Jump to content

ప్రభుత్వము/ప్రభుత్వ మనగా నేమి?

వికీసోర్స్ నుండి

ప్రభుత్వము

1

ప్రభుత్వమనగా నేమి?

ప్రభుత్వమనునది నిజముగా బ్రహ్మవిద్యగాదు. కవిత్వము, చిత్రలేఖనము, చిత్రలేపనము ఇత్యాదివిద్యలవంటిదై నను గాదు. వీనినన్నిటినిగాని, కొన్నిటినిగాని, ఒక్కటినిగాని సాధించుటకు పూర్వజన్మ వాసన యవసరమందురు. ప్రభుత్వ మనుదానిని సాధించుటకు అంత పూర్వజన్మ వాసనయు నవసరము గాదు.

ఇదియేమిది ? ప్రభుత్వ మనిన ఇంతచులకనగా పలుకుచున్నా రే యని చదువరు లాశ్చర్యపడ వచ్చును. అ ట్లచ్చెరువంద బనిలేదు. కుటుంబములో ఇంటిపెద్ద చేయునట్టిపనిని ప్రభుత్వమనుపని అనుకరించును. అందు వలన అది యంతకష్టసాధ్యము కాదనుచున్నాము.

ఒక్క నిముస మాలోచింతము, ఇంటిపెద్ద చేయునట్టి పనియేమి? ఇంటిలోనికి ఇతరులు దూరి దోచుకొని పోకుండ ఇంటిని కాపాడుకొనుచున్నాడు. ఇంటిలో కుటుంబమునకు కావలసిన భోజనాదివసతులకు తగినసదుపాయములకయి వస్తుసముదాయమును సేకరించుచున్నాడు. కుటుంబము లోని వేరు వేరు జనులకు – అన్నకు దమ్మునికి, అక్కకు చెల్లెలికి, బావకు మరదికి, మామకు అల్లునికి—వివాదములు వచ్చినప్పుడు ఆవివాదములను తీర్చుచున్నాడు. చిన్నపిల్లలింటిలో ఉన్నయెడల వారికి గావలసినచదువు సంధ్యలకు తగిన యేర్పాటులు చేయుచున్నాడు. ఉచితజ్ఞుడగు ఉపాధ్యాయునో లేకున్న సరియైన విద్యాలయమునో వెదకికొని లేదా స్థాపింపించి వారికి విద్యవచ్చునట్లు చేయు చున్నాడు. మరి ఇంటిలోనివారికి భోజనాదికములు నిచ్చుచున్నాడు. గుడ్డల నిచ్చుచున్నాడు. వివాహాదినిత్యజీవన విషయములన్నియు సంపాదించుచున్నాడు. ఇంటిలోనివారలకు ఎవ్వరకై నను ఆరోగ్యముతప్పి రోగములు వచ్చినప్పుడు వారికి తగిన వైద్యసహాయమును సంపాదించు చున్నాడు. ఇల్లు శుభ్రముగా నుంచుటకు ఇంటిలో రాత్రులు దీపములు మొదలైనవి పెట్టుటకు అన్నివిధములైన ఏర్పాటులును చేయుచున్నాడు.

ఇట్టి ఏర్పాటులన్నియును బహుసామాన్యులైన గృహస్థులు చేసికొనుచుండుట ప్రపంచమున ప్రతి దినానుభవముగా నున్నది. మనదేశములో నిన్ననేటి దనుకగూడ ఇంతటి సంపూర్ణమైన ఏర్పాటులో, ఇందులో కొన్ని కొన్నియో, ఒక్కొక్క గ్రామమునకు ఒక్కొక్క తెగకు సంబంధించి నడచివచ్చినవి.

