ప్రసార ప్రముఖులు/హైదరాబాదు కేంద్రం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రమేష్ చౌదరి ఆకాశవాణిలో హిందీ ప్రవచనశాఖ ప్రొడ్యూసర్ గా చేరారు. కొంతకాలానికి డిప్యూటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ గా ప్రమోట్ అయి ఢిల్లీ బదలీ అయ్యారు. 1979లో ఆయన ఆ పదవితో పాటు మదరాసు బదలీ అయ్యారు. 1980 సం॥ నవంబరులో మదరాసులో ఆయన పదవీ విరమణ చేశారు. ఆకాశవాణి డైరక్టరేటు జనరల్ కార్యాలయంలో రెండేళ్ళు పనిచేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.

1983 ఏప్రిల్ 30న రమేష్ చౌదరి కాలధర్మం చెందారు.

హిందీ సాహిత్యాకాశంలో ఆయన వినీల ధృవతార.

హైదరాబాదు కేంద్రం

ప్రసారాలు ప్రైవేటు రేడియో కేంద్రం ద్వారా హైదరాబాదు నుండి 1933 లో ప్రారంభమయ్యాయి. 1935లో నిజాం తన ఆధీనంలోకి రేడియో కేంద్రాన్ని తీసుకొని ప్రసారాలు చేయసాగారు. ఆయన 'డెక్కన్ రేడియో' అని నామకరణం చేశారు. తెలుగు ఉర్దూ ప్రసారాలు జరిగేవి. హైదరాబాదు సంస్థానం 1950 ఏప్రిల్ లో భారతదేశంలో విలీనమైన తర్వాత డెక్కన్ రేడియో కేంద్రాన్ని భారత ప్రభుత్వం తీసుకొంది. 1950 ఏప్రిల్ 1 నుండి ఆకాశవాణి ప్రసారాలు మొదలయ్యాయి.

తెలుగుభాషా ప్రసారాలతోబాటు హైదరాబాదు కేంద్రం నుండి ఇతర భాషా ప్రసారాలు కూడా జరుగుతున్నాయి. ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఆంగ్ల భాషాలలో వారం వారం ప్రసారాలు చేస్తున్నారు. దాదాపు యాభై సంవత్సరాల చరిత్ర గల ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం అసెంబ్లీ భవనాలకు ఎదురుగా గల 'రాక్ ల్యాండ్స్‌' ఏరియాలో సుందరమైన భవనాలలో నెలకొల్పబడింది. 1988 నుండి ప్రస్తుత నూతన భవనాలలోకి ఆఫీసు బ్లాకు మార్చబడింది. 1995 లో నూతన స్టూడియో కాంప్లెక్సును ప్రారంభించారు.

హైదరాబాదు 'ఏ' కేంద్రంపై ప్రధాన ప్రసారాలు మీడియం వేవ్, షార్ట్‌వేవ్ లపై ప్రసారమవుతాయి. 'బి' కేంద్రం నుండి యువవాణి కార్యక్రమాలు 1970 డిసెంబరు 20 నుండి ప్రసార మవుతున్నాయి. 'సి' కేంద్రం కేవలం వాణిజ్య ప్రసారాలకు పరిమితమైంది. వాణిజ్య ప్రసార కేంద్రం 1971 మార్చి 21న ప్రారంభించారు. దీనికి స్టేషన్ డైరక్టరు హోదా గల అధికారి వున్నారు. హైదరాబాదు కేంద్రం స్టేషన్ డైరెక్టర్లుగా పని చేసిన ఆంధ్రులలో ప్రముఖులు వీరు : శ్రీ యం.వి రాజగోపాల్. వీరు విజయవాడ కేంద్రం డైరెక్టరుగా 1949-50 సం॥ లో పని చేసారు. హైదరాబాదు కేంద్ర డైరెక్టరుగా 19-8-55 నుండి 20-4-57 వరకు పని చేసారు. ఆ తరువాత I.A.S లో చేరి నెల్లూరు జిల్లా కలెక్టరుగా , ఆంధ్ర విశ్వ విద్యాలయ రిజిస్ట్రారుగా , రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ డైరెక్టరుగా, జవహర్ లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్.ఛాన్సలర్ గా వ్యవహరించారు. చక్కటి భాషా సాంకేతిక పరిజ్ఞానం గల మేధావి రాజగోపాల్. వీరు హైదరాబాదులో పరమపదించారు. డా॥ అయ్యగారి వీరబద్రరావు కూడా విజయవాడలో పని చేసిన తరువాత హైదరాబాదు కేంద్రానికి 15-3-65 నుండి 28-10-66 వరకు డైరెక్టరుగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పసల గురుమూర్తి 3-6-74 నుండి 15-10-75 వరకు డైరెక్టరుగా పని చేసారు. అలానే పుల్లెల వెంకటేశ్వర్లు 15-10-75 నుండి 22-6-78 వరకు డైరెక్టరుగా చేసారు. 78 నుండి ఆకాశవాణి డైరెక్టరేట్ లో డిప్యూటీ డైరెక్టర్ జనెరల్ గా వ్యవహరించారు. హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. మైసూరు వాసుదేవాచారి మనుమలైన యస్. రాజారాం ఈ కేంద్ర డైరెక్టరుగా 25-9-81 నుండి 31-1-83 వరకు పని చేసి రిటైర్ అయ్యారు. శ్రీ వి వి శాస్త్రి 6-1-92 నుండి 31-10-96 వరకు డైరెక్టరుగా పని చేసి రిటైరయ్యారు.


హైదరాబాదు కేంద్రంలో పని చేసిన ఇతర కార్యక్రమ నిర్వాహకులలో ఎందరో మహానుభావులున్నారు. ఆయా రంగాలలో నిష్ణాతులైన లబ్ద ప్రతిష్టులైన ఎందరో ప్రసార ప్రముఖులు శ్రోతల అభినందన లందుకొన్నారు. సర్వశ్రీ త్రిపురనేని గోపీచంద్ (గ్రామీణ కార్యక్రమాలు) స్థానం నరసింహారావు (నాటక విభాగం ) దేవులపల్లి కృష్ణశాస్త్రి , దాశరధి, రావూరి భరద్వాజ(ప్రసంగ శాఖ) వింజమూరి వరదరాజయ్యంగార్,మంహాల జగన్నాధరావు,పాలగుమ్మి విశ్వనాథం, N.S.శ్రీనివాసన్ (సంగీత విభాగం) శ్రీమతి వింజమూరి సీతాదేవి (జానపద విభాగం ) రామమూర్తిరేఖ, వేలూరి సహజానంద, తురగా జానకిరాణి , కేశవపంతులు నరసింహశాస్త్రి , గొల్లపూడి మారుతీరావు , నండూరి విట్టల్ , జనమంచి రామకృష్ణ , అజర్ అఫ్సర్(ఉర్దూ), ఎల్లా వెంకటేశ్వరరావు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, భాస్కరభట్ల కృష్ణారావు , N.V.S. ప్రసాదరావు హైదరాబాద్ కేంద్ర కార్యక్రమ రూపకల్పనకు కృషి చేశారు. ఈ కేంద్రం జాతీయ స్థాయిలో ఎన్నో బహుమతు లందుకొంది.

హాస్యబ్రహ్మ మునిమాణిక్యం నరసింహారావు, నాయని సుబ్బారావు, న్యాపతి రాఘవరావు, కామేశ్వరి (రేడియో అన్నయ్య, అక్కయ్యగా ప్రసిద్ధులు) ఈ హైదరాబాదు కేంద్రం ప్రశస్తికి తోడ్పడ్డారు.

