ప్రాణాయామము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఓం

ఉపోద్ఘాతము

నేటి యంత్రయుగంలో ఎచ్చటికైన త్వరగ పోవలె నన్నచో, రైళ్ళు, స్టీమర్లు, విమానములు మొదలగువానిని ఉపయోగించుచున్నాము. కాని యోగులు యోగసాధనచే శరీరముయొక్క బరువును తగ్గించి, కొద్దిసేపటిలో ఎంత దూరమునకైన గాలిలో ఎగిరిపోవచ్చునని చెప్పుచున్నారు. వారొక విధమగు తైలమును పాదములకు రాచుకొని ఎంతదూరమున కైనను కొద్దిసేపటిలోనే పోగలిగియున్నారు. ఖేచరీ ముద్ర నభ్యసించుటచే గాలిలో ఎగురుగలిగియున్నారు. ఒకవిధమగు మహిమగల మాత్రను నోటిలోవుంచుకొని రెప్పపాటులో ఎంత దూరమునకైన పోగలరు. దూర దేశమందున్న మన బంధు మిత్రుల యోగక్షేమములను ఉత్తరములవల్లను, తంతి, నిస్తంత్రి వార్తలవల్లను తెలిసికొనుచున్నాము. కాని, యోగులు ధ్యానము వల్ల ప్రపంచమం దెచ్చట ఏమి జరుగుచున్నదో, క్షణము సేపటిలో తెలిసికొనవచ్చునని చెప్పుచున్నారు. లాహిరి యోగి లండను పట్టణమున తన పై యుద్యోగి భార్యయొక్క ఆరోగ్య మెటులనున్నదో తెలిసికొనుటకు యోగసాధనచే పోయెను; దూరమందున్న మిత్రునితో మాట్లాడుటకు మనము టెలిఫోను, వైర్లెసుల నుపయోగించుచున్నాము. కాని, యోగులు యోగమహిమలవల్ల, ఎంతదూరమునందలి విషయమునైన వినవచ్చుననిన్నీ, ఇంతేగాదు - ఈశ్వర వాక్కులను, ఆకాశమందు మనకు కనిపించకుండనున్న అనేక వస్తువులయొక్క ధ్వనులను, మనము వినవచ్చునని చెప్పుచున్నారు. నేటి భౌతిక ప్రపంచ మున ఎవరికైన ఏదైనవ్యాధి వచ్చుచో వైద్యులు మందులు ఇంజక్షన్లు మొదలుగాగలవాటిచే నివారించుచున్నారు. కాని, యోగులో చూచినంత మాత్రమున, తాకినంత మాత్రమున మంత్రము నుచ్చరించినంతమాత్రమున రోగియొక్క వ్యాధిని నివారించుటేగాదు, చచ్చినవానిని కూడ బ్రతికించ వచ్చునని చెప్పుచున్నారు.

ఈ యోగులు, ఎడతెగని ధారణవలన అనేకములగు సిద్ధులను పొందెదరు. ఇట్టి సిద్ధులను పొందినవారిని సిద్ధులందురు. సిద్ధులను పొందుటకై వారు సాధనను చేసెదరు. ఇట్టి సాధనలలో ప్రాణాయామము అనునదొక ప్రధానమైన సాధన, ఆసనములను అభ్యసించుటవల్ల స్థూలశరీరము వశపడును. ప్రాణాయామమువల్ల సూక్ష్మశరీరము లింగశరీరములు వశపడును. శ్వాసకు, మజ్జాతంతువులకు చాల దగ్గరి సంబంధము గలదు. అందువలన శ్వాసను వశపరచుకొనుటచే, సహజముగనే ఆంతరిక ప్రాణతంత్రులు వశపడును.

