ప్రభుత్వము/శాసననిర్మాణస్వరూపము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పాలితప్రాంతములలోను ఆందోళన జరుగుచున్నది.

కాబట్టి ఈమూడధికారముల స్వభావస్వరూపములు వెన్వెంటనే వర్ణింప దగియున్నది.

__________

4

శాసననిర్మాణస్వరూపము

కార్యనిర్వాహకుల నిరంకుశత్వమును అణంచునట్టి ప్రధమసాధనము శాసననిర్మాణము. ఈయీ విధముగా గార్యములు జరుగవలసినది యని యొకనిర్ణయమేర్పడిన తరువాత కార్యనిర్వాహకులు మట్టుమీరి ప్రవర్తించుట సులభసాధ్యము కాదు. అట్టినిర్ణయము ఏర్పరచునట్టిశక్తి ప్రజలకు పూర్తిగా కలిగినయెడల అధికారు లెంతనిరంకుశులైనను, “శాసనవిరోధము చేయుచున్నారమే, ప్రజల కోపాగ్ని ప్రజ్వరిల్లునే, లోకాపవాద వ్యాపించునే, ”యని యాలోచించి ప్రవర్తింపవలసి యుందురు. ఇంతటి యంకుశముగా నీశక్తి యుపకరింప గల్గుటనుజేసి యెల్ల దేశములలోను ప్రజలు దొలుదొలుత ఈశక్తినే సాధ్యమైనంత కై వసముచేసికొన జూచినారు. నిజముగా ఈశక్తిమూలకముగనే ప్రజలు దేశాదాయవ్యయనిర్ణయమును హస్తగతము చేసికొని శాసననిర్వహణాధికారుల నందరను తామే యేర్పరుచునట్టి పదవిని ఇంగ్లాండు, అమెరికా, ఫ్రాంసు ఇత్యాది దేశములలో పొందగలిగినారు. కాబట్టి నేటి నాగరకరాష్ట్రములలో నన్నిటను శాసననిర్మాణ శాఖ రాజ్యాంగములలో ముఖ్యతమమయి తలమానికముగా గణింపబడుచున్నది.

ప్రతినిధి పద్ధతి

శాసననిర్మాణమున ప్రజయెల్లయు జోక్యము కలుగజేసి కొనుటకు అవకాశ మున్న యెడల ఆ రాష్ట్రమునందు ఉత్తమశాసనాధికార మున్న ట్లెంచవలయుననుట నాగరకరాష్ట్రములలో అంగీకృతమైన సిద్ధాంతము. ఈసిద్ధాంతము కార్యరూపమున కానిపించుటలేదు. కన్పించుట సాధ్యమునుకాదు. పూర్వకాలమున మనదేశమున నీపద్ధతియుండిన దందురు. కొంత తరువాత ఆథెన్సునగరమున నీపద్ధతి పొడగట్టినది. కాని, అచ్చటను స్త్రీలకుగాని, బానిసలకుగాని 'వోటుకు' అర్హత యుండలేదు. పిదప కొన్నికొన్ని యూరోపుపట్టణములలో ప్రజలందరకు శాసనాధికారముండు ఛాయలుదోచినవి. నేటిదినము స్విట్జరులాండులోని కొన్ని పట్టణములలో పరిమితముగ శాసననిర్మాణ మొక కొన్నిసందర్భములలో అందరు ప్రజల స్వాధీనమైనది. ఇతర రాష్ట్రములలోను 'రెఫరెండము' అనుపేరిట నిది యంగీకృతమగుచున్నది. రాష్ట్రములు పెద్దవియై ప్రజాసమూహము మెండై యుండుటచేత ఏ దేశములోను ప్రజలందరునుచేరి శాసననిర్మాణముచేయుట సాధ్యముకాలేదు. ఇందుకు ముఖ్యకారణములు రెండు. (1) అసంఖ్యాకజనము చేరినయెడల తలకొకమాటయై ఏచిన్న విషయమైనను తీర్మానమగుటకు నేండ్లుపూండ్లు పట్టిపోవును. (2) అసంఖ్యాకజనముపై బరువు వేసినప్పుడు ఒక్కరును జవాబుదారి తమకు కలదని యాలోచించు వారుండరు. సమావేశము చేయవలసివచ్చినప్పుడు అనేకులు హాజరుకాకపోవుటయు సంభవించును. ఆథెన్సు చరిత్రమును చదివినవారలకు ఒక్క విషయము జ్ఞాపక ముండవచ్చును. అచ్చట శాసనములను చేయునట్టి సమయమున పౌరులను తెచ్చి చేర్చుటకుగాను ప్రత్యేకము అధికారులు రంగుపూసినత్రాళ్లను గొనిపోయి వాని యావరణములోనికి పౌరులను నిర్బంధించి తెచ్చు చుండిరనుట స్మరణకు రావచ్చును. నేటిదినము ఆంగ్లభూమిలో శాసననిర్మాణమునకు అందరు ప్రజలు వచ్చుటలేదు. 615 గురు ప్రజాప్రతినిధిసభకు రావలసియున్నారు. వీరిసభకే పార్లమెంటు (హౌసుఆఫ్ కామన్సు) అనిపేరు. వీరిని అత్యవసరసమయములలో ఎక్కువ సమ్మర్దముగా రాబట్టుటకు 'చబుకు' అనునట్టి అర్థమునిచ్చు ఆంగ్లపదమయిన 'వ్హిప్పు' అనుపేరుతోబరగు నుద్యోగస్థు లేర్పడి యున్నారు, ఈవిధమగు కారణములు ప్రచారమందుండుటచేత ప్రపంచమునందలి యెల్ల రాష్ట్రములలోను నేటిదినము శాసననిర్మాణమును ప్రజలందరును నేకముగా జేరి చేయక తమతమ యనుకూలముల ననుసరించి, పలువిధములైన పద్ధతుల ననుకరించి ప్రతినిధులను నియమించుకొని వారిమూలకముగా శాసననిర్మాణము చేసికొనుచున్నారు. దీనినే 'ఎలక్షన్' పద్ధతి యనియు, 'ప్రతినిధి' పద్ధతి యనియు వ్యవహరింపవచ్చును.

రెండుసభలు

సామాన్యముగా శాసననిర్మాణమునకయి. ప్రతినిధులు రెండుసభలుగా నేర్పడుచున్నారు. అచ్చము ప్రజలప్రతినిధిసభ యొకటి. కొంచెము మార్పుతో మరియొకసభ యొకటి. దీనిని అప్పరుహౌసు అనుటకలదు. రాజున్నచోట ఈరెంటికితోడుగా రాజొక్కడు. రాజులేనిచోట దేశములోని యుత్తమాధి కారముపొందిన అధికారియుండును. ఇతనిని అధ్యక్షుడనుట కలదు. ఇతర పేళ్ళును దేశమునుబట్టి యేర్పడుటకలదు. రెండుశాసనసభల యధికారమును ఈమూడవయధికారి యధికారమును చేరియే శాసననిర్మాణాధికారమగును. ఆంగ్లభూమిలో రాజుతోకూడిన శాసననిర్మాణాధికార మములులోనున్నది.

చరిత్రలో రెండుసభ లెట్లేర్పడినవో యాలోచింతము. ప్రజలు కన్ను తెరచి 'మాప్రతినిధులు శాసనములు చేయు నధికారముకలవారుగా నుండవలె'నని కోరునప్పటికి రాజులును, రాజులనాశ్రయించిన ప్రభువులును, సామంతులును సర్వాధికారులుగా నుండినారు. రాజు లేమిచేసినను వారియనుచరు లైన ప్రభువులు సామంతులు సలహా లీయవలసియుండినారు. అందుచేత ప్రజలు నిరంకుశులగు రాజుల నుండి శాసనాధికారమును చేజిక్కించుకొను పోరాటమునందు, రాజుల అనుచరులగు ప్రభువులకును సామంతులకును గూడ స్థాన మీయవలసి వచ్చినది. మొదట మొదట వారికి బలీయమైన స్థానమే దొరకినది. అట్టివారిసభలకే శిష్టసభలని వ్యవహారముండినది. క్రమక్రమముగా ప్రజావ బోధమయి జనులు తెలివితేటలుసంపాదించి తమహక్కులను స్థాపించుకొననారంభించిన తరువాత ప్రభువులబలము తగ్గి వారు శాసననిర్మాణాధికారమున నొక్కశకలము మాత్రమయియుండిరి. ప్రజావబోధముకలిగిన తరువాతగూడ రాజులకు గావలసినవారును, ప్రభువులకు గావలసినవారును శిష్టసభలో సభ్యులుగా నుండుచు వచ్చినారు. అయిన వీరిపలుకుబడి క్రమక్రమముగా నశించిపోయినది. కొంతపలుకుబడి నిలుపుకొనియుండిన ఇంగ్లీషు ప్రభువుల సభయుగూడ 1911-వ సంవత్సరపు పార్లమెంటు ఆక్టు కారణముగా నామమాత్రావశిష్ట మయినది. అయినను ఈసభను బొత్తుగా రద్దుసేయునుద్యోగమునకు ఇంగ్లీషుప్రజలు కడంగలేదు. ఇతరవిధముల నిర్మితములయిన శిష్ట సభలును నేటిదినము శాసననిర్మాణాధికారమున ప్రత్యేకాంగముగా నంగీకృతములయి యున్నవి. ఇట్లంగీకృత మగుటకు కారణము లారయవలయును. అనేక దేశములలో నీశిష్టసభ పరంపరాగతమయివచ్చియున్నందున దీనిని ప్రజలు తప్పించుకొనుటకు రాలేదు. ఇది యొక కారణమే. కాని ప్రజలందరు అభిప్రాయపడినచో ఈ కారణమునకు బలముండదు. వారలు ఒక్కపూటన ఈ శిష్టసభలను తుడిచి పారవేయవచ్చును. యుద్ధానంతరము అదివరలో శిష్టసభలు ప్రబలియున్న దేశములలోనుగూడ పరంపరాగత శిష్టసభలు ఈరీతిగా నశింపుపొంది క్రొత్తస్వరూపములు దాల్చినవి. కాబట్టి శిష్టసభలు నిలిచి యుండుటకు మరి వేరుకారణము లుండి తీరవలయును.

(1) ప్రజాసమూహ మెల్లప్పుడును శాంతముగా నాలోచించు నను కొనరాదు. ఒక్కొక సందర్భమునందు ప్రజలలో ఏదైనను పొరబాటైన అభిప్రాయము వ్యాపించి కలవరము కలుగవచ్చును. ఆసమయమునందు ప్రజలచే నేరుగా నెన్నుకొనబడు . ప్రతినిధుల సభ యొక్కటే యుండునెడల ఆసభ ప్రజల తాత్కాలికావేశమును శాసనరూపముగా స్థిరపరుపవలసి వచ్చును. తొందరలో సాగిపోయిన శాసనము త్రిప్పవలయుననిన మరల వృథాప్రయాస కలుగును. తాత్కాలికావేశము నశించినతోడనే ప్రజలు నూతనదృష్టిపథమును అవలంబింపవచ్చును. అప్పుడు కార్యము లన్నియు తారుమారగును. అట్టిరసాభాసమును ఆపుదలచేయుటకు శిష్టసభలు మిక్కిలి సహకారు లగుచున్నవి.

(2) ప్రజాప్రతినిధుల సభలలో ఎక్కువ సంఖ్యాకుల సమ్మతుల ననుసరించి వ్యవహారములు తీర్మానములగుచున్నవి. తక్కువసంఖ్య బ్రతినిధుల నెన్నుకొను బ్రజలు ఈ ఎక్కువ సంఖ్యాకుల నిర్ణయములకు తలయొగ్గ వలసి యుండును. శిష్టసభయను మరియొకసభ లేక యుండిన యెడల తక్కువ సంఖ్యాకులగు ప్రజల ప్రతినిధులు నోరెత్తకుండ వారిని నణచివేయుట గూడ నెక్కువ సంఖ్యాకుల ప్రతినిధులకు సుకరంబగును. కాబట్టి ఎక్కువసంఖ్యాకులగు ప్రజల ప్రతినిధుల యభిప్రాయ మంగీకృతము కావలయునను సిద్ధాంతమున్నంతకాలము రెండవసభయైన శిష్టసభ లేనిచో తక్కువసంఖ్యాకుల గతి దుర్భరము కావచ్చును. వారి స్వాతంత్ర్యములు వెలివడకుండ కూడ నపహృతములు కావచ్చును. అందుచేత శిష్టసభలు ఎక్కువసంఖ్యాకుల నిరంకుశత్వమును నిరోధించుటకు సహకారు లగుచున్నవని నాగరకరాష్ట్రము లీసభలను నిలువబెట్టుకొని యున్నవి. (3) ఇంతేకాదు, మరియొక విధముగాను నీశిష్ట సభలు ఉపయోగపడుచున్నవి. కొన్ని కొన్ని దేశములలో, ముఖ్యముగా అమెరికా సంయుక్త భూమిలో, అనేకరాష్ట్రములు ఏకప్రభుత్వముగా నేర్పడియున్నవి. ఈరాష్ట్రము లొక్కొక్కటియు విస్తీర్ణమునను, జనసంఖ్యయందును ఎంతెంతో భేదపడియున్నవి. ఒక్క రాష్ట్రము లక్షలమైళ్ళ వైశాల్యముకలదై కోట్లకొలది ప్రజలతో నిండియున్నది. మరియొకరాష్ట్రము నూర్లు వేలకు మించనిమైళ్ళవిస్తారముకలదియై పరిమిత జనసంఖ్య కలదై యున్నది. ప్రజాప్రతినిధి సభలలోవలె సంయుక్తరాష్ట్రములకు సంబంధించిన శిష్టసభలోకూడ ప్రజా సంఖ్యానుగుణముగ నధికారమిచ్చుచో చిన్నచిన్న రాష్ట్రములను పెద్దరాష్ట్రములు కబళించి తినిపోవును. ఇట్టి మహారిష్టమును నివారించి ప్రతి రాష్ట్రమునకును ఇతరములతో సమానాధికార మిచ్చుటకు శిష్టసభ సహకారి యయి యున్నది. వివిధప్రాంతములును, నానారీతులగు స్వదేశ సంస్థానములును గల మన దేశము నందును సంపూర్ణ మైన ప్రజాస్వామ్యము నెలకొనినపిదప 'శిష్ట సభ'ల ఈవిధమగు నుపయోగమే కావచ్చును.

అంగభేదము కావలెను

ఎప్పుడు రెండుసభలు కావలయునను సిద్ధాంత మేర్పడినదో, ఎప్పుడు రెండుసభలకును ఉద్దేశ్యములలో తారతమ్య మున్నదనుట యొప్పుకొనినామో, అప్పుడే ఈ రెండుసభలును ఒకే పద్ధతి ననుసరించి నిర్మితమైన పక్షమున లాభము లేదనుట స్పష్టనుయినది. ప్రజాప్రతినిధి సభయొక్క ప్రతిబింబముగా 'శిష్టసభ'యు సృష్టితమగు నేని అచ్చటి 'బహుసంఖ్య'యే యిచ్చటి 'బహుసంఖ్య' యగును. అచ్చటిబలమే యిచ్చటి బలమగును. అచ్చటి బలహీనులే యిచ్చటను బలహీనులుగానుందురు. కావున రెండు సభలుండుటవలన నింకను ఎక్కువ యుద్రేకమునకు, ఎక్కువ యన్యాయమునకు, ఎక్కువ యక్రమమునకు కారణము కావచ్చును. అందుచేతనే రెండు సభల యొక్క స్వరూపనిర్ణయమునందును ఏదో కొంత విభేదము కల్పించు కొనుటకు ఎల్ల దేశములును ప్రయత్నించినవి. ఒక్కొక్క దేశమును ఒక్కొక్క విధమగు భేదమును పాటించినది. అయిన అన్ని దేశములలోను రమారమి ప్రజాప్రతినిధిసభ ఏకరూపమును దాల్చునట్టి ప్రయత్నములే కొనసాగినవి. శిష్టసభవిషయమునందు మాత్రము అనంతస్వరూపములు కాన నగును.

ఆంగ్లభూమిలోనిశిష్టసభ పూర్ణముగా ప్రాతవాసన కలది. న్యాయవిచారకులలో నలుగురను మాత్రము సార్వభౌముడు ప్రభుసభకు 'జీవిత ' సభ్యులుగా నియమించుచున్నాడు. మతాధికారమునకు జేరిన మరికొందరు సభ్యులును ఆసభ నలంకరించుచున్నారు. మంత్రులు తమపని సాగించుకొనుటకు సృష్టించిన “ప్రభువు 'లును గలరు. కర్మకర “ప్రభువు ”లును నేడు వెలసినారు. తక్కుంగల వారందరును పరంపరాగతముగా వచ్చిన ప్రభుపద బలము చేత నీసభయందు సుఖాసీనులగు చున్నారు. అప్పటికప్పుడు మన 'సింహా' వంటివారలు ప్రభువులుగా నియోగింప బడుట కలదు. కాన నియోజితులయిన వారివంశము లోనివారు పరంపరగా ప్రభుసభలోనికి ప్రవేశము గలవారగుచున్నారు. కావున నేటిక్రొత్త రేపటిరోత యగుచున్నది. 750 సంఖ్యగలది ఈ ప్రభుసభ. అందులో స్కాట్లండుప్రభువులు పదునార్గురు, ఐర్లాందులు ప్రభువులు పదునాలర్గురు, నేటిదినము ఇండియా ప్రభువు ఒక్కరు, తక్కుంగల వారు ఆంగ్లభూమి ప్రభువులునై యున్నారు.

ప్రభుసభలో ఇందరుప్రభువులు పరంపరాగతముగా కూర్చొనుట కర్హులగుట యేలొకో యర్థముకాదు. పరంపరాగతసామర్థ్యము వీరికి కలుగుచున్నదాయనిన నది సున్న . పండితపుత్రు డన్నమాట పరమసత్యము, అయిన పండితపుత్రుడగువాడు పండితుడుకాడని యర్థముకాదు. కొంద రుద్దండులైన పుత్రులుందురు. కాని కొందర కన్వయించునది సామాన్యసూత్రముగా నంగీకరింపరాదు గదా! ఈ ప్రభుసభవా రొక్కొక పర్యాయము కనుబరచిన మౌఢ్యమునకు మితియేలేదు. లోక మీమార్గమున నడచుచున్నదికదా, మనమడ్డుపడిన నీప్రవాహములో మనము కొట్టుకొని పోవలసినదే కాని ప్రవాహమును నిరోధింప జాలము అను నాలోచనయే ఒక్కొక్కప్పుడు వారికి కలుగలేదు. తమస్వలాభమును, తెగయొక్క లాభమును సమకూరిన జాలునని వారలు మొండితనము కనుబరచుట వారికి సహజమైయుండినది. కాబట్టియే నేటిదినము ఆంగ్లభూమిలోని ప్రభుసభకు విశేషస్వతంత్రాధికారము లేదు. క్రమక్రమముగా ఆంగ్లప్రజ ప్రభుసభవారి రెక్కలువిరిచి వై చినారు. ఆసభవారు నేటిదినము ప్రజూ ప్రతినిధిసభవారిచే నామోదితమైన కార్యము నొకకొంత జాగుసేయు నధికారము మాత్రము కలవారై యున్నారు. మిగిలిన శాసనాధికారస్వాతంత్ర్యము లేవియును వారికి దక్కియుండ లేదు. ప్రభుసభ యింతటి మహావిమర్శకు భాజనమైయుండియును ఆంగ్లభూమిలో దానికి నిలకడ కలుగుటజూడ జిత్రముగా దోచకపోదు. ప్రభుసభలోని సభ్యుల కొక్కొక్కరికిని నగరములలో, గ్రామసీమలలో ఆస్తిపాస్తు లున్నవి. వ్యాపారములలో, వ్యవహారములలో ఎక్కువ జోక్యమున్నది. సామాన్యముగా వీరలు ప్రజూకక్షలలోజేరు నభ్యాసము కలవారుకారు. . కాబట్టి ప్రజలలో తీక్ష్ణసమస్యలయం దావేశముకనుపట్టి వ్యవహార ముద్రేకముగా జరుగునట్టి సమయముల వీరలు నిశ్చలులై నిష్పాక్షికదృష్టితో సలహాలిచ్చి ప్రజావేశమును శాంతమార్గములకు దేగలరను నభిప్రాయమే వీరియునికికి కారణమని పలువు రాడుకొనుచున్నారు. ఇంగ్లండులోని ప్రభుసభకు మరియొక గొప్పగౌరవ మమరియున్నది. ప్రీవి కౌన్సిలు అనబడు సంఘ మీసభలోని యొకభాగము. బ్రిటిషుసామ్రాజ్యములోని అన్ని యుత్తమన్యాయస్థాన ములందుండియు అప్పీళ్లీ ప్రీవీకౌన్సిలుకు పోవలెను. అధినివేశములలోని ప్రసిద్ధన్యాయమూర్తుల కిందు స్థానము కల్పించుచున్నారు,

మరి యేమహారాజ్యమునందును ఆంగ్లరాజ్యములోవలె పరంపరాగతపద్ధతి శిష్టసభనిర్మాణమునకు వినియోగింప బడుచుండుటలేదు. ప్రపంచమహాసంగ్రామమునకు ముందు ఆస్ట్రియా, స్పెయిను, ఇటలీ, హాలండు లలో నీరీతి నిర్మాణ మొకకొంత యుండినది. కాని ఈరాష్ట్రములును నిపుడు ప్రజాసత్తాకములయి పోయినవి. కాబట్టి పరంపరాగతశిష్టసభకల రాజ్యము అయిరోపాలో ఇంగ్లం డొక్కటియే కానవచ్చు చున్నది. బ్రిటిషురాజ్యములో చేరిన యధినివేశములలో కొన్నిటను, ఇదివరకు బ్రిటిషురాజ్య సంబంధములు కలిగిన రాష్ట్రములలోను ఈవాసన వదలలేదు. 'కనడా'లోని శిష్టసభకు గవర్నరు జనరలు యావజ్జీవసభ్యులను నియమించును. దక్షిణాఫ్రికాలో శిష్టసభ సభ్యులు 32 రు ఎన్నుకొనబడు చున్నారుగాని ఎనమండుగురు మాత్రము నియమితులు గలరు. అందులో నలుగురు నల్లవారి సంరక్షణకొరకట. స్వదేశజులయి బహుసంఖ్యాకులయిన నల్లవారికిగాని, మనదేశమునుండి ఏనాడో అచ్చట చేరికొని దేశము నభివృద్ధిపరచిన హైందవులకుగాని అచ్చట స్వరాజ్యమును లేదు. వోటును లేదు. స్వల్పసంఖ్యాకులైన తెల్లవారిదే సర్వము. స్వతంత్రములుగాని యధినివేశములమాట చెప్ప నక్కరయేలేదు. నిన్నటివరకును బ్రిటిషుసంరక్షణలో నుండి యింకను పూర్ణముగా స్వతంత్రముగాని ఈజిప్టులో సుల్తాను శిష్టసభలోని అయిదింట రెండువంతులను తాను నియమించును. ఇట్లే మెసపొటేమియాలోను ప్రభువైన ఫెయిజల్ శిష్టసభలోని ఇరువదిమందిసభ్యు లెల్లరను నియమించును. 1935-వ సంవత్సరపు గవర్నమెంటు ఆఫ్ ఇండియా ఆక్టుననుసరించి ఇండియా అంతటికిని ఏర్పరచబోయే శిష్టసభలో మనప్రాంతికశాసనసభల ప్రతినిధులు 156 గురతో స్వదేశసంస్థానాధీశులు నియ మించబోయే పెద్దలు 104 గురుందురు. స్వదేశసంస్థానాధీశ్వరుల కీయధికార మిచ్చుటేగాక ఇండియాశాసనసభలలోని ప్రధమసభలోను 125 గురను మూడింట ఒక్కభాగమును నియమించే అధికారమును ఇచ్చినారు. మన ప్రాంతీయశాసనసభలలోని అప్పరు హౌసులలో గవర్నరు నియమించే సభ్యులు ఆరోవంతు కెక్కడను ఎక్కువ యుండరు. లోయరు హౌసులు పూర్ణముగా ప్రజ లెన్నుకొనేవి. కాంగ్రెసువారి పలుకుబడి బలములచేత మంత్రులు జరిపే దినచర్య పరిపాలన కడ్డుదగులునట్లు తన ప్రత్యేకాధికారములు గవర్నరు వినియోగించడములేదను సదాచారము ఏర్పడుచుండగా ఇండియాసభలను పైనచెప్పిన రీతిగా శిష్టులయు, స్వదేశసంస్థానాధీశులయు వశముచేయ వీలులేదు. కాబట్టే కాంగ్రెసువారు ఫెడరేషనును — ఇండియాప్రభుత్వమునకు క్రొత్త ఆక్టులో ఏర్పడిన విధానమును - ప్రచారములోనికి రానీయమని పట్టుబట్టినారు.

నేటిదినము ప్రపంచములో ప్రజాసత్తాకములే యెక్కువ. డిక్టేటరులుగా నేర్పడియుండు హిట్లరు, ముస్సోలినీలుగూడ తాముచేయు దుండగపు పనులకుగూడ - మొన్నటి ఆస్ట్రియా ఆక్రమణకువలె -ప్రజలవోట్లు - రెఫరెన్డము - కోరుచున్నారు. వారి విధానములనుగురించి ముందు వినగలరు. కాని ప్రజాపరిపాలితములలో ననేక రాష్ట్రములయందు శిష్టసభలు కలవని యెరుంగుట మాత్రము ప్రస్తుతకర్తవ్యము. వీనియం దన్నిటను శిష్టసభలకు సభ్యులను నియమించు నధికారము ప్రజల యధీనమున నేయున్నది, పరాసుభూమి, స్వీట్‌ర్లాందు, బెల్జి యము, నార్వే, స్వీడను, హాలండు, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, పోర్చుగలు, స్పెయిను, హంగరీ, పోలండు, అల్బేనియా, రుమేనియా, గ్రీసు, అయిర్లాందు, ఆస్ట్రేలియా, ఆర్జెంటైనా, బొలీవియా, బ్రెజీలు, చిలీ, చీనా, క్యూబా, జెక్కో స్లో వేకియా, హెయిటీ, పోలండు, సంయుక్త రాష్ట్రములు ఈరాజ్యములన్నిటను శిష్టసభ సభ్యులు ప్రజానిర్వచితులుగా నుందురు. ఆఫ్రికాలో 'లైబీరియా' యను నీగ్రోల ప్రజాసత్తాకరాష్ట్ర మొకటిక లదు. అచ్చటను శిష్టసభకలదు. - అందలిసభ్యులును ప్రజానిర్వచితులు, జర్మనీ, ఇటలీలలో నియంత లేర్పడుటచేతను, హిట్లరు ఆస్ట్రియాను స్వాధీనము చేసికొనుటచేతను ఈదేశముల రాజ్యాంగ స్వరూపము స్థిరము కాలేదు.

పరోక్ష నిర్వచనము

శిష్టసభయందుగల సభ్యులను 'ఎన్నుకొను' పద్ధతిని అవలంబించు దేశములలో ప్రజాప్రతినిధి సభయొక్క ప్రతిబింబము ఈసభ కాకుండుటకు నిర్వచనపద్ధతులలో అనేక తారతమ్యము లేర్పడియున్నవని ఇదివరలో నే నూచితమయినది, అందులో ప్రధమగణ్యము పరోక్షనిర్వచనము. సమ్మతిని ఇచ్చుటకు అధికారముగల ఒక్కొక్క పురుషుడును, ఒకొక్క స్త్రీయును ఈతడు మా ప్రతినిధిగా నుండదగినవాడని నేరుగా నియమించుకొనుపద్ధతి ప్రత్యక్ష పద్ధతియనుట ప్రత్యేకించి వ్రాయనక్కర లేదు. దీనికి దూరమైనది పరోక్షపద్ధతి. మనదేశములో శాసనసభల యెన్నికలకు ఈపద్ధతియే 1920–వ సంవత్సరమునకుముందు ప్రచారము నందుండినది. అప్పుడు రు 30 ల శిస్తునిచ్చు వారందరును తాలూకాబోర్డులకు, జిల్లాబోర్డులకు సభ్యులను పేర్కొనుచుండినారు. పట్టణపాలక సంఘసభ్యులును ఈవిధమగు కొన్నిఏర్పాటుల ననుసరించి ఏరుకొనబడు చుండినారు. ఇట్లేర్పడిన జిల్లాబోర్డు తాలూకాబోర్డు సభ్యులును, పట్టణపాలకసభ్యులును శాసననిర్మాణసభకు చెందతగిన సభ్యులను ఎన్నుకొనుచుండినారు. ఇండియా శాసనసభకు సభ్యుల నెన్నుకొను నధికారము జిల్లాబోర్డు తాలూకాబోర్డు సభ్యులకును, పట్టణపాలకసభ్యులకును నుండినది కాదు. మన శాసనసభలలోని సభ్యులు తమలో నుండియే తాము నియమించుకొను చుండినారు. ఈకారణములచేత మన శాసననిర్మాణసభలలో పరోక్షపద్ధతి ద్విగుణీకృతమై చెన్నారుచుండినది. లోకములో మరియెచ్చటను ఇట్టి ద్విగుణీకృతపరోక్షపద్ధతిగాని, సామాన్య పరోక్షపద్ధతికాని ప్రజాప్రతినిధిసభలకు సంబంధించి నంత వరకు లేదు. ఒక్క శిష్టసభకుమాత్రము కొన్ని కొన్ని ప్రాంతములలో ఈ పద్ధతి వ్యాప్తియందున్నది.

పరోక్షనిర్వచనమున కర్థమేమి యనునది యిచ్చట గ్రహింపదగియున్నది. ప్రజాసమూహమునెడల గల యొక యపనమ్మిక ఈపద్ధతికి కారణ మనుట స్పష్టము. పరోక్షముగా ప్రతినిధు లేర్పడునెడల ప్రజలలో తాత్కాలికముగాగల యుద్రేకములు ఆప్రతినిథినిర్వచనమున ప్రతిబింబింపవనియు అందుచేత కార్యనిర్వహణమున కేర్పడిన ప్రతినిధులు శాంతపరులై , ఆలోచనాయుతులై యుందురనియు విశ్వసించుటయే యీ పద్ధతికి మూలాధారమగు కారణము. నిర్వచనాధికారము కొందరకు మాత్రమే యున్నప్పుడు 'కక్షల గడబిడ నిర్వచనములలో నంతగా ప్రతిఫలింపదనియు ఎక్కువ సంఖ్యలు సమ్మతులిచ్చు నెడల నొక్కొక్కప్పుడు కొరగానివారుగూడ ప్రతినిధులై పనులు చెడవచ్చుననియు తలంచుటయే యిందుకు బునాది. అయిన ఇట్టిభావము లెంతవరకు నిజములో పరిశీలించుట యవసరము. పరోక్షపద్ధతి కార్యక్రమమున నెంతో విజయవంతముగా పనిచేయ లేదనుట మొదట గమనింపదగినది. కక్షల గడిబిడ లేకుండుననుటయు కల్ల. ఏలయందురా, శిష్టసభకు సభ్యులను నియమించునట్టి మధ్యస్థులెట్టివారో యాలోచింపదగియున్నది. వీరుతప్పక 'కక్షలలో' నేదైనను నొక్కదానికి జేరియుందురుగాని వేరుకాదు. కాబట్టి వీరుచేయు నియామకమును 'కక్షలకు' సంబంధపడియుండక తప్పదు. మరి పరోక్షనిర్వచనమున నిర్వాచకవర్గము (ఓటరులవర్గము) కడుంగడు తక్కువ. అందుచేత అభ్యర్థిగా నుండునట్టివాడుగాని, అతని మిత్రులుగాని ఈతక్కువ సంఖ్యాకులను అవినీతి పద్ధతు లవలంబించి లోబరచుకొనుట సులభము. ప్రత్యక్షపద్ధతియందు నిర్వాచకులసంఖ్య యపరిమితము కావున నిట్టిపద్ధతులకు తావెక్కువగా నుండదు. ఇంతేకాదు. ప్రత్యక్షనిర్వచనపద్ధతియున్న యెడల సమ్మతినీయ నర్హుడగు నొక్కొక్కరును ప్రతినిధి నన్నుకొనుట యం దెక్కువ యుత్సాహమును, అభినివేశమును జూపుటకు వీలుకలదు. అట్లుగాక ఎవ్వరో ఇతరులు శిష్ట సభకు తనపక్షమున ప్రతినిధినెన్నుదురనిన నాతని కంత దూరము పట్టుదలయుండకపోవును. కడపటిమాట. మధ్యవర్తిని ఎన్నుకొనుటకు శక్తిశ్రద్ధలు నిర్వాచకునకు కల వని యభిప్రాయపడిన పిదప ప్రతినిధి నేరుకొనుట కేల అతనికి శక్తిశ్రద్ధలు లేవనుకొనవలయునో నిర్ణయించుట యసాధ్యము. కాబట్టి లోకమంతటను ప్రత్యక్షపద్ధతియే “శిష్టసభ'కును నెక్కువ యెక్కువగా నన్వయమగుచున్నది,

ఇతరాధారములు

పరోక్షనిర్వచనపద్ధతి పనికిరాదను కొనినచో రెండుసభల తారతమ్యమునకుగల యితరాధారము లేవియో విమర్శింప దగియున్నది. ప్రజాప్రతినిధిసభకును శిష్టసభకును సభ్యుల నెన్నుకొనునట్టి ప్రాంతములలో అనగా దేశవైశాల్యములో విభేదముకల్పించుట యొకయాధారముగా నంగీకృతమయి యున్నది. ప్రజాప్రతినిధిసభకు ఫిర్కాలు, తాలూకాలు ప్రతినిధుల నెన్నుకొనుచో శిష్టసభకు మండలములు, కోస్తాలు నియమితమగుటకలదు. ఈకారణముచేత 'శిష్ట' సభలో ప్రజాప్రతినిధిసభ యందుకంటె తక్కువసంఖ్య యుండుట సంభవించుచున్నది. ఈతక్కువ సంఖ్యాకులెక్కువ వివేకవంతులుగా నుందురను భావనయు నొక్కటికలదు. ఇదివరలో జెప్పినరీతిని అమెరికాసంయుక్త రాష్ట్రములలో ఈ “శిష్ట' సభ నిర్మాణసమస్య యుత్తమరీతిని తీరువబడినది. విస్తీర్ణమునందును జనసంఖ్యయందును విస్తారమైనతారతమ్యము లున్నప్పటికిని సంయోగమునందలి యన్ని రాష్ట్రములకును సమానముగా సంబంధించిన విషయములలో సమత్వము కలుగజేసి తన సంఖ్యలబలముచేతనే యొక్క రాష్ట్రము తనపలుకుబడినే చెల్లించుకొనకుండ నిరోధించుటకు ఈసభ వినియోగపడుచున్నది. స్విట్‌జరులాండులోను ఈవినియోగమే యను కరింపబడినది. అచ్చటిప్రాంతములనుండి — వీనిని పట్టణములనియే చెప్పవచ్చును. ఒక్కొక్కింటికి ఇరువురు సభ్యులు శిష్టసభకు రానర్హులు. సగముప్రాంత మొక్కరిని, మరి సగముప్రాంతము మరియొక్కరిని నియమించుకొనుచున్నది. పరాసుభూమిలోను 'శిష్ట' సభకు సభ్యుల నెన్నుకొను నధికారము డిపార్టుమెంటు లనబడు రాష్ట్రములబోలు మండలముల కే కలదు. కాని యొక్కొక మండలమునకును సమానమైన సంఖ్య కానరాదు. ఇద్దరు మొదలు పదుగురవరకును ప్రతినిధుల నెన్నుకొను స్వాతంత్ర్యము అచ్చటి మండలముల కేర్పడియున్నది.

శిష్టసభ సభ్యత్వమునకును ప్రజాప్రతినిధిసభ సభ్యత్వమునకును తారతమ్యము పాటించుటకు మరియొక యుపాయమును ఆలోచింపబడియున్నది. ప్రజాప్రతినిధిసభకు సభ్యత్వమున కర్హతలు వేరుగను, శిష్టసభ సభ్యత్వమున కర్హతలు వేరుగను నియమించుటకలదు. ముఖ్యముగా వయస్సు విషయమున నీవిభేద మనేకరాజ్యములలో కానవచ్చుచున్నది. ప్రజా ప్రతినిధిసభ్యత్వమునకు పౌరుడుగా నుండిన చాలుననుట సామాన్యసిద్ధాంతము. పౌరత్వమున కర్హత యుక్తవయస్సు వచ్చినతోడనే కలుగుచున్నది. అనగా 21-23 సంవత్సరముల వయస్సువాడైనచో పౌరుడు ప్రజాప్రతినిధి సభలో నాసీనుడగుటకు తగినవా డగుచున్నాడు. కాని శిష్టసభయందు ఆసీనుడగుటకో పరాసు భూమి, ఇటలీ, బెల్జియములలో 40 ఏండ్లవయస్సు కలవాడు కావలెను. అమెరికాసంయుక్త రాష్ట్రములలోను, తదనుయాయులగు నితరరాజ్యములలోను అధమపక్షము ముప్పదియేండ్లు వచ్చినగాని శిష్టసభ్యత్వమున కర్హత యుండదు. మొత్తముమీద ప్రజాప్రతినిధి సభ్యత్వార్హతకు కావలసిన వయోగుణమునకంటె శిష్టసభ్యత్వమున కెక్కువ వయోగుణము కావలయుననుట సామాన్యాంగీకారమును చెందియున్నది.

వయోగుణ మెక్కువగా పాటించుటయేకాక మరికొన్ని యుపాయములచేతను శిష్టసభకు స్థిరత్వము నెక్కువగా కల్పించుటకు నేర్పాటులు జరిగియున్నవి. ప్రజాప్రతినిధి సభకు అధికారకాలపరిమితి తక్కువ, శిష్టసభకు ఎక్కువ. అమెరికాసంయుక్తరాష్ట్రములలో ప్రజాప్రతినిధిసభ రెండు సంవత్సరముల కొకపర్యాయము నిర్వచితమగుచున్నది. శిష్టసభ ఆరు సంవత్సరముల కొక పర్యాయము. అంతేకాదు. శిష్టసభలోని సభ్యు లెల్లరును నొకేపర్యాయము వదలిపోవుటలేదు. ఉన్నసభ్యులలో మూడవవంతు మూడేండ్ల కొకపర్యాయము మారుచుందురు. ఈవిధమగు నుపాయముల వలన రాజ్యకార్య నిర్వహణమునందు ఏదోకొంత స్థైర్యము కలుగుటకు అవకాశ మేర్పరుపబడినది. శిష్టసభయు, ప్రజాప్రతినిధిసభయు ఏకరీతిని ఒక్క టేనాడు రద్దగుచుండు నెడల, క్రొత్తగా వచ్చినవారు కార్యజాలమును క్రొత్తగా నుపక్రమించు చుండునెడల రాజ్యకార్యములు జరుగుట దుర్ల భమగునను నాలోచనయే యీ తారతమ్యములకు కారణమైనది. రాజ్య జీవితమును క్రమాభివృద్ధినందునట్టి జీవకళకలది. ప్రాతకు ప్రాత క్రొత్తకు క్రొత్త త్రెంపిన ట్లేర్పడుచుండునేని సరళమును, సహజమునునగు ప్రవృద్ధిజరుగదు. ప్రాతక్రొత్త లను నేకప్రవాహమున దీర్చుటకు రెంటికిని కొంతసంయోగముండదగును.

రెండుసభల యుపయోగము

ఏదోయొకవిధమగు నుపయోగము కలదని తోచుచున్నను, రెండు సభలవలని సుస్పష్టప్రయోజన మేమియాయను సందేహము మాత్రము లోకమును బాధించుచునే యున్నది. శిష్టసభలోని వారలలో నెక్కువమంది యొక కక్షివారై , ప్రజాప్రతినిధిసభలోనివా రింకొక కక్షివారైనప్పుడు రెండు సభలకును ఘర్షణ తప్పదు. శాసనావసరము కలిగినప్పుడు పనికిమాలిన పోరాటములు సంభవించి ఆలస్యములు జరుగుటయుకలదు. పోటీకిగాను ప్రజాప్రతినిధిసభ శిష్టసభకు ఇష్టముగాని శాసనమును నుపక్రమించుటయు కాననగును. శిష్టసభ మొండిపట్టుబట్టి అభివృద్ధి కాటంక మగుటయు సంభవించినది. అమెరికాసంయుక్తరాష్ట్రము లందువలె శిష్టసభకు ప్రత్యేకమగుపని కలుగనిచోట శిష్టసభ ప్రజాగౌరమును పోనాడుకొనినదనుటయు నిక్కువమే, ప్రత్యేకప్రాంతముల సంయోగము సరిసమానమగు స్థితియందు సమకూరవలసి యున్నప్పుడు శిష్టసభ యుపయోగకర మగునుగాని సామాన్యరాజ్య కార్యనిర్వహణమున కది యెంతో సహకారియని చెప్పుటకురాదు.

సభల ఆధికారములు

శిష్టసభకును, ప్రజాప్రతినిధిసభకును గల అధికారములు ఎల్ల దేశములలోను రమారమి సమానముగానే తోచుచున్నవి. రెండుసభలలోని సభ్యులును తమతమ సభలో చట్టములను ప్రవేశ పెట్టవచ్చును. అనగా ఫలానావిషయమునుగురించి, ఉదాహరణార్థము, నీటిసరఫరాను గురించి, ఈయీరీతిగా ఈదేశమున ఏర్పాటులు జరుగవలసినదని సంపూర్ణపద్ధతిని నియమించుచు శాసనము చేయవలసినదని ఏసభ సభ్యుడై నను ఆసభలో ఉపక్రమింపవచ్చును. ఏశాసనములో నైనను మారుపాటులు చేయవలసినదని కాని, ఏశాసనమునై నను రద్దుచేయవలసినదని కాని ఉపక్రమించుటకు రెండు సభలవారికిని అధికారము కలదు. ఒక్కసభలో తీర్మానమైన విషయమును రెండవ సభవారు ఆలోచనచేసి తమ యభిప్రాయానుసారము ఆ తీర్మానమైన విషయమును అంగీకరించుటకో,మార్చుటకో, రద్దుచేయ సలహాయిచ్చుటకో అధికారము కలవారై యుందురు.

అయిన నీకడపటి యధికారము రెండుసభలును నిరాఘాటముగా ప్రయోగించుట కవకాశ ముండినయెడల రాజ్యకార్యములు జరుగుట దుర్లభమగును. ప్రజాపరిపాలితరాష్ట్రము లన్నిటిలోను ప్రజాప్రతినిధిసభలో సభ్యులుగా నుండునట్టి వారిలో నెక్కువ పలుకుబడిగల కక్షి సభ్యులు రాజ్యకార్యనిర్వాహకులుగా నుందురు. ఎట్టి కార్యనిర్వాహకమునకును ద్రవ్యమే మూలాధారము. ఇక రాజ్యకార్యనిర్వహణమునకు దాని యవసర మింతింతని చెప్పరాదు. ప్రజాప్రతినిధిసభవారు ఇంత ద్రవ్యము కావలెను. ఇట్లు ద్రవ్యమును సేకరింపవలయును, ఈరీతిగా నీద్రవ్యమును వ్యయ పెట్టవలయును నను మున్నగు నేర్పాటులు కావించినప్పుడు శిష్టసభవారు ఇందులో నొక్కొ క్క సందర్భమును ఆటంకపరచుటకు నధికారము కలవారగుదురేని పని నిలిచి యరాచకము ప్రారంభము కావలసివచ్చును. అందుచేత ద్రవ్యసంబంధ మగు శాసనములపై శిష్టసభలకు అనేక నాగరకరాష్ట్రములలో నెక్కువ యధికారము పెట్టబడలేదు. ద్రవ్యమునకు సంబంధించిన శాసనమును ఆంగ్లభూమిలోని ప్రభువులసభవారు త్రోసివేయరు అనున్యాయము 1910 వ సంవత్సరమువరకును ప్రబలుచువచ్చినది. త్రోసివేయరాదను నిర్బంధము మాత్రముండలేదు. ఆసంవత్సరమున ప్రజాప్రతినిధిసభనుండి యొక ద్రవ్యసంబంధి యగుశాసనము పోగా దానిని ప్రభువులు పట్టుబట్టి త్రోసివేసిరి. అందువలన ప్రజలలో నుద్రేకము కలిగి ప్రభుసభకు నట్టియధికారమే లేదను నిర్ధారణ యేర్పడిపోయెను. అంతేకాదు. ఏశాసనమువిషయములోను ప్రభుసభకు తీర్మానాధికారములేదని యంగీకృతమయ్యెను. అమెరికాసంయుక్తరాష్ట్రములలో శిష్టసభ వారు ద్రవ్యసంబంధమగు శాసనమును నుపక్రమించుటకు రాదుగాని ప్రజాప్రతినిధి సభలో నుపక్రమితమైన శాసనమునందు సవరణలు చేయవచ్చును. ఇది మిక్కిలి గొప్పయధికారమే. సవరణలనుపేరిట క్రొత్తశాసనమునే చేసివేయవచ్చును. అమెరికాసంయుక్తరాష్ట్రముల శిష్ట సభవారు ఈకారణముచేత ద్రవ్యసంబంధమగు శాసననిర్మాణవిషయమునను ప్రజాప్రతినిధిసభవారితో సమానమైన స్వాతంత్ర్యములు కలవారయి యున్నారనియే చెప్పదగును. ప్రజాసత్తాకములందంతటను నింతమాత్రపు నిర్బంధము సామాన్యముగ కనుపించును. ఒక్క స్విట్‌జర్‌లాం డులో మాత్రము అన్నివిషయములలోను శిష్టసభకును, ప్రజాప్రతినిధిసభకును పూర్తిగా సరిసమానమైన హక్కులు గలవు. ద్రవ్యసంబంధశాసనమని ఇతరశాసనమని భేదమిచ్చట పాటించుటలేదు.

ప్రజాప్రతినిధిసభకు ద్రవ్యసంబంధ శాసనములు చేయుటలో నెక్కువ యధికారముండ తగినదను సిద్ధాంతము నిజముగా ఆంగ్లభూమిలో జన్మించినదే, జన్మించతగినదే. ఏలయందురా ! ప్రభుసభ వట్టి శిష్టసభ కాదు. పరంతరాగతప్రభువుల సభయనుట యిదివరలోనే వర్ణితమైనది. కాబట్టి ప్రజలు అట్టిసభకు నెక్కువ శక్తులను నిలువ నిత్తురనుట యెన్న రానిమాట. ఎట్లైనను ఆంగ్లభూమిలో ప్రారంభమయిన ఈ సిద్ధాంతము అనేక రాష్ట్రములలో నంగీకృతమగుటకు వేరుకారణము లుండవలెను గదా! ఆకారణము లిదివరలోనే కొంత సూచితమైనవి. అంతే కాదు. దేశాదాయము దేశప్రజలనుండి వసూలగుచున్నది. దేశప్రజలు తమ ప్రతినిధులను నేరుగా నెన్నుకొని ప్రజాప్రతినిధి సభకు ననుపుచున్నారు. ద్రవ్యమిచ్చువాడు తనకు ఎక్కువ నమ్మకము గలవానిచేత దాని వినియోగము చేయించునుగాని యొరున కంత యెక్కువగా నధికారములీయడు. ఇది మిక్కిలి సహజమైనస్థితి, కాబట్టియే ప్రజాప్రతినిధిసభలకు ద్రవ్యసంబంధవిషయక శాసనముల యెడల నెక్కువ యధికారము సమకూరినది.

బహుళ ప్రజలనిర్వచనముచే నేర్పడునదగుట చేతను, ద్రవ్యాధికారము హస్తగతముచేసికొని యుండుట చేతను ప్రజాప్రతినిధిసభయే రాజ్యాంగములలో నెల్ల నుత్తమాంగముగా పరిగణింపబడు చున్నది. ప్రజాప్రతినిధి సభకును, శిష్టసభకును వివాదము కలిగినప్పుడు ప్రజలు యెవ్వరివైపున నుండునో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు ప్రజాప్రతినిధిసభ నేరుగా ప్రజలచే నెన్నుకొనబడునది ప్రజకు నిష్టములేనిచో బహుస్వల్ప కాలములో మారి పోవునది. కాబట్టి ఈసభ సర్వసామాన్యముగా ప్రజలలోని యుద్రేకమును ననుసరించియే ప్రవిర్తించుచుండును తమ్ము ననుసరించు రాజ్యాంగసభపక్షమును ప్రజల వహింపక శిష్టసభపక్షమును వహింతురా ? ఈకారణముచేత ఆంగ్లభూమిలో ప్రజాప్రతినిధిసభ పై యుద్ధి యయి పోయినది. అమెరికాసంయు క్త రాష్ట్రములలోను, నేటి యితర ప్రజాసత్తాక రాష్ట్రము లనేకములలోను శిష్టసభ, ఆసంయోగము నందలి ప్రత్యేకరాష్ట్రముల ప్రతినిధులసభ యయి యుండుటచేత ప్రజాప్రతినిధిసభకును, నీ సభకును సంఘర్షణ కలుగు నవకాశములు మిక్కిలి తక్కువ. కాబట్టి రెండుసభలకు కొంచె మించుమించుగా సరి సమానమైన హక్కు లేర్పడి యున్నవి.

సభలో విధానములు

ప్రజాప్రతినిధిసభ కానిండు, శిష్టసభ కానిండు ఏసభ యైనను ఆలోచనచేసి కార్యముచేయుట కేర్పడిన సభలుగాని ఉబుసుపోకకు కాలముపుచ్చుటకు నేర్పడిన సభలు కావు. అందులో ఇరువురుమువ్వురు చేరునట్టి సభలును గావు. అనేక సంఖ్యాకులు చేరునట్టి సభలు. ఇందరు చేరినప్పుడు కార్యక్రమము నడచుటకేదో, యొకవిధానము కావలసియుండును. అందరును ఏకకాలమున మాటలా డుటగాని, ఒక్కొక్కరును ఇష్టమువచ్చినంతసేపు ఉపన్యసించుటగాని, ఇష్టమువచ్చినప్పుడు ఇష్టమువచ్చినవారులేచి సంభాషించుటగాని పొసగినచో జాతరయైపోవును. కాబట్టి ఒక్కొక దేశములోను శాసనసభలలో కార్యములు సాగించుటకు సూత్రము లనేకము లేర్పడియున్నవి. ఈ సూత్రము లన్నిటిని ఇట వివరించుటకుగాని, విమర్శించుటకు గాని తావుచాలదు. కాని, మూడు ముఖ్యసూత్రములు ఎల్లదేశములలోను ప్రముఖముగా నంగీకృతమయి యుండుటనుజేసి వానిని బేర్కొనదగియున్నది.

(1) ఏశాసనమైనను మూడుపర్యాయములు చదువనిది ఏసభలోను తీర్మానముకారాదు. ఇది అత్యావశ్యకమైన సూత్రము, మనదేశములోను ముమ్మాటికి చెప్పెదను విను మను నభ్యాసముకలదు. ఏదోవిషయము విమర్శకు తేబడినప్పుడు ఒకానొక సభ్యుడు పరధ్యానముగా నుండవచ్చును. అలసట చెంది యుండవచ్చును. లేదాభ్రాంతి పడియుండవచ్చును. ఊరక తలయూప వచ్చును. అయిన నదేవిషయము మూడుపర్యాయములు చదువంబడునేని సామాన్యముగా భ్రమప్రమాదములకు నవకాశముండదు. ఈసూత్రమున కిదియేయర్థము. ఇందింతటి యర్థము నిండియున్నను సామాన్యముగా శాసనములు మొదటి కడపటి పర్యాయములు మంత్రములవలె చదువ బడుచున్నవి. రెండవపర్యాయము చదువబడునప్పుడు మాత్రము సభ్యు'లు మేల్కొని ఉత్సాహముతో, అభినివేశముతో విమర్శకు గడంగు చున్నారు. . ఆంగ్లభూమివంటి భూములలో మాత్రము మూడు పర్యాయములును తగినంత చర్చజరు గుట కనుకూల మేర్పడినది. ఏలయన నచ్చట సభవారు మూడు పర్యాయములును సమ్మతులు తెలిపి ఒకవిధమగు తీర్మానమునకు నచ్చినట్లుగా సూచింపవలసి యున్నారు.