దూరదర్శన్ హైదరాబాదు నుండి ప్రసారాలు మొదలుపెట్టిన తర్వాత ఈ కేంద్రం నుండి చాలామంది ప్రసార ప్రముఖులు అందులోకి బదిలీ అయ్యారు. రామంతపురంలో సువిశాలమైన స్టూడియోలతో దూరదర్శన్ తన ప్రసారాలను ఆంధ్ర ప్రేక్షకులకు అందిస్తోంది. భద్రవ్రత, బాలకృష్ణ, నండూరి విఠల్, G. మరార్ ఈ కేంద్రంలో పనిచేసి పదవీ విరమణ చేశారు.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం శ్రోతల విభాగం పరిశోధనాధికారులుగా వ్యవహరించిన శ్రీ B. S. S. రావు, H. హనుమంతరావు ప్రసారాల నాణ్యతకు కృషి చేశారు. B. S. S. రావు SITE కార్యక్రమాల తొలిరోజుల్లో విశేషంగా కృషి చేశారు. తర్వాత వారు జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో Information Director గా పనిచేసి తర్వాత UGC వారి హైదరాబాదు విద్యా ప్రసార కేంద్రం డైరక్టర్ అయ్యారు. హనుమంతరావుగారు హైదరాబాదులో Audience Research గా పనిచేసి పదోన్నతిపై డిప్యూటీ డైరక్టరుగా బొంబాయి వివిధ భారతిలో పని చేశారు. మలేషియాలోని Asian Institute of Broadcast Development సంస్థలో మూడు సంవత్సరాలు డిప్యూటీ డైరక్టరుగా వ్యవహరించారు. హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో Information డైరెక్టరుగా 1995 లో చేరడానికి ముందు వారు ఆకాశవాణి ఆడియన్స్ రీసర్చ్ డిప్యూటీ డైరక్టరుగా అలహాబాదులో పనిచేశారు. కార్యక్రమాల రూపకల్పనపట్ల చక్కటి అవగాహన, విశ్లేషణ గల వారిలో హనుమంతరావుగారు ఒకరు.

త్రిపురనేని గోపీచంద్ (1910-62) :

గోపీచంద్ కథకుడు, నవలా రచయిత, సాహితీవేత్త.

1910 సెప్టెంబరు 8న కృష్ణాజిల్లా అంగలూరులో జన్మించారు. గుంటూరులో బి.ఏ. పూర్తిచేసి. మదరాసులో బి.యల్. చదివారు. ఆంధ్రదేశంలో రాడికల్ ప్రజాస్వామ్య పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 1953లో ఆంధ్రరాష్ట్రావతరణ తరువాత రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టరుగా వ్యవహరించారు. 1957లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో గ్రామస్థుల కార్యక్రమాల ప్రయోక్తగా పని చేసారు. వీరి హయాంలో చక్కటి ప్రయోజనాత్మక కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. అనేక రేడియో నాటికలు వ్రాశారు. రేడియో ప్రసంగాలన్నీ ఉభయకుశలోపరి పేర ప్రచురించారు. గోపీచంద్ సినీ జీవితం పేర్కొనదగింది. 1939లో గృహలక్ష్మి చిత్రంతో ఆరంభమైంది వీరి సినీ జీవితం. చదువుకున్న అమ్మాయిలు, రైతు బిడ్డ చిత్రాలకు మాటలు వ్రాశారు. లక్ష్మమ్మ, పేరంటాలు, ప్రియురాలు చిత్ర దర్శకత్వం చేపట్టారు.

దేవుని జీవితం, తండ్రులు-కొడుకులు , పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, ధర్మాసుపత్రి , అసమర్ధుని జీవయాత్ర , పరివర్తన, శిధిలాలయం - వీరి నవలలో ప్రధానాలు. భార్యల్లోనే వుంది, దేశం ఎమయ్యేట్టు , గీతా పారాయణం ,సరే కానివ్వండి వీరి యితర రచనలు. పట్టభిగారి సోషలిజం , మర్క్సిజం అంటే ఏమిటి? సోషలిస్టు ఉద్యమం చరిత్ర - వీరి విమర్శనా పటిమకు నిదర్సన గ్రంధాలు. తత్వశాస్త్రం, తత్వవేత్తలు, పోస్టు చెయ్యని ఉత్తరాలు - తత్వ పరిశోధనా గ్రంధాలు.

గోపీచంద్ గుండెపోటుతో 1962 నవంబరు 22న మరణించారు. గోపీచంద్ కుమారులు సైచాండ్ టీవి నటుడిగా ప్రసిద్దిపొందారు. గోపీచంద్ తండ్రి త్రిపురనేని రామస్వామి చౌదరి గొప్ప కవి, సంఘసంస్కర్త . కుమారునిపై తండ్రి ప్రభావం ఎంతో వుంది.

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనీ నవలకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం లభించింది. మెరుపుల మరకలు , చీకటి నవలలు యితర నవలలు, మాంచాల, పస్చిమవాహిని, గుడ్డి సంఘం , అభాగివి, తత్వమసి వీరి నాటక రచనలు. మాలపల్లి నవలకు నాటకీకరణ చేసారు.

నాయని సుబ్బారావు (1899 - 1978)

1899 అక్టోబరు 29న నాయనివారు (అప్పటి నెల్లూరు జిల్లా పొదిలిలో జన్మించారు. నవ్యాంధ్ర కవులలో ఆయన అగ్రగణ్యుడు. ఈ శతాబ్ది ఆరంభంలో రెండు,మూడు దశాబ్దులలో ప్రణయ కవిత్వానికి పట్టం కట్టినవారిలో నాయని ఒకరు. రాయప్రోలు, విశ్వనాథ ,దేవులపల్లివలె వీరు కూడా ప్రేమగీతాలు ఆలపించారు. వీరి సౌభద్రుని ప్రణయయాత్ర సుప్రసిద్ధం. తానే అర్జునుడు . తాను ప్రేమించిన మేనకోడలు సుభద్ర సరస మధుర కావ్యమిది.

ఫలశ్రుతి, నిత్యక్రీడ మొదలైన ఖండికలు విశిష్టాలు. నాయని వారి మాతృ గీతాలు బాగా ప్రచారం పొందాయి. సుబ్బారావుగారు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ఐదు సంవత్సరాల విద్యాప్రసారాల విభాగం ప్రొడ్యూసరుగా వ్యవహరించారు. 1924లో సహాయ నిరాకరణోద్యమంలోచదువు మానివేశారు. బి.ఏ , బి.ఇ.డి పూర్తి చేసి నరసారావు పేట పురపాలక ఉన్నత పాఠశాలలో టీచర్ గా పని చేసారు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా తొలినాళ్ళలో పని చేసారు. భాగ్యనగర కోకిల , వేదనా వాసుదేవం, విషాద మోహనం, ఫలశ్రుతి, మాతృగీతాలు వీరి రచనలు. 1961లో అఖిలాంధ్ర రచయతల సంఘం వీరిని ఘనంగా సత్కరించింది.

నాయని సుబ్బారావు 9-7-78న గతించారు. వీరి కుమార్తెలు ఆచార్య నాయని కృష్ణకుమారి , కోటీశ్వరి. కృష్ణకుమారిగారు తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాలు అధ్యాపకులుగా వ్యవహరించారు. జన్మభూమి, వేదనా వాసుదేవము, విషాద మోహనము వీరి రచనలు. భాగ్యనగర కోకిల సుబ్బారావు 1958-64 సం॥ల మధ్య వ్రాసిన రచన ఆయన ఉదాత్తకవి. ప్రాపంచిక కామ్యాల పట్ల తగులం పెట్టుకోలేదు నాయని వారు. కులపొలికా ప్రణయాన్ని సాహిత్యంలో ప్రవేశపెట్టిన కవితా మార్గదర్శి నాయని. జన్మభూమి వంటి కావ్యాన్ని ఒక భక్తుడు, జ్ఞాని యోగి మాత్రమే రచింపగలరని చెప్పవచ్చు. అందుకే నాయని వ్రాసినదంతా సువర్ణమే నన్నాడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి.