హైందవ మతము ప్రాణాయామమునకు చాల ప్రాధాన్యము నిచ్చును, ప్రతి బ్రహ్మచారి, గృహస్థు, ప్రతిదినము త్రిసంధ్యలందును సంధ్యావందన సమయమున ప్రాణాయామమును చేయవలెను. హిందువులుచేయు ప్రతి మతసంబంధమగు కర్మయందును ప్రాణాయామము గలదు. తినుట, త్రాగుట, ఏదైన చేయుటకు నిశ్చయించుటలకు ముందు తప్పకుండ ప్రాణాయామమునుచేసి, తాను చేసికొనిన నిర్ణయము యొక్క స్వభావమును గుర్తెరింగి, ఆ పిమ్మట నీ నిశ్చయమును మనస్సు నెదుట పెట్టుము, అప్పుడు మనస్సు నీ కోరికను నెరవేర్చుటకు ప్రయత్నించును. హిందూయోగులు ధారణా మహిమచే భిన్నభిన్నములగు నూరు విషయములను గురించి జ్ఞప్తియుంచుకొని శతావధానమును చేతురు. ఈ శతావధాని (శతావధానము చేయువాడు) ఒకరితరువాత, మరొకరు త్వరత్వరగ వేయు నూరు ప్రశ్నలను జ్ఞప్తి యందుంచుకొని వరుస ప్రకారము జాగరూకతతో జవాబు చెప్పుచుండవలెను. ఈ ప్రశ్నలు వేయువారు ఆలోచించు కొనుటకుకూడ వీలు లేకుండు నంత త్వరగ వివిధవిషయములపై ప్రశ్నలను వేసెదరు. అప్పుడీ శతావధాని ఏ మాత్రము తొట్రుపాటు, ఆలస్యము లేకుండ ఎవరు వేసిన ప్రశ్నలకు, ఏ జవాబు లివ్వవలెనో ఆ ప్రకారము జవాబివ్వవలెను. ఇట్టి జవాబులను మూడు లేక ఇంక ఎక్కువ మారులుగ, ప్రతిపర్యాయము వరుసగ కొంతకొంత భాగము జవాబిచ్చుచు వచ్చి పూర్తిచేయును.

ఇట్టి ధారణ, ఒక్కబుద్ధి బలము విషయమున మాత్రమేకాదు; పంచజ్ఞానేంద్రియములతో కూడ చేసెదరు. చాల గంటలను వేరు వేరు గుర్తులతో వ్రేలాడగట్టి మ్రోగించెదరు. అటుల మ్రోగిన మ్రోతలు విని ఏగంట ఏరీతిని మ్రోగినదో చెప్పవలెను. ఇదే రీతిని తదితర జ్ఞానేంద్రియములను గురించి గూడ పరీక్ష చేసెదరు. ఇట్టి శక్తులు ప్రాణాయామాభ్యాసము వల్ల లభించగలవు.

ప్రాణ మను నదొక సూక్ష్మమైన శక్తి, ఇది స్థూల ప్రపంచములో చలనము, కృత్యముల రూపమునను, సూక్ష్మ ప్రపంచములో సంకల్ప రూపమునను కనిపించును. ప్రాణాయామ మన, ప్రాణశక్తులను నిలువచేసి కొనుట. ఇందువల్ల ప్రాణ శక్తులు వశపడును. స్నాయువులలో చైతన్యము వచ్చి, బాహ్య ప్రపంచ విషయములను తెలిసికొన గలుగుట, ఆంతరిక సంకల్పములను గురించి యోచింప గలుగుటలు ప్రాప్తించ గలవు, ప్రాణశక్తిని వశపరచుకొనుటయే ప్రాణాయామ మందురు. ఇట్టి ప్రాణాయామముచే తన ప్రాణశక్తిని లోబరుచుకొన్న వాడు, తననేగాదు తదితర ప్రపంచ మంతటిని జయించిన వాడగును. ఈ ప్రాణమే ఈ సృష్టికంతకు మూలాధారము. యోగి ప్రపంచమునంతను తన శరీరముగ తలచును. ఏలనన, తన శరీరము ఏ పంచ భూతములచే సృష్టింప బడినదో, ఆ పంచభూతముల చేతనే గదా ఈప్రపంచ మంతయు సృష్టింపబడుట! తన నాడీ మండలమును నడుపుచున్న ఆ మహత్తర శక్తియే, ఈ ప్రపంచము నంతను నడుపుచున్నదిగా తలచును. కావున, తన శరీరమును జయించుటవలన, తాను ప్రకృతి యందలి సమస్త శక్తులను జయించితి ననెడి భావముతో యోగి యుండును. హైందవ తత్త్వశాస్త్ర రీత్యా, ఈ ప్రకృతి యంతయు ఆకాశము (ETHER) ప్రాణము (ENERGY) అను ప్రధాన పదార్థములచే సృజింప బడినది. వీనినే యించు మించు, ఆధినికశాస్త్ర వేత్తలుచేప్పు, పదార్థము, శక్తి - అనవచ్చును. ఈ సృష్టియందలి స్థూల రూపమును దాల్చియున్న ప్రతి పదార్థము సర్వవ్యాపియగు 'ఆకాశ' పదార్థముచే సృజింప బడినదే. వాయు, ద్రవ, ఘన పదార్థములు, సమస్త సృష్టి, - అంతయు మన సూర్య సిద్ధాంత రీత్యాగాని, ప్రపంచమందలి ఎన్నో ప్రధాన సిద్ధాంతముల ననుసరించిగాని, ఈ ప్రపంచమున సృష్టింపబడిన ప్రతి పదార్థము, అగోచరమగు ఆకాశ ద్రవ్య సహాయము వలననే సృష్టింపబడ గలదు. అంతమున మరల ఈ ఆకాశ ద్రవ్యము ననే చేరగలదు. ఇదే రీతిని, మానవునకు తెలిసియున్న అన్ని విధములగు ప్రాకృతిక శక్తులు ఆకర్షణ, ప్రకాశము, ఉష్ణము, విద్యుత్తు, చుంబన ఆకర్షణ శక్తి, పశుబలము, బుద్ధిబలము మొ) ఈ విశ్వప్రాణశక్తి నుండియే సృష్టింపబడినవి. అంతేగాదు, ఈ ప్రాణశక్తినుండియే జన్మించి, అందేలయమై పోవు చున్నవి. ఈ సృష్టి యందలి భౌతిక, మానసిక శక్తులన్నియు, అందే లయమగు చున్నవి. ఈ రెండు పదార్థములు లేకుండ నున్నవస్తు వేదియు ఈ సృష్టియందు లేదు. శక్తి నిత్యత్వము, పదార్ధ నిత్యత్వము అను, రెండుమూల సిద్ధాంతములు ప్రకృతియందు గలవు. ఈరెండు శక్తులలో ఆకాశతత్వము సృష్టించుటను (ఎల్లప్పుడు) చేయుచుండును; శక్తి, ఎడతెగకుండ యీ సృష్టింప బడిన పదార్థములకు చైతన్యము నిచ్చును. ఈ రీతిని శక్తి భిన్న భిన్న స్వరూపములలో చక్రమువలె తిరుగు చుండి, పున: బలిష్ఠ మగును; అదేరీతిని ఆకాశముగూడ, మరల, ఈ శక్తులు రెండవ చుట్టును ప్రారంభింప బోవునపుడు, భిన్న భిన్న స్వరూపములను కలిగించుటకై తిరిగి ఆకాశ తత్వముపై పనిచేయును. ఈ రీతిని, ఆకాశతత్త్వము మారిపోయి స్థూల సూక్ష్మరూపములుగా మారి నప్పుడెల్లను, ప్రాణశక్తికూడ అదే రీతిని స్థూల సూక్ష్మరూపములు గలదిగ మారును.

