ప్రబోధ తరంగాలు/96-142

వికీసోర్స్ నుండి

96. భక్తుల హృదయాల్లోని ఆత్మచిహ్నమే బండరాతి గుళ్ళల్లోని ప్రతిమ ఆకారము.

97. అష్టసిద్ధులను అభిలషించేవారు అచలసిద్ధిని అందుకొనజాలరు.

98.మతిభ్రష్టులను చూచి అవధూతలనుకొనే వారే నిజమైన మతిభ్రష్టులు.

99. నదీ ప్రవాహం దాటుటకు పటిష్టమైన పడవ ఎంత అవసరమో సంసారమనే నదిని దాటుటకు శుద్ధమైన జ్ఞాననౌక అవసరము.

100. జ్ఞానమను కలపతో నిర్మింపబడిన పడవలో జీవుని చేర్చి, సంసారమను సాగరమును దాటించి, మోక్షమను తీరమును చేర్చగల నావికుడే సద్గురువు.

101. విషయ చింతనమనే విషజాడ్యము నుండి జీవున్ని విముక్తి కల్గించు శక్తి ఒకే ఒక ఔషధానికుంది ఆ ఔషధమే సద్గురు ప్రబోధామృతము.

102. ఆశా భూతగ్రస్తమై ఆత్మశాంతి లేక అలమటిస్తున్న జీవా! అది వదలాలంటే గురుప్రబోధన మంత్రమే శరణ్యము.

103. సంశయ రహితమే సంపూర్ణ జ్ఞానము.

104. ఇటు ప్రకృతి, అటు ఆత్మ రెండింటియందు సంబంధములేని జీవాత్మ పరమాత్మగ మారిపోగలడు.

105. శరీరమను ప్రమిదలో కర్మయను తైలము వేసి అందులో వత్తియను ఎరుకనుంచి జ్ఞానమను జ్యోతిని వెల్గించి ఆ వెలుగులో ఆత్మను దర్శించుటయే అసలైన దీపారాధనార్థము.

106. జీవుడు కర్మను అనుభవించుటకు కాలమే ఆధారము. 107. అన్ని సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది. ఆ కాలం వచ్చేవరకు జీవులు వేచి ఉండాల్సిందే.

108. స్త్రీల యవ్వన సౌందర్యానికి చిత్తచాంచల్యము బొందెడి జీవులు ఆ శరీరాలలోని చైతన్యశక్తియే ఆ సౌందర్యమని అర్థం చేసుకొనలేకున్నారు.

109. అనిత్యమైన శరీరాలను ప్రేమించి ఆనందిస్తున్న జీవులు అవి నశించినప్పుడు ఆవేదన పొందుతారు. ఆ శరీరాలకు ఆధారమైన ఆత్మ నిత్యమైనది. దాన్ని గుర్తించితే అసలు దుఃఖమే లేదుగదా!

110. సూర్యున్ని మేఘము గప్పినట్లు జ్ఞానాన్ని కామము కప్పియున్నది. వాయు తరంగాల ధాటికి మేఘము చెదిరిపోయినప్పుడు సూర్య ప్రకాశము గోచరించినట్లు, ప్రబోధ తరంగాల తాకిడికి కామము చెదిరిపోయినప్పుడే జ్ఞానం ప్రకాశిస్తుంది.

111. నీలో జ్ఞానము నీకు తెలిపేనిమిత్తమే గురువు నిన్ను పరీక్షిస్తాడు.

112. కాలము తీరినప్పుడు కాయము. కర్మదీరినప్పుడు జీవము కడతేరుచుండును.

113. పాదరక్షలు ధరించినవారు కంటకావృతమైన మార్గములో నిర్భయంగా ఎలా నడువగలరో, తద్విధముగా జ్ఞానరక్షలు ధరించినవారు సంకటావృతమైన సంసారమార్గమున ధైర్యంగా సాగిపోగలరు.

114. జ్ఞానమను కవచాన్ని ధరించిన జీవునకు అరిషడ్‌ వర్గములు వేయు విషయములనే విషబాణములు తగిలినప్పటికి అవి ఏమి చేయజాలవు. 115. విషయచింతనము వీడి పరమార్థ చింతనము పట్టుబడిన నాడే మానవుడు స్వచ్ఛమైన జీవితము గడుపగలడు.

116. నిన్ను నీవు తెలుసుకొంటే నీలోని అహమేమిటో తెలియును.

117. మంచిని ఆలోచించినా, చెడును ఆలోచించినా ఏది జరగాలో అదే జరిగితీరుతుంది.

118. భోగాలన్నీ అనుభవించిన తరువాత యోగసిద్ధి పొందవచ్చునని యోచించకు, అప్పుడు రోగసిద్ధి కలుగవచ్చును.

119. ప్రతి జీవికి భక్తి ఉంటుంది. అది ప్రకృతి భక్తి కాకుండ పరమాత్మ భక్తి అయితేనే మంచిది.

