ప్రభుత్వము/మూడు విధములు

వికీసోర్స్ నుండి

2

మూడు విధములు

నేడు అంగీకృతమైయుండు రాజకీయసిద్ధాంతానుగుణముగా ప్రభుత్వమను నధికారము మూడువిధములుగా పరిస్ఫుట మగుచున్నది.

శాసననిర్మాణము

(1) దీనినే తేట తెనుగున చట్టములు చేయుట యందురు. వేలకొలది ప్రజలకు సంబంధించిన పనులు చేయవలసియున్నప్పుడు ఆలోచనచేయకుండ పనిచేయ రాదుగదా! ఆయాలోచనయైనను నిమేషనిమేషమునకును మారుచుండు నట్టిదిగా నుండరాదుగదా! బాగుగా ఆలోచనచేసి మనము పద్ధతిని మార్చుకొనువరకును ఈవిషయమై ఈవిధముగా మనదేశములో పనులు జరుగుచుండ వలసినది అని తగిన పదిమందిచేరి నిశ్చయము చేసికొనుటకే చట్టముచేయుట యని పేరు. అట్టిసభలకే శాసననిర్మాణసభలనియుపేరు. ఆయధికారమునకే శాసన నిర్మాణాధికార మని పేరు.

శాసన వివరణము

(2) ప్రజాసమూహమునకు సంబంధించిన కట్టుదిట్టము దినదినము మారుచునుండరాదని చెప్పితమి. సంవత్సరము సంవత్సరము మారుచుండవచ్చునా యని ప్రశ్నించికొందము. ఇదియు పొసగునట్టి పనికాదు. తరములు తరములు యుగములు యుగములుగా చట్టములు అమలులో నున్నవి. మనదేశములో ఇప్పటికిని మనుధర్మ శాస్త్రము, పరాశరస్మృతి యిత్యాదులు ఆధారములుగా నున్నవి. వీనికి వ్యతిరేకముగా నడచుట యనిన మహాపాపమని తలంచునట్టివారును ఇంకను కోటానుకోటులున్నారు, మితాక్షరి, దాయభాగ న్యాయములు ఏనాడో ఏర్పడినవి నేటికిని ఉపకరించుచున్నవి. ఈరీతిగా శాసనములకు చిరాయువు కలిగియుండుట ఒక్క మనదేశములోనే కాదు. మనకు ప్రభువులుగానుండు ఆంగ్లేయుల దేశచర్రితమును ఆలోచించినను, వారలు ఏ పదిమూడవశతాబ్దపు శాసనమునో మాటిమాటికి తమసర్వస్వాతంత్ర్యములకును ఆధారముచేసికొని మాట్లాడుట గమనింపనగును. ఇట్లనుటచేత శాసనములు మారుచుండలేదని చెప్పుటగాదు. సంవత్సరము సంవత్సరము మారునట్టి శాసనములును నేటిదినము గలవు. [1]కాని మొత్తముమీద శాసనములు బహుకాలము స్థిరత్వముగలవై యుండుననుట నిక్కువము. అట్లు స్థిరత్వముగలవై యుండునవియే శాసననామమున కర్హ ములనియు జెప్పవచ్చును. ఎందువలన నన సంఘము దినదినాభివృద్ధి నందునట్టి వ్యక్తియైనను పూర్వసంబంధములను దినదినమును త్రెంచుకొనునట్టిదిగాదు. ఈనాటిజీవితమునకు నిన్నటిజీవితమును బునాదిచేసికొని, ఈనాటి జీవితమును నిన్నటి జీవితముతో సమన్వయము చేసికొని, రేపటి జీవితమునకు ఈనాటిజీవితమును ఆధారము కావించుకొనుచున్నది. ఇట్టి యనంతస్వరూపము సంఘ మునకు కలదగుటంజేసి సంఘమునకు సంబంధించిన కట్టుదిట్టములకును స్థిరత్వము కొంతవరకు అవసరమగుచున్నది. ఆలోచించి ఈ కట్టుదిట్టములను అమర్చి పెట్టునట్టి వారు శాసనకర్తలు. మనదేశమునందు పూర్వ మిట్టిపనిని ఋషులు చేసిరందురు. నేటిదిన మెల్లచోటులలోను శాసనసభలలో చేరి శాసనసభ్యు లీ కార్యమును నెరవేర్చుచున్నారు.

అయిన ఈ స్థిరత్వము అచలముగాదు. మానవుడు బుద్ధివికాసము కలవాడు. తనప్రతిభ చేత నిమేషనిమేషమును ఉత్తర ఉ త్తమస్థితులకు బ్రాకుచుండు స్వభావము కలవాడు. కాబట్టి ఏనాడోచేయబడిన శాసనమునైనను ప్రస్తుతోపయోగమునకు సరిపరచుకొనవలసినవాడు. అందుచేత శాసనగర్భమున నిమిడియుండు పదజాల మొకటియే యైనను కాలానుగుణముగా అర్థ మొక కొంతవిభేద పడుట కవకాశముకలదు. లిఖితమగు పదముల కొక్కటే యర్థ మెల్లప్పుడును నుండదు. ఏసందర్భమున మాటల నుపయోగింపవలసి యుండునో ఆసందర్భము ననుసరించి మాటలయర్థము మారవచ్చుననుట యెల్ల రెరింగినవిషయమే. 'ఏమయ్యా' అనునీరెండు పదములయర్థ మాలోచింతము. ముఖవికారమేమియు లేక వీనిని నుపయోగించునెడల సంగతియేమి అని యడిగి నట్లగును. ఈపదములనే కుటిలంపుచిరునగవుతో నుపయోగింతుమేని 'నీవు చేసిన యపచారము నేనెరుగుదును. ఏమిసమాధానమిచ్చెదవు? తెలుపు'మని బెదరించినట్లగును. ఈపదములనే కీల్గొంతుతో మొగము తేలవైచి పలికినయెడల , 'అయ్యో, నే నేమియు సహాయములేనివాడనై యున్నాడనే, నన్నేల ఇట్లు పీడించెదవు' అను నర్థమిచ్చును. ఇంతేకాదు. పదములపొందికకూడ బుద్ధివికాసము కలవారలకు వేర్వేరు అర్థములను స్ఫురింప జేయుచుండును. స్వపక్షమును సమర్థించుకొనుట మానవునకు నైజగుణము. అందుచేత శాసనము చేయబడిన పిదప దానిలోని పదజాలమును తనకు అనుకూలపడునట్లు వినియోగింప జూచుకొనుట మానవునకు లక్షణమైనది. కాబట్టి శాసనము పుట్టినతోడనే దానికి నర్థముచెప్పునట్టి యధికారియు నేర్పడవలసి వచ్చినాడు. ఒక్క చిన్న దృష్టాంతము. మనదేశపు శిక్షాస్మృతిలో 'దొంగతనము' అనునది నిర్వచింపబడినది. పరుని వస్తువును అతనియనుమతి లేక స్వీకరించుట దొంగతనము అనియున్నది. ఒక్క ఇంటిలో ఇద్ద రన్నదము లున్నారు. అచ్చట ఒక్కవస్తువుకలదు. అందుకు సంబంధించి ఎవ్వరు ఎప్పుడు పరుడగును? ఈ వివరణ శాసనములలో లేదు. ఇదేవిధముగా 'అనుమతి’యను సంగతియు సందిగ్ధములకు కారణము. తల యొకప్రక్కకు సూచిన సమ్మతియగును. రెండవప్రక్కకు త్రిప్పిన సమ్మతి లేకపోవచ్చును. ఈవివరణమును శాసనములోలేదు. ఈవివరణముల నిర్ణయము చేయుటకు అధికారి అవసరముగదా! ఆయధికారమే శాసనవివరణాధి కారము, న్యాయవిమర్శనాధికారము అనుపేళ్ల బరగుచున్నది. అప్పటికప్పుడు సందర్భముల నన్నిటిని విని శాసనముల కర్థము నిర్ణయించి తీర్పుచెప్పుట కేర్పడినవారినే మనము మేజస్ట్రీటులని, మునసబులని, జడ్జీలని, పంచాయతులని, కోర్టులని వ్యవహరించుచున్నాము.

శాసన నిర్వహణము

(3) శాసనములు చేయుట యొకపని; అర్థము చెప్పుట యొకపని; కాగా, వానిని కార్యక్రమమున పెట్టుట యనునది మరియొక పనికలదు. ఏర్పాటులు చేయుట యేల? నడిపించుట కేకదా! నడిపింపకుండునెడల ఏర్పాటులు చేయనేల? కాబట్టి సంఘమున కంతటికిని కావలసిన ఏర్పాటులను చేయునట్టి యధికారులు వానిని చేసినపిదప అట్టి ఏర్పాటులను నడిపించునట్టి యధికారులు కావలసియుందురు. వారి కే లోకములో నేటిదినము 'అధికార' శాఖవారని పేరుపడి యున్నది. ఆలోచనలు చెప్పువారు, వ్యాఖ్యానములుచేయువారు ఎంత కుశాగ్రబుద్ధులైనను కార్యము నడుపువారితో సమానమగు పలుకుబడిని వారు సంపాదించట సులభసాధ్యముకాదు. అందుచేతనే అధికారశాఖ యెల్లప్పుడును ప్రపంచమున పై చెయి కాజూచినది. ప్రజలస్వామ్యములను తనస్వాధీనముననుంచుకొన జూచినది. ప్రజలు తక్కుంగలశాఖలకు ప్రాముఖ్యము కల్పించి అధికారశాఖను వానికి వశముగ చేయ జూచినారు. ఎట్లైన నేమి, ప్రభుత్వమను అధికారమున

(1) శాసననిర్మాణము

(2) శాసనవివరణము

(3) శాసననిర్వహణము

అంగములుగా గర్భితములై యున్నవనుట స్పష్టము.


__________
  1. ప్రపంచరాష్ట్రముల నగ్రస్థానము నాక్రమించినదని పేరు గనిన అమెరికాసంయుక్తరాష్ట్రము సంవత్సరమునకు 2500 శాసనములు చేయుచున్నదట.