Jump to content

ప్రభావతీప్రద్యుమ్నము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ప్రభావతీప్రద్యుమ్నము

చతుర్థాశ్వాసము

—————



రుచిరతరుఁడు విమలా
చారధురంధరుఁడు సుకవిసముదయగోష్ఠీ
సారస్యపరుఁడు పింగళి
సూరనయమరార్యవరుఁడు సురగురుఁ డుక్తిన్.

1


వ.

ఆరామవర్తి యైన కుమారోత్తముండు నన్నుం జూచి
యోచిలుకలకులభూషణంబ నాకు నీవలన నయ్యెడుప్రయో
జనంబు విను మావజ్రపురంబున శుచిముఖి యనురాజ
హంసి గలదు దాని నరసి యొక్కలేఖ యందింపవలయు
ననియె నే నతని యతిదైన్యాతిభారంబు భావించి కారుణ్య
పరవశత్వంబు నొందినదాననై తక్కినయౌగాములు లెక్క
సేయక యీకమ్మ హంసి కిచ్చు టింతియ కదా యని కొంచుఁ
బోయిన నెంత తప్పు వాటిల్లెడు ననుతలంపున నియ్యకొని
యయ్యాకు పతత్రంబులోన లీనంబుగాఁ గట్టించుకొని వచ్చి
యిప్పు డప్పువ్వుఁదోఁటలోని కొలంకులు కలహంసకులకల
కలాకులంబు లగుటయుఁ దత్కన్యకాపరిచయంబున నున్న
నిన్నుఁ బరికించి.

2


తే.

ఇచట శుచిముఖ యనుహంసి యీగడ యొక
కొంత దొరకునో యంచు నక్కుజమునందు

నొయ్య నిలిచితి నంతనె యురిని దగులు
కొంటి లోనైతి నీపాట్లకు న్మరాళి.

3


వ.

అని చెప్పుటయు.

4


క.

తనకార్యమ యది యగుటకు
ననయము ముద మొదవ మదిన యడఁచి యిది యెఱిం
గినయది యింతియ కావల
యును బత్రికచంద మింత యొనరునె యనుచున్.

5


వ.

కావున నింక నీపత్రికాప్రసంగంబు నిస్సారంబుగాఁ బోనాడి
ప్రసంగాంతరంబున మఱపించి విడిచెద నని హంసి చిలుక
కి ట్లనియె.

6


ఆ.

పక్షిపేర వ్రాసి పత్రిక యనిచెడు
నట్టివాఁడు భ్రాంతుఁ డగుట ధ్రువము
నా కతం డనిపినయాకమ్మ యె ట్లుండె
నేమి మిగుల నొరసి యేల యడుగ.

7


క.

నీ వాపురికిని మొదలం
బోవం బని యేమి చెప్పుము యథార్జముగా
నావుడును నీళ్లు నమలుచు
నావిహగము చెప్పఁ గొంక నంచయు దానిన్.

8


ఆ.

బిగియఁబట్టి యెందు బెణఁక నీ కడిగె నే
యర్థ మిందుఁ గలదొ యనుతలఁపున
జడియ కదియుఁ జత్తు సరిపోదు మాటప
ట్టీక చెప్ప ననుచు వీఁక నుండె.

9


ఆ.

నవనిధానములును దవిలి యిచ్చిన నైన
మెడలమీఁద గత్తి యిడిన నైనఁ

జాల రనఘచరితు లేలినవారిర
హస్యభంగమునకు ననుమతింప.

10


వ.

హంసియు దాని కడిగినమాటప ట్టిచ్చె నదియు ని ట్లని
చెప్పె.

11


క.

విను వజ్రనాభుతమ్ముఁడు
సునాభుఁ డనుఘోరరాక్షసుండు గలఁడు త
త్తనయలు గల రిద్దఱు సొబ
గున నధికలు చంద్రవతియు గుణవతియు ననన్.

12


చ.

అతఁ డొకనాఁడు నారదు విహారవశంబున నాత్మసత్సభా
గతుఁ డగువాని సద్వినయగౌరవపూజలఁ దన్పి సౌవిద
ప్రతతులఁ గూర్చి లోపలికిఁ బంచెను దేవులు నక్కుమారికా
ద్వితీయము మ్రొక్కి రాతనికి దీవన లందుటకై వినీతితోన్.

13


సీ.

ఇవ్విధమున నమ్మునీశ్వరుఁ బూజించి
            యతనియాశీర్వాద మందుటకును
దనయంతిపురమువారిని సునాభుఁడు నియ
            మించి పంచినఁ బరమేష్ఠిసుతుని
వారును వివిధోపచారపూజలచేత
            సంతుష్టుఁ జేయుచోఁ జంద్రవతియు
గుణవతియును భక్తిఁ బ్రణమిల్లఁ బతిమనో
            వల్లభలై పుత్త్రవతుల రగుచు


తే.

నొప్పుఁ డనుచును దీవించె నప్పు డచటి
దాదు లోమునివర్య యీతలిరుఁబోండ్ల
కధిపు లెవ్వారు వారల నానతిండు
నావుడును గొంత చింతించి నారదుండు.

14

మత్తకోకిల.

వీరి కిద్దఱకు గ్రమంబున విస్ఫురద్గుణశోభితుల్
ద్వారకానగరాశ్రయు ల్యదువంశజు ల్గదసాంబు ల
న్వారు నాథులు గాఁ గలా రని వారి కానతి యిచ్చె న
న్నారదోక్తికి వారు చిత్తమున న్విచారము సంధిలన్.

15


తే.

కుడిచి కూర్చుండి వెతఁ దెచ్చుకొంటి మొకటి
యెన్న నెక్కడిద్వారక యెక్కడిగద
సాంబు లివి విన్నఁ బెనుచేటు స్వామిచేత
నసురులకుఁ బగవీడఁట యాపురంబు.

16


చ.

అని తమలోనఁ దా రడఁచి రాపలు కెందును సుబ్బకుండ న
ద్దనుజవరేణ్యకన్యకలు తాపసవాక్యము విన్నయాదిగా
మనమునఁ గూర్మి హెచ్చి నియమంబులు నోములు దానధర్మవ
ర్తనలుఁ గరంబు సల్పుదురు తద్గదసాంబశుభంబె కోరుచున్.

17


చ.

క్రమమున భోగయోగ్య మగుప్రాయము నిండుచు రాఁగభర్తృసం
గమనమనోరథంబు నతిగాఢము గాఁగఁ బతి ప్రవృత్తిలా
భము గడు దవ్వుగా నలసి బాలిక లిద్దఱు తద్దయున్ గత
క్షమఁ గుసుమాస్త్రబాణములఁ గాంతియె చిక్కఁగఁ జిక్కి రే మనన్.

18


ఉ.

అచ్చపలాక్షు లిద్దఱును నర్మిలిఁ బెంచియుఁ బల్కు నేర్పియున్
ముచ్చటకాఁపుగాఁ దమవినోదపునెచ్చెలిగా నను న్గడున్
మచ్చికఁ జూతు రాసతులమన్ననకుం దగఁ బ్రత్యుపక్రియా
సచ్చరితంబుఁ జూపఁగ నజస్రము నేనును గోరుచుండుదున్.

19


క.

కావున వారలయప్పటి
భావజశరపీడఁ జూచి భామినులారా

మీవల్లభులశుభస్థితి
నావెరవునఁ దెలిసి వత్తు నమ్ముఁడు మదిలోన్.

20


తే.

మఱియు నప్పటికొలఁదిని మంతనముగఁ
జేరి మీకోర్కిఁ జెప్ప వచ్చినను జెప్పి
మాఱుమాట యేఁ దెచ్చెద మానసముల
నన్యచింతలు మాని న న్ననుపుఁ డనుచు.

21


వ.

ఏను మద్విరహాసహత్వంబునం జేసి వారు లనుపం జాలక
యనుమానించినను మానక యపుడ కదలి ద్వారకా
పురంబున కరిగి నాచేత నైనపాటిగమనకార్యంబు సాధించు
కొని తిరిగి వచ్చునప్పు డాలేఖ యట్లు ప్రాప్తం బయ్యెఁ
దత్ప్రకారంబును వినిపించితి నన్నుఁ బ్రభావతి చూచి
గుఱు తెఱింగెనేని చంద్రవతీగుణవతులకు నేమి కొఱ
గామి సంఘటిల్లునో యని తలంకెద నవ్వనితలకు మత్పున
ర్దర్శనంబునకై మితి పెట్టినదినంబు నేఁడ కావున నెంత
వంతం బొరలుచున్నవారో వారికిం బొడసూపవలయు
న న్ననిపి యనుగ్రహింపుము.

