ప్రసార ప్రముఖులు/ఆంధ్రలో వివిధ కేంద్రాలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రలో వివిధ కేంద్రాలు

ఆకాశవాణి హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాలు చిరకాలంగా పనిచేస్తుండగా ఆరవ పంచవర్ష ప్రణాళికలో జిల్లా స్థాయి రేడియో కేంద్రాలు స్థాపించాలనే నిర్ణయానుసారం ఐదు కేంద్రాలు ప్రారంభించారు. తమిళనాడులోని నాగర్ కోయిల్ లో 1984 అక్టోబరులోను, ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ లో 84 లోను, మహారాష్ట్రలోని షోలాపూర్ లో, రాజస్థాన్ లోని కోటలో, ఒరిస్సాలోని ఖేన్ జర్ లో ఐదు కేంద్రాలు ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రసారం ఈ కేంద్రాల లక్ష్యం, జనజీవన స్రవంతిలో ప్రసార కేంద్రం ఒక భాగం కావాలని ప్రభుత్వ లక్ష్యం.

అదిలాబాదు :

హైదరాబాదు కేంద్ర ప్రసారాలు మారుమూల తెలంగాణా ప్రాంతమైన అదిలాబాద్ జిల్లాలో వినిపించడం లేదనే కారణంతో అదిలాబాద్‌లో 1 కిలోవాట్ ప్రసారశక్తి గల మీడియంవేవ్ కేంద్రాన్ని సాయంకాలం ప్రసారాలతో ప్రారంభం చేశారు. సి. రాజగోపాల్ తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా ఈ కేంద్రం హంగామా లేకుండా 12-10-1986లో ప్రారంభమైంది. అదిలాబాద్ ప్రాంతం జానపద సంగీతానికి ప్రసిద్ధి. యన్. యమ్. జి. రామకృష్ణ, కె. బి. గోపాలం (డైరక్టర్) అక్కడ పనిచేశారు. సుదూర ప్రాంతం కావడం, కనీస వసతులు లేకపోవడం వల్ల ఈ కేంద్రాన్ని 'difficult station' గా ఆకాశవాణి ప్రకటించింది. ఈ కేంద్రం మూడు గంటల స్వతంర కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. జిల్లా వరకే ఈ కార్యక్రమాలు పరిమితమైనా అదిలాబాద్ జిల్లా సువిశాలమైన జిల్లా కావడంవల్ల జిల్లా మొత్తంమీద శ్రోతలు ఈ కార్యక్రమాలు వినిపించడం లేదు. గత దశాబ్ది కాలంలో ఈ కేంద్రం గణనీయమైన ప్రగతి సాధించలేదు.

యఫ్. యం. కేంద్రాలు :

మీడియం వేవ్ కేంద్రాల బ్యాండుపై వందకుపైగా ప్రసార కేంద్రాలు రావడంతో 'జామ్‌' అయిపోయే క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దాన్ని అదిగమించడానికి, అంతర్జాతీయ ఫ్రీక్వెన్సీ సంస్థ వారిచ్చిన రెండు వందల ఫ్రీక్వెన్సీలు వాడుకోవలసి రావడం వల్ల భారత ప్రభుత్వం ఏడవ పంచవర్ష ప్రణాళికలో జిల్లా స్థాయి యఫ్. యం. కేంద్రాలను విశేషంగా ప్రారంభించారు.

కొత్తగూడెం :

భారతదేశంలోనే మొట్టమొదటి స్వతంత్ర F. M. కేంద్రాన్ని కొత్తగూడెంలో ప్రారంభించారు. సింగరేణి కాలరీస్ వారి సౌజన్యంతో భూ సేకరణచేసి రెండేళ్ళు కష్టపడి స్వతంత్ర భవనాలు, స్టూడియోలు రామవరం ప్రాంతంలో నిర్మించారు. కేంద్ర ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఢిల్లీనుండి తొలి డైరక్టర్‌గా డా|| ఆర్. అనంతపద్మానాభరావు ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. అప్పట్లో కేంద్ర పరిశ్రమల శాఖామాత్యులు శ్రీ జలగం వెంగళరావు చొరవతో ఖమ్మం జిల్లా శ్రోతల కలలపంటగా ఈ కేంద్రం ప్రారంభమైంది.

1989 మార్చి 24న కొత్తగూడెం మహిళా కళాశాలలో జరిగిన సభలో వెంగళరావు ఈ కేంద్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. 6 కిలోవాట్ల ప్రసారశక్తితో ఈ కేంద్రంప్రసారాలు జరుపుతోంది. రాష్ట్ర సమాచార శాఖామంత్రి శ్రీ కారుపాటి వివేకానంద ముఖ్య అతిధిగా విచ్చేశారు. చీఫ్ యింజనీర్లు కె. పి. రామస్వామి, యం. జె. విశ్వనాథం, డిప్యూటీ డైరక్టర్ జనరల్ టి. ఆర్. మాలాకర్ కార్యక్రంలో పాల్గొన్నారు. స్వతంత్ర కేంద్రంగా కేవలం సాయంకాలం మూడున్నర గంటల ప్రసారాలతో తొలుత ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయ ప్రసారాలు కూడా ఆరంభమయ్యాయి. శ్రీ యన్. సి. గోవర్ధన్, A. S. D. శ్రీ యన్. యం. జి. రామకృష్ణ, కబీర్ అహమ్మద్ డైరక్టర్లుగా ఈ కేంద్రం ముందుకు సాగింది. శ్రీ వై రాఘవులు ఈ కేంద్రం బాధ్యతలు 93లో స్వీకరించారు. ఈ కేంద్రం సమర్పించిన 'కిన్నెరసాని' రూపకానికి జాతీయ స్థాయి బహుమతి లభించింది. ఇతర జిలా కేంద్రాలవలె కాక ఇది NON-Local శ్తేషన్. ఇందులో కడప, విశాఖపట్టణం కేంద్రాలవలె సంగీత కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

నిజామాబాద్ :

తెలంగాణా జిల్లాలలో నిజామాబాద్‌లో ప్రసార కేంద్రాన్ని అప్పట్లో కేంద్ర ప్రసార సమాచార శాఖామంత్రి పర్వతనేని ఉపేంద్ర ప్రారంభించారు. 1990 సెప్టెంబరు 9న ఈ కేంద్రం ప్రారంభించారు. శ్రీ యం. నిత్యానందరావు డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాయం ప్రసారాలు మాత్రమే ఈ F. M. కేంద్రాల ద్వారా ప్రసారమవుతున్నాయి. శ్రీ ప్రహరాజు పాండురంగారావు అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా పని చేశారు. 1996 ఆగస్టు నుండి ప్రయాగ వేదవతి అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు.

వరంగల్ :

కాకతీయ సామ్రాజ్య ప్రాచీన వైభవాలకు నెలవైన ఓరుగల్లు అనబడే వరంగల్లులో F. M. రేడియో కేంద్రం ప్రారంభమైంది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించడం ఈ కేంద్ర లక్ష్యం. కాకతీయ విశ్వ విద్యాలయానికి ప్రధాన కేంద్రమైన వరంగల్‌లో రేడియో కేంద్రాన్ని అప్పట్లో కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి శ్రీ ఉపేంద్ర 17 ఫిబ్రవరి 1990న ప్రారంభించారు.


P. R. రెడ్డి, ఆర్. వెంకటేశ్వర్లు ఈ కేంద్రం డైరక్టర్లుగా ప్రసారాల ప్రమాణం మెరుగుపరచడానికి విశేష కృషి చేశారు. డా. సి. మధుసూధనరావు 1994 నుండి అసిస్టెంట్ డైరక్టర్‌గా ఈ కేంద్రం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా జిల్లాలలో ఇది నాలుగో కేంద్రం. (అదిలాబాదు, నిజామాబాద్, కొత్తగూడెం, వరంగల్)

రాయలసీమ కేంద్రాలు :

అనంతపురం :

అనంతపురం ఆకాశవాణి F. M. కేంద్రం 1991 మే 29న లాంచనంగా ప్రారంభమైంది. తొలి డైరక్టర్‌గా డా. ఆర్. అనంతపద్మణాభరావు ఆ కేంద్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. పాత్రికేయులు కాశీపతి మాటల్లో చెప్పాలంటే క్షణాక్షణాభివృద్ధికి యత్నించారు. R. V. రమణమూర్తి, కళా కృష్ణమూర్తి, విద్యాలంకార్ తొలినాళ్ళలో కార్యక్రమ నిర్వాహకులు, U. V. S. R. ఆంజనేయులు కేంద్రం ఇన్‌స్టేలేషన్ ఆఫీసర్‌గా కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. K. S. శాస్త్రి తొలి స్టేషన్ యింజనీర్. ఈ కేంద్రం అసిస్టెంట్ డైరక్టర్లుగా ఆరవీటి శ్రీనివాసులు, డా. టి. మాచిరెడ్డి పని చేశారు. అనంతపుర సాంస్కృతిక వికాసానికి ఈ కేంద్రం కృషి చేస్తోంది. కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ యిక్కడే వుండటం ఈ కేంద్రానికి ఆయువుపట్టు. ఇక్కడ పనిచేసిన నాగసూరి వేణుగోపాల్ చక్కని రచయిత. సైన్సు విషయాలపై కృషి చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ బదిలీ అయ్యారు.

తిరుపతి :

శ్రీ వేంకటేశ్వరునికి నెలవైన తిరుపతిలో 1991 ఫిబ్రవరి 1న F. M. కేంద్రాన్ని అప్పటి ప్రసారమంత్రి సుబోద్ కాంత్ సహాయ్ ప్రారంభించారు. తొలి డైరక్టర్ గా యు. రాసయ్య, ఆ తర్వత శ్రీమతి విజయలక్ష్మి సౌందర రాజన్ పనిచేశారు. ఆ తర్వాత సి. రాజారావు అసిస్టెంట్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 1995 లో తిరుమలలో జరిగే సుప్రభాత సేవను ఉదయం 2-30 గం. ల నుండి ప్రత్యక్ష ప్రాసారం చేస్తున్నారు. తిరుమలలో జరిగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ కేంద్రం ప్రసార మాధ్యమం.

కర్నూలు :

1992 మే 1న అప్పటి కేంద్రన్యాయ శాఖామాత్యులు శ్రీకోట్ల విజయభాస్కర రెడ్డి ఈ కేంద్రం ప్రారంభించారు. శ్రీ యన్. పి. గోవర్థన్ ఈ కేంద్రం తొలి డైరక్టరు. శ్రీశైలంలో జరిగే కార్యక్రమాల ప్రసారాలకు ఈ కేంద్రం ప్రాధాన్యత నిస్తున్నది. ఇది F. M. కేంద్రం.

మార్కాపురం :

ఒంగోలు జిల్లాలోని మార్కాపురంలో 1993లో ఆగస్టు 9న F. M. కేంద్రాన్ని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. విజయభాస్కరరెడ్డి ప్రారంభించారు. తొలి అసిస్టెంట్ డైరక్టరు Y. హనుమంతరావు. వీరి తర్వాత కె. వి హనుమంతరావు రెండేళ్ళు ఆ బాధ్యతలు స్వీకరించారు. ఈ కేంద్రం స్థాపనతో ఆంధ్రప్రదేశ్‌లో 12 రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. గుంటూరు జిల్లా మాచెర్లలో మరో F. M. కంద్ర స్థాపనకు స్థలసేకరణ పూర్తి అయింది.