యోగి తనశరీరము నొక సూక్ష్మప్రపంచముగ నెంచి, నాడీవిధానము, ఆంతరి కేంద్రియములచే తన శరీరము నిర్మింప బడినదని తెలిసికొని, తన పరిశ్రమవలన వీటి మర్మముల నన్నిటిని కనుగొని, వీటి నన్నిటిని వశపరచుకొని, జగత్తునంతను జయించును.

ఇట్టి మహత్తరమైన ప్రాణమును వశపరచుకొనినవాడు, భౌతికజీవితము, భౌతికవిషయముల నన్నిటిని వశపరుచుకొన గలడు. ఇట్టివాడు తన శరీరమును, మనస్సును వశపరచుకొన గలుగుటేగాదు, సృష్టియందలి ప్రతి ప్రాణియొక్క శరీరము, మనస్సులనుకూడ తన వశములోనికి తెచ్చుకొనగలడు. ఇదే ప్రాణాయామము నభ్యసించి, ప్రాణశక్తిని వశపరచుకొనుట వల్ల గలుగు ఫలితము. ఇట్టి యోగి, తన శరీరమునందే జగత్తంతయు నున్నట్లు గుర్తించి, జగత్తునందుగల సర్వశక్తులు తన శరీరమునందున్నవని భావించి, ఆ శక్తుల నన్నింటిని తన వశము చేసికొనుటకు ప్రయత్నించును. ఇట్టి సిద్ధినిపొందుట కొర కాత డనేక రకములగు అభ్యాసముల నొనర్చును.

తెలిసికొంటివా? ఇంక ఆలస్యమెందుకు? ఆలసించుట యన, ఇంకను బాధలను, సంతాపములను అధిక మొనర్చుకొనుటయే, త్వరత్వరగ ఎక్కువ కష్టించి, ఈ ప్రాపంచిక విషయములను వశపరచుకొని సుఖపడుటకు తీవ్ర ప్రయత్నముచేయుము, సరియగు సాధననుచేసి, ఈ జీవితమునందే నీగమ్యస్థానమును చేరుటకు ప్రయత్నించుము, నీవేల ఆ ఆత్మజ్ఞానము, పరమానందము, పరమశాంతి, విశ్వశక్తులను ఇప్పుడే, ఈ జన్మలోనే పొందరాదు?

ఈ సమస్యను యోగశాస్త్ర మొక్కటియే పరిష్కరించ గలదు. దీనియొక్క గమ్యస్థానము సంసార సాగరమునుండి మానవుని దాటించి, శక్తి, జ్ఞానములను పెంపొందింప జేసి, అమృతత్వమును పరమానందములను పొందజేయుటయే.

ఓం శాంతి:

శివానంద

______