బొంగి తుదలు - బుగ్గరించినయట్టి మొగ్గ పుష్పములు
సుడిగాలిఁగడివోయి తొడిమలు వదలి - పడియున్న యాస్వయంపతితపుష్పములు
[43]మఱుఁగులఁ గొమ్ములమాటులఁ దుదల - [44]నొఱపున నున్నపర్యుషితపుష్పములు
బహుకీటకోత్కరనిహతిచేఁ దావి - రహితమైయున్న యుపహతపుష్పములు
కావని వర్ణించి కమనీయమైన - తావి వొంపిరిగొని తనరుపుష్పములు
సజ్జ నిండఁగఁ గోసి సంభ్రమంబడర - సజ్జన భక్తుఁ డాసామజంబెదుర
హరపూజనోత్సవపరవశుండగుచు - నరుదెంచుట నక్కరి గూడముట్టి
తుండాగ్రమునఁబట్టి [45]తూకించివైచి - రెండు గొమ్ముల నొక్కె రుండంబుగాఁడఁ
బ్రాణవియోగతాపమున భక్తుండు - "ప్రాణేశ! శివశివ! పరమాత్మ!” యనిన
యెలుఁగు [46]వినేతెంచి యిఱువదాండారి - మలహరభక్తునిపలుకుగా నెఱిఁగి
బిట్టుల్కిపడి మదిఁ [47]గట్టుగ్రుఁ డగుచు - "నిట్టియార్తారవం [48]బేమొకో!” యనుచు
బఱతెంచి భక్తునిపాటు భద్రేభ - మఱిముఱితనము నల్లంతటఁ గాంచి
నిశితకుఠారసన్నిహితుఁడై పొంగి - 'పశువ! త్రుంచెద [49]నిన్నుఁబఱవకు' మనుచు
మార్కొన నతనికి మలయుచు గజము - మార్కొని యెదిరె నున్మదము వట్రిల్ల
నేనిక రక్కసుఁడీశ్వరుమీఁదఁ - గానక పఱతెంచు గతియును బోలె
దీకొనఁ[50]గని, మదోద్రేకవిజృంభి - తాకారుఁడై పేర్చి యార్చి మైవెంచి
సంహారరుద్రుని చాడ్పునఁ గోప - రంహస్స్ఫురణమయి సింహనాదంబు
పూరించి చూపఱ దూరించిపాఱ - వారించి మదకరిఁ గారింతు ననుచుఁ
బఱతెంచి తొండంబుఁ బట్టి రాఁదివిచి - [51]మఱి నేల [52]కొఱగిన మా వంతుఁబట్టి

మడియించి యెడగాలఁబుడమికినూ(?)కి - మెడఁద్రొక్కి పెడబొబ్బలిడుచు ఘిఱ్ఱనఁగ
హస్తికుంభస్థలన్యస్తస్వకీయ - హస్తకుఠారుఁడై యట వ్రయ్యఁదివియ
శుంభద్గజేంద్రంబు కుంభినిఁ ద్రెళ్లె - దంభోళిచేఁ బర్వతము ద్రెళ్లినట్టు;
లిట చోళభూవిభుఁడింతయు నెఱిఁగి - యట వచ్చి యిఱువత్తు నడుగులకెరఁగి
నిటలాగ్రహస్తుఁడై నిలిచి భావించి - "కటకటా! భక్తునిఁ గారించె గజము
హరుభక్తులకు మున్నజాచ్యుతాదులును - సరియుఁ గారన్న నిక్కరిచావు సరియె?
ఏనుంగు వశువదియేమి దా నెఱుఁగు - నేనుంగు నేలిన యే ద్రోహిఁ గాక
చచ్చెద నా చావుసరి యన్న నోరు- వుచ్చు నట్లైనను జచ్చి శుద్ధుండ”
ననుచు నప్పుడ యిర్వదాండారిమ్రోల - జనపతి దన శిరంబునకుఁ దా నలుగ
నట్టిచో శివుడు ప్రత్యక్షమై చోళ - [53]పట్టవర్ధను భయభక్తియుక్తికిని
ఇఱువదాండారి మహిష్ఠభక్తికిని - గఱకంఠుఁడజుఁడు శంకరుఁడక్షయుండు
మెచ్చి భక్తునిప్రాణమిచ్చి మావంతుఁ - జెచ్చెర నపుడ సంజీవితుఁ జేసె
నంతఁబ్రాణము మత్తదంతికి నొసఁగె - యెంతయు మహిమ నయ్యిఱువదాండారి
నా చోడవల్లభు నతిదయాదృష్టిఁ - జూచి కైలాసవాసులఁజేసె శివుఁడు
మదియించి భక్తుని మడియించి నేనుఁ - గదియు నప్పుడ చచ్చె నా చోడనృపతి
ప్రేమం బెలర్పఁగ "భృత్యాపరాధ(?) - స్వామినోదండ” యన్చదువు నిష్ఠించి
తన కరిద్రోహంబు దన ద్రోహముగను - దన కల్లెనన్న నీ తప్పునకింక
గుఱి యెట్టు బిజ్జలక్షోణీశ! నీవ - పఱపంగఁ దలఁచితి భయమాత్మ లేక.

బావూరి బ్రహ్మయ్యగారి కథ


మఱియు బావూరి బ్రహ్మయనాఁగ నొక్క - గఱకంఠు భక్తుఁడఖండితకీర్తి
వీరమాహేశ్వరాచారవ్రతస్థుఁ - డారూఢగాఢమహత్త్యకాంతుండు
[54]మంగళభక్తి క్రియాంగభాషాంగ - సంగతచరితుఁడభంగప్రతాపి
స్థైర్యసంపన్నుండు శౌర్యపండితుఁడు - ధైర్యప్రపూర్ణుండవార్యవీర్యుండు
సత్యవచోరాశి శరణాగ్రగణ్యుఁ - డత్యుత్తమోత్తముఁడనఁగ నిబ్భువిని
బరగ జంగమలింగపాదారవింద - పరిచరణ క్రియాపరతంత్రలీల
నలయక పువ్వుఁదోఁటలు వెక్కు గూర్చి - తొలుకోడి గూయంగ బలువిడి నేఁగి
పూవులు గొనివచ్చి పుష్పమాలికలు - భావించి సంధించి భక్తుల [55]కిచ్చి

యట్టి కాయకలబ్ధియందు నిత్యంబు - చట్టన జంగమార్చనలు సల్పుచును
వర్తిల్ల మఱియొక్క వాదంబునందుఁ - గర్త గౌరీశుండ కాఁబ్రతిష్ఠించి
కలునందిఁబుల్లును బులగంబు మేపిఁ, - యిలయెల్ల నెఱుఁగ జొన్నలు లింగముగను
జేసి యో! యనిపించి భాసురభక్తి - వాసనమై నుండ వడినొక్కనాఁడు
ధరణీశుఁ డొక్కఁడు దంత్రంబుఁ దాను - బరమండలంబుల పైఁ బోయి పోయి
బావూరి చేరువఁ బ్రాగ్దిశయందుఁ - బూవుఁదోఁటలచెంత భూపతి విడిసి
యున్నెడ నతనిమహోద్దండగజము - తన్నుఁ దా మఱచి మదగ్రస్త మగుచుఁ
గడిఁదిమావంతునిఁ బడ ఝాళిసేసి - విడివడె దండెల్ల విరియఁద్రోలుచును
నీడకు నులుకుచు నింగివేయుచును - జాడ మల్లార్చుచు జనులఁ జంపుచును
ననివారితోద్వృత్తిఁ జనుదెంచుగజముఁ - గనియు బావూరిబ్రహ్మన లెక్కగొనక
వచ్చుచో మదకరి వడిగొని యెదుర - నుచ్చాటనము సేసి హో [56]యన్చునుదుర
బిట్టుల్కి సంధులు వ్రిదిలి ఘిఱ్ఱనుచు - [57]నెట్టోడి తుండంబు నిటలంబుఁ గూర్చి
వెనువెనుకకు భీతిఁ జని నదీతీర - మునఁ బడి చనలేక మూర్చిల్లి యపుడు
జీవంబు విడుచుడు మావంతు లేఁగి - యా విభునకు నిట్టు లనిరి బెగ్గిలుచు
"విడివడి మదకరి వడిగొని పఱచు - నెడ నొక్కభక్తయ్య యీ పల్లెనుండి
చని పుష్పములు గోసికొని వచ్చునెడను - గని మహోద్రిక్తమై కదియముట్టుడును
గాదన కేతించి కరతలంబార్చి - "చా! దున్న! నిలు” మని జంకింపఁ దడవ
వెనువెనుకకు భీతిఁ జని నదీతీర - మున విడ్చె జీవంబు” నన విని విభుండు
[58]నాయయ్య నాగజం [59]బట్లెంత యేచె - నో” యని [60]వగచుచు నొయ్యన వచ్చి
యమ్మహాత్ముని చరణమ్ముల కెరఁగి - "యిమ్మదకరి నీకు నెదురించుతప్పు
సైరింపు" మని చక్కఁ జాఁగి మ్రొక్కుడును - గారుణ్యరసవార్ధికడలున ముంచి
[61]యమ్మహీజనులెల్ల నాశ్చర్యమంద - బమ్మయ్య మదకరిప్రాణ మట్లిచ్చెఁ
బరగ బ్రహ్మయగారిశరణు సొచ్చుడును - జరితార్థుఁ డయ్యె భూవరుఁడు వెండియును
సజ్జనభక్తులచరితంబు లిట్లు - బిజ్జలక్షోణీశ పెక్కు వర్ణింప
[62]వెరవఱి మార్కొన్నఁ బొరిగొండ్రు వెఱచి - శరణన్నఁ బ్రోతురు హరభక్తవరులు
గాన యిన్నియుఁ జెప్పఁగాఁ బనిలేదు - భూనాథ! మనవలతేని, [63]లే పొదము
కలియుగరుద్రుఁడుగాక మాచయ్య - తలఁపఁగ మర్త్యుఁడే ధరణీశ యిదియ
[64]కర్ణంబు” నావుడు బిజ్జలుఁ డంత - లజ్జయు సిగ్గును బుజ్జగింపగ

బసవన్న బిజ్జలుని మాచయ్యకడకుఁ బిలుచుకొనిపోవుట

'నవుఁగాక' యని వచ్చి యఖిలంబు నెఱుఁగ - భువి సమస్తాంగము ల్వొంద నల్లంతఁ
బడియున్న బండారి బసవయ్య వచ్చి - మడివాలు మాచయ్య యడుగుల కెఱఁగె
నసమానలీలఁ బెంపెసఁగఁగీర్తించి - బసవఁడిట్లని విన్నపముసేయఁ దొడఁగె
“వలదని వారింపఁ జలమున ముక్కు - వొలియించుకొన్నట్టు వురులు వోనాడి
యిక్కడ రానోడి యెప్పటఁగోలె - నక్కడ సాష్టాంగుఁడై యున్నవాఁడు
పక్షికిఁదొడనేల పాశుపతంబు? ఈ క్షితీశ్వరుఁడన నెంతటివాఁడు?
ఎదురు నీకెవ్వఁ డీ రేడు లోకముల - సదయాత్మ! యీ తప్పు సైరింపవలయు”

మాచయ్య బిజ్జలుని యేనుఁగును బ్రదికించుట


నని విన్నవించిన నట్ల కాకనుచు - జననాథు లెమ్మనఁ బనిచి తత్క్షణమ
యట్టయుఁ బొట్టయు నస్థులుఁ గూడఁ - బెట్టించి జనులు విభీతులై చూడ
భసితంబు దునియలపైఁ జల్లి యతని - యసమగజేంద్రంబు నొసఁగి తొల్నాఁడు
పొడిచి వైచిన పీనుఁగుడువీథిఁ దాఁకి - పడ నప్డు సభ భయభ్రాంతులై బెదర
బొందికిఁ బ్రాణంబుఁ బోసి మాచయ్య - యందఱుఁ జూడంగ నంతరిక్షమున
నున్నవస్త్రములకు వెన్నొగ్గి జనులు - సన్నుతి సేయఁగఁ జనియెఁ జాటుచును
బసవఁడు మాచయ్య పాదము ల్గొలిచి - యసమాను మఠమున కనిచి యేతెంచె
సకలనియోగంబు జనపాలకుండు - ముకుళితహస్తులై మ్రొక్కుచు నుండ

మాచయ్య బసవనిగీతమును విని కోపించుట


అంత మాచయ దొంటియట్ల సద్భక్తి - సంతతసత్క్రియాస్పదలీల నడవ
మఱికొన్ని దినముల కఱలేక బసవఁ - డఱిమురి నొకగీత మానతిచ్చుడును
భక్తులు దన యొద్దఁ బాడఁగఁ దడవ - యుక్తియే” యనుచు మహోగ్రతతోడ
'శివశివ' యని కేలు సెవులఁ జేర్చుచును - 'నవినీతుఁ డిట్టుండె హా కల్లినాథ!
చెల్లబో! దీనులఁ జేసి శరణుల - కెల్లను దా నొకయిచ్చువాఁ డయ్యె
ఎన్నఁడు గ్రోఁతి యయ్యెను? వెక్కిరింప - నెన్నఁడు గఱచె నిం కెక్కడిభక్తి
దోసంబు గాదె భక్తులు దీని విండ్రె - బాసలు గీసలు వాట వాడకుఁడు
మాయొద్ద' ననుచును మాచయ్య గినిసి - కాయకంబున కరుగంగ నిక్కడను

బసవన్న మాచయ్య కడకేగి మన్నింప వేఁడుట

నంత నంతయు విని యాత్మలోఁగలఁగి - యంతంత ధరణి సాష్టాంగంబు లిడుచు
బసవఁడు భక్తజనసహాయుఁ డగుచు - వెస నేఁగుదెంచి భయసమగ్రవృత్తి
మడివాలుమాచయ్య యడుగులపొంతఁ - బుడమి సర్వాంగముల్ వొందంగ మ్రొక్కి
“యాక్రాంత సంతతాహంకార నిరతు - నక్రమాలాపు నిర్వక్రాపరాధు
నూర్జితక్రోధు వివర్జితసత్యు - దుర్జనాచారు ననిర్జితకాము
నజ్ఞానపుంజంబు నపగతశౌచు - విజ్ఞానహీను వివేకవిదూరు
నిర్భాగ్యచూడామణిని భక్తిరహితు - దుర్భావకు నవినీతుని నన్ను నింకఁ
గాచి రక్షింపవే కారుణ్యపాత్ర!- యేచినమద్గర్వమెల్ల మాయించి
లాలితంబుగ నాల్గు లక్షలమీఁద - నోలి [65]నర్వదినాల్గువేలగీతములు
గావించుటిది [66]యెగ్గు గని యేవగించు - భావన నాకయ్యె నీవు గైకొనమి
నా యతప్రీతి నోయనకున్న నింకఁ - జా! యనవయ్య నా సంగయ్యదేవ!”
యనుచు నిట్లాత్మనిందాతిదీనోక్తు - లను విన్నవించుడు విననట్ల వినియు
జంగమపరతంత్రుఁడంగావికారి - లింగదమాచఁడాలీఢశౌర్యుండు
“నధముఁడా! క్రొవ్వితే? హరభక్తులరయ - నధములే? నీవొకయర్థాధిపతివె?
అడిగెడువారు లేకయ్య నీ వింత - బడగవైతివి; మజ! బాపురే!” యనుచు
“అట్టియాచకుల నే నటు గందుఁగాని - యిట్టిత్యాగులఁ గాన మేలోకములను
పాన లిన్నియునేల? బసవ! నీయిచ్చు - నేనికదున్నలు నిలఁబచ్చమన్ను
గుఱ్ఱపుగాడిదల్ గుటిలంపుసతులు - నెఱ్ఱకోకలు బ్రాఁతియే శరణులకు
నీ దిక్కుఁ జూడుమా నాదు జంగమము పేదఱికములేని పెల్లు సూపెదను
[67]నదిగొ” మ్మనుచుఁ జల్ల నందంద నెగయు - సదమలోదకకణజాలమంతయును
మరకత [68]నీలనిర్మల పుష్యరాగ - వరవజ్ర విద్రుమ వైడూర్యముఖ్య
వినుతరత్నాచలవితతియై వెలుఁగ - నినుఁడు ఖద్యోతమ [69]ట్లిరవిరిఁ(?)దోఁప
నట పౌరు లత్యద్భుతాక్రాంతు లగుచు - నిట బిజ్జలుఁడుఁదారు నేతెంచి చూడ
నమరి మాచయ యుండెఁ బ్రమథప్రసాద - విమలపుష్పాంచితవృష్టి పైఁగురియ
బసవని నభిమతఫలములఁ దనుప - నసమాక్షుఁడర్చితుఁడై యున్నయట్లు
జంగమంబొప్పె నాలింగావతార - సంగతి మాచయ్య సద్భక్తిమహిమ