22


తే.

ఘనపయోవృష్టికిని జాతకములు వోలెఁ
గొమరువెన్నెలకును జకోరములు వోలె
భాస్కరోదయమునకు నబ్దములు వోలె
నెదురుచూతురు నారాక కిందుముఖులు.

23


వ.

అనుటయు.

24


ఆ.

ఏను నిన్ను విడువ కిట్ల వచ్చెద నీవు
చెప్పినంతవట్టు నప్పడఁతులఁ

బిలిచి నాయెదుటను గల దనిపించిన
విడుతు మదుపకారవృత్తి దెలిపి.

25


క.

అనవుడు నట్లన కాని
మ్మనుచుఁ దదాక్రాంతమూర్తి యగుచునె వెసఁ దా
జని చిలుక కెళవు లరయుచు
సునాభకన్యలు వసించుశుద్ధాంతమునన్.

26


క.

ఒకసౌధవిటంకమత
ల్లికమాటుగ వ్రాలి లాఁతిలేఁమ లచటఁ జే
రికఁ బొలయ కుండ నారసి
యకలంకస్వరతఁ బిలిచె నాకన్నియలన్.

27


క.

పిలుచుటయు వార లిది మన
చిలుకయెలుం గనుచు నుల్లసిల్లి రపుడు వీ
నుల నూఁదుకప్పురపుఁజలు
వలఁ బోలి విరాళియలఁత వడి నది తీర్పన్.

28


ఆ.

అట్లు సంతసిల్లి యతిసంభ్రమంబున
నరుగుదెంచి హంసికావృత మగు
చిలుకతెఱఁగుఁ జూచి వెలవెలఁ బాఱఁ ద
ద్భయనివృత్తి గాఁగఁ బలికెఁ జిలుక.

29


క.

నిను నంపినవారికి నీ
కును హితమె యొసక్తుఁ బ్రాతికూల్యం బొకప
ట్టునఁ జేయ ననుచు నిది నా
కు నిజము చేసినది మీరు కొంకకుఁడు మదిన్.

30


వ.

అని తనకును దానికిం బ్రాపించినసంబంధంబు తెఱంగునుం
దాను మాటపట్టు పుచ్చుకొని తనకార్యరహస్యంబుఁ దెలు

పుటయుం దెలిపి యేను మీదాన నగుట మీచేత వెళ్ళ
నాడించుకొని మీ కుపకారం బెక్కించి విడుచుటకు వచ్చిన
దని చెప్పి తత్ప్రార్థనావశీకృతహృదయ యగుహంసిచేత
విడువంబడి యేను బోయినకార్యంబు వివరించెద నని వారల
వేఱువేఱం బేరు గ్రుచ్చి యి ట్లనియె.

31


తే.

చంద్రవతి నీదుప్రాణేశుఁ డింద్ర నిభుఁడు
గదుఁడు ద్వారక నున్నాఁడు ముదముతోడ
గుణవతీ నీదుప్రియుఁడు సాద్గుణ్యరాశి
తనరుచున్నాఁడు సాంబుఁ డెంతయు శుభమున.

32


క.

ప్రకటితచాతురి నారా
జకుమారులతోడ నుచితసమయముల న్మ
చ్చిక చేసితి నేఁ గ్రమమున
నొకఁ డెఱుఁగక యుండ నొకనియొద్దకుఁ జనుచున్.

33


క.

విదితము చేసితి మీమీ
హృదయేశుల కంత మీయభీష్టము తెఱఁగుల్
తుద నంతయుఁ దెలిపితి మీ
బ్రదుకులతదుపేక్షణైకపర్యంతతయున్.

34


తే.

వారు నేయుపాయములను వదలక వరి
యించువా రైరి మిమ్ము మీ రింతలోన
ధృతి సడల నిత్తురే నాత్మహతియ కాక
పతిహననపాతకముఁ గల్గఁ బల్కి రపుడు.

35


సీ.

అని చెప్పుటయు విని యాకన్యకలు గరం
            బులఁ గర్ణయుగళంబు మూసికొనుచుఁ

దమ కంత యే లగుఁ దాము దీర్ఘాయుర
            న్వితు లగుదురు గాక యతివియోగ
వనరాశి నేమును మునుఁగక తమమాట
            యాస పెన్దెప్పగా నచల మైన
తాల్మి నీఁదుచు నుండెదము తమ కస్మదీ
            యప్రాణసంరక్షయందుఁ దగిన


తే.

త్రోవ మాభాగ్యవశమునఁ దోఁచుదాఁక
నోర్చుటయ కాక తమకింప యుక్త మగునె
యని పలికి యూరకుండిన నంచచెలువ
వారి కి ట్లను సముచితవాక్యసరణి.

36


క.

మీపతు లిట వచ్చుట కుచి
తోపాయము మిగులఁ దడయ కొక్కటి తగ నే
నాపాదించెద మీరలు
నాపై దయ మఱవకుఁడు మనంబులయందున్.

37


వ.

ఏను బ్రభావతికిఁ బ్రాణసఖి నై యుండుదుఁ గావున నా
చెలువపనుపున నీచిలుక నిట్లు దగులుకొని వచ్చితి నిది
నిమిత్తంబుగా నైన మీతోడిమైత్రి దొరకె నింక నిక్కడ
మిక్కిలిం దడయఁ దగదు పోయి వచ్చెద నచ్చట నిచ్చటి
రహస్యంబు వెలివోవ నీక తగినయుత్తరం బిచ్చి కప్పి
పుచ్చెద నిచ్చలంపుమనంబుల నుండుం డని పలికి యా
మాటల కత్యంతసంతుష్టాంతరంగ లగు నాయంగనల
వీడ్కొని వజ్రనాభతనయకడకు నరుగుదెంచి యి ట్లనియె.


క.

చెలువా నీసౌభాగ్యపు
విలసనమ కదమ్మ యెచట వీక్షించిన న

ర్మిలి నీపతి నీకై చిం
తిలి యనిపిన లేఖ యఁట కదే తెలియంగన్.

39


వ.

అనిన నక్కన్యకారత్నంబు నవ్వుచు ని ట్లనియె.

40


క.

అడుగఁగ వలసినయది యే
నడుగుదు విశదముగ మొదల నాచిలుక యదె
క్కడిది యిటఁ దేక యేటికి
విడిచితి నీకడుపు కందవిత్తుగ హంసీ.

41


వ.

అనుటయు శుచిముఖి యి ట్లనియె.

42


క.

నీపతి నీకై కుందుచు
నాపేరను లేఖ యనిపినాఁ డని యిది యే
నాపులుఁగువలనఁ దెలిసి ము
దాపూర్ణత నుబ్బి విడిచి యనిపితి దానిన్.

43


క.

మన కి మ్మనుచు నతం డని
చినపత్రిక దొరకె నొరులచేఁ బడ కిదియే
మనకుం బదివే లెట్లట
చనని మ్మాచిలుక తద్విచారం బేలా.

44


సీ.

అని రాగవల్లరిఁ గనుఁగొని యాపత్రి
            కార్థ మే విన్నట్లె యగుఁ గదమ్మ
చదువుకొంటిరె యన్న నది తాను జదివిన
            యంతయుఁ జెప్పి నన్నవలఁ జదువ
నీక తా నొడిసి యాయాకు బలిమిఁ బుచ్చు
            కొనియె నీపడు చన విని మరాళి
యటమీఁదఁ దెలియ నాయము కాదు మనకు న
            నన్యప్రకాశనీయంబు లైన

తే.

ప్రేమభంగులఁ దా నేమి యేమి వ్రాసి
యనిపినాఁడొ కడున్ రహస్యంబు గాఁగ
నట్టియాకాముకునికూర్ము లతనిసతియె
చదువుకొని మోదసంపదఁ బొదలనిమ్ము.