120. కామ్యార్థపూజలకు కారణము దేవాలయాలు కాదు. ఆత్మార్థ మరయుటకే ఆర్యులు దేవాలయములు నిర్మించారు.

121. సుజ్ఞానము లేని నరుని బ్రతుకు, సుగంధము లేని పుష్పము యొక్క అందము ప్రయోజనము లేదు.

122. తలలోని తలపులు దైవానికర్పిస్తే తరిస్తారు కాని తలకురులర్పిస్తే తరిస్తారా?

123. కర్పూరం అగ్నిచే కాలి నిశ్శేషమైన తరువాత కర్పూరము మరియు అగ్ని లేకుండా శూన్యములో ఎట్లులయింపబడునో, అట్లే జ్ఞానమను అగ్నిచే కాల్చబడుతున్న కర్మ నిశ్శేషమైన తరువాత కాలుచున్న కర్మ మరియు కాల్చుచున్న జ్ఞానము రెండుపరమాత్మలో లయించిపోవుచున్నవి. 124. ఆత్మస్థితినందుకొనువరకు అనుక్షణము ఆరాటపడుము అదే నీ జీవిత లక్ష్యము.

125. విభిన్న రూపాలుగల ప్రకృతి యొక్క పంచభాగాలలో ఏకత్వంగా ఇమిడి ఉన్న పరమాత్మను ఆకళింపుచేసుకో, అప్పుడే నీ అంతరంగములోనున్న అజ్ఞానము నీకందనంత దూరంగా పారిపోతుంది.

126. నీ శరీరము స్త్రీ, అందులోవున్న నీవు పురుషుడవు, మీఇరువురి కలయిక వలన నీ శరీరము చైతన్యవంతమౌతున్నది.

127. అనుభవము లేని ఆత్మబోధ, ఆకర్షణలేని అందములాంటిది.

128. నరక, స్వర్గలోకాలన్నీ నరలోకములోనే ఉన్నాయి. ఏస్థలములో జీవుడు కష్టమనుభవిస్తున్నాడో ఆ ప్రదేశమే వానిపాలిట నరకలోకము. ఏస్థలములో జీవుడు సౌఖ్యమనుభవిస్తున్నాడో ఆ స్థలమే వానిపాలిట స్వర్గధామము.

129. కర్మవర్జితుడే అసలైన స్వతంత్రుడు.

130. ఆత్మజ్ఞానానికి ఉపయోగించని ఐశ్వర్యం, అంగబలం, ఆయుస్సు ఊరులో గాచిన వెన్నెలవలె వ్యర్థమైనవగును.

131. మొదట అమృతంలావుండి చివర విషంగా పరిణమించేవే ప్రపంచ విషయాలు. మొదట విషంలావుండి, చివర అమృతంలాగ ఉండేవి జ్ఞానవిషయాలు.

132. సూర్యోదయం కూడ పోగొట్టజాలని చీకటి ఒకటుంది అదే అజ్ఞానము. అది జ్ఞానోదయముతోనే పోవును.

133. జ్ఞానం తెలియని సాధన దారి తెలియని నడకవంటిది. 134. భార్యా మోహమనే సంకెళ్లు తగిలించి, పుత్రవ్యామోహమను చీలలుబిగించి, ప్రకృతియనే చెరసాలలో జీవున్ని బంధించి కర్మయను శిక్షను అనుభవింపజేస్తున్నది మాయ.

135. మనస్సు ఎక్కడుందో తెలుసా? అది నీవలె శరీరములో ఒక చోట లేదు. మెలుకువలో శరీరమంతా వ్యాపించియున్నది.

136. కర్మల ఆధారముగ చేయించేది ఆత్మ, చేసేది కాయము, అనుభవించేది జీవుడు.

137. ప్రపంచములోని ప్రతిమనిషి సుఖం కలుగుతుందను ఆశతోనే కష్టాల పూజలు చేస్తున్నాడు.

138. మాయ అనే అద్దంలో ప్రతిబింభిస్తున్న జీవాత్మల యొక్క చావు పుట్టుకల స్వరూపమే ఈ జగత్తు.

139. బలమైన ప్రకృతి శక్తులను తన వశం చేసుకొని పరవశించాలని పరవళ్లు ద్రొక్కుతున్న మానవుడు చివరకు ప్రకృతి శక్తులచేతనే భంగపడక తప్పదు.

140. దేని ఆధారముతో అన్ని నావనుకొంటున్నావో ఆ జ్ఞప్తిని అరక్షణములో అంతము చేయగల అజ్ఞాతశక్తి ఒకటుంది. అదే నీ మృత్యువు.

141. నేను అనుకొంటే నీవు నీవుగానే ఉంటావు. నేను అనుకుంటే నీవు అంతటా ఉంటావు అంటాడు పరమాత్మ.

142. అజ్ఞానులు సంసారం కోసమై కర్మ చేస్తారు. జ్ఞానులు కర్మకోసమై సంసారము చేస్తారు.