Jump to content

ప్రసార ప్రముఖులు/డైరక్టరేట్ జనరల్ కార్యాలయం

వికీసోర్స్ నుండి

K.V.S. రావు, N.H.K. మూర్తి, D.J. రావు, D.S. దీక్షితులు, V.A. శాస్త్రి, G.N.L.N. రావు వంటి అధికారులు మంత్రిత్వశాఖలో సీనియర్ పదవులు నిర్వహించారు. దీక్షితులు, V.A. శాస్త్రి ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్ఛి వ్యక్తిగత కార్యదర్శులుగా పనిచేశారు. G.V.L.N. రావు ఆకాశవాణి డైరక్టర్ వ్యక్తిగత కార్యదర్ఛిగా రెండేళ్ళు పనిచేసారు. N.H.K. మూర్తి హృద్రోగంతో హఠాత్తుగా మరణించారు. K.V.S. రావు ఆకాశవాణి డైరక్టర్ జనరల్ విజిలెన్స్ సెక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించారు. D.J. రావు దూరదర్శన్, ఆకాశవాణిలలొ పనిచేసి Ministry of Personnel లో డిప్యూటీ సెక్రటరీగా వెళ్ళారు.

డైరక్టరేట్ జనరల్ కార్యాలయం

ఆకాశవాణి డైరక్టరేట్ జనరల్ కార్యాలయం కొత్త ఢిల్లీలోని పార్లమెంటు వీధిలోని ఆకాశవాణి భవనంలో వుంది. ఈ కార్యాలయంలో ఎందరో ఆంధ్ర ప్రముఖులు పనిచేశారు. ఆకాశవాణి మాన్యువల్ రూపొందించిన ఘనత ఆంధ్రులకే దక్కింది. అకౌంటెంట్ జనరల్ గా పనిచేసి డెప్యుటేషన్ మీద ఆకాశవాణి డిప్యూటీ డైరక్టర్ జనరల్ (అడ్మినిస్ట్రేషన్) గా పనిచేసిన P. V. రాఘవరావు ప్రాతఃస్మరణీయులు. వీరు 1956 లో మనుస్మృతి వంటి మాన్యువల్ తయారుచేశారు. 1989 వరకు దానినే అనుసరించారు. 1989 లో మాన్యువల్ కు కొత్తరూపం యిచ్చారు. రాఘవరావుగారు పదవీ విరమణానంతరం హైదరాబాదులో 1992 లో పరమపదించారు. వీరి కుమారులు రాష్ట్రప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్న P. V. రావు.

మరొక ఉన్నతస్థానం అలంకరించిన వ్యక్తి భమిడిపాటి కుక్కుటేశ్వరరావు. వీరు I.A.S.లో పనిచేస్తూ డెప్యుటేషన్ మీద D.D.G. (అడ్మినిస్ట్రేషన్) గా ఆకాశవాణి ఢిల్లీలో పనిచేశారు. వీరు కేంద్ర గనుల శాఖ కార్యదర్శిగా 1990 జూన్ లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు. బి.కె. రావుగా ప్రసిద్ధులైన వీరు జియాలజీలో M.S.c. పట్టభద్రులు, సాహితీప్రియులు. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ సీనియర్ పదవులు అధిష్టించారు. చిత్తూరు కలెక్టరుగా వ్యవహరించారు.

ఇటీవలి కాలంలో D.D.G. సెక్యూరిటీగా వి. పురుషోత్తమరావు పనిచేస్తున్నారు. వీరు డెప్యుటేషన్ పై వచ్చారు. స్వతహాగా పోలీసు (C.R.P.F.) శాఖకు చెందినవారు. (1992-96) మధ్యకాలంలో వీరు ఢిల్లీలో పనిచేశారు. వీరి సతీమణి వెదురుమూడి రాజేశ్వరి ఢిల్లీ కేంద్రం తెలుగు వార్తా విభాగంలో న్యూస్ రీడర్ గా 1996 లో చేరారు.