45


క.

ఓవనిత లేఖలోనఁ బ్ర
భావతి యనఁబోయి ప్రప్రభాభావతి యం
చీవిధమున వ్రాసిన భ్రాం
త్యావిష్టుం డేమి వ్రాయఁ డమితపుఁగూర్ముల్.

46


క.

వెఱఁ గయ్యెడు నే నపు డీ
తరుణిగుణంబులు సుతింపఁ దాను విరక్తి
స్థిరునట్లు యుండి తోడనె
విరహార్తుఁడ నైతి ననుట వివరింపఁ జెలీ.

47


క.

ప్రాయపువాఁ డఁట సదృశ
శ్రీయుక్తిఁ దలిర్చుబిత్తరి న్వినునఁట యా
హా యాతనియాత్మ యినుమొ
ఱాయో కులిశంబొ నెఱి దొఱంగక యుండన్.

48


వ.

అదియునుం గాక.

49


తే.

సకలసౌభాగ్యభాగ్యలక్షణగుణైక
ఖని ప్రభావతి సిద్ధసంకల్ప గాక
యుండు నేని శాస్త్రము లిన్నియును బుధులకుఁ
బ్రత్యయానర్హతను వృథాభరమె కావె.

50


వ.

అనినఁ బ్రభావతి దాని కి ట్లనియె.

51


సీ.

ఇపుడేమి గంటి నా కెక్కడిసిద్ధసం
            కల్పత గుమ్మడికాయలోన

నావగింజయుఁ బోదు హంసి నాచింతాభ
            రంబులో లేశమాత్రము నుడుగుట
గలదె యీవేళకుఁ దలపోసి చూచినఁ
            దాదృశాశ్చర్యసౌందర్యకోమ
లాంగుఁ డవ్విభుఁడు నాకై యెంత యలసెనో
            యెంత కుందెనొ యనునట్టి వెతయు


తే.

నొకటి తొంటికంటె విశేష మొదవె నేఁడు
దీనిఁ దరియింప నిక నెద్దితెరువు చెపుమ
యసురపతి యొల్లఁ డాతనియల్లుఁదనము
పుర మితనియాజ్ఞ లే కెట్లు జొరఁగరాదు.

52


వ.

అనుటయు శుచిముఖ ప్రభావతి కి ట్లనియె నోపువ్వుఁబోఁడి
నీపలికినయంతయుం దప్పదు నీవిభునిరాకకు నాకనిరోధి
యనుమతి సాధించుటకు సుపాయం బొక్కటి గలదు దాని
నేన యెఱుంగుదు నీకు ననువైనసమయంబున నన్ను
సరసకథాకథనప్రవీణ యనియును సకలవిద్యాధురీణ యని
యును బ్రభువుల నుబుసుపుచ్చి మెచ్చింప నేర్చు ననియును
నిచ్చకు వచ్చునట్లుగా భవజ్జనకునకుం జెప్పి సమ్ముఖంబు
నకు రప్పించుకొనునట్లుగాఁ జేయు మటమీఁదటి కార్యం
బునకు దైవంబు గలదు పోయి వచ్చెద నిచ్చటికొలంకులన
యుండెదఁ జుమీ మాటవడిన పిలిపింతుగాని యనుచు వారి
ద్దఱ వీడ్కొని నిజేచ్ఛం జనియెఁ బ్రభావతియు సఖీసహిత
యై గృహంబున కరిగె నంత నక్కాంత యొక్కసమయంబున.

53


చ.

వెలుపలికొల్వు వీడ్కొలిపి విశ్రుతతేజుఁడు వజ్రనాభుఁ డిం
పలరఁగ రాణివాసమున నాడెడి పాడెడి పువ్వుఁబోండ్లసే

వలు గొనుచుండఁ జేరి తగువర్తన నొప్పుచుఁ ద న్నతండు వ
త్సలతయు గారవంబు వెదచల్లెడుమాటల నాదరింపఁగన్.

54


వ.

తదీయరత్నసింహాసనసమీపంబునఁ బ్రవర్తిల్లుచు నల్లన
ప్రసంగంబు దిగిచి సవినయమధురభాషణంబుల ని ట్లనియె.

55


క.

మనబొడ్డనబావులలో
ననుదినముఁ జరించునoచలం దొకహంసాం
గన యేమి చెప్పఁ దండ్రీ
కని విని నే నెందు నెఱుఁగ గని విద్యలకున్.

56


చ.

శుచిముఖి యండ్రు దానిని వచోనిపుణత్వమునందు సత్కథా
రచనలయందు నీతివిదురత్వమునందు బహుశ్రవోవలో
కచణతయందు నెందు సరి గానము దానికి వేయు నేల దా
నిచతురతావిశేషములు నీవ కన న్వలయు న్మహాత్మకా.

57


తే.

అనుడు నాదైత్యపతి తనయనుఁగుఁగూఁతు
మాట లొకముద్దు సేయుచు బోటిఁ బనిచి
యమ్మ రప్పింపవే చూత మమ్మరాళి
ననియె నింతియు రప్పించె హంసి నపుడ.

58


వ.

రప్పించి ముందట నిడుకొని శుచిముఖి నీదువిద్యావిలసనంబు
విన్నవించిన నయ్య వినవలయు నని వేడుక పడుచున్న
వాఁడు శాస్త్రప్రసంగంబు సేయు మనిన నదియును.

59


క.

వీనులకు సుధారసముల
సోనలు వర్షించుమృదులసుస్వరఫణితిం
దా నిట్టట్టు గ్రుక్కక పని
లేనిపునఃపదము లిడక లీల దలిర్పన్.

60

శా.

కాణాదంబును గౌతమీయమును సాంఖ్యంబు భుజింగాగ్రణీ
వాణీమార్గము జైమినీయమతమున్ వ్యాసోక్తశాస్త్రంబు వ
క్కాణించెం గడుఁ బూర్వపక్షములు జోకం బెంచుచు న్బెంచి య
క్షీణప్రౌఢిఁ దిరస్కరింపుచుఁ దుదన్ సిద్ధాంతము ల్నిల్పుచున్.

61


మ.

స్వమితిప్రౌఢి దృఢానుమానముల సంస్థాపించు నేవేళ నె
ద్ది మతం బప్పుడు వానివానికి నుపాధిగ్రస్తతావ్యాప్తిభం
గముఖానేకసుదూషణంబులు వెసం గల్పించుఁ దా నన్యశా
స్త్రమతస్థాపనవేళ నవ్విహగి దైత్యశ్రేష్ఠుఁ డోహో యనన్.

62


వ.

మఱియును.

63


తే.

కావ్యనాటకాలంకారగానమదన
శాస్త్రపరిచయమహిమంబు జాలపాద
భామినీమణి నెఱపె నుద్దామపటిమ
నాయసురభర్త మెచ్చి పురే యనంగ.

64


వ.

అంత నద్దనుజనాయకుండు శుచిముఖముఖం బవలోకించి
నీవును నాదిగంతచారిణివి నీ కనినయద్భుతంబు లే మేని
యుం గలిగిన నెఱింగింపు మనవుడు నాయంచ యించుక
విచారించుట యభినయించి యి ట్లనియె.

65


తే.

కనినచోద్యంబు లెన్నియో గలవు వాని
నేమి చెప్పుదు నందులో నెల్ల నాకు
నతివిచిత్ర మై తోఁచినయది నిశాచ
రాధిప వచింతు నొక్కటి యవధరింపు.

66


ఆ.

నటుఁ డొకండు భద్రనాముండు మున్నొక్క
చోటఁ దాపససభ నాట నేర్పు

వలన మెచ్చఁ జేసి వరముగా నత్యద్భు
తంపునాట్యపటిమపెంపు వడసి.

67


సీ.

ఏడుదీవులఁ జరియించుచు నున్నవాఁ
            డని చెప్పి యతనినాట్యములవేళఁ
గలయట్టియద్భుతంబులు సర్వమును సవి
            స్తరముగ వినిపింప దానవేంద్రుఁ
డాశ్చర్యకౌతుకాయత్తాత్ముఁ డగుచు నే
            నును గొంత కొంత యాతనితెఱంగు
విని చూడవలయు నన్వేడుక నుండుదు
            నీవు ప్రవీణ వన్నిటను హంసి


తే.

