ప్రాణాయామము/1వ ప్రకరణము

వికీసోర్స్ నుండి

ప్రాణాయామము

1వ ప్రకరణము


ప్రాణము, ప్రాణాయామము

ప్రాణాయామ మొక పూర్ణమైన శాస్త్రము. ఇది అష్టాంగయోగమందలి నాల్గవాంగము. 'తస్మిన్ సతిశ్వాస ప్రశ్వాసయో ర్గతివిచ్ఛేద: ప్రాణాయామ:' - పాతంజల యోగ సూత్రము (2.49)లలో ఆసన సిద్ధిపొంది శ్వాసోచ్ఛ్వాసలను వశపరచుకొనుటయే, ప్రాణాయామమని వివరింపబడినది.

'శ్వాస' యన లోపలికి పీల్చుగాలి; 'ప్రశ్వాస' యన బయటకు గాలివిడచుట, శ్వాస విద్యుచ్ఛక్తివలె స్థూలరూపమును ధరించిన ప్రాణశక్తి, శ్వాసస్థూలము; ప్రాణము సూక్ష్మము. అభ్యాసముచే ఈ శ్వాసను వశపరచుకొనినవానికి ప్రాణ శక్తి సహజముగ వశపడును. ప్రాణశక్తి వశపడుటచే మనస్సు వశపడును. మనస్సు ప్రాణశక్తి సహాయములేనిదే ఏ పనిని చేయజాలదు. మనస్సునందు ప్రాణశక్తియొక్క కంపనములవల్ల మాత్రమే సంకల్పములు మొలకెత్తగలవు. మనస్సు ప్రాణశక్తి యొక్క సహాయమువల్ల మాత్రమే కదలగలదు. ప్రాణమనునది మనస్సుకు బయటితొడుగు. 'శ్వాస' యనునది యంత్రము యొక్క ప్రధానచక్రము (FLY -WHEEL) లాటిది. ఇది ఆగుటచే తక్కిన చక్రములనియు ఆగిపోవునటుల, శ్వాసను ఆపి వేయుటవల్ల శరీరమనెడి యంత్రమునందలి అన్ని చక్రములు ఆగిపోవును. ఈరీతిని శరీరయంత్రమును, ప్రాణమును వశపరచు కొనుటవల్ల లోబరుచుకొనుటనే ప్రాణాయామ మందురు.

కంసాలి, పుటము పెట్టుటచే బంగారమందలి మలినమును పోద్రోలినటుల, ప్రాణాయామసాధనచే యోగి తనయందలి అపరి శుద్ధతలను పారదోలును.

ప్రాణమును అపానముతో కలిపి, ఈ రెంటిని తలవైపుకు ప్రవహించునటుల చేయుటయే ప్రాణాయామము యొక్క ప్రధానాశయము, ఇందువలన నిద్రించుచున్న కుండలినీ శక్తి మేల్కొనును.

ప్రాణమననేమి ?

శ్రుతులు "ప్రాణమునుగురించి ఎవ డెరుగునో వాడే వేదములను తెలిసికొన్నవాడు" అని చెప్పుచున్నవి. 'అందువలన శ్వాస బ్రహ్మ' యని వేదాంతసూత్రములు వాకొను చున్నవి. జగత్తునందు గల సమస్త శక్తులయొక్క సమ్మేళనమే ప్రాణము - ప్రతి మనుష్యునియందు అతని చుట్టుప్రక్కల దాగియున్న సమస్తశక్తులయొక్క కూడికయే ప్రాణశక్తి. ఈప్రాణ శక్తినుండియే, వేడి, వెలుతురు, ఆకర్షణశక్తి, విద్యుచ్ఛక్తులు బయలు వెడలినవి. ఇట్టి సమస్తవిధములగు శక్తులు, మహిమలు, ప్రాణము-ఇవన్నియు, ఇకే ఆత్మనుండి వచ్చుచున్నవి. శారీరక మానసిక శక్తులన్నియు ప్రాణశక్తిక్రిందికివచ్చును. ప్రపంచములో చలనము, జీవము, కార్యచరణచేయు ప్రతిపదార్థము ప్రాణ శక్తియొక్క స్వరూపమే. ఆకాశముకూడ ప్రాణశక్తియొక్క స్వరూపమే. ఈ ప్రాణశక్తి ప్రాణరూపమున మనస్సుతోనూ, మనస్సువల్ల ఇచ్ఛాశక్తితోనూ, ఇచ్ఛాశక్తివల్ల వ్యక్తిగత ఆత్మతోనూ, వ్యక్తిగతఆత్మవల్ల పరమాత్మతోనూ సంబంధము గలిగి యున్నది. మనస్సుద్వారా చెలరేగుచున్న సాధారణ ప్రాణ తరంగములను వశపరచుకొను విధానమును తెలసికొన్నచో, విశ్వప్రాణమును వశపరచుకొను విధానము సులభముగ తెలియును. ఈ రహస్యమును తెలిసికొనినయోగి ప్రపంచమందలి సర్వశక్తులయొక్క రహస్యమును తెలిసికొన్న వాడగుటచే, ఏ విధమగు శక్తికికూడ భయపడడు. కొంత మంది జీవితములో విజయవంతులు, ఎక్కువ పలుకుబడి గల వారుగనుండుటకు గల రహస్యము, వారికి ప్రాణశక్తిలోబడి యుండుటయే. ఇట్టివన్నియు ప్రాణశక్తివల్లనే లభించగలవు. కాని యిట్టి పలుకుబడి మొదలగునవి గల జనులం దీ శక్తులు వారికి తెలియకుండగనే వుపయోగములోనికి వచ్చుచుండును. కాని యోగియో, వీటిని తన యిచ్ఛానుసార ముపయోగించు కొనగలడు. హృదయ వ్యాకోచము, సంకోచము, రక్తప్రసరణము, శ్వాసోచ్ఛ్వాసలు, ఆహారము జీర్ణమగుట, మల మూత్ర విసర్జనములు, శుక్రము, లాలాజలము, పైత్యరసము, జఠరరసములున్నూ, కనులు మూయుట, తెరచుట, నడచుట, ఆడుట, మాట్లాడుట, యోచించుట, భావించుట మొదలగున వన్నియు ప్రాణశక్తివల్లనే జరుగుచున్నవి.