పుల్లెల వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరక్టర్ జనరల్ (ప్రోగ్రాం) గా ఢిల్లీ లో 1980-82 సం॥ లలో వ్యవహరించారు. ఆ స్థాయికి ఎదిగిన స్టేషన్ డైరక్టర్ల లో వెంకటేశ్వర్లుగారు అగ్రగణ్యులు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఆకాశవాణిలో చేరిన కెప్టన్ పుల్లెల విజయవాడ, హైదరాబాదు, పోర్ట్ బ్లెయిరు తదితర కేంద్రాలలో పనిచేశారు. హైదరాబాదు కేంద్ర డైరక్టర్‌గా 1975 అక్టోబరు నుండి 78 జూన్‌ వరకు పని చేశారు. అధికారిగా మంచిపేరు సంపాదించారు, డైరక్టర్ ఆఫ్ ప్రోగ్రాం (పాలసీ)గా చక్కటి పేరు గడించారు. పదవీ విరమణానంతరం పుల్లెల హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. ఆర్మీలో పనిచేసి రిటైరైన పుల్లెల విజయవాడలో ప్రథమంగా చేరారు. 1966 లో అసిస్టెంట్ డైరక్టర్‌గా డైరక్టరేట్‌కు బదలీ అయ్యారు.

సూరి నారాయణమూర్తి DDG ప్రోగ్రాంగా పనిచేసిన వారిలో సమర్ధులు. వీరు ప్రోగ్రాం అసిస్టెంట్‌గా చేరి డిడిజి హోదాకు ఎదిగారు. 1971 ఆగష్టులో పదవీ విరమణ చేసి విజయవాడలో విశ్రాంత జీవనం గడుపుతూ 1981 జనవరిలో పరమపదించారు. మదరాసులో చేరి అహమ్మదాబాదు, పూనే, బొంబాయి, ఢిల్లీ కేంద్రాలలో డైరక్టరుగా పనిచేశారు.

ఇంజనీరింగు విభాగంలో కూడా ఎందరో చీఫ్ యింజనీర్ల స్థాయికి ఎదిగి డైరక్టరేట్‌లో పనిచేశారు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో పని చేసిన ప్రముఖ చీఫ్ యింజనీర్లలో విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారులు విశ్వనాథ అచ్యుత దేవరాయలు, R S, శాస్త్రి, M. L. శాస్త్రి, N. వెంకటేశ్వర్లు, వి. వి. రావ్, టి. యన్. జి డాన్ (కలకత్తా) చెప్పుకోదగినవారు. ప్రాంతీయ కార్యాలయం మదరాసులో చీఫ్ యింజనీర్లుగా M. I. సూర్యనారాయణ, ఆర్ శేషయ్య వ్యవహరించారు. వీరిద్దరి హయాంలో చాలామంది తెలుగు యువకులు ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా సెలక్టు కాబడి యిప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్ల హోదాకు ఎదిగారు.

డైరక్టర్లుగా డైరక్టరేట్‌లో భిన్న కాలాలలో ఎందరో పనిచేశారు. సర్వశ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు, పుల్లెల వెంకటేశ్వర్లు, గుంటూరు రఘురాం యిలా ఎందరో. రఘురాం జలంధర్‌లో స్టేషన్ డైరక్టరుగా పనిచేసి డైరక్టరేట్‌లో డైర క్టర్ ఆఫ్ ప్రోగ్రాం (పెరసనల్‌గా) పనిచేశారు. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన ఈ శాఖను సర్వసమర్థంగా నిర్వహించారు. వీరు 1993 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడారు. ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి విజయవాడ, హైదరాబాదు, గుల్బర్గా కేంద్రాలలో వివిధ హోదాలలో పనిచేశారు. హిందీలో చక్కటి ప్రవేశమున్న రఘురాం 14. 2. 35 న అనంతపురం జిల్లాలో జన్మించారు. సున్నిత హృదయులైన రఘురాం చక్కటి కార్యక్రమాల రూపకల్పన శిల్పి. 1982 లో స్టేషన్ డైరక్టర్‌గా పదోన్నతి పొందారు.

డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న మరో ప్రముఖులు బి. ఆర్. చలపతిరావు. ఆకాశవాణిలో చేరడానికి ముందు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన చలపతిరావు ఆడియన్స్ రెసెర్చి ఆఫీసర్ గా 1-4-69 న చేరారు. 1985 డిసెంబరులో యు.పి.యస్.సి. ద్వారా స్టేషన్ డైరక్టర్ గా సెలక్ట్ అయి మంగుళురు కేంద్ర డైరక్టరుగా చేరారు. 1987 ఏప్రిల్ లో డైరక్టరేట్ లో వాణిజ్య విభాగం డైరక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ పదవిలో దాదాపు 8 సంవత్సరములు జయప్రదంగా పనిచేసి 1994 జనవరిలో పదవీ విరమణ చేశారు. రచయితగా, వక్తగా, అధికారిగా చలపతిరావు సమర్ధులు. చలపతిరావు విశాఖపట్టణంలో 12-12-36 న జన్మించారు. చలపతిరావు ఢిల్లీలో స్థిరపడ్డారు. 1994 నుండి 96 వరకు సలహాదారుగా వ్యవహరించారు.

డా. ప్రపంచం సీతారాం ప్రముఖ వేణుగానలోలురు. చిన్నతనంలోనే సంగీత రసజ్ఞులనలరించారు. సీతారాం విజయవాడలో 21.9.42 లో జన్మించారు. ఆకాశవాణిలో 1980 లో చేరడానికి ముందు ఢిల్లీ లోని అశోకా హోటల్లో వేణుగాన విద్వాంసులుగా పనిచేశారు. యు.పి.ఎస్.సి. ద్వారా 1976 లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా సెలక్ట్ అయి మదరాసులో పనిచేశారు. అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరుగా 11.2.85 నుండి విజయవాడలో పనిచేశారు. డైరక్టరేట్ లో సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యూసర్ గా నాలుగేళ్లు పనిచేశారు. 1993 లో స్వచ్చంద పదవీ విరమణానంతరం తిరుపతిలోని పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో సంగీతం ప్రొఫెసర్ గా చేరారు. సంగీతంలో సీతారాం డాక్టరేట్ పొందారు. విద్వాంసులుగా సీతారాం లబ్ధ ప్రతిష్ఠులు

డైరక్టరేట్ లో సంగీత విభాగంలొ చీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేసిన మరో ప్రముఖులు ఈమని శంకరశాస్త్రి. వైణికులుగా లబ్ధ ప్రతిష్టులైన శంకరశాస్త్రి ఢిల్లీలో సముచిత గౌరవాన్ని పొందారు. మరో ప్రముఖ వ్యక్తి డా॥ ఆరెకపూడి రమేష్ చౌదరి. ఆయన హిందీ విభాగం డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా (ప్రవచన శాఖ) ఢిల్లీలో పని చేశారు. చివరి రోజుల్లో మదరాసు కేంద్రంలో పనిచేసి పదవీ విరమణ చేశారు.

విదేశీ ప్రసార విభాగంలో చాలాకాలం పనిచేసి పదవీ విరమణ చేసిన కుమారి ఉషారావు మొసలికంటి తిరుమలరావు గారి పుత్రిక. ఆమె E. S. D. లో సబ్ ఎడిటర్ గా పనిచేసి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా రిటైరయ్యారు.

P. R. రెడ్డి, శంకరమంచి సత్యం డిప్యూటీ డైరక్టర్లుగా (1988-90) E. S. D. లో పనిచేశారు. E. S. D.లో (విదేశీ ప్రసార విభాగం) పనిచేసిన మరో ప్రముఖుడు R. C. రాజశేఖర్, రాయప్రోలు సుబ్బారావు (ప్రముఖ కవి) కుమారులు. వివిధ హోదాలలో బెంగుళూరు తదితర కేంద్రాలలో పనిచేశారు. E. S. D. లో డిప్యూటీ డైరక్టర్ గా పనిచేసి డైరక్టరేట్‌లో వ్యవసాయ కార్యక్రమాల జాయింట్ డైరక్టర్ గా పనిచేశారు. రాజశేఖర్ ఢిల్లీలో హఠాన్మరణం చెందారు. ఆకాశవాణిలో తొలినాళ్ళలో చేరి సమున్నత స్థానాన్ని పొందిన వ్యక్తులలో ఆయన ఒకరు. ఆయన బెంగుళూరు కేంద్ర డైరక్టరుగా పనిచేశారు.

