Jump to content

ప్రసార ప్రముఖులు/ప్రసార మంత్రిత్వశాఖ

వికీసోర్స్ నుండి

ప్రసార మంత్రిత్వశాఖ

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఎందరో ప్రముఖులు నేతృత్వం నిర్వహించారు. మొట్టమొదటిగా పేర్కొనదగిన తాళ?? ప్రాంశులైన వ్యక్తి డా. బెజవాడ గోపాలరెడ్డి. రవీంద్ర కవీంద్రుని అంతేవాసిగా, శాంతి నికేతన్ సాహచర్యంతో ఎదిగిన వ్యక్తి గోపాలరెడ్డి. బహుభాషా పరిచయం వారి ప్రత్యేకత. రాజకీయ భీష్ములుగ స్వాతంత్రోద్యమ సమరంలో పనిచేసిన గోపాలరెడ్డి అతి చిన్న వయసులో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు.

డా. బెజవాడ గోపాలరెడ్డి

జవహర్ లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో 1962-64 మధ్య కాలంలో సమాచార ప్రసారమంత్రిగా వ్యవహరించారు. విశాఖపట్టణ కేంద్రం (ఆగష్టు 4, 1963), కడప కేంద్రం (జూన్ 17, 1963) ప్రారంభోత్సవాలు వీరి చేతిమీదుగా జరిగాయి. కామరాజ్ ప్లాన్ క్రింద గోపాలరెడ్డి 64లో మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు. గోపాలరెడ్డి సాహితీవేత్త.

సాహితీ రాజకీయ రంగాలలో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకొని 90 సంవత్సరాల నిండు జీవితాన్ని పరిపూర్ణారోగ్యంతో గడిపిన పూర్ణపురుషుడు బెజవాడ గోపాలరెడ్డి. ఈ శతాబ్ది ప్రథమంలో జన్మించి చివరి వరకు జరిగిన పరిణామాలు అన్నిటినీ దర్శించిన భవ్యపురుషుడు.

1907 ఆగష్టు 5న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో గోపాలరెడ్డి జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసానంతరం బందరు జాతీయ కళాశాలలో చేరారు. అక్కడ నుండి శాంతి నికేతన్ లో 1924-27 సం॥ లలో రవీంద్ర కవీంద్రుని అంతే వాసి అయ్యారు. ఒక వైపు జాతీయోద్యమం మరోవైపు సాహిత్యపిపాస గోపాలరెడ్డి జీవనంలో పెనవేసుకొన్నాయి.

జాతీయోద్యమంలో పాల్గొని చెరసాలల్లో సంవత్సరాల తరబడి గడిపారు. ముప్పయి సంవత్సరాలు నిండకముందే రాజాజీ మంత్రివర్గంలో అవిభక్త మదరాసు రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అప్పటికింకా ఆయన అవివాహితుడు. తిక్కవరపు రామిరెడ్డిగారి కుమార్తె లక్ష్మీకాంతమ్మను మంత్రిగా వివాహమాడారు. కర్నూలులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపుడు 1955లో ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో విశాలాంధ్ర ఏర్పడినపుడు హైదరాబాదు రాజధానిగా ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ కేంద్రంలో మంత్రిగా గోపాల రెడ్డిని ఆహ్వానించి రెవిన్యూ మంత్రిని చేశారు. అనంతరం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఐదేళ్ళపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించారు. 186 నెలలు వివిధ రాజకీయ పదవులు నిర్వహించారు.

సాహితీ రంగంలో ఆయన సవ్యసాచి. 1946 నుండి తెలుగుభాషా సమితి అధ్యక్షులుగా వ్యవహరించారు. 1957 నుండి 82 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా 25 సం॥లు పనిచేశారు. 1978 నుండి కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులు. 1963 నుండి ఎనిమిదేళ్ళు జ్నానపీఠ అధ్యక్షులు. ఆయనకు పరిచితులుకాని సాహితీకారులు లేరు. అనేక భాషలలో సన్నిహిత పరిచయం గల గోపాలరెడ్డి రవీంద్రుని గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. తొలుత అనువాదాలతో ప్రారంభమై డెబ్బయివ ఏట స్వతంత్ర రచనలు మొదలుపెట్టారు. 1978లో తొలి స్వీయ కవితాసంపుటి వెలువరించారు. ఆమె, ఆమె జాడలు, ఆమె నీడలు, ఆమె తళుకులు, ఆమె చెరుకులు. ఇలా ఆమె పంచకం వెలువడింది.

కవితారంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్న డా. గోపాలరెడ్డి వార్ధక్యాన్ని సాహితీ సుగంధాలతో నింపుకుని శేష జీవితాన్ని నెల్లూరులో గడుపుతున్నారు.

పర్వతనేని ఉపేంద్ర జనతా ప్రభుత్వంలో V.P. సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా కేంద్ర సమాచార ప్రచార మంత్రిగా 1988లో బాధ్యతలు స్వీకరించారు. ఉపేంద్ర ఎం.ఏ. పట్టభద్రులై రైల్వే మంత్రిత్వ శాఖలో పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో పనిచేశారు. కొంతకాలం మధు దండావతే రైల్వే మంత్రిగా మనిచేస్తున్న కాలంలో వారి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ 1983 లో ఏర్పడినపుడు దాని రూపురేఖలు తీర్చిదిద్దడంలో N.T. రామారావుకు తోడ్పడారు. 1984లో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉపేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్ లో దూరదర్శన్ విస్తరణ బాగా జరిగింది. విజయవాడ దూరదర్శన్ కేంద్రం P.G.F. స్టుడియోల నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. విజయవాడ నుండి 1996లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మల్లికార్జున్ కేంద్ర సమాచార ప్రసారాల శాఖ డిప్యూటీ మంత్రిగా వ్యవహరించారు. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిత్వంలో ఆయన కొంతకాలం 1983-84 మధ్య సమాచార శాఖను నిర్వహించారు. తెలంగాణా ఉద్యమ కాలంలో విద్యార్థి నాయకుడుగా, చెన్నారెడ్డి అనుచరుడుగా మల్లికార్జున్ రాజకీయాలలో పాల్గొన్నారు. తెలంగాణా పోరాట సమితి పక్షాన లోక్‌సభకు ఎన్నికయ్యారు. రక్షణశాఖ స్టేట్ మంత్రిగా పనిచేశారు. పార్లమెంటరీ వ్యవహారాలతో పాటు అనేక శాఖలు సమర్ధవంతంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుండి వరుసగా లోక్‌సభకు ఎన్నికవుతూ 1996లో కూడా విజయం సాధించారు.

నెహ్రూగారి మంత్రిత్వంలో శ్రీ C. R. పట్టాభిరామన్ సహాయమంత్రిగా ప్రసార మంత్రిత్వ శాఖను పటేల్ గారి నాయకత్వంలో నిర్వహించారు. వీరు మేమూ తెలుగువారమని చెప్పుకొనేవారు. పట్టాభిరామన్ తిరువాన్కూర్ దివాన్ గా పనిచేసిన సర్ సి.పి. రామస్వామి అయ్యర్ కుమారులు.

ప్రసార మంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారులు ఎందరో పదవీ బాధ్యతలు నిర్వహించారు. వారిలో ప్రధానులు శ్రీ. ఏ.యు. శర్మ, శ్రీ కె. యస్. శర్మ, I.A.S.కు చెందిన వీరిద్దరు Joint Secretary (Broadcasting)లుగా వ్యవహరించారు. ఏ.ఉమాకాంతశర్మ బీహారు క్యాడర్ కు చెందిన సీనియర్ I.A.S. అధికారి. జనతా ప్రభుత్వ హయాంలో వీరు జాయింట్ సెక్రటరీగా ఒక సంవత్సరం పనిచేశారు. ఢిల్లీలో డిప్యుటేషన్ పూర్తికాగానే పాట్నాకు బదలి అయి బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పదవీ విరమణానంతరం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. శర్మగారికి సోషలిష్టు భావా లున్నాయి. వీరిది కడపజిల్లా నందలూరు స్వగ్రామం.

శ్రీ. కె. సుబ్రహ్మణ్యశర్మ ఆంధ్రా క్యాడర్ కు చెందిన 1968 బ్యాచ్ I.A.S. అధికారి. M.Sc. పట్టభద్రులైన శర్మ అనంతపురం, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. లండన్ లో ఒక సంవత్సరకాలం శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన శర్మగారు 1996లో ప్రసార మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ (Broad Casting)గా నియమితులయ్యారు. వీరిని పి.వి. ప్రభుత్వం 1996 లో దూరదర్శన్ డైరక్టర్ జనరల్ గా నియమించింది. శర్మగారు గుంటూరు జిల్లా తెనాలి వాస్తవ్యులు. 1944 జూలైలో జన్మించారు. 1968 జూలైలో I.A.S.లో చేరారు. కొంతకాలం ఆంధ్రరాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా వ్యవహరించారు.