స్థానం నరసింహారావు (1902-71)

ఆంధ్ర నాటకరంగ చరిత్రలో నరసింహారావు స్థానం చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఆయన స్త్రీ పాత్రదారణలో అసాధారణ ప్రజ్ఞ చూపించారు. స్త్రీ పాత్ర అత్యంత సహజంగా, సొగసుగా నటించి ప్రేశాకుల ఆదరాభిమానాలు చూరగొన్నారు. 1902 సం॥ సెప్టెంబరు 23న గుంటూరు జిల్లా బాపట్లలో నరసింహారావు జన్మించారు. 1920వ సంవత్సరంలో నాటకరంగ ప్రవేశం చేసారు. దాదాపు నాలుగు దశాబ్దాలు స్త్రీ పాత్రలు ధరించారు.

సత్యభామ శృంగార రసాధి దేవత. స్వాభిమానానికి ప్రతీక. ఆ పాత్రను సహజంగా పోషించడంలో స్థానానికి విశిష్ట స్థానం. అలానే సారంగధర నాటకంలో మిత్రాంగి, విప్రనారాయణలో దేవదేవి, కన్యాశుల్కంలోమధురవాణి, హరిశ్చంద్రలో చంద్రమతి, నలదమయంతిలో దమయంతి పాత్రలను విశేష ప్రతిభతో ప్రదర్శించేవారు. నటన ఆయనొక తపస్సు. రోషనార, చింతామణి పాత్రలు విశేషం.

వేషధారణలో, వస్త్రధారణలో ఆయనది ప్రత్యేక స్థానం. చీరకట్టులో అయన చూపే నైపుణ్యం స్త్రీలకే ఆశ్చర్యం గొలిపేది. పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో పాత్ర పోషణలో ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. రాష్ట్రపతి డా॥ రాధాకృష్ణన్, ప్రముఖ రచయత హరీంద్రనాథ చటోపాధ్యాయ నరసింహారావును ప్రశంసించారు. భారత ప్రభుత్వం 1970లో పద్మశ్రీ సత్కారం చేసింది. 1971 ఫిబ్రవరి 21న స్థానం కాలధర్మం చేసారు

1956 నుండి ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగ ప్రయోక్తగా స్థానంవారు చక్కటి నాటకాలు ప్రసారం చేసారు బళ్ళారి రాఘవ సరసన నటించారు. నటశేఖర, ఆంధ్ర గంధర్వ, నాటకావతఁస భిరుదులు పొందారు. తెనాలిలో రామ విలాస సభ స్థాపించి దేశవిదేశాల్లో ప్రదర్శన లిచ్చారు.

మునిమాణిక్యం నరసింహారావు (1898-1973)

కాంతం కథలతో ఆంధ్ర పాఠకులకు చిరపరచితులైన మునిమాణిఖ్యం నరసింహారావు 1898 మార్చి 15న గుంటూరుజిల్లా సంగంజాగర్లమూడిలో జన్మించారు. పూర్వాచార సనాతన కుటుంబం వారిది. తండ్రి ఉపాధ్యాయులు.

తెనాలి, విజయనగరం, రాజమండ్రిలో చదువుకొని బి.ఏ , ఎల్ .టి . పూర్తి చేసారు. ఆ తరువాత గుంటూరు, భీమవరం, బందరు కళాశాలల్లో 30 ఏళ్ళు పని చేసారు. ఆదర్శ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకొన్నారు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో విద్యా ప్రసారాలు అసిస్టెంట్ ప్రొడ్యూసర్ గా పని చేసారు. ఆంధ్ర సారస్వత పరిషత్, తెలుగు పండిత శిక్షణా పాఠశాల హెడ్ మాస్టర్ గా హైదరాబాదులో 5 ఏళ్ళు పనిచేసారు. నవలలు, కధలు ఏది వ్రాసినా ఆయన సునిశితహాస్యం కొట్ట వచినట్లు కనపడేది. పాటలు చెప్పడంలో ఆయన కొత్త తరహ సృషించారు. ఆయన వ్రాసిని కధలలో తెలుగు యింటి ఆడపడుచు దర్శనమిచేది. ఆయన కాంతం కధలు హైలైట్. కాంతం పాత్రకు జీవం పోసిన మహారచయిత ముని మాణిక్యం.

మన హాస్యం పేరుతో ఆయన చక్కని గ్రంధం వెలువరించారు. వక్రరేఖ, తిరుమాళిగ, దీక్షితులు కాంతం, నేను మా కాంతం (1933), కాంతం కైఫియత్, కాంతం కాపురం, మునిమాణిక్యం కథలు, రుక్కుతల్లి, శరధ్రాత్రులు, అన్నయ మంత్రి, మరపు, స్తుతి-ఆత్మస్తుతి, ఇల్లు-ఇల్లాలు, మంచివాళ మాట తీరులు, గాజుల సెట్టి, తల్లి ప్రేమ. వీరి రచనలలో ప్రసిద్ధం. తిరమాళిగా, రుకుతల్లి, దీక్షితులు నవలికలు-కరుణరసభరితాలు.

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వీరిని విశిష్ట సభ్యులుగా సత్కరించింది. కాంతం కధలు, 1927 లో కధాసంకలనంగా వెలువడింది. మునిమాణిక్యం గారి భార్య 1938 లో కాలధర్మం చెందింది. ఆ తర్వాత కాంతం, కాంతం వృద్ధాప్యం రచించారు.

పిల్లలకు, విద్యార్ధులకు సరిపడేలా అన్నయమంత్రి, వక్రరేఖ నవలలను రచించారు. తిరుగుబాటు అనే నాటకం వ్రాసారు. ఇంటావిడతో పోట్లాట, ప్రణయ కలహం, భార్యను లొంగదీసుకోవడం ఎలా - వంటి రచనలు హాస్యస్పోరకాలు. మధ్యతరగతి సంసారాల దాంపత్య జీవిత రహస్యాలను ఆయన సజీవ పాత్రలుగా సృషించారు. 1973 ఫిబ్రవరి 4 న మునిమాణిక్యం కాంతని కలవటానికి స్వర్గలోకం వెళ్ళారు. ఆయన కుమార్లు మునిమాణిక్యం రఘునాధ యాజ్ఞవల్క్య, 'మురయా' సంచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఫిలింపబ్లిసిటీ ఆఫీసరుగా చేసే పదవీ విరమణ చేశారు.

న్యాపతి రాఘవరావు దంపతులు

న్యాపతి రాఘవరావు (1905 - 1984)

రేడియో అన్నమయ్యగా ప్రసిద్ధి కెక్కిన రాఘవరావు 1905 వ సంవత్సరం లో బరంపురంలో జన్మించారు. అక్కడే 1921 లో మెట్రిక్యులేషన్ చదువుతుండగా జాతీయోద్యమంలో ప్రవేశించారు. ఫలింతంగా చదువుకు స్వస్తి పలికారు. కొంత కాలం 'ఆంధ్రవాణి' తెలుగు వారపత్ర్హిక నిర్వహించారు. చదువు మీద పట్టుదలతో బి.ఎ. డిగ్రీ సంపాదించారు. వీరి ధర్మపత్ని కామేశ్వరి. వివాహం 1931 లో జరిగింది.

ఆకాశవాణిలో రాఘవరావు దంపతులు కార్యక్రమాల నిర్వాహణలో రేడియో అన్నయ్య, అక్కయ్యగా ప్రసిద్దికెక్కారు. 1939లో రాఘవరావు కార్యక్రమ నిర్వాహకుడుగా ఆకాశవాణి మదరాసు కేంద్రంలో చేరారు. బాలల పట్ల ఆయన కపారమైన ప్రేమ. వారి విద్యాసాంస్కృతిక వికాసానికి ఎంతగానో తోడ్పడ్డారు. బాలానంద సంఘం పేర 1940లో ఒక సంస్థను స్థాపించారు. జీవితాంతం ఆ సంస్థ కోసం అహరహం కృషి చేసారు, 'బాల' పత్రిక ద్వారా బాలల సర్వతో ముఖాభివృద్దికి కృషి చేశారు.