(2) శాసనమును ఉపసంఘముల యాలోచనకు బంపుట రెండవముఖ్యమగుసూత్రము. దేశ శాసనసభలలో నూర్లకొలది సభ్యు లుందురు. అందరికిని అన్నివిషయములును తెలిసి యుండవు. వాస్తుశాస్త్రముతో నెక్కున సంబంధముగల శాసనము ఉపక్రమితమైనయెడల వైద్యశాస్త్రజ్ఞుడు దాని విషయమయి స్థూలదృష్టిని విమర్శ చేయగలడేమోగాని సూక్ష్మాంశములలోనికి దిగి యిదమిద్ధమని తేల్చుటకు మాత్రము వలంతిగాడు. దేశ మంతటికిని శాసనములు చేయుపట్టున నిట్టిసమయములు దినదినమును పొడసూపుచుండును. సూక్ష్మాంశములచర్చ నూర్లకొలది ప్రజలకు రుచించునదియుం గాదు. కాబట్టి యుపసంఘముల యాచారము వాడుకలోనికి వచ్చినది. సంగతులు తెలిసిన యొకకొందరు సావకాశముగా కూర్చొని యొక్కొక్క విషయమును విమర్శించి ఆయాశాసనమును తమసభవారికిగాని, సభలవారికిగాని నివేదించు చున్నారు. తగిన వారియాలోచన పొందినందున శాసనసభలవారు ఆశాసనమును సులభతరముగా నంగీకరించుటకో, తిరస్కరించుటకోశక్తికలవా రగుదురు. ఇప్పట్టున మనకు 1920-లో ప్రసాదితమైన సంస్కరణశాసన మెట్లు విమర్శనందినదియు జ్ఞాపకమునకు దెచ్చికొనవచ్చును. ఆశాసనమున ముఖ్యమగు మార్పులు చేసినవారు ప్రజా ప్రతినిధిసభ ప్రభుసభలలోనుండి ఏర్పడిన యుపసంఘమువారు. వారే యేమార్పులు సూచించిరో రమారమిగా నన్నిటిని బ్రిటిషురాజ్యాంగ సభలవా రామోదించిరి. వారిసలహాలకు వ్యతిరేకముగా కొనిరాబడిన సవరణలన్నియును త్రోసివేయబడియెను. ఉపసంఘముల యాచారము ఎంత బలవంతమైనదియు ఈయొక్క నిదర్శనము వలననే స్పష్టమగుచున్నది. ఉపసంఘముల ప్రభావ మింకను నొక కొంతవర్ణింపదగి యున్నది. ఉదాహరణార్థము అమెరికాసంయుక్త రాష్ట్రముల శిష్టసభనే కైకొందము. ఆసభలో విమర్శింపదగిన శాసనములు సంవత్సరము సంవత్సరమును వేనవేలుండును. అందుచేత ఏబది యువసంఘము లేర్పడియున్నవి.సభయందు సామాన్యముగా మొదట చదువుటలో శాసనము పేరు, ఉద్దేశము చదువబడు చున్నది. వెంటనే దానిని తత్సంబంధియగు నుపసంఘమువారి యాలోచనకు బంపివేయుచున్నారు. ఉపసంఘమువారు అందులో కావలసినన్ని మార్పులు చేయుట కధికారము కలవారై యున్నారు. వారు దాని స్వరూపమునే వేరుచేసి దానిని క్రొత్త శాసనమునే కావింపవచ్చును. తుదకు దానిని సభవారి విమర్శకు తేక యుండవచ్చును. అనగా శాసనము ఉపసభవారి యధీనమున బడినది యనిన దాని యునికి, నాశనము వారి చేతులలోనే యున్నవనుట స్పష్టము.

(3) విమర్శలను నిలుపుదలచేయుట కేర్పడిన సూత్రము మూడవ ముఖ్యసూత్రము. ఏసభలోనైనను ఎక్కువ సంఖ్యాకులు 'ఇక విమర్శ' చాలునని కోరుటకు అధికారము కలవారై యున్నారు. ఇది యంత మంచి యేర్పాటగునాయనునది, యోచింపదగియున్నది. ఎక్కువ సంఖ్యాకులై మన మున్నంత మాత్రముచేత తక్కువ సంఖ్యాకులైన యెదుటివారి నోరు మూయించ వలసినదేనా? ఇది సరియనుడు, తప్పనుడు ఆచారముమాత్రము లోకమున స్థిరమయినది. కొంతవిమర్శ సాగినపిదప ఏసభలోనైనను ఒకసభ్యుడు లేచి ఈవిమర్శ చాలించవలసినదని యుపక్రమింప వచ్చును. అట్లుపక్రమించినప్పుడు కొన్ని కొన్నిసభలలో అధ్యక్ష స్థానమున నుండువారు . సభవారి సమ్మతి తీసికొనవలసియుందురు. ఎక్కువ సమ్మతులు నిలుపుడు పక్షముననుండెనా నిలుపుదల చేయవలసియుందురు. మరికొన్ని సభలలో తీర్మానముచేయు నధికారము అధ్యక్షస్థానమున నుండువారికే యొసంగబడినది. ఆంగ్ల రాజ్యాంగసభలోని ఏర్పాటు ఇదియే. అచ్చట అధ్యక్ష పదవియం దుండువానిని 'స్పీకరు' అందురు. ఆతని ఇష్టము వచ్చినయెడల ఆపుదలచేయవచ్చును; లేకున్న విమర్శ జరుగును గాకయని వదలవచ్చును. అమెరికాసంయుక్త రాష్ట్రములలోని ప్రజాప్రతినిధిసభలో మాత్రము సభ్యు బూరక మాటలాడుట కలదట ! తమమాట సాగదనుకొనువారు ఊరక మాటలుపెట్టి ఎదుటివారిని విసిగింపజూచుట సహజము. కాబట్టి అమెరికాసంయుక్తరాష్ట్రములలోను నిర్బంధ మవసరమని ప్రయత్నములగుచున్నవి.

ప్రతినిధి

శిష్టసభలో సభ్యుడుగా నుండు వాడైనను సరియే, ప్రజాప్రతినిధి సభలో సభ్యుడుగానుండువాడైనను సరియే ప్రతినిధిగానుండు వాడెవడైనను తనయధికారమును తా నెరుంగుట కష్టముగానున్నది. రాజ్యలాభాలాభము లొకవైపునను, తన్ను నిర్వచించిన ప్రాంతలాభాలాభము లొకవైపునను నుండ సమన్వయమెట్లుచేయవచ్చుననునది ఇతనికి గొప్పసమస్య యగుచున్నది. స్థూలదృష్టిని చూచినప్పుడు ఈరెంటికిని వైరుధ్యము ఉన్నయట్లు కానరాదు. రాజ్యములో భాగమగుప్రాంతమునకు ఏదిలాభకరమో అది రాజ్యమునకు లాభకరముకావలసినదే. ప్రాంతముల ఏకత్వమగు రాజ్యమున కేది లాభకరమో అది ప్రాంతములకు లాభకరము కావలసినదే. ఈసిద్ధాంతము బాగుగనే యున్నది కాని పలుమారు దినదినమును ఈసిద్ధాంతమునకు కొలదిగనో, గొప్పగనో కార్యక్రమమున విఘాతము కలుగుచుండును. దృష్టాంతములు కావలయునా ? నేడు మనరాజధానిలోను మన ఆంధ్రభూమి లోను పొడసూపిన సమస్యలనే యాలోచింతము. ఆంధ్రులగు మనకు ఆంధ్రరాష్ట్ర మావశ్యకము. మనద్రవిడసోదరులలో ననేకుల కది యిష్టములేదు. మన మిరుతెగలవారమును శాసనసభలో నున్నారము. మనప్రతినిధు లెట్లు ప్రవర్తింపవలెనో యెవరు చెప్పగలరు! అట్లే కృష్ణమండలము రెండు కానున్నదనుకొనుడు. క్రొత్తమండలమున కేది ముఖ్యపట్టణము? ఆంధ్రప్రతినిధి తనమండలమువారి యభిప్రాయానుసారము పోవలయునా లేక తానాంధ్రదేశమున కనుకూలమనుకొను రీతిని ప్రవర్తింపవలయునా?

నిజముగా ప్రతినిధికర్తవ్యము తన్నెన్నుకొనినవారు చెప్పినట్టుగా మాత్రముచేయుట యనరాదు. ఏలయందు రా. ఆఎన్నుకొనినవారే ప్రతినిధిస్థానమునం దుందు రేని వారును సమయానుకూలముగా ఆలోచన చేయవలసి యుందురు. ఏదైనను ప్రశ్న పొడసూపినప్పుడు దానికి సంబంధించిన పూర్వాపరముల నాలోచించి తీర్మానముచేయ వలసియుందురేకాని నాడిట్లంటిమి నేడును నిట్లేయందుమనుటకు రాదు. తమప్రాంతపుమేలును దేశపుమేలును వితర్కించి దేశపుమేలునకు తమప్రాంతపు మేలును లోబరచవలసిన వారైనను కావచ్చును. అందుచేత ప్రతినిధులకు స్వాతంత్ర్య ముండవలయుట అత్యవసరమై దోచుచున్నది.

అయిన ప్రతినిధులు తమస్వాతంత్ర్యము పేరుబెట్టుకొని తమ్మును నియమించినవారి యభిప్రాయములను లక్ష్య పెట్టక ప్రవర్తించుటకలదు. ఆకారణముచేత కొన్ని కొన్ని రాష్ట్రములలో శిక్షిత ప్రాతినిధ్యము ప్రారంభమయినది. ప్రతినిధి తన్నెన్నుకొనినప్రాంతమువా రేమిచెప్పిన నది చెప్పవలసిన దేకాని స్వతంత్రాభిప్రాయ మీయరాదు. ఈచిలుకపలుకు ప్రాతినిధ్య మంత బాగుగా నుండలేదు. ప్రతినిధియైనవాడు తన నిర్వాచకవర్గము నప్పుడప్పుడు కలిసికొనుచు తన యభిప్రాయములను వారికి చెప్పుచు వారి యభిప్రాయములను తానువినుచు సాధ్యమయినంత మట్టుకు వారి యభిప్రాయము ననుసరించుచు ప్రవర్తించు నెడల ఈ చిలుకపలుకు ప్రాతినిధ్యముకాని, అనిరంకుశ ప్రాతినిధ్యముకాని బాధింపకుండును. చక్కగా కక్షలేర్పడి దినదినమును ఆనాటి సమస్యలపై దృఢాభిప్రాయమిచ్చుచుండు దేశములలో ప్రతినిధి కెంతో కష్టముండదు. ప్రతినిధిసభలలోని లోపములచేతను, ప్రతినిధులలోపముచేతను కలుగునట్టి కష్టములను నివారించుకొనుటకు నేటి రాష్ట్రములు రెండు మూడు క్రొత్తఏర్పాటులను కావించుకొనినవి. తాము పంపిన ప్రతినిధిని తాము పదచ్యుతుని గావించుట యొకపద్ధతి. వోటరులలో ఇందరుకోరుదు రేని రాజీనామానియ్యవలయునని గాని స్థానము ఖాళీపడినట్లెంచవలసినదనిగాని నియమించుట దీనికిమార్గము. ఇట్టిమార్గమున కింగ్లీషులో 'రీకాల్ ' అని పేరుపెట్టినారు. ఇది విశేషము ప్రచారమునందులేదు. అమెరికాసంయుక్త రాష్ట్రములలో కొన్నిమునిసిపాలిటీలలో కలదందురు. ఇది యాచరణయోగ్యమని తోచదు. కారణము స్పష్టము, ప్రతినిధిని పంపునుద్దేశము కార్యకరణము. అందు స్వేచ్ఛకొలదిగానైన నుండదగును. లేకున్న నిత్య శంకితులే ప్రతినిధులు కావలసియుందురు. నిత్యశంకితులకు కార్యనిర్వహణశక్తియుండదు. వోటరులు ఎప్పుడు కోరిననప్పుడు తన్ను కార్యమునుండి మరల్తురను విశ్వాసముకలవానికి దీక్షయును కొరవడును. ఈకారణముల చేత 'రీకాల్ ' పద్ధతి యెక్కువ వ్యాప్తినందినదిగాదు.

వోటరుల కింకొకమార్గము 'ఉపక్రమాధికారము.' దీనినే ఇంగ్లీషులో 'ఇనీషియేటివ్' అనినారు. ఏశాసన మైనను చేయవలసినదనిగాని, ఏరాజ్యకార్యములైనను నిర్వహించవలసినదనిగాని వోటరులలో అధికసంఖ్యాకులు తమయభిప్రాయమును వ్యక్తపరచవచ్చును. అప్పుడు ప్రభుత్వమువారు ఆవిషయమై యాలోచింపక తీరదు. ఇట్టి 'యుపక్రమాధికారము” వోటరులకు అయిర్లండులో గలదు. అధమపక్షము 50000-ల వోటరులయినను చేరిననుగాని ఈ యధికారము వినియోగింప వీలులేదు. జర్మనీలోను నిట్టియధికారము ప్రజలకు ప్రసాదితమయి యున్నది. కాని నేడేర్పడియుండు డిక్టేటరులపద్ధతిలో వీని కర్థము లేదు.

వోటరులచేతిలోని మూడవ యాయుధము రెఫరెండము. కొన్నికొన్ని సందర్భములలో శాసనములను గురించియు, ముఖ్యవిషయములను గురించియు తాము స్వయముగానే అభిప్రాయము వ్య క్తము చేయుపద్ధతి కీపేరుకలిగినది. ప్రభుత్వములవారు అట్టి యభిప్రాయమును అమలుజరుపవలసియు నుండును. పరగణాలను, మండలములను నేర్పరచుటలో సరిహద్దులను నిర్ణయించుటకును; భాషలప్రాబల్యమును నిరూపించుటకును నొకప్రాంతపు ప్రజ లింకొకప్రాంతములోచేరుట కిచ్చగింతురా లేదా యనుటను నిశ్చయించుటకును నీపద్ధతి చాలయుపయోగపడినది. కడచిన యైరోపా మహాసంగ్రామానంతర మేర్పడిన చిన్నచిన్న రాష్ట్రములసమస్యలు పరిష్కరించుటలో నీపద్ధతి మాటికిమాటికి ననుసరింపవలసివచ్చినది. స్వయం నిర్ణయసూత్రమని ప్రచారమందిన సిద్ధాంతమున కిది సాధనముగా నుపకరించుచున్నది. అస్పృశ్యుల దేవాలయ ప్రవేశమునకు మనశాసనసభలలో పెట్టదలచిన శాసనము నమలుజరుపనెంచినచో ఈపద్ధతి నవలంబించవలెనను బునాది వై చినారు.

ఇనీషియేటివు, రీకాలు, రెఫరెండము పద్ధతులు శాసనబద్దముగా ప్రచారమునందున్నను, లేకపోయినను వా క్స్వాతంత్ర్య పత్రికాస్వాతంత్రములున్న దేశములలో చక్కని యాందోళనమూలకముగ వీనిఫలమును సాధించుట కవకాశమున్నది. ఇట్టి కొత్తఏర్పాటు కావలెనని సభలుపెట్టి తీర్మానములుచేసి వ్యాసములు వ్రాసి ఇనిషియేటివునందువలె గవర్నమెంటువారిచేత క్రొత్తచట్టము చేయింపవచ్చును. శాసనసభలలో విచారణకు రాగల సంగతులనుగురించి విస్తారప్రజాభిప్రాయమును పురికొల్పి రెఫరెండముఫలము సాధింపవచ్చును. ఏప్రతినిధిచేయునట్టి పనినైనను గట్టిగా విమర్శింపించి అతడు విసిగి రాజీనామానిచ్చునట్లు చేయవచ్చును. మొండికివేసుకుంటే మరల ఎన్నికలో రాకుండచేసి రీకాల్ ఫలమును పొందవచ్చును. అయిన నేటిలోకమున ఒకవైపు డిక్టేటరులచేతులలోని ఫేసిస్టు ప్రభుత్వములవంటి ఏకపక్ష ప్రభుత్వములును ప్రజాపక్షములేయైనను రుష్యాలోని సోవియట్టువంటి ఏకపక్ష ప్రభుత్వములును ఏర్పడి యింతచక్కని ఫలప్రదమగు వాక్స్వాతంత్ర్య, పత్రికాస్వాతంత్ర్యము లరికట్టబడుచుండుట గమనింపదగియున్నది.

_________


5

శాసననిర్వహణస్వరూపము

(అధికారశాఖ)

ఇదివరలో వ్రాయుటయందు అర్థసౌకర్యార్థము శాసననిర్మాణము, శాసనవివరణము, శాసననిర్వహణము, అనుక్రమమున వ్రాసితిమి, నేటి ప్రజాపరిపాలితరాష్ట్ర