నశించీ నశింపకయుండు గ్రామసంస్థలవై పొక్క పర్యాయము దృష్టిమరల్చి చూడుడు, ఒక్కొక్క గ్రామములోను, కొన్నికొన్ని ప్రాంతములలో, నేటికిని సమష్టి ఆదాయమున్నది. ఆదాయ మిప్పుడు విశేషముగా ఏజాతర లకో కర్చగుచుండుట నిజమేకాని ఇంతకు కొంచెము పూర్వము అది గ్రామములమొత్తము మేలునకు వినియోగపడుచుండె ననుట నిక్కువము. 40 ఏండ్లకు పై బడనికాలమున సమష్టిమీద గ్రామమునకు కావలసిన బావులు మొదలై నజలాధారములు బాగుచేయుటయు, ఉపాధ్యాయులను నియమించుటయు, బాటలు చక్కబెట్టుటయు, మున్నగుకార్యములు గ్రామస్థులే జరుపుకొనుట కన్నులార చూచినవారు చాలమందికలరు. ఇక వివాదముల తీర్పు విషయమై వ్రాయనక్కరయేలేదు. గ్రామ సీమలలో నివసించువారి కందరికిని అంతయునశించిన నేటి కాలమునందును 'పంచాయతు' లను శబ్దము కడుంగడు పరిచితముగా నున్నది. ఎంతటి నిమ్నజాతులలోను వివాదములను తీర్చికొనుశక్తి మనదేశమున పరంపరాగతముగ వచ్చియున్నదనుట మన ప్రజ కంతటికిని తెల్లముగా తెలిసిన సంగతియే. కొంతకాలముక్రిందట మద్రాసునగరమునందు తోటిపాకీవారలందరును సంఘముగా నేర్పడుట సంభవించినది. అందులో కొంద రొకయేర్పాటు చేసికొనిరి. తమలో తమకు కలుగు వివాదములను బయటికి తీసికొని పోవరాదనుకొనినారు. పంచాయతిని నియమించికొనినారు. తీర్పులు చెప్పికొన్నారు. ఆతీర్పులమూలకముగను సంఘమునకు కొద్దిగా ద్రవ్యము చేరినది.

ఇక ప్రాచీనగ్రామసంస్థల ఏర్పాటు లాలోచింతమా మనదేశములోనుండినంత యౌత్కృష్ట్యము మరి యేదేశములోను నుండినదికాదు. దానినంతయు నిట వివరించుటకురాదు. అది స్థానిక స్వపరిపాలనమను గ్రంథ మునకుజేరినది. కాని యొక్కమాట మాత్రము ఇక్కడ వ్రాయవలసి యున్నది. మనగ్రామములలో అన్నివిధములగు ఏర్పాటులును గ్రామస్థులచేతులలోనే యుండి, వారే కుటుంబములోని ఇంటిపెద్దవలె గ్రామపుపెద్దలను నియమించుకొని పనులు నెరవేర్చుకొనుచుండిరనుట నిజము.

గ్రామముపై బడుటకు 'బందిపోటు' వచ్చుచున్నదని వినినయెడల గ్రామస్థులలో పటుత్వముగల వారందరును, ఆయుధపాణులై బయలుదేరి గ్రామమును కాపాడుకొనుచుండిరి. గ్రామములో విద్యాలయము జరుగవలయుననిన గ్రామస్థు లందరును బడిపంతులకు సంవత్సర గ్రాసము కల్పించి 'అతనిని పోషించుచుండిరి. గ్రామములో బాటలు వేసికొనవలసియుండిన తలకొకబండిరాళ్లు తోలి పని జరుపుకొనుచుండిరి. గ్రామమునకు కావలసిన భోజనాదివసతులనిర్వహణమునకు, గ్రామమునకు సంబంధించిన వ్యవసాయమునకు, నేతపనికి, కమ్మరమునకు, కుమ్మరమునకు, వడ్రంగమునకు ఇత్యాదుల కన్నింటికిని ఏర్పాటులుండెను. గ్రామములో ఏదైనను కలరా మున్నగువ్యాధులు కాన్పించినచో ఆయా గ్రామమువారలనమ్మకముల, విశ్వాసముల ననుసరించి ప్రతీకారములు చేయుటయు గ్రామవాసులందరి సమష్టి ప్రయత్నము మీదనే జరుగుచుండినది.[1] ఈరీతిగా మనదేశములో కుటుంబజీవనము, గ్రామజీవనము అను నీరెండును పరిపూర్ణ మైన వికాసముతో విజృంభించియుండినందుననే, మనదేశ మనాదికాలము నుండి ఉత్తమసామ్రాజ్యముల కునికిపట్టై శ్రీరాముడు, చంద్రగుప్తుడు, అశోకుడు, విక్రమార్కుడు, పృథ్వీరాజు, షర్షా, అక్బరు, శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు ఇత్యాది మహాచక్రవర్తులకు నిలయమై లోకమునకు సర్వవిధములగు జ్ఞానమును దానముచేయు మహామాతయై తనరార గల్గినది.