ఆకాశవాణిలో బాలబాలికల కోసం దాదాపు వెయ్యి రచనలు చేశారు. నాటికలు, రూపకాలు ఒకటేమిటి ఎన్నో రకాలుగా ప్రసారాలు నిర్వహించారు. రంగస్థలం పైన బాలబాలికలచే ఎన్నో కార్యక్రమాలు రూపొందిచారు. పొట్టిబావ, చిట్టిమరదలు, కొంటిక్రిష్ణయ్య, తాతయ్య, మొద్దబ్బాయి, దొడ్డమ్మ పాత్రల ద్వారా బాలనంద కార్యక్రమాలు రక్తికట్టేలా చూసారు. రాఘవరావు రచించిన 'బడిగంట' రూపకం జాతీయ స్థాయిలో బహుమతి పొందింది. ఆయన కొంత కాలం సెంట్రల్ సోషల్ వెల్‌ఫెర్ అడ్వయిజరీ కమిటీ మెంబరుగా పని చేశారు. బాలల కోసం ఒక సినిమా తీశారు. ఎన్నో గ్రామఫోను రికార్డులు రూపొందిచారు.

చివరిదశలో రాఘవరావు హైదరాబాదులోని నారాయణ గూడలోని బాలానంద సంఘ కార్యాలయంలో ఎంతో ఉత్సాహంగా పని చేశారు. 1984 ఫిబ్రవరి 24 న ఆయన హైదరాబాదులో కాలధర్మం చెందారు. కామేశ్వరితో ఆయనకు అన్యోన్య దాంపత్యం. ఇద్దరూ బాలల కార్యక్రమాలు తీర్చిదిద్దడంలో అహరహం కృషిచేశారు. బాలానంద సంఘ సభ్యులు ఎందరో ప్రసిద్ద కళాకారులయ్యారు. బాలానందంలో పాల్గొనడం ఒక విశిష్టతగా భావించేవారు. బాపు, ముళ్ళపూడి వెంకటరమణ, మోహనకందా వంటి ప్రముఖులు యిందులో సభ్యులు కావడం విశేషం పిల్లల మనస్తత్వాన్ని కనిపెట్టి వారి బుద్ది వికాసానికి కార్యక్రమాలు వినోదాత్మకంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసినారు. కళాతృష్ణను పెంపొందించి వారి మనోవికాసనానికి దోహదం చేశారు. ఆయన చిరంజీవి.

న్యాపతి కామేశ్వరి (1908-80)

రాఘవరావుగారి ధర్మపత్ని కామేశ్వరి 1908 వ సంవత్సరంలో విజయనగరంలో జన్మించారు. 1932లో విజయనగరం మహారాజా కళాశాలలో పట్టభద్రులయ్యారు. 1937లో ట్రెయినింగ్ లో యల్. టి. ప్యాసయ్యారు. ఉపాధ్యాయ వృత్తిపై ఆమెకు ఎనలేని గౌరవం. మదరాసు నేషనల్ గరల్స్ హైస్కూలులో అధ్యాపక వృత్తిలో చేశారు. బాలలంటే ఆమెకు వల్లమాలిన ప్రేమ.

రేడియో అన్నయ్యగారితో కలసి బాలానంద సంఘం స్థాపించారు. అవిభక్త మదరాసు రాష్ట్రంలో ఈ సంస్థ బాగా కృషి చేసింది. ఆంధ్ర రాష్ట్రావతరన తర్వాత 1956 లో హైదరాబాదుకు ఈ సంఘం తరలించబడింది. మహిళాభ్యుదయానికి, బాలల విజ్ఞానాభివృద్ధికి బాలానందం ఎనలేని కృషి చేసింది.

1939-56 మధ్యకాలంలో ఆకాశవాణి మదరాసు కేంద్రంలో బాలల కార్యక్రమ రూపకల్పనలో ఆమె అవిరళ కృషి చేశారు. బాలల కార్యక్రమాలు, మహిళా కార్యక్రమాలు, విద్యా ప్రసారాలు తీర్చిదిద్దడంలో ఆమె కృషి అనన్య సాధ్యం. 1956లో హైదరాబాదు కేంద్రానికి బదిలీ అయివచ్చారు రాఘవరావు దంపతులు. రేడియో అక్కయ్యగా కామేశ్వరి శ్రోతలకు పరిచితురాలు. జంట నగరాలలో రేడియో మహిళా మండలులు స్థాపించడంలో ఆమె కృషి ఎంతైనా ఉంది. తెలంగాణాలోని పల్లెలకు కూడా ఈ ఉద్యమం వ్యాపించింది. రేడియో మహిళామండలుల సమాఖ్యను రూపొందించడంలో ఆమె విశేష కృషి చేశారు. సాంఘిక సంక్షేమ సలహా మండలి సమావేశకర్తగా ఆమె చక్కటి పరిశ్రమ చేశారు.

ఆంధ్ర బాలానంద సంఘం పక్షాన బాలలు పాడుకోవటానికి అనువుగా ఎన్నో పాటలు రచించారు. ప్రముఖ సినీ నటులు నాగయ్యగారి చిత్రం ' నా ఇల్లు ' లో ఆమె ఒక పాత్రను పోషించారు. 1974 ఆమె సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 1969 వరకు మూడు దశాబ్దాలు ఆమె రేడియోలో పని చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలలో 1975లో కామేశ్వరి సన్మానం పొందారు. 1980 అక్టోబరు 23న కామేశ్వరి దివంగతులయ్యారు.

రేడియో అన్నయ్య, అక్కయ్య ఆదర్శ దాంపత్యానికి మారుపేరు.

బాలానంద సంఘం సభ్యులు వారిని విస్మరించలేరు.

బాలలు నిత్య విజ్ఞాన సందీప్తులని వెల్లడించింది ఈ దంపతులే. హైదరాబాదులో బాలానంద సంఘం కార్యకలాపాలు కొనసాగినంత కాలం రాఘవరావు దంపతులు చిరంజీవులు. సినీ రంగంలోని కాంచన, షావుకారు జానకి, కృష్ణకుమారి, నేపథ్య గాయని సుశీల, వింజమూరి లక్ష్మి, వైణికులు చిట్టిబాబు బాలానంద సంఘ సభ్యులు.

1948లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రారంభమైనపుడు ' పాలవెల్లి ' బాలల కార్యక్రమం ఈ బాలానంద సంఘ సభ్యులు ప్రథమంగా ప్రసారం చేశారు. రేడియో అక్కయ్య స్మారకార్థం ' కామేశ్వరి స్మారక శిశులాలన కేంద్రం' రాష్ట్ర సాంఘిక సంక్షేమ సలహా మండలి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేశారు. మురికివాడలలో తల్లులు మధ్యతరగతి తల్లులు ఈ కేంద్రాన్ని వినియోగించుకొంటున్నారు. ఆంధ్ర బాలానంద సంఘ ట్రస్టు బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ప్రముఖ ఇంద్రజాలికులు శ్రీ బి. వి. పట్టాభిరాం ఏటా నిర్వహిస్తున్నారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980) :

పిఠాపురాస్థాన కవులైన తండ్రిగారి సాహితీ వారసత్వం కృష్ణశాస్త్రికి లభించింది. వీరి స్వస్థలం పిఠాపురానికి సమీపంలోని చంద్రంపాళెం. 1897 నవంబరు 15 న శాస్త్రి జన్మించారు. వీరు పట్టభద్రులు. కాకినాడ P. R. కళాశాలలో 1931-41 మధ్య ట్యూటర్ గా పనిచేశారు. హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో వీరు తెలుగు ప్రసంగాలశాఖ ప్రొడ్యూసర్ గా 1957-64 మధ్య పని చేశారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం వీరిని కళా ప్రపూర్ణ బిరుదంతో సత్కరించింది. కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి, పల్లకి - వీరి ఖండకావ్య సంపుటాలు. అప్పుడు పుట్టి వుంటే, పుష్పలావికలు, బహుకాల దర్శనం - వచన రచనా సంపుటాలు. వెండి తెర పాటలు మేఘమాలగా ప్రచురితమయ్యాయి. వందలాది చలనచిత్ర గీతాలను రచించారు. ప్రేక్షకుల ఆదరణ లభించింది.

నవ్య సాహిత్యోద్యమానికి ' దేవులపల్లి ' ఆద్యులు. ఆత్మాశ్రయ కవిత్వం వచ్చిన తొలి రోజుల్లో తన దుఃఖాన్ని సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. అనేక రేడియో నాటికలు, ప్రసంగాలు శ్రోతల మన్నన లందుకొన్నాయి. జీవిత చరమ దశలో ' గొంతు క్యాన్సర్ ' వచ్చింది. మదరాసులో చివరి రోజులు గడిపారు. వీరి కుమారుడు ' బుజ్జాయి '. వీరి మేనకోడళ్లు వింజమూరి సీతాదేవి, అనసూయ జానపద సంగీతం ద్వారా ఆకాశవాణికి పరిచితులు. సీత రేడియోలో జానపద సంగీత ప్రయోక్తగా పనిచేసి పదవీ విరమణ చేసింది.

సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకొని కృష్ణశాస్త్రిగారు 24-2-80 న పరమపదించారు.

భావ కవిత్వోద్యమానికి ఆయన పెట్టింది పేరు. గిరజాల జుట్టు, మెరుగు కళ్ళజోడు, తెల్లని లాల్చి, పంచె పల్లెవాటుతో ఆయన భావకవికి మారుపేరై నిలిచాడు. దుస్తులలో ఆయన నెందరో అనుకరించారు. 1975లో దేవులపల్లి కవితా స్వర్ణోత్సవం మదరాసులో ఘనంగా జరిగింది.

కళాప్రపూర్ణ బిరుదంతో (1975) ఆంధ్ర విశ్వవిద్యాలయం, పద్మభూషణతో (1976) భారత ప్రభుత్వం సత్కరించాయి. 1978లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి విశిష్ట సభ్యత్వంతో సత్కరించింది.

శాస్త్రిగారి మరణానంతరం వీరి గ్రంథాలు ఆరు సంపుటాలుగా వెలువరించారు. అమృతవీణ, మంగళకాహళి, కవి పరంపర, కవితా ప్రశస్తి, మహావ్యక్తి, అమూల్యాభిప్రాయాలు, ఇంకా 11 సంపుటాల ఆముద్రిత రచనలున్నాయి.

భాస్కరభట్ల కృష్ణారావు (1918-63) :

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన సుప్రసిద్ధ కథారచయిత భాస్కరభట్ల కృష్ణారావు. కథా రచయితగా, నవలా రచయితగా భాస్కరభట్ల లబ్ద ప్రతిష్ఠులు. 1918 డిసెంబరు 19న హైదరాబాదు నగరానికి సమీపంలో ప్రేమాజీపేటలో జన్మించారు. బి.యస్.సీ. పూర్తిచేసి L.L.B. పట్టా పుచ్చుకొన్నారు. 1951 ప్రాంతాలలో ఆకాశవాణిలో చేరారు. దాదాపు 15 సంవత్సరాలు పనిచేశారు.

కథా రచయితగా ఆయన రెండు దశాబ్దాలు (1939-57) పేరు తెచ్చు కొన్నారు. కథా సంపుటులు మూడింటిని ప్రచురించారు. కృష్ణారావు కథల పేరుతో 1955లో పది కథలుసంపుటిగా ప్రచురించారు. రెండోసంపుటి ' చంద్రలోకానికి ప్రయాణం ' అనే పేర 9 కథలు ప్రచురించారు. మూడో సంపుటి వెన్నెలరాత్రిలో 17 కథలు ప్రచురించారు. కథా రచనలేగాక నాలుగు నవలలు కూడా ప్రచురించారు. వింత ప్రణయం, యుగసంధి 1957లో, వెల్లువలో పూచిక పుల్లలు 60లో, భవిష్యద్దర్శనం 66లో వెలువరించారు. ఈ నవలల్లో పాశ్చాత్య ప్రభావంలోని ఆస్తిత్వవాదం ప్రస్ఫుటమవుతుంది. భాస్కరభట్ల 1966 నవంబరు 11న కాలధర్మం చెందారు.

కార్యక్రమ నిర్వాహకుడుగా చక్కటి పేరు సంపాదించారు. ప్రసారాలను విశేషంగా రూపొందించారు.

బుచ్చిబాబు 1916-67

శివరాజు వెంకటసుబ్బారావు బుచ్చిబాబుగా ప్రసిద్ధులు. ఈయన 1916 జూన్ 14న ఏలూరులో జన్మించారు. ఎం. ఏ. పట్టభద్రులయ్యారు. రచయితగా ఆయన సుప్రసిద్దులు. పాలకొల్లు, గుంటూరు, మదరాసు, నాగపూర్ లలో విద్యాభ్యాసం చేశారు. 1945 నుండి ఆకాశవాణి మదరాసు, విజయవాడ, హైదరాబాదు కేంద్రాలలో కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేశారు. హైదరాబాదు కేంద్రంలో వీరి స్థానం సముచితం. అనంతపురం, విశాఖపట్టణాలలో కాలేజీల్లో ఇంగ్లీషు లెక్చరర్ గా చేశారు. వీరి రచనలలో 1946 లో వ్రాసిన 'చివరకు మిగిలేది' నవల సుప్రసిద్దం. మేడమెట్లు, అడవికాచిన వెన్నెల, కథాసంపుటాలు ఆత్మ వంచన, దారినపోయే దానయ్య, తెరవడని నాటకం, కార్యదర్శి, కల్యాణి, ఉమర్ ఖయ్యాం నాటికలు వ్రాశారు. ప్రాక్ పశ్చిమ సాహిత్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

తండ్రి ఓవర్‌సీర్‌గా ఉద్యోగం చేస్తుండటంతో బుచ్చిబాబు ఆంధ్రదేశంలోని పలుప్రాంతాలు సందర్శించి, నివసించే అవకాశం కలిగింది. ఆ నేపథ్యంలో ఆయన రచనలు గ్రామీణ వాతావరణం ప్రతిబింబిస్తాయి. 1936-67 మధ్యకాలంలో ఆయన ఎన్నో తెలుగు ఇంగ్లీషు రచనలు చేశారు. ఇంగ్లీషు రచనలకు 'సంతోష్ కుమార్‌' అనే కలం పేరుతో వెలువరించారు. షేక్స్‌స్పియర్ సాహిత్య పరామర్శ చక్కటి విమర్శనాగ్రంథం. 40 వ్యాసాల సంపుటిని, 40 నాటికా, నాటకాలను అజ్ఞానమనే వచన కావ్యాన్ని వ్రాశారు. అనుభూతిని కథలలో జొప్పించిన వారిలో బుచ్చిబాబు ప్రథముడు. ఆయన గాయకుడు, నటుడు, చిత్రకారుడు, సాహిత్యకారుడు, సౌందర్యారాధన, మనస్తత్వ చిత్రణ ఆయన కథలలో ప్రస్పుటమవుతుంది.

1967 సెప్టెంబరు 20న బుచ్చిబాబు పరమపదించారు.

వీరి ధర్మపత్ని శివరాజు సుబ్బలక్ష్మి రచయిత్రిగా పేరు పొందారు. బుచ్చిబాబు కవితాత్మగల చిత్రకారుడు. చిత్రకళా కోవిదుడైన కవి. అంతరంగ కథనం పేరుతో ఆయన తన బాల్య జీవితానుభవాలను అద్భుతంగా వ్రాసుకొన్నారు. 'శిల్పమంతా నీ చేతిలోవుంది బుచ్చిబాబూ, అని విశ్వనాథ సత్యనారాయణ, 'ఆంగ్లంలో నిధివి' అని పింగళిలక్ష్మికాంతం బుచ్చిబాబుని ప్రశంసించేవారు. ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్‌ కపూర్ వీరిని బహుధా ప్రశంసించారు. రేడియో నాటకాలకు ఆయన మార్గదర్శి. వందకిపైగా రేడియో నాటికల్ని ప్రొడ్యూస్ చేశారు రేడియోకు ఆయన వ్రాసిన 'రాయలు కరుణకృత్యం' నాటక ఆధారంగా 'మల్లేశ్వరి' సినిమాతీశారు. స్టేజి నాటకాలను వ్రాసి ప్రదర్శనలిప్పించారు.

చివరకు మిగిలేది నవల 'నవోదయ' పత్రికలో దారావాహికంగా వెలువడింది. ఆ నవల దాదాపు పాతిక ముద్రణలు పొందింది. ఎంకి పాటలంటే ఆయన కిష్టం. ఆ పాటల ప్రేరణతో 'ఉత్తమ ఇల్లాలు' అనే రేడియో నాటకం వ్రాశారు. ఎంకి పాటలకు ఆయన బొమ్మలు వేసుకొని దాచుకొన్నారు. అంతటి ప్రజ్ఞాశాలి ఉద్యోగం చేస్తూ 51 వ ఏట కన్నుమూశారు.

దాశరథి (1926-87)

'నా తెలంగాణ కోటిరతనాల వీణ' అని సగర్వంగా పలికిన దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణలోని 'చిన గూడూరు'లో జన్మించారు. తెలంగాణ సూర్యచంద్రులుగా నారాయణరెడ్డి, దాశరథి పేరు గడించారు. నవాబు పరిపాలనను ఎదిరించి జైలుకెళ్ళారు. వీరికి జైలులో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పరిచితులయ్యారు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషలలో సమానంగా ఉర్దూలో పాండిత్యం సంపాదించారు. ఆయన మలేషియా అమెరికా మొదలైన దేశాలలో విస్తృతంగా పర్యటించారు. 1947-48 కారాగారవాసం చేశారు.

హైదరాబాదు, మదరాసు ఆకాశవాణి కేంద్రాలలో అసిస్టెంట్ ప్రొడ్యూసర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు వ్రాశారు. సినిమా కోసం రేడియోకు రాజీనామా చేశారు. వీరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థానకవిగా నియమించింది. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖవారు గౌరవ సలహాదారుగా (Producer Emiretus) నియమించారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణతో సత్కరించింది. ఆగ్రా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ నిచ్చింది.

అమృతాభిషేకం, అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, మహాబోధి, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, ఆలోచనాలోచనాలు కవితా సంపుటాలు. గాలిబ్ గీతాలు అనువాద గ్రంథం. తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 5-11-87న దాశరథి పరమపదించారు.

వీరి సోదరులు దాశరథి రంగాచార్య మంచి నవలా రచయిత. మునిసిపల్ శాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు.

దాశరథి రుబాయిలను, గజళ్ళను వ్రాయడంలో అందెవేసిన చేయి. ఆయన మంచి సాహిత్య విమర్శకుడు. సాహిత్య సభలు, కవిసమ్మేళనాలు ఆయన అధ్యక్షత వహించిన తీరు ఎంతోవిలక్షణం. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు పద్యం వ్రాసినా వచన కవిత్వం వ్రాసినా, గేయం వ్రాసినా అందచందాలు చూపగలిగేవాడు. దాశరథి సింహగర్జనకవితోద్యమమై తెలంగాణా అంతటా ఆవరించింది. అభినవ దాశరథీ శతకంలో ఆయన సామాజిక స్పృహ స్పష్టమవుతుంది. జయదేవుని గీతా గోవిందానికి భావవ్యాఖ్యనం చేశారు. ప్రతిభాపూర్వకమైన ఉపోద్ఘాతం వ్రాశారు. వ్యాసపీఠం పేరుతో ఆయన సాహిత్యవ్యాస సంపుటి ప్రచురించారు. అందుకే కవితాశరధి దాశరథి

డా. రావూరి భరద్వాజ :

కథా రచయిత, నవలా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భరద్వాజ గుంటూరుజిల్లాలో జన్మించారు. నాలుగోతరగతి మించి చదువుకోలేదు. ఆకాశవాణిలో చేరడానికి ముందు పేనాలు అమ్మడం మొదలు పత్రికలలో పనిచేయడం వంటి సాదాసీదా పనులు చేశారు. ఆకాశవాణి హైద్రాబాదు కేంద్రంలో Script writerగా చేరారు.

1975 తెలుగు ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా హైదరాబాదులో చేరారు. 1984లో రిటైరయ్యేంత వరకు ఆయన ప్రసంగశాఖను సమర్థవంతంగా నిర్వహించారు.

పాకుడురాళ్ళు నవల ద్వారా భరద్వాజ లోకానికి సుపరిచితులు. అనేక నవలలు, కథలు, వ్యాసాలు, బాలసాహిత్యం భరద్వాజ కలంనుండి వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ 'సోవియట్ లాండ్ నెహ్రూ బహుమతులు అందుకున్నారు. జీవన సమరం పేర సామాన్యుని స్వగతాలు ఈనాడు పత్రికలో ధారావాహికగా ప్రచురితమై గ్రంధరూపంలో వచ్చాయి. జమీన్ రైతు, దీనబంధు, రేరాణి పత్రికలలో పని చేశారు.

ఆయన సతీమణి కాంతమ్మ మరణానంతరం స్మృతి కావ్యాలను ప్రచురించి ఆ రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయం డాక్టరేట్ తో, కళాప్రపూర్ణ బిరుదంతో ఆంధ్ర విశ్వకళాపరిషత్ సత్కరించింది.

1987 లో ఆకాశవాణిలో పదవీ విరమణనంతరం తెలుగు విశ్వవిద్యాలయములో ప్రొడ్యూసర్ గా కొంత కాలం పని చేశారు.

అజర్ అఫ్సర్:

నయీరంగ్ కార్య క్రమాల నిర్వహణ ద్వారా ఉర్దూ కార్య క్రమాల రూప కల్పనకు అహరహం కృషి చేసి రెండు దశాబ్దాల పాటు ఖ్యతి గడించిన వ్వక్తి అజల్ అఫ్సర్. 1975 లో ఉర్దూ విభాగం ప్రొడూసర్ గా చేరి ఒక దశాబ్ది పాటు ఈ కార్య క్రమాలకు వన్నె తెచ్చిన వ్యక్తి అప్సర్. స్వయంగా ఉర్దూలో చక్కటి కవి. 1884 లో అజల్ అఫర్ పదవీ విరమణ చేశారు.

వసీం అక్తర్:

ఉర్దూ వార్తా విభాగంలో రెండు దశాబ్దాలు విచ్చిన్నంగా వార్తలు చదివిన వ్యక్తి వసీం అక్తర్. ఆయ ప్రత్యేక బాణీని ఎందరో మిమిక్రీ కళాకాఅరులు అనుకరించేవారు. ఆయన 1984 లో పదవీ విరమణానంతరం 1994 ప్రాంతంలో పరమ పదించారు.

డా. వడ్లమూడి గోపాలకృష్ణయ్య:

వాఙ్మయమహాధ్యక్ష, కళాప్రపూర్ణ వడ్లమూడి గోపాలకృష్ణయ్య కొద్దికాలం ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో (1964 -66) ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఆ తరువాత వారు హైదరాబాదులోని ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారాధిపతిగా పని చేసి పదవీ విరమణ చేశారు. వ్యాకరణ శాస్త్ర వేత్త, బహు గ్రంథ రచయిత అయిన గోపాల కృష్ణయ్య బహుభాషావేత్త.

నండూరి విఠల్:

తన కమ్రకంఠ స్వరంతో శ్రోతల నాకట్టుకొన్న నండూరి విఠల్ విజయవాడ కేంద్రలో అనౌన్సర్ గా జీవితం ప్రారంభించారు. విజయవాడ, హైదరాబాదుల్లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేసారు. దూరదర్శన్ హైదరాబాదు కేంద్ర డైరక్టర్ గా పని చేశారు. వీరి విషకన్య నవల ప్రసిద్ధం. చిన్నారి ప్రచురణలపేర విజయవాడలో పుస్తకాలు ప్రచురించారు. అనారోగ్య రీత్యా స్వచ్చంద పదవీ విరమణ చేసి 1994 లో హైదరాబాదులో మరణించారు.