డా. ఆర్. అనంత పద్మనాభరావు ప్రవచన శాఖ డైరక్టర్ ఆఫ్ ప్రోగ్రాంగా 1988 వ సంవత్సరంలో డైరక్టరేట్‌లో పనిచేశారు. డైరక్టరేట్ అనుబంధ సంస్థ అయిన శిక్షణా సంస్థలో 1987-90 మధ్యకాలంలో డిప్యూటీ డైరక్టర్‌గా వ్యవహరించారు.

శ్రీమతి వాణీజయరాం డైరక్టరేట్‌లో సంగీత విభాగం ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. వీరు ప్రసిద్ధ సంఘ సేవకురాలు మోహినీగిరి గారి తల్లి. వీరివలె ప్రస్తుతం శ్రీమతి G. వైదేహి సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నారు.

ఈమని శంకరశాస్త్రి

శంకరశాస్త్రి పేరు వినగానే వీణాతంత్రులు మీటుతూ గంధర్వరాగాలను సంగీత రసజ్ఞుల కందించిన ఒక విరాట్ మూర్తి మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమవుతారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి వహించిన వైణికులు. 1923 ప్రాంతాలలో తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఒక విద్వత్ కుటుంబంలో శంకరశాస్త్రి జన్మించారు. తండ్రి అచ్యుతరామశాస్త్రి సుప్రసిద్ధ వైణికులు. శంకరశాస్త్రి కాకినాడ మహారాజా కళాశాలలో పట్టా పొందారు. చిన్నతనం లోనే వీణావాదనలో ప్రావీణ్యం సంపాదించారు. 15వ ఏట ఆయన కాకినాడ సరస్వతీ గానసభలో తొలి కచేరి చేసి పండితుల ప్రశంసలందుకొన్నారు. ఆనాటి నుండి ఆయన దినదిన ప్రవర్ధమానవుతూ సంగీతవేత్తల ప్రశంసలను యావత్ భారతంలో అందుకొన్నారు.

ఆయన కొంతకాలం సినీరంగంలో పనిచేశారు. 1940 ప్రాంతంలో సంగీత దర్శకుడుగా చేరారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చి తమ ప్రతిభను చాటుకొన్నారు.

ఆకాశవాణిలో శంకరశాస్త్రి 1959లో సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా మదరాసు కేంద్రంలో చేరారు. హిందూస్తానీ పాశ్చాత్య సంగీతంలో ప్రవేశం సంపాదించి వాటి చక్కని మేళవింపుతో తనదైన వినూత్నశైలిని ఏర్పరచుకొన్నారు. ఆకాశవాణి వాద్యబృంద నిర్దేశకులుగా ఆయన ఎన్నో ప్రయోగాలూ చేశారు. ఆదర్శ శిఖరారోహణం, భ్రమరగీతం వంటి సంగీత రూపకాలు రూపొందించి శ్రోతల ప్రశంసలందుకొన్నారు. వీణపై వేదమంత్రాలు అలవోకగా పలికించి రసజ్ఞఉల మన్ననలందారు. "ఆసియన్ రోస్ట్రం అవార్డు" అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదంతో సత్కరించింది. ఆకాశవాణిలో సంగీత విభాగం ఛీఫ్ ప్రొడ్యూసర్ గా ఆయన రిటైరయ్యారు. కేవలం వీణావాదన మాత్రమేగాక వీణ కచేరీతో పాటు సోదాహరణ ప్రసంగాలు చేసి వివిధ ప్రాంతాలలో బహుళ జనామోదం పొందారు. గమకములు, అనుస్వరాలు లోకానికి విశదపరచిన మేధావి శంకరశాస్త్రి. ఆయనది గాత్రధర్మశైలి. వీణపై ఒక స్త్రీ కంఠ స్వరాన్ని పలికించి శ్రోతల్ని పులకింప జేసేవారు. రాగ హృదయాన్ని ఆవిష్కరింపజేయగల ప్రతిభాశాలి. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో ఆయనకు కనకాభిషేకం 1987లో జరిగింది. శంకరాభారణ రాగాలాపన ఆయన ప్రత్యేకత.