ఇంటికి ఇంటిపెద్దలును, గ్రామమునకు గ్రామపు పెద్దలును ఏయేపనులను నెర వేర్చవలసియున్నారో, నెరవేర్చుచుండినారో అట్టిపనులనే తగినవారు దేశమంతటికిని నెర వేర్చుటయే 'ప్రభుత్వము' అందురు.

దేశములను పాలించు ప్రభుత్వములవారు చేయునట్టి కర్మ లెవ్వియో గమనింతము,

(1) దేశమునకు తగిన భూసైన్యమును, నావికా సైన్యమును, వైమానిక సైన్యమును స్థాపించి ఇతరులు పై బడివచ్చి దేశమును దోచుకొనిపోకుండ కాపాడుట మొదటిపని.

(2) తగిన పోలీసుసిబ్బంది, న్యాయస్థానములు ఇత్యాదులను నియమించి, దేశములో నివసించునట్టి ప్రజలలో కలుగు పరస్పరమగు వివాదములను దీర్చుచు, పోట్లాటలను ఆపుచు శాంతి నెలకొల్పి దేశజీవనము సావధానముగా, ధర్మబద్ధముగా నడుచునట్లు చేయుట రెండవపని.

ఈరెండుకర్మలే 'ప్రభుత్వము' అను అధికారము నొసట నీశ్వరుడు వ్రాసినాడను సిద్ధాంతము పాశ్చాత్య భూములలో బహుకాల మంగీకృతమై యుండినది. రాజులు నిరంకుశులుగా నున్నన్నిదినములు, అధికారవర్గములు నిరంకుశములుగా నున్నన్నిదినములు, ప్రజలకు నోరు లేనంతకాలము ఈసిద్ధాంతము అవసరమైయుండినది. దేశములోని వృత్తులను అభివృద్ధి చేయునట్టి పనియు, గనులను త్రవ్వి లాభము సంపాదించుపనియు, ఇటువంటి పనులు పెట్టినయెడల రాజులును, నిరంకుశులును తమబలమును హెచ్చించుకొనుటకే ఈయధికారములను వినియోగించు కొందురు. విద్యావ్యాపనాధికారము వారికి నుండెనేని సామాన్యప్రజ తమకు నెట్లంకితులగుదురాయని ఆలోచించి తదనుకూలమగు విధానమునే నెలకొల్పుట వారికి స్వాభావికమగును. అధికారములు ఒనగూడినట్లెల్లను నిరంకుశప్రభువులును, అధికారులును ఈవిధముగా తమ తమబలమును పెంచుకొన జూచుట తప్పని ఫలము. కాబట్టి నిరంకుశపరిపాలనపద్ధతులు ప్రబలినంత కాలమును పాశ్చాత్యభూములలో ప్రజలు ప్రభుత్వముననుండిన రాజులకును అధికారవర్గములకును ఇట్టి అధికాధికారములను ఇచ్చుటకు అంగీకరించుచుండలేదు. ఇట్టి అధికారములు అట్టి నిరంకుశుల అధీనమున నున్నప్పుడు ఏవిధముగానైనను తాము వానిని స్వాధీనపరచుకొనుచు వచ్చిరి. అయిన నేటిదినము పాశ్చాత్యభూములలోను, ప్రాచ్యభూములలోను ప్రజాసత్తాకములు ప్రబలి ప్రజాస్వాతంత్ర్యము స్థాపితమైయున్నది. కాబట్టి ప్రజలు పూర్వము మనగ్రామములలో సమష్టిమీద నెన్ని కార్యములు జరుపుచుండిరో అన్ని కార్యములు దేశమంతటికిని సమష్టిమీద ప్రభుత్వమువారు జరుపవలయునని కోరుచున్నారు. అంతేకాదు. దేశమునందలి 'గనులు' ఇత్యాదులు ప్రత్యేకముగా ఒక్కరి స్వాధీనమున నుండరాదనియును ప్రభుత్వములవారే స్వాధీనముచేసికొని పరిపాలించి అందువలని లాభమును ప్రజలందరకును అందజేయవలయుననియు అభిప్రాయపడుచున్నారు.[2]