యానటుని నిచ్చటికిఁ దెచ్చితేని మెచ్చు
గలదు నీ కని ప్రేమతోఁ బలికె నదియు
నట్ల చేసెద నని దనుజాధినాథు
వీడ్కొని ప్రభావతనిఁ జూచి వినయ మొప్ప.

68


ఉత్సాహ.

అనిపెదే ముదంబుతోడ నమ్మ పోయి వత్తునా
యనుడు నదియుఁ గొన్నియడుగు లనుప నేఁగుదేర నో
వనరుహాక్షి యింతయు న్భవత్ప్రియార్ధమే సుమీ
మనమునందు నిది యెఱింగి మైత్రి మఱవ కుండుమీ.

69


వ.

అనుచు గూఢవృత్తిఁ దదిష్టసాధనపరత సూచించి యని
పించుకొని ద్వారకానగరంబునకుం బోయి తాను వజ్రనాభు
చేత భద్రనామధేయనటునిం దోడ్కొని తెచ్చుటకు
నియుక్త యగుట కృష్ణుని కెఱింగించి వజ్రనాభానుజుం డగు
సునాభునికూఁతులు గదసాంబులకు భార్యలుగాఁ గల రని
నారదవచనంబులకలిమి చెప్పి ప్రద్యుమ్నున కసురజయ

సాహాయ్యకంబు నడుప గదసాంబు లరుగువా రని నిశ్చ
యించిన యాచక్రధరునినిశ్చయంబు విని యది తదీయశాస
నంబున వాసవునకు విన్నవింప దివంబునకుం జనుచుం
బ్రద్యుమ్నునింటి కరిగి యప్పు డతండు ప్రభావతీవియోగ
తాపాతిభారంబున నసురుసు రగుచు మిగుల నొగిలి తదు
దంతచింతం జేసి నిజాగమనంబ కోరుచున్నవాఁడు గావున
నతనిచేత నతిమాత్రాదరగౌరవంబు వడసి యేకతంబున
నతనితోడ.

70


సీ.

ఒకచిల్కచేతఁ బత్రిక యంచితే నాకు
            ననిచితి నది నీకు నందె నొక్కొ
యనుచు టెవ్వరిఁ గూర్చి యది వారికిని జేరె
            నాయింతికి శుభంబె హంసరమణి
నాలేఖ యందుట నామాట యనవచ్చు
            మున్నట్టికొదవ రా మూల మెద్ది
పత్రిక కడుదైన్యపడి నీవు పంచు ట
            ట్లాకాంతపై నెంతహాళికలిమి


తే.

నాసతియు భవద్విరహాగ్ని నంత గుందె
నన్ను నెఱుఁగుట యెట్లు ము న్వాంఛ సేయ
శివ లిఖించి యిచ్చినది నీచెలువు దాని
కేమిటికి నిచ్చె వరుఁడు నీ కీతఁ డనుచు.

71


మ.

అనుచు న్మాటకు మాటగా వరుసతో హంసీకులోత్తంస మా
తనికిం దైత్యతనూజకోర్కితెఱఁగుం దన్మూలముం జెప్పి యి
ట్లను నే నీ కిది నాఁడె తెల్పుటకుఁ గాదా చేసితి న్జాల ద
ద్ఘనశోభాస్తుతి నీ వొకించుకయుఁ జిత్తం బీమిఁజాలించితిన్.

72

వ.

ఆప్రభావతి నన్ను నత్యంతప్రియసఖింగా నడుపుకొన్నది
గావున దానిగు ట్టించుకయు నే నెఱుంగనియది లేదు కని
యు వినియు సమస్తంబు నాకళించినదాన నని యతనికి భవా
నీకృపానుగ్రహపతిప్రకారంబు సకలంబునుం దెలిపి యి
ట్లనియె.

73


చ.

భవదమలాకృతిప్రతిమఁ బర్వినయప్పుడు చూపు క్రమ్మఱన్
దివఁ గదలింప రాక సుదతి న్గతచేష్టితఁ జేసె నోయదు
ప్రవరుఁడ యేమి చెప్పుదును రాగకుతూహలవిస్మయాతిగౌ
రవమున నెంతవ్రేఁ గగుచు రాపడియుండెనొ కాని యత్తఱిన్.

74


చ.

కొసరక చూపుచేతఁ గడుఁ గ్రోలిన నీచెలువంబు చెల్వమా
నసమున నెంత మిక్కిలి ఘనంబుగ హత్తెనొ కాని యప్పుడో
రసికశిఖావతంస యదురత్నమ కాకరకాయరీతిఁగాఁ
గిసలయపాణిచన్నుఁగవ క్రేవ గగుర్పొడిచెం బొరిం బొరిన్.

75


ఉ.

వావిరి నెల్లప్రొద్దును భవత్పరిరంభణచుంబనాదినా
నావిధభోగలీలకు మనంబున నువ్విళు లూరుచున్కి వ్రీ
డావతి దెల్పెఁ గొన్నినిశలం గనుమూసినయంతమాత్రఁ బై
పై విలసిల్లుకుట్టమితభావవిశేషవిజృంభణంబులన్.

76


మ.

కలలం గూడినవేళ నెట్టిపొలయల్క ల్పుట్టెనో యేమి నీ
వలనం దప్పు ఘటిల్లెనో యెఱుఁగఁ దత్స్వప్నాగమామర్షవి
హ్వలితస్వాంతయ పోలె నిద్ర నెఱయ న్వర్జించెఁ బద్మాక్షియ
క్షు లహోరాత్రములందుఁ బద్మకుముదస్ఫూర్తి న్విడంబింపఁగన్.

77


క.

చిత్తజమహాగ్నికాఁకల
నెత్తు దఱిగి వన్నె యెక్కె నెంతయు నెమ్మే

నత్తరుణికి జను లందఱుఁ
బుత్తడిబొమ్మ యనుమాట బొం కేల యగున్.

78


సీ.

రోలంబనికురుంబనీలిమశ్రీఁ బోలె
            వేణి ముట్టుట కడు విరస మయ్యె
సమదకోకిలశుకస్వరసామ్యమునఁ బోలె
            సఖులసల్లాప మసహ్య మయ్యెఁ
బరిపూర్ణచంద్రబింబసమత్వమునఁ బోలె
            నిలువుటద్ద మదర్శనీయ మయ్యెఁ
బ్రసవాస్త్రవివిధమార్గణవర్ణధృతిఁ బోలె
            రత్నభూషాళి యగ్రాహ్య మయ్యె


తే.

వేయుఁ జెప్పఁగ నేల నీవిలసనంబు
లుల్లమునఁ దలపోయుట యొకటి దక్క
బహుదినంబులనుండి యాపడఁతి కితర
వస్తురుచు లన్నియును గాన వావి యయ్యె.

79


క.

వెదకికొని తానె యిటు రా
మది సాహస మొంది కదలు మాటికి నీరూ
పెదుటఁ దన కంతఁ దోఁచిన
మదిరేక్షణ తత్తఱిలుచు మగుడున్ లజ్జన్.

80


క.

ఆపడఁతి యడలఁ జేసెను
జూపఱ నపు డేమి చెప్ప శోషిలుచుఁ గడున్
నీపత్రిక యానిమిషము
లోపల రాదేనిఁ బాటిలు దశాంతరమున్.

81


వ.

ఆపత్రికయుపకారంబునం దాత్కాలికస్థితికారణం బగుట

యొక్కటియ కాని యక్కన్యకు మిక్కిలిం దాపంబు గావించు
చున్న యది యె ట్లంటేని.

82


క.

క్రిందటిదినములు విరహద
శం దా నలఁగుటయ కాని సరిగ నిపుడు నీ
వుం దన కై కుందుట విని
యెం దరుణికి నింక నిమిష మేఁ డై తోఁచున్.

83


ఉ.

భావన చేసి చూడ క్షణభంగుర మింతులతాల్మికల్మి వా
తావిలపల్లవాంచలహిమాంబుకణంబును నంతకంటె మే
ల్గావున నింక నెంత యవిలంబమునం గృప నేఁగి ప్రోచెదో
దేవరచిత్త మాసతియదృష్టము వేయును జెప్ప నేటికిన్.

