ప్రసార ప్రముఖులు/ప్రసార ప్రముఖులు

వికీసోర్స్ నుండి

ప్రసార ప్రముఖులు

ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమై దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తోంది. 1927 జూలై 23న అప్పటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ ఇర్విన్ తొలి ప్రసార కేంద్రాన్ని ప్రారంభించడంతో ప్రసారా లారంభమయ్యాయి. ఆకాశవాణిగా 1936లో నామకరణం చేశారు. గత ఆరు దశాబ్దాలుగా ఎందరో ప్రముఖులు ఆయా కేంద్రాలలో పేరు గడించారు. వారిని గూర్చి తెలియజేయడానికి చేస్తున్న చిరుప్రయత్నమిది. ఇది సమగ్రం కాదని తెలుసు. అయినా ఆరంభం ఎక్కడో ఒకచోట జరగాలి. అందుకు నాందీ పలుకుతున్నాను.

1938 జూన్ 1న ఆకాశవాణి మదరాసు కేంద్రం రూపుదిద్దుకొంది. అప్పట్లో తెలుగుప్రసారాలు అక్కడనుండి జరిగేవి. తెలుగు అధికారులు అక్కడ చేరారు. తొలి తెలుగు అనొన్సరు మల్లంపల్లి ఉమామహేశ్వరరావు. ఆయన సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరులు. మదరాసు కేంద్రం అప్పట్లో సాహితీ త్రివేణీ సంగమం. ఆంధ్ర తమిళ కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మదరాసు కేంద్ర ప్రసారాలను తీర్చిదిద్దేవారు. అప్పట్లో "LIVE" ప్రసారాలు యధాతధంగా జరిగేవి. తర్వాత తర్వాత టేప్ రికార్డింగు సౌకర్యం వచ్చింది. దానికి ముందు గ్రామఫోను రికార్డులు కట్ చేసేవారు. అది ఎంతో శ్రమతో వ్యయప్రయాసలతో కూడిన పని.

దిగ్దంతులవంటి వ్యక్తులు ఆనాడు మదరాసు కేంద్రంలో కార్యక్రమ నిర్వహకులు. పద్మశ్రీ యస్. యన్. మూర్తి, డా.అయ్యగారి వీరభద్రరావు, ఆచంట జానకీరామ్‌ డా. బాలాంత్రపు రజనీకాంతరావు, బుచ్చిబాబు, శ్రీవాత్సవ ఆనాటి కార్యక్రమ నిర్వాహకులు. ప్రముఖ కవి జాషువా కొంతకాలం మదరాసు కేంద్రంలో పనిచేశారు. గత యాభై సంవత్సరాల కాలంలో ఎందరో ఆంధ్ర ప్రముఖులు అక్కడ పనిచేశారు. సర్వశ్రీ గొల్లపూడి మారుతీరావు, యస్. శంకరనారాయణ (బాపు సోదరులు), యస్ వేణుగోపాలరెడ్డి, శ్రీమతి దుర్గా భాస్కర్, వి. చంద్రమౌళి ఈ కేంద్ర కార్యక్రమాల నిర్వహణలో పేరు గండించారు.