కాబట్టి నేడు 'ప్రభుత్వము' అను అధికారమువారు చేయవలసిన కర్మలు

(1) బయటి శత్రువులనుండి దేశమును సంరక్షించుటగాక,

(2) పరస్పరవివాదములనుండి ప్రజలను సంరక్షించుటగాక,

(3) దేశమునకు వలయు విద్యావిధానముల నేర్పరచుటగాక, (1) దేశమునందలి వ్యవసాయవాణిజ్యములను, పరిశ్రమలను పెంపొందించి దేశాదాయ మార్గములను అభివృద్ధిచేయుట

(2) దేశమునకు వలయు వైద్యసహాయాదికముల నమర్చుట

(3) రైళ్లు, రోడ్డులు, వంతెనలు, విమానములు మున్నగునవి కట్టించి రాకపోకలకు ననుకూలములు కల్పించుట

(4) బ్యాంకులు, విదేశములతోటి ఆర్థికసంబంధములు ఇత్యాదులు కల్పించి ప్రజలకు ఆర్థికానుకూల ములను పొసగించుట

(5) తపాలా, తంత్రీసమాచారములు ఇత్యాదు లేర్పరచి ప్రజలకు సహాయపడుట

మొదలగు ప్రజాసౌకర్యనిర్మాణమునకు సంబంధించిన ధర్మములు క్రమక్రమముగా నేర్పడినవి. ఏర్పడు చున్నవి.

నిజమునకు ఈ కాలమున ఒకవైపున ప్రతిగొప్ప రాష్ట్రమును మహాఘోరయుద్ధమునకు సిద్ధపడుచున్నట్లు, అన్ని బలములను పెంచుకొనుచున్నను అన్ని రాష్ట్రముల వారును తాము లోకశాంతికిగానే యిట్టిపని చేయుచున్నామని ప్రకటించుకొనుచున్నారు. ప్రపంచసంగ్రామానంతరము 'లీగ్ అఫ్ నేషన్సు' అను సర్వరాజ్యసమితి యేర్పడి ఆయుధవిసర్జనసమావేశములు జరిపి లోకశాంతిని సమకూర్చవలెనని ప్రయత్నించినది. ప్రపంచములోని సర్వప్రజలకును సంబంధించిన ఆరోగ్య, వైజ్ఞానిక, ఆర్థిక విష యములలో కొంత పనిచేసినది. స్వల్ప రాష్ట్రములపైకి గొప్పరాష్ట్రములు లంఘించి బలహీనులను నశింపజేయకుండ కాపాడవలెనను ప్రయత్నమున ఇటలీ, జపాను, జర్మనీల సామ్రాజ్యకాంక్షల నెదుర్కొనలేక భగ్నమయినది. సమితిలో ప్రధానరాష్ట్రములగు ఇంగ్లండు, ఫ్రాంసులు సామ్రాజ్యతత్త్వమునకు పుట్టినిండ్లగుటచేత సర్వరాష్ట్రసమితి ఫలవంతము కాలేకపోయినదని తజ్ఞుల యభిప్రాయము. అందుచేత ఏరాష్ట్రమున కారాష్ట్రము ప్రజాసౌకర్యసంబంధములగు సర్వధర్మములను నిర్వహించుచు ప్రాతనాటి దేశసంరక్షణకార్యక్రమమునుగూడ నాటికంటె నేడొక్కువగా తీర్చుకొనవలసినవి యయినవి. ముందు పరిణామ మెట్లుండునో చూడదగును.

పైన ఇదివరకు వివరించిన ఇంటిపెద్దయొక్కయు గ్రామముపెద్దలయొక్కయు కార్యక్రమముతో ప్రభుత్వము అనునట్టి అధికారముయొక్క కార్యక్రమమును పోల్చి చూచినయెడల రెండును వ్యాప్తిభేదమాత్రముతో ఒక్కటియేయనుట యెట్టివారికిని అర్థము కాకపోదు. కాబట్టి ప్రభుత్వము అను అధికారనిర్వహణము సామాన్యమగు విషయమేకాని ఏదో దుస్సాధ్యమగు పనికాదని వ్రాసితిమి. అట్టి సామాన్యవిషయము అయినందువలననే లోకములో నాగరకములేని అనేక రాష్ట్రములుకూడ స్వయంపరిపాలితములై యున్నవి.

ప్రభుత్వమను నధికారము సామాన్యవిషయమే యైనను బహుకాలముగా లోకములోని భిన్నజాతులు దీనిని నెరవేర్చుకొనుచు వచ్చియుండుటచేత, భిన్న భిన్న ప్రదేశములలో వేర్వేరుకాలములలో నియ్యది భిన్నభిన్న రూపములుగా వేర్వేరుఛాయలుగా పొడసూపినది. అందుచేత నేటిపరిస్థితులలో ప్రభుత్వము అను అధికారము నడుచునట్టి పథము నెఱింగినంగాని అందరితో సమానముగా మనమును ప్రపంచచరిత్రమున పాల్గొనజాలము. ప్రపంచమున నన్నిప్రాంతములయందును పాశ్చాత్యజాతుల ప్రాబల్యమువలన కొంచె మించు మించుగా నొకేవిధమగు ప్రభుత్వస్వరూపము ఏర్పడునట్టి మార్గము దోచియున్నది. ఆమార్గమును అనుసరించి నేటిదినము మనదేశములోను స్వరాజ్యమును నెలకొల్పుటకు ఉద్యోగములు జరుగు చున్నవి. ఆమార్గము లేవియో వివరించుట ఆకారణము చేత నవసరము.

పాశ్చాత్యజాతుల ప్రాబల్యముచేత ప్రభుత్వాధికారము ఒక్కరీతిని నేర్పడ నారంభించినది యనుటచేత ఆ యాకారమంతయు మనకు క్రొత్తయనికాని మనదేశమున నట్టియాకారమే యుండలేదని కాని తలంప రాదు. మనదేశమునందు ప్రాచీనకాలములో వ్యాపించియుండిన సంస్థలు నేటిపాశ్చాత్య రాజకీయసంస్థల పితామహప్రపితామహ స్థానమునుండి మన జీవితసిద్ధాంతములమీద నాధారపడి యుండినందున నింతకన్నను నెన్నియో మడుంగులు ప్రజాశాంతికి అనుకూల తరములుగా నుండెననుట నిక్కువము. వానిసూక్ష్మవివరణ మంతయును ప్రస్తుతవిషయముగాదు.



__________
  1. ఇట్టిపనిలో విశేషభాగము జరుగుటకు వీలుచేయవలయు నను నుద్దేశముతో నే ఇటీవల మనకోస్తాలో ‘పంచాయతు'ల నిర్మాణమునకును, నిర్వహణమునకును చట్టమేర్పరచి ఇప్పు డాచట్టమును లోకలుబోర్డులశాసనముతో నైక్యపరచి యున్నారు. కొన్ని కొన్ని జిల్లాలలో ముఖ్యముగా గుంటూరు, గోదావరులు, సేలము, ఉత్తరార్కాటులలో నూర్లకొలది పంచాయతులు చక్కగ పనిచేయుచున్నవి. కాంగ్రెసుప్రభుత్వము లేర్పడినపిదప మరల గ్రామవ్యవహారము లన్నిటిని పంచాయతుల పరము చేయవలెనని వారు ప్రయత్నించుచున్నారు.
  2. రుష్యావంటి యుద్దండరాష్ట్రములలో వ్యక్తిగతమగు ఆస్తియే యుండరాదనియు ప్రభుత్వమే సర్వవిధములయిన ఆస్తిని పరిపాలించి ప్రజలకు వారివారి పనినిబట్టి అవసరములనుబట్టి జీతము బత్తెము లిచ్చుచు బడిపిల్లలచదువులు ఇత్యాదులన్నియు సమష్టి సంస్థలలో జరుపజూచుచున్నారు.