సుప్రసిద్ధ వైణికులు చిట్టిబాబు, శంకరశాస్త్రి శిష్యులు. యాహూదీ మొయిన్ హిన్ వంటి విదేశీ సంగీత ప్రముఖుల ప్రశంసలందుకొన్నారు. Prix Italia International అవార్డు ఆయన పొందారు.

గుంటూరులో కనకాభిషేకం అంది ఆ రాత్రి రైలులో ప్రయాణం చేస్తూ 1987 డిసెంబరు 8న నిద్రలోనే సునాయాస మరణాన్ని పొందారు. ...............ఆకాశవాణికి ఆయన ఎనలేని సేవచేశారు. కర్ణాటక సంగీత విభాగం చీఫ్ ప్రొడ్యూసర్ గా ఢిల్లీలోని డైరక్టర్ జనరల్ కార్యాలయంలో పనిచేసి 19.. లో పదవీ విరమణ చేశారు. సంగీత లోకం ఆయనకు రుణపడి వుంది. వాద్యబృంద డైరక్టర్ కామశాస్త్రి, M. S. శ్రీరాం వీరి సన్నిహిత బంధువులు.

డా॥ ఆరెకపూడి రమేష్ చౌదరి

ఆంధ్రులు హిందీ సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. వారిలో ఆరెకపూడి ప్రముఖులు. ఆయన హిందీ, ఆంగ్ల భాషలలో సమ ప్రతిభ గలవారు. ఆకాశవాణిలో ఆయన డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.

1922 నవంబరు 28 న కృష్ణాజిల్లా ఉయ్యూరులో రమేష్ చౌదరి జన్మించారు. పత్రికా రచయితగా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. హిందూ, Free Press Journal, ఇండియన్ రిపబ్లిక్ పత్రికలలో ఆయన పనిచేశారు. హిందూస్తాన్ టైమ్స్, ఫోరమ్‌ పత్రికల కరస్పాండెంట్ గా వ్యవహరించారు.

హిందీలో దాదాపు పాతిక చక్కటి నవలలు వ్రాశారు. తెలుగు మాతృభాష అయినా తలస్పర్శిగా హిందీ భాషాభిమానుల ప్రశంసలు అందుకొన్నారు. ఆయన నవలలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు బహుమతులిచ్చింది. అది ఒక విశిష్ట గౌరవం 'సాఠ్‌గాంఠ్' నవల భారత ప్రభుత్వం బహుమతినందుకొంది. ఆయన రచనలు విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాలుగా ఎంపిక చేయబడ్డాయి.

సారా సంసార్ మేరా, నిర్లజ్జ, ధన్యభక్షు, ఉధార్ కే పంఖ్, అప్నే పరాయ్ నదీ కా శోర్ వీరి నవలల్లో ప్రముఖాలు. వీరి నవల రష్యన్ భాషలోని అనువదించబడడం మరో విశేషం. అడవి బాపిరాజు 'నారాయణరావు' నవలను వీరు హిందీలోకి అనువదించారు.

చందమామ, దక్షిణ భారత్ పత్రికలకు ఆయన కొంతకాలం సంపాదకులుగా వ్యవహరించారు. ఆయన స్వాతంత్ర సమరయోధులు కూడా. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తామ్రపత్రం ప్రభుత్వం నుండి పొందారు. 1980లో ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూడా గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరిని కళాప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది.