ప్రభుత్వము/మూడు శక్తులు

వికీసోర్స్ నుండి

3

మూడు శక్తులు

ఈమూడు శక్తులును ఒక్కటే స్థానమునందు ఏకమైయుండునెడల కలుగునష్టము మిక్కిలి యెక్కువయని యెరింగి లోకము బహుకాలముగా వీనిని వేరుపరచియుంచుటకు సర్వ ప్రయత్నములును చేసినది. అయిన నెచ్చటను సంపూర్ణముగా వేరుపరచుటకు రాలేదనుటయు నిక్కువమే. మొదటినుండియు లోకములో నిరంకుశ ప్రభువులు దేశములను వశముచేసికొని సర్వాధికారములును తమచేతులలో నుంచుకొని పరిపాలించుచు తమ దివ్య చిత్తమునకు వచ్చినదియే శాసనముగా ప్రవర్తించుచు వచ్చినందున పై ప్రయత్నము జరుగవలసివచ్చినది.

చిన్న ఉదాహరణమును గొందము. సైనికాధికారమునకుపోలిన మరియొక నిరంకుశప్రభుత్వపద్ధతి లేనేలేదు. సైనికాధికారప్రభుత్వ మున్నంతకాలము అధికారమున నుండునట్టి సైనికాధికారి నోట నేమాట యుచ్చరించిన నది శాసనము. అత డేయర్థము చెప్పిన నదియే శాసనమునకు నర్థము. అత డేరీతిని శాసనమును అమలులో పెట్టిన నదియే శాసననిర్వహణము. కాబట్టి సైనికాధికార ప్రభుత్వమున నధ్యక్షుడుగానుండు నతడు ప్రభుత్వాంగములును మూడింటిని పూర్తిగా వశముచేసికొని ఇచ్చకు వచ్చినమేరకు చరించుచుండును. కొంతకాలముక్రిందట పంజాబులోను, ఇతర ప్రాంతములలోను స్వల్ప కాలము సైనికప్రభుత్వము వెలసినదనుమాట మాచదువరు లెరుం గుదురు. అప్పుడు జరిగిన ఘోరస్థితులును పదేపదే వర్ణితములయియేయున్నవి. గౌరవవంతులగు మానవులను పొట్టమీద ప్రాకించు నంతటి యధికారముకూడ సైనిక ప్రభుత్వాధికారులకు నుండినది యనినచో శాసననిర్మాణ, వివరణ, నిర్వహణాధికారములు మూడును పరిపూర్ణముగ నేక వ్యక్తియందు ఇమిడినచో కలుగు దుర్భరస్థితి యర్థము కాకపోదు.

ఈశక్తుల విభాగము మనపూర్వచరిత్రమున ఎంతవరకు జరిగినది? నే డెంతవరకు కలదు? ముం దెంతవరకు నుండగలదు? అనుప్రశ్నలకు ప్రత్యుత్తరము వ్రాయగడంగినచో నదియే మహాగ్రంథము కావచ్చును. అయిన క్లుప్తముగా సంగతినిగమనించి ముందు విషయముసకు తరలవలసి యున్నాము. సామాన్యముగా పూర్వము మనదేశములో రాజులు నిరంకుశులుగా నుండిరనియు అప్పటికాలమున శాసననిర్మాణము, శాసనవివరణము, శాసననిర్వహణమను విభాగ ముండనే లేదనియు వ్యవహరించుట గలదు. ఇదివరలోనే యీగ్రంథములోనే తెల్లము చేసినవిధమున గ్రామగ్రామమునకు స్వతంత్రజీవనమేర్పడి యుండిన దే కాక మనరాజులు నిరంకుశులుగాక, నేటి ఆంగ్ల సార్వభౌముని పగిదిని మితాధికారధూర్వహులుగానుండి రనుట, రానురాను చరిత్రకారులు గ్రహించుచున్నారు. ఋషులు శాసనములుచేయ, ప్రజారంజకముగ మంత్రులు వానికర్థముజెప్ప, రాజులు వానిని అమలులో పెట్టుచుండినారు. రాజు శాసననిర్వహణాధికారి తక్క వేరుకాదు. ఇది రామాయణకాలమునకు మున్నే మన భారతభూమి యందు వ్యాపించియుండిన పద్ధతి. సూక్ష్మవిమర్శ మరియొకచోట చేయనగును. పాశ్చాత్య భూములలోనో శాసననిర్మాణ, శాసనవివరణ, శాసననిర్వహణాధికారము లన్నియు కొంతకాలము రాజుల చేతులలోనుండి, తరువాత సామంతుల చేతులలోబడి, ప్రజల యొత్తిడిచేత క్రమక్రమముగా వేరుపడి మరల ప్రజాప్రభుత్వములు విరివిగా తలయెత్తిన తరువాత ప్రజాప్రతినిధులలో కేంద్రీకారము నందుచున్నవి. డిక్టేటరులలో ఈ కేంద్రీకరణము విపరీతమై అలజడి కలిగించుచున్నది. శాసననిర్మాణ, వివరణ, నిర్వహణాధికార విభాగమునకు కలిగిన ముఖ్యకారణము అధికారుల నిరంకుశప్రవర్తన. దానిని మట్టుపెట్టి రాజ్యమున ప్రజల యభీష్టము నెరవేరునట్లు చేసికొనుటకు ప్రజాసమూహము రాజులకును, అధికారవర్గములకును శాసననిర్వహణాధికారము మాత్ర ముంచి, తక్కుంగల యధికారములను క్రమక్రమముగా తమకో, అది సాధ్యముకానిచో అధికారవర్గమునకు ప్రత్యక్షముగా లోబడని యట్టి ప్రత్యేకవ్యక్తులకో, చెందజేయ ప్రయత్నించుచు వచ్చినది. మన దేశములోను దేశీయమహాసభ ఏబదియేండ్లుగ శాసనసభ సంపూర్ణముగా ప్రజానువర్తి కావలసినదనియు, అధికారవర్గమువారికి న్యాయవిమర్శన శక్తియుంగూడ నుండరాదనియు - అనగా కలెక్టరులు పోలిన వారికి మేజిస్ట్రీటు అధికార ముండరాదనియు--కోరుటకు కారణమును ఇదియే. బ్రిటిషురాజ్య మిచ్చట స్థాపితమైన పిదప శాసననిర్మాణ, వివరణ, నిర్వహణశక్తులు మూడును అధికారవర్గమునందు కేంద్రీకృతమయి యుండుటచేత మనరైతులు ఫారెస్టు, డీ. పీ. డబల్ యు ఇత్యాదివిషయములలో దుర్భరావస్థ పడవలసివచ్చినది. ఈపరిస్థితియంతయు నొక్క కాలమున పాశ్చాత్యభూములలో పొడసూపినదియే. మనదేశమునందు కాంగ్రెసువారి నిరంతరప్రయత్నముచేతను, భారతపుత్రీపుత్రుల యపారత్యాగముచేతను మనకు నేటిదినము పరగణాలలో నొకవిధమయిన స్వపరిపాలన యేర్పడి పరగణాలమట్టుకు సర్కారు ఇలాకాలపయి మనవోట్లచే నేర్పడు మంత్రులకు అధికారము కలిగియున్నది. కాని భారతప్రభుత్వము పూర్ణముగా స్వతంత్రమగువరకు నిరంకుశఛాయ విడిచిపోయిన దనుకొనరాదు. నేటి ఐ. సి, ఎసుల నియామకము, వారితీసివేత, వారి రక్షణ శిక్షణలు సర్వము మంత్రుల యధీనమైననాడే మనకు నిజమగు స్వాతంత్ర్యము కలిగినట్లెన్నదగును. ఇదివరలో సంపూర్ణప్రజాప్రభుత్వము లనుకొనిన జర్మనీ, ఇటలీ మున్నగు రాష్ట్రములలో శాసననిర్మాణ, నిర్వహణాధికారములు హిట్లరు, ముస్సోలినీల హస్తగతములగుటచేత శాసనవివరణాధికారులనుగూడ లొంగదీసికొని వారు నేడు 'నియంత'లను క్రొత్తరకపు నిరంకుశాధికారులు కాగలిగినారు. అందుచేతనే నేటికిని ఎంతటిప్రజాప్రభుత్వములు ప్రబలినను పాశ్చాత్యభూములలో ఉదారులైనవారందరును శాసననిర్మాణ, వివరణ, నిర్వహణములను వేరువేరుగనే వ్యవహరింప జూచుచున్నారు. శాసనవివరణ, శాసననిర్వహణాధి కారములను కలెక్టరులు మున్నగు నధికారులలో నేకముగా నుంచరాదనియు, విభజింపవలసిన దనియు మనదేశమున కాంగ్రెసుమంత్రివర్గపరి పాలితప్రాంతములలోను ఆందోళన జరుగుచున్నది.

కాబట్టి ఈమూడధికారముల స్వభావస్వరూపములు వెన్వెంటనే వర్ణింప దగియున్నది.

__________

4

శాసననిర్మాణస్వరూపము

కార్యనిర్వాహకుల నిరంకుశత్వమును అణంచునట్టి ప్రధమసాధనము శాసననిర్మాణము. ఈయీ విధముగా గార్యములు జరుగవలసినది యని యొకనిర్ణయమేర్పడిన తరువాత కార్యనిర్వాహకులు మట్టుమీరి ప్రవర్తించుట సులభసాధ్యము కాదు. అట్టినిర్ణయము ఏర్పరచునట్టిశక్తి ప్రజలకు పూర్తిగా కలిగినయెడల అధికారు లెంతనిరంకుశులైనను, “శాసనవిరోధము చేయుచున్నారమే, ప్రజల కోపాగ్ని ప్రజ్వరిల్లునే, లోకాపవాద వ్యాపించునే, ”యని యాలోచించి ప్రవర్తింపవలసి యుందురు. ఇంతటి యంకుశముగా నీశక్తి యుపకరింప గల్గుటనుజేసి యెల్ల దేశములలోను ప్రజలు దొలుదొలుత ఈశక్తినే సాధ్యమైనంత కై వసముచేసికొన జూచినారు. నిజముగా ఈశక్తిమూలకముగనే ప్రజలు దేశాదాయవ్యయనిర్ణయమును హస్తగతము చేసికొని శాసననిర్వహణాధికారుల నందరను తామే యేర్పరుచునట్టి పదవిని ఇంగ్లాండు, అమెరికా, ఫ్రాంసు ఇత్యాది దేశములలో పొందగలిగినారు. కాబట్టి నేటి నాగరకరాష్ట్రములలో నన్నిటను శాసననిర్మాణ