ప్రసార ప్రముఖులు/దూరదర్శన్ కేంద్రం
దూరదర్శన్ కేంద్రం
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం తెలుగువారి ఆశాజ్యోతిగా SITE కార్యక్రమాలతో ప్రారంభమైంది. తొలినాళ్ళలో ఆడియన్స్ రిసెర్చి ఆఫీసర్ శ్రీ బి. యస్. యన్. రావు ఈ కార్యక్రమంలో పనిచేశారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో కొంత భాగానికి ఈ ప్రసారాలు పరిమితం. Sattelite Instruction Television Experiment పేర ఈ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. పాఠశాల విద్యార్థుల కుద్దేశించిన ఈ ప్రసారాలు కొంతవరకు ప్రయోజనాన్ని సాధించాయి.
దూరదర్శన్ తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడంతో తెలుగువారి సాంస్కృతిక వికాసానికి మరింత అవకాశం లభించింది. హైదరాబాదులోని రాజభవన్ రోడ్‌లో అద్దె బంగళాలో ఈ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్ళలో నండూరి విఠల్ డైరక్టర్‌గా కార్యక్రమాల రూపకల్పన చేశారు. నండూరి విఠల్ అద్భుతగాత్ర గాంభీర్యం గలవ్యక్తి. నాటకాలలో చక్కటి అనుభవం గల శ్రావ్య, మైనకంఠం. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా జీవనం ప్రారంభించి స్టేషన్ డైరక్టర్‌గా అనారోగ్య కారాణాలతో 1986 ప్రాంతాలలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అస్వస్థులుగా వుండి 93 ప్రాంతాలలో కాలం చేశారు. ప్రస్తుతం హైదరాబాదు కేంద్రం డైరెక్టర్.
వేదగిరి శర్మ, శ్రీ గోపాల్ దూరదర్శన్‌లో కార్యక్రమ నిర్వహకులుగా పనిచేశారు. ఇద్దరూ అకాలమరణం చెందడం విధి విలాసం. వడ్డాది అప్పారావు దూరదర్శన్ అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. 1940 జులై 14న జన్మించిన అప్పారావు దూరదర్శన్‌లో ప్రొడ్యూసర్‌గా 1963 లో చేరారు. ఆ తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ డైరక్టర్, డైరక్టరు హోదాలు నిర్వహించారు. దూరదర్శన్ డైరక్టరేట్ జనరల్ కార్యాలయంలో పనిచేశారు.
దూరదర్శన్ డైరక్టర్ జనరల్ కార్యాలయంలో పని చేసిన ఆంధ్రులలో దేవళ్ళ బాలకృష్ణ, హెచ్. యన్. పాత్రో, వి. వి. కృష్ణశాస్త్రి, విమలామిట్టల్, వి. అప్పారావు ప్రముఖులు.
హెచ్. యన్. పాత్రో ప్రవాసాంధ్రులు. 1933 జనవరి 13 న జన్మించిన పాత్రో వివిధ హోదాలలో ఆకాశవాణిలో హైదరాబాదు, జయపూర్ (ఒరిస్సా) కేంద్రాలలో పనిచేశారు. 1982లో డైరక్టరు అయి, 1987లో అహమ్మదాబాద్ దూరదర్శన్ కేంద్ర డైరక్టర్ అయ్యారు. 1991లో పదవీ విరమణ చేశారు.
దేవళ్ళబాలకృష్ణ 1933 సెప్టెంబర్ 6న జన్మించారు. లాపట్టా పుచ్చుకున్నారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి 1977 జనవరిలో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా కడప వెళ్ళారు. 1980 జులైలో డైరక్టర్‌గా విశాఖపట్టణం బదిలీఅయ్యారు. గ్యాంగ్‌టాక్, విశాఖపట్టణం కేంద్రాలలో పనిచేసి, దూరదర్శన్‌లో డైరక్టరేట్‌లో కంట్రోలర్ గా వెళ్ళారు. 1991 సెప్టెంబరులో హదరాబాద్ దూరదర్శన్ డైరక్టర్‌గా రిటైరయ్యారు. విశాఖపట్టణంలో స్థిరపడ్డారు.
C. రామానుజాచార్యులు 1937 సెప్టంబరులో జన్మించారు. ఆడియన్స్ రీసెర్చి ఆఫీసర్ గా చేరి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా UPSC ద్వారా ఎంపికయ్యారు. వివిధ కేంద్రాలలో పనిచేసి 1995 సెప్టెంబరులో గుల్బర్గా దూరదర్శన్ కేంద్రంలో డైరక్టర్‌గా రిటైరయ్యారు. టి. వి రాఘవాచార్యులు దూరదర్శన్‌లో వివిధ కేంద్రాలలో పనిచేసి భోపాల్ దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. R. R. K. శ్రీ డిప్యూటీ డైరక్టర్‌గా దూరదర్శన్‌లో పనిచేస్తున్నారు.
R. వెంకటేశ్వర్లు మరో ఉన్నతాదికారి. 1954 జులై 1 జన్మించిన వెంకటేశ్వర్లు ఫీల్డ్‌పబ్లిసిటీ ఆఫీసర్‌గా గుంటూరులో ఒక దశాబ్ది పనిచేశారు. అంతకు ముందు ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా హైదరాబాద్‌లో పనిచేశారు. 1988లో UPSC ద్వారా స్టేష డైరక్టర్‌గా ఎంపికయైన యువకుల్లో వెంకటేశ్వర్లు ఒకరు. మొట్టమొదటిసారి తిరునల్వేలి స్టేషన్‌డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుండి వరంగల్ స్థానిక రేడియో డైరక్టర్‌గా చక్కటి సేవలు అందించారు. 1994 నుండి దూరదర్శన్ హైదరాబాదు కేంద్రం డిప్యూటీ డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1996లో కంట్రోలర్‌గా హైదరాబాదు దూరదర్శన్ కేంద్ర పదవీ బాధ్యతలు స్వీకరించారు.
దూరదర్శన్‌లో పనిచేసిన మరో ఉన్నతాధికారి సి. గురునాద్. 1937 మే 28న జన్మించిన గురునాద్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరారు. 1985 లో UPSC ద్వారా స్టేషన్ డైరక్టర్‌గా సెలక్టు అయ్యారు. బొంబాయి దూరదర్శన్ కేంద్రం డైరక్టర్‌గా ఐదేళ్ళపాటు చక్కటి సేవలు అందించారు. బెంగుళూరు దూరదర్శన్ డైరక్టర్‌గా 85-89 మధ్యకాలములో పనిచేశారు. 1995లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు.
భద్రవ్రత :
కృష్ణాజిల్లాకు చెందిన భద్రవ్రత ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆకాశవాణిలో చేరి విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి అసిస్టెంట్ డైరక్టర్‌గా రీజనల్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాదులో శిక్షణా బాధ్యతలు నిర్వహించారు. దూరదర్శన్ హైదరాబాదు డైరక్టరుగా 1982-84 సంవత్సరాలలో వ్యవహరించారు. 1984లో రిటైరై రాష్ట్ర ప్రభుత్వం SITE డైరక్టర్‌గా 1 సం. పనిచేశారు.
దూరదర్శన్ వార్తా విభాగం ప్రారంభమైన తర్వాత వార్తలు చదివే వ్యక్తిగా శాంతి స్వరూప్ ఎంపికయ్యారు. తన ప్రత్యేక బాణిలో వార్తలు చదివి తెలుగు ప్రేక్షకులకు పరిచితులయ్యారు. కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసి దూరదర్శన్ ప్రేక్షకుల మన్ననలు పొందిన వ్యక్తులు ఎందరో.
ఓలేటి పార్వతీశం ప్రముఖులు. ఆకాశవాణి కడప కేంద్రంలో 1978లో చేరి దూరదర్శన్‌కు బదలీమీద 81 లో వెళ్ళారు. అక్కడే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా 88 లో UPSC ద్వారా ఎంపికయ్యారు. వీరిది పండిత కుటుంబం. వెంకట పార్వతీశ కవులు జంటకవులుగా ప్రసిద్ధులు. వోలేటి పార్వతీశంగారి కుమారులు శశాంక. వారి కుమారులు పార్వతీశం. పాండిత్యంతో పాటు ప్రెజంటేషన్‌లో తన ప్రత్యేకతను పార్వతీశం చాటుకొన్నారు. సాహిత్య కార్యక్రమాల రూపకల్పనలో ఆయన మేటి.
వేదుల కృష్ణశాస్త్రి 1938 మార్చి 15న పండిత కుటుంబంలో జన్మించారు. ప్రముఖ కవి వేదుల సత్యనారాయణశాస్త్రి కుమారులు. ఎం. ఏ. పట్టభద్రులై ఆంగ్లంలో లెక్చరర్‌గా పూనాలోని మిలటరీ శిక్షణా కళాశాలలో పదేళ్ళు పనిచేశారు. 1982 లో UPSC ద్వారా అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా సెలక్టు అయి 1985 ఫిబ్రవరిలో డైరక్టర్‌గా ప్రమోషన్ పొంది ఢిల్లీ వెళ్ళారు. దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీ, లక్నో కేంద్రాలలో పనిచేసి డైరక్టర్ జనరల్ కార్యాలయంలో కంట్రోలర్ గా పనిచేస్తున్నారు.
విమలా మిట్టల్ మరొక ప్రముఖురాలు. ఈమె 1940 మార్చి 25న జన్మించారు. రాష్ట్రేతరులను వివాహమాడారు. మిట్టల్ స్టేషన్ యింజనీర్ గా ఆకాశవాణి, దూరదర్శన్‌లో పనిచేస్తున్నారు. 1967 డిసెంబరులో ఆకాశవాణిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి అసిస్టెంట్ డైరక్టర్, కంట్రోలర్ గా పనిచేశారు. ప్రవాసాంధ్రులలో ఈమె ప్రముఖురాలు.