వేలూరి సహజనంద:

వేలూరి వంశంలో జన్మించిన సహజానంద హైదరాబాదు కేంద్రంలో ఒక దశాబ్ది పంచ వర్ష ప్రణాళిక ప్రొడ్యూసర్ గా పని చేశారు. పంచవర్ష ప్రణాలికల ద్వారా దేశాభివృద్ధిని గూర్చి ప్రచారాలు రూపొందించడములో ఆయన కృత కృత్యులయ్యారు. 1979 ప్రాంతంలో ఆయన అకాల మరణం చెందారు. రచయితగా సహజానంద ప్రసిద్ధులు.

డా. రామమూర్తి రేణు:

హిందీలో సుప్రసిద్ధవిద్వాంసులైన వారణాసి రామమూర్తి గారు, రామమూర్తి రేణుగా ప్రసిద్ధులు. హిందీ ప్రసంగాల విభాగాన్ని హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు నిర్వహించారు. వీరు వ్యాఖ్యాతగా కూడ పరిచితురు. వీరు హైదరాబాదులో విశ్రాంతి జీవన గడిపారు.

N.V.S. ప్రసాద రావు:

తెనాలి వాస్తవ్యులయిన N.V.S ప్రసాద రావు ఆకాశవాణిలో 64 ప్రాంతాల్లో హైదరాబాదు కేంద్రంలో గ్రామీణ కార్యక్రమాల ప్రొడ్యూసర్ గా చేరారు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబందాలు గల ప్రసాదరావు గ్రామీణ కార్యక్రమాల రూప కల్పనలో సిద్ధ హస్తులు. 1980 లో రిటైర్ అయిన తర్వాత కొంత కాలం రాష్ట్ర వ్వవసాయశాఖ నడిపే మాస ప్రత్రిక ఎడిటర్ గా పని చేశారు. ఆ తర్వాత రవీంద్ర భారతి డైరక్టర్ గా వ్వవరించారు. హైదరాబాదు లోని వివిధ సాంస్కృతిక సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధం. వీరి కుమార్తె సుశీల హైదరాబాదు కేంద్రంలో అనౌన్సర్ గా పనిచేస్తున్నారు.

కేశవ పంతుల నరసింహశాస్త్రి:

కె.వి.ఎన్. శాస్త్రిగా ప్రసిద్ధులైన కేశవ పంతుల సంస్కృత పరిచయం ద్వారా ఆంధ్ర శ్రోతలకు సుపరిచితులు. వీరు హైదరాబాదు కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా ఒక దశాబ్ధి పైగా పనిచేసి పదవీ విరమణ చేశారు. హైదరాబాదులో 91లో కాల ధర్మం చెందారు.

గొల్లపూడి మారుతీరావు:

G.V.S.M.L. నారాయణరావు విశాఖ పట్టణంలో 1939 ఏప్రిల్ 14న జన్మించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయములో M.Sc.,(Mathematical physics) చేశారు. 1961-63 మధ్య కాలంలో ఆంధ్ర ప్రభ (చిత్తూరు) లో సబ్ ఎడిటర్ గా పని చేశారు. మారుతీ రావు రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నాటక రచయితగా నటుడుగా పేరు పొందారు.

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా 1963 లో చేరారు. ఎందరో మహామహులు అప్పుడు ఆకాశవాణిలో పని చేస్తున్నారు. దాశరధి, దేవులపల్లి, స్థానం, మునిమాణిక్యం ఇలా ఎందరో వారితో కలిసి పని చేశారు. అప్పుడే చక్ర భ్రమణం నవలను "డా: చక్రవర్తి " సినీ కథకు మాటలు వ్రాసి సినీ రచయితగా స్థానం సంపాదించారు. వందలాది సినిమాలకు కథ, మాటలు సమకూర్చారు.

1981 లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి 81..96 మధ్య కాలంలో మూడు వందల పైగా సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి బహుమతులందుకున్నారు.

ఆకాశవాణి సంబల్ పూర్, మదరాసు, కడప కేంద్రాలలో ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్ గా రెండు దశాబ్దాలు పని చేశారు. 1980 లో ASD గా పదోన్నతి పొంది 1982లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. 1970-80 మధ్య కాలములో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పని ఛేశారు. కథారచయిత, వ్యాసరచయిత, నటుడు, నాటక రచయిత సినీరచయిత గా మారుతీరావు బహు ముఖ ప్రజ్ఞాశాలి. మారుతీరావు మదరాసులో స్థిరపడ్డారు.

మారుతీరావు రచనలపై వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశీధన చేసి డా. యం. రజని పి.హెచ్.డి పట్టా పొందారు. వీరు రచించిన కళ్ళు నాటిక ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీచే 1975 ఉత్తమ నాటక రచయిత బహుమతి పొందింది. 'కళ్ళు' సినిమాగా రూపొందించబడి 1989 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు పొందింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'జీవనకాలమ్' 16 సంవత్సరాలుగా నిర్వహిస్తూ సామాజిక జీవన సమస్యలను విశ్లేషిస్తున్నారు. 10 కి పైగా నాటకాలు, 20 నాటికలు, 10 నవలలు వ్రాసి సాహితిలోకంలో విశిష్ట స్థానం సంపాదించారు. వంద దాకా చిత్రాలకు సంభాషణలు. కథలు సమకూర్చారు. 1982 నుండి ఎన్నో సంస్థలచే ఉత్తమ నటులుగా బహుమతులు పొందారు. ఇటీవల కాలములో ఈ టీవి జెమినీ టీవీలకు వివిధ కార్య క్రమాలు రూపొందిస్తూ తమ విలక్షతను చాటుకొంటున్నారు గొల్లపూడి. మంచి మిత్రులు మారుతీరావు.

దండమూడి మహీధర్:

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రములో హిందీ స్క్రిప్ట్ రైటర్ గా రెండున్న దశాబ్దాలుగా పనిచేసిన మహీధర్ హిందీలో మంచి రచయిత. అనువాదకు/డుగా మంచి పేరు సంపాదించారు.

కె.చిరంజీవి.

మూడు దశాబ్దాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో నాటక విభాగంలో డ్రామ Voice గా పనిచేసి చిరంజీవి పదవీ విరమణ చేశారు. చక్కటి కంఠ స్వరం గల చిరంజీవి మంచి రచయిత కూడా. నాటకాలు శ్రవ్య మాధ్యమానికి సరి పడేలా రూపొందించడములో సిద్ధహస్తులు. ఆయన 'స్వతంత్ర భారత్ కీ జై' నవల వ్రాశారు. రేడియో నాటికలు ఒక సంకలనంగా ప్రచురించారు. 1994 లో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు. శారదా శ్రీనివాసన్‌తో కలిసి అనేక రేడియో నాటకాలలో పాల్గొన్నారు.

మల్లాది నరసింహశాస్త్రి :

మల్లాది వంశంలో జన్మించిన నరసింహశాస్త్రి అసిస్టెంటు ఎడిటర్ Srciptగా హైదరాబాదు కేంద్రంలో మూడు దశాబ్దాలుగా పనిచేశారు. మల్లాది రామకృష్ణశాస్త్రి కుమారులు వ్వవసాయ విభాగములో శాస్త్రి చక్కటి పేరు తెచ్చుకున్నారు.

విజయవాడలో అనౌన్సర్ గా చేరి స్క్రిప్ట్ రైటర్ గా వ్యవసాయ విభాగములో చేరారు.

1984 లో పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు.

దూరదర్శన్ లో అసిస్టెంటు డైరెక్టర్ గా పని చేస్తూన్న శైలజా సుమన్ వీరి కోడలు.

.

డా. వింజమూరి సీతా దేవి:

జానపద విభాగములో ప్రొడ్యూసర్ గా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు పనిచేసిన సీతాదేవి ప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేన కోడలు. వింజమూరి సీత, అనసూయ అక్క చెల్లెండ్రు. ఇద్దరూ జానపద గాయకులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణాలో అనేక ప్రాంతాలలో పర్యటించి జానపద గేయాలకు ప్రాణం పోశారు. సీతా దేవి స్వయంగా గానం చేస్తారు. జానపద గేయాలు సంకలన రూపంలో వెలువరించారు. 1984 లో సీతాదేవి పదవీ విరమణ చేసి హైదరాబాదులో స్థిరపడ్డారు. భక్తి - ముక్తి, లాలి-తాళి పేర జానపద గేయాలు ప్రచురించారు. కొంత కాలం మదరాసు కేంద్రంలో పనిచేశారు. వీరికి కళా ప్రపూర్ణ బిరుదాన్ని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ యిచ్చి సత్కరించింది.

శ్రీమతి సునందినీ ఐప్:

అనంతపురంలో 1926 నవంబర్ లో జన్మించారు. బి.ఎ. బి.యిడి పూర్తి చేసి కొంత కాలం అధ్యాపకులుగా పని చేశారు. 1972 లో ఆకాశవాణి హైదరబాదు కేంద్రంలో విద్యాప్రసార విభాగంలో ప్రొడ్యూసర్ గా చేరారు. విద్యాప్రసారాలను పటిష్టం చేసి బహుళ జనామోదం చేయడంలో కృతకృత్యులయ్యారు. విద్యాశాఖతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని విద్యాప్రసారాల రూపకల్పనలలో కొత్త ఒరవళ్ళు సృష్టించారు. ఎన్.వి.ఎస్. రామారావు (అనౌన్సర్)గా వీరి శాఖకు సహకారాలందించారు. ఆయన 1995 లో హృద్రోగంతో హఠాన్మరణం చెందారు. రామారావు చక్కటి నటుడు. ఈల పాట రఘురామయ్య సన్నిహిత బంధువు. సునందిని 1984 నవంబరులో స్టేషన్ డైరక్టర్ గా మైసూరులో పదవీ బాధ్యతలు స్వీకరించి అదే నెలాఖరులో పదవీ విరమణ చేశారు. ఆమె ఇప్పుడు హైదరాబాదులో స్థిరపడ్డారు. చక్కటి వాచకం గల వ్వక్తి సునందిని.

పండు ధర్మజ్ఞాని:

కృష్ణా జిల్లా వాసి అయిన ధర్మజ్ఞాని తొలి నాళ్ళలో పనిచేసిన వారిలో ప్రథములు. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా చేరి విజయ వాడ, హైదరాబాదు, డిల్లీ, జమ్మూ, జైపూర్ లలో పని చేశారు. బెంగుళూరు కేంద్రం డైరక్టర్‌గా కొంత కాలం పనిచేసి పదవీ విరమణ చేశారు.

శ్రీ వింజమూరి వరద రాజ అయ్యంగార్:

సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు వింజమూరి వరద రాజయ్యంగార్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో కర్ణాటక సంగీత విభాగం అసిస్టెంటు ప్రొడ్యూసస్ర్ గా 1965 నుండి ఒక దశాబ్ది కాలం పని చేశారు. వీరిది గుంటూరు జిల్లా. గాత్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన వీరి నేతృత్వంలో చక్కటి కార్యక్రమాల రూపొందించాయి. వీరు 1994 ప్రాంతంలో కాలధర్మం చెందారు. వీరి కుమారులు శ్రీ వి. గోవింద రాజన్ I.A.S అంధ్ర రాష్ట్ర ప్రభుత్వ్ కార్యదర్శిగా వ్వవహరించారు. కేంద్ర ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

డా. మంచాల జగన్నాథరావు:

వైణికులుగా జగన్నాథరావు సుప్రసిద్ధులు. వీరి సోదరులు వాడ్రేవు పురుషోత్తం ఆకాశవాణి హైదరాబాదులో కలసి పని చేశారు. జగన్నాథరావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆతర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పని చేశారు. 1984 లో రిటైరయ్యారు. జగన్నాథరావు హైదరాబాదులో పరమ పదించారు. నేత్ర వ్యాధి తో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముగ్ధుల్ని చేసే వారు. అలహాబాదు పాట్నా కేంద్రాలలో హిందూస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. వయోలిన్ విద్వాంసులు మారెళ్ళ కేశవరావు హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వారిలో ఒకరు.

N.S.శ్రీనివాసన్:

T.S. మహాలింగం శిష్యులుగా వేణునాదంలో ప్రసిద్ధులు. శ్రీ ఎన్.ఎస్. శ్రీనివాసన్ ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో వేణుగానం ఆర్టిస్టుగా మూడు దశాబ్దాలు పని చేశారు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శ్రీనివాసన్ అనేక రూపకాలను ఆకాశవాణిలో సమర్పించారు. సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా పని చేసి పదవి విరమణ చేసారు.

వీరి సతీమణి శారదా శ్రీనివాసన్ అద్భుతగాత్ర సౌందర్యంగల వ్వక్తి. ఆమె హైదరాబాదు కేంద్రంలో డ్రామా వాయిస్ గా మూడు దశాబ్దాలు పైగా పనిచేసి 1996 లో రిటైర్ అయ్యారు.

పాలగుమ్మి విశ్వనాథం :

పాలగుమ్మి విశ్వనాథంగారు లలిత సంగీత విభాగం ప్రొడ్యూసర్ గా హైదరాబాదు కేంద్రంలో రెండు దశాబ్దాలు పనిచేసి 1982లో పదవీ విరమణచేసారు. కర్ణాటక లలిత సంగీతకచేరీలు నిర్వహించటంలో విశ్వనాథం ప్రవీణులు. వీరు లలిత సంగీతానికి చక్కని ఒరవడి పెట్టారు. వీరి సంగీత నిర్వహణలో అనేక కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. వీరి తర్వాత M చిత్తరంజన్ ఆ బాధ్యతలు స్వీకరించారు. చిత్తరంజన్ ఈ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీణ ఆర్టిస్టుగా మొదట చేరారు.

S. రాజారాం :

ప్రముఖ మృదంగ సంగీత విద్వాంసులు రాజారాం. వీరు మైసూరు వాసుదేవాచారి మనుమలు. ఆర్టిస్టుగా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా వివిద కేంద్రాలలో పని చేసారు. ఢిల్లీలో సంగీత విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. 1981లో హైదరాబాదు కేంద్ర డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి 1983 జనవరిలో రిటైరయ్యారు. ప్రస్తుతం వీరు మదరాసు కళాక్షేత్రంలో ప్రిన్సిపాల్ గా ఒక దశాబ్దిగా పనిచేస్తున్నారు. వీరి సోదరులు యస్ కృష్ణమూర్తి మైసూరు కేంద్రం డైరెక్టర్ గా రిటైరయ్యారు.

చెరుకుమిల్లి భాస్కరరావు:

హైదరాబాదు కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్(Scripts)గా పని చేసారు. రచయత , కళాకారుడు అయిన భాస్కరరావు దూరదర్శన్ కేంద్రంలో కూడా పని చేసారు.

మొదలి అరుణాచలం:

రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసి ఆకాశవాణి కేంద్రంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీసర్ గా రెండు దశాబ్దాలు 93లో పదవీ విరమణ చేసారు. కధా రచయత, రూపక రచయత అరుణాచలం కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు బహుళ జనామోదం పొందడానికి కృషి చేసారు. వీరొక కథల సంపుటి ప్రకటించారు. వీరి కుమార్తె ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదులో పని చేస్తున్నారు.

శ్రీమతి తురగా జానకీరాణి:

తురగా కృష్ణమోహన్ హైదరాబాదు వార్తా విభాగాదిపతిగా పనిచేసి అకాల మరణం చెందారు. వారి సతీమణి జానకీరాణి 1975 లో ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో women & children ప్రొడ్యూసర్ గా చేరారు. అంతకు ముందు రాష్ట్ర