మెఱుఁగఁగ జాలక యిన్నిరూపములు - వఱలఁగఁ దాల్చిన తెఱఁగునుబోలె
అట్టి జంగమ సభాభ్యంతరాళమున - నొట్టిన రత్నంపుఁదిట్టలకఱుత
భక్తుల కేనసూ బండారి నన్న - యుక్తి నబ్బసవరా జుండె వెండియును
వారక యా మడివాలుమాచయ్య - గారల శ్రీపాదకంజంబులకును
మున్ను సాష్టాంగుఁడై మ్రొక్కుచుఁ జేరి - సన్నుతి సేయుచు శరణు వేఁడుచును
“నీ మహత్త్వముఁ జూడ నే నెంతవాఁడ - ధీమణి! సంగయ్య! దేవ! సర్వజ్ఞ!
నీవు శంకరుఁడవు నేను గింకరుఁడ - నీవు నిర్మలుఁడవు నేను దుర్మలుఁడ
నీవు విజ్ఞానివి నే నవిజ్ఞాని - నీ వమృతాంగుండ వే విషాంగుండ
నీవు మహాదాత వేఁ గృపణుండ - నీవు వశుపతివి నేఁ బశుజీవి
స్వామి! త్రైలోక్య చూడామణి వీవు - భూమి నిర్భాగ్యచూడామణి నేను
బొరి నిట్టి దుర్గుణంబులప్రోఁకలోన - నరయంగఁ గలదె నా యందు సద్గుణము
రక్షింపు మిట్టిగర్వప్రాప్తు నన్ను - శిక్షింపవే యయ్య! జియ్య నాదైన
యపరాధశతసహస్రావలి సైఁచి - విపరీత మహిమాఢ్య! వేయునునేల?”
అనుచున్న బసవన్న నందంద కౌఁగి - టను జేర్చి కారుణ్యవనధి నోలార్చి(ర్చె?)
“కలుగునే కాదె లింగంబునందైనఁ - దలఁపఁ గోపప్రసాదంబులు రెండు
చేరింటికైనఁ జెచ్చరఁ [70]గడువఁగొను - వారు సేపట్టరు వాయించికాని
ధర నంతకంటెను దమ భృత్యవితతి - [71]నొరయక చేపట్టుదురె యట్లుఁగాక
యందులమాలిన్య మడఁపఁగఁ గాక - యెందుఁ జీరల కల్గునే రజకుండు?
అట్టిద బసవయ్యఁ బట్టి మాచయ్య - ధట్టించి నిర్మలత్వంబు నొందించె
నెన్నంగ వేమాఱు నెంతగాఁచినను - వన్నెక్కుఁగాదె సువర్ణంబు మిగుల
నింతింతగాఁ జేయ నిక్షుఖండంబు - నంతకంతకుఁ దీపు లధిక మౌఁగాదె
ఱంపానఁ [72]గోసిన ఱాచిన నెఱయఁ - గంపెక్కుఁగాదె శ్రీగంధంబునకును
ఱాచిన మడివాలు మాచయ్య యెరసి - చూచుడు బసవయ్య శుద్ధసద్భక్తి
తనరంగ నేఁడుగదా! తుదముట్టె" - ననుచు భక్తాళి కీర్తన సేయుచుండ
ముకుళీకృత వికంపితకరాబ్జుఁడైన - సుకుమారు బసవయ్యఁ జూచి మాచయ్య
“విను మహంకారించినను భక్తియగునె - విని యెఱుంగవె పురాతనులలోపలను

మాచయ్య బసవన్నకు శంకరదాసికథఁ జెప్పుట

జడయ శంకరమహాస్థానంబునందు - సడిసన్న శరణుండు శంకరదాసి
కాలకర్మాకర్మకలితమహేంద్ర - జాలవిలోలనిర్మూలనశాలి
జన్మజరామరణోన్మదాపహుఁడు - చిన్మయానందవశీకృతాత్మకుఁడు
రౌద్రమహోద్రేకరంజితవీర - భద్రుండు ప్రత్యక్ష ఫాలలోచనుఁడు
దండితాజాండ కరండదోర్దండ - మండితాడంబరతాండవమూర్తి
విలసితకీర్తి నిర్మలుఁడు సంసార - తలగుండుగండఁ డతర్క్యప్రతాపి
నాఁగఁ బ్రఖ్యాపితానశ్వరలీల - వీఁగుచుఁ బ్రచ్ఛన్నవేషంబునందు
బొంతకు గంతకుఁ బ్రోవిడి పోవు - నంతకు విక్రయంబార్చి తెప్పించి
యక్కజంబందఁ గాయకలబ్ధి [73]నిత్య - మెక్కవుఁ దఱుఁగవు [74]నేను మానికలు
జంగమకోట్లకు సముచితార్చనలు - భంగిగాఁ జలుపుచుఁ బ్రభుడున్నయెడను
దేడరదాసయ్య సూడంగ వచ్చి - వేడుక మదిఁ [75]దులుకాడంగ మ్రొక్కి
యొక్కింత సుఖగోష్ఠి నుండి వీడ్కొనుచుఁ - జక్కన మఠమేఁగి [76]సదయుఁడపోలెఁ
“గటకటా! యింతలింగ [77]సదర్థుఁడయ్యు - నిట యీఁగకును దవుడింటిలో లేదు
శంకరదాసి లసద్భక్తి మహిమ - మింకనెన్నటి కంచు నె[78]డ్డవగచుచు
నక్కటికను దుగ్గళవ్వకుఁ జెప్పి - చిక్క గంపెఁడుకొల్చు శ్రీఘ్రంబ పనుప
“నట్టట్టె! పుత్తెంచెనటె కొల్చుదాసి - యట్టిదకాక మేలయ్యె నెంతయును
గొలుచునకిచ్చె మున్కోకయుఁ జించి - యిల నేమియడుగునో యీ మాకుఁగలదె?
బిడికిట నొకమాటు వుడుకంగఁదడవ - పిడికిటిలోననే యడఁగె గంపెఁడును
[79]నత్తవనిధియును నందలయించెఁ - దొత్తడిసంపద దొలఁగెఁ దత్క్షణమ
కూడు మందునకైనఁ గొలు [80]చిన్నిలేక - యాడకాడకు గాదియలు వాడువాఱె
దాసి మువ్వడసినతవనిధి యట్లు - దాసయ్య దివుచుడుఁ దత్‌క్షణమాత్ర
పరిభవాద్భుతశోక పారవశ్యమున - దురపిల్లు దాసికి దుగ్గళవ్వనియె

దుగ్గళవ్వ దేడరదాసయ్యకు శంకరదాసిమహిమ చెప్పుట


"కలవానియట్ల నిక్కంబు నీ వొక్క - బులుసరితనమునఁ బుచ్చితి కొలుచుఁ
దనర నేనుఁగుపండ్లు దాఁబట్టిచూచు - మనుజుండు బ్రదుకునే మడియునకాక

నెట్టన శరణుల నిలుకడ లరసి - పట్టిచూడంగ నీ ప్రాప్తియే చెపుమ
మృడుఁడు ప్రసన్నుఁడై యడు గడుగుమన - [81]నడిగెనే గెలిగొని యడకించెఁగాక
[82]యదియేల చేయుకాయకలబ్ధి యెంత? - కదలకయుండు జంగమసంఖ్య యెంత?
యక్కజంబైన కాయకలబ్ధి నిత్య - మెక్కవు దఱఁగవు నేను మానికలు
జంగమకోటుల సంతుష్టిసేయు - లింగసదర్థుల లేమి యెట్టిదియొ?

ఈశ్వరుఁడు శంకరదాసికి మూఁడవకన్ను నిచ్చిన కథ


ఖండేందుధరుఁడు లోకత్రయంబునను - వెండియు నాయయ్య వెలయింపఁదలఁచి
'యడుగు'మటంచుఁ బ్రత్యక్షమై నిలువఁ - జిడిముడిపడక సంస్మితవక్త్రుఁడగుచుఁ
గర్తలకర్త మత్కర్తవై నీవు - వర్తింప నింకొండు వరమేల వేఁడ
కడుఁగాక యేమియు నడుగమి సిగ్గు - వడియెద వడిగెదఁ బగలింటియట్ల
రాత్రియు సూఁదిదారంబు గ్రువ్వంగ - నేత్రములకు దృష్టి నెక్కొల్పుమనుడు”
వరదుండు దరహాసవదనాబ్జుఁ డగుచుఁ - గరమర్థి మిక్కిలికన్నిచ్చుటయును
హరునిచేఁ బడసిన యామీఁదికన్ను -పరదైవ దోర్దర్పహరణార్థమగుట
శంకరదాసి నిశ్శంకితవృత్తి - శంకరేతర సర్వ సమయారి యగుట
నిటలతటాంబకోత్కట చటులాగ్ని - పటు దృష్టివాతను బలువేల్పులెల్లఁ
జిటచిటఁ బ్రేలుచుఁ జటచటఁ బాసి - పటపటఁ బగులఁగఁ గటకటాయనక
వేల్పన్న పేరికి వెనుకొని [83]పుట్టు - మాల్పఁగ మఱికొన్ని వేల్పులు వోయి
బలువిడి శివ[84]శరణుల మర్వు సొచ్చి - తలఁకుచు మ్రొక్కు వేల్పులనెల్లఁ గాచి
యనయము మువ్వెట్టి గొనుచును [85]బడుగు - పనులు వంపఁగఁజేసి బ్రదుకుదమనుచు
[86]మసనక ముంగిటికసువులు నూక - [87]కొసనక మానక కొట్నంబు దినముఁ
బుట్టెఁడు దంపంగఁ బోలక మఠము - చుట్టును జాల రాఁజుచునుండు పెద్ద
పోటికట్టెలు వొలమున మోచితేరఁ - గాటిపాపఁడు వసిఁ గాచుచునుండఁ
గడుభక్తితోఁ గటకంబు మైలారుఁ - డడర నెప్పుడు గొడ గిడి తోడ నడవ
జేరి యాకడమల [88]చేటికాట్రేఁడు - దారలువట్ట నుద్యత్కీర్తులులియఁ
దక్కిన [89]యా పెఱదైవంబులెల్ల - నొక్కటఁ బనులు సేయుచుఁ గొల్చియుండ

నొప్పి యష్టాదశయోగపీఠములు - దప్పక [90]యేఁటేఁటఁ గప్పంబు [91]లరువ
'ముక్కంటి! నీ యింటికుక్కల'మనుచు - జక్కులు గిక్కులు మ్రొక్కుచుఁ గొలువఁ
దగిలి వారలమహత్త్వము విని యంత - జగదేకమల్లఁ డసహ్యభావమున

జగదేకమల్లని కథ


హరి నడంచుటయొ బ్రహ్మాదిదేవతలఁ - బొరిమాల్చుటయొ బుడిబుడి వేలుపులను
[92]బఱచుట సోద్యమే కఱకంఠుచేత - నెఱయ ఫాలాభీలనేత్రంబు వడసి
ముక్కన్ను వడయు(వాఁడౌ?)ట నిక్కమేనియును - జక్కన విష్ణుని సమదృష్టినిలిచి
వేయేల వడఁకక పోయినఁజాలుఁ బో!” యని కల్యాణపురమధ్యమందు
గోవిందుప్రతిమ యుక్కునను గావించి - భావించి యటమీఁదఁ బంచలోహములుఁ
బోయించి కడుసాంగముగఁ బ్రతిష్ఠించి - పాయక రేయును బగలును గొలువ
శంకరదాసి యచ్చటి కేఁగుదెంచి - యంక కాఁడునుబోలె హరభక్తులలర
నఱిముఱి మొగవాడ దెఱచి వీక్షింపఁ - బఱియలై విష్ణునిప్రతిమ నుగ్గగుడు
నట[93]మున్న మీఁదిలోహంబెల్లం గరఁగి - యిట వాదములఁబడ నేతెంచినట్టు
లరుదేర విష్ణునిఁ [94]బొరిమాల్చెఁగూలఁ- బరసమయులు భయభ్రాంతులై [95]పఱవఁ
గట్టుగ్రలీల శంకరదాసమయ్య - యిట్టు వర్తింపంగ నిల నరుల్వొగడ
నెఱుఁగవే విని చూచి యేఁజెప్పనేల - కఱకంఠునకునైనఁ గావ శక్యంబె?
భక్తులసద్గోష్ఠిఁ బాసియుండినను - భక్తియు భయమును బాటిల్లుఁగాక
భక్తులసద్గోష్ఠిఁ బాసియుండినను - భక్తియు భయమును బఱపఱగాదె!
ఇదియేమి సోద్యమో యీశుఁడే యెఱుఁగు - విదితంబుగా మఱి చదువఁబెట్టినను
గలమతియును జెడ్డకారణంబయ్యె - నిల నిన్నియును జెప్పనేల? ర”మ్మనుచు
వందుచుఁ గుందుచు [96]వనట నిర్వురును - నందంద సాష్టాంగులగుచు నేతెంచి

దుగ్గళవ్వయు దేడరదాసియు శంకరదాసయ్యను మన్నింపవేఁడుట


“కావవే జియ్య! శంకరదాసమయ్య! - దేవ! దెసయు దిక్కు నీవ మా”కనుచు
మ్రొక్కుచుఁ గరములు మోడ్చినఁ జూచి - "యక్కటా! వీరెవ్వరయ్య [97]వోచెల్ల!
దాసిదేవయ్యగారా! [98]సరణార్తి - మీ సరివారమా? మీకిట్లు దగునె?
ఇట విజయంచేయు టేమికార్యంబొ? - [99]ఎటపయనం బిట్టు లేఁగుచున్నారొ?

కరుణించి యిచ్చటి కరుగుదెంచితిరొ? - హరహర! మము మఱవరుగదె యెందు?
నిట్టి భయంబును నిట్టినిగర్వ - మిట్టి భక్తియుఁ గల్గునే యితరులకు
బాపురే! దాసయ్య! బడుగులాదరువ ! - బాపురే! దాసయ్య! భక్తులప్రాప!
వచ్చితే [100]యేమేనిఁ దెచ్చితే మాకు; - నిచ్చితే బ్రదుకు మా[101]యీసరయ్యకును
కోకమ్మి పడసినకొలుచు గాదియల - లేకేమి కొనిరావుగాక యేమియును
నేటంపుసంపద లెందేఁగెనింక - మాట [102]లేటికిని రమ్మా పాఱఁగొనుచు
వీసము నాసము విడువంగ ముడువ - నోసరించినధనం బుండునో యిచటఁ
ద్రవ్వుమా!” బనుచు నద్దాసయ్యచేతఁ - ద్రవ్వింప జంగమాస్థానదేశమున
నక్కజంబంద నందంద కడాని - [103]నక్కులై వెడలంగ నక్కజంబంది
యాదాసియును దుగ్గళవ్వయుఁ జాఁగి - పాదాబ్జములమీఁదఁబడి లేవకున్న
“నూలికి మొదలును గూలియు [104]నిచ్చు - నోలికిఁ గొలుచిచ్చి చేలఁగొన్నట్టి
యీగి చెల్లింపక యెట్లునాచేతఁ - జాగెద” వనిపోయి శంభుని నాఁగు
కడుఁగాక యింకొండు [105]దడ(డు?)పల్లియిచ్చి - పడయుము పుట్టెఁడుపందుమునుముక
కుడిచికట్టిన [106]బడుగులచేతనొండెఁ - బడనడ్చికొనుమ యిమ్మడియు ముమ్మడియు
గాదేని పేదల [107]సాదులచేతి - యా దీవనలన మేలయ్యెడిఁబొమ్ము
బడుగుభక్తులకాళ్లపైఁ బడ్డఁగలదె - కుడువఁగఁగట్టఁగ విడువఁగ ముడువ
నేదియుఁ గాదేని పాదము [108]ల్విడువు - లేదన్నఁ బోపునే పేదలమునుక
యిన్నియుఁ జెప్పఁగానేల యీ పసిఁడి – మన్నైనఁ గొనిపొండు గొన్ని పెర్కలను
ననవుడు "నిట్లేల యానతిచ్చెదరు? - త్రినయన [109]యతిగర్వతిమిరాంధు నన్ను
నపరాధశతసహస్రపరీతకృత్యు - నుపమింపరాని గర్వోపేతచిత్తుఁ
గరుణఁ దప్పుల సైఁచి కావవే!” యనుచు - శరణు వేఁడుచును బ్రశంసించుచున్న
సదయాత్ముఁడై యంత శంకరదాసి - ముదమున భక్తసమూహి గీర్తింప
నిరువుర లేవంగనెత్తి కారుణ్య - శరధి నోలార్చి ప్రసాదింపఁ దడవ
అవలఁ దొల్లిటికంటె నతిశయంబగుచుఁ - దవనిధి దేడరదాసయ్య కలరె
గర్వించినను నట్లకాక సద్భక్తి - నిర్వాహమొందంగ నేర్చునే బసవ

మాచయ్య బసవన్నకు నిమ్మవ్వ కథఁ జెప్పుట


అదియును గాక నిమ్మవ్వ యనంగ సదమల - సత్క్రియాస్పద భక్తినిరత

యకుటిల వీరవ్రతాచారయుక్త - ప్రకటజంగమలింగ పరతంత్రచిత్త
సంసారరహిత నిష్కళ మహిమావ - తంస సజ్జనసముద్యద్గుణోపేత
హరభక్తులిండ్లకు నర్ఘ్యపణ్యములు - కరమర్థి మోచుచుఁ గాయకం బలరఁ
గొడుకు భక్తులయిండ్లఁ గోవులఁ గావ - నుడుగక కాయకోద్యోగలబ్ధమున
జంగమాసక్తి లసద్భక్తియుక్తి - సంగతి దినములు [110]జరపుచున్నెడను

సిరియాలుని కథ


నంచితమతి సిరియాలుండు నాఁగఁ - గంచిలో నిత్య జంగమము లేవురకు
నిష్టాన్నపానాదులీప్సితార్థములు - దుష్టిగా నందిచ్చుశిష్టవ్రతమునఁ
జరియించుచుండంగ సర్వేశ్వరుండు - సిరియాలు భక్తిలోఁ తరయఁగఁ దలఁచి
కృతక తపోధనాకృతి నేఁగుదేర - హితజంగ[111]మార్థమై యేతెంచి సెట్టి
మస్తకవిన్యస్తహస్తుఁడై తపసిఁ - బ్రస్తుతింపుచుఁ బదాబ్జంబుల కెరఁగి
"స్వామి! వే వేంచేయవే! మహాపురుష! - నీ[112]మనుమని నిత్యనేమంబుసలుప”
నని విన్నవించుడు నత్తపోధనుఁడు - "ననఘ! మాయిచ్చ సేయఁగ నోపుదేని
నింతకంటెను సుఖం బెద్ది మా” కనుచు - సంతసంబందుచు సదయుఁడపోలె
సిరియాలుఁ గరుణాభిషిక్తుఁజేయుచును - నరమాంస మొక్కొక్క వెరవున నడుగ
“సర్వజ్ఞ! మీ మనోజ్ఞంబైనయట్టి - సర్వలక్షణగుణ సంపూర్ణుఁ డొక్క
వరపుత్త్రుఁడున్నాఁడు, నరమాంస మింకఁ - బొరుగింటికిని విల్వఁ బోయెదనయ్య?
అరుదైన మీవ్రతోద్యాపన నేఁడు - కరమర్థిఁ జెల్లింతు క్షణముగొ” మ్మనుచు
నడుగులఁ బడి సిరియాలుండు దపసి - నొడఁ[113]బర్చి యింటికి వడి నేఁగుదెంచి
తన సాధ్వి కొయ్యన తత్కార్యధార - వినిపింప “నీవేల వెఱచెద” వనుచు
సంగళవ్వయు నప్డు చదివెడుపుత్త్రు - మంగళంబలరఁ గ్రమ్మనఁదోడి తెచ్చి
“మనయింటఁ బండువుదినము నే”డనుచుఁ - గనుఁగొని వధ్యశృంగారంబు సేసి
బాలుని ముక్తివిలోలు సిరాలు - లీలయుఁబోలెఁ దల్లియును దండ్రియును
నిండారుమనమున నిహతుఁ గావించి - ఖండించి నానాప్రకారముల్గాఁగ
శాకంబు లొడఁగూర్చి జనులెర్గకుండ - శ్రీకంఠమూర్తిఁ జెచ్చెరఁబిల్చి తెచ్చి
శ్రీపాదయుగళాభిషేకంబు సేసి - యా పాదజలములత్యర్థిఁబ్రాశించి
సంచితోన్నత సుఖాసనమున నునిచి - మించి యర్చించి పూజించి వడ్డించి

యంగనయును సెట్టి సాష్టాంగ మెరఁగఁ - బొంగి తాపసి శాకములు వేఱువేఱు
పరికించి చూచి యేర్పడ శిరోమాంస - మరసి యెయ్యెడఁగాన కంత నిట్లనియె
“తలసూచియైనను దనయునిమీఁది - వలపు దక్కింపంగ వచ్చుఁ బొమ్మనియొ
తలదాఁచుకొన్నారు; తగవయ్య! బాలు - తలగొని యిఁక మీరు ధన్యులుగారు
ఏమియు లేదు శిరోమాంస మిట్లు - నేమంబునకుఁ జెల్లునే? యాగమోక్తి
దాన "సర్వస్య గాత్రస్య శిరః ప్ర - ధానం” బనెడుమాట గానేర దింక
ననవుడుఁ బతియును నతివయు బెదరి - "యనఘ! మహాత్మ! యి ట్లానతీఁదగునె
ఉపమింపఁ గేశదుష్టపరీతశాక - ముపహతం బనఁబడునో యని వెఱచి
పుచ్చితి మదియు నిప్పుడు చందనంగ - సెచ్చెరఁ బాకంబు సేసెఁదా” ననుచు
మఱితెచ్చి యా శిరోమాంస మర్పింపఁ - గఱకంఠమూర్తి గన్గంట వీక్షించి
“యిల నెట్టి యన్నదాతలు నిన్నుఁబోలఁ - గలరయ్య! యింతయుఁ గడుసాంగమయ్యె
నేనాటఁ బ్రతి వోల్పలేని యభీష్ట - దానంబు సేసితి దీనికిఁ దగఁగ
నీ వలపట మేము నీవు దాపటను - దేవతార్చనములు దీర్చి [114]సపంక్తిఁ
గడుఁ బ్రీతితోడ లింగప్రసాదంబు - గుడువనినాఁడు నా కొడఁబాటు గాదు
కంటి మంటినని యాకాంక్ష నిదేమి - కొంటిమో తింటిమో కొడుకుమాంసంబు
నిచ్చ సేయంగ మున్నిచ్చినక్షణము - పుచ్చుకో నీవ యేఁ బోయెదనింక”
ననవుడు సెట్టి భయభ్రాంతిఁ బొంది - వనితఁ జూచుడు "నింక ననుమానమేల?
ర”మ్మంచు లింగార్చనమ్ము సేయించి - క్రమ్మన వడ్డింపఁగాఁ దపోధనుఁడు
“నతిథిపూజలు సేయునవసరంబునను - సుతులును దారు నుత్సుకలీలతోడఁ
బొత్తునఁ గుడుతు రట్లుత్తమపురుషు - లిత్తఱి నీకైన నెట్లు సేయాడు
నిప్పుడు గానరాఁ డేఁడి మీ సుతుఁడు - చెప్పమే యప్పుడు సిరియాల! నీకు
నెన్నఁ బుత్త్రులు లేనియింట మాకెట్టు - లన్న దానముఁగొన నర్హమౌ చెపుమ
ధృతి 'నపుత్రస్య గతిర్నాస్తి' యనఁగ - గతిహీనులిండ్లఁ గుడుతురె సంయములు
కాన పుత్త్రుఁడు గలఁడేని పిల్పింపు - లేనినాఁడొల్లము పానలే”లనినఁ
జకితదేహుఁ డగుచుఁ జయ్యన మ్రొక్కి - "యకలంక! మీ రప్పుడున్నారు నేను
విన్నాఁడఁ బుత్రుఁడున్నాఁడు సదువు - చున్నాడొ! యాడుచున్నాఁడొపిదప
జనుదెంచి మఱి మీ ప్రసాదంబు వాఁడు - గొనియెడిఁగాక భోజన మాచరించి

రక్షింపవే యోగిరములు శాకములు - అక్షయాత్మక! చల్లనారకయుండ”
ననుచు మ్రొక్కుడును దదంగనఁ జూచి - "పనిచిన 'నౌఁగాక' యని పిల్వరాదె
తల్లి విల్చిన రాని [115]తనయులు గలరె - తెల్లంబుగా నాల్గుదిక్కుల నిలిచి
యెలుఁగెత్తి పిలువుమా యేము వినంగ - నలరుచు రాకేమి యట్లయుండెడినొ"
అనవుడు "నుత్తరం బాడంగ నేల” - యనుచు నేతెంచి తూర్పాదిగా నిలిచి
చెలఁగుచుఁ దాపసిచెప్పినయట్టు - లెలుఁగెత్తి సుతుఁ దల్లి విలువఁగఁదొడఁగె

సంగళవ్వ కొడుకును బిలుచుట


“పూర్వజన్మార్జితభూరికర్మములు - గుర్వణఁగించు నా కొడుక! రావయ్య!
దక్షిణాధీశ్వరుదర్పమడంచు - దక్షతగల్గు నాత్మజుఁడ రావయ్య!
విరసపశ్చాజ్జన్మమరణదుఃఖములు - [116]పొరిమాల్పఁ జాలు నా పుత్త్ర! రావయ్య!
ఉత్తరంబేలు నుదాత్తయోగీంద్రు - చిత్తంబునకు వచ్చుశిశువ! రావయ్య!
అలరు నా కోపభోగాతీతపదము - లలవడె నేఁడు నాయయ్య! రావయ్య!
దండధరోద్దండ దండప్రశక్తి - ఖండింపనోవు పుత్త్రుండ! రావన్న!
పాయనివ్యామోహపాశబంధములు - కోయంగఁజాలు నా కుఱ్ఱ! రావన్న!
ద్రవిణాదికేషణత్రయ విజృంభణము - తవులునఁ బడని నా తండ్రి! రావన్న!
సురరాజనుతుఁడు విశ్రుతతపోవేషి - వరదుఁడైనాఁడు నా వడుగ! రావన్న!
అంతకాంతకమూర్తియగు తవరాజు - సంతసంబంద నా సామి! రావన్న!
ఘోరనిస్సార సంసారవారాశి - పార మీఁదించుపాపండ! రావన్న!
అంచితాగణ్య పుణ్యప్రాప్తి నమరు - కాంచీవిలాసు నగ్రజుఁడ రావన్న!
దివిజకన్యకలతో దివి ముక్తికన్య - కవయనున్నది భక్తికాంతుండ! రావె!
దందడి మీయయ్య దక్షిణభుజము - నందంద యదరెడినన్న! రావన్న!
భానుఁడెంతేనియుఁ బడుమట వ్రాలె - శ్రీనిలయుండ! నా సీరాల!రావె!
స్వాదొంద నర్దేశసఖునిసన్నిధిఁ బ్ర - సాదంబుఁ గొనఁగ నా గాదిలి! రావె!
అనుచు నాలుగుదిక్కులందు నందంద - తనయునిఁ బిల్చుశబ్దంబులోపలను
జనితమై దిక్కులసంజ్ఞలు దోఁప - వనితాలలామ విల్వంగ నంతటను
గుండలంబులు గ్రాలఁ[117]గూఁకటి వ్రేల - [118]మండనం బొలయ సౌమ్యపుఘంట లులియ
రావిరేకయుఁ దూల భావంబు వోల - నా విధియు నదల హర్షంబు వొదల

నందెలు మ్రోయ మోక్షాంగన డాయ - సందేహ [119]ముడుగ నాశ్చర్యంబు [120]దొడుగఁ
జూపఱు గీర్తింప సురలు శంకింపఁ - దాపసి వీక్షింపఁ దండ్రి మైవెంపఁ
దల్లి గౌఁగిలిసాఁపఁ ద్వరితంబు దోఁప - ముల్లోకములుఁ జూడ ముద్దు దుల్కాడఁ
బఱతెంచె సుతుఁడు; నప్పాటనీశ్వరుడు - కఱకంఠుఁడజుఁడు మాకాంతుడుగ్రాక్షుఁ
డక్షరుం డా సిరియాలుకట్టెదుర - నక్షణంబునన ప్రత్యక్షమై నిలువ
నంతలో [121]సిరియాలుఁడతివయు సుతుఁడు - నంతంత ధరణి సాష్టాంగులై మ్రొక్కి
కలగని మేల్కన్నకరణి నద్భుతము - దళుకొత్తఁ జెలగి కీర్తనలు సేయఁగను
"శ్రీశ! వాణీశ! సురేశ! సన్ముని గ - ణేశ దిశాధీశు లెలమి నంకింప
నా రుద్రగణములు నా పురాతనులు - వీరభద్రాదులు సేరి కొల్వంగ
సద్భక్తు లతులితోత్సవలీలఁ దనర - నద్భుతాక్రాంతాత్ములై [122]నరుల్వొగడ
నలరి చందననంగ నాప్తవర్గంబు - నలతిరువెంగాణి'నంగఁ దత్సఖుల
నంచితమతి సిరియాలు సీరాలుఁ - గంచేడువాడలుఁ గైలాసమునకుఁ
బ్రవిమలకనకదివ్యవిమానపంక్తి - దివిఁదేజరిల్ల నద్దేవదేవుండు
గొనిపోయెఁ, గైలాసమున సిరియాలుఁ - డనుపమప్రమథగణాస్థానమందు
భవుఁ జూచి తనుఁజూచి ప్రమధులఁజూచి - భువిఁదనపెట్టిన పుత్త్రునిఁ జూచి
“పుడమిఁబుత్త్రునిఁజంపి మృడునిచే మగుడఁ - బడసి కైలాసమేర్పడఁ జూఱగొనిన
యిటువంటివాఁడెవ్వడేఁ దొల్లి యిపుడు - నట యిట గలఁడె నా యట్టి భక్తుండు
ఏనకా” కని మదినెంతయుఁగ్రొవ్వి - తా నహంకారించి తలఁపంగఁదడవ
చిఱునవ్వు నవ్వుచు శివుఁ డది యెఱిఁగి - 'చిఱుతొండ'రమ్మని చెయివట్టికొనుచు
నిమ్మహీతలమున కేతెంచి యపుడ - క్రమ్మఱ నిమ్మవ్వకడ నిల్వఁబడుడుఁ

నిమ్మవ్వ కథ


బడఁతియు బిట్టుల్కిపడి సంభ్రమమున - నడుగుల కెరఁగి పాదాబ్జముల్ గడిగి
యంగన ప్రచ్ఛన్నలింగమూర్తులకు - సాంగోచితక్రియాభ్యర్చనల్ సేసి
పంచభక్షంబులుఁబాయసాన్నాదు - లంచితప్రీతిఁగావించునయ్యెడను
భువిఁబథిశ్రాంతులుఁబోలె సెట్టియును - శివుఁడును వెడ నిద్ర సేయుచున్నెడను
నిమ్మవ్వ యర్ఘ్యపణ్యమ్ములకేఁగఁ - గ్రమ్మన గోవులఁ గాచి బాలుండు
వలసి యాఁకొని వచ్చి "యమ్మమ్మ!” యనుచుఁ - దలుపు [123]గఱ్ఱనూకితల్లి లేకున్న
నటయిట వరికించి యందొక్కబూరె - కుటిలాత్ముఁడై పుచ్చికొని నమలంగ

నంతటిలోన నిమ్మవ్వ యేతెంచి - యంతంతఁ 'జీ! కుక్క' [124]యని యిల్లుసొచ్చి
“పడుచు వాపముచేసె మృడునోగిరములు - [125]దొడికిలి తినె శివద్రోహి వీఁ"డనుచుఁ
బచ్చిచెక్కలఁ దలఁబగులంగనడిచి - చచ్చినపీనుఁగు జఱజఱ నీడ్చె
అననేల? పుత్త్రమోహంబు సీమంత - యును లేక కొడుకు చా వొరులెర్గకుండ
గాడిలోపల వైచి కసువుపై డిగిచి - వేడుక మదిఁదులుకాడంగ మఱియుఁ
బాకయత్నము సేయ బాలునిచావు - నేకాంతమున శివుఁడెఱిఁగింపఁ దలఁచి
"చిఱుతొండ! చూచితే! చిత్ర మివ్వనిత - తఱుసంటి [126]యాఁకలి ధరియింపలేక
క్రమ మెర్గఁ డొకబూరె గ్రక్కున డిగిచి - నమలెనో నమలఁడో నాతి వీక్షించి
'పాకమింతయు వృథాపాకంబుసేసె - యీ కుక్క ద్రోహి వీఁడేల నా'కనుచు
నఱిముఱిఁ బట్టి నిజాత్మజుఁ జంపి - జఱజఱ నీడ్చి యా చక్కటి వైచె
నదె చూడు” మనుచుఁ బాదాంగుష్ఠమునను - బొదివిన కసువెల్ల బోవనూకుడును
జూచి శిరఃకంప మాచరించుచును - నా చిఱు[127]తొండఁ డత్యాశ్చర్య మందె
నంగన వాక ప్రయత్నాంతమందు - జంగమములకు మై జలకంబు[128] సేసి
యతుల లింగోపచర్యల నర్చలిచ్చి - యతివ వడ్డించు నయ్యవసరంబునను
నింతిపుత్త్రునిఁజంపు టెఱుఁగనియట్ల - యంతకాంతకమూర్తి యప్పు డిట్లనియె
“ఇంతి! నీ పుత్త్రుఁడా యింతకమున్ను - నెంతయు నాఁకొని యిట సీరిచీరి
యెక్కడ వోయెనో? యెట్లున్న వాఁడొ? - అక్కటా! డస్సెఁ గదమ్మ! బాలుండు
కరుణమాలినయట్టి కాంతవు గదవె? - హరహర! చెయ్యాడ దారగింపంగఁ
బెంపమే కానమే బిడ్డలఁ దొల్లి - యింపౌనె కీడు మేలింట నేమేని
వండినఁ దిన; నెట్టివారైన శిశువు - లుండంగఁ దార కైకొండురే యిట్లు?
కనికరం బింతయు మనసున లేక - వనిత! మా కేటికి వడ్డించి తవ్వ!
పసిబిడ్డ లుండంగఁ బాడిగాదిట్లు - మసలక సుతుఁ బిల్వుమా యౌల నివల”
ననవుడు "నట్లగు నగు నాఁటదాన - ననియె చూచెదవయ్య! యయ్య నీమాయ
లెఱుఁగుదు నెఱుఁగుదు నే బేలఁ గాను - కఱకంఠ! యిదియేల కథలువన్నెదవు
ననుఁజూచి [129]సిరియాలుఁ డని తలంచితివొ? -పనియు లేదారగింపక పోవరాదు
ప్రామిఁడి[130]యై మేడుపడియెడు దానఁ - గామి నీ వెఱుఁగవే కడయింటి పొడువ
కామించి సుతుఁ జంపి క్రమ్మఱఁ బిలువఁ - గామారి! నీ యిచ్చు కైలాసమొల్లఁ