ఈ ప్రాణము స్థూల సూక్ష్మశరీరములను కలుపు లంకె లాటిది. ఈ లంకెను త్రెంచివేయుటవల్ల సూక్ష్మశరీరము స్థూలశరీరమునుండి విడిపోవును. అదేమరణము. అప్పుడీ భౌతిక శరీరమున పనిచేయుచుండు ప్రాణశక్తి సూక్ష్మశరీరములోనికి తీసికోబడును. జగత్ర్పళయ సమయమందీప్రాణము సూక్ష్మముగను, నిశ్చలముగను, అప్రత్యక్షముగను, అభేదముగను వుండును. ఆ పిమ్మట జగత్కంపనము వచ్చును. అప్పుడీ ప్రాణము కదలి, ఆకాశతత్త్వమును సహాయముగ తీసికొని, అనేకరకములగు రూపములను సృష్టించును. బ్రహ్మాండము, పిండము లనునవి ప్రాణశక్తి, ఆకాశముల కలయికయే.

పొగబండిని, పొగఓడను నడిపించునది, విమానమును ఎగురులాగున జేయునది, ఊపిరి విడుచుట తీయుటలను జేయించునది, ____ఇదంతయు ప్రాణమే,

నీకీ ఉదాహరణల వల్ల ప్రాణశక్తి యన ఏదో తెలిసినది గదా!

కావున నీవీశ్వాసను వశపరచు కొనుటవల్ల, శరీరములో జరుగు సమస్త కార్యములను వశపరచు కొన గలుగుదువు. ఇందువల్ల నీశరీరము, మనస్సు, ఆత్మలు కూడ అతి త్వరగ నీకు లోబడును. ఇట్టి ప్రాణాయా మాభ్యాసముచే, నీ పరిస్థితులు, నీ స్వభావమును లోబరచు కొనుటయేగాదు, నీవ్యక్తిగత ప్రాణ శక్తివల్ల విశ్వ ప్రాణశక్తిని గూడ లోబరచు కొని నీ యిష్టానుసారము నడిపించ గలుగుదువు.

ఇచ్ఛా శక్తిచే సంకల్పములను వశపరచుకొని, ఆ సంకల్పబలము వల్ల శ్వాసను యిష్టాను సారము నడప గలుగుటచే పొందెడుశక్తి, నీ ఆత్మోన్నతికి సాయపడును.

ఇంతేగాదు, ఈ శక్తి నీయందలి, యితరులయందలి కుదురని మొండివ్యాధులను నివారించుటకే గాదు, యింకెన్నో ఉపయోగకరములగు పనులు చేయుటకు పనికివచ్చును. నీ జీవితము నందలి ప్రతిక్షణమును, నీ యిచ్ఛాను సారము వినియోగించు కొనవచ్చును. కావున, దానిని సరియగు విధమున వుపయోగించుము.. శ్రీ జ్ఞాన దేవుడు, త్రిలింగస్వామి, రామలింగస్వామి మొదలగు మహయోగు లందరు, అనేక విధములుగ, ఈ ప్రాణశక్తిని వుపయోగించిరి. కావున నీవుకూడ ప్రాణయామమును అభ్యసించినచో వారివలె చేయగలవు. నీవు పీల్చునది ప్రాణశక్తియే. నెమ్మదిగను, ప్రశాంతముగను ఏకాగ్రత గల మనస్సుతోను గాలిని పీల్చుము. నీకు శ్రమ లేకుండ ఆపగలిగి నంతసేపు దానిని లోపల ఆపుము. ఆపిమ్మట నెమ్మదిగా గాలిని విడువుము. ప్రాణాయామమును ఎట్టి స్థితియందు కూడా శ్రమతో చేయరాదు. ఈ శ్వాసయందు దాగియున్న ఆధ్యాత్మికమహాత్మ్యములను గుర్తించుము. యోగివి కమ్ము, ఆనందము, ప్రకాశము, మహాత్మ్యము లనెడి పరిసరములను గలవాడ వగుము.

ప్రాణవాదులు(హఠయోగులు) ప్రాణ తత్త్వమును మన స్తత్త్వము కంటె శ్రేష్ఠమైనదని చెప్పెదరు. నిద్రాసమయములో, మనస్సు లేకుండపోయినప్పుడు కూడ ప్రాణము వుండునని వారి సిద్ధాంతము. అందువల్లనే మనస్సుకంటె ప్రాణమే శ్రేష్ఠమనివారి అభిప్రాయము. కౌశీతకి,ఛాందోగ్యోపనిషత్తు లందు కొన్ని నీతికథలు గలవు. వాటిలో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములను నవి, నేను గొప్ప, నేను గొప్ప యని పోట్లాడుకొనును. కాని చివరకు, ప్రాణమే గొప్పదని తేలును. ప్రాణమనునది, అన్నిటికంటె పెద్దది. బిడ్డ గర్భమందు పడుట తడవుగ, ఈప్రాణశక్తి వానియందు ప్రవేశించును. ఇంద్రియములు, చెవులు, ముక్కులు మొదలగునవి ఏర్పడిన పిదప మాత్రమే ప్రవేశింప గలవు. ఉపనిషత్తులలో, ఈ ప్రాణము జ్యేష్ఠుడని, శ్రేష్ఠుడని వర్ణింపబడినది. మనస్సు, సంకల్పము లనునవి ఈ ప్రాణశక్తి వున్నప్పుడు మాత్రమే పనిచేయగలవు. లేనిచో చేయజాలవు. వినుట, చూచుట, మాట్లాడుట, యోచించుట, తెలిసికొనుట మొదలగునవన్నియు, ప్రాణశక్తి సహాయమువల్లనే జరుగును. అందువల్లనే వేదములు ప్రాణమును బ్రహ్మగా వాకొనుచున్నవి.

ప్రాణము ఎచట నుండును ?

ఈ ప్రాణము హృదయమం దుండును. అంత:కరణ మనునది ఒకటే అయినప్పటికి, అది నాల్గురూపములుగ నున్నది. 1. మనస్సు, 2. బుద్ధి, 3. చిత్తము, 4. అహంకారములని, చేయుపనుల ననుసరించి అంత:కరణ మీ రీతిని విభజింప బడినది. ఇదేరీతిని ప్రాణము ఒకటే అయినప్పటికి, అదిచేయు పనులననుసరించి ఐదురూపములను కలిగియున్నది. 1. ప్రాణము, 2. అపానము, 3. సమానము, 4. ఉదానము, 5. వ్యానము అని. దీనినే వృత్తి భేదమందురు. వీనిలో ప్రధాన ప్రాణమును ముఖ్యప్రాణ మందురు. ఈ ప్రాణము అహంకారముతో కలిసి హృదయమందు వసించును. ఈ పంచప్రాణములలో ప్రాణము, అపానములు ప్రధానమైనవి.

ప్రాణమునకు హృదయమువలె, అపానమునకు గుదము నివాసస్థానము. 'సమానము' నకు బొడ్డు, 'ఉదానము' నకు గొంతుకయు వాసస్థానములు. 'వ్యానము' శరీరమంతటను సంచరించుచుండును.

ఉపప్రాణములు - వాటి కృత్యములు

నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము - అను ఐదు ఉపప్రాణములు గలవు. ప్రాణముయొక్క పని శ్వాసించుట. అపానము విసర్జన, సమానము జీర్ణముచేయుట, ఉదానము మ్రింగుటలను చేయును. ఇది జీవుని నిద్రింపజేయుట, మరణ సమయమున స్థూలశరీరమునుండి సూక్ష్మశరీరమును విడదీయుటలను కూడ చేయును. వ్యానవాయువు రక్తపు సారమును కలిగించును.

నాగము వెక్కిళ్ళు, త్రేనువుల నున్నూ, కూర్మము కండ్లను తెరచుటను, కృకరము ఆకలి దప్పికలను కలిగించుటను, దేవదత్తము ఆవలింతను, ధనంజయము మరణానంతరము శరీరమును విడదీయుటను చేయును. బ్రహ్మరంధ్రముగుండ తలయందుగల ప్రాణమును బయటకుపోవులాగున చేసికొని మరణించినవాడు తిరిగి జన్మింపడు.

ప్రాణము యొక్క రంగులు

ప్రాణము రక్తవర్ణముగాను పగడపురంగుగానువుండును. అపానము ఇంద్రగోపమనెడు పురుగుయొక్క రంగువలెనుండును. సమానవాయువు చిక్కటిపాలు స్ఫటికముల వన్నెవలెగాని లేక నూనెవన్నెతో గూడిన తళతళలాడు వన్నెతోగాని వుండును. ఉదానవాయువు ఆపాండర (పాలిపోయిన తెలుపు) వర్ణముగా నున్నూ, వ్యానవాయువు దీప కిరణపు వన్నెగానుండును.

వాయు ప్రవాహముల నిడివి

ఈ వాయు పూరితమగు శరీరముయొక్క సాధారణ నిడివి ఆరు అడుగులు. సాధారణముగ బయటకు విడచు వాయు ప్రవాహము యొక్క నిడివి 9 అంగుళము లుండును; పాడునప్పుడు 1 అడుగు, తినునపుడు 15 అం; నిద్రించునపుడు 3 1/2 అం, సంభోగ సమయమున 27 అం., శరీర వ్యాయామములు చేయునపుడు యింతకంటె ఎక్కువగను వుండును. ఇట్లు బయటకు విడచు వాయు ప్రవాహముల దూరము (9 అం, నుండి) తగ్గించుచో ఆయువు వృద్ధియగుటయు, ఎక్కువ చేయుటచే ఆయువు తగ్గుటయు జరుగును.

ప్రాణమును కేంద్రీకరించుట

ప్రాణమును బయటనుండి లోపలికి పొట్టనిండు నంతవరకు పీల్చి, ఆ పిమ్మట ప్రాణమును మనస్సుతో గూర్చి బొడ్డుమధ్య గాని, నాసాగ్రముపైగాని, కాలి బొటనవ్రేళ్ళపై గాని కేంద్రీకరించుము (ఎల్ల సమయములందు లేక త్రిసంధ్యలందును), ఈ రీతిగ చేయుటచే యోగి సర్వవిధములగు వ్యాధులు, వేదనలనుండి విముక్తుడగును.ప్రాణమును నాసాగ్రముపై కేంద్రీకరించుటచే వాయు తత్త్వము వశపడుటయు, బొడ్డుమధ్యన కేంద్రీ కరించుటచే అన్నివ్యాధులు నివారణ అగుటయు, కాలి బొటన వేళ్ళపై కేంద్రీకరించుటచే శరీరము తేలికయగుటయు లభించ గలదు. నాలుకతో గాలిని పీల్చువాడు తన మనోవేదనలనుండి విముక్తిని పొంది, దాహములేని వాడుగా అగుటయే గాక అనేక విధములగు వ్యాధులనుండి విముక్తిని పొందును. రెండు సంధ్యల యందును, రాత్రియొక్క చివరి రెండు గంటలయందును, నోటితో గాలిని మూడు మాసములు వరకు పీల్చువానికి సరస్వతీదేవి వాక్కునందు ప్రత్యక్షమగును. అతడు మంచి పండితుడగును. పైరీతిని ఆరు మాసములు చేయువాడు వ్యాథులన్నిటి నుండి విముక్తుడగును. గాలిని నాలుక యొక్క మూలము వద్దకు పీల్చి, బుద్ధిమంతుడైన వాడు అమృతమును పానముచేసి, జౌన్నత్యమును పొందును.

శ్వాసకోశములు

ఇచ్చట శ్వాసకోశములను గురించి వ్రాయుట అనవసరమని తలంచును. శ్వాసావయవములైన రెండు శ్వాసకోశములు (ఊపిరి తిత్తులునూ) రొమ్ముకు యిరుపార్శ్వముల నుండును. వీనితోపాటు, రెండు గాలి గొట్టములున్నూ వుండును. ఇవి రొమ్ము నందలి ఉపరితల హృదయ కుహరమునందుండును. ఇవి పెద్ద రక్తనాళము చేతను పెద్ద గాలి గొట్టము చేతను వేరు చేయబడు చున్నవి. ఈ శ్వాసకోశములు మెత్తగా సన్నటి రంధ్రములతో కూడి యుండి స్థితి స్థాపక ధాతువులు గలవై యుండును. వీటియందు అసంఖ్యాకములగు వాయుకోశము లుండును. ఈ వాయు కోశముల నిండ, వాయువు నిండి యుండును. మరణా నంతరము ఈ వాయు కోశములతో నిండియున్న శ్వాసావయవములను ఒక నీటి పళ్ళెములో పడ వేసినచో అది తేలును. ఇవి పలుచటి సన్నని పొరచే కప్పబడు యుండును. ఈ పొరను పుప్పుస వేష్టనము అందురు. ఈ పుప్పుస వేష్టనము ద్రవ ద్రవ్యముతో నిండి యుండి, శ్వాసావయములు గాలి పీల్చు నపుడు కలుగు రాపిడిచే చెడిపోకుండా కాపాడును. ఈ పుప్పుస వేష్టనముయొక్క ఒక పొర, శ్వాసావయవమును అంటుకొని యుండును. రెండవ చివరిపొర గుండె యొక్క లోపలి అంచును ఆనుకొని యుండును. గుండెను, శ్వాసావ యవములను రెంటిని ఒక దానితో ఒకటి, అంటి పెట్టుకొని యుండు లాగున చేయునది ఈ పొరయే. ఈ శ్వాసావయవములలో కుడి కోశములో మూడు వృత్తములు, ఎడమ కోశములో రెండు వృత్తములు వుండును. ప్రతికోశమునందు ఒక శిఖ, ఒక ఆధారము వుండును. ఈ ఆధారము, పొట్టను గొంతును వేరుపరచు గోడయగు మహా ప్రాచీర వైపు ముఖము గలిగి యుండును. ఇక శిఖయో, పై భాగమున అనగా మెడయొక్క మూలమునకు దగ్గరగా వుండును. పుప్వూజ్వరము వచ్చినప్పుడు ఈ ఆధారమున మంటగా వుండును. ఈ శిఖకు సరిపోవు నంతటి ప్రాణ వాయువు లభించక పోయినచో క్షయవ్యాధి కలుగును. ఇదే క్షయవ్యాధి బీజములను (T.B) సృష్టించుటకు కారకురాలు, కపాలవతి, భస్త్రిక ప్రాణాయామముల వల్ల కావలసినంత ప్రాణవాయువు లభించును. అంతేగాక క్షయవ్యాధి రాకుండుటయేగాదు, చక్కటి మధురమైన గొంతు కూడ ప్రాప్తించును.

ముక్కులోపల రెండు గాలిగొట్టములు వుండును. ఇవి రెండు స్వరతంతులను కలిగి యుండును. మనము గాలిని ముక్కుతో పీల్చిన తదుపరి, ఆ గాలి సప్తపథ, గొంతు క్రోపుల గుండా శ్వాసనాళములోనికి పోవును. అచ్చటినుండి, కుడి ఎడమ సూక్ష్మ శ్వాసనాళములలోనికిన్నీ, అచ్చటినుండి అసంఖ్యాకములగు అతి సూక్ష్మ శ్వాసనాళములలోనికిన్ని పోవును. ఆ పిమ్మట శ్వాసావయవములో గల లక్షలకొలదిగా గల అతి సూక్ష్మములైన వాయుకోశములలోనికి ఈ గాలిపోయి, అచ్చట ఆగిపోవును. ఈ వాయుకోశములను ఒక చదునైన స్థలములో పరచినచో అవి 1,40,000 చ.అ.ల స్థలము నాక్రమించును.

మహాప్రాచీర, గాలిని శ్వాసావయవముల లోనికి తెచ్చును. ఈ మహాప్రాచీర తెరచుకొని యున్నప్పుడు రొమ్ము శ్వాసావయవములయొక్క విస్తీర్ణము పెరుగును. అట్టి సమయములో, ఈ రీతిగా మహాప్రాచీరను తెరచియుంచి రొమ్ము శ్వాసావయవములను విస్తరింపజేయుటచే ఏర్పడిన శూన్య స్థలములోనికి, బయటగల గాలి ప్రవేశించును. గాలిని బయటకు విడచినప్పుడు గుండె, శ్వాసావయవములు ముకుళించుకొనును.

స్వరయంత్రమున గల స్వరతంత్రులవలన శబ్దము కలుగు చున్నది. అతివాగుడు, మితిమీరి పాడుట, ఉపన్యసించుటవలన స్వరతంత్రులు చెడిపోయి గొంతు బొంగురు, కటువైన గొంతు ఏర్పడును. ఈ స్వరతంత్రులు స్త్రీలయందు పొట్టివిగావుండును. అందువలన వారి కంఠము మృదువుగను, మధురముగను వుండును. మనుష్యుని సాధారణ ఉచ్ఛ్వాసనిశ్వాసల పరిమాణము, నిమిషమునకు పదహారుమార్లు, న్యూమోనియా వ్యాధి పీడితుడు నిమిషమునకు 60, 70 లేక 80 మార్లు శ్వాసోచ్ఛ్వాసల నొనర్చును. ఉబ్బసవ్యాధిగలవాని సూక్ష్మ శ్వాసనాళములలో ఒకవిధమగు ఈడ్పువుండును. అందుచే అవి ముడుచుకుపోవును. ఇందువలన గాలిపీల్చుటలో అతనికి ఎంతో శ్రమ గలుగును. ప్రాణాయామము చేసినందువల్ల, ఈ సూక్ష్మశ్వాసనాళములు బాగుపడును. ఊపిరి గాలిగొట్టముయొక్క పై వరుసలో ఒక సన్నని టోపివుండును. దీనినే గోజిహ్వక యందురు. ఈ గోజిహ్వక నీటిని, ఆహారద్రవ్యములను శ్వాస గొట్టములోనికి పోకుండులాగున ఆపుచేయును. ఒకవేళ ఏదైన కారణము వల్ల, శ్వాసగొట్టములోనికి గాలిగాక, మరే పదార్థమైన పోవుటకు ప్రయత్నించినచో, వెంటనే దగ్గువచ్చును. ఆ రూపేణా పదార్థము బయటకు నెట్టివేయబడును.

శ్వాసావయవములు రక్తమును పరిశుద్ధపరచును. ఈ రక్తము ప్రాణపోషక పదార్థములతో ధమనులనుండి బయలు దేరి, శరీరమునందలి పనికిమాలిన పదార్థములను తీసికొని, మలిన రక్తనాళములగు సిరలగుండా తిరిగివచ్చును. ఈ ధమనులు హృదయమునుండి పరిశుద్ధమైన ప్రాణవాయుపూరిత రక్తమును గైకొని, శరీరమందలి వివిధభాగములకు పంపును. ఇక సిరలు, శరీరమందలి అన్ని భాగములనుండి అపరిశుద్ధ రక్తమును తీసుకొనును, ధమనులు, సిరలు చేయుపని ఇది. హృదయమునకు కుడివైపున గల అపరిశుద్ధ రక్తము వుండును. హృదయమునకు కుడివైపున గల ఈ అపరిశుద్ధ రక్తము పరిశుద్ధపరుపబడుటకై శ్వాసావయవములోనికి పోవును. అచ్చట, ఈ చెడురక్తము లక్షలకొలది శ్వాస గోళములకు పంచిపెట్టబడును. మనము పీల్చిన గాలియందలి ప్రాణవాయువు శ్వాసావయవములందలి పుప్పుసీయ కేశనాళికల సహాయమువల్ల, ఈ అపరిశుద్ధ రక్తమువద్దకు పోవును. ఈ కేశనాళికల ప్రాకారములు బహుసన్నగ జల్లెడవలె నుండును. అందువలన వీటిగుండా అతిత్వరగా రక్తము స్రవించును. ఈ కేశనాళికలగోడల ద్వారా ప్రాణవాయువు, ఆరక్తమును ముట్టడించును. అప్పు డొకవిధమగు భస్మ ప్రక్రియ జరుగును.

అప్పుడు ఈరక్తము ప్రాణవాయువును గైకొని శరీరమందలి అనేక భాగములందలి అపరిశుద్ధ రక్తము, విషపదార్థములవలనను తయారై నట్టి బొగ్గుపులుసు గాలిని విడచును. అప్పుడు, ఈ పరిశుద్ధరక్తము నాల్గు పుప్పుససిరల ద్వారా ఎడమ కర్ణికలోనికిన్నీ, అచ్చటినుండి ఎడమ జఠరిక నిలయములోనికిన్ని గొంపోవబడును. తరువాత, ఈ జఠరిక నిలయమునుండి ప్రధానధమని యగు బృహద్ధమనిలోనికి తోడె వేయబడును. ఈ బృహద్ధమనినుండి, తదితరధమనులన్నిటిలోనికి పరిశుద్ధరక్తము ప్రవహించును. ఈ రీతిని, దినమునకు 35 వేల పింటుల రక్తము పరిశుద్ధ పరుపబడునని లెక్కకట్టబడినది.

ఈ ధమునులనుండి పరిశుద్ధరక్తము సూక్ష్మకేశ నాళికలలోనికి పోవును. ఈ కేశనాళికలనుండి రక్తమునందలి శుభ్రధాతువు బయటకు పారి, శరీరమునందలి ధాతువులనన్నింటిని పరిశుభ్ర పరచును. ఈ ధాతువులు అచ్చట శ్వాసించును, ఆ శ్వాసించునప్పుడు, ప్రాణవాయువును గైకొని, బొగ్గుపులుసు గాలిని ధాతువులు బయటకు విడచును. ఈ విడువబడిన అపరిశుద్ధతలను సిరలు తీసికొనిపోవును.

ఈ విచిత్రమగు యంత్రమును నిర్మించిన వాడెవడు? దీనినంతను సృష్టించిన వాడెవడో ఒకడు గలడని యిప్పటికైన తెలిసికొంటివా? అతడే దేవుడు, ఆతని గొప్పతనమును ఈ మానవ యంత్రమే అడుగకుండ చెప్పుచుండుట లేదా? మన హృదయములలో దాగియున్న ఆ అంతర్యామి ఈ యంత్రముచేయుచున్న పనిని ద్రష్టగావుండి పరీక్షించుచుండును. అతడు లేనిదే, హృదయము రక్తమును ధమనులలోనికి తోడి పోయజాలదు. శ్వాసావయవములు రక్తమును పరిశుద్ధ పరుప జాలవు. తెలిసికొంటివా! ఇకనైన నీవు ఆతనిని ప్రార్థించుము, అతనిని స్మరించుము. ఆతనిని నీ యందలి ప్రతిఅణువునందు నిండియున్న వానినిగ అనుభవించి, సుఖించుము.

ఇడ, పింగళలు

వెన్నెముకకు రెండు వైపులను రెండు నాడీప్రవాహములు గలవు వీనిలో ఎడమవైపున గలదానిని 'ఇడ' యనియు కుడివైపున గలదానిని 'పింగళ' యనియు అందురు. వీటినే 'నాడులు' అందురు. కొందరు వీటిని అనుకంపిక మజ్జారజ్జువులు అందురు. కాని యివి ప్రాణమును గొంపోవు సూక్ష్మనాళములు. సూర్యుడు పింగళయందును, చంద్రుడు ఇడయందును సంచరించును. ఇడ శితలతను, పింగళ ఉష్ణతను యివ్వగలదు. ఇడ ఎడమ ముక్కుగుండను, పింగళ కుడిముక్కుగు:డను ప్రవహించును. శ్వాస ఒక గంటసేపు కుడిముక్కు గుండను, ఆ తదుపరి ఎడమ ముక్కుగుండ ఒక గంటసేపును ప్రవహించును. ఇడపింగళలగుండ శ్వాస ప్రవహించునప్పుడు మనుష్యుడు ప్రాపంచిక విషయములలో ముణిగి తేలుచుండును.

సుషుమ్నగుండ ప్రవహించ సాగగానే, ప్రాపంచిక విషయము లేమియు లేనివాడై, సమాధిలో ప్రవేశించును. యోగియనువాడు. ఈ ప్రాణవాయువును సుషుమ్నానాడి ద్వారా ప్రవహించులాగునచేయుటకై, తన శక్తి కొద్దీ ప్రయత్నించును. దీనినే కేంద్రీయ బ్రహ్మనాడియనికూడ అందురు. ఈ సుషుమ్నకు ఎడమవైపున ఇడ, కుడివైపున పింగళయు గలదు. చంద్రుడు తమోగుణ స్వభావము, సూర్యుడు రజోగుణ స్వభావము గలవాడు. ఇందు విషభాగము సూర్యునిది, అమృతభాగము చంద్రునిది. ఈ ఇడ పింగళలు కాలమును తెలియజేయును. కాని సుషుమ్నయో, కాలమును లేకుండచేయును.

సుషుమ్న

నాడు లన్నిటిలోనను, సుషుమ్నానాడి అతి ప్రధానమైనది. ఏలనన, జగత్తునంతను భరించునది, మోక్షమార్గమును చూపునదీ, అదియే. ఇది గుదమునకు వెనుక భాగమున ప్రారంభమై, వెన్నెముకను అంటిపెట్టుకొని వుండి, తలయందలి బ్రహ్మరంధ్రమువరకు పోవును. ఇది చూచుటకు వీలుకానంత సూక్ష్మముగ వుండును. సుషుమ్న తన పనిని ప్రారంభించి నప్పటినుండి, యోగియొక్క నిజమగు కార్యక్రమము ప్రారంభమగును. ఇది వెన్నెముకయొక్క మధ్యభాగముగుండ పోవును. బొడ్డుకు క్రిందుగను, జననేంద్రియమునకు పైగను గ్రుడ్డు[పక్షి] ఆకారమువలె నుండు 'కాండము' గలదు. అచ్చటినుండియే డెబ్బది రెండువేల నాడులు బయలుదేరును. వీటిలో డెబ్బది రెండు సాధారణ మైనవిన్నీ, అందరికీ తెలిసినవిన్నీ. వీటిలో పది ప్రధాననాడులు గలవు. ఇవి ప్రాణశక్తిని గొంపోవుచుండును. వీటినే ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వ, పూష, యశస్విని, అలంబుస, కుహుశంఖిని అందురు. యోగులు,ఈ నాడులు, చక్రములను గురించి తప్పక తెలిసి కొనవలెను. ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ప్రాణశక్తిని గొంపోవుననిన్నీ, వాటి అధిష్ఠాన దేవతలు చంద్రసూర్యాగ్నులనిన్నీ చెప్పబడెను. సుషుమ్న గుండా ప్రాణము ప్రవహించునప్పుడు ధ్యానమునకు కూర్చొనుము.

సర్వశక్తులకు నిలయమగు కుండలినీ శక్తిని సుషుమ్న ద్వారా చక్రము తరువాత చక్రములోనికి ప్రవహింపజేయుచూ వచ్చినచో, వివిథములగు అనుభవములు, శక్తులు, ఆనందము లభించ గలవు.

కుండలిని *[1]

కుండలిని వెన్నెముకయొక్క మూలంలోగల మూలాధార చక్రంలో 3 1/2 చుట్లు చుట్టుకొని, ముఖమును క్రింది వైపుగా వుంచి నిద్రించుచుండు ఒకశక్తి. ఇది మేల్కొననిదే, సమాధి లాభం కలుగదు. ప్రాణాయామ సమయంలో కుంభకమువల్లపుట్టెడి వేడి, కుండనీ శక్తిని లేపి సుషుమ్నా నాడిగుండా పైకి పోవులాగున చేయును. ఇట్టి సాధకునకు అనేకవిధములగు దృష్టులు కలుగును. ఈ రీతిని సాధనచేయుటవల్ల క్రమక్రమంగా కుండలినీశక్తి, పైకి పైకిపోయి ఆరుచక్రములను దాటి, చివరకు శివునితోఐక్యమగును. ఈ శివుడు తలయందలి సహస్రదళములుగల సహస్రారమను పద్మమునందుండును. ఈ రీతిని శక్తి, శివుల ఐక్యము గలుగుటచే నిర్వికల్ప సమాధి లభించుటయేగాక, సాధకుడు మోక్షమును పొంది, సమస్తములగు దైవీసంపదలను పొందును. ప్రతివాడు ఏకాగ్రతతో కూడియున్న మనస్సుతో ప్రాణాయామమును చేయవలెను. ఏలనన, మణిపూర చక్రము వరకు తీసికొని పోబడిన కుండలినీ శక్తి, ఏకాగ్రత తప్పినచో మరల మూలాధారమున పడిపోవచ్చును. ఈ కుండలినిని, మేల్కొలుప దలచినవాడు వైరాగ్యమును, వాంఛారాహిత్యమును చక్కగా అభ్యసించవలెను. కుండలిని దారమువలెవుండి దేదీప్యమానముగ ప్రకాశించుచుండును. అది మేల్కొనినప్పుడు, కర్రతో పామునుకొట్టినచో, ఏవిధముగా బుసకొట్టునో ఆ రీతిని బుసకొట్టుచూలేచి, సుషుమ్నా రంధ్రమున ప్రవేశించును. ఇది క్రమక్రమముగ ఒక చక్రము తరువాత మరొక చక్రములో ప్రవేశించుటవల్ల మనస్సుయొక్క పొరలు విడిపోయి, అనేక సిద్ధులు పొందును.

షట్చక్రములు *[2]

చక్రములు అన, ఆధ్యాత్మిక శక్తికేంద్రములు. అవి లింగ శరీరమునందు వున్నప్పటికీ, స్థూలశరీరముతో సంబంధ మును కలిగియున్నవి. వీటిని యీ కండ్లతో చూడజాలము. వాటిని దివ్య (యోగ) దృష్టిచే మాత్రమే చూడగలము. వీటిలో ఆరు ప్రధానచక్రములు. 1. మూలాధారము, గుదము వద్ద 4 దళములు గలిగి యుండుట. 2. స్వాధిష్ఠాన (6దళములు) ము. జననేంద్రియమువద్ద వుండును. 3. మణిపూరము(10 దళములు)బొడ్డువద్ద. 4. అనాహతము (12దళములు) హృదయమువద్ద. 5. విశుద్ధము (16 దళములు) గొంతువద్ద. 6. ఆజ్ఞాచక్రము(2 దళములు) రెండు కనుబొమల మధ్య వుండును. ఏడవచక్రము తలపైగల వెయ్యిదళములుగల సహస్రారము. త్రికాస్థిప్రదేశము(SACRAL PLEXUS) ను మూలధారమనియు, శుక్రాశయ ప్రదేశమును (PROSTATIC PLEXUS) స్వాధిష్ఠానమనియు, సౌరప్రదేశమును (SOLAR PLEXUS) మణిపూర చక్రమనియు, హృదయప్రదేశమును (CARDIAC PLEXUS) ఆనాహతచక్రమనియు, గొంతుప్రదేశమును (LARYNGEA PLEXUS) విశుద్ధచక్రమనియు, (CAVERNOUS PLEXUS) ను ఆజ్ఞాఅచక్రమనియు పిలువవచ్చును.

నాడులు

నాడులు ప్రాణ ప్రవాహములను గొంపోవు, సూక్ష్మపదార్థములచే చేయబడిన సూక్ష్మ నాళములు. వీటిని దివ్య దృష్టితో మాత్రమే చూడ గలము. ఇవి మజ్జాతంతులు కావు. ఇవి 72 వేలు. వీనిలో ఇడ, పింగళ, సుషుమ్నలు ముఖ్యమైనవి. వీటి మూటిలో సుషుమ్న ముఖ్యమైనది.

నాడీశుద్ధి

ప్రాణాయామము - ఆన, ప్రాణము - అపానములు రెండూ కలియుట అని చెప్పియుంటిమి. ఇది మూడు విధములు. గాలి విడచుట, గాలి పీల్చుట, గాలిని ఆపు జేయుట, దీనినే సంస్కృతములో 'ప్రణవము' అని కూడ అందురు. పద్మాసనములో కూర్చొని, నాసాగ్రముపై దృష్టిని నిలపి, ఎఱ్ఱటి రంగుతో, అనంతమైన కిరణములతో కూడియుండి, హంసపై ఎక్కి, చేతిలో ఒక కఱ్ఱను గలిగియుండి, చంద్రుని వలె ప్రతిబింబము గలిగి యుండు బాలికయగు గాయత్రీ దేవిని, సాధకుడు ధ్యానించ వలెను. 'అ'కారము ఆమెయొక్క సంజ్ఞ. 'ఉ' కారము సావిత్రికి; ఈమె తెల్లటి ఆకృతి గలిగి చేతిలో ఒక గుండ్రని చక్రమువంటి బిళ్ళను గలిగియుండి, గరుత్మంతునిపై ఎక్కియుండు యువతి. 'మ" కారము సరస్వతికి సంజ్ఞ. ఈమె నల్లటి ఆకృతి గలిగియుండి, ఎద్దుపై ఎక్కి త్రిశూలమును చేతిలో గలిగియుండు వృద్ధ వనిత.

సాధకుడు ప్రతి (ఓంకారముయొక్క) అక్షరము(అ, ఉ, మ)ను ధ్యానించవలెను. గాలిని 'ఇడ' గుండా 16 మాత్రల కాలమువరకు పీల్చ వలెను. ఆసమయమున 'అ' కారమును ధ్యానించవలెను. అటుల పీల్చిన గాలిని 64 మాత్రల కాలము, లోపల ఆపియుంచి, ఆసమయమున 'ఉ' కారమును ధ్యానించ వలెను.తదుపరి 32 మాత్రల కాలమువరకు, పీల్చిన గాలిని విడచుచూ, 'మ' కారమును ధ్యానించ వలెను. ఈ రీతిని ఒకదాని తరువాత ఒకటిగా అభ్యసించవలెను.

ఆసనశుద్ధి పొందిన తరువాతను, ఆత్మ సంయమములో విజయమును సంపాదించిన పిమ్మటను, యోగి సుషుమ్నా నాడిలో గల అపరిశుద్ధతలను పార ద్రోలుటకై, పద్మాసన మందు కూర్చొని, ఎడమ ముక్కు నుండి గాలిని పీల్చి, ఆప గలిగినంత సేపటి వరకు గాలిని లోపల ఆపుజేసి, ఆ పిమ్మట కుడిముక్కు గుండా గాలిని విడువ వలయును. ఆ పిదప కుడి ముక్కునుండి గాలి పీల్చి, లోపల ఆపగలిగినంత సేపు ఆపి, ఎడమ ముక్కుగుండా గాలిని విడువ వలెను. ఈ రీతిని గాలిని విడచిన ముక్కుతో గాలి పీల్చుచూ, పైన చెప్పిన విధముగా చేయుచూ, రావలెను. పైన చెప్పినరీతిని క్రమ ప్రకారము అభ్యసించినచో మూడు మాసములలో నాడీ శుద్ధి కలుగును. ఆ పిమ్మట 4 వారములు పాటు, రోజుకు 80 మారులు సూర్యోదయ మధ్యాహ్న సూర్యాస్తమయ అర్ధరాత్రి సమయములందు గాలిని కుంభించుటను క్రమ క్రమముగ అభ్యసించుచూ రావలెను. ఇటుల చేయుటవలన ప్రారంభదశలో శరీరమునకు చెమట పోవుటయు, మధ్యమ స్థితిలో శరీరకంపనమును, చివరస్థితిలో గాలిలో శరీరము తేలిపోవుటయు జరుగును. ఇవి పద్మాసనములో కూర్చొని గాలిని ఆపుటపై ఆధారపడి యుండును. చెమట పోసినప్పుడు, చెమటను శరీరమున కంతకును రుద్దవలెను. ఇటుల చేయుటచే శరీరమునకు కాంతి, దృడత్వములు ప్రాప్తించును. ప్రారంభస్థితిలో వున్న సాధకుడు పాలు నెయ్యితో కలసియున్న ఆహారమును గైకొనుట లాభకారి. ఈ ఆహారనియమమును పాటించిన వానికి శరీరదార్డ్యము లభించును. అంతేగాదు, శరీరమున మంటలు(తాపము) పుట్టవు. సింహములు, ఏనుగులు, పులులు లాటి భయంకర జంతువులను క్రమక్రమముగ మచ్చిక చేసికొన గలిగిన రీతిని, జాగ్రత్తతో క్రమక్రమముగ ప్రయత్నించినచో ఈ శ్వాసనుకూడ వశపరచుకొన గలము.

ప్రాణాయామాభ్యాసము వలన నాడీశుద్ధి, శరీరకాంతి, జఠరాగ్ని, చక్కని ఆరోగ్యము, ప్రాణనాదములను వినగలుగుట లభించును. క్రమప్రకారము సరిగా ప్రాణాయామాభ్యాసము చేయుటచే, నరములకూటములు పరిశుభ్రమైనవై, వాయువును సుషుమ్న వైపు పోవునటుల చేయును. మెడయందలిస్నాయువులు, అపానవాయువు ఈరెండు ఒత్తిపట్టి యుంచుటచే ప్రాణవాయువు తప్పని సరిగ సుషుమ్నలో ప్రవేశించుటకు ప్రయత్నించును. ఈ సుషుమ్న ఇడ పింగళలకు మధ్యగనుండును. కొంతసేపు ఇడ, కొంతసేపు పింగళ నాడులలో సంచరించు ఈ ప్రాణ వాయువును కుంభకమువల్ల ఆపుజేయవలెను. ఇటుల చేయుటచే తప్పని సరిగ ప్రాణవాయువును సుషుమ్నా నాడిలో సంచరించులాగునచేసి, యోగి ప్రపంచముతో సంబంధము లేనివాడుగ అగును. దీనినే సమాధి అందురు. ప్రాణవాయువును క్రింద అదిమిపట్టి, అపానవాయువును పీల్చుటవలన యోగి ముసలితనమును పొందక, పదునారేండ్ల యువకునివలె అగును. ప్రపంచమునందలి ఏ వైద్యశాస్త్రము కుదుర్చని మొండివ్యాధులన్నియు, ప్రాణాయామమువలన మొదలంట నాశనమగును.

నాడీశుద్ధి కలిగినటుల తెలిసికొనుటకు, కొన్ని బాహ్య చిహ్నములు గలవు. శరీరము తేలికయగుట, శరీరకాంతి, జఠరాగ్ని వృద్ధియగుట, శరీరము సన్నబడుట, శరీరము అవిరామముగ బాధ నొందకుండుట, ఇవన్నియు నాడీశుద్ధి కలిగినదని తెలిసికొనుటకు గుర్తులు.

షట్కర్మలు

లావుగా శ్లేష్మ తత్వమును కలిగియున్నవారు, మొట్టమొదట షట్క్రియలను అభ్యసించి, ఆపిదప ప్రాణాయామమును అభ్యసించినచో, సులభముగ విజయము లభించగలదు. 1. ధౌతి 2 వస్తి 3 నేతి 4 త్రాటకము 5 నౌలి 6 కపాల భాతి, అను ఈ ఆరింటిని షట్‌క్రియలు అందురు.

ధౌతి

బెత్తెడు వెడల్పు, 15 అడుగుల పొడవుగల సన్నని పరిశుభ్రమైన గుడ్డపీలికను తీసికొనుము. గోరువెచ్చని నీటిలో దానిని ముంచుము. ఈ గుడ్డయొక్క అంచులను ఏమాత్రపు నూలుపోగుకూడ యివతలికి లేకుండులాగున జాగ్రత్తగ కుట్టించుము. ఆ పిమ్మట ఆ గుడ్డ పీలికను లోపలికి మ్రింగి, తరువాత బయటకు లాగుము. మొదటిరోజున ఒక అడుగు పొడవుగల పీలికను లోపలికి మ్రింగుము; ఆ పిమ్మట ప్రతిరోజు కొంచెము కొంచెము ఎక్కువగ మ్రింగుచుండుము. దీనిని వస్త్రధౌతి అందురు. మొదట, రెండురోజులు కొద్దిగా డోకు వచ్చినట్లు వుండును. మూడవనాడు తగ్గిపోవును. ఈ అభ్యాసమువల్ల అన్ని విధములగు పొట్టకు సంబంధించిన జబ్బులు (మలబద్ధము మొ) త్రేయ్పలు, జ్వరము, నడుము శూల, ఉబ్బసము, ప్లీహ, కుష్ఠు, చర్మవ్యాధులు, కఫపైత్య వ్యాధులు నివారణమగును. దీనిని ప్రతినిత్యము చేయనక్కరలేదు. వారమునకు ఒకమారుగాని, పదిహేనురోజులకు ఒకమారుగాని చేయవచ్చును. ఈ గుడ్డను సబ్బుతో కడిగి ఎల్లప్పుడు పరిశుభ్రముగ వుంచుము. అభ్యాసము ముగిసిన తరువాత ఒక గ్లాసెడు పాలు త్రాగుము.

వస్తి

దీనిని వెదురుగొట్టము సహాయముతోగాని, అది లేకుండగాని చేయవచ్చును. కాని వెదురుగొట్టము సహాయముతో చేయుట మంచిది. ఒకనీటి తొట్టిలో బొడ్డువరకు నీటిలో ముణుగులాగునకూర్చొనుము. శరీరము యొక్క బరువు అంతయు కాలివ్రేళ్ళ యొక్కముందు భాగముపైనిలచు లాగునను, మడమలు పిఱ్ఱలను ఒత్తిపట్టి యుండులాగును ఉత్కటాసనములో కూర్చొనుము. 6 వ్రేళ్ళ అడ్డచుట్టు కొలతయు, 4 వేళ్ళ (బెత్తడు) పొడగున గల, చిన్న వెదురు గొట్టమును తీసికొనుము. దానికి VASELINE వాజులైను లేక సబ్బులేక ఆముదమును రాచి నునుపుగా వుండు లాగున చేసి గుదములో దూర్చుము. తరువాత గుదముతో దానిని బిగియ బట్టుము. ఆపిమ్మట నెమ్మదిగా ప్రేవులలోనికి నీటిని లాగుము. ప్రేవులలో, యీలోపలికి తీసికొనిన నీటిని కలియ బెట్టుము. ఆ పిదప ప్రేవులలోనికి తీసికొనిన నీటిని బయటకు వదలుము. దీనిని జలవస్తి అందురు. ఇది ప్లీహ, మూత్ర సంబంధమైన, గుల్మము, స్నాయు సంబంధమైన వ్యాధులను, జలోదరము, జీర్ణకోశమునకు సంబంధించిన వ్యాధులు, ప్రేవులకు సంబంధించిన వ్యాధులు, పైత్య శ్లేష్మ వ్యాధులను నివారించును. ఈక్రియను పొట్ట ఖాళీగా వున్నప్పుడు ప్రొద్దుటి సమయమున చేయవలెను. ఈ క్రియ అయిన వెంటనే ఒక గ్లాసెడు పాలుగాని; అన్నముగాని తినుము. ఈ క్రియను నదిలో నిలువబడి కూడ చేయవచ్చును.

నీటి సహాయము లేకుండా వస్తి క్రియను చేయుటకు మరొక మార్గముగలదు. దీనిని స్థలవస్తి అందురు. నేలపైన పశ్చిమోత్తా నాసనములో కూర్చొనుము. పొత్తికడుపు, మూత్రాశయ భాగములను గిరగిర త్రిప్పుము. ఇది మలబద్ధమును పోగొట్టుటే గాక పొత్తికడుపుకు సంబంధించిన అన్ని వ్యాధులను పోగొట్టును. కాని, యిది జలవస్తితో సమానమగు లాభకారి కాదు.

నేతి

ముళ్ళు ఏమియూ లేనట్టి 1/2 మూరెడు పొడవుగల సన్నని దారమును తీసికొనుము. దానిని మెల్ల మెల్లగా ముక్కులలో నుంచి లోపలికి పోవులాగున దూర్చి, నోటిలో నుంచి బయటకులాగుము. దీనిని ఒక ముక్కులో నుంచి దూర్చి, మరివక ముక్కులో నుంచి లాగి కూడ చేయవచ్చును. ఇది కపాలమును శుభ్రపరచి, చక్కని దృష్టిని కలిగియుండు లాగున చేయును. ఈ క్రియవల్ల పడిశెము, పీనసలు నివారణయగును.

త్రాటకము

రెప్పవాల్చ కుండ ఏకాగ్రతగల మనస్సుతో కండ్ల నుండి నీరుకారు నంత వరకు, ఏదైన చిన్ని వస్తువుపై దృష్టి నిలపి చూడుము. ఇందువలన అన్నిరకములగు కంటివ్యాధులు పోవును. మనస్సుకు గల చంచలత్వము పోవును. శాంభవీ సిద్ధి ప్రాప్తించును. ఇచ్ఛాశక్తి వృద్ధి అగును. దివ్యదృష్టి లభించును.

నౌలి

ఋజు స్నాయువుల సహాయముతో పొత్తి కడుపును గిరగిర త్రిప్పుటను నౌలి క్రియ యందురు. తలను క్రిందికి వంచుము. ఋజు స్నాయువు (RECTUS MUSCLE) ను రెండు భాగములుగ జేసి, కుడినుండి ఎడమకు, ఎడమనుండి కుడివైపుకు త్రిప్పుము. ఇది మలబద్ధమును పారద్రోలి, జఠరాగ్నిని పెంపొందింప జేసి, మూత్రాశయ వ్యాధులను అన్నింటిని తొలగించును.

కపాలభాతి

కమ్మరవాని కొలిమి తిత్తులవలె త్వరత్వరగ రేచకమును పూరకమును చేయుము. ఇది అన్నివిధములగు శ్లేష్మవ్యాధులను పోగొట్టును. దీనిని గురించిన పూర్తి వివరములు మరొకచోట యివ్వబడినవి.

____...____

  1. * పూర్తి వివరములకు నా 'కుండలినీ యోగము' ను చదువుడు.
  2. * పూర్తివివరములకు 'కుండలినీ యోగము' చూడుము.