ప్రసార ప్రముఖులు/స్వర సుధాకరులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వర సుధాకరులు

సినిమారంగంలో తెరమీద కనిపించే నటులకున్న ప్రాధాన్యం తెరవెనుక వున్న కళాకారులకు ప్రేక్షకుల్లో వుండదు. ఆకాశవాణిలో కూడా నిత్యం తమ కంఠస్వరాన్ని వినిపించే అనౌన్సర్లకున్న ప్రాముఖ్యం శ్రోతలలో మిగతా కార్యక్రమ నిర్వాహకులకుండదు. ఒక్కొక్కసారి కొందరు అడుగుతుంటారు. ' స్టేషన్ డైరెక్టర్‌కు అనౌన్సరు ప్రమోషన్ రావాలంటే ఎన్నేళ్లు పడుతుందని? ' వాళ్ళ దృష్టిలో అనౌన్సరు చాలా ప్రధాన వ్యక్తి.

నిజానికి ప్రసార సమయంలో అనౌన్సరు అష్టావధానిలా ప్రవర్తించాలి. సమయస్ఫూర్తి మరీ అవసరం. పొరబాట్లను కప్పిపుచ్చగలడు, సృష్టించగలడు. కుంభవృష్టి కురుస్తున్నా, తుఫాను బీభత్సం సంభవించినా రాత్రింబవళ్ళు డ్యూటీలు చేసే ప్రధాన పాత్రధారి అనౌన్సరు. శ్రోతలు కోరిన పాటలు మొదలు అనేక కార్యక్రమాల ద్వారా శ్రోతలకు చిరపరిచితుడు.

మదరాసు కేంద్రంలో తొట్ట తొలి తెలుగు అనౌన్సరు మల్లంపల్లి ఉమామహేశ్వరరావు. 'ఉమ' పేరుతో కార్యక్రమాలలో పాల్గొనేవారు. ఆయన ప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారి సోదరులు. మదరాసు కేంద్ర అనౌన్సర్లలో భానుమతి (సినీ భానుమతికాదు) ప్రసిద్ధులు. ప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్‌గారు కూడా మదరాసు కేంద్రంతో అనుబంధం ఉన్నవారే. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం మహిళా విభాగంలో కార్యక్రమ రూపకల్పనలో పాల్గొన్న యువతీమణులలో శ్రీమతి V. S. రమాదేవి పేర్కొనదగినవారు. వీరు 1964లో కేంద్ర న్యాయ సర్వీసులో చేరి 1985-92 మధ్య కాలంలో కేంద్ర లా సెక్రటరీగా వ్యవహరించారు. కొంతకాలం ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసి 1993 జులై నుండి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పనిచేస్తున్నారు. రేడియోతో తమ అనుబంధాల్ని గొప్పగా చెప్పుకొనే వ్యక్తులలో వీరొకరు. వీరు అనేక గ్రంథాలు వ్రాశారు. పంకజం, దారితప్పిన మానవుడు, అందరూ మనుసులే వీరు వ్రాసిన నవలలు. నా కరిగిపోయే కలలు వీరి మ్యూజింగ్స్ రచన

హైదరాబాదు కేంద్రం 1950 లో డెక్కన్ రేడియోతో విలీనమైంది. తెలుగు కార్యక్రమాల ప్రకటనకు అనౌన్సర్లు రిక్రూట్ అయ్యారు. రతన్‌ప్రసాద్, వట్టం సత్యనారాయణ మూడు దశాబ్దాలపాటు అనౌన్సర్లుగా పనిచేసి తమ ముద్ర వేశారు. కార్మికుల కార్యక్రమంలో Family Serialలో వీరు ప్రధాన పాత్రలు పోషించారు. భువనేశ్వరి, ఇందిరాదేవి, నిర్మలావసంత్, ఇలియాస్ అహమ్మద్, M. N. శాస్త్రి, జ్యోత్స్న, శేషారత్నం, పండా శమంతకమణి తమ సుమధుర కంఠాల ద్వారా శ్రోతలకు చిరపరిచితులు. జ్యోత్స్న అనౌన్సర్ నుండి తెలుగు న్యూస్ రీడర్‌గా విజయవాడలో పనిచేసి ప్రస్తుతం హైదరాబాదు వార్తా విభాగంలో ఉన్నారు. అలానే దివి వెంకట్రామయ్య చక్కని రచయిత, నవలలు, కథలు వ్రాశారు. పండా శమంతకమణి తెలుగులో వ్రాసిన రామకథకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. శ్రీమతి M. G. శ్యామలాదేవి రేడియో నాటక విభాగంలో మూడు దశాబ్దాలు పనిచేసి. పదవీ విరమణ చేశారు. E. కపర్ది సౌజన్యంగల వ్యక్తి. మల్లాది చంద్రశేఖర్, సాధన చక్కటి నైపుణ్యం గల వ్యక్తులు.

హైదరాబాదు వివిధభారతి, వాణిజ్య ప్రసార విభాగంలో అనౌన్సర్లుగా పనిచేస్తున్నవారు బహుముఖ ప్రతిభావంతులు. సర్వశ్రీ ఉమాపతి బాలాంజనేయశర్మ, ఆకెళ్ళ సత్యనారాయణమూర్తి, సీత, ఇందిరా బెనర్జీ, మట్టపల్లి రావు, రాజగోపాల్, రూప్‌లాల్ ఆ యా రంగాలలో కృషి చేశారు. ఆకెళ్ళ దంపతులలో సత్యనారాయణమూర్తి అనారోగ్యంతో కాలధర్మం చెందారు. ఆయన చాలా టి. వి. నాటకాలలో నటించారు. బాలంజనేయశర్మ వాక్శుద్దిగల పండితుడు. మట్టపల్లి రావు రూపొందించిన రూపకాలకు జాతీయస్థాయిలో ఆకాశవాణి బహుమతులు లభించాయి. ఇందిరా బెనర్జి సంపన్న కుటుంబంలో జన్మించి ఆకాశవాణి పట్ల అభిమానంతో పని చేస్తున్నారు. పుష్పలత అనే అనౌన్సరు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా UPSC ద్వారా సెలక్టు అయి కొంతకాలం దూరదర్శన్‌లో పనిచేసి రాజీనామా చేశారు.

విజయవాడ కేంద్రంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అనౌన్సర్లు లబ్ద ప్రతిష్టలు. సర్వశ్రీ కూచిమంచి కుటుంబరావు, శ్యామసుందరి, లత, కమలకుమారి, A. B. ఆనంద్, పేరి కామేశ్వరరావు, కోకా సంజీవరావు, A. లింగరాజు శర్మ, వెంపటి రాధాకృష్ణ కేవలం అనౌన్సర్లుగానే గాక ఇతర కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధి పొందారు. కుటుంబరావు చక్కటి కంఠస్వరం గల వ్యక్తి. వీరు నటించిన నాటిక నేడు నాటకం రసవత్తరంగా సాగింది. లత రచయిత్రిగా పేరు తెచ్చుకొన్నారు. డ్రామా వాయిస్‌లుగా సర్వశ్రీ సి. రామమోహనరావు, నండూరి సుబ్బారావు, వి. బి. కనకదుర్గ, సీతారత్నమ్మ ప్రముఖులు. ఈ తరం అనౌన్సర్లలో సర్వశ్రీ M. వాసుదేవమూర్తి, పన్నాల సుబ్రహ్మణ్యభట్, S. B. శ్రీరామమూర్తి, D. S. R. ఆంజనేయులు ప్రముఖులు. వాసుదేవమూర్తి సెలక్షన్ గ్రేడ్ అనౌన్సరుగా పనిచేస్తున్నారు. ఈయన రూపొందించిన రైలు ప్రయాణం నాటకం ఆకాశవాణి వార్షిక పోటీలలో జాతీయస్థాయి బహుమతి పొందింది. పన్నాల సుబ్రహ్మణ్యభట్ కొంతకాలం మహిళా శిశువిభాగం ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. చెణుకులు కార్యక్రమం ద్వారా శ్రోతలకు పరిచితులు, చక్కని రచయిత, విమర్శకులు రేడియో ప్రసారాలపై ప్రసార తరంగిణి ప్రచురించారు. జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. మంచి చిత్రకారుడు. శ్రీరామం విశ్శబ్ద గమ్యం, మెట్లు, మహావిశ్వ రూపొందించి జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు.

మల్లాది సూరిబాబు గాత్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు. వీరి కుమారులు మల్లాది శ్రీరాం ప్రసాద్ చక్కని గాత్రం గల వ్యక్తి. విజయవాడ కేంద్రంలో తంబురా కళాకారుడుగా ఎన్నికయ్యారు. యువతరం అనౌన్సర్లలో సర్వశ్రీ విజయకుమారి, E. V. కృష్ణశాస్త్రి, శారద జయప్రకాష్, కామేశ్వరి, S. శారద, మాడుగుల రామకృష్ణ గణనీయమైన సేవ చేస్తున్నారు.

కడప కేంద్రం 1963లో ప్రారంభమైనపుడు అనౌన్సర్లుగా సర్వశ్రీ గాడిచర్ల శ్రీనివాసమూర్తి, గుర్రం కోటేశ్వరరావు నియుక్తులయ్యారు. శ్రీనివాసమూర్తి ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు కుటుంబానికి చెందినవారు. కోటేశ్వరరావు న్యాయవాద పట్టా పుచ్చుకొన్నారు. ఇద్దరూ మూడు దశాబ్దాలు పనిచేసి రిటైరయ్యారు. ఆరవీటి శ్రీనివాసులు కొంతకాలం అనౌన్సరుగా పనిచేసి తర్వాత జానపద విభాగం ప్రొడ్యూసరయ్యాడు. తర్వాత అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరయ్యారు. గోపి, రమణమోహన్, వనజారెడ్డి, మంజుల సుమనోహర్ కంఠస్వరం గల యువతీయువకులు.

విశాఖపట్టణం కేంద్రంలో అనౌన్సర్లుగా శ్రీ A. V. S. రామారావు, కుమారి కామాక్షమ్మ, శ్రీమతి కుమారి ప్రముఖంగా చెప్పుకోదగినవారు. రామారావు మంచి నటులు, ప్రయోక్త. అద్దంకి మన్నార్ అనౌన్సర్‌గా విజయవాడలో పనిచేస్తూ డిల్లీ తెలుగు విభాగం న్యూస్ రీడర్‌గా వెళ్ళారు. నండూరి విఠల్ అనౌన్సర్‌గా విజయవాడలో పనిచేసి తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి దూరదర్శన్ కేంద్ర డైరక్టరయ్యారు. శారదా శ్రీనివాసన్ అనౌన్సరుగా తొలుత జీవనం ప్రారంభించి తర్వాత డ్రామా వాయిస్‌గా హైదరాబాదులో రెండున్నర దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఇతర కేంద్రాలలో వర్దిష్టులైన అనౌన్సర్లు పనిచేస్తున్నారు. నిర్దుష్టమైన ఉచ్చారణ, సమయోచిత మార్పులు గమనించగల సామర్థ్యం అనౌన్సర్ల కవసరం. దాదాపు 80 మంది దాకా ఆంధ్రదేశంలో అనౌన్సర్లు పనిచేస్తున్నారు. వీరిలో ప్రతిభావంతులు ఉన్నత విద్యావంతులు అనౌన్సర్లుగా చేరడం విశేషం. అనంతపురం కేంద్రంలో డా. వి. పోతన, కె. పుష్పరాజ్ పనిచేస్తున్నారు. పోతన తెలుగులో పిహెచ్.డి. చేశారు. పుష్పరాజ్ బి. ఏ. బి. ఎల్. పట్టభద్రులు. తిరుపతిలో పని చేస్తున్న P. అమృత, కొత్తగూడెంలో పనిచేస్తున్న రాజబాబు. యిలా ఎందరో ప్రతిభావంతులు. ఆకాశవాణి భవిష్యత్తు వీరి కృషిపై ఆధారపడి వుంది. అకుంఠిత దీక్ష, ఉద్యోగంపట్ల గౌరవం ప్రధాన లక్ష్యంగా పని చేయాలి.

ప్రసార దంపతులు

సినీ దంపతులుగా కృష్ణ-విజయనిర్మల, అంజలి-ఆదినారాయణరావు, రాజసులోచన-సి.యస్.రావు, నాగార్జున-అమల ఇలా ఎన్నో జంటలు. అలానే ప్రసార రంగంలో కొన్ని జంటలు నిర్విరామ కృషిద్వారా శ్రోతల్ని ఆకట్టుకొన్నారు. రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా పేరుగాంచిన న్యాపతి రాఘవరావు కామేశ్వరి అగ్రశ్రేణి ప్రసార దంపతులు.

తొలి తరానికి చెందిన శ్రీనివాసన్ దంపతులు, సుభద్రా శ్రీనివాసన్, శ్రీనివాసన్ దంపతులు విజయవాడ, కోహిమాలలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేశారు. సుభద్రగారు కోహిమాలో అనారోగ్యంతో మరణించారు. హైదరాబాదులో మరో శ్రీనివాసన్ దంపతులు పనిచేశారు. N. S. శ్రీనివాసన్ వేణుగానలోలురు. సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పదవీ విరమణ చేశారు. వీరి సతీమణి శారదా శ్రీనివాసన్ నాటక విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. హైదరాబాదులో