దన ద్రోహమునఁజేసి తాఁబోయెఁబొలిసి - గొనకొని యా ద్రోహిఁగూడు నే తలఁప"
నన [131]సిరియాలుండు విని యంత శోక - వనధిఁ దేలుచుఁ దలవంచి లజ్జించి
యడఁకుచు నిశ్చేష్టితాత్ముఁడై యుండఁ - బడఁతి నిర్మలభక్తిభాతికి మెచ్చి
యంతకుమున్న నిజాకృతిఁ దాల్చి - యంతకాంతకుఁడు ప్రత్యక్షమై నిలువ
“నోహో! ఇదేమయ్య! యుచితమే యిట్టు - లాహా! మహాత్మ! మహాత్ములగుణమె?
అతిముఱిఁజన్నుఁబాలర్థించి యేడ్చు - చిఱుత[132]చే నొకపిండికరు(ఱు?) డిచ్చి తల్లి
తనచన్ను మఱపించి కొనిపోయినట్లు - చనరాదు నిమ్మిచే సందేహపడకు
మొడలికిఁబ్రాణంబు నొడలువ్రాణమున - కొడఁబడియున్నట్టు లుభయనామములు
నమరెడు లింగజంగమమూర్తి విడిచి - భ్రమకు హేతువులగు భావము ల్దాల్ప
నవ్వరే నిన్నును నన్నును భక్తు - లివ్వేడబంబులకెల్ల లోనైన
నేల యీ బహురూపు [133]లే నేమి నిన్ను - సోల వెల్తిగ మున్ను సూచితినయ్య!
ముక్కంటివై మఱి మూఁడు [134]నుగన్ను - లక్కజంబుగ నున్న నవియు లేకున్న
హరరూపమై యున్న నరరూపమన - గురురూప కాదె సద్గురుసన్నిహితులు
కఱకంఠ! [135]యిట్లేల కళవళించెదవు? - వెఱవకు వెఱవకు వేఱకాఁదలఁప
వేయేల గుండయ్య ప్రాయంబు వడయ - నే[136]యఱ్ఱుకప్పుతో నేఁగితి చెపుమ
భోగయ్య యింటికిఁ [137]బోయిననాఁడు - ఏ గౌరిసహితమై యేఁగితి చెపుమ
దాసయ్యచే వస్త్రదానంబు గొనఁగ - నేసోమకళఁ దాల్చి యేఁగితి చెపుమ
మానకంజారుని మందిరంబునకు - నేనందినెక్కినీ వేఁగితి చెపుమ
చిఱుతొండని యింటికి నీవు - నే చతుర్భుజముల నేఁగితో చెపుమ
కావున నీ చమత్కారము ల్మాను - మీ వేడబము లెల్ల [138]నే మెఱుంగుదుము
ఎట్టైననుండు మీ విట్టారగింపఁ - [139]బెట్టుదు నీయాన ప్రిదిలితినేని”
అనుచు నిష్ఠించి నిమ్మవ్వ పల్కంగ - మనసిజాంతకుఁడు మెల్లన నవ్వుదనర
నట్టైన నవుఁగాక" యని యారగింపఁ - బెట్ట నా [140]సిరియాల సెట్టికిట్లనియెఁ
గడుభక్తిఁ జండేశకాటకోటాదు - లడరంగఁ దండ్రుల నాప్తులఁ దప్ప
నడచినఁ జంపరే? నఱకరే మగుడఁ - బడయరే? వేఁడరే ప్రత్యక్షమైన
విను మట్లుఁగాక ద్రావిడదేశమందుఁ - జనినపురాతన శరణులలోన

నరసింగ నయనారుని కథ

నరసింగ[141]మొన్నయనారనురాజు - ధరణి మద్భక్తుఁ డాతని యగ్రమహిషి
కరమర్థి నాయూరిపరమేశుఁ గొలువ - నరుగుచోఁ బూజార్హమగుపుష్పమొకటి
పుచ్చి మూర్కొనుడును బువ్వులవడుగు - నచ్చెల్వ నాసికం బప్పుడ కోయ
నచ్చోటి కప్పుడ యచ్చోడనృపతి - వచ్చుడు సతితోడ వనితలు మ్రొక్కి
“దేవ! తప్పేమియుఁ గావింప దిచట - దేవి వోవుచు నొక్కపూవుమూర్కొన్న
లింగార్థమై యున్న చెంగల్వపూవు - నంగన మూర్కొనె నని ముక్కుగోసి
వైచి నీ పూజారివడు” గని చెప్ప - "నోచెల్ల! తగ దిట్టు లుచితమే నీకు”
ననుచుఁ బూవులవడ్గు నప్పుడ విల్వఁ - బనిచి “నీ కిది భక్తిపాటియే వడుగ!
యెట్టివివేకివై తిటమున్ను పువ్వు - ముట్టినచెయి మొట్టమొదటికిఁ గోసి
మఱికదా కోయుట మగువ నాసికము - ఎఱుఁగవు నిన్ను [142]నాకేమనఁ గలదు?
అనుచు నిజాంగన నచటికిఁ బిలువఁ - బనిచి భూపతి [143]వాఁడి [144]బాడితయెత్తి
“నిన్ను నీ వెఱుఁగక యన్నెక్కి క్రొవ్వి - మున్నీశ్వరార్థమై యున్నపూవునకుఁ
జాఁచిన చెయ్యేది సక్కన నపుడు - చాఁచినట్లే చాఁపుదాఁపు ర”మ్మనుచు
ముట్టిన [145]యంగుళుల్ మొదలికి నఱికి - పట్టఁ జూచిన మణికట్టు ఖండించి
[146]తివిచినమోచెయ్యిఁ ద్రెవ్వంగ నడిచి - యవిచారమున మొద[147]లంట వదల్ప
నత్తఱి నేము ప్రత్యక్షమై నిలిచి - తుత్తున్కలై యున్న యత్తన్వి చేయి
మును గోసివైచిన ముక్కును నొసఁగి - జననాథునకు నంత సామీప్యముక్తి
యిచ్చినఁ గైకోఁడె యీ జనవ్రాత - మచ్చెరువందుచు నర్థిఁ గీర్తింప

కొట్టరువు చోడనికథ


అట్టునుగాక [148]మున్ [149]పట్టంబుదేవి - కొట్టరువందు మా కొల్చుఁగుడ్చుచును
గర్భిణినాక తద్గర్భంబులోనె - యర్భకు సహితంబ హరియింపఁదడవ
కోరి మోక్షము వేఁడికొనఁడె మెచ్చినను - నారచోడఁడు! మఱి యట్లనే మెచ్చి
భంగిగా నభిమతఫల మడుగుమనఁ - [150]గింగాణమును జేయ దంగనఁ జూడు
తప్పుసేసిన మహోద్ధతభక్తియుక్తిఁ - దప్పేమి సంపెఁ బో తన్వి దనూజు
నడుగంగవలదె ప్రత్యక్షమైయున్న - యెడ? నింతిమాహాత్మ్య మేమనవచ్చు

నడిగినఁ జంపితి వడుగఁ దనూజు - మడియించి పిల్చితి మఱి పిల్వదతివ
[151]ఇట్టిట్టిభక్తు లనేకులుండంగ - నెట్టయా [152]సిరియాల! యేనకా కంటి
భక్తితో గర్వించి పలుకుటయెల్ల - యుక్తియే?" యనుచుఁదద్భక్తవత్సలుఁడు
బాలుని నంత సప్రాణుఁ గావించి - కైలాసమున [153]కన్చెఁగమనీయలీల
“జంగమలింగపూజనము వీక్షింప - భంగిఁజతుర్వర్గ ఫలములకంటె
నుతృష్ట”మని ధరనుండె నిమ్మవ్వ - సత్క్రియలందెల్లఁజనునె గర్వోక్తి
యట్టిదకాక యహంకరించినను - బట్టిచ్చునే భక్తి బసవకుమార!
హరుఁడు దా వెండియు [154]నంతఁబోనీక - సిరియాల! రమ్మని చెయివట్టికొనుచు

హలాయుధుని కథ


సరసర భక్తవేషంబులతోడ - ధరహలాయుధుఁడున్నపురికి నేతేర
నా హలాయుధుఁడు నత్యర్థి [155]దుల్కాడ - మాహేశ్వరులకు సమ్మతిఁజాఁగి మ్రొక్కి
నవినయసంభ్రమవివశాత్ముఁడగుచు - నవసరోచిత సత్క్రియాదులఁ దనిపి
ముక్కంటిమూర్తికి ముదము వహింప - మక్కువ సుఖగోష్ఠి మాటలాడుచును
“నెంతదవ్వులనుండి యేఁగుదెంచితిరొ? - యెంతయేనియుఁబథశ్రాంతులు వోలె
నున్నవా”రని యిట్లు విన్నవించుడును - నన్నీలగళమూర్తి యతని కిట్లనియె
“ధరణి మహాభక్తదర్శనార్థంబు - చరియించు జంగమోత్కరములోపలను
నరుదంద ననయంబు నాడుచుండుదుము - కరమర్థి భక్తులే గతియుఁగా మేము
మముఁ దమపాలిలింగముగ వారంత - నమితసంగతిఁ గొనియాడుచుండుదు[156]రు
తిరునీలకంఠుండు వరగొండపతియుఁ - గరికాలచోడండు నరియమరాజు
యెలయదంగుళిమారఁ డేణాధినాథుఁ - డిలఁ జేదిరాజు వాగీశనైనారు
చేరమ శ్వపచయ్యగారు సోమాసి - మారుండు పిళ్లనైనా” రనఁబరగు
వీరాదిగా భక్తవితతిచే నొల్ల - నారాధ[157]నలు గొన్నవార మీ క్రియను
నీడాడ యని చెప్పనేల! యిద్ధరణిఁ - గూడ నేఁజొరనిభక్తులయిండ్లు లేవు
మమ్మెఱుంగనిభక్తుఁ డిమ్మహి లేఁడు - ఇమ్మహిఁబెద్దగాలమ్ము మా[158]సుళువు
మును పెట్టివారు మెచ్చనియట్టి భక్త - జనము లౌననఁగ మా దినములు గడచెఁ
జేపట్టి మము రూపు సేసినవార - లేపారు భక్తుల [159]నేకులు గలరు
నరిది మా బ్రదుకు మున్నాదిఁబుట్టినది - పెరిఁగినది నిరాళపురమను వీడు

పుట్టితిఁగాని యిబ్బువిఁదల్లిదండ్రు - లిట్టివారనియెర్గ నేమనిచెప్ప
నింపార నిమ్మవ్వ యెత్తి చన్నిచ్చి - పెంపఁగఁబెరిఁగితి బిడ్డనిభాతి
నడరఁగెంభావిభోగయ్య సెట్టార్చి - నడపింప భువి నడుగిడఁ గఱచితిని
బడిపను లేమేనిఁబంపుచు నంబి - కడుకొని పిలువంగ నుడువ నేర్చితిని
గడుఁగూర్మిఁ జెన్నయ్యగారిపొత్తునను - దొడుకొని కుడుపంగఁగుడువ నేర్చితిని
అఱకొఱ లేక దాసయ్యమచ్చునను - గఱచితి వస్త్రంబుగట్ట నంతటను
గడఁకతోఁ గూఁతుక్రుమ్ముడిఁ గోసిమాకు - జడఁగట్టె మానకంజారుండు మఱియు
మిండండనై యాడుచుండంగఁ జూచి - వెండి బల్లహుఁ డొక్కవెలఁదిఁగావించె
ఇమ్మిండనికి [160]ధనం బెక్కడిదనుచు - ముమ్మడిపడి సేసె మొన్నయధరుఁడు
అంత దాక్షారామమం దహర్నిశముఁ - గాంతాసుఖోపభోగంబులందుచును
నరుదెంచి మొన్న నా సిరియాలునింట - వరపుత్త్రుఁగంటి దేవరఁగూడుకొనియె
భువిని నా సుఖదుఃఖములు నీకుఁజెప్ప - కెవరికిఁజెప్పుదు నే హలాయుధుఁడ!

జంగమరూపధారియగు శివుఁడు హలాయుధునకు సిరియాలుమహిమఁ జెప్పుట


అట్లునుగాక చోద్యంబు వెండియును - నెట్లన్న వినవయ్య! యేఁజూడఁజూడ
సిరియాలుఁడాకంచిపురి యేడువాడ - లరుదుగాఁగొనిపోవ నందులోపలను
గలసి పుత్త్రుఁడు వోయెఁ గైలాసమునకు నిలఁజిఱుతొండని కెన యెందుఁగలరె?
మలహరుఁడాతనిమనసు లోఁతరయఁ - దలంచి శంకరకింకరులు మొదల్గాఁగఁ
గడఁగి వ్రతస్థులఁ దొడంగి పుత్తేర - నడిగినట్టుల వారి కతిభక్తియుక్తిఁ
జెఱకురసంబు నీప్సితవస్తువులును - నఱలేక యందిచ్చి కఱకంఠుఁగొలువ
నదిగాక హరుఁడరువదియొక్కదినము - వదిగొని కంచిలో వాన [161]గుర్పింపఁ
గడఁగి నిత్యము నేగురొడయల కన్న - మిడుచుండఁదపసులం దెచటలేకున్నఁ
బరముండుదాన తాపసిక్రియ నంత - నరుదెంచి సిరియా[162]లువరపుత్రు నడుఁగఁ
గడునర్థిఁ గొడుకుశాకములు గావించి - మృడుని మెప్పించి యప్పుడు సుతు మగుడఁ
బడసి కైలాస మేర్పడఁజూఱగొనియె - నడరంగ నున్నార మందు నాఁడేము
అట్టి భక్తుఁడు గలఁడయ్య లోకములఁ - బెట్టంగవచ్చునే పుట్టినసుతుని
మచ్చరంబున భక్తిమాటలాడంగ - వచ్చుఁగా”కని పేర్చి [163]హెచ్చి కీర్తింప

శివ! శివ! ఇది యేమి సెప్పెదవయ్య! - శివుఁడేమి నరులభక్షింప రక్కసుఁడె?
శిశువు సద్భక్తుని [164]సిరియాల నంబి - పశువరింపఁగఁజంప భక్తిహీనుండె?
మీ రొడయలుగాన మీమాట బొంకు - నారాదు గాక యేనాఁటఁబోలగునె?”
అని మిథ్య సేయఁగ నా మృడుమూర్తి - "విను హలాయుధ! పురాతనులలోపలను
సతుల నిచ్చినవా రసంఖ్యాతకోట్లు - సుతుల నిచ్చినవారు శతకోటికోట్లు
తమ్ము నిచ్చినవారు దా రనంతంబు - నిమ్మహి లేరన నిది నీకుఁ దగునె?
హరుఁడు భక్తులమనం బరయంగఁదలఁచి - యరుదైన వస్తువు లరుదెంచి వేఁడ
నరగలిగొన కిత్తు రట్ల భక్తులును - ధరఁబుట్టెనే భక్తి సిరియాలుతలనె?
కఱకంఠుఁడును వేఁడెఁగావున నిట్లు - చిరుతొండఁడును బెట్టె సీరాలు బాలు
నరయింపు నమ్మవే ధరణిలోపలను - గరమర్థి నూరూర సిరియాలు చరిత
మేటియై చను భక్తకూటువలందుఁ - బాటలుగాఁ గట్టి పాడెడువారుఁ
బ్రస్తుతోక్తుల గద్యపద్యకావ్యముల - విస్తారముగఁజేసి వినుతించువారు
నటుగాక సాంగభాషాంగక్రియాంగ - పటునాటకంబుల నటియించువారు
మునుమాడి వీరు వా రననేల కూడి - కనుఁగొన ఱోళ్ల రోఁకళ్లఁబాడెదరు
అనుమాన మొక్కింతయును లేదు దీని” – కనవిని కలుషించి యా హలాయుధుఁడు

హలాయుధుఁడు, సిరియాలు కథ విని కోపించి శివునకును, సిరియాలునకును వెలివెట్టుట


“అట్టెట్టు [165]వేఁడె నాహరుఁడు మాంసంబు; పెట్టె[166]నా చిఱుతొండసెట్టితనూజు?
భక్తవత్సలుఁడెట్లు భక్తుని మ్రింగె? - భక్తుఁడేనియు వెట్టు భక్తునిఁజంపె?
హరహరా! యట్టి దేవర యట్టి భక్తుఁ - డరుదగు లేదువో సరిసమానంబు
తల్లి రక్కసియైనఁదా నెట్లుబ్రదికె? - నల్లవో శివుఁడు దానవుఁడయ్యె నయ్య!
ముదిసి ముప్పున నింత మది [167]మరుల్వొంది - మదనారికిని ధృతిమాలంగఁదగునె?
కోమటి బుద్ధుల కోలాసఁ జేసి - కామించి సుతుఁజంపెఁగాక యెట్లన్న
ముట్టరు భక్తులు మున్ను మాంసంబుఁ - బెట్టుదురే తన్నుఁబెద్ద సేయుదురె?
అడిగెఁబో మనసు లోఁతరయఁదప్పేమి? - కొడుకుఁ జంపఁగఁ గత్తిఁగొన్న యంతటనె
మృడుఁడు జాణండేని మెచ్చంగవలదె? - కడుఁగడు మోహించెఁగాక పుత్త్రునకు
మఱి యట్లుగాక యచ్చిఱుతొండఁడరయ - నెఱవణిగల భక్తినిరతుఁడేనియును

[168]నోరవోఁజూచునే యొగిఁదన్నుడాఁచి - [169]యారఁబ్రాణంబున కాసించె నతఁడు
తమసుతుఁడైన జంగమమ కాఁడెట్లు? - సమయింపఁగూడునే శంక దాలేక!
పొరుగింటిచిచ్చైనఁదరికొనుఁగాని - దరికొనదే [170]యిట్లు దమయింటిచిచ్చు
వెలుపలిదుఃఖంబు వెలిఁబోయెననినఁ - బొలుపయ్యె నిట్లుండవలవదే భక్తి?
మృడునకు నరమాంసమేకాని యొండు - మెడకుఁబోదయ్యెనో మేలయ్యెననుచుఁ
దలర కీశ్వరుమీఁదఁదా నింతభక్తి - గలవాఁడు శాకపాకములు గావించి
యన్నీలగళునకుఁదన్నేల పెట్టఁ - డెన్నంగ నిది భక్తహింస గాదెట్లు
తనయుని నొప్పించెఁదన్ను వంచించె - ననుమాట [171]కోడి పుత్త్రు నపుడ పిలువఁ
బంచెఁగా “కప్పు డర్పించితిఁబిలువఁ - బంచుట యిది భక్తి [172]పాటిగా దింక”
ననియెనే చిఱుతొండఁడట్లునుగాక - చనుదెంచి యర్థించి చంపించినట్టి
మనసిజారియును మ్రింగన(?)గొండియయ్యె - ననుమాట కంజిపుత్త్రుని నపు డుమిసెఁ
గాక త్రేన్పులు గఱ్ఱుగఱ్ఱున వెడలఁ - జేకొని యారగించెనె కడుపార
సెట్టికిఁగర్మంబుఁ దిట్టు దేవరకుఁ - గట్టిల్లె నింతియ [173]కాదె కావునను
భక్తుని మ్రింగిన పచ్చిరక్కసుఁడు - భక్తుని జంపఁ బాల్పడు సూనెగాఁడు
నిది యొక్క కథయుఁగా నిల రచియించి - చదువుమూఢులకు నసంఖ్యాతులకును
వెలియుఁజుండో” యని వ్రేసెఁ జేతాళ - మలుక రెట్టింపంగ నా హలాయుధుఁడు
అంత నత్యంత భయభ్రాంతిఁబొంది - యంతకారియు సిరియాలుండు నతని
యక్కజంబైనకోపాటోపదృష్టి - కొక్కింత గెలఁకుల [174]కోసరించుచును
నుల్లము ల్గలఁగ నొండొరుల మొగంబు - లల్లన చూచుచుఁ దలడిం[175]చుచును
నున్న యిద్దఱ హలాయుధుఁడు వీక్షించి - "మన్నింపఁదగు జంగమములుగా మిమ్ము
నిట క్రిందిమాటలకేఁదప్పువట్ట - నిటమీఁద సిరియాలు నీశ్వరువార్త
మఱచి యాడితిరేని మా భక్తు లెడకు - మఱి మీరు హరుని కోమటి తోడివార”
లనవుడు నుత్తరం బాడంగ వెఱచి - మనసిజారియును నుమాకాంతఁదలఁపఁ

పార్వతి సంగళవ్వతో నేతెంచి తమ పతుల వెలిదీర్ప హలాయుధుని వేఁడుట


బార్వతియును దాను భక్తియన్ సుదతి - సర్వాంగములు దాల్చి చనుదెంచునట్లు
సంగళవ్వయుఁదానుఁజనుదేరఁగాంచి - జంగమాకృతిఁగని చని హలాయుధుఁడు

మ్రొక్కి తోడ్తెచ్చి సముచితక్రియాదు - లక్కజంబుగఁజేయ నంబిక యనియె
“నఖిలంబు నెఱుగంగ నజ జనార్దనుల - ముఖమున ఱొమ్మున ముదిత లుండియును
వారక తమతమ వలచినవారిఁ - గోరి పోదురు వారి గుణమేమి సెప్పఁ
బొలుపొందఁగాఁదనపురుషునిగాని - కలనైన నెఱుఁగదు గౌరి దా నట్టి
పరమపతివ్రతాపరల మల్లయ్య - హరపాదభక్తి నిరంతరాత్మలము
'ఒడలాదిగా హలాయుధుఁడు భక్తులకు - నడిగినవస్తువు లెడపక యిచ్చు'
ననుచు సద్భక్తసభాంతరంబులను - ఘనతరంబుగఁజెప్పఁగా విని యేము
వచ్చితి మట్ల మా వాంఛితార్థంబు - లిచ్చిదీవనఁ బొందవే హలాయుధుఁడ!
మహితశివాచారమార్గానుపాల! - సహజైకలింగనిష్ఠాపరతంత్ర!
విదితసద్భక్తి సంవిత్సుఖామాత్ర! - సదమలసర్వప్రసాదైకగాత్ర!
జంగమశృంగార! సత్యగంభీర! - లింగానువర్తి! యభంగురకీర్తి!
నెట్టణ శరణుండ! నిర్మలాంగుండ! - ధట్టుండ! మోక్షవిద్యాపండితుండ!”
అంచు నగ్గింపఁగా నా హలాయుధుఁడు - సంచిత ప్రీతి [176]దుల్కాడఁ గేల్మొగిచి
“వ్యక్తిమై భక్తులవరువుడఁబ్రస్తు - తోక్తుల కోర్తునే? యొడయ లిచ్చెదరు
మా భక్తు లతులసామర్థ్యు లిట్లవిర - [177]తాభీష్టవస్తువు లడుగుఁడేమేని.”
అనవుడుఁ [178]“జిఱుతొండఘనునాతియిదియ; ననఘ! యీశ్వరునియర్ధాంగన నేను
బతి బాహ్యలైయున్న సతులేమిగొఱయు - బతు లేమిగొఱభక్తి బాహ్యులేనియును
గావునఁ దప్పులు వోవిడ్చి స్నేహ - భావన నతిదయాభావంబు దాల్చి
పతులకు నతులసద్భక్తి భిక్షంబుఁ - బ్రతిభమై మాకు సౌభాగ్యభిక్షంబుఁ
బెట్టవే?” యనుచు సంస్పృహభాతిఁగరుణ - వుట్ట నాశైలేంద్రపుత్త్రి వేఁడంగ
నటమున్న చిఱుతొండనతివయు మ్రొక్క - నిట హలాయుధుఁడును మహేశ్వరావలియు
హరునకు సెట్టికి నభయంబులొసఁగఁ - బరమాత్ముఁడజుఁడు శ్రీపార్వతీశ్వరుఁడు

శివుఁడు ప్రత్యక్షమై హలాయుధు ననుగ్రహించుట


కంతుసంహరుఁడు శ్రీకంఠుఁడుగ్రాక్షుఁ - డంతకుమున్న ప్రత్యక్షమై నిలువ
నలరుచుఁ బ్రమథరుద్రానేకకోట్లు - బలసి డగ్గఱి యిరుగెలఁకులఁ గొలువ
వెనుకదిక్కునఁదిరువెంగాణినంగ - యును సిరియాలుండు [179]దనరఁగీర్తింప
ముందఱ నందంద మ్రొక్కుచు భక్త - సందోహ మచలితానందంబు నొంద

దివిజదానవపద్మభవహరిముఖ్యు - లవికలావరణస్థులై ప్రశంసింప
సర్వసన్మునులు నాశీర్వాదనాద - పూర్వకంబుగ హస్తములు దలఁదాల్పఁ
దుంబురునారదాదులు ప్రీతిఁబాడఁ - బంబిన దేవతూర్యంబులు సెలఁగఁ
గరికాల, సిరియాలచరితాదికథలు నరుదందఁబాఠకులంతంతఁజదువ
నటమున్న నిటలతటాక్షపదాబ్జ - ఘటితఫాలస్థల పటుదేహుఁడగుచు
జనితనేత్రానంద సలిలాభిషిక్త - వినుతవక్త్రాంబుజ విలసనుండగుచు
గద్గదప్రోద్భూత కంధరాంచిత స - ముద్గతస్తవన సంయుతదేహుఁడగుచు
సవినయ సంభ్రమ సంస్పృహానంద - వివశాంతరంగాది విభ్రముండగుచు
నున్న హలాయుధు నన్నీలగళుఁడగు - చెన్నొందఁ గౌఁగిటఁజేర్చి సంప్రీతి
నా హలాయుధునియుద్యద్భక్తిమతికి - సాహసంబునకు నసాధ్యనిష్ఠకును
మెచ్చె నచ్చెరువు నర్మిలి దొట్రుకొనఁగఁ - జెచ్చెర నతులిత శ్రీలింగమూర్తి
మెఱుఁగులఁగన్నులు మిఱుమిట్లువోవ - వఱలెఁడుకనక దివ్యవిమానపంక్తి
యవిరళంబై వెల్గ నతఁడు వాలించు - నవపురంబులు గూడ శివభక్తవితతి
నా హలాయుధుని యత్యద్భుతభక్తి - మాహాత్మ్యమలరార మహిజను ల్వొగడ
లాలితానందసల్లీల దలిర్పఁ - గైలాసమునకుఁజక్కనఁగొనిపోయె
సిరియాల దర్పాపహరణార్ధముగను - హరుఁడిల మెఱయించె నా హలాయుధునిఁ
గావున నెందును గర్వోక్తిభక్తి - భావన కెక్కునే బసవకుమార!

మిండనైనారు కథ


మఱియును సద్భక్తిమహితమండనుఁడు - మిఱుమిండనైనారు మేదురకీర్తి
జంగమారాధనా శ్రాంతనితాంత - సంగతసుఖ విగతాంగవికారి
యతులశాపానుగ్రహ[180]సమగ్రకీర్తి - యతిశయశుద్ధశివైకమానసుఁడు
దుష్టజనోద్దండదోర్దళనుండు - శిష్టజనోత్కృష్ట శీలపాలనుఁడు
ధరణిఁ [181]జేగొండనా విరచింపఁబడ్డ - పురవరంబందు సుస్థిర భక్తియుక్తి
నెలనెల శివరాత్రి నీమంబు భక్తి - వలగొని పండ్రెండువర్షము ల్సలిపి
యిచ్చమైఁబదు[182]మూఁడవేఁటి యంత్యమున - వచ్చి చెల్లంతిరువాలూరఁబరగు
వాల్మీకిదేవుని వాసంబునం ద - కల్మషభక్తి జాగరము సెల్లించి
పాపవిధ్వంసుని భక్తులుఁదాను - గోపురంబున నిష్టగోష్ఠి నున్నెడను

ఒడయనంబి వాల్మీక దేవుని గుడికి వచ్చుట

నరుదందఁగా నంబి పరమనాచమ్మ - వరగృహంబున నుండి వాల్మీకిదేవు
గుడికి నేతెంచునయ్యెడఁబురజనులు - గెడగూడి త న్నిరుగెలఁకులఁగొలువ
సంతసంబున గ్రంతక్రంతల [183]నిఱికి - యంతంత జనులు ఘేయని జయవెట్ట
గద్యపద్యాద్యనవద్యకావ్యములు - హృద్యంబుగా సత్కవీశ్వరు ల్వొగడఁ
బరిహాసకుఁ [184]ల్సేరఁబాఠకుల్ బట్లు - వరగుణాంకనలుగైవారము ల్సేయ
గాయకు ల్దాళము ల్గదియించి మ్రొక్కఁ - బాయక తాపసప్రభులు దీవింప
వసిగొని వారికి వాంఛితార్థంబు - లొసఁగుచు నంతంత మసలి నిల్చుచును
బదనఖకాంతి భూభామవక్షోజ - పదకరత్నప్రభాప్రఖ్యమై వెలుఁగ
రాజిత[185]భూషణప్రభలు దిగ్గజశి - రోజమౌక్తికములరుచి నుల్లసిల్ల
నతులదివ్యాంగదీధితు లుదయార్కు - నతిశయాత్మజ్యోతిగతిఁ [186]బ్రజ్వరిల్ల
స్థిరదశనద్యుతుల్ శృంగారలక్ష్మి - వరముఖముకుర భాస్వరలీల వెలుఁగ
వరదృఙ్మరీచు లావాల్మీకిదేవు - చరణాబ్జరుచిరవిస్ఫురణఁబొల్పార
మకుటమాణిక్యాంశుమంజరు ల్సురగి - రి కలిత శేఖరాకృతిఁబ్రజ్వరిల్ల
వరవిటాకృతిఁ [187]బొల్చి హరు నిరవద్య - కరుణామృతాటోపకలితవారాశిఁ
దేలుచుఁ బసిఁడి బొందియకోల వట్టి - క్రాలుచుఁ గేరుచు సోలుచుఁగతులు
తడఁబడఁ ద్రొక్కుచు దండయిచ్చుచును - బడసిచూచుచు బయ [188]ల్వొడిచియాడుచును
సంగడికాండ్రను జప్పరించుచును - నంగ మెక్కంగ దిగంగఁజూచుచును
బొలఁతిభావము దలపోయుచు నాత్మ - విజయంబు మెఱయుచు విఱ్ఱవీఁగుచును
నెక్కుడువిటచేష్ట లేపార నెదిరి - లెక్క సేయక సుఖలీల నందంపు
సంబవు లిడుకొని సరసర నొడయ - నంబి సద్భక్తగణవ్రాతమునకు
మ్రొక్కక కరములు మోడ్ప కందంద - చిక్కక స్రుక్కక చక్కన వచ్చి
గుడిసొచ్చి తననిత్యపడి వేఁడికొనఁగ - మిడమిడిమిడుకుచు మిఱుమిండఁడనియె

ఒడయనంబిగర్వమునకు మిఱుమిండఁడు కుపితుఁడై వెలివెట్టుట


నోరి వీఁడెవ్వఁడు రా? రాజమౌళి - ధీరదిగ్గజములఁజీరికిఁగొనక
క్రొవ్వె! మా భక్తులకొలఁదెఱుంగండు - నవ్వాలుమీకేశుఁడడ్డమే తనకు
ఫాలాక్షుఁడలిగిన భక్తులు గావఁ - జాలుదు రట్టిద పోలగుఁగాక!

అతుల మహోద్ధతాయత మహాభక్త - తతి యల్గెనేఁగావఁదరమె యీశునకు?
కడుఁగడు గర్వియై కానఁడాతనిని - గుడివెడలింపుఁడు గూడదు చూడ”
ననవుడు విన్నవారాశ్చర్యమందఁ - జనుదెంచి యొక్క వూజారి గేల్మొగిచి
“దేవ! మున్నెఱుఁగవే? యీ వాలుమీక - దేవదేవుఁడ లసత్ప్రీతిదుల్కాడ
నచ్చెరువంద నీ యయ్యపాటలకు - మెచ్చియో భక్తికి మెచ్చియో యెఱుఁగఁ
బడి నిత్యవేమాడ లెడపక యిచ్చు - నడిగిన వెండియుఁగడపఁడేమియును
గొడుకని మన్నించుఁ గడుముద్దు సేయు - నెడవోవు లంజియయింటికిఁ దాన
యనురాగహేతు సర్వార్థసంపదలఁ - దనిపి నంబికి విటత్వంబు సెల్లించు
నిల విదూషకుభాతి నిరువురవలపు - లలర నన్యోన్యగుణాంకన ల్సేయుఁ
గ మర్ధిఁ దాన నాగరకునట్లతని - సరసోచితాలాప సంపదఁదనుపు
ధరఁదాన పీఠమర్దకులీల నెల్ల - పరిచర్యలును బడిపనులును జేయు
నన్నియు నననేల నమ్ముడువోయి - యున్నాఁడు శివుఁడు నం బెన్నకు” ననిన
“నీతఁడా నంబి? ము న్నితనికా శివుఁడు - ప్రీతితోఁబడివెట్టుఁ? బెద్దమేలయ్యె
నీతని బగితియు నితనికిఁగూర్చు - నాతనికూరిమిఁజూతఁడి”ట్లనుచు
“నంబియు గింబియు నంబికిఁగూర్చు - సంబుండు గింబుండు సకల భక్తులకు
వెలియుఁజుండో” యని వ్రేయించె ఘంట - నలిరేఁగి మిఱుమిండనల్లనైనారు
అట యున్నవారెల్ల నక్కజంబంద - "నిటయున్కి [189]పాటిగాదింక రం” డనుడు
ముఖమంటపంబున మును గొలువున్న - యఖిలభక్తులయాగ్రహంబు నాలించి
భయభక్తియుక్తియు భక్తైకదేహ - తయు నంబికెఱిఁగింపఁదలఁచి శంకరుఁడు

వాల్మీకేశుఁడు సాకారుఁడై మిఱుమిండనికి వెఱచి యొడయనంబితో చాటుగాఁబాఱిపోవుట


నయ్యా! యనుడు నేమియయ్యా! యనెడుత - దియ్య(?) వాక్యంబు నజ్జియ్య యడంచి
గ్రక్కునఁజేసన్నఁ గదియంగఁబిలిచి - చక్కన సాకారసన్మూర్తిఁదాల్చి
వడవడవడఁకుచు వాల్మీకదేవుఁ - దొడయనంబిని దన పెడకచ్చఁ [190]జక్కఁ
బట్టించుకొనుచు సద్భక్తసమూహి - కట్టెదురఁజనంగ గడుభయమంది
చప్పుడు గాకుండ జలహారి దెసకు - నప్పుడ తొలఁగి యొయ్యన నడ్గులిడుచు

[191]మదుకుచు దీపముల్ మఱుఁగు వెట్టుచును - నొదుఁగుచు మూలల కోసరించుచును
గాలిసన్నడఁపుచుఁగరముల గోడ - ఱాలూఁదికొనుచును ల్వాలించుకొన్చు
లాలిత నవపుష్పమాలావిలంబి - కీలనపంక్తుల క్రేవలఁదారి
[192]తలఁకున డెందంబు తటతట [193]నుదర - [194]నలఁగుచు గర్భగృహాంతంబు వెడలి
మెల్లనమెల్లన మెట్టుచుఁ దొలఁగి - యల్లనల్లనఁదల్పులండకుఁ జేరి
సంగతి జాలక సమతులఁదొంగి - తొంగిచూచుచు నెడఁదొలఁగి నిల్చుచును
బోవకుండఁగ నోడి పోవంగనోడి - యావాలుమీకేశుఁడాత్మగలంగ
సందులు వ్రిదుల సంచలనంబు వొడల - సందడిదొఱఁగి పూజారుల మొఱఁగి
ఘనభక్త నిచయంబుఁగనుఁగొన వెఱచు - చనుగరాగ్రములు దృష్టులకడ్డమిడుచు
స్రుక్కుచు సరగున సొకనాసి వెడలి - చక్కనగుడి వెన్కదిక్కున కరిగి
యెగురుదురో(?) యని వగవంగ వెనుక - [195]మగిడి యాలించుచు బెగడుచుఁజనుచుఁ
జొక్కాకుగాలికి స్రుక్కుచునిక్కి - నిక్కిచూచుచు నలుదిక్కులరయుచుఁ
[196]జెంగి చెంగి చనుచుఁబొంగఱి వంగి - వంగిపాఱుచుఁ దొంగితొంగి తాఱుచును
నటమున్న కలుకోట యందొక్కఱాయి - స్ఫుటపదాంగుళమున భువిఁబడనూఁకి
కడుభయంబున గండికను దూఱివెడలి - వడిగొని కుఱుజంగ నిడుజంగ [197]గునుకు
పరువు బాటయఁబెట్టి పఱవ ముందటను - ధరనొప్పి క్రోశ మాత్రంబున నొక్క
వరవిచిత్రోద్యానవన మున్నఁజూచి - యరుగక దిగ్భ్రమితాత్ముఁడై నిలిచి
“యూరోయిది యటంచు నూరుగా దురుత - రారణ్యమో యూరు నడవియుఁగాదు
హృద్యశాఖాతతి నిత్తరులొప్పు - నుద్యానవనముగా నోపు నీ వనము
గానిమ్మిదియు నూరుగాకున్నఁజాలుఁ - గాని ఘోరాటవియైన నుద్యాన
వనమైన ననుచు నల్లన వనాంతరము - చనఁజొచ్చి తొంటి తెర్వునకుఁ దొలంగి
మూఁక చింతలవడి మోకమామిళ్ల - వాఁక నొప్పెడు సరోవరము నీక్షించి
పారిజాత వకుళ బంధూక కర్ణి - కార క్రముక కోవిదారముల్గడచి
చందన ఘనసార చంపకాశోక - మందార తరువుల కందువదాఁటి
యిమ్ముల మాదిఫలమ్ముల కురవ - కమ్ముల నారికేళమ్ముల క్రేవ
మాగధీ కరవీర మాలతీ కుంద - నాగకేసర వికీర్ణస్థలి నడుమ

మల్లికా విద్రుమ మాధవీ ద్రాక్ష - వల్లరీవేల్లన సల్లీలఁదనరి
లలితతదీయ కిసలయ ప్రసూన - ఫలమంజరుల ప్రభఁబ్రజ్వరిల్లుచును
బంబి పున్నాగరంభాపరివేష్టి - తంబగు సంతానధరణీరుహంబు
పొడఁగని ముందట [198]గుడియకాఁదలఁచి - యడుగెత్త కతిసంశయాత్ముఁడై చూచి
యీ వనమధ్యమందిది యొక్కగుడియొ? - కావింపఁబడియున్న ఘనకల్పతరువొ?
ఈతరుశాఖల హేమకుంభములొ? భాతి విద్రుమలతాప్రసవ మంజరులొ?
ఈ మంజరులలోన నిదిరత్నపంక్తి - యో మల్లికాతతియో! పుష్పతతియొ?
ఈ పుష్పపంక్తి మాకెనయుఁగాదనుచు - నేపారి యిట్లున్న యెలమి వేష్టించి
మ్రాకుగట్టినయట్టి మానంపుగుడియొ? - ప్రాకటపుష్ప విస్ఫార గుల్మములొ?
ఈ గుల్మమధ్య మహీజరాజునకు - బాగొందఁజల్లని పవనంబు నొసఁగఁ
జాలుపచ్చని పట్టునాలవట్టములొ? - క్రాలుచునున్నట్టి కదళీదళములొ?
ఈ కదళీదళానీకంబు సుట్టి - ప్రాకారములలీలఁబ్రజ్వరిల్లెడిని
వినుతికెక్కన కల్పవృక్షంబ యిదియు - ననుమాన మొక్కింతయును [199]వలదనుచు
శీతలంబై కడుఁజెన్నొందుచున్న - యాతరుచ్ఛాయ కట్లల్లన యేఁగి
భువి ని[200]పతితపుష్పములు గద్దెగాఁగ - శివుఁడు సుఖాసనాసీనుఁడై యంత
నెగయు నిట్టూర్పులు నిగుడఁగ ఱొమ్ము - నిగుడించుకొని నంబిమొగముఁజూచుచును
సంగతానన ఘర్మజలములు గరత - లాంగుళంబులఁబుచ్చి యవలవైచుచును
నలిఁగదళీదళచలన సంకలిత - మలయానిలమునకు మనసువెట్టుచును
నానావిధానేక నవపుష్పపరిమ - ళానూనవాసన కాత్మఁ [201]జొక్కుచును
ఘనసారచందనక్ష్మాజ సౌరభము - తనువు(పు?) సంగతికిడెందంబు నొగ్గుచును
బరిమళాహృత భృంగపక్షోపనిహతిఁ - దొరుగు పుప్పొడికిని శిరము సాఁపుచును
హిమకరశేఖరుఁడమృతాంగుఁడిట్లు - గమనోపతాపోపశమము వహింప
నొయ్యనొయ్యన నంబి కున్మదం బడఁగ - నయ్యెడ భక్తి భయం బాత్మఁదొడఁగ
“నయ్యా! ఇదేమయ్య! జియ్య! నీయట్టి - యయ్యకు నిట్టి భయం బాత్మఁదోఁచు
టింతవట్రిల్లు టిదే[202]మొకో?” యనిన - నంత వాల్మీకేశుఁడతని కిట్లనియె

వాల్మీకేశుఁడు శివభక్తుల మహిమ నొడయనంబికిఁ జెప్పుట


“నవికలవేద వేదాంతపురాణ - వివిధ శాస్త్రార్థ సంవిత్ప్రమాణముల
మాకును మద్భక్తమండలికిని వి - వేకింపఁగా నెద్ది వేఱుభేదంబు?

భక్తులకేన చూ ప్రాణంబు నాకు - భక్తుల దేహంబు పరమార్థ మిదియు
మద్భక్తసేవయ మత్పాదసేవ - మద్భక్తదేహంబు మాదుదేహంబు
మద్భక్తవినుతియ మద్గుణవినుతి - మద్భక్తనిందయే మత్తత్త్వనింద
సన్నుతలీల మా జంగమావలిని - మన్నింపకున్నను మతి నిష్ఫలంబు
శంభు పూజనముదా “[203]స్థావరేనిష్ఫ - లం భవే” త్తని శ్రుతు ల్చాటెడిఁ [204]గాదె!
భక్తైకదేహుండ భక్తవత్సలుఁడ - భక్తసత్ప్రాణుండ భక్తాశ్రితుండ
భక్తపరాధీనయుక్తుండ నటు - భక్తికేఁగూర్చుట ప్రఖ్యాతి గాదె

బాణుని కథ


ఎట్టన్న! వీరమాహేశ్వరభక్తి - నెట్టణ గలుగు వినిశ్చలాత్మకుఁడు
బాణుండు నాఁగ సద్భక్తి క్రియాధు - రీణుండు లింగమూర్తికి సాంగముగను
వేయుమాఱులు నిత్యవిధి నేమముగను - బాయక పూజలుసేయుచునుండ
దేహధర్మములకుఁదెఱపి లేకున్న - బాహుసహస్రంబు బాణున కిచ్చి
యది యొక్కమాఱు వేయవసరంబులను - సదమలభక్తిమైఁజలుపఁజేసినను
బాణునకును మెచ్చి బాహుసహస్ర - మేణాంకధరుఁడిప్పుడిచ్చెఁదా” ననుచు
సందర్శనాసక్తిఁజనుదెంచుభక్త - సందోహశివకథాసంగతినుండ
“నటమున్న చేయులింగార్చనలకును - నిట యెడలేకున్న [205]నెట్లోకో” యనుచు
సడిసను లింగావసరములు సేసి - తొడఁగి ప్రసాదంబుఁగుడుచునంతకును
వారించి చొరనీక వాఁకిట నిలిచి - యేరికైనను [206]నేన యిల గోష్ఠి యిచ్చి
వాకిటి కాపులవాఁడనై యతని - వాకిలి గావనే లోక మెఱుంగ

పిట్టవ్వ కథ


వెండియు నమ్ముదిగొండ యన్పురిని - దండియై కరికాలమండలేశ్వరుఁడు
కావేరి గట్టింపఁగడఁగి యిల్లాది - వోవ 'నీకై యేను వోయెద' నంచుఁ
బిట్టవ్వ భక్తికిఁబ్రియపడి కాదె - వెట్టికిఁజనుటెల్ల విను మట్లుఁగాక

కలికామదేవుని కథ


నిత్యార్థమగు స్వామిభృత్యసంబంధ - కృత్యసద్భావనక్రియ దులుకాడ
నక్కటా! స్వామిదివ్యాంఘ్రికంజంబు - లొక్కింతయును గందునో యనకిట్లు

పంబిన మర్మమేలంబున నొడయ - నంబి యన్వాఁడు భయం బింత లేక
వెడపను ల్వంపఁగ వేశ్యయింటికిని - నెడయును బుచ్చంగ నిట్లెఱింగియును
వారక యత్తిరువాలూర భక్తు - లూరక చూచుచు నున్నారు గాని
తారొండె శివుఁబంపఁదగ దన్నవారు - గారొండె నంబికి వేఱొక్క (?) భృత్యుఁ
బనిపాటు సేయ నేర్పడ నియమింప - రననేల వేయును” ననుచు నుగ్రమునఁ
గలికామదేవుఁడన్గణము నీ యూరు దలఁచిన నీ వార్త దడవిన యపుడ
యెట్టిబల్లిదునైనఁబట్టి భంజింప - నట్టిచో నే నేఁగి య ట్లొడఁబఱచి
చక్కన నాతని సముఖంబునందు - నొక్కటిసేయనే యొం డిఁకనేల?
చేయొగ్గి మీ తాతచేత మా తాత - యాయతిచూపి ప్రాఁతప్పు గొన్నాఁడె
అడిగినప్పుడు నీకు నర్థమిచ్చుటయు - బడిపను లేమేనిఁ బాఱి సేయుటయు?
మిక్కిలి భక్తినిమిత్తంబు గాదె - యెక్కుడుగాఁగ నీ కేఁగూర్చుటెల్లఁ?
గావున మా భక్తగణములనడుమ - నీ వహంకారించి నిలువ నెవ్వఁడవు?
భ్రాంతి “సంసర్గజాః పాపగుణా భ - వంతి” యన్చదువు దా వసుధ నాకయ్యె
నీ కారణంబునఁగాక భక్తులకు - మాకును నొల్లమి మనసునఁగలదె?”
అని యిట్లు పెక్కు దృష్టాంతరంబులను - మనసిజహరుఁడు నంబనకుఁ దెల్లముగ
భక్తుల మహిమయు భక్తుల ఘనత - భక్తుల నడవళ్లుఁ బాటించి తెలిపి
నయమును నధికవినయమును భక్తి - భయమును దత్త్వనిర్ణయము సంధించి
ప్రథితజంగమమహాభక్తస్థలంబు - పథముఁజూపుడుఁజాఁగఁబడి మ్రొక్కి నంబి
"సద్గురుమూర్తి! జగద్గీతకీర్తి! - హృద్గతంబైయున్న మద్గర్వమడఁచి
సద్గతిఁజూపి నీ జంగమభక్తి - తద్గతుఁజేసితి ధన్యుండ నైతి
నరిగి దైన్యముఁజూపి యభయంబు వేఁడి - శరణని ప్రార్థించి సంస్తుతుల్ సేసి
యడుగులఁబడి బంటనై యాడిపాడి - పడయుదు నెట్లైన భక్తులకరుణఁ
జూడుమా! యింక నీ సుతుభక్తి” యనుచు - నాడాడ భక్తాళి కభిముఖుండగుచు
నందంద బారెంట నంత మూరెంట - నందుండి ధరణి సాష్టాంగంబు లిడుచు
దాళముల్ గ్రంగన ధ్వనియించి మ్రొక్కి - వేళానుకూలవిలోలరాగములఁ
బరగు మహాభక్తచరితలు నాద - భరితమై చనఁదిరుపాటలు సేసి
పాడుచు నొక్కొక్క భక్తునిచరిత - వేడుకఁబొగడు నవ్విధ మెట్టులనిన

ఎణుమూర్తి నైనారు కథ

లీలమైఁదన ప్రాణలింగంబునకుఁద్రి - కాలంబునందును మేలిచందనము
ననురక్తి నియతిగా నర్పింపుచుండ - ధనమెల్లఁజందనంబునకు సమయుడుఁ
గడులేమి వుట్టిన గంధ మెబ్బంగి - గడియింపఁజాల కయ్యెడ నిర్ణయించి
[207]తలఁపఁగ నేల దాఁగలిమియు భక్తి - కలిమిగా కర్థంబు కలిమియే కలిమి
నా మనంబునఁదెంపు లేమియే భక్తి - లేమిగా కర్థంబు లేమియే లేమి
తనువుండ మనసుండఁదల్లడం బంద - నను మెచ్చునే ప్రాణనాథుఁడీశుండు
తనువెల్లఁగూడ గంధముగాఁగఁదిగిచి - యనుష(ర)క్తి నిత్యంబు నర్పింతు నింక
నెత్తురు వెడలిన నిగ్గు దేరినను - నిత్తఱిఁదనుగుణం బింతసూపినను
మెఱుఁగు లేవడియైన మించు సడలిన - నెఱిఁజందనమునకుఁగొఱఁత దోఁచినను
జాయ దప్పిన నెఱి సామాన్యమైనఁ - బూయుచో [208]నురలినఁబొలుపు [209]గందినను
గంపొండు వలచినఁగడలు గట్టినను - గెంపు దక్కువయైనఁగ్రియ వెల్తియైనఁ
దనుపు లేకున్నఁ బూఁతకు రాకయున్న - నునుపు గాకున్న వాసనకుఁదేకున్న
మఱి కదా శివునకు మాకు నంకంబు - అఱిముఱితనమిప్పుడదియే!” యనుచు
ముదమున వలపలిమోఁచేయి సానఁ - గదియించి తిగిచి శ్రీగంధంబు వడసి
శివున కర్పించి భజించి మెప్పించి - భువి నరుల్ సూడఁజూడ విమానమెక్కి
మృడుపురంబునకు నప్పుడు బొందితోడ - నడచిన యెణుమూర్తినయనారిబంట

కడమలనంబి కథ


ప్రాణలింగమునకుఁబ్రతిదినంబునను - జాణత వెలయ నిజవ్రతంబుగను
గడు నర్థితోడ నఖండదీపంబు - లెడపక నిత్య వేయేసి ముట్టింప
నదియ నిమిత్తమై యర్థంబు సమయ - మదిలోన నొక్కనుమానంబు లేక
“తనువు దక్కంగ నర్థంబెల్ల సమసెఁ - దనువు నివేదించు తఱి యయ్యె నింకఁ
దలయును మేనును దరికొల్పి పెద్ద - వెలుఁగు వెట్టెద” నంచు వెండ్రుకల్ విచ్చి
జ్వలనంబునకుఁబట్టి శంభు మెప్పించి - వెలసిన యాకడమలనంబిబంట

గుగ్గులుకళయారు కథ


ఆసక్తిమై మహిసాక్షి ధూపంబు - బాసగా వెండియుఁబ్రాణేశ్వరునకు
నేఁడునాఁడనకుండ నిత్యనేమముగ - మూఁడుసంధ్యల ధూపముగ సమర్పింప

నాలిమంగళసూత్ర మది యాదిగాఁగ - లీల నర్ధంబు సెల్లించునత్తఱిని
[210]దిరుపరంధామమం దురగేశ్వరేశుఁ - డురగకన్యక లతిస్ఫురణమైఁబాడ
సోలి ముందటి కింత వ్రాలుడు ధరణి - పాలుఁడు మును పెక్కుపాయంబులందుఁ
జక్కొల్పఁ జాలక సంచలింపంగ - నక్కడి కేఁగి యత్యర్థిఁదుల్కాడ
“వలసినయంత గుగ్గిలము నాకిండు - నిలిపెదఁ జక్కఁగా నిటలాక్షు” ననుడు
మహినొక్కవ్రోఁకగా మహిసాక్షివోసి - మహిపతి యొప్పించి మహిఁజాఁగిమ్రొక్కి
యలరుచుఁగైకొని యఖిలంబునెఱుఁగ - బలువుగానొకపటు(ట?) వలి[211]చించియొక్క
దిక్కీశుతోడ సంధించి వేఱొక్క - దిక్కు శస్త్రంబుతోఁ దిగిచి బంధించి
గ్రక్కున శస్త్రంబుఁ గంఠంబునందు - నెక్కొల్పి వెనుకకు [212]నిగుడంగఁదడవ
యెప్పటియట్ల నాగేశుండు నిలిచి - యప్పుడు ప్రత్యక్షమై కరుణింప
నలి దీటుకొన నపునర్భవలీల - వెలసిన గుగ్గులుకళియారిబంట

అరివాళు నయనారి కథ


లీల వెండియుఁదన లింగంబునకుఁద్రి - కాలంబు నియమంబుగా రాజనంబు
ప్రాలోగిరము సమర్పణసేసి తాను - నాలింగ[213]లీనమై యట్లువర్తింపఁ
దమ మొల్లమంతయుఁ దత్కారణమున - సమయుడు నొండుపాయము లేమిఁజేసి
కొడవలి గడియించికొనుచుఁగైకూలి - వడి రాజసములకు నొడఁబాటు చేసి
పట్టిననియమంబు [214]వ్రతి వాల్చుచుండ - నట్టిచోఁగూలియుఁబుట్టకయున్న
[215]నిట్టుపవాస మేన్దినము లుండంగ - నెట్టకేలకు బియ్య మిరుస గల్గినను
సరసరఁగొనివచ్చు సంభ్రమంబునను - ధరఁదాఁకి పడి[216]న నెత్తఁగ రాక ప్రాలు
[217]నెరియలపాలైనఁ"బురహర! నీకుఁ - గరమర్థి నర్పింపఁగా నేఁగుదెంచు
నత్తఱి విచ్ఛిన్నమయ్యె నేనింకఁ - జత్తునకా” కంచుసంశయం బుడిగి
పెడకచ్చకొడవలి మెడఁబెట్టి మూఁపు - తడుపంట సంధించి తన్నంగఁదడవ
పరమేశ్వరుం డట్టి బాసకు మెచ్చి - ధరణిఁ బ్రసన్నుఁడై కరుణఁజూచుడును
బరమపునర్భవప్రాప్తుఁడై యున్న - యరివాళు నయనారి కనుఁగు భృత్యుండ

అడిభర్తుని కథ


మఱియును నప్పాండ్యమండలంబునను - మఱియొండు గాయకం బెఱుఁగమిఁ జేసి

వలయెత్తి నీటిలో [218]వైవంగఁదడవ - వలఁదొల్త వచ్చిన వలుఁదమత్స్యంబు
నదియు 'శివప్రీతి' యనిపోవ విడుచు - నిదియ నేమముగాఁగ నితరమత్స్యముల
నంగడిఁ బోకార్చి యందుల లబ్ధి - జంగమారాధనల్ సలుపుచు లీలఁ
జరియింప దినములు సనఁగ వేఁటయును - బరికింప నేనాళ్లువాఱమి డస్సి
వలఁగొని మఱునాఁడు [219]వైవంగఁదొలుత - వలనుగా నందు సువర్ణమత్స్యంబు
వచ్చిన నదియు 'శివప్రీతి' యనుచు - నచ్చోన పోవిడ్చి యవలవైచుడును
నమ్మీన వచ్చుడు నారేవు విడిచి - యెమ్మెయి వలవైవ నెప్పటి మీన
తగులంగ విడువంగఁదగులంగఁ విడువఁ - బగలెల్ల నమ్మీన పట్టువడంగ
“నాత్మశునకుఁబ్రియంబన్న మత్స్యంబు - నాత్మార్ధమై [220]కొను టనుచితం”బనుచు
నింటికి నేతెంచి యిట రాత్రి వుచ్చి - తొంటి యేటికిఁబోక తూర్పు దీర్ఘికను
వల యెత్తివైచుడుఁదొలినాఁటిమీన - మలరుచు వచ్చుడు నట్ల పోవిడిచి
మఱి వైవ నమ్మీన మసలి వచ్చుడును - జిఱునవ్వు నవ్వుచు "శివునిమత్స్యంబు
నేడ చూచినదాన యీ యేట [221]వైవ - నాడ [222]యీశ్వరు మీన మరుదెంచెనేని
వలఁజేతఁబట్ట నా వ్రత మిదియనుచు - వలయెత్తి యూఁకించి వైచి తివ్చుడును
వలతోన తొడిఁబడి వచ్చి ముక్కన్ను - నలిఁ జతుర్భుజములు నందివాహనము
నమరంగ శివుఁడు ప్రత్యక్షమై నిలిచి - ప్రమథేంద్రపదవి యారంగ నిచ్చుడును
నా నిరంతరపరమానందసుఖము - లానుచునున్నట్టి యడిభర్తబంట

ఏణాధినాథుని కథ


అనయంబు భూతిరుద్రాక్షధారణులఁ - దన ప్రాణలింగభావన విశ్వసించు
నిదియ నేమముగాఁగ నేలాపురమున - సదమలలీల రాజ్యంబుఁజేయుచును
నొడఁబడ గెలిపించె నొడినవీటఁ - బడి భరం బేఁగి కప్పంబులు గొనుచు
నవనీశులకు నెల్ల నక్కుఁగొఱ్ఱగుచు - భువిఁబ్రవర్తింప నబ్భూపతు లొక్క
దళవాయి శాసనధారిఁగావించి - బలసహితంబుగాఁబనుపఁగఁదడవ
తన తంత్రమును దానుఁ జనుదెంచి తాఁకి - యనిసేయు భూతిరుద్రాక్షధారణునియుఁ
గని 'శివ శివ' యంచుఁగరవాలువైచి - చనుదెంచి భువిఁజక్కఁజాఁగిలిమ్రొక్క
'నెటువోదుపొ'మ్మంచు [223]నటయేఁగుదెంచి - స్ఫుటశక్తిఁగరవాలుఁబూఁచి[224]వైచుట

'దాలింగ' మనిమ్రొక్కఁదన కంఠమందు - వాలంబు మున్నువూమాలగాఁజేసి
యక్షరుం డపుడు ప్రత్యక్షమై నిలిచి - యక్షరత్వంబు దయామతి నొసఁగ
క్షోణి లసత్కీర్తిఁగొఱలినయట్టి - యేణాధినాథుని యిలుపుట్టుబంట

చేదివల్లభుని కథ


అట్టు విభూతి రుద్రాక్షధారులను - నెట్టును శివుఁడనియెడిభక్తియుక్తిఁ
జరియించుచుండంగఁబరరాష్ట్రపతులు - దురమునఁదనచేత విరథులై పాఱి
రుద్రభక్తులభాతి రూఢిగాఁబంచ - ముద్రధారులఁబదుమువ్వురఁజేసి
పనుచుడుఁగపటలాంఛనధారు లపుడు - చనుదేరనతిభక్తి వినమితుం డగుచు
దారు[225]ణాంచితనిశాతక్రూరశస్త్ర - ధారల [226]జర్జరితంబు సేయంగఁ
బరికించియు నితరభావంబు లేక - గురురూపకాఁగఁగైకొని మ్రొక్క నపుడ
ప్రత్యక్షమై నిల్చి పార్వతీనాథుఁ - డత్యుత్తమంబు నిత్యత్వంబు నొసఁగ
సల్లలితోన్నతిఁజనిన విముక్తి - వల్లభుఁడగు చేదివల్లభుబంట

కరయూరిచోడని కథ


సంగతంబుగ నట్ల శాసనధరుల - భంగిగాఁదన ప్రాణలింగంబ యనుచుఁ
బరమవిశ్వాస సద్భక్తిభావమునఁ - బరగుచో నన్యభూపతులపై దండు
వుచ్చుడు ముప్పదివొణకల తలలు - నచ్చెరువుగఁగొట్టి తెచ్చుచో నందు
నెత్తుట నొకదల జొత్తిల్లి బిగిసి - యత్తఱి జడతల యనుపోల్కి నున్నఁ
గనుఁగొని 'హరహరా!' యని తత్ క్షణంబ - తనతలఁదఱిగి యత్తలమీఁదఁబెట్ట
నంతటిలోనఁబ్రత్యక్షమై నిల్చి - కంతుసంహరుఁడు మోక్షము గరుణింప
మును జడతల కిచ్చె ముడితల యనఁగఁ - జను కరయూరిచోడని బంటుబంట

కళియంబనైనారు కథ


పనిసేయ నోపక బానిసకొడుకు - చని లింగధారియై చనుదేరఁదడవ
బానిసకొడు కనుభావంబు లేక - తా నీశుఁడనుచుఁబాదంబులు గడుగ
“మన సిరియక [227]కొడ్కుమల్లండు వీనిఁ - గనుఁగొనవే కాళ్లు గడిగెద!” వనుచుఁ
జులుకఁగాఁ బూర్వంబుఁ దలఁచి పల్కుచును - బొలఁతి జలంబులు వోయకున్నంత
“నాలినేసితి గదా హరమూర్తి” ననుచు - నాలి చేతులు రెండు నప్పుడ నఱకి
మలహరుకారుణ్యనిలయుఁడైనట్టి - కళియంబనైనారిగాదిలిబంట

ఇరువదాండారి కథ

జంగమలింగభాస్వద్భక్తి యుక్తి - సంగతిదినములు [228]జరపుచునుండ
నంతకాంతకుఁడు భక్తాకృతి వచ్చి - బొంతయుఁగచ్చడంబును దాఁప నిచ్చి
యంత నప్పుడ యదృశ్యము సేసి పిదప - బొంతయుఁగచ్చడంబును వేఁడఁదడవ
చెచ్చెరఁదనదాఁచి నచ్చోట వెదకి - యెచ్చోటఁగానక "యెత్తున కెత్తు
ననఘ! మీ కిచ్చెద" నని తులాయష్టిఁ - దనర [229]వేఱొకబొంతయును గచ్చడంబు
నొక్కదిక్కునఁబెట్టి యున్న దిక్కునను - బెక్కువస్త్రంబులు నెక్కొల్పి తూఁప
సమము గాకుండినఁదమయింటఁగలుగు - నమితాంబరంబులు నర్ధంబుఁదాను
వచ్చి యత్తుల యెక్క వరదుఁడక్షణమ - మెచ్చి యా ప్రమథత్వ మిచ్చుడు ధరణిఁ
బాండురాంగునిభక్తిఁబరగిన యిర్వ - దాండారి కనుగులంబైన భృత్యుండ

దంగుళి మారయ్య కథ


జంగమార్థంబకా సకలార్థములును - భంగిగాఁజలుపుచుఁ [230]బరగుదుర్దశను
నడవంగ శివుఁడొకనాఁడు వర్షమునఁ - దడియుచు నర్ధరాత్రం బేఁగుదేర
'వరతపోధనమూర్తి వడఁకెడు' ననుచు - వరుసతోఁదనపాక వ్రచ్చి కాల్పంగ
'నాఁకొంటి' ననవుడు నట తొలునాఁడు - వీఁకతో నలికినవిత్తులు నీళ్ల
[231]విదళించికొని తెచ్చి వేఁపి దంపించి - సుదతియుఁదాను నుత్సుకలీలతోడఁ
బాకయత్నము సేసి భక్తి వడ్డించి - శ్రీకంఠు నపుడ మెచ్చించి విముక్తి
సంగతి సుఖలీలఁజనినట్టి యెళయ - దంగుళిమారయ్య [232]లెంగిలిబంట

గణపాలుని కథ


భవి నొక్కరునిఁదన భువి నుండనీక - శివసహితులఁజేయుఁజేకొనకున్న
వేదార్థములు దెల్ఫి యాదిఁజూపియును - గాదన్న దృష్టసంపాదనఁజూపి
యడిగిన [233]నెంతర్థమైనను నిచ్చి - యెడఁబఱుపంగ సర్వోపాయములను
గఱకంఠుభక్తుండు గానొల్లకున్న - మఱి చంపునదియె నేమముగ వర్తింపఁ
బరమేశ్వరుఁడు దన బాసలోఁతరయ - నరుదెంచి [234]వెలమఁడై"యరి యప్పనంబు
[235]గానుక గట్నంబుఁగడఁగి సుంకంబు - పూనిక వెట్టియుఁబొరి [236]నెన్నుఁబన్ను
[237]నరువ నేమియుఁదన్ను నల [238]జడి వెట్ట - ధరణీశ తగ” దంచుఁదా మొఱలిడఁగ

“వాకిటికాఁపులవారల మొఱఁగి - యోకాఁప! నీ వెట్లొకో వచ్చి తిపుడు
సర్వమాన్యము నీకు గుర్వుగా నిత్తు - శర్వుభక్తుండవై చరియింపు” మనుడుఁ
“దనకు [239]నొమ్మదుభక్తి తన వంశమందు - మునుభక్తు [240]లెవ్వరుమనరిట్టు” లనుడు
“మనుపఁగ మాపూఁట మఱియట్లుఁగాక - ధన మిత్తు మన మిత్తుఁదన రాజ్యమిత్తు
నొడఁబడు” మనుడు సర్వోపాయములను - నొడఁబడకున్న మహోగ్రతతోడ
జళిపించి యసమనిశాతఖడ్గమునఁ - దల ద్రెవ్వ వ్రేయుచోఁదత్‌క్షణమాత్ర
హరుఁడు ప్రత్యక్షమై 'యడుగడ్గు' మన్న - "వరమూర్తి! నీ యిచ్చువరము లేనొల్ల
నంగద భక్తుండవగు” మంచు శివుని - లింగసహితుఁజేసి లీలమైఁబ్రమథ
గణవంద్యు సద్భక్తిగతిఁజూపి ప్రమథ - గణమూర్తియై యున్న గణపాలుబంట.

కుమ్మర గుండయ్యగారి కథ


పరగిన [241]యప్పెనుపట్టపులూరఁ - దిరునీలకంఠ దేవరగుడి కేఁగి
యొక్కనాఁడేతెంచుచున్నెడ రాత్రి - గ్రక్కునఁ జీకటిఁ గానంగలేక
వెలఁది యొక్కతె హర్మ్యతలమున నుండి - యిల నెత్తి చల్లుచో నెంగిలినీరు
పైనిండ "హరహరా! ప్రాణేశ" యనుడు - మానిని యేతెంచి మహిఁజాఁగి మ్రొక్కి
యట తోడుకొనిపోయి యభ్యంజనాది - పటుతర సత్క్రియా పరిపూర్ణుఁజేసి
క్షమఁగొని యనుచుడుఁజనుదేరఁ[242] దడవ - రమణి "వారాంగనార్థము సిక్కి” తనుచుఁ
గట్టుగ్రమునఁబతిఁగవయకున్నెడను - "అట్టేల డాయ ర” మ్మని కొంగువట్టి
తరళాక్షిఁదిగిచిన “దన్ను ముట్టినను - దిరునీలకంఠ దేవరయాన” యనుడు
నాసతి నంటక యట్లకాకనుచు - బాసతోడన యెను(c?) బదియేండ్లు సలుప
నప్పరముఁడు భక్తుఁడై వచ్చి యొక్క - గప్పెర నేనిచ్చి క్రమ్మఱవచ్చి
యట్ల కప్పెర యదృశ్యము సేసి యడుగ - నెట్లును గానక యింతియుఁబతియు
వడవడ వడఁకుడు వరతపోమూర్తి - "వెడమాటలను బోను వేయేల నమ్మఁ
గప్పెర[243]గొనకున్న గాంతయుఁబతియుఁ - జెప్పిన శపథంబు సేయుఁడు వచ్చి(డటంచు?)
కుంభిని జనులెల్లఁగూడి చూడంగ - గంభీరజలములఁగామినిఁబతిని
దండి గుండముముంపఁ దత్‌క్షణమాత్ర - మిండప్రాయంబులై మీఁదికి నెగయ
నటమున్న ప్రత్యక్షమై ధరనిల్చి - నిటలాక్షుఁడతిదయాన్వీతభావమున
నెప్పటట్టుల భువి నెను(c?)బదియేండ్లు - నొప్పార సుఖలీల నునుప మీఁదటను
మండితానంద ప్రమథ వైభవమున - నిండారు కుమ్మరగుండయ్యబంట.

పూసల నయనారు కథ

రూఢిగా విక్రమచోడఁడు ధరణిఁ - గూడఁగఁబసిఁడిని గుడి నియోగించి
లింగప్రతిష్ఠ సల్లీలఁజేయంగ - మంగళంబలరార మానసంబునను
దానును రత్నవిమానమయంబు - గా నొక్క గుడిగట్టి కాలకంధరుని
నాసక్తి మెప్పించి యరిగినయట్టి - పూసలనయనారి దాసానుదాసి

మఱికొందఱ కథలు


ధర రాజ్యమొల్లక తిరుముడి దాల్చి - పరము నమ్మిన తిరుపాలుని బంటఁ
దిరునావకపురీశుకరుణఁబ్రాణేశు - నిరవెర్గి కొల్చినతిరు[244]కుర్విబంట
ధర రోహిణియుఁదాను హరుకృపఁజనిన - తిరుపూరి [245]తిరుమూలదేవునిబంట
ననయంబు భక్తసహస్రార్చలందుఁ - జెనసి ముక్తికిఁజను [246]చిఱుపులిబంటఁ
బడినిత్య మొకమాడ భర్గుచేఁ గొనుచు - నడరుచిఱుత్తొ(త్తు)ణయని బంటుబంటఁ
జన్న పురాతనశరణులబంట - నున్ననూతన భక్తయూథంబుబంట
నిటమీఁద శివుఁగొల్చి యీప్సితార్థములు - పటుతరంబుగఁగాంచు భక్తులబంట
ననుచు భక్తులచరిత్రాంకన లిట్టు - లనురక్తిఁదిరుపాట లమరఁబాడుచును
వింతవేడుక వుట్ట వినుతి సేయుచును - నంతంతఁజాఁగి సాష్టాంగంబు లిడుచు
మ్రొక్కుచుఁగరములు మోడ్చుచు“మీరె - దిక్కునుదెసయును దేవ!” మాకనుచు
[247]మీబంట మీ దూత మీ డింగరీఁడ - మీ బిడ్డ మీ పన్న మీ లెంకవాఁడ
మీ దత్తి [248]మీ ప్రాఁత మీ ధర్మకవిలె - మీ దాసి ననుఁగావరే దయతోడ”
ననుచు నంబన్న భక్తావలిఁజేర – వెనుక నంతంత నవ్విభుఁడేఁగుదేర
నభయార్థి యగునంబి నట్ల కైకొనుచు - నభవున కెదురేఁగి యందఱు మ్రొక్క
మిఱుమిండనయనారు మెఱవణి మెచ్చి - కఱకంఠుఁడాభక్తగణసహితంబు
కైలాసవాసులఁగాఁజేసె; నంబి - భూలోకమునను సల్లీలతో నునిచెఁ
గావున భక్తుఁడు గర్వింప భక్తి - భావన కెక్కునే బసవకుమార!
అని యిట్లు మాచయ్య యతిభక్తియుక్తిఁ - జనిన సద్భక్తుల చరితము ల్దెలిపి
బుద్ధులు నీతులుఁబోలంగఁ జెప్పి - పెద్దెన గర్వంబుపెల్లు మాయించి
మెఱుఁగులఁగన్నులు మిఱుమిట్లువోవ - వఱలెడు రత్నపర్వతము లత్యర్థి

నా జంగమంబున కర్పించి బసవ - రాజు వీడ్కొలుప నిరంతరభక్తి
నబ్బసవండు పాదాక్రాంతుఁ డగుచు - నుబ్బుచు భక్తాలియును దాను నరిగె
నప్పౌరు లెల్ల సాష్టాంగులై మ్రొక్కి - "తప్పదు దేవర దా నీతఁ”డనుచుఁ
గరములు నిజమస్తకంబులఁదాల్చి - యరిగిరి ధారుణీశ్వరుఁడును దారు
మహిఁదొంటియట్టుల మాచయ్యభక్తి - మహిమమైఁద్రిభువనమాన్యుఁడై యుండె
మడివాలు మాచయ్య మహనీయచరిత - మడరంగఁజదివిన నర్థిమై విన్న
హరుభక్తి బుద్ధి దృష్టాదృష్టసిద్ధి - సరసవచశ్శుద్ధి సంపద లొందు
గురుభక్తివిస్తార! గురుభక్తిసార! - గురుభక్తిపరతంత్ర! గురుభక్తితంత్ర!
జంగమసుఖకృత్య! జంగమభృత్య! - జంగమహితచర్య! జంగమధుర్య!
లింగార్చనాసక్త! లింగసద్భక్త! - లింగలీన! ప్రాణలింగధురీణ!
సత్ప్రసాదాపాంగ! సత్ప్రసాదాంగ - సత్ప్రసాదపరీక్ష! సత్ప్రసాదాక్ష
సర్వస్థలైకభాస్వద్భక్తిసౌఖ్య! - సర్వస్థలైకభాస్వర సంగనాఖ్య!
ఇదియసంఖ్యాత మాహేశ్వరదివ్య - పదపద్మసౌరభభ్రమరాయమాణ
జంగమలింగ ప్రసాదాపభోగ - సంగత సుఖసుధాశరధినిమగ్న
సుకృతాత్మ పాలకురికి సోమనాథ - సుకవిప్రణీతమై కవిత్వస్ఫూర్తిఁబేర్చి
చను బసవపురాణ మను కథయందు - ననుపమంబుగఁజతుర్థాశ్వాస మయ్యె.

  1. నిష్ఠుండు
  2. ప్రతి
  3. దురితషడ్వర్గ సంహరపరాపరుఁడుఁ
  4. దెసలకు
  5. వరవు, పెక్కు ప్రతులలో 'వరువు' కలదు.
  6. గడియలు
  7. మడుపు
  8. గట్టించి
  9. నిచ్చుచుమ్రొక్కి
  10. చోద్యముగాన మెన్నఁడు ననుచు
  11. ముట్టి
  12. యను
  13. కినుకమైఁ
  14. నెదుటను
  15. యార్చినఁ జూచి
  16. మవనీశ్వరుండ!
  17. మున నిట్లనియె
  18. లోకుల
  19. నింతేసి స్ర(న)డ్డలే, జనులఁ
  20. మెన్నఁడును
  21. గ్రక్కెనే
  22. లేకుల
  23. నాదు బిందువుఁగా
  24. నాఁటి
  25. ననలికూ
  26. వరాటనము
  27. ఈ ద్విపద కొన్ని మాతృకలయందు మాత్రముగలదు.
  28. బోదేర్చు
  29. వారడ్గఁదడవ
  30. తొలఁగకాతనిఁ దొలతొల
  31. యెదుర... యార్చినఁజూచి-క
  32. నందు సంధించి
  33. దిమరుచు
  34. యెదిరి
  35. యార్చిమైవెంచి
  36. విఱిచినట్లె మ్ములువిఱుచు
  37. నన్నట్లుగాఁ
  38. యేతెంచి
  39. మున్నఱువత్తాడి
  40. ద్రిక్క
  41. ఱేకులుబలుగాలి నెడలి - చిరిఁగియున్నట్టియా
  42. మదుగుల
  43. నొదవుల
  44. తూలించి
  45. కేతెంచిన
  46. గట్టుగ్రమగుచు
  47. బిదియేమి
  48. దున్న
  49. గరి
  50. పిఱిఁదికి నూఁకి పైకెఱఁగి మా వంతు
  51. కొఱిగిన, కొఱుగనమ్మా
  52. పట్టభద్రుని
  53. జంగమ
  54. కిచ్చు, నట్టి
  55. యనియడువ
  56. నెట్టాడి, నెట్టొడిసి(?)
  57. నీ
  58. బిట్లింత
  59. వెఱచుచు
  60. యమ్మహా
  61. వెరవిఁడి
  62. పోవుదము
  63. కజ్జంబు
  64. నిర్వది
  65. యెట్లుఁగని యెలుఁగించు
  66. నదెకొ
  67. మౌక్తికమణి
  68. ట్లిఱివిరి
  69. గుడుప(డ్ప?) విలుచు
  70. నరయక
  71. ద్రెంచిన
  72. నిక్క
  73. నేడు
  74. దొలు
  75. పథనుండ
  76. సమర్థుఁ
  77. నుదవగచుచును, నెడ్డవగుచుచును
  78. నత్తప
  79. చింత
  80. యడిగెనేగేలిగోన
  81. యదియేమిసే, యదియెల్లఁ జే
  82. పట్టు
  83. భారువుల
  84. బడగు?
  85. మసలకు
  86. కొసరక, మారక
  87. జెట్టికాట్రేఁడు
  88. బెంతర, జంతర
  89. యేఁడేఁట
  90. లిడుచు
  91. బఱపుట
  92. యున్న
  93. బరిమార్చె
  94. పర్వ
  95. వడినిరువురుమ
  96. రోచెల్ల
  97. శరణార్థి
  98. ఎటకైనఁబయనమైయేఁ
  99. బడగు
  100. యీసురయ్య
  101. లేమిటికి
  102. నక్కులు
  103. నిచ్చి యోలికిఁ
  104. కడువల్లె
  105. బడగుల
  106. సాదల
  107. ల్విడుఁడు
  108. వరగర్వ
  109. సలుపు
  110. మార్థియై
  111. మనమిడి నిత్తెనేమము?
  112. బఱచింటికి
  113. మా పంక్తి
  114. తనయుండుగలఁడె?
  115. పరిమాల్పఁ జాలునాపట్టి
  116. గూకటల్ వ్రా(వ్రే)ల
  117. మండలం
  118. మణుఁగ
  119. దొణఁగ
  120. జిఱుతొండఁ
  121. నరుల్చూడ
  122. గ్రక్కున
  123. యనుచిలు
  124. దొడికిలెనే
  125. యాకటదరియింపలేక
  126. చిరియాలు
  127. లార్చి
  128. చిఱుతొండఁడని
  129. నై(మై) మైదుపడియెడు
  130. జిఱుతొండండు
  131. చేతికిఁబిండి
  132. లేమేని మున్ను, లేవైనమున్ను
  133. ముక్కన్ను
  134. నీవేల
  135. యర్తి
  136. బోయెడి
  137. నే నెఱుంగుదును
  138. బెట్టకనాయాన
  139. చిఱుతొండ
  140. మున్నయ
  141. నే నేమనఁ
  142. తాన
  143. బాడి స1ద, -
  144. వ్రేళ్లను; నంగుళులను
  145. తివిరిన
  146. లంతవిడ్పింప
  147. యీ
  148. పట్టంపు
  149. కింగాణి
  150. ఇట్టి భక్తులనేకు లీ భువినుండ
  151. చిఱుతొండ
  152. కంపెఁ
  153. నంతటఁ బోక
  154. దొల్కాడ
  155. ము?
  156. నములుగొన్నార
  157. సుళువు
  158. యెట్లతాననిన. అ
  159. వ్రయంబెట్లగున (బిట్లెయ్దద)నుచు
  160. గావింప
  161. పేర్చి
  162. జిఱుతొండ
  163. వేఁడెనే
  164. నే
  165. మఱంబొంద
  166. ఒరవోవఁ
  167. యరయఁ
  168. యిల్లు
  169. కంజిపుత్త్రుని నప్డపిల్వ
  170. పాడి
  171. కావున, మఱియు
  172. కోసరింపుచును
  173. పు
  174. దా
  175. తాభీప్సితార్థంబు
  176. సిరియాల
  177. ననుగీర్తిసేయ
  178. సమర్థమూర్తి
  179. బెంగొండ
  180. మూఁటియేఁటి
  181. నిలిచి
  182. ల్కేరఁ
  183. భూషిత
  184. దేజరిల్ల
  185. దాల్చి
  186. లొడసి. ల్డొడసి
  187. పాడి
  188. జంకఁ
  189. ఈ రెండు ద్విపదలు గొన్ని ప్రతులలో లేవు.
  190. తలఁగు
  191. నదర
  192. నలుకును
  193. మగుడి
  194. జంగిచంగి
  195. లిడుచు
  196. గుడిగాఁ దలంచి
  197. వల్వదనుచు
  198. నిపతితమైన పువ్వులగద్దె
  199. జొన్పుచును
  200. మకో?
  201. స్థావరం
  202. గాన
  203. నెట్లకో
  204. నేఁగ నిల
  205. తలఁకఁగ
  206. నురివి
  207. దప్పినను
  208. దిరువరందామయం
  209. చిందె(ది)నొక్క
  210. నీల్గంగఁ
  211. లింగియై
  212. ప్రతిపాల్చు
  213. నిట్రుపవాస
  214. బియ్యము రివెత్తరాక
  215. సరియల
  216. వయ్యంగఁ
  217. వయ్యంగఁ
  218. కొనుడను; కొననను
  219. నేయ, వయ్య?
  220. నీ
  221. నతఁడేగు
  222. వ్రేయుడును
  223. దాఁచిన
  224. దనువు జర్జరితంబుసేయ(?)
  225. కన్న
  226. సలుపుచు
  227. రెండొక
  228. బరమహర్షమున
  229. విదలిం
  230. లెంగుల
  231. నెంతైన నర్థంబులిచ్చి
  232. వెలువఁ(మఁ)డై?
  233. గానిక
  234. నరయి
  235. మట
  236. నోవదు, మోవదు
  237. లెన్నఁడు
  238. యప్పె (గుహిప్పరిగె), యన్-టూర
  239. నిచట
  240. గొనిరండు
  241. కుర్పి; నెఱిఁగికొల్చిన తిరుకురుబులి
  242. తిరువూరి
  243. చిఱువురి
  244. మీ దూత మీ బంట మీడింగరీఁడ 1 మీదయలోవాఁడ మీ ప్రాంతవాఁడ
  245. మీ పన్న