84


వ.

అనిన విని యతండు.

85


క.

గ్రక్కునఁ జని వ్రాలుదునో
ఱెక్కలు గట్టుకొని దివిజరిపుమేడలపై
నక్కొమ్మఁ జూచు టెపు డెపు
డొక్కో యనునంతతమక మున్నది మదిలోన్.

86


తే.

ఏమి సేయుదు నాదైత్యునియ్యకోలు
లేక వీ డెవ్వరికిఁ జొర రాక యునికి
యరసి వేఁగుచు నున్నాఁడ నమరపతియు
హరియుఁ దలపోయుకార్య మే మయ్యెఁ జెపుమ.

87


వ.

అనిన శుచిముఖి యతనిం జూచి యోగుమారక నీకుఁ
దత్పురప్రవేశచింత వలవదు తదుపాయంబు హరి నిశ్చ
యించుకొనియున్నవాఁడు వజ్రనాభవధకార్యంబునకు నేను
భవదిష్టసాధనానుకూల్యంబు చింతించి నిన్నే యనుపు
నట్లుగాఁ జేసితి వాసుదేవుం డిపుడ యేతదర్థంబు నిన్నుఁ బిలి

పించి యనుపుచున్నవాఁడు వజ్రకి నిది యెఱింగించి వజ్రపురం
బున కరిగి యేనును దగిన తెఱంగునం దావకీనకార్యాను
గుణ్యంబు నడుపుచుండెద నని పలికి యతని వీడ్కొని
చనియె నప్పుడు.

88


సీ.

అమరారికరులకుంభములు వ్రయ్యఁగ మొత్త
            రమణిచన్నులు నఖాగ్రముల నొత్త
సమదరాక్షసరథచక్రంబు లిలఁ గూల్పఁ
            గాంతశ్రోణికి నూడిగంబు సల్ప
నసురేంద్రజయశంఖ మననిపై వ్రేయింపఁ
            గామినికంఠంబు గౌఁగిలింప
వజ్రనాభునిధనుర్వార్తలు గడతేర్పఁ
            బడఁతికన్బొమసంజ్ఞఁ బరు లొనర్ప


తే.

దైత్యుమెఱుఁగుఁదూపులు దళితములు సేయఁ
దత్తనూజచూపులు ఫలితములు సేయ
నుదుటుఁదనమును వలపు నొండొంటితోడ
దంటగొని క్రమ్మ నెమ్మది దాల్చె నతఁడు.

89


సీ.

అంతట గోవిందుఁ డతనుని గదసాంబు
            లను బిలిపించి యలంఘ్యదర్పు
వజ్రనాభుని బ్రహ్మవరబలోద్ధతుని దే
            వహితార్థమై త్రుంపవలయుటయును
దన్మహత్త్వంబును దత్పట్టణప్రవే
            శం బన్యులకు నసాధ్యం బగుటయుఁ
దాను మరాలిచేఁ దగ ఘటింపించిన
            తదుపాయమును విశదముగఁ జెప్పి

తే.

యందు రుక్ష్మిణిసుతుఁడు భద్రాఖ్యురూపు
గదుఁడు పారిపార్శ్వికునియాకారము మఱి
సాంబుఁడు విదూషకునిప్రకారంబుఁ దాల్చి
చనఁగ నియమించి పంచెను దనుజపురికి.

90


ఆ.

ఆముగురు పరస్పరావిదితస్వప్రి
యాంగనాసమాగమానుగుణతఁ
బ్రమద మొంది రవుడు ప్రత్యేక మీయాత్ర
నాదుభాగ్యవిలసనంబ యనుచు.

91


సీ.

మనముల ని ట్లుబ్బుచును నటవేషంబు
            ధరియించి తమకును దగినయట్టి
వారసీమంతినీవ్రాతంబు గొలువ వై
            ణికవైణవికమౌరజకజనాది
నాట్యసామగ్రి మున్ భద్రున కెట్టిది
            యట్టిద యై కనుపట్టుచుండఁ
గదలి యథోచితగతిఁ బయనంబులు
            వర్తిలఁగా నేఁగి వజ్రపురము


తే.

ప్రాంతమునను శాఖానగరములయందు
విరివి చూపట్ట మేళంబు విడిసి విడిసి
యతివిచిత్రంబు లగుతమయాటనేర్పు
నెల్ల నెఱపిరి కడువార్త కెక్కుచుంట.

92


క.

దనుజేంద్రుఁడు తద్వార్తలు
వినుచున్ హృదయమునఁ బొదలువేడుకతో వా
రిని బిలిపించెను వారును
జని యాదనుజునకు నుచితసమయమునందున్.

93

క.

తమనాట్యవిద్యఁ జూపఁగ
సమకట్టి తదర్హ మైనసన్నాహవిశే
షముతోడ నేఁగుదెంచిరి
రమణ దలిర్పంగ నృత్యరంగస్థలికిన్.

94


వ.

శుచిముఖ యటమున్న తనపలికినక్రమంబున వచ్చి వజ్ర
నాభునియాదరంబు వడసి ప్రవర్తిల్లుచుం బ్రభావతికిం జంద్ర
వతీగుణవతులకుం దత్పతులరాకతెఱం గెఱింగించి వియోగ
తాపంబున మిగుల నొగులకుండఁ దదాశాశీతలోపచారంబున
సేద చేర్చుచు నుండి యప్పు డ ట్లేతెంచినప్రద్యుమ్నునకు క్షణ
క్షణప్రవర్ధమానప్రభావతీరాగవృత్తాంతంబున నౌత్సుక్యంబుఁ
బెనుచుచు నతిగూఢంబుగా రాకపోకలు గావింపు చునికిం
జేసి యతనితోడ నేఁడు నీహృదయవల్లభ నీనాట్యంబు
చూడవచ్చు నని చెప్పి తదాగమనీయహర్మ్యస్థలంబునుం
జూపి పోయె నంత.

95


సీ.

వజ్రనాభుఁడు రాజ్యవైభవం బెంతయు
            మెఱసి నానాబంధుమిత్రసచివ
సంఘంబుతోడ నాస్థానమహామంట
            పమునందు నొడ్జోలగమున నుండి
పరులదృష్టికి నగోచర మగుసంవృత
            స్థలి నిల్చి రాణివాసపుజనంబు
చూచునట్టుగఁ జేసి సొంపారువేడ్కతో
            సావధానస్వాంతుఁ డగుచుఁ జూడ


తే.

సంవిహితరంగమంగళాచారుఁ డగుచు
సురహితముగ మాయానాట్యసూత్రధార

వృత్తి గైకొని శంబరద్వేషి యొనరెఁ
బూర్వరంగప్రవర్తన పొందు పఱుప.

96


వ.

అప్పుడు.

97


శా.

గాంధారప్రముఖస్వరశ్రుతికళాగంభీరవారాంగనా
గాంధర్వంబు ఘనస్వనంబు తతని క్వాణంబు వంశాదిసం
బంధిస్వానపరంపరామహిమయున్ మద్దెళ్లదిందింధిమిం
ధింధోంధిక్కిధిమిక్కిశబ్దభరమున్ దీపింప నాపూర్ణతన్.

98


సీ.

సరవిఁ జంచత్పుటచాపపుటోద్ఘట్ట
            షట్పితాపుత్రకసంజ్ఞ లమర
వెలయుచుండెడుసమవిషమతాళప్రవృ
            త్తులు నాల్గు ప్రస్తారకలనవలనఁ
గలుగునానాతాళములు యథోక్తస్ఫూర్తిఁ
            బరఁగునేలాదిప్రబంధచయముఁ
దత్తదర్హస్థానదత్తపటాక్షర
            బిరుదాదికాంగవిస్ఫురణ దనర


తే.

క్షితిఁ జతుర్దశముద్రకగీతభేద
ములు దురాపము లండ్రు వర్తిలె నవియును
నిఖిలకళలును గలరౌక్మిణేయుశిక్ష
వలనఁ దన్నాట్యకర్మప్రవర్తనమున.

99


ఉ.

ఆవనజాక్షనందనుఁడు నంతట నాంది దగం బఠించి యిం
పావహిలం బ్రరోచనయు నాముఖముం దనరార నొప్ప బ్ర
స్తావనతో ముఖాదులగుసంధులు సాంగతఁ బెంపుమీఱ గం
గావతరాదినాటకము లాడె ననేకము లద్భుతంబుగన్.

100

సీ.

ఆనాటకప్రయోగావసరముల భ
            గీరథాద్యాకారధారణమును
గంగాదినిమ్నగాగతియుఁ గైలాసాది
            నగకల్పనమును నానావనప్ర
పంచనంబును బశుపక్షిమృగాదిజం
            తువిశేషరూపవృత్తులును మఱియు
నెచటి కెయ్యది యోగ్య మచటఁ దత్తద్వస్తు
            సృష్టి పన్నిదము వేసియును గృతక


తే.

మగుట నిశ్చయింపఁగ లేక యబ్రపడుచుఁ
జూచి సామాజికులు తమసొమ్ము లెల్ల
నొసఁగులుగ వైవ నడుపుచు నొప్పు మీఱె
రుక్మిణిసుతుండు మాయానిరూఢి మెఱసి.

101


వ.

ఇవ్విధంబున నాత్మీయదివ్యమాయాప్రపంచసముదంచిత
నాట్యవంచితులం గావించి నక్తంచరులధనసంచయంబు
నూఁచముట్టుగా దోఁచుకొనుచుఁ జూచుఖేచరులకు వేడ్కఁ
బుట్టించె.

102


మ.

ప్రియకాంతామణిచూడ్కికిన్ నిజవపుశ్శ్రీతోన తోఁచెన్ మహా
నయమాయానిధి రుక్మిణీసుతుఁడు నానాభూమికాధారణుం
డయి భద్రుం డయి పొల్చువేళ 'నహి మాయాయా మసంభావ్య మ
స్తి' యటంచు న్బుధులాడుమాట మదిఁ జింతింపంగ బొం కేలగున్.

103


శా.

ఆభవ్యుం డటము న్నొకొక్కనెప మొప్పార న్మరాళీప్రది
ష్టాభిజ్ఞానగవాక్షలక్ష్యదనుజాధ్యక్షాత్మజావక్త్రవీ

క్షాభద్రంబును సారెకుం దనకుఁ గల్గం జేసికొంచున్కి న
ట్లాభామామణికిం బ్రభుస్తుతివిలీనార్థంబుగా నిట్లనున్.

104


చ.

సకలవిశేషశోధనకుఁ జాలినయోనెఱజాణ వజ్రనా
భకులవతంసరత్నమ ప్రభావతిరోహితకంటకంబు తా
వక మగుచూపు నాపయిఁ బ్రవర్థితరాగతఁ బర్వెఁ గాన న
త్యకలుషవృత్తి నాసుకృత మంతయు నేఁడు సుమీ ఫలించుటల్.

105


తే.

నీకు నామీఁదఁ గలయట్టినెయ్యమును మ
హాదరము నీవు పనిచినహంసి చెప్ప
నాత్మలో ననవరతనాట్యప్రసంగ
మున నిను భజించువేడుక ఘనము నాకు.

106


క.

నను నేలికొను మవశ్యం
బును నీయూడిగము చిత్తమున కెక్కఁగ నే
నొనరింతు నేఁటితమి నీ
మనమున నెంతయు నిడుకొని మన్నింపఁదగున్.


క.

అన విని కపోలయుగళము
ఘనపులకితముగ మరల్చెఁ గ్రక్కున నాత్మ్యా
ననము ప్రభావతి యాలో
కనజాలకమునకు నెగడఁ గడు లజ్జమెయిన్.

107


చ.

అపుడు తదీయపార్శ్వగత యైనమరాళవధూటి దానవా
ధిపతనయం గనుంగొని మదిం గనుఁగొంటివె యాత్మనాథువా
క్యపదవిఁ దోఁచునట్టియితరార్ధము సర్వము నాననాబ్జముం
ద్రపనిటు త్రిప్పి తింతిగరు దాల్చెఁ గపోలము చాల నావుడున్.

108

క.

విచ్చలవిడి ననుఁ బేర్కొని
యిచ్చను గల దెల్లఁ బలికి యిదె నేఁటినిశన్
వచ్చెద ననుచున్నాఁ డిఁక
నిచ్చో మఱి యర్థ మెద్ది యితరము దీనన్.

110


క.

ఎవ్వరు వినుటకుఁ గైకొనఁ
డివ్విభుఁ డిది యేమిభ్రాంతి యెత్తైనొకో నా
కెవ్విధి ప్రాప్తమొకో మని
నివ్వెఱపడి యింతతడవు నిలిచితి వినుచున్.

111


వ.

అనుడు శుచిముఖి యాశశిముఖి నీక్షించి.

112


మ.

అతివా యన్నిట జాణ నీమగఁడు నీ కాచింత యుక్తంబు గా
దతఁ డర్థద్వితయోక్తి నీకు నుచితం బైనట్టు నీకు న్సభా
ప్రతి కర్హం బగురీతి నాతనికిఁ దోఁపం బల్కినాఁ డేది నీ
మతిఁ దోఁచెం బ్రకృతంబు గాఁ బరు లాత్మం గాన రాయర్థమున్.

113


క.

సకియా నానార్థోక్తుల
నొకనియమము తెలియు మర్ద ముచితం బెచ్చో
టికి నెద్ది యదియ యచ్చోఁ
బ్రకటము హరి శ్రీవిభుఁ డనుపల్కునఁ బోలెన్.

114


వ.

కావున నీవల్లభుండు నిన్నుఁ బలికినపలుకు లన్యు లెఱిఁగిరో
యనుశంక విడువు మతం డితరులకు నాట్యావసానసమయ
సముచితస్తోత్రప్రకరణబలంబునఁ దోఁచుచున్న యర్థాంతరంబు
చేతఁ బ్రభువు నుపచరించి యిదె యతనిచేఁ దనవిడిదికి నని
పించుకొని చనుచున్నవాఁ డని పలికి శుచిముఖ యంతం
బలికినట్ల సేయు రౌక్మిణేయుం జూపి తనతలంపు యథార్థం

బగుట తార్కాణించె నట్లు విహగమహిళారహస్యసం
భాషణరసానుభవంబున విభాసిల్లు ప్రభావతియు రాగవల్లరీ
సహితంబుగా గృహంబున కరిగి ప్రియసమాగమత్వరమాణ
మానస యగుచు నుండె నంత.

115


ఉ.

ఎప్పుడు వచ్చుఁ గాంతుఁ డినుఁ డెప్పుడు గ్రుంకు నటంచు నాత్మలో
ముప్పిరిగొన్నరాగము సముత్కట మై కనుదోయి కుబ్బఁగాఁ
దొప్పఁగఁ దోఁగుచూడ్కిని వధూమణి సారెకుఁ జూడఁగాఁ జుమీ
యిప్పొలు పొందె నీతఁ డన హేళి క్రమంబునఁ దాల్చె రక్తిమన్.

116


ఉ.

అంబుధిలోని కంతటను హంసుఁడు డిగ్గె దినాంతమజ్జనా
ర్థంబును బోలె నట్టియెడఁ దత్తటి నాఱఁగఁ గట్టినట్టిర
క్తాంబరమో యనంగఁ దనరారెఁ గడుం గడసంజఠీవి యం
తం బొడసూపెఁ దారలకు తత్పతనోద్గతబిందులో యనన్.

117


క.

తోరపుజీఁకటు లంతన్
మారోత్సవక లనమునకు మదిఁ బొంగుచు ది
ఙ్నారీజను లాడెడిక
స్తూరివసంతములయొప్పు చొప్పడ నెరసెన్.

118


వ.

అంత.

119


క.

ఐరావణకరికరధూ
త్కారవమధురేణుపటలికైవడిఁ గుత్కీ
లారిదిశఁ దెలుపు తోఁచెను
దారలు ప్రథమోత్థబిందుతతిగతిఁ బరఁగెన్.

120


వ.

తదనంతరంబ.

121

చ.

తివిరి త్రియామకు న్సొగసు దిద్దికొనంగఁ బురోదిశాళి దా
గవిసెన వెల్వరించుమణికల్పితదర్పణమో యనంగఁ గై
రవకులబంధుమండలము రాజిలె నోలి నిలీయమాన మై
మివులఁ గళంకలక్ష్యతఁదమీప్రతిబింబమునంత నేర్పడన్.

122


తే.

తామరసలక్ష్ము లాచందమామరాకఁ
గలఁగుచును గుముదాలికై తొలఁగె నపుడు
తొలఁగుబావయె కాఁడె తమ్ముల నరించు
నట్టిసతులకు నతఁడు మున్నెట్టిఁ డైన.

123


చ.

పనుపడ వేణునాళములఁ బగ్గములం బలెఁ గ్రిందఁ బర్వుశో
భనకిరణప్రకాండములు భాసిలఁ జందురుఁ డొప్పె నెంతయు
న్మనసిజుఁ డెల్లప్రాణులమనంబులు చేలుగ రాగబీజముల్
పెనుజతనంబుతోడ వెదఁబెట్టెడు రౌప్యపుజడ్డిగం బనన్.

124


చ.

నేల యనువెండికుండఁ గడు నించి నిశాఖ్యచకోరనేత్ర యిం
పలరఁగ నంబరాహ్వయమహానటమూర్తిమహాభిషేకమున్
జలువఁగ నెల్లదిక్కుల వెసం బ్రవహించెడుపాలవెల్లి నాఁ
బొలిచె సమస్తముం జలువఁ బొంద నమందత సాంద్రచంద్రికల్.

125


చ.

తొలఁకెడుహంసకాంతులవిధుద్యుతిఁ బ్రోచి చకోరమైత్రి
కలు మెఱయించుకన్గవలకల్కితనంబునఁ బుష్పలావికల్
తలఁపులు గొల్లలాడి మిగులం బ్రమయించి యువవ్రజంబుచే
వెల లధికంబుగాఁ గొనుచు వేడుక నమ్మిరి పువ్వు లంగడిన్.

126


తే.

అప్పుడు ప్రభావతికి నొక్కయతివ విరులు
గొనుచుఁ బోవఁగ నందు నింపునఁ జరించు
తేఁటిగమిలోనఁ దా నొక్కతేఁటి యగుచు
నేఁగె మాయాఘనుండు రతీశ్వరుండు.

127

వ.

అటమున్న పతిసమాగమోత్సవసముత్సాహంబునం జేసి యప
రాహ్ణంబుననుండియుం గ్రీడాభవనపర్యంకాదిసముచితనూతన
సత్క్రియావిశేషసంపాదనంబునకుం దగినపరిచారికల నియో
గించుచున్న ప్రభావతీమనోరథం బెఱింగి రాగవల్లరి యతి
ప్రయత్నంబున.

128


క.

చెలువకు సంపెఁగనూనెం
దలయంటె సుగంధవాసితము లగుచూర్ణం
బుల నలుఁగుఁ బెట్టె గంధా
మలకం బిడి చమురు దిగిచె మజ్జన మార్చెన్.

129


చ.

చెలికి మెఱుంగుఁబావడలచేఁ దడియార్చెను ధూపవాసనల్
దలకొలిపె న్బ్రసూనసదలంకృతి మీఱఁగ వేఱువేఱ మె
చ్చు లరసి కీలుగంటు జడుసుళ్లెము వ్రేలుడుఁగొప్పు మూఁడుమూ
లలబిగికొప్పు పెక్కుగతుల న్నిలిపెం బలుమాఱు విప్పుచున్.

130


వ.

అప్పు డారాగవల్లరి ప్రభావతి నుద్దేశించి.

131


చ.

విరిసిన నొక్కయొప్పు నరవీడినవేఱొక యొప్పుఁ జిక్కువా
టొరసిననొక్కయెప్పు నది యూడ్చిన వేఱొకయొప్పు వేణిభా
వరచన నొక్కయొప్పు ముడివైచిన వేఱొకయొప్పు కొప్పుగాఁ
బరఁగిన నొక్కయొప్పుఁ గనుపట్టక మానదు నీకచంబులన్.

132


క.

తెఱవా సందిట సందెడు
నెఱివెండ్రుక లాయతములు నీలము లివి యే
తెఱఁగున ముడిచిన నీకున్
గొఱఁత గలదె యవియ జట్టిగొను నీవిభునిన్.

133

క.

అనుచు విరు ల్కచబంధం
బునఁ జెరివెడుసఖిని మరలి పొలఁతుక వైచెం
దనచేతిపువ్వుబంతిని
గినుకయుఁ జిఱునవ్వుఁ గన్నుఁగ్రేవలఁ దొలఁకన్.

134


వ.

అంత.

135


తే.

అని చెలువ యక్షకర్దమం బాదిగాఁగఁ
గలపములభేదములు దనవలసినట్లు
సంఘటింపించి కుంకుమచందనాదు
లలఁది నిలిపించుకొనియె మే లరసి యరసి.

136


తే.

మృగమదాదులఁ జుక్కబొ ట్టగిసెయాకు
బొట్టు పూర్ణచంద్రతిలకంబు నెలవంక
విధమునామము గుమ్మడివిత్తునామ
మొకటి గా దాని యొకటి యాయువిద దాల్చె.

137


తే.

వెలఁది మట్టెలు పిల్లాండ్లు వీరమద్ది
యలును నందెలు మొలనూళ్లు నంగుళీయ
కంకణాంగదహారతాటంకముఖస
మస్తభూషణములు దాల్చె మార్చి మార్చి.

138


క.

ఒక్కొకతోయముసొమ్ములె
పెక్కుఁదెచెఱంగులవి యునికి పెంపున నివి యొం
డొక్కటి మీఱుచుఁ దనప్రభ
నెక్కుడగుటఁ ద్రిప్పి త్రిప్పి యింతి ధరించున్.

139


ఉ.

అంచలప ట్టొకింతతడ వబ్రపుమంజిడి కొంతసేపుఁ గ్రొ
మ్మించుజరంగుదళ్లుఁ గడుమేలిమిమాదళము ల్బవంతు లొ
క్కించుక యించు కంతవడి యింపున నొక్కటి మెచ్చ కొక్కటిం

జంచలనేత్ర దాల్చెఁ బ్రియుసమ్మత మె ట్లగు నొక్కొ య న్మదిన్.

140


చ.

తరుణి యొకింతసేపు చిఱుఁదమ్ములపుంబంసతోడిమోవి మే
గరగరిక న్విరాజిలుచుఁ గమ్మలుఁ దీఁగెయుఁ బూని వేణికా
సురభితఁ బొల్చి యొక్కపరిశుద్ధపుసైకపుటొల్లె గట్టి భా
సురతఁ గడు న్వెలార్చెఁ బెఱసొమ్ముల కోపమి యన్మిషంబునన్.

141


వ.

వల్లభమనస్సమాకర్షణకౌశలాకౌశలసందేహంబుసం జేసి
యెందును మనస్థైర్యంబు చాలక మఱియును.

142


ఉ.

శ్రీలలితాంగరాగములుఁ జీరలు సొమ్ములు నేర్చి యేర్చి తా
మేలుతరంబుఁ దాల్చియును మెచ్చక మార్చుచు నెన్ని మాఱులుం
జాలక దిద్దినట్టిదియె సారెకు దిద్దుచు మించుటద్దమున్
గేల ధరించి చూచుఁ బరికించుఁ బొరింబొరి సద్మసంస్క్రియల్.

148


సీ.

కేళీగృహంబుముంగిట గరగరిక లా
            లోకించు గంధాంబుసేక మరియు
నలుకుపూఁతలపరిమళముఁ బరీక్షించు
            రంగవల్లికలతెఱంగుఁ జూచు
సకినలమంచంబుజాడ విమర్శించుఁ
            గుంకుమపరపుభంగులు గణించు
హొంబట్టుతలగడయొప్పు విచారించు
            నగరుధూపముల సోయగము లెంచు

తే.

నలకుటోవర్లు మేల్కట్లు నంగరాగ
పూర్ణపాత్రికలును గందవొడిబరణులు
జాలవల్లిక లాదిగా సముపభోగ
సాధనశ్రీలు పరికించు సారె కబల.

144


వ.

ఇట్లు వర్తించుచున్న యన్నీలవేణి యాపువ్వు లాదరంబునం
బుచ్చుకొనియె నట్టియెడ నిట్టు నట్టుఁ జెదరి పఱచుతుమ్మెద
పదువుపొది వదలి యొదిగి యదుకుమారుం డక్కుమారిక
సవరించుశ్రవణోత్ఫలంబులోనం గాన రాకుండ నడంగి
యుండె నప్పు డప్పడంతి ముప్పిరిగొనురాగవేగంబునఁ బ్రియా
గమనవిలంబంబు సహింపలేక బహిఃప్రాణంబు లన నొప్పు
శుచిముఖిరాగవల్లరుల నేకతంబునకుం బిలిపించి శుచిముఖ
కి ట్లనియె.

145


శా.

రాఁ డయ్యె హృదయేశుఁ డీహృదయభారం బెట్లు సైఁతున్ క్షణం
బేఁ డై యున్నది యేటికిం దడసెనో యేవిఘ్నము ల్పుట్టెనో
నేఁ డేతెంచుప్రయత్న మున్న నకటా నీతోడఁ జెప్పండె యె
వ్వాఁ డీరీతి యెఱింగెనో యపుడు న న్వాక్రుచ్చి య ట్లాడఁగన్.

146


శా.

ఆహా యప్పటికట్లు న న్దలఁచెఁ గా కంతఃపురంబు ల్సుదు
ర్గ్రాహంబుల్ పెఱవారి కెట్లు చొర శక్యంబైనఁగానీ కడున్
మాహాత్మ్యంబున మేటియంటి వతనిన్ దౌవారికాత్యుగ్రస
న్నాహం బెక్కడ నుండు రావలసిన న్రాలేఁడె యెట్లేనియున్.

147


క.

వత్తు నవశ్యము నేఁడని
చిత్తము తమి రేఁచి యంతఁ జింత యొకతెపై

హత్తిన నది వృథ పుచ్చినఁ
బుత్తురు మగవారిమాట పొసఁగదు నమ్మన్.

148


క.

అనఘాత్మకుఁ డతఁ డాతని
నన నే మున్నది మదీయ మైనయదృష్టం
బును దూఱుట గా కె ట్లది
యొనర్ప నున్నదియె చంద్రికోగ్రదవాగ్నిన్.

149


వ.

అని చంద్రు నుద్దేశించి.

150


క.

నీశైత్యము నమ్మితి న
త్యాశన్ హిమధాముఁడును సుధాంశుఁ డనంగా
నోశశధర యేలా మృత
కోశాతకి వయ్యె దేమి గూడెడు దీనన్.

151


క.

చలువ యొనరించినంతయ
ఫల ముష్టత విడువు మిదియ పదివే లింకన్
జలిపందిలి పెట్టుట కడ
వలఁబో మొత్తమియె మాకు వనజారాతీ.

152


సీ.

శ్యామకంఠలలాటసామీప్యపరితప్య
            మానంబులుగఁ గళల్ మార్చి మార్చి
సింధూదకాంతస్సమింధనబడబాన
            లోగ్రకీలల సెగ నూని యూని
ప్రత్యమావాస్యసంభవదర్కసంయోగ
            కలితాధికోష్ణమఁ గ్రాఁగి క్రాఁగి
విప్రయోగోష్ణపాంథప్రాణపరిపాన
            భూమజం బగుకాఁక పొంది పొంది

తే.

కాలకూటాహ్వయభ్రాతపాలు పట్టి
పుచ్చుకొనుదాహకత్వంబు ప్రోచి ప్రోచి
యింతవేఁడిమి సాధించితేమొ చంద్ర
నన్ను నేఁచుటకే ప్రయత్నంబుతోడ.

153


చ.

ప్రథమకళ ల్నెలన్నెల నుపాయన మిచ్చుచు వహ్నిసూర్యులన్
బృథుతరమైనమైత్రిఁ గడుఁబ్రీతులఁ జేయుట యీదృశోష్ణిమ
ప్రథమఫలిభవద్విరహిబాధకె కావలయు న్శశాంక యీ
పృథివి నధర్మి కెన్నఁ బరపీడయె యుత్తమలాభ మెప్పుడున్.

154


చ.

చలువయె భ్రాంతిమూలము నిశాకర యింకొకఁ డెన్ని చూడఁ గే
వలమును వేండ్రపుంబ్రకృతివాఁడవ యె ట్లనినం జకోరముల్
వెలయుఁ గడంక నీయుడుకువెన్నెల జుఱ్ఱుచు దానఁ జేసి కాఁ
కలపడ శైత్యము ల్మరగినట్టివి నిప్పులమేఁత కోర్చునే.

155


మ.

ఇటుగా కొక్కొకకాలదోషమున నౌ నేమో విపర్యాసమ
న్నిటియందు న్మలయానిలుండు నిదిగో నెమేనికిం జాల ను
త్కటతాపం బొనరింపఁజొచ్చె నిదియుం ద్వచ్చంద్రికాజాలసం
ఘటనాదౌష్ట్యము రాజధర్మ మనుచుం గ్రౌర్యంబుఁ దాఁ బూనెనో.

156


వ.

అని దక్షిణానిలు నుద్దేశించి.

157


క.

తలఁప జగత్ప్రాణుఁడవై
వెలసిననీ విట్లు నన్ను వేఁచుట తగునే
యిల వెలుగు చేను మేసిన
మలయానిల యెద్ది కాఁపు మదిఁ జింతింపన్.

158

వ.

అని యతనివేఁడిమి మాన్చుటకై యనేకప్రకారంబులం
దూఱియుం బ్రార్థించియు గుణంబు గానక విసివి యి
ట్లనియె.

159


సీ.

అంతకాశాసమాయాతత్వ మరసినఁ
            జలువకు నీకును జాలదవ్వు
రౌద్రమూర్తిత్వవార్తలు విచారించినఁ
            జలువకు నీకును జాలదవ్వు
దహనసారథ్యతత్పరత భావించినఁ
            జలువకు నీకును జాలదవ్వు
శ్రీఖండవిషధరోచ్చిష్టత యెంచినఁ
            జలువకు నీకును జాలదవ్వు


తే.

పలుకు లేటికి నీయందు మలయపవన
చలువ గల దనునట్టిసంశయము దగదు
వసుధ నెందైనఁ జండాలవాటిలోన
బ్రాహ్మణగృహంబు వెదకుట భ్రాంతి గాదె.

160


ఉ.

దక్షిణగంధవాహ నినుఁ దన్మలయద్రుమరూఢగూఢపా
ద్భక్షణ నింతకెంతయు నపాయము పొందదె పొందకుండఁగా
నిక్షుశరాసనుండు విరహిశ్వసితోపచయక్రియ న్విము
క్తక్షయుఁ జేసెఁ గావలయుఁ గాక తదుష్ణత నుష్ణ మెక్కఁగన్.

161


వ.

అని మలయసమీరు నుపాలంభించి.

162


శా.

పాథోరాశిగభీరు సద్వితరణప్రాగల్భ్యమందారు భూ
నాథాస్థానవిధేయవర్తను నపైనఃపద్ధతీవర్తనున్
యాథాతథ్యవిధప్రయోగవివిధోపాయార్జితద్విణ్మదో
న్మాథఖ్యాతసునీతికౌశలు నసన్మార్గచ్ఛిదాపేశలున్.

163

క.

వ్యాచక్షాణసుధీజన
వైచక్షణ్యోదయాభివర్ధన వైద
గ్ధీచుంచురనిజకృతమై
త్రీచుంచువిశృంఖలాష్టదిక్చరకీర్తిన్.

164


మాలిని.

అమలమప్రియసూనున్ యామినీశోపమానున్
గమలభవమనీషున్ గణ్యవాక్ప్రౌఢిశేషున్
శమదమగుణనిష్ఠున్ శాస్త్రచింతాగరిష్ఠున్
బ్రమథపతిసుభక్తున్ బ్రహ్మవిద్యాసురక్తున్.

165


గద్యము.

ఇది నిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ
పింగళి యమరనార్యతనూభవ సౌజన్యజేయ సూరయనామ
ధేయప్రణీతంబైన ప్రభావతీప్రద్యుమ్నం బనుమహాప్రబం
ధంబునందుఁ జతుర్థాశ్వాసము.

—————