Jump to content

ప్రసార ప్రముఖులు/ప్రసార దంపతులు

వికీసోర్స్ నుండి

అద్దంకి మన్నార్ అనౌన్సర్‌గా విజయవాడలో పనిచేస్తూ డిల్లీ తెలుగు విభాగం న్యూస్ రీడర్‌గా వెళ్ళారు. నండూరి విఠల్ అనౌన్సర్‌గా విజయవాడలో పనిచేసి తర్వాత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ అయి దూరదర్శన్ కేంద్ర డైరక్టరయ్యారు. శారదా శ్రీనివాసన్ అనౌన్సరుగా తొలుత జీవనం ప్రారంభించి తర్వాత డ్రామా వాయిస్‌గా హైదరాబాదులో రెండున్నర దశాబ్దాలు పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఇతర కేంద్రాలలో వర్దిష్టులైన అనౌన్సర్లు పనిచేస్తున్నారు. నిర్దుష్టమైన ఉచ్చారణ, సమయోచిత మార్పులు గమనించగల సామర్థ్యం అనౌన్సర్ల కవసరం. దాదాపు 80 మంది దాకా ఆంధ్రదేశంలో అనౌన్సర్లు పనిచేస్తున్నారు. వీరిలో ప్రతిభావంతులు ఉన్నత విద్యావంతులు అనౌన్సర్లుగా చేరడం విశేషం. అనంతపురం కేంద్రంలో డా. వి. పోతన, కె. పుష్పరాజ్ పనిచేస్తున్నారు. పోతన తెలుగులో పిహెచ్.డి. చేశారు. పుష్పరాజ్ బి. ఏ. బి. ఎల్. పట్టభద్రులు. తిరుపతిలో పని చేస్తున్న P. అమృత, కొత్తగూడెంలో పనిచేస్తున్న రాజబాబు. యిలా ఎందరో ప్రతిభావంతులు. ఆకాశవాణి భవిష్యత్తు వీరి కృషిపై ఆధారపడి వుంది. అకుంఠిత దీక్ష, ఉద్యోగంపట్ల గౌరవం ప్రధాన లక్ష్యంగా పని చేయాలి.

ప్రసార దంపతులు

సినీ దంపతులుగా కృష్ణ-విజయనిర్మల, అంజలి-ఆదినారాయణరావు, రాజసులోచన-సి.యస్.రావు, నాగార్జున-అమల ఇలా ఎన్నో జంటలు. అలానే ప్రసార రంగంలో కొన్ని జంటలు నిర్విరామ కృషిద్వారా శ్రోతల్ని ఆకట్టుకొన్నారు. రేడియో అన్నయ్య, అక్కయ్యలుగా పేరుగాంచిన న్యాపతి రాఘవరావు కామేశ్వరి అగ్రశ్రేణి ప్రసార దంపతులు.

తొలి తరానికి చెందిన శ్రీనివాసన్ దంపతులు, సుభద్రా శ్రీనివాసన్, శ్రీనివాసన్ దంపతులు విజయవాడ, కోహిమాలలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేశారు. సుభద్రగారు కోహిమాలో అనారోగ్యంతో మరణించారు. హైదరాబాదులో మరో శ్రీనివాసన్ దంపతులు పనిచేశారు. N. S. శ్రీనివాసన్ వేణుగానలోలురు. సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పదవీ విరమణ చేశారు. వీరి సతీమణి శారదా శ్రీనివాసన్ నాటక విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. హైదరాబాదులో అనౌన్సర్‌ల జంటలు రెండున్నాయి. ఇలియాస్ అహమ్మద్, జ్యోత్స్న అనౌనర్లుగా నవలా రచయితలుగా పేరు తెచ్చుకొన్నారు.

అలానే సత్యనారాయణ, సీత అనౌన్సర్లుగా పేరు తెచ్చుకొన్న మరో జంట. నటుడుగా నాటక రచయితగా పేరున్న సత్యనారాయణ 1988లో అకాల మరణం పొందారు. హైదరాబాదులో పనిచేస్తున్న సుధామ, ఉషారాణి దంపతులు కార్యక్రమ నిర్వాహకులుగా పేరు గడించారు. సుధామ మంచి రచయిత : కవి.

విజయవాడ కేంద్రంలో మంజులూరి కృష్ణకుమారి దంపతులు మరో జంట. కృష్ణకుమారి కార్యక్రమ నిర్వాహకురాలిగా UPSC ద్వారా ఎంపికయ్యారు. విజయవాడ, విశాఖపట్టణ కేంద్రాలలో 10 స. లుగా పనిచేస్తున్నారు. కృష్ణకుమారి చక్కని రచయిత్రి. ఈమె వ్రాసిన అముద్రిత రచనకు NCERT వారి జాతీయ బహుమతి లభించింది. పన్నాల సుబ్రహ్మణ్యభట్, కృష్ణకుమారి ఆదర్శ దంపతులు. భట్ మంచి విమర్శకుడు, రచయిత, ప్రసార మాధ్యమంలో పట్టువున్న వ్యక్తి. చెణుకులు ద్వారా శ్రోతల్ని ఆకట్టుకుంటారు. కార్టూనిస్టుగా పేరు తెచ్చుకొన్నారు. తెలుగు ప్రసారాలకు గూర్చి దారావాహికంగా ప్రసారం చేసి 'ప్రసార తరంగిణి' పుస్తకం ప్రచురించారు. 1996లో నేపథ్యంపేర 20 వారాలు దారావాహికంగా ఆధునిక నాటకంపై ప్రామాణిక గ్రంథం వెలువరించారు. వాదబంధం (1983), మార్గబంధం(1988) రూపకాలకు భట్ జాతీయస్థాయి బహుమతులు పొందారు.

N. బాబూరావు దంపతులు విజయవాడలో ట్రాన్సిమిషన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఝాన్సీ కె. వి. కుమారి కపయిత్రి. వచన కవితా సంపుటాలు వెలువరించారు. వీరిద్దరు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లుగా నాలుగేళ్ళుగా నిజామాబాద కేంద్రంలో పనిచేస్తున్నారు.

మంత్రవాది మహేశ్వర్, వసుమతి దంపతులు మరోజంట. వీరిద్దరు ప్రస్తుతము అనంతపురం కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకులు. మహేశ్వర్ చక్కని కథకుడు. వీరిద్దరు విశాఖ, హైదరాబాదుల్లో వుండహా వివాహం అయింది. విశాఖ, విజయవాడలలో పనిచేసి అనంతపురం బదలీ అయ్యారు. కలగా కృష్ణమోహన్, పరిమిళ దంపతులు విజయవాడలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌లుగా వుంటూ వివాహం చేసుకొన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం హైదరాబాదు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో విడిగా పనిచేస్తున్నారు. కృష్ణమోహన్ రూపొందించిన మాట-మౌనం 1988లో జాతీయస్థాయి బహుమతి పొందింది.

రాఘవరెడ్డి, అమృత దంపతులు ప్రస్తుతం తిరుపతిలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, అనౌన్సర్లుగా వున్నారు. వీరు తొలుత అనంతపురంలో రిక్రూట్ అయ్యారు. అమృత తండ్రి శ్రీపులికంటి కృష్ణారెడ్డి 1992 అక్టోబరు - 95 అక్టోబరు మధ్యకాలంలో మూడేళ్ళు ఆకాశవాణి గౌరవసలహాదారుగా వ్యవహరించారు. రెడ్డి కవి, కథకుడు, మంచి భావుకుడు, చక్కటి మిత్రుడు.

వీరేగాక కలిసిమెలిసి పనిచేయడంవల్ల పరస్పరాకర్షితులై దంపతుల కన్న మిన్నగా ప్రవర్తించిన వారెందరో ఆ యా కేంద్రాలలో వున్నారు. వీరిని ప్రసార ప్రేమికులనవచ్చు, ఇది ఆకాశవాణి ప